SHARE

Thursday, February 28, 2013

48. " మహాదర్శనము " --నలభై ఎనిమిదవ భాగము---భార్యా భర్తలు


48.  నలభై ఎనిమిదవ భాగము--  భార్యా భర్తలు


        వివాహము ఆడంబరముగా గొప్పగా జరిగింది . ఇల్లు నిండినట్లాయెను . కోడలు ఇంటికి వచ్చిందని ఆలంబినికి సంభ్రమము , గర్వము . పరుగెత్తుతున్న గుర్రానికి పగ్గము పడిందని దేవరాతునికి అతిశయము . ఆలంబిని తల్లిదండ్రులు కొన్ని దినములుండి తమ ఊరికి వెళ్ళినారు . మిగిలినవారు కూడా ఒకటి రెండు దినములలో వెళ్ళిపోయినారు . 

         యాజ్ఞవల్క్యుడు ఉద్ధాలకులు చెప్పినట్లే వీలైనంత బహిర్ముఖుడై యున్నాడు .  ఉదయము యజ్ఞేశ్వరుని ఉపాసన చేయు కాలములో ఇష్టము లేకున్ననూ ,  కాత్యాయని పక్కనే ఉన్ననూ ,  అలాగే అంతర్ముఖుడై యజ్ఞేశ్వరుని సాక్షాత్కారమునకై వెడలిపోవును . అప్పుడు కాత్యాయని , అది తెలిసిన దాని వలె , దానికి అలవాటైన దాని వలె , ఎదురుచూస్తూ కూర్చొంటుంది . ఆమె పది సంవత్సరాల బాలిక. న్యాయంగా ఇతరులై ఉంటే ’ కాళ్ళా గజ్జా కంకాళమ్మా’  అంటూనూ లక్క పిడతలతోనూ ఆడుకొనే వయసు . అయినా మొగుడి వద్దా , అత్తవెంటా , పెద్ద దానివలె వ్యవహరించును . 

         యాజ్ఞవల్క్యుడు ఆదిత్యోపాసనను ఆరంభించినాడు . సూర్యుడు బాగా కనిపించు వేళకు అగ్న్యుపాసన ముగించి , రక్త ( ఎర్రటి ) పుష్పములు , రక్త చందనము , రక్త అక్షతాదులతో ఆదిత్యునికి సూర్య నమస్కారములు చేయును . ఆదిత్యునికి నివేదన అయిన పాయసమును తల్లిదండ్రులు , భార్యకు కొంత కొంత తీసిపెట్టి మిగిలినది తాను భుజించును . రాత్రిపూట తల్లి బలవంతము మీద ఒక స్థాలి పాలను తాగును . మిగిలిన సమయమంతా మంత్ర జపములో వినియోగించును . 

       కాత్యాయని , భర్త దినచర్యను చూచినది . ఆమెకు అంతా అలవాటై పోవుటకు ఒక వారము పట్టినది . అత్త దగ్గరికి వెళ్ళి , " అత్తా, వారు ఆదిత్యుని ప్రసాదమైన పాయసమును తప్ప ఇంకేమీ తీసుకోరా ?  " అని అడిగినది , దానికామె , " ఔనమ్మా, ఇంకేమీ తీసుకొనడు " అన్నది . 

" రాత్రి పూట ? "

" అదీ చూచినావు కదా , నేను తీసుకొని వెళ్ళి ఇచ్చిన పాలు. అదికూడా బలవంతము మీద తీసుకుంటాడు . లేకుంటే అదీ లేదు . "

" ఆ దేహమునకు ఆ కొంత ఆహారము చాలా ? "

       ఆలంబినికి సంతోషమయినది . వయసు చాలకున్ననూ మనసు పెరిగినది అనుకొని , ’ ఆ సంగతి వాడినే అడగవలెను .  ఈ దినము నువ్వు వెళ్ళి అడుగు . " అన్నది . " అదేమో మీ దగ్గర ఉన్నంత చనువు ఇంకా వారి దగ్గర దొరకలేదు కదా ? "  

       " అలాగంటే ఎలాగ తల్లీ ? ఎంతైనా మీరిద్దరూ మొగుడూ పెళ్ళాలు . రేపు వాడికి తోడునీడగా ఉండి మసలుకోవలసిన దానవు . నువ్వు ఇప్పటి నుండే వాడి కష్ట సుఖములు చూచుకొని , వాడి మనసు తెలుసుకొనే ప్రయత్నము చేయి . " 

" సరేనత్తా,  అట్లయితే ఈ దినము సూర్యుడు దిగినాక అడగనా ? "

       " అడుగు , తప్పేమీ లేదు . అలాగని , వాడు జపము చేయుచున్నపుడు వెళ్ళి జపమును చెడగొట్టవద్దు . వాడు ఏ కారణము చేతనైనా విసుక్కున్నా , కోపము తెచ్చుకున్నా , వెంటనే నమస్కారము చేసి , నాకు నేర్పించు అను . అయితే , నా కొడుకని గర్వముతో అనునది కాదు , యాజ్ఞవల్క్యుడు నిజంగా పరమ శాంతుడు . " 

కాత్యాయని సరేనని ఊరకుంది . 

        కాత్యాయని వచ్చిన ఈ వారములో ఆలంబినికి నిజంగానే విరామమంటే ఏమిటో అనుభవమునకు వచ్చింది . భోజనము ముగుస్తుండగనే కాత్యాయని ఎంగిలి ఆకులెత్తి శుద్ధి పెడుతుంది . అత్త వద్దంటున్ననూ వినక , వంటింట్లో కసవు ఊడ్చి నేల శుభ్రము చేసి , ఉపకరణములూ పాత్రలూ అన్నీ కడిగేస్తుంది . దిగుపొద్దులో వెళ్ళి బట్టలన్నీ ఉతికి తెస్తుంది . సాయం స్నానానికి వేడి నీరు సిద్ధము చేస్తుంది . అత్తకు అనుగుణముగా ఉండి , హోమధేనువు పాలు పిండుట ఒక్కటీ తప్ప, పగలు రాత్రి వంట తప్ప, మిగిలిన పనంతా చేయును . ఆలంబినికి కోడలు నచ్చింది . ఆమె చిన్న వయసుది అయిననూ , ఇప్పుడు ఆమెను అడగకుండా అత్త ఏపనీ చేయదు . అంతేకాదు , వంటకు బియ్యము పప్పు తీసుకొనునప్పుడు కూడా , " ఏమే కాత్యాయనీ , ఈ పూటకింత బియ్యము చాలు కదవే ? " అని అడుగును . ఒకే వారము లోపల కోడలు అత్త మెప్పు సంపాదించినది . 

        ఆ దినము దిగు పొద్దులో కాత్యాయని ఇంటిలోని బట్టలన్నీ బుట్టలో నింపుకొని చెరువుకు వెళ్ళవలెను . అప్పుడు అత్త చెప్పినది గుర్తాయెను . " భర్తను అడుగుట ఎలాగ ? " అని ఒక మనసు . ఇంతవరకూ అతనితో మాట్లాడలేదు కదా అని సంకోచము . " ఎప్పటికైనా అడగవలసినదే , ఇప్పుడే అడిగితే తప్పేమి ? " అని ఇంకొక మనసు . అత్త చెప్పినారు కదా ? అతడి తోడునీడవై యుండవలెను అన్నారు . వారి కష్ట సుఖములు చూసుకో అన్నారు . ఒకవేళ వారు కోపిస్తే ?  పరమ శాంతులు అని అత్త చెప్పినారు . అయినా కోపించినారు అనుకుందాము , ఉపాయము కూడా తెలుసు . సరే , ఈ పూటే అడుగుతాను " అని ధైర్యము చేసింది . 

         యాజ్ఞవల్క్యుడు ఇంటి వెనుక తోటలో తనకోసమై కట్టిన గుడిసె వదలి బయటికి ఎక్కువగా రావడము లేదు .  తల్లి బలవంత పెట్టిననూ , తండ్రి వేడినీటి స్నానము చేస్తే తప్పులేదని చెప్పినను అతడు మాత్రము చెరువులోనే తప్పనిసరిగా స్నానము చేయును . తడిబట్టలతోనే వెళ్ళి తన గుడిసెలో ఆరవేసిన మడి బట్టలు కట్టుకొని సంధ్యా జపములను నెరవేర్చి , అగ్ని కార్యమునకు ఇంటిలోపలికి వచ్చును . మరలా ఆదిత్యోపాసనను గుడిసె వాకిట్లో చేయును . మరలా లోపలికి వెళ్ళిపోతే మధ్యాహ్నము భోజన సమయము నకు వచ్చును . ఇప్పుడు ఒకటి రెండు దినములుగా భోజనము లేదు . కాబట్టి ఇంటిలోపలికి అగ్నికార్యార్థమై వచ్చేది తప్ప ఇక దేనికీ రావలసినది లేదు . 

         ఆ దినము పొద్దువాలు సమయము వీలుచేసుకొని కాత్యాయని భర్త గుడిసెకు వెళ్ళింది . అతడు కనులు మూసుకున్నాడు . పద్మాసనములో కూర్చున్నాడు . దేహమంతా సునాయాసముగా ఉన్నట్లు ఉన్నది . చుట్టూ శాంతి వాతావరణము నిండిపోయినది . ఆవాలు కిందపడినా శబ్దము వినిపించునంత నిశ్శబ్దముగా ఉన్నది . కాత్యాయని వచ్చిన తరువాత , అదేం మాయగా వచ్చి నేల తుడుస్తుందో గానీ , గుడిసె అంతా  పరిశుభ్రముగా , కసవు పేరే లేకుండా , చెత్తా చెదారం అన్నదే కనబడకుండా , ముత్యం లాగా మెరుస్తూ , రంగవల్లులతో చూడ ముచ్చటగా ఉంది . గుడిసె నిండా సన్నగా సుగంధమొకటి వ్యాపించి ఉంది . 

        ఒక ఘడియ ఎదురుచూస్తూ కూచుంది . వారు లోపల జపము చేస్తూ ఉన్నారు . వారి నీడయైన నేను ఇప్పుడేమి చేయవలెను ? అని ఆలోచించినది . తానూ ’ ఓం నమస్సవిత్రే ’ అంటూ జపము చేస్తూ వాకిట్లోనే కూర్చుంది . 

        ఒకింత సేపటికి హఠాత్తుగా యాజ్ఞవల్క్యుడు కనులు తెరచినాడు . చూస్తే , గడప బయట వాకిట్లో బాలయోగిని వలె కాత్యాయని కూర్చున్నది . పద్మాసనము , రెండు చేతులూ రెండు తొడల పైన , అరచేతులు వెల్లకిలా పైకి . దేహము జపమునకు అలవాటైనట్లు సుఖముగా సునాయాసముగా కూర్చున్నది . అది చూచి అతడికి సంతోషమైనది . 

        అతడికి చిన్నగా ఒక పొడిదగ్గు వచ్చింది . ఆమెకు దానివలన ఇబ్బంది కాకూడదని , చాలా నివారించుకొని , సన్నగా దగ్గినాడు . ధ్యానము ఇంకా బలము కాకపోవుట చేత కాత్యాయనికి ఆకాస్త శబ్దమునకే మెలకువయై, కనులు తెరచింది . కనులు తెరిచి బహిర్ముఖుడై ఉన్న భర్తను చూచి నవ్వుతూ లేచి నిలుచుంది . 

" కూర్చో , ఏమిటిలా వస్తివి ? నావలన ఇబ్బందేమీ కలగలేదు కదా ? " 

" నాకేమీ ఇబ్బంది కాలేదు . మీకు నావలన జప భంగము కాలేదు కదా ? "

" భంగమేముంది ? ఏమీ లేదు . వచ్చిందేమిటికి ? కూర్చొని మాట్లాడు . " 

        కాత్యాయని కూర్చుంది . కానీ విషయమును ఎలా ఆరంభించ వలెను అన్నది ఆమెకు తోచలేదు . ఒకసారి మొగుడి ముఖము , ఇంకొకసారి నేల చూపులూ చూస్తూ ఆలోచించినది .

         యాజ్ఞవల్క్యునికి అలాగ పొద్దుపుచ్చుట ఇష్టము లేకున్ననూ , ఘడియ కొకసారి తన ముఖమును చూస్తున్న ఆ పిల్ల ముఖము ముద్దుగా అనిపించింది . విసుగు కనపడకుండా నమ్మకముగా మరలా అన్నాడు , " వచ్చినదేమిటో చెప్పు , నేను నిన్ను తినివేయనులే , " అని చిన్నగా నవ్వుతూ అనునయముగా  మార్దవము నిండిన గొంతుతో అన్నాడు .  

కాత్యాయని దృఢముగా కాకపోయినా , బెదురు లేకుండా పలికింది : " మీరు ఈ వ్రతము పూర్తగు వరకూ వఠ్ఠి పాయసము మీదే ఉంటున్నారట , ఔనా ? "

" ఎవరన్నారు ? "

" అమ్మ " 

" ఔను , అలా అనుకున్నాను." 

’ మీరు సమావర్తనము చేసుకున్నారు కదా , అయినా ఈ వ్రతమెందుకు ? " 

" నన్ను చేయమని ఎవరూ బలవంతము చేయలేదు . అయినా లోపలి ప్రేరణ చేత చేస్తున్నాను . " 

" ఈ వ్రతము ఎన్ని దినములు ? "

" ఒక సంవత్సరము చేయవలె ననుకొను చున్నాను ."

" వఠ్ఠి పాయసము మీదే ఉండుట నియమములలో ఒకటా ? " 

" ఔను "

" అయితే నేను కూడా మీ వలెనే వఠ్ఠి పాయసము మీదే ఉండుటకు అనుమతి నివ్వండి . " 

" దానికి నా అనుమతి ఎందుకు ? "

        " నేను మీ తోడునీడను కావలెను ! మీరెలా ఉంటే నేనూ అలాగే ఉండవలెను అని అక్కడ మా అమ్మ చెప్పేది . ఇక్కడ అమ్మ కూడా అదేమాట చెప్పినారు . అదీగాక , ముత్తైదువలు భోజనము చేయవలెనన్న , భర్త అనుజ్ఞ కావలెనంట . "

" ఓహో ! అటులనా ! నీకు సాధ్యము కాకపోతే ? "

" కావలెను . కాకపోతే అప్పుడు మరలా వచ్చి , అగుట లేదు , ఏమి చేయుట ? అని మిమ్మల్ని అడుగుట. " 

        యాజ్ఞవల్క్యుడు నవ్వినాడు : " మనసుకు సాధ్యము కానిదేదీ లేదు . నువ్వు ఇలాగే కావలెనంటే , మనసు రెండు దినములు హాహూ అంటూ గునుస్తుంది . మనము పఠము పట్టితే , అది ఊరకే అవుతుంది . అదీకాక, మనుష్యుడు జీవించేది ప్రాణాపానముల వలన కాదు . అవి రెండూ ఎవనిని ఆశ్రయించినాయో వాని వలన జీవించును . "

" అలాగన్న ? "

        " మనము భుజించేది అన్నము . దానిని అన్నాదుడై దేహములో ఉండి తినేది ప్రాణుడు . ఈ అన్నములో అవసరము లేని దానిని బయటకు తోసేది అపానుడు . కాబట్టి అందరూ మనుష్యుడు బ్రతికేది ప్రాణాపానముల వలన అనుకుంటారు . అందుకే ఉపనిషత్తు అంటుంది , ’ మనుష్యుడు బ్రతికేది ప్రాణాపానముల వలన కాదు , ఈ రెండిటికీ ఆశ్రయమైన వాడి వలన. ’ అని . నేనూ అదే చెప్పినాను . "

" సరే , అలాగయితే నాకు అనుమతి దొరికింది . వఠ్ఠి పాయసము మీదే ఉండవచ్చును అని ? " 

      " నువ్వింకా చిన్న పిల్లవు . నీది పెరిగే వయసు , దేహము . కాబట్టి భోజనము చేయుట మంచిది . కాదు , అలాగే ఉంటాను అంటే , అలా ఉండుటకు నీకు సాధ్యమైతే మంచిది , నా కర్మలకు దాని వలన బలము కూడా వచ్చును . " 

        " సరే , మరి నాకు ఈ జన్మలో మీకు సహాయకురాలిగా ఉండుట కన్నా వేరే పనేమీ లేదు . రేపటినుండీ నేను కూడా ప్రసాదమైన పాయసము తోనే ఉంటాను . రాత్రి మీరు పాలు తీసుకుంటే నేను కూడా తీసుకుంటాను . " 

అతడు సరేనన్నాడు . కాత్యాయని సంతోషముతో , నేనింక వస్తాను " అని లేచి వెళ్ళిపోయినది . 

      అతడికి విస్మయమైనది . " ఈ చిన్న వయసులో ఎంత దృఢమైన మనసు ! ఔను , ఇలా లేకుంటే లోకమెలా సాగుతుంది ? " 

         మరలా కనులు మూతపడినాయి . " దీనికోసమే బహిర్ముఖుడ నైనానేమో ? " అని అతడు యోచిస్తుండగనే అభ్యాసము మనసును ధ్యానము వైపుకు లాగుకొని వెళ్ళినది . 

Wednesday, February 27, 2013

47. " మహాదర్శనము "--నలభై యేడవ భాగము--వివాహము


47. నలభై యేడవ భాగము--  వివాహము


          దేవరాత దంపతులు కొడుకును ఆశ్రమము నుండీ ఇంటికి పిలుచుకు వచ్చినారు . ఉద్ధాలకులు , ’ అతడు ఆశ్రమములో ఇంకా కొన్ని దినములుండిన మంచిది " అను ఉద్దేశము కలవారు . ఆలాపిని మాత , దినదినమూ మైత్రేయిలో యాజ్ఞవల్క్యునిపై అభిమానము పెరుగుచుండుట చూచి , " ఇద్దరూ వయసులో ఉన్నారు , అయినంత దూరములో ఉండనీ . వారు పెద్దయ్యాక ఏమవుతుందో అదే కానీ! " అని ఏకాంతములో భర్తకు చెప్పి అతడిని తండ్రి యింటికి పంపించినది . 

         యాజ్ఞవల్క్యుడు ఇంటికి వచ్చినదే ఆలస్యము , కాత్యాయనుడు దేవరాతుని వెనకాల పడి తగులుకుని , "  ఆలంబినీ దేవికి వయసైనది . యాజ్ఞవల్క్యుడు ఇంకా వ్రతాచరణమును వదలలేదు . కాబట్టి ఆతని సేవకైనా ఎవరో ఒకరు ఉండవలెను " అని కొన్ని కారణములను ముందుంచినాడు . ఆలంబిని నేరుగా కాకున్ననూ పరోక్షముగా ఒప్పుకున్నది . అయితే , ఆమెకు తన కొడుకుకు కాత్యాయని కన్నా , తన అన్న కూతురును తెచ్చుకుంటే ఉత్తమము అని ఒక చిన్న ఆశ. కానీ , ఆనాడు బుడిలులకు తామిచ్చిన అభివచనమును కొట్టి వేయుట ఇష్టము లేదు . అంతే కాక, ఇంటికి కోడలు వచ్చి ఇంట్లో ముత్తైదువ లాగా కళకళలాడుతూ తిరుగుతుంటే , తాను దృఢముగా ఉన్నపుడే మనవడిని ఎత్తుకొని ఆడించుట అదొక లక్షణము గా ఉంటుంది అన్న నమ్మకము . 

          దేవరాతునికి ఉద్ధాలకులు పంచాత్మ సంక్రమణ విద్య విషయమంతా విపులముగా చెప్పినారు . అతనికి సంతోషమూ కలిగినది , భీతి కూడా కలిగినది . తన కొడుకు సర్వ దేవాయతన మయినాడని సంతోషము . ఇదే కారణముతో కొడుకు బ్రహ్మవిద్య కడకు తిరిగి సన్యాసి అయితే ఏమిగతి యని భీతి . కాబట్టి కొడుకు ఒంటిపై అయినంత వేగముగా ఇంకొక యజ్ఞోపవీతము పడితే అది ఒంటెద్దు ముక్కుకు ముగుతాడు కట్టినట్టే కాగలదు అని ఒక భావన. ఇవన్నీ ఆలోచించి అతడు కొడుకు వివాహమునకు తన అంగీకారమును తెలిపినాడు . మొత్తానికి కాత్యాయని తండ్రికి మనసు సమాధానమై, అతడు మాఘ మాసములో లగ్నము పెట్టుకున్నాడు . 

         ఇక్కడ యాజ్ఞవల్క్యునికి మాఘ మాసములో సూర్యారాధన చేయవలెనని అభీష్టము . " మాఘమాసములో సూర్యుడు ఉత్తరాభిముఖముగా తిరుగును . అప్పుడు ఆరాధన చేసినవారిపై అతనికి మమత ఎక్కువ. శీఘ్రముగా వర ప్రదానము చేయును . " అని అతనికి నమ్మకము . కాబట్టి మాఘ శుద్ధములోనే పెళ్ళి అనుకున్నారు . 

దేవరాతుడే స్వయముగా నిలచి కొడుకుకు సమావర్తన కర్మమును చేసినాడు . విద్యాగ్రహణము పూర్తిఅయినదని స్నాతకుడై యాజ్ఞవల్క్యుడు శోభించినాడు . 

          వివాహమునకు కులపతులిద్దరూ పత్నీసమేతముగా వచ్చినారు . మైత్రేయి పుట్టింటికి వెళ్ళిపోయినది . ఇటు ఆలంబినీ దేవి తల్లిదండ్రులూ , అటు అత్తగారు మొదలుగా అందరూ వచ్చినారు . అటు ఆడపెళ్ళివారి తరఫున భార్గవాదులూ , వధువు మాతామహుడూ , సపరివారముగా వచ్చినారు . ఇరు పక్కల వారికీ పరమానందము . 

          అందరికీ వివాహ వైభవపు వైపే గమనమయితే , యాజ్ఞవల్క్యునికి వివాహపు వైదికత్వము పైన ఎక్కువ గమనము . " ప్రాణాపానములను కలపవలెను . దంపతులిద్దరికీ యావజ్జీవమూ స్నేహమయమయిన జీవనము కలగవలెను . " అని మనసు ఆవైపే . కానీ కర్మములో ఏదైనా హెచ్చుతగ్గులయితే , కాత్యాయని చిరాకు తెచ్చుకుంటే ఏమి గతి ?  అని దిగులు . అన్నిటికన్నా ఎక్కువగా , " పది సంవత్సరాల బాలిక, ఈమె నాకు అనుగుణముగా ఆదిత్య వ్రతమును నాతో చేయించగలదా ? " అని సందేహము . భీతి , సందేహములూ ఆకాశములో ముసురుకునే మేఘములవలె వచ్చి మూసుకున్ననూ లోలోపల ధైర్యము . " దేవతలు చేయు పని . వారెప్పటికీ అర్ధాంతరముగా చేయరు . అంతా బాగా , సరిగ్గానే చేస్తారు . లేక, ఒకవేళ సరిపోకుండా పోతే , ఒక హవనమో హోమమో చేస్తే సరి . " అని . 

          పెళ్ళి దగ్గరకొచ్చింది . మగ పెళ్ళివారు ఆడపెళ్ళి వారింటికి వచ్చినారు . రాజధానిలో ఎక్కడ చూసినా పరమోత్సాహము . అందరూ ఆచార్యుల కొడుకు పెళ్ళికి రావలెను అనుకొనువారే . కాత్యాయనుడు , భార్గవుని ప్రోద్బలముతో పెద్ద పందిరిని వేయించినాడు . పందిరిలో రాజ భవనము వారికొక ప్రత్యేక స్థానమును ఏర్పరచినారు . 

         వివాహము నాడు ఉదయమే వైశంపాయనులు దేవరాతుడిని ప్రత్యేకముగా పిలచి " ఈ దినము మీ యింటికి వచ్చునది కోడలు కాదు , మహాలక్ష్మి. మీ వంశమును ఉద్ధరించునది . ఆ భావము మీకు ఉండవలెను . మీ దంపతులు కన్యాగ్రహణ కాలములో ఆ భావముతో దేవతలను ఆరాధించండి . నేను ఇలాగ చెప్పినందుకు కోపము లేదు కదా ? " అన్నారు.

          దేవరాతుడు వారికి నమస్కారము చేసి , " సమావర్తనమగు వరకూ మీ దగ్గర ఉండుటకు యాజ్ఞవల్క్యునికి అదృష్టము లేకనేపోయింది . అయినా వాడికి తమరు గురువులు అను భావము అలాగే ఉన్నది . అలాగే తమరికి వాడు శిష్యుడను భావము పోలేదు . బుడిలులు ఉండి ఉంటే ఇదంతా నిన్నటి దినమే చెప్పి మమ్ములను హెచ్చరించేవారు . ఇప్పుడు తమరు బుడిలుల స్థానములోనున్నారు . కాబట్టి తప్పేమీ కాదు . మాకు కూడా వివాహ మంత్రములు అర్థపూర్వకముగా తెలిసియున్ననూ వాటిని అనుష్ఠానములో పెట్టుకొనలేదు . తమరు జ్ఞాపకము చేయకున్న ఎలాగ ? " అని అభివాదములు చెప్పి నమస్కరించినాడు . 

          యాజ్ఞవల్క్యుడు పెండ్లి మంటపము నకు వెళ్ళుటకు ముందు వచ్చి వైశంపాయన దంపతులకు నమస్కారము చేసినాడు . వారు అతడిని లేపి హత్తుకొని , " యాజ్ఞవల్క్యా , నువ్వు సర్వజ్ఞుడవైనావు . దానిని లోకము కూడా ఒప్పుకొనునట్లు కావలెను " అని నోరారా దీవించినారు . యాజ్ఞవల్క్యుడు ’ అంతా తమరి ఆశీర్వాదము ’ అన్నాడు . కదంబిని, " నిన్ను చూచినపుడు  నువ్వు మా యాజ్ఞవల్క్యుడు అనవలెను అనిపిస్తుంది . ఏమిటి చేయుట ? " అన్నారు , యాజ్ఞవల్క్యుడు , " నేను దేవరాత దంపతుల కొడుకును అన్నది ఎంత సమంజసమో , వైశంపాయన దంపతుల శిష్యుడను అనునది కూడా అంతే సమంజసము . నేను ఎక్కడ ఉన్నా ఎక్కడ తిరిగినా మీ యాజ్ఞవల్క్యుడనే ! " అన్నాడు . కదంబినికి పట్టలేనంత సంతోషమై , " నా యాజ్ఞవల్క్యుని విశ్వానికి విశ్వమే గౌరవించు సమయము రావలెను " అని మనసారా పొగడినారు . 

         యాజ్ఞవల్క్యునికి ఉద్ధాలక దంపతులకు కూడా నమస్కారము చేసి రావలెనని ఆశ. అయితే వారేమయినా అనుకుంటే ? అని ఒక వెనుకంజ. చివరికి అయ్యేది కానీ యని వారున్న వైపుకు వెళ్ళినాడు . ఉద్దాలకులు లేచి అతడిని ఆహ్వానించి , " చూడు ,  యాజ్ఞవల్క్యులు వచ్చినారు "  , అని ధర్మపత్నికి చెప్పినారు. ఆమె వచ్చి , " రా నాయనా , ’ నిన్ను ’  అని పిలువవలెనో , ’ మిమ్మల్ని ’ పిలువవలెనో ? న్యాయంగా ’ మిమ్మల్ని ’ అని పిలువవలెను . మీరే మాకు మార్గదర్శులు. " అని నవ్వుతూ పలికినారు . 

          యాజ్ఞవల్క్యుడు చేతులు జోడించి , "  తమరు ఏమైనా చెప్పండి , నేను మీరు నాటిన బీజమును . ఈ  నారు మీదే , నీరు మీదే . అది విశ్వమాన్యమైననూ మీ మొక్కే కదా ? నాకొక వరము కావలెను . దానికోసము తమవద్దకు వచ్చినాను . " అని ఇద్దరినీ ప్రార్థించినాడు . 

ఉద్ధాలకులు , " ఏమిటి ? మొన్నటిదే కదా ? ఇద్దరికీ నమస్కారము చేసి ఆశీర్వాదమును పొందవలెను, ఇదేకదా నీ ప్రార్థన ? " అన్నారు . 

" ఔను "

         " ఈ దినము నువ్వు ఏమి అడిగినను లేదనకూడదు . కాబట్టి ’ అటులనే ’ అనవలెను . మేము అప్పుడే చెప్పినట్లు , నువ్వు వయసులో చిన్నవాడివి అన్నది ఒక్కటీ వదలి , ఇక దేనిలో మాకన్నా తక్కువ ? అయినా కానిమ్ము , ఆలాపినీ , వెళ్ళి అక్షతలను తీసుకొనిరా. ఆశీర్వాదము చేయుదము " అన్నారు . అక్షతలను తెచ్చుటకు ఆమె వెళ్ళినది . 

ఉద్ధాలకులు : " నువ్వు నాకొక మాట ఇవ్వవలెను " 

" అనుజ్ఞ ఇవ్వండి , ఎంతైననూ నేను మీ అనుగ్రాహ్య వర్గమునకు చేరినవాడిని . "

          " నువ్వు ఎల్లపుడూ అంతర్ముఖుడివిగా ఉంటావు యాజ్ఞవల్క్యా , నువ్వు అలాగ అంతర్ముఖుడివిగా ఉంటే , కాత్యాయని బ్రతుకు పాడైనట్టే . కాబట్టి బహిర్ముఖుడవై నువ్వు ఆమె మనసు నొప్పించకుండా సంసారము చేసుకోవలెను . " ఉద్ధాలకులకు భావావేశము పొంగింది . చివరి మాట అంటున్నపుడైతే కంఠము బిగుసుకొనే పోయింది . 

          యాజ్ఞవల్క్యుడు ఒక ఘడియ అలాగే నిలుచున్నాడు . అతడు ఇంతవరకూ ఆ కొత్త బాలికను తనకు కావలసినట్లు దిద్దుకొనే యోచనలో ఉన్నాడే తప్ప , ఆ బాలిక కూడా తనవలెనే సృష్టికి వచ్చిన ప్రాణియనీ , దానికీ తనవలెనే సుఖ దుఃఖములు ఉంటాయని ఆలోచించలేదు . ఉద్ధాలకుల మాట అతడి కళ్ళు తెరిపించినది . వివాహ మంత్రములలో అన్నిటికన్నా ఎక్కువగా ’ ఋక్ త్వమ్ , అహమ్ సామ ’ నువ్వు ఋక్కు , నేను సామము అను మంత్రమూ , ’ సఖా సప్తపదీ భవ ’, ఏడడుగులు కలసి నడిచి సఖీ సఖులు కండి అన్న  మంత్రమూ గుర్తొచ్చింది . 

          ఆ వేళకు ఆలాపిని అక్షతలను తెచ్చిచ్చింది . యాజ్ఞవల్క్యుడు ఆ అక్షతలను తీసుకొని వారికిచ్చి ,  " ఈ తమరి ఆజ్ఞ నాకు శిరోధార్యము. ఎల్లపుడూ ఈ మాటలు నా హృదయములో ఉండి మార్గ దర్శి కావలెను " అని దంపతులకు నమస్కరించినాడు . 

ఆ దంపతులు , " నీకు ఈ కల్యాణము సర్వథా, సర్వదా కల్యాణము అయి వుండనీ " అని మనఃపూర్వకముగా ఆశీర్వాదము చేసినారు . 

         యాజ్ఞవల్క్యుడు బయటికి వెళ్ళగనే వధూవరుల తల్లులు వచ్చి , " ఇంద్రాణీ పూజ చేయించవలెను రండి , మీ వెంట కదంబినీ దేవి కూడా రావలెను " అన్నారు . 

         ఆలాపినీ దేవి , కదంబినీ దేవి కలసి కాత్యాయని చేత ఇంద్రాణీ పూజను చేయించినారు . కదంబిని , " మా యాజ్ఞవల్క్యుని ధర్మపత్నివి కమ్ము . మీ దాంపత్యము ఆదర్శమగుగాక " అని నోరారా ఆశీర్వదించినారు . ఎందుకో ఏమో ఆలాపిని దేవికి మైత్రేయి గుర్తుకొచ్చినది . వారుకూడా కదంబినీ దేవి వలెనే ఆశీర్వాదము చేసినారు . అయినా , " ఈమే మైత్రేయి అయిఉంటే ? " అనిపించి , వారిని ఆ భావము ఎక్కడెక్కడికో పిలుచుకొని వెళ్ళింది . 

Tuesday, February 26, 2013

46. " మహాదర్శనము "--నలభై ఆరవ భాగము --గృహిణియా ? బ్రహ్మవాదినియా ?


46. నలభై ఆరవ భాగము -- గృహిణియా ? బ్రహ్మవాదినియా ? 


         ఆ మాట విను వరకూ మైత్రేయి ఒళ్ళంతా చెవులై వింటున్నది , వివాహపు సంగతి వచ్చేసరికి ఎందుకో చంచల యైనది . ఆమెకు ఏదో అసహనముగా అనిపించినది . తన పదార్థమును ఎవరో ఎత్తుకొని పోవుచున్నట్లు భావించినది . 

       ఆలాపిని మాత , మేనకోడలి మనఃస్థితిని ఆమె ముఖము మీద కనబడుతున్న భావముల నుండే ఊహించినారు . అయితే అప్పుడు మాట్లాడుట సరికాదని ఊరికే ఉన్నారు . 

        యాజ్ఞవల్క్యుడు బయలు దేరుతానన్నాడు . ఆచార్య దంపతులిద్దరూ నమస్కారమును గైకొని  వెళ్ళివచ్చుటకు అనుజ్ఞ నిచ్చినారు . వెళ్ళుతున్న వాడిని చూచి ఆలాపిని, " మరలా కన్నులు తెరిచేది ఎప్పుడో చెప్పి ఉండవయ్యా ! ఆ పూటకు సరిగ్గా పాలు పంపిస్తాను . అంతవరకూ దినదినమూ పంపించి పాలనెందుకు వ్యర్థము చేయవలెను ? " అన్నారు.

       యాజ్ఞవల్క్యుడు బయలు దేరినవాడల్లా నిలచి , " పాలు వ్యర్థమేమీ కాలేదు కదా , పాలు చెడిపోలేదు , పులిసిపోలేదు , విరిగిపోలేదు . మీకు వేరే పనికి  ఉపయోగ పడినాయి కదా " అన్నాడు. 

ఆలాపిని , " అదీ నిజమే . అయినా మాటవరసకు ఆడిన మాట అది . దానికింత గౌరవము ఇవ్వనక్కర లేదు " అన్నారు .

       ఆచార్యుడు , " చూచితివేమయ్యా ? నువ్వు కనులు మూసుకొని కూర్చున్నావు . నీ దగ్గర పెట్టిన పాలను వీరు తెచ్చినదీ , ఉపయోగించుకొన్నదీ నీకెలా తెలుసు ? అలాగ నీకు తెలిపినది సర్వజ్ఞ బీజము కాకపోతే ఇంకేది ? దానినే కావాలన్న మొక్కగా , చెట్టుగా పెంచవచ్చు . " అన్నారు . 

        యాజ్ఞవల్క్యుడు , అద్దములో తన రూపమును చూచుకొని సిగ్గుపడే రూపవతి వలె తనకు తెలియకుండానే ప్రకటమైన సర్వజ్ఞత్వమును చూసి , లోపల మెచ్చుకున్ననూ , బయటికి సిగ్గుపడినవాడివలె అక్కడ నిలవకుండా వెళ్ళిపోయినాడు . 

        వెళుతున్నవాడిని చూస్తున్న ఆలాపిని, " ఏమంటారు , ఈ యాజ్ఞవల్క్యుని ఆ కాత్యయని సేవించుట సాధ్యమా ? మన మైత్రేయి వలె పెరిగినదయితే బాగుండెడిది . " అన్నారు .

        ఆచార్యుడు నవ్వు కనిపిస్తున్న కొంటెతనముతో , " అలాగయితే కాత్యాయనునికి చెప్పి పంపుదామా , మీ కాత్యాయని వద్దు , ఇక్కడ అప్పుడే స్వయంవరమై పోయినది , మా మైత్రేయి మీ యాజ్ఞవల్క్యుడిని వరించినది యని ? ఏమంటావమ్మా , సరేనా ? " అని మైత్రేయి ముఖాన్ని చూస్తూ అన్నాడు . 

       ఆ మాటకు ఆలాపిని ఉత్తరమిస్తూ , " మైత్రేయి బ్రహ్మవాదిని కావలెనని ఒత్తిడి తెచ్చిన దానను నేను . అయితే అప్పటికి యాజ్ఞవల్క్యుడిని చూచి ఉండలేదు . " అన్నారు . 

       ఆచార్యులు నవ్వుతూ , " ఇప్పుడేమి నష్టమయింది మహా ! మైత్రేయిని , నీ కోరిక మేరకు బ్రహ్మవాదిని కానిమ్ము , ఆమెకు ఇష్టమైతే మోక్షపత్ని కావచ్చు కదా " అన్నారు . 

       మైత్రేయి నవ్వుతూ , " చూడత్తమ్మా , నీలాగా కావలెనని మామయ్య చెప్పుచున్నారు . అయితే నువ్వు మామయ్యకు ధర్మపత్నివి కూడా , మోక్షపత్నివి కూడా ! నీ లాగా రెండూ అగుటకు ఎవరికి సాధ్యము ? " అన్నది . 

ఆ మాటల వెనుకనున్న అర్థమును గురించి ఎవరూ అంతగా ఆలోచించలేదు . 

45. " మహాదర్శనము "--నలభై ఐదవ భాగము-- దేహము దేవాయతనమైనది


45. నలభై ఐదవ భాగము--   దేహము దేవాయతనమైనది 


        ఆచార్యులు కనురెప్ప పాటు కాలము అలాగే అవాక్కై నిలుచున్నారు . వారు మౌనముగా నున్ననూ , వారి విప్పారితములైన కన్నులు , పైకిలేచిన కనుబొమలూ , తెరుచుకున్న నోరూ వారి ఆశ్చర్యమును తెలుపుచునవి . మరలా అంతలోనే సహజావస్థకు వస్తూ , " సర్వ దేవతలనూ పిలుచుకొని వచ్చిన కుమారునికి అర్ఘ్య పాద్యాదులకు సర్వమునూ సిద్ధము చేయండి . నేను ఇప్పుడే వస్తాను" అని బచ్చలింటి వైపుకు వెళ్ళినారు . దేవి ఆలాపిని కుమారునికి ఒక కృష్ణాజినమును ఇచ్చి కూర్చోబెట్టి , తాను అర్ఘ్యపాద్యాదులను సిద్ధపరచుటకు వెళ్ళినది . మైత్రేయి కూడా అత్త వెంటనే వెళ్లినది .

       " సర్వదేవతలనూ పిలుచుకొని వచ్చినాడు " అన్న ఆచార్యుల మాట కుమారునికి అర్థము కాలేదు . ’ ఇంకేమిలే , వారే వస్తారు , అదేమిటో చెప్పెదరు ’ అని ఎక్కడో మనసుతో కూర్చున్నాడు . 

         అతను కూర్చున్న వెంటనే వెనుకటి వృత్తి అతడిని ఆవరించి ఎక్కడికో లాగుకు వెళ్ళింది . ఎవరో వచ్చి , ’ కావలెనంటే భవిష్యమును చెప్పెదను . ఆచార్యుల మాటకు అర్థమును చెప్పెదను ’ అన్నారు . " నువ్వు ఎవరు ? " అని అడిగితే , " నేనే నీ మనసు . మనస్సర్వము ,  ఇక పైన ఏమి కావాలన్ననూ నువ్వు పుస్తకము తీసి చదువునట్లే చూసుకోవచ్చు . ఏ అడ్డమూ ఉండదు . నీకు కాల పురుషుని దర్శనమైనందు వలన నీకు ఇతరుల వలె దేశ కాల వర్తమానముల అడ్డము లేదు ." అన్నారు . కుమారుని కుతూహలము రేకెత్తలేదు , ఆచార్యుల వాక్కుకు వ్యాఖ్యానము అవసరము లేదు , అలాగే , మైత్రేయి యొక్క భవిష్యత్తులో ఆసక్తి కలుగలేదు . ఆచార్యదంపతులు ఆవేళకు అటు ఇటు నుండి వచ్చినారు . ఆచార్యులు చేతులు తుడుచుకుంటూ వచ్చి , భార్యను అడిగి నీరు తీసుకొని శుద్ధాచమనము చేసినారు . ఆమె తాను తెచ్చిన పాద్య , అర్ఘ్య , ఆచమనములను కుమారునికి ఇచ్చినారు . కుమారుడు ఎందుకు , ఏమి అని అడుగకుండానే వారి అర్పణలను అనుజ్ఞయని  గ్రహించినాడు . ఇంకొకసారి పాలు , పండ్లు ఇచ్చినారు . ఎప్పటివలె అయితే కుమారుడు వద్దనవలసినది . అయితే ఇప్పుడు ఆ ఫలహారమును ఆదరముతో స్వీకరించినాడు . అంతా అయిన తరువాత ఆచార్యుడు కుమారుని వద్ద వేరొక కృష్ణాజినము పైన కూర్చున్నాడు . ఆచార్యాణీ , మైత్రేయీ అక్కడే ఒక్కొక్క ఆసనములను వేసుకొని కూర్చున్నారు . 

ఆచార్యులే మొదట మాట్లాడినారు  వారి మాటలో వారి సంతోషము వ్యక్తమగుచున్నది . 

" ఏమిటయ్యా యాజ్ఞవల్క్యా, ఇప్పుడు నిన్ను కుమారా అన వలెనా,  ఆచార్యా అనవలెనా ? "

కుమారునికి గాభరా అయినది . " ఇంకా స్నాతక వ్రతము కాలేదే ? "

         " స్నాతక వ్రతము క్రమముగా విద్యా గ్రహణాదులను చేసినవాడికి . కానీ యాజ్ఞవల్క్యా , సర్వ దేవతా సాన్నిధ్యమును పొందిన నీకు స్నాతక వ్రతము వలన ప్రయోజనమేమి ? నువ్వు పుట్టినపుడే నువ్వు ఇలాగవుతావని మాకు తెలిసి యుండినది . అదీకాక, నిన్ను సమర్చించే కాలమూ ఒకటి వస్తుందని మాకు నమ్మకము కూడా ఉండినది . అందువలననే , దైవ యోగము వలన నువ్వు వైశంపాయనుల ఆశ్రమము నుండీ వచ్చినపుడు , మేము అన్యశిష్యుడిని పరిగ్రహించము అని అన్నది . ఇప్పుడు నీకు ఆదిత్యుడు గురువైనందు వలన ఏమేమయినదో , చూచితివా ? మేము అనేక వర్షముల కాలము గురుసేవ కష్టమును అనుభవించి నేర్చిన పంచాత్మ సంక్రమణ విద్య నీకు పదునైదు దినములలోనే కరగతమైనది . బ్రహ్మ విద్యా సంప్రదాయములన్నిటా బహు విస్తారమయినదీ , ఇహములో నానా ఫలములను ఇచ్చునదీ , అన్నిటి కన్నా ఎక్కువగా సర్వజ్ఞ పదవిని ఇచ్చునదీ అయిన ఈ విద్యను నీవలె సాధించినవారు ఇంతవరకూ ఎవ్వరూలేరు . ఇకముందు మేము ఏదైనా తెలుసుకోవలె నంటే నీనుండీ తెలుసుకొను నట్లయినది . అంటే , నువ్వు మాస్థాయిని చేరినావు . మేము ఆచార్యులు అయితే , నువ్వు అత్యాచార్యుడవైనావు . అన్నిటికన్నా మిక్కిలిగా , నీకు గుణమంటే కుతూహలము లేదు . రేపు ఏమి జరుగుతుందో అన్నది ఈ దినమే తెలుసుకోవలె నన్న ఆత్రము లేదు . ఇది సర్వజ్ఞత్వపు గుర్తు . భలే , అద్భుతముగా సాధించినావు , భలే ! భలే! " 

      కుమారుడు లేచి వారికి నమస్కారము చేసినాడు . " తమరు అనుజ్ఞ ఇచ్చినదంతా విన్నాను . కానీ నాకు ఏమీ అర్థము కాలేదు . దయచేసి నాకు అర్థమగునట్లు అనుజ్ఞ కావలెను  . " 


        ఆచార్యుడు తన సంతోషమును ప్రకటముగా చూపిస్తూ అన్నాడు , " నీ ఈ వినయము శ్రేయస్సాధనము . నీకైనా, ఎవరికైనా , పరమ విభూషణము . నీ ఈ వినయమునకు వశము కాని వారెవరు ? కాబట్టి నీకు అర్థం కాలేదన్నావు కదా, ఒక్కొక్కటీ విడమరచి చెప్పెదను , విను . మేము అనేక వర్షముల కాలము గురుసేవ కష్టమును అనుభవించి నేర్చిన పంచాత్మ సంక్రమణ విద్య నీకు పదునైదు దినములలోనే కరగతమైనది అన్నాను , అది అబద్ధము కాదు .  కానీ మీకెలా తెలిసింది అంటావేమో , చూడు , పంచాత్మ సంక్రమణ విద్యను సాధించినవానికి కాకపోతే ఇతరులకు పంచభూత దర్శనము కాదు . నీకు పంచభూత దర్శనమైనది అనుదానిని నీ కన్నుల ప్రశాంత తేజస్సు చెప్పుచున్నది . అలాగ ఆ భూత దర్శనము కాకుండా ఈ ప్రపంచ దృశ్యపు నానాత్వము చెరిగిపోదు . ఈ దృశ్య నానాత్వము చెరిగిపోకుంటే , ఇంద్రియ లోలత్వము , ఇంద్రియ సహజమైన చాపల్యము తప్పవు . అవి తప్పకపోతే మనసు శాంత సంకల్పము కాదు . మనసు శాంత సంకల్పము కాకపోతే దేవతలు ఆ దేహమున వచ్చి విలసిల్లరు . దేవతలు విలసిల్లని దేహము దేవాయతనము కాదు . దేహము దేవాయతనము కాకుంటే, కాల పురుషుడు ప్రసన్నము కాడు . ఆతడు ప్రసన్నుడు కాకుంటే, చింత , కలవరము , కుతూహలము , ఆత్రము , తొందరపాటు తప్పవు . తెలిసిందా ? "                

" ఇప్పుడు నాలో ఇదంతా జరిగినదంటారా ? "

       " అయినది అనుదానిని నువ్వు చూసుకోలేదు . ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఆకుల చాటున కనుమరుగైన ఫలముల వలె నున్నవి . నీకు కాల పురుషుని దర్శనము కాలేదా ? "

       కుమారుడు ఒప్పుకున్నాడు . ఆచార్యుడు కొనసాగించెను," అయ్యా, ఆ దేవతల ఆట ఏమని చెప్పేది ? నీకు కావలసినదంతా అయింది . అయితే అయినట్టు నీకింకా బోధ కాలేదు . ఆ దినము నువ్వూ నేనూ కూర్చున్నపుడు పంచాత్మ సంక్రమణ విద్యను ఆదిత్యుడు నీకు అనుగ్రహించినాడు . మెట్టు మెట్టుగా ఆ దినము నీకు ఈ ఐదు కోశములూ దారినిచ్చినవి . నీకది జ్ఞాపకమున్నది కదా ? "

        కుమారుడు ఔనన్నాడు . దాని తర్వాత ఏమేమి నడచినదో చూడు . నీకు పంచభూతముల దర్శనమైనది కదా ? , భూతభూతములకూ వేరే వేరే గతులున్నవి అన్నది తెలిసింది కదా ? ఆ గతులలో దేనికీ దొరకక, ఆకాశము వరకూ వెళ్ళి అక్కడ ప్రాణ దర్శనము చేసి వచ్చినావు కదా ?  ఈ ప్రపంచములో శబ్దమంతయూ ఆహతముగా ఉన్నపుడు , పరమాకాశములో అనాహతమైన ఓంకారమును దర్శించినావు. ఇంతటి అదృష్టము ఎవరికి కలుగును ? ఇప్పుడు నీకేమయినదో తెలుసా ? దృశ్యముగా నున్నదంతా శ్రావ్యమై , శ్రావ్యముగా ఉన్నదంతా ఒకే ఒక ప్రణవపు సంకేతమైనది యని బోధయగుచున్నది కదా ? నువ్వు కావాలన్నా , వద్దన్నా , నీకు కలిగిన ప్రణవ దర్శనపు ఫలము నిన్ను వదలలేదు . కాదా ? "

కుమారుడు ఔనని ఒప్పుకున్నాడు . 

" ఇప్పుడు చెప్పు , దృశ్య నానాత్వము ఇంకా ఉందా ? "

        కుమారుడు తన అనుభవమును అబద్ధమనుటెలా ? తాను అనుభవిస్తున్నదానిని కాదని చెప్పుటెలా ? ఆచార్యుడు తనకైన అనుభవమును , తనకు కలుగుతున్న బోధను అద్దములో కాదుకదా , కళ్ళారా చూచినదానికన్నా ఎక్కువగా వర్ణిస్తున్నది చూచి ఆశ్చర్యమైనది . మరుక్షణమే ఆ ఆశ్చర్యము తిరోధానమై మనసు అంది " ఇదేమీ ఆశ్చర్యము కాదు . ఆచార్యులు జ్ఞాన చక్షువులున్నవారు . అటువంటివారికి ఏ అడ్డమూ లేక, వెనుక ముందు ఉన్న వాటిని మాత్రమే కాదు , దేశాంతర , దేహాంతర కాలాంతరములలో జరిగినదానిని చూచి చెప్పగల శక్తి ఉంటుంది . నీకు కూడా ఆ శక్తి ఉంది . దానిని ఉపయోగించమని నేను అప్పుడే చెప్పితిని , నువ్వు వద్దంటే నేను ఊరకున్నాను . "

       ఆచార్యుడు మరలా అడిగినాడు , " ఈ దృశ్య నానాత్వము చెరగి పోయి నందువల్లనే ఇప్పుడు నీ ఇంద్రియములు స్థిరమైనాయి . ఇప్పుడు ’ ఈ ఇంద్రియములు వేరు వేరు కాదు . అన్నీ ఒకటే ’ యంటే నువ్వు ఔను అనే స్థితికి వచ్చినావు . చూచుటకు కళ్ళే అవసరము లేదు , కాలితో కూడా చూడవచ్చును అంటే , నువ్వు చూడకున్ననూ ’ అది సాధ్యమే ’ అను స్థాయికి వచ్చినావు . దాని వలన గోళకమే దృక్ అన్న భ్రాంతి అణగి , దృక్ , దృశ్యము , దర్శనము అన్న త్రిపుటము అణగిపోయినది . దాని ఫలమేమిటో తెలుసా ? మనసు ఇంద్రియములలో పారి బయటికి వస్తున్నది తప్పినందువల్ల , బయటికి వెళ్ళుట అను ఆలోచనయే తప్పిపోయి , మనసు శాంత కల్పమైనది . " 

  " చిత్తము , "

        " మనస్సు శాంత కల్పమగుచున్నపుడు బుద్ధి కర్తృత్వ రహితమై  , తన చేష్టలను వదలినది . దాని వలన లోకములో నీవలన కార్యములు చేయించుటకు దేవతలే రావలసి వచ్చినది . అనగానేమి ? నీ దేహములోనున్న ప్రాణమండలము ప్రాణముగా నుండుట తప్పి , అగ్నీషోమీయ మండలమైనది . అగ్ని కుండము నుండీ విస్ఫులింగములు వెదజల్లునట్లే , కావలెనన్నపుడు , ఆవశ్యకత వచ్చినపుడు అక్కడ దేవతలు సిద్ధమై తమ తమ కార్యములను లోపములు లేకుండా నిర్వహించునట్లాయెను . దానివలన నీదేహము దేవాయతనమైనది . సరియా ? "

" వింటున్నాను , సరియే  " 

       " ఇదంతా అయినదానికి గుర్తుగా నీకు కాలపురుషుని దర్శనమైనది . కాల పురుషుని దర్శన ఫలముగా నువ్వు సర్వజ్ఞుడైనావు . సర్వజ్ఞ చిత్తము నీలో ఏర్పడింది . నీ చింత, ఆందోళన వంటివన్నీ అస్తమించినాయి , తప్పా ఒప్పా ? "

     కుమారుడు ఒప్పే అన్నాడు . ఆ ’ ఒప్పు ’ అన్న రెండు అక్షరముల మాటలోనే ఆచార్యుడు చెప్పిన సర్వమూ తన అనుభవమునకు వచ్చినది యన్నది అతడు ఒప్పుకొను నట్లుండినది . 

       " ఈ చింత , ఆందోళన వంటివి నీ దేహపు లోపల ఉండిఉంటే , నీకు కూడ  మాకు లాగే ఎన్నో సంవత్సరములు పట్టేది . కానీ దేవతలు గొప్ప మనసుతో వారి కృపాఫలము నీకిచ్చి , ఇదంతా ఒకే పక్షములో అగునట్లు చేసినారు . ఆ పక్షములో కూడా నువ్వు బహిర్ముఖుడవు కాలేదు . దేహము వైపు నీ గమనమే లేదు . దేహము తన సుఖదుఃఖములను , మూత్ర పురీషములను గురించి ఏమనుటకూ అవకాశము దొరకలేదు . ఆ దేహమునకు , చంకలో బిడ్డను ఎత్తుకొనుటే చాలయిపోయిన తల్లి వలె , దేవతల వైపుకు తిరిగి , దేవతలతో సంభాషణ జరుపుతున్న నిన్ను తట్టుకొనుటే చాలయిపోయింది . అదీకాక, అధికారము చూపతగిన నువ్వు మిత్రుడి వలె వ్యవహరించి , అన్నమయ కోశమును పూజాదులతో గౌరవించినందు వలన , అది ’ నీ పని నేను  చేయను ’ అని మొండికేసి పట్టు పట్టుటకూ సాధ్యము కాలేదు . ఇప్పుడు నువ్వు జాగృత్తికి వచ్చి ఈ దేహములో వ్యాపారము చేస్తున్న దానికి గుర్తుగా , దేహమును నిర్మించిన భూతములన్నీ శుద్ధియయిన దానికి గుర్తుగా, నీ దేహములో మనోహరమైన కమల గంధము ఉత్పన్నమైనది . " 

      కుమారుడు మౌనముగా వారు చెప్పినదంతా ఒప్పుకున్నాడు . ఆచార్యుడు అన్నాడు : " ఇప్పుడు చెప్పు , నువ్వు సర్వజ్ఞుడవు కాకున్నా , సర్వజ్ఞ కల్పుడవైనావు . అలాగనిన ఏమిటా ? విను . శాంత కల్పమై నిర్విషయమైన మనసు అంతర్ముఖమైనపుడు తానున్నానా , లేనా అని అర్థము కానట్లు , నిద్రించినట్లు ఉండును . మనసు ఈ అవస్థలో ఉన్నపుడు ఏదైనా తెలుసుకోవలెను అనిపిస్తే , ఆ సంకల్పము దేవ కార్యార్థమై వచ్చినందు వలన , దేవతలు పరుగెత్తి వచ్చి , అక్కడ ఆ జ్ఞానము కలుగుటకు కావలసిన అనుకూలములను కల్పిస్తారు . ఇప్పుడు చూడు , నిన్ను ఇక్కడికి పిలుచుకురాలేదా ? కాబట్టి , అలాగ ’ ఇప్పుడు నేను సర్వజ్ఞుడనో కాదో ’ యని చూచుకోవలసిన అగత్యమే లేదు కాబట్టి నువ్వు ఆ విషయములో ఉదాసీనుడవైనావు . అయితే , అక్కడున్న సామగ్రి అంతా చూచినాక , ’ ఇంటిని చూడగా ఇల్లాలెటువంటిదో తెలియునట్లు ’ ఆ దేహి యొక్క యోగ్యత అవగతమగును . కాబట్టి, ఇప్పుడు నీకున్నవి రెండు దారులు . నిన్ను నువ్వే పరీక్ష చేసుకొనుట , లేదా నన్ను నమ్ముట. ఈ రెండింటిలో ఏదైనా ఒకదానిని పట్టుకో . కుమారుడు యోచించినాడు . : ’ సర్వజ్ఞుడనని నన్ను అందరూ పొగుడుటవలన , నాకు కలుగు పురుషార్థము ఏమిటి ? నన్ను నేను పరీక్ష చేసుకుంటే మాత్రం కలిగేదేమి ? కాబట్టి , ఆచార్యుల మాట చాలు . అంతేగాక , వారు అబద్ధము చెప్పి సాధించేదేముంది ? అని విచారము చేసుకొని , " తమరి మాటే చాలు , పరీక్ష అవసరము లేదు " అన్నాడు . 

" అయితే సరే . ఇప్పుడు చెప్పు , ఇంతటి నిన్ను మేము మా సమానుడవంటే తప్పేమి ? " 

కుమారుడు ఆ మాటకు ఉత్తరమునివ్వలేదు . నవ్వుతూ తలవంచినాడు . 

       " నువ్వు స్నాతకుడవు కాలేదని ఒక కుంటి సాకు వెదకుతున్నావు . అదిలోకపు పద్దతి . దానిని విడు , నీ ముందరి దారి గురించి చెప్పు . ఇప్పుడు నువ్వు మరలా ఆదిత్యుని గూర్చి తపస్సు చేయి . అతని వలన ఏమి కాగలదు అనునది నువ్వూ నిర్ణయించుకోగలవు , నాకూ తెలుసు . కాబట్టి దాని విషయమై నేను ఏమీ చెప్పను . ఆదిత్యుని అనుగ్రహమైన తరువాత కొంత కాలము గృహస్థుడవై సుఖముగా ఉండు . ముందేమవుతుందో చూద్దాము . " 

" తమరి అనుజ్ఞ. ఆదిత్యోపాసనను చేస్తూనే ఉన్నాను . వదలలేదు . ఇకముందు దానిని బలపరచెదను . " 

       " చూడు , మరచిపోయినాను . బుడిలుల కుమారుడు కాత్యాయనుడు కూతురి పెళ్ళికి కాలాతీతమగుచున్నది ; వచ్చు మాఘాదిపంచకములో వివాహమగునట్లు ప్రయత్నము చేయవలెను అని మీ తండ్రి దగ్గర ప్రస్తావించినాడట. వారు నాకు సమాచారము పంపినారు . ఏమి సమాధానము పంపించేది ? " 

" తమరు అప్పుడే అనుజ్ఞ ఇచ్చినట్లు మొదట ఆదిత్యానుగ్రహ సంపాదన. అనంతరము వివాహము ." 

" సరే కానిమ్ము " 

Sunday, February 24, 2013

44. " మహాదర్శనము "--నలభై నాలుగవ భాగము --మైత్రేయి


44. నలభై నాలుగవ భాగము---  మైత్రేయి


         కుమారుడు మైత్రేయి గురించి వినియున్నాడు . ఈమె బ్రహ్మవాదిని కావలెనని ఆలాపిని దేవికి కోరిక . ఎక్కడో ఒకచోట , పెళ్ళిచేసుకొని ఆకుచాటు పిందెవలె ఉండనీ అని ఆమె తల్లిదండ్రుల ఇష్టము. అయినా తమ్ముడు అక్కగారి మాటంటే బహుళముగా గౌరవించెడి వాడు కాబట్టి స్వతంత్రించలేదు . అతడి భార్య కూడా భర్తమాటకు ఎదురాడునట్టిది కాదు కాబట్టి ఆమె కూడా పెళ్ళి చేసే తీరవలెను అని మొండికేయలేదు . ఇలాగ మైత్రేయికి , తల్లిదండ్రులు కూతురికి వివాహము జరిపించు వయసు దాటిపోయినది . బంధువులు కూడా ఆలాపిని మాత మనసు తెలిసినవారు కాబట్టి వయసు మీరిన ఆడపిల్ల ఇంట్లో ఉన్నదని ఆక్షేపించలేదు . మైత్రేయికి కూడా వివాహపు విషయములో అంత ఆసక్తి లేదు . 

         మైత్రేయి చాలా మంచి అమ్మాయి . కొండెక్కించి పొగడవలసినంత రూపవతి కాకున్ననూ పెదవి విరచునట్లు కూడా లేదు . ముఖములోని సౌమ్యత మనసులోని శాంతికి గుర్తుగా కనిపిస్తుండుటచే ఆమె సౌందర్య లావణ్యములు అంతగా గమనములోకి రావు . ఆమె తెలుపే అయిననూ ఆ తెలుపు గోడకు వేసిన సున్నపు తెలుపు కాదు . ఆ ముఖానికి పసుపు రాస్తే , పసుపు , తెలుపూ రెండూ కలసి ఏదో మనోహరముగా కనిపిస్తుంది . కనులలో చాంచల్యము లేక , స్థిరమైన దేనినో వెతుకుట కోసమే పుట్టినవి అన్నట్లున్నాయి . ఆ విశాలమైన వదనములో పైన కురులూ , కింద కనుబొమలూ పొందికగా ఉండి జీవన లక్ష్యమును రాసి పెట్టి నట్లుంటుంది ఆ ముఖము . నాసికా దండము చక్కగా ఉండి అంతఃకరణపు సరళతనూ , ముక్కుసూటి తనమునూ ప్రతిబింబించునట్లున్నవి . బుగ్గలు మరీ కోమలముగా ఉండి బాలభావమును ప్రతిబింబించునట్లేమీ లేవు , అలాగని తమ బిగిని పోగొట్టుకొని వేలాడుతూ వయసు మీరిన ప్రౌఢత్వము చూపునట్లేమీ లేవు . 

          వక్షస్థలము మాత్రము ఎత్తుగా ఉండి ఆ దేహపు యౌవనపు ప్రాదుర్భావమును సూచిస్తున్నది . దేహానికి యౌవనము వచ్చి బాల్య  , కౌమారపు హెచ్చుతగ్గులు వదలినట్లుంది . ఆమె నిలుచున్న భావము , ప్రౌఢ యొక్క స్థిర భావమూ కాదు , యౌవనపు పదార్పణ చేస్తున్న పదారేళ్ళ చంచల భావమూ కాదు . మొత్తానికి చూస్తే , శరీరముకన్నా మనసు ఎక్కువగా పెరిగినట్లున్న గుర్తులు కొట్టవచ్చినట్లు కనిపిస్తాయి . మనోహరములైన పువ్వులను పూసిననూ దానివలన గర్వమును రానివ్వని చెట్టు వలె , ఆమె తాను యౌవనవతి నన్న లక్ష్యమే లేని దాని వలె నిగర్వియై ఉన్నది . 

         కూమారునికి ఆశ్చర్యము. " ఏడు దినములుగా  కూర్చున్నచోటే కూర్చున్నారు " అని విన్నది నమ్మలేక పోయినాడు . జాగృత్తులోని ఒక్కనిమిష కాలములో , కలలోని ఏడెనిమిది దినములంత దీర్ఘమైన కాలమును అనుభవించుట మామూలే , కానీ దానికి విపరీతముగా , జాగృత్తులోని ఏడు దినములను సవితృదేవునితో మాట్లాడుచూ గడిపితినంటే నమ్ముట ఎలా ?  

" మీకు ఆకలి కాలేదా ? " మైత్రేయి అడిగినది . 

" ఇప్పుడవుతున్నది " 

" అలాగయితే పాలు తీసుకోండి " మైత్రేయి పాలతో నిండిన చిన్న చెంబును ముందు పెట్టింది . 

" బ్రాహ్మణ దేహము , స్నానము లేదు "

" ఆకలి ఎక్కువగా ఉందా ? తక్కువగా ఉందా ? "

" ఎక్కువగా ఉందనే చెప్పవలెను . మేరువును తిని సముద్రాన్ని తాగవలె నన్నట్లుంది "

" అలాగయితే నా మాట వినండి , మంత్ర స్నానము చేసి పాలు తాగండి . అది సరే , ఒక మాట . మీరు నిద్రలో ఉంటిరా ? "

" లేదు "

" అలాగైతే ఏడు దినములు మెలకువగా ఉండి ఎలా కన్నులు మూసుకున్నారు ? "

         కుమారుడు ఒక ఘడియ అనుభవమును చెప్పుటయా వద్దా అని ఆలోచించినాడు . మైత్రేయి బ్రహ్మవాదిని యవగలదని అతడికి తెలుసు . మెడ చూసినాడు  అక్కడ మంగళసూత్రము లేదు . సరే , చెరగు మాటున యజ్ఞసూత్రము ఉండవలెను ." ఇటువంటిదాని దగ్గర దాచిపెట్ట వలసిన అవసరము లేదు " అనుకొని తన అనుభవమును చెప్పినాడు . 

       మైత్రేయి అదంతా ఒళ్ళంతా చెవులు చేసుకొని విన్నది . చివరికి చిన్నగా నవ్వి , " మీయంతటి వారికే దేహాభిమానము పోలేదన్న తరువాత , అదెంత భద్రముగా ఉండవలెను , ఆ అభిమానము ! "  అన్నది .

యాజ్ఞవల్క్యునికి ఆమె మాట విని సంకోచము వంటి బిడియమైనది , " అదేమిటి ? అలాగంటావు ? " అని అడిగినాడు . 

        మైత్రేయి అన్నది , " మీరు ఉండినది దేవతా సాన్నిధ్యములో . అంతేకాక , ఉన్నచోటినుండీ లేవలేదు . శరీరమున్ననూ కూర్చుండుట తప్ప ఇంకేమీ చేయలేదు . ఇటువంటప్పుడు మీకు మైల అన్న భ్రాంతి ఎలా వచ్చింది ? నేను బ్రాహ్మణుడిని అంటే , బ్రాహ్మణాభిమానము తల్లిదండ్రుల నుండీ వచ్చిన దేహమును అనుసరించి వచ్చినది . కాబట్టి అలాగ అన్నాను." 

        మైత్రేయి వాదన యాజ్ఞవల్క్యుని మనసుకు నచ్చింది . " నువ్వు చెప్పినది సరిగ్గా ఉంది . బ్రాహ్మణుడు అగ్ని వలెనే ఎల్లపుడూ శుచియైననూ లౌకికాగ్నిని సంస్కారముతో వైదికాగ్నిగా చేసినట్లు చేయవలెను . కానీ ఇంతవరకూ దేవతా సాన్నిధ్యములో ఉండుట చేత ఇప్పుడు సంస్కారము అవసరములేదు : పాలు ఇవ్వు . త్రాగి ఆలాపినీ దేవి వారి దర్శనార్థము నేనూ వస్తాను " అన్నాడు .

         పాలు బాగా ఎర్రగా కాగి రుచిగా నుండినవి . వైశ్వానరుని తృప్తి పరచి యాజ్ఞవల్క్యుడు మైత్రేయితో పాటూ దేవివారి దర్శనార్థమై బయలుదేరినాడు . ఇటు  ఒక మడి వస్త్రాన్ని కట్టుకొని , ఒక ఉత్తరీయమును కప్పుకొని వెళుతున్న యాజ్ఞవల్క్యుడు , అటు అతనికి సమీపముననే చీరతో ఒళ్ళంతా కప్పుకొని పైన ఒక ఉత్తరీయమును కప్పుకొని వెళుతున్న మైత్రేయి. ఇద్దరూ వెళుతుంటే ఆశ్రమపు వీథి అంతా నిండినట్లున్నది . 

       కొంత దూరము వెళుతుండగా , మైత్రేయి ఏదో గంధమును ఆఘ్రాణించినట్లు ముక్కు పుటాలను వెడల్పు చేసి చూస్తున్నది . ఆమె వాసన ఎగబీల్చు ధ్వని అన్యమనస్కుడైన యాజ్ఞవల్క్యుని గమనమునకు వచ్చి , అతడు ఏమిటని అడిగినాడు . 

మైత్రేయి అడిగినది , " ఈ చుట్టుపక్కల ఎక్కడైనా కమలముల చెరువుందా ? "

" నాకు తెలిసి ఎక్కడా లేదు "

" మరి , ఎక్కడినుండీ ఈ పద్మ గంధము వస్తున్నది ? "

యాజ్ఞవల్క్యుడు నిలచి చూచినాడు . ఔను , పద్మ గంధము వస్తున్నది . ఇంకా పరీక్షగా చూసి నవ్వుతూ , ’ ఔను , వస్తున్నది ’ అన్నాడు . 

" ఎక్కడి నుండీ ? తెలుసా ? "

" అదంతా ఋషిమూలము , నదీమూలముల వలె అన్వేషణ చేయరాదు . " 

" అంటే , మీ ఒంటినుండే ? " 

" ఒకవేళ ఔనన్నాననుకో , నా ముల్లె ఏమీపోదుగా ? " 

మైత్రేయి ఉన్నపాటునే నిలచిపోయింది , " నిజంగానా ? " అడిగింది . 

యాజ్ఞవల్క్యుడు తలాడించాడు . ’ ఔను ’ అని నోటితో చెప్పలేదు , అంతే ! 

మైత్రేయి సంతోషపడింది . " యోగులు , ఇది భూతజయపు ఆరంభము అంటారు . పృథ్వి పక్వమైనదాని గుర్తుగా ఈ సువాసన వస్తుందంట ! " అన్నది . 

యాజ్ఞవల్క్యుడు తానూ అలాగే విన్నానని అన్నాడు . 

      దారిలో మరలా ఎవరూ ఒకరినొకరు మాట్లాడించలేదు . మైత్రేయికి , " ఇటువంటివాడితో ఎల్లపుడూ చర్చిస్తూ ఉంటే ? " అని యోచన. యాజ్ఞవల్క్యునికి , " ఇలాగ ఉపచారము చేయు వారొకరుంటే నేనెంత తపస్సు చేయవచ్చునో " అని యోచన. 

       దేవి ఇంటి తలవాకిటికి వచ్చి మేనకోడలిని నిరీక్షిస్తూ నిలుచున్నది . అంతలో వారిద్దరూ మలుపు తిరిగి కంటికి కనబడ్డారు . ఆమెకు , " వీరిద్దరూ దంపతులైతే ! " అనిపించింది . వెంటనే , " నేనే ఈమెను బ్రహ్మవాదిని కమ్మని ప్రేరేపించినదానను . ఇప్పుడు ఈ వయసైన తర్వాత వివాహమంటే నవ్వుతారు " అనుకున్నది . దానితోపాటు , ’ యాజ్ఞవల్క్యునికి కన్య ఒకతె నిర్ణయింపబడినది కదా ! ఇంకేమిటి , మనసే ఇటువంటి తగని సంబంధాలను కల్పిస్తుంది , ఆకాశమునకు నిచ్చెన వేసే యోచనయే తప్ప ఈ ప్రారబ్ధానికి వేరే పనిలేదా ? ’ అనుకున్నది . ఆవేళకు వారిద్దరూ వచ్చినారు . 

        కుమారుడు ప్రణామము చేసినాడు . అత్తకు కోడలు , అతడి శరీరమంతా సుగంధాయమైనది సైగతోనే తెలిపింది . అయినా ఆమెకు హాస్య ప్రవృత్తి ముంచుకొచ్చి , " ఏమిటమ్మా ! అందరూ అన్నట్టే అయింది . ఆడది బ్రహ్మ విద్య దారిలో నున్న విఘ్నము అన్న మాట నిజము చేసినావు . పదునైదు దినములనుండీ లోకపు సంగతే పట్టక కనులు మూసుకొని కూర్చున్న వాడిని బహిర్ముఖుడిగా చేసి, అది చాలదన్నట్టు పట్టి తెచ్చినావే ! " అన్నది .

       మైత్రేయి కూడా హాస్యమును ఒప్పుకుంటూ , " అదేమి పెద్ద విషయములే , అలాగ విఘ్నముగా మారునది కావలెనన్న, విఘ్నమును దాటించునది కూడా కాగలదు . వీరు ఏడు దినములనుండీ సమాధిలో నున్నది తెలుసు , నువ్వు పదునైదు దినములంటావే ? " అన్నది.

        " ఔను , ఈ దినము చవితి . పోయిన శుద్ధ చవితి నాడు కన్నులు మూసి కూర్చున్నాడు ఈ పుణ్యాత్ముడు ! రెండు దినములు , పాలను పిల్లవాళ్ళతో పంపించినాను . వారు పిలచి , అరిచి , ’ ఏమిచేసినా యాజ్ఞవల్క్యుడు కళ్ళే తెరచుట లేదు , కావాలని అలాగే కూర్చున్నాడు " అన్నారు . ఇలాగ కాదని , మరుసటి దినము నుండీ నేనే పాలు తీసుకొని వెళ్ళుచుంటిని . నువ్వు వచ్చినది దశమినాడు . ద్వాదశినుండీ నువ్వు తీసుకొని వెళ్ళుచున్నావు . " 

          యాజ్ఞవల్క్యుడు ఏమో అడుగవలెనని తలయెత్తినాడు. ఆమె నవ్వుతూ అన్నది : " ఇది నాకేమీ కొత్తది కాదు . మా వారు ఎక్కడికో వెళ్ళినారు అని నేను అప్పుడపుడు చెపుతుంటాను కదా ? అదేమనుకున్నావు ? వారు కూడా నీవలెనే సమాధిలో కూర్చుంటారు . అప్పుడు ఒళ్ళంతా కళ్ళుగా వారిని కాపలా కాయుట అభ్యాసమై పోయినది . అందుకే నీ స్థితిని తెలుసుకొని , ఎవరివల్లా నీకు ఇబ్బంది , ఆటంకము కాకూడదని , ఎవరూ ఆవైపుకు వెళ్ళకూడదు అని విధాయకము చేసి నేనే నీకు పాలు తెస్తుంటిని . ఏమే ? నీకు నేను చెప్పలేదేమే ? వారుగా కనులు తెరిచి పాలు తీసుకుంటే సరే , నువ్వు అరిచి పిలచీ లేపవద్దు అని ? " 

         " ఈపూట కూడా నువ్వు చెప్పినట్లే చేసినాను అత్తమ్మా , అడుగు ! నేనుగా వారిని పిలవలేదు . ఏదో ఒక ఘడియ నిలుచొని ఉందామా అనిపించి నిలుచున్నా. అంతలో వారే కనులు తెరచినారు "

" సరే , మనసులోని భారము దిగిపోయింది . ఏమి, యాజ్ఞవల్క్యా ? పంచాత్మ సంక్రమణ విద్యను సాధించినావా ? " 

" అదింకా నాకు సరిగ్గా తెలీదు , కానీ ...." 

       " చింతించవద్దు. అమ్మాయి కూడా బ్రహ్మవాదిని అగును . ఈ దినము కాకపోతే రేపైనా ఈ అనుభవములన్నిటినీ పొందగలదు . అమ్మాయి ఉందని చింత లేదు , చెప్పు . " 

       " నేను పంచాత్మ సంక్రమణ విద్యను సాధించవలెను అనే కూర్చున్నాను . అయితే , నాకు గుర్తున్నంతవరకూ , నాకయినది పంచ భూత దర్శనాదులు ." అని అతడు ఆమెకు క్లుప్తముగా తనకయిన అనుభవమునంతా చెప్పినాడు . 

       ఆమెకు యాజ్ఞవల్క్యుని పతికి చూపించవలెనని ఆశ కలిగింది . అయితే వారు ఇప్పుడే విశ్రాంతికి వెళ్ళినారు . వారిని లేపితే ఏమో  లేపకుంటే ఏమో అని ఆలోచన. ఏమి చేయవలెనో తోచక ఆమె ఇలాగే సతమతమవుచుండగా పక్క గది తలుపు తెరుచుకుంది . ఉద్ధాలకులే స్వయముగా బయటికి వచ్చినారు . " ఓహో ! యాజ్ఞవల్క్యుడా ! " అని ఆశ్చర్యముతో అలాగే నిలుచున్నారు . 

ఆలాపినికి అది ఆశ్చర్యమైనది . వారు ఆశ్చర్య చకితులగుటను ఆమె ఎప్పుడూ కలలో కూడా చూచియుండలేదు . 



43. " మహాదర్శనము "--నలభై మూడవ భాగము --పంచభూతముల ప్రత్యక్షము


43. నలభై మూడవ భాగము--పంచభూతముల ప్రత్యక్షము


         ఇప్పుడు యాజ్ఞవల్క్యునికి వేరే ఆలోచనే లేదు . పగలూ రాత్రీ ఒకటే ఆలోచన. అది , పంచాత్మ సంక్రమణ విద్యను పూర్ణముగా కరగతము చేసుకోవలెనని ! . పుష్కలముగ ఆహారము సేవించిన వన్య మృగము ఆ ఆహారపు పరిణామము కోసము ఏకాంతమైన గుహను ఆశ్రయించినట్టే ఇప్పుడు అతడు ఏకాంతముగానున్న తన గుడిసెలో ఉన్నాడు . ఇప్పుడతనికి ఆహారపు యోచన కూడా లేదు . అలాగని , ఆహారము వద్దు , ఏమో మందమయినది అనునట్లు కూడా లేదు . దేహమంతా లఘువుగా చురుకుగా ఉంది . మనసు సంపూర్ణముగా జాగ్రతమైనది . ఇంద్రియములలో బడలిక యేమీలేదు . 

          కుమారుడు తన విహిత కర్మలను ముగించి , నిత్యజపము చేసుకొని తనకు దేవతానుగ్రహము వలన ప్రాప్తమైన పంచాత్మ సంక్రమణ విద్య అను యోగమును క్షేమముగా చేసుకొను కార్యములోనున్నాడు . ఇప్పుడు కుమారుడు కనులు మూసినా తెరచినా తన ఎదురుగా తానే కనిపిస్తున్నాడు . ఎవరైనా అతడి దగ్గరకు వస్తే ,  అతడికి ఆ వచ్చినవారు ఎవరు అనునది అర్థము కావలెనంటే , కళ్ళెదుట ఉన్న బింబము చెదరి వారి ముఖము కనబడవలెను . లేదా , వచ్చినవారు మాట్లాడితే చెవిద్వారా గుర్తించవలెను . అలాగయినది . ధ్యానములో కూర్చొని ఇంద్రియముల వైపుకు పోవుచున్న మనసును ప్రార్థన చేసి కుమారుడు కూర్చున్నాడు . బింబము ఎదురుగనే ఉంది . ధ్యానము ఏకాగ్రమగు కొలదీ బింబము కూడా శుద్ధమగుచున్నది . చివరికి మాట్లాడుతున్నది . " నీకు ఇప్పుడు పంచాత్మ సంక్రమణ విద్య కరగతమైనది. అయితే అదింకా సీమారేఖలలో ఉన్నదే తప్ప వివరములు తెలియవు . నేను అన్నమయ కోశపు బింబమును , నిజమే . అయితే , ఈ ప్రాణమయ , ఆ మనోమయ కోశములు రెండూ నావలన ప్రభావితములైనవి . నేను ప్రాణము వలననే పుట్టినవాడిని , అదీ నిజమే . అయితే , నేను పెరిగిన తర్వాత ప్రాణమయ కోశము నా ప్రభావమునకు లోనైనది . కాబట్టి నన్ను బాగుగా తెలుసుకో . ఆ తరువాత వీటిని తెలుసుకొనుట సులభమగును . "

" నిన్ను తెలుసుకొనుట ఎలాగ ? "

" నన్ను తెలుసుకొనుట యంటే , నన్ను కట్టిఉన్న పంచభూతములను ఒక్కొక్క దానినీ ప్రత్యేకముగా తెలుసుకొనుట. ఇప్పుడు నువ్వు సిద్ధముగా ఉన్నావా ? "

" సిద్ధముగా ఉన్నాను "

         " చూడు , ఇప్పుడు స్థూలముగా చెప్పెదను . గట్టిగా ఉన్న భాగములన్నీ పృథ్వి , ద్రవముగా నున్నదంతా జలము , ప్రకాశముగా నునదంతా తేజస్సు , చలనముతో కూడియున్నదంతా వాయువు . డొల్లగా  నున్నదంతా ఆకాశము . "

" దేహములో ఏ భాగమును చూచినను ఈ ఐదు భూతములూ ఉన్నపుడు , ఈ పంచభూతములను వేర్వేరుగా చూచుటెలా ? "

          " బాగా అడిగినావు . ఇప్పుడు నువ్వు పృథివ్యాది పంచ భూతములను వేరువేరుగా ధ్యానించు . నువ్వు అగ్ని , ప్రాణ , ఆదిత్యుల కృపను సంపాదించినవాడివి . నీకవి దర్శనమిచ్చును . "

          కుమారుడు అలాగే చేసినాడు . అతడికి , ’ తనను ఎవరో ప్రేరేపిస్తున్నారు , బింబమున కూర్చొని ఎవరో మాట్లాడుచున్నారు ’ అన్న భావన. అయితే దానిని వెనుతిరిగి చూచుటకు ఇష్టములేదు . ఏదో ప్రవాహమున చిక్కి కొట్టుకొని పోతున్నవాడివలె ఉంది . పృథివిని ప్రత్యేకముగా అతడెప్పుడూ ప్రార్థించి యుండలేదు . అయినా ప్రార్థన బయలువెడలింది . " పృథ్వీ భూత స్వరూపురాలవై నిలచి అన్నిటికీ నిలయమైయున్న ఓ పృథ్వీదేవీ , నాకు  దర్శనమును అనుగ్రహించు . నీ దర్శనము నాకు సుఖకరముగా ఉండనీ . మా అందరినీ అనుగ్రహించు . నీ దర్శనము వలన మాకు ఏ హానీ కలుగకుండనీ . నీకు నమస్కారము , నీకు నమస్కారము . "

          బింబము ఎదురుగా అలాగే కూర్చున్నది . అయితే ఏదో వ్యత్యాసము ఉన్నది . నల్లగా ఉన్న ఆడది. కనులు దేదీప్యమానములై , ఉజ్జ్వలములై ప్రకాశముగా నున్నవి . కళ్ళతోటే సర్వమునూ ఆకర్షించునట్లు కనిపిస్తున్నది .ఆ ముఖము కళ్ళవలన ఉద్దీప్తమగుచున్నది . కళ్ళు లేనిచో , ఆ ముఖమే కనపడదేమో అన్నట్లున్నది .. అలాగ ఆ శరీరమంతా అంధకారావృతమై ఉన్నట్లుంది . అయితే , ఆ అంధకారములో కూడా అదేదో విధమైన ప్రకాశమొకటుంది . అది లోకములో కనిపించు ప్రకాశము కాదు : ప్రభ కాదు . అలాగ అంతా తానేయై కూర్చున్న బింబమొకటి ప్రకాశిస్తున్నది . కుమారుడు పూజించినాడు .  

          ఆ బింబము సహజమైన మాతృ వాత్సల్యముతో మాట్లాడుచున్నది . " కుమారా , నన్నుచూడాలనుకున్నావు . ఇదిగో చూడు . నన్ను చూచిన వారికి కంటిలో దృష్టి ఉండదు . నా దృష్టిలో వారి దృష్టి చేరును . కానీ నువ్వు ముందే ప్రార్థన చేసినావు కాబట్టి , దేవకార్యార్థమై నేను నీకు దర్శనమిచ్చినాను . ఇక నా విచిత్రమైన మహిమను చెప్పెదను విను . పరమాత్ముడి సత్య స్వరూపము యొక్క బాహ్య రూపమును నేను . నేను ఉన్నచోటెల్లా స్థైర్యమును ఇస్తాను . సర్వమునకూ ఆధారమైనదానిని నేను . వ్యక్తి యొక్క వ్యక్తిత్వమునకు కారణము నేను . నా అనుగ్రహము లేనిదే ఎవరూ వృద్ధికి రాలేరు . నీ దేహపు బింబములో కూర్చొని నన్ను చూడమని అన్నారు కదా , వారిని అడుగు . ఇప్పుడు కాదు , తరువాత అడుగు . మేము దేవతలము . ప్రత్యక్ష ప్రియులము కాదు . పరోక్షములో నిలచి సర్వమునూ ఆడించెదము . ఇప్పుడు చూడు , నా దయ కలిగినది . ఇప్పుడు నువ్వు కావాలంటే ఆకాశములో ఎగురవచ్చును . "

          కుమారుని తొడల నుండీ కింది భాగము ఏదో విచిత్ర పరివర్తన చెంది , అతడు పక్షి వలె తేలికయైనాడు . కాళ్ళూ చేతులూ ఉన్నవి , అదే దేహము . అయినా ఇప్పుడు తూకము లేదు . ఎవరో అన్నారు ," ఎగిరి రా , నీకు అనుభవము కలుగు వరకూ నీకు నమ్మకమెలా కలుగును ? "

          కుమారుడు మేఘ మండలము వరకూ ఎగిరినాడు . అక్కడ ఒక విచిత్రము కనిపించినది . అక్కడ ఇంకొక దేవి . శుద్ధ వస్త్రమును కట్టుకొని , ప్రసన్నయై ప్రకాశమానముగా కూర్చున్నది . కుమారుడు ఆమెను చూసి నమస్కారము చేసినాడు . ఆమె తన విశాలమైన కన్నులతో తన చుట్టూ పరిసరాలను వెలిగింపజేస్తూ , " కుమారుడు రావలెను , నా చెల్లెలు పృథ్వీ పంపించినదా ? నేను ఆమె అక్కను , జలదేవిని . నన్ను చూచినవారు నాలో కరగిపోయెదరు . కానీ నువ్వు దేవతానుగ్రహ సంపన్నుడవు . కాబట్టినీకు నా అనుగ్రహము ఉన్నది . నువ్వు ఇంకా ముందుకు వెళ్ళు . ఇప్పుడు నిన్ను నువ్వు చూసుకో , ఏమి వ్యత్యాసమైనదో తెలుసుకొని పైకి వెళ్ళు . " 

          కుమారుడు తనను తాను చూసుకున్నాడు . దేహమంతా గాజుబొమ్మ యయినది . అతడి చూపు కు ఏ అడ్డమూ లేకున్నట్లున్ననూ ఏది చూచినా ప్రవహించు నీటిలో చూస్తున్నట్టుంది . దేహము పూర్తిగా తేలికయై , ఏ మాత్రము భారమూ లేక యున్నది . అతి లఘువుగా నున్నది . దేహమును ఒకచోట నిలుపుటకు కూడా అగుట లేదు . అయితే , దాని సీమారేఖలు , ఇది చేయి , ఇది కాలు , ఇది తల అను బయటి రేఖలున్ననూ స్పష్టాస్పష్టముగా నున్నవి . తన దేహమును చూచుకొనుట మాని అతడు ఆమెకు పూజ చేసినాడు . 

         రెక్క బలమును చూచుకొనుటకు రెక్కలు కొట్టు పక్షి వలె దేహము పైపైకి పోవుచున్నది . ఇంకో ఘడియలోపల దేహము బాగా పైకి పోయి , పొగవలెనే వాయుమండలములో చలిస్తూ ఇంకా పైకి పోవుచున్నది . 

          ఎదురుగా ఎర్రగా ఉన్న పురుషుడొకడు , ఎర్రటి బట్టలు , ఎర్రటి నగలూ , ఎర్రటిమాలలు హారములూ ధరించిన వాడు కనబడినాడు . ఆతడు , " కుమారా , నా దర్శనము చేసి ముందుకు వెళ్ళుము . నా ఇద్దరు సహోదరీ మణుల అనుగ్రహము పొందినవాడివి నా అనుగ్రహమును కూడా పొందుము " అన్నాడు . కుమారుడు నిలచి అతడికి పూజ చేసినాడు .

          ఆతడు పూజ వలన ప్రసన్నుడై , ’ నేనే అగ్నిని . పంచ భూతములలో మధ్యముడను . న్యాయంగా అయితే నన్ను చూచినవాడు నాలో కలసిపోవలెను . కారణాంతరముల వలన నీకు అలాగ జరగదు . నా అనుగ్రహమును నా అంతట నేను నిన్ను అడిగి మరీ ఇస్తున్నాను . ఇక్కడ కలిగిన వ్యత్యాసములను చూచుకొని ముందుకు వెళ్ళు " 

          కుమారుని దేహములో కనపడు చుండిన స్పష్టాస్పష్టత , ఏదో నీటిలో చూస్తున్నట్లుండినదీ ఇప్పుడు లేవు . దేహము , ఇటువైపు నుండీ చూస్తే అటు వైపు పారదర్శకముగా కనిపించు గాజుపలక వలె అయినది . మొదటి లావు , పొడుగు , వెడల్పు వంటివి ఉన్నా , ఇప్పుడవన్నీ తేజఃఫలక మైనట్లు , స్ఫటికమయ మైనట్లు కనిపించుచున్నవి . ఇప్పుడు దేహపు ధృవ చలనము తప్పి , ఎటువైపు అంటే అటువైపుకు పోవుటకు సిద్ధమైనది . అగ్నికి నమస్కారము చేయునంతలోనే కుమారుడు గాలితో పాటు గాలియై తేలిపోవుచున్నాడు . ఇంకొక వ్యత్యాసము , చిగురులో నున్న కంపనపు కదలిక యున్నను అంగాంగములూ ప్రత్యేకముగా ఉన్నట్లు అనిపించదు . ఏమి కావాలన్ననూ పట్టుకోవచ్చు, అయితే చేతులున్నట్లు అనిపించదు . ఎక్కడికైనా పోవచ్చును కానీ కాళ్ళున్నట్లు అనిపించదు . కనిపిస్తున్నట్లున్నా కళ్ళు లేనట్లూ , వినిపిస్తున్నట్లున్నా చెవులు లేనట్లూ , వాసన , రుచి , దర్శనమూ ఇవేవీ లేనట్లుంది . అయినా నీటిలో మునిగినట్లు ఒక స్పర్శ ఉండి  , అన్ని ఇంద్రియముల పనినీ చేస్తున్నది .  

          అలాగే తేలుతూ , అక్కడికీ ఇక్కడికీ తిరుగుతూ ఎంతో సేపు అయి ఉంటుంది . అప్పుడు ఒక గాలి బలంగా వీచినట్లై ఒక పురుషుడు కనిపించినాడు . ఆ పురుషుడు ఎటువంటి బట్టలు కట్టుకున్నాడు ? ఏమి కప్పుకున్నాడు ? ఎలాగున్నాడు ? అనే వివరాలేమీ కుమారునికి తెలియుట లేదు . అలాగని తెలియదు అనుటకునూ లేదు . అంతే కాదు , రూపమే స్పష్టముగా లేదు . అయినా అర్థమగుచున్నట్లుంది . వచ్చినవాడే మాటాడించినాడు :

         కుమారా , నువ్వు ఇక్కడి వరకూ వచ్చినది చాలా సంతోషముగా నున్నది . నువ్వు వస్తావని తెలుసు. నేనే వాయువు. అన్నిటికీ కారణమైన వాడిని నేను . నేనే నీ దేహము ఏర్పడుటకు ముందే నీ తల్లి గర్భమును ప్రాణముగా చేరి నీ దేహము ఏర్పడుటకు కారణమైన వాడను . చూడు , ఈ నా రూపమును చూచినవారు నాలో చేరిపోవలెను . కానీ , నీవలన ముందు ముందు ఇంకా కార్యములు జరగవలెను కాబట్టి నువ్వు ముందుకు వెళ్ళు . అయితే మా అన్న ఆకాశుడి వద్దకు వెళ్ళినపుడు ఒకటి గుర్తుంచుకో. అక్కడికి వెళ్ళి అతడిని చూచినవారంతా అతనిలో లయము కాక తప్పదు . నువ్వు , ’ అస్తి ,  నువ్వే చివర కాదు , నీ ముందు ఇంకా ఏదో ఉంది , అదే నేను ’ అనుకుంటూ ఉండు . లేకపోతే నువ్వు లయమై పోతావు . నామరూపాలు లేకుండా పోతావు . వెళ్ళిరా. నీకు శుభము కలగనీ " అని అనుగ్రహించినాడు . 

          కుమారుడు తన స్వభావానుగుణముగా అతడికి పూజ చేయవలెను. అయితే సాధ్యము కాలేదు . అతడప్పటికే వెళ్ళిపోయినాడు . కుమారునికి పరమ తేలికగా నున్న తన శరీరములో ఏదో ఒకటి వదలి పోయినట్లాయెను . ఇప్పుడు కుమారునికి తానొకడు ఉన్నాను అన్నది తప్ప ఇంకేమీ తెలియదు . తన రూపము తనకు తెలియుటతో పాటు ఏదో ఒక శబ్దము మాత్రము వినిపిస్తున్నది . తానున్న చోటే ఉండి వ్యాపిస్తున్నది . ఏదో ఉన్నట్టు , అదంతా ఉన్న చోటే లయమై , సజాతీయమైన ఏదో ఒక అనిర్దిష్ట పదార్థములో చేరిపోయినట్లు బోధ యగుచున్నది . అయిననూ ’ అహమస్మి ’ యనెడు అస్మితారూపము ఉన్నట్లనిపించుతున్నది . ఇంకో విశేషమేమంటే , ఏదో అనిర్వచనీయ శబ్దము అంతటా నిండినట్లుండి , తానుకూడా శబ్దరూపుడిని యైనట్లు తోచుచున్నది . 

          అయితే అది లౌకిక శబ్దము కాదు . లౌకిక శబ్దము వాయు వాహనమై ఆహత శబ్దముగా తరంగ తరంగములుగా వస్తుంది . కానీ అక్కడ తరంగ రహితమైన ఏదో శబ్దము ఉంది . కుమారునికి ’ ప్రత్యభిజ్ఞ ’ ( ఎదుటి దానిని గుర్తించు జ్ఞానము ) ఎక్కడనుండో వచ్చింది . ఆ శబ్దము తనకు తెలిసినదే యన్నట్లు , తానుకూడా ’ ఓం ’ అంటున్నాడు . అనంతమైన ఆ ప్రవాహములో అతడూ ఓంకార రూపమై లయము కావలెను. స్థిరములో స్థిరుడై సరిపోవలెను . అంతవరకూ కనిపించని ఏదో ఒక విలక్షణ స్థితి ప్రాప్తమైనది . అంతలో ప్రత్యభిజ్ఞ మెరసి , ’ అస్తి ’ అంటున్నది . విలయన క్రియ ఆరంభమై , తనను ’ తాను ’ అని తెలుసుకొనుటకు కావలసిన ఆవరణ జ్ఞానము కుంటు పడిపోవుచుండుట దృఢమగుతున్నది . మరలా ఓంకారము , మరలా అస్మితా వృత్తి . అయితే ఆ వృత్తికిప్పుడు గట్టు , తీరము ఏమీ ఉన్నట్లు లేదు . ఉన్నదంతా ఒకటే ఒకటై రెండోది ఏమీ కనపడక , అస్మితావృత్తి ( నేను అన్న భావము )  మాత్రము అంతా నిండి పోయింది . దానిని వృత్తి యనుటకూ లేదు , ఇంకేమనవలెనో కూడా తెలియదు . అదొకటీ ఉన్నపుడు ఇంకేదైనా ఉందా అంటే ఏమీ ఉన్నట్లు లేదు . ఒకటి అను లెక్కకు సరిపోయినా , లెక్కించుటకు వీలు కాని ఏదో ఉంది . అనంతముగా ఉంది యని బోధపడుచున్ననూ తాను ’ సాంతము ’ అనీ , అనంతము  ’ దానికవతల ’  ఉన్నదను శ్రద్ధ పెరుగుచున్నది . 

          ఆ బట్టబయలులో కుమారునికి తన నామ రూపములు మరచినట్లుంది . తాను ఒక శబ్దము : అయితే ఆ శబ్దము అక్కడున్న శబ్దముకన్నా ప్రత్యేకమైన శబ్దము కాదు . అదీ అనాహత శబ్దమే , తానూ అనాహతమే అని బోధపడుచున్నది . కానీ అక్కడ విషయము లేదు , వినిమయమూ లేదు . నువ్వు అనువారు లేని ఆ మహార్ణవములో ఏమనవలెను ? 

          అలాగ కొంత సేపు ఉన్నపుడు అక్కడ కూడా కాలపు అస్తిత్వము వచ్చినట్లైంది . ఇదే ఆకాశము అని అర్థమగుచున్నది . అర్థమయినదే ఆలస్యము , అక్కడున్న శబ్దము ఆహతము ( రాను రాను అణిగిపోవునది -ఆహతము )  వలె మారి అక్కడ చలనము కలుగుతున్నది . ఆ చలనము తెలిసే లోపలే ఇంకేదో వచ్చి చేరుతున్నది . దానిని తెలుసుకొనే లోపలే కళ్ళు లేనివాడికి కనులు పుట్టుకొచ్చినట్లై చలనబోధతో పాటు వచ్చిన స్పర్శతో పాటు ఇప్పుడు దర్శనము లభించినట్లై తాను దృక్ అగుచున్నాడు . చూసుకోవాలి అనిపించి చూస్తుండగా అంగాంగములూ ఉన్నది కనిపిస్తున్నది . అలాగ చూస్తుండగనే  గాజు పాత్రలో నీరు నింపినట్లై తాను భారమగుచున్నాడు . అలాగ బోధ యగుచుండగనే నీరు తోడు పెట్టినట్లై మొదటి భారము తెలుస్తున్నది . తాను వెనుక కూర్చున్నచోటే కూర్చున్నాడు . తన ఎదురుగా తన బింబము కూర్చున్నది . 

బింబము అడిగింది , ’ చూచితివా యాజ్ఞవల్క్యా , ఈ నీ దేహమైన నన్ను , ’ మందిరాన్ని కట్టు ఇటుకలవలె ’ కట్టిన పంచభూతములనూ చూచితివా ? 

" నువ్వు అనుగ్రహించినావు . ఆ అనుగ్రహ రూపముగా పృథివ్యాది పంచభూతముల దర్శనమైనది . "

         బింబమన్నది , " నువ్వు ధన్యుడవు యాజ్ఞవల్క్యా , పంచభూత దర్శనమునకై ఉన్ముక్తులగు వారే అతి తక్కువ. వారిలోనూ , ఒక్కొక్క భూతమును చూచి దానిలో లయమైపోవు వారే ఎక్కువ. కానీ నువు అయిదు భూతములనూ చూచి వచ్చితివి కదా ! "

" అంటే , ప్రతియొక్క భూతమూ తనను చూడ వచ్చినవారిని తనలో లయము చేసుకొనునా ? " 

" మరి , ఇంకేమనుకున్నావు ? నీకు వాయ్వాది చతుర్భూతములూ ఆ మాటను స్పష్టముగా చెప్పలేదా ? వాయువు , ఆకాశములో వెళ్ళినపుడు ఏమవుతుందో చెప్పినాడు , మరచావా ? "

" మరువ లేదు  , గుర్తుంది "

         " చూడు , భూతములకన్నిటికీ  తమ తమ ప్రత్యేక మైన గతులున్నాయి . తమకు తామే అవి చేసుకున్న ఆ గతులను తెలిసినవారు , ముందుకు వెళ్ళవలెను అను ఉద్దేశము కలవారైతే ఆయా భూతములను దాటగలరు . ఎలా ఎలా వెళ్ళిననూ , చివరి ఆకాశ భూతపు విలయన గతిని దాటుట కష్టము . అందుకే , తెలిసినవారు , " అస్తీత్యైవోపలబ్ధవ్యః " ( అస్తి ఇతి ఏవ ఉపలబ్ధవ్యః -అస్తి అనియే  అతడిని పొందవలెను ) అన్నారు . ఎవరు ఉపాసకులో వారిని ఉపాస్య దేవత ముందుకు పిలుచుకొని వెళ్ళును , మరియు , వారు నీవలెనే సుఖముగా వెనుతిరిగి వస్తారు . లేకపోతే అక్కడే ఉండిపోవలసి వస్తుంది " 

" ఇదంతా నీ దయ వలన జరిగింది . దానికోసము మరియొక సారి నీకు నా నమస్కారము " 

        " ఇక్కడే నువ్వు మోసపోయినది . ఎంతైనా నేను శరీరమును . అందులోనూ పార్థివాంశ ఎక్కువగా ఉన్న శరీరమును . కాబట్టి నాలో జడధర్మమే ఎక్కువ. ఏదేమైనా , పృథ్వీభూతమును సాక్షాత్కరించి ఇచ్చుట తోనే నా సామర్థ్యమంతా ముగిసింది . " 

" దాని కోసమైనా నమస్కారమునూ , పూజనూ ఒప్పుకో " 

        " ఇది సరియైన ధర్మము . పెద్ద దానినే చూపియున్ననూ , చిన్న వాడినైన  నాకు పూజను అర్పించుతున్న నీకు మంగళమగు గాక . నీ పూజను నేను ప్రసన్నముగా స్వీకరించెదను . ఇక చూడు , నిన్ను తినివేయుటకు సిద్ధమైన ఆ భూతములను ప్రసన్నముగా చేసిన ఆ ప్రభువు ఎవరన్నది చూడు . "

        కుమారుడు చూచినాడు , : తేజోమయమైన దేహముతో దివ్య వస్త్ర మాల్యాంబరములతో భూషితుడైన దేవుడొకడి దర్శనమయింది . కుమారుడు పూజ చేసి , పరిచయమును కోరినాడు . వచ్చినవాడు నవ్వి , " నేను సవితృ దేవుడిని . సృష్టికి వచ్చు ప్రతి ప్రాణియూ మాతృ గర్భమునుండీ బయటికి రావలెనంటే నా అనుమతి కావలెను . ప్రతి దేహములోనూ నేనుంటాను . సరే , పంచభూతముల దర్శనమయిందా ? "

" నీ అనుగ్రహము వలన అయినది , దేవా! "

" సంతోషము . పంచభూతముల దర్శనము వలన నీకు కలిగిన ప్రయోజనమేమో తెలిసిందా ? " 

" కవచమును ధరించిన వీరయోధుని వలె నేను అంగాంగ సమేతుడనై ఈ దేహమును ధరించినాను " 

" ఔను , ఇది ఒక మహత్వ పూర్ణమైన లాభము , ఇప్పుడు ప్రపంచమంటే ఏమిటో చెప్పు " 

" ఈ ప్రపంచము నా వలెనేనున్న దేహధారుల సమూహము . "

" దేహధారి ఎవరు ? దేహమనగానేమి ? అది చెప్పు "

        " దేహము పంచభూతముల నుండీ కట్టబడిన గూడు . శాస్త్రపు ప్రకారమైతే అది క్షరము ( వ్యర్థమగునది )  . ఆ క్షరము నశ్వరమైనది . ( నశించునది ). నశ్వరమైన ఆ గూటిలో అవినశ్వరమైన ( నాశనము లేని ) చేతనము ఒకటి ఉంటుంది . అదే దేహధారి . శాస్త్రపు ప్రకారము అది అక్షరము . " 

" ఒకదానిని పట్టుకొని ఇంకొకదానిని వదలివేయ వచ్చు , కదా ? "

" అది సాధ్యము కాదు అని తోచుచున్నది , దేవా ! . ఉంటే రెండూ ఉండవలెను . లేదంటే రెండూ లేవు అనిపిస్తుంది . "

          " ఔను , అదే మన మార్గము . అయితే అనేకులు , ఈ మార్గమును ఎంచుకోరు . క్షర-అక్షరములు రెండిటినీ గౌరవించు మార్గము మనది . సరే , అలాగయిన , లోకోద్ధారము అంటే ఏమిటి ? అది ఎవరి వలన కావలెను ? " 

         " అక్షరమును మూసియున్న క్షరము యొక్క శుద్ధీకరణమే లోకోద్ధారము . తాను శుద్ధుడైనవాడు ఆత్మోద్ధారము చేసుకున్నవాడు . అటువంటి వాడే లోకోద్ధారము చేయగలడు . ఇతరుల వలన సాధ్యము కాదు . ఇదేమిటి దేవా , నీ మాటను నా నోటిలో పలికిస్తున్నావు ? అవునా ? "

         " ఔను . మేము ఎప్పుడూ అటులనే ! మేము చేయు కార్యపు భారమును ఇతరుల మీద మోపెదము . ఎవరైనా , మేము కర్తలము అని ముందుకొస్తే చాలు . మేము అక్కడినుండి విరమించెదము . ఇది మా రహస్యము . ఇప్పుడు చెప్పు , బాగా గమనించి చూచి చెప్పు , ఈ లోకపు వ్యాపారపు మూలము ఎక్కడ ఉంది ? "

          కుమారుడు వెదకి చూచినాడు . ఎక్కడ చూచిననూ , తాను చేసినాను అను కర్తృత్వపు అహంకారము . చేయలేకపోతే , పరులే అడ్డు వచ్చినారు . కార్యమయితే అహంకారము కొంత పెరుగును . కాకున్న , ఇంకొకరి వలన ఆగింది అని వారిపై ద్వేషము . ఆ ద్వేషము కూడా అహంకారమును వేరొక రీతిలో పెంచును. మొత్తానికి ముందుకు తోసినా పొట్టు , వెనక్కు లాగినా పొట్టు అను ఱంపపుకోత అనే వ్యాపారము వలె కార్యము సఫలమైనా , విఫలమైనా , అటైనా , ఇటైనా మొత్తానికి అహంకారపు వివర్ధనము . చివరికి లోక వ్యాపారమంటే చెట్టు వంటిది-చిగురు వేసినా చెట్టు పెరిగినట్లే , ఆకులు ముదిరినా చెట్టు పెరిగినట్లే . అదెట్లో , అటులనే అహంకారపువృద్ధి -- పూర్వ రూపములో అహంకార విజృంభణము , ఉత్తర రూపములో అహంకార వివర్ధనము . ఇంక వేరేమీ ఉన్నట్లు కనపడదు .

         కుమారుడు సవితృ దేవుడికి నివేదిక ఇచ్చినట్లు అప్పజెప్పినాడు , " దేవా , ఇదేమిటి ? ఎక్కడ చూచినా తాను , తాను , తాను అనునది తప్ప ఇంకేమీ ఉన్నట్లు లేదు . తాను చేయవలెను అని ఉబలాటము పూర్వ రూపము . తాను చేయుచున్నాను అని వర్తమాన రూపము , తాను చేసితిని యని ఉత్తర రూపము . ఇది తప్ప ఇంకేమీ ఉన్నట్లు లేదు . "

" ఇది చేతనము అనిపించుకున్న జంగమ జగత్తు . స్థావరములో ఏమున్నదో చూడు . "

         " అక్కడ ఇక్కడికన్నా విచిత్రముగా ఉంది . అక్కడ కార్యములు జరుగుతున్నవి , అయితే అక్కడ , నేను చేస్తాను , చేసినాను అనునది లేదు . అక్కడ సర్వమూ ప్రతిక్రియయే తప్ప , క్రియ లేదు , కర్తృత్వము ఎక్కడా లేదు . "

" ఇంకా చూడు "

         " పొయ్యి మీద పెట్టిన అన్నమును ఉడికించు మంట వలె, ఒక సమూహాత్మకముగా క్రియ నడచుచున్నది . దేవా ! ఇక్కడ పంచభూతములన్నీ కలగూరగంప అయినవి . యేటిలో వచ్చిన ప్రవాహపు నీటి ఉధృతికి చిక్కి అన్నీ కరగి కలసిపోయినట్లు, పంచభూతములను వేరు వేరుగా తీసుకొనుటకు వీలు కానట్లు , కషాయములో కలసిపోయిన మూలికల రసము వలె కలసి పోయినాయి . ఇవి వడ్లవలె ఒకచోట చేరుతున్నవి . రోటిలో వేసి దంచునపుడు అగునట్లు ఇంకొకవైపు వేరుపడుతున్నవి . ఇలాగ ఒకటిగా చేరుటకూ , వేరు వేరుగా అగుటకూ ఎవరు కారణమనునది మాత్రము తెలియుట లేదు . "

" ఇంకా చూడు "

        కుమారుడు ఆశ్చర్యముతో అన్నాడు , " దేవా , చేరుతున్నవీ , వేరగుచున్నవీ భూతముల సంఘాతములు . ( సమూహములు ) అబ్బా! ఈ సంఘాతములు ఎంత సూక్ష్మముగా ఉన్నాయి ! ఒక్కొక్కటీ ప్రత్యేకముగా ఉన్నట్టే కనిపించిననూ అవన్నీ పంచభూతముల సంఘాతములు . వీటిని కలుపుతున్నదీ , వేర్పరచుతున్నదీ ఒకటే రూపము . ఏదో అలౌకిక శక్తి ఇటు కలుపుతున్నది , అటు వేర్పరస్తున్నది . " 

" ఆ  అలౌకిక శక్తిని దర్శన పరిచయములనిచ్చి అనుగ్రహించమని వేడు . ’

          " ఇదిగో , ఆ శక్తి రూపము కనిపిస్తున్నది . అతడు నవ్వుతూ ఉన్నాడు . దుఃఖమునే చూడని వాడు ఎలా నవ్వగలడో అలాగ నవ్వుతున్నాడు . అతడు , " నేనే కాలమును . నేనే సర్వమునకూ కారణము" అంటున్నాడు . ’ నా స్వరూపమును తెలుసుకున్నవారికి దుఃఖము లేదు . నేను ఎల్లపుడూ నన్ను తెలియని వారికి దుఃఖమునూ , తెలిసిన వారికి సుఖమునూ ఇచ్చువాడను . ’ అంటున్నాడు . అతడిప్పుడు తన విశ్వరూపమును చూపిస్తున్నాడు . ఎల్ల లోకములలోని స్థావర జంగమములన్నీ అతడి వల్ల కలిగినవే . పర్వతమైనా , పరమాణువైనా అన్నీ అతని వల్లనే .’ నేనే ప్రకృతి : నేనే పురుషుడను ’ అని అట్టహాసము చేస్తున్నాడు . "

" అతడిని పూజించి గౌరవించు "

" అతడు పూజను ఒప్పుకొని అంతర్థానమయినాడు . మరలా లోకము కనిపిస్తున్నది . "

" ఇప్పుడు నువ్వు ఇంతసేపు చూచిన దానిని జంగమ జగత్తుకు అన్వయించు " 

          " అక్కడా అంతే ! అన్నిటికీ కారణము కాలమే అనిపిస్తున్నది . ఈ లోకము చక్రము వలె తిరుగుతున్నది . ఒక్క ఘడియ కూడా నిలుచుటలేదు . ఆత్రము , తొందరా లేవు . సమంగా తిరుగుతున్న చక్రములో ఒకభాగము కిందికీ మరొక భాగము పైకీ తిరుగునట్లు , ఈ లోకములో కూడా నడచుచున్నది . వీటన్నిటికీ కారణము ఉన్నట్లు లేదు , ఉన్నదంతా ఒక వేగము . దానిని గమనించుచుండ వలెను , అంతే . ఆ చక్ర గతిలో ఇది పైన , ఇది కింద అని చెప్పుటకు లేదు . ఈ వేగము కాలముదేనా ? "

" ఔను , ఆ గతి అణువణువులోనూ ఉన్నది "

" నాలో కూడా ఉందా ? " 

" ఉందో లేదో నువ్వే చూసుకో " 

        కుమారుడు చూసుకున్నాడు : " ఔను , ఉంది . అన్నమయ కోశపు త్వక్ , రుధిర అస్థి మజ్జాదులన్నిటా ఉంది . దేహపు ఇంద్రియములన్నిటా ఉంది . ప్రాణులన్నిటా ఉంది , మనసులో ఉంది , బుద్ధిలో ఉంది . ఆనందమయ కోశములో ఉన్ననూ లేనట్లే ఉంది. అంతే కాదు , ఒక్కొక్క గతి ఒక్కొక్క రూపములో ఉంది . విచిత్రముగా ఉంది . ఆ గతులను మాత్రమే చూస్తే , సర్వమూ గమన మయమైనది . " కుమారునికి ఆశ్చర్యంగా ఉంది . 

" అయితే , ఇన్ని గతులు అక్షరుడిపైన పని చేస్తున్నాయా ? "

" ఔను . ఇవన్నీ పాశములు . వీటన్నిటినిండీ విడిపించుకున్న వాడు అక్షర స్వరూపమును చూచిన వాడు . "

" ఇది వదలుట ఎప్పుడు ? "

" ప్రకృతి అనుమతి యైనపుడు . అంతవరకూ వీటి తాడనమును సహించవలసినదే " 

" ఇవి వదలినట్లు తెలిసేదెలాగా ? "

         "  మనసుకు ప్రసన్నత కలిగితే అవి వదలినట్లే గుర్తు.  . ఇవన్నీ చేరు భూమి మనస్సు . అక్కడక్కడా ఒక్కొక్క గతీ తిరోధానమవుతుండగా, మనసు ప్రసన్నమవుతూ వస్తుంది . మనసు మనిషికి వచ్చినపుడు ఇంకొక కొత్త గతి పుట్టును . అది అహంకారము . ఈ గతుల సమిష్ఠి ఫలమును ’ గుణము ’ అంటారు . ఆ గుణము స్పష్టముగా కనిపించేది ఎక్కడో తెలుసా , అహంకార భూమియైన బుద్ధిలో . గుణములు మూడు జాతులు . తమస్సు , రజస్సు , సత్త్వము అని . ప్రకృతి యొక్క అక్షరమును తమస్సు నుండీ రజస్సుకు తోసినపుడు జీవము మనుష్య దేహమును పొందును . అక్కడ , దేశ , కాల వర్తమానములు అనుకూలముగా ఉంటే , జీవుడు రజస్సు నుండీ సత్త్వానికి తిరిగి , తన మనస్సునూ , ఆ మనసుతో బుద్ధినీ శుద్ధీకరించుకొని ముందుకు వెళ్ళును . "

 " అప్పుడు అహంకారమేమగును ? "

       " అహంకారము సాత్త్వికమైనపుడు దేవతల కీలుబొమ్మ అగును . ముందరి పురోభివృద్ధి సాధనమగును . చివరికి తాను కేవలము ప్రతిబింబమను విషయమును పరిచయము చేసి , తన మూలము ఎక్కడుందో చూపించును . " 

" అప్పుడేమగును ? "

          " అదలా ఉండనీ , ఒక కథ విను . ఈ విశ్వపు ఆదిలో పరబ్రహ్మ నుండీ చతుర్ముఖ బ్రహ్మ పుట్టినాడట.  పుట్టిన ఈ బ్రహ్మకు ఏమి చేయవలెనో తోచలేదు . అప్పుడు అతడు ఏమి చేయవలెను అనునది తెలుసుకొనుటకు తపస్సు చేసినాడు. అమూర్తముగా నున్నది మూర్తిమంతమగు కాలమది . అందువలన ఆ తపస్సంతా మూర్తియైనది . అది ఆదిత్యుడిగా మారి కూర్చొని , వెనుక , ముందు చూచింది . అతడికి ఏమీ కనబడక , ’ అహం పూర్వ ’ అన్నాడు . ఈ శబ్దము ఘనమై , మొదటి బ్రహ్మ కళ్ళు తెరిపించినది . అప్పుడు అతడు’ నేనే పూర్వుడిని ’ అని , ’ అహం పూర్వ ’ అన్నాడు . ఇద్దరూ రజోగుణపువారు . రజోగుణము , మూలమును మరపించి , ’ తాను ప్రత్యేకము ’ అను స్వభావము ఉండునది. దానితో ఇద్దరూ పోరాడినారు . అదే ఇద్దరూ సత్వగుణములో ఉంటే , తామిద్దరూ సృష్టికి వచ్చినవారము , తమను సృష్టికి తెచ్చినవారు ఎవరు అనుదానిని కనుక్కొని కృతార్థులయ్యేవారు . ఇప్పుడు తెలిసిందా ? " 

          కుమారునికి అర్థమైనది . అక్కడ కూడా దేవతల విచిత్ర వర్తనము . స్పష్టముగా జరుగునదేమిటి అనుదానిని చెప్పకూడదా ? ’ అహంకారము సాత్త్వికమైతే తాను తన మూలమును చూచి అందులో చేరిపోవును ’ అనకూడదా ?  అలాగ ఆలోచిస్తుండగా మరలా సవితృ దేవుడి కంఠమునుండీ వెలువడింది , "  ఇదే ద్వాసుపర్ణ శృతి యొక్క అర్థము . ఈ సంసార వృక్షమును ఆశ్రయించుకొని యున్న పరమ జీవులలో ఒకడు భోక్త, ఇంకొకడు అభోక్త. భోక్త , అభోక్తను చూచినపుడు ఇతడూ అతడి వలెనే యగును . కాదా , చూడు "

         కుమారుడు దానిని పరిభావించి చూసినాడు . అభ్యాసము అతడిని పదార్థ సాక్షాత్కారము వైపుకు లాగింది . సవితృదేవుడి ఎదురుగా నున్నాను అన్నది మరచాడు . అహంకారము ఎదురుగా నిలిచింది . దానిని చూస్తున్నాడు , అది ఎర్రగా ఉండినది తెలుపుగా మారుతూ వస్తున్నది . ఇంకేమి , పూర్తిగా తెల్లబడింది . కాచుటకు ఉంచిన నీటిపైని ఆవిరివలె యగుచున్నది . ఆవిరి పైకిలేస్తున్నది . అంతలో ఏదో అడ్డమైనట్లయింది . సర్రుమని దిగినట్లాయెను . ఇంకో క్షణములో కళ్ళు తెరుచుకున్నాయి . మధ్యాహ్నపు సూర్యుని ప్రభ అంతా తానే అయి ఉంది . ఆ ప్రభ యొక్క శాంత తేజస్సును పట్టి అచ్చుపోసినదా అన్నట్లున్న పదునారేండ్ల బాలిక ఎదురుగా నిలుచున్నది .

         కుమారుడు కూర్చున్న గుడిసె ఉత్తరాభిముఖమైనది . అందులో వాకిటికి ఎదురుగా గోడ . అతడు కూర్చున్న వైపుకు రావలెనంటే వాకిలి దాటి , దానికెదురుగా నున్న గోడ దాటి రావలెను . కుమారుడు కనులు తెరచిననూ అతడికి ఇంకా సవితృదేవుని సన్నిధానములోనే ఉన్నట్లు , తాను అహంకారమును సాక్షాత్కరించుకొని చూస్తున్నానన్న భావన. దానివలన , ఎదురుగా ఉన్న కుమారి కంటికి కనబడుతున్ననూ వెంటనే ఆమెను గుర్తించలేక పోయినాడు. 

        వచ్చినామె , ఇతడు కళ్ళు తెరచినది చూచినది . అయినా ఆమెకు వెనుకకు తిరగవలెను అనిపించలేదు . ఆమె వెళ్ళుటకు ప్రయత్నించలేదు . 

         చెదరిపోయిన ఇంద్రియములూ , మనస్సూ మరలా బహిర్ముఖమై ఒకటగుటకు ఒక ఘడియయైనది . ఆమె అంతవరకూ అక్కడే నిలుచున్నది . కుమారుడే మాట్లాడించినాడు : " నీవెవరు ? "

" నేను మైత్రేయిని . ఆలాపిని దేవియొక్క తమ్ముడి కూతురుని . "

" నువ్వు ఇక్కడికెందుకొచ్చినావు ? "

" అత్తమ్మ పాలుతీసుకొని వెళ్ళు అన్నది , అందుకే వచ్చినాను ."

" నిన్నా మొన్నా వచ్చినావా ? "

          " నేను ఒక వారమునుండీ వస్తున్నాను . మీరు కళ్ళు మూసి కూర్చున్నవారు పట్టుదలగా అలాగే కూర్చునే ఉన్నారు . ఇలాగ కళ్ళు కూడా తెరువక కూర్చొనువారు ఉంటారు అని విన్నాను . మిమ్మల్ని చూచినాను . పదే పదే దర్శనము చేయవలెను అనిపించినది . అత్తమ్మకు చెప్పినాను . ఆమెకూడా అనుమతి నిచ్చినది . కాబట్టి వస్తున్నాను . ఈ దినము చూద్దాము యని ఒక్క ఘడియ నిలచి చూచినాను . నేను చూస్తున్నపుడే మీరు కనులు తెరచితిరి . పరుగెత్తి వెళ్ళి ఈ వార్త అత్తమ్మకు చెప్పాలనిపించినది . కానీ వెళ్లలేదు , నిలిచే ఉన్నాను . మీరు మాట్లాడించినారు "


Friday, February 22, 2013

42. " మహాదర్శనము "-- నలభై రెండవ భాగము---వారుణీ విద్య


42 . నలభై రెండవ భాగము--  వారుణీ విద్య


          పంచాత్మ సంక్రమణ విద్యను గురించి ఆచార్యులు చెప్పదొడగినారు . " యాజ్ఞవల్క్యా , సావధానముగా ఉన్నావా ? అని అడిగినారు . సావధానముగానే కూర్చున్న కుమారుడు , ’ సిద్ధముగా ఉన్నాను , అనుజ్ఞ ఇవ్వవలెను , తమరు అనుమతి నిచ్చినట్లే , చెప్పువాడు ఆదిత్యుడు అన్న భావనము చేసుకొని మన ఇద్దరికీ రక్షణను ఇవ్వమని వేడితిని . " అన్నాడు . 
       ఆచార్యులు ’ సరే ’ యని ఆరంభించినారు . " మొదటిది అన్నమయ దేహము . దీనిని సాక్షాత్కరించుకో . అప్పుడు ఈ దేహపు ప్రతిబింబము నీ ఎదురుగా కూర్చొనును . ఇదేమిటి , ఒక దేహము రెండయినది అనుకోవద్దు . బయటి ఆకాశములో లయమగుచున్న నీ దృష్టి ఇప్పుడు దేహపు పక్కన ఉన్న ఆకాశములో నీ తపోబలముచేత వెనుతిరిగి నీ దేహమునే చూచును . కాబట్టి నీకు ఈ రెండవ దేహము కనిపించును . అన్నమయ కోశమును దాటుట అనగా అదే . " 

      " ఔను , రెండవ మూర్తి యొకటి కనిపిస్తున్నది . అలాగే అక్కడున్న అంగాంగములన్నీ స్ఫుటముగా కనిపించుచున్నవి . నఖ శిఖ పర్యంతమూ స్పష్టముగా కనబడుచున్నది . " 

" ఆ మూర్తికి పూజ చేసి , ముందుకు దారి ఇవ్వమని ప్రార్థించు " 

      యాజ్ఞవల్క్యుడు ఆ మూర్తికి పూజను సలిపి దారి ఇవ్వమని ప్రార్థించినాడు . అప్పుడు ఆ మూర్తి జ్వాలామయమయినది . ఒక ఘడియ లాగే ఉండి మరలా శ్యామ సుందరమై మూలాధారము నుండీ కంఠము వరకూ ఒకే పంక్తిలో నున్న ఐదు జ్వాలలై దర్శనమిచ్చినది . 

      పక్కనున్న ఆచార్యులు , " అదే , చూడు ప్రాణమయ కోశము . దానికి పూజ చేసి , తన క్రియా కలాపములను చూపించమని వేడుకో . " అన్నారు . యాజ్ఞవల్క్యుడు అలాగే చేసినాడు . 

      జీర్ణమైన రావి ఆకు వలెనున్న ఒక చిత్రము కనిపించినది . దేహపు సీమారేఖల మధ్య పందిరి వలె కన్నులు కన్నులుగా పరచుకున్న నరమండలము . ఆ నరమండలపు మధ్య నీలము , తెలుపు , నలుపు , ఎరుపు , పసుపు రంగుల దీపములు . ఆ దీపముల ప్రభ విశ్వతోముఖముగా పరచుకుంది . ఒక్క క్షణము కూడా విచ్ఛితి లేక , ఆ దీపముల ప్రభ మంద్రముగా నున్ననూ ఖచ్చితముగా వెలుగుతున్నది . 

       " ఇక్కడి వరకూ మానవులకు యాతాయాతములుండును . అక్కడ నీలపు వర్ణముతో వెలుగు చల్లుతూ కూర్చున్నాడే , అతడే వ్యానదేవుడు . అతడే దేహమునందు జరుగు సర్వ కార్యములకూ కర్త. దేహి నిద్రకు వశుడైనపుడు కూడా దేహములో మెలకువగా ఉండి , శ్వాస నిఃశ్వాసలు మొదలు ఆహార పచనాంతము వరకూ అని కర్మలనూ చేయించువాడీతడు . ఇతనిని పట్టుకుంటే ప్రాణ పంచకమూ సునాయాసముగా చేతికి చిక్కును . కాబట్టి అతనికి మొదట పూజ చేసి , ముందుకు పోవుటకు అతని అనుమతిని వేడు." 

       వ్యాన దేవుడు పూజగొని ప్రసన్నుడై తన అనుజులైన ప్రాణ , అపాన , సమాన , ఉదానులను పరిచయము చేసినాడు . " చూడు , ఇతడు ప్రాణ దేవుడు . దేహాద్యంతమూ వేడిమి యుండుటకు కారణమితడు . ఈతడు బయటి నుండీ వచ్చిన సర్వమునూ గ్రహణము చేయును . ఇక, ఇతడు అపాన దేవుడు . దేహమునుండీ బయటికి వెళ్ళు ప్రతియొక్క దానికీ దేహపు గమనమునకూ కారణము . తరువాత ఈతడు సమాన దేవుడు . ఇతడు  , జీర్ణమైన ఆహారమును మూడు భాగములు చేసి స్థూలముగా ఈ దేహమునకు అవసరము లేనిదానిని బయటికి పంపమని అపాన దేవుడి వశము చేయును . ఇంక రెండు భాగములలో ఒకభాగమును దేహమునకు , ఒక భాగమును మనసుకూ ఇచ్చును . ఇక ఈతడు ఉదాన దేవుడు . దేహములో కలుగు శబ్దములకన్నిటికీ కారణమైన ఇతడు సరస్వతీ వ్యూహము ద్వారా పలికిస్తూనే ఉండును . ఈతడు ప్రసన్నుడైతే , నువ్వు ఋషివై వేదమంత్రములను పలికెదవు . ఈతడు పరమాకాశములో నున్న సరస్వతిని పిలుచుకు వచ్చి వర్ణాత్మకురాలుగా చేయగలడు . అందరి పరిచయమునూ చేసినాను . ఇంకేమి కావాలో చెప్పు . " 

" తామందరికీ పూజ చేయు విధానము ఎలాగన్నది చెప్పవలెను . " 

       " ఇప్పుడు నువ్వు ముందుకు బయలు వెడలినావు . దారిలో నిద్రించుట సరికాదు . కాబట్టి మా అందరినీ సమిష్టిగా పూజించి మా అనుమతి పొంది ముందుకు వెళ్ళు . మేము ఇంతవరకూ నీలో ఉండి , నీ అర్చనాదుల వలన తృప్తులమైనాము . " 

       యాజ్ఞవల్క్యుడు సమిష్టిగా ప్రాణదేవులకు పూజ సలిపినాడు . ఐదుగా ఉన్న రత్న దీపములు ఒకటై హృదయములో నిలచి పూజను ఒప్పుకొని ప్రసన్నమై అనుమతినిచ్చినవి . 

       దేహపు రూపు రేఖలు అలాగే ఉన్నవి . దానిలో కనిపించిన రావి ఆకు వంటి జాలము అక్కడే ఉంది . ఆచార్యుడు అన్నాడు , " కుమారా , అన్నమయములో ప్రాణమయము  అంటే ఇంకేమో కాదు , అన్నమయము నంతా నిండిన పురుషుడు అని గుర్తెరిగితివా ? అలాగే , ఈ ప్రాణమయ కోశము నంతా నిండిన మనోమయ కోశమును చూడు . " 

       ప్రాణదేవుడు దారి ఇచ్చినాడు . చంద్ర మండలమువలె శాంతమై తెల్లగా ఉన్న జ్వాల యొకటి హృదయదేశములో కనిపించినది . అది రెండు భాగములైనది . ఒకటి ప్రాణమయ కోశము వైపుకు పోయి , ఇంద్రియ గోళములలో ప్రాణముతో పాటు కూర్చుంది . ఇంకొక భాగము దేహాద్యంతమునూ వ్యాపించినది . పంచ ప్రాణముల నుండీ వస్తున్న వెలుగు వలెనే ఉన్ననూ , ఈ వెలుగు అది కాదనునది తెలుస్తున్నది . అలాగని , ఇదివేరే యని దానిని వేరు పరచుటకూ లేదు . 

ఆచార్యులు అన్నారు , " అదే , మనోమయ కోశము . దానికి పూజాదులు చేసి , పరిచయమును కోరు " 

       మనోమయము కుమారుడిచ్చిన పూజను గ్రహించి ప్రసన్నముగా పలికింది , " చూడు , నాలో రెండు జ్వాలలున్నదానిని , లేదా నేను రెండు భాగములైన దానిని చూచితివి కదా ? మనస్సర్వము  , మనోతీతము యని నాకు రెండు రూపములు . మనస్సర్వము ఇంద్రియాదులను ఆశ్రయించుకొని యున్న బహిర్ముఖము . మనోతీతము ఇంద్రియములకు అతీతమై దేహములో ప్రాణుడితోపాటు వ్యాపారము చేయుచుండును . మనస్సర్వమును కట్టివేస్తే , మనోతీతపు పరిచయమగును . ప్రాణవాహినియై మనోతీతము లోకములన్నిటా సంచరించి రాగలదు . ఈ మనోతీతము యొక్క సన్నిధిని సాధించి యోగులు నానాత్వము యొక్క రహస్యమును ఛేదించి , కాల , దేశ వర్తమానములను గెలిచి , తాము ఎక్కడ కావాలంటే అక్కడ , ఎప్పుడు కావాలంటే అప్పుడు కావలసిన రూపములను తీసుకొని కావలసిన వ్యాపారమును చేయగలరు . అయితే అలాకావలెనన్న , నన్ను అతిక్రమించకుండా సాధ్యము కాదు . "

" దేవా , నువ్వు సర్వ శక్తుడవలె నున్నావు . ఇటువంటి నిన్ను అతిక్రమించి వెళ్ళుట సాధ్యమా ? " 

       " లోకములో అసాధ్యమనునదే లేదు యాజ్ఞవల్క్యా , కాలమూ , కర్మమూ అంతటినీ పాకము చేయుచుండును . సర్వమూ తలకిందులు అగుచుండును . ఇలా ఉన్నపుడు అసాధ్యమెక్కడిది ? రెండు గీతల కథ విన్నావా ? ఒకటి చిన్నది కావలెనంటే ఇంకొకటి పెద్దదయితే చాలు . అలాగే అసాధ్యమును చిన్నది చేయుటకు వీలయితే , అప్పుడది సాధ్యమగును . అలా అగుటకు నీ సంకల్ప పూర్వకమైన ప్రయత్నము సతతముగా జరుగవలెను . దానికి నా అనుగ్రహము కావలెను . అయితే , నాకునేనుగా నీకు ఏమీ ఇవ్వలేను . వెనుకటిది ప్రేరేపించినట్లు ముందుదానిని చేయుటయే నా పని . కాబట్టి నా వెనుక ఉన్నవాడిని చూడు . " 

       యాజ్ఞవల్క్యుడు చూచినాడు . ఆదిత్యుడు ప్రసన్నముగా విరాజమానుడై యున్నాడు . తాను అహర్నిశలూ ఉపాసన చేయుచున్న ఆదిత్యుడు, మనఃప్రేరకుడు , వెనుక తాను చూచినది జ్ఞాపకము వచ్చెను . ఆదిత్యుడు , " ఔనౌను . మనసును ప్రేరేపించువాడిని నేను . ఈ మనోదేవుడే అవస్థా త్రయమునకు కారణుడు . నీ ప్రయత్నము ఎక్కువయితే , ప్రాణమయ , అన్నమయములు రెండూ ఆ ప్రయత్న రాశిని వహించలేనంతగా అది పెద్దదయితే అప్పుడు మనోమయమును ప్రార్థించెదవు . మనోమయుడు వెనుకకు తిరుగును . అంటే , దాని అర్థము , నా కిరణములలో మునుగును . అప్పుడు సుషుప్తి యగును . అక్కడ జీవుడు ఏమీ చేయుటకు లేదు , కాబట్టి యాజ్ఞవల్క్యా , నీవు ఇతడిని బాగుగా ఆరాధించు . ఈతని ప్రసాదమును పొందు . అప్పుడు ఇతడు నిన్ను ముందుకు వదలును . " 

       ఆదిత్యుడు అంతర్థానమగుతుండగనే ప్రసన్నమైన , మందహాసపు మృదువైన గలగలారావము విని కుమారుడు అటు తిరిగినాడు . మనోదేవుడు ఇప్పుడు మూర్తియైనాడు . సింహాసనము పైన కూర్చున్న మకుట ధారి యైనాడు . మొదటి చాంచల్య భావము లేదు . ఒక్కచోట నిలవకుండా అలలవుతున్న వెలుగు ఇప్పుడు మూర్తియై కూర్చున్నది . యాజ్ఞవల్క్యుడు మరలా పూజను సమర్పించి , " దేవుడు ప్రసన్నుడు కావలెను . ముందరి ప్రయాణము అనుకూలము కావలెను " అని ప్రార్థించినాడు . 

       మనోదేవుడు అన్నాడు , " నీకు ముందరి ప్రయాణమునకు అనుకూలము కావలెననియే దేవతలు నిన్ను సర్వజ్ఞులైన ఉద్ధాలకుల వద్దకు పిలుచుకు వచ్చినది . చూడు యాజ్ఞవల్క్యా , అతడక్కడ సంకల్పిస్తున్నాడు , ఇక్కడ క్రియ నడచుచున్నది . నేను శుద్ధ చంచలుడను . నీటికన్నా , గాలికి చిక్కిన లేత చిగురు కన్నా చపలుడను నేను . నా చాపల్యమును పోగొట్టు ఉపాయమేదో తెలుసునా ? ఆదిత్య దర్శనము చేయుట . నువ్వింతవరకూ ఆదిత్యుడి దర్శనము చేసి అతడిలో ఉన్న సావిత్ర కిరణమును హృదయములో నింపుకొనుచుంటివి కదా ! దానివలన నేను ఇప్పుడు అచలుడనై దర్శనము ఇచ్చినాను . ఇదిగో , నువ్విక ముందుకు పోవచ్చు . ఇదివరకూ దేహములో ప్రాణమయ కోశమును చూచినావు . అన్నమయ , ప్రాణమయములలో నిండిన నన్ను కూడా చూచినావు . ఇక , నావలెనే అన్నమయ , ప్రాణమయములలో నిండిన బుద్ధి దేవుని చూడు . " 

       మనో దేవుడు తన సింహాసనముతో పాటూ అంతర్థానమయినాడు . అతని స్థానములో ఇంకొక సింహాసనములో ఒకతడు కూర్చున్నాడు . అతనికి శరీరము సగము తెలుపు , సగము నలుపు . యాజ్ఞవల్క్యుడు అతడికి పూజను సలిపినాడు . ఆతడు పూజను ఒప్పుకొని , " నేను కూడా నీ దేహములో ఉండవేవాడినే . అయితే నువ్వు నన్ను చూచి ఉండలేదు . నేనే నీ బుద్ధిని . మనోవ్యాపారములు ఒక్కొక్కదానిలోనూ నా పనితనము ఉంటుంది .  మనసు వెనుక వెనుకే ఉన్న నన్ను బహు కష్టపడి అర్ధార్ధముగా చూచినవారు లేకపోలేదు . అయితే , నీవలె నన్ను ప్రత్యేకించి చూచువారు బహుకొద్ది మందే . నువ్వు యోగ్యుడవని , నీకు లభించిన జ్ఞానమును దురుపయోగ పరచేవాడివి కావని , నీకు ఒక రహస్యమును చెపుతాను విను . ఈ నా ధవళ కృష్ణ రూపమును చూచుచున్నావు కదా , ఇది శుద్ధ శ్వేత వర్ణమయినపుడు నా అనుగ్రహమయినది అని తెలుసుకో . ఇదిగో చూడు  . ఈ కృష్ణ రూపములో ఉండి ఈ భాగము కృష్ణమగుటకు కారణమైన వాడు అహంకారుడు . ఆ అహంకారుడు శుద్ధుడైనపుడు ఈ భాగము కూడా తెలుపగును . ఈ అహంకారము అభివృద్ధి కాకుండా చూచుకొనేదే వైరాగ్యము . మానవుడు తాను చేయు ప్రతియొక్క కార్యము వలనా పెరుగు అహంకారమును పెరగనివ్వకుడా ఉండునదే వైరాగ్యము . ఇలాగ వైరాగ్య సంపన్నుడైన వాడే నన్ను దాటుటకు సమర్థుడు . నువ్వు నన్ను అడగనవసరము లేదు . నేనే దారి ఇస్తాను , ముందుకు వెళ్ళు . "  

       ఆచార్యులు ధ్యాన మగ్నులైయున్నారు . వారి నోటి నుండీ ఏమాటా రావడము లేదు . అయినా ఊపిన ఉయ్యాల ఎవరు ఊగకున్ననూ తానుగా ఊగుతున్నట్టే అయినది . యాజ్ఞవల్క్యుడు ముందుకు సాగాడు . దేహములో కనబడుతున్న రూపు రేఖలన్నియూ మసిబారినాయి . విశాలమైన బయలు ప్రదేశమొకటి . అక్కడ ఏమీ లేదు . ఒక ఓంకారపు ధ్వని మాత్రము వినిపిస్తున్నది . దాని మూలమెక్కడుందో అది మాత్రము తెలియుట లేదు . ఏదో విచిత్రము . అక్కడ అంతా విచిత్రమే అనిపిస్తున్నది . తనను పట్టిఉండిన నామరూపములు కరిగి సూక్ష్మాత్ సూక్ష్మమైనవి . అక్కడ ఏ దృష్టి ప్రసరిస్తున్నదో చెప్పుటకు అగుట లేదు . ఏ చెవులు వింటున్నవో అదికూడా తెలియుటకు లేదు . ఎలా తెలియునో అది కూడా తెలియదు . అక్కడ కుమారునికి అర్చనాదులు పొందినట్లయింది.. అంతే కాదు తాను ప్రత్యేకముగా ఒకడినున్నాను అన్న భావనయే కరగి పోతున్నది . అక్కడ చెవులు లేకున్నా వినిపిస్తుంది , కన్నులు లేకున్నా కనిపిస్తుంది .మనసు లేకున్నా తెలుస్తుంది . ఎక్కడ ఎవరో అంటున్నట్లుంది , :

      " జగమునకు కారణుడను నేను . చూడు , ఇక్కడికి వచ్చినవాడు ఉదయించిన సూర్యుని వలె పైకి వచ్చినవాడు. ఇంక పతితుడు కాకుండా చూచుకో . మనోబుద్ధుల వ్యాపారము నిలచినపుడు నేను ప్రకటమగుదును . నన్ను ఆశ్రయించియే సర్వమూ బ్రతికియున్నది . ఈపూటకు ఇంత చాలు " 

       యాజ్ఞవల్క్యుడు తన ప్రయత్నము లేకనే వెనుతిరిగి వచ్చినాడు . అతడు కళ్ళు తెరచు వేళకు ఆచార్యులు కూడా గురు దేవా అంటూ చేతులు జోడిస్తూ కళ్ళు తెరచినారు . ఇద్దరూ ఒకరినొకరు చూచుకొని నవ్వినారు . 

Thursday, February 21, 2013

41. " మహాదర్శనము " --నలభై ఒకటవ భాగము--ఇంద్ర దంపతులు


41. నలభై ఒకటవ భాగము-- ఇంద్ర దంపతులు


          ఆచార్యులు అన్నారు : " యాజ్ఞవల్క్యా , ఆదిత్య తేజస్సైన ఉషాదేవి , నిన్ను జాగృత్తు నుండీ స్వప్నమునకు జారకుండా పట్టి నిలిపినది చూచినావు కదా ? అది ఎలా చూచినావు ? కర్మేంద్రియముచేతనా ? జ్ఞానేంద్రియము చేతనా ? "

          యాజ్ఞవల్క్యుడు కనులు మూసుకొని , అప్పటి అవస్థను స్మరించి , దానిని మరలా అనుసంధానము చేసి చూస్తూ అన్నాడు : " ఇది కర్మేంద్రియముల వ్యాపారము కాదు . జీవుడు భ్రుకుటి స్థానములో నున్నపుడు కర్మేంద్రియ వ్యాపారమే గానీ , ఆ స్థానమును వదలి వెళ్ళినపుడు కర్మేంద్రియ వ్యాపారమెక్కడిది ? అలాగే , స్వప్నమునకు జీవుడింకా జారిపోలేదు కాబట్టి జ్ఞానేంద్రియ వ్యాపార ప్రసక్తి కూడా లేదు . అయిననూ దర్శనము జరుగుతున్నది . దీని నేమనవలెనో తెలియదు . " 

          ఆచార్యులన్నారు , " ఇదే దివ్య దర్శనము . ఈ దివ్య దర్శనము కావలెనంటే కర్మేంద్రియ జ్ఞానేంద్రియములు రెండూ వ్యాపార ముఖమై వాటి స్థానములో దేవతా భావము రావలెను . ఈ భావము ఇంద్రియ గోళముల వరకూ వ్యాపిస్తే అప్పుడక్కడ ప్రతి గోళములోనూ దివ్యభావము వచ్చును . అప్పుడు విశ్వరూప దర్శనము . జాగ్రత్త ! నువ్వు విశ్వ రూప దర్శనమునకు ఉబలాట పడవద్దు . వేచియుండు , అది తానుగా వస్తుంది . ఇప్పుడు కన్నులు మూసి చూస్తున్న ఈ దివ్య దర్శనము ,  దేవతానుగ్రహము వలన ఇంద్రియ గోళములవరకూ తానుగా వచ్చువరకూ నిదానించు . " 

యాజ్ఞవల్క్యుడు అనుజ్ఞ యని కళ్ళుతెరిచినాడు . 

          ఆచార్యులు మరలా చెప్పినారు : " ఇప్పుడు మరలా అనుసంధానము చేసి ఆదిత్య దేవుడిని చూసి పంచాత్మ సంక్రమణ విద్యకు కాలము వచ్చినదేమో అడుగు . నువ్వు నేను చెప్పినానని , నన్ను ఆచార్యుడిగా చేసుకోవద్దు . చెప్పువాడు ఆదిత్యుడే అనుకో . అప్పుడు చెప్పువాడినీ , వినువాడినీ ఇద్దరినీ ఆదిత్యుడు సంరక్షించును . " 

         యాజ్ఞవల్క్యుడు అనుజ్ఞయని ఆదిత్యుడిని అనుసంధానము చేసుకున్నాడు . కుడి కంటిలో చలనమైనది . ఆదిత్యుడు దర్శనమిచ్చి , పూజాదులను స్వీకరించి , అన్నాడు , " విద్యా గ్రహణమునకు సకాలమైనది . అయితే , దానికన్నా ముందు కలుగు ఇంకొక పరిణామమును గమనించు . ఇప్పుడు చూడు , నీకు ఎవరు దర్శనమిస్తున్నారో ? "

          ఎదురుగా ఇద్దరు వచ్చినారు . భోగముల వలన క్రొవ్వుపట్టిన శూరుడి శరీరాకృతి , తలపైన రత్నకిరీటమూ , కప్పుకున్న ఉత్తరీయమూ , ’ ఈతడు సామాన్యుడు కాదు ’ యనుదానిని ప్రకటముగా చెప్పుతున్నవి . ఆతడు ధరించిన గంధమాల్యములు కూడా అటువంటివే . అనన్య సాధారణమైనవి అని తెలిసిపోతున్నాయి . ప్రసన్నమైన ఆ ముఖపు వెడల్పువరకూ ఉన్న కన్నులు వాతాహతి వలన కొంచము కూడా క్షుబ్ధము కానట్టి సరోవరముల వలె శాంతములూ , రమణీయములూనై , తేజోపుంజములై వెలుగుచున్నవి . ఆతని ముఖములో ఏదో విలక్షణమైన తేజస్సు . దానిని చూచిన వారంతా చేతులెత్తి జోడించి ఏమి ఆజ్ఞ యని అడుగవలెను . అలాగు బలాత్కారము చేయుచున్నట్లు తోచుచున్న ఆ తేజస్సు, కావలసినది ఇచ్చెదనని ప్రసన్నముగా వచ్చినట్లుంది . 

          అతని పక్కనే ఒక స్త్రీ . స్ఫురద్రూపమునకు ఆమె అంటే చాలా అభిమానమై యుండవలెను . లేకున్న, అంతటి సౌందర్యము ఆమెకెలా లభించును ? ఆమె , ఆతడి ఎడమ భాగములో కూర్చున్నది . ఆతని ప్రసన్నత అంతా ఆమె వలన ప్రచోదితమైనట్లు కనబడుతున్నది . వీర పుంగవుని శౌర్యము నంతటినీ పిడికిట పట్టి ఆడించు నటువంటి ఆమె కరుణ , ఔదార్యములు అనన్య సాధారణములుగా కనిపించుచున్నవి . 

          చూడగా , ఇద్దరూ దంపతుల వలె కనిపించు చున్నారు . సౌభాగ్యమంతయూ ఆ దంపతుల వశములో నున్నట్లు యాజ్ఞవల్క్యునికి బోధ యగుచున్నది . భర్త , పాల మీగడవంటి మనోహరమైన బుట్టా వస్త్రోత్తరీయములను ధరించితే , భార్య , నానావర్ణ విరాజితమైన తేటయైన చీరను కట్టి ఎర్రటి రవికను ధరించి మనోహరముగా ఉంది . నుదుటి కుంకము జ్యోతిఃపుంజము వలె ప్రకాశమానముగా ఉంటే , చెక్కిళ్ళమీదా , మెడమీదా ధరించిన కస్తూరి పసుపు ముఖానికి వెన్నెల చౌకట్టును కట్టినట్టుంది . చెదరినట్లున్న కురులకు కట్టిన చిన్న చిన్న ఆణిముత్యములైతే శ్రమచేసినపుడు కనిపించు చిన్న చిన్న స్వేద బిందువులవలె ముద్దుగా ఉన్నాయి . ఆ తలపాపట దువ్వుకున్న విధము సౌభాగ్య రేఖను దిద్దినట్లుంది .  ఆ నాసాదండము సుందరమైన భ్రూయుగ్మము యథాస్థానములో ఉండుటకు కట్టిన ఆధార స్థంభము వలెనున్నది 

           ఆమె యొక్క ఆభరణములు కూడా అంతే నయన మనోహరములుగా ఉన్నవి . పచ్చలు , కెంపులు , వజ్రములతో చేసిన సరము కంఠములో శోభిస్తున్నది . నవరత్న ఖచితములైన వంకీలూ , సింహ లలాటపు కడియములూ చేతులనూ ముంజేతులనూ అలంకరించుచున్నవి . సుందరమైన వడ్డాణము నడుమున మెరుస్తున్నది . అన్నిటికన్నా హెచ్చుగా ఆణిముత్యపు హారము మధ్య మధ్య ఉన్న కుందనపు , నవరత్న గుళ్ళతో ఉజ్జ్వల కాంతియుక్తమై మెరుస్తూ , ఎదపై పాముపిల్ల వలె వెలుగుతూ పడుకుని ఉంది . దివ్య గంధమాల్యము లైతే భర్త కన్నా భార్యకే ఎక్కువగానున్నవి . 

         యాజ్ఞవల్క్యుడు ఆ దంపతుల దర్శన భాగ్యము వలన ఒక ఘడియ తృప్తుడై మూగబోయినాడు . ఎవరి ప్రచోదనము చేతనో లేచి నిలబడి వారికి మానసపూజను అర్పించినాడు . విశేషమేమనిన, 

          ’ లం పృథివ్యాత్మనే గంధాన్ ధారయామి ’ అన్నపుడు , మనోహరముగా , వేసర కలిగింపక, సూక్ష్మమైన గంధపు సరిసోన వ్యాపించి , చుట్టుపక్కల వాతావరణము నంతటినీ ప్రసన్నము చేయుచున్నది . ఆ గంధపు ఆఘ్రాణము వలన ఊపిరి ప్రసన్నమై , శాంతమై దీర్ఘమవుతున్నది . 

          ’ హం ఆకాశాత్మనే పుష్పం సమర్పయామి ’ అన్నపుడు వారిద్దరికీ , అప్పుడే ఎక్కడి నుంచో వచ్చి వికసిస్తున్న అనేక జాతుల మల్లెల పూదండలు వారి మెడను అలంకరిస్తున్నవి . వారు ధరించిన పుష్పమాలల సువాసన తో ఇప్పుడు వచ్చిన మాలల సువాసన చేరి ఒక కొత్త పండుగ చేసినట్టై , ప్రధానముగా నయనములకు గౌణమై మిగిలిన ఇంద్రియములకు సంతర్పణమగుచున్నది .

          ’ యం వాయ్వాత్మనే ధూపం దర్శయామి ’ అన్నపుడు ఒక కొత్తధూపపు ఘుమ ఘుమ , అజ్ఞాతమైననూ దివ్యమైనది యని బోధయగుచున్న అలౌకికమైన పరిమళము అంతటా నిండి దేహాద్యంతమూ ఆయాసమన్న దానిని లేకుండా పోగొట్టి ఏదో తెలియని హాయినిస్తున్నది . 

           ’ రం జ్ఞానాత్మనే దీపం దర్శయామి ’ అన్నపుడు  మనోహరముగా రత్నకాంతి రంజితమైన మంగళారతి యొకటి తానే వెలిగి , కుమారుని దేహము నంతా చిన్న చిన్న ముత్యములవంటి దీపములతో సుందరము గావించుచున్నది . 

          ’ వం అమృతాత్మనే అమృత ఖండ నివేదనమ్ సమర్పయామి ’ అన్నపుడు నాసికకు బహు తృప్తిని గొలుపు సువాసనతో ఆప్యాయన కరమైన బాదామి పాలు రెండు గిన్నెలలో వచ్చి నిలుస్తున్నది . దాని సువాసనవల్లనే ఉన్న ఆకలియంతా తీరినట్టై సర్వేంద్రియములకూ ఉత్తేజనము దొరకుతున్నది . 

         యాజ్ఞవల్క్యునికి ఈ దినము జరిగినది ఆశ్చర్యమును గొలుపునదే . అంతవరకూ అతడు దేవతలను కొన్నిసార్లు సాక్షాత్కరించుకొని యున్నాడు . అప్పుడు మానసపూజలను చేసినదీ ఉన్నది . అయితే ఏ దినము కూడా ఇలాగ , అతని నోటి వెంట వచ్చిన మాటలు ఘనీభూతమై వస్తు గుణములుగా పరిణమించలేదు . 

          ఆ ఆశ్చర్యములో , వచ్చినవారు ఎవరు అన్నది తెలుసుకొనుటకు అవకాశము దొరకలేదు . వెనుకనుండీ ఎవరో ప్రేరేపించినట్లు , వారికి నమస్కారము చేసి వారు ఎవరో తెలుసుకో అని చెప్పినట్లాయెను . యాజ్ఞవల్క్యుడు పర ప్రేషితుడి వలె యాంత్రికముగా ఆ ప్రశ్నను అడగబోతుండగా ఆ వచ్చినవారే మాట్లాడినారు . 

          " మేము ఇంద్ర దంపతులము . నీ కుడి కంటిలో నేనెల్లపుడూ ఉంటాను . ఈమె ఎడమ కంటిలో ఉంటుంది . ఇప్పుడు నీకు వరమునిచ్చుటకు వచ్చినాము . నువ్వు ఏ ఆదిత్యుని పగలురాత్రి యనక ఉపాసన చేయుచున్నావో , ఆ ఆదిత్యుని నేనే ! నువ్వు బ్రహ్మ విద్యా సంపన్నుడగు వరకూ ఆదిత్యుని వరము బీజరూపముగానే ఉండును . ఆ బ్రహ్మ విద్యను పొందుటకు ముందే నీ ఇంద్రియములూ , అంగాంగములూ దానిని ధారణ చేయగల సామర్థ్యమును పొందియుండవలెను . నీకు లభించు బ్రహ్మవిద్య నీలో నిలిచి ఫలకారి యవనీ యని ఆశీర్వదించి , ఆ సామర్థ్యమును నీకు కరుణించ వలెననియే మేమిద్దరమూ వచ్చినది . "

" పరమానుగ్రహమయినది " 

          " ఇంకొక రహస్యమును తెలుసుకో . బ్రహ్మవిద్యకు విఘ్నమును తెచ్చి అడ్డుకునేవారమూ మేమే ! వేలెడంత దొరికితే మనసు దానిని పర్వతమంత చేసి, ’ ఇంకెవరికి తెలుసు ఈ విద్య ’ యని విర్ర వీగునట్లు అహంకారమును హెచ్చించు వారమూ మేమే ! ఎందుకో తెలుసా ? అనామకులు , సామాన్యులు వెళ్ళు దారికాదు అది . యాజ్ఞవల్క్యా , నీవంటి , లోకోద్ధారమునకు పుట్టినవాడు తన కార్యమును నిర్వహించుటకు కావలసిన ఆత్మోద్ధారమునకై బ్రహ్మవిద్యను అనుగ్రహించే వారమూ మేమే ! "

యాజ్ఞవల్క్యుడు అడిగినాడు , " తమరికి లోకోద్ధారము పైన అంతటి మమతనా ? "

         ఇంద్రుడు నవ్వినాడు , " ఈ ప్రశ్న ఎక్కడినుండీ వచ్చినదో నాకు తెలుసు . అది ప్రాణ దేవుడిది . ఆతను తానై చెప్పవలసినదానిని  నా ద్వారా చెప్పించవలెనని ఈ ప్రశ్నను నీతో అడిగించినాడు . " 

          " కానిమ్ము , దీనిని లోకము తెలుసుకోనీ ! విను , నేను త్రిలోకాధిపతి యైన దేవరాజును . ఈ త్రిలోకములూ సుఖముగా ఉండవలె ననియే నేను పాలించుచున్నది . ఆ సుఖము మనసుది . మనసు , కాల దేశ వర్తమానములకు తగినట్టు తాను యే దేహములో ఉండునో , ఆ దేహపు గుణ కర్మలకు అనుగుణముగా తన తన సుఖమును కల్పించుకొనును. ఇంకా ఒక్కడుగు ముందుకు పోయి చూస్తే , ఆ మనసు , దేహములోనున్న నాడీ వ్యాపారముల చేత  ఇటు వైపుకు ,  దేహములోనున్న ప్రాణ సంక్రమణాదుల చేత అటు వైపుకూ , వెనుకటి కర్మ వలన ప్రచోదితమై ఉన్న బుద్ధివలన  ఇంకోవైపుకూ , తూగుడు బల్లకు చిక్కినట్టు ,  ఆటాడుటకు దొరికిన చెండు వలె ,  పైకీ కిందికీ , అటునిటూ నలిగిపోవుచుండును . కాబట్టి సుఖమునకు ఒక నియమితమైన స్వరూపము లేదు . దీనినే మేము మనస్సు యొక్క ఇఛ్చా ద్వేషములకు అనుగుణముగా సుఖమనీ దుఃఖమనీ అంటాము తెలిసిందా ? " 

" తెలిసినది , ముందరి విషయము అనుజ్ఞనివ్వవలెను . " 

          " దేహములో నున్న నాడులు శుద్ధమై కల్మష రహితములై ఉంటే అది ఒక శుద్ధి . దురాహారములు లేక ప్రాణాదులు శుద్ధముగా ఉంటే దానివలన లభించునది ఇంకొక శుద్ధి . వెనుకటి కర్మలు పుణ్యములై ఉంటే దానివలన లభించునది మరియొక శుద్ధి . ఇలాగ శుద్ధి త్రయము వలన శుద్ధమైయున్న మనస్సు బ్రహ్మవిద్య వైపే మొగ్గుతుంది . అటుల చేసిన ప్రయత్నము విఫలము కాకుండా మా అనుగ్రహము లభించితే , అప్పుడు ఆ ప్రయత్నము పూర్ణమై , ఆ వ్యక్తి బ్రహ్మవిద్యా సంపన్నుడగును . నీ తరువాతి ప్రశ్న నాకు తెలుసు , వ్యక్తి అలాగయితే లోకమునకేమి ప్రయోజనము ? అని కదా ?, విను . "

యాజ్ఞవల్క్యుడు చేతులతో మొక్కి అడిగినాడు  ,  " తమరి అనుజ్ఞ , సావధానముగా వింటున్నాను " 

          ఇంద్రుడు మరలా నవ్వి అన్నాడు , " చూచితివా ? నీ మనసును ప్రచోదించు ప్రాణాగ్నులు ప్రసన్నమగుటను నువ్వు ’ సావధానముగా ఉన్నాను ’ అన్నట్లే , లోకము కూడా , ఈ కొన నుండీ ఆ కొనవరకూ పర ప్రేషితము . దైనందిన వ్యవహారముల చేతను , లోకమును నియమమున పెట్టు కాల దేశముల చేతను , క్షణ క్షణమూ ప్రతి దేహము నందునూ కల్మషము నింపబడు చుండును . ఆ నిండిన కల్మషమును మనసు ప్రతిబింబించు చుండును . అలాగ నిండుచున్న కల్మషమును కడుగునది బ్రహ్మవిద్య. పాత్రలు ఎవరి ప్రయత్నమూ లేకనే మసిబారును. అయితే , ఎవరైనా వాటిని బలముగా పులుసు వేసి రుద్దితే మొదటివలె మెరయును . అదే విధముగా ఎవరైనా ఒకడు బ్రహ్మవిద్యా సంపన్నుడు పుట్టితే అతడి దర్శన , స్పర్శన, సల్లాపములచేత లోకము తన కల్మషమును కడుక్కొని మరలా పూర్వము వలెయగును . ఇది లోకపు కాంతిమయ స్థితి . ఇది ధర్మము . ఇది సహజమైన  స్థితి . అప్పుడు దేహములన్నీ శుచిగా ఉండుట వలన అందరూ ఎక్కడ చూచినా సత్య ధర్మ పరాయణులగుదురు . ఇలాగ లోకము చక్కబడుటే లోకోద్ధారము . ఇలాగ లోకోద్ధారమగునది , ఆత్మోద్ధారము చేసుకొన్న బ్రహ్మజ్ఞుడి వలన. ఇప్పుడర్థమైనదా ? "

" దేవా , మీ అందరి కృప వలన అర్థమయినది " 

         " సరే , యాజ్ఞవల్క్యా , మంచిది . ’ నీ ’  అనుటకు బదులు ’ మీ ’  అన్నావు కదా , అది బాగుంది . ఔను , నువ్వు పుట్టినది మా అందరి ప్రయత్నము వలన. మా అందరి వల్ల మాత్రమే కాదు , ఈ త్రిలోకపు ఉపకారము కోసము కూడా .  అందువలననే నువ్వు నా ఉపాసనను ప్రత్యక్షముగా చేయకున్ననూ , నేను నీకు దర్శనమిచ్చినది . నేను ఇచ్చిన సౌభాగ్యమును క్షేమముగా ఉండునట్లు చూచునది ఈమె . అందుచేత ఈమెను పిలుచుకొని వచ్చితిని . ఇక పై నీకోసము నువ్వు ఏమీ కోరవద్దు . నేను లోకోద్ధారమునకై , ఆత్మోద్ధారమును చేసుకొనవలెను అన్న అహంకారమును పెంచుకోవద్దు . దానికి మేమున్నాము . ఎవరెవరి వలన ఏయే పనులు ఎప్పుడెప్పుడు కావలెను అనునవి మేము చూచుకొనెదము . ఇక మీదట నీకున్నది ఒకే ఒక పని . భక్తి , జ్ఞానము , వైరాగ్యములను పెంచుకొనుట , అంతే నీ పని . అలాగన్ననేమి యని అడగబోవుచున్నావు . అది నీకు అర్థమగునట్లు అనుగ్రహమగును . దిగులు పడవద్దు , నీ పని ఇంతకు  మించి లేదు . ఇది బాగా గుర్తు పెట్టుకో . నీకు అహంకారమను తుప్పు పట్టకుండునట్లు , నీ ఆచార , విచారములలో మెలకువగా ఉండు . బాహ్యాంతః శుద్ధిని కాపాడుకో . "

          ఇంద్రుడు విరమించినాడు . యాజ్ఞవల్క్యుడు , ముక్కుకు కట్టిన ముగుతాడును లాగగనే హెచ్చరిక గొన్న ఎద్దువలె , ఎవరివల్లనో ప్రేరేపింప బడిన వాడివలె అడిగినాడు , " దేవా , మీరు దేవతలు , సాక్షాత్తుగా సూక్ష్మముగా మాలో ఉండి మాకు తెలియకుండానే మాతో వ్యాపారము చేయించెదరు . కాబట్టి అడుగుతున్నాను . ఆచార , విచార , వ్యవహారములచేత నాకు కల్మషము తాకకుండా , నా బాహ్యాభ్యంతర శుద్ధి చెడిపోకుండా మీరు కాపాడకపోతే , నేను దానినెలా సాధించగలను ? "

          " అందు కోసమే మేము నీకు సామర్థ్యమును కరుణించుటకు వచ్చినది . అంగాంగమూ ప్రసన్నమగునట్లు మేమిచ్చిన వరమును తీసుకో . బ్రహ్మధారణము నీకు సులభమగునట్లు మేము చేయుచున్న ఈ అనుగ్రహమును స్వీకరించు . ఎంతవరకూ నువ్వు ప్రత్యక్ష దేవతలైన ఆదిత్య , వాయు , అగ్నులను జడము లనకుండా , చేతనములని గౌరవించెదవో , అంతవరకూ నీకు యే కల్మషమూ తగలదు . నువ్వు వేదము తెలిసినవాడివి . మేము నీ దేహములో ఎప్పుడు , ఎలాగ , ఎందుకు వ్యాపారము చేసెదమో అది గమనిస్తూ ఉండు . నీకు బాహ్యాభ్యంతర శుద్ధి ఉంటుంది . అది సరే , నీకు ఉద్ధాలకుల ద్వారా , అవస్థా త్రయ నిరూపణకు ముందే సాక్షీయానుభవమును చెప్పితిమి కదా ? ఎందుకో అర్థమైనదా ? "

" చెప్పితే తెలుసుకుంటాను , దేవా ! " 

          " ఈ విషయమును చివరి వరకూ వదలకుండా ఉండవలెను . విను . మనుష్యుడు జాగృత్తిలో ఇంద్రియములు మేలుకొనియున్నపుడు తెలిసినదే సత్యము అనుకొనుచున్నాడు . అలాగ కాదు : కర్మ జ్ఞానేంద్రియములు రెండింటినీ తిరస్కరించి తెలుసుకొనుటకు ఇంకొక దారి ఉంది . అది జాగృత్ జ్ఞానమున కన్నా విపరీతము కాదు , దానికన్నా నిశ్చయమైనది యనునది నీకు తెలియవలెను . అది ఇంద్రియములకు గోచరమగునట్లు ప్రత్యక్షము కాకున్ననూ , అది అసత్యము కాదు . ’ సత్యస్య సత్యం ’ అనుదానిని నమ్ము . ఆ అనుభవము నీకు శీఘ్రముగా లభించి నీకు నువ్వుగా నామాటను ఒప్పుకొను కాలమూ వస్తుంది . ఇక మేము వెళ్ళి  వస్తాము " 

యాజ్ఞవల్క్యునికి కనిపిస్తున్న దంపతులు తిరోహితులైనారు . అయిననూ యాజ్ఞవల్క్యుడు ఆ శూన్యాకాశామునకు పూజాదులను సలిపి కనులు తెరచాడు .