SHARE

Monday, April 8, 2013

71. " మహాదర్శనము"-- డెబ్భై ఒకటవ భాగము--మరలా వాదము


71. డెబ్భై ఒకటవ భాగము-- మరలా వాదము


          విదగ్ధశాకల్యుడు గార్గిని పిలచినాడు. : మీ పద్దతి నాకెందుకో సరిపోలేదు. అశ్వలుడు ఒక్కరు తప్పితే ఇంకెవరూ మనఃపూర్వకముగా ప్రశ్నలు వేసినట్టులేదు. కహోళుడైతే సమర్పణము చేసుకున్నవాడి వలె ఉన్నారు. మీరైతే భగవానులు అనగానే అర్దనిమీలితులై  నేను మీ శిశువును అన్నట్టు మాట్లాడినారు. ఎదిటివాడిని గెలిచే పద్దతి ఇదేనా ? ఆతడు తాను బ్రహ్మిష్ఠతముడ నన్నది నోటితో కాకుండా చేతలతో చేసి చూపినాడు. ఆతని పైన పడునపుడు మత్తగజము పైన మశకము పడినట్లు పడితే ఉపయోగమేమున్నది ?  ఇదేమైనా బాగుందా ? "

         గార్గికి మర్మాఘాతమైనట్లాయెను. ఏనుగును అంకుశముతో పొడిచినట్లాయెను. మంత్రబద్ధమైన మహాసర్పమును బెత్తముతో కొట్టినట్టాయెను. ఆమె అదంతా మింగుకొని నిట్టూర్పు విడచినది. 

          అంతలో ఒకడు వేదిక వద్దకు వచ్చినాడు.   నడుస్తున్న పద్దతి చూస్తేనే అతడు సామాన్యుడు కాదు అని తెలుస్తున్నది. ముఖమును చూస్తే, ఎవరి లక్షమూ ఉన్నట్టు లేదు. వచ్చిన వాడు ఉద్ధాలకుడు. మహా విద్వాంసులని ప్రసిద్ధులైన అరుణుల కొడుకు. మదించిన విద్వాంసుడు అని ప్రసిద్ధి కెక్కినవాడు. బ్రహ్మవాదము లోనైతే అసమానుడు అని పేరు గన్నవాడు. 

         ఉద్ధాలకుడు , నేరుగా , దిట్టంగా వేదిక పైకి వెళ్ళి ,  ఆసనములో కూర్చున్నాడు. కూర్చొనుటకు ముందు ఆసనము పైన ఉన్న ధూళిని అంగవస్త్రముతో విదిలించి , దానిపై కృష్ణాజినమును వేసుకున్న రీతిని చూస్తే అంతవరకూ అక్కడ కూర్చున్న వారి సంపర్కము వలన కలిగిన పరాభవము నంతా విదిలించి పారేసినట్టుంది. 

          " యాజ్ఞవల్క్యులు నావైపు తిరిగి గమనము నుంచి వినవలెను. మేము శ్రౌతమును నేర్చుకుంటూ మద్రదేశపు కపిగోత్రుడైన పతంజలుల వద్ద ఉంటిమి. ఆతని భార్య ఒంటిపై గంధర్వుడు పూనకము పూని, వచ్చేవాడు. కబంధుడను ఆ గంధర్వుడు ఒక దినము మా అందరి సమక్షములో కావ్యమును రాస్తూ , " ఇహ లోకము , పరలోకము, మరియూ   సర్వభూతములనూ బంధించి ఉన్న సూత్రము తెలుసా ? అలాగే , ఈ అన్నిటిలోనూ ఉండి , వీటిని ఇలాగ ఉండవలెనని నియమించు అంతర్యామిని ఎరుగుదువా ? ఈ సూత్రమును, ఈ అంతర్యామిని ఎరిగినవాడే , బ్రహ్మలోకము , వేదము , భూతములు , ఆత్మ-అన్నిటినీ తెలిసినవాడు. ’ అని, మా అందరికీ ఆ జ్ఞానమును ఉపదేశించి నాడు. యాజ్ఞవల్క్యా , మీకు ఆ సూత్రపు మరియు , అంతర్యామి యొక్క  జ్ఞానముందా ? అలాగ లేకుంటే , మీరు ఆ జ్ఞానమున్న వారికి  మాత్రమే లభ్యము కావలసిన గోధనమును తీసుకొని పోతే , దానికి పరిహారముగా మీరు మీ తలనే ఇవ్వవలసి ఉంటుంది! "

         ఆ ప్రశను విని అందరూ చకితులైనారు. ’ ఇప్పుడే ఇది నిజమైన బ్రహ్మ వాదము , భలే! ’ అన్నారు. విదగ్ధుడు కూడా తలాడించినాడు. దేశాధిపతులంతా తలలూపినారు. ప్రశ్న , ఎంతటివారైనా కళ్ళు పెద్దవి చేసి కనుబొమలను పైకెత్తునంత గొప్పగా ఉంది.     

         భగవానులు అచలమైన శిలా ఖండము వలె కూర్చున్నారు. కనులు మూసి , తెరచి ఉద్ధాలకులను చూసి , చిరునవ్వు ముఖముమీద చిందుతుండగా , చీమ చిటుక్కుమన్నా వినిపించు ఆ నిశ్శబ్దములో , ఉద్ధాలకుని ఆతని గోత్రముతో సంబోధించి, " గౌతమా , నేనది ఎరుగుదును " అన్నారు. 

          ఉద్ధాలకులకు భగవానులు సమాధానముగా ఇచ్చిన ఉత్తరము కోపమును తెచ్చిపెట్టింది. అయిననూ , సహజ సంయమియైన అతడు తనకైన ఆశాభంగమును ఎర్రబడ్డ ముఖము తెలుపుతున్ననూ, కోపమును దమనము చేసుకొని అన్నాడు : " యాజ్ఞవల్క్యా , ఎవరు కావాలన్నా ఎరుగుదును అనవచ్చును. మీకు తెలుసునని మేము నమ్మేటట్లు చెప్పండి."   

          భగవానులు ఆనుకొని ఉన్న దిండును వదలి , పద్మాసనమును సరిగ్గా వేసుకొని, అరచేతులను ఒకదానిపై నొకటి పెట్టుకొని , గంభీరముగా అన్నారు : " ఉద్ధాలకులు అంతఃస్థితిని ముఖ ముద్రాదులతో  గుర్తు పట్టగలరు అని నేను విన్నాను. వాక్కు కన్నా అర్థము గొప్పది. ఉన్న అర్థము నంతా వాక్కు చెప్పలేక పోతే కుంటుపడును అని తెలిసిన వారు అనుకున్నాను. ఓ వాక్కూ! పలుకు ! వేదసమ్మతమై , అనుభవములో నున్నదానిని ఇక్కడ ఎంత చెప్పవచ్చునో అంత చెప్పి కృతార్థురాలవు కమ్ము. విని మేమూ కృతార్థులమయ్యెదము. ఉద్ధాలకులవారూ , మీరు కూడా వినండి. " అన్నారు.   

          ఉద్ధాలకులు మేఘరహితమైన ఆకాశములో  ఉన్నట్టుండి వినిపించిన గర్జన విని బెదరినట్లు బెదరినారు. " నేనెందుకు ఇంత నిష్టూరముగా పలికినాను ? ఇదే మాటనే మృదువుగా చెప్పిననూ  సరిపోయేది కదా ? " అనిపించినది. 

భగవానులు మేఘ గర్జనవలె మ్రోగు కంఠముతో అన్నారు: "

         " గౌతమా , ఆ సూత్రమే వాయువు. ఇహలోక, పరలోకములు మాత్రమే కాదు , సర్వమూ వాయువు వల్లనే కట్టుబడి యుండునది. వాయువు శరీరమును వదలి వెళితే అంతా శిధిలమగును. కాబట్టి , గౌతమా , వాయువే ఆ సూత్రము. "

        భగవానుల ఒక్కొక్క మాటా పడగ విప్పిన పాము యొక్క పడగ పైన పడిన దెబ్బలవలె ఉద్ధాలకులకు భావన కలిగించినవి. అతడికి ఇష్టము లేకున్ననూ , అతని నోటి వెంట , " ఔను , సరియే , ఇక అంతర్యామి విషయము " అని మాటలు బయటపడినాయి. 

         భగవానులన్నారు: " ఎవడు పృథివ్యాది పంచభూతములలోను , వాటివల్ల ఏర్పడిన అంతరిక్ష ద్యులోకములలోను , అంతరాంతరములలో ఉండునో , ఎవడికి ఇవన్నీ శరీరములు గా ఉన్నాయో , ఎవడిని ఇవేవీ ఎరుగలేవో , ఎవడి నియమము ప్రకారము ఇవన్నీ నడచునో, అతడే మీ ఆత్మ. అతడే అంతర్యామి. అతడొక్కడే అమృతుడు. " 

        " ఆదిత్య , చంద్ర నక్షత్రాది తేజోమండలముల లోపల ఉండి , నియమించుతున్ననూ , అవి ఇతడి శరీరమై ఉన్ననూ ఎవడిని ఇవి తెలుసుకోలేవో అతడే మీ ఆత్మ అతడే అంతర్యామి. అతడే అమృతుడు. " 

          " అటులనే , శరీరములన్నిటా ఉన్నట్లే మీ శరీరములో కూడా ఉన్న ఇంద్రియ, మనః, ప్రాణ ,విజ్ఞాన , రేతస్సులలో కూడా అతడు అంతస్థుడై నియామకము చేయును. అవన్నీ అతడి శరీరములు. అయిననూ అవి యేవీ అతడిని తెలియవు. ఎవరికీ కనిపించకుండా అన్నిటినీ చూచేవాడు అతడు. ఎవరికీ వినిపించకుండా అన్నిటినీ వినువాడు అతడు. అతడు తప్ప ఇంకెవరూ లేరు.  అతడు మీ ఆత్మ. అంతర్యామి కూడా ! అతడొక్కడే అమృతుడు. మిగిలినవన్నీ మృతములు." అన్నారు. 

ఉద్ధాలకులు స్వప్రయత్నము లేకనే " సరియే " అని చేతులు జోడించి వెను తిరిగినాడు. 

         గార్గి మరలా లేచినది. సభకు నమస్కారము చేసినది. " పూజ్యులారా , నేనిప్పుడు ఇంకో రెండు ప్రశ్నలు అడగవలెనని యున్నాను. తమరి అనుమతి కావలెను " అని చేతులు జోడించినది. విదగ్ధుడు , ’ గార్గి చెలరేగుతుంది , ఇక యాజ్ఞవల్క్యుడు నిలబడుట కష్టము’ అనుకున్నాడు. ’ ఒక వేళ ఈమె ప్రశ్నకూ యాజ్ఞవల్క్యుడు వంగక పోతే ? " విదగ్ధుడు సభనంతటినీ చూచినాడు. ఎక్కడెక్కడ చూచిననూ ప్రశ్నలను అడుగువారు ఎవరూ ఉన్నట్టులేదు. అతడి మనసు ఎగసింది. ’ ఎవరూ లేవకుంటే నేనే లేచెదను ’ అనుకున్నాడు. అయితే , కురు పాంచాలులందరిలో  విద్వద్రత్నము అనిపించుకున్నవాడు స్వతంత్రించి వాదమునకు వెళ్ళుట యెలాగ ? సరే , కానిమ్ము , దైవము ఏమి చేయునో చూచెదము ’

         సభ వారు గార్గి వినయమును చూసి సంతోషించినారు. మొదటిసారి అడుగునది సభలో నున్న వారందరికీ స్వతఃసిద్ధముగా వచ్చిన అధికారము.  రెండవ సారి అధికారము పొందవలెనంటే సభవారి అనుజ్ఞ కావలెను. అది సరే , అయితే , ఇంకొకరు , మరియొకరు ఇదే దారి పట్టితే ? .... చివరికి ఎక్కడికక్కడ చిన్న వాద వివాదములై , సభ ఆమెకు అనుజ్ఞనిచ్చినది. 

          గార్గి  వేదిక వద్దకు వచ్చినది. ఈ సారి కావాలని భగవాన్ శబ్దమును ఉపయోగించకుండానే ఆమె అన్నది, " ఆర్యా , యాజ్ఞవల్క్యా , ఇదిగో నేను మరలా వచ్చినాను. శూరుడని ప్రసిద్ధుడైన కాశీరాజు పుత్రుడో,  విదేహ రాజు పుత్రుడో కిందకు దింపిన ధనుస్సుకు మరలా నారిని కట్టి , ఎదుటివాడికి వ్యథ కలుగవలెనని బాణ ప్రయోగము చేసినట్లు , మీరు సమాధానము చెప్పలేని రెండు ప్రశ్నలను మీపైకి సంధించుటకు మరలా వచ్చినాను. సిద్ధముగా ఉన్నారా ? "

         భగవానులు ఆమె అంత విస్తరణగా పలికిననూ , ఏమీ లెక్కలేనట్టు విన్నారు: " భగవతి ఏమి కావాలన్ననూ అడగవచ్చును. " అన్నారు. 

          " బ్రహ్మాండము రెండు భాగములై ద్యావాపృథ్వులైనది యని తెలిసినవారు అంటారు. ఈ ద్యావా పృథ్వుల బయటా  లోపలా నిండి ఒకటుంది యని అంటారు. అది భూత, భవ, భవిష్యత్తు మూడు కాలములకు కారణమయినది అంటారు. ఇలాగ కాల దేశ విభాగములకు లోను కాని దానిని సూత్రము అంటారు. ఆ సూత్రము దేనిలో ఓతప్రోతమైపోయి ఉంటుంది ? "

          భగవానులు ఆ స్త్రీ బుద్ధి యొక్క వైభవమును చూచి బహు సంతుష్టులైనారు. " భలే ! గార్గి , వెనుక నేను , ఆగమము వలన , ఉపదేశము వలన పొందవలసిన దానిని అనుమానముచేత ఊహించకూడదు అన్నాను. ఇప్పుడు ఆగమమును ముందుంచుకొని మరలా అనుమానమును ఒడ్డుతున్నారు. భలే , భగవతి చెప్పిన ఆ సూత్రము దేశకాలముల చేత వ్యాకృతమైనది ( వేరు పరచబడినది ) అలాగ వ్యాకృతమైన సూత్రుడే వాయువు. ఆ వాయువు దేశకాలములను మీరిన అవ్యాకృతమైన ఆకాశములో ఓతప్రోతమైపోయి ఉండును. తృప్తియైనదా ? " 

          గార్గి , భగవానులు తన ప్రశ్నకు తగ్గ ఉత్తరమును చెప్పినారని సంతోషపడినది. దానితో పాటూ , తాను అతి ప్రయాసతో సిద్ధము చేసుకున్న ప్రశ్న తాను నిరీక్షించినట్లు కాకుండా  విఫలమైనదే అని ఆమెకు దుఃఖమూ కలిగింది. అయినా ఆ దుఃఖమును సంతోషము మించిపోగా , ముక్త కంఠముతో అన్నది :

         " భగవానులకు నమస్కారము. దుస్సాధ్యమైన ఈ ప్రశ్నకు ఇంత సరళముగా ఉత్తరము చెప్పిన తమకు ఇంకా ఒకసారి నమస్కారము. అయితే , భగవానులు దీనికన్నా కఠినమైన మరొక ప్రశ్నకు సిద్ధము కావలెను. "

         భగవానులు ఆమె నమస్కారమును యథోచితముగా సహజమే అన్నట్లు స్వీకరించి , అన్నారు : " కావచ్చును. మేము ఎప్పుడూ సిద్ధమే " 

         గార్గి అన్నది, " సూత్రమైన వాయువు ఆకాశములో ఓతప్రోతమైపోయి ఉండును అన్నారు. ఆ ఆకాశము దేనిలో ఓతప్రోతమైపోయి ఉండును ? "

          భగవానులు ఆ ప్రశ్నను విని సంతోష భరితులైనారు. " భగవతి అసాధ్యురాలు మరియు లౌకికురాలు అనుదానిని ఈ ప్రశ్న ప్రకటముగా చెప్పుచున్నది. ఈ ప్రశ్నకు మేము అది అవాచ్యము అని ఊరకే ఉండవలెను. లేదా , ఏదైనా ఉత్తరమును చెప్పవలెను. ఉత్తరము చెప్పకుంటే చెప్పలేదని బంధనము. చెప్పబోతే అవాచ్యమును వాక్కులో చెప్పుటకు ప్రయత్నించినారని బంధనము. ఇలాగ రెండు విధములు గానూ మాకు ఓటమి కలుగవలెనని ప్రశ్నను వేసిన భగవతీ , ఈ రెండు దోషములకూ దొరకకుండా తమకు ఉత్తరము ఇచ్చెదను ....సిద్ధము కండి . "

          సభవారందరూ ఆ ప్రశ్న , దాని నిర్వచనములను విని ఆశ్చర్య చకితులై ఆవాక్కైపోయినారు. నోటితో ఎవరూ అనకపోయిననూ , అందరూ మనసులో , ’ ప్రశ్నంటే ఇలాగ ఉండవలెను , భలే! భలే! ’ అని మెచ్చుకున్నారు. దానికన్నా ఎక్కువగా దానిలోనున్న గాంభీర్యమునూ , ఉభయతో వ్యాఘాతమునూ కనుక్కొని , దానికీ ఉత్తరమును చెప్పుటకు సిద్ధమైన భగవానులను చూచి , " ఈతడు మానవ మాత్రుడు కాడు " అని ప్రతి ఒక్కరి మనసూ ప్రశంసించింది. విద్యా ప్రాశస్త్యమునకు పేరైన కురు పాంచాల దేశపు వారు భయపడిపోయినారు. విదగ్ధుడు కూడా , ’ ఏమి ? ఇతడు మాకు కూడా అసాధ్యుడా ? " అనుకున్నాడు. అందరూ ఉత్తరమును వినవలెనని జాగృతులై, సావధానులై సువ్యవస్థితులై కుతూహలముతో కూర్చున్నారు. మైత్రేయిని కాత్యాయని , ’ అక్కా! గార్గి గారి ముఖమును చూడు! ఎంత ఎర్రబడిందో! ’ అని లాగుచున్ననూ గమనింపక , మైత్రేయి నోరు వెళ్లబెట్టి భగవానుల ముఖమును చూస్తూ కూర్చుంది. 

          భగవానులు నిశ్శబ్దమైన సభ యొక్క మౌనపు ముద్దను పగల గొట్టునట్లు అన్నారు: " భగవతీ , ఆకాశము దేనిలో కలసిపోయి ఉన్నదో , దానిని బ్రహ్మజ్ఞానమున్న బ్రాహ్మణులు అక్షరము అంటారు. ఈ మూర్ఖ ప్రపంచములో గుణములు అని పిలవబడే ఏది కూడా దానికి అన్వయించుటకు లేదు కాబట్టి దానిని నిర్గుణమందురు. అది అన్నము కాదు , అన్నాదుడు కాదు, అయినా అది లేదనుటకు లేదు. ఎందుకంటే గార్గీ , దాని ప్రశాసనములోనే ఈ సూర్య చంద్ర ద్యావా పృథ్వులూ , నిమేషాదిగా సంవత్సరాంతమైన కాలమూ ఉన్నవి. నది , గట్ల మధ్య ప్రవహించునది ఆ అక్షరము పాలించుట వలననే!  అంతేనా ? సర్వమూ యథా స్థానములలో నున్నది దాని బలము తోనే ! గార్గీ , దీనిని తెలియకుండా చేసిన కర్మలన్నీ సాంతములు. ఇది తెలియని వాడు కృపణుడు( కుత్సితుడు ). ఇది తెలిసినవాడు బ్రాహ్మణుడు. ఇదిలేకుంటే ఇంకేదీ లేదు. ఉన్నదంతా ఇదొకటే! అంతటి అక్షరములో ఆకాశము ఓతప్రోతమైపోయి ఉంటుంది. "

          గార్గి ఇది విని మిక్కిలిగా సంతోషించినది. " భగవానులకు నమస్కారము. నమస్కారము. భగవత్స్వరూపమైన బ్రాహ్మణులారా , వీరు మీ నమస్కారములను పరిగ్రహించి వదిలేస్తే అదే మీ అదృష్టము. బ్రహ్మవాదములో ఈతడిని గెలిచెదను అనునది కలలోని మాట" అని మరలా భగవానులకు నమస్కారము చేసి వెనక్కుతిరిగి వెళ్ళి కూర్చున్నది. 

No comments:

Post a Comment