75. డెబ్భై ఐదవ భాగము -- రాజ సభలో
మరుదినము ప్రాతఃకాలములో చేయవలసిన కార్యములన్నీ చేసి , భగవానులు , తాము వెనుక ఉంటుండిన గుడిసెకు చేరినారు. కాత్యాయని అల్పాహారమునూ , పాలనూ తీసుకొని అక్కడికి వెళ్ళింది.
భగవానులు ఆమె ఇచ్చినవి తీసుకొని, " కాత్యాయనీ , ఈ దినము ఇంకేమీ అవసరము లేదు, కాబట్టి ఏకాంతముగా ఉండాలనుకుంటున్నాను. " అన్నారు. కాత్యాయని , " దేవా , అది తమరి ఇఛ్చ , అయితే , తమరే చెప్పునట్లు పరేఛ్చా ప్రారబ్ధమేమున్నదో ఎవరికి తెలుసు ? " అన్నది.
" అట్లయితే , ఈ దినము మేము చేయవలసినది ఏమైనా ఉందా ? "
" నాకేమి తెలుసు ? "
" మరి , అలాగంటివి ? "
" తమరు అనే మాట గుర్తొచ్చింది , చెప్పినాను. ఈ దినము యే గార్గి వస్తుందో, అథవా రాజే దర్శనార్థియై వస్తాడో, అథవా తమరి తండ్రిగారే దయ చేస్తారో, ఎవరికి తెలుసు ? చూడగా , తమరి తండ్రిగారు ఏదో ఆలోచనలో ఉన్నట్టుంది. కానీ నేను వారిని ఏమిటా ఆలోచన అని ఎలా అడగగలను ? "
" సరే , అయ్యేది కానీలే , నేను మాత్రము ఏకాంతముగా ఉండవలె ననుకున్నాను. కానీ నువ్వు చెప్పినది నిజము. శరీరధారి యైనవాడు సుఖ దుఃఖములను తప్పించుకోలేడు. మన ఇఛ్చ ప్రకారము అయితే సుఖము, ఇంకోలాగ అయితే దుఃఖము. అంతే కదా ? "
" తమరికి సుఖ దుఃఖాలు కూడా ఉంటాయా ? నాటకము లాడు వారి వలె తమరు కూడా ఇతరుల కోసము సుఖ దుఃఖములను చూపిస్తారు , అంతే! "
" ఛీ , పాడు దానా ! కనిపెట్టినావు. కాత్యాయనీ , నిజము. అయితే దీనిని గుట్టుగా ఉంచు. గుర్తుంచుకో. మాకు సుఖదుఃఖములు లేకున్ననూ సుఖముగా ఉన్న వాడిని సూచి సుఖించవలెను , దుఃఖముగా ఉన్న వాడిని చూచి దుఃఖించవలెను. లేకుంటే, ఈ క్షర పురుషుడు, ఈ దేహము శాపము నిచ్చును. "
" అట్లేమి ? "
వీరు ఇలాగ మాట్లాడు చుండగనే ఆలంబిని, ’ ఏం చేస్తున్నావయ్యా ? " అని వచ్చింది. కాత్యాయని ఆమెను చూచి లేచి నిలబడింది. అలాగ లేచి నిలుచున్న కోడలిని చూచి, ’ నువ్వు వెళ్ళిపోవద్దమ్మా , ఈ ఎద్దును కట్టడానికి నువ్వే సరియైన పగ్గము! " అని కొడుకు వైపుకు తిరిగింది. కొడుకు కూడా లేచి నిలుచున్నాడు. " ఏమిటమ్మా ? ’ అని వినయముతో అడిగినాడు.
తల్లి అన్నది : " నువ్వు సర్వజ్ఞుడవు! నీకు తెలియనివీ ఉంటాయా ? అయినా చెపుతాను. మీ తండ్రిగారు కబురు పంపినారు. రాజ పురుషులు నిన్ను రాజభవనానికి పిలుచుకొని వెళ్ళుటకు వస్తున్నారంట ! "
కొడుకు నవ్వినాడు , " చూడమ్మా, ఈ దినము ఏకాంతములో ఉండవలెనని నేను సంకల్పించుకొని ఇక్కడికి వచ్చినాను. అదే సంగతి ఈమెకూ చెప్పుచున్నాను. చివరికి నువ్వొచ్చినావు. రాజ భవనమునకు ఇలాగ వెళ్ళకూడదేమో ? "
" చూడయ్యా , నిన్ననే సర్వజ్ఞాభిషేకమును చేయించుకున్నావు. కాబట్టి , ఆ కిరీటమునూ , అప్పుడు ఇచ్చిన వస్త్రాభరణములనూ ధరించి , కట్టుకొని, పెట్టుకొని వెళితే చందము. నాకైతే , నిజంగా చెపుతాను , నిన్ను ఆ వేషములో ఎంత చూసిననూ తృప్తి లేదు. "
" అట్లేమి ? నీ తృప్తికై ఏమి కావాలన్నా చేస్తాను , లేవమ్మా ! నువ్వు సంతోష పడుతానంటే ఈ నగరములో ఉండే వరకూ ఆ బట్టలనే కట్టుకొని తిరిగితే సరి. దానికేమి ? కాత్యాయినీ , వెళ్ళి అవన్నీ తీసుకొనిరా. "
కాత్యాయని సరేనని వెళ్ళింది.
ఆలంబిని " ఇంకొకటి , " అంది
" చెప్పు "
" మీ తండ్రిగారు కూడా నీతో రాజ సభకు రావలె ననుకొనుచున్నారు. పిలుచుకొని వెళతావా ? "
"ఇదింకా బాగుంది , ఇది , మీరు తల్లిదండ్రులు ఇచ్చిన దేహము. దీనికి కలుగు వైభవమంతా మీవలన. కాబట్టి , వారొక్కరే కాదు , నువ్వూ రా. అయితే ఒక మాట. మీరిద్దరూ పల్లకిలో ఒకే వైపు కూర్చోండి , నేను మీ ఎదురుగా కూర్చుంటాను. "
అంతలోపల కాత్యాయని సర్వజ్ఞ వస్త్రభూషణములను తెచ్చిచ్చి , " రాజ పురుషుడు వచ్చినట్లుంది " అన్నది. భగవానులు వస్త్ర భూషణములను ధరించు వేళకు స్వయం దేవరాతుడే రాజపురుషుని పిలుచుకొచ్చినాడు.
రాజ పురుషుడు వచ్చి సాష్టాంగ నమస్కారము చేసి , మహారాజులు ఇతర దేశాధిపతులతోనూ , విద్వాంసులతోనూ సర్వజ్ఞులను ప్రతీక్షించుచున్నారు. రెండు పల్లకీలు వస్తున్నాయి. " అని విన్నవించినాడు.
" సరే , అమ్మా , నువ్వూ నీ కోడళ్ళూ సిద్ధము కండి. కాత్యాయనీ , కణ్వుడినీ , మాధ్యందినుడినీ సిద్ధము కమ్మని చెప్పు.
మహారాజూ , ఇతర దేశాధిపతులూ సవిద్వాంసులై సర్వజ్ఞులను గజద్వారములో ఎదుర్కొని , పిలుచుకొని వెళ్ళినారు. సర్వజ్ఞులకు సలుపవలసిన మర్యాదలన్నీ సలిపి , అందరినీ స్వస్థానములలో కూర్చోబెట్టి , మహారాజు చేతులు జోడించి , వినీతుడై, " ఏదైనా అనుజ్ఞ కావలెను. మేమంతా విని కృతార్థులగుటకు వేచియున్నాము. " అని తెలియజేసినాడు.
భగవానులు నవ్వుచూ అన్నారు , " ఈ దినము మేము వృత్తిని తిరోధానము చేసి ( మరుగు పరచి ) ఏకాంతములో ఉండవలెనని యున్నాము. మహారాజుల ఆజ్ఞను మీరలేక ఇక్కడికి వచ్చినాము. తమందరి దర్శనమై మనసు ఇంకా సంతుష్టమైనది. కాబట్టి , తమరు ఏదైనా అడగండి , దానికి ఉత్తరముగా మాకు తెలిసినది చెప్పెదము "
భగవానులు జలతారు వస్త్రములను కట్టుకున్నారు. జలతారు ఉత్తరీయమును తమ కృష్ణాజినపు ఉత్తరీయము పైన కప్పుకున్నారు. తలపైన రత్నమయమైన పాండిత్య కిరీటము శోభిస్తున్నది. ముంజేతికి రత్నమయమైన కడియముంది. వేళ్ళకు మూడు మూడు అనర్ఘ్యమైన( వెలలేని ) ఉంగరములు. జలతారు వస్త్రము పైన రత్నమయమైన శృంఖల. కాలికి రత్నమయమైన పెండేరము. పాదములకు రత్నమయమైన పాదుకలు. చూడగా , ఆ రత్నముల కాంతితో వారి ముఖము దేదీప్యమానమైనట్లుంది. అయితే , నిజంగా చూస్తే , వారి తేజస్సు వలన ఆ సర్వమూ వ్యాప్యమైనట్లుది. వేష భూషణములకు కొత్త కాంతి వచ్చినట్లుంది. అందరికీ ఆశ్చర్యమేమంటే , మహానది మహాపూరములో ( ప్రవాహములో ) వచ్చి సముద్రమును చేరిననూ, సముద్రము తనపాటికి తాను ఉండునట్లు , సర్వజ్ఞాభిషేకము భగవానులలో లేశమైనా వ్యత్యాసము కలిగించలేదు.
అందరూ గార్గిని ఏమైనా అడగవలెనని సూచించినారు. ఆమె వినయముతో , " మా ఆటోపమంతా ముగిసింది. ఇంకేమున్ననూ వినుట , అంతే! మన మహారాజులు ఇతరులవలె కాదు. వేదోపనిషత్తులను సాంగముగా తెలిసినవారు. వారు అడుగుటా , భగవానులు చెప్పుటా బాగుండును. "
సర్వానుమతితో మహారాజులే లేచినారు. అన్నారు: " భగవానులు ప్రసన్నులై మా ప్రశ్నకు ఉత్తరము చెప్పవలెను. మనుష్యుడు యే జ్యోతి వలన తన కార్యములను చేయును ? "
" ప్రశ్న బాగున్నది. మనుష్యుడు యే జ్యోతి వలన తన కార్యములను చేయును ? రాజా , మనుష్యుడే యేమి , ప్రాణ జాతులన్నీ కూడా ఆదిత్యుడను తేజస్సు వలన ప్రచోదితమై తమ తమ కార్యము లన్నిటినీ చేయును. ఆదిత్యుడు తన కిరణముల ద్వారా సర్వమునూ సృజించును. సర్వమునూ స్థితిలో కాపాడును. సర్వమునూ లయము చేసి తనలో ఉపసంహారము చేసుకొనును. సుఖ నిద్రలో పరుండిన పురుషుని జాగృత్తుకు తెచ్చునది ఆతని కిరణము. ఆదిత్యుడు పురుషుని హృదయమును ప్రవేశించి , నానా విధములైన వ్యాపారములకు కారణమగును. ఒక రూపముతో తపనము చేసి , ఇంకొక రూపముతో వర్షమును వర్షించి , అన్న కారణమగు వాడూ వాడే! అన్నాదుడై దేహములో కూర్చొని అన్నిటినీ జీర్ణించువాడూ వాడే! కాబట్టి , సృష్టికి వచ్చిన భూతజాలమంతా తన సర్వకార్యములకూ ఆదిత్యునికి ఋణి. ఆదిత్యుడు లేకపోతే ఎవరికైనా ఏమి చేయుటకు అవుతుంది ? "
" రాత్రి పూట ఆదిత్యుడుండడు కదా ? "
" ఔను , ఆతడు అప్పుడు దేశాంతరములో ఉండును అని శృతి చెప్పుచున్నది. ఆతడు కంటికి కనబడకున్ననూ , ఆతని కిరణములు ఉండనే ఉంటాయి. లేకుంటే ఉక్కపోయుట ఎలా జరుగును ? కాబట్టి ఆదిత్యుడు ఎల్లపుడూ ఉండనే ఉంటాడు. అయినా ఆతడు రాత్రిపూట ఉండడని లోక ప్రసిద్ధి. అప్పుడు చంద్రుడు జ్యోతియై అందరిచేతా పనులు చేయించును. "
" చంద్రుడు లేనపుడు , జ్యోతి యేది ,భగవాన్ ? "
" చంద్రుడు ప్రతిరాత్రీ ఉండనే ఉంటాడు. శుక్ల పక్షములో సూర్యుడి నుండీ దూరముగా పోతూ పోతూ ఆతని కళాభివృద్ధియగును. కృష్ణ పక్షములో ఆతను తన కళలను ఒక్కొక్క దినమునకు ఒక్కొక్కటిగా దేవతలకు ఇచ్చి, ఇంకొక్క కళ మాత్రమే మిగిలి యున్నది అన్నపుడు సూర్యుడిని ప్రవేశించును. అతడి నుండీ తన కళలన్నీ పొంది , దినమున కొకటిగా పెంచుకుంటూ పోవును. అయినా అతడు లేని కాలము ఉంది యని లోకప్రసిద్ది ఉంది కదా ? అప్పుడు , సూర్యుడూ చంద్రుడూ ఇద్దరూ లేనపుడు అగ్నియే జ్యోతి. "
" వీరు ముగ్గురూ లేనపుడు జ్యోతి యేది , దేవా ? "
" వీరు ముగ్గురూ బాహ్య జ్యోతులు. వీరు ఎవరూ లేనపుడు పురుషుడు తన కరణములనే జ్యోతిగా చేసుకొనును. చీకటిలో వాణి ఇతనికి జ్యోతియగును. వాణి వినిపించిన చోటికి వెళ్ళును. వాణిని పట్టుకొని అన్ని వ్యాపారములూ చేయును. కాబట్టి అప్పుడు వాణియే జ్యోతి. "
" ఆ వాణికూడా లేనపుడో , దేవా ? "
" వాణి అనేది కరణము. కరణము జడమైనది. కరణమును జ్యోతియనునది ఔపచారమునకే. బ్రాహ్మణ దంపతుల కొడుకు బ్రహ్మ కర్మ చేయకున్ననూ వాడిని ఔపచారమునకు బ్రాహ్మణుడని పిలుచుట లేదా ? అలాగే ఇదీ ! జాగృత్తులో అయితే ఇది ( కరణము ) ఇంకొక జ్యోతి యొక్క ప్రకాశముతో వెలుగును. ఆ ఇంకొక ప్రకాశమున్ననూ , స్వప్నములో అయితే ఇది ( వాణి యనే కరణము ) వెలుగకుండా ఉండును . ఇలాగ జాగృత్తు లో కరణములను ప్రకాశింప జేయుచూ తాను లేనట్టున్న ఆ జ్యోతి స్వప్నములో అంతా తానేయగును. అప్పుడు అది కరణము కన్నా ప్రత్యేకమైనది అని బాగా తెలియును. ఆ జ్యోతి యేదో తెలుసా ? అదే , మీలోనూ , నాలోనూ ఎల్లపుడూ ఉండు ఆత్మ జ్యోతి. అది కార్యమగు శరీరము , కరణమగు వాణి-ఈ రెండింటికన్నా విలక్షణమైనది. ప్రత్యేకమైనది. ఆ ఆత్మను తెలిసినవారు అతడిని అసంగుడు అంటారు. నీటిలో వేసిన పాదరసము వేరుగా ఉండునట్లే , పాలలో వేసిన మరకతమణి తన ప్రభావము చేత పాలను పచ్చగా చేసిననూ , పాల వలన ప్రభావితము కాకుండా వేరుగా ఉండునట్లు , ఈ శరీరపు హృదయములో జ్యోతియై ఉన్ననూ ఈ శరీరము , కరణముల వలన ఏమీ ప్రభావితము కాకుండుట చేత అతడిని అసంగుడు అన్నారు. శృతి చెపుతుంది , ’ వాడిని చూడవలెనంటే స్వప్నములోనే! ’ అని. ఎందుకంటే , జాగృత్తులో బహిర్ముఖమై లేచి ఆడుతున్నట్టు ఆడుతున్న ఈ కరణముల వ్యాపారములో ఆత్ముడు మబ్బుల చాటున నున్న సూర్యుని వలె మాటుగా నుండును. సుషుప్తిలో అక్కడ అంతా తానై నిండి యుండిననూ , తెలివికి సాధనమైన బుద్ధి నిర్లిప్తముగా తూష్ణీభావముతో ఉండుట చేత , అప్పుడు అతడిని తెలుసనుట ఎలాగ ? తెలియలేదనుట ఎలాగ ? కాబట్టి , శృతి , అతడిని చూడవలెనంటే సంధి స్థానమైన స్వప్నమే సరి అన్నది. ఆ ఆత్ముడు , జ్యోతికే జ్యోతి. బయటి ఆదిత్యాదుల లోనూ ప్రకాశమై ఉండువాడు అతడే. ఇలాగ లోపలా , బయటా అంతటా నిండియున్న ఆతడిని తెలిసినవాడే కృతార్థుడు. "
రాజు ఇంకా ఏదో అడగబోయినాడు. భగవానులు దానిని నివారించి , " అప్పుడే మధ్యాహ్నమగుచున్నది. కర్మఠులకు కర్మచేయు ఆత్రము. ఈ దేశాధిపతులు , తీవ్రమగుచున్న వైశ్వానరుడి ఉపాసన సకాలములో నిర్వహించనీ. నేటికి ఇక్కడికే చాలిద్దాము " అన్నారు.
అందరూ గబగబా లేచినారు. రాజు చేతులు జోడించి , ఇంకొక ఘడియ కూర్చోమని ప్రార్థించి , కోశాధికారిని పిలచి ఏమో అడిగినారు. అతడు నివేదిక చదివినట్లు ఏదో చెప్పిన తరువాత , రాజు మరలా భగవానులకు చేతులు జోడించి , " నిన్నటి దినము వచ్చిన కానుక పన్నెండు లక్షలకు దగ్గర దగ్గరగా ఉంది. అనుజ్ఞ అయితే దానిని ఆశ్రమమునకు పంపించెదను ? " అన్నారు.
భగవానులు నవ్వినారు. " ఇప్పుడే , నా నోటి నుండే వచ్చింది ,’ లోపలా బయటా అంతటా నిండియున్న వాడు ఆత్మ ’ దానిని ఇంత త్వరగా ఎందుకు అబద్ధము చేయవలెను ? దీనిని ఇచ్చినవారు దేవతలు. వారు అందరి శరీరములలోనూ ఉన్నారు. కాబట్టి , ఇచ్చినవారికి తృప్తి కానీయని, వారికి దానిని ఈ విద్వాంసుల ద్వారా అర్పించండి. ఆశ్రమవాసులకు కావలెనన్నచో , వారికిచ్చుటకు దేవతలు సిద్ధముగా ఉన్నారు. ఆశ్రమవాసులు అందరూ కాకున్నా, కొందరైనా ఈ అంతటా నిండిన ఆత్మ దర్శనములో , విచారములో, మననములో , ఆసక్తి కలవారు కానీ" అని చెప్పి లేచినారు.
అందరూ భగవానులను పంపించుటకు వాకిలి వరకూ వచ్చినారు. అక్కడ పల్లకీ నెక్కునపుడు భగవానులు రాజును పిలచి , " చూడండి , మనము పశువుకు గడ్డి వేసేది అది పాలిస్తున్నదనో , ఇచ్చుననో కదా ? అలాగే దూర ప్రయాణమునకు బయలు దేరినవాడే కదా శకటము మొదలైన సంభారముల నన్నిటినీ సిద్ధము చేసుకొనును. తమరు ఇప్పుడు విద్వత్సమూహమును కట్టుకొని , వారినందరినీ పోషిస్తూ వారినుండీ వేదోపనిషత్తుల నన్నిటినీ సంగ్రహించు చున్నారు. ఇదెందుకు ? ఆలోచించండి , ఎందుకీ ఆడంబరములన్నీ అనుదానిని గూర్చి చింతించండి " అని , అందరినీ వీడ్కొని వెడలివచ్చినారు.