30. ముప్పైయవ భాగము-- పైవాడి సంకల్పము
కులపతి వైశంపాయనులు సాయమగ్ని హోత్రమును ముగించుకొని , వచ్చి కూర్చున్నారు . మనస్సు , ఏ ఆలోచనలూ లేక , నిరాటంకముగా , సాత్త్వికావస్థలో యుండి , ప్రసన్నముగా ఉంది . చేతి దీపపు మంద ప్రకాశము నడిమింట్లో లోభి యొక్క ఐశ్వర్యము వలె జ్ఞాతాజ్ఞాతముగా పరచుకొని ఉంది . కులపతులు రుద్రాధ్యాయమును పారాయణ చేస్తున్నారు .
ఉన్నట్టుండి ఆ నడిమింట్లో తీవ్ర ప్రకాశమొకటి కనిపించినట్లై , కులపతుల పారాయణము నిలచిపోయింది . వారు అలాగు పారాయణము చేయునపుడు ఏరోజు కూడా దేవతలను సాక్షాత్కరించుకుంటూ ఉండలేదు . పరోక్షప్రియా వై దేవాః ! దేవతలు ఎప్పటికీ పరోక్షప్రియులే . పరోక్షములోనే ఉండాలనే ఆశ ఉన్నవారు అనుదానిని సంపూర్ణముగా నమ్మినవారు . " ఈ జగత్తు యొక్క ధర్మాధికారులు వారు . కావాలంటే , వారే వస్తారు , వారు చెప్పినట్లు వింటే చాలు " అని వారు దేవతా సాక్షాత్కారములో ఉదాసీనులు .
ఇప్పుడు ఒక తేజస్సేదో వచ్చినది వారికి గోచరమైనది . మనస్సు వేగిర పడగా , వచ్చినవారిని ఉపచరించుటకు సిద్ధమైనది . కళ్ళు , దర్శనము పొందవలెనని , మిగిలినవాటిని దేనినీ చూచుట లేదు . వచ్చినవారి మాట వినాలని చెవులు కూడా మిగిలిన అన్నిటినీ పక్కకు తోసి , కాచుకొని ఉన్నాయి . తేజోదేహములు వచ్చునపుడు వ్యాపించు సూక్ష్మమైన సువాసనను ఆఘ్రాణించి , ముక్కు ఆవైపుకు తిరిగింది . శ్వాస నియమబద్ధముగా ఉంది . నాలుక కూడా స్తుతి చేయుటకు కళ్ళ ఆదేశమునకై వేచియున్నది . జలరాశిలో స్నానానికి దిగినపుడు నీటి చల్లదనము శరీరమునంతనూ ఆవరించునట్లు , తనకన్నా ప్రబలమైన దేవతా సన్నిధిలో ఉన్నాననుదానిని చర్మపు కణకణమూ అనుభవించినదా అన్నట్లు , రోమములన్నీ నిక్కబొడుచుకున్నాయి . కులపతులు ఒళ్ళంతా కళ్ళై వేచియున్నారు .
వచ్చినవారు కనిపించినారు . సూర్యుడికి అడ్డముగా వచ్చిన తెల్ల మేఘము వలె తేజస్వియైననూ కళ్ళు మిరుమిట్లు గొలపని ప్రభామండలములో ఒక మూర్తి గోచరించినది . దృగ్గోచరమైన వ్యక్తి స్త్రీయై , మాతృభావము నిండిపోగా , ప్రేమయే వాత్సల్యమే మూర్తీభవించినట్లు కరుణామయ దృష్టితో ప్రసన్నమై యుంది . రత్నమయమైన కిరీటమూ , దివ్య మాల్యాంబరములూ అలౌకిక కాంతితో కూడి , ఆమె ప్రసన్న గంభీరతను ప్రతిబింబిస్తున్నవి ." నేను నీకన్నా పై అంతస్తు దానను . నామాటను మీరకూడదు " అను హెచ్చరిక ఇచ్చునట్లు ఆమె భూమినుండీ అంత ఎత్తులో నిలచిఉన్నది . ఆమె యొక్క స్తోత్రము చేయుచున్న వందిమాగధులెవరో మృదు మధురమైన , మంజులమైన సామగాన పరంపరను వ్యక్తావ్యక్తముగా వినిపిస్తున్నారు .
అతని మనసు ఎవరూ చెప్పకున్ననూ ఆమెను , తల్లిని గుర్తించిన దూడ వలె , శృతీ భగవతి యని గుర్తెరుగుతున్నది . ఆ వెంటనే అతడు దిగ్గున లేచి ఆమెకు సాష్టాంగ ప్రణామము చేసి , లఘుపూజను మనసులోనే అర్పించి , చేతులు జోడించి నిలుచున్నాడు . స్తోత్రము చేయవలెనన్న ఆశ మాత్రము , ఏమిటి , ఎలా చేయవలెను అనుదానిని నేరుగా తెలుసుకోలేక , ఆ ఆశను వదలలేక నలుగుతున్నది .
ఆమెయే మాట్లాడినది , " కులపతులు స్తోత్రము చేయలేదని వ్యథ పడనవసరము లేదు . మీ ప్రయత్నముతో రూపము చెంది , మీ కారణము కోసము వచ్చినపుడు స్తోత్రాదులు కావలెను . ఇప్పుడు మాకై మేముగా మా కార్యమునకై వచ్చినపుడు మాకు స్తోత్రాదులు వద్దు . "
" హే జగన్మాతా , నీ మాటకు ప్రతి యాడుతున్నాననుకోవద్దు . చూడు , ఈ విద్యార్థులచేత నమస్కృతులు పొందుతున్నానన్న ఈ అహంకారము శృతీ భగవతి దర్శనమైనపుడు ఏ స్తోత్రమూ చేయలేదని ఖిన్నము కాకుండనీ . కాబట్టి , అనుమతినివ్వు , నీ స్తోత్రము చేసి కృతార్థుడనగునట్లు నా మనోబుద్ధులను అనుగ్రహించు . నీ దర్శనము చేత కృతార్థమైన ఇంద్రియములవలె , నా వాణి కూడా నీ స్తోత్రము చేత కృతార్థము కానీ "
" కానిమ్ము , నీ ఇఛ్చ పూర్ణము కానిమ్ము "
కులపతి మరలా ప్రణామము చేసి , లేచి , ఉత్తరీయమును సవరించుకొని , సమాహితుడై నిలిచి , స్తోత్రమును ఆరంభించినాడు , " జగన్మాతకు నమస్కారము . జగత్తు పుట్టుటకు ముందే విరాట్పురుషుని తో పాటు , పరబ్రహ్మపు నిశ్శ్వాస రూపిణియై వచ్చి , ఆ హిరణ్య గర్భుడికి గురువై సృష్ఠి క్రమమును ఉపదేశించిన దేవికి వందనము . అణు రేణు తృణములన్నిటా ఉన్ననూ , మహత్ప్రయత్నము లేనిదే చూచుటకు వీలు కాని విశ్వ వంద్య కు వందనము . పెరిగిన దేహములో పరా పశ్యంతి మధ్యమా వైఖరి రూపములుగా నాలుగు ఘట్టములలో ప్రకటమగు ప్రచోదనా రూపిణికి ప్రణామము . ఎవరి కృప వలన కంటికి కనపడిన దర్శనము కూడా మహా దర్శనమౌతుందో ఆ మహా దేవికి మరలా మరలా నమస్కారము . మంత్రాత్మికవై , మంత్రార్థపు బయట ఉన్ననూ , వర్ణవర్ణములలోనూ పరబ్రహ్మగా సాక్షాత్కారమగు ప్రణవ స్వరూపిణికి మరలా మరలా ప్రణామములు . " అని విధవిధములుగా స్తుతించినాడు .
అతడు స్తుతించుచుండగా , ఆమె సూక్ష్మ రూపము స్థూలరూపముగా మారుచూ , మొదటే మనోహరముగా సాత్త్వికముగా నున్న రూపము ఇంకా మనోహరమై సాత్త్వికమైనది. ఇంద్రియములు మాత్రమే కాక , మనోబుద్ధులూ చాంచల్యమును వదలి స్థిరముగా నిలచి తల్లి ఆజ్ఞను నెరవేర్చుటకు నడుము బిగించిన వెట్టివానివలె అయినవి .
తల్లి మందహాసమును మెరిపిస్తూ అడిగినది , " కులపతీ , ఇప్పుడు నేను వచ్చినది దేవకార్యమునకు , దేవతల ప్రార్థనను నెరవేర్చెదవా ? "
కులపతి ఆతురముతో అన్నాడు , " ఈ జగత్తంతయూ దేవతల అధీనములోనున్నది . దేవతలు తమకు కావలసిన కార్యములను మానుండీ మాకు తెలియకుండానే చేయించుకోగలరు . అలాగున్నపుడు , ప్రార్థనయనగా నేమి ? మాతా ! దేవతల ఆజ్ఞను నెరవేర్చుటకు సర్వథా సిద్ధుడనైయున్నాను . "
భగవతి ప్రకటముగా నవ్వింది . ఒక మెరుపు మెరిసినట్లై ఆమె చిన్న దంతముల కాంతి చుట్టుపక్కల అంతటినీ వెలిగించినట్లాయెను . ప్రశాంతమైన ఆ వాతావరణములో ఆమె అన్నదీ , " నిజము , మేము దేవతలము పరోక్షముగానే నిలచి కావలసినదానిని చేయించుకోగలము . అయితే , కర్మాదులను చేసి పరిశుద్ధులైన వారిని మాకు సమానులుగా భావించుట మా పద్దతి . ఎవడు యజ్ఞయాగాదులను చేసి దేహమును బ్రాహ్మణముగా చేసుకొనియున్నాడో , ఎవడు తన తపోబలముచేత దేహగతమైన ప్రాణ దేవుడిని , దేహ సంసర్గ జన్యమైన జాడ్యములను పరిహరించి దివ్యభావాపన్నమగునట్లు చేసుకొని , తాను విప్రుడైయుండునో , అట్టివాడిని దేవకల్పుడని భావించుటే మా పద్దతి . కాబట్టి భవిష్యత్తును రూపించెడి మేము అంతటివారిని మాలో కలుపుకొని కార్యములు చేసెదము . ఈ దృష్టితో, దేవతలందరూ ముందు ముందు కావలసిన జగదోద్ధారమును సాధించుటకు నువ్వు కూడా సహాయకుడివి కావలెనని ప్రార్థించెదరు . దానిని నెరవేర్చి ఇవ్వగలవా ? "
" మహామాతా , జగత్తు యొక్క ఉద్ధారమనగానేమి ? అనుజ్ఞ ఇవ్వు . ఎప్పటినుండో , ఇవే పంచభూతములు . ఇవే సృష్ఠి స్థితి లయలు . ఇవే హాని వృద్ధులు . ఇవిలా ఉంటే , జగత్తులో మరలా ఉద్ధారమనునది దేనిని ? "
" ఔను , నువ్వన్నది నిజము . నదిగా ప్రవహించినా , మేఘములై తేలియాడినా , జగత్తులోనున్న నీటి మొత్తము ఒకటే అయిఉన్నట్లు , జగత్తులో ఉండి సర్వమునూ పట్టి ఆడిస్తున్న తేజము ఒకే ప్రకారముగా లేకున్ననూ , ఒకే విధముగా సర్వములోనూ సమముగా ఉంటుంది . కిందకు జారిన పదార్థము తన భారమునకు తానే జారునట్లు సృష్ఠి మొదలైన క్షణమునకు దూరమవుతూ వచ్చిన ఈ జగత్తు జడమవుతూ వస్తుంది . మొట్టమొదట సర్వమూ తానై నిండిన ధర్మము ఇప్పుడు ప్రయత్నము చేత సాధింపవలసినది అవుతుంది . అలాగయినపుడు దేవతలు ఆ ధర్మపు వృద్ధి కోసము ప్రయత్నిస్తారు . సకాములై యజ్ఞయాగాదులచేత తమను ఆరాధించు జనస్తోమము దేవతలకు బహు ప్రియమైనది . అయితే శృతి నుండి అపశృతికి దిగిన లోకమును ఆ కర్మలు మరలా శృతి మార్గమునకు తేలేవు . అలా తెచ్చుటకు బ్రహ్మ విద్యను ప్రధానముగా బోధిస్తున్న నిష్కాముడైన బ్రహ్మర్షి యొకని అవతారము కావలెను . నేను చెప్పినది మనసుకు చేరినదా , కులపతులూ ? కర్మలు ఉన్నదానిని కాపాడగలవే తప్ప , కొత్తదానిని సృష్ఠించలేవు . అలాగు కొత్త సృష్ఠిని చేయుటయే ఉద్ధారము. ఇప్పుడేమయింది ? నిజమే , కర్మలు , అనగా మనము సద్గతి ప్రాప్తికోసము విధించియున్న యజ్ఞయాగాదులు నడుస్తున్నవి . లేదనుటలేదు , అయితే తత్ఫలముగా జగత్తులో ప్రకటమవ వలసిన బ్రహ్మోపాసన అహంకారముతో కూడినది . ప్రతిఒకరూ తమకు తోచినదే బ్రహ్మ అనుచున్నారు . ఇలాగ , ఏకదేశముగా నడుస్తున్న బ్రహ్మోపాసనయే జగత్తుయొక్క వినాశనమునకు హేతువు . అలాగు ఏకదేశముగా నడవక , బ్రహ్మోపాసనము యథావత్తుగా పూర్ణముగా నడచుటయే జగత్తు యొక్క ఉద్ధారము . "
కులపతి సరేనన్నట్టు తలఊపినాడు . " దేవకార్యమును జరిపించుటకు సిద్ధముగా నున్నాను . "
" ఇప్పుడు చూడు , ఈ ఉద్ధారపు కార్యమును నెరవేర్చుటకు మనము దేవతలు , ఋషులు , పితరులు , -వీరు ముగ్గురే కదా ఈ లోకపు స్థితికి కారణము ? ఈ ముగ్గురూ వెళ్ళి , తపోలోకములో తనపాటికి తాను తపోనిరతుడైన ఒక మహానుభావుడిని , సప్తర్షి కల్పుడైన వాడిని భూమికి పంపించినారు . ఆతడు కర్మ భూయిష్ఠమైన ఈ కాలమునకు తగ్గట్టుగా కర్మమును సాంగముగా చెప్పు సంహితా బ్రాహ్మణములను , సర్వకాలీనమైన ఉపనిషత్తును తపోలోకములో ప్రత్యక్షము చేసుకొని , జగదుద్ధారము చేయుటకు వచ్చినవాడు , ఆతను నీ శిష్యుడైనాడు . నువ్వు జగత్కల్యాణార్థమై అతడిని వదలి వేయవలెను . "
" ఎవరు ? యాజ్ఞవల్క్యుడేమి ? "
" అవును . ఆ తేజస్వి గురించియే నేను చెప్పుచున్నది . దేవర్షి , పితరులూ ఎవరూ ఈ కార్యమునకై నీ వద్దకు వచ్చుటకు ఒప్పుకోలేదు . నీ శిష్యుడై వచ్చినవాడిని అకారణముగా వదలమని అనుటకు ధైర్యము ఎవరికుంది ? అందుకోసము నన్ను పంపినారు . "
కులపతులకు తన పేగులను ఎవరో బయటకు లాగివేసినంత సంకటమైనది . ఏమి చెప్పవలెనో తోచలేదు . అయిననూ ఎండిపోయిన నోటిని నాలుకతో సవరించుకుంటూ , ఏమో చెప్పాలని ప్రయత్నించినాడు . దానిని చూచి భగవతి మనసు నొచ్చుకొని ఉండాలి . ఆమె కులపతుల అంతస్తాపమును ఆర్పివేయగల ఊరట కలిగించు మాటలను ఆడుచూ చెప్పినది : " నిజమే కులపతీ , నీ శిష్యులందరిలోనూ అతడే తేజస్వి . అతనిని వదలుట అన్నా , నీ ప్రాణములను వదలుట అన్నా రెండూ ఒకటే . ! అయినా దేవతా కార్యమని మనసు చేయి . నీకు ఒక కారణము కావలెను . దేవతలు ఆ కారణమును పుట్టించెదరు . అయితే , నువ్వుగా ఒప్పుకుంటే తప్ప వారు ఏమీ చేయలేరు . "
" దేవతలు అంతటి నిర్వీర్యులు కారు "
" సంకటములో ఉద్రిక్తుడవై మాట్లాడవద్దు కులపతీ . ఇప్పుడు నిన్ను అడిగి చేయనున్న దేవతలు నిన్ను అడగకుండా కూడా చేయగలరు . అయినా నువ్వు ఒప్పుకుంటే నీకు కూడా ఆ కార్యములో ఒక పాలు . ఆలోచించు . "
కులపతి తనకు తెలియకుండానే శాంతుడైననూ , సఛ్చిష్య లోభము మాత్రము పోలేదు . " కానిమ్ము , భగవతి యొక్క ఆజ్ఞను శిరసావహించెదను . అయితే దేవతలు ఈ మహానుభావుడిని ఇంకొక సంవత్సరము నాదగ్గరే ఉంచగలరు " అని ప్రార్థించినాడు .
భగవతి , " అటులనే కానిమ్ము , అయితే ఇది దేవరహస్యము . ఇంకెవరికీ చెప్పకూడదు ." అని అంతర్థానమైనది . ఆమె తన చేతనము నంతటినీ తీసుకొని , శరీరమును మాత్రము తనకు వదలినట్లు అయిపోయి , కులపతి నిలువలేక , అలాగే కూలిపోయినాడు .
No comments:
Post a Comment