SHARE

Tuesday, April 9, 2013

76. " మహాదర్శనము " -- డెబ్భై ఆరవ భాగము-- సంభావనలు


76. డెబ్భై ఆరవ భాగము--  సంభావనలు

         మరుసటి దినము అపరాహ్ణపు దిగుపొద్దులో రాజసభ ,  రాజ భవనములో సమావేశమైనది. సర్వజ్ఞ కానుకను ఏమి చేయవలె ననునది ఆ దినపు పర్యాలోచన యొక్క విషయము. 

         " భగవానులకు వచ్చినది కాబట్టి , అదంతా వారికే ఇవ్వవలెను యని ఒక మతము. " " భగవానులు అప్పుడే దానిని మీకు తోచినట్లు వినియోగించండి అని చెప్పినారు. కాబట్టి మనమంతా కూర్చొని మనకు తోచిన రీతిలో వినియోగించవలెను. " అని ఇంకొక మతము. ఇద్దరికీ ఆమోదమగునట్లు చర్చ జరిగి  చివరికి , " దానిలో సగమును గురుకులమునకు కానుకగా అర్పించెదము. మిగిలినది బయటినుండీ వచ్చిన , మరియూ ఆస్థానపు విద్వాంసులకు యథోచితముగా పంచెదము " అని నిర్ణయించినారు. 

          ఇదంతా ముగుస్తుండగా మేస్త్రీ వచ్చి కనపడినాడు. " మహాస్వామి వారి ఆజ్ఞ అయినట్లు , సవత్సములైన సహస్ర గోవులను సర్వ సౌకర్యములతో ఉంచుకొనుటకు అనుకూల మగునట్లు ఆశ్రమములో  ఏర్పాట్లు చేసినాము. " అని నివేదించినాడు. 

" ఎంతమంది మనుషులను ఇచ్చినారు ? "

" గో సేవకనే నలభై కుటుంబములు నిర్ణయమైనవి. వారందరికీ నాయకుడై , సకుటుంబుడైన ఇంకొకడు. మొత్తం నలభై ఒక్క కుటుంబములు. "

" వారందరూ సుఖముగా ఉండునట్లు ఇళ్ళూ వాకిళ్ళూ కట్టించి ఇచ్చినారా ? "

" అయినది , మహాస్వామీ " 

" పశువులకు పాకలు,  కోష్టములు అయినాయా ? "

" అనుమతి అయితే వివరముల నన్నిటినీ ఇచ్చెదను. " 

" వివరములు వద్దు. మేము ఆశ్రమమునకు గోదానము చేసినందుకు ఆశ్రమవాసులకు దాని వలన ఇబ్బంది కాకూడదు , అంతే! "

         " సరే  , గోవులకు , దూడలకు , ఎడ్లు , ఆబోతులకూ అంతా వ్యవస్థ అయినది. ధాన్యాలు , గడ్డి , మేత, దాణాలు నింపి పెట్టుకొనుటకు గోదాములు , గాదెలూ అయినాయి. గోవులు మేసి వచ్చుటకు గోవనములను విభజించినాము. వాటికీ , గొల్లలకూ ఆహారమును , ధాన్యములనూ పెంచుటకు కావలసినంత భూమి కేటాయించినాము. "

         " సరే , సర్వ విధములా ఈ దానము సుఖకరముగా ఉండవలెను. భగవానులు అక్కడికి వచ్చువరకూ మనవైపు అధికారి యొకరు ఉండనీ. వారు వచ్చిన తరువాత , వారికి సర్వమునూ అప్పజెప్పి వారి అనుమతి పొంది రావచ్చును. "

" ఆజ్ఞ "

" భగవానులు ఆశ్రమమునకు ఎప్పుడు దయచేస్తారంట ! "

" అదింకా స్పష్టముగా తెలియదు. "

" భగవతివారు వెళతారేమో చూడండి "

’ లేదు , మహాస్వామీ , వారు ఇక్కడికే వస్తున్నారు. వెంట రాజపురోహితులు కుడా వచ్చినట్లుంది. 

భగవతికీ , అశ్వలులకు దారి ఇచ్చి మేస్త్రీ అటు జరిగినాడు. రాజు లేచి వారిని ఆహ్వానించినాడు. 

        రాజే మొదట మాట్లాడినాడు : " జ్ఞాన సత్రము ఆరంభమయిన దినము నుండీ తమరిద్దరిలో ఎవరినీ ప్రత్యేకముగా చూడలేదు , కోపము లేదు కదా ? "

        అశ్వలుడు అన్నాడు: " సన్నిధానము జ్ఞాన సత్రము జరిపించినది మా బుద్ధి పరివర్తన యగుటకు కారణమైనది. మేమంతా నోటితో ఏమేమో చెప్పుచుంటిమి. దానికి ప్రత్యేకమైన అర్థమున్నదని మా మనసుకు తోచి యుండలేదు. ఇప్పుడంతా వేరే అయిపోయినది. " 

          గార్గి అందుకున్నది , " మేమంతా బ్రహ్మవాదులము. అయినా అదేమయినదో ఏమో గానీ , బ్రహ్మము పరిపూర్ణము అని నోటితో చెప్పుచూ చెప్పుచూ కేవలము బహిర్ముఖులముగనే ఉంటున్నాము. మేము సరే , ఉద్ధాలక అరుణులు , ఉషస్తులు , కహోళులు , వీరందరూ ప్రఖ్యాతులైనవారు. వీరందరూ శరణాగతి అయినారు అంటే ఆ బ్రహ్మజ్ఞుని అంతస్తేమిటి ? ఎంతటిది ? ముఖ్యముగా మాకు ఏ జన్మలోదో పుణ్యము పరిపక్వమై ఈ జ్ఞాన సత్రములో భాగస్వాముల మైనాము. "

          రాజు అన్నాడు, " తామందరూ ఇలాగ పొగడుతున్నందు వలన , మాకు కూడా  ఈ జ్ఞాన సత్రము వలన కలిగిన లాభము చెప్పెదము. మేము మాకు కలిగిన స్వప్నముల విషయము చెప్పినాము కదా ? అక్కడ స్వయం దేవగురువులు అనుజ్ఞ ఇచ్చినందువల్లనే ఈ సర్వజ్ఞాభిషేకమును నిర్వహించినది. వారు , సర్వజ్ఞుడే గెలుచును అన్నారు. మనము దానిని ఇటు తిప్పి , గెలిచినవాడే సర్వజ్ఞుడు అన్నాము. ఆ దినము మీరు గంగా స్నానము సంగతి చెప్పిన దినము నుండీ భగవానులే సర్వజ్ఞ పీఠమును అధిరోహించే వారేమో యని యనిపించెడిది. ఇప్పుడు అది నిర్వివాదమై ధృవీకరించబడినది. "

          " నేనే కదా మొదట లేచి ప్రశ్నను అడిగినవాడిని , అప్పుడేమయిందో తెలుసా ? అక్కడ కూర్చున్నది మేము చూచిన దేవరాతుల కొడుకైన యాజ్ఞవల్క్యుడు కాదు. ఏదో ఒక తేజోరాశి అనిపించి మాట్లాడుటకే భయమైనది. ఇంటికి వచ్చి స్నానము చేసి మరలా అగ్నిహోత్రమును చేయువరకూ ప్రకృతస్థుడ నగుటకు కాలేదు. "

" మీరు చెప్పే దాంట్లో ఆవగింజంత కూడా అబద్ధము లేదు. అయినా నా మనసు విదగ్ధులు దగ్ధమైనపుడు కలచివేసింది. " 

         " తమరన్నది నిజము. మాకూ అటులే అయినది. ఎంతైనా గురువులు కదా ? మేము వారి పాద మూలలో కూర్చొని నేర్చుకోలేదా ? అయిపోయింది. ఇక చేసేదేముంది ? "

        " సన్నిధానము వేయి చెప్పండి , నాకైన దుఃఖములో నేను నేరుగా భగవానుల వద్దకు వెళ్ళి ఏడ్చేసినాను. విదగ్ధులకు ఉత్తమ గతి దొరకవలెను అని ప్రార్థించినాను. వారు కూడా పెద్దమనసుతో అటులే అగును అన్నారు. " అని వెనుకటి దినము భగవానులు చెప్పినదంతా చెప్పినది. 

అశ్వలుడన్నాడు. " అట్లయితే అది దేవతా కోపము వలన అయినది. నేను భగవానులే కోపించి అటుల చేసిరేమో అనుకున్నాను. " 

        గార్గి అన్నది :" ఏమో , అయినది అయినది. ఇప్పుడు వారి గురుకులమూ , వారి కుటుంబమూ వారు లేరని వ్యథ పడకుండా చేయుట మహాస్వామి వారి చేతిలో ఉంది "

       రాజు , వ్యథతో సంకోచించిన మనసుతో అన్నారు. " ఆ విషయములో మేమూ తమరి వలెనే చాలా వ్యథ చెందినాము. అందువలన తాము చెప్పినట్లే చేయుటకు సిద్ధముగా ఉన్నాము. " 

        " తమరు వారికి ఏమేమో ఇవ్వవలె ననుకున్నారు. ఈ దినము సర్వజ్ఞ కానుకలో సగమును విద్వాంసులకు పంచెదము అన్నారు. అదీ ఇదీ అంతా చేర్చి వారికోసమై ఒక లక్ష అట్టిపెట్టండి. దానిలో వారి కుటుంబమునకు సగము , గురుకులానికి సగము ఇప్పించండి. "

       " అటులనే. ఇంకొక సమాచారము విన్నారా ? కురు పాంచాల దేశపు విద్వత్సమూహమంతా నిన్ననే ఇక్కడినుండీ వెళ్ళిపోయినారంట!  వారిలో ఒక్కరు కూడా లేరు. "

        " పాపము , కొమ్ములు పోగొట్టుకున్న వృషభము వలెనే అయినవి వారి పాట్లు. ఏమి మహా విశేషము ? కాకపోతే , వారిలోని విద్వత్ప్రముఖులంతా కలిసి వచ్చి చెప్పి విదగ్ధులను ముందుకు తోసినారు పాపం. వారికి మాత్రమేమి తెలుసు ఇలాగవునని ! ఇట్లయిన తరువాత వారు యే ముఖముతో యింకా ఇక్కడే ఉంటారు ? ఏమైనా సరే , ఎవరెవరు వచ్చియున్నారు అన్నది తెలుసు. సన్నిధానమునకు సమ్మతమైతే , వారందరికీ ఒకటికి రెండుగా ఇవ్వవలెను. " 

" చాలా మంచి సలహా. అదీకాక, కురుపాంచాల విద్వాంసు లంతటి విద్వాంసులు ఈ పృథ్విలో ఎక్కడ వెదకిననూ దొరకరు. కాబట్టి వారికై ఇలాగ చేయుట సర్వథా సాధువైనది. "

మహారాజులే అన్నారు : " ఇదే కాక ,  వాదములో భాగులైన వారందరికీ విశేషమైన సంభావనలు ఇవ్వవలెననీ నిర్ణయించు కున్నాను. " 

     " మేమిద్దరం వాదములో భాగులైన వారము. కాబట్టి మేము మాట్లాడ కూడదు. అయినా తమరి యోచన సాధువైనది. అంత మాత్రమే చెప్పగలము. "

     " సరే, తమరు ఒప్పుకున్నందుకు నాకు చాలా సంతోషమైనది. సర్వజ్ఞ కానుకగా వచ్చినదానితో పాటు మరికొంత చేర్చి వితరణ చేసెదము. " 

" అటులనే "

        గార్గి, " నాకొక సందేహమున్నది. చెప్పవచ్చును అంటే చెప్పేస్తాను. అయితే నానుండీ సమాధానము చెప్పించుట మాత్రము కారాదు. సన్నిధానము నాయంత స్పష్టము గానే తమ మనసులో నున్నది చెప్పవలెను " 

" అటులనే , అనుజ్ఞ ఇవ్వండి " 

     " వెనుక ఒకసారి అనుజ్ఞ ఇచ్చియుంటిరి. : భగవానులకు తమరిని శిష్యులుగా పరిగ్రహించవలెను అని అడిగినపుడు ’ గురు-శిష్య పరీక్షయైన తరువాత ఆ మాట ’ అన్నారని. ఇప్పుడు ఈ జ్ఞాన సత్రము జరిపినది ఆ గురు పరీక్షకేనా ? "

         మహారాజు నవ్వినాడు:  " తమరు అనుకున్నది చాలా సరిగ్గా ఉంది.  విద్వత్ప్రియులని ప్రఖ్యాతమైన, దానమునకు ప్రసిద్ధమైన ,  వంశములో పుట్టినవారు ఎలాగ చేయవలెనో అలాగ చేసినాను.   అన్నిటికన్నా మిన్నగా దైవ సహాయము కలిసి వచ్చింది. విదగ్ధుల మరణము ఒక్కటీ తప్ప , ఇక అన్నివిధములా జ్ఞాన సత్రము ససూత్రముగా , యథోచితముగా , జరిగినది యని నా నమ్మకము. అయితే , చూచినవారు మీరు  , ఈ విషయమును చెప్పవలెను. " 

         అశ్వలుడన్నాడు : " వెనుకటి మహారాజు ఇఛ్చ కూడా ఈడేరింది.  మన విదేహ రాజ్యములో కురు పాంచాలుల విద్వాంసులను మించగల విద్వాంసుడు పుట్టవలెనని వారి కల. వారుగనక ఈ జ్ఞాన సత్రములో ఉండి ఈ సర్వజ్ఞాభిషేకమును చూచి ఉంటే ఎంత సంతోషించెడి వారో ? అంతేనా ? సన్నిధానము ఆ కిరీటమును భగవానుల తలపైన పెట్టినపుడు నాకైతే ఒక ఘడియ వెనుకటి మహారాజులు తమలో ఆవాహన అయినట్లే కనబడు చుండినది. "  

      " భగవానులు సామాన్యులు కారు. వారి దగ్గర కూర్చుంటే ఏదో దివ్య తేజస్సు నొకదానిని పట్టి పురుష విగ్రహమై అచ్చుపోసినట్టుండినది. అబ్బా ! ఆ దృశ్యమును గుర్తు చేసుకుంటే ఇప్పుడు కూడా ఒళ్ళు ఝుమ్మంటుంది. "     

        అశ్వలుడు మరలా అన్నాడు: " వెనుక బుడిలులు అనేవారు, అతడు తపోలోకము నుండీ లోకోద్ధారమునకై వచ్చిన వాడయ్యా ! ముందు ముందు అతని వలన ఏమేమి కావలసి యున్నదో ! చూస్తూ ఉండండి’ అనేవారు. అంతేకాక , అతడు అతి పిత , అతి పితామహుడయ్యా , అనేవారు. అయితే మేమెవ్వరూ ఆ బాల యాజ్ఞవల్క్యుడు  ఇలాగ భగవానులై సర్వజ్ఞులవుతారని అనుకొని యుండ లేదు. ఇప్పుడు ఆ మహా పురుషుని ఆశ్రమము గంగా సాగరము వలె యాత్రాభూమి యైపోయినది "

        " ఇది దేశ విదేశముల అధిపతుల సమక్షములో , విద్వాంసుల సమ్ముఖములో జరిగినది ఇంకా మంచిదైంది. సరే , గురు పరీక్ష అయినది. ఇప్పుడు సన్నిధానము చేయవలె ననుకున్నది యేమి ? "

" యేమి ఏమిటి ? భగవతి ఏమి చెప్పితే అదే. ! "

        " మేమెంతయిననూ వచ్చిన నగకు  అలంకారము చేయువారము మాత్రమే! నగలను చేయించు వారము కాదు. సన్నిధానము యేమేమి చేయవలెనని ఉన్నదీ చెప్పితే , దాన్నే పట్టుకొని , ఇలాగ చేయండి , ఇలాగ చేయవద్దండి అని చెప్పేవారము. కాబట్టి , మొదట అక్కడి నుండీ అనుజ్ఞ కావలెను. " 

        " మేమూ దానినే ఆలోచిస్తున్నాము. ఇంకా దారి తోచలేదు. భగవానులను ఇంకా కొన్ని దినములు ఇక్కడే నిలిపి ఉంచుకొని, ఈ దేశ విదేశముల అధిపతుల సన్నిధానములో వారి సేవకు ఈ విదేహ రాజ్యమునూ , మమ్ములనూ అర్పించు కొనుటయని ఒక మనసు. అయితే , బ్రహ్మవిద్య ఏమైననూ గురు శిష్యులకు మాత్రమే సంబంధించినది. కాబట్టి భగవానులను ఏకాంతములో చూచి వారినుండీ ఉపదేశము పొందవలెను అని ఇంకొక మనసు. "

         గార్గి తలాడించినది . " మొదటిగా తమరు ఈ రాష్ట్రాధిపతుల సమ్ముఖములో రాజ్య దానము చేయుట మంచిది. అయితే , దానికి భగవానులు ఒప్పుకుంటారనే నమ్మకము నాకు లేదు. రాజ్యము తమరిది కాదు , అది తమ కుల ధనము. ఉన్నంత వరకూ రాజ్యాధికారమును సన్నిధానము అనుభవించవచ్చునే కానీ , తమరు దానము చేయవచ్చునని నాకు అనిపించుట లేదు. నా బుద్ధికి తోచిన విషయము భగవానుల బుద్ధికి తోచదను మాటే లేదు. కాబట్టి అది సాధ్యము కాదు. రెండవది సన్నిధానము క్షత్రియులు. బ్రాహ్మణులైతే అన్నిటినీ త్యాగము చేసి వైరాగ్యముతో వెళ్ళి పోవచ్చును. క్షత్రియుడు అటుల చేయుటకు లేదు. అతడు బహిర్వ్యాపారములో ధర్మమును వదలి పోవుటకు లేదు. ఏదున్ననూ , అభ్యంతర వ్యవహారములో బ్రహ్మారాధనను పెట్టుకోవచ్చునే గానీ బాహ్యాభ్యంతరములు రెండింటిలోనూ బ్రాహ్మణుని వలె బ్రహ్మ పరాయణుడగుటకు లేదు. చివరిగా ఉద్ధారమును ఆపేక్షించు సన్నిధానము భగవానులను వెదకికొని వెళ్ళునదే సరి. కాబట్టి , ఈ సారి తమరు దేశాధిపతుల నందరినీ పిలుచుకొని వెళ్ళి భగవానులను ఆశ్రమమునకు వదలి రండి. శుభమైన తిథి వారములను చూచుకొని , శాస్త్రములో చెప్పిన ప్రకారముగా , తమరు మిత్ర సమేతులై వారిని ఆశ్రయించండి. వారు తమరిని తప్పకుండా అనుగ్రహిస్తారు. "   "   

        " రాజు అశ్వలుల ముఖమును చూచినారు. అశ్వలుడు, " భగవతి అనుజ్ఞ ఇచ్చినది సరియని తోచుచున్నది. శాస్త్ర దృష్టితో అలాగ చేయుట శ్రేయస్కరము. బ్రహ్మబోధనమును పొందుట అనేది ఆత్మోద్ధారపు విషయము. రాజ్యపు విషయములో మాత్రము ఇది ఖచ్చితముగా స్వంత విషయము కాదు. దీనిని దానము చేయుటకు లేదు. ఈ ధర్మ బ్రహ్మల రెండింటిలోనూ భగవతి యొక్క అభిమతము సాధువైనది. " 

         రాజు భగవతి అభిప్రాయమును సంపూర్ణముగా ఆమోదించినారు. ఇంక రెండు దినముల తరువాత తిథి వార నక్షత్రములు బాగున్నవనీ , ఆ దినము ప్రయాణము చేసి వెళ్ళుట శుభమనీ నిర్ణయించబడినది. 

       మరుదినము భూరి భోజనము , విద్వత్సంభావనా వినియోగము , దాని మరుసటి దినము ప్రస్థానము అని నిర్ణయమైనది. 

       రాజభవనపు రాజపురుషుడొకడు సపరివారుడై వెళ్ళి భగవానులనూ , మిగిలిన విద్వాంసులనూ చూచి ఏమేమి చెప్పవలెనో అంతటినీ చెప్పి వచ్చినారు.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                        

No comments:

Post a Comment