SHARE

Thursday, February 7, 2013

" మహా దర్శనము "---- వేదములు--ఒక లఘు పరిచయము



వేదములు--ఒక లఘు పరిచయము


         యాజ్ఞవల్క్యుని కథ చదువువారు ఈ పుస్తకములో అనేక చోట్ల  సంహిత , బ్రాహ్మణము , ఉపనిషత్తు అనే మాటలు  చదివి కొంత అయోమయమునకు లోను యగుట సహజము. వీటి అర్థము తెలుసుకోనిదే ఇందులోని కొన్ని విషయములు అర్థముకావు. అందుకని , కొన్ని ప్రాథమికమైన విషయములను ఇక్కడ చర్చించడమైనది. 

అసలు వేదమనగానేమి ? 

        వేదమంటే ’ జ్ఞానము ’ అని అర్థము. పరమాత్మ , జీవులు , దేవతలు , ప్రకృతి , ధర్మము మొదలగు విషయములను గురించిన జ్ఞానము. అతి పవిత్రమై , అత్యంత ప్రామాణికమై , మన ధర్మములు , దర్శనము , సమాజము మొదలగు వాటిపై అంతిమ నిర్ణయమును చెప్పు అధికారమున్న గ్రంధమే వేదమని చెప్పవచ్చును. అది అతీంద్రియ సత్యములను తెలియగోరు అందరు సాధకుల పవిత్ర గ్రంధము. 

వేదమను పదము , ’ జ్ఞానము ’ అథవా ’ పొందుట ’ యను అర్థమును ఇచ్చు ’ విద్ ’ అను ధాతువు నుండీ ఏర్పడ్డ శబ్దము. 

|| వే॒దేన॒ వై దే॒వా అసు॑రాణాం వి॒త్తం వేద్య॑మవిన్దన్త॒ తద్వే॒దస్య॑ వేద॒త్వమ్ ||

      అనే తైత్తిరీయ సంహితలోని ఈ మంత్రము వలన ఈ విధముగా తెలియుచున్నది: అసురులు పొందిన , మరియు ఉపయోగించనున్న ద్రవ్యములను దేవతలు దేనివలన తెలుసుకొని పొందినారో , అది వేదము. 

వేదమంటే జ్ఞానము మాత్రమే కాదు.  అది , మానవుడు కాంక్షించు అనేక విషయములను అతనికి తెచ్చి ఇవ్వగల సామర్థ్యము కలిగినది. 

|| ఇష్ట ప్రాప్త్యనిష్ట పరిహారయోః అలౌకికం ఉపాయం యో గ్రంధో వేదయతి స వేదః ||

     కోరిన ఇష్టములను పొందుటకును , కీడు ను తప్పించుకొనుటకును గల అలౌకిక ఉపాయమును తెలుపు గ్రంధమే వేదము అని ఆచార్య సాయణులు తమ ’ కృష్ష్ణ యజుర్వేద సంహితా భాష్యము ’ లో చెప్పినారు.

వేదములెన్ని ?

        వేదమనునది అపారమైన జ్ఞాన రాశి. ఎవరూ కూడా దానిని సంపూర్ణముగా తెలుసుకొనుటకు సామర్థ్యులు కాదు. జ్ఞానము అనంతమైనట్లే , ఆ దివ్య జ్ఞానమునకు శబ్దరూపమైన శరీరము వలెనున్న వేదరాశి కూడా అపారమే. అట్టి అపారమైన గ్రంధరాశిని అధ్యయనము చేయుటకెలాగూ సాధ్యముకాదని నిరాశ చెంది అల్పబుద్ధిగల మనుష్యులు వేదాధ్యయనమునే నిలిపివేస్తారేమోనని , వేదమే కనుమరుగౌతుందేమోనని శంకతో మహాత్ములైన కృష్ణద్వైపాయనులు వేదముల విభాగము చేసినారు. అఖండమైన ఆ వైదిక వాఙ్మయమును ఋగ్వేదము , యజుర్వేదము , సామ వేదము అథర్వణ వేదము యని నాలుగు భాగములు చేసి తమ శిష్యులొక్కరితో వాటి పరంపరను కొనసాగించునట్లు చేసినారు. ఈ విధముగా నాలుగు విభాగములు గల వేదములో ఏదైనా ఒక భాగమును ప్రధానముగా అధ్యయనము చేసి మిగిలిన భాగములయొక్క సామాన్య పరిచయమున్ననూ చాలునని , అ విధముగా అనేకులు తమ తమ శాఖను అధ్యయనము చేయుటవలన వేదపరంపర కొనసాగునని ఈ యోజన చేసినారు. 

అలాగ వేద విభజన చేసిన కృష్ణద్వైపాయనులు వేదవ్యాసుడు గా ప్రసిద్ధికెక్కినారు.

       ఆయా వేద శాఖను మాత్రము విశేషముగా అధ్యయనము చేసినవారికి ప్రకృతి దోషము వలన తమ వేదశాఖయే గొప్పది , తక్కినవి అధమము అను తప్పుభావన రాకూడదని , ప్రతియొక్క శాఖా విద్వాంసులూ ఒక్కటిగా చేరి తమ తమ ప్రావీణ్యమును ప్రకటిస్తూ ఒక కర్మను నెరవేర్చినపుడు తామందరూ ఒకే వేద వృక్షమును ఆశ్రయించిన వారము అన్న ఎరుక అందరికీ కలుగును. ఇలాగ అన్ని వేదముల విద్వాంసులూ చేరి నెరవేర్చు కర్మయే ’ యజ్ఞము ’ . 

        నాలుగు వేదశాఖలలో ఏ ఒక్క వేద విద్వాంసుడు లేకున్ననూ ఆ యజ్ఞము జరగదు. అన్ని వేదముల సహకారము వల్లనే యజ్ఞము సంపన్నమగును. యజ్ఞములో భాగము వహించు ఋగ్వేదపు ఋత్త్విజుడిని " హోతా  ( హోతృడు ) "  అనీ , యజుర్వేదపు ఋత్త్విజుడిని " అధ్వర్యుడు " అనీ , సామవేదపు ఋత్త్విజుడిని " ఉద్గాతా " యనీ , అథర్వణవేదపు ఋత్త్విజుడిని" బ్రహ్మా " అనీ అంటారు. 

( ఇవన్నీ కాక , ప్రతి వేదములోనూ అనేక శాఖలున్నవి... పొడిగించుట లేదు )

        వేదమును నాలుగు భాగములుగా విభజించినట్లే , ’ సంహితా ’ , ’ బ్రాహ్మణము ’ , ’ ఆరణ్యకోపనిషత్తు ’ అని కూడా విభజించబడినది. ఈ విభాగము అన్ని వేదములకూ ఉంది. వీటిలో ఆరణ్యక , ఉపనిషత్తులను ఒకటిగా భావించి , మొత్తము మూడు విధములుగా విభజింపబడుట వలన  వేదములకు " త్రయీ " అన్న పేరు కూడా ఉంది. 

సంహిత

        వీటిలో సంహిత అంటే " ఒకచోట చేర్చిన " భాగము. వేరే వేరే ఋషులు మంత్రద్రష్టలై కనుక్కున్న మంత్రములను ఒక క్రమ పద్దతిలో చేర్చి , ఒకేచోట కలసికట్టుగా కూర్చిన భాగము. దీనినే , ఇంకో విధముగా , అంటే , పదపాఠమును స్వరము , సంధి--ఇత్యాది నియమానుసారముగా కూర్చి దండాకారముగా పారాయణ చేయుటకు అనువుగా అలవరచిన వేదమంత్రములు. వివిధములైన యజ్ఞయాగాదులలో ఉపయోగించవలసిన మంత్రములు మాత్రమే ఉన్న భాగమును సంహిత అంటారు.  ఐతరేయ , తైత్తిరీయ , వాజసనేయ , కౌథుమీయ, శౌనకీయ సంహితలు కొన్ని ఉదాహరణలు. 

     ప్రకృతి , ప్రత్యయములు లేదా, పదములు మధ్యలో విరామములేకనే చేరియుండుట కూడా సంహిత అనిపించుకుంటుంది. పైన చెప్పిన సంహితలలో అనేక మంత్రపాఠములలో కొన్ని వందల పదములు ఒకే వాక్యములో నుండుటను గమనింపవచ్చు. 

       ఇంకొక విషయము : వేదములో ’ సంహిత ’ అన్న పదము మంత్రముల సమూహములతో కూడిన భాగమునకు మాత్రమే వర్తిస్తుంది. ఋగ్వేద , శుక్ల యజుర్వేద సంహితలలో మంత్ర భాగము మాత్రమే ఉంది. అయితే , కృష్ణ యజుర్వేదములోని ( తైత్తిరీయ ) సంహితలో బ్రాహ్మణ భాగమూ , మంత్ర భాగమూ చేరి కనిపిస్తాయి. అలాగే , కృష్ణ యజుర్వేద బ్రాహ్మణములో కూడా బ్రాహ్మణ భాగమూ , మంత్ర భాగములూ కలసిపోయి కనిపిస్తాయి. 

మరి బ్రాహ్మణము అంటే యేమిటి ? 

       బ్రాహ్మణము అంటే సంహిత యొక్క మంత్రముల వ్యాఖ్యాన రూపమైన గద్య గ్రంధము. బ్రహ్మమును ( అంటే మంత్రమును ) వివరించుట వలన వీటికి ’ బ్రాహ్మణము ’ అని పేరు. ఈ బ్రాహ్మణములో , ’ సంహితా మంత్రములను యజ్ఞములలో వినియోగించుట యెలాగ ? యే కాలములో యే కర్మను యెలాగ చేయవలెను ? అనుదానినీ , దానికి సంబంధించిన ఉపాఖ్యానములనూ వివరించే వేద భాగము ఉంటుంది.

      ఐతరేయ , కౌషీతకీ బ్రాహ్మణములు ఋగ్వేదమునకు సంబంధించినవి. తైత్తిరీయ , శతపథ బ్రాహ్మణములు యజుర్వేదమునకు సంబంధించినవి. తాండ్య , జైమినీయ , షడ్వింశ బ్రాహ్మణములు సామవేదమునకు సంబంధించినవి. గోపథ బ్రాహ్మణము అథర్వణవేదపు బ్రాహ్మణము. 

       బ్రాహ్మణములను ఇంకొక రీతిలో కూడా వివరించవచ్చును. వేదములోనే వచ్చు ఇతిహాసములు , పురాణములు కొన్ని ఉన్నాయి. వాటిని బ్రాహ్మణములనే తెలుసుకోవలెను. కాబట్టి , మంత్రము మరియూ బ్రాహ్మణములను వివరించునపుడు మంత్రమనగా , " యాజ్ఞిక నిష్ఠ మంత్రత్వ ప్రకారక ప్రసిద్ధి విషయత్వమ్ " అని శాస్త్రములో చెప్పబడియున్నది. యజ్ఞము చేయువాడు దేనిని మంత్రమని గుర్తించి చెప్పునో అదే మంత్రము అని ఆ వాక్యపు అర్థము. " శేషే బ్రాహ్మణ శబ్దః " అను మాట , మంత్రములు తప్ప మిగిలినవన్నీ బ్రాహ్మణభాగమే అని తెలుపును. కాబట్టి , వేదములోనున్న కొన్ని పురాణములూ , గాథలూ , కల్పములూ , నారాశంసీ-- ఇవన్నీ బ్రాహ్మణపు అంతర్గతములే. ( నారాశంసీ అంటే మనుష్యుల కథలను తెలుపునవి )  అంతే కాక , దీనివలన వేదములో ఇవన్నీ ఉన్నాయి అని కూడా తేటతెల్లమవుతుంది. 

బ్రాహ్మణమును కూడా విధి , అర్థవాదము అని రెండు విధములుగా విభజించవచ్చు. దీనిని పొడిగించుట లేదు. 

ఆరణ్యకోపనిషత్తులు

       కర్మమును వివరించు సంహితా బ్రాహ్మణములకూ , మరియూ శుద్ధ జ్ఞానమును ఉపదేశించు ఉపనిషత్తులకూ  సేతువు వంటివి ఆరణ్యకములు. ఇవి గద్యరూపములో ఉండును. ఆరణ్యకపు చివరి భాగమునే ఉపనిషత్తు అంటారు. అందుకే ’ ఆరణ్యకోపనిషత్ ’ అని కలిపి పిలుస్తారు. యజురారణ్యకములో ’ అరణ్యేధీయీత ’ అను వాక్యమును బట్టి , ఇవి ( ఆరణ్యకములు ) అడవిలో అధ్యయనము చేయవలెను అన్న నియమమునకు లోబడినవి. ఆరణ్యకోపనిషత్తులు కొన్ని చోట్ల కర్మ కాండ , ఉపాసనా కాండ , మరియూ జ్ఞాన కాండకూ కూడా సంబంధించియున్నాయి. 

       ఆరణ్యకోపనిషత్తులు యజ్ఞములకు తాత్త్వికమైన అర్థమును ఇచ్చి , మనలను జ్ఞానము వైపుకు మరల్చును. ’ అరణులు ’ ( నివృత్తి ధర్మములోనున్న నైష్ఠికులు , సన్యాసులు ) అధ్యయనము చేయుటకు యోగ్యమై , అతి పవిత్రమూ రహస్యమూ అయిన విద్య యొక్క గ్రంధములు కాబట్టి వీటికి ఆరణ్యకములు అని పేరు. 

తైత్తిరీయ ఆరణ్యకము , ఐతరేయ ఆరణ్యకము , బృహదారణ్యకము , తలవకారారణ్యకము--కొన్ని ఉదాహరణలు. 

        ఉపనిషత్తులు జీవ , బ్రహ్మ , జగత్తు మొదలగు రహస్యములనూ , దివ్య జ్ఞానమునూ అందించు వేదభాగములు. వీటికి ’ వేదాంతము ’ అనికూడా పేరు. వేదపు సిద్ధాంతమును చెప్పుట వలననూ , వేదపు చివరలో వచ్చుట వలననూ వీటిని వేదాంతము అంటారు. ’ ఉపనిషత్ ’ అన్న పదమునకు రహస్య విద్య , ఆచార్యుని దగ్గర కూర్చొని మాత్రమే నేర్చు విద్య , ఉపాసనా విద్య , పరమాత్ముని దగ్గరకు చేర్చు విద్య , పరమ శ్రేయస్సుకు స్థానమైన విద్య , సంసార బంధనమును సడలించు విద్య --అవిద్యను నాశనమొనరించు విద్య - మొదలైన అర్థములున్నవి.

       ఈశావాస్యోపనిషత్తు , కేనోపనిషత్తు , కఠోపనిషత్తు , ముండకోపనిషత్తు , మాండూక్యోపనిషత్తు , ఐతరేయోపనిషత్తు , తైత్తిరీయోపనిషత్తు , ఛాందోగ్యోపనిషత్తు , బృహదారణ్యకోపనిషత్తు అను పది ఉపనిషత్తులు ముఖ్యమైనవి. 



శుభం భూయాత్


No comments:

Post a Comment