SHARE

Sunday, April 7, 2013

70. " మహాదర్శనము " --డెబ్భైయవ భాగము--కర్మ-బ్రహ్మ వాదులు


70. డెబ్భైయవ భాగము -- కర్మ-బ్రహ్మ వాదులు


         ఆర్తభాగుడు అలాగ వెళ్ళిపోవుటను చూచి సభ ఆక్రోశము చెందినది. " అతడు లేచినపుడు ఏమి ఠీవి ? ఏమి అట్టహాసము ? అంతటివాడు అడగకూడని ప్రశ్నను అడిగి చివరికి ఎవరిని విరోధించుటకు వెళ్ళినాడో వారినుండే రక్షణ తీసుకొని ఉండిపోవలసి వచ్చెను. ఇటువంటివాడు వారిపైన ఎందుకు పడవలసినది ? " అని మాట్లాడుకున్నది. భగవానులు ఏమీకానట్లే నిర్విషణ్ణులై కూర్చున్నారు. 

        కాశీ విద్వాంసులు కూర్చున్న వైపు గుసగుసలు మొదలైనాయి. ఒకడన్నాడు : " భుజ్యూ , నువ్వు గంధర్వుల నుండీ విద్యను పొందినవాడవు. వెళ్ళు , అయితే అడగకూడనివి అడగవద్దు. చూడు , దీనిలో ఓడిపోయిననూ నీ పేరు శాశ్వతమగును. లే మరి ? " 

భుజ్యుడు సిద్ధమైనాడు. లేచి వేదికవైపుకు వెళ్ళినాడు. 

" ఇతడెవరు ? "

" మంచిది , ఇతడిని చూడలేదా ? భుజ్యుడు. ఆ పరమ విద్వాంసులు లహ్యులు ఉన్నారు కదా ? వారి మనవడే ఇతడు. "

భుజ్యుడు వేదిక పైకి ఎక్కి భగవానుల ఎదురుగా కూర్చున్నాడు. ప్రశ్నోత్తరములు ఆరంభమయినవి. 

         " యాజ్ఞవల్క్యా ! మేము విద్యార్థులై మద్ర దేశములోనున్న కాప్య గోత్రులైన పతంజలుడి ఇంటికి వచ్చినాము. అక్కడ అతని కూతురును గంధర్వుడు  పూనుటను గురించి అతనితో మాట్లాడుతూ , పరీక్షితులు ఎక్కడికి వెళ్ళినారు అని అడిగినాము. అదే ప్రశ్నను మిమ్మల్ని అడుగుతున్నాను. పరీక్షితులు ఎక్కడికి వెళ్ళినారు ? "

" పరీక్షితులు అశ్వమేధయాజులు ఉన్నచోటికి వెళ్ళినారు. "

" అశ్వమేధయాజులు ఎక్కడున్నారు ? "

        " భుజ్యూ , సూర్యుడి రథము ఒక దినమునకు ఎంత దూరము వెళ్లునో దానికి ముప్పై రెండు రెట్లు ఈ లోకము. ఈ లోకమును దీనికి రెట్టింపు ఉన్న భూమి చుట్టియున్నది. దానిని ,  దానికి రెట్టింపు ఉన్న సముద్రము ఆవరించి యున్నది. అక్కడే బ్రహ్మాండపు కొన. అక్కడ కత్తిమొన అంత ఒక చిన్న రంధ్రమున్నది. దానినుండి బయటకు వాయువు పరచుకొని యున్నది. అశ్వమేధపు అగ్ని , సుపర్ణుడై అశ్వమేధ యాజులను, మీరు చెప్పిన పరీక్షితులనూ తనలో ఉంచుకొని తీసుకొని వెళ్ళి ఆ వాయువుకు ఇచ్చును. ఆతడు వారిని తనలో ఉంచుకొని తీసుకొని వెళ్ళి పూర్వపు అశ్వమేధ యాజులున్న బ్రహ్మలోకమును చేర్చును. "

       భుజ్యుడు ఆశ్చర్యపడుతూ , " ఔను , నిజము. మీరు చెప్పినది సరిగ్గా ఉంది. గంధర్వుడు కూడా ఇలాగే చెప్పినాడు " అని చేతులు జోడించి, ఆసనము నుండీ లేచి వేదిక నుండీ దిగి వెళ్ళి కూర్చున్నాడు. 

        ఇక్కడ కాత్యాయని మైత్రేయితో , " అక్కా , భుజ్యులు ఒకటి మరచినారు. వారు గంధర్వుడి అనుగ్రహము పొంది ఉంటే , వీరు ఆదిత్యుని అనుగ్రహమును పొందినవారు  అన్నది వారు మరచినారు " అన్నది. మైత్రేయి,  " వారి స్థానములో నువ్వు ఉంటే , ప్రతిపక్షము వారు మిగిలేవారు కాదు , కదా ? " అని భుజమును తట్టి నవ్వింది. 

       అంతలో మరలా గుసగుసలయినాయి . ఉషస్తుడు లేచినాడు. సభకు నమస్కారము చేసి , దిట్టముగా నడచుకొని వచ్చి వేదికను ఎక్కి , భగవానుల ఎదురుగా కూర్చున్నాడు. ఆ ఠీవి మనోహరముగా నుండినది. ఉషస్తునికి భగవానులను ఓడించెదనను పట్టుదల గానీ , వారికి ఓడిపోతానని భయముగానీ లేవు. సములను సములు చూచినపుడు ఉన్న సమభావమే ఉండినది. 

అతడు వినయముతో అడిగినాడు: " యాజ్ఞవల్క్యుల వారూ , నేను ప్రశ్నను అడగవచ్చునా ? " 

       భగవానులు ముఖమును చూచి , " మీరు చక్రాయణుల పుత్రులు ఉషస్తులు కదా ? బ్రహ్మ విద్యా సంపత్తుకు పేరెన్నిక గన్న వంశపువారు. అనుష్ఠానమునకు ప్రఖ్యాతులైనవారు. తప్పకుండా అడగండి. "

" సంతోషము , ఏది సాక్షాత్తయి ఉండి , అపరోక్షమై ఉంటుందో , ఆ సర్వాంతస్థమైన బ్రహ్మమును గూర్చి నాకు చెప్పండి. " 

       " మాకు ఇష్టమైన విషయమునే అడిగినారు. దానికి వందనములు. ఉషస్థుల వారూ , చూచే మన ఇంద్రియములు బయటి ముఖమైనవి. ఇంద్రియములకూ , దృశ్యములకూ ఉన్న సంబంధము తప్పితే ,( అనగా , ఇంద్రియములు బహిర్ముఖములగుట తప్పి అంతర్ముఖములయితే )  అప్పుడు ఆత్ముడు సాక్షాత్తుగా కనిపించును. దేనిని సుఖమనుకొని కోరి కోరి దానిచుట్టూ లోకము తిరుగునో , ఆ సుఖమంతటికన్నా ఎక్కువ సుఖమని , అన్నిటికీ కారణమైనదని , అన్నిటికన్నా గొప్పది యని అపరోక్షమైనది.. అది అన్నిటిలోనూ ఉన్ననూ , చూచువాడికి వాడి వాడి ఆత్మగా కనిపిస్తుంది. కాబట్టి , సర్వాంతస్థుడైన ఆత్ముడు ఇంకెవరూ కాదు , అడుగుతున్న మీరే! " 

        ఉషస్తుడు గంభీరుడైనాడు. తాను ఏదో అడిగితే ఏమేమో ఉత్తరము వచ్చినట్లు, అసంతృప్తిని చూపించు ముఖముద్ర ఉన్నవాడైనాడు. మరలా అదే ప్రశ్నను అడిగినాడు , " సర్వాంతస్థుడైన ఆత్ముడు ఎవరు ? " భగవానులు చెప్పుటకు ఆరంభించినారు:

         భగవానులు ఎదుటివాడి యొక్క ఉద్దేశమును సులభముగా అర్థము చేసుకున్నారు. తల ఆడిస్తూ అన్నారు : " అటులనా ? అయితే వినండి ఆత్మ అంటే ఈ శరీరము కావలెను , లేదా ఆత్మ అంటే కార్య కరణ సంఘాతమైన లింగము, కావలెను , లేదా ఆత్మ అంటే ఈ రెండింటీలో నున్న ఇంకొకడు కావలెను.. శరీరము సర్వాంతస్థము కాదు , కాబట్టి ఆత్మ కాదు. ఎందుకంటే శరీరము కార్య కరణ సంఘాతమైన ప్రాణము చేత ఎన్నుకోబడుతుంది. లింగము కూడా ఆత్మ కాదు. ఎందుకంటే , అదీ కరణమే! పంచాత్మకమై , ఈ భూత సంఘాతమైన దేహమును ఆడించుచున్న ఆ పంచప్రాణముల క్రియను చేయించు వాడతడు. కాబట్టి , ఈ కార్యము లన్నిటికీ కారణుడైన , ఈ కరణముల నన్నిటినీ ఆడించుచున్న, ఆ చేతనాచేతనుడు ఉంటాడే , వాడు సర్వాంతస్థుడు. "

        ఉషస్తుడు ముఖము గంటు పెట్టుకున్నాడు. అసంతృప్తి ఆవరించుకుంది. అరిచినాడు , " యాజ్ఞవల్క్యా , ఇది మోసము. ’ కొమ్ములు పట్టి తెచ్చి ఇది  ఎద్దు అని చూపిస్తాను ’ అన్నవాడు , దానిని ప్రత్యక్షముగా తెచ్చి ఇవ్వక ,  నడిచేది ఎద్దు , పరుగెత్తేది గుర్రము , మొదలుగా చెప్పినట్లాయెను. మీరు తీసుకున్నది బ్రహ్మిష్ఠతముడికి అట్టిపెట్టిన గోధనము. బ్రహ్మమును అడిగితే , ఇప్పుడు సాక్షాత్తుగా చూపించకుండా , ఇలాగ వేరే వేరే గుర్తులతో ఆనవాలు చెపుతున్నారా ? "

         భగవానులు మందహాసమును వదలకనే అన్నారు : " బ్రహ్మజ్ఞులకు ఈ విక్షోభము తగనిది. బ్రహ్మమనునది ఆకారము లేనిది. ఇంద్రియములు దానిని చూడలేవు. ఇటువంటిదానిని ఇంద్రియ గోచరము చేయుట ఉన్నదా ? సువర్ణాలు పదివేలు అంటే చూడవచ్చు. అర్బుదము అంటే ఊహించవచ్చు. అసంఖ్యాకమంటే , ఏ ఇంద్రియముతో దానిని సాక్షాత్కరించుకునేది ? చూపులోనూ ఉండి , చూపులకు చిక్కని దాన్నెలా చూచేది ? చూపించేది ? కాబట్టి ప్రతిజ్ఞా హాని మాకు లేదు. అసాధ్యమైనదానిని చూపించమని అన్న మీలోనే ప్రతిజ్ఞాహాని ఉన్నది. దాన్ని ( ఆత్మను ) వాక్కు , మనసు కూడా ముట్టలేదు. అనుభవించి మాత్రమే తెలుసుకో వలసిన దానిని మాటలతో తెలుసుకొనుట సాధ్యమా ? మాటలకు అందని దానిని వర్ణించుటకు పోతే , మాట నిలచిపోదా ? మనసుకు అందని దానిని మననము చేసుకోబోతే అన్యమనస్కమవదా ? ఔనా , కాదా ? చెప్పండి "

        ఉషస్తుడు ఏమో చెప్పబోయాడు. మాట పెగల లేదు. బెదిరినాడు. లేచి నమస్కారము చేసినాడు. నాలుక పలికింది. ’ తప్పయింది. ఖండించి నందుకు క్షమించవలెను. తమరు చెప్పినదే సరైనది " అని ప్రతివచనమును నిరీక్షించకయే వెళ్ళిపోయినాడు.  

         అనంతరము కౌషీతకేయ కహోళుడు సభనుంచీ వచ్చి ఆసనములో కూర్చున్నాడు. ఆతని ముఖ ముద్రను చూడగా, ఆ మంటపములో తానూ , భగవానులూ తప్ప ఇంకెవరూ లేరనుకున్నట్టే కనిపించు చుండినది. అతడు గోధనము , బ్రహ్మిష్ఠతముడు మొదలైనవి అంత ప్రధానముగా ఎన్నడూ చూచినట్లు లేదు. అతనికి తన జీవితములో ఇంతటి సమయము వస్తుందా అని కాచుకున్నట్లు , అంతటి యోగము కలసి వచ్చినట్లు , దానిని తాను ఉపయోగించు కోకుండా వదిలితే మరలా అది లభ్యమేకాదు అన్న దిగులున్నట్లు తోచుచున్నది. అయినా గురుశిష్య భావమున్నట్లే కనపడదు. ఆసనములో కూర్చొని అతడు ఏదో మరచినదానిని జ్ఞాపకము తెచ్చుకుంటున్న వాడివలె , అథవా అనేకమైన విషయాలను ఎదురుగా ఉంచుకొని యేది సరియైనది అని ఎంచుకొనుటకు ఒక్కొక్కదానినీ తీసుకొని పరీక్షిస్తున్న వాడివలె  ఒక ఘడియ నేలను చూస్తూ కూర్చున్నాడు. సభ నీరవమై , అతని నోటినుండీ ఏమి వస్తుందో అని కాచుకున్నది. 

        ఆ సమయమును చూసి కాత్యాయని మైత్రేయిని మోచేతితో పొడిచి , ’ చూడు ’ అన్నది. మైత్రేయి, కాత్యాయని చూపించిన చోట చూస్తే , గార్గి , పైకి లేచునపుడు చేయునట్లే చీర చెరగును , ఉత్తరీయమును సవరించుకుంటున్నది. భగవానుల వైపు సూటిగా చూస్తున్నది. చూడబోతే ఆమె కూడా భగవానులను ప్రశ్నించుటకు సిద్ధమగునట్లున్నది. 

      అది చూచి మైత్రేయి చిన్నగొంతుతో , కాత్యాయనితో అన్నది , " చెల్లీ , ఇవన్నీ మేఘాలు. వారు పర్వతము వంటి వారు. గాలికి సాగిపోయే ఈ మేఘాలు ఆ పర్వతమును ఏమి చేయగలవు ? పాపం ! " అన్నది. 

కాత్యాయనికి ఆ అభిమానపు మాట ఎంతో ముచ్చటగా అనిపించినది. ఏమో చెప్పబోయింది , అంతలో కహోళుడు మాట్లాడినాడు. 

" యాజ్ఞవల్క్యా , పెద్ద మనసు చేసి మరలా అదే ప్రశ్నకు ఉత్తరము నివ్వవలెను. " 

" అనగా ? "

"సాక్షాత్తుగా, అపరోక్షముగా , సర్వాంతస్థముగా ఉన్న బ్రహ్మవిచారమును గురించి చెప్పవలెను. "

         " మంచిది , చెపుతాను , దానికేమి ? శరీర ధర్మములూ , ప్రాణ ధర్మములూ , మనోధర్మములూ ఆ ఆత్మను ముట్టలేవు. ఆతడు వీటి నుండీ దూరము. శరీర ధర్మములు జరామరణములు. ఆత్ముడు అజరుడు. అమరుడు. జరామరణములు  ఏమైననూ శరీరమును , అంటే , వేరొకదాని కార్యమై , ఇంకొకదాని కరణమై యున్న శరీరమును పట్టుకోగలవే తప్ప ఆ శరీరి యొక్క ఆత్మను అంటుకోలేవు. ఇక ఈ శరీరము లోపల ఉండి శరీరమును స్వేఛ్చగా ఆడిస్తున్న  ప్రాణపు ధర్మములు క్షుత్పిపాసలు. అవి కూడా ఆత్మను ముట్టలేవు ప్రాణము ఆత్మ యొక్క నీడ. ప్రాణము కార్యము కూడా మరియూ కరణము కూడా!. అవి రెండూ కాని ఆత్మను అవి రెండూ అయిన ప్రాణపు ధర్మములు ఎలా ముట్టగలవు ? ప్రాణము వలెనే శరీరములో ఉండి ఇంద్రియముల చలనమును ప్రేరేపించు మనస్సు యొక్క ధర్మములు శోక మోహములు. శోకమే కామము. మోహమే అజ్ఞానము. గడ్డి అగ్నిని ముట్టి ఎలాగ బ్రతకలేదో , అలాగే కామము అకామమైన ఆత్మను ముట్టి బతుకలేదు. కామకామములూ , లుప్తకామమమైన ఆత్మను ముట్టి ఎలా బతకగలవు ? అలాగే , అజ్ఞానము కూడా , జ్ఞానమే తానైన ఆత్మను ఎటుల చేరగలదు ? తెలిసిందా ? "

" తెలిసింది. శరీర ధర్మము , ప్రాణ ధర్మము, మనో ధర్మములకు బయట, వాటికి అందకుండా ఉండువాడు ఆత్ముడు. "

         " ఆ ఆత్ముడు మీరు చెప్పిన సర్వాంతస్థుడు. ఎందుకంటే అది నిత్యమై అంతటా ఉండుట చేత, ఒకసారి చూచినవాడు మరచిపోలేక , దానినే సర్వదా సర్వత్రా చూచుట వలన సాక్షాత్తుగా , అణువుకే అణువైననూ మహత్తు కన్నా మహత్తై ఉన్నందువలన అపరోక్షమైన అదే అందరిలోనూ ఉండి అన్నిటినీ ఆడిస్తున్నందు వలన దానిని తెలుసుకుంటే ఫలమేమి ? తెలుసా ? "

" తమరే చెప్పవలెను "

          " దానిని తెలిసినవాడు ఆ తెలిసినదే బలమని నిశ్చింతగా ఉంటాడు. వాడికి అది తప్ప ఇంకేదీ అవసరము లేదు. పుత్రాదుల వైపుకు కూడా వాడి మనసు లాగబడదు. లాగబడే తత్త్వమే అతనికి ఉండదు. అతడు తన అవగాహన , దానివలన కలుగు బలము వలన మౌనియగును. మౌని యైనవాడు తాను మౌని యైనంతసేపూ తాను అదే అయినాను అనునది చూచి బ్రాహ్మణుడై కృతకృత్యుడగును. ఆ మహా దర్శనము ఒక్కటి తప్ప  మిగిలినవన్నీ నశించునవే. "

" పరమోపకారమయినది "

కహోళుడు వేరేమీ మాట్లాడకుండా లేచి , భగవానులకు నమస్కారము చేసి వెళ్ళినాడు. 

      అనంతరము గార్గి లేచినది. అందరూ వేదికపైకి వెళ్లండి అన్ననూ ఆమె ఒప్పుకోలేదు. గార్గి , "  భగవానులు ప్రసన్నులై నా ప్రశ్నకు ఉత్తరమును అనుగ్రహించవలెను. " అన్నది. 

        భగవానులు నవ్వుచూ , " ఔను, భగవతి అడుగు ప్రశ్న అటువంటిది. దానికి రక్ష కానే కావలెను. కాబట్టి మొదటే కోటను కట్టి కాపాలా కూడా ఉంచుకొని బయలుదేరినారు. అనుజ్ఞ ఇవ్వండి " అన్నాడు. 

        గార్గి అడిగినది  , " ఈ పృథ్విలోనున్న సర్వమూ జలములో పరచుకొని చేరి ఓతప్రోతమై ( కలగలసి ) యుండును. ఆ జలము దేనిలో అలాగ పరచుకొని చేరి ఓతప్రోతమై యుండును ? "

         " భలే , భలే , భగవతి వారి ప్రశ్న యొక్క జాతి బాగుంది. పరంపరగా పెంచవచ్చు. అయితే భగవతీ , నిష్ఠతో (ఆధారములు చూసి )  తెలుసుకోవలసిన దానిని యుక్తితో, అనుమానముతో ( ఊహతో ) తెలుసుకుంటే , తెలిసినది యని సంతృప్తి కలగ వచ్చును, కానీ అది చిత్రాగ్ని. అది గుర్తుండనీ. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు ఉత్తరము చూద్దాము. ఈ పృథ్వి , జల , అగ్ని , వాయు , ఆకాశములు ఒకదానితో ఒకటి చేరి లోకలోకములనూ ఏర్పరచును. అవి , జలము వాయువులో , వాయువు అంతరిక్షములో ,  ఆ అంతరిక్షము  గంధర్వ లోకములో , అది ( గంధర్వ లోకము ) ఆదిత్య లోకములో , అది చంద్రలోకములో , అది నక్షత్ర లోకములో , అది దేవలోకములలో , అది ఇంద్రలోకములలో  , అది ప్రజాపతి లోకములలో , అవి బ్రహ్మ లోకములలో  అల్లిబిల్లిగా ఓతప్రోతమైపోయి ఉంటాయి. సంతోషమయినదా ? "

" బ్రహ్మ లోకములు దేనిలో అల్లుకొని ఓతప్రోతమైపోయి ఉంటాయి ? "

          " దానికి ముందర అడగ వద్దు. గార్గి , ఆ బ్రహ్మలోకములలో బ్రహ్మాండములను నిర్మించు భూతములు ఉన్నాయి. భూతములు ఉన్నంతవరకూ జ్ఞానము బాహ్యము. జ్ఞానము భూతములను దాటిననూ అంతటా నిండిపోదు. అప్పుడు  విషయమును తెలుసుకొనుట ఆగమము వలన. అనుమానము వలన కాదు. కాబట్టి ఆగమమును వదలి , అనుమాన ప్రధానముగా వెళితే , విషమును అన్నమని తిన్నట్టగును. వదిలివేయండి. "

గార్గి అది విని, విధేయురాల వలె చేతులు జోడించి , తన చోటుకి వచ్చింది.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                 

No comments:

Post a Comment