69. అరవై తొమ్మిదవ భాగము-- అతి ప్రశ్నల ఫలము
మరుసటి దినము దేవరాతుని ఇంటికి రాజభవనము నుండీ రెండు పల్లకీలు వచ్చినాయి. ఒకటి ఆచార్య దంపతులకు , ఇంకొకటి భగవానుల దంపతులకు. వాటిని తెచ్చిన రాజపురుషులు భగవానులకు తెలియజేసినారు , " గోవులన్నీ నిన్ననే ఆశ్రమమునకు వెళ్ళిపోయినవి. అక్కడ ఈ దినము నుండీ కొట్టములు , పాకలు , ధాన్యములు , గడ్డి , గోదాములు , గాదెలు , మనుషులు , వారికి ఇళ్ళు , పశువులకు తాగునీటి భావులు అన్నీ చేయుటకు ప్రయత్నములు మొదలైనవి.
భగవానులు కాత్యాయనిని పిలచి అన్నారు : " చూడు , నీ ఇఛ్చ ప్రకారము వేయి గోవులను దేవతలు ఇచ్చినారు. ఇంకేమి చేస్తావో చెయ్యి. "
ఆమె నవ్వుతూ అన్నది , " ఔను , మనము దైవ ద్రవ్యము వారము. మనకు దేవతలు ఇస్తే ఉంటాయి , లేకుంటే లేదు. సరే , ఇప్పుడు మీరు చెప్పేది నన్ను అక్కడికి వెళ్ళి వాటిని చూచుకొమ్మనా ? "
భగవానులు ఆమె ప్రశ్నలో నున్న భావము తెలిసి నవ్వివారు: " ఇప్పుడు నిన్ను వెళ్ళమనుటకు అవుతుందా ? ఇక్కడ విద్వత్సభలో జరుగునదంతా నువ్వు చూడకపోతే ఎలాగు ? అలాగని , ఆశ్రమమునకు వచ్చిన గోవుల యోగక్షేమములను చూచుకొనుటకు నువ్వుకాక శక్తులు వేరెవ్వరు ? నీకు మంచి ధర్మ సంకటమే ప్రాప్తమయినది కదా ? "
" ధర్మ సంకటమేమీ లేదు. దేవతలు ఇచ్చిన ఈ వరము వలన నాకు ఏ విధమైన ఇబ్బందీ , ఆటంకమూ ఉండకూడదని ముందరే మాట అయినది. కాబట్టి రాజపురుషులే ఈ సభ ముగియువరకూ చూచుకొనునట్లు విధాయకము చేస్తే సరిపోతుంది. "
" అలాగా ? ఉండవే , రాజపురుషులను అడుగుదాము"
రాజపురుషుడు మరలా తెలియజేసినాడు: " కొట్టములు కట్టి వాటిలో పశువులను కట్టివేయు వరకూ అంతా మా బాధ్యత. వాటిని సరియైన స్థలములో కట్టిన తరువాత తమరి బాధ్యత. అలాగని , అప్పుడే అనుజ్ఞ అయినది. "
కాత్యాయని సంతుష్టురాలై భగవానుల ముఖమును చూచినది. వారు, " నువ్వు బుద్ధిమంతురాలివి. దేవతలకు నీ స్వరూపము బాగా తెలుసు. కాబట్టి నీ ఇష్ట ప్రకారమే అంతా చేసినారు కదా ? "
" అదీ మీ కృపయే , ఇదీ మీ కృపయే "
అందరూ జ్ఞాన మంటపమునకు సకాలములో వచ్చినారు. రాజువచ్చి వందనము చేసి , " ఈ దినము మీరు కూర్చొని మాట్లాడవలెను. పృఛ్చకులు కూడా ఎదురుబదురుగా కూర్చొనే మాట్లాడుతారు " అని విజ్ఞాపన చేసినారు.
భగవానులు అన్నారు , " నిన్ననే నాకు అనిపించినది. శాస్త్ర విచారములో మాట్లాడునపుడు నిలుచుకొని మాట్లాడుట శ్రేయస్కరము కాదు. అయితే , నిన్నటి సందర్భములో దానిని నేనుగా నొక్కి చెప్పరాదు అని ఊరకున్నాను. ఈదినము మీరు చేసిన విధానము ఉచితముగా నున్నది, అటులనే " అన్నారు.
సభ ఆరంభమగుచుండగనే భగవానులు వేదికను ఎక్కివచ్చి ఒక ఆసనములో కూర్చున్నారు. సభనుండీ ఆర్తభాగుడు వచ్చి రెండో ఆసనములో కూర్చున్నాడు. ప్రశ్నోత్తరములు ఆరంభమయినవి. ఆర్తభాగుడు అడిగినాడు : " యాజ్ఞవల్క్యా , నేను ప్రశ్నలను అడుగవచ్చునా ? "
" మీరు ప్రసిద్ధమైన జరత్కారు వంశపు వారు. ఋతభాగుల పుత్రులు. మీయంతటి విద్వాంసులు నన్ను ప్రశ్నలు అడుగుటయే ఒక గౌరవము. అటులే కానివ్వండి. సిద్ధముగా ఉన్నాను "
" మృత్యువంటే ఏమి ? దానిని గెలుచుట అంటే ఏమి ? "
" మృత్యువు ప్రవృత్తి కారణము. ప్రవృత్తిలో ఆసక్తుడు కాకుండా నివృత్తిలో మనసును నిలుపుటయే మృత్యువును గెలుచుట. "
" విశ్వమంతా బ్రహ్మమే అయినపుడు , విశ్వములో నున్నవారు ఎందుకు ప్రవృత్తిలో ఆసక్తులై ఉంటారు ? "
" ఒక్కొక్క వ్యక్తీ , గ్రహాతిగ్రహములచే నియమితుడై ఉన్నాడు. అందువలన. "
" అలాగయితే , ప్రవృత్తికారణములైన ఆ గ్రహాతిగ్రహములు యేవి ? అవి ఎన్నున్నాయి ? "
" ఆర్తభాగా , ఆ గ్రహములు ఎనిమిది. వాటిని తమ పట్టులో ఉంచుకొన్న అతి గ్రహములూ ఎనిమిదే. వినండి : ఘ్రాణము ( నాసిక ) , జిహ్వ ( నాలుక ) , చక్షువులు ( కన్నులు ), శ్రోత్రములు ( చెవులు ), హస్తములు , త్వక్ ( చర్మము ), వాక్కు , మనస్సు అనునవి గ్రహములు. ఇవన్నీ బహిర్ముఖములు ( బాహ్యముగా కనిపించేవి ). కాబట్టి ఇవి గ్రహములు. ఇవి ఎల్లపుడూ మనుష్యుని పట్టి లాగుతూ , బహిర్ముఖుని చేసి ప్రవృత్తి కారణములైనవి. వీటిని అలాగ చేయునట్లు నియమించినవి అతి గ్రహములు. అవీ ఎనిమిది. ఘ్రాణమును గంధము లాగును. జిహ్వను రసము లాగును. ఇటులే చక్షువులను రూపమూ , శ్రోత్రములను శబ్దమూ , హస్తములను కర్మలూ , త్వక్కును స్పర్శ, వాక్కును నాదమూ , మనస్సును కామమూ లాగుచుండును. అందువలననే గంధాదులను ఘ్రాణాదుల చేతనే గ్రహించునది. ఇవన్నీ శరీరములో ఉండి శరీరి( ప్రేతము ) ని ప్రవృత్తి పరుడగునట్లు చేసి , చివరికి తాము మృత్యువు వశమగును. "
" ఇవన్నీ మృత్యువశమగునంటే , మృత్యువు ఏది ? అది ఎవరి వశమగును ? "
" ఆర్తభాగా , లోకమంతా అన్నము-అన్నాదుడు అను రెండే భాగములై ఉన్నది. ఇవన్నీ మృత్యువుకు నోటి ముద్దలగునన్నాను కదా ? ఆ మృత్యువే అగ్ని. దానికి అన్నీ అన్నమగును. ఇలాగ , అన్నము- అన్నాదుడు విభాగమును తెలిసినవాడు మృత్యువును గెలుచును. "
" యాజ్ఞవల్క్యా , శరీరము మృత్యు వశమైనపుడు శరీరి( ప్రేతము ) ఏమవుతాడు ? వాడిని వదలి పోవునవి ఏవేవి ? అవి ఏమవుతాయి ? "
" బాగా అడిగినారు., ఆర్తభాగా ! శ్రద్ధగా వినండి. శరీరము మృత్యు వశమైనపుడు శరీరి( ప్రేతము ) వేరుపడును. నామము ఒక్కటీ తప్ప మిగిలినవన్నీ తాము ఎక్కడెక్కడి నుండీ వచ్చినాయో అక్కడికి తిరిగిపోవును. ఇలాగ వాణి అగ్నిని , ప్రాణము వాయువును , చక్షువులు ఆదిత్యుని , శ్రోత్రములు దిక్కులను , శరీరము పృథివినీ , బుద్ధి ఆకాశమునూ , రోమ కేశములు ఔషధులూ వనస్పతులనూ , రక్త , బల , తేజస్సులు నీటిని , మనసు చంద్రునీ చేరును. "
" అలాగయితే అప్పుడు ఆ శరీరి( ప్రేతము )కి స్థానమేది ? ఎక్కడుంటాడు ? "
భగవానులు అదివిని నవ్వేసినారు : " ఆర్తభాగా , ప్రశ్న చాలాబాగుంది. మీరు అడిగిన ప్రశ్నలకన్నిటికీ ఉత్తరమును ఇచ్చుటకే కూర్చున్న నేను , ఈ ప్రశ్నకు ఉత్తరమిస్తే , ఈ సభలోని ఎవరో ఒక్కరైనా శరీరమును వదలవలసి వస్తుంది. అంతటివారు ఎవరు ? వారికి మీరు ఎట్టి రక్షణ నివ్వగలరు ? చెప్పండి. నేనయితే విఘటనాత్మక మయిననూ ఉత్తరము నిచ్చుటకు సిద్ధముగా నున్నాను. "
( అనువాదకుని వివరణ : బ్రహ్మ జ్ఞానులు పాలుపంచుకొనే సదస్సులో యే విషయమైననూ అనుభవ , ప్రయోగ పూర్వకములుగా అనుభవించియో , ప్రదర్శించియో చెప్పినగానీ సార్థకత ఉండదు. కేవలము శాస్త్రపు మాట చెప్పిన అది ఒక సిద్ధాంతమగునే తప్ప ప్రయోగము కాదు. అలాగ ప్రయోగించుటకు ఎవరైనా ఒకరి శరీరములోని భూతములు వేరై ఆత్మ యేమగునో చూపవలసి వచ్చును. )
ఆర్తభాగుడి కనులు తెరచుకున్నాయి. " నేనెందుకు అడగరాని ఈ ప్రశ్నను అడిగినాను ? " అని అతడికి కంట నీరు వచ్చినది. భగవానులు అది చూచి కరుణావిష్టులై, " ఆర్తభాగా , అయినదేమో అయినది. ఫరవాలేదు. కావలసిన రక్షణను ఇచ్చుటకు నేను సిద్ధముగా ఉండగా మీకు బెదురెందుకు ? " అని ధైర్యము చెప్పి ఉత్తరము నిచ్చినారు :
" మొదట రక్షణను ఇచ్చెదను. దేవతలు అగ్నిలో శ్రద్ధను హోమము చేసెదరు. దానినుండీ సోమము పుట్టును. ఆ సోమమును పర్జన్యుడను అగ్నిలో హోమము చేస్తే , వానలు వచ్చును. ఆ వానలను పృథివి యను అగ్నిలో హోమము చేస్తే అన్నము సంభవించును. ఆ అన్నమును పురుషుడను అగ్నిలో హోమము చేస్తే రేతస్సు అగును. ఆ రేతస్సును యోషిదగ్నిలో హోమము చేస్తే గర్భమై , అది శిశువగును. దీనిని మనసులో ఉంచుకొని మీ ప్రశ్నకు ఉత్తరమును వినండి. అంతా మరలిపోవు నపుడు శరీరి( ప్రేతము ) తన కర్మమును మాత్రము తీసుకొని చంద్రుని వద్దకు వెళ్ళును. అక్కడినుండీ పుణ్యము ఎక్కువగా ఉంటే పుణ్య శరీరమును, పాపము ఎక్కువ గా ఉంటే పాప శరీరమును పొందును. "
( అనువాదకుని వివరణ : ఒకవేళ ఎవరైనా అటుల శరీరము నుండీ వేరు పడినచో , తిరిగి శరీరమును పొందు విధానమును తెలుసుకొనుటయే రక్షణ. )
ఆర్తభాగుడు తానేమైనానో యని మొదట తనను పరీక్షించుకున్నాడు. అంగాంగములన్నీ స్వస్థానములో ఉండుట చూసి సంతుష్ట హృదయుడై, పులి చేతికి చిక్కిన హరిణి పరుగెత్తినట్లే , అక్కడ నుండీ లేచి పరుగెత్తినాడు. రెండు అడుగులు వెళ్ళిన తరువాత భగవానులకు నమస్కారము చేయలేదని గుర్తొచ్చి , వెనక్కు తిరిగి అక్కడి నుండే సాష్టాంగ ప్రణామము చేసి, దుర్దానమును తీసుకున్నవాడిలాగా ఎవరికీ చెప్పకుండా సభనుండీ వెళ్ళిపోయినాడు.
No comments:
Post a Comment