SHARE

Sunday, March 10, 2013

59. " మహాదర్శనము " --యాభై తొమ్మిదవ భాగము --తీర్థ యాత్ర


59.  యాభై తొమ్మిదవ భాగము --  తీర్థ యాత్ర


భార్గవుడు రాజభవనము నుండి నేరుగా దేవరాతుని ఇంటికి వచ్చినాడు. అతడూ ఇంటిలోనే ఉన్నాడు. 

         " ఆచార్యా నా ఇష్టము నెరవేరింది. బహు దినములనుండీ ఉప్పు తిన్న దేహము , ఆ ఉప్పునిచ్చిన ప్రభువు అనుమతి లేకనే వెళ్ళిపోవుట ఎలాగ ? అని ప్రబలమైన యోచన వచ్చియుండెను. ఈ దినము కాలము అనుకూలమైనది. నా చివరి సమాలోచనను నిర్వహించి ప్రభువు కొచ్చిన సంకటము దూరము చేసినాను. నా సంకటము కూడా దూరమైనది. "

        దేవరాతునికి అర్థము కాలేదు. భార్గవుడు రాజభవనములో జరిగినదంతా చెప్పినాడు. కొడుకు దొరగారిని లక్ష్యము లేకనే మాట్లాడినాడని అతనికి దిగులూ , సంతోషమూ రెండూ కలిగినవి. చివరికి మహారాజు అతడి మాటను అంగీకరించినాడని విని , ఒకటి పోయి రెండోది పూర్తిగా నిండిపోయింది. 

" సరే , మరి ఇప్పుడేమి చేయవలెనని ఉన్నారు ? "

" చేసేదేముంది ? ఒకసారి తీర్థ యాత్రకు వెళ్ళుట. అది ముగియగానే వెళ్ళి భగవానుల ఆశ్రమములో ఉండుట. "

" ఇదేమో ఇప్పుడే అంటిరి కదా ? దానిని చూచి మా దంపతులము కూడా మీతోపాటే వస్తాము. " 

         " సరిపోయింది , అది ఎప్పుడో ఏమో  అన్నది తెలియకనే మనము కాచుకుని కూర్చొనుటకు అవుతుందా ? మన పని మనది , వారి పని వారిది. ఇప్పుడు చూడండి , మాఘ మాసము రాబోతున్నది. నేను పాదచారినై హిమాలయముల వైపుకు వెళతాను. నేను హిమాలయములకు వెళ్ళేటప్పటికి మాఘమాసము ముగియవస్తుంది. ఆ తరువాత వసంత ఋతువంతా అక్కడ గడిపి మరలా వానలొచ్చేటప్పటికి ఈ బయలునాడుకు వచ్చేసేదనుకున్నాను. "

" మీ ఆలోచన బాగుంది . అటులనే, ఎవరెవరు వెళుతున్నారు ? " 

" వేరెవరూ లేరు, నేనొక్కడినే వెళుతున్నాను. "

" మీరొక్కరే వెళ్ళుటకు సన్యాసులు కాదు కదా , మీ కుటుంబము వారికి ఇలాగ తీర్థయాత్ర సంగతి చెప్పినారా ? " 

" ఆమె ఆశ్రమానికే రానన్నది , ఇక హిమాలయాలకు వస్తుందా ? " 

         "ఇక్కడే మీరు పొరపడినారు. ఆశ్రమమునకు వెళ్ళు నిబంధనయే వేరు. తీర్థయాత్రకు వెళ్ళు నిబంధనలే వేరు. కాబట్టి వెళ్ళీ,  ఆమెకు చెప్పండి. యోగ్యమైన తిథిని చూచుకొని మేమూ వస్తాము. మన రెండు కుటుంబాల వారూ జతగా కలసి వెళ్ళివద్దాము. కొంచముండండి. మీరు తెచ్చిన వార్త ఆలంబినికి కూడా చెప్పవచ్చుకదా ? " 

భార్గవుడు ఆలోచించి అన్నాడు , " ఆడవారి నోటిలో మాట నిలుచుట కష్టము. కాబట్టి సూక్ష్మముగా చెప్పండి. " 

         " అదంతా అయ్యేది కాదు. చెబితే పూర్తిగా చెప్పవలెను. లేకుంటే వద్దే వద్దు. ఇక ఆడవారి నోటిలో నువ్వు గింజ నానదు అంటిరి, దానికి కావాలంటే భద్రము చేద్దాము. " 

" అలాగయితే సరే " 

         దేవరాతుడు భార్యను పిలచి, " ఇదొక రహస్యము , ఎవరికీ చెప్పకూడదు " అని కట్టుదిట్టము చేసి రాజభవనపు విశేషాలన్నీ చెప్పినాడు. " చూడు , జమా జెట్టీల పోటీకి బదులు , కొమ్ములు తిరిగిన ఆంబోతుల పోటీలకు బదులు , బ్రహ్మజ్ఞానుల పోటీ జరుగుతుంది. నీ కొడుకు కూడా ఈ ఆంబోతులలో ఒకడు. బహుశః నీ ఆంబోతే  గెలవవచ్చు. అది చూచి తీర్థ యాత్రకు పోదామా లేక , ముందే పోదామా ? భార్గవులు అప్పుడే బయలుదేరి ఒంటికాలి మీద నిలబడినారు. వారికి చెప్పినాను , మీరు గృహస్థులు , మీ అర్ధాంగపు ఇంకొక కాలు కూడా వస్తే రెండుకాళ్ళతో యాత్ర బాగా జరుగుతుంది అని. వారు కూడా అర్ధాంగీకారము ఇచ్చినారు . "

         " ఔను , నాకు కూడా చాలా దినములనుండీ తీర్థ యాత్ర పిచ్చి పట్టుకున్నది. వీరి ఇంటి ఆడవారికీ అది ఉంది. పోయిన ఏడాదే వెళదామా అంటే వీరే వద్దన్నారట. ఇప్పుడు మీరు చెప్పిన జ్ఞాన సత్రము ఎప్పుడు జరుగుతుంది ? " 

        " జ్ఞాన సత్రము ...హహ మంచి పేరే పెట్టినావు, భార్గవుల వారూ , వీలైతే మహారాజు వారికి ఈ పేరు సూచించవలెను. ఆలంబీ , మహారాజుగారు ఇది చేయవలసిన కార్యము అని ఒప్పుకున్నారు. అయితే , ఎప్పుడు ? ఏ రూపముగా ? మొదలైన వివరాలు ఒక్కటీ తెలియలేదు. "

         " అలాగయితే ఒక పని చేద్దామా ? మీకొడుకు కూడా అందులో ఒక ముఖ్యుడు అన్నారు కదా ? ఇంకా ఇది ఎవరికీ తెలీదు. ఇక్కడి నుండీ ఆశ్రమానికి వెళ్ళి వాడినీ వాడి భార్యలనూ పిలుచుకొని తీర్థ యాత్రలకు వెళదాము. మనము వైశాఖమాసపు చివరిలో వస్తాము. వాడు లేకుండా జ్ఞాన సత్రము ఎక్కడిది ? వాడు వచ్చిన తరువాత అది జరిగితే మనకు తీర్థ యాత్ర కూడా అవుతుంది , జ్ఞాన సత్రమూ దొరుకుతుంది. "

         " భార్గవులూ చూచితిరా ? స్త్రీ బుద్ధి మనకన్నా చురుకు. ఈమె ఎంతటి ఉపాయమును చెప్పింది ? ఒకవేళ యాజ్ఞవల్క్యుని వదలి జ్ఞానసత్రము జరిగితే ? " దేవరాతుడు శంకించినాడు. 

         " ఈ దినము మహారాజులు చెప్పినదానిని బట్టి , భగవానులను అందరి సమక్షములో ఎంచుకొనుటకు ఆడుతున్న నాటకమిది. అదీగాక రాజుకు విదగ్ధ శాకల్యుడి పైన అభిమానము తగ్గింది. అయినా వెనుక ఉపాద్యాయుడై ఉన్నాడని ఊరకున్నారు. వారికి తమ దేశపు వారికే రాజగురువు పట్టమును కట్టవలెనని ఆశకూడా ఎక్కువైంది. అయినా రాజగురుత్వము రాజాభిమానమును అవలంబించి ఉండకూడదను ధర్మ జ్ఞానమూ ఉంది. అంతేగాక , రాజగురువు ఇతర విద్వాంసులెవ్వరికీ తక్కువ కాకూడదు అన్న మానోన్నతి కూడా ఉంది. ఇదంతా వారు ఆ దినము ఆశ్రమమునకు వచ్చినపుడే నిర్ణయించుకున్నారు. కానీ భగవానులు పరీక్ష కావలెను అన్న తరువాత విధిలేక ఈ ఉపాయము. కాబట్టి అతడు లేకుండా సత్రము ఎలా జరుగుతుంది ? " 

         ఆలంబిని మధ్యలో కల్పించుకుంది "  ఒకవేళ మీకు అటువంటి అనుమానముంటే ఒక పని చేయండి. గార్గిని కూడా వెంట తీసుకొని వెళదాము. ఆమెకు కూడా అభిలాష ఉంది. సరియైన వారు తోడుగా  దొరికితే ఆమె రానే వస్తుందని నాకు తెలుసు. "

         ఆ వేళకు వాకిట్లో ఎవరో పిలచినట్లాయెను. ఆలంబిని వెళ్ళి చూస్తే , గార్గి. ఆమె నవ్వుతూ ఆమెను పిలుచుకొని వచ్చింది. " ఇగో , చూడండి , మన గార్గికి సహస్ర వర్షములు ఆయుష్షు. మనము ఆమె గురించి అనుకుంటున్నపుడే వచ్చినారు. " 

భార్గవ దేవరాతులు లేచి వెళ్ళి ఆమెను ఆహ్వానించి ఆసనమును ఇచ్చినారు. 

" ఎంతైనా నేను ఆడదాన్ని. నేను మీతో సమానముగా కూర్చొనేదా ? "

" మీరు ఆడవారూ కాదు , మగవారూ కాదు: విద్వాంసులు "

        ఆమె ఏమో చెప్పుటకు నోరు విప్పి , వెంటనే మనసు మార్చుకొని , " పెద్దవారు చెప్పినట్లు వింటాను " అని వారు చూపిన వేత్రాసనములో కూర్చున్నది. ఆమె బలవంతము మీద ఆలంబిని కూడా కూర్చున్నది. 

" నా విషయమేమిటి వచ్చింది ? " ఆమె అడిగింది. 

        దేవరాతుడు, " మరేమో కాదు , మేము తీర్థ యాత్రకు వెళ్ళవలెననుకున్నాము. మా వెంట ఎవరెవరిని పిలుద్దామా అని ఆలోచించినాము. అప్పుడు మీ విషయము వచ్చింది " 

" మేము అంటే ఎవరెవరు ? "

" మేము అంటే , భార్గవుల దంపతులు , మా దంపతులము , యాజ్ఞవల్క్యుల దంపతులు"

" నిజంగా ? ఎన్ని నెలలు ? "

" రెండు , రెండున్నర నెలలు. మాఘమాసములో బయలు దేరుట, వైశాఖము వేళకు హిమాలయపు క్షేత్రములు చుట్టుకొని వచ్చేసేది. "

" యోచన బాగుంది. యాజ్ఞవల్క్యుల ..కాదు , భగవానుల వెంట అన్ని దినములు ఉండుట అంటే అదృష్టముండవలెను. వారిని ఒప్పించినారా ? " 

ఆలంబిని అన్నది " ఆ పని నాకొదిలేయండి " 

" సరే, మంచిది , అటులనే. భార్గవుల వారూ , తమరు రాజపౌరోహిత్యము వద్దన్నారట , ఔనా ? "

" నిజమే. మీకెవరు చెప్పినారు ? "

        " అది నాకింకెవరు చెపుతారు ? మీ పుత్రుడు వచ్చి పొద్దున చెప్పినాడు. సంగతేమిటో తెలుసుకుందామని మీ ఇంటికి వెళ్ళినాను. మీరు లేరు, సరే ఇక్కడున్నారంటే ఇక్కడికే వచ్చినాను. "

        " నేను ఇల్లువదలి , రాజ భవనమునకు వెళ్ళి అక్కడి నుండీ ఇక్కడికి నేరుగా వచ్చినాను. అక్కడ మహారాజు గారిని చూసి , రాజ పౌరోహిత్యము నాకిక వద్దు అను చెప్పి వారి ఆమోదము తీసుకొని వచ్చినాను. "

" అయితే ఆ తరువాత విన్నదీ నిజమేనా ? "

" ఏమిటి ? "

" మీరు ఆశ్రమమునకు వెళ్ళి అక్కడ భగవానుల వద్ద ఉండాలనుకున్నది ? "

" అదీ నిజమే "

" అలాగయితే తీర్థయాత్ర సూచన దేవరాతులు ఇచ్చిఉండవలెను ? "

" అది కూడా నిజమే "

"సరే, మహారాజులకు ఏమో అనారోగ్యమట ? ఇప్పుడెలాగున్నారు ? "

భార్గవులు నవ్వుతూ అన్నారు, " ఆరోగ్యము పాడగునట్లు చేసినది మీ భగవానులే "

" అదెలాగ ? "

         " అదిలాగ " అని జరిగినదంతా భార్గవులు చెప్పినారు. గార్గి అది విని , " భలే, భలే, అదీ పరాక్రమమంటే. ఈ దేశమునేలే మహరాజు శిష్యుడనవుతాను అని అంటే , ’ నీ గురువును పరీక్ష చేసి ఎంచుకో ’ అనవలెనంటే ఎంత ధైర్యముండవలెను ? లక్ష్యము లేకపోవడము ప్రపంచాతీతమును చూచినవారి ఆనవాలు. అక్కడ చూడండి , మా యింటికి ఆవును తెచ్చుకోవాలంటే , దాని పుట్టుబడి చూచి , కొమ్ములు చూచి , సుడి చూచి , పాలు చూచి తెచ్చుకుంటాము. అటువంటపుడు గురు శిష్యులు ఒకరినొకరు పరీక్ష చేయకనే ఒప్పుకునేదెలాగ ? భగవానులు చాలా బాగా చెప్పినారు. సరే , ఆ కారణముచేత మహారాజులకు రోగము వచ్చినది. ఔను , ఒకరికి చెప్పుకొను నట్లు లేదు , మౌనముగా భరించుటకూ లేదు, మంచి పేచీనే ! " 

మరలా గార్గి అడిగినది: " బయలు దేరేది ఏ దినము ?"

దేవరాతుడు ఉత్తరమిచ్చినాడు: " అది రేపు నిర్ణయిస్తాము. "

" సరే, నాకెలా చెపుతారు ? "

" భగవానుల పుత్రుడొచ్చి చెపుతాడు " 

" అయితే నేను వెళ్ళిరానా ? "

గార్గి లేచి నమస్కార ప్రతి నమస్కారములతో వెళ్ళిపోయింది. ఆలంబిని ఆమె వెంట వెళ్ళి కుంకుమ ఇచ్చి వచ్చినది. 

        భార్గవులూ , దేవరాత దంపతులూ ఇంకొక ఘడియ అలాగే ఉన్నారు. భార్గవులకు ఇంటికి వెళ్ళుట ఇష్టము ఉండలేదు. భార్గవులు ఇంటికి వెళ్ళి తీర్థయాత్ర సంగతి భార్యకు చెప్పి ఆమెను ఒప్పించి వచ్చి చెప్పవలెననీ , ఆ  తరువాత ఆలంబినీ దేవరాతులు ఆశ్రమమునకు వెళ్ళి కొడుకునూ కోడళ్ళనూ ఒప్పించవలెననీ నిర్ణయించుకున్నారు. 

No comments:

Post a Comment