SHARE

Wednesday, April 10, 2013

81. " మహాదర్శనము " -- ఎనభై ఒకటవ ( చివరి ) భాగము ----చివరి పండగ ?


81. ఎనభై ఒకటవ ( చివరి )  భాగము---  చివరి పండగ ? 


          ఈ దినము ఆశ్రమములో భగవతి గారి నేతృత్వములో నానా భక్ష్య భోజ్యములు పాకమగుచున్నాయి. ఏమైనా సరే , భగవానులు వైశ్వదేవమునకు చెప్పు వేళకు అన్నీ అయి ఉండవలెను. కాబట్టి వేగ వేగముగా అన్నీ జరుగుతున్నవి. 

          వైశ్వదేవమయినది. ఈ దినము నడిమింట్లో ఆకులు వేసినారు. సుడివేసిన అరిటాకులు, పెద్ద పెద్ద అగ్రములు గలవి , మధ్యలో ఒక ఆకు , దానికి కుడి పక్క మూడు ఆకులు, ఎడమపక్క రెండు ఆకులు. ప్రతిదానిలోనూ సిద్ధమైన పంచ భక్ష్యములు , పంచాన్నములు , పరమాన్న , ససూప వ్యంజనములై వడ్డించబడి యున్నవి. ఒక్కొక్క అరటి దొన్నె పెట్టి  , దానిలో సద్యో ఘృతము వడ్డించియున్నది. 

రాజధాని నుండీ , గార్గి , జనకులు వచ్చినారు. వారి మిత పరివారము వస్తున్నది. 

       భగవానులు నడిమింటికి వచ్చి చూచినారు. వారికి ఇంతటి భవ్యమైన సంతర్పణ కాచుకున్నదని తెలియదు. " కాత్యాయనీ , ఇది ఎవరెవరికి ? " అని అడిగినారు. 

" మధ్యలో వేసినది తమరికి. కుడి పక్క ముగ్గురు శిష్యులు , ఎడమపక్క ఇద్దరు బ్రహ్మవాదినులు. "

గార్గి మధ్యలో అన్నది, " ఎడమ పక్క ఆడ శిష్యులు , కుడి పక్క మగ శిష్యులు అనవలసినదేమో ? " 

భగవతి వెంటనే ఉత్తరమిచ్చింది , " ఒకరు శిష్యులైననూ భార్య. తమరు శిష్యులైనది ఎప్పుడో తెలీదు. "

" భగవానులకు సర్వజ్ఞాభిషేకము అయినాక లోకము లోకమే శిష్యులైపోయినారు. "

భగవానులు దానికి అన్నారు : " నిజము , అయితే , జగద్గురు పట్టమును నేను ఒప్పుకోలేదు. " 

      " క్షమించితే చెపుతాను, తమరికి ఏదీ అవసరము లేదు, అన్నీ కావలసినది మాకే. పట్టపుటేనుగుకు సింగారము చేసినట్లు , మాకొకరు సర్వజ్ఞులు కావలసియుండిరి. మాకొకరు జగద్గురువులు కావలసి యుండిరి. అందుకని మహారాజులు మాకొక సర్వజ్ఞ జగద్గురువులను కరుణించినారు "

మైత్రేయి తనకు తానే చెప్పుకున్నది, " ఔను , ఆత్మనః కామాయ సర్వం ప్రియం భవతి. తనకోసమే అన్నీ కావలసినది. "

భగవానులు అన్నారు : " మీ జగద్గురువులకు కావలసినదొకటే ఒకటి. అది , మహాదర్శనము. "

జనకుడు చేతులు జోడించి అన్నాడు , " అది అయిన వేళకు ఇదంతా జరిగినది అని మా అందరి భావన." 

భగవతి అన్నది , " మహారాజులు అన్నది అన్ని విధములా బాగుంది. మహా దర్శనమైనదని ఇంత సంభ్రమము ,న్యాయమే. "

భగవానులు అన్నారు : " మరలా మహా దర్శనమునకు వెళ్ళెదను అని ఈ సంభ్రమములన్నీ "   అని వడ్డించిన ఆకులను చేతితో చూపించినారు. 

మహారాజులు తికమక పడి , " అంటే ? " అని అడిగినారు.

         భగవతి అన్నారు : " నేను చెపుతాను వినండి. వీరు ఈ దినము పరివ్రాజకులై వెళ్ళెదరంట. అందుకని , ’ నీకు కావలసిన వంటకాలు వడ్డించు , నీ అభిమానమునకు సంతోషము కానీ ’ అన్నారు. ఈ శిష్యులను పిలచి , ’ కణ్వా , నువ్వు దక్షిణ దేశములో కావేరీ తీరములో ఒక గురుకులమును ఏర్పరచు ’ అన్నారు. మాధ్యందినుడికి ’ ఈ ఆశ్రమమంతా అప్పజెప్పినారు. మా అనుమతిని కోరినారు. అది దొరకగానే ’ జై శంకరా ’ అని వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నారు. " 

" గార్గి అన్నది , " ఇదంతా మాకు తెలియదే ? "

        " మహారాజు అన్నాడు , " మాకు వచ్చిన పత్రములో ఈ దినము తప్పకుండా భోజనమునకు రావలెను అని మాత్రము రాసి ఉంది. అందువలన నేను భగవతి గార్గి ని పిలుచుకొని ఏనుగు పైన వచ్చినాను. పరివారము వెనుక వస్తున్నది " 

గార్గి లేచి నమస్కారము చేసినది: " నాకు ఒక వరమునివ్వ వలెను " 

మహారాజు , కణ్వుడూ , మాధ్యందినుడూ నమస్కారములు చేసి ఒక్కొక్క వరమునడిగినారు. 

భగవానులు భగవతి ముఖము చూచి , ’ నువ్వు ? ’ అన్నారు. 

ఆమె నవ్వుతూ అన్నది , " వారంతా మీకు బయటి వారు అని వరమునడుగుచున్నారు. మీరు నన్ను అడుగుతున్నారే ,మొదట వారివన్నీ నెరవేరనీ "

భగవానులు , " అటులనే అవుతుంది, మీకు ఏమేమి కావలెనో అడగండి " అన్నారు. 

భగవతి గార్గి అమృతత్వమును కరుణించవలెను అన్నారు. 

మహారాజు, భగవానులు చివరి వరకూ నా దేశములోనే ఉండవలెను అన్నారు.

కణ్వుడు , " నా గురుకులమునకు సపత్నీకులై వచ్చి దర్శనమిచ్చి , కొంతకాలము మా ఆతిథ్యమును స్వీకరించి, మమ్ములను ఆశీర్వదించవలెను " అన్నాడు. 

      మాధ్యందినుడు , " ఈ ఆశ్రమములో ఇంకా కొంతకాలముండి నా ఆశ్రమ పాలన సరిగ్గా ఉందో లేదో ,  తప్పో ఒప్పో చెప్పవలెను. సరిగ్గా ఉంటే సరే, లేకపోతే మరలా ఆశ్రమమును తమరే వహించవలెను " అన్నాడు. 

’ భగవతి ఏమంటారు ?"  అని భగవానులు అడిగినారు.

         కాత్యాయని నవ్వుతూ ," వీరందరూ కోరిన కోరికలు నెరవేరునంటే నేను ఇప్పుడు ఊరికే ఉంటే చాలు. ఈ దినము ఉదయము యజ్ఞేశ్వరుని, " నా భర్త సదా ఇంటిలో ఉండునట్లు అనుగ్రహించు " అని వేడుకున్నాను. ఆతడు కృప జేసి , వీరందరి నోటిలో ఈ మాటలు పలికించినాడు.

         భగవానులు ఒక ఘడియ ఊరికే ఉండి అన్నారు: " మేమెక్కడున్ననూ సదా బ్రహ్మానుసంధానము చేయువారము. మాకు ఏ దేశమైతేనేమి ? కాత్యాయనీ , వీరందరికీ వారు కోరిన వరమునివ్వు " అన్నారు. అందరూ సంతోషముగా భోజనానికి కూర్చున్నారు. 


                    ||  భద్రం   శుభం   మంగళం  ||                                                                                                                                                                                                                                                                                                                                                                                        

No comments:

Post a Comment