SHARE

Thursday, April 23, 2015

ఆది శంకరుల అద్వైత సిద్ధాంతము-- శ్రీ భారతీ తీర్థ మహా స్వాముల మాటలలో.


|| శ్రీ గురుభ్యో నమః ||

ఆది శంకరుల అద్వైత సిద్ధాంతము-- శృంగేరీ జగద్గురువులు శ్రీ భారతీ తీర్థ మహా స్వాముల మాటలలో.




పరమ పూజ్యులగు శ్రీ శంకర భగవత్పాదాచార్యులు , ధరపైన అవతరించి అద్వైత సిద్ధాంతమును ఈ ప్రపంచమునకు దయపాలించినారు. అయితే , అద్వైత సిద్ధాంతపు పుట్టుకకు శ్రీ శంకరులే కారణము అనేది సరికాదు. ఉపనిషత్తులలో అద్వైత సిద్ధాంతపు ప్రతిపాదన స్పష్టముగా ఉంది. శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీత యొక్క అంతరార్థము కూడా అద్వైతమే. శ్రీ వేదవ్యాసులు కూడా బ్రహ్మ సూత్రములలో అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినారు. 

అయినా కూడా శ్రీ శంకరుల అవతారము అగు వరకూ అద్వైత సిద్ధాంతము జటిలముగనే ఉండిపోయినది. ఉపనిషత్తులలోని కొన్ని వాక్యములను ఆధారముగా చేసుకొని కొందరు , తమకు తోచినట్లు వ్యాఖ్యానిస్తున్నారు. నాస్తికులు కూడా తమ మొండి సిద్ధాంతాలను సమర్థించుకోవాలంటూ కొన్ని వేద వాక్యాలను నిదర్శనముగా చూపుతున్నారు. ఇలాగ అద్వైత సిద్ధాంతము గురించి బలము లేని చర్చలు నడుస్తుండేవి. అటువంటి సందర్భములో జనులను సరియైన దారికి తెచ్చు క్రమములో భగవత్పాదులు శంకరాచార్యులు ధరపై అవతరించినారు.  ఉపనిషత్తులలోని గూఢార్థముగా ఉన్న సిద్ధాంతమును సరళముగా జనులముందు విప్పి పెట్టినారు. 
వేదవాక్యములను విశ్లేషించుటకు సూక్త ఆధారములను ముందర పెట్టుకోవలెను. మనము చేయు విశ్లేషణలు సరియైన దారిలోనుండవలెను. అద్వైతము  శృతి , యుక్తి  మరియూ అనుభవవేద్యమై యున్నది. 

|| వేదస్య హి నిరపేక్షమ్ ప్రామాణ్యం రవేరివ రూపశయే || 

ఈ [ అద్వైత ] సిద్ధాంతమును ప్రతిపాదించునపుడు మనము వేదమును పరమ ప్రమాణముగా అంగీకరించ వలెను అంటారు శంకరులు. కొందరు , " వేదములలో అయోమయము కలిగించు అంశములున్నాయి , కాబట్టి అవి ప్రమాణములు కాదు " అంటారు. కానీ అది సరి కాదు , పూర్వాపర విరోధము రాకుండా , సమగ్ర ప్రకరణమును చూసి , ఆ తరువాతనే వేదమునకు అర్థమును చెప్పవలెను. ఉదాహరణకు ,ఉపనిషత్తులోనున్న , " న తస్య ప్రతిమాఽస్తి " అనే వాక్యానికి కొందరు , " దేవుడికి ప్రతిమా మూర్తి అనేది లేదు , కాబట్టి విగ్రహారాధన చేయకూడదు " అని అర్థము చెపుతారు. అయితే , ఆ వాక్యానికి అర్థము అది కాదు , ’ ప్రతిమా ’ అంటే , ఉపమ ...లేదా పోలిక. దేవుడికి సమానమైనవాడు , వాడికి ఉదాహరణగా ఇవ్వతగ్గ ’ మరొక ’ వస్తువు కాదు" అని ఆ వాక్యానికి అర్థము. ఇదే అర్థాన్ని, " న తత్ సమశ్చ అభ్యధికశ్చ  దృశ్యతే " అనే ఉపనిషద్వాక్యము బోధిస్తుంది. అతడికి సమానమైన మరియూ అతడికన్నా అధికుడైన ఇంకొకడు లేడు అని దానర్థము. 

భగవంతుడు వర్ణనాతీతుడు , ఊహాతీతుడు , అనంతానంత సామర్థ్యమున్నవాడు. అచింత్యుడు , అపరిమితుడూ అయి ఉన్నాడు. అతడికి పోల్చదగిన మరొక వస్తువే లేదు. అదే , ఆ ఉపనిషత్ వాక్యపు అర్థము. అట్లున్నపుడు మనము వేదవాక్యములను తప్పుగా అర్థము చేసుకోకుండా , ప్రతీ దానినీ , యే విరోధమూ కలుగకుండా స్పష్టముగా అర్థము చేసుకోవలెను. ఆ కారణము చేతనే భగవత్పాదులు శంకరులు , వేద వాక్యాలను సరిగ్గా అర్థము చేసుకొనవలెను అని చెవిమాట చెప్పినారు. సర్వ ఉపనిషత్తుల పూర్తి సారమూ అద్వైతమే అన్నారు. పూర్తి వేదాంతపు మార్గమే అద్వైతమని అర్థము చేసుకుంటే , వేరే ప్రశ్నలే పుట్టవు. 

కొందరు , శంకరులను గురించి , " అద్వైత సిద్ధాంతము ప్రకారము , పరబ్రహ్మమే నిత్యము , సత్యము , మిగిలినదంతా మిథ్య " - ఇదే నిజమయినట్టైతే , ఈ ప్రపంచములో జరిగే ప్రతియొక్క క్రియ గురించి ఏమని చెపుతారు ? గురువులైన తమరు , శిష్యులైన మాకు జ్ఞానమును బోధిస్తున్నారు , ఇది సత్యమా లేక మిథ్యయా ?  మీరే చెప్పండి . బ్రహ్మ తప్ప మిగిలినవన్నీ మిథ్య అన్నట్టైతే , మీ బోధనలు , మా గ్రహింపు... మిథ్యయేనా ? ఈ ప్రపంచములో నడచు అన్ని కార్యములూ అబద్ధాలేనా ? జరిగే సర్వ క్రియలూ మిథ్య అనే అర్థమా ? " అని ప్రశ్నిస్తారు. 

అప్పుడు భగవత్పాదులైన శంకరులు ఇలాగ ఉత్తరమిస్తారు , 
|| సర్వ వ్యవహారాణామేవ ప్రాగ్ బ్రహ్మాత్మతా విజ్ఞానాత్ సత్యత్వోపపత్తేః |
స్వప్న వ్యవహారస్యేవ ప్రాక్ ప్రబోధాత్ ||

జగత్తులో మూడు విధముల సత్యములున్నాయి. 
మొదటిది , " పారమార్థిక సత్యము " అది ’ త్రికాలాబాధితమైన ’ సత్యము. ఆ పరబ్రహ్మమనేది , మొదటా ఉండింది , ఇప్పుడూ ఉంది. ఇక ముందూ ఉంటుంది. అది పరమ సత్యము. 
రెండవది ,బ్రహ్మ జ్ఞానము పొందక ముందు ఉన్న స్థితిలో ఉండేది , " వ్యావహారిక సత్యము ". 
మూడోది, " ప్రాతిభాసిక సత్యము ".  అంటే , వస్తువు కనిపించునంత కాలము మాత్రమే అది సత్యముగా కనపడేది. ఉదాహరణకు , మృగతృష్ణ [ ఎండమావి ] లో నీరున్నట్టే కనబడుతుంది. అక్కడ నిజముగా నీరు లేకున్ననూ భ్రాంతి వలన నీరున్నట్టే కానవస్తుంది. ఇది ప్రాతిభాసిక సత్యము. ఈ మూడింటికన్నా భిన్నముగా ఉన్న వస్తువేదైనా , తుఛ్చమైన అసత్యమే ! 
ఉదాహరణకు , గగన కుసుమము , శశశృంగము [ కుందేటి కొమ్ము ]. 
ఈ ప్రపంచమనునది గగన కుసుమము మొదలగువాటి వలె అసత్యమైనది కాదు. ఎందుకంటే ఇది మన అనుభవానికి గోచరమవుతున్నందు వలన ఇది అబద్ధమని చెప్పుటకు సాధ్యము కాదు, అలాగే ,ఇది పరబ్రహ్మ వస్తువు వలె పారమార్థికముగా సత్యమైన వస్తువూ కాదు. ఎందుకంటే ఇది నిరంతరమూ మారుతూనే ఉండుట వలన దీనిని ’ త్రికాలాబాధమైన ’ సత్యము అనుటకు సాధ్యము కాదు. అందువలన ఈ ప్రపంచము ’ మిథ్య ’ అని పిలవబడినది. ’ మిథ్య ’ అంటే ’ అబద్ధము ’ అని అర్థము కాదు. ’ ఇది ఇలాగ ’ అని నిర్ధారించుటకు సాధ్యము కానిది , అనిర్వచనీయమైనది అని అర్థము. 

ఈ ప్రపంచమనేది వ్యావహారిక సత్యము. బ్రహ్మ జ్ఞానము పొందు వరకూ ఇది సత్యమని అనిపిస్తుంది. బ్రహ్మ జ్ఞానమును పొందినప్పుడు , బ్రహ్మమే సత్యము. మిగిలినదంతా మిథ్య అని తెలుస్తుంది. ఎలాగైతే నిద్రించు వ్యక్తి కలలో అనెక ఘటనలను చూసి కూడా , మెలకువ అయినాక , అవన్నీ అబద్ధము అని తెలుసుకుంటాడో , అలాగే , బ్రహ్మము ఒకటే సత్యము.  ’ ఆ బ్రహ్మము నేనే అయి ఉన్నాను ’ అన్న జ్ఞానము వచ్చిన తక్షణమే స్వప్న సదృశమైన ద్వైత ప్రపంచమంతా నష్టమవుతుంది. 

దీనిని అద్వైత సిద్ధాంతమును సరిగ్గా అర్థము చేసుకోనివారు ఆక్షేపించవచ్చు , ’ అద్వైతము ’ అనగానే అన్నీ మిథ్య అని అర్థము కాదు. వాస్తవాన్ని ఎవ్వరూ తోసిపారేయుటకు సాధ్యము కాదు అనేదేమో నిజము. అద్వైత సిద్ధాంతము వలన కర్మ మార్గమునకు ప్రాముఖ్యత లేదని కాదు , ఎవరికైతే అద్వైత సాక్షాత్కారమయినదో , వారికి కర్మలు వదిలేయండి అని చెప్పే అవసరమే లేదు , అటువంటి వారిని కర్మ తానే వదలిపోతుంది. కానీ అద్వైత సాక్షాత్కారమగు వరకూ అతడు కర్మాసక్తుడై ఉండవలెను. కాబట్టి , అద్వైత సిద్ధాంతము కర్మలను , ఉపాసనలను తిరస్కరించదు అనవచ్చు. 
భగవత్పాదులైన శంకరులు అద్వైత సిద్ధాంతాన్ని సదృఢముగనే ప్రతిపాదించిననూ , కొందరి[ సరిగ్గా అర్థము చేసుకొనలేని వారి ] దృష్టిలో , అద్వైతము టీక చేయవలసిన వస్తువు. అయితే , ద్వైతము-అద్వైతము-విశిష్టాద్వైతము - ఈ అన్నింటినీ కూలంకషముగా పరీక్షిస్తే , అద్వైత సిద్ధాంతములో మాత్రమే అన్ని ఆక్షేపణలకూ సరియైన సమాధానము దొరకుతుంది. అద్వైత సిద్ధాంతమే శ్రేష్ఠము అనేది ’ అయ్యణ్ణ దీక్షితుల’ స్పష్ట అభిప్రాయము. ఈ అంశాన్ని వారు " వ్యాస తాత్పర్య నిర్ణయ " అనే గ్రంథములో ప్రతిపాదించినారు. శంకరులు , ’ ఉపనిషత్ సారమే అద్వైతము ’ అన్నారు. వారు ప్రతిపాదించిన అద్వైతము , తరువాతి కాలములో కావలసినంత విస్తారమూ , ప్రసిద్ధీ అయినది. 

ఓం తత్ సత్

[ బోధివృక్ష --కన్నడ ప్రచురణ నుండీ అనువాదము ]

No comments:

Post a Comment