డెబ్భైయవ ( చివరి ) తరంగం .
భగవాన్ యాజ్ఞవల్క్యుల ఆహ్వానము మేరకు మందాకినీ అలకనందా నదుల సంగమములో భగవాన్ నచికేతుల ఆశ్రమములో బ్రహ్మర్షి పరిషత్తు భగవాన్ పిప్పలాదుల అధ్యక్షతలో సమావేశమైనది . భగవతీ గార్గి, అతిథి పూజకు నియుక్తులైనారు . ఒక విశేషమేమనిన , " సరస్వతీ నదీ తీరములో యాగము చేస్తున్న ఋషి గణమొకటి అనార్య ఋషి గణమునొక దానిని చూచినది . ఈ అనార్య గణములో పన్నెండుగురున్నారు . వారికి క్రమాధ్యయనము కాలేదు . అయినా వారంతా బ్రహ్మజ్ఞులు . వారు పిలచిన చోటికి దేవతలు వస్తారు . వారు దేవ భాషలోనైనా, ప్రాకృత భాషలోనైనా మంత్రములను రచించగల మంత్రకృత్తులు . వారి విషయములో ఆర్యర్షులు ఎలాగు వ్యవహరించవలెను అన్నది పరిషత్తు ధృవీకరించి చూపవలెను " అని ఒక మనవి వచ్చినది . ఆ అనార్య గణము కూడా వచ్చింది . వారితో పాటు చంద్ర వంశజుడైన యయాతి , సూర్యవంశపు జనకుడు వీరిద్దరూ సభకు విశేషాహ్వానము పై వచ్చినారు .
మొదటి రోజు హోమ , హవనములను చేసి , దేవర్షి పితృ గణములను అర్చించి , సభా కార్యములను ఆరంభించినారు . భగవాన్ పిప్పలాదుల సమక్షములో భగవాన్ వశిష్ఠులు వారి కుడివైపు ఆసనములో విరాజమానులైనారు . ఎడమ వైపు భగవాన్ విశ్వామిత్రులు. సభా కార్యకలాపములు ఆరంభమయినవి .
భగవాన్ యాజ్ఞవల్క్యులు లేచి అన్నారు , " ఈ దినము పరిషత్తు చేరిన కారణము , భగవాన్ విశ్వామిత్రుల అభినందనకు . వెనుక , పరిషత్తు చేరినపుడు , భగవతీ గార్గి , ’ ఆర్యీకరణమునకు ఒక సులభ సాధనమును కల్పించవలెనని భగవాన్ విశ్వామిత్రులను ప్రార్థించినారు . ఈ దినపు అధ్యక్షులతో పాటు అనేకమంది ఆ ప్రార్థనలో భాగము వహించినారు . వీరే తపస్సా , తపస్సే వీరా అన్నట్లు తపస్సును చేసిన ఈ పుణ్యపురుషుడు దానిని సాధించినాడు . నిదర్శనము లేనిదే మేము అంగీకరించుట లేదు . కాబట్టి నిదర్శనము కూడా అయినది . సరస్వతీ తీరపు ఋషులు ఇక్కడికి పంపించి యున్న ఈ ఋషిగణము , వెనుకటి కాలములో అనార్యులు . వారు విశ్వామిత్రుల అనుగ్రహము పొంది మంత్ర కృత్తులగు మంత్ర పతులైనారు . వారిని పిలుచుకొని వచ్చిన ప్రతినిధులు ఈ సభ ముందుకు వచ్చి , అక్కడ జరిగినది చెప్పెదరు . దానికి అనుమతి కావలెను "
సభ అనుమతి పొంది పిప్పలాదులు ప్రతినిధిని పిలచినారు . అతడు వచ్చి , సభకు నమస్కారము చేసి , " గొప్ప వారికి నమస్కారము . అర్భకులకు నమస్కారము . తరుణులకు నమస్కారము , వృద్ధులకు నమస్కారము , బ్రహ్మకు నమస్కారము , బ్రహ్మజ్ఞులకు నమస్కారము , నేను సత్యమునే చెప్పెదను . నేను చెప్పు సత్యము నన్ను కాపాడనీ . నేను చెప్పు సత్యము దానిని విన్నవారినందరినీ కాపాడనీ . నేను ఋతమును చెప్పెదను . ఆ ఋతము , చెప్పిన నన్నూ , విన్న ఇతరులనూ కాపాడనీ . నానోటిలో అసత్యము , అనృతము వచ్చినచో నా తల పగిలి నూరు ముక్కలవనీ " యని ప్రతిజ్ఞ చేసి , సభ అనుమతి పొంది పలికినాడు ,
" మేము అనగా , సరస్వతీ తీరములోనున్న ఋషులందరూ చేరి విశ్వ శాంతికై ఒక యజ్ఞమును చేయుచుంటిమి . మూడవ దినము మధ్యాహ్నము హోమము జరుగవలసినపుడు , ఒక గుంపు అక్కడికి వచ్చి , ’ మేము కూడా యజ్ఞములో భాగము వహించెదము. అనుమతి కావలెను ’ యని ప్రార్థించినారు . ఆ గణపు ముఖ్యుడుగా నున్నవాడు కవష ఐలూషుడను మహనీయుడు . వారిని గురించి విచారించగా , వారిలో అనేకులు శూద్రీ పుత్రులు : అద్విజులు , అనార్యులు , క్రమాధ్యయనము చేయని వారు అని తెలిసి వచ్చి , వారిని యజ్ఞ భాగాధికారులుగా మేము అంగీకరించలేదు . వారంతా తమకు నిరాశ కలిగిననూ మారు మాట్లాడక వెళ్ళి పోయినారు . వారి వినయమునూ , సౌజన్యమునూ చూచిన ఋషులు , ’ యేమి చేయుట ? విధాయకముగా అవకాశము లేదు ’ అని ఎంతో బాధ పడినారు "
" మాధ్యందిన హోమము ఆరంభమయినది . ఎంత పిలచిననూ ఏ దేవతలూ రాలేదు . ఇదేమిటీ ఆశ్చర్యము అని దేవపతి యైన ఇంద్రుని పిలచితిమి . అతడు అర్ధార్ధముగా ప్రకటమై , ’ మీరు పంపించి వేసిన ఋషులు పొందిన నిరాశ తీరువరకూ దేవతలు ఇక్కడికి రారు . మేమంతా వారివైపున యున్నాము ’ అని , మేము ఇచ్చిన హవిస్సును కూడా స్వీకరించక అంతర్ధానమైనాడు . "
" ఆ పిమ్మట మా ఋషులంతా వెళ్ళి , కవష ఐలూష గణమును ప్రార్థించి , తాము ప్రారంభించిన యజ్ఞమును వారి యనుమతితో యథావిధిగా ముగించి , వారిని ఇక్కడికి నావెంట పంపించినారు . ఇక ముందు యేమి కావలెనన్నది పరిషత్తు నిర్ణయించవలెను . "
భగవానులొకరు లేచి , ’ సభాపతులకు విజ్ఞాపన . అనార్య ఋషిగణపు విషయము సభ ముందరికి ఇప్పుడే వచ్చినది , వారి విషయమున యేమి చేయవలెనని ఇంకా నిర్ధారింపబడలేదు , కానీ అప్పుడే , అతిథి సత్కారమునకై నియుక్తులైన వారు , వారికి మధుపర్కమును ఇచ్చివేసినారు . ఇది క్రియా లోపమా కాదా యని విమర్శ చేయవలసినది . " అన్నారు.
సభాపతులు , అతిథి సత్కారమునకు నియమింపబడిన భగవతీ గార్గి ముఖమును చూచినారు . ఆమె లేచి , సభాపతులకూ , సభకూ వందనము చేసి , ప్రసన్న ముఖముతో , మందహాసమును చిందిస్తూ , వినయముగా అన్నారు , " భగవానులొకరు క్రియాలోపమును ప్రస్తావించినారు . అతిథులు వచ్చినపుడు వారి వారి యోగ్యతకు అనుగుణముగా సత్కారము చేయుట నా కార్యము . నాకు ఇచ్చిన కార్యములో , నా సామర్థ్యమునకు అనుగుణముగా , ప్రతియొక్కదానినీ గమనించి కార్యము చేసినదానను . ఆ మహర్షులు వస్తున్నపుడే వారితో పాటు వస్తున్న పంచాగ్నులనూ చూచినాను . వారిని ఆర్యులని పరిషత్తు అంగీకరించలేదు , నిజము. అయితే , పంచాగ్ని సమేతులుగా వచ్చినవారికి మధుపర్కమును ఇవ్వకున్న , యజ్ఞేశ్వరునికి ద్రోహము జరిగి , సభకూ , సభాపతులకూ ప్రత్యవాయము ఉండునని బెదరి , ఆ అగ్నివంతులకు నేను మధుపర్కమును ఇచ్చినాను . ఇది అపరాధము కాదనునది తామెల్లరకూ తెలుసు . అయినా, సభా మర్యాదయని ఇదిగో , చేతులు జోడిస్తున్నాను , అపరాధమైనచో క్షమించవలెను . మనము బ్రహ్మవాదులము . కర్మలో ప్రమాద వశమున న్యూనాతిరిక్తములు వచ్చిననూ , దానిని సహించుకొనువారము . అటులనే , ఈ పరిషత్తు కూడా కర్మ దోషముండినచో సహించుకొనవలెనని ప్రార్థన "
ధర్మజ్ఞులందరూ ఆమె చేసినది సరియైనదే యన్నారు . " పరిషత్తులలో అన్ని కార్యములకన్నా ప్రధానమైనది అతిథి సత్కారము . దానిలో ఎక్కువ తక్కువలయినచో పరిషత్తు బాధ్యత వహించి అశ్రేయస్సును పొందవలెను . కాబట్టి , అగ్నివంతులకు మధుపర్కము , వారు ఎవరైననూ సరే , సమర్పించవలసినదే అయినందువలన , ఆమె చేసినది సరియైనదే " యన్నారు .
ఇంకొకరు లేచి నవ్వుతూ సభాపతికి తెలిపినారు , " భగవతి గార్గి చేసినది సరియని అంగీకరించిన సభ , వారిని ఆర్యులు , బ్రాహ్మణులు అని కూడా ఒప్పుకున్నట్లే అయినది . దానితో పాటూ భగవాన్ విశ్వామిత్రులు కల్పించి ఇచ్చి మహదనుగ్రహము చేసిన ప్రాజాపత్య వ్రతము యొక్క మహిమను తెలుసుకోవడమూ అయినది . ఇక , సభ ముందున్న కార్యము , భగవాన్ విశ్వామిత్రులు మనుష్య కులమునకు చేసిన పరమోపకారమునకు వారిని అర్చించుట . ఆ అర్చన యే రూపముగా జరగవలెను అనునది నిర్ణయించవలెను , అంతే ! " అన్నారు .
అందరూ ’ ఔను , ఔను ’ అని ఆనందముతో కరతాళ ధ్వనులు చేసినారు . భగవతీ గార్గి లేచి నిలచి , " ఒక పుష్పమంటపమును కట్టి, దానిలో భగవాన్ విశ్వామిత్రులను కూర్చోబెట్టి , మనమందరమూ ఆ రథమును లాగుకొని వెళ్ళవలెను . ఇది మనము వారికి చేయవలసిన అర్చన కావాలి . " అన్నారు .
మహారాజైన యయాతి , మహారాజు జనకుడి అనుమతి పొంది , లేచి నిలచి , " సూర్య వంశ భూషణుడైన జనక మహారాజు ఈ పరిషత్తుకు విజ్ఞాపించమని నాకు అనుజ్ఞ నిచ్చినారు . ఈ బ్రహ్మ పూజకు క్షత్ర సమాయోగము విహితమైనందు వలన , పుష్ప రథమును కట్టుట తమ కార్యమవనీ , దానిని లాగుకొని పోవుట మా భాగమవనీ. దీనికి పరిషత్తు ఒప్పుకొని అనుమతి నివ్వవలెను . "
భగవాన్ పిప్పలాదులు లేచి , ఆ సూచనను అంగీకరించ వలెనని పరిషత్తును ప్రార్థిస్తూ , " ఈ సభాపరముగా ఆ కార్యములో భాగము వహించుటకు సభాపతులకు కూడా అవకాశము ఉండవలెను " అన్నారు .
భగవతీ గార్గి లేచి నిలుచుకొని , ముసి ముసిగా నవ్వుతూ , " సభాపతులు దాక్షిణ్యమును చూపి మావైపు తిరగవలెను . ఈ సూచనను తెచ్చినవారు కార్యములో భాగస్వాములు కాకపోతే అది పూర్ణమెలాగవుతుంది ? " అన్నారు .
అందరూ సరేనని సమ్మతించినారు . రథమును లాగువారు నలుగురు యని నిర్ణయించినారు . సభాపతులు లేచి , " భగవాన్ విశ్వామిత్రులు దీనిని అంగీకరించవలెను " అని చేతులు జోడించినారు . భగవానులు లేచి నిలచినారు . భవ్యమైన ఆ పురుషాకృతిని చూచినవారందరూ , " ఇది లోకానుగ్రహార్థము మూర్తిగా మారిన వేదములే అయిఉండాలి " అని మనసా అభివాదనము చేసినారు . వారన్నారు , " ఈ దినపు యశస్సంతయూ భగవాన్ వశిష్ఠులది . ద్వేషముఖముగా వారిని ఆరాధించుటకు వెళ్ళిన నేను ఇప్పుడు రాగపూర్వకముగా పరమ ప్రీతితో ఈ మాట చెప్పుచున్నాను . ఈ పరిషత్తు పరముగా భగవతీ గార్గి మొదలైన వారు సర్వులూ నాకు ఇచ్చిన పనిని నిర్వహించుటకు కూడా వీరే కారణము . అగస్త్యాశ్రమమునకు వెళ్ళమని వీరు సలహా ఇచ్చి మార్గ దర్శకులైనారు . అదేవిధముగా , అన్నిటికన్నా ముందు భగవాన్ వామదేవుల ద్వారా అనుగ్రహించినవారు కూడా వీరే ! కాబట్టి వీరికి ఈ పూజ సమగ్రముగా జరగవలెను " అన్నారు .
చివరికి భగవంతులిద్దరూ పుష్పరథములో కూర్చోవలెనని నిర్ణయమైనది .
మారుదినము పుష్ప రథము సిద్ధమైనది . రథపు అలంకారమునకు పూలుతెచ్చుటకు వెళ్ళినవారు వచ్చి , తమ ఆశ్చర్యమును చెప్పలేకపోతున్నారు . ఆశ్రమపు చుట్టుపక్కల ఉన్న వృక్ష లతలన్నీ కేవలము పూలగుత్తులై ఉన్నాయి . కాలము , అకాలము యను నియమమే లేకుండాపోయి , అన్ని ఋతువుల , అన్ని పుష్పములూ పూసినాయి . ఇప్పుడు అలంకారమునకు పూలు వచ్చినవి బుట్టలలో కాదు , బళ్ళలో ! అందరూ వెళ్ళి ఆ వనలక్ష్మి పుష్పాలంకారమును చూచి వచ్చినారు . ఎక్కడ చూసినా పూలే పూలు . చెట్లలో , మొక్కలలో , పొదలలో , తీగలలో ఎక్కడ చూసినా ఒక్క ఆకు కూడా కనపడదు . ఆ పూల సాగరములో ఆకులన్నీ ఏదో ప్రభావమునకు లోనై పూలైపోయినట్లుంది .
పుష్పరథమును తపస్వులు ’ బ్రహ్మ రథము ’ అని పిలచినారు . వశిష్ఠ విశ్వామిత్రులను కూర్చోబెట్టుకొని ఆ రథము వస్తున్నది చూచినవారు " రెండు పక్షులు ఒకే చెట్టుపై కూర్చున్నట్లున్నవి " అన్న శృతిని స్మరించినారు .
యయాతి ధర్మిష్ఠుడు , జనకుడు బ్రహ్మిష్ఠుడు . వీరిద్దరూ రథమును లాగుతున్నది చూడగా , బ్రహ్మాండపు క్షేమము ధర్మ బ్రహ్మ సమాయోగమునందున్నది " అను వేద పురుషుని సందేశమును పాడుతున్నట్లుంది .
ఆ ఊరేగింపును చూచి , మానవులే కాదు , విశ్వానికి విశ్వమే సంతోష పడినది .
వశిష్ఠులు సమాధిలోనున్న విశ్వామిత్రులను హెచ్చరించి , ’ అక్కడ చూడండి ’ అన్నారు . దేవ గణ సహితుడైన దేవేంద్రుడు పరమ సంతోషముతో , పరమ భక్తితో చేతులు జోడించి నిలుచుండుట కనిపించినది .
వశిష్ఠులు నవ్వినారు : విశ్వామిత్రులూ నవ్వినారు.
*************************************************************************************************************************************************
ఇంతవరకూ ఈ మంత్ర ద్రష్ట కాదంబరిని ప్రోత్సహిస్తూ ఆద్యంతమూ విడువకుండా చదివిన మిత్రులకు , పాఠకులకూ సహృదయులకూ అనేకానేక ధన్యవాదాలు . మీరిచ్చిన ప్రోత్సాహము వెలలేనిది . విశ్వామిత్రుని ఆధ్యాత్మిక ప్రయాణము , గాయత్రీ మంత్రావిర్భావము పై మీరందరూ చూపిన ఆసక్తి , నాకెంతో ఉత్తేజాన్నిచ్చింది . ఇందులో నాపాత్ర చాలా పరిమితమైనది . ఏదో నాకు తోచిన విధముగా , నాకు వచ్చిన భాషలో రాశాను . శ్రీ దేవుడు నరసింహ శాస్త్రి గారిని మీ అందరికీ పరిచయము చేయడము నేను చేసుకున్న భాగ్యము . నాకు దానికి మించిన లబ్ధి ఇంకేమీ లేదు .
|| శుభం భూయాత్ |
| సమస్త సన్మంగళాని భవంతు||