SHARE

Wednesday, April 10, 2013

80. " మహాదర్శనము "--ఎనభైయవ భాగము--ఆత్మానాం కామాయ


80. ఎనభైయవ భాగము--  ఆత్మానాం కామాయ


         మైత్రేయికి భగవానులు తనను వెతుక్కుంటూ వచ్చినది ఆశ్చర్యమైనది. లేచి నిలుచుకొని ఆహ్వానించినది. భగవానులు తామే మాట్లాడినారు: " మైత్రేయీ , నేను చివరిదైన సన్యాసాశ్రమమును వహించెదను. అనుమతినివ్వు. నువ్వు కావాలంటే , నీకూ , కాత్యాయనికీ ఆర్థిక సంబంధము లేకుండా సర్వమూ వ్యవస్థ చేసి వెళ్ళెదను. "

మైత్రేయి శాంతముగా అడిగినది , " భగవానులు ఈ ఆలోచన చేయుటకు కారణమేమి ? "

" ఇంతే మైత్రేయీ , నేను అమృతత్వమును పొందుటకు సన్యాసము తీసుకొనెదను"

" అటులనా ? ఇదేదో అర్థపు మాటను చెప్పినారు. నేను దానిని పొందితే నాకు కూడా అమృతత్వము లభించునా ? "

        " అదెలాగగును , మైత్రేయీ ? నీకు అర్థము ఉంటే , అర్థవంతులు పొందునట్లే నువ్వూ దేహ సుఖమును పొందవచ్చును. అమృతత్వము ఆత్మకు సంబంధించినది. దానిని అర్థముతో పొందుటకు సాధ్యము కాదు. "

        " దేవా ! నాకు అమృతత్వము తప్ప వేరేమీ వద్దు. అదీకాక, తమరు నాకు అభివచనమును ఇచ్చినారు. దాని ప్రకారము నాకు అమృతత్వమును ఇవ్వక తమరెలాగ దానిని పొందెదరు ? మొదట నీకు , ఆ తరువాత నాకు మైత్రేయీ , అని మాట ఇచ్చినారు కదా ? "

         " నిజము. మైత్రేయీ , నీకు ఇదివరకూ చెప్పినదంతా మరలా ఒకసారి సంగ్రహముగా చెప్పెదను. విను. మొదటిది ఆత్మ అమృతము. ఆత్మయే అమృతము. దానిని నమ్ముటకు అడ్డుగా ఉన్నది , ఆత్మ వేరే , నేను వేరే అనుకొని ఉండుట. ఎవడు ఆత్మ వేరే , నేను వేరే యనునో  , వాడు తెలియని వాడు. అతడు చేసినదంతా బూడిదలో చేసిన హోమమగును. ఇలాగ తాను వేరే అనుకొనుటకు కామనయే కారణము. కామము వేరే , తాను వేరే అని తెలియక పోవుటయే ఆ మోహమునకు కారణము. మైత్రేయీ , నేను నిన్ను పత్నియని అంగీకరించినదీ , నువ్వు నన్ను పతియని అంగీకరించినదీ ఆ కామన వల్లనే ! లోకములోనున్న ప్రతియొక్కరూ తనకన్నా ప్రత్యేకమైన ఏదేదో కోరెదరు కదా , దానికంతా వారి వారి కామన యే కారణము. అంతేకాదు , తాను ప్రత్యేకముగా ఉండును : అపూర్ణుడై యుండును ! ఆ అపూర్ణతను పోగొట్టుకొనుటకు ఇది సాధనమా యని దేనినో కామించును. తానే పూర్ణము అన్నది మరచి , తాను అపూర్ణుడని నమ్మి , ఈ కామనను ఆశ్రయించి ఉండును. 

        " అది గనక తప్పి , తాను పూర్ణుడనని తెలిస్తే , అది అనుభవమునకు వస్తే , ఎవరూ దేనినీ కామించరు . అంతా తానే అయినపుడు ఏది కావలెను ? ఏది వద్దు ? దీనిని అనుసంధానము చేయి. ఇదే పూర్ణత్వము , ఇదే అమృతత్వము. ఇదే మహా దర్శనము. దీనిని పొందనివాడికి బహు పెద్ద హాని . అతడి జననము అసార్థకము :  దీనిని పొందిన వానికి బహు పెద్ద లాభము. అతడి జననము సార్థకము. అతడు కృతకృత్యుడు. బ్రాహ్మణుడు. " 

       మైత్రేయి ఆ మాటలోనున్న అర్థమును గ్రహించుటే కాదు , అనుభవించినది. చివరికి లేచి నమస్కారము చేసి , " ఈ మాటలను ఎన్నో సార్లు భగవానుల నుండే విన్నాను. అయితే , ఇప్పటి వలె , అవి నన్ను గ్రహించి ఉండలేదు. " అన్నది. 

        " సరే , మైత్రేయీ , మనము వాటిని అర్థము చేసుకొని తిరుగు కాలమొకటి , అవి మనలను అర్థము చేసుకొని తిరుగు కాలము ఇంకొకటి. రెండవది కాల కర్మలు పక్వమైన కాలము. ఇదే నాకు ఇప్పుడు వచ్చినది , అందుకే సన్యాసము. " 

" తమరిచ్చిన వరమును ఇంకొకసారి ఇవ్వవలసినది. "

" అట్లంటే ? "

      " తమరు , ’ నువు మొదట , ఆ తరువాతే నేను ’ అనుచుంటిరి. ఇప్పుడు తమరు సన్యాసము తీసుకుంటానని అంటున్నారు. అప్పటికి సన్యాసములో తమరే మొదట అన్నట్టయింది. " 

" ఆడవారికి సన్యాసము లేదు కదా ? "

" అలాగయితే ( అన్న మాట నిలవక పోతే ) తమరికది ఎలాగ సిద్ధించును ? " 

          భగవానులకు ఇప్పుడు సంకటము కలిగింది. ఏమి చేయుట ? ఒక్క సన్యాసము అనే చర్య వలన కావలసినదంతా అయింది అంటే , అప్పుడు తాను సన్యాసము తీసుకోవలసిన అవసరము లేదు. ఆలోచించినారు : చివరికన్నారు :" మైత్రేయీ , నువ్విప్పుడు ముక్తిభాజనురాలివైనావు. ( ముక్తికి పాత్రురాలు )  చిన్న పిల్లలమే అయిపోతే అప్పుడు నేను కావలసినది చేయవచ్చును కదా ? " 

" నాకు అర్థము కాలేదు "

         " ఈ దేహము పంచభూతముల నుండీ ఏర్పడినది. తన్మాత్రలనుండీ అంతః కరణమూ , స్థూల భూతములనుండీ శరీరమూ ఏర్పడినాయి.  ఈ భూతములు , తన్మాత్రలూ నీకు అనుమతినిచ్చి , నువ్వు అశరీరమైన ఆత్మలో ఒకటయితే ? అని నేను అడిగినది "

" అప్పుడు అనుమతి అవసరమే లేకపోయి , ఇంక అనుమతి అడిగేదెవరిని   ? "

" సరే " 

No comments:

Post a Comment