79. డెబ్భై తొమ్మిదవ భాగము -- పండిన పండు
కణ్వ మాధ్యందినులు వచ్చి భగవానులను చూచి, " ఉపనిషత్తు సిద్ధమైనది " అన్నారు. భగవానులు పరామర్శగా చూచుటకు దానిని తీసుకున్నారు.
" ఎలాగ రాసినారు ? "
" తమరు అనుజ్ఞ ఇచ్చినట్లే , ఆదిత్య దేవుని ఉపాసన వలన రాసినాము. "
" మిక్కిలి మంచి పని చేసినారు. ఆదిత్యుని అనుమతితో విలిఖిత మైనది అన్న తరువాత , మేము చూడ వలసినది ఏమీ లేదు "
" అందులో తమరి పేరుతో ఉల్లేఖనము ఉంది "
" ఔను , మైత్రేయికీ , మాకు కలిగిన సంవాదమని ఉల్లేఖించినారు. అది ఇంకా జరగవలసిన భవిష్యద్విషయము. మేమూ దానిని గురించే ఆలోచిస్తున్నాము. "
" మాకు రెండు మూడు విషయములు వివరించుటకు కాలేదు "
" అవి ఏవి ? "
" మొదటిది , ఎవడైనా తనను తాను హీనుడనుకుంటే వాడిని గొప్పవాడిని చేయుట ఎలాగ ? "
" దానికేమిటంట ? మంథ విద్య సహాయముతో దానిని చేయవచ్చును. ఆ విద్య మీకు పాఠమయినది కదా ? ఔను , అయింది. ప్రయోగము సిద్ధము కాలేదు. అందువలన సందేహము వచ్చింది. సందేహమును నివారించునది శ్రద్ధ. ఇది గుర్తుంచుకోండి. లోకములో నున్న విషయములన్నీ శ్రేయస్సు , ప్రేయస్సు అని రెండు విధములు. లోకములో ఆసక్తిని ఎక్కువ చేయునవన్నీ ప్రేయస్సు. ఆత్మలో అభిరుచిని పెంచునవన్నీ శ్రేయస్సు. మనో దౌర్బల్యము వలన , శ్రద్ధారాహిత్యము వలన మానవుడు ప్రేయస్సును పట్టుకొనును. మనో బలము చేత , శ్రద్ధ చేత మానవుడు శ్రేయస్సును పట్టుకొనును. ప్రేయో మార్గము ఉత్తరోత్తర ( తరువాతి విషయములు ) ప్రధానము. శ్రేయో మార్గము పూర్వ పూర్వ ( ముందరి విషయములు ) ప్రధానము. కాబట్టి , శ్రద్ధావంతులకు , ఇతరులకు శ్రద్ధకలగ వలెనని మధు విద్యలో వంశ్యమును చెప్పినట్లే , ఈమంథ విద్యకూ వంశ్యమును రాయండి. అంతా సరిపోవును. మనుష్యుడు గొప్పవాడు. అలా కాకుంటే అతడు ఆత్మ విద్యను నేర్వలేడు. ఆత్మ విద్యను నేర్చినవాడు గొప్పవాడగును. అయిందా , ఇంకొకటి ? ".
" మనకన్నా గొప్ప కొడుకు కావలెనంటే ఏమి చేయవలెను ? "
" ఇది మంచి ప్రశ్న. అయితే , వేదపురుషుడు దానిని ఇలాగ అంటాడు; దానిని నాత మౌద్గల్యుడు , కుమార హారీతుడు , ఉద్ధాలక అరుణులు ఎరుగుదురు. వారిని అనుసంధానము చేసి వారినుండీ తెలుసుకోండి. స్థూలముగా అర్థమిదీ : పతి , పత్నిలో పుత్రుడిని పొందును. కాబట్టి ఆమె విషయములో ఈతడు ఎలాగ నడచుకొనును అనునది ముఖ్యము. ఆమెను దాసివలె చేసుకుంటే పుత్రుడు దాసీ పుత్రుడగును. అలాకాక, తాను వీరుడననే అభిమానముతో , ఆమెకు వీర పత్ని యను అభిమానము పుట్టునట్లు చేసి ఆమెలో పుత్రుడిని పొందితే , అతడు వీరపుత్రుడగును. అలాగే , ఉపనిషత్తు కావలెనంటే , అది చేసి చూసిన వారినుండీ నేర్చుకుని చేయవలెను. ఇంకేమి , చెప్పండి. "
కణ్వ మాధ్యందినులు లేచి నమస్కారము చేసినారు. అనుమతి పొంది వెళ్ళిపోయినారు.
దేవరాత దంపతులు దేహమును వదలి ఒక సంవత్సరమయినది. ఈ సంవత్సరమంతా శ్రీమంతుల ఇంటి వివాహము వలె సంభ్రమముగా పితృ యజ్ఞము నడచింది. మాసికముల దినము భగవానులు రజతమయ పాత్రలలో దేవతలకూ , కాంచన మయ పాత్రలలో పితరులకూ హవ్య కవ్య ( హవ్యమంటే దేవతలకు ఇచ్చునది , కవ్యమంటే పితరులకు ఇచ్చునది ) దానము చేసినారు. వారు తమకు కావలసినపుడు పితరులనూ , దేవతలనూ రప్పించుకొనేవారు. వారికది ఒక ఆట.
ఈ మధ్య ఇప్పుడిప్పుడు భగవానులకు అలమ్ భావము వచ్చినది . అన్నీ చాలు , ఇంకేమీ వద్దు అను భావము ఎక్కువైనది. మొదటి నుండీ వారికి సహజముగనే ఉదాసీన భావము. వారు మనసు పెట్టి శ్రద్ధా భక్తులతో చేస్తున్నది అధ్యయనము , అధ్యాపనములు. ఇప్పుడు కూడా వాటిలో శ్రద్ధ తగ్గలేదు. అయితే మొదటిలాగా ఉత్సాహము లేదు. వారి మనసు ఏ ఆలోచన వచ్చిననూ , " కిం తేన కర్మ ? ( నీకు కర్మ ఎందుకు ? ) దానివలన కర్మ చేయుటయా ? ఏమి చేద్దాము ? అనిపిస్తుంది. కట్టెలన్నీ కాలి పోయిన తరువాత వైశ్వానరుడు బూడిద లో అంతర్థానము కావలెను. అయితే భగవానుల విషయము లో అలాగ కాలేదు. దానికి వ్యతిరేకమయినది. వారికి వ్యక్తము పైన వైరాగ్యము పెరిగినట్టల్లా వారి తేజస్సు వృద్ధియగుతున్నది. అదేనా ఆత్మ జ్ఞానపు ప్రభావము ? ఏమీ వద్దన్నపుడు పెరిగేది , ఏదైనా కావాలన్నపుడు తక్కువయ్యేది ? అయి ఉండవలెను. శాస్త్రపు మాట నిజమయితే , అనుభవించినవారు ఎవరూ అబద్ధమనరు , పెద్దదో , చిన్నదో ఏదైనా కావాలన్నపుడు , కావలెను అన్నపుడే అశరీరి శరీరి అయ్యేది. శరీరము వచ్చిన తరువాత , ఒక్కడే ఉండుట వీలుకాక, రెండోదానిని కలుపుకున్నట్లే , రెండు మూడై , మూడు ముప్పది అయి,అలాగే పెంచుకుంటూ వెళ్ళి ఈ అపార విశ్వమయినది. ఇలా ఉన్నపుడు , వెను తిరిగిన వానికి , -కొమ్మనువద్దని , మొదలు వైపుకు వచ్చినవాడికి- తేజస్సు వృద్ధియగుటలో విశేషమేముంది ? "
భగవానులకు ఈ అలమ్ భావము పెరుగుతూ వచ్చి , ఒకదినము , ఈ కపిచేష్టలు ఇంకెన్ని దినములు ? అనిపించినది. మాగుతూ వచ్చిన పండు చెట్టుకు భారమయి నట్టయింది. తనది అన్నది ఏదీ ఉండని స్థితిని అంటే సన్యాసమును అవలంబించ వలెను అనిపించినది. కానీ చేపట్టిన భార్యలు ఇద్దరున్నారు. ఒకతె బ్రహ్మవాదిని. ఇంకొకతె ధర్మచారిణి. ఇద్దరికీ తెలపకుండా వెళ్ళిపోవుటెలాగ ?
భగవానులు ఆలోచించినారు. ఇక నేను చేయవలసినది కూడా ఏమీ మిగలలేదు. దైవము నా ద్వారా ఒక సంహిత , ఒక బ్రాహ్మణము , ఒక ఉపనిషత్తు లను కరుణించి , నందనపు నందాదీపము నొకదానిని వెలిగించినది. ఉద్ధాలకుల గురుకులమును అర్ధ శతమానము నడిపించి శిష్య సంపత్తును పెంచుట అయినది. కణ్వ మాధ్యందినులు ఇద్దరూ ప్రచండులైనారు. ఔను, వారిని కులపతులుగా చేయవలెను. అదొక్కటీ మిగిలుంది. అదేమంత పెద్ద పని కాదు. కావేరీ తీరములో గురుకులమును కట్టమని చెప్పి, కణ్వుడిని దక్షిణమునకు పంపించునది , అతడు శక్తుడు, అంతేకాక తపస్వి. విద్యను తెలిసినవాడు. దేవతానుగ్రహమునూ సంపాదించినాడు. అన్నిటికన్నా ఎక్కువగా ఆత్మవిద్యా సంపన్నుడు. అతడే ఒక గురుకులమును కూడా నిర్మించగలడు. మాధ్యందినుడు ఎంతైనా కణ్వుడికి ఎడమ చేయి వంటివాడు. కాబట్టి అతడికి ఈ ఆశ్రమమును ఇచ్చెదను. ఇక మిగిలినవారు భార్యలు. అయ్యో ! నాకెంతటి పిచ్చి ! పుట్టిన అంకురము తన ఆహారమును తలపై మోసుకొని తెస్తుంది. అటువంటప్పుడు , వారిద్దరి భారమును నేను మోయవలెనా ? " వారు నా మీద భారమును మోపినారు. నేను దానిని మోస్తున్నాను" అను భావపు బీజమే ఈ సంసారము ! సరే , ఓ సంసారమా! నీకు తృప్తి కలగనీ , అన్నీ వదలివెళ్ళునపుడు ఎవరికైనా ఎందుకు బాధ కలగవలెను ? అని పలురకాలుగా ఆలోచించినారు.
వీలయినంత సేపూ కనులు మూసుకొని ధ్యానాసక్తురాలై కూర్చునే మైత్రేయికి భగవానులలో కలిగిన ఈ మార్పు తెలియలేదు. నీడకు నీడయై , సహధర్మచారిణి యైన కాత్యాయనికి మార్పు వచ్చినది తెలియకుండా పోలేదు. అయితే , ఈ మార్పు ఎక్కడ ఏ వైపుకు తిరుగునో అన్నది ఆమెకూ తెలియదు. ఏమవుతుందో కానీ అని మొండి ధైర్యమును తెచ్చుకున్ననూ ఆమె ఓ కంట కనిపెట్టుట మానలేదు.
భగవానులు సన్యాసియై వెళ్ళిపోవలెనని నిర్ణయించుకున్నారు. దానికోసమై ఏ ప్రయత్నమూ జరగ నవసరము లేదు. అయితే భార్యల అనుమతి తీసుకోవలెను. వీరిద్దరిలో మొదట ఎవరికి ఈ విషయము చెప్పుట ? ఉన్నంత వరకూ ధర్మము , అంతా ముగిసిన తరువాత బ్రహ్మము కాబట్టి కాత్యాయనికి ముందుగా ఈ సంగతిని తెలియపరచ వలెను. ఆ తరువాతే మైత్రేయికి అని నిర్ధారించుకున్నాడు.
" కాత్యాయనీ , రేపటి దినము మనము ఏమేమి తినవలెనని ఆశ ఉందో అవన్నీ చేయి. "
కాత్యాయని అడిగింది, " రేపేమి విశేషము ? "
" మేము సన్యాసము తీసుకొని వెళ్ళిపోవలె ననుకున్నాము"
" మేమేదైనా అపరాధము చేసినామా యేమి ? "
" ఛీ ! ఛీ ! . మీరందరూ సరిగ్గా ఉన్నందువలననే మా వైరాగ్యము పక్వమైనది. మేము ఇప్పుడు పరమ తృప్తులము. తృప్తికి గుర్తుగా మా సన్యాసము "
" అయితే రేపు ఇష్టమైన వంటలు చేయుట ఏమిటికి ? ? "
" మీ అభిమానము పూర్ణము కానీ యని ! "
" మా అభిమానము పూర్ణము కావలెననునది ఏమిటికి ? "
" ఔను , మీ అనుమతి లేనిదే సన్యాసము లభించుటెలాగ ? "
" అట్లనా ? మరి మీ శిష్యుల అనుమతి కూడా కావలెనా ? "
" శిష్యులు మేము చెప్పినట్లు వినేవారు. మేము మీరు చెప్పినట్లు వినేవారము. "
కాత్యాయని రెప్పపాటు కాలము ఊరికే ఉంది. " అన్ని విషయములలోనూ ఆమె అక్క , నేను చెల్లెలు. కాబట్టి ఆమెతో మొదట ప్రస్తావించండి. నాదేమి , ఉండనే ఉంటుంది. " ఆమె అక్కడ నిలవలేదు , వెళ్ళిపోయింది. భగవానులు ఆమె ఆంతర్యమేమై ఉండునా యని ఆలోచించినారు. అన్నీ వదలివెళ్ళే ఆలోచనలో ఉన్న వారికి కాత్యాయని హృదయమేమో అర్థము కాలేదు.
" కానిమ్ము , ఆమె చెప్పినట్లే వింటాను. మొదట మైత్రేయి దగ్గర ప్రస్తావిస్తే , ఆమె బ్రహ్మవాదిని. ఒప్పుకొని తీరును. ఆ తరువాత యేమి ? కాత్యాయని లోకవాసనా వాసురాలు. ఆమెకు భర్త కన్నా హెచ్చుగా ఆస్తిమీద అభిమానము. " అని భగవానులు లేచి మైత్రేయి వద్దకు వెళ్ళినారు.
No comments:
Post a Comment