SHARE

Friday, March 8, 2013

57. " మహాదర్శనము "--యాభై యేడవ భాగము--సంభాషణ


57. యాభై యేడవ భాగము--  సంభాషణ


          భగవానులు రాజ భవనమునకు వెళ్ళవలసిన దివసము సమీపించినది . ఆశ్రమపు కార్య భారమునంతటినీ భగవతి కాత్యాయని వహించుకొని వృద్ధ శిష్యుల సహాయముతో నిర్వహించవలెననీ , మైత్రేయి భగవానుల నిత్య సూర్యోపాసన చేయవలెననీ నిర్ణయమైనది. నిర్దిష్ట కాలములో ఇద్దరు శిష్యులతో రాజశకటములో బయలు దేరినారు. భగవానులు రాజధాని వద్దకు చేరగనే రాజ పురుషులు వచ్చి కనిపించినారు. వీరు వారిని పలకరించి , " మేము మా తండ్రి ఆచార్యుల ఇంటిలో దిగుతాము. ఈ దినము సంజ అయినది. కాబట్టి రేపటి దినము మహారాజుల అనుమతి అయినపుడు మేము వచ్చెదము. మాకోసము మధుపర్కము మొదలగు వ్యవస్థలు చేయనక్కరలేదు అని మహారాజులకు మా పరముగా విజ్ఞాపన చేయండి " అని గట్టిగా అయిననూ నవ్వుతూ చెప్పి పంపినారు. 

          ఆచార్యుల ఇంటికి గార్గి , భార్గవుడు వచ్చియున్నారు . యాజ్ఞవల్క్యులు వారిని చూచి సంతోషపడినారు. వారు కూడా వీరికి అభివాదనములను అర్పించినారు. భగవానులు , " ఇదేమిది , ఒకవేళ దేవి గార్గి అభివాదనమును సహించినా , మాకన్నా పెద్దవారు భార్గవుల అభివాదనమును సహించుటెట్లు ? ఒప్పుకొనుట సంగతి ఇంకా దూరపు మాట." అని ప్రత్యభివాదనములను చేయుటకు వెళ్ళినాడు. ఇద్దరూ దానిని ఆపి , " తమరు జ్ఞాన వృద్ధులు. కాబట్టి తమరికి మేము అభివాదనము చేయవలెను , తమరు మాకు కాదు " అన్నారు. భగవానులు తల్లిదండ్రులకు నమస్కారము చేసి ఆశీర్వాదము పొందినారు. 

         దారిలో ఒక విచిత్రము జరిగింది . హవ్యముగా ఉపయోగించవచ్చునని కొందరు సద్యో ఘృతమును ( తాజా నెయ్యి ) ఇచ్చినారు . బాగా పాలిచ్చు గోవులను అర్పించుటకు వచ్చినారు ఇంకొందరు. కానుకలను తెచ్చిచ్చినారు అనేకులు. విశేషమేమంటే , వారందరూ లోకమును ఉద్ధరించుటకు పుట్టిన మహాపురుషుడనీ , ఆదిత్య దేవుడి ప్రసాదముగా వేదాదులను పొందినవాడనీ గౌరవించువారే ! 

          కుశల ప్రశ్నలయిన తరువాత గార్గి కొంతసేపు ఉండి వెళ్ళినారు. రాజపురోహితుడు ఇంకా ఉన్నాడు. భగవానులతో  ఏదో చెప్పవలెనని అతడికి మనసులో ఉందని అతడి ముఖమే చెప్పుతున్నది. చివరికి దేవరాతుడు, " ఏమో చెప్పాలని ఉన్నట్లుంది , చెప్పేయండి . ఏకాంతములో చెప్పవలెనంటే మేము బయటికి వెళ్ళెదము " అన్నారు. భార్గవుడు , " నిజము. ఎలాగ ఆరంభించవలెను ? ఎక్కడినుండీ చెప్పవలెను ? అని ఆలోచిస్తున్నాను. మీరు ఉంటే నాకేమీ చింతలేదు. " అన్నాడు. భగవానులు కూడా అవునన్నారు. 

          చివరికి భార్గవుడు అన్నాడు , " అయ్యా, నిన్ను నువ్వు అని సంబోధించవలెను. అదీగాక నిన్ను శిశువుగా ఉన్నప్పటి నుండీ చూస్తున్న వాడిని నేను. కాబట్టి నువ్వు అంటే కోపము చేసుకోవద్దు. ఆదినము నీ ఉపనిషద్వ్యాఖ్యానమును విన్న దినము నుండి నాకు పిచ్చి పట్టినది. నేను రాజ పౌరోహిత్యమును వదలివేస్తాను. మీ గురు కులమునకు వచ్చేస్తాను. అయితే అక్కడ నావంటి వానికి అవకాశము ఉన్నదో లేదో అని వెనకా ముందూ చూస్తున్నాను." 

          భగవానులు నవ్వినారు. " ఇపుడిది మరీ బాగుంది. మీవంటి వారికి మా గురుకులములో స్థానము లేదంటే ఏమిటి ? గురు కులమున కంతా భగవాన్ అనిపించుకున్న వారు గొప్ప అయితే , మీరు అతడి తండ్రి స్థానములో ఉండండి. అయితే గురుకులమునకు వచ్చుట గొప్ప కాదు , అక్కడ ఏమి చేయవలెను అనునది మొదట నిర్ణయించుకొని రండి. అక్కడికి వచ్చునపుడు ఇక్కడివన్నీ ముగించుకొని , మరలా ఇక్కడికి వచ్చుట లేదు అన్నట్లు రండి. నేను , నా భార్యలూ సదా మీ సేవకై సిద్ధముగా ఉంటాము " అన్నారు.

          భార్గవుడు అన్నాడు , " అయ్యా , నేనేమి చెప్పేది ? మొదట యేయే వస్తువులు ప్రియమని నెత్తిన పెట్టుకున్నానో అవన్నీ ఇప్పుడు అసహ్యములైనాయి. ఇంటిని అంత అక్కరగా అవస్థలు పడి కట్టించినానా ?  ఇప్పుడు ఆ ఇంటిలో ఉండుటయే కష్టముగా ఉన్నది . తోడునీడగా ఉండి సేవ చేస్తున్న భార్యను వదలి పోలేనని కొన్నిరోజులు నలిగినాను. ఆమె మొన్న , " కావాలంటే మీరు వెళ్ళండి , నేను రాజధానిలో ఉంటాను " అన్నది. ఇంక ఇక్కడ నన్ను పట్టి ఉంచేది ఏదీ లేదు. " 

దేవరాతుడు, " భార్గవులు చెప్పినదంతా నిజము. వారు ఈ మధ్య రాజ భవనమునకు కూడా అంతగా పోవుట లేదు " అన్నాడు.  

         భగవానులు అన్నారు , " భార్గవుల వారూ , ఈ భోగములు తమరికి చాలనిపించినాయా ? అది చెప్పండి. అవి వద్దనిపించు వరకూ ఇక్కడే ఉండండి. అవి వద్దు , మరలా వాటిని నేను కోరను అనిపించగానే వచ్చేయండి. మేము మిమల్ని కంటికి రెప్పలా చూచుకొనెదము. తమరికి కావలసినది మేము చెప్పెదము. " అన్నారు. 

         ప్రాతఃకాల విధులన్నీ ముగించుకొని, అగ్నిహోత్రము , సూర్య నమస్కారములు కానిచ్చి , వేదాదులు పారాయణము చేసి ముగిస్తుండగా భగవానుల కోసమని రాజశకటము వచ్చింది. వారు తలిదండ్రుల అనుమతి పొంది రాజభవనమునకు వెళ్ళినారు. 

         మహారాజులు సరస్వతీ విలాసములో ఏకాంతముగా వేచియున్నారు. భగవానుల అనుజ్ఞ మేరకు మధుపర్కాదులు ఉండలేదు. పూర్వాభిముఖముగా ఒరగుదిండు వేసియున్న మెత్త మీద పరచిన విశాలమైన కృష్ణాజినముతో సుందరముగా నున్న ఆసనమొకటి. దాని కుడిపక్కన అదేజాతివే ఇంకా రెండు అజినములు ఎక్కువగా వేసియున్న ఇంకొక ఆసనము. దూరములో వ్యజనములు , చామరములు పట్టుకొని సిద్ధముగా నున్న దాసీజనము. 

          మహారాజులు వచ్చి సాష్టాంగ నమస్కారము చేసి భగవానులను పిలుచుకొని వెళ్ళి పూర్వాభిముఖముగా నున్న ఆసనము మీద కూర్చోబెట్టినారు. కుశల ప్రశ్నల ఉపచారములు ముగిసిన తరువాత మహారాజు చేతులు జోడించి అన్నారు : " సంభాషణ తమరే ఆరంభించవలెను. " 

          మందస్మితముతో భగవానులు ఆరంభించినారు. " వెనుక బాలాకి గార్గ్యుడు అను విద్వాంసుడుండేవాడు. అతడికి తాను విద్వాంసుడనని అహంకారము బలు హెచ్చు. దానితో పాటు , అదేమి మహా బ్రహ్మ విద్య! గురువు లేకపోతే నేర్చుకోలేమా అని ఒక అహంకారము. అతడు ఒక దినము కాశీరాజైన అజాతశత్రువు వద్దకు వెళ్ళి , ’ నేను నీకు బ్రహ్మమును గురించి బోధిస్తాను ’ అన్నాడు. రాజుకు మిక్కిలి సంతోషమయినది. ’ అందరూ జనకుని కన్నా విద్వత్ ప్రియులు వేరొకరు లేరు అని అతని వద్దకే పోతారు. కానీ నువ్వు నాదగ్గరకు వచ్చినది చాలా బాగున్నది. బ్రహ్మవిద్యను చెప్పిస్తాను అన్న మాటకు నీకు సహస్ర సువర్ణములు ఇస్తాను ’ అన్నాడు. సంవాదము ఆరంభమయినది. 

          గార్గ్యుడు , ’ ఆదిత్యునిలో ఉన్న పురుషుడే బ్రహ్మ ’ అన్నాడు. అజాత శత్రువు, ’ ఓ బ్రాహ్మణా, బ్రహ్మము అనేది పుట్టి వచ్చినది కాదు. పుట్టి వచ్చిన , పుట్టి రానున్న సర్వ భూతములకూ అది ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడిని ఉపాసన చేసినవాడు సర్వభూత మహేశ్వరుడగును అనుదానిని నేనెరుగుదును. నువ్వు అది అయినావా ? చెప్పు .’ అన్నాడు.

         గార్గ్యుడు ఇంకా ముందుకు కొనసాగించి , చంద్రాదులను గురించి చెప్పుతూ , చివరికి , ’ శరీరములోనున్న పురుషుడిని బ్రహ్మమని ఉపాసిస్తాను ’ అన్నాడు. అజాత శత్రువు, ఒక్కొక్క ఉపాసనకు ఒక్కొక్క ఫలమును చెప్పుచూ, ’ బ్రహ్మోపాసకుడు బ్రహ్మమే కావలెను. అది నువ్వు అయినావా ? చెప్పు. ’ అని అడిగినాడు. 

చివరికి గార్గ్యుడు తన జంభపు ఫలమును తానే అనుభవించి , ఆ అజాత శత్రువు నుండీ బ్రహ్మోపాసనను నేర్చుకున్నాడు. "

          ఈ కథను ఉపనిషత్తులో చేర్చవలెను అని అనుమతి అయినది . దీనిని ఇప్పుడెందుకు చెప్పినాను అంటే , నాకూ అలాగ ఎవరికీ తెలియనిది నేనెరుగుదును అన్న గర్వము వచ్చి నన్ను కిందకు తోసివేయకుండుటకు. మరియు, ’ పూర్ణోపాసన ఫలము పూర్ణుడనగుట ’  అని తెలిసి ఉండనీ అని దీనిని జ్ఞాపకము ఉంచుకొనుటకు. ఇక తమరు ఏమి చెప్పెదరో అనుజ్ఞనివ్వండి. " 

మహారాజు అదివిని సంతోషముతో తలయూపినారు. 

          " బహు ముచ్చటైన ఆరంభము. ఈ కథ తమరికి మాత్రమే కాదు , నాకు కూడా మార్గదర్శకము. ఈ దృష్టితో చూస్తే మేము తెలుసుకున్నది సరియా తప్పా అని మాకు సందేహము కలుగుచున్నది. ఏమి చెప్పేది ? "

         " ఆలోచిస్తూ కూర్చోవడానికేముంది ? ఈ దేహమే నేను అన్న భావము ఉన్నంతవరకూ సందేహములు వదలవు. కాబట్టి ఎక్కడో ఒకచోట నుండీ ఆరంభించండి. లేదా , నేనే అడిగేదా ? " 

" అదే సులభమనిపిస్తున్నది " 

" సరే , మొదటిది , తమరికి ఈ బ్రహ్మ జ్ఞానపు పిచ్చి , ఎందుకు , ఎలాగ వచ్చింది ? చెప్పండి . "

          " విద్యాభిమానము మా వంశపు సొత్తు. అంతేకాక, మా తండ్రిగారు , మనలో ఒకరు విద్వద్వరిష్టుడు పుట్టవలెను అన్న అభిమానము కలవారు. నేను బాల్యములోనే , ’ యస్మిన్ విజ్ఞాతే సర్వం విజ్ఞాతం భవతి ’ - ఏదైనా ఒకదానిని సరిగ్గా తెలుసుకుంటే సర్వమూ తెలియును అని విన్నాను. అలాగ అంతా తెలుసుకోవాలన్న జిజ్ఞాస నన్ను బ్రహ్మ జ్ఞానమునకు తీసుకు వచ్చింది. "

" మంచిది , తమరు ఎవరెవరిని సేవించినారు ? వారు ఏమేమి చెప్పినారు ? అనుజ్ఞ ఇవ్వండి. " 

" నేను శైలిని , ఉదంకుడు , వార్ష్ణుడు , భారద్వాజుడు , సత్యకాముడు , శాకల్యుడు అను ఆరుగురు గురువులను సేవించినాను. "

" అటులనా , వీరందరూ మాతృ , పితృ , గురువుల వలన సుశిక్షితులైన వారు. వారు చెప్పునది సరిగ్గానే ఉండవలెను. ఏదీ , ఒక్కొక్కటే చెప్పండి. " 

" శైలినుల వారు వాణియే బ్రహ్మము అన్నారు. " 

" అవును , వాణి నుండే కదా అంతా , వేదశాస్త్రముతో సహా , తెలిసేది ! కాబట్టి వాణిని బ్రహ్మమన్నారు . తరువాత ? "

" ఉదంకులు ప్రాణమే బ్రహ్మము అన్నారు . " 

" అది కూడా నిజమే. ప్రాణము లేనివాడు ఏమి చేయగలడు ?  అదీగాక , లోకము నూరారు పనులను చేయుట ప్రాణము కోసమే కదా , అందువలన వారు అలాగన్నారు. పిదప ? "

" వార్ష్ణులు చక్షుస్సే బ్రహ్మమన్నారు. " 

" అది కూడా సరియే. కన్నులతో చూడకనే ఏదైనా ఎలా తెలియును ? ఆ తరువాత ? "

" భారద్వాజులు శ్రోత్రమే బ్రహ్మము అన్నారు. "

" ఇది కూడా సరియే. శ్రోత్రము లేనివాడు ఉంటే ఏమి లేకుంటే ఏమి ? పిమ్మట ? "

" సత్యకాములు మనసే బ్రహ్మము అన్నారు. "

" అదియూ నిజమే . అన్నీ ఉన్నా మనసు లేకపోతే చేయుటకేముంది ? ఆమీదట ? "

" శాకల్యులు హృదయమే బ్రహ్మము అన్నారు . " 

        " అదీ సరియే , హృదయము లేకుండా ఇంకేముంటే ఏమి ? సరే , మీరు వీటిలో దేనిని అభ్యాసములో ఉంచుకున్నారు ? లేదా , దానికన్నా ముందే ఇది చెప్పండి , ఆయా గురువులు వీటి ఆయతనము , ప్రతిష్ఠ లను చెప్పినారేమి ? ’

" లేదు, వారు చెప్పలేదు. అలాగన్న నేమి ? "

" ఆయతనమంటే అది ఉన్న స్థలము. ప్రతిష్ఠ అంటే దేనిని పట్టుకుంటే అది దొరకునో , అది. కానివ్వండి , తమరి అభ్యాసములో ఉన్నదేది ? తమరి అనుభవమేమిటి ? "

" తమరి ప్రశ్నలే నాకు కొత్తగా ఉన్నాయి. బ్రహ్మమును గురించి అభ్యాసము చేయునదేమి ? దానివలన కలుగు అనుభవము ఎట్టిది ? "  

          " ఔను. బ్రహ్మము అన్నిటినీ తనలో ఉంచుకుని , అన్నిటిలోనూ తానుండి , వాటి బయట కూడా ఉండు అవ్యయము. దానిని గురించి అభ్యాసమంటే నేను , నేను అంటూ అన్నిటినీ ఆత్మ భిన్నముగా చూచు సంకుచిత దృష్టి లేకుండా చేసుకొనుట. ఆ సంకుచిత దృష్టి పోయేకొద్దీ మనుష్యుని ఆనందానుభవ శక్తి కూడా ఎక్కువగును. అప్పుడు గిన్నెడంత ఉన్న నీరు సముద్రమయినట్లగును. ఇప్పుడు తమరు చెప్పినవన్నీ ఏకాంశ బ్రహ్మములు. వాటిని ఉపాసన చేసిననూ ఫలముంటుంది.  కానీ పూర్ణ బ్రహ్మోపాసన ఫలముండదు. " 

" పూర్ణ బ్రహ్మోపాసన ఫలమంటే ఏమిటి ? "

" మనశ్శాంతి. రాత్రింబగళ్ళూ ఇది లేదు , అది చాలదు అని ఏడ్చే మనసు తన ఏడుపును పోగొట్టుకుని సుఖముగా ఉండుట. " 

          " ఆహా ! ఏమి మాట ? ఏమి మాట ! భగవాన్ , ఈ మాటకు , ఏడుపు పోవును అన్న తమరి మాటకు, ఏనుగంతటి కోడె దూడలున్న  ఆవుల మంద నొకదానిని మీకు అర్పిస్తాను. స్వీకరించవలెను. "

         భగవానులు సమాధానముగా యే ఉద్వేగమూ లేక అన్నారు , " తొందరేముంది ? ఉండండి. మీకు నేనింకా  ఆ పూర్ణ విద్యను నేర్పలేదు. ఆ పూర్ణ విద్యను  చెప్పనిదే మీరు బయట పడలేరు. అలాగ మీ శోకమును దాటించి ఉద్ధారము చేయకుండా మీరు ఇచ్చుదానిని గ్రహించుట ఎట్లు ? శిష్యుడిని ఉద్ధారము చేయకనే ఏమీ తీసుకోకూడదని తమరి తండ్రిగారు చెప్పేవారు. నాకు బాగా జ్ఞాపకము ఉన్నది. మీరు నాకు శిష్యులు కూడా  కాలేదు. అలాంటపుడు ఎలా తీసుకోను ? "

మహారాజులు యోచించినారు. ఒక ఘడియ తరువాత, " నన్ను తమరి శిష్యునిగా అంగీకరించి నాకు పూర్ణ విద్యను అనుగ్రహించండి. "

          " అలాగ వద్దు మహారాజా , శిష్యుడిని గురువు పరీక్షించునట్లే శిష్యుడు కూడా గురువును పరీక్షించవలెను. తన మనసు ఇతడు సరియైన వాడు అనుకున్న తరువాత యథావిధిగా గురువును వరించవలెను. కాబట్టి , తమరు పరీక్ష చేసి , తమరి పరీక్షలో గెలిచినవాడిని గురువుగా అంగీకరించవలెను. అంతవరకూ మీరు ఈ విషయపు రాజులు. తమరు అడిగినదానికి ఉత్తరమును చెప్పుట ఈ విషయ వాసులమైన మా ధర్మము. మీరు వింటున్నారు, నేను చెపుతున్నాను. మీకు విన్నామని సంతోషము, నాకు చెప్పినానని సంతోషము. నేనిక బయలుదేర వచ్చునా ? " 

          భగవానులు లేచినారు. మహారాజులు విధిలేక ఇష్టము లేకున్ననూ లేచి ప్రణామము చేసినారు. రాజ భవనము ముఖద్వారము వరకూ వచ్చి భగవానులు రాజ శకటములో కూర్చొన్న తరువాత చేతులు జోడించి వారిని వీడ్కొలిపినారు. 

Thursday, March 7, 2013

56. " మహా దర్శనము "--యాభై ఆరవ భాగము---చెరువు ఆసరాతో భావి


56.   యాభై ఆరవ భాగము-- చెరువు ఆసరాతో భావి


          ఆశ్రమపు ఒక మూల విశాలముగా పెరిగిన మర్రి చెట్టొకటి ఉంది. దాని మొదట్లో ఒక మూర ఎత్తుతో రాళ్ళగోడలపై ఫలకములతో కట్టిన అరుగు వంటి కట్ట ఒకటి. లోకవ్యాపారముల వలన ఆయాసమైతే భగవానులు అక్కడికి వెళ్ళి కూర్చుంటారు. సామాన్యముగా అటువైపుకు ఎవరూ వెళ్లరు. ఇక భగవానులు అక్కడుంటే మాత్రము ఒక్కరు కూడా ఆ వైపే చూడరు. 

        ఇప్పుడు భగవానులు అక్కడ కాత్యాయనితో పాటూ కూర్చున్నారు. ఒక ఘడియ విశ్రామము తరువాత భగవానులే భగవతిని అడిగినారు. " కాత్యాయినీ , నీకేమి ఆశ ఉంది ? "

ఆమె అన్నది , " మీ సేవ చేయుట ఒకటి తప్ప వేరే ఆశేమీ లేదు. "

        " మైత్రేయి అయితే బ్రహ్మ వాదిని. ఆమె నోటిలో ఇటువంటి మాట శోభిస్తుంది. కానీ నువ్వలాగ కాదు. నీకు ఏదో ఆశ ఉండే ఉంటుంది. పోనీ , స్త్రీ సహజమైన పుత్రాపేక్ష కూడా లేదా ? "

          కాత్యాయని పకపకా నవ్వింది. ఆపుకోలేక ఆపుకుంటూ అన్నది. గొంతులో తారుణ్యపు సరళత్వము లేదు. ప్రౌఢత్వపు గాంభీర్యము నిండి ఉంది," నిజంగా చెప్పవలెనంటే నాకు పిల్లలు కలుగుతారేమోనని గాబరా. పిల్లలయితే నేను వారిని చూచుకొనేదా ? మీ సేవ చేసేదా ? పిల్లలవుతే నాకు రెంటికీ చెడిన రేవతి గతి తప్పదు. కాబట్టి నాకు పిల్లలు వద్దు. కొడుకూ వద్దు , కూతురూ వద్దు. మీ చేయి పట్టి మీ ఇంటికి రాగానే నాకేదో తృప్తి వచ్చేసింది. తమరు గురుకులపు అధిపతి అయిన దగ్గర నుండీ నా తృప్తికి హద్దే లేదు. కాబట్టి నాకు ఏమీ వద్దు. అలాగని చిన్న చిన్న ఆశలు లేకపోలేదు, బెండకాయ పులుసు , బూడిద గుమ్మడికాయతో మజ్జిగ పులుసు , వడియాలు , అప్పడాలు...ఇటువంటి ఆశలింకా ఉన్నాయి. అయితేనేమి ? అవి తీరితే ఎంత సంతోషమో , తీరకున్నా అంతే సంతోషము. "

" ఇదేమిటి , నేను మాట్లాడుతున్నది మైత్రేయితోనా , కాత్యాయని తోనా ? "

        " బాగుంది మీ హాస్యము. లోకాంతరములలో ఉన్న వాటినన్నిటినీ సంయమము చేసి తెలుసుకొనే వారికి ఎదురుగా గూటము వలె కూర్చున్నది సరిగ్గా కనబడక పోతే నేనేమి చెప్పవలెను ? "

        " దేహమేమో కాత్యాయనిదే, సందేహము లేదు. కానీ , ఆశ్రమపు అధిరాజ్ఞియై లౌకిక వ్యాపార మగ్నురాలై యున్న కాత్యాయనికి ఆశలు లేవు, ఆమె వైరాగ్య సంపన్నురాలు అంటే నమ్మేదెలాగ ? ధర్మపత్ని సాధ్య విషయములను గురించి చెప్పితే సరి. భవిష్యత్తును అలాగ రూపించుకోవలెను , ఇలాగ రూపించుకోవలెను అంటే మాకు అర్థమవుతుంది . అది వదలి , మోక్షపత్ని వలె , నాకేమీ వద్దు , పిల్లలూ వద్దు అంటే ఎలా నమ్మమంటావు ? కాబట్టి అలాగ అడిగినాను. నీకు నెమరు వేసే ఆవును పాలు పిండుటకు లేపునట్లు ఒక దెబ్బ కొట్టినాను. "

         " నేనన్న మాట వలన మీకింత నొప్పి కలిగితే , ఇదిగో , కాళ్ళు తాకుతున్నాను. మాటల జోరులో సంయమము పేరు తెచ్చినాను. ఆ మాత్రానికే మీకు నొప్పి కలిగినదా ? అదెలాగ ? మేము నీటిలోకి రాయి విసరితే ఆ నీరు రాతిని మింగునట్లు , మిమ్మల్ని మేము కావాలని నొప్పించినా , ఆ నొప్పి మీకు తగులుటే ఆలస్యము, ఆనందముగా మారిపోతుంది. కాబట్టి దాని గురించి మేము కూడా అంతగా నొప్పి పడే అవసరము లేదు . " 

       " అదికాదు కాత్యాయినీ , భూమికి దేనిని విసరినా అది దానిని తనలో కలుపుకొని తనవలె ఆత్మసాత్ చేసుకుంటుంది. అలాగే , నాకు వచ్చినదంతా నేను కూడా నాలో కలుపుకుని ఆత్మసాత్ చేసుకుంటే ఆశ్చర్యమేముంది ? ఆత్మ అంటే ఆనందము కదా ? కాబట్టి ప్రతియొక అనుభవమూ ఆనందమే కావలెను కదా ? "

      " దేవా , ఇవన్నీ మైత్రేయికి ప్రత్యేకము. నేను సేవకోసమే పుట్టినదానిని. ఆమె విచారములకు చర్చలకూ జన్మనెత్తినది. ఆమె మీవలెనే తానుకూడా చెరువు కావలెను అనునది. నాకు ఆ ఆలోచనే లేదు. నేను చెరువు ఆసరాతో ఉన్న భావిని. కాబట్టి అన్నాను. నాకు ఎప్పుడూ దేనికీ దారిద్ర్యము లేదు. ఎల్లపుడూ నా హృదయములో అంతా నిండి తొణికిసలాడుతూ ఉంటుంది. ఈ నిండుదనము ఎక్కడిది అంటారా ? అది తమరిది. తమరి హృదయములో అదికావలెను , ఇది కావలెను , అది లేదు , ఇది లేదు అను ఆశ ఉండి ఉంటే  నా హృదయములోనూ ఉండి ఉండేది. మాటిమాటికీ మీరు ’ కిమ్ తేన మర్మ..’ దానివలన  ’ మాకేమికావలెను ’ అనుచున్నారు. కాబట్టి నాకూ అదే భావము వచ్చినది. అంతే ! " 

          " భలే , కాత్యాయినీ , ఈ దినమేమో మా కాత్యాయని సరస్వతి యైనది. మాట బహుబాగుంది. నేను చెరువు , నువ్వు భావి, ఈ ఉపమానమును ఇలాగే ముందుకు కొనసాగిస్తే నా గతి యేమి ? ఏక్కడినుండో ఏమేమో కొట్టుకొని వచ్చు మురికి నీరు నేను , తేటనైన , శుద్ధమైన నీరు నువ్వు. భలే బాగా తిడుతున్నావే "

        కాత్యాయని పడీ పడీ నవ్వింది. " మీరు చెప్పింది నిజము. లాగితే ఆ అర్థము కూడా వస్తుంది. కానీ నాకా అభిప్రాయము లేదు. సరే , అదలా ఉంచుదాము , ఒక వరము ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. కావాలంటే ఆ ఆశ ఉంది "

" ఏమిటి , చెప్పు " 

        " నెలకు మూడు నాలుగు దినములు నాకు మీ సేవ తప్పుచున్నది . దానిని నివారించగలిగితే చెప్పండి , నిరంతరాయంగా మీ పాద సేవ చేసుకుంటూ పడి ఉంటాను. " 

       " అదేమంత పెద్ద విషయము కాదు. అయితే కాత్యాయనీ , ఆడదాని దేహము అలాగ అగుట దాని ధర్మము. కాబట్టి దానికి అడ్డు రాకూడదు. సరే , ఇప్పుడు గుర్తొచ్చింది , నువ్వు గోవులు కావలెను అన్నావు కదా ? "

          " సరిపోయింది , అది ఆకాశానికి నిచ్చెన వేయుట వంటిది. ఒకానొక కాలములో మనవి అని చెప్పుకొనుటకు ఒక వేయి ఆవులు ఉండవలెను అను పిచ్చి ఉండినది. ఇప్పుడది అవివేకము అనిపిస్తుంది. వేయి గోవులంటే , వాటిని కట్టివేయుటకు ఎంతపెద్ద కొట్టము కావలెను ? వాటికి నీరు, పచ్చి గడ్డి వేయుట అటుంచి , ఆ కొట్టము కడుగుటకు నీరు ఎవరు మోసుకొని వస్తారు ? అని తలనిండా ఆలోచనలు వచ్చి , అన్ని ఉంటే పాలు పిండువారు ఎవరు ? అనిపించి , అది ఒక అవివేకము అను ఘట్టమునకు వచ్చినాను. " 

" ఒక వేళ నీకా యోగముంటే ? "

         " అప్పుడు దానిని అనుభవించక తప్పదు. ఇప్పుడే మన ఆశ్రమములోని ఇళ్ళలో ఉన్నవన్నీ కలిపితే సుమారు ఐదునూర్లు గోవులు లేవా ? వాటిని పంచినందువల్ల మనకు అంత ఇబ్బంది లేదు. అన్నీ ఒకచోటే ఉంటే ? అబ్బ! అదెక్కడాలేని కష్టము. మీ నోటిలో వచ్చిందంటే , ఏ పనిఅయినా జరగక పోదు. కాబట్టి వేయి ఆవులు వచ్చు యోగముంది అనిపిస్తున్నది. రానివ్వండి , అది సుఖయోగమగుటకు ఏమి చేయవలెను అని ఇప్పటినుండే ఆలోచిస్తాను. " 

" అప్పుడే అన్నావు కదా , ఆశ్రమ వాసులందరికీ పంచివేయుట అని ? అలాగే చేస్తే సరిపోతుంది. "

         " కష్టము తప్పించుకొనుటకు అది మంచి ఉపాయము. ఇప్పుడు నేను పిల్లలకు అదే ఉపాయము చేసినాను. తెల్లటి పాపడిని ఎత్తుకోవాలనిపిస్తే , తెల్లటి పాపడున్న ఇంటికి వెళతాను. వాడిని ఎత్తుకొని ఆటాడుకొని ఇంటికి వస్తాను. ఇలాగే ఎర్రటి పాప , నల్లటి పాప , అందమైన పాప, కురూపి పాపాయి , అంతేనా ? ఈ ఆశ్రమములోనున్న పిల్లలందరినీ నావాళ్ళుగా చేసుకొని సుఖముగా ఉన్నాను. అయితే ఆవుల విషయము అలాగ కాదు. మనవి అంటే మనవే కావలెను. వాటి స్వామిత్వపు విషయములో , వినియోగపు విషయములో ఇంకొకరు చేయి వేయునట్లు ఉండకూడదు. సరే , రానివ్వండి , చూద్దాము. " 

" వచ్చిన తరువాత ఆలోచించుట వద్దు. వచ్చేలోపే ఆలోచించుకొని ఉండు. " 

        " అది న్యాయమే. మీరు వస్తాయంటే వచ్చేతీరుతాయి. కానీ మీరు వస్తాయి అనలేదు కదా ! ’ రావాలి ’ అని నేను కూడా బలవంతము చేయుట లేదు కదా " 

        " అలాగ కాదు , పుణ్యాత్మురాలా , ఇక్కడ చూడు , నువ్వు కోరినది నెరవేర్చుటకు దేవతలు సిద్ధముగా ఉన్నారు. నువ్వు పిల్లలు వద్దన్నావు. పోనీ ధనము కావాలా అంటే అది కూడా వద్దన్నావు. కాబట్టి నీ వెనుకటి కాంక్షయైన వేయి గోవులను కట్టివేసుకొను విషయము వచ్చింది. దేవతలు ఇస్తారంట , కావాలి అను. " 

" తమరి అనుజ్ఞకు ఎప్పుడూ ప్రతి లేదు. కావాలి అంటాను. అయితే వచ్చునపుడు ఒక నిబంధనతో రావలెను. " 

" ఈ నిబంధన ఏమిటి , చెప్పు . " 

         " ఏమీ లేదు , వేయి ఆవులు వస్తే మనకు సంతోషము అగునట్లే , అవి కూడా తమకు తాముగా ఇష్టముగా ,  మనము అడిగినందుకు కాదు , - తమకు తామే ఇష్టముగా రావలెను. అంతే కాదు, అవి వచ్చినందుకు మనకు కొంచము కూడా శ్రమ కలుగకూడదు. ఇక్కడ సంతోషమంటే , మీ సంతోషము , మీరనుకునే సంతోషము కాదు , నేను , ఈ కాత్యాయని చెప్పు సంతోషము. ఆ వేయి ఆవులు వచ్చినాయి అని మనకళ్ళలో ఒకచుక్క కూడా నీరు రాకూడదు. మన శరీరాలకు ఆవగింజంత కూడా ఆయాసము కలుగరాదు. " 

" భలే ! మంచి నిబంధనలాగానే ఉంది. దేవతలు నీ నిబంధనకు ఒప్పుకొని వేయి గోవులనిస్తే అప్పుడేమి చేస్తావు ? " 

         " ఔను, చూడండి , మీరు ఈ మాట అడిగినందుకు గుర్తొచ్చింది , ఆ పశువులు మన దగ్గర ఉండు వరకూ అవిగానీ , వాటి దూడలు గానీ రోగములూ , వ్యాధులతో బాధ పడరాదు. వాటికి ఎప్పుడూ గడ్డీ , నీరూ సమృద్ధిగా ఉండవలెను. అంటే ఏమిటి ? ఒకమాటలో , వాటి వల్ల మనకు గానీ , మనవల్ల వాటికి గానీ ఏ రీతిలోనూ ఆవగింజంత కూడా ఇబ్బంది కలుగరాదు. " 

" మీ నిబంధనలన్నీ అయినాయా , ఇంకా ఉన్నాయా ? " 

        " అంతే! అప్పుడే అన్నాను కదా , మననుండీ వాటికీ , వాటి నుండీ మనకూ పరస్పర సంతోషము కలగవలెనే కానీ ఏ రీతిలో కూడా పరస్పర కష్టము కలుగరాదు. " 

" ఇంకా ఆలోచించి చూడు "  

" ఏమిటి ? మీరే వరము నిచ్చునట్లు అడుగుతున్నారే ? "

" ఔను. దేవతల పరముగా నేను తథాస్తు అంటాను. "

" అలాగయితే అనెయ్యండి " 

కాత్యాయని లేచి సాష్టాంగ నమస్కారము చేసి లేచి నిలబడి చేతులు జోడించినది. 

 భగవానులు కూడా లేచి నిలచి గంభీరముగా ’ తథాస్తు ’ అన్నారు. 

Wednesday, March 6, 2013

55. " మహాదర్శనము " --యాభై అయిదవ భాగము --అక్కాచెళ్ళెళ్ళు


55. యాభై అయిదవ భాగము --  అక్కాచెళ్ళెళ్ళు


        ఎండవేడిమి తగ్గుతూ , ఎండ ఉంటే బాగుండును అను ఘట్టమునకు వచ్చినది. భగవాన్ ఆదిత్యదేవుడు తన కిరణములను వెనక్కు లాగుకొనుటకు ఆరంభించినాడు. పొద్దువాలు సమయము దగ్గరైంది. భగవానులు వచ్చి అరుగుమీద కూర్చున్నారు. కనులు అంతర్ముఖములై పంచభూత సంఘాతమైన ప్రపంచ చిత్రమును పరిభావిస్తున్నవి. ఆశ్రమ వాసులందరూ అక్కడక్కడా కూర్చొని చింతన చేస్తూ , ఆవృత్తి చేస్తూ , తమ తమ వ్యాపారములలో మగ్నులై ఉన్నారు. భగవానులు వారందరిచేతా వారి వారి కార్యములు చేయించు మాతరిశ్వుడి వలె ఉండి తూష్ణీ భావముతో కూర్చున్నారు. 

        ఆశ్రమవాసి యొకడు వచ్చినాడు. కాలి శబ్దము దగ్గరవగానే భగవానులు కనులు తెరచి , ’ ఏమిటి ? ’ అన్నారు. వచ్చినవాడు భయభక్తులతో రాజదూత ఒకడు వచ్చినాడని తెలియజేసినాడు. వారు లేచి వెళ్ళి అతిథి శాల లో ఉన్న రాజదూతను చూచినారు. అతడు తాను తెచ్చిన రాజ శాసనమును అందించినాడు. దానిలో , ’ భగవానులు వచ్చి తమరి పాదధూళిచే మా రాజభవనమును పవిత్రము చేయవలెను . తమరికి అనుకూలమైన దినము తెలిపితే ఆగమనమునకు కావలసిన వన్నిటినీ సిద్ధము చేయగలము" అని రాసి ఉంది. భగవానులు దానిని అక్కడే విప్పి చదువుకొని " మహారాజులకు తెలుపు , వారు రాసిన విషయమును ఆదిత్య దేవునికి తెలిపి ఉత్తరమును పంపించెదము అని. " అని చెప్పి రాజదూతకు యథా యోగ్యమైన ఉపచారములను చేయుటకు ఆశ్రమవాసి ఒకరికి ఆదేశమునిచ్చి తాము వచ్చేసినారు. 

          వారికి ఈ దినము ఏదో విశేషము జరుగుతుందని తెలుసు. అయితే అటు తిరిగి చూచి అది యేమిటి అని తెలుసుకొనెడు కుతూహలము లేదు. సరే , రాజదూత ఆగమనమే ఆ విశేషము అనుకున్నారు. స్నానానికి ఇంకొంత సేపు ఉందని మరలా వెళ్ళి అరుగుపై కూర్చొని కళ్ళు మూసుకున్నారు. భగవానులు అక్కడున్నారంటే , పక్షులే కాదు , క్రిమి కీటకాలు కూడా గట్టిగా శబ్దము చేయవు. 

         అలాగే వారు కొంతసేపు కూర్చున్నారు. వారు లోపల చూస్తున్న నిస్తరంగ చిదాంబుధి వలెనే బయట కూడా ప్రశాంతముగా ఉంది. చెవిలో ఎప్పుడూ వినిపించే గుంయ్ మనే నాదముకూడా వినిపించనంత దూరముగా వున్న వారు హఠాత్తుగా కన్నులు తెరచినారు. ఎదురుగా భగవతి. 

" వచ్చి ఎంత సేపైనది ? " భగవానులు అడిగినారు. 

" ఇప్పుడే వచ్చినాను. సంధ్యాస్నానపు పొద్దు. ఎందుకో రాలేదే , చూద్దామని వచ్చినాను. "

" చూడు , స్నానానికి పొద్దయింది అని నాకు ఎవరైనా వచ్చి జ్ఞాపకము చేయవలెను. ఇటువంటి పిచ్చివాళ్ళ మెడను కావలించుకుంది ఈ ఆశ్రమము. "

" మా తాత చెప్పునది నిజమయితే , ఆశ్రమము మాత్రమే కాదు , ఈ జగత్తంతా మిమ్మల్ని కావలించు కొనవలెను " 

" అలాగయితే మేము పెద్ద జోలె పెట్టుకోవలెను " 

" ఇంతకీ మీరేమనుకుంటున్నారు ? చేసేవారు వేరే ఉన్నారు , చేసుకుంటారు . అంతేనా ? "

          " చిలికి తీసుకున్న అర్థాలన్నీ అంతే. నువ్వు రాను రానూ మాటల నైపుణ్యము బలే చూపిస్తున్నావే ?  పదవే పద స్నానానికి పోదాం. ఆలస్యము కావలసినది , అయింది. ఈ దినమేమో ఇంట్లోనే స్నానము చేయాలనిపిస్తున్నదే ? "

" గంగ ఇంటికే వచ్చింది. అంతా సిద్ధముగా ఉంది. రాండి " 

          ఆ వేళ భగవానులు ఇంటిలోనే స్నానము చేసినారు. స్నానము చేసిన భగవతి, వారికి స్నానము చేయించి , సంధ్యావందనమునకు అన్నీ పెట్టి తాను అగ్నిగేహమునకు వెళ్ళింది. భగవానులు సంధ్యావందనము చేసి అగ్నిహోత్రమును ముగించినారు. 

          ఆ వేళకు నడిమింట్లో దీపము వెలిగింది. బయట నక్షత్రములు బాగా కనిపిస్తున్నాయి. కన్నులు ఉండీ ఏమీ కనిపించనంతగా చీకట్లు కమ్ముకుంటున్నాయి. చంద్రుడు ఇంకా ముఖము చూపించలేదు. భగవానులు వచ్చి నడిమింట్లో వేసిన ఆసనము పైన గోడకానుకొని కూర్చున్నారు. వారు ఈ దినమెందుకో  ’ అగ్నే నయ సుపథా..’ మంత్రమును చెప్పుతున్నారు. మనస్సు దాని అర్థమును పరిభావిస్తున్నది. " యుయోధ్యస్మజ్జుహురాణమేనః  " అను  ’ మన కుటిలమైన పాపములను నాశనము చేయుటకు ’ అనే అర్థము ఉన్న మూడవ పాదము పైన ఒక ఘడియ నిలిచింది. " అంటే , మనలను తప్పుదారికి లాగు పాపము ఒకటుంది. ఆ పాపమేది ? మన అపూర్ణత. అపూర్ణతయే అశక్తత. దాని వలననే మనము పలు దారులగుట" అని అనేక రకాలుగా ఆలోచనలు పరచుకున్నాయి. 

          ఎవరో వచ్చి నమస్కారము చేసినారు. భగవానులకు అదేమీ కొత్తది కాదు. కానీ ఆ సమయములో వచ్చేది ఎవరు ? మనసు ఎక్కడికో పోయి ఉండినది. దీపము తగ్గిపోయి కనులు తమ పనిని సరిగ్గా చేయుట లేదు. వచ్చినవారు ఆడవారు అని చెప్పినాయే కానీ ఎవరు అని చెప్పలేదు. 

భగవానులు చిన్నగొంతుతో ’ ఎవరు ’ అన్నారు. 

వచ్చినామె కూడా అదే గొంతును అనుసరించి చిన్నగా ’ నేను మైత్రేయిని ’ అన్నది. 

" ఏమి వచ్చినావు ? "

" ఇప్పుడైతే భగవానులు ప్రసన్నముగా ఉంటారు , అడిగిన వరమునిస్తారు అని వచ్చినాను. " 

" ఆలాపినీ దేవి గారికి ఇష్టమైన కోడలివి. నువ్వు అడిగినదానిని ఎప్పుడూ కాదనము. అదినీకు తెలుసా ? "

" తెలుసు దేవా , అయితే అడిగే వరము నా యోగ్యతను మించినదేమో అని దిగులు. " 

" అదేమిటో చెప్పు "

" నేను కూడా ఈ ఆశ్రమములోనే ఉండాలనుకుంటున్నాను " 

" తప్పకుండా ఉండవచ్చును. నీకు ఇక్కడ ఉండుటకు అధికారము లేదా ? నన్ను అడిగి , అనుమతి పొంది ఉండవలెనా ? " 

" అటుల కాదు , నేను ఉంటే , నా రక్షణ , పోషణ , మార్గ దర్శనము అన్నీ మీ బాధ్యతలవుతాయి. "

" ఇప్పుడు ఆశ్రమవాసులందరికీ ఇవన్నీ లభ్యము కాలేదా ? " 

" నేను ఇతరులవలె అడుగుట లేదు " 

" సమస్య జటిలమన్నమాట. అప్పుడే మాట ఇచ్చినాను. ఏమైనా కానీ , వహించుటకు సిద్ధముగా ఉన్నాను. బెదరకుండా చెప్పు. " 

" నేను కోరుతున్నది వట్టి శిష్యత్వము కాదు " 

" మరి, ఇంకేమిటి ? "

" మార్గదర్శనము తో పాటూ...."

" సహ బ్రహ్మచారిణి అవుతానంటావా ? "

" ఔను "

" నాకు అప్పుడే పెళ్ళి అయినది నీకు తెలియదా ? " 

" దేవా , నేను అడుగుతున్నది ధర్మ పత్నీత్వము కాదు " 

" మరింకేమిటి ? " 

" మోక్ష పత్నీత్వమును. గురువుగా , పతిగా , నానుండీ తమరు సేవలందుకోవలెనని " 

భగవానులు ఒక్క ఘడియ ఊరకే ఉన్నారు . " అంటే, ఐహికమైన ధనాపేక్ష ఏమీ లేదనా ? "

" ఔను . నాకు కావలసినది ఆముష్మిక ధనము "

         భగవానులు ఒక ఘడియ ఆలోచించినారు. " తప్పేమీ లేదు. ఇలాగ చేస్తే అర్థము లేకుండా ఆడిపోసుకొను వారి నోటికి తాళము వేసినట్లే , సరే " అని నిశ్చయించుకొని, " కాత్యాయని అనుమతి లేకుండా మేము ఏమీ చేయుటకులేదు మైత్రేయీ .." 

" ఈ వేళకు వెళితే భగవానులు నిశ్శంకగా వరప్రదానము చేస్తారని చెప్పినది ఆమెయే. " 

భగవానులు తలాడించినారు, " అట్లయిన కావచ్చును . " 

మైత్రేయి లేచి నమస్కారము చేసినది. భగవానులు నవ్వినారు. 

Tuesday, March 5, 2013

54. " మహా దర్శనము " --యాభై నాలుగవ భాగము --పారాయణము


54. -యాభై నాలుగవ భాగము--  పారాయణము


          ఉద్ధాలకుల ఆశ్రమమిప్పుడు యాజ్ఞవల్క్యుల వలన అనాథ గా మిగలక , సనాథమయినది . కులపతులను భగవానులు అని సంబోధించవలెను అని ఎవరూ ఆజ్ఞనివ్వలేదు , అయినా , ఆశ్రమ వాసులందరూ భగవానులనే సంబోధిస్తారు. వారుకూడా కులపతిహోదా తమకు మొదటినుండీ ఉన్నట్టే , అలవాటైనట్టే నడుచుకున్నారు. వారి ఆశ్రమములో ఒక ఆశ్చర్యమేమనిన, భగవతి వారు. వయోమానము చేత చూచునట్లైతే , భగవతి కాత్యాయని  అక్కడున్న అనేక పాత శిష్యులకన్నా చిన్నవారు . కానీ ఆమె వద్ద నిలుచొని కొంచముసేపు మాట్లాడితే వారిలో అనిర్వచనీయమైన వృద్ధత్వమును చూచి తల పంకించుతారు. ఆమె వయోవృద్ధురాలు కాదు , జ్ఞాన వృద్ధురాలు కాదు; జరాది వృద్ధురాలు కాదు . ఇంకా పదహారేళ్ళ షోడశి. బాలచంద్రునివలె పెరుగుతున్న యవ్వనము. అంగాంగములూ యౌవనవతి అనుదానిని ఉద్ఘోషిస్తున్నాయి. అయినా ఆమెలో అందరూ తమకన్నా ఎక్కువగా ఏదో ఒకదానిని చూచి తల ఊపువారు. అది పతిసేవా పరాయణత్వము యొక్క ఫలమని ఎవరికీ తెలియదు. దానినెవరూ చూడలేరు. 

          యాజ్ఞవల్క్య దంపతులు ఏ విధమైన ఉద్వేగమూ లేకనే ఆశ్రమపు కార్యములను నిర్వహించువారు. ఆశ్రమవాసులు మొదలుకొని , ఒకటిరెండు దినములు అతిథులుగా వచ్చిన వారు, పెద్దవారు , గొప్పవారు , చిన్నవారు అందరూ , ’ వెళ్ళిపోయిన దంపతులు ఈ వచ్చిన దంపతులను ఆవహించి ఉండవలెను ’ అంటారు. 

          విదేహరాజైన జనకుడు సందర్శనార్థమై ఆశ్రమమునకు వస్తాడని సమాచారము వచ్చింది . రాజు సపరివారముగా ఆశ్రమపు అతిథిగా వచ్చుట అదే మొదటిసారి. ఆశ్రమవాసులందరికీ అదొక పరమ సంతోషమైన సమాచారము. కొందరు ఉత్సాహముతో కొంచము ముందుకు వెళ్ళి , " ఇంకేమి లేవయ్యా, మన ఆశ్రమము ఒక యాత్రా క్షేత్రమై పోవును. విద్యాభిమానులందరూ యాజ్ఞవల్క్యాశ్రమమునకు వెళ్ళకుంటే వారికి అదొక కళంకము అనిపించుకుంటుంది . " అంటారు. 

          మహారాజుల రాక గురించి కొన్ని ఏర్పాట్లు జరిగినవి. వారికని భవ్యమైన మందిరమొకటి ఏర్పడింది . దానికి ఎడమపక్కగా రాజ పరివారము వారికి వేరే వేరే మందిరములు. కుడిపక్కగా విద్వాంసుల వసతులు. దానికి వెనుక పక్క రాజకాంతలకు అంతఃపురములు. చుట్టూ కాపలా సేనలకు చిన్న చిన్న వసతులు. సమీపములోనే ఒక గోశాల , పాక గృహములు. మహారాజువారూ , అంతఃపుర కాంతలూ , రాజపరివారమూ , విద్వాంసులూ , ఆశ్రమవాసులూ , కులపతులూ కూర్చొనుటకు అనుకూలమైన , ఎత్తైన , విశాలమైన అనావృత మంటపమొకటి . వారు వచ్చినపుడు వారికి ఎదురుపడి ఆహ్వానించు వారెవరు ,  వారిలో పూర్ణ కుంభము తీసుకొని వెళ్ళువారు ఎవరు , లాజ , అక్షతలను వేయువారెవరు , పుష్పములను చల్లువారెవరు , అనునవెల్లా నిర్ణయింపబడినవి. తన వెంట మైత్రేయి ఉండవలెనని , కాత్యాయని తాను తీసుకొని వెళ్ళ వలసిన పూర్ణ కుంభమును వేరొక ముత్తైదువకు అప్పజెప్పింది. 

          మహారాజులు వచ్చినారు. పల్లకీలో వచ్చిన వారి వెంట పల్లకీలలోనూ , మేనా లలోను విద్వాంసులు వచ్చినారు. రథములు- బండ్లు వంటి వాహనములమీద , ఏనుగుల మీద , రాజపరివారమూ , రాజ కాంతలూ వచ్చినారు. పూర్ణకుంభములతోను వేద ఘోషలతోను వారిని ఎదురుకొని , భగవానులూ , భగవతీ , మైత్రేయీ పిలుచుకొని వచ్చి వారి వారి స్థానములలో వారిని దింపినారు . భార్గవులనూ , దేవి గార్గినీ , వెనుకటి దినమే వచ్చిన దేవరాతులు వదలక , తమ ఇంటికి పిలుచుకొని వచ్చినారు . మరుసటి దినము నుండీ వేద బ్రాహ్మణోపనిషత్తుల పారాయణము అని నిర్ణయించినారు . 

          యథా కాలములో వేద పారాయణము ఆరంభమయినది . పూర్వాహ్ణము , అపరాహ్ణము రెండింటిలోనూ పారాయణము నడచినది . వృద్ధ శిష్యుడు వేదిక పైన కూర్చొనును. అతనికి కుడివైపు కులపతులూ , ఆశ్రమవాసులూ భగవతీ ఆలంబినీ తోపాటు మైత్రేయీ , ఆశ్రమ స్త్రీలూ కూర్చుంటారు . ఎడమవైపు మహారాజులూ , విద్వాంసులూ , రాజపరివారమూ , రాజ కాంతలూ కూర్చుంటారు. సభను చూచినవారికి అది ఒక బ్రహ్మ సభ యనిపించును. వారిలో ఇద్దరు ముగ్గురిని వదలితే , మిగిలిన వారందరూ మొదటి దినము సభాదర్శనపు ఆనందములో విస్మితులైపోయినారు . భార్గవులూ దేవరాతులూ భగవానుల కుడిపక్క ఆసీనులైనారు. భార్గవులకు , తాను ఉపనిషత్తును వినగలుగు సుదినము వచ్చినదని ఆనందోద్రేకములతో ముఖమంతా ఎర్ర తామర వలె వికసించినది. 

          వేదపారాయణము జరుగుతున్నపుడు విద్వాంసులు మంత్రముగ్ధులై పాములవలె తలలాడిస్తున్నారు. ఇదివరకూ ఉన్న వేదములో  మంత్ర బ్రాహ్మణములు కలసిపోయినాయి. కొత్త వేదములో అది లేదు. అందువలన వేదపారాయణము ముగియగనే విద్వత్సభ దానిని ఆమోదించి కృష్ణ యజుర్వేదము , శుక్ల యజుర్వేదము అని పేరు పెట్టుటకు మహారాజుకు సలహా ఇచ్చినది. దానిని భగవానులకు విజ్ఞాపన చేసి సరియేనా అని అడుగగా , వారు , " ఇది వివరణాత్మకమైన నామధేయమైనది. అయితే అది వచ్చినది వాజిరూపుడైన ఆదిత్యుని వలన అనునది అందరికీ జ్ఞాపకము రావలసిన అవసరముంది. కాబట్టి ’ వాజిసనేయ సంహితా ’ అన్న పేరు సమంజసముగా ఉంటుంది  " అన్నారు . మహారాజులు రెండింటినీ ఆమోదించినారు . అప్పటినుండీ నూతన వేదము శుక్ల యజుర్వేదము , వాజిసనేయ సంహితా అను రెండు పేర్లతో ప్రసిద్ధమైనది. 

           సంహితోపనిషత్తులను అప్పుడే ఆరంభించుటయా అని ఒక చిన్న వాదము జరిగినది. మహారాజు గార్గి ముఖము చూచినారు. ఆమె విధిలేక లేచి నిలబడింది. విద్వాంసులకు నమస్కారము చేసి అన్నది : " ఇక్కడి ఆశ్రమవాసులు కాక, బహుశః ఆ ఉపనిషత్తును చూచినదానిని నేనొక్కదానినే అని తోచుచున్నది. అందులో ఉన్న మంత్రముల సంఖ్య మరీ చిన్నది ( సంహిత యొక్క నలభైయవ అధ్యాయమైన ఈ ఉపనిషత్తులలో ఉన్నది కేవలము పదిహేడు మంత్రములు. ఇప్పుడు ప్రచారములో ఉన్న ఉపనిషత్తులలో ఉన్న మంత్రములూ , అక్కడున్న మంత్రములూ వేర్వేరు క్రమములలో ఉన్నవి అన్నది గమనించవలెను ). అయితే అర్థములో మాత్రము అది చాలా విస్తారమైనది. ప్రశ్న , ఐతరేయ , కేన , తైత్తిరీయాది ఉపనిషత్తులు పూర్ణముగా అర్థమై , ఉపనిషద్ధర్మములన్నీ కరతలామలకములైన వారికి మాత్రమే ఈ ఉపనిషత్తు అర్థము కావచ్చు. కాబట్టి ఇప్పుడే దీని పారాయణము జరగనీ. మరలా ఇంకొకసారి కూడా జరగవలెను. ఇది నా అభిప్రాయము. " 

         అదేవిధముగా తీర్మానమయినది. దానిని విన్న విద్వాంసులు, " దేవి గార్గి చెప్పినది సరిగా ఉన్నది " అన్న సిద్ధాంతమునకు వచ్చినారు. ఆ ఉపనిషత్తు అంతా అయిన తరువాత మరలా ఒకసారి పారాయణము కావలెనని తీర్మానించినారు. 

         బ్రాహ్మణ పారాయణము ఆరంభమయినది . మొదటి ఏడు కాండములు ముగిసినాయి. అగ్ని రహస్యము వచ్చినది. అప్పుడు మహారాజులు భగవానుల ముఖమును చూచి నవ్వినారు. అగ్ని రహస్య పారాయణమైన తర్వాత అన్నారు , " భగవానులు యజ్ఞేశ్వరుని సంపూర్ణముగా తెలుసుకున్నారు అనుటకు ఇది ఒక నిదర్శనము. మేము , వారు వీరు చెప్పినది విన్నంత మాత్రమునకే ఏదో మహా తెలుసుకున్నట్టు విర్రవీగుతాము. అటువంటప్పుడు , ఇంత తెలిసియుండి .....ఇంకా సరిగ్గా చెప్పవలెనంటే , సర్వజ్ఞులైననూ భగవానులు అంతంతగా ఉన్నారు అన్న తరువాత , వారి జ్ఞానమునకు వెలకట్టువారు ఉన్నారా అనిపిస్తుంది " అని పరి పరి విధములుగా ప్రశంసించినారు. భగవానులు పెదవి కదపలేదు. 

          బ్రాహ్మణ పారాయణము ముగిసింది. అశ్వమేధ కాండము నుంచీ ఉపనిషత్తు ఆరంభమయినది . అప్పుడు భగవానులు మాట్లాడినారు . "  దేవి గార్గి వెనుక అడిగిన ఒక ప్రశ్నకు ఇక్కడ ఆదిత్య భగవానుడు ఉత్తరము నిచ్చినాడు. వారు కర్మ బ్రహ్మ సముఛ్చయ వాదమే సిద్ధాంతమైతే కర్మాధికారము లేని వారి ఉద్ధారము ఎలాగు ?  అన్నారు. అటువంటి వారు ఒక యజ్ఞమును గురించి తత్ సంబంధిత మంత్రములనూ బ్రాహ్మణమునూ పారాయణము చేస్తే తత్ఫలము దొరకునని ఆదిత్య దేవుని ఉత్తరము. అది మాత్రమే కాక , ఆదిత్య దేవుని అనుమతితో ఇంకొక మాట చెపుతాను. చాతుర్వర్ణ్యమూ చేరి ఒక సమాజము. గుణకర్మల వలన , గుణకర్మల కోసము విభాగమగుటను గమనింపకయే , కాలవశమున ప్రతియొక్కరూ తాము తాము ప్రత్యేకమైనట్టు వర్తించినారు . ఇది సరి కాదు. దానికోసము ఉపలక్షణముగా రాజన్యుల కథలు రెండింటిని చేర్చి ఈ ఉపనిషత్తును పూర్తి చేయ వలసినదంట. కాబట్టి ఇది అసంపూర్ణముగానే ఇంకా మిగిలింది. " అన్నారు. 

          ఉపనిషద్భాగమునకు భగవానులు విద్వాంసుల కోరిక మేరకు తామే అర్థము చెప్పినారు. భగవానుల వచో వైఖరియే అట్లున్నదో , లేక తపస్వి మాటలు కాబట్టి వాటికి విచిత్రమైన శక్తి వచ్చినదో , లేక విద్వాంసుల హృదయములు పక్వమైనవో గానీ మొత్తానికి ఆ అర్థమును అందరూ గ్రహించి , భగవానులు కృతకృత్యులని ఒప్పుకున్ననూ , భార్గవ దేవరాతులు మరియొకసారి ఉపనిషత్తును వినవలెను అనుకున్నారు. 

          మరుసటి దినము జనక రాజు భగవానుల వద్ద వినయముతో విన్నవించుకున్నాడు, " ఎప్పుడైనా ఒకసారి భగవానులు మా రాజ భవనమునకూ దయచేసి మమ్ములను అనుగ్రహించవలెను. వెనుక మాకు ఇచ్చిన వరమును , అనగా , కామప్రశ్నుడను కావచ్చును అన్న వరమును మరవకూడదు. " అన్నాడు. భగవానులు నవ్వుచూ సమయోచితముగా మాటలాడి ముగించినారు. 

         ఆశ్రమవాసులందరికీ యథోచితముగా , ఉదారముగా మర్యాదలను వితరణ చేసి భగవానులవద్ద వీడుకోలు పొంది మహారాజు వెనుకకు తిరిగినాడు. ఆదినము రాత్రి ఇంటి పనులనన్నిటినీ ముగించుకొని కాత్యాయని శయనించుటకు వెళ్ళవలెను. అప్పుడు మైత్రేయి వచ్చినది. 

అక్కను మాట్లాడించు చెల్లెలి వలె స్నేహముతో కాత్యాయని మాట్లాడింది. " ఏమక్కా , వచ్చినావు ? "

మైత్రేయి, " నేను నీతో ఒక విషయమును గురించి మాట్లాడవలెనని వచ్చినాను. నువ్వు సావధానముగా వింటావా ? " 

" నువ్వు నాకన్నా పెద్దదానివి. నువ్వు చెప్పినది వినుట నా ధర్మము. "

          " చెల్లీ , నువ్వు నాకు ఏదీ తక్కువ చేయలేదు. అన్నిటిలోనూ మొదట నేను , ఆ తరువాత నువ్వు అన్నట్టు నడచుకుంటున్నావు. కానీ ఇది మంచిది కాదు. ఈ ఆశ్రమానికి అధిరాజ్ఞివి నువ్వు. నావలన నీ అధికారమునకు లోపము కాకూడదు. అందుకని నేను ఇక్కడినుండీ అయినంత తొందరగా వెళ్ళిపోవలె ననుకున్నాను. "

        " అలాగ అనుకొనుటకు ఏమి కారణము వచ్చింది ? నాకు తెలియకుండా నేను నీతో యేమైనా అవినయముగా నడచుకున్నానా ? "

          " నేనప్పుడే అన్నాను కదా , నువ్వు ఆవగింజ కాదు , ఆవగింజ మొలకంత కూడా అవినయమును చూపలేదు. కానీ నేనిక్కడుంటే నీ అధికార వ్యాప్తి తగ్గుతుంది. నువ్వు భగవానుల పత్నివి. భగవతివి. కానీ నువ్వు ప్రవర్తించునది ఎలాగుందంటే  , నేను భగవతిని , నువ్వు నా ఆజ్ఞాధారకురాలివి అన్నట్లుంది. ఈ అధికార హానిని నేనెలాగ ప్రోత్సహించేది ? "

         కాత్యాయని కూర్చున్నది . మైత్రేయి చేయి పట్టి లాగి , ’ కూర్చో ’ అని కూర్చోబెట్టుకున్నది. విశ్వాసముతో అన్నది , " నీది విచిత్రమైన మనోరోగము. మొదట నీకు మానుండీ ఏమైనా తప్పు జరిగిందా అని భయపడినాను. నువ్వు చెప్పినదంతా విన్న తరువాత నువ్వు కారణము లేకుండానే వ్యథ పడుచున్నావు అనిపించినది. సరే , నీమాటే వింటాను , ఇప్పుడు నువ్వు ఏమి చేయాలనుకున్నావు ? " 

" నేను ఇంకెక్కడికైనా వెళ్ళవలె ననుకుంటున్నాను "

" ఎక్కడికి ? "

         " అదే ఇంకా తెలీదు. చూడు , నేను పెరిగిన యువతిని. పెళ్ళికాని దాన్ని. అదీకాక , ఇష్టము వచ్చినట్లు నడచుకొను దానిని. ఇలాగ లోకపు దృష్టిలో ఉన్న ఆడది ఎక్కడున్నా అపయశస్సు తప్పదు ఇక్కడ కాక, పుట్టింటికి వెళ్ళినాననుకుందాము , అక్కడ కూడా అపయశస్సు తప్పలేదు. కాబట్టి నావలెనే ఉన్న గార్గి వద్దకు పోవలెనని ఒక ఆలోచన. "

" అలాగయితే ఇక్కడికి గార్గి వచ్చినపుడు అడిగినావా ? "

         " ఔను  , అడిగినాను. ఆమె , ఉంటే ఇక్కడ ఉండు. భగవానులు మనందరికీ పెద్దవారు. వారి ఆశ్రయము వదలుట అయితే ఇంకెక్కడికీ వెళ్ళ వద్దు , నా దగ్గరే వచ్చి ఉండు అన్నారు " 

" సరే , నీకు భగవానులు కావాలా వద్దా ? " 

" నువ్వూ ? నీ తుంపు మాటలూ ? సరే , అదుండనీ. నాకు కావలసినది మార్గదర్శియగు సద్గురువు. "

" భగవానులు అటువంటి సద్గురువులు కాగలరు అన్న నమ్మకము నీకుందా ? " 

       " నాకు సంపూర్ణముగా ఉంది . అంతే కాదు , అటువంటి వారు గురువుగా లభించవలెనంటే అదృష్టము ఉండవలెను. కానీ వయో ధర్మమును చూచు జగత్తు తనకు తోచినట్లు మాట్లాడుతుంది. " 

        " అక్కా , జగత్తు వద్దు అని బయలుదేరిన దానివి నీకు జగత్తు అలాగంటుంది , ఇలాగంటుంది అన్న లక్ష్యము ఎందుకు ? " 

         మైత్రేయి తన తప్పు ఒప్పుకొని అన్నది " అపయశస్సు అనునది ఎప్పటికీ ఒకరిని గురించి మాత్రమే రాదు. అసంగతములైన రెండు పదార్థములను గురించి వెడలునదే అపయశస్సు. దానికేమంటావు ? " 

         భగవతి, పులి వచ్చి మీద పడినట్టు మైత్రేయి పైపడి అన్నది. " అక్కా , నువ్వింత మెతకదానివని నేననుకోలేదు. నేనిప్పుడు చెపుతాను విను. ఊరికే వెయ్యి మాటలాడి నిన్ను నొప్పించడము నాకు ఇష్టము లేదు. అందుకని పోకలు కత్తరించినట్లు చెపుతాను విను , నువ్వు ఇక్కడే భగవానుల ఆశ్రయములో ఉండు. వారికి తమ వేదాంత విచారములను వినువారు , అందులో పాలు పంచుకొనెడి వారు ఒకరు కావలెను. నాకు ఆ అదృష్టము లేదు. కాబట్టి వారి కోరికను నువ్వు నెరవేర్చు. అపయశస్సు అన్నావు. అది రాకుండా నువ్వు వారి సహధర్మిణివి కా. నువ్వో అంటావా ? నాకన్నా వయసులోను , జ్ఞానము లోనూ , ఆలోచన లోనూ పెద్దదానివైన నువ్వు అక్క. నేను చెల్లెలు. ఇద్దరమూ ఆ మహానుభావుడిని సేవించి కృతార్థులమవుదాము. మనము సవతులము కాదు, అక్క చెళ్ళెళ్ళము, తెలిసిందా ? "

         మైత్రేయి అనిరీక్షితముగా వచ్చిన ఈ ఔదార్యమును చూచి మూగబోయింది. కాత్యాయని కొనసాగించింది, " అక్కా, నీకు భగవానులను ఒప్పించే రహస్యము ఒకటుంది , అది చెపుతాను విను . వారు అగ్నిహోత్రము ముగించి వచ్చి కొంచము సేపు కూర్చుంటారు. అప్పుడు వెళ్ళు. నమస్కారము చేసి , రక్షణ , మార్గదర్శనము రెండింటినీ వరముగా కోరుకో. అప్పుడు వారు లేదనకుండా నీకు వరమునిస్తారు. అప్పుడు నీ శంక , సందేహమూ అన్నీ నివారణయగును. " 

మైత్రేయి ఏమీ అనలేదు. కాత్యాయనిని హత్తుకున్నది. ఇద్దరి కనులూ చెమర్చినాయి. 

Monday, March 4, 2013

53. " మహాదర్శనము " ---యాభై మూడవ భాగము --ధర్మ సంకటము తప్పినది


53. ధర్మ సంకటము తప్పినది


          శతపథ బ్రాహ్మణము ముగిసింది. చివరి అధ్యాయములు సంహితలో ఉన్న విధము గానే ఉపనిషత్తు కావలెను. అంతలో దైవాజ్ఞ అయినది. అక్కడికే చాలని , యాజ్ఞవల్క్యుడు అక్కడికే నిలిపివేసినాడు. ఆతనికి తాను కృతకార్యుడనని సంతోషము వచ్చినది. అయితే దానిని ఎవరైనా పెద్దలకు చూపవలెను. అనంతరము బ్రాహ్మణము పరిపూర్ణ మైనందుకు మంగళము చేయవలెను అని అతనికి ఆశ. 

          ఒక దినము సమయము చూచి తండ్రితో కొడుకు తన ఆశను తెలియపరచినాడు. ఆచార్యుడు, " నేను చూడవచ్చు. కానీ నేను పాత వేద, బ్రాహ్మణములకు అలవాటైన వాడిని. కాబట్టి నాకు మొదటినుండీ చివరి వరకూ దోషములే కనబడితే అతిశయమేమీ కాదు. కాబట్టి ఉద్ధాలకులకు చూపించు. వారయితే వేద, బ్రాహ్మణములను సమన్వయము చేసి చూడగలరు. అదీకాక, కొడుకు రాసినాడు , అబ్బ ఒప్పుకున్నాడు  అను అపఖ్యాతికి మనమెందుకు గురి కావలెను ? చూడు యాజ్ఞవల్క్యా , లోకము ఎప్పుడూ చిన్నతనమును ఇతరులకు ఆపాదించుటకు ప్రయత్నిస్తుందే తప్ప వారి గొప్ప తనమును చూడదు. దాని వల్ల కూడా  నేను చెప్పినదే సరియైనది. నువ్వు నీ గ్రంధములను వారికి చూపించు " అన్నాడు. 

          కొడుకుకు కూడా తండ్రి చెపుతున్నది సరైనదే అనిపించినది. " నాకు కూడా అక్కడికి వెళ్ళవలెను అనిపించు చుండినది. అయితే వెళ్ళుట ఏ దినము  ? " అని అడిగినాడు. 

          " రేపటి పూర్వాహ్ణములో మహారాజుగారు వచ్చెదరు. వారు వచ్చినా ఎంతసేపుంటారు ? మధ్యాహ్నము భోజనానంతరము బయలుదేరు. వెళ్ళునపుడు వెంట అగ్నులను తీసుకొని ఉండు. వేద బ్రాహ్మణ పారాయణము చేయునపుడు అగ్నిహోత్రము లేకుండా ఎందుకుండ వలెను ? " 

" అయితే వెళ్ళి సిద్ధము చేయమని చెప్పి వస్తాను " అని యాజ్ఞవల్క్యుడు లోపలికి వెళ్ళినాడు. 

అతడు అటుతిరిగి వెళ్ళగనే " ఆచార్యా " అని పిలుస్తూ భార్గవుడు వచ్చినాడు. 

          కుశల ప్రశ్నలు అయిన కొంత సేపటికి భార్గవుడన్నాడు: " ఆచార్యా , నేనెందుకు వచ్చినాను అని అడుగలేదే ? రేపు మహారాజువారి సవారి ఇక్కడికి రావలసి ఉంది అని తెలుసు కదా ? అయితే  వారికదేదో రాచకార్యమని నగరాంతరమునకు వెళ్ళవలసి వచ్చి వెళ్ళిపోయినారు. వారి ప్రతినిధిగా నేను వచ్చి మీకూ , మీ పుత్రుడికీ సమాచారము నిచ్చి వివరించి చెప్పవలెనని అనుమతి అయినది. " 

         " నేనేమిటి , మీతో చేరినవాడనే కదా , కాబట్టి నాకు సమాధానము చెప్పనక్కర లేదు. ఇక , యాజ్ఞవల్క్యుడు. వాడు ఎంతైనా మీకన్నా చిన్నవాడు. మీరు సమాధానము చెప్పితే చెప్పవచ్చు , లేకున్న లేదు. " 

          " ఆచార్యా , అతడు మీ కొడుకు , కాబట్టి మీకు అలాగ తాత్సారము. అయితే బయటి వారి కన్నులలో ఆతడు ఎంత గొప్పవాడో తెలుసా ? ఆమె ?  ఆ వాచక్నువు కూతురు  గార్గి , ఆమెకు పగలు పుట్టినది పడదు. రాత్రి పుట్టినది రోత. అంతటి ఆమె మీ కొడుకు విషయములో ఎంత గౌరవము చూపిస్తుందో తెలుసా ? అదీగాక , మహారాజావారు ఒక సంవత్సరము నుండీ యాజ్ఞవల్క్యుని దర్శనార్థము రావలెనని అంటున్నారు. తీరా అనుకొని ధృవీకరించి కూడా రేపు వచ్చుటకు కాదని ఎంత వ్యథ పడినారో తెలుసా ? ఆతనికి కోపము రాకుండా సమాధానము చేసి రావలెనని నాతో పూర్తి ఒక ముహూర్త కాలము మాట్లాడి చెప్పి పంపినారు. నాకు అదేమీ అతిశయము అనిపించలేదు. ఇప్పటి కాలములో ఎవరయ్యా ఒక వేదమును , ఒక బ్రాహ్మణమును , ఒక ఉపనిషత్తునూ సృష్టి చేసినవారు ? మీరు వెయ్యి చెప్పండి , ఆ దినము బుడిలులు చెప్పినది నేను మరచిపోలేను. " 

         ఆచార్యుడు కొడుకు కీర్తి విని పొంగిపోయినాడు. భార్గవుడు ప్రబలులైన విద్వాంసులనే రాజాశ్రయము నుండీ వంకలు చెప్పి స్వస్తి పలికించి వారికి చుక్కలు చూపించేవాడు , ఇంతగా పొగడుచున్నాడన్న తరువాత , ఇంకేమి చెప్పవలెను ?  

         ఆ సంతోషములో ఆచార్యుని అహంకారము ఎగసిపడింది. " స్వామీ , పురోహితులవారూ , మరువకండి , నేను తండ్రినీ తాతలనూ మించు కొడుకు కావలెనని తపస్సు చేసినవాడను " అన్నాడు. 

          భార్గవుడు ఓహ్హొహ్హో  అని నవ్వేసినాడు. " కాదయ్యా , నీ కొడుకు యొక్క సంహితోపనిషత్తును ( ఈశావాస్యోపనిషత్తుకు ఈ పేరు కూడా కలదు ) ప్రపంచములోని వారంతా పొగడుచున్నారు. మీరు ఏ రోజైనా దానిని చూచినారా ? చెప్పండి. నువ్వో ? అంటారేమో ? మాకు ఈ జన్మలో రాజభవనము గుదిబండగా మారి చేయవలసిన ఎన్నో పనులు మిగిలిపోయినాయి. మీరు చెప్పండి. " 

          " ఏమిటి మీరు చెప్పండి ? కొడుకు వద్ద కూర్చొని శాంతి పాఠము చెప్పవలెనా ? నేను ఎన్నో దినములు దానిని గురించే ఆలోచించినాను. మీదగ్గర ఉన్నమాట చెపుతాను. నేను , " నేను తండ్రిని " అన్న అహంకారమును వదలి , ఉపనిషత్తు చెప్పమని వెళ్లవలెనా ? కొన్ని దినములాగండి. వాడు కూడా ఒక ఆశ్రమమును కట్టుకొని శిష్య సంపత్తుతో వర్ధిల్లుతాడు. అప్పుడు వాడు శిష్యులకు బోధించునపుడు నేనూ నాభార్యా కూర్చొని వింటాము. "  

          " నాకు ఎంత కుతూహలమో తెలుసా ? ఆ దినము వైశంపాయనులకు యాజ్ఞవల్క్యుని సన్నిధి వలన కలిగిన ఉపకారమును విన్న ఘడియ నుండీ అన్నీ వదలి ఆతని శిష్యుడను కావలెననిపిస్తున్నది . కానీ నాకు అవకాశమే లేదు. కావలసినది కానివ్వండి . మీ దంపతులు ఆ ఉపనిషత్తు వినునపుడు నన్ను కూడా రానివ్వండి.... ఏమిటీ , నేను వచ్చి ఇంత సేపయినది , యాజ్ఞవల్క్యుడు రానేలేదే ..వెళ్ళి కనులు మూసుకొని కూర్చున్నాడో ఏమో ? "

          " అదీ సంభవమే. ఉండండి, కాత్యాయనిని అడుగుదాము." అని ఆచార్యుడు కేకవేసి కాత్యాయనిని పిలచినాడు. యాజ్ఞవల్క్యుడే " ఏమిటి తండ్రిగారూ , ఆమె ఎక్కడో చెరువు దగ్గర బట్టలు ఉతుకుచుండ వలెను " అని వచ్చినాడు. 

         భార్గవుడు , " రావయ్యా , మాకు కావలసినది నువ్వు. కాత్యాయనితో నిన్ను పిలిపిద్దామని ఆమెను పిలిచినాము " అన్నాడు. 

         యాజ్ఞవల్క్యుడు వినయముతో లోపలికి వచ్చినాడు. భార్గవుని సూచనతో ఆచార్యుడు కొడుకుకు తప్పిపోయిన రాజాగమన విషయమును చెప్పినాడు. 

          యాజ్ఞవల్క్యుడు భారము దిగినట్టు నిట్టూర్చి , " మంచిదైనది. వారు వచ్చి , ఏదీ బ్రాహ్మణము చూపించు అంటే , నేను ధర్మ సంకటములో చిక్కుకునేవాడిని. వారికి చూపించాలని నేనే వచ్చేవాడిని , కానీ మొదట పెద్దవారెవరైనా ఒకరికి చూపించి ఆ తరువాతనే దానిని ప్రకటించ వలెనన్న నా సంకల్పము వ్యర్థమయ్యెడిది. " 

" అలాగయితే రాకుండినదే క్షేమమయినది కదా ? " 

" భార్గవుల వారూ , ఏమి చెప్పేది ? ప్రపంచము ఈశ్వరునిది. వాడి పరముగా దేవతలు దీనిని ఏలుచున్నపుడు జరిగేదంతా మంచికే కదా ? "

" అలాగయితే నీకు అసంతృప్తి ఏమీ లేదు అంటావా ? " 

" అదేమిటి అలాగ గుచ్చి గుచ్చి అడుగుతున్నారు ? " 

          " నీ కీర్తి దేశమంతా వ్యాపించి , దాని ప్రతిఛ్చాయ రాజ భవనమును కూడా ఆవరించినది. మహారాజుల దృష్టిలో నువ్వొక మేరు పర్వతము అంతటి పెద్దవాడివి. కాబట్టి నీకు అసంతృప్తి కలుగ కుండునట్లు చూచుకొని చెప్పిరావలెనని నాకు ఆజ్ఞ అయినది. అందుకే ఇంతగా అడిగినది. " 

          యాజ్ఞవల్క్యుడు ’ అటులేమి ? ’ అని నవ్వినాడు. " నా మాట కూడా కొంచము వినండి . వారు యువరాజుగా ఉన్నపుడు వారిని నేను చూచి  మొరటుగా , ’ అగ్ని రహస్యమును నువ్వు చెప్పేదేమిటి ? నేను వినేదేమిటి ? యజ్ఞేశ్వరునే అడుగుటకు అవకాశమున్నపుడు ఇంకొకరి దగ్గర నేర్చుకోవలెనా ? అని వచ్చేసినందుకు వారికి నాపైన కోపమేమో ? అనుకున్నాను. ’ మేము వస్తాము ’ అని వారు  వర్తమానము పంపించినపుడు ఎక్కడ ఆమాట ఎత్తుతారో అను శంక ఉండినది. ఇప్పుడు ఆ శంక కూడా తొలగింది . ధర్మ సంకటమూ తప్పింది . ఇంకొకసారి వారు వచ్చేటట్టయితే అది మా గురుకులములో కావలెను. అది కొంచము చూచుకోండి . " అన్నాడు. 

" అయితే ఎప్పుడయ్యా, గురుకులపు ప్రారంభోత్సవము ? "

         " నన్ను హాస్యము చేస్తున్నారు . ఇప్పుడు మా తండ్రిగారు ఏమైనా ఇస్తే ఉంటుంది , లేకుంటే లేదు. ఇలాగున్నపుడు , గురుకులపు ఆరంభము ఎప్పుడు అంటే ఖచ్చితముగా చెప్పుట ఎలాగ ? " 

         " నీకేమిటయ్యా , దేవతల అనుగ్రహము సంపాదించినవాడివి. నువ్వు సంకల్పిస్తే చాలు ధనము ఎక్కడి నుండో అదే వస్తుంది . మావలె నువ్వు చివరిదాకా శ్రమ పడ నవసరము లేదు. "

          " మీ నోటి చలవ వలన అలాగే కావలెను. నాకు కూడా గురుకులపు సంకల్పము మీదమీదగా కలుగుతున్నది. ఈ నవీన వేద బ్రాహ్మణోపనిషత్తులను అనేకానేక శిష్యులకు నేర్పవలెను అనిపిస్తున్నది. దీనిని ఇచ్చినవారికి,  దీనిని వినియోగించుట ఎలాగో తెలీదా ? నాకెందుకు ?  అనికూడా నేను మనోదమనము చేస్తున్నాను. " 

        " సరే , రేపటి ప్రయాణము శుభమగుగాక. వెళ్ళి రా. నేను కూడా వెళ్ళి వస్తాను. రాజదర్శనము తప్పిందని అసంతృప్తి ఏమీ లేదు కదా ? " 

         " అది తప్పినదెక్కడ ? అయితే , కేవలము యాజ్ఞవల్క్యునికి బదులుగా , వారు కులపతి యాజ్ఞవల్క్యుడిని చూస్తారు, అంతే ! " అన్నాడు యాజ్ఞవల్క్యుడు. 

          వారిద్దరికీ అతడి గంభీరమైననూ స్థిర విశ్వాసపూర్ణమైన భావము ముచ్చట గొలిపింది. ఉదాత్తమైననూ , వినయముతో పలికిన ఆమాటను వారు బలు మెచ్చుకున్నారు. ఒకరు మనసులోనే తథాస్తు అన్నారు. ఇంకొకరు ప్రకటముగా ఘోషించునట్లు తథాస్తు తథాస్తు అని రెండుసార్లు అని , వీడ్కొన్నారు. 

          ఇక్కడ ఉద్ధాలకుల ఆశ్రమములో ఆలాపినీ దేవికి అతిసార చిహ్నములు కనిపించినాయి . వైద్యులు ఆమెకు ద్రవాహారము తప్ప ఘనాహారము ఇవ్వవద్దని చెప్పినారు. వారిని ఒక విశాలమైన గదిలో పడుకోబెట్టినారు. మైత్రేయి ఆమె శుశ్రూషలో ఉంది. ఉద్ధాలకులు పదే పదే వచ్చి చూచుకొని వెళుతున్నారు. ఆశ్రమవాసులందరికీ ఏదో దిగులు. ఆమె మాత్రము ఘడియ ఘడియకూ వ్యాధి ఎక్కువవుతున్ననూ నిశ్శంకగా పడుకొని ఉన్నది. అప్పుడప్పుడు ఎవరినో నిరీక్షిస్తున్నట్టు వాకిలి వైపు చూస్తుంది. తన మనో దౌర్బల్యమును చూచి తానే నవ్వువట్లు , ఎవరూ రానిది చూచి సన్నగా నవ్వుకొని కళ్ళు మూసుకుంటుంది . 

          ఉద్ధాలకులు అది రెండు మూడు సార్లు చూచినారు . " నువ్వు ఎవరినో నిరీక్షిస్తున్నట్టుంది . ఎవరికైనా రమ్మని కబురు పంపవలెనా ? " అని అడిగినారు.  

          " అదేమంత పెద్ద విషయము కాదు . ఒంటి మీద స్పృహ ఉన్నపుడే యాజ్ఞవల్క్యుని ఒకసారి చూడవలెనని ఒక ఆశ. అయితే , దానికోసము అతడికి కబురు పంపించ వలసినంత బలంగా లేదా ఆశ. " 

" దానికేమిటి , ఇప్పుడు మనిషిని పంపిస్తే ఉదయానికల్లా వచ్చేస్తాడు. సరే , ఇంకేమి ఆశ ఉంది నీకు ? "

" మీరు నవ్వనంటే చెబుతాను " 

" లేదు , ఖచ్చితంగా నవ్వను " 

          " ఈ మైత్రేయి ఇలాగ పెళ్ళీ పెటాకులూ లేకుండా ఉండుటకు నేనే కారణము అనవచ్చును. నేను పోతే దీని గతి ఏమి ? అన్న ఆలోచన వచ్చింది . ఉత్తర క్షణమే దానిని కాపాడుటకు దాని భాగ్యము లేదా అనిపించినది . ఆ యోచన వదలి శాంత చిత్తురాల నయినాను. " 

" నా గురించిన ఆలోచన లేదా నీకు ? "

" నాకు బాగా తెలుసు . నేను పోగానే మీరిక ఆశ్రమములో ఉండరు. వానప్రస్థులై హిమాలయముల వైపుకు వెళతారు. " 

" ఈ ఆశ్రమము ? "

          " ఔను. దీని తలరాతను నిర్ణయించుటకు నాకూ అధికారము నిచ్చినారు . అయ్యేదవుతుంది అనవచ్చు . కానీ నిర్ణయించడము మానవ ధర్మము. ఆ వేళకు యాజ్ఞవల్క్యుడొస్తే అతడిని ఇక్కడ మీ స్థానములో ఉంచవచ్చును. దైవానుగ్రహ సంపన్నుడు , విద్యావంతుడు , అనుష్ఠానపరుడు , నియమ నిష్ఠలున్నవాడు , అన్నిటికన్నా మిన్నగా ఒక వేదము , ఒక బ్రాహ్మణము , ఒక ఉపనిషత్తును పొందినవాడు . మీరేమాలోచిస్తున్నారో ? "

" నా ఆలోచనే నీ నోటిద్వారా వింటున్నపుడు నేనింకేమి చెప్పేది ? ఊ అంటానంతే ! " 

" సంధ్యాకర్మలన్నీ అయినాయా ? "

" అన్నీ ముగించుకొని నీ పక్కన కూర్చొని రక్షోఘ్న మంత్రములు పారాయణము చేద్దామని వచ్చినాను. "

" రక్షోఘ్న మంత్రములు ఇక నాకెందుకు ? ఏమీ వద్దు. మీరు ఒక్క క్షణము నా పక్కన కూర్చుంటే చాలు. " 

అంతలో ఎవరో పరుగెత్తి వచ్చి , " యాజ్ఞవల్క్యులు వస్తున్నారు " అని ఒగరుస్తూ చెప్పినారు .

ఆలాపిని , " ఆ ? యాజ్ఞవల్క్యుడొస్తున్నాడా ? " అన్నది . ఉద్ధాలకులు , ’ ఒక్కడేనా ? ’ అన్నారు.

’ ఊ ’ అని ఆలాపినికి చెప్పి , ’ కాదు , పత్నీ సమేతముగా వస్తున్నారు ’ అన్నారా వచ్చినవారు .

" మంచిదైంది .వెళ్ళి పిలుచుకు వస్తాను " అని చెప్పి ఉద్ధాలకులు లేచి వెళ్ళినారు . ఇంకొక క్షణములోనే యాజ్ఞవల్క్య దంపతులతో పాటూ వచ్చినారు . 

          యాజ్ఞవల్క్యుడు వచ్చి నేరుగా వెళ్ళి ఆలాపినికి నమస్కారము చేసి కొడుకు కన్నా ఎక్కువగా పక్కన వచ్చి కూర్చున్నాడు . ఆమె కూడా అదే విశ్వాసముతో , ’ వచ్చినావా , రా రా. ఈ దినము చూచి రేపటిరోజు నీకు కబురు పంపవలెనని అనుకున్నాము " అన్నది . 

          కాత్యాయని తాళపత్ర గ్రంధమును పట్టుకొన్నది , అలాగే ఆమెకు నమస్కారము చేసి , మైత్రేయి పక్కన కూర్చొని , " ఏమక్కా , బాగున్నారా ? "  అన్నది . 

          ఆలాపినికి ఒక ఆలోచన వచ్చింది . : ధర్మ కర్మ సంయోగము చేత ఈమె మాట నిజమయితే ? అప్పుడు కూడా వీరిద్దరూ ఇలాగే విశ్వాసముతో ఉండునట్లైతే ? "

         ఉత్తర క్షణమే మనసు సమాహితమై ఈశ్వరుని చిత్తానుసారము , వారి భాగ్యానుసారము  అవుతుంది . నా ఆశీర్వాదము కావలసి ఉంటే , అది కావలసినంత ఉంది " అని నిలకడగా అయింది . 

          యాజ్ఞవల్క్యుడు కుశల ప్రశ్నలు వేసి వెళ్ళి సంధ్యా కర్మలు ముగించుకొని వచ్చు వేళకు ఆలాపినికి రోగము ఉల్బణమైపోయింది . ఆమెకు రోగము అంత ప్రబలముగా నున్ననూ మనసు ప్రసన్నముగా ఉంది . యాజ్ఞవల్క్య దంపతులు మైత్రేయితో పాటు ఉపచారములు చేయుటకు అక్కడే ఉన్నారు . దేవరాత దంపతులను పిలుచుకు వచ్చుటకు బండి వెనుతిరిగింది . 

          మరుసటి దినము ఉద్ధాలక దంపతుల సన్నిధానములో బ్రాహ్మణ పారాయణమైనది . ఆ వేళకు దేవరాత దంపతులు వచ్చినారు . ఆ దంపతులు యాజ్ఞవల్క్యుడు పారాయణము చేసిన బ్రాహ్మణమునూ ఉపనిషత్తునూ విని సంతోషపడినారు . ఆలాపిని , " సంహిత చివరలో వచ్చిన ’ ఈశావాస్యమిదం సర్వ ’ అనుదానికీ , ఈ బ్రాహ్మణము చివరలో వచ్చిన అశ్వపు వర్ణనకూ సమన్వయము చేస్తే ? " అన్నారు . 

ఉద్ధాలకులు ’ గుమ్ముగా కాచిన పాలకు చక్కెరా తేనే కలిపినట్లవుతుంది " అన్నారు . 

Sunday, March 3, 2013

52. " మహాదర్శనము " -- యాభై రెండవ భాగము--ఉపనిషత్తు యొక్క అర్థము


52.  యాభై రెండవ భాగము-- ఉపనిషత్తు యొక్క అర్థము 


         యాజ్ఞవల్క్యునికి బ్రాహ్మణమును రాయుటకు ఆదిత్యుని అనుమతి అయినది . వెనుకటి వలెనే , అది అతని నిత్య కర్మలలో ఒకటయినది . ఎప్పటి వలెనే కాత్యాయని కూడా పతి సేవనూ , వేదపురుషుని సేవనూ చేస్తూ ఉన్నది . ఆ బ్రాహ్మణము నూరు అధ్యాయముల పరిమితి యున్నది అని అది శతపథ బ్రాహ్మణమైనది . 

         బ్రాహ్మణమును రాయుచున్నపుడు ఒక దినము  గార్గి వచ్చినారు . ఆమె బుడిలుల శిష్యుడైన వాచక్నువు కూతురు . తండ్రికి ఒకతే సంతానమగుట చేత ఆమెను చాలా ప్రేమాభిమానములతో పెంచినారు . వాచక్నువు , కూతురు వివాహము చేసుకొని వెళ్ళిపోతే తన ఇంటిలో దీపము పెట్టువారు లేకపోయెదరని కూతురును కొడుకు వలెనే పెంచినారు . సకాలములో ఉపనయనము చేసి , ముఖ్యముగా బ్రహ్మవిద్యను కూడా బోధించినారు . గార్గి కూడా ఎందుకో అందరి వలెనే వివాహము చేసుకొని సంసారములో ఉండుట వద్దనుకున్నది . తండ్రి అనుమతితో బ్రహ్మవాదిని అయినది . ఆమె లక్షణవతి. అయిననూ జనులు ఆమె కఠోర తపస్సునే మెచ్చుకొన్నారు . సాంప్రదాయము , శాస్త్రముల పేరుతో ఆమెకు ఇబ్బందులు కలిగించలేదు . విద్వద్వర్గములో ఆమెకు గణ్యమైన స్థానముండినది . విదేహపు ఆశ్రమములలో నైతే నేమి , చుట్టుముట్ల ఆశ్రమములలో నైతేనేమి , ఆమెకు తగిన గౌరవము లభించెడిది . ఆమెయొక్క శాస్త్ర నిష్ట , ప్రవచనములు , విచక్షణ , అగాధమగు అనుభవమును చూచి ఆమెను అందరూ పూజిస్తారు . 

       గార్గి అంటే జరత్కారు వంశపు అరుణి కి ఎంతో మెచ్చికోలు. " నువ్వు సరస్వతీ దేవి యొక్క అపరావతారమమ్మా ! " అని పొగడేవాడు . ఆమె నమస్కారము చేయుటకు  వస్తే  లేచి నిలబడి ఆదరముగా ఆహ్వానించేవాడు. విదగ్ధ శాకల్యుడైతే , " ఏమి చేయుట ? ఈమె మగ ప్రాణి . దానిని ఆడ దేహములో పెట్టి అన్యాయము చేసినాడు ఈశ్వరుడు ! ఎన్ని చెప్పినా , ఆడదానికి కర్మాధికారమెక్కడిది ? కర్మము లేనిదే బ్రహ్మ విచారమెలాగ పూర్ణమగును ? " అన్ననూ ఆమె అంటే అపార గౌరవము చూపించేవాడు . 

        విదేహపు రాజాస్థానములో ఆమెకు ప్రథమ వర్గపు విద్వత్పదవి . ఆమెకు ’ అభినవ సరస్వతి ’ యను బిరుదు నివ్వవలెనని వెనుకటి మహారాజు ప్రతిపాదన చేసినారు . ఆమె అది విని నవ్వేసింది . " మేము అద్వైతులము . జ్ఞాన దృష్టితో ఆత్మ ఆత్మకూ భేదము లేదు అనెడివారము . మేము బిరుదును ఒప్పుకున్న దినమే మా అద్వైతమునకు తర్పణము వదలినట్లవుతుంది " అని గౌరవముగా తిరస్కరించినది . అప్పటినుండీ ఆమె పైన గౌరవము ఇంకా ఎక్కువయినది . 

        గార్గి యాజ్ఞవల్క్యుని చూచుటకు వచ్చినది . అప్పుడు దేవరాతుడు ఇంట్లో లేడు . ఆలంబిని ఆమెను ఆహ్వానించి కొడుకు వద్దకు పిలుచుకొని వెళ్ళింది . యాజ్ఞవల్క్యునికి కూడా గార్గి వచ్చిందని సంతోషమయినది . తన విలేఖన కర్మను ఒక ఘడియ పక్కన పెట్టి ఆమె వైపుకు తిరిగినాడు . " దయచేసి అర్ఘ్య పాద్యాదులను స్వీకరించవలెను " అని ప్రార్థించినాడు . 

గార్గి నవ్వుతూ అంది , " మేము స్త్రీలము. మాకు మధుపర్కాధికారము లేదు "

        " నిజమే . మధుపర్కాధికారము స్త్రీలకు లేదు . కానీ తమరు బ్రహ్మవాదినులు. తమ దేహములో అగ్ని ఉండనే ఉన్నాడు . కాబట్టి అగ్ని తృప్తికని మేము అర్పించు అర్ఘ్యపాద్యాదులను తమరు స్వీకరించకుండుట ఎక్కడి న్యాయము ? "

        " తమరు నన్ను ధర్మ శృంఖలతో కట్టేసినారే . అగ్ని తృప్తికని తమరు అర్పించినది నిరాకరించుటకు మాకు అధికారము లేదు , నిజమే . కాబట్టి నేను స్వీకరించవలసినదే , కానివ్వండి . " 

        గార్గికి కాత్యాయని అర్ఘ్యపాద్య ఆచమనీయ అల్పాహారములను అందించినది . ఆమె అవన్నీ స్వీకరించి సమాహితురాలై కూర్చున్నది . " యాజ్ఞవల్క్యా , తమరు కొత్త వేదమును పొందిన సంగతి నాకు తెలుసు. ఈ మధ్య దానితో పాటు ఉపనిషత్తు కూడా ఉందని తెలిసింది . దానికోసమే వచ్చినాను . లౌకికముగా ఇంకొక కారణము ముడిపడు నట్లుండెను . కానీ దానిని నేను పట్టించు కోలేదు . " 

" లౌకిక కారణమేమిటని అడుగవచ్చునా ? "

        " దానికేమి ? రాజ భవనము వారు మిమ్ములను అక్కడికి పిలుచుకు వెళ్ళుటకు నన్ను దర్విగా ఉపయోగించు కోవాలనుకున్నారు . నేనన్నాను : " మహారాజులు లోకానికి మాత్రమే పెద్దవారు . లోకానికన్నా గొప్పది ఒకటుందని దానివైపుకు తిరిగినవారిని మహారాజువారే స్వయముగా వెళ్ళి చూచుట వలన , జనులకు బ్రహ్మవిద్యపై ఆదరము పెరుగును. వారు తమ దగ్గరికి వస్తే తిరుపెము కోసము వచ్చినట్లవుతుంది . కాబట్టి బ్రహ్మజ్ఞానులను తిరుపెపు వారి అంతస్తుకు తెచ్చుట నా వల్ల కాదు " అని నిక్కచ్చిగా చెప్పినాను . మహారాజు మామాటను ఒప్పుకున్నట్లే కనబడుతుంది . వారు వచ్చినా రావచ్చు. " 

       మాటలు అటు ఇటూ తిరిగి ఉపనిషత్తు వైపుకు వచ్చినాయి . " ఈశావాస్యమిదం సర్వ యత్కించ జగత్యాం జగత్ " అనునది మొదటి మంత్రపు మొదటి అర్థము . గార్గి దానిని బహు మెచ్చుకున్నది . ఆ మంత్ర భాగమును కొన్ని సార్లు తానే చెప్పుకున్నది . " అయితే యాజ్ఞవల్క్యా , తమరి ఈ ఉపనిషత్తుకు ఈశావాస్యమిదం సర్వ అనునదే నిష్ఠయా ? " ( ఆధారమా ?)

" కాదు , మొదటి రెండు మంత్రములూ చేరితే నిష్ఠ. "

" అలాగయితే తమరే ఒక అర్థము చెప్పండి " 

       " ఈ జగత్తులోనున్న సర్వులలోనూ ఈశ్వరుడున్నాడు . వాడు తప్ప ఎవరూ ఏమీ చేయలేరు . కాబట్టి ఏమి కావలసిననూ వాడినే అడగండి . అతడు కాని వేరొకడి నుండి దానిని పొందవలెను అనుకోవద్దు . " 

" ఇక్కడ అంత అర్థమున్నదా ? "

" ఇది మంత్రము . ఇది ఉన్నది అలౌకిక భాషలో . కాబట్టి ఇలాగే అర్థము చెప్పవలెను . " 

" సరే , రెండవ మంత్రము ? " 

        " అదికూడా అంతే , అలౌకిక భాష నుండీ లౌకిక భాషకు పరివర్తనము చేయునపుడు అర్థమును మాత్రమే గమనములో ఉంచుకోవలెను కదా ? కాబట్టి ఇలాగ అర్థము చెప్పెదను : ఈశ్వరుడు అన్నిటా ఉన్నాడనుకొని , శాస్త్ర విహితములైన కర్మములనే , అవి యజ్ఞమగునట్లు చేయుచూ ఆయుష్షు పూర్తియగు వరకూ జీవించవలెను . మధ్యలో , చచ్చిపోయిన చాలు కదా , నాకింకనూ చావు ఎప్పటికి వచ్చునో అని ఏడుస్తూ కూర్చోరాదు . ఎందుకంటే , ఈశ్వరుడు అన్నిటిలోనూ ఉన్నపుడు శోకమెందుకు ? మోహమెందుకు ? ఇలాగ కాక వేరే దారే లేదు . ఇలాగ కాక అంటే , చేసే కర్మలన్నీ యజ్ఞమగునట్లు చేస్తూ ఉంటే కర్మ లోపమగు సంభవమే లేదు . అదీకాక, కర్మము యజ్ఞమైన తరువాత , అది జగద్భాండారమునకు ఇచ్చిన కానుక అవుతుంది . మరి అది లోపమెలా అవుతుంది ? " 

" అవును. కర్మ చేస్తూ ఉంటేనే జీవితము అనునదే మీ అర్థమైతే , కర్మాధికారము లేనివారి మాటేమిటి ? "

        " దేవి గార్గి అంత కాతరము చెంద పనిలేదు . ఈ జగత్తులోనున్న సర్వములోనూ ఈశ్వరుడున్నాడన్న తరువాత , స్త్రీలలో లేడా ? కాబట్టి కర్మాధికారము లేనివారికి కూడా శృతి ఒక మార్గమును కల్పించినది . "

" అదేమిటో చెప్పండి , వింటాను . " 

        " కర్మాధికారము లేనివారు యజ్ఞములను గురించి చెప్పు మంత్రములను పారాయణ చేసిన చాలు . కర్మాధికారము లేనివారు ఇలాగ మంత్ర కర్మను చేసియే తీరవలెను . తప్పించుకొనుటకు లేదు . " 

       " అలాగయిన , స్త్రీలు అనిపించుకున్న మేము ఇప్పుడు అశ్వ మేధమును గురించిన పాఠము చదివినాము అనుకోండి , మాకు అశ్వమేధపు ఫలము వస్తుందా ? " 

       " తప్పక వస్తుంది . అదీకాక, అశ్వమేధము వంటి శ్రేష్ఠతమమైన కర్మము ఇంకోటి లేదు . మీకు నా మాటలో నమ్మకము లేనిచో , మీరు ఒకసారి అధ్యయనము చేసి చూడండి . " 

        " ఇది సరియైన సమాధానము . చేసి చూడండి అన్న తరువాత ఇక మాట్లాడుటకేమున్నది ? చేస్తాను . ఏ దినము ఆరంభించవలెను ? అని అడుగుట ఒకటే మిగిలింది . " 

" ఇది సరిగ్గా అన్నారు . నేను చెప్పిన విధముగా చేయండి . నేను చెప్పిన ఫలము వస్తే ఒప్పుకోండి, సరేనా కాదా ? "

" సరే " 

        " ఇప్పుడొచ్చినది ఒక మహా యజ్ఞపు సంగతి కదా ? దాని ఫలమేమిటని అడిగెదరా ? అశ్వమేధాది యాగములను చేసినవారికి శరీరమూ అంతఃకరణమూ శుద్ధమగును . శుద్ధ శరీరాంతఃకరణములున్న వారికి కర్మ కాండలో చెప్పియున్న దేవతలందరూ దేహములో ఉన్నది తెలియును . " 

" అలాగయిన చెప్పండి ,  ఎప్పుడు ఆరంభించేది ? " 

" నేను మీకు గురువును కాను . మీ గురువు గారిని అడగండి . వారు చెప్పిన దినము ఆరంభించండి . " 

        ఈ మాట ముగుస్తుండగా ఆలంబిని గబ గబా వచ్చినది . ఆమె ముఖములో కనిపిస్తున్న గాబరా చూచి కొడుకు , " ఏమిటమ్మా , ఏమైనది ? " అని అడిగినాడు. 

       ఆలంబిని చెప్పింది : " వైశంపాయనులకు దేహస్థితి క్షీణించినదంట. రెండు మూడు దినములనుండీ వస్తున్న జ్వరము ఇప్పుడు ఇంకా ఎక్కువైనదంట. "

" ఈ వార్తను తెచ్చినదెవరు ? "

       " మనిషి వచ్చినాడు . మీ తండ్రిగారేమో బండి కట్టించుకొని వెళ్ళిపోయినారు . నీకు చెప్పమన్నారు. ఏమి చేయవలెనో నీకు తెలుసంట. " 

         యాజ్ఞవల్క్యుడు వార్త విని కొంచము కలత చెందినాడు . ఎడమ కన్ను అదిరి , వైశంపాయనుల ఆశ్రమములో అంతా సుఖముగా లేదు అని సూచించినది . అక్కడికి వెళ్ళవలెనని నిర్ణయించుకొని లేచి నిలుచున్నాడు . 

       " గార్గి దేవి క్షమించవలెను. ఎంతైనా నాకది గురుస్థానము . ఈ చివరి కాలములో నేను అక్కడ లేకపోతే పాపభాగిని అవుతాను . ఈ బ్రాహ్మణపు  పని కొంతకాలము వేచి యుండవలసినది .  కానీ ఇవన్నీ మనచేతిలో లేవు . కాబట్టి ఈశ్వరుడు చేయించినట్లు అవనీ అని వాడి పైన భారము వేసి , మనము చేయు పనిని శ్రద్ధతో చేయుటయే మన పని ! అనుమతి అయితే వెళ్ళి వస్తాను , " అని చేతులు జోడించినాడు . 

        గార్గి కూడా లేస్తున్న యాజ్ఞవల్క్యుని తోపాటూ తానూ లేచింది ." వైశంపాయనులు మన విద్వద్వరేణ్యులలో ఒకరు. గురుస్థానము లేకున్ననూ ఈ అంత్య కాలములో వెళ్ళి వారి దర్శనము చేసుకొనుట తమవంటి విద్వాంసుల కర్తవ్యము . దానిపైన గురుస్థానము . ఇక ఆలోచించవలసినదేమీ లేదు. నేను మరొక దినము వచ్చి తమరిని చూచెదను. తమరి ఉపనిషత్తు , దానికన్నా తమరు చేయు భాష్యము బహు స్వారస్యముగా నున్నది . త్వరలోనే నేనుకూడా వస్తాను. వారి ఆశ్రమమునకు నేను కూడా రావలెను. కానీ ఇంటికి వెళ్ళి వచ్చి చూచెదను. " అని అందరికీ వీడ్కోలు చెప్పి వెళ్ళినది. 

ఆలంబిని , " బండి కట్టించవలెనా ? " అన్నది .

         " పరుగిడే బండి నడచే నాకన్నా త్వరగా వెళ్ళగలదు అన్నది నాకు తెలుసు. అయినా పెద్దవారికి అస్వస్థమన్న తరువాత తక్షణమే వెళ్ళవలెను. కాబట్టి నేను ముందు వెళతాను. వెనుకనుండీ బండిని అయినంత వేగముగా పంపించు. నువ్వూ కాత్యాయినీ ఇక్కడే ఇంటిలోనే ఉండి అగ్నిని చూచుకొని ఉండండి. నేనూ , తండ్రిగారూ ఈ దినము వచ్చుట ఆలస్యమైతే , రేపుకూడా స్నానపు వేళకు రాకపోతే , మీరు కాచుకోవద్దు. " అని ఉత్తరీయముతో పాటు ఇంకొక వస్త్రమును తీసుకొని వెళ్ళిపోయినాడు. 

       యాజ్ఞవల్క్యుడు ఆశ్రమమును చేరు వేళకు అక్కడ పెద్ద ఏడుపు వినిపించింది. ఎవరో, " తాళుకోండి , వారికి వినిపించకూడదు " అని ఆపుటకు ప్రయత్నిస్తున్నారు. 

        వైశంపాయనులకు జ్వరము విపరీతమై అపస్మారక స్థితి వస్తున్నది. వారు బతుకుతారను ఆశ పోయి నిరాశ నిండిపోయినది. అది తెలిసి కూడా కొంతసేపయినది. స్థితి దారుణముగా ఉన్నదని తెలియగానే అంతవరకూ వారి సేవ చేస్తూ ఉన్న కదంబిని లేచి పతికి పాదాభివందనము చేసి, వెళ్ళిపోయినది. ఇంకొక గడియలో పక్క గదిలో ఏదో పడినట్లాయెను. ఏమిటా శబ్దమని వెళ్ళి చూడగా కదంబిని దేవి జీవపక్షి ఎగిరిపోయి ఉండినది. పద్మాసనములో కూర్చొని ఉన్న వారి దేహము కిందికి వాలి పడిఉన్నది. 

        యాజ్ఞవల్క్యుడు వచ్చినది చూచి అందరూ వారికి దారి వదలినారు . అతడు వెళ్ళి గురువుల పక్కన కూర్చున్నాడు. వారికి అతి తాపము నిస్తున్న జ్వరము ఈతనిని చూచి బెదరి పారిపోయినదా అన్నట్టు అరక్షణములోనే విడిచింది. దాని గుర్తుగా శరీరమంతా స్నానము చేసినట్లు చెమటలు పట్టినాయి. ఇంకొక ఘడియ లోపలే వారు లేచి కూర్చొని శుద్ధాచమనము చేసినారు. 

       అక్కడ భార్య లేకపోవుటను చూచి ’ తానేదీ ? " అని అడిగినారు. చుట్టు ఉన్నవారు విధిలేక, జరిగినది చెప్పినారు. వైశంపాయనులు తల ఊపి, " సరిపోయినది. నా మార్గము నిర్విఘ్నమైనది " అని వృద్ధ శిష్యునొకడిని పిలచి , " ఆశ్రమము మీది. మీరు కావలసిన వాడిని ఎంచుకొని ఆతని యాజమాన్యములో ఉండండి" అని చెప్పి యాజ్ఞవల్క్యుని వైపుకు తిరిగినారు. 

        " యాజ్ఞవల్క్యా, నువ్వు ఇప్పుడు వచ్చినది చాలా మంచిదైనది. నాకిక ఆజ్ఞనివ్వు. నువ్వు దైవానుగ్రహ సంపన్నుడవు. నన్ను ఉండమని బలవంతము చేయవద్దు. చావూ బ్రతుకూ మావంటి వారికి ఒకటే ! ఇదిగో పితరులు వచ్చి పిలుస్తున్నారు. పోయివస్తాను , శం సర్వేభ్యః " అన్నారు. 

వారు కనులు మూసుకున్నారు. ఇంకొక ఘడియలోపలే దేహము చల్లబడింది.  

51. " మహాదర్శనము "--- యాభై ఒకటవ భాగము --సమారాధన


 51.  యాభై ఒకటవ భాగము  సమారాధన


          ఆచార్య దేవరాతుని ఇంటిలో ఈ దినము సమారాధన. బ్రహ్మర్షి యాజ్ఞవల్క్యుడు ఆదిత్య దేవుని అనుగ్రహము వలన లభించిన యజుర్వేద లేఖనమును  ముగించినాడు . దానికే ఈ సంభ్రమపు సమారాధన. ఇరవై నలుగురు దంపతులకు దంపతీ పూజ. వచ్చిన వారిలో రాజపురోహితుడు భార్గవుడు , ఇద్దరు కులపతులూ ముఖ్యులు. 

         భార్గవులు కులపతుల ప్రశ్నకు ఉత్తరముగా అన్నారు , " వెనుకటి మహారాజులు ’ కావలసినది జరగవలెను , కురు పాంచాలులను మించునట్టి విద్వాంసుడు మనలో పుట్టిమన దేశము కీర్తి సంపన్నము కావలెను ’  అనేవారు . ఇప్పుడున్నవారు విద్వత్సంభావనా విషయములో ఏమీ తక్కువ వారు కాదు . ’ అయినా వారింకా ప్రాతస్సూర్యులే . అయినప్పుడు చూద్దాములే , ’ అనునది ఒక స్వభావముగా మారినట్టున్నది . లేకపోతే ఇంతటి సందర్భములో రాజ భవనము నుండీ ఇంకా కానుకలూ లాంఛనాలూ రాకుండా ఉండటము ఏమిటి ? " 

          ఆచార్యుడు అక్కడే ఉన్నాడు . వారు అది విని అన్నారు : " దానికి కారణము లేకపోలేదు . ఒక దినము రాజభవనము నుండీ పిలుపు వచ్చినది . అనగా , నేను చెపుతున్నది ఇప్పటి మహారాజు గురించి . యాజ్ఞవల్క్యుడు అప్పుడేమనవలెను ? ’ నేను ఇప్పుడు చేపట్టిన కార్యము ముగియు వరకూ నేను ఎవ్వరినీ చూడబోను ’ అనేసినాడు .  ఇంకా వేడి రక్తమున్న ఆ మహారాజుకు అది విని చురుక్కుమనుట సహజమే కదా ? "

అది విని కులపతులిద్దరూ చాలా సంతోషించినారు . ఒకరు , " అతడికి ఇప్పుడు కావలసినది రాజానుగ్రహము కాదు , దేవతానుగ్రహము . రెంటిలో రెండవదే ముఖ్యము . అది లభిస్తే మొదటిది తానే దొరకును. " అని సంతోష పడితే , ఇంకొకరు , " ముఖ్యముగా , ఇంకా కాలము రాలేదు . దానివల్లనే దేవతలు అతడి నోటిలో ఆ మాట పలికించినారు . " అని సంతోష పడినారు . 

భోజనానికి ముందే దంపతీ పూజలు జరిగినవి . ఆదిత్యుని ద్వాదశ నామములు ఒక్కొక్క దానికీ ఇద్దరు దంపతులకు పూజలు జరిగినవి . చీర, రవిక , ధోవతులు , దక్షిణగా రెండ్రెండు ధేనువులు , పసుపు , కుంకుమ , పూలు , తట్టల నిండా పళ్ళు , అవి చూచి అందరూ , " ఇలాగ చేయుటకు కేవలము రాజాధిరాజులకు మాత్రమే సాధ్యము . ఏదేమైనా తీసుకొనుట మాత్రమే అలవాటైన బ్రాహ్మణులు ఇలాగ ఇచ్చుట ఆశ్చర్యమే !! " అని పొగిడినారు .  

భోజనానంతరము తాంబూలాదులను ఇచ్చి కాత్యాయనీ యాజ్ఞవల్క్యులు ఆశీర్వాదములను పొంది అందరినీ వీడ్కొలిపినారు . కులపతులూ , భార్గవులూ కొత్త వేదమును వినుటకు కూర్చున్నారు . యాజ్ఞవల్క్యుడు వినిపించుట మొదలుపెట్టినాడు . మొదట ప్రకృతి యానమైన దర్శేష్టి విన్నవారంతా చాలా ఆనందించినారు . " ఇప్పుడున్న యజుర్వేదములో ఇంతటి పరిష్కారము లేదు . బ్రాహ్మణపు సహాయము లేక దానిని సమన్వయము చేసుకొని పోవుట నిజముగా కష్టము . అయితే ఇది అలాగ కాదు , మంత్రముల వినియోగములు స్పష్టముగా వున్నాయి . ఇది  శుక్లమయితే , ఇప్పుడున్నదానిని కృష్ణ యజుర్వేదమనవలెను .  దేవరాతా , మీరు యజ్ఞవల్క్యులని ప్రసిద్ధులైతే , మీ కొడుకు వేద వల్క్యుడు . ప్రకృతి వికృతి యాగములను రెండు పాయలుగా విభజించినట్టు విభాగించి చూపునట్టి ఒక వేదమునే ఆదిత్యదేవుని దయ వలన పొంది తెచ్చినాడు " అని పొగడినారు . 

యాజ్ఞవల్క్యుడు లేచి వారికి సాష్టాంగ ప్రణామము చేసి చేతులు జోడించినాడు . " అంతా తమరి అనుగ్రహము ! " అన్నాడు . వైశంపాయనులు , " ఇలాగ నవోనవమైన వేదమును పొందుటకే పుట్టినవాడు , నాకు గనక శిష్యుడై ఉంటే అయ్యెడిదా ? దేవతలు ఒక ఆటను రచించి మమ్ములను వేరు చేసినారు . ఏమైనా సరే , మా యాజ్ఞవల్క్యుని ప్రాదుర్భావము మాకు హితమే కాదు , ప్రియము కూడా ! " అని యాజ్ఞవల్క్యుని వెన్ను తట్టినారు . 

ఉద్ధాలకులు ఏమీ మాట్లడకయే ముసి ముసి నవ్వులు చిందిస్తూ కూర్చున్నారు . వైశంపాయనులు , " సమారోపణము ఎలాగయినది , చూద్దాము తియ్యవయ్యా " అన్నారు . యాజ్ఞవల్క్యుడు తీసి చదివినాడు . ’ ఈశావాస్యమిదం సర్వ...’  మొదలగు పద్దెనిమిది మంత్రములు . 

వైశంపాయనులు , " ఈ మంత్రములు ఏ కర్మలో వినియోగము ? " అన్నారు. వారికి సమాధానము చెప్పువారెవరు ? యాజ్ఞవల్క్యుడు  మిన్నకున్నాడు . 

ఇటు ఆడవాళ్ళ మధ్య గుసగుసలు మొదలైనాయి . మైత్రేయి అత్త చెవిలో ఏదో ఊదింది . ఆమె , " మా మైత్రేయి ఏమో అంటున్నది , వినండి .’  అని ఉద్ధాలకులకు చెప్పింది . వారు అందరి అనుమతితో , " అదేమిటమ్మా ? చెప్పు " అని మైత్రేయిని అడిగినారు . 

ఆమె రెండు మూడుసార్లు మొహమాట పడి , మళ్ళీ మళ్ళీ అడిగించుకొని , లేచి అందరికీ నమస్కారము చేసి, " ఈ నవీన వేదము లభించినది ఆదిత్యుని కృప వలన. ఆ మంత్రముల వినియోగము గురించి యాజ్ఞవల్క్యుని అడిగితే ఎలాగ ? ఆదిత్యుడినే అడగవలెను " అన్నది . 

సభ , ఆమె మాటను ఒప్పుకున్నది . యాజ్ఞవల్క్యుడు గురుజనుల అనుమతితో ఆచమనాదులను చేసి ఆదిత్యుని ప్రార్థించినాడు . ఆదిత్యుడు అతడి నోటిలో పలికించినాడు, " ఈ మంత్రములకు వినియోగము లేదు . ఇది ఉపనిషత్తు . తామెల్లరూ వేదమును బ్రహ్మము అంటున్నారు . ప్రత్యక్షముగా బ్రహ్మమును బోధించు ఉపనిషత్తు లేకుంటే వేదము బ్రహ్మమగుటెలా ? అందుకోసమే ఇది " 

ఆ వివరణ అందరికీ సమంజసమనిపించినది .  అందరూ ఒప్పుకున్నారు . కాత్యాయనికి మైత్రేయితో మైత్రి కుదిరింది . ఆమెకు , ఆ సభలో ఆ సందర్భములో తన భర్తకు కలగబోయే అవమానమును తప్పించినది అని మైత్రేయి అంటే ఏదో ఆత్మీయ భావము కలిగింది . దగ్గరికి వెళ్ళి కూర్చొని విశ్వాసముతో , " ఈ దినము నుండీ నువ్వు నాకు అక్కవి " అన్నది . మైత్రేయి కూడా ఆ విశ్వాసమును వద్దనలేదు . 

అంతా అయిన తరువాత వైశంపాయనులు , " మంచిది , ఆచార్యా , ఈ దినము గార్గి దేవిని ఎందుకు పిలవలేదు ? ఆమె ఉండి ఉంటే ఈ సభ బ్రహ్మసభకు సమానమయ్యెడిది . " అన్నారు . 

ఆచార్యుడు  , " దేవి గార్గి ఊరిలో లేరు . తమ గురువులైన కురు పాంచాల దేశపు విదగ్ధ శాకల్యులను చూచి వచ్చుటకు వెళ్ళియున్నారు " అన్నాడు . 

ఉద్ధాలకులన్నారు , " ఆతడు పేరు మోసిన విద్వాంసుడైతే కావచ్చు. కానీ దేవీ గార్గి వలె జ్ఞాన కాండలో అంత చెయ్యి తిరిగిన వారు కాదు అనిపిస్తుంది . అయినా విద్వద్వర్గములో గణ్యుడైన వాడు . ప్రథమ శ్రేణికి చేరినవాడు . " 

వైశంపాయనులు నవ్వుతూ అన్నారు : " అందువలననే మన వెనుకటి మహారాజు వారు , వారినందరినీ తోసిరాజన గల విద్వాంసుడు మనలో ఒకడు పుట్టవలెను  అనుచుండినది . మీ ఈ స్తుతి వచనమును గనక విని ఉంటే వారు ఎలాగయ్యెడివారో ? "

" దేనికీ ? కొంచము వేచియుండండి . యాజ్ఞవల్క్యుడు ఆ గార్గి , విదగ్ధ శాకల్యుడు మొదలగు వారికన్నా గొప్పవాడగు కాలము చాలా దూరము లేదు . మీ శిష్యుడు వారిని మించిపోవును . " 

" అలాగ అవుతుందంటే , ఇదిగో , ఇప్పుడే నేను నా తపస్సునంతా ధారపోయుటకు సిద్ధము . వైదేహులు విద్యార్థముగా కావలసినది ఇచ్చుటకు సిద్ధముగా నున్ననూ ఇంకా విద్యాలక్ష్మి విదేహమును తన గృహముగా చేసికొనలేదు . మీ ఆకాంక్ష వలన అలాగ అగుగాక. " 

" అవుతుంది , సందేహము లేదు " 

ఆచార్యుల ఇంటిలో జరిగినదంతా కూలంకషముగా రాజభవనమునకు నివేదిక వెళ్ళినది . మహారాజులు ,  యాజ్ఞవల్క్యులు రాజ భవనమునకు రానన్నది విని పదుగురు పలుమాట లాడతారేమో , పని చెడునో ఏమో అని శంకించి , రాజపురోహితుని వెంటనే పిలిపించుకున్నారు . అతని ద్వారా అక్కడ జరిగినది మళ్ళీ ఒకసారి విని , " మీ మాట ప్రకారము జరిగి ఉంటే బాగుండెడిది . ఇప్పుడు చేజారి పోయింది . ఏమి చేయుట ? ఇంతటి విద్వాంసులను గౌరవించక పోతే , మా వంశపు ఖ్యాతి మిగులుటెలాగ ? " అన్నారు . 

భార్గవుడు ఆలోచించి , " దేవీ గార్గి ఇక్కడికి వచ్చు వరకూ ఆగండి . ఆమెను ఉపయోగించి , యాజ్ఞవల్క్యుడను ఆ మదపుటేనుగును పట్టి తెచ్చు ప్రయత్నము చేద్దాము " అన్నాడు . 

Friday, March 1, 2013

50. " మహాదర్శనము "--యాభైయవ భాగము--కీర్తి వ్యాపించినది


50.  యాభైయవ భాగము--- కీర్తి వ్యాపించినది


" మిథిలలో బ్రహ్మర్షి యొకడు పుట్టి యున్నాడంట ! " 

" మిథిలా నగరపు జనక మహారాజు విద్వాంసులకు కావలసినదంతా ఇస్తున్నది సార్థకమైనది "  

" విద్య ఎంతైనా కురు పాంచాలుల సొత్తు యనునది ముగిసింది " 

" ఏదో మద్ర వారూ , కాశీ వారూ విద్వాంసులు అయితే కావచ్చును అనుకున్నాము , ఇప్పుడు మిథిల వారు కూడా తలెత్తుకొని తిరుగునట్లాయెను . " 

"  మిథిలలో కూడా మహర్షి కల్పులూ , ఋషి కల్పులు ఉన్నారు , లేరనుటకు లేదు , ఎందుకు ?  ఋషి దేవరాతుడుండలేదా ? " 

"అలా అనవద్దు , మహర్షి వైశంపాయనులు తక్కువ వారా ? ఆ ఉద్ధాలక మహర్షులు మాత్రము సామాన్యులా ? "  

        " సరేలే వయ్యా , బ్రహ్మర్షి పుట్టవలెనంటే ఊరకే అవుతుందా ? కర్మ కాండ , బ్రహ్మ కాండ సిద్ధాంతములు రెండూ అనుభవ పూర్వకముగా తెలిసినవాడై , శిష్యులకు కూడా ఇదమిత్థం  ఇది ఇలాగ అని బోధించు వాడు కావలెను . అంతటివాడు పుట్టినాడంటే జగత్తు యొక్క అదృష్టమనవలెను . " 

          " నువ్వు చెప్పేదెవరి గురించి ? యాజ్ఞవల్క్యుడి గురించే కదా ? నాకు తెలుసు , విను : ఎన్నో సంవత్సరముల కిందటే వైశంపాయనులు అతడిని తమ ఆశ్రమము నుండీ వెడలగొట్టినారు . అంతటివారు ఇప్పుడు బ్రహ్మర్షి యైనారంటే ఏమి చెప్పేది ? ఊరికే ఉండవయ్యా ! " 

" అటుల కాదయ్యా , అతడికి అభ్యూహన మంత్ర సిద్ధి అయినదట. ఆ తరువాతే  వైశంపాయనుల ప్రసక్తి . " 

          " ఏమైనా చెప్పు , మేము ఏదీ చూడకుండా దేనినీ నమ్మము . నువ్వు చెప్పినదాని కన్నా ఎక్కువగా నాకు తెలుసు , అయినా నేను నీకన్నా ఎక్కువగా ప్రత్యక్షమును నమ్మేవాడిని . " 

" సరే పద , వెళ్ళి చూసుకొని వద్దాము "  

       " స్వామీ , మా వల్ల కాదు , మేము సన్యాసులు కాదు , ఉంటే ఈ ఊరు లేస్తే పక్క ఊరు అనుటకు మాకు పెళ్ళాం పిల్లలు ఉన్నారు . మేము ఎక్కడికైనా వెళ్ళ వలెనంటే ఇంటిలో అంతా సంపన్నముగా ఉంటే మాత్రమే సాధ్యము . కాబట్టి అనుకున్న వెంటనే సాధ్యము కాదు "   

        " కానీవయ్యా , ఇంకేమి మాఘాది పంచకము వచ్చింది . ఎక్కడ చూచినా యాగములవుచున్నవి . నిన్ను ఆర్త్విజ్యమునకు పిలవనే పిలుస్తారు . కర్మ ధర్మ సంయోగముంటే నేనూ వస్తాను . ఇద్దరం వెళ్ళి చూచుకొని వద్దాము ."" 

        " అలాగయిన సరే . ఈ యాజ్ఞవల్క్యుని విషయములో ఒకటి మాత్రము నిజము . అతడు అసంగ్రహి . ఎవరినుండీ ఒక గుడ్డి గవ్వను కూడా తీసుకోడంట. "  

" సరే , అతడిని ఎవరూ అధ్వర్యమునకు పిలవరా ఏమిటి ? "  

" పిలవకేమి ? కానీ అతడు వెళ్ళడట. "

          ఇలాగ పరి పరివిధములుగా బ్రాహ్మణుల సంపత్తు చేరిన ప్రతిచోటా యాజ్ఞవల్క్యుని వృత్తాంతము తప్పక వచ్చును . నూరు మందిలో ఒక్కొక్కరు అతడి యోగ్యత విషయములో సందేహ పడుతారు . అదేమో ఎందుకో ఉద్ధాలకుల వద్ద యాజ్ఞవల్క్యుడు ఉండి బ్రహ్మోపాసన చేసినదానిని ఎవరూ మాట్లాడరు . కానీ వైశంపాయనుని వద్ద అతడుండి వచ్చినదీ , మరలా ఎలాగెలాగో బ్రహ్మర్షి యైనది మాత్రము అందరి నోటిలోనూ వస్తుంది . 

          ఇక్కడ యాజ్ఞవల్క్యుడు ప్రాతః కర్మలన్నీ ముగిసిన తరువాత సూర్యోపాసనను ముగించి గుడిసెలో కూర్చొని వస్తూ ఉంటాడు . కాత్యాయని  ఒకతే అతనికి నీడలా ఉండి సేవ చేయును . భూర్జ పత్రములను తెచ్చి , వాటిని సరిగ్గా కత్తరించి ,ఈనెలు తీసి ,  బాగా కడిగి, నానవేసి , ఉంచుట ఆమె దైనందిన కార్యములలో ఒకటి . అప్పుడప్పుడు ఆలంబిని వచ్చి కొడుకును చూచి వెళ్ళేది . ఆమెకు కొడుకు ముఖములో తేజస్సు నిండియుండుట చూసి చాలా సంతోషము . 

          అదేమో ఈ వర్షము ఆచార్య దేవరాతునికి విరామమే లేదు . కొడుకు ద్వారా ఆదిత్యుడు లోకానికి వేరే వేదమును అనుగ్రహించినది అతడికి తెలుసు . ఒక దినము కూర్చొని , తమ వేదమునకూ , ఆ కొత్త వేదమునకూ గల వ్యత్యాసమేమిటో చూడాలన్న కుతూహలము అతనికి పెరిగిపోయింది . కానీ దానికి కావలసిన వ్యవధానము లేదు . 

         ఎలాగో ఆచార్యుడు ఒకరోజు వీలు చేసుకొని కొడుకును వెతుక్కొని వచ్చినాడు . గుడిసెలో కొడుకు పద్మాసనము వేసుకొని కూర్చొని రాస్తూ ఉన్నాడు . అతడికి ఒంటిమీద స్పృహలేనట్టు కూర్చొని రాస్తున్నాడు . చేతనున్న ఘంటము, రాస్తున్న భూర్జ పత్రము తప్ప , ఇంకొక దాని గమనమే లేకుండా రాస్తున్న అతని ముందు ఇంకొక ఘడియ అలాగే నిలుచొన్నాడు . దేవరాతుడు కట్టుకున్న గంజిపెట్టి ఉతికిన తెల్లటి గరగరలాడే ధోవతి ఆ గుడిసెలో కాంతి పెంచుతూ గాలికి సన్నగా సవ్వడి చేస్తున్నా యాజ్ఞవల్క్యునికి గమనమే లేదు . 

         అది చూచి ఆచార్యుడు వచ్చి భార్యతో , " నీ కొడుకు  రాయుటలో మునిగియున్నాడు . తానుగా మనలను పిలుచు వరకూ మనము వెళ్ళరాదు . ఈ దినము కాత్యాయని  కూడా అక్కడ లేదు . ఆమె ఎక్కడ ? " అన్నాడు .

       "  ఆమె బహుశః చెరువు దగ్గరకు వెళ్ళిఉండవచ్చు . అదేం మాయో , ఇక్కడి పనంతా  ఒక్క ఘడియలోనే పూర్తి చేసి గుడిసెకు పరుగెత్తి పోతుంది . అది చూసి నాకూ సంతోషమే . నాకేమో అడ్డు చెప్పుటకు మనసు రాదు . " 

          " వద్దు , వద్దు . అడ్డువెళ్ళవద్దు . అయినా ఆమె ఇప్పటినుండే భర్త సేవ చేసుకోవడమే కదా మనకు కావలసినది ?  అది సరే , నేనిక్కడికి వచ్చినది ఇది చెప్పాలని : మననుండీ వాడికి ఇబ్బంది కలుగకుండా చూసుకో . మనము పెద్దలము అక్కడికి వెళితే , వాడు చేస్తున్న పనిని వదలి మనవైపుకు తిరగవలెను . అలాగ తిరిగితే వాడి పనికి చేటు . ఇది చెప్పడానికే వచ్చినాను . " 

        " మొన్న వెళ్ళినాను . ’ ఇంకా కొంచము మిగిలిందమ్మా . అదవగానే వారికి చూపవలెను. వారు ఒప్పుకున్న తర్వాతే మిగతా మాటలు ’ అన్నాడు . ’ మిగతా మాటలు అంటే ఏమి ? ’ అన్నాను . ’ తండ్రిగారి అనుమతి అయితే ఒకసారి గురువులకు చూపించవలెను . కానీ వారు-’ ఏమీ ?  నీ వేదము లేకపోతే నాకు వేరే గతిలేదా ? చూడండి , కొత్త వేదాన్నే తెచ్చినాను - అని జంభము చూపించుటకు వచ్చినావా ? ’ అంటే ? అని దిగులు . కాబట్టి ఆ విషయములో తండ్రిగారు చెప్పినట్లే చేయవలెనని అనుకున్నాను ’ అన్నాడు " 

         " వాడు చెప్పినది సాధువుగా ఉంది. అయితే వైశంపాయనులు వాడి విషయములో అలాగ అనరు . అదేకాదు , వీడికి కొత్త వేదము వచ్చినది కూడా వారికి తెలుసు . వీడికి కొత్త వేదమును అనుగ్రహించిన ఆదిత్య దేవుడే వారికి కూడా దర్శనమిచ్చి, ’ ఆచార్యా , నీ దయ వలన జగత్కార్యము ఈనాడు నెరవేరినది . నీ శిష్యునికి ఈ నాడు వేదమును దేవతలు నా ద్వారా ఇచ్చినారు . ఇప్పుడు అతడు దానిని రాస్తున్నాడు .  అదయిన తరువాత నీ వద్దకు పంపిస్తాము . నువ్వు చూచి ఒప్పుకుంటే , ఆ తర్వాతే మిగిలిన మాటలు ’. అని అన్నాడట. ఈ పూట సమయము దొరికితే నేనే ఈ మాటను చెప్పేవాడిని . నువ్వు అవకాశము చూసి వాడికా మాట చెప్పు . ఏమైనా సరే , అందరూ అదేమిటో , ఎందుకో , యాజ్ఞవల్క్యుని బ్రహ్మర్షి అంటున్నారు . వారి మాటే నిజము కానీ అని నేను రాత్రీ పగలూ ఆకాంక్షిస్తున్నాను . సరే , ఇదంతా ఉండనీ , కాత్యాయని  వెళితే ఆడది వచ్చింది అని ఏమీ ఆరాటము లేదు కదా ? "

          " దైవము అలాగ జరగ నివ్వలేదు అనవలెను . పోయిన వర్షము భర్త ఆదిత్య వ్రతములో ఉన్నాడని ఆమె నియమములో ఉన్నది కదా ! అప్పటినుండి వాడికి ఆమెమీద మమత కావలసినంత ఉంది . అయినా మీరేమీ అనుకోవద్దు. వాడు పదిమంది లాగా సంసారమును లంపటముతో నడిపించువాడు కాదనే నా భావన. ఏదో సంత వేళకు మూడు మూరలు బట్ట నేస్తే చాలు అనుకునే వాడు . వాడికింకా నా యిల్లు , నా వాకిలి అన్న లంపటమే లేదు . " 

        " చూడు , మనకు వేరే పిల్లలు లేరు . ఇంట్లో అంతా సమృద్ధిగా ఉంది . కూర్చొని తిన్నా ఇంకా ఒక పది సంవత్సరాలకు మోసము లేదు . ఇప్పుడు వీడికి అప్పుడే నాకన్నా ఎక్కువ కీర్తి వచ్చింది . వీడు రానన్ననూ పట్టుకొని వెళ్ళి యజ్ఞ యాగములు చేయించని వారే లేరు . అన్నిటికన్నా మిన్నగా వీడు కొత్త వేదమును తెచ్చినవాడు . వీడిపాలిటి దైవము వీడిని కాపాడక చేయి వదలదు . ఇప్పటికి చేసుకున్న పెళ్ళాన్ని వదలక ఇంట్లో దీపము పెట్టుకుంటూ ఉంటే చాలు . " 

         " వాడు ధర్మ పరాయణుడు. కాబట్టి పెళ్ళాం విషయములో దిగులు పడనవసరము లేదు . అదీకాక, మీరు చెప్పినట్లు వాడి దేవతలు వాడి చేయి వదలరు . కానీ వాడు మీవలె కాదు . మీకు ఇంటి విషయములో ఉన్న అక్కర వాడికి లేదు అన్నాను , అంతే ! " 

          " అయితే ఒక్కొక్కసారి వాడి తేజస్సు కన్నులతో చూచుటకు కాదు . మండే సూర్యుడే దిగివచ్చి వాడిలో వెలసినాడా యేమి,  అనిపిస్తుంది . అప్పుడంతా నాకు ఏదో ఆలోచన , మీకు తెలుసా , వీడేమైనా తానున్న చోటునే వేరే లోకముగా చేసేస్తాడేమో యని సందేహమవుతుంది . అయితే పక్కనే ఉన్న కాత్యాయనిని చూసి , " ఓహో , ఇదే లోకము , వేరే లోకముకాదు " అని సందేహ నివారణ అవుతుంది . అట్లే , బయట గుడిసె పక్కన  ఉన్న  అవే మొక్కలు , అవే చెట్లు , అదే చెరువు ఉండుట చూసి నేను వేరే లోకమునకు వెళ్ళలేదు అని నమ్మకము వస్తుంది ." 

         ఆచార్యుడు ఆ వివరణను విని నవ్వినాడు .: " భలే ఆలంబినీ , నువ్వు పురాణ ప్రవచనము చెప్పితే చాలా బాగా ఆకట్టుకుంటావు . అది సరే , సమయము చూసి వైశంపాయనుల వృత్తాంతము వాడికి చెప్పు " 

49. " మహాదర్శనము " --నలభై తొమ్మిదవ భాగము --ఆదిత్యుని అనుగ్రహము


49.  నలభై తొమ్మిదవ భాగము --ఆదిత్యుని అనుగ్రహము


          యాజ్ఞవల్క్యుడు వ్రతుడై , కాత్యాయని ఆతని సతియై , పాయస భోజనము చేస్తూ ఒక సంవత్సరము ఆదిత్యోపాసన చేసినారు . కొన్ని దినములగుచుండగా , యాజ్ఞవల్క్యుడు మంత్ర జపమునకు కూర్చొనువేళకు , ఒక పచ్చటి మైదానములో మేస్తున్న ఎర్రటి గుర్రమొకటి కనిపిస్తుంది . అతడు  జపంలో ఉన్నంత సేపూ అది ఎదురుగనే ఉండును . 

         కాత్యాయనికి ఆమె పితామహుని వలననూ , ఇంటి లోని వారు ఆడుకొను మాటల వలనా, భర్త ఒక అలౌకిక మహాపురుషుడు అన్నది తెలిసియుండినది . అందుకే ఆమె , భర్తను వ్రతమెందుకు చేయుచున్నావు మొదలైన ప్రశ్నలను ఒక్కటీ అడుగలేదు . 

         రాను రాను యాజ్ఞవల్క్యుని ముఖము తేజస్సుతో వెలుగుచున్నది . తేజస్సంటే సామాన్యమైన తేజస్సు కాదు , అది కనులకు మిరుమిట్లు గొలుపు నంతటి తేజస్సు . ముట్టుకుంటేనే కాదు , చూస్తేనే కాలుస్తుందేమో అనునట్టి తేజస్సు . ఒకటి రెండు సార్లు అతడు జపమగ్నుడై యున్నపుడు అతని తల్లి ఏదో కారణము వలన వచ్చి తొంగి చూచినది. పదునై తీవ్రముగా నున్న , ఆ శీతలమైన తేజస్సును చూచి , గుడిసె దేదీప్యమానంగా వెలుగుతుంటే ఎక్కడైనా అంటుకుంటే ? అని శంకించి , తన భర్తకు తన శంకను చెప్పినది . అతడు నవ్వి , " పిచ్చిదానా , మంత్ర జపము చేయువాడు మంత్రాధిదేవత వలెనే అగును , నిజము . కానీ గుడిసె ఏమీ అంటుకోదు . దిగులు పడవద్దు . ఒకవేళ నీ కొడుకు యొక్క  తపోజ్వాల వలన గుడిసె అంటుకున్నా , అతడిని ఏమీ చేయలేదు . " అని శాంతింప జేసినాడు . 

         అయితే దినమూ భర్త తోపాటు అగ్ని సేవ చేయునపుడు కాత్యాయనికి శాఖము , వేడిమి ఏమీ తగులుట లేదు . పైగా దేహమంతా ఏదో సౌభాగ్యమును పొంది సంతోష పడినట్లగును . ఆమె అదంతా గమనించలేదు . ఆమెకు కావలసినది ఒకటే ఒకటి : అది , భర్త కృతార్థుడగుట. 

        ఇలాగ కొన్ని దినములు గడచినాయి . నెలలూ గడచినవి . గుర్రము ఒకరోజు సకిలిస్తూ యాజ్ఞవల్క్యుని ఎదురుగా వచ్చింది . అతడికి ఇది సామాన్యమైన గుర్రము కాదు అనిపించి , దానికి పంచోపచార పూజను అర్పించినాడు . గుర్రము మానవులు స్వీకరించుట కన్నా ఎక్కువగా పూజను స్వీకరించి , ’ నా వలన ఏమి కావలెను , చెప్పు ’ మానవ భాషలో అడిగింది . 

        యాజ్ఞవల్క్యుడు , " దేవా , నువ్వు ఎవరు అని అడుగవలెనని ఆశ. అయితే ఆదిత్యమంత్రమును జపము చేయునపుడు దర్శనము ఇస్తున్నావు కాబట్టి ఆదిత్యుడవే అయి ఉండవలెను అని నమ్మకము " అన్నాడు . 

        గుర్రము సకిలించినది . ఆ సకిలింపు యాజ్ఞవల్క్యునికి నవ్వు వలె అనిపించినది . ’ చూడ వలెనా , చూడు ’ అన్నది . చూడగా , గుర్రము ఉన్న వైపంతా ఆదిత్య మండలము జ్వాలాయమానం గా మనోహరముగా ఉంది . నానా వర్ణపు జ్వాలలు మండలమును వెలిగిస్తూ వెలుగుచున్ననూ , తెల్లటి వెలుగు అంతటా పరచుకొని సుందరముగా ఉన్నది . మండల మధ్యస్థుడైన హిరణ్మయ పురుషుడు విరాజిల్లుతున్నాడు . రక్త మాల్యాంబరములను ధరించినాడు . సర్వాభరణ భూషితుడైనాడు . ఆతడే ఆదిత్యుడై యుండవలెనని యాజ్ఞవల్క్యునికి బోధయగుచున్నది . 

 ఆ మహాపురుషుడు అడిగినాడు , " ఏమి యాజ్ఞవల్క్యా , నా వలన ఏమి కావలెను ? " 

         యాజ్ఞవల్క్యుడు ’ నేను అర్పించిన పూజను గైకొనుము ’ అంటున్నాడు . ఆ మహా పురుషుడు , " మీ దంపతులు నిత్యమూ అర్పిస్తున్న పూజవలన నేను ప్రసన్నుడనైనాను . కాబట్టి మరలా పూజ అవసరము లేదు . నీకేమి కావలెనో అడుగు "  అంటాడు . 

       యాజ్ఞవల్క్యుడు " దేవా , మేము మానవులము . లోభపు మూర్తులము . మేము మా మనసు ప్రేరేపించునట్లు పలికెడివారము . కాబట్టి , నేను అడుగుట , నువ్వు ఇచ్చుట వద్దు . ఏమిస్తే నేను కృతార్థుడ నగుదును అని నీకనిపిస్తుందో , నువ్వు నీ అంతస్తుకు తగినట్లు ఏమిస్తే సరిపోతుందో , నాకు నువ్వేమిస్తే లోకము కృతార్థమగునో , దానిని ఇవ్వు " అంటాడు . 

         ఆదిత్యుడు ఆ మాట విని తల ఊపుతాడు . " యాజ్ఞవల్క్యా , నువ్వు నా మంత్రమును నాకే అప్పజెప్పినావు , భలే !  కానిమ్ము , అటులనే ఇచ్చెదను . నీ అహంకారమును ముందుంచుకొని , అదివ్వు , ఇదివ్వు అనకుండా , ఏమి ఇచ్చుట అనుదానిని నీకే వదలినాను అన్నదీ బాగుంది . అది సదహంకారపు పరమావధి . కానిమ్ము , నువ్వు పుట్టినది ఎందుకు అన్నది నాకు తెలుసు . ఈ ఉద్దేశము నెరవేరనీ యనే , మేమే నీచేత ఈ వ్రతమును చేయించు చున్నాము . సరే , ఇంకొన్ని దినములు వ్రతమును చేస్తూ ఉండు . ఇప్పుడే కదా ఉత్తరాయణము గడచింది, మరలా ఉత్తరాయణములో నేను నీకు మరలా వరప్రదానము చేయుదును . ఇక వెళ్ళి వస్తాను " అని అంతర్థానమవుతాడు . యాజ్ఞవల్క్యుడు మరలా జపములో మగ్నుడవుతాడు . 

          మరలా ఉత్తరాయణము వచ్చింది . జగత్తును ఆవరించిన శీతలము ఓడిపోయిన సైనికుడివలె మెలమెల్లగా వెనక్కి వెళుతూ వేసవికి దారి ఇస్తూ వచ్చింది . రథసప్తమి కూడ వచ్చి  , సూర్యుని రథము ఉత్తరమునకు తిరిగింది . యాజ్ఞవల్క్యుడు అంతర్ముఖుడయి ఉండుట ఎక్కువైంది . కాత్యాయని , యాజ్ఞవల్క్యుని ప్రతిబింబము వలె , బహిర్ముఖముగా వ్యాపారములను నడిపిస్తున్ననూ , ఆదిత్య మంత్రమును ఎడము లేకయే జపిస్తున్నది . చూచేవారికి , ’ ఈ పిల్లకు మాటలే రావా ? ’ అనిపించేంత మౌనముగా ఉంటున్నది . దినమునకు ఒకటో రెండో మాటలు మాట్లాడుతుంది , అదికూడా అత్తతోటే ! 

         ఎప్పటి వలెనే తోటలో సూర్యారాధన జరుగుతున్నది . నమస్కారములన్నీ అయినవి . అర్ఘ్య ప్రదానాదులు కూడా ముగిసినాయి . ఆ దినము పూజ జరుగుచుండగా ఏమి విచిత్రము జరిగిందో ఏమో , యాజ్ఞవల్క్యుడు భార్యను పిలచి , " సాధ్యమైతే నువ్వు ఈ దినము గుడిసెలో ఉండు " అన్నాడు . కాత్యాయని మౌనముగా , వినయముగా ’ సరే’ నని తలాడించినది . ఇంకా సూర్యుడు ముఖాని కెదురుగా వస్తున్నాడు , అంతే ! మొదటి ఝాము గడచింది . సుమారు రెండో ఝాములో కూడా కొంత గడచింది . 

యాజ్ఞవల్క్యుడు ఎప్పటిలా జపములో మగ్నుడైనాడు . కాత్యాయని వాకిటి లోపల తానూ జపములో కూర్చున్నది . 

          ఎప్పటి వలె గుర్రము కనిపించినది . గుర్రము ఒకటి ఉన్నది , ఒకటి రెండైనది . అలాగే మరలా ఒకటే అగుచున్నది . అదికూడా గుర్రము పిల్లగా అగుచున్నది . పరుగెత్తుతూ నేరుగా యాజ్ఞవల్క్యుని వద్దకు వచ్చి , " యాజ్ఞవల్క్యా , వచ్చేదా ? " అని అడుగుతుంది . అతడు దానికి పూజ చేసి , " దేవా , నీ ఇఛ్చయే నా ఇఛ్చ " అంటాడు . 

         " చూడు , నువ్వు నన్ను ధరించగలవా ? " అని గుర్రము కాళ్ళు తాటిస్తూ ఆడుచున్నది . చూడగా , ఇప్పుడది గుర్రము పిల్ల కాదు , ఒక మనిషి కన్నా ఎత్తైన గుర్రము . అంతే కాదు , జ్వాలామయమైనది . నిగనిగమని నిప్పులకన్నా ఎర్రగా మెరుస్తున్నది . 

          యాజ్ఞవల్క్యునికి బెదురు కలుగుట లేదు . " దేవా , అప్పుడే తెలిపియున్నాను . నీకు సరి యనిపించిన దానిని కరుణించు . నాకు హితమైనది ఏదో దానిని కరుణించు . లోకానికి ఏది కావలెనో దానిని కరుణించు " 

          గుర్రము పలుకుతుంటే ఉరుము ఉరిమినట్లుంది , " సరే , భారమును నాపై వేసి నువ్వు కృతార్థుడవైనావు . లేకపోతే , ఇప్పుడు నేనివ్వవలె ననుకొన్న ఈ వరమును ధరించుటకు నీకు చేతనయ్యెడిది కాదు . ఇదిగో  , నువ్వు నావలె అయి , నా వరమును గ్రహించు " అని గుర్రము మరలా ఒకసారి సకిలించి ఆతని హృదయమును ప్రవేశించినది . 

        యాజ్ఞవల్క్యుడు ప్రజ్వలిస్తున్న అగ్నిగుండమైనాడు . అతని రోమ కూపము లన్నిటినుండీ అగ్ని పురుషుని కన్నా ఎక్కువగా జ్వాలలు లేచినవి . ఒక ముహూర్త కాలము  అలాగే ఉండినది . 

         గుర్రము మరలా బయటికి తిరిగి వచ్చినది . యాజ్ఞవల్క్యుని దేహము వెదజల్లుతున్న మంటలన్నీ శమించినాయి . గుర్రమన్నది , " యాజ్ఞవల్క్యా , కృతార్థుడవైనావు . నీ వలన లోకము కృతార్థమైనది . నువ్వు వేద పురుషుడవైనావు . నీనుండీ లోకము ఒక సంహిత , ఒక బ్రాహ్మణము , రెండు ఉపనిషత్తులను పొందును . వాటిలో ఒక ఉపనిషత్తు నీ గురించినది . ఇంకొకటి బ్రహ్మను గురించినది . ఆ రెండింటినీ అధ్యయనము చేసి , వాటిలోనున్న రహస్యమును ఛేదించువానికి తప్పకుండా మహాదర్శనమగును . ’

          యాజ్ఞవల్క్యుడు ఏమి చెప్పవలెనో తెలియక ఒక గడియ మౌనముగా ఉన్నాడు . గుర్రము అంత సేపూ యాజ్ఞవల్క్యుని తన మూతితో నిమురుతూ తన విశ్వాసమును చూపిస్తూ అక్కడే నిలిచింది . కొంతసేపైన తరువాత ప్రకృతస్థుడై యాజ్ఞవల్క్యుడు గుర్రానికి పూజ సలిపినాడు . వెనుక అయినట్లే మరలా , గుర్రము ఉన్న చోట మండలస్థుడైన ఒక మహాపురుషుడు  కనిపించి ఆతని పూజనంతా స్వీకరించి , " యాజ్ఞవల్క్యా , నువ్వు ఋషివైనావు . మహర్షియైనావు . బ్రహ్మర్షియైనావు . నీవంటి అదృష్టవంతుడు లేడు . ఇప్పుడు నువ్వు సర్వజ్ఞుడవు . సర్వ దేవతామయుడవు . అంతే కాదు , బ్రహ్మమై యున్న బ్రహ్మర్షి , వృక్షము లోపల గుజ్జు తో కూడిననూ బయట చిగురు , పూలు , కాయలతో మెరయునట్లే అంతర్ముఖుడవైనను బహిర్ముఖుడవై సంసారిగా ఉండు . కాలము వచ్చినపుడు హెచ్చరించెదము . అప్పుడు నువ్వు నువ్వు అగుదువు గాని . నేనిక వెళ్ళి వస్తాను , మేమంతా నీలో ఉపస్థితులము . మరవ వద్దు " అని అతనిని వీడ్కొని వెళ్ళినాడు . 

          యాజ్ఞవల్క్యుడు కళ్ళు తెరచు వేళకు కాత్యాయని కూడా కళ్ళు తెరచింది . అతనికి కనిపించినదంతా ఆమెకూ కనిపించినది . ఆమె ప్రసన్న వదనయై , తన హృదయములోని సంతోషము కన్నులలో నీరుగా వర్షిస్తున్నది . " నేను జన్మాంతరములలో ఈశ్వరుని బాగా అర్చించి యుండవలెను . లేకపోతే తమ వంటి మహానుభావుల చేయి పట్టుకొను భాగ్యమును పొందేదానిని కాదు . " అన్నది . మాటలో , " మీరు పర్వతము , నేను పరమాణువును " అన్న ధ్వనియుండినది .