SHARE

Saturday, June 1, 2019

సంతాన భాగ్యము- వేదవిహిత ఉపాయము

సంతాన భాగ్యము- వేదవిహిత ఉపాయము
-----------------------------------------------------



సంతానము లేక చాలా మంది దంపతులు అన్ని రకాల ప్రయత్నాలూ చేసి ఫలము దక్కక విసిగి వేసారి ఉంటారు. భౌతికంగా, లైంగికముగా , మానసికముగా వారిలో ఎట్టి లోపాలూ ఉండవు. అయినా సంతానము కలగదు. దానికి కారణము ఎవరూ చెప్పలేరు.

 అయితే వేదము మనకు ఆ కారణాన్ని తేటతెల్లము చేస్తుంది. 
నిజానికి ఇదేమీ కొత్తవిషయము కాదు. వేదోక్తమైన కర్మలను అనాదిగా ఆచరిస్తూ, సంతానాన్ని పొందినవారు అన్నికాలాల్లోనూ ఉన్నారు.
సంతానము కోసము యాగాలు చేయుట మనకు తెలిసినదే. దశరథుడి వంటివాడే పుత్రకామేష్టి యాగము చేసినాడని పురాణము చెబుతుంది. 
అయితే, సంతానము కోసము, యాగమే ఎందుకు చేయాలి ? ఇతర పద్దతులు లేవా ? 

ఈ ప్రశ్నకు సమాధానము కూడా వేదమే చెబుతుంది.

కృష్ణ యజుర్వేదములోని రెండవ కాండములోని , మొదటి ప్రశ్నలో ఈ విషయము దీర్ఘముగా చర్చించబడినది.

అసలు, సంతానము కలుగుటకు, కలగక పోవడానికి గల కారణాలు తెలిస్తే, మిగతావి సులభముగా అర్థము అవుతాయి..

మొదట తెలుసుకోవలసినది, సంతానానికి కారణము మన దేహములో చరించే వాయువు. ఈ వాయువే ఐదురకాలుగా పిలవబడుతుంది. వీటినే పంచప్రాణాలు అంటారు. దేహములో  వాయు సంచారమే ప్రాణము ఉండుటకు, లేకపోవుటకు కారణము. ఉఛ్చ్వాస నిశ్వాసాలు లేకపోతే ప్రాణము ఉంటుందా ? 

ఈ ఐదు ప్రాణాలలో, ప్రాణము, అపానము-- ఇవి రెండే సంతానానికి కారణము. 
మన ముఖమునుండీ బయటికి సంచరించే వాయువే ప్రాణము.
మన దేహములో ఉదరభాగములో లోలోపలే సంచరించు వాయువే అపానము. దీనినే నియుత్ అని వేదభాషలో అంటారు. 
ఈ ప్రాణము, అపానము ఒకదానినొకటి పొందినపుడు-- అనగా కలసినపుడు మాత్రమే , సంతానము కలిగే సాధ్యత ఉంటుంది. ప్రాణము , అపానము ఒకదానినొకటి కలియక, వేరువేరు అయిపోతే అప్పుడు ఆ మనుష్యుడికి సంతానము కలుగదు. 

కాబట్టి, ఎన్ని ప్రయత్నాలు చేసినా సంతానము కలుగక పోవుటకు, ఈ ప్రాణాపానాలు దూరమగుటయే  కారణము. 

మరి, వాటిని కలుపుట ఎలాగ ? 

దీనికి వాయువే మనకు సహకరించాలి. అనగా , వాయువు మనకు సహకరించుటకు తగ్గ ప్రయత్నాలు మనము చేయాలి. 
అది ఎలాగ అంటే, వాయువు అతివేగముగా సంచరించువాడు. అందుకే వాయువేగము... అంటుంటాము. వాయువు అతివేగముగా సంచరించినట్టే , అతివేగముగా ఫలము కూడా ఇస్తాడు. 
.
కాబట్టి వాయువు అనుగ్రహము పొందాలంటే మనము చేయవలసినది-- శ్వేతపశు యాగము. శ్వేత పశువు వాయువుకు ప్రియమైనది. 
అపానవాయువును ’ నియుత్ ’ అంటారని తెలుసుకున్నాము కదా , నియుత్ అంటే , వాయువు సంచరించే రథము ను లాగే గుర్రాలు. అంటే దేహములో ఏదో రథము పరుగెడుతూ ఉంటుంది అని అర్థము కాదు. వేదము ఏమి చెప్పినా నేరుగా చెప్పదు. ఒక చిహ్నారూపముగానో, సంజ్ఞా రూపముగానో చెబుతుంది. ఈ నియుత్ అనే వాయువు దేహములో తిరుగుతుంది కాబట్టి, వాయువును ’ నియుత్వంతుడు ’ అంటుంది వేదము. ఈ నియుత్వంతుడికి, శ్వేత పశువు అతి ప్రియమైనది.....అని కూడా వేదము చెబుతుంది. 
కాబట్టి, శ్వేతపశువు నుండీ వచ్చిన ద్రవ్యాలతో [ అనగా తెల్లటి పశువు-- అది గుర్రము, మేక, ఆవు, గొర్రె వీటిలో ఏదైనా కావచ్చు.. అయితే గోవుకున్నంత శ్రేష్ఠత్వము, ప్రాముఖ్యత వలన పంచగవ్యాలతో]  ఇట్టి యాగము చేయుట ఈ కలికాలములో రూఢియైనది .

ఈ  శ్వేత పశుయాగము చేయడము వలన , వాయువు, తన భాగము తనకు దొరకుట వలన తృప్తుడై, దేహములో ప్రాణాపానములను కలియునట్లు చేస్తాడు.  అప్పుడు సంతాన నిరోధకముగా ఉన్న దోషము తీరి, సంతానము కలుగుతుంది. 

_____________
ఇదే విధముగా దీర్ఘరోగుల శరీరములో కూడా ప్రాణాపానాలు కలియక, ఆ రోగి మరణించే అవకాశము ఉంటుంది. దీర్ఘ రోగులు ఈ శ్వేత పశుయాగము చేయడము వల్ల, వారుకూడా రోగము పోగొట్టుకొని ఆరోగ్యము పొందుతారు. 

ఇదేవిధముగా ధనప్రాప్తి కోసము కూడా ఈ యాగము చేస్తారు. 
అదే విధముగా, ప్రజల మీద అధికారము సంపాదించి నాయకుడు కాగోరినవారు కూడా ఇదే యాగాన్ని చేసి ఫలితాన్ని పొందవచ్చు.]

ఇప్పుడొక ముఖ్య ప్రశ్న 
--------------------------------
ఈ యాగము వలన అనేక ఫలితాలు కలుగుతాయి నిజమే, కానీ అందరికీ ఇది సాధ్యమా? 
అందరికీ సాధ్యము కాకపోవచ్చు. యాగమంటేనే ఖర్చుతో కూడినది. పైగా ఎన్నెన్నో వసతులు, సౌకర్యాలు ఉండాలి. అవిలేనివారు, ప్రతి దినమూ బ్రహ్మ యజ్ఞములో వేదములోని ఈ రెండవ కాండము, మొదటి ప్రశ్న లోని మొదటి అనువాకాన్ని [ వాయుర్వై క్షేపిష్ఠా దేవతా.... ] పారాయణము చేసినా అంతే ఫలితము ఉంటుంది. బ్రహ్మ యజ్ఞములో కాకపోయినా, మామూలుగా అయినా పారాయణ చేయవచ్చు. అది కూడా వీలుకాని వారు, వేదవిదుడైన బ్రాహ్మణుడితో తమ స్వగృహమునందు నలభై రోజులు ఈ పారాయణము చేయించవచ్చు. 
. వేదము ఉన్నది మానవుల అభ్యుదయము , క్షేమము కోసము మాత్రమే గనుక, వేదములో చెప్పబడిన ఈ విధానాన్ని పాటించి సత్ఫలితాలను పొందుదాము. 
*************************

|| జగదంబార్పణమస్తు || 
|| వేద నారాయణార్పణమస్తు || 

_____________________
దీనినే ఈనాటి శాస్త్రజ్ఞులు, వైద్యులు పరిశోధనలు చేస్తే, ఈ కారణాలను, పరిష్కారాన్ని ఇప్పటి పదజాలము ఉపయోగించి, సంతాన సాఫల్య కేంద్రాలలో కొత్తపేరు పెట్టి , యాగానికి ప్రత్యామ్నాయాలను కనుగొని అదే ఫలితము వచ్చునట్టుగా చేయగలరేమో.. 

Wednesday, May 1, 2019

కల్ప సూత్రములు -ఒక లఘు పరిచయము



కల్ప సూత్రములు -ఒక లఘు పరిచయము 
________________________________________

ఈ వ్యాసములో కల్ప సూత్రములు ఏవి అనునది చర్చించలేదు.
అసలు కల్ప సూత్రముల గురించి తెలియని వారికి, అవంటే ఏమిటి, వాటి పేర్లు, వాటిలోని భేదములు, వాటి ఉపయోగము--వంటి విషయాలు మాత్రమే ఇవ్వడము జరిగింది.
కల్పసూత్రములు అంటే ఏమిటో చాలా మందికి తెలియకున్నా, వాటిని దాదాపు అందరు హిందువులూ నిత్యజీవితములో ఆచరించి, ఉపయోగిస్తున్నారు. 
వేదములో ఉపయోగింపబడిన భాష వల్ల కానీ, అందులో వివరింపబడిన సంక్లిష్టమైన అనుష్ఠాన పద్దతుల వల్ల కానీ, వేదాలను చదివి అర్థము చేసుకొనుట దుస్సాధ్యము. దాదాపు అసంభవము. 
కానీ వేదాల ఉనికి మానవుల అభ్యుదయము కోసము మాత్రమే. అటువంటప్పుడు అర్థము కాకపోవుట వల్ల ప్రయోజనము లేదు. వేదాలు ఆ విధముగా సామాన్యులకు అందుబాటులో ఉండకపోవుటకు కారణము, కేవలము వాటి పరిరక్షణార్థము మాత్రమే. 
మరి వాటిని అర్థము చేసుకొనుట ఎలాగ అంటే , వాటి అంగాల వల్ల మాత్రమే. ఇవే వేదాంగాలు. 
దాదాపు వేదములు ఆవిర్భవించిన కాలము నుండే ఈ అంగాలు కూడా ఉన్నాయి. వీటివల్ల, వేదములయందున్న ధర్మ సూక్ష్మాలను, వాటి రహస్యాలను తెలుసుకొనుట, వాటిలోని  విషయములను అర్థము చేసుకొనుట, ఆచరించుట సులభము అవుతుంది.
ఆ వేదాంగాలు, 
శిక్ష, 
ఛందస్సు,
వ్యాకరణము,
నిరుక్తము, 
జ్యౌతిష్యము [ జ్యోతిష్యము కాదు ] ... జ్యౌతిష్యము అంటే ఖగోళ శాస్త్రానికి సంబంధించినది.
ఆఖరిది, ’ కల్పము ’.. ఈ ఆరింటినీ శాస్త్రములు అనికూడా అంటారు, వాటి  విషయ ఆధిక్యత వల్ల. 
ఆఖరిదైన ఈ కల్పమే మన అనుష్ఠాన, ఆచారములను వివరించేది. 

కల్పము అంటే ప్రయోగము అనవచ్చు కూడా. 
 ఇందులో నాలుగు శాఖలున్నాయి, శ్రౌత, గృహ్య, ధర్మ, మరియు శుల్బ సూత్రములు. ఇవన్నీ కలిపితే కల్పసూత్రములు అవుతాయి. 
ఇప్పుడు ఈ నాలుగింటి గురించీ క్లుప్తముగా తెలుసుకుందాము..
మొదటిది, 
****************
శ్రౌత సూత్రములు 
****************
శ్రౌత సూత్రములు ముఖ్యముగా వైదిక యజ్ఞ యాగాదుల గురించీ, వాటిని ఆచరించవలసిన పద్దతులు, వివరాలను వర్ణిస్తాయి. 
కొన్ని శ్రౌత సూత్రములను కిందివిధముగా వర్గీకరించవచ్చు.
యజమానుడు, ఋత్త్విక్కులు, వారి ధర్మములు, వారి కార్య కలాపములు
అగ్న్యాధేయము --అనగా, అరణులను రాపిడి చేసి అగ్నిని పుట్టించుట 
దర్శపూర్ణమాస యాగము, సోమయాగము, చాతుర్మాస్య బలులు, సత్రయాగములు వంటివాటి వర్ణన, వివరణ.
అగ్నిచయనము --అనగా, ఇటుకలను యాగవేదికలు చేయుటలో ఉపయోగించు పద్దతులు, విధములను వర్ణించుట.
వేదములోని అన్ని శాఖలలోను వాటికి సంబంధించిన శ్రౌత సూత్రములు ఉన్నాయి. 
వాటిని కింది విధములైన పేర్లతో తెలుసుకొనవచ్చును.

ఋగ్వేదము ; ఆశ్వలాయన శ్రౌత సూత్రములు, సాంఖ్యాయన శ్రౌత సూత్రములు.
శుక్ల యజుర్వేదము : కాత్యాయన శ్రౌత సూత్రములు.
కృష్ణ యజుర్వేదము : ఆపస్తంబ శ్రౌత సూత్రములు, బౌధాయన శ్రౌత సూత్రములు, భారద్వాజ శ్రౌత సూత్రములు, మానవ శ్రౌత సూత్రములు, మరియూ వైఖానస శ్రౌత సూత్రములు.
సామవేదము : ఆర్షేయ కల్పసూత్రములు [ లేక ] మశక కల్పసూత్రములలోని శ్రౌత సూత్రములు, ద్రాహ్యయణ శ్రౌత సూత్రములు, జైమినీయ శ్రౌత సూత్రములు, లాట్యాయన శ్రౌత సూత్రములు.
అథర్వ వేదము : వైతాన శ్రౌత సూత్రములు.
ఈ శ్రౌత సూత్రములు లేకున్నచో, అనేకములైన వైదిక యజ్ఞాలు చేయుట అసాధ్యము. 
*****************
గృహ్య సూత్రములు 
*****************
మనము గృహములలో ఆచరించతగిన, ఆచరించవలసిన సాంప్రదాయాలను , తంతులను --అనగా షోడశ సంస్కారములను , పాకయజ్ఞములను  వివరించేవి గృహ్య సూత్రాలు.. 
నాలుగు వేదశాఖలకు చెందిన గృహ్య సూత్రాల పేర్లు[ ఇప్పటికి తెలిసినవి ]
ఋగ్వేదము :  ఆశ్వలాయన గృహ్య సూత్రములు, సాంఖ్యాయన గృహ్య సూత్రములు
శుక్ల యజుర్వేదము : పారస్కర గృహ్య సూత్రములు
కృష్ణ యజుర్వేదము : ఆపస్తంబ గృహ్య సూత్రములు, బౌధాయన గృహ్య సూత్రములు,భారద్వాజ గృహ్య సూత్రములు.
సామవేదము : గోభిల గృహ్య సూత్రములు, జైమినీయ గృహ్య సూత్రములు, ఖాదిర గృహ్య సూత్రములు.
అథర్వ వేదము : కౌశిక గృహ్య సూత్రములు. 


*****************
ధర్మ సూత్రములు 
*****************
ధర్మ సూత్రములనే, " సామయాచారిక సూత్రములు " అని కూడా అంటారు. ఈ ధర్మ సూత్రములు ముఖ్యముగా ఆచారములు, వ్యవహారములు , మరియు వర్ణాశ్రమ ధర్మములను గురించి వివరిస్తాయి. 
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయమును గుర్తుంచుకొనుట అవసరము. ధర్మ సూత్రములు, గృహ్య సూత్రములు ఇంచుమించు కలగలసి ఉండి, రెంటికీ దగ్గర సంబంధము ఉండును. అందులోని సూత్రములు ఇందులోను, ఇందులోనివి అందులోను ఉండే అవకాశము ఉంది.  అయినా, వాటి ముఖ్య భేదము ఏమనగా, గృహ్య సూత్రములు పాకయజ్ఞములకు, సంస్కారములకూ పరిమితము కాగా, ధర్మ సూత్రములు వర్ణాశ్రమ ధర్మాలను ఎత్తి చూపుతాయి. 
ధర్మసూత్రములు కింది విధములుగా ఉంటాయి. 
ఋగ్వేదము : వాశిష్ట ధర్మ సూత్రములు.
శుక్ల యజుర్వేదము : శంఖ లిఖిత ధర్మ సూత్రములు.
కృష్ణ యజుర్వేదము : ఆపస్తంబ ధర్మ సూత్రములు, బౌధాయన ధర్మ సూత్రములు, హారీత ధర్మ సూత్రములు, హిరణ్యకేశి ధర్మ సూత్రములు, వైఖానస ధర్మ సూత్రములు, విష్ణు ధర్మ సూత్రములు.
సామవేదము : గౌతమ ధర్మ సూత్రములు
అథర్వ వేదమునకు ధర్మ సూత్రములు ఉన్నవీ లేనిదీ తెలియదు. ఒకవేళ ఉంటే , వాటిపేర్లు తెలియవు. 

******************
శుల్బ సూత్రములు  
 ******************
శుల్బము అనగా, కొలతలు కొలుచుటకు ఉపయోగించు దారము , లేక తాడు. 
యజ్ఞ వేదికలు, యాగవాటికలు, యాగ శాలలు నిర్మించుటకు పాటించవలసిన కొలతలను ఈ శుల్బ సూత్రములు వివరిస్తాయి. 
శుల్బ సూత్రములను అధ్యయనము చేసి పరిశీలిస్తే , వేదకాలములోనే రేఖాగణితము యొక్క అద్భుత జ్ఞానము మన ప్రాచీన ఋషులు అందించినది చూసి ఆశ్చర్యపోక తప్పదు. ఆయా కొలతలు, ఆకారములు చూస్తే అబ్బురముతో నిశ్చేష్టులము కాక తప్పదు. 
ప్రస్తుతము మనకు ఏడు శుల్బ సూత్రములు లభ్యముగా ఉన్నవి.  అవి కూడా శ్రౌత సూత్రాలకు చాలా సన్నిహితముగా సంబంధించి ఉన్నాయి.  అవి, 
ఆపస్తంబ శుల్బ సూత్రములు, 
బౌధాయన శుల్బ సూత్రములు ,
కాత్యాయన శుల్బ సూత్రములు ,
మైత్రాయణ శుల్బ సూత్రములు ,
మానవ శుల్బ సూత్రములు ,
వాధూల శుల్బ సూత్రములు ,
వరాహ శుల్బ సూత్రములు 
*****************
 ఈ కల్ప సూత్రములన్నీ కూడా , వేదాంతములైన ఉపనిషత్కాలానికి తరువాత ఉనికిలోనికి వచ్చినాయి. 
___________________
బ్రహ్మ సూత్రములు
___________________
 సూత్రముల గురించి విన్నపుడు, చదివినపుడు, సహజముగా గుర్తొచ్చేది " బ్రహ్మ సూత్రములు " అనే పేరు. కల్ప సూత్రములకు , బ్రహ్మ సూత్రములకు ఎట్టి సంబంధమూ లేదు. వీటిలో కల్ప సూత్రములు ప్రాచీనమైనవి, బ్రహ్మ సూత్రములు అర్వాచీనమైనవి. 
బ్రహ్మ సూత్రముల గురించిన లఘు పరిచయము మరొకసారి. 

|| శుభం భూయాత్ ||

  సర్వం జగదంబార్పణమస్తు.. 

Wednesday, April 3, 2019

ఆన్ లైన్ సంస్కృత భాషా బోధన-రిజిస్ట్రేషన్ ఫారం




మిత్రులకు, ఇది చదివిన వారు అందరికీ ఒక సూచన.
" మిత్ర పరిషత్ తరఫున ఆన్ లైన్ సంస్కృత భాషా బోధన విషయము మీకు తెలిసినదే. ఈ ఆన్ లైన్ క్లాసులో చేరదలచుకున్నవారికి వారి మెయిల్ ఐడీ లకు ఒక రిజిస్ట్రేషన్ ఫారం పంపాము. కారణాంతరాలవల్ల ఎవరికైనా రాకున్నచో, కింది లింకులో నుండీ డౌన్ లోడ్ చేసుకొని, పూర్తి చేసి, అందులో ఉన్న మెయిల్ ఐడీ కి పంపగలరు. 
ఈ ఫారం ’ ఎడిటబుల్ పీడీఎఫ్ ’ ఫార్మాట్ లో ఉంది. అందులో అడిగిన మీ వివరాలు అందులోనే నింపవచ్చు. నింపి సేవ్ చేయవచ్చు. 
నింపిన ఫారాన్ని పంపండి.
ధన్యవాదాలు. ఇది అందరికీ షేర్ చేయవచ్చు.
Pl. send filled in forms to: mitraparishat@gmail.com

https://drive.google.com/file/d/199f5F3VsHrAy5kfMz8wKNFXTnIO7WpmV/view?usp=sharing




Wednesday, March 6, 2019

సంస్కృత భాషా బోధన -అధ్యాపకులు

సంస్కృత భాషా బోధన -అధ్యాపకులు 

అందరికీ నమస్కారము 
సంస్కృత భాషా బోధన గురించి నిన్న మేము పెట్టిన టపా కు అనూహ్య స్పందన లభిస్తున్నది. సంస్కృతము దేవభాష. దీనిని మృతభాషగా మార్చాలని ఎందరెందరో చేసిన ప్రయత్నాలకు గొడ్డెలిపెట్టుగా మీ స్పందన ఒక్కటీ చాలు. అనేక కృతజ్ఞతలు.

ఇక విషయానికి వస్తే,  మాకు టపా పంపిన వారందరూ విద్యార్థులే...సంస్కృతము నేర్చుకోవాలన్న ఆసక్తి చూపినవారే. 
అధ్యాపకుల నుండీ ఇంకా స్పందన రావలసి ఉంది. సంస్కృత భాషను నేర్చి, ఇతరులకు నేర్పించగల ప్రతిభ గల అధ్యాపకులకు ఇదే అవకాశము. మా  విన్నపము ఆలించండి. 
మీ సుముఖతను తెలియజేస్తూ స్పందించండి. సనాతన ధర్మ రక్షణలో పాలు పంచుకోండి. 
ఇది ఉచిత సేవ కాదు. మీరు చేయబోయే సేవకు తగిన పారితోషికము ఉంటుంది కాబట్టి, ఇది ఉభయతారకమైన మార్గము అని మేము చేపట్టడము జరిగింది. 
ఎలా నేర్పాలి, పాఠ్యాంశాలు, కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు వంటి వాటి గురించి మీరు చింతించవద్దు. తలపెట్టినది దైవకార్యము. ఆ దైవమే చూసుకుంటాడు. మన పని కేవలము మానవ ప్రయత్నము. 
కాబట్టి మరొక్కసారి ప్రార్థిస్తున్నాము, సంస్కృత అధ్యాపకులు ముందుకు రండి.

సనాతన ధర్మానికి జయము కలుగుగాక
ధన్యవాదం 

Tuesday, March 5, 2019

సంస్కృత భాషా బోధన

సంస్కృత భాషా బోధన 
-------------------------------

సనాతన ధార్మికులకు ఒక విశేష సూచన 
---------------------------------------------------
          సనాతన ధర్మాన్ని ఎందరెందరు ఎన్నెన్నిసార్లు అణచాలని చూసినా ప్రతిసారీ లేచి తలఎత్తి నిలబడింది. దీనికి కారణము అది మరణము లేనిది కాబట్టి. " జాతస్య మరణం ధృవమ్ " అయితే సనాతన ధర్మము పుట్టుక లేనిది..అనాదిగా వస్తున్నది. కాబట్టే దానికి మరణము లేదు.
కానీ అడుగడుగునా ధర్మాన్ని కించపరచే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. 
సనాతన ధర్మానికి వేదము , సంస్కృత భాష-ఇవి రెండూ ఆయువుపట్టులాంటివి. వేదాన్ని ఎందరు ప్రయత్నించినా ఏమీ చేయలేరు. ఇక మిగిలింది దేవభాష అని పిలవబడే సంస్కృత భాష. 
వేదము , శాస్త్రాలు వంటివి సంస్కృత భాషలోనే ఎందుకు ఉన్నాయి, వేద, శాస్త్రాల ప్రచారముకోసము సంస్కృత భాష ఎందుకు అవసరము--- అనే విషయము పైన శృంగేరీ శ్రీ జగద్గురువుల అనుగ్రహ భాషణము మీరు ఇదే బ్లాగులో చదివి యున్నారు. 
సంస్కృత భాషలో మన పురాతన సంస్కృతికి సంబంధించిన అతి గొప్పదీ పెద్దదీ అయిన ఖజానాయే ఉంది. భాష రాని కారణముగా  అధికశాతము ప్రజలు అపారమైన ఆ విజ్ఞానాన్ని అందుకోలేక వంచితులయినారు. 
విదేశీయుల కుయుక్తులవల్ల  సంస్కృత వాజ్ఞ్మయం చాలాభాగము  వారి అనువాదాల్లో వక్రీకరింపబడినది. 
ఒక జాతిని నిర్వీర్యం చేసి నశింపజేయాలంటే మొదట ఆజాతి సంస్కృతిని నాశనము చేయాలి అన్న సిద్ధాంతముతో వారు కొంత విజయము సాధించారు. దాని ఫలితమే ఈనాడు సంస్కృత భాషకు పట్టిన దుస్థితి. 
ఈ విషయాలు కొత్తవేమీ కాదు. ఈమధ్య సామాజిక మాధ్యమాల వల్ల ఇటువంటి విషయాలు బయటికి వచ్చాయి. నేటి యువతలోను , సనాతన ధర్మాచరణలో ఆసక్తి గలవారి లోనూ, సంస్కృతము మీద విశేష ఆకర్షణ , ఆదరణ, అభిమానము నానాటికీ పెరుగుతున్నది. 
అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన సమస్య కూడా ఉంది. 
సంస్కృతము నేర్చుకోవాలని ఆసక్తి నానాటికీ ప్రబలము అవుతున్నా, వారికి నేర్పించేవారు దొరకక పోవడము , అధ్యాపకులు ఉన్నచోట విద్యార్థులు లేకపోవడము , ఉన్నాకూడా సమయాభావము , దూరాలు వంటి అనేక ప్రతిబంధకాలు ఉన్నాయి. 
అంతర్జాలములో ఇప్పటికే అనేక వెబ్ సైటులు, వీడియోలు, పాఠాలు ఉచితముగా దొరకుతున్నాయి. కానీ వాటి ఉపయోగము చాలా పరిమితమైనది . ఎందుకంటే , ఇటువంటి వాటిని నేరుగా గురుముఖతా నేర్చుకోవాలి. ప్రశ్నోత్తరాలు, సందేహాలు, ఎప్పటికప్పుడు తీర్చుకోవాలి. అంతేకాక, ఒక్కోవిద్యార్థి గ్రాహకశక్తి ఒక్కోలా ఉంటుంది. దానికి తగినట్టు అధ్యాపకులు/ గురువులు తమ బోధనా శైలినికానీ పద్దతులను కానీ కొంత మార్చుకోవలసిన అవసరం ఉంటుంది.  ఇప్పుడున్న సౌలభ్యాలు  ఆ ప్రయోజనాన్ని సాధించలేవు. ఈ కారణము చేతనే , చాలామంది మొదలుపెట్టి, అనతి కాలములోనే మానేస్తున్నారు. 
ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ప్రపంచములో ఎక్కడెక్కడో ఉన్న  విద్యార్థులను , అధ్యాపకులనూ అనుసంధానించి, అంతర్జాలము ద్వారా సంస్కృతము నేర్పించాలన్న సంకల్పము ఆ శారదాదేవి అనుజ్ఞ, అనుగ్రహము మేరకు కలిగిన కొందరు ఈ విషయముపై తీవ్రముగా శ్రమించి, పదుగురికి మేలు జరగాలన్న సదుద్దేశముతో ఒక కార్యాచరణను ఏర్పాటు చేస్తున్నారు. 
దానిలో భాగముగా , మొదట , ప్రపంచములో ఎక్కడున్ననూ , సంస్కృత అధ్యాపకులు తమ పేర్లను నమోదు చేసుకోవలసినదిగా కోరడమైనది.
అలాగే , ఆసక్తిగల విద్యార్థులు తమపేర్లను నమోదు చేసుకోవలసినదిగా కోరడమైనది. 
మొదట ఈ అధ్యాపక-విద్యార్థుల వివరాలు సేకరించిన తరువాత, వారికి ఒకరినొకరికి అంతర్జాలము ద్వారా సంధానించే ప్రక్రియ చేపట్టబడుతుంది. సంస్కృత భాష నేర్చుకొనుటకు సులభపద్దతిలో పాఠ్యాంశములను కూడా సిద్ధము చేసే ప్రక్రియ త్వరలోనే మొదలవుతుంది. దీనిలో భాగముగా , మూడు నాలుగు అంచెలుగా పాఠములు ఉంటాయి. 
ప్రాథమిక పరిచయము , పుస్తకముల ద్వారా బోధన , భాషణము ద్వారా బోధన, పరీక్షలు వంటి అంచెలలో బోధన ఉంటుంది.

గ్రాహక శక్తిని బట్టి విద్యార్థులు ఒకటి రెండు సంవత్సరాలలో స్వయముగా సంస్కృతము చదివి అర్థము చేసుకొనుట, భగవద్గీత , ఇతర కావ్యాలను అర్థము చేసుకొనుట, తామే స్వంతముగా సంస్కృతములో రచనలు చేయుట వంటి లబ్ధిని పొందగలరు. 
ఆసక్తి గల అధ్యాపకులు, మరియూ విద్యార్థులూ కింది మెయిలుకు తమ వివరాలు పంపగలరు. అలాగే ఫోన్  చేసి ఇతర వివరాలు పొందవచ్చు

Mail : mitraparishat@gmail.com
Cell: 6362685006

ఇంతవరకూ ఈ ప్రక్రియను వేదము నేర్చుకొను విద్యార్థులకు , నేర్పించే గురువులకు సంధానము చేయుట కొరకు విజయవంతముగా నడపడమైనది. ఇంకా నడుస్తున్నది. నేను వ్యక్తిగతముగా గత పదేళ్ళుగా వేదము ఈ పద్దతిలో , విదేశాల్లో ఉన్న కొందరికి నేర్పిస్తున్నాను. 
అయితే ఇప్పుడు మొదలుపెట్టబోవుతున్నది ప్రస్తుతము కేవలము సంస్కృత భాషా బోధనకే పరిమితము. 
సూచన : ఇది కేవలము  సమాజహితము గురించి మాత్రమే చేయబడుతున్నది. లాభములకోసము కాదు. 
మరొక్క విషయము:
ఈ కాలములో అనేక పండితులు, సంస్కృతములో అత్యంత ప్రావీణ్యము కలిగియుండి, విద్వత్తు, ప్రతిభలు ఉండి కూడా విద్యార్థులు దొరకక, వారితో అనుసంధానించే పద్దతులు తెలీక, ప్రభుత్వము నుండీ గానీ ఇతర ధార్మిక సంస్థలనుండీ గానీ తగిన ఆదరణ లేక, దారిద్ర్యరేఖ ను అంటుకొని ఉన్నారు. అటువంటి వారికి కొందరికైననూ సహాయము అందించాలని ఆ శారదామాత ప్రబోధముచేత బద్ధ కంకణులై ఉన్న బృందము ఈ కార్య క్రమాన్ని చేపడుతున్నది. అటువంటి వారు తప్పక మా సేవలను అందుకోవలసినదిగా కోరుతున్నాము. 

మొదట , మాకు తమ ఆసక్తిని ప్రకటిస్తూ మెయిల్ పంపినవారికి ఒక బయోడాటా ఫారమ్ పంపబడును. దానిని నింపి మాకు పంపవలసి ఉంటుంది. 

పేర్లు, వివరాలతో కూడిన బయోడేటా  సేకరణ  అయ్యాక ప్రతిఒక్కరూ వారి పేర్లను రిజిస్టర్ చేసుకోవలసి ఉంటుంది. 
వచ్చిన వివరాలను పరిశీలించిన పిమ్మట , విడతల వారీగా వారికి ఆయా వివరాలు అందజేస్తాము. 
అధ్యాపకులకు విద్యార్థులు చెల్లించాల్సిన రుసుము , ఇతర వెసులుబాట్లు, సౌకర్యాలు , కావలసిన అంశాలు -తదితర విషయాలను తరువాతి టపాలో చూడవచ్చు. 
|| శుభం భూయాత్ ||

Wednesday, September 5, 2018

వైదిక ధనము

వైదిక ధనము
-------------------------

తపస్సుకు మెచ్చి, సరస్వతీ దేవి ప్రత్యక్షమై, ’ వత్సా , ఏమికావాలి, కోరుకో ..’ అంటే ,
" తల్లీ, నాకు అధికముగా ధనాన్ని ఇవ్వు. ప్రపంచములోని అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ చదివి జ్ఞానము సంపాదించుకుంటాను " అన్నట్టు
ఈ మధ్య ప్రతీదాన్నీ కేవలము ధనముతో మాత్రమే సంపాదించగలము--అనుకొనేవారి సంఖ్య రానురానూ ఎక్కువవుతోంది.
జ్ఞాన సరస్వతే ఎదురుగా ఉన్నపుడు, జ్ఞానాన్ని అడక్కుండా , అదేదో తాను ప్రత్యేకంగా సాధించాలి అన్నట్టు , దానికి డబ్బు అవసరమైనట్టు --ఇంతటి అజ్ఞానాన్ని చూసి సరస్వతీ దేవి ఇక అక్కడ క్షణం ఉంటుందా ?
అనేకులు , ఎంతగొప్ప చదువులు చదివినా, ఎంతగొప్ప ఉద్యోగాలు చేసినా , ప్రతీదాన్నీ డబ్బుతో ముడి పెడతారు.
ఎవరైనా ఏదైనా పని చేయబోతే " దానివల్ల ఎంతొస్తుంది ? ఏమొస్తుంది ? " అంటూ ప్రశ్నలు.
సనాతన ధర్మములో
|| ఇష్ట ప్రాప్తి-అనిష్ట పరిహారయోః అలౌకికమ్ ఉపాయమ్ యో గ్రంధో వేదయతి స వేదః ||
అని ప్రసిద్ధమైన ఋషివాణి ఉన్నది.
అనగా , " మనకు ఈ ప్రపంచములో అవసరమైన - లేక, ఇష్టమైన వాటిని పొందడానికి, మరియు హానికరమైన వాటిని తప్పించడానికి కావలసిన అలౌకిక ఉపాయాలను యే గ్రంధము ఇస్తుందో, అదే వేదము "
అంటే, దీన్ని బట్టి, వేదములో ప్రతిపాదించిన పద్దతుల వల్ల మనము సర్వమునూ సమకూర్చుకోవచ్చును. అంతే కానీ ధనము వల్ల కాదు.
ధనము వల్ల వచ్చేవాటినీ, ధనము వల్ల రాని వాటినీ కూడా వైదిక పద్దతుల ద్వారా [ యజ్ఞ యాగాదులు , హోమాలు వంటివి ] సులభముగా పొందవచ్చును.
కానీ దీన్ని మనము నమ్మితే కదా?
నమ్మిన వారికి ఫలముంది, నమ్మని వారికి ఏముంది--అన్నట్టు, అసలు ఇటువంటి ఆలోచనే ఎవరికీ రాదు.. ఎవరైనా చెప్పినా నమ్మరు. ప్రస్తుతము సమాజములోని పరిస్థితులు , పోకడలే దానికి కారణము.
వైదిక ధర్మాన్ని పాటిస్తున్నవారే , చాలామంది దీన్ని నమ్మరు. ఎందుకు నమ్మరు అంటే కారణాలు అనేకము. ముఖ్యమైనది, జీవితంలో వారు ప్రయాణించిన పద్దతి.

ఉదాహరణకు , కొందరు స్వఛ్ఛమైన దుస్తులు వేసుకొని కాలినడకన , మరికొందరు స్కూటర్ మీద, ఇంకొందరు ఆటోరిక్షా, అలాగ , బస్సు , కారు , రైలు , విమానాల్లో ప్రయాణించారు అనుకోండి. వారందరి ప్రయాణ కాలము ఒకటే అనుకోండి. ప్రయాణము తర్వాత ఎవరెవరి దుస్తులు ఎలా ఉన్నాయో చూద్దామా ?
వారందరి దుస్తులూ అంతో ఇంతో మాసి ఉంటాయి.
కాలినడకన వెళ్ళేవారికి, స్కూటర్, ఆటో, బస్సు, కారు, రైలు, విమానాల్లో వెళ్ళేవారికి ఒకే రకంగా దుస్తులు మాసి ఉండవు కదా?
విమానాల్లో వెళ్ళినవారికి తలపైన జుత్తు కూడా చెదరి ఉండకపోవచ్చు. ఏసీ కారు వారికీ అంతే. ఇక రైలు, బస్సు, ఆటో, స్కూటర్ వారికి వేర్వేరు రకాలుగా దుస్తులు మాసి ఉంటాయి. పైగా కొందరికి చెమటవల్లను , వాన, బురద వల్లనో దుస్తులు పాడై ఉంటాయి కూడా.
ఇందులో ఎవరి ప్రయాణము సుఖవంతము , ఫలవంతము అనడిగితే , విమానము , ఏసీ కారు , ఏసీ రైళ్ళలో వెళ్ళినవారిది అని ఠకీమని చెబుతారు.
అదే తర్కాన్ని అనుసరించి, పైన చెప్పిన " ధనముతో అన్నీ వస్తాయి , వైదిక పద్దతుల వల్ల కాదు" --అని అనుకోడానికి-- అనుకోకపోవడానికీ--వారు చేసిన ప్రయాణమే కారణము.
ఇక్కడ విమానము , ఏసీ కార్లు, రైళ్ళూ అంటే-- వైదీక జీవనములో ప్రయాణించినవారు అని అర్థము. అంటే పొట్టపోసుకోడానికి వైదీక జీవనములో ఉండడము కాదు. నిజంగా వేదాన్ని నమ్మి , దాన్ని ఆచరిస్తూ జీవనము గడిపేవారు అని అర్థము.
ఇక ఈనాటి అర్థం పర్థం లేని చదువులు చదివి అవి ఇచ్చే ధనము , వస్తువులు , సౌకర్యాలు పొందుతూ ’ తాము గొప్ప హోదాలో ఉన్నాము ’ అనుకొనేవారు స్కూటర్, ఆటో రిక్షాలలో వెళ్ళేవారికన్నా అధములు. అంటే వారి మనసులు ఎక్కువగా మలినము అయ్యాయి అని. వారికి ప్రతీదీ డబ్బుకు ముడివడి ఉంటుంది. ఇతరులలో డబ్బునే చూస్తారు. వారి గుణగణాలను , వ్యక్తిత్వాన్ని , జ్ఞానాన్ని వీరు చూడలేరు. అవన్నీ ఉన్నా కూడా డబ్బులేదు--అని వీరు గనక అనుకుంటే వారిని చులకనగా చూస్తారు.
మీరు అడగవచ్చు, ’ నేటి అర్థం పర్థం లేని చదువులవల్ల డబ్బు , వస్తువులు , సౌకర్యాలు వస్తున్నాయని అన్నారు కదా, మరి అలాంటప్పుడు వేదముతోను , వైదీక జీవితముతోను ఉపయోగమేమి ? " అని.
నిజము,నేటి చదువులు అవన్నీ ఇస్తున్నాయి . ఎవరు కాదనగలరు.. కానీ మనశ్శాంతి , ఆరోగ్యము , జన్మాంతరములో మనకు తిరిగి సంపదలు , మానసిక ఆరోగ్యము వంటివి ఈ చదువులు ఇస్తాయా ? ఇవన్నీ ఈ జన్మతో ముగిసిపోవలసినదే. ఎవరూ వీటిని -అనగా ఈ డబ్బు సౌకర్యాలు , వస్తువులను మూటగట్టుకొని పోరు. చచ్చినపుడు అన్నీ వదలి పోతారు. మనవెంట రావు. పైగా ఇవన్నీ అశాశ్వతాలు. ఎప్పుడైనా వీటిని పోగొట్టుకోవచ్చు.
అయితే , వైదిక జీవనము ఈ జన్మలో అన్నీ ఇచ్చుటే గాక , పైజన్మకు కూడా వాటిని పుణ్యరూపములో మూటగట్టి తెచ్చిస్తుంది.
’ పై జన్మ ఉందో లేదో, ఇప్పటికేది ప్రస్తుతమో అది చాలు ’ అనుకొనేవారికి, నా ప్రశ్న --" పైజన్మ ఉండకపోయేది మోక్షము ప్రాప్తములో ఉన్నవారికి మాత్రమే. ఆ మోక్షము కలగాలన్నా, ఈ లౌకిక విధానాలు సహాయం చెయ్యవు. దానికీ వైదిక విధానాలే శరణ్యము"
అంతా బాగానే ఉంది, మీరు చెప్పినవి పాటించి ఫలితాన్ని పొందిన వారు ఎవరైనా ఉన్నారా ? --అంటే , అనేకులు ఉన్నారు. నేను స్వయముగా చూసినవారే కాదు, మీరందరూ కూడా చూశారు , ఈనాడు ఆధ్యాత్మికముగా గొప్ప స్థితిలో ఉన్నవారందరూ అటువంటి వారే. వారికి ధనముతో అవసరము లేకుండానే అన్ని భాగ్యాలు , సౌకర్యాలు దొరుకుతున్నాయి.
మనము అనేక దేశాల్లో చూస్తున్నాము , తిండికీ బట్టకీ ఉండదు. మనుషులు అస్థిపంజరాల్లా ఉంటారు. అనేక రోగాలు, అశాంతులు , అలజడులు , ప్రకృతి ప్రకోపాలు--ఇలా ఎన్నెన్నో.. మనదేశములో అవన్నీ లేవు. ఎందుకో తెలుసా ? అది మన గొప్ప కాదు. ఈ తరము , పోయిన తరము వారి గొప్ప కాదు. మనకు మన పూర్వీకులు ఇచ్చిపోయిన ధనమే అది. వారు చేసిన పుణ్యఫలమే తరతరాలుగా మనలను రక్షిస్తున్నది.
" ఒక వ్యక్తి వేద విద్యా పారంగతుడైతే , అతడికి ముందు , వెనుక , ఎన్నోతరాల వారి శ్రమ ఫలించినట్టు. అతడి వల్ల అన్ని తరాలు ఉద్ధరింపబడతాయి. "
కొంతకాలము కింద ఇక్కడే నా మిత్రుడొకరు--చిన్నవయసు వారే --- అడిగారు" ఏమిటోనండీ జపాలు , పూజలు , అనుష్ఠానాలు చేస్తాను గానీ ఎందుకో ధనము ఇమ్మని ఆ దేవుణ్ణి అడగడానికి మనసు రాదు. అది తుఛ్చముగా అనిపిస్తుంది.. కానీ ధనము లేకపోతే నాకు కావలసినవి దొరకడము లేదు, పనులు జరగడము లేదు--" అని.
అతడు నిజముగా ఆధ్యాత్మిక మార్గములో ఉన్నాడు. అయితే కొన్ని అవరోధాలు వస్తున్నాయి. నేను చెప్పాను, " మీకు ధనముతో అవసరము ఏమిటి, మీకేమేమి వస్తువులు , పనులు కావాలో ఆ దేవుణ్ణి అడగండి. ధనము రాకపోయినా మీ పనులు జరిగితే చాలు కదా " అన్నాను. అతడు దానికి ఒప్పుకొని , మంచి సూచన అని అంగీకరించి ఆచరణలో పెట్టాడు. తర్వాత కొంతకాలానికి అతడే చెప్పాడు, ’ ఇప్పుడు నా అవసరాలన్నీ ధనముతో పని లేకుండానే తీరుతున్నాయి, లేదా, అవసరానికి ఏదోరకంగా ధనము అదే వస్తున్నది --" అని.
సరే మరి , అందరూ అనుష్ఠానాలు , యాగాలు హోమాలు చేయలేరు కదా, వారి మాటేమిటి ?
అవును, వేదము నేర్చిన వారిలో కూడా అందరూ యాగాలు , యజ్ఞాలు చేయలేరు. సనాతన ధర్మములో ప్రతిదానికీ ఒక ప్రత్యామ్నాయము ఉంది.
వేదము నేర్చినా, యజ్ఞయాగాదులు చేయలేనివారికి " బ్రహ్మయజ్ఞము " అనే మహోత్కృష్ట సాధనము ఉంది. ఇది అందరూ అనుకొనే అగ్నిని కుండములలో ప్రతిష్ఠించి చేసే యజ్ఞము కాదు. ఇందులో కేవలము స్వాధ్యాయము [ వేదపఠనము ] మరియూ దేవ ఋషి పితృ తర్పణాలు ఉంటాయి . బ్రహ్మ యజ్ఞపు గొప్పదనము , విలువ , ఫలితము అంతాఇంతా కాదు. యాగాలు చేయకపోయినా, ఒక పద్దతి ప్రకారము ఆయా మంత్రాలను పఠిస్తే అంతే ఫలితమని వేదమే చెబుతుంది.
శతపథ బ్రాహ్మణములో , అగ్నిని ప్రతిష్టించి చేసే యజ్ఞాలకూ , బ్రహ్మయజ్ఞానికీ గల సారూప్యత ఆసక్తికరంగా చెప్పబడింది.
బ్రహ్మయజ్ఞములో భాగమైన వేదాధ్యయనములో నిమగ్నమైన వారి శరీరపు వివిధ అంగాలు , ఆయా శరీరపు కలాపాలు , ఇతర యజ్ఞాలలో ఉపయోగించు యజ్ఞాయుధాల[ ఉపకరణాల] తో పోల్చబడినాయి. యజ్ఞములో ఉపయోగించు జుహు, ఉపభృత్ , ధృవా మొదలగు ఉపకరణాలు , సంకేత రూపములో వాక్కు, మనసు , కన్నులతో పోల్చబడినాయి. బ్రహ్మ యజ్ఞపు చివర చేయు వేదాధ్యయనమే అవభృత స్నానమట !
అలాగే వేదము అధ్యయనము చేసినా, అధ్యాపనము చేసినా అదే ఫలితము. అధ్యాపనము [ నేర్పించుట ] చేసేవారు అధ్యాపనమే ఫలితముగా భావించాలి. శిష్యుల వద్దనుండీ ఏమీ ఆశించరాదు. ఒకవేళ వారేమైనా ఇస్తే , అది తనకు అవసరమైతే , ఉపయోగపడితే , తీసుకోవచ్చును. ఉపయోగపడనిదాన్ని , ఎంతగొప్పదైనా, వారే ఇచ్చినా సరే, తీసుకోరాదు.
ఇది తెలియని అనేకులు" వేదము నేర్పిస్తారా ? దానితో కడుపు నిండునా కాలు నిండునా ? " అని ప్రశ్నించి తమ అజ్ఞానాన్ని ప్రదర్శించుకుంటారు. మరికొందరు, వీరు వేదము నేర్పిస్తున్నారు-అనగానే , " పాపం , ఎంత బీదరికంలో ఉన్నారో, " అని జాలి కాదు, తమతో పోల్చుకుని, మిథ్యా తృప్తి పొందుతారు. తామెంత హీనస్థితిలో ఉన్నారో వారు ఎరుగరు.. వారికి అజ్ఞానమే బ్రహ్మానందము.
వేదము నేర్వని వారు యే గాయత్రీ మంత్రమో , అదీ రాని వారు పురాణాలు , ధార్మిక గాథలు, ఇతిహాసాలను చదివితే అంతేఫలితమని వేదములోని యజురారణ్యకములో స్పష్టముగా చెప్పి ఉంది.
కాబట్టి ఎవరికి వచ్చినది వారు చేయవచ్చు.
ఇక తర్పణాలకు కూడా పెద్ద తంతు అవసరము లేదు. ఆయా దేవతల, ఋషుల , పితరుల పేర్లు చెప్పి ఆయా తీర్థాలతో తర్పణము ఇవ్వడమే. తీర్థము అంటే , కుడిచేతి చూపుడు, బొటనవేలిని మడిచి, గోకర్ణ ఆకృతిలో ఉన్న ఆచేతి వేళ్ళ నుండీ ముందుకు నీరు వదిలితే అది దేవతీర్థములో వదలినట్టు.
కుడి అరచేతిలోని నీటిని చిటికెన వేలు కిందిగా ఎడమవైపుకు వదలితే అది ఋషితీర్థము.
చూపుడు వేలు, బొటన వేలు మధ్యనుండీ నీటిని కుడివైపుకు వదిలితే అది పితృతీర్థము. అరచేతిలోని నీటిని వెనక్కు--అనగా మణికట్టు వైపుకు వదిలితే అది బ్రహ్మ తీర్థము.

|| శుభం భూయాత్ ||

Sunday, April 8, 2018

దానము-ధర్మము-దక్షిణ

దానము-ధర్మము-దక్షిణ 






             దానము, ధర్మము , దక్షిణ అనేవి వేరు వేరు పదాలే అయినా వాటికి చాలా దగ్గర సంబంధము ఉంది. 

            సనాతన ధర్మములో దానానికి ఉన్న మహత్తు అంతా ఇంతా కాదు. మనము బాగుండాలంటే ’ పెట్టిపుట్టి ఉండాలి ’  అంటారు.. అంటే దానము చేసి ఉండాలి అని.  పూజకొద్దీ పురుషుడు, దానము కొద్దీ పిల్లలు అన్నారు. ఈ దానము అనే ఒక్క కర్మ మాత్రమూ విడవక చేస్తే ఇక వారికి జీవితమంతా పువ్వులబాటే అని శాస్త్రాలు  ఘోషిస్తున్నాయి. 

ఈ ’ దానము ’ అనే పదము మనకు మొట్టమొదట ఋగ్వేదములో కనపడుతుంది.  కేవలము ఒక సూచనాప్రాయముగా ఉటంకింపబడిన ఈ దానము అనే పదము రానురాను అత్యంత విస్తృతమైన అర్థము సంతరించుకొని, ముఖ్యమైన పుణ్యకర్మలలో ఒకటిగా భావింపబడుతున్నది. 

తపస్సు, జపము , ఇతర అనుష్టానాలతో సమానముగా ఈ దానము యొక్క విశిష్టత వర్ణింపబడినది. దీనిని ఋగ్వేదము ’ దక్షిణ ’ గా పేర్కొనింది [ 1. 125. 6 ] . అప్పటికాలములో దానము అంటే కేవలము ఆవులు , బంగారము మాత్రమే. అటుపిమ్మట అన్నదానము , విద్యాదానము , వంటి అనేక దానాలు గొప్పవని కీర్తింపబడినాయి. 

ఈ దానాలు / లేక దక్షిణలను రెండు విధాలుగా చూడవచ్చు
ఒకటి, సార్వజనికముగా సర్వేసర్వత్రా ఇచ్చే దానాలు
రెండు, బ్రాహ్మణులకు ఇచ్చే దక్షిణలు. 
వీటిని పాటించుట ద్వారా ధర్మము నిలబడుతుంది కాబట్టి , ధర్మాన్ని నిలబెట్టుట కోసము దాన దక్షిణలు ఇవ్వవలెను. ’ ధర్మము చేయండి ’ అనే మాటకు అర్థము అదే. 
అయితే ధర్మము అనే పదానికి అర్థము చాలా విస్తృతమైనది. సత్రములు , దేవాలయములు , భావులు , తోటలు, తోపులు  వంటివి కట్టించుట కూడా ధర్మము కిందకే వస్తాయి. 

దానధర్మములే మోక్షసాధనములు అని ఉపనిషత్తులు తేల్చి చెప్పాయి. 

ఉపనిషత్తుల ప్రకారము , దానము చేయుటవలన ఒక క్రమశిక్షణ కలిగి, మనుషులలో లోభము అనే దుర్గుణము పోతుంది. 
భగవద్గీత [ 16:1   మరియూ 17:20:22 ] కూడా దానమును ఒక గొప్ప దైవగుణముగా కీర్తిస్తుంది. 

వీటన్నిటినీ మించి, ధర్మశాస్త్రాలలోను, పురాణాలలోను దానము యొక్క విశిష్టత గొప్పగా వివరింపబడింది.

         దానమనేది నిత్యకర్మ కావచ్చు , లేదా నైమిత్తికమో, కామ్యమో, విమలమో [ అతి స్వఛ్ఛము ] అయిన కర్మ కావచ్చు. 
ఆకలిగొన్నవారికి ఆహారమును ఇచ్చుట నిత్య దానము లేదా నిత్యాన్నదానము.  దీనిని మనము అనేక దేవస్థానాలలోను , ఇతర ధార్మిక సంస్థలలోనూ చూస్తూనే ఉంటాము. 


        ఇక నైమిత్తికమంటే , ప్రత్యేక దినాలలో చేసే దానాలు. ఉదాహరణకు , గ్రహణాలు, సంక్రమణాల వంటి రోజుల్లో చేసేవి. అనేకులు తమ పుట్టినరోజునాడో, ఇతర ప్రత్యేకమైన దినాలలోనో చేస్తుంటారు..ఉగ్రరథ , భీమరథ శాంతులలో భాగముగా కూడా దానాలు ఇస్తారు. ఎవరైనా మరణిస్తే , వారి కర్మలు అయ్యాక, పదవరోజు దానాలు ఇస్తారు. . ఇవన్నీ నైమిత్తికమైనవి. 

     కామ్యములంటే  , ఏదైనా ఒక కోరిక తీరుట కోసము చేసిన పూజలు లేదా యజ్ఞాలలో భాగముగా దానములిచ్చుట. సాధారణముగా బంగారము , గోవులు దానము ఇస్తారు. 

      ఇక నాలుగోది, యతులు, సన్యాసులకు ఇచ్చే దానములు ’ విమలము ’ అనిపించుకుంటాయి. అక్కడ దాతకు యే కోరికా , అవసరమూ ఉండదు. కేవలము భక్తితోనో , దైవ చింతతోనో ఇచ్చేవి. 

ఈ దానాలు అన్నీ కూడా , మూడో కంటికి తెలియకుండా గొప్పకోసము కాకుండా ఇచ్చినపుడే , ఫలవంతములవుతాయి. 

         దానాలు, దక్షిణలు ధర్మానికి సంబంధించినవి కాబట్టి, వీటికి కొన్ని నియమాలు, కట్టుబాట్లూ ఏర్పడ్డాయి. 

దానము చేసే దాత, తనకు ఏ విధమైన ’ నివారింపలేని’  రోగములూ లేనప్పుడు, తనకు పాతకములు చుట్టుకొని లేనపుడు, తాను అనేక పుణ్యాలు చేసి, సద్గుణ సంపన్నుడై ఉన్నపుడు , ధనాన్ని న్యాయమార్గములో సంపాదించినప్పుడు మాత్రమే దానము చేయుటకు అర్హుడు. 
అంతే కాదు, గ్రహీత కూడా , ఆ దానమును తీసుకొనుటకు అర్హుడై ఉండవలెను. అతడు / ఆమె చెడు అలవాట్లు, చెడు శీలము కలిగిఉండరాదు. తాగుబోతులకు, జూదగాళ్ళకు, నేరస్తులకు దానము తీసుకొనే అర్హత లేదు. అట్టివారికి ఇవ్వరాదు. గ్రహీతలకు అన్న వస్త్రాలు , భూములు, ధనము వంటివి ఆ సమయములో అత్యంత అవసరమై ఉండవలెను. అట్టివారికి మాత్రమే దానము ఇవ్వవచ్చును. 

దాతకు ఉండాల్సిన మరికొన్ని అర్హతలు , దానము మీద శ్రద్ధ , భక్తి కలిగి ఉండటము , పుణ్యసంపాదన అనే ఉద్దేశము కలిగిఉండటము ముఖ్యము. అంతే కానీ, వారు ఎంత ఇస్తున్నారు అనేది ముఖ్యము కాదు. అయితే తాముఇచ్చే వస్తువులు / పదార్థములు ఉపయోగయోగ్యములుగా ఉండవలెను. పాడైపోయిన పదార్థాలు , వట్టిపోయిన ఆవులు , ఇతరలోహములు కలిపిన బంగారము--వంటివి ఇవ్వరాదు. 

దాత , గ్రహీత కూడా , అక్రమ మార్గాల ద్వారా సంపాదించిన ధనమును దానములో విసర్జించాలి. అట్టివి ఇవ్వరాదు, తీసుకొనరాదు. అలాచేస్తే విపరీత పరిణామములు కలుగుతాయి. 

ఒక గృహస్తు, తనకు శక్తికి మించిన దానములు ఎన్నటికీ చేయరాదు. పుణ్యము వస్తుందని , అప్పులు చేసి దానములు ఇవ్వరాదు. తాను ఇచ్చే దానమువలన తన కుటుంబ సభ్యులు నష్టము, కష్టము అనుభవింపరాదు. సాధారణముగా , గృహస్తులు తమ ఆదాయములో పది శాతము వరకూ దానాలు ఇవ్వవచ్చు. కనీసము పదిశాతము ఇవ్వవలెను-అని దీని అర్థము కాదు. 

ఇక దానము ఇవ్వకూడని వస్తువులు/ పదార్థములు

తనకు చెందని వస్తువులు / పదార్థములను ఎన్నటికీ దానము చేయరాదు, అటువంటివని తెలిస్తే తీసుకోరాదు. ఇతరుల నుండీ అరువు తెచ్చుకున్నవీ, ఇతరులు తమవద్ద రక్షణకోసము ఉంచినవీ దానాలు ఇవ్వరాదు. 

ఇక గ్రహీతలు కూడా , ’ స్వధర్మానికి ’ సంబంధించని దానాలు స్వీకరించరాదు. ఉదాహరణకు , ఒక శ్రోత్రియ బ్రాహ్మణుడు, ఆయుధములు , మత్తుపదార్థములు వంటివి ఇచ్చిననూ తీసుకోరాదు. 
దానాలు ఇవ్వవలసిన / తీసుకోతగిన దినములు

ముందే చెప్పినట్టు, ఉత్తర దక్షిణాయన పుణ్యకాలములందూ, గ్రహణకాలము లందూ , సంక్రమణ కాలములందూ , అమావాస్య, పౌర్ణమిలయందూ , ఏదైనా ప్రత్యేక పర్వదినములందూ  దానము ఇచ్చుట, తీసుకొనుట ప్రశస్తమైనది. 
తీర్థయాత్రలలో, పుణ్యక్షేత్రములలో ఇచ్చిన దానాలు అత్యంత శ్రేష్టమైనవి. 
ఒకసారి దానము ఇచ్చిన తరువాత దానిని తిరిగి తీసుకోరాదు. దానము ఇస్తానని మాట ఇచ్చిఉంటే , ఆమాట తిరిగితీసుకోరాదు. దానము ఇచ్చే తీరవలెను. అయితే , మతిస్థిమితము లేనివారు, తీవ్రమైన రోగములతో బాధపడువారు, పరిపక్వత లేని చిన్నపిల్లలు ఇచ్చిన దానాలకు ఇది వర్తించదు. 

దానములన్నిటిలోకి గోదానము , సువర్ణ దానము , తులాపురుషదానము గొప్పవిగా శాస్త్రాలు చెపుతాయి. 
" తులా పురుషదానము " నకు సంబంధించిన మరిన్ని వివరాలు ఈ బ్లాగులోనే ఇక్కడ చూడవచ్చు. 

http://vibhaataveechikalu.blogspot.in/2014/03/blog-post_28.html

జ్ఞానదానము , విద్యాదానము , ధర్మమునకు సంబంధించిన విషయ దానము అతిగొప్పవని శాస్త్రాలు చెబుతాయి. దానమువలన శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు అని మహానారాయణోపనిషత్ అంటుంది. 

ఇక దక్షిణ ల గురించి. 

దక్షిణ కూడా ఒక విధమైన దానమే అయిననూ, దక్షిణ ఇచ్చుటలో దాతకు ఒక బద్ధత అనేది ఉంటుంది. అనగా , ఇక్కడ దానమిచ్చుట అనేది దాత ఇష్టాఇష్టాలపై పూర్తిగా ఆధారపడదు. అది ఒక బాధ్యత. ఒకరినుండీ ఏదైనా ఒక ఉపకారము పొందినపుడు, ప్రత్యుపకారముగా ఇచ్చేదే దక్షిణ లేక సంభావన. 

ఇది ఎవరికైనా ఇవ్వతగినదేకానీ ఎక్కువగా ధార్మిక కార్యాలు జరిపించి ఇచ్చే పురోహితులకు , బ్రాహ్మణులకు ఎక్కువగా ఇది వర్తిస్తుంది. దక్షిణ అనేది వారి సేవలకు ప్రతిఫలము అనో, భత్యము అనో, జీతము అనో , రుసుము అనో అనుకుంటే అది పూర్తిగా దోషభూయిష్ఠమైన ఆలోచన. ఋణమును తీర్చుకొనుట ఎటువంటి బాధ్యతో, మనకు పాపమును పోగొట్టి, పుణ్యమును పక్వమునకు వచ్చునట్లు చేయు బ్రాహ్మణులకు దక్షిణ నిచ్చుట కూడా అటువంటి బాధ్యతే.  దురదృష్టముకొద్దీ ఈ కాలములో దక్షిణ అంటే అది ఒక రుసుముగా  భావిస్తున్నారు. ఇది పూర్తిగా తప్పు. 

ధార్మిక కార్యక్రమాలు చేయించుట ద్వారా బ్రాహ్మణులు యజమానికి తన పుణ్యము పక్వమునకువచ్చునట్లు చేయుటే గాక, అతడిచ్చు దక్షిణ స్వీకరించి అతడి పూర్వ పాపములో భాగము పంచుకొంటున్నాడు. ఆ పాపాన్ని పోగొట్టుకొనుటకు ఆ బ్రాహ్మణుడు ప్రాయశ్చిత్తములు చేసుకొనవలెను. 

సాధారణముగా త్రికాల సంధ్యావందనము వలన ఆ పాపములు శమించుచుండును. కానీ ఒక్కొక్కసారి అంతకుమించిన ప్రాయశ్చిత్తములు కూడా చేసుకొనవలసి వచ్చును. 

బ్రాహ్మడికి దక్షిణ ఇంత అనీ ఎక్కడా నిర్వచనము లేదు. అయితే , " విత్త శాఠ్యము " లేకుండా , తనకు ఉన్న శక్తికొలదీ వీలైనంత ఎక్కువగా ఇచ్చి బ్రాహ్మణుడిని సంతృప్తి పరచవలెను. బ్రాహ్మణుడు చేయించిన పూజల/ హోమాల ఫలితము పూర్తిగా యజమానికి దొరకవలెనంటే అతడు  తన శక్తికొలదీ దానము దక్షిణగా ఇవ్వవలెను. పీనాసితనము చేయరాదు. శక్తి ఉండీ తక్కువ దక్షిణను ఇచ్చినచో అతడి కార్యము అంతమేరకు కుంటుబడుతుంది. కావలసిన కార్యములు దానివలన పూర్తిగా సఫలము కావు. శక్తిలేనివాడు తక్కువ ఇచ్చినా కూడా అతడి కార్యము పూర్తిగా సఫలమవుతుంది. కాబట్టి, తన శ్రేయస్సు కోసము , బ్రాహ్మణుడి చేత కార్యములు చేయించుకొను యజమాని ఎప్పుడూ కూడా వీలైనంత ఎక్కువగా దక్షిణ ఇచ్చుచుండవలెను. 

ఇక, దక్షిణ ఎప్పుడు ఇవ్వాలి అనునది-
ఏదైనా కార్యము ముగిసిన వెంటనే దక్షిణ ఇచ్చినచో అది యజమానికి సర్వశుభములనూ కలుగజేయును. 
అలాకాకుండా , ఏ కారణము చేతనైనా వెంటనే ఇవ్వలేక పోతే , ఒక రాత్రి గడిచాక ఇస్తే , ఆ దక్షిణను రెట్టింపుగా ఇవ్వవలెను. 
ఒక మాసము గడిచినా ఇవ్వకుండా, తరువాత ఇస్తే దక్షిణను , తాను అనుకున్నదానికన్నా వందరెట్లు ఎక్కువ ఇవ్వవలెను. 
రెండు మాసముల తరువాత ఇస్తే , వెయ్యిరెట్లు ఇవ్వవలెను.
 సంవత్సరము గడిచాక ఇస్తే , అది నిష్ప్రయోజనమే కాక, ఆ యజమానికి నరక ప్రాప్తి తప్పక కలుగును అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. 

ఈ కాలము ’ ఎంత ఇవ్వాలి ?’ అని ముందే అడుగుతున్నారు. లేదా , అతి తక్కువ ఇవ్వ జూపి, బ్రాహ్మణుడి చేత " అంత చాలదు, ఇంకాఎక్కువ ఇవ్వండి " అని చెప్పించుకునేలా చేస్తున్నారు. బ్రాహ్మణుడిచేత అలాగ నోరుతెరచి ’ దక్షిణ ఇంత ఇవ్వాలి ’ అని చెప్పించుకుంటే , అది మరొక పాపముగా పరిగణింపబడుతుంది. దానికి ప్రాయశ్చిత్తముగా ఇంకా ఎక్కువ ఇవ్వవలసి ఉంటుంది. ఇవన్నీ ధర్మ శాస్త్రాలలో విపులముగా చర్చించిన విషయాలు. 

బ్రాహ్మణుడి చేత తమకు కావలసిన కార్యము  జరిపించుకుని , తామేదో దానము ఇస్తున్నట్టు అహంకారము చూపిస్తూ బ్రాహ్మణులను తక్కువ చేసి వేధించేవారికి కులనాశనము , వంశ క్షయము , కుటుంబములో ఈతి బాధలు మొదలవుతాయి. 
బ్రాహ్మణుడు కూడా ఎప్పుడూ తన నోటితో ’ నాకు ఇంత కావలెను, ఇది కావలెను ’ అని అడుగరాదు. అలా అడిగితే , ’ మీ పాపము నాకు రావలెను ’ అని అడిగినట్టే. అలా వచ్చిన పాపమును పోగొట్టుకొనుట అంత సులభము కాదు. 
" ఈ కాలములో ఇంత ఇస్తున్నారు, మీరు చూసి, శక్తివంచన లేకుండా ఇవ్వండి ’ అని చెప్పవచ్చును. 

ఇక చివరగా " గురుదక్షిణ " 
గురువుగారు తాను విద్యాదానము చేసిన శిష్యుడి నుండీ తీసుకునే దానమే " గురుదక్షిణ " 
గురుదక్షిణ ’ ఇది ’  లేక ’ ఇంత ’ అని గురువు చెప్పవచ్చును. లేదా గురువుగారికి ఏది అవసరమో, ఏది ఇష్టమో చూసి శిష్యుడే తెలుసుకొని ఇవ్వవచ్చును. గురుదక్షిణ ఇవ్వడానికి ఒక కాలపరిమితి అంటూ లేకపోయినా , సాధారణముగా విద్యార్జన అయిన తరువాత వెంటనే ఇచ్చుట ఆనవాయితీ. 

|| స్వస్తినో బృహస్పతిర్దధాతు || 

Friday, March 30, 2018

శృంగేరీ జగద్గురువుల సంస్కృత అనుగ్రహ భాషణము-- తెలుగు అనువాదము

|| ఓం శ్రీ గురుభ్యో నమః ||


శృంగేరీ జగద్గురువులు గత జనవరి నెలలో శృంగేరీ క్షేత్రములోని ఒక సంస్కృత విద్యాపీఠపు రజత మహోత్సవములో , సంస్కృత భాష , శాస్త్రములు , వేదములు మానవజీవితానికి ఎందుకు అవసరమో తెలుపుతూ చేసిన సంస్కృత భాషలోని అనుగ్రహ భాషణమును తెలుగులోకి అనువదించాను. 

ఇందులో  సరిగ్గా నేను అనువాదము చేసి ఉంటే , అదంతా జగద్గురువుల ఆశీర్వాద బలముచేతమాత్రమే . ఏవైనా తప్పులు ఉంటే అవి నా అజ్ఞానము వల్లనే. దానికి ముందస్తు క్షమాపణలు .


|| నిత్యాక్ష హారం మణివలయ 
మనోజ్ఞేః పాణి పద్మైర్దధానా ||
|| సితవసన లలామా  తుంగ ముక్తాభిరామా |
| వసతు శశినిభాస్యా వాచి వాగ్దేవతా నః ||


పాతిక సంవత్సరాల పూర్వము ఈ శృంగగిరి క్షేత్రములో  ప్రారంభించబడిన ’ రాజీవ్ గాంధీ విశ్వవిద్యాలయము’   పేరుతో వ్యవహరింపబడుతున్న ఈ సంస్కృత విద్యాలయము యొక్క రజత మహోత్సవము ప్రస్తుతము జరుపుకుంటున్నందుకు  అత్యంత సంతోషించినాము.

ఈ విద్యాలయము యొక్క ప్రారంభము ఏవిధముగా జరిగినది అన్నది , ఈ మఠము యొక్క ప్రశాసనములో స్వకీయమైన భాషణము ద్వారా నిరూపించబడినది . 

దీనికి ముందే , శృంగగిరి క్షేత్రములో చాలా కాలమునుండీ వేద, శాస్త్రముల ప్రచారము కోసము ఒక సంస్కృత పాఠశాల నడుస్తున్నది. మా పూజ్య గురువులు , ప్రాతఃస్మరణీయులుయైన జగద్గురు శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతీ స్వామి వారి చేత నూట ఇరవై ఐదు సంవత్సరముల ముందు ఈ క్షేత్రములో " సద్విద్యా సంజీవిని " పేరుగల సంస్కృత మహాపాఠశాల ఆరంభింపబడినది. ఆ పాఠశాలయొక్క ఏకైక లక్ష్యము, ’ వేద, శాస్త్రముల ’ ప్రచారము చేయుట. 

’ వేద శాస్త్రముల గురించి మాత్రమే ఎందుకు ’ అని మీరు అడిగితే , వేదశాస్త్రముల ప్రచారమే లేకపోతే , అప్పుడు మనము మన ధర్మము యొక్క స్వరూపాన్ని తెలుసుకొనుటకు అశక్తులము అవుతాము. ఏలననగా , ధర్మముయొక్క స్వరూపము వేదశాస్త్రముల చేతమాత్రమే తెలుసుకొనదగినది. వేదశాస్త్రాల్లో ధర్మము యొక్క స్వరూపము నిక్షిప్తమై ఉంటుంది. ఒకవేళ వేదముయొక్క , లేదా శాస్త్రము యొక్క జ్ఞానము లేకుంటే , ఆ ధర్మమును ఇంకేవిధముగానూ తెలుసుకోలేము. ఎప్పుడైతే ధర్మముయొక్క స్వరూపమునే  తెలుసుకోలేమో, అప్పుడు దాన్ని ఎలాగ అనుష్ఠించగలము , ధర్మానుష్ఠానము లేకుండా సుఖము ఏలాగున లభ్యమగును ?. సర్వజనులూ తమకు సుఖమునే కోరుకొందురు. ఆత్మ సుఖము కోరనివాడు, లేదా తనకు దుఃఖము కోరుకొనువాడు ఎవరూ ఉండడు. అట్టి సుఖముయొక్క అభిలాష ధర్మాచరణ చేత మాత్రమే సిద్ధిస్తుంది. ధర్మాచరణము లేకుండా సుఖప్రాప్తిగానీ , సుఖవాంఛ గానీ అత్యంత అనుచితమైనది. అసాధ్యమైనది కూడా!  కాబట్టి, ధర్మాచరణము చేయవలెనంటే , ధర్మపు జ్ఞానము అవసరము , ధర్మాన్ని తెలుసుకొనుటకు వేదశాస్త్రాల పరిచయము అత్యావశ్యకము. 

అందుకని ఈ వేదశాస్త్రముల ప్రచారము అత్యంత అపేక్షితమైనది అని భావించి ఆ పాఠశాల ఈ క్షేత్రములో నూట ఇరవై అయిదు సంవత్సరాల పూర్వము ప్రారంభింపబడినది. 

ప్రస్తుతము, లోకుల మనసులలో విదేశసంస్కృతి , మన సంస్కృతికన్నా ఎక్కువగా ప్రచారములో ఉంది. విదేశ సంస్కృతి చేత ఆకర్షింపబడిన ప్రజలు విదేశ సాంప్రదాయాలను ఆచరించుట చాలా సముచితము అన్న భ్రమలో ఉన్నారు. విదేశీయులు దేన్ని ఆచరిస్తున్నారో, వారు ఎలాగ వేషభూషణ భాషలను ప్రదర్శిస్తున్నారో , వారు ఏ విధముగా భోజనము చేస్తారో ,ఏ విధముగా గానము చేస్తారో అదే మంచిది అన్న భ్రమ, మనవారి మనసులలో నిలచిపోయింది. మన వాస్తవికమైన స్థితి ఎటువంటిది, మన నిజమైన సాంప్రదాయాలు ఎట్టివి అన్నది మనవారు అందరూ మరచిపోయారు.


 ఈ దుష్ట పరిస్థితి, రెండువందల యాభై సంవత్సరాలనుండీ, ఆంగ్లేయుల పరిపాలన జరగడము వలన మన మనసులు కలుషితమై  ప్రావిర్భవించినది . ఆ ఆంగ్లేయులు, " ఎప్పుడైతే ఈ భారతీయులు తమ స్వధర్మాన్ని మరచిపోతారో,  తమ సంస్కృతిని మరచిపోతారో,  తమ సంస్కృత భాషను మరచిపోతారో, అప్పుడే తమ కార్యము సులభముగా చేయవచ్చును "  అని వారు అనేక కార్యాలను చేయనెంచినారు.  వారికి ఇఛ్ఛ వచ్చినట్టు చేయవచ్చని , మన సంస్కృత భాషను ’ మృత భాష ’ గా ప్రచారము చేయాలని భావించి అటువంటి కార్యాలను మొదలుపెట్టారు. 

" ఎప్పుడైతే   మన సంస్కృత భాషపై జనులకు శ్రద్దాసక్తులు తగ్గిపోతాయో , అప్పుడు ఎవరూ ఈ భాషను అభ్యసించరు, మరియు, ఈ భాషయొక్క అనభ్యాసము వలన వేద శాస్త్రాల అభ్యాసము లుప్తమవుతుంది, సనాతన ధర్మపు గ్లాని కలుగుతుంది అప్పుడు అందరూ విదేశీ సంస్కృతిని ఆచరిస్తారు " అని వారు తలచి, సర్వ ప్రథమముగా సంస్కృత భాషను ’ మృతభాష ’ అని ప్రచారము చేసి మన మనసులలో సంశయాలకు బీజము వేసినారు.

 మనలోని కొందరు మూర్ఖులు, వారు చెప్పినది సత్యమని తలచి మన భాషను విస్మరించి, సంస్కృత భాషపైన శ్రద్ధను వహించక తాత్సారము చేసి సంస్కృత భాషాభ్యాసము మానేసి తమ జీవితాలను గడుపుచుండేవారు. దానితో ఆంగ్లేయులు తాము కృతార్థులమైనట్టు భావించారు. తాము అనుకున్నది జరిగింది, అందరూ తమ సంస్కృతభాషను మరచేటట్టు చేశాము , దీనితో మేము పూర్తిగా కృతార్థులము అయినట్టే అని వారనుకున్నారు. 


అయితే పరమేశ్వరుని కృపవల్ల, మన భారతీయుల మనసులలో సంస్కృతభాష పైన శ్రద్ధ అంకురించింది. ఆ శ్రద్ధను అంకురింపజేయుటకు , ఆ శ్రద్ధను వృద్ధిచెందించుటకే మన పరమపూజ్య గురుసమానులు కొన్ని ప్రయత్నాలను చేయాలని అనుకున్నట్టుగానే , వారి ప్రయత్నములచేతనే శృంగేరీ ’ సద్విద్యా సంజీవిని ’ సంస్కృత పాఠశాల సమారంభమైనది. వారిమార్గములోనే నడుస్తున్న మనము , ఆ సంస్కృత భాషా ప్రచారము కోసము ఎన్నో దారులు వెతికాము. " సుర సరస్వతీ సభా" యొక్క ప్రతిష్ఠాపనము, అక్కడక్కడ సంస్కృత పాఠశాలల ఉద్ఘాటన , శాస్త్ర సభల ఆయోజనము , శాస్త్రవిద్వాంసుల సమ్మానము, శాస్త్రాధ్యయనము చేసేవారికి ప్రోత్సాహము , ఇటువంటి విహితమైన క్రమములు మాచేత చేపట్టబడినవి. 

దీని ఫలితముగా అక్కడక్కడా సంస్కృత విద్వాంసులను ఈనాడు మనము చూస్తున్నాము. సంస్కృతము మీద ఉత్సాహము , శ్రద్ధ గల విద్యార్థులను చూడగలుగుతున్నాము.  మరియూ , శాస్త్ర , వేద విషయములలో కూడా శ్రద్ధ కలిగిన ఆస్తికులను కూడా చూడగలుగుతున్నాము. ప్రస్తుతము చాలామంది ఆస్తికులు ఉన్నారు. వారు స్వయముగా సంస్కృతము గానీ , వేదమునుగానీ నేర్వకున్ననూ , ఎరుగకున్ననూ , వాటిలో అతిగొప్ప శ్రద్ధను కలిగిఉన్నారు. 

సంస్కృతముయొక్క ప్రచారమునకు సహాయము చేయుటకు ’ నేనంటే నేను ’ అంటూ ముందుకు వస్తున్నారు. అందువల్ల ఈ సంస్కృత ప్రచారము కొరకు మేము చేస్తున్న ప్రయత్నాలలో ఇక్కడ , శృంగేరీ సంస్కృత విద్యాపీఠము యొక్కస్థాపనము అనన్యమైనది . 

పూర్వ ప్రధాని , మమ్ములను చూచుటకు శృంగేరికి వచ్చినపుడు, వారి సమక్షములో ఈ విషయము మాచేత ప్రస్తావించబడినది. వారు కూడా మా మనసులోని ఈ సంకల్పాన్ని  ఎంతో శ్రద్ధతోను, సంతోషముతోను ఆమోదించినారు. మా సంకల్పము ను తప్పక నెరవేర్చెదమని ప్రతిజ్ఞ చేసినారు. వారి ప్రతిజ్ఞాపాలనము వల్లనే , ఈ ’ రాజీవ్ గాంధీ విద్యాలయము ’ అను  సంస్కృత విద్యాపీఠముయొక్క స్థాపనము జరిగినది. మా మనస్సు అత్యంత ప్రమోదమును పొందినది. భగవతీ శారద మా పైన అత్యంత అనుగ్రహము కలిగియున్నది అన్న తృప్తి కలిగినది. 


విద్యాపీఠముయొక్క స్థాపనమయితే అయింది కానీ అందులో అధ్యాపకులు ఎటువంటి వారుండవలెను , ఇక్కడ అధ్యయనము ఏ విధముగా జరగాలి, అని మరలా మా మనసులో కొంత దిగులు కలిగినది. ఆ దిగుళ్ళు కూడా భగవతీ కృపవల్ల నివారించబడి,  న్యాయము , వేదాంతము , వ్యాకరణములలోను, మీమాంస లోనూ నిష్ణాతులైన విద్వాంసులు ఇక్కడ నియమింపబడినారు.  మరి యే విద్యాపీఠములలోనూ చూచుటకు దొరకనటువంటి విద్వాంసులు ఇక్కడ అధ్యాపనములో నిరతులై ఉండుట మేము భగవతీ శారద యొక్క కృపగా భావిస్తున్నాము. 

ఇక్కడ అధ్యయనము చేస్తున్న విద్యార్థులు కూడా అమిత ఉత్సాహముతో , గొప్ప శ్రద్ధాభక్తులతో అభ్యసిస్తున్నారు. ఇదంతయూ సాక్షాత్కరించుకోవడము , సర్వులకూ శుభము కలుగుట ,  భగవతీ శారద యొక్క అనుగ్రహము తప్ప మరొకటి కాదు అనుటలో యేమాత్రమూ  సంశయమూ లేదు. 


ఈ సురభారతి యొక్క ప్రచారము మా అందరి అన్ని కర్తవ్యములకన్నా అత్యంత ముఖ్యమైనది అని మేమందరమూ  భావిస్తున్నాము. అందరికీ ఒక్కొక్క కర్తవ్యము ఉంటుంది ,  కానీ అందరూ కలసి ఒక్క కార్యమును చేయుట అనేది సుర సరస్వతి యొక్క ప్రచారము. కాబట్టి మా కర్తవ్యమునుండి  ఎప్పుడైనా కూడా , యే మాత్రము కూడా విచలితులము కాకూడదని , ఏ విధమైన కష్టములు వచ్చినా కూడా  ఈ కర్తవ్యము తప్పక నిర్వహించవలసినదే అని, ఈ కర్తవ్యాన్ని మేము నెరవేర్చవలసినదే ఈ సంకల్పము అందరి మనసులలోనూ సుదృఢముగా ఉండాలని నా కోరిక. 

చాలామంది , " శాస్త్రములను అధ్యయనము చేస్తే ప్రయోజనమేమి ? "  అని సంశయిస్తారు. అయితే ఒక్కొక్క శాస్త్రమునూ అధ్యయనము చేస్తేనే గానీ అక్కడ ఎన్నెన్ని విషయములు ఉన్నవి , మన జీవితాలను సార్థకము చేయుటకు ఎన్ని మార్గములు శాస్త్రములలో చెప్పబడినవి , అన్న విషయము శాస్త్రాధ్యయనము  తరువాత మాత్రమే తెలుస్తుంది. శాస్త్రము చదవకుండా వాటిని అర్థము చేసుకొనుట వీలుకాదు. కాబట్టి, శాస్త్రములను అవగాహన చేసుకొని , జీవితమును ఫలవంతముగా గడిపే దారి ని శాస్త్రాధ్యయనము ద్వారా సరిగా  తెలుసుకోగలుగుతాము. 


సర్వులకూ జీవిత అంతిమ లక్ష్యము మోక్ష ప్రాప్తి. మోక్షప్రాప్తితోనే  జీవితము సార్థకము అవుతుంది.  లేకపోతే మరల మరల ఈ జీవన ప్రవాహములో మగ్నము , నిమగ్నము అగుటయే మన భాగ్యము అవుతుంది. ఎంతవరకూ మనము ఈ జనన , మరణ ప్రవాహము నుండీ బయటకు రాలేమో , అంతవరకూ  మనకు సుఖలేశమూ ఉండదు , లేదు.  ఈ జనన మరణ ప్రవాహమునుండి బయటకు ఎప్పుడు రాగలమంటే , శాస్త్రములలో యే సాధన మార్గములు చెప్పబడి ఉన్నవో , వాటి అనుసరణము చేత మాత్రమే అది సాధ్యము. ఆ మార్గములు శాస్త్రములచేత మాత్రమే ప్రదర్శింపబడినవి, శాస్త్రములచేత ఉక్తమైన  ప్రదర్శింపబడిన అట్టి సన్మార్గములు మాత్రమే మన చేత పాటింపదగినవి. కాబట్టి అందుకోసమే మనమందరికీ శాస్త్రాధ్యయనము అనివార్యము అయినది. 

పూర్తిగా శాస్త్రాధ్యయనము చేయలేకున్ననూ , వాటిలోని సారాన్ని గ్రహించి పాటించి , జీవితాలను సార్థకము చేసుకొనుట మన విధి. కాబట్టి మన అందరి అభ్యుదయము కొరకూ మూలభూతమైనవే ఈ రెండూ-- శాస్త్రము , మరియూ సంస్కృత భాష. కాబట్టి శాస్త్రముల అధ్యయనము , వేదాభ్యాసము అనునవి మన శ్రేయస్సుకోసమే కల్పింపబడినవి. మన శ్రేయస్సును మనమే సాధించాలి. వేరొకరు మన శ్రేయస్సుకు సాధకులు కాలేరు. మన శ్రేయస్సును మనమే సాధించాలంటే , శాస్త్రాలను , సంస్కృత భాషను అవశ్యము అభ్యసించవలెను. దానికోసమే ఈ విద్యాపీఠము సమారంభమైనది .. 

ఇప్పుడు దీనికి ఇరవై అయిదేళ్ళు గడచినవి. ఇరవై ఆరో సంవత్సరములో ఈ విద్యాపీఠము అడుగు పెట్టబోతున్నది. ఇదే విధముగా ఇంకో ఇరవై అయిదేళ్ళ తరువాత స్వర్ణోత్సవము , అటు పిమ్మట శతమానోత్సవము కూడా జరుగుతుంది. అటువంటి ఆ ఉత్సవాలలో భాగము వహించుటకు మాకు సాధ్యము కాకున్ననూ , ఈ ఉత్సవాలు తప్పకుండా జరుగుతాయి అని విశ్వసిస్తున్నాము. శారదా భగవతిని మీ అందరి శ్రేయస్సు అనే పరంపరలో భాగము వహించమని ప్రార్థిస్తున్నాము. 


ఈ రజత మహోత్సవము యొక్క ఆచరణలో గొప్ప శ్రద్ధతోను, ఉత్సాహముతోను అనేకులు తమ కర్తవ్యాన్ని నిర్వహించినందుకు మీ అందరికీ ఆశీర్వాదములను ఇస్తున్నాను. 
ఈ కర్నాటక రాజ్యము యొక్క రాజ్యపాలులైన  సహృదయాగ్రేసరులు వజుభాయి వాలా  మహోదయులు ఇక్కడికి వచ్చి , తమ భావములను ఇక్కడ ప్రకటించినారు. అది విని మాకు అత్యంత ప్రమోదము కలిగినది. మన భారతీయ సంస్కృతి , మన సంస్కృత భాషలలో వారికున్న శ్రద్ధ ఎంతో శ్లాఘనీయము. అందుకు వారికి విశిష్ట ఆశీర్వాదములను అందిస్తున్నాము. ఇదేవిధముగా , మన కర్నాటక సంసద్ సదస్యులు , మన శృంగేరీ శాసక సభ్యులు , కర్నాటక విత్తకోశపు మహా ప్రబంధకులు మొదలుగా అనేకులు ఇక్కడికి వచ్చి సంసృత భాష మీద తమకు గల శ్రద్ధను ఇక్కడ ప్రకటించినారు. వారందరికీ కూడా మా ఆశీస్సులు.  ఈ సంస్థానము యొక్క కులపతి ’ పరమేశ్వర నారాయణ భట్టులు , ఈ  విద్యాపీఠముయొక్క ప్రాచార్యులు సచ్చిదానంద భట్టు లు ఈ కార్యక్రమమును ఎంతో శ్రద్ధతో చేసినందుకు వారికి నా ఆశీర్వాదములు. ఇక్కడ సమావేశమైన సర్వులకు భగవతీ శారద తన శ్రేయః పరంపరతో సర్వదా సర్వులనూ  అనుగ్రహించాలని  ప్రార్థించి , అందరికీ ఆశీర్వాదములతో నా భాషణమును ముగిస్తున్నాను. 

https://www.youtube.com/watch?v=c2Fduv_9dz8

Friday, April 7, 2017

వేదములో గో రక్షణ



            ఈనాడు గోవధ గురించి విశేష చర్చ జరుగుతున్నది. గోవులను హింసించరాదనీ , గోమాంస భక్షణ చేయరాదనీ సనాతన ధర్మ పరాయణులు అంటుంటే , ఒకరి ఆహారపుటలవాట్లను నియంత్రించుటకు ఇంకొకరికి అధి కారము లేదు అంటూ మరి కొందరు వాదిస్తున్నారు. 
మానవుడు సహజముగా స్వేచ్ఛాజీవి. తన మనసుకు నచ్చినట్లు ఉండుట , ప్రవర్తించుట ...అతని ప్రాథమిక హక్కులు. కానీ ఇక్కడ గమనించవలసినది యేమంటే , ఆ ప్రాథమిక హక్కుల వలన అతడికి సంతృప్తి కలిగినంత మాత్రాన చాలదు. ఇతరులకు అసంతృప్తిగానీ కష్టము గానీ కలుగరాదు. ఎందుకు ?  
           ఎందుకంటే , మానవుడు సంఘజీవి.. అరణ్యాలలో , ఇతరుల సంపర్కము లేకుండా జీవించేవారికి అంతటా స్వేచ్ఛే ఉంటుంది. కానీ ఎప్పుడైతే సంఘములో ఉండి జీవించాలనుకుంటాడో అప్పుడే కట్టుబాట్లు మొదలవకా తప్పదు , వాటిని పాటించకా తప్పదు. నేను ఇవేవీ పాటించను , నా అలవాట్లు , నా ఇష్టము అంటూ వాదిస్తే , దాని అర్థము , " నేను ఆదిమ వాసిని , నాకు యే సంస్కారమూ లేదు , నాకు ఒకరి కష్టాలతో గానీ భావాలతో గానీ పని లేదు " అని నిర్లజ్జగా చెప్పుకున్నట్టే. 

ఒకవేళ , దీనికి కూడా సమ్మతించని  వారుంటే , నిస్సందేహముగా వారు తమ వాదనను , తమ హక్కులను గురించి తగిన వేదికలలో [ కోర్టులు వంటివి] చర్చించి ఒక తెన్నుకు రావచ్చు.

ఈ వ్యాసపు ఉద్దేశము , గోమాంస భక్షణ చేయవచ్చునా కూడదా అన్నది కానేకాదు. 
మరోసారి చదవండి , 
ఈ వ్యాసపు ఉద్దేశము , గోమాంస భక్షణ చేయవచ్చునా కూడదా అన్నది కానేకాదు.

అది నిర్ధారించుటకు సాధికారికత కలిగిన అనేకులున్నారు. 

       గోమాంసము తినవచ్చు అని  వాదించేవారు కొందరు , సనాతన ధర్మములో అతి పవిత్రముగనూ , ప్రామాణికము గనూ భావించి పూజించే వేదాలను వక్రీకరించే ప్రయత్నము చేస్తూ , తమ వాదనకు బలము తెచ్చుకోవడానికి సమాయత్తమవుతున్నారు. వారి వక్రీకరణలు , వాదనలూ  సత్యదూరాలనీ , యే మాత్రమూ బలము లేనివనీ , ఎంతమాత్రమూ గౌరవించవలసినవి కావనీ సత్యాలతో , సాక్ష్యాలతో సహా నిరూపించుటయే ఈ వ్యాసపు ఉద్దేశము.  

         వేదాలలో వర్ణించిన యజ్ఞ యాగాదులలో గోవధ , గోమాంస భక్షణ ఉన్నాయనీ కాబట్టి గోవధ తప్పేమీ కాదని గోమాంస భక్షణ అనాదిగా హిందువులు చేస్తూనే ఉన్నారనీ ఇప్పుడు కొత్తగా వాటిని నిషేధించడము యేమిటనీ ... ఇటునుంచీ నరుక్కు రావడానికి వారు ప్రయత్నిస్తున్నారు. మనసంతా మురికి పట్టిన మరి కొందరు , ఆ నటుడు , ఈ రాజకీయ వేత్త , ఫలానా పాత్రికేయుడూ హిందువులు మాత్రమే కాక , బ్రాహ్మణులు కూడా అనీ , వారే గోమాంసము తింటున్నారనో , లేక తప్పుకాదంటున్నారనో.... తమ వాదనను ఇతరులచేత ఒప్పించాలని విశ్వ ప్రయత్నము చేస్తున్నారు.. ఆ స్థాయికి దిగిపోయిన వారిని పట్టించుకోవడమే వృథా. అసలు వేదములో చెప్పినదేమిటి ?



 వేదాలలో గోవును పూజించి రక్షించమనే చెప్పి ఉంది గానీ గోవును హింసించమని ఎక్కడా చెప్పలేదు. 

         యజ్ఞయాగాలను సంపూర్ణముగా వివరించేది యజుర్వేదము మాత్రమే. యజ్ఞ యాగాలకు సంబంధించిన సమగ్ర సమాచారమూ సాధికారికముగా చర్చించినది యజుర్వేదములో మాత్రమే.. ఇతర వేదాలలో కూడా అక్కడక్కడా కనపడవచ్చు.. అది కూడా యజుర్వేదముతో అంగీకరిస్తూ ఒకదానినొకటి సమర్థించుకుంటూ సమభావముతో వివరింపబడి ఉంటుందే తప్ప ఒకదానికొకటి ఎక్కడా విరోధము ఉండదు. యాగాలకూ పశువధకూ సంబంధము ఉందా లేదా అనేది, ఆయా మంత్రాల నిజమయిన అర్థము తెలిస్తేనే అవగతమయ్యేది. కేవలం  సంస్కృత భాష తెలిసినంత మాత్రాన మంత్రాల అర్థాలను తెలుసుకోలేము. అసలు వేద మంత్రాలే బీజాక్షరాలతో , బీజార్థములతో ఉంటాయి.. అంటే , అతితక్కువ అక్షరాలలో అనంతమైన అర్థము ఇమిడి ఉంటుంది. వేదమంత్రాలంటే మామూలు సంస్కృత శబ్దాలు కాదు. అందుకే ఆ శబ్దాల యొక్క ప్రభావము అంత ఎక్కువ. వాటిని ఎంతో విజ్ఞతతో సమన్వయము చేయాల్సి ఉంటుంది

యజుర్వేదపు ప్రారంభములోనే ,  మొట్టమొదటి మంత్రము.. " ఇషేత్వోర్జేత్వా  వాయవస్థో పాయవస్థ... -----బహ్వీర్యజమానస్య పశూన్ పాహి " 

        పై మంత్రార్థము చూస్తే , ఇది పశువులను , ముఖ్యంగా వత్సములను ( దూడలను ) కాపాడుటకోసం ప్రయోగించబడుతుంది.  దర్శ యాగములో ఇంద్ర దేవతలకు పెరుగును ’ హవిస్సు ’ గా అర్పిస్తారు. ఆ పెరుగు దొరకాలంటే గోవులను ఆశ్రయించక తప్పదు. పాలు దొరికితేనే కదా , పెరుగు తయారయ్యేది ! ఆ పాల కోసము , ఆవుదూడలను కొంతపాలు తాగిన తర్వాత తల్లినుండీ వేరు పరచక తప్పదు. పాలు కావాలంటే ఇదే విధి.  ఆ దూడలకు , వేరే ఆహారాన్ని ఏర్పాటు చేయాలి. దూడలను ఆవునుండీ వేరు చేయాలంటే , వాటిని అదిలించో , ఆశపెట్టో ఆ పని చేయాలి. వాటికి హింస కలుగరాదు. కాబట్టి , ఒక మోదుగ కొమ్మను చెట్టునుండీ కత్తరించి , ఆకులు గల ఆకొమ్మతో దూడలను అదిలిస్తారు. తర్వాత వాటిని పచ్చిక మేయడానికి పంపిస్తారు. వాటికేమాత్రం బాధ కలగరాదని , వాటిని ఇలాగ ప్రార్థిస్తారు. " ఓ దూడలారా , మీరు వాయువులు కండి ( అంటే , ఇంకో అర్థము , మాతృ సమీపము నుండీ దూరము వెళ్ళండి.) . ఆ వాయువే మిమ్మల్ని రక్షించు గాక ( పశువులకు దేవత అంతరిక్షము , ఆ అంతరిక్షానికి అధ్యక్షుడు వాయువు ) గడ్డి మేసి , సాయంకాలానికి మరలా యజమాని ఇంటికి తిరిగి రండి.." 

      తర్వాత , గోవులను ఇలాగ ప్రార్థిస్తారు, " ఓ గోవులారా , సర్వప్రేరకుడైన ఆ సవితృ దేవుడు మిమ్మల్ని శ్రేష్టమైన కర్మ అగు యాగానికి హవిస్సును కలుగజేయుటకు ప్రేరేపించనీ.. దేవతలకు ఇవ్వతగిన పాలు , పెరుగు , నేయి మొదలైనవి , మీనుండీ గాక , ఇంకెక్కడ లభించును ? గోవులారా , మీరు హింసకు ఏమాత్రమూ అర్హురాళ్ళు కాదు. ( గోవులను ’ అఘ్ని ’ అని అంటారు... అంటే హింసింపకూడనివి ) మీరు మొదట మీ బిడ్డలకు , తర్వాత మనుషులకూ పాలిచ్చి , పుష్టిని కలిగిస్తున్నారు. ఇప్పుడు బాగా గడ్డి మేసి , ఇంద్రాది దేవతలకు కావలసిన హవిస్సును కూడా ఇవ్వండి.. మిమ్మల్ని , దొంగలు అపహరించకుందురు గాక. కౄర మృగాలు హింసింపకుండు గాక , రుద్రుడూ , రుద్రాయుధాలూ మిమ్మల్ని తాకకుండు గాక ( రుద్రుడి పని , కనిపించినవారిని హింసించుటయే ) మీ సంతతి వృద్ధియై , యజమానుని శాల నిండనీ ! 

     తర్వాత , మోదుగ చెట్టును ( కొమ్మను ) ఇలాగ ప్రార్థిస్తారు. ఓ పాలాశమా , దేవతలకు కావలసిన ఆహారము కోసము , నిన్ను వాడుకుంటున్నాను.  నిన్ను నమస్కరించి నిన్ను కత్తరిస్తున్నాను. దూడలు నిన్ను చూడగనే , బెదురు లేకుండా మరలిపోయేటట్టు చేయి , [ మోదుగకు మనసును ప్రభావితం చేసే సమర్థత ఉంది. యాగాలలో మోదుగను ఉపయోగించుట అందుకే ]  అలాగే యజమానుని గోవులను రక్షించు..

లోకకల్యాణార్థమై , ఒక్క యాగము కోసము , యాగము సక్రమంగా జరిగి , ఎవరికీ ఏ బాధా కలుగరాదని , వాటికి అవసరమైన అన్నిటినీ ప్రార్థించి గానీ మొదలుపెట్టని సంప్రదాయాన్ని మనకు వేదము నేర్పింది.. ఇవే కాదు , ఇంకా వేరు మంత్రాలలో , మట్టినీ , నీటినీ ఇతర పదార్థాలనీ ఇలాగే ప్రార్థించే సన్నివేశాలు కనిపిస్తాయి. 

ఈ అవగాహన లేకుండా , వేదాలలో హింసను ప్రేరేపించే అంశాలు ఉన్నాయనీ , పశు వధ ధర్మ సమ్మతమేననీ తమ స్వార్థము కోసము వక్రీకరించేవారు.. రేపు ఇంకెటువంటి పనిని అయినా చేయగల సమర్థులే. 

అసలు , వేదముతో మాకేమిటి పని , మేము వేదములో చెప్పినదాన్ని ఎందుకు పట్టించుకోవాలి ? అది మా మతము కాదే ? అనే వారూ ఉన్నారు.. అలాంటి వారు తెలుసుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి..

వేదము భారతీయులకు మాత్రమే సంబంధించినది అని కొందరూ , కాదు , హిందువులకు మాత్రమే సంబంధించినవి అని మరికొందరూ , కానేకాదు , బ్రాహ్మణులకు మాత్రమే అని మరి కొందరూ.. యే మాత్రమూ కాదు , బ్రాహ్మణులలో మగవారికి , అందులోనూ ఉపనయనము అయిన వారికి మాత్రమే అంటూ అనేకులు భావిస్తుంటారు..

 అవన్నీ తప్పే. 

       వేదాలున్నవి సర్వ మానవాళి కోసము .. ఎందుకలా ?  ఎందుకంటే , అందులో ఉన్నవి అభిప్రాయాలు కావు. మానవాభ్యుదయానికి ఎలా జీవించాలో యేయే ధర్మాలను పాటించాలో యేది చేస్తే మానవులకు శుభమో , యేది అశుభమో , యేది మంచో యేది చెడో... స్పష్టముగా చెప్పి ఉంది. ఇవన్నీ కూడా ప్రకృతి సహజమైన ’ న్యాయాల ’ మరియూ ’ ధర్మాల ’ ఆధారముగా చెప్పబడినవే. ఈ న్యాయాలు , ధర్మాలూ సర్వమానవులకూ సమానమే.. ఉదాహరణకు భూమ్యాకర్షణ అనే న్యాయం ఉందనుకోండి... అది మనుషులకే కాక సమస్త జీవులకూ అన్వయించేదే .. మతాలను బట్టి అది మారదు.. అలాగే వేదము లోని న్యాయాలు సమస్తజీవులకూ సౌహార్ద వాతావరణములో జీవించుటకు చెప్పబడినవే గానీ , ఒక దేశము వారికో , ఒక మతము వారికో , మగవారికో ఆడవారికో  అని కాదు. 

       భూమ్యాకర్షణ న్యాయాన్ని అనుసరిస్తూ మరెన్నో ఇతర సూత్రాలు , సమీకరణాలూ తయారయ్యాయి... అవన్నీ సూత్రాలూ సమీకరణలే గానీ , స్వతంత్రముగా న్యాయాలు కావు. అవన్నీ భూమ్యాకర్షణ అనే న్యాయానికే కట్టుబడి ఉంటాయి.. అలాగే సనాతన ధర్మము అటువంటి అనేక ప్రకృతి సహజమైన న్యాయాల పుట్ట. సత్యము , అహింస , బ్రహ్మ చర్యము , మిత్రత్వము... ఇటువంటి వన్నీ సనాతన ధర్మాలే. ఇవే మన జీవన విధానాలు.  ఇక మతాలు అనేవి మతాలే గానీ న్యాయాలు కావు , కాలేవు.. మతము అంటే అభిప్రాయము మాత్రమే..ధర్మము కాదు.  మతాలెన్నున్నా అవి ప్రకృతి సహజమైన న్యాయాలకు లోబడి ఉంటూనే కొన్ని సమీకరణాలను కలిగి ఉంటాయి.. వాటికి ప్రత్యేక ప్రతిపత్తి లేదు. అవన్నీ ఒక మూల పురుషుడి అభిప్రాయాలనుండీ పుట్టినవి మాత్రమే.  అటువంటి యే మతములో కూడా పరస్పర మైత్రి గురించి , అహింసను గురించీ  వేదములో చెప్పినంత దృఢముగా , గాఢముగా చెప్పలేదు. ఇది తెలుసుకోవడానికి ఆయా మత గ్రంధాలను చదివే అవసరము లేదు. సర్వమత సామరస్యము , సహనము వంటివి ఒక్క సనాతన ధర్మాన్ని పాటించే వారికి తెలిసినంతగా ఇతర ’ మతాల ’ వారికి తెలియదు అని వారి చర్యలే చెబుతున్నాయి .. మా మతాన్ని పాటించకపోతే చంపేస్తామని కొందరూ , మా మతము లో చేరకపోతే నరకమే గతి యని మరికొందరూ భయపెట్టో , ప్రలోభపరచో చేస్తున్న ప్రయత్నాలే దానికి సాక్ష్యము. సర్వ మానవ మైత్రిని ఆకాంక్షించే వారయితే అటువంటి ఆలోచనలే రావు కదా... 
             సనాతన ధర్మము అలాగ కాదు,ప్రకృతి సహజమైన న్యాయాలకు అనుగుణంగా ఒక జీవన విధానాన్ని నిర్వచించేదే సనాతన ధర్మము. వేదాలు అనేవి అభిప్రాయాలు కావు. ప్రకృతి సహజ న్యాయాలు. లోకములో ఫలానా ఋతువులో ఫలానా పనులు చేయాలి , ఆ ఫలానా పనులను ఫలానా విధముగా చేయాలి , వంటి దేశకాలాలకు తగ్గట్టు చేయవలసిన కార్యాలను వివరిస్తాయి , అది కూడా మానవాభ్యుదయము కోసము మాత్రమే. ఎవరినో సంతోషపెట్టుటకు కాదు. మానవులందరికీ సమానముగా , మిత్రతా భావముతో లాభము కలిగించే అంశాలే ఉన్నాయి కానీ వేరు అభిప్రాయము గలవారికి నాశనము అంటూనో , కష్టాలు అంటూనో బెదిరింపులు ఎక్కడా లేవు.  వేదాలకు మూలపురుషుడంటూ ఎవరూ లేరు.. అందుకే వాటిని " అపౌరుషేయాలు " అంటారు.. అవి మానవుడు రాసినవీ , తయారు చేసినవీ కాదు... భూమ్యాకర్షణ మానవుడు తయారు చేశాడా ?  అలాగే. 

మరి వేదాలలో అక్కడక్కడా కనబడే గోవధ , మాంస భక్షణ , అశ్వమేధము , పశుబలి , బలిపశువులను కట్టి వేయు  యూప స్థంభము  వంటి వాటి అర్థమేమిటి ? 

 అవన్నీ అవగాహనా రాహిత్యముతో ఊహించుకున్నవి మాత్రమే ... 

మరి సత్యమేమిటి ? 

దీనికి కొందరు ఇలాగ సమాధానమిస్తారు..
" గోవధ వేదకాలంలో యజ్ఞాలలో ఉండినదే. కానీ బ్రాహ్మణులు గోమాంసము తినేవారా అన్నదే వివాదాస్పదము.. అయితే , గోవధ " హింస " కాదా అని మీరు అడగొచ్చు. కాదు. 
ఈనాటి మన సంకుచిత అర్థాలతోనూ , దృష్టితోనూ చూస్తే అది హింస అనిపించవచ్చు. ఈనాడైతే అది హింసే.  కానీ ఆనాడు కాదు. ఎలా ?
||మా హింస్యాత్ సర్వా భూతాని , అహింసా పరమో ధర్మః || 

అనే శ్రుతి వాక్యము అన్నివేదాల ఒట్టు సారాంశపు మాట. హింస , అహింస అనేవాటికి సందర్భాన్ని బట్టి  అర్థాలు మారుతాయి. దేశ రక్షణ చేసే సైనికులు శత్రువులను చంపితే అది అహింసే కానీ , హింస కాదు. ఒక రోగి కాలో చెయ్యో తీయాల్సి వస్తే , అది అహింసే. ఒక కార్యపు పరమార్థాన్ని చూడక , కార్యాన్ని మాత్రమే చూస్తే వచ్చే అనర్థమే అనేకులకు కలిగే అయోమయం. "

పై వాదనలో కొంత నిజముందని మొన్న మొన్నటి వరకూ నేను కూడా అనుకునే వాణ్ణి.. కానీ అది శుద్ధ తప్పని నిరూపణ అయింది [ ఎలాగో , కింద ఉంటుంది]

మరికొందరేమో , వేదకాలములో గోవధ ఉన్నా రానురాను అది సమంజసము కాదని అర్థము చేసుకున్న హిందువులు దానిని వ్యతిరేకించారు.  కానీ వేదాలను పూర్తిగా కొట్టి పారేయలేక , గోవులను , అశ్వాలను , మేకలనూ పిండితో తయారు చేసి వాటిని బలి ఇచ్చే ఆచారము మొదలైంది.." 
అని అంటున్నారు.

పై రెండు వాదనలూ సంపూర్ణముగా అసత్యములు , అవగాహన లేని మాటలూనూ. 
మరి వాస్తవమేమిటి ? 

    వేదాలకు అనేకులు భాష్యాలు రాసినా , అన్ని వేదాలకూ భాష్యాలు రాసింది సాయణాచార్యుడు ఒక్కడే. వేర్వేరు వేద భాగాల్లో వచ్చే అవే మంత్రాల అర్థాల నిజమైన ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని సాయణాచార్యులంటారు , 
|| బిభేత్యల్ప శ్రుతాద్వేదః మామయం ప్రతరిశ్యతి ||
వేదమే ఇలా అంటుందట , " అల్ప జ్ఞానులైన మనుషులు నన్నే వక్రీకరించి మోసగించగలరు " 

సత్యము తెలియాలంటే అతి ముఖ్యముగా ఒక సంగతి తెలుసుకోవాలి. 

సంస్కృత పదాలకు సాధారణముగా లౌకికార్థము , వేదార్థము అని రెండు అర్థాలుంటాయి . ఆ భేదము తెలుసుకోకపోతే కలిగేది మనుషుల మధ్య , జాతుల మధ్య వైషమ్యాలే .వేదములోని మంత్రాలూ , శబ్దాలు అన్నీ కూడా ఒక ప్రత్యేకమైన " వైదిక " మరియూ " యౌగిక " శబ్దాలు. మామూలు సంస్కృత పదాలకు , వేదములోని అవే పదాలకూ అజగజాంతరము ఉంటుంది.  ఆయా మంత్రాలను , సందర్భాన్ని బట్టి అర్థము చేసుకోవాల్సి ఉంటుందే గానీ ఆ పదాల సంస్కృత అర్థాలు తెలిసినంత మాత్రాన మంత్రపు అర్థము తెలిసినట్టు కాదు. అసలు వేద మంత్రాలే బీజార్థములతో ఉంటాయి.. వాటిని ఎంతో విజ్ఞతతో సమన్వయము చేయాల్సి ఉంటుంది.

     మరి శంకరాచార్యుల వంటి వారు కూడా వేదాలలోని గోవధను వర్ణించినారు కదా , దానికేమి సమాధానము చెబుతారు ? అని మరి కొందరు అడుగుతారు.  
     వేదాలకూ , ఉపనిషత్తులకూ భాష్యాలు రాసిన శంకరులు అంతకు ముందరి భాష్యాలను చదవలేదనీ , అసలు శంకరులు వేదాలలో చెప్పిన దానికి భిన్నముగా కొత్తగా ఏదైనా చెప్పినారనీ అనుకుంటే అంతకన్నా అజ్ఞానము మరొకటి ఉండదు. వేదములలోని మంత్రాలు ఎలాగ బీజరూపములో , వాటి సరైన అర్థాన్ని వాటి ధాతువుల మూలముగా ఎలాగ అర్థము చేసుకోవాలో , శంకరుల భాష్యములనుకూడా అలాగే అర్థము చేసుకోవలెను. శంకరులు కూడా వైదిక , యౌగిక అర్థాలతోనే ప్రతిపాదించినారు కానీ లౌకిక అర్థాలతో కాదు. వారి భాష్యాలకు విపరీతార్థాలు కనిపిస్తే అది మన దోషమే గానీ వారి భాష్యాలలోని దోషము కాదు. 

       అలాగే , కొన్ని పురాణాలు , ఇతిహాసాలలో ఉన్న హింసకు సంబంధించిన వ్యాఖ్యలు ఒకానొక కాలములో " ధూర్తుల " చేత చేర్చబడినవే.. శాంతి పర్వములో " యూపం ఛిత్వా , పశూన్ హత్వా .." అంటూ స్వర్గానికి పోగల మార్గమును వర్ణించినారు. పశువులను అలాగ బలి ఇచ్చి స్వర్గానికి వెళ్లగలిగితే లోకం లో అందరూ స్వర్గానికే వెళ్ళవలెను కదా.. స్వర్గప్రాప్తి ఎంత సులభము ? అటువంటి మాటలన్నీ ఇతరులచేత ఆయా భాగాలలో చేర్చబడినవి. అవి మనకు ప్రమాణము కావు.  వేదము మాత్రమే స్వతః ప్రమాణమైనది. ఎవరిచేతనూ మార్చబడుటకు అవకాశము లేనిది ఒక్క వేదము మాత్రమే. వేదము తనకు రక్షణగా వేదాంగాలైన జ్యోతిష్యము , [గణితము , ఖగోళము ], శిక్ష , వ్యాకరణము , ఛందస్సు , నిరుక్తము వంటివే కాక , పదపాఠము , క్రమ పాఠము , జటా పాఠము , ఘనపాఠములను  కలిగియున్నది. వాటివల్ల ఎవరు ఎక్కడ ఏ చిన్నపాటి మార్పు , అక్షరములో గానీ స్వరములో గానీ-- చేస్తే వెంటనే తెలిసిపోతుంది. కానీ మిగతావి అలాగ కాదు. భారతము , రామాయణము , చివరకు భగవద్గీతలో కూడా ధూర్తులు అనేక మార్పులు , చేర్పులు చేశారు. 
అందుకే వేదము మాత్రమే స్వతః ప్రమాణమైనది. మిగతావి ’ పరతః ’ ప్రమాణమైనవి.

       కొందరు ’ మేధావులు "  గా తమను తాము భావించుకునే వారు , ’ అశ్వమేధ ’ యాగము గురించి రాస్తూ , గుర్రమును చంపి వండుకోవటము , వండుతుండగా వచ్చే దాని సువాసనలనూ వర్ణించడమూ , అంతేనా , ,  గుర్రముతో యజమాని భార్య ఏమేమి చేస్తుందో... అలాంటివన్నీ  తమ మకిలి పట్టిన మనసుతీరా ఉన్మత్తపు రాతలు రాసి శునకానందము పొందుతుంటారు. 
        తాము ఆధునిక వైజ్ఞానికులమనీ , ఎన్నెన్నో పరిశోధనలు చేసి  మానవ జాతి " చరిత్ర ’ ను ఔపోసన పట్టామనీ , ఏవేవో పిచ్చిరాతలు రాసేవారు , సంస్కృతము ఒక్కటీ నేర్చుకుంటే చాలు , వేదాలను , సనాతన ధర్మాన్నీ భ్రష్టు పట్టేలా ఏదైనా , ఎలాగైనా వక్రీకరించి రాయొచ్చనీ , ఈ కాలము యువత సంస్కృతము  నేర్చుకోదనీ , తెలిసిన పాతవారు వీటన్నిటినీ పట్టించుకోరనీ ధీమాతో తమ మనసులలోని అశుద్ధాన్ని ఏ మాత్రమూ సంకోచమూ, సంశయమూ, మొహమాటమూ లేకుండా బయట పెట్టుకుంటున్నారు. 

శివపురాణములో కథానాయకుడు శివుడు , విష్ణు పురాణములో కథానాయకుడు విష్ణువు అంటూ ఇలాంటి వాళ్ళు చెప్పే ప్రతీదీ ఒప్పేసుకుంటూ పోతే మన ముఖాన మనమే మసి పూసుకున్నట్లే. అసలు నిజాలేమిటో కొన్ని చిన్న చిన్న ఉదాహరణలతో వివరిస్తాను.

యజుర్వేదములో " మా మా హిగ్ంసీ " అనగా , గోవులనూ , జంతువులను హింసించుట ఎంతమాత్రమూ తగదు " అని అంటుంది
యజుర్వేదములో కనపడే " పశుబలి " అనే మాటలకు అర్థము పశువులను బలి ఇచ్చుట కాదు , అది నిజానికి " పశుత్వ" బలి. కావాలన్న వారు " ధాతు రూప " శబ్దాలు ఎలా వచ్చాయీ , వాటి అర్థాలు ఎలా ఉంటాయీ అన్నది ధాతురూప కోశములలో చూడవచ్చు. వేదములోని శబ్దాలన్నీ ధాతువులనుండీ వచ్చినవే.. 
" మాంసము " అనగానే ఈనాడు ," నాన్ వెజిటేరియన్ " అనే అర్థము బలపడి పోయింది. వేదకాలములో ’ మాంసము ’ అంటే , ఫలములలోని గుజ్జు , దుంపలలోని గుజ్జు , అని మాత్రమే అర్థము.. ఈనాటి అర్థాలతో ఆనాటి వేదశబ్దాలను సంధానం చేస్తే జరిగే దుష్పరిణామమే ఇలాంటి వక్రీకరణలు. 

పిశాచి అంటే దయ్యం అని అర్థం చేసుకుంటున్నాము.. అది ’ పిశం అస్తి’ పిశ అవయవే ’ అనే ధాతువుల నుండీ వచ్చినది  అనగా , ఈ నాడు మనము చెప్పుకునే " నాన్-వెజిటేరియన్
"  పిశాచమంటే అదే ! 

" భ్రాతృ " అనే పదానికి సంస్కృత అర్థము , ’ సోదరుడు ’ అని. కానీ దాని  వేదార్థము యేమిటంటే , " శత్రువు " . 
" న " అంటే కాదు అని సంస్కృతార్థము. కానీ " అదే విధమైన "  అని వేదార్థము.
అంతేగాక , వేదమంత్రాలకు వర్ణాలతోపాటూ స్వరాలున్నాయని గుర్తుంచుకుంటే , ఒక్క చిన్న స్వర భేదముతో మంత్ర అర్థమే పూర్తిగా మారిపోతుందని ఎన్నో ఉదాహరణల ద్వారా చెప్పవచ్చు. అతి ప్రసిద్ధి పొందిన " ఇంద్ర శత్రు " అన్న పదాల అర్థాలు తెలిసినవే. 

" ఆగఛ్చతు " అంటే రమ్మని అర్థము.. దాన్నే స్వరము మార్చి పలికితే , వెళ్ళమని అర్థము.

తెలుగులో మాత్రం అటువంటి పదాలు లేవా ? నేను వెళ్ళను అనుటకు , దీర్ఘము తీసి" నేను వెళ్ళనూ ? " అనుటకు భేదము లేదా ? 

|| ఋచో ఆక్షరే పరమే వ్యోమన్ | యస్మిన్ దేవా అధి విశ్వే నిషేదుః | 
యస్తన్న వేద | కిమ్ ఋచా కరిష్యతి  ||

అన్న ఋగ్వేదపు మంత్రము కూడా , " ఒకడికి మంత్రార్థము తెలియకుంటే దానికి ఋగ్వేదము ఏమి చేస్తుంది ? " అని ప్రశ్నిస్తుంది. 

[ బ్రహ్మాణమ్ బ్రహ్మ వాహసమ్--ఋగ్వేదమ్--౬-౪౫-౭

బ్రహ్మాణమ్ పరివృఢం , బ్రహ్మ వాహసమ్ బ్రహ్మభిః  స్తుతిరూపైర్ మంత్రైర్ వహనీయమ్ --సాయన భాష్యమ్ 

ద్రవ్య పక్షేపి సర్వ శబ్దానామ్ అసత్యోపాద్య వచ్చిన్నం బ్రహ్మతత్త్వం వాచ్యమితి నిత్యతా || --కైయటః , మహా భాష్య పస్పశాహ్నికమ్ 

" అప్యేకం దేవపథ మథీయీతేవ --శతపథ బ్రాహ్మణం --౧-౧౫-౬౯ ]

" సంస్కృత పదాలైన కొన్ని నామవాచకాలు , నదులు , జంతువుల పేర్లు వాటి అర్థాలను ఇచ్చినా , వాటి నిజమైన స్వభావము , ప్రవృత్తులు మాత్రము బ్రహ్మమును కీర్తించుటయే " అని దాని అర్థము. 

ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించేముందు , దాని అసలైన వైదిక అర్థాన్ని తెలుసుకోవడము వివేకమైన పని. సంచలనము కలిగించుట కోసమో , వక్రీకరణ కోసమో దానిని నిర్ధారణ చేసే ముందు అందులోని వైరుధ్యాన్ని, లోపాలనూ , ఆ సిద్ధాంతము చేసేవాడే , " నేఽతి" [ ఇది కాదు , ఇది కాదు ] అంటూ ఆత్మ విమర్శగా పరీక్షించుట అవసరము. ఎందుకంటే ఆ పని ఇతరులు ఎలాగూ చేసి తప్పని చెబుతారు కాబట్టి. 

ఇక , అశ్వ మేధము.. 

      విపరీతముగా అపార్థము చేసుకోబడిన వేద శబ్దములలో ఇది ఒకటి. దీని అసలు అర్థము గ్రహింపుకు వచ్చిన తరువాత , అశ్వమేధాన్ని వక్రీకరించినవారు ప్రాయోపవేశము చేసుకున్నా ఆశ్చర్యము లేదు. అంత ఘోరమైన తప్పిదము అది. 
తాము మహామేధావులమని భావించుకొనే సనాతన ధర్మ వ్యతిరేకులు కొందరు సంకోచాలు , మర్యాదలూ హుందాతనమూ మరచిపోయి , అశ్వమేధ యాగములో యజమాని భార్య అశ్వము [అనగా వారి అర్థములో ’ గుర్రము ’ ] తో యేమేమి చేస్తుందో వారివారి నీచమయిన ప్రవృత్తులను తృప్తిపరచుకొనుట కోసము వర్ణించి శునకానందము పొందేవారు ఉన్నారు. వీరి వంటి వారే అయిన ప్రాచీనులైన " పువ్వటుడు ", మహీధరుడు " వంటి వారిని ఉటంకిస్తూ అటువంటి వ్యాఖ్యలు చేస్తారు. 

ఇటువంటి వైదిక శబ్దాలను అర్థము చేసుకొనుటకు ఒక ప్రత్యేకమయిన క్రమముంది. దానిని " ఆర్షేయ క్రమము " అంటారు. దాని పేరే తెలియని ఈ మేధావులు వేదాలకు భాష్యము చెప్పబోవుట అనేది గుడ్డివాడు సినిమా గ్రాఫిక్స్ ను వర్ణించినట్లే ఊహాజనితములై ఉంటాయి. 
అశ్వ అనే పదము , ’ అశ్ భక్షణి ’ అనే ధాతువు నుండీ వచ్చింది. అనగా , దారిని తినివేయునది. 
తినుట , గ్రహించుట అనే అర్థాలకోసము అశ్ శబ్దము వాడతారు. అశనము , ప్రాశనము అలా వచ్చిన పదాలే. 
వేదములో చెప్పిన అశ్వ మేధ శబ్దానికి, గుర్రానికీ యే విధమైన సంబంధమూ లేదు. 

ఏదైతే ఇంకొకదానిని గ్రహించునో , అది అశ్వము
నీటిని గ్రహించే సూర్య కిరణము అశ్వమే.
వెలుతురును గ్రహించే కన్నూ , శబ్దాన్ని గ్రహించే చెవీ, రుచిని  గ్రహించే నాలుకా... ఇవన్నీ అశ్వాలే.  కాబట్టి ఇంద్రియాలను అశ్వములు అని పిలుస్తారు. 
శరీరాన్ని రథముతోనూ , రథము నడిపేవాణ్ణి ఆత్మతోనూ , ఇంద్రియాలను గుర్రాలతోనూ పోల్చే ప్రసిద్ధమైన శ్లోకాలు ఈ వైదిక అర్థముతో రాయబడినవే.  
సంస్కృతములో అశ్వము అంటే గుర్రమే. కానీ వేద శబ్దాలకు ఆ అర్థము లేదు. సందర్భాన్ని బట్టి ఎక్కడ ఏ అర్థము వస్తుందో చూడాలే గానీ అశ్వము వచ్చిన చోటంతా గుర్రము రాదు. 

అశ్వానికి ఇంకో అర్థము కూడా ఉంది అ-శ్వః అంటే రేపు లేనిది. - నిరంతరంగా ఉండేది. అశ్వమితి రాష్ట్రం-- దేశము ఎప్పుడూ నిరంతరంగా ఉంటుంది. వేదికను కూడా అశ్వము అంటారు. నటీనటులు వస్తూ పోతుంటారు, వేదిక నిరంతరముగా ఉంటుంది. 

ఇక మేధ అనే శబ్దానికి రెండు ధాతువులున్నాయి
మేధృ - " సంప్రహ " మరియూ మేధృ- సంగమం.
అశ్వమేధమంటే ఇంద్రియాలను సంగమములోకి అనగా స్వాధీనములోనికి తెచ్చుకొనుట. వేదములో చెప్పిన ’ అశ్వ మేధ ’ పదానికి అర్థము ఇదే. 
రాష్ట్ర మేధ -- రాష్ట్రాన్ని అనగా రాజ్యాన్ని అధీనములోకి తెచ్చుకొనుట. రాజ్య ఐక్యత. 

యూపము అంటే , గుర్రాన్ని కట్టివేయు కొయ్య స్థంభము కాదు. యూపమను పదాన్ని,  ఇంద్రియాలను , మనసును అదుపులో ఉంచు విషయములో వాడతారే గానీ పశువును కట్టు గూటము అనే అర్థములో కాదు. 

కాబట్టి అశ్వ మేధములో గుర్రమూ లేదు , హింస అంతకన్నా లేదు. దోష పూర్ణమైన అర్థాలు తీసి వేదవాఙ్మయాన్ని వక్రీకరించుటలో కొందరు మేధావులు సిద్ధ హస్తులు. 
అయితే , ఎంతమంది మేధావులు ఎన్ని వక్రీకరణలు , కుతర్కాలు , చేర్పులు మార్పులూ చేసినా , వేదాన్ని ఎవరూ ఆవిధముగా అంటలేరు కాబట్టి వేదమే వారికి దీటైన సమాధానము చెబుతుంది.

ఇలాగ ఎన్నెన్నో పదాలకు తప్పుడు అర్థాలు తీసి అయోమయాలు , వైషమ్యాలూ సృష్టించుటే వారి పని. 

 భారతాన్ని పంచమ వేదము అంటారు.. అందులో కూడా చేర్పులు జరిగాయి. అది మానవుడు రాసింది కాబట్టి.. అలాగే మతాచార్యులు రాసిన వాటిని కూడా కొందరు వేదమనే అంటారు. ఎవరేమి రాసినా మూల వేదానికి విరుద్ధము కానంతవరకే దానికి విలువ , ఆదరము. లేకపోతే వేదము అన్న పదాన్ని చేర్చుకున్నంత మాత్రాన ఏ రాతలూ ’ సత్య వేదాలు ’ కాలేవు, అభాసు పాలూ కాకుండానూ పోవు.   

భారత దేశములో అనాది నుండీ మన బలాలు యేమిటంటే , శిక్షణ , పశుపాలన , కృషి-- ఈ మూడే . ఆంగ్లేయుల పాలనలో ఈ మూటిమీదా అటకాయింపు జరిగింది. శిక్షణను ’ మెకాలే ’ ప్రతిపాదించిన " ఇంగ్లీషు చదువుల’ తోనూ , పశుపాలనను ’ మాంస భక్షణను’ అలవాటు చేయడము వలననూ , కృషి ని వాణిజ్యము చేయడము వల్లనూ మూడూ పతనము చెందినాయి. 

సనాతన ధర్మములో మాంసాహార భక్షణ అనునదే లేదు. అంతెందుకు , ఓ యాభై యేళ్ళ కిందవరకూ కాఫీ అంటే అదొక " మైల " గా భావించే వారు . ఇంటి బయట ఒక మూలలో బొగ్గులపొయ్యి మీద రహస్యంగా తయారు చేసేవారు. 

సనాతన ధర్మమును కించపరచి విమర్శించే వారు రెండు రకాలు.
ఒక్కసారిగా గొప్పవాళ్ళము కావాలనుకొనేవారు , సనాతన ధర్మము గురించి అసలేమీ తెలీని వాళ్ళు. 

కానీ వీళ్ళు తమ వరకూ వస్తే , మరలా సనాతన ధర్మపు సందేశాలనే పాటిస్తారు. శాకాహార భోజనము యొక్క గొప్పదనము వారికి తెలీక కాదు , వారి మొదటి ప్రాధాన్యత అదే. అంతే కాదు , వారిలో సంతానము లేని వారికి , కృత్రిమ పద్దతిలో సంతానము కలగాలంటే , మొదటగా కోరుకొనేది బ్రాహ్మణుల వీర్యాన్నే. సంతాన ప్రాప్తి కేంద్రాలలో ఎక్కడ కనుక్కున్నా ఈ విషయము తెలుస్తుంది. ఎన్నిసార్లు పేపర్లలో చదవలేదు ? శాకాహారులై , నియమబద్ధమైన జీవనము గడుపుతూ , వేద వేత్తలై ఉంటే , వారి వీర్యానికి వీరిచ్చే విలువ అంతా ఇంతా కాదు. వ్యక్తి గతముగా అలాగ సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ , సామాజికంగా ఆ సనాతన ధర్మాన్నే విమర్శించే వారు యేనాటికైనా సనాతన ధర్మానికి బాహాటముగా తలవంచవలసినదే. 
నిన్న నాతమ్ముడితో మాట్లాడుతున్నపుడు కొన్ని ఆశ్చర్య కరమైన విషయాలు చెప్పాడు. అతడు జర్మనీలో ఉంటాడు.. మనం ఊహించుకునేట్టుగా , విదేశీయులందరూ మాంసాహారులూ , తాగి తందనాలాడేవారూ కాదనీ , చెట్లకు కూడా హాని కలిగించక బ్రతికేవారున్నారనీ అన్నాడు. అక్కడ అనేకులు , చెట్లనుండీ కాయలూ , పళ్ళూ కోయరట. అవే పండి రాలితే గానీ వాటిని తీసుకోరట.  మనం మృత్యుంజయ మంత్రములో , " ఉర్వారుకమివ బంధనాత్ ... " అంటూ , పండిన పండువలె రాలిపోదామనీ , అపమృత్యువు రాకూడదనీ ప్రార్థిస్తాము.. దాని అర్థాన్ని తెలుసుకొని వారు ఎంతబాగా ఆచరిస్తున్నారు అనిపిస్తుంది. పాలు పిండితే పశువులకు బాధ అని , చాలామంది పాలు , పెరుగు ముట్టుకోరట. 

మనము సనాతన ధర్మము , సాంప్రదాయాలు , అంటూ మాట్లాడుకునే మనము , నిజంగా అందులోని సారాంశాన్ని తెలుసుకొని పాటిస్తున్నామా ? అనిపిస్తుంది , ఒకోసారి. ఎందుకంటే మన వేదాలని అర్థం చేసుకొని , వాటి సారాంశాన్ని ఉపయోగిస్తూ మనకన్నా ఎక్కువగా పాటించేవారు.. విదేశాల్లో ఎక్కువ ఉన్నారని అవగతమవుతున్నది. 
అంతే కాదు , నూరేళ్ళనుండే అక్కడ సంస్కృతపు వాడకము ఉందనీ , ఇప్పటికీ సంస్కృతం లో వార్తలు ప్రసారమవుతాయనీ , వేదమంతా అనువదించి లైబ్రరీలలో నిక్షిప్తము చేసుకున్నారనీ అన్నాడు. 
వేదాన్ని మనకన్నా వారే క్షుణ్ణంగా అర్థం చేసుకొని ఆచరిస్తున్నారని ఆనందించడమే గాక , మనము కూడా అలాగే ఆచరించాలని దానికి తగ్గ అవగాహనను ఇమ్మనీ , కుసంస్కారంతో ఎదుటివారిపై బురద జల్లేవారిని సంస్కరించమనీ వేడుకుందాము. 


వేదములో గోవధ చెప్పబడి ఉందా  అని ఒక వివాదాన్ని కొందరు మ్లేఛ్ఛులు తీసుకొచ్చి సనాతన ధర్మాన్ని కించపరచాలని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి... వేదములో అటువంటి గోవధను ప్రేరేపించే విషయములేవీ లేవని నిర్ద్వంద్వముగా  తేల్చబడినది.. ఇంకా అనుమానము ఉంటే , --గోవధను ప్రేరేపించుట కాదు-- గోవధను చేయకండి అవివేకులారా  --అని స్పష్టముగా ఏకాగ్ని కాండములో వివరింపబడి ఉంది..

 వేదములో " గోవధ కూడదు " అని స్పష్టముగా చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యముగా , ఉపనయన సమయములో వటువు, పలికే ఈ మాటలు చూడండి.. వీటికి ఎంతో ప్రాముఖ్యము ఉంది.. ఎందుకంటే , ఉపనయనము అయితే గానీ , వేదాధ్యయనము చేసి , యజ్ఞయాగాదులు చేయుట --చేయించుటకు వటువుకు యోగ్యత రాదు .. .. కాబట్టి , వటువు ఉపనయన సమయములో ఏమి నేర్చుకుంటున్నాడో  చూడండి..


|| యజ్ఞోవర్ధతాం యజ్ఞస్య వృద్ధిమను వృద్ధాఽపచితి రస్యపచితిం మా కుర్వపచితోఽహం మనుష్యేషు భూయాసం || 

|| గౌరస్యపహత పాప్మాఽపపాప్మానం జహి మమచాఽముష్య చ || 


" ఓ ధేనువా !! నీవు అతి పవిత్రవంతమైన దానివి.. నీ యందు ఎటువంటి దోషములూ ఉండుటకు సాధ్యము కాదు.. కాబట్టి, నాయొక్కయు , కన్యాదాత యొక్కయు పాపములను నీవు మాత్రమే నశింపజేయ గలవు.. 

నీ సంబంధమైన పూజ లోకములో వృద్ధిపొందుగాక.. నీ పూజ వృద్ధియైనట్లే  నీవుకూడా వృద్ధి పొందుము , పూజనీయవైన నీ పూజ చేసి నేను కూడా పూజనీయుడనయ్యెదను.. నీ పూజాఫలమును నాకివ్వు. "

|| గౌర్ధేనుభవ్యా మాతా రుద్రాణాం దుహితావసూనాగ్ స్వసాఽదిత్యానామమృతస్య నాభిః | ప్రణువోచం చికితుషే జనాయ మా గామనాగా మదితిం వధిష్ఠ || 

|| పిబతూదకం తృణాన్యత్తు ||

|| ఓముత్సృజత || 

" యజ్ఞయాగాదులలో సమస్త దేవతలూ పొందదగిన ఆజ్యము మొదలగు హవిస్సును ఇచ్చుటవలన ఈ ధేనువు అతి యోగ్యమై, పూజార్హమైనది. ఆ కారణము చేతనే ఈ ధేనువు ఏకాదశ రుద్రులకు తల్లియైనది. అష్ట వసువులకు కుమార్తె యైనది. ద్వాదశాదిత్యులకు తోబుట్టువైనది. అమృతమునకు ఆధారమైనది.. కాబట్టి  లోకములలోని యేదోషములూ ఈ గోవును అంట జాలవు. ఈ గోవు అణుమాత్రమైననూ హింసింపకూడనిది. కాబట్టి ఓ అవివేకులారా , పరమ పవిత్రమైన గోవును హింసింపవద్దు , వధింపవద్దు.. దానిని జలములు త్రాగుటకు , తృణ ఘాసములను దినుటకు వదలిపెట్టండి..   "

వేదము గోవును ఎంత పవిత్రముగా ఆరాధిస్తుందో  తెలుసుకొనుటకు  ఇది చాలు కదా..