SHARE

Thursday, April 11, 2013

" విభాత వీచికలు " -----మహాదర్శనము---ఉప సంహారము


మహాదర్శనము---ఉప సంహారము


         యాజ్ఞవల్క్యుడి గురించి ప్రాచుర్యములోనున్న విషయము తక్కువ. వాజసనేయ సంహిత ( శుక్ల యజుర్వేదము ) , బృహదారణ్యకోపనిషత్ ( యాజ్ఞవల్క్య , జనకుల సంవాదము ) మైత్రేయ్యుపనిషత్తు ( మైత్రేయి , యాజ్ఞవల్క్యుల సంవాదము ) మొదలైనవి ప్రాచుర్యములోనున్నను, యాజ్ఞవల్క్యుని గురించిన ఎక్కువ విషయములు శ్రీ దేవుడు నరసింహ శాస్త్రి గారు పరిశోధించి తమదైన శైలిలో మిక్కిలి ఆసక్తిదాయకముగా వ్రాసిన ఎన్నో విషయములు ఈనాటికీ సులభముగా ఆచరణీయములు. 

        పంచప్రాణములు ( ప్రాణోపాన వ్యానోదాన సమానములు ) మానవుని భౌతిక , మానసిక ఆరోగ్యములకు ఎంత ముఖ్యమైనవో , ఆధ్యాత్మిక పురోభివృద్ధికి ఎట్లు ఉపయోగపడునో , వాటిని ఆరాధించుటెట్లో , వాటివలన పొందగలుగు లబ్ధులేమిటో వాటిని ఎందరో సాధకులు ఈ నాటికీ  సాధన చేస్తూ ఉత్తమ గతి దిశగా పయనించుచున్నారు. వీటి గురించి ఏ మాత్రమూ అవగాహన లేనివారికి ఇదంతా ఒక పుక్కిటి పురాణము. ఇటువంటి ఆధ్యాత్మికమైన విషయములలో ఆసక్తి కలుగుటయే ఒక అదృష్టమని చెప్ప వలెను. ఆ తరువాత అందులో దిగితే గానీ వాటి గొప్ప దనము బోధ పడదు. పంచాగ్ని యజ్ఞము , పంచాత్మ సంక్రమణము , పంచభూతముల అనుగ్రహము పొందుట వంటివి ప్రతిఒక్కరూ అనుష్ఠించదగిన బృహదనుష్ఠానములు.  మానవుడికి సాధ్యము కానిదేదీ లేదు అను మాట తరచూ వింటుంటాము. అది ఎంత నిజమో , అంత అబద్ధము కూడా ! ఎందుకంటే ,  ప్రయత్నము చేయని వారికి అన్నీ అసాధ్యములే , అబద్ధములే ! . ప్రయత్నించినవాడు ఎన్నడూ విఫలము కాడు. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరి జన్మ హక్కు. దేవతలు , ఇటువంటి అనుష్ఠానములపై ఆసక్తి గల వారికై వేయి కళ్ళతో ఎదురు చూస్తుంటారు అన్నది ఇందులో కాలు పెట్టిన ప్రతి ఒక్కరికీ అనుభవమే. ఇట్టి సత్యములను మరొకసారి మన ముందుకు తెచ్చి మనలను కార్యోనుముఖులుగా చేయుటకు ఉపయోగపడేదే ఈ యాజ్ఞవల్క్యుని చరిత్రము. 

        సృష్ఠిలో సర్వులూ పరమాత్మ స్వరూపులనీ , బ్రహ్మ పదార్థము లేని చోటు లేదనీ మనమే ఆ బ్రహ్మ అని ఆదిశంకరుల వంటి మహనీయులు ఎందరో చెప్పియున్నారు. వారు చెప్పినది అసత్యమగునా ? మానవుడు సత్యమును గుర్తించుటలో కూడా ఎన్నో భ్రమలకు లోనైయున్నాడు. తన శక్తికి అందుబాటులో ఉండి , తనకు సాధ్యమయితే అది సత్యము, లేకున్న అసత్యము. తన శక్తిని వృద్ధిపరచుకోవచ్చునన్న విషయము అతడికి తట్టదు. అనేక ప్రారబ్ధ కారణముల చేత పుట్టుకతో వచ్చిన శక్తి మాత్రమే తనకు ప్రాప్తమన్న భ్రాంతిని వదలి ప్రయత్నించిననాడు సర్వశక్తులూ అతడివే !. 

యాజ్ఞవల్క్యుడు సాధించిన విషయములు సాధించుటకు అందరూ శక్తులే. ఇక్కడ లోపించినది శక్తి కాదు. దృఢమైన సంకల్పము ! 

ఆ సంకల్ప బలమును పెంచుకొనుటకు మనకు ఇట్టి చరిత్రములు ఎంతో ఆవశ్యకములు. 

|| జనాస్సర్వే సుఖినస్సంతు || 

3 comments:

  1. మహాద్రష్ట,మహాదర్శనం రెండూ చదువుచున్నప్పుడేకాదు వారం రోజులవరకు నిద్రలో, మెలుకువలోను వేరేలోకములో వున్నట్లే వుంది..
    జ్ఞానంతో పాటు, ప్రశాంతతను కూడా ప్రసాదించే ఇంత మంచి గ్రంధాలను మాకు పరిచయంచేసి తెలుగులో ఇచ్చినందుకు శతకోటి ధన్యవాదములు..

    ReplyDelete
  2. పూజ్యులు జనార్ధనశర్మ గారికి నమస్కారములు.మీ బ్లాగు చదువుట వలనో, అమ్మ అనుగ్రహము వలనో, కోటి గాయత్రీ మంత్ర జపము సంకల్పించి గత ఆరు సంవత్సరాలలో నలభై ఐదు లక్షల జపము చేయగలిగినాను. అందు ఒక ముప్ఫై లక్షల జపము బ్రహ్మ, వశిష్ఠ, విశ్వామిత్ర శాపవిమోచన మంత్ర పఠనము పిదప చేసాను. ఇప్పుడు ఆ శాపవిమోచన మంత్రములకు పాఠాంతరము మా నాన్నగారు ఒక WhatsApp message వలన చూసి పంపినారు. కానీ అందు కొన్ని అక్షర దోషములు ఉన్నట్లు తోచుచున్నవి.

    దయచేసి ఈ విషయమైన మీరు ఏదైనా మార్గదర్శనము చేయగలరు.

    మీ అనుమతితో మీకు Email or call చేయుటకు సిద్ధము. ధన్యవాదములు.

    ReplyDelete
    Replies
    1. రవి గారికి శుభాశీస్సులు
      కారణాంతరముల వల్ల ఈ మధ్య నేను ఎక్కువగా రావడము లేదు.
      ఆలస్యానికి క్షంతవ్యుడను
      మీరు నాకు మెయిల్ పంపవచ్చును నా ఐడీ ఉన్నది కదా

      Delete