SHARE

Monday, June 18, 2012

22. " మంత్ర ద్రష్ట " ఇరవై రెండవ తరంగము



ఇరవై రెండవ తరంగము

     అయోధ్యా నగర సమీపములో , సరయూ నదీ తీరములో , భవ్యమైన దేవయజన మొకటి సిద్ధమైంది  ( దేవ యజనమంటే యాగ శాల ) ఇక్ష్వాకు కులజుడైన త్రిశంకు మహారాజు ఈ రోజు సశరీరముగా స్వర్గానికి తీసుకొని పోగల యాగమొకదానిని ఆరంభించనున్నాడు . రాజర్షి యని ప్రసిద్ధుడైన విశ్వామిత్రుడు ఆ యజ్ఞమును చేయించుటకు అధ్వర్యుడుగా నిలిచాడు . భార్గవులలో పేరుపొందిన జమదగ్ని , దానికి బ్రహ్మ . అలాగే , వేద వేత్తలలో అగ్రగణ్యులని పేరుపొందిన మేధాతిథి , గృత్సమదుడు , కణ్వుడు మొదలగు కొందరు వరిష్ట ఋషులు ఆర్త్విజ్యానికి ఒప్పుకున్నారు . వశిష్ఠులు మాత్రము ఈ యాగమునకు రాలేదు . వశిష్ఠ విశ్వామిత్రుల మధ్య జరిగినది ప్రతి ఒక్కరికీ తెలుసు . అందుకే , వారు రాకపోవడము ఎవరికి ఆశ్చర్యమనిపించ లేదు . అయితే యాజ్ఞికమును ( యజ్ఞవిధులు , సంప్రదాయములు , పద్దతులు )  తెలిసిన వారు మాత్రము , వశిష్ఠులు రాకపోతే అది యాగమేనా ? అంతేకాక , వశిష్ఠుని శాపమును మీరి వీరు త్రిశంకువుతో నిజంగా యాగము చేయించగలరా అని శంకించారు .

     దేవయజనమును కట్టుటకు లగ్నము పెట్టిన దగ్గరనుండీ , ఏ విధముగా చూచిననూ , ఈ యజ్ఞమునకు విఘ్నములు తప్పవని తెలుస్తున్నది . దాని గురించి వివరాలు అడిగితే , కొందరు , బ్రాహ్మణుడు చేయించవలసిన యాగమును క్షత్రియుడు చేయిస్తే అవుతుందా ? అన్నారు . ఇంకొందరు , ఛ  , ఛ ...ఋత్విక్కు వలన యజ్ఞమునకు విఘ్నమగుట ఎక్కడైనా ఉందా ? ఏది జరిగినా యజమాని వల్లనే ! ఫల భోక్త ఎవరు ? ఋత్వికుడా లేక యజమానుడా ? కాబట్టి , ఈ యాగము చెడిపోతే అది యజమానుని దురదృష్టము వల్లనే అవుతుంది . అంతేకాక , సశరీరముగా త్రిశంకువు స్వర్గానికి పోవచ్చు అన్నప్పుడు , అదే యాగమును , ఇంకొంత పొడిగించి , అయోధ్య నంతటినీ స్వర్గానికి ఎందుకు తీసుకొని పోరాదు ? అన్నారు . ఇంకొక పండిత మాన్యుడు , " అది కాదు , మహారాజు స్వర్గానికి వెళ్ళి దాని రహస్యమును ఛేదించి , దానినే ఇక్కడికి ఎత్తుకొని వస్తారంట " అన్నాడు . ఇంకొకడు , " అది కూడా సాధ్యమే . మంత్రబలమున్నవారు ఏమైనా చేయగలరు . ఎందరో జనులు , మంత్రముతో దేవతలను కట్టివేయలేదా ? "  అన్నాడు ...

     మొత్తానికి యాగమైతే ప్రారంభమైంది . త్రిశంకుడు , ఆ రోజు నర్మదా తీరపు ఆశ్రమములో అశ్వినీ దేవతలు ఇచ్చిన ఆశీర్వాద వచనములను స్మరించి , తనకు యాగ ఫలము నిజంగానే దొరుకుతుంది అని నమ్మియున్ననూ , " లగ్నపు బలము ఎలాగుందో ? దేనికైనా సిద్ధముగా ఉండవలెను " అని ఋత్విజులకు చెల్లించవలసిన దక్షిణకు రెండు మూడు రెట్లు ద్రవ్యమును ముందే ముట్టజెప్పాడు . విశ్వామిత్రునికి , తన రాజ్యపు దక్షిణ భాగము నంతటినీ దక్షిణగా సమర్పింఛాడు . 

     విశ్వామిత్రునికి కూడా ఆశ్చర్యము , " ఎన్ని రకాలుగా , ఎన్ని కోణముల నుండి చూచిననూ , యాగము పూర్ణము కాదు అనే సంకేతాలే కనిపిస్తున్నాయి . అయితే , త్రిశంకువుకు మాత్రము లోకాంతరములకు వెళ్ళు యోగము పూర్తిగా ఉంది . యాగము నిలచిపోవాలంటే దానికి కారణమేమై ఉంటుంది ? వశిష్ఠులు రానిది ఒక కారణము . వామదేవుడైనా వచ్చి ఉంటే బాగుండెడిది . అతడు ఏదో వ్రతము పట్టి కూర్చున్నాడు . వశిష్ఠులు రాకున్నచో , ఇంద్రుడు రాడు అనేది నిజమేనా ? అట్లేమయినా అయితే  , తాత్కాలికముగా కొంతసేపు ఎవరిలోనైనా వశిష్ఠత్వాన్ని ఆరోపిస్తే సరిపోవును . కార్యము ముగుస్తుంది . 

     " కానీ ఒకవేళ యాగము నిలిచిపోవలసి వచ్చి ,  నిలచిపోతే ? మహా ఏమవుతుంది ? ప్రాయశ్చిత్తముగా విశ్వజిత్ యాగమును  చేసిన సరిపోవును . ఎవరి యాగమునకు ఎవరు ప్రాయశ్చిత్తము చేసుకోవాలి ? కాబట్టి యాగము పూర్ణార్థమై ప్రాయశ్చిత్తము చేసుకొనుటకైనా తాను కూడా యాగ కర్త తో పాటే కర్త గావలెను . " 

     జమదగ్ని దీనికి ఒప్పుకున్నాడు . త్రిశంకువు కూడా ఒప్పుకున్నాడు . త్రిశంకువు విధి పూర్వకముగా దీక్ష వహించాడు . యజ్ఞ దీక్షను వహించు దినము చేయవలసిన ’ దీక్షాయణి " ఇష్టి జరిగింది . ( ఇష్టి అంటే , ఏదైనా కోరి , ఇష్ట కామ్యార్థిగా చేసే యజ్ఞము . )  క్రమ క్రమముగా నిరిఘ్నముగా యాగము ముందుకు సాగింది . సోమక్రయణము అయింది . ( సోమమును తెచ్చుకొనుట ) ఆ దినపు ఇష్టి కూడా అయింది . రేపటి దినము సోమయాగము . ఇంతవరకూ అగ్ని , మిత్ర , వరుణ , వాయువులు వచ్చి తమకు సమర్పించిన హవిస్సులను తీసుకున్నారు . ఇంతవరకూ ఇంద్రుడిని ఆవాహన చేసి పిలవాల్సిన సందర్భము రాలేదు . కానీ రేపు సోమయాగములో అతనిని పిలవనిదే పని జరగదు . అతనిదే ప్రయాజము . ( ఏ యాగములోనైనా , అన్ని ఆహుతులకూ ప్రధానమైన ఆహుతిని ప్రయాజము అంటారు ) .

     మరల  జమదగ్ని , విశ్వామిత్ర , త్రిశంకువులు సమావేశమయ్యారు . " రేపటి రోజు ఇంద్రుని ఆహ్వానించవలెను . వశిష్ఠులు లేరు . వాశిష్ఠులు  ( వశిష్ఠుల వారి కులము వారు )  కూడా ఎవరూ లేరు . ఏమి చేయాలి ? ఇంద్ర మంత్రానికి ’ ప్రైష ’ ఇవ్వాలి . ( అధ్వర్యుడు యజమానికి  ప్రతినిధిగా నిలచి యాగమును చేయును . అతడు , ’ దేవతను పిలువుము ’ అని యజమానునికి ఆజ్ఞను ఇచ్చుటను ప్రైష అంటారు ) ఇంద్రుడు వస్తే సరే సరి , లేదంటే ’ హోతృడి ’ లో వశిష్ఠుని ఆవాహించవలెను ( ఋగ్వేద మంత్రాలను , అంటే , ఋక్కులను చెప్పి , దేవతలను ఆహ్వానించువాడు ’ హోతృ ’ ) . అంత సులభము కాదు . కాబట్టి , వీలైనచో దానిని వదలివేయుటే ఉత్తమము .  ఇక విధి లేకుండా తప్పనిసరి అయితే చేద్దాము . " అని జమదగ్ని సలహా . అందరూ ఒప్పుకున్నారు .ఈ విషయమును ఋత్విక్ గణానికి కూడా తెలియజేశారు . వారు కూడా ఒప్పుకున్నారు . 

     సోమము భాండములలో సిద్ధముగా ఉంది . కరగించిన అపరంజి వలె , ద్రవ రూపములో , అగ్నితో అలంకారము చేసినారా అన్నట్టు సోమరాజు మెరుస్తున్నాడు . సోమపానమునకై ఆత్ర పడుతూ , పరుగెత్తి పరుగెత్తి వస్తున్న దేవతల కాంతి వారికన్నా ముందుగా వచ్చినట్టు , యజ్ఞేశ్వరుని జ్వాలా కలాపములు ఎగిరెగిరి పడుతున్నాయి . దేవ యజనములో ఈ కొననుండి ఆ కొన వరకూ ఉన్న వారందరూ దేవయులై శ్రద్ధా భక్తి వినమ్రులై కాచుకున్నారు ( దేవయులు అంటే , దేవతలమీద నమ్మకము , విశ్వాసము ఉంచి , వారు రావాలి అన్న శ్రద్ధ ఉన్నవారు . ). ఋత్విజులందరూ తమ తమ స్థానములలో జాగరూకులై , ఒళ్ళంతా కళ్ళతో వేచి చూస్తున్నారు . గార్హపత్య , ఆహవనీయ , దక్షిణాగ్నులు  ( అనే మూడు అగ్నులూ )  మంగళముగా శుభముగా సుఖముగా ప్రజ్వలిస్తున్నాయి . 

     ఇష్టి ప్రారంభమైంది . యజమానుని అనుమతితో , అతని పరముగా , అధ్వర్యుడు హోతృనికి , --ఇంద్రుని పిలువుము అని ప్రైష ఇచ్చాడు . హోతృడు వేదమంత్రాలతో ఇంద్రుని పిలిచెను . ఉద్గాతృడు ( సామవేదమును పఠించువాడు ) , హోతృడు జపించిన ఋక్కునే ఉప బృంహణము చేసి సామముగా పాడెను . ఇంద్రుడు రాలేదు . 

     విశ్వామిత్రునికి కార్యము చెడిపోయినదని అనిపించెను . ఇంద్రుడు రాకున్నచో  , ఇష్టి నడవదు . వశిష్ఠులు గానీ  , వాశిష్ఠులు గానీ లేకపోతే ఇంద్రుడు వచ్చుటయే లేదు . ఏమి చేయుట ? 

     వెంటనే ఇలాగనుకున్నాడు . ఇప్పుడు హోతృ గా కూర్చున్న వానిలో , ఒక ఘడియ వశిష్ఠత్వమును ఆరోపణ చేయాలి . వశిష్ఠుల తేజస్సును ఆకర్షించి , ఇంకొకరిలో నిక్షేపము చేయుట సాధ్యమా , అసాధ్యమా అని అతనికి ఇంతవరకూ సంశయమే రాలేదు . అలాగే చేదాము అని అర క్షణములో సిద్ధాంతము చేసుకొని , బ్రహ్మకు ఆ సంగతి తెలిపి , అనుమతి పొంది , యజమానునికి కూడా దానిని తెలిపి , హోతృడిని దక్షిణ కపర్ది కావలెనని ప్రార్థించి , తాను వశిష్ఠాకర్షణకు కూర్చున్నాడు . ( కపర్ది అంటే జటాజూటము కలవాడు. ఏదైనా ఉపాసన చేయునపుడు జట ( శిఖ ) ఉండే తీరవలెను . ఆ దేవతా తేజస్సు అంతసేపూ శిఖలో బంధింపబడి ఉంటుంది . )

     విశ్వామిత్రుడు ఆకర్షణకు కూర్చొని మంత్రములను చెప్పుతుండగా ,ఆ మంత్రశక్తి మనో వేగముతో అతనిని వశిష్ఠుల ఆశ్రమానికి తీసుకొని పోయింది . తీగ ఒకటి ఏదో విచిత్ర ప్రభావానికి గురియై , ఒకే దిక్కులో తన శాఖ నొకదానిని విద్యుద్వేగముతో  ప్రసరిస్తే , అది ఉన్నచోటే ఉన్నా , దాని శాఖ దూరమునకు ఎలాగ పోవునో , అలాగ , ఎత్తైన చెట్టుపైనున్న బీజకోశము పక్వమై పగిలితే , దానిలోనున్న బీజాలు ఫటామని దిక్కుదిక్కులకూ విసరివేయ బడినపుడు పెనుగాలి వీస్తే ఆ బీజాలు దేశాంతరమైనట్లు , సంకల్పము చేతనే , ముందే ఆవహించిన మంత్రశక్తి ప్రభావము  చేత విశ్వామిత్రుడు సూక్ష్మాతి సూక్ష్మముగా ఒక కాంతి కణము కన్నా చిన్నదైన ఆకారముతో , వశిష్ఠుల ఆశ్రమమును ప్రవేశించాడు . వశిష్ఠులను పట్టుకొనడానికి ఎందుకో భయమై , అతని పుత్రులలో ఒకడిని పట్టుకున్నాడు . వశిష్ఠుల జ్యేష్ఠ పుత్రుడైన శక్తి , సోదరులతో పాటు కూర్చొని అప్పుడు  వేదాధ్యయనము చేస్తున్నాడు . విశ్వామిత్రుడు పట్టుకున్న వాడి నోటి నుంచీ వేదము వినిపించలేదు . రాహుగ్రస్తమైన తేజో బింబపు తేజము తగ్గినట్లే , అతడూ , వాక్కు కోల్పోయి , తెరచిన కన్నులు తెరచినట్టే చూస్తూ కూర్చుండిపోయాడు . 

     ఇదేమిటి , ఇలా అయ్యాడని , శక్తి , వానివైపు చూస్తున్నాడు . స్థూల చక్షువులకు కనిపించని విశ్వామిత్రుని గ్రహణము , అతని ప్రజ్ఞా చక్షువు నుండి తప్పించుకోలేదు . తమ క్షేత్రమునే ప్రవేశించి , తమ తేజస్సును  , తమ అనుమతి లేకుండా తీసుకొని పోవుటను ఆ తేజస్వి ఎలా సహిస్తాడు ? దొంగను పట్టి కట్టిన గృహస్థు వలెనే , విశ్వామిత్రుడిని పట్టేశాడు . ఇనుము అయస్కాంతాన్ని ముట్టుకొని , దానికి కరచుకొన్నట్టాయెను . 

     ఇక్కడ దేవయజనములో కూర్చున్న విశ్వామిత్రుని దేహము తేజము కోల్పోయెను . అంగాంగములూ చేష్టలు ఉడిగెను . అతని వాక్కు పడిపోయినట్లు మాట పెగలక ఉండెను.  అంతలోనే , బ్రహ్మ పక్కనే ఉన్న అగ్ని ,  దుష్ట వర్ణములతో కూడిన జ్వాలలతో విజృంభించి , వచ్చిన అరిష్టమును సూచించెను . వెంటనే బ్రహ్మ ( జమదగ్ని ) తన శక్తి సర్వస్వాన్నీ ప్రయోగించి , వాగ్దేవిని పిలిచెను . ఋత్విగ్గణమంతా అప్రమత్తమయ్యారు . బ్రహ్మ యొక్క ఋక్కును హోతృడు జపము చేశాడు. దావిని మరల ఉద్గాతృడు ఉప బృంహణము చేసి సామముగా పాడెను . అధ్వర్యు గణము సరస్వతికి  త్వర త్వర  గా హోమము చేసిరి . జమదగ్నియొక్క మంత్ర ప్రభావము విశ్వామిత్రుని తేజస్సును నిగ్రహించిన తేజస్సును కబళించింది . నిగ్రహించబడి కూర్చున్న ఆ తేజస్సు , తనను విడిపించటానికి వచ్చిన తేజస్సుతో చేరింది . రెండూ , విచిత్రముగా విజృంభించాయి . శక్తి హాహాకారము చేశాడు . అతని సోదరులందరూ చేరినారు . మరలా ఈ రెండు తేజస్సులూ ఒకదానితో ఒకటి కలిశాయి .

     జమదగ్ని , ఇలా ఇక పని కాదని , అథర్వుడిని  స్మరించి ఘోరరూపుడాయెను . ఊపిరి పీల్చునంతలొనే , జమదగ్ని , విశ్వామిత్రుల తేజస్సులు రెండూ చేరి , శక్తి , మరియు అతని సోదరుల తేజస్సులనన్నిటినీ స్వాహా చేసేశాయి .. జమదగ్ని , విశ్వామిత్రులు యాజ్ఞికులైనందు వలన , వశిష్ఠ ఆశ్రమపు దేవతలు , ఏమీ తోచక , ఆ సమయానికి , శక్తికీ , అతని సోదరులకూ ఏ సహాయము చేయలేక , దుర్బలులవలె ఊరకే ఉండి పోవలసి వచ్చెను .

     ఇక్కడ , విశ్వామిత్రుడు , పీడ కల ఏదో చూస్తున్నవాడు సాహసముతో వదరుతూ  నిద్ర లేచిన వాడివలె లేచెను . ఆయాసముగా ఉన్ననూ , భయపడి నట్లు యజ్ఞము చెడిపోయెను కదా అన్న వ్యథతో , అవమానముతో రేగి పోయి , హవిస్సు వేసిన తక్షణమే ఎగసి పడే యజ్ఞేశ్వరుడి వలె విజృంభించాడు . 

21. " మంత్ర ద్రష్ట " ఇరవై ఒకటవ తరంగము



ఇరవై ఒకటవ తరంగము

     చికిత్స ప్రారంభమైంది . దేవ వైద్యులు అక్కడ పెట్టి ఉన్న మోదుగ  , రావి దొన్నెలలో నీరు నింపుకుని , దర్భ కట్టలను పట్టుకొని , మంత్రజలమును ప్రోక్షిస్తూ వచ్చారు . విశ్వామిత్రుడు చూస్తూ ఉండగానే పలుచగా   నీటి ఆవిరి వంటి సూక్ష్మ ద్రవము ఆ దేహపు చుట్టూ చేరుతున్నట్టు వచ్చి వచ్చి ఒక ఘడియ లోపలనే ఆ దేహము చుట్టూ ఒక తెల్లటి  మేఘము కట్టినట్లాయెను . దానినంతటినీ చేర్చి , ఒకముద్ద లాగా చేసి , దానిపైన మంత్రజలమును ప్రోక్షించగా , అది ఒక ఉండ లాగా మారి , ఘనమైన తేజో మూర్తిలాగా నిలిచింది . ఆ తేజో మండలము రకరకాల రంగులతో ,వెలుగులతో నిండి ఉంది . 

     దానిని మరలా మంత్ర జలముతో ప్రోక్షిస్తూ రాగా , విద్యుల్లత వంటి నీల వర్ణముతో విశిష్టముగా మెరస్తూ , సూర్యకిరణము వలె ఉజ్జ్వలంగా ఉన్న ఒక తేజః కణము బయటికొచ్చింది . దానిని ఒక దర్భ అగ్రము నందు పెట్టి , మరలా ఆ తేజో మేఘము వైపుకు తిరిగారు . దానిని మంత్ర జలముతో ప్రోక్షణ చేస్తూ ఉండగా , దానినుండీ ఉడికిన పట్టు గూడు నుంచీ మొలక వచ్చినట్టి సూక్షమైన తంతువు ఒకటి పైకి వచ్చింది . సాలె పురుగు దారముకన్నా మృదువుగా ఉన్న ఆ దారమును ఆ వైద్య వరేణ్యులు వేగవేగముగా చుట్టి పక్కన పెట్టారు . 

     ఆ దారమును విప్పి తీస్తున్నప్పుడే , ఆ తేజో మేఘపు అంతః ప్రకాశము సుందరముగా కనిపిస్తున్నది . అంతవరకూ కనిపించని దాని లోపలిదంతా తెలిసి  , అక్కడ , తెలుపు , నలుపు , నీలము , పసుపు రంగులు కనిపించాయి . అవి అలాగే చూస్తూండగానే , తేట పడి , అన్నీ వేరే వేరే రంగులుగా మారుతున్నాయి . నలుపు తెలుపైంది . పాల వర్ణపు తెలుపు  శుద్ధమై తేలి , పాదరసపు తెలుపైంది . ఎరుపు , పాటల వర్ణము లో ఉన్ననూ పసుపు రంగుకు మారింది . పసుపు  రంగు ఏదో ఏదో రంగుకు మారి , చివరికి అపరంజి రంగుకు వచ్చి నిలచింది . నీలము కొంచము మసక బారి , మెరుపు లేకుండ ఉన్నట్టిది , ఉత్తమమైన నీలి రత్నము వలె మెరుపును సంతరించుకుంది . ఇంకొక ఘడియ లోపలే , అవన్నీ చేరి , మరల లేత ఆకుపచ్చ వర్ణమై నిలిచాయి . 

     దానినక్కడే పెట్టి , నీల ప్రకాశముతో ఉన్న ఆ తేజః కణమును తీసుకున్నారు . దాని నుంచీ కూడా శుభ్రమైన , సూక్ష్మాతి సూక్ష్మమైన తంతువు ఒకటి లేచి వచ్చింది . దాన్ని కూడా చుట్టి ప్రత్యేకముగా పెట్టారు . అంతవరకూ మిరుమిట్లు గొలిపే వెలుగు తో మెరుస్తున్న  ఆ నీలి ప్రకాశము స్థిరమై , సౌమ్యముగా మారింది . దానిని ముందే సిద్ధమై ఉన్న తేజో మండలములో ఉంచారు . 

     ఆ వేళకు ఇక్కడ , త్రిశంకుని స్థూల దేహము ఒరిగి సొరగి పోయి ఉంది . పురుష ప్రమాణములో పుష్టిగా , దృఢముగా ఉన్న దేహము తగ్గి , కేవలము జానెడు పొడవు బొమ్మ లాగా మారిపోయి ఉంది . దానిని మరల మంత్రోదకాలతో ప్రోక్షిస్తూ రాగా , దాని నుంచీ నానా వర్ణాలతో వెలుగులున్న జ్వాలలు లేచాయి . అవి కొంత కొంత సేపు అలా మండి శాంతములయ్యాయి . దేహము , తేజపు సంపదతో కూడి , గాజు బొమ్మ వలె అయింది . తేజో మండలము , ఆ బొమ్మలోపలికి దుమికి , అక్కడే అణగి పోయింది . జానెడున్న దేహము చూస్తూ చూస్తూ ఉండగనే , పెరిగి పెద్దదై , మొదటిలాగా పురుష ప్రమాణమునకు వచ్చింది . 

     దేవతలు ఇద్దరూ , దానిని ఆవైపు ఒకరు , ఈ వైపు ఒకరూ పట్టుకుని , " నువ్వు ఎవరో గుర్తుందా ? " అని అడిగారు . సమాధానము వచ్చింది , " నేను అయోధ్యా పతి అయిన త్రిశంకువును . "  దేవతలు మరలా అన్నారు , " నువ్వు , సోమయాగము పూర్తి యై , అవభృతుడవగు వరకూ , విశ్వామిత్ర మహర్షి అనుమతి దొరకు వరకూ భూలోకమును వదలి పోరాదు . అవభృతుడవగు వరకూ నీకు భూస్పర్శ వలన కలిగెడు ప్రజ్ఞా మాంద్యమూ , ( తగ్గిన ప్రతిభ ) , దేహపు బరువూ ఉంటాయి , తెలిసిందా ? "  ఆ దేహము వారు చెప్పినది ఒప్పుకొనుటకు ఇష్టము లేనిదాని లాగా , కొంచము వేదనతో  ముఖాన్ని చిట్లించుకుంది .  " ఊహూ .. ఎదురాడ కూడదు . మేము చేసినది అంతా సరిగ్గా ఉంది " 

దేహము , ఒప్పుకొని , ఊరికే ఉంది . చిత్తం అని ప్రత్యుత్తరము వచ్చింది . 

     అశ్వినీ కుమారులు జమదగ్నిని సంబోధించి  , " మా కార్యము ముగిసినది , పురుష సూక్తముతో పూర్ణాహుతినివ్వు . మా కార్యము సఫలమవుతుంది " అన్నారు . జమదగ్ని పూర్ణాహుతి ఇస్తున్నంతలోనే త్రిశంకువు నిద్ర లేచిన వాని వలె లేచి కూర్చున్నాడు . 

 దేవతలు విశ్వామిత్రుని వైపుకు తిరిగి , " అంతా అర్థమయింది కదా ? " 

" అయింది " 

" ఏదీ , నీకు తెలిసినదానిని ఒకసారి చెప్పు " 

     " మంత్ర జల ప్రోక్షణముతో పైకి మేఘము వలె వచ్చినది పంచ ప్రాణాల ప్రభ . దానిలో ఉండినది జీవన జ్యోతి . ప్రాణ ప్రభా మండలము నుండీ విప్పి తీసినది యమ పాశము . దాని తరువాత వెలుగుల హెచ్చుతగ్గులు అన్నీ , పంచప్రాణాలలోని ఉప భాగాల ఎక్కువ తక్కువలను నివారించి , సరిగ్గా జోడించడము . అప్పుడు అతడు కామరూపి అయ్యాడు . ఆ జీవన జ్యోతి కోశము నుండీ విప్పితీసిన దారాలు , వరుణ పాశము . ఇకపైన , ఈ జీవుడున్న దేహములోని భూతములు భేదమును పొందక , కల్పాంతము వరకూ సమానముగా నుండును . ఇంతవరకూ ఇతనికి ఉండినది పార్థివ దేహము . దానిలో పృథ్వి అంశము అంతా తానే అన్నంత ఉండెను .  ఆ భూతముల సరిజోడింపు వలన , ఆ నలుపు పోవడమే దేహపు పృథ్వీ అంశము  తగ్గినదనుదానికి గుర్తు . అలాగే , పాలతెలుపు పాదరసపు తెలుపగుట , ఆపో భూతము ( నీరు )  తగ్గిన గుర్తు . ఇక ఈ దేహము తేజసమై ఉంటుంది . లోపలి ఆకాశ , వాయు , తేజో భూతములు కూడా మాలిన్యములను వదలి సత్త్వ సంపన్నములాయెను . అదే , దేహములో వెలిగిన మంటలు . ఇప్పుడు ఈ యాగము ముగియు వరకూ పృథ్వీ అంశముతో కప్పబడి ( ఆవరింపబడి ) ఉంటుంది కాబట్టి , ఈ దేహానికి ఆకాశ గమనము , తేజో వికిరణము వంటి దివ్య దేహపు గుణములు కనిపించవు . " 

     అశ్వినీ దేవతలు ఆ నివేదికను విని చాలా సంతోషించారు . కుశాగ్ర బుద్ధియై , ఏక సంత గ్రాహియైన శిష్యుడు చెప్పిన సరియైన ఉత్తరములను విన్న గురువుల వలె సంతోషించారు . వారి ప్రసన్నత ప్రకటమై కనిపిస్తున్నందున , వారి ముఖ కవళికలు ’ కావలసిన వరమును అడుగు , ఇస్తాము " అనే భావన చూపుతున్నందున , విశ్వామిత్రుడు వారికి మరల స్తుతులతో ఉపహారమును సమర్పించి , " అడిగినదానిని ఇచ్చు దేవతలని ప్రసిద్ధులైన దేవ వరేణ్యులారా , ఇస్తామన్న దానిని తప్పక ఇచ్చే సత్య వంతులారా , కృపతో నాకొక వరమునివ్వండి . నాకు బ్రాహ్మణ శరీరమును ఇవ్వండి " అని ప్రార్థించాడు . 

     అశ్వినీ దేవతలు విశ్వామిత్రుని ఆలింగనము చేసుకున్నారు . : " గాధి తనయా , నీ పితామహుడు కుశికుని సంకల్పము నెరవేరును . ఋచీకుని అనుగ్రహము ఫలించును . నీ పూర్వజుడైన సింధు ద్వీపుడు అయినట్లే , నువ్వు కూడా బ్రాహ్మణుడవవుతావు . అంతే కాదు , మహా బ్రాహ్మణుడు కూడా అవుతావు . కానీ అది అంత సులభము కాదు . మానవ దేహమునే దివ్య దేహముగా మార్చిన వారికి , ఒక క్షత్రియ దేహాన్ని బ్రాహ్మణ దేహముగా మార్చుట అదేమంత కష్టము అంటావేమో   ? ఇప్పుడు మేము చేసినది ,  పెరిగి నిలుచున్న చెట్టును కొట్టేసి , యూప స్థంభముగా మార్చుట , అంతే ! నువ్వు అడుగుతున్నది , యూపస్థంభమును చిగిరించునట్లు చేయు కార్యము . దేహము బ్రాహ్మణము కావాలంటే , అందులో ఒక భూత , భవ్య , భవద్దేవత లందరికీ ఒక్కొక్క స్థానమును కల్పించవలెను . పృథ్వి , అంతరిక్ష , స్వర్గములలో ఎవరెవరు దేవతలుగా  ఇప్పుడున్నారో , ఎవరెవరు దేవతలుగా ఇంతకు ముందు ఉండి ఉన్నారో , ఎవరెవరు ముందు ముందు దేవతలవుతారో , వారందరికీ స్థానమును కల్పించి ఇచ్చిన దేహము బ్రాహ్మణునిది . అంతేనా ? విశ్వా మిత్రా ,  సమిష్టి యొక్క ప్రతి బింబమైన వ్యష్టి దేహము ఏదో , అది బ్రాహ్మణము . ఈ విశ్వపు హద్దు అయిన రసా నది వరకూ చూడ గలిగిన ప్రజ్ఞా చక్షువును ధారణ చేయ గలిగిన దేహము బ్రాహ్మణము . దేవ దేవులందరినీ సృష్టించిన ప్రజాపతికీ , పురుషునికీ ( విష్ణువు )  వెనుకనున్న బ్రహ్మ తత్త్వమును సంతతముగా చింతించు ప్రవృత్తిని , బ్రహ్మ వర్ఛస్సును ఖండములో ( చిన్న ముక్కలో ) ప్రతిబింబించగల దేహము బ్రాహ్మణము . అంతటి దేహమును తయారు చేయుట సాధ్యమైననూ , సులభము కాదు . కాల దేశాలు కలవ వలెను . కాల దేశాలు కలిసిననూ , ఆ కార్యము కావాలంటే , మాతో పాటూ ఉషస్సు , సవితృ , బ్రహ్మణస్పతి , --ఈ ముగ్గురూ చేరవలెను . అవుతుంది , అవుతుంది .  వెనక్కు తగ్గకుండా ముందుకు సాగు . గెలుస్తావు . నీ పేరు శాశ్వతమవుతుంది . ఎవరూ చేయనటువంటి కార్యమును చేశాడని నీకు కల్ప , కల్పాంత స్థాయిలో కీర్తి వస్తుంది . అంతే కాదు . బ్రాహ్మణుడు కావలసిన ప్రతి ఒక్కరూ , దిన దినమూ , ప్రతిసంధ్యలోనూ నీ పేరు చెప్పవలసి వస్తుంది . అయినా , వత్సా ! ఆత్ర పడవద్దు . ఆత్ర పడితే కార్యము చెడిపోతుంది . శాంతుడవై , దాంతుడవై కాల నిరీక్షణ చేస్తూ ఉండు . " అని అన్నారు .

     ఈ అభినందనా వచనాన్ని విని విశ్వామిత్రుని అంగాంగములలో దేహములోని ప్రతిఒక్క జడ , చేతన కణమూ అమృతాభిషేకము చేయించుకున్నట్లు సంతోషమైంది . 

     అశ్వినీ దేవతలు జమదగ్నికి యథా యోగ్యమైన వరమునిచ్చి , ఆ ఇద్దరు ఋషీంద్రుల నుండీ పూజా సత్కారములను యథావిధిగా పొంది , అదృశ్యులైరి . 

Sunday, June 17, 2012

దేవుడు నరసింహ శాస్త్రి గారి శిష్యులు


                                                                     నమో నమః


     పై ఫోటో లో ఉన్నది శ్రీ గోవిందరాజన్   అయ్యర్ గారు , వారి సతీమణి.       శ్రీ గోవిందరాజన్ గారు కిందటి సంవత్సరమే నూరవ పుట్టిన రోజు జరుపుకున్నారు . వారి సతీ మణికి ఇప్పుడు తొంభై సంవత్సరాలు.


     ' మంత్ర ద్రష్ట ' పుస్తకపు మూలమైన కన్నడ  భాషలోని   ' మహా బ్రాహ్మణ ' పుస్తకము రాసిన శ్రీ దేవుడు నరసింహశాస్త్రి గారు , శ్రీ గోవింద రాజన్ గారికి గురువు గారు .  1925-1935  మధ్య  వీరు , వారిదగ్గర శిష్యుడు గా ఉన్నారు .
    
      శ్రీ గోవిందరాజన్ గారు కూడా ఉపాధ్యయులే .  వీరిని గురించి తెలియని వారు ఒకప్పుడు  బెంగుళూరిలోనే కాక , కర్నాటకలో కూడా ఎవరూ ఉండేవారు కాదు .


      వీరిద్దరూ ఇప్పటికీ ఎంతో ఆరోగ్యంగా , తమ పనులు తామే చేసుకుంటూ ఆది దంపతుల వలె నిండుగా ఉంటారు. శ్రీ గోవింద రాజన్ గారు ఇప్పటికీ రుద్రము , అరుణము మహా న్యాసము వంటివి కుమారునితో పాటూ పారాయణ చేస్తారు . రోజూ పొద్దున్నే నిత్య కర్మల తర్వాత కొడుకు ఇచ్చే అభిషేకపు తీర్థము తీసుకుని గానీ వీరి దిన చర్య (  వార్తా పత్రికా పఠనము , టీ వీ వీక్షణము , మొ ॥ )  మొదలు కాదు .


     ఈమధ్య  వీరితో  మాట్లాడాను . మా వూరి తో ( అనంతపురము ) వారికున్న అనుబంధము గురించి చెప్పారు .


      ఇంకా చెప్పుటకు చాలా ఉందికాని , గ్రంధ విస్తరణ భీతి చే ఇక్కడికి నిలుపుతాను .


     శ్రీ దేవుడు గారు చాలా నిరాడంబర వ్యక్తి  అని , అతి నిష్ఠా గరిష్ఠులనీ శ్రీ గోవిందరాజన్ గారు చెపుతారు . వీరు తెలుగు , కన్నడ , తమిళ్ , ఇంగ్లీషు భాషలు అనర్గళముగా మాట్లాడతారు . వారి సతీమణి కేరళ నుండీ వచ్చిన   అయ్యరు కుటుంబీకులు .


     వీరి ఆఖరి పుత్రుడు  శ్రీ అశోక్ అయ్యర్ గారు నాకు మంచి మిత్రులే కాక, వేదాధ్యయనములో నాకు సహపాఠి.  మా ఇద్దరి అధ్యయనము ఇంకా సాగుతున్నది . మా గురువు గారు పూజ్య శ్రీ ప్రకాశ భట్టు గారు . నాకు ' మహా బ్రాహ్మణ '  పుస్తకము దొరికినది వీరి వల్లనే . 

Saturday, June 16, 2012

20. " మంత్ర ద్రష్ట " ఇరవయ్యవ తరంగము



ఇరవయ్యవ తరంగము

     జమదగ్ని , విశ్వామిత్రులు సోమయాగమును ఆరంభించారు . వారి దేవతలు అశ్వినులు . యాగము ఏ విఘ్నమూ లేకుండా నడిచింది . యాగాంతములో అవభృతము కూడా అయింది . ( అవభృతమనగా , యజ్ఞాది శుభ కర్మల సమాప్తి యందు చేయు స్నానము ) మరునాడు ఇద్దరు ఋషులూ చేరి , అశ్వినీ దేవతలను ఆవాహన చేసి రప్పించుకున్నారు . నవ యౌవన సంపన్నులూ , సుందర సౌష్ఠవ రూపములు కలవారు , కమల హారములను ధరించి సుదీర్ఘమైన సుగంధపూరిత కేశములతోనూ మనోహరము గా కనుపించు ఆ దేవతలు శింశుమార రథమునందు (  మొసలి చేత లాగబడు రథము ) వచ్చి దర్శనమిచ్చారు . 

     వారికి సలుపవలసిన పూజలన్నీ సలిపి , సర్వోపచారములు చేసి , త్రిశంకువు సంగతి వారికి తెలియజేశారు . : వారు సంతుష్టులై , " మానవులు ఇలాగ సాహస వంతులై ఉండుటే మాకు కావలసినది . అంతే కాని , పుట్టినది పుట్టినట్లే చెక్క లాగా పడి ఉండుట మానవ ధర్మము కాదు , అది జడపదార్థము . క్రిమికీటకాలు ఆహారమును , భోగమునూ వెతుక్కుంటూ తిరుగుతాయి . మనుష్యులు సిద్ధులనూ , ప్రభావములనూ వెతుక్కుంటూ తిరుగుతారు . అటువంటి వారిని చూస్తే మాకు సంతోషము . ఈ విషయమై , మా వలన ఏమి కావలెను , చెప్పండి , తప్పకుండా చేస్తాము . " అని మాట ఇచ్చారు . 

     విశ్వామిత్రుడు జమదగ్ని యొక్క ప్రేరణతో మాట్లాడెను , " అశ్వినీ దేవతలారా ! మీరు సత్యవంతులని ప్రసిద్ధులైనవారు . పూర్వము మీరు ఎందరో భక్త జనులకు కావల్సిన వరములన్నీ ఇచ్చి కాపాడినవారు . దేవ వైద్యులుగా ప్రసిద్ధులై , భక్తులను కాపాడుటకు పరుగెత్తి వచ్చువారు మీరు . మిమ్ములను ప్రార్థిస్తున్నాను . ఈ త్రిశంకువు యొక్క ఇష్టము నెరవేరు విధానమును మాకు అనుగ్రహించండి . ఏ విధానము వలన , మర్త్యుడైన ఇతడు , తన మర్త్య దేహమును విడువకుండానే , అమరుడై సుర భోగాలకు అర్హుడగునో దానిని ఉపదేశించి , మమ్ములను కృతార్థులను చేయండి . " 

     అశ్వినీ దేవతలు నవ్వారు . : " రాజర్షీ ! నువ్వు ఇప్పుడడుగు చున్న విషయము ఎంతటి గంభీరమైనదో గమనించినావా ? లోకములో ఎవరైనా కానీ , పండితులైనా , పామరులైనా కానీ , ఒక వస్తువును దాని గుణ ధర్మాలతో గుర్తిస్తారు . ఆ గుణ ధర్మాలను మార్చి వేస్తే , అప్పుడా వస్తువే వేరే  కదా ? అది మారిపోతుంది కదా ? అలాగ వస్తువును మార్చకుండా , కేవలము దాని గుణ ధర్మాలను మాత్రము ఎలా మార్చగలము ? మర్త్య , అమర్త్య దేహాలు రెండూ పరస్పర విరుద్ధ ధర్మాలు కలవి . జరామరణ ధర్మమున్నటువంటి మానవ దేహము గనక అమర్త్యమైతే ,  అది ఒక విచిత్రము . అటువంటి ఒక విచిత్ర విధానమును కల్పిస్తే , లోకపు మర్యాద చెడిపోయి , ఒక వ్యవస్థ అంటూ లేని విచిత్ర సృష్టి జరిగి , ధర్మము సంకరమై లోకము వ్యథ చెందును . అయితే , మేము మాట ఇచ్చాము కనక , దీనిని చేసి ఇస్తాము . అయితే ఒక మాట. బాగా గుర్తుంచుకో . ఇప్పుడు మేము చూపబోవు ఈ మార్గమును మరల మరలా ఉపయోగించవద్దు . మానవులు సహజముగా లోభులు . ఎప్పుడు చూసినా ఏదో ఒకటి కావాలి అనే లోభానికి గురియై  ప్రయాస పడుతుంటారు . తృప్తి లేని చంచల మనస్సు గలవారు . కాబట్టి దీనిని వీలైనంత రహస్యముగా ఉంచండి . దుర్వినియోగము చేయగల అపాత్రులకు ఇవ్వవద్దు . " 

     విశ్వామిత్రుని మనసు ఎందుకో కలత పడి , ఈ మాట నాగురించే చెప్పినారు అనుకున్నది . 

     అశ్వినీ దేవతలు ఇంకా చెప్పసాగారు , " మనుష్యులూ , దేవతలు ఒకే రజో గుణము గలవారు . ఆ రజో గుణములో తమో గుణాంశము ఎక్కువైతే మనుష్యులూ , సత్త్వాంశ ఎక్కువైన, దేవతలూ పుడతారు . కాబట్టి , ఇప్పుడు త్రిశంకు దేహములో నున్న రజస్సు , తమస్సు లను వేరు చేయండి . తమస్సు యొక్క అంశానికి బదులుగా సత్త్వమును ఉంచితే అతడు దేవత అగును . అది జరగాలంటే , ఇరవై నాలుగు తత్త్వాల యొక్క , పంచభూతాల  , వీటికన్నా ముఖ్యముగా , ఇంద్రుని అనుమతి కావలెను  దీన్ని మనస్సులో పెట్టుకొని సాగండి . పలాశ ( మోదుగ ) , అశ్వత్థములు యమ , వరుణ పాశములను విడిపించగలవు . యమ పాశమునుండి తప్పించుకున్న వాడు అమరుడగును . వరుణ పాశము నుండీ ముక్తుడైన వాడు పంచభూతాల భేదముల వలన కలుగు వికార రూపమైన ముసలితనము నుండి విముక్తుడై అజరుడగును . సోమయాగము వలన దేవతలను తృప్తి పరచి , వారి అనుజ్ఞ పొంది , స్వర్గానికి పంపించండి . అక్కడ శాశ్వతంగా  నెలకొన గలడు . "

     విశ్వామిత్రుడు అడిగెను , " చిత్తము , దేవదేవులారా , అతనికి గురు పుత్రులవలన శాపము వచ్చింది కదా , దానికేమి చేయుట ? " 

     " ఆ శాపము అతనికి అప్పుడే చండాలత్వమును తెచ్చిపెట్టింది . జీవుడికి కర్మ , కళ అని రెండు రూపాలు . మేము చెప్పిన విధానము కర్మమును కడిగేస్తాయి . ఇతనికి గురుశాపము తగిలినది క్రింది స్థాయిలో . కాబట్టి , నీ తపోబలముతో దానిని ఆకర్షించి , ఒక కుండలో పెట్టి ఉంచి , సోమ యాగపు అవభృత వేళలో దానిని విసర్జించు . కానీ అది వశిష్ఠుల శాపము . వశిష్ఠునిపై ఇంద్రునికి అపారమైన విశ్వాసము , గౌరవము . కాబట్టి , వశిష్ఠుల కులము వారు ’ తీరినది ’ అని చెప్పువరకూ ఈ శాపము పూర్తిగా తీరదు . " 

     జమదగ్ని , విశ్వామిత్రునికి సైగ చేసి , ఊరుకొమ్మని చెప్పి , తాను మాట్లాడెను . " ఓ కవల లారా ! తమరు చెప్పిన విధానమును చేయుట తమ వల్లనే సాధ్యము . అంతే కాక , ఆ విధానమును ఈ కాల దేశానుగుణముగా సరిచేసుకొను శక్తి , సాధనాలు మాకు లేవు . కాబట్టి , తమరి అనుజ్ఞ అయిన , తమరు ఈ ఉద్దేశానికి విరోధము కాదు కాబట్టి అడుగుతున్నాను . పెద్ద మనసుతో , మాపై అనుగ్రహము చూపి , త్రిశంకువు దేహాన్ని తమరే చికిత్స చేసి దివ్య దేహముగా మార్చవలెను . " 

     కవలలిద్దరూ ఒకరి ముఖమునొకరు చూసుకొని నవ్వారు . "  అయితే సరే " అని ఒప్పుకున్నారు . మరుసటి రోజు రాత్రే చికిత్స జరుగునని తెలిసింది . 

     త్రిశంకువుకు అప్పటికే చండాలత్వము వచ్చేసింది . ముఖములో తేజస్సు లేదు . దేహములో బలము లేదు . మనసులో దేనిపైనా కోరిక లేదు . విశ్వామిత్రుడు అది చూచి , ఇంకా చేయి దాటి పోవువరకూ ఊరికే ఉండరాదు అని తలచి , అతనికి మంత్ర స్నానము చేయించి , అతని చండాలత్వమును ఆకర్షించి , ఒక కుండలో పెట్టి , దానిని , ఆశ్రమపు వెనకాల ఎవరు ఎక్కువగా తిరుగని ఏకాంత ప్రదేశములో ఒక ముళ్ళ మోదుగ చెట్టుకు కట్టేశాడు . త్రిశంకువుకు  గుణమై , మరలా ముందువలె అయ్యాడు . 

     తరువాత అతడు మృత్తికా  శౌచములతో దేహాన్ని శుద్ధి చేసుకొని , నదీ స్నానము చేసి వచ్చాడు . 

     ఆశ్రమములో ఒక కొత్త గుడిసె ఏర్పాటైంది . దాని మధ్యలో , జ్యోతిర్లత ఒకటి వెలుగుతూ , కంటికి సుఖమైన వెలుగును పంచుతున్నది . దాని కింద ఒక దర్భ శయ్య . దాని రెండు వైపులా రెండు  పెద్ద పీఠికలు . వాటి పైన దర్భాసనాలు . చుట్టూతా చిన్న అరుగు. దానిపైన మోదుగాకులు , రావి ఆకులు ,  అరటి ఆకులతో చేసిన దొన్నెలు . ఒక పెద్ద కడవ నిండా నీళ్ళు . ఇంకొక అరటి ఆకు దొన్నె నిండా నవనీతము . ఇంకోదానిలో సద్యోఘృతము( తాజా నెయ్యి ) . ఆ గుడిసె ఇంకొక వైపులో ఒక అగ్ని కుండము . దానిలో లౌకికాగ్ని మంద్రముగా మండుతున్నది . దాని పక్కనే , వేరు వేరుగా కట్టిన , నానా విధములైన సమిధల ఇరవై నాలుగు కట్టలు . 

     అనుకున్న కాలానికి త్రిశంకువు వచ్చాడు . అశ్వినీ దేవతలు ఆరోజు చికిత్స చేసెదరు ,  మానవ దేహాన్ని దివ్య దేహముగా చేసెదరు అన్నది అతనికి తెలుసు . అతడూ సంతోషంగానే ఒప్పుకున్నాడు . నార బట్టలతో చేసిన మడిధోవతి  కట్టుకొని , ఇంకో నార బట్ట తో చేసిన ఉత్తరీయమును సవ్యముగా ధరించి వచ్చాడు . ఎన్నో సార్లు అవభృత స్నానములను చేసినది గుర్తొస్తున్నది . సోమపానము చేసి ఆనందోన్మత్తుడై ఉండినది గుర్తొచ్చి , మనస్సు అప్పటి ఆనందాతిరేకమును పూర్ణముగా అనుభవించునంతలోపల ఏదో నీలి నీడ వచ్చి తటాలున ఆక్రమించి ఆనందాన్ని క్రుంగదీయుచున్నది . కాని త్రిశంకువు వెనుకటి త్రిశంకువు కాదు . వెనకటి రోజుల త్రిశంకువు కూడా  కాదు . వశిష్ఠాశ్రమునకు వెళ్ళి  అక్కడ శాపమును పొంది నిత్య దుఃఖియై వచ్చిన త్రిశంకువు అసలే కాదు . దానికన్నా వెనుక , లోకములోని ఉత్తమోత్తమ సుఖములను అనుభవిస్తున్నా , అశాంతుడై , వాటికన్నా ఉత్తమమైన దివ్య భోగములను కోరుతున్న త్రిశంకువితడు . ప్రశాంతంగా వర్షము కురిపించుటకు సిద్ధమై యున్ననూ , నిశ్చలంగా ఆకాశములో నిలచిఉన్న నీల మేఘము వలె , స్థిరముగానూ , పూర్ణముగానూ కనిపిస్తున్నాడు . 

     రాత్రియయినది . ఒక ఝాము గడచింది అనునంతలోనే జమదగ్ని , విశ్వామిత్రులు వచ్చారు . వచ్చి మొదట ఆ లౌకికాగ్నిలో హోమము చేశారు . కవలలు , ఆహుతులను తీసుకొని  , అగ్ని శాంతుడగుతుండగా కానుకగా సమర్పించారు . హోమమును ముగించి , ఋషులిద్దరూ లేచి , కవలలిద్దరికీ అర్ఘ్య పాద్యాదులను అర్పించారు . త్రిశంకువుకు దేవతల దర్శనమాయెను . అతడుకూడా నమస్కారాదులతో అర్చించాడు . 

     అశ్వినీ దేవతలు అడిగారు , " ఏమంటావు మహారాజా ? ఈ దైవీకరణను ఒప్పుకున్నావా ?  నీ దేహములో మేము వ్యాపారము చేయవచ్చునా ? " 

     త్రిశంకువు నమస్కారము చేసి , " తమరు ఏమి కావాలన్ననూ చేయ వచ్చును . దేవలోకములో శాశ్వతముగా ఉండాలన్న ఆశ నాది . దానిని విశ్వామిత్రులవలన సాధించుకో అని గురు దేవుల అనుమతి అయ్యింది . కాబట్టి వారిని ఆశ్రయించాను . వారు తమరిని ఆహ్వానించారు . తమరు చేయునదంతా నా శ్రేయస్సుకే నని నాకు తెలుసు  గనక , నేను చేయగలిగినది ఒకటే ఒకటి . : అది నన్ను నేను తమకు అప్పజెప్పుకోవడము. " అని చేతులు జోడించాడు . 

     అశ్వినులు సరే యని చికిత్సకు సిద్ధమైనారు . త్రిశంకువుకు సద్యోఘృతమును మంత్రపూర్వకము గా పానము చేయించి , దేహాద్యంతమూ నవనీతమును వ్రాసి , మంత్రోదకమును చల్లారు . త్రిశంకువు చేష్టలు ఉడిగి , అచేతనుడాయెను . ఆ దేహమునెత్తి , దర్భ శయ్యపై పరుండబెట్టారు . 

     జమదగ్ని , అగ్నికుండపు పక్కన దర్భాసనుడై , రక్షోఘ్న మంత్రములను జపిస్తూ కూర్చున్నాడు .

     విశ్వామిత్రుడు దేవ వైద్యుల అనుమతితో , జరుగుతున్నదంతా గమనిస్తూ వారి పక్కనే నిలుచున్నాడు . 

19. " మంత్ర ద్రష్ట " పంతొమ్మిదవ తరంగము



పంతొమ్మిదవ తరంగము

     విశ్వామిత్రుని కోరిక మేరకు జమదగ్ని వచ్చాడు . ఇతడి ఆలోచనలు అతడికి నచ్చినవి . " ఇప్పుడున్న ఏ యాగము కూడా , మనకు కావలసిన ఈ అర్థాన్ని సాధించి ఇవ్వలేదు. అందుకై , ఒక కొత్త యాగమును కల్పించవలెను . అలాగ కల్పన చేయుట అతిశయమేమీ కాదు . ఇప్పటి దేవతలూ , అసురులూ కూడా , ఇలాగే ఒక కొత్త యాగాన్ని కనిపెట్టియే కదా , ఇప్పుడున్న స్వర్గాన్ని నిర్మించినది ! దానిని ( ఆ యాగమును )  దేవతలు , అందరికి దొరకరాదు అని దాచిపెట్టారు . అథర్వుడికి ఈ రహస్యము తెలుసు . ఋషులకు కూడా తెలుసు . యముడికి తెలుసు . వీరందరూ తెలుసుకున్న రహస్యాన్ని మనము ఛేదిస్తాము . లేదా, వీరి తంటాయే మనకు వద్దంటే , మనము వేరే ఇంకొక క్రమాన్ని పట్టుకుందాము . " అన్నాడు . జమదగ్ని , విశ్వామిత్రులు అగ్ని , గాలి కలసినట్టు కలసిపోయారు . 

     విశ్వామిత్రునికి వామదేవుని పిలవాలని కోరిక . కానీ , మనసు ఎందుకో అది సంకల్పము వరకే వెళ్ళి నిలిచిపోయింది . " దీని తర్వాత , నేను ఏ పని చేసినను అతడు ఉండనే ఉంటాడు కదా , ప్రత్యక్షముగా ఇప్పుడు లేకున్న నేమి ? " అనుకొని ముందుకు దూకెను . 

     దినదినమూ జమదగ్ని , విశ్వామిత్రుడు స్వర్గమును ఇచ్చు యజ్ఞములు ఏమేమి ఉన్నాయి అని విచారిస్తున్నారు . కానీ , సశరీరముగా స్వర్గానికి తీసుకొని వెళ్ళి , అక్కడ శాశ్వతంగా ఉండునట్టి ఫలము నిచ్చు యాగము యేదీ ఉన్నట్లు కనపడలేదు . త్రిశంకునికి కావలసినది శాశ్వతమైన స్వర్గము . మనుషుడు స్వర్గమునకు వెళ్ళి వచ్చుటకు దేవతలు ఒప్పుకున్ననూ , అక్కడే శాశ్వతముగా ఉండుటకు ఒప్పుకుంటారా ? అలాగ శాశ్వతంగా ఉండాలంటే ఏమి చేయాలి ? తానే ఒక దేవత కావాలి . మనుష్యుడు దేవత అయితే , అప్పుడు శాశ్వతమైన స్వర్గము లభిస్తుంది . 

     చివరికి విశ్వామిత్రుడు జమదగ్నితో , " మనమెందుకు ఇంత చింతించాలి ? అథర్వ మహర్షిని పిలిచి ప్రార్థిద్దాము . అతడు అటువంటి ఒక యాగమును కల్పించి ఇస్తాడు . " అన్నాడు . జమదగ్ని సరేనన్నాడు . ఇద్దరూ ధ్యానములో కూర్చున్నారు . 

     ఇంద్రియముల బహిర్వృత్తిని నిరోధించి , ప్రాణ బలమును వృద్ధి పరచి , ఇద్దరూ ఏక కాలములో సంయమము చేశారు . అథర్వ మహర్షి ఆకారము దృగ్గోచరమైంది . అలాగే ఇంకొంత  సంయమము తర్వాత , అథర్వుడు తన పూర్తి స్వరూపముతో కనిపించెను . గోత్ర ప్రవర కర్త యునూ , మంత్ర ద్రష్టయూ అయిన మహర్షికి చేయవలసిన ఉపచారముల నన్నింటినీ సలిపి , అతని అనుమతి పొంది , సంపూర్ణ వినయముతో ప్రార్థించుకున్నారు . " ఋషీంద్రా , సశరీరుడై శాశ్వత స్వర్గమును పొందుటకు సాధనమగు యాగమును మాకు కరుణించండి .  " 

     అథర్వుడు చెప్పెను , " మీరు అడుగుతున్నట్టి యాగమేదీ లేదు . : ఇప్పుడు త్రిశంకువు యొక్క కోరిక మీరు అనుకున్నట్లు , దేవత కావలెనని కదా ! మనుష్య దేహము సుఖ దుఃఖములను ద్వంద్వముగా అనుభవించకుండా , కేవలము సుఖమునో , లేక దుఃఖమునో మాత్రమే అనుభవించలేదు . దుఃఖము లేకుండా కేవలము సుఖాన్ని మాత్రమే అనుభవించుటకు సమర్థత లేని శరీరముతో ,  సుఖము మాత్రమే దొరకు స్వర్గానికి వెళ్ళితే , అక్కడ ఈ శరీరము ఏమి చేయగలదు ? మహా అయితే , స్వర్గములో జరామరణములు ఉండవు కాబట్టి , ఆ స్వభావములున్న దేహము ఇంకొంత కాలము అక్కడ దృఢముగా ఉండ గలదు . అయితే , కల్పాంతమువరకూ ఉండుటకు సాధ్యము కాదు . దేహానికి ఆ స్థాయి లేదు . కాబట్టి , మీరిద్దరూ కలసి , మనుష్య దేహమును దివ్య దేహముగా మార్చుటకు ప్రయత్నించండి . మీరు గెలిస్తే , మీ ఇష్టార్థము లభించినట్లే . " 

     జమదగ్ని అడిగెను , " దేవా , నువ్వే దయ చేసి మాకొక యాగమును నిర్మించి ఇవ్వు . " 

     అథర్వుడు చెప్పెను , " అది జరగని పని . కానీ అసాధ్యము కాదు . రుద్ర , యమ , వరుణ పాశముల నుండీ దేహమును విడిపించి  , జరామరణ ధర్మమును తప్పిస్తే , మనుష్య దేహము దివ్య దేహము కాగలదు . ఏమైననూ , ఇంతటి విశేషమైన సిద్ధులు వ్యక్తిగతముగా ఉండవలసినదే తప్ప , సార్వత్రికముగా సర్వజనులకూ అందుబాటు లో ఉండరాదు . దీనికోసమని ఒక యాగమును కల్పిస్తే , దేవ దత్తులు , సింహ దత్తులందరూ  స్వర్గానికి పరుగెత్తి వస్తారు . (  దేవదత్తము , సింహ దత్తము అనునవి పంచ ప్రాణముల లో రెండింటి  ఉప వాయువులు . ఆయా ఉప వాయువులు శరీరమున కలవారు , అంటే , మనుష్యులు , రాక్షసులు ). అప్పుడు స్వర్గ , మర్త్య , పాతాళములు అను వ్యవస్థ చెడిపోవును . మేము ఋషులము . ప్రకృతి , వికృతి ధర్మములను తెలుసుకొని ఉండవలసిన వారము . అయినంత వరకూ ప్రకృతి ధర్మ నిష్ఠ లో ఉండవలెను . " 

" అట్లయిన  , ఈ త్రిశంకువు యొక్క యాగము చేయుటకు వీలు లేదా ? " 

     " చేయవలసినదే . అతని కోరిక కాలానుగుణముగా లేకున్ననూ , అసహజముగా నున్ననూ , అది అలౌకికమైనది . అది ముందు ముందు జరగబోవు ఏదో మహత్కార్యమును గురించిన ఈశ్వరేఛ్చకు ప్రతిబింబము . దీనిని అర్థము చేసుకొని నడుచుకోవలెను . ఈ యాగము అంత సులభము కాదు . మీరు సోమపానము చేసినపుడు ఏ ధర్మము మీ స్థూల సూక్ష్మ శరీరములలో ఉండునో , అదే ధర్మము ( యజ్ఞము చేయు )  కారణానికి కూడా వ్యాపించువరకూ మనిషి దేవత అగుటకు వీలు లేదు . అటుల అగుటకు మనుష్యుని ఆనందానుభవ శక్తి ఎంత పెరగ వలెను ! మనుష్యుని  ఆనందానికి నూరు రెట్లు అయితే అది మనుష్య గంధర్వుల ఆనందము . దానికి నూరు రెట్లు అయితే , అది దేవ గంధర్వుల ఆనందము . దానికి కూడా నూరు రెట్లు అయితే అది దేవానందము . ఆ మాత్రమైనా వస్తేనే కదా శాశ్వత స్వర్గ స్థితి ? ఆ మాత్రము పొంది , స్వర్గములో ఎవడో అనామకుడిగా బతుకుట కన్నా , చక్రవర్తియై ఇక్కడే ఉండుట ఉత్తమము . ఇతర దేవతలతో సమానముగా స్వర్గములో ఉండాలంటే  , అధమ పక్షము  కర్మ ఫలముగా పుట్టిన దేవత యొక్క ఆనందమైనా కావాలి కదా ! ( మనుషునిది కారణ దేహము , దేవతది కర్మజ దేహము )  అలా కావాలంటే అది ఇంకా ఎంత పెరగాలి ?  దానికి ఇంద్రుని అనుమతి కావలెను . అతని అనుమతి లేనిదే , కారణ దేహపు బలమూ , ఆనందానుభవ శక్తీ రెండూ పెరగవు . ఈ యాగమునకు వశిష్ఠులు రారు . వశిష్ఠులు రాకుంటే ఇంద్రుడు రాడు . ఇంద్రుడు లేనిదే యాగము జరగదు . లేదా , ఇంద్రుడు లేని యాగమును చేయాలి ." 

     " అంటే యాగము సహజముగా కాకుండా , సాహసముతో జరగాలి అన్నట్టే కదా ? " 

     " దానిలో ఎట్టి సందేహమూ లేదు . మీరిద్దరూ అసహజముగా పుట్టిన వారు . త్రిశంకుని ఆశ  కూడా అసహజమైనది . కాబట్టి మీరు చేయు కార్యము అసహజమైనది . ఈ సాహసముల వల్ల అరిష్టాలు కూడా జరుగును . అయితే ఆ అరిష్టాలేవి అన్నది పట్టించుకోకండి . ఎందుకంటే ,  ఆ అరిష్టాలను చూచికూడా చూడనట్టు ఈ కార్యములో నిమగ్నమగుటకు మీకు సాధ్యమే కాదు . అవి తప్పక మీకే తెలుస్తాయి .  మీలో ఒక్కడు రుద్ర విద్యను తెలిసినవాడు . ఇంకొకడు వరుణ విద్యను తెలిసినవాడు . మీరిద్దరూ చేరి మొదట అశ్వినీ దేవతలను  మెప్పించండి . వారు అగ్ని , వాయువుల రహస్యములు తెలుపుతారు . తరువాత ఏమి చేయాలన్నది మీరే తెలుసుకోవలెను . అయితే ఒక్క హెచ్చరిక . మీ మీ బుద్ధి శక్తులన్నిటినీ ప్రయోగించండి . దాని తర్వాతనే సంయమమునకు రావలెను . మీరు మాటిమాటికీ సంయమము చేస్తే , అంతః పురుషుడు సరిగ్గా వాణి ని వినిపించడు . " 

     అథర్వుడు వెళ్ళిపోయాడు . : జమదగ్ని , విశ్వామిత్రులు మరల ప్రార్థించి , అతనిని ఇంకొక ఘడియ నిలవమని కోరినారు . విశ్వామిత్రుడు అడిగెను , " మహర్షివర్యా ! ఈ యాగమునకు బ్రహ్మ కాగల యోగ్యత ఎవరికి ఉందో తెలియదు .( ఏ యాగమునకైనా , నాలుగు వేదాల ప్రతినిధులూ ఋత్విక్కులుగా ఉండవలెను . అందులో అథర్వణ వేదమునకు ప్రతినిధిని  బ్రహ్మ అని , అతని స్థానమును ( నైఋతి ) బ్రహ్మ స్థానమనీ అంటారు . ఇతని పని యాగమును రక్షించుట . )   అరిష్టాలు జరుగుతాయని తమరు సెలవిచ్చారు . ఆ అరిష్టాలనుండీ యజ్ఞము చెడిపోకుండా కాపాడ గల బ్రహ్మ ఎవరు అన్నది అనుగ్రహించవలెను . " 

     అథర్వుడు మందహాసము చేసి , " కౌశికా , బాగానే అడుగుతున్నావు , యజ్ఞ దీక్ష తీసుకున్న వాడేమో చండాలుడు . అధ్వర్యుడేమో క్షత్రియుడు ( యజుర్వేదానికి ప్రతినిధి , అతని ఆధ్వర్యములో జరుగు యాగము ) , ఉద్దేశమేమో , సశరీరముగా శాశ్వత స్వర్గ వాసము . దీనికి మహర్షులెవరు వస్తారు ? ఏదేమైననూ ఇది  భరతులూ , భార్గవులూ నిర్వహించ వలసిన కార్యము . నీపై విశ్వాసముతో కొందరు , జమదగ్ని మీద భయముతో కొందరూ రావచ్చు . రానివారిని పిలచి అభాసు చేసుకోవద్దు . జమదగ్నియే బ్రహ్మ కానిమ్ము . అతను శాంత , ఘోర కర్మలనన్నిటినీ సంపూర్ణముగా తెలిసిన వాడు . ఒకవేళ అవసరమైతే , జమదగ్ని , నన్ను స్మరించవలసిన ప్రయోగము చెయ్యి . ( జమదగ్ని బ్రహ్మ స్థానము లో ఉంటాడు . అతడు మరే విచారములూ లేక , శాంతుడై ఉండవలెను . అతని పరముగా ఆ ప్రయోగము విశ్వామిత్రుడే చేయవలసి వచ్చును )  .. అది సిద్ధిస్తుంది . కానీ మరొక హెచ్చరిక . ఈ యాగము ముగియు వరకూ నీకు కోపము రాకూడదు . మీరు భార్గవులు . మీకు ముక్కుమీదే కోపము . నువ్వు కోపము చేసుకొంటే  యాగము చెడి పోతుంది . జాగ్రత్త ! " 

     అథర్వ మహర్షి వీడ్కోలు తీసుకున్నాడు . జమదగ్ని , విశ్వామిత్రులు అతనికి పునః పూజ చేసి , వీడ్కొలిపి , తమ ముందరి కార్యక్రమములో నిమగ్నమయ్యారు .  

18. "మంత్ర ద్రష్ట " పద్దెనిమిదవ తరంగము



పద్దెనిమిదవ తరంగము

     కౌశికుడు ఆశ్రమానికి వచ్చు వేళకు సంధ్య దాటి , రాత్రియైనది . అతనికి ఈ వేళ ఆకలి దప్పులు అంతగా లేవు . అసలు లేవనే చెప్పవచ్చును . అతనికి ఆ ’ జగత్ప్రాణపు ’ విషయము తప్ప ఇక మిగిలినవి కనిపించుట లేదు . తిరిగి సంయమనము చేసి కూర్చొని ఛాయా పురుషుని అడుగుదామా అంటే , ఎందుకో వద్దనిపిస్తుంది . " ఆత్మా రాముడు , నీకు భోజన వేళ అయినది  , లోపల వంట సిద్ధముగా ఉంది , స్నానం చేసి రా ... అంటూన్నాడు.అయితే ఇప్పుడు బలా అతిబలా విద్యలవలన ఆకలిబాధని తొలగించగలను , ఏమీ వద్దు , అంటూ ఒక్క ఘడియ ఏదో ఆలోచనలో ఉండిపోయాడు " 

     ఆశ్రమానికి వచ్చు వేళకు ఎవరో వచ్చి ఉన్నారు . చాలా సేపటినుంచీ కాచుకుని ఉన్నారట . విశ్వామిత్రునికి అయ్యో పాపం అనిపించి , ఎవరు మీరని   వివరాలడిగాడు . ఆ వచ్చినది త్రిశంకు మహారాజు . రాజ్యాదులనన్నిటినీ వదలి , ఏదో ఒక ఆశతో కనిపించిన ఆశ్రమాలన్నీ తిరుగుతున్నాడట . అతని కోరికను నెరవేరుస్తానని మాట ఇస్తే , అన్నీ వివరంగా చెపుతాడట ..

     విశ్వామిత్రుడు అతనికి తగిన మర్యాదలు , లఘువుగానే చేశాడు . 

     " మహారాజా , ఆయాసపడి వచ్చినట్టున్నారు . ఈ రాత్రికి విశ్రమించండి . రేపటిరోజు అన్నీ వివరంగా మాట్లాడుకుందాం " అన్నాడు . త్రిశంకునికి ఆత్రము ..... " లేదు , తమరే గతి యని వచ్చాను . మీవలన నా కోరిక తీరునని కొండంత ఆశతో వచ్చాను . అది తీరునా లేదా అని తెలిసే వరకూ నాకు తిండి కూడా సహించదు . " 

" నావలన నీ కోరిక  తీరునని ఎవరు చెప్పారు ? "

" సాక్షాత్తూ భగవానులే చెప్పారు " 

" భగవానులు అంటే ? "

" వశిష్టులు " 

" ఏమీ ? వశిష్ఠులా ? నావలన నీ కార్యమగునని చెప్పినారా ? " 

"ఔను "

     విశ్వామిత్రునికి ఆశ్చర్యమైంది . వెంటనే , త్రిశంకు ఆత్రానికి రెట్టింపైన ఆత్రముతో , ’ ఏమిటి ’ అని తెలుసుకోవాలని కుతూహలము . కానీ , తపస్వికి సహజమైన శాంతమును వీడక   అడిగాడు , " అట్లయిన మరి సందేహమేల ? భగవానుల అనుజ్ఞ అయినచో అది నెరవేరి తీరును . తప్పకుండా అవుతుంది , ఇక లేచి , భోజనము చేయి " 

     ఆశ్చర్య పోవుట  త్రిశంకుని వంతు ఆయెను . :" దేవా , నా కోరిక , కొండను పగలగొట్టి , సముద్రాన్ని తాగేయ వలెనన్నంత పెద్దది "

" కానిమ్ము , చింత లేదు . కావాలంటే ఇంకొక బ్రహ్మాండాన్నే సృష్ఠిద్దాము . "

" ఔను ఋషీంద్రా , ఆ కోరిక అంతటిదే ! నేను శరీరముతో స్వర్గానికి వెళ్లవలెను . " 

     విశ్వామిత్రుడు ఉలిక్కిపడ్డాడు . ఆశ్చర్యంతో , " ఏమిటీ ? "  అని మళ్ళీ అడిగాడు . 

     త్రిశంకునికి గాభరా. ఎక్కడ , నెరవేరదు అనేస్తాడోనని శంక. తనంతట తానే స్వరము కుంచించుకుపోగా , " సశరీరుడనై స్వర్గానికి వెళ్ళవలెను . " అన్నాడు . 

     విశ్వామిత్రునికి ఇంకా ఆశ్చర్యమే ... తానేమో , ఇదే శరీరముతో బ్రాహ్మణుడను కావలెనని ఆశ పడుతున్నాడు , ఇతడు ఈ శరీరముతో స్వర్గానికే వెళ్లవలెను అని ఆశ పడుతున్నాడు . ఇద్దరికీ బాగానే ముడిపడింది అని దీర్ఘముగా ఆలోచిస్తున్నాడు . 

     " సరే , వశిష్ఠులు నా వలన అవుతుంది అని ఎప్పుడు చెప్పారు ? "

     వశిష్ఠుని ఆశ్రమములో జరిగినదంతా త్రిశంకువు క్లుప్తముగా వివరించాడు . 

     కామ్య కర్మము కాబట్టి వశిష్ఠులు చేయుటకు వీలు కాదన్నారు . అరుంధతీ దేవి మాతృసహజమైన వాత్సల్యముతో ఇష్టార్థ సిద్ధి అవుతుందన్నారు . మరల భగవానుల వద్దకు పోవుటకు ధైర్యము చాలక , వశిష్ఠ పుత్రులవద్దకు వెళ్ళగా , అక్కడ మాటలలో  ఒకరు , వేరే ఎవరైనా సమర్థులను వెదకిన అగును కదా అన్నారు. ఇంకొకరు ,  కుల గురువును విడువ వచ్చునా ? అన్నారు . మరి ఒకరు , అలా వదిలితే చండాలత్వము వస్తుంది అన్నారు . అలా అన్నందుకు నేను ఖిన్నుడనై ఉన్నంతలోనే భగవానులే వచ్చి , " దక్షిణమునకు వెళ్ళు , అక్కడొక రాజర్షి ఉన్నాడు . అతని వలన నీ కార్యము కాగలదు . నువ్వు ఇంకొకడిని గురువుగా అంగీకరించనంత వరకూ ఈ చండాలత్వము నిన్ను తాకదు . " అని యనుజ్ఞ ఇచ్చిరి . ఇలాగయినది కదా , అన్న ఖేదమూ , కోరిక తీరగలదన్న మోదమూ ,  చీకటి వెలుగులవలె  మనసులో ఇల్లుకట్టుకొనగా , కొంతకాలము రాజధానిలోనే ఉన్నాను . అయితే , కోరిక తీవ్రత అధికమై , సశరీరుడనై నన్ను స్వర్గానికి పంపగల మహా తపస్వి నా చండాలత్వమును కూడా నశింప చేయలేడా ? అని మిమ్మల్ని వెతుక్కుంటూ ఇప్పుడు వచ్చాను . " 

     విశ్వామిత్రుడు అంతావిన్నాడు . :" వశిష్ఠులు తనను రాజర్షి అని పిలిచారు . కావాలంటే అతడు ఈ కార్యమును చేయగలడు అని కూడా అన్నారు . గురుపత్ని కూడా , ఇష్టార్థ సిద్ధి అగును అని ఆశీర్వదించారు. ఇంతవరకూ అనేకులు క్షత్రియులు దేవ కార్యార్థమై లోకాంతరములకు వెళ్ళి వచ్చారు . నహుషుడైతే , మానవదేహముతోనే దేవాధిపత్యమును నిర్వహించాడు . ఇలా ఉన్నప్పుడు , త్రిశంకువు , తాను స్వర్గానికి పోవలెను అనుటలో తప్పేముంది ? "  అని దీర్ఘముగా ఆలోచిస్తూ , ఇలా అడిగాడు , 

     " సరే , మహారాజా , నువ్వు అనేక యాగములను చేసినవాడివి . వాటి ఫలముగా నీకు స్వర్గము తప్పక దొరుకుతుంది కదా , ఇప్పుడెందుకు తొందర ? " 

     త్రిశంకువు చెప్పాడు , " దేవా , తమరు చెప్పింది నిజమే . నేను చేసిన యాగముల ఫలముగా ఈ దేహము పోయిన తర్వాత నాకు స్వర్గము  తప్పక దొరకును . అయితే , ఈ మానవ శరీరముతోనే స్వర్గానికి వెళ్ళి , అక్కడి భోగములను అనుభవించవలెను . " 

     " స్వర్గభోగములు ఎలా ఉండునో మనుషులకు తెలియవు. కానీ , నువ్వు దేహానంతరము స్వర్గానికి పోయి , అక్కడి భోగములను అనుభవించి మరల దేహమును ఆశ్రయించి పుట్టవలెను కదా. అప్పుడు , నువ్వే త్రిశంకువైన విషయమూ , స్వర్గములోని భోగములు అన్నీ నీకు గుర్తుఉండేటట్లు అయితే చాలుకదా , దానికోసము ఇంత ప్రయాస ఎందుకు పడాలి ? " 

     " దేవా , నిజంగా నామనసులోని అసలు విషయము ఇది . తమరు కూడా క్షత్రియులు కాబట్టి మీ దగ్గర చెప్పుతున్నాను . అపరాధమైతే క్షమించండి . ఈ దేవత లనువారు మనమిచ్చు హవిస్సుల వలన బలిసి , మనలనే పాలిస్తారు . శత్రుశేషము లేకుండా ఈ భూమినంతటినీ గెలిచి పాలించునట్లే , నా తపోబలము వలన స్వర్గాన్ని కూడా గెలిచానన్న కీర్తి గడించవలెను . ఇది నా మనసులోని కోరిక . భగవానులు ’ ఇది తప్పు ’ అని ఉంటే , అప్పుడే నా ఆశను తుంచివేసుకునే వాడిని . అసాధ్యమైన కోరికలను పట్టుకొని అల్లాడుట సాహసమే . కానీ వారు , నేనడిగినప్పుడల్లా , ’ చూద్దాం , చూద్దాం , ఎందుకు తొందర ? " అనెడివారు . దానివలన నా భావన ఇంకా బలీయమైంది . చివరికి వారిని కొంత బలవంత పెట్టాను కూడా . వారి మనసు నొచ్చుకుందేమో , వారి వలన హాని కాకున్ననూ , వారి సంతానము వలన హాని అయినది . " 

     " వారు చెప్పినట్లు ఈ ప్రయత్నమునే విరమించుకుంటే హాని తప్పుతుంది కదా ! " 

     " హాని తప్పించుకోవాలి , కోరిక కూడా తీరాలి అని తమరిని ఆశ్రయించాను . తమరే చెప్పండి , ఒక మనుష్యుడు స్వర్గాన్ని గెలిచాడంటే మానవత్వానికే గౌరవము కదా ? క్షత్రియుడు కాక , అందులోనూ , ప్రతాపశాలి యైన భాస్కరుడి వంశపు క్షత్రియుడు కాక , ఇంకెవరు ఈ సాహసమును చేయవలెను ? కాబట్టి , పూజ్య దేవా , తమరు పెద్ద మనసు చేసి , ’ అవుతుంది ’ అంటే , ఇంకా పది సంవత్సరాల తర్వాత ఐనా కూడా చింత లేదు . అంత వరకూ నేను కూడా ఒక ఆశ్రమములో , తమరి ఆజ్ఞ అయితే , ఇక్కడి ఒక మూలలో ఒక గుడిసె కట్టుకొని తపస్సు చేస్తూ ఉంటాను . " 

     విశ్వామిత్రుడు ఆలోచించాడు  : " స్వర్గమంటే కేవలము భోగ భూమి . నృత్య గీతాలు , భోగాలతో నిండి ఉన్నది . రాజ భవనపు భోగములతో విసుగు చెందిన రాజు , సుర భూమిలోని భోగాలను కోరుతున్నాడు . అంతే ! అక్కడి ఆ అప్సరసల సహవాసము , గంధర్వుల నృత్య గీతాలు , ఆ మందార నందనాలు ...... అన్నీ భోగి మనసును ఆకర్షిస్తే తప్పేమి ? నాకు కూడా ఎన్నో సార్లు వచ్చిన ఆలోచనే కదా ఇది ? ఇక్కడి క్షణిక భోగము వద్దని , అక్కడి నిరంతర భోగములు కావాలంటే తప్పేమి ? అయితే , ఇప్పుడు వీనిని నా శిష్యుడుగా అంగీకరిస్తే వీనికి చండాలము ఈ వెంటనే వస్తుంది . కాబట్టి ఇతడిని ప్రస్తుతానికి నిలిపి ఉంచుతాను . ఈ కార్యమును ఒప్పుకొని చేస్తే , అనన్య సాధ్యమైన కార్యమును చేశాడని నాకు కూడా కీర్తి వస్తుంది . అప్పుడు ఋషులూ , తపస్వులూ నన్ను వశిష్ఠుని వలెనే కాకపోయినా , వారికి సమానముగా నైననూ గౌరవిస్తారు . " అని పరి పరి విధములుగా పర్యాలోచన చేసి , చివరికి అన్నారు : 

     " భగవానులు చెప్పినట్లు ఇది కేవలము కామ్యము . అయినా నువ్వు క్షత్రియుడవైనందు వల్ల అది అంతగా తప్పు కాదు . భగవానులే చేయించవలసినది . అయినా , నిన్ను ఇక్కడికి పంపించారు . అలాగే చేద్దాము . కొంతకాలము నువ్వు ఆశ్రమములోనే ఉండు . ఇప్పుడే నువ్వు నన్ను గురువని అంగీకరించవద్దు . నేను నా మేనల్లుడు జమదగ్ని తో కూడా మాట్లాడతాను . నాకేమో చేయించుటకు ఇష్టమైతే ఉంది . కాని ఇటువంటి యాగమును ఇంతవరకూ ఎవరూ చేయించలేదు . అందుకని , విధానము , దేవతలు మొదలైన వివరములనన్నిటినీ తెలుసుకోవాలి . అంతవరకూ నువ్వు ఇక్కడే మిత్రుడవై ఉండు . " అన్నాడు . 

     ఆమాట త్రిశంకువు కు నచ్చింది . అలాగేనని , ఆ మహారాజు ఆశ్రమ వాసిగా మారాడు . 

17. "మంత్ర ద్రష్ట " పదిహేడవ తరంగము



పదిహేడవ తరంగము

      విశ్వామిత్రుడు సమాధి నుంచి లేచి ఇప్పటికి రెండు రోజులయింది. అతడు అలాగ పద్మాసనములో కూర్చొని , మనుష్య కాల మానములో ఇరవై ఆరు దినములయింది. దేహము ఏ విధమైన ఇబ్బందికీ లోను కాలేదు . 

     సమాధినుంచీ కళ్ళు తెరుస్తున్నంతలోనే , ఇద్దరు తేజోవతులైన దేవీ మూర్తులు కనిపించారు . సుప్రసన్నమైన మందహాసములతో , మధురంగా , మనోహరముగా నున్న ఆ దేవతా స్త్రీలు విశ్వామిత్రుడిని చూసి నవ్వారు . కౌశికుడు వారికి చేయవలసిన సత్కారములు సలిపి , " తమరు ఎవరు ? " అని విచారించెను . 

     వారు తమ కథను చెప్పారు . " మేము  ’ బలా ’ , ’ అతి బలా ’ అనే రెండు విద్యలము . ఆపోదేవి తమపైన కృపతో మమ్ములను తమకు అనుగ్రహించినారు . మా అనుగ్రహమునకు పాత్రులైనవారు దైవ కార్యముల యందుండు వరకూ  ఆకలిదప్పుల వల్ల కానీ , ఇంకేదైనా దేహ శ్రమ  , రోగరుగ్మతల వల్ల కాని బాధింపబడరు . " అన్నారు .

     విశ్వామిత్రుడు ఆపో దేవిని స్మరించెను . ఆమె వచ్చి , ఆ దేవతలకు సంబంధమైన మంత్ర పటలముల నన్నిటినీ రహస్యముగా ఉపదేశము చేసెను . ఆ విద్యా దేవతల అనుగ్రహము వల్ల అతనికి అంతవరకూ కలిగిన ఆయాసమంతా తీరిపోయెను . 

     అతనికి వెనకటి దంతా గుర్తొచ్చి , వామదేవుడు తనను కాపాడుతున్నాడు అన్నది మిక్కిలిగా ఆశ్చర్యమును కలిగించెను . ఆ రోజు వశిష్ఠాశ్రమములో జరిగిన సంఘటన , తాను హిమాలయములను విడచి వచ్చునపుడు జరిగినది , ఈ మధ్య తాను దర్శించిన దృశ్యములు ......ఇవన్నీ అతనికి వామదేవుని పైన అపారమైన గౌరవమును , భక్తిని పుట్టించెను . వామదేవుని కోసము అతడు ప్రాణము నిచ్చుటకైననూ సిద్ధము . అతని మనసుకు , రేపు లోకకర్త అయిన మహేశ్వరుడే వస్తే , అతడూ వామదేవుని రూపములోనే రావలెను అన్నంతవరకూ వచ్చింది . 

     ఇట్లే వామదేవుని ప్రభావమును గురించి చింతిస్తున్న మనసు , తాను సంయమములో చూచిన దృశ్యములు తలచి , " కావాలన్న , ఇంకొక బ్రహ్మాండమును సృష్టించ వచ్చు ’ అనే పల్లవిని పాడుతున్నది . దానికి వంత పాడునట్లు ,  వామదేవుడు హిమాలయములో చెప్పిన మాటలూ , దానికి  తోడుగా , " నువ్వు సృష్టించిన ఆ నూతన అస్త్రమును  బ్రహ్మ దండము మింగివేసినది . లేకపోతే అది వెళ్ళి ఎవరి పైననో పడి ఉంటే వారి గతి ఏమై ఉండెడిదో చూడవలసినది . " అని అతని మనసే అంటున్నది . 

     విశ్వామిత్రునికి ఆ కొత్త పుట్టుక ,  నూతన సృష్టి గురించే ఇంకా ఆలోచన . " అట్లయితే , ఎవరు ఏమి కావాలన్ననూ చేయవచ్చునా ? ఈ చరాచర సృష్టి అంతా సంతలో వ్యాపారము లాగేనా ? ధనము ఇచ్చి ధాన్యము తీసుకున్నట్టే , తపస్సు ఒక్కటుంటే , కావలసినది చేయవచ్చునేమి ?  ఇది నిజమేనా ?  " 

     మనస్సు మరల ధ్యానమునకు తిరిగినది . " ఇప్పుడు నేను చూసినదంతా కలో , నిజమో  తెలుసుకోవాలి . కల అంటే , మరి వామదేవుడినీ , ఋచికుడిని , కుశిక తాతనూ  చూశాను కదా ? అంతే కాక , నేను ఏ పనిచేసినా , ఎంత చేసినా దానివలన నాకు ఏ ఇబ్బందీ , శ్రమా కలుగుట లేదు . ఒకరు కాదు , ఇద్దరు కాదు ,... ముగ్గురి ప్రభావము నన్ను కాపాడుతున్నది . కాబట్టి ఇప్పుడే కార్యోన్ముఖుని కావలెను . ఊరికే కూచున్నచో ప్రయోజనము లేదు . బ్రహ్మాండమును చేయుటకు సమయము కావలెను. బ్రహ్మాండము కాకపోయినా , ఒక చిన్న పక్షి , ఒక తీగ ..ఏదో ఒకటి చేయవలెను ..." 

     మరల మనస్సు బహిర్ముఖమాయెను .  దానికి ఒకటే ఆలోచన : " చేయాలి -- చేయాలి  -- చేయాలి " .

     విశ్వామిత్రుడు బయటికి వచ్చి చూచెను . మధ్యాహ్నమయింది . సూర్యుడు తలపైకి వచ్చాడు . స్నానపు సమయము . నదికి స్నానమునకు బయలుదేరెను . స్నానము చేయునపుడు ఒక చేప ఇంకొక చేపను అంటుకొని వచ్చింది . రెండూ వచ్చి అతని తలపైన పడ్డాయి . రెండూ గిల గిలా కొట్టుకుని , ప్రాణము వదిలాయి . 

     కౌశికునికి ఆశ్చర్యమైంది . తనను ముట్టిన వెంటనే అవి ఎందుకు ప్రాణము వదిలాయి ? నేను విష పురుషుడనయ్యానా ? అక్కడే నిలుచున్నాడు . ఆ రెండు చచ్చిన చేపలను అక్కడే ఒక రాయిపై నుంచెను . ఇంకొక చేపను పట్టి ముట్టుకొనెను . అది కూడా గిల గిలా కొట్టుకుని చచ్చిపోయింది . దానిని ముట్టి తిరుగునంతలో అతని చేయి తగిలి ఒక కమలము వాడిపోయింది . 

     ఇక కౌశికునికి ఏ అనుమానమూ లేదు . గట్టుపై ఉన్న ఒక చెట్టు చిగురును పీకి తీసుకున్నాడు . అతడు ముట్టగానే అది మంటకు గురైనట్లు ముడుచుకొని ,  వాడి , ఎండి పోయింది . అట్లన్న , తన దేహము నుంచీ ఏదో ఒక దాహ శక్తి బయటకు వస్తుండాలి . ?  అదేమిటి ? 

     అతడు అక్కడే కూర్చొనెను . శ్వాస పీల్చి , కుంభకములో ఉంచి , తన దేహమును చూసుకున్నాడు . స్థూల దేహములో చర్మము మొదలుకొని , ఎముకల వరకూ  సప్త ధాతువులూ ఉజ్జ్వలమై వెలుగుతున్నాయి . కాలిన లోహపిండము దీపములాగా వెలగకున్ననూ , ఎర్రగా అగ్ని గోళము వలె కనపడునట్లు , సప్త ధాతువులూ జ్వలిస్తున్నాయి . సూక్ష్మ దేహములో పంచ ప్రాణములూ , వాటి భాగములూ ఒక్కొక్క దీపము వలె కిరణములను ప్రసరిస్తున్నాయి . ఆ కిరణాలు ఒకదానికొకటి తోడై , అన్నీ చేరి ఒక దీపమైనట్లున్నవి . శరీరములోని నానా భాగములనుండీ బయలు వెడలిన కిరణాలు వచ్చి ఈ దీపాన్ని వెలిగిస్తున్నాయి . 

     కౌశికునికి  మరల ఆశ్చర్యమైంది . ఆ తేజస్సును ధ్యానించెను . తనవలెనే ఉన్న ఇంకొక తేజోమయ మూర్తి అంగాంగములెల్ల ప్రతిబింబించినట్లు కనిపిస్తూ , కౌశికుని ఎదురుగా అద్దమును ఉంచి చూపించినట్లే , అతని ఎదురుగా ప్రతికౌశికుడై , ఒకడు కూర్చున్నాడు . అతడు మాట్లాడెను . 

     " ఈ జ్యోతి బయటిది కాదు , నీదే ! దేహ దేహములలోనూ ప్రాణాపాన గతులు ఉంటాయి . ఈ ప్రాణాపానముల మథనము వల్లనే అగ్ని పుట్టి దేహమును వెచ్చగా ఉంచునది . ఎవరైతే ప్రయత్న పూర్వకముగా ఈ ప్రాణాపాన మథనమును నిలిపెదరో , వారి దేహములో విశేషమైన శాఖము పుట్టును . ఆ శాఖములో దేహము ఎంత ధరించగలదో అంత తాను ఉంచుకొని , మిగిలినదానిని బయటికి వదలును . బాగుగా కాలిన లోహపు పిండము తన వేడిని , తనను తాకిన వారికందరికీ పంచునట్లే , నీ దేహము తనలో ఉన్న ఉష్ణమును తన సంపర్కము పొందిన పదార్థములన్నిటికీ , జడ - చేతనములు అన్న భేదము లేకుండా ఇస్తుంది . కొన్ని ఆ వేడిని సహిస్తాయి . కొన్ని సహించలేవు . " 

" మరి , ఆ జ్యోతి ఏమిటి ? " 

     " అది , పంచ ప్రాణములూ , వాటి మాత్రలూ వెదజల్లిన కిరణాలు అన్నీ చేరి ఏర్పడినది . దానిని ప్రాణ జ్యోతి అంటారు. " 

     " ఆ చేపలూ , కమలమూ , చిగురూ నేను ముట్టగానే కాలి పోయాయి కదా , అదెందుకు ? "

     "  అప్పుడే చెప్పాను కదా . వాటిలో ఉన్న ప్రాణమును ఈ ప్రాణ జ్యోతి ఆకర్షించినది . దీని ఉష్ణమును వాటి దేహాలు తట్టుకొనలేదు . దానివలన అవి చచ్చిపోయాయి " 

     " ఇప్పుడు అవి బతకగలవా ? " 

     " వాటి ప్రాణమును వాటికి ఇస్తే బతికేతీరతాయి . సందేహమా ? " 

     " ఆ ప్రాణమును తిరిగి ఇచ్చుట ఎలాగ ? "

     " ఆ ప్రాణ జ్యోతిని చూచిన వాడికి , సంకల్పానికీ - సిద్ధికీ ఎక్కువ దూరము ఉండదు . నిస్సంకల్పముగా వెడలిన ప్రాణ జ్యోతి తేజము కాల్చివేస్తుంది . ససంకల్పముగా వెడలితే , అదే సృష్టిస్తుంది . " 

     " నువ్వు ఎవరు ? " 

     " నేను నీ ఛాయా పురుషుడను " 

     " నేను పిలచినపుడు వస్తావా ? " 

     " నేను నీ ఛాయను , అంటే నీకు వశుడను . నువ్వు ’ పాంచభౌతికమైన దేహము నేను కాదు ’  అని  తెలుసుకున్నపుడు  , నేను వేరుగా కనపడుతాను . ప్రాణ జ్యోతిని చూసినపుడు కనబడతాను . బ్రహ్మాండమునకూ , పిండాండమునకూ సామరస్యము ఉందని చూపించు క్షేత్రమును నేను . " 

     " అట్లయితే , బ్రహ్మాండములో , ఎక్కడ ఏమున్నదో చూపించగలవా ? " 

     " భూత సమూహముతో నిండిన దేశము నందున్న నువ్వు , కాల దేశములను మీరలేవు . నేను నీకు వశుడనయిననూ , నాకు కాల దేశాల హద్దు లేదు . లోకలోకములు వేరే వేరే గ కనపడునది , కాల దేశముల భ్రాంతి వలన. ఆ భ్రాంతి తొలగగానే , అంతా కర తలామలకము అగును . " 

     " నాకేమి కావాలన్నా నిన్ను అడగవచ్చునా ? " 

     " అప్పుడే చెప్పాను కదా . నీ దేహము నీ కొలబద్ద . నువ్వు దాని పట్టులో ఉన్నంతవరకూ , దాని వలెనే సాంతుడవు , అనంతుడవు కాదు . " 

     ఇంకా అడుగుటకు కౌశికునికి మనసు రాలేదు . ఎందుకో , ఏమో  అక్కడికే మాటలు నిలిపేశాడు . ఎదురుగా నున్న బింబము కరగుట  ఆరంభమయ్యింది . మళ్ళీ అడిగాడు , " ఇదెందుకు కరగుతున్నావు ? " 

     " ఎక్కడో దూరము నుండీ పలికినట్లు వినిపించెను : " నీ మనసు ఇంకే వైపుకో తిరిగింది. " 

     ఇంకొక ఘడియలోపల మరల తేజోబింబము . మరలా కరగింది. కౌశికుడు కనులు తెరచాడు . సాయంకాలము కావస్తున్నది . కూచున్న రాయి కాలి , చురచుర మంటున్నది . కౌశికునికి మననమైంది , " ప్రాణజ్యోతిని చూసినవాడికి సంకల్పానికీ - సిద్ధికీ దూరము లేదు " 

     ఆ చేపలను తాకి , ’ ఇవి బతుకును ’ అనెను . ఆ మూడు చేపలూ ఎగిరి నీటిలో పడి పారిపోయెను . కమలమును ముట్టి ’ బతకాలి ’ అనెను . కమలము మరల వికసించింది . చిగురు మరల పచ్చనై కళకళలాడింది . 

     కౌశికుడు సంధ్య వేళ వరకూ అక్కడే రాయిపైనే కూర్చున్నాడు . అతని చేయి తనపైనున్న తల యొక్క భారమును మోస్తున్నది . తల  , ఆలోచనల భారము చేత వంగినట్లు , ముందుకు చాచుకున్నది .  అతనికి ఒకటే ఆలోచన : " ప్రాణమంటే ఇంతేనా ? కావాలంటే ఇవ్వ వచ్చు . వద్దంటే తీసుకోవచ్చు . దీనికోసము లోకమెందుకు ఆరాట పడుతుంది ?  ప్రాణమనేది పాత్రలోకి నీరుపోసినట్లు , దానినుండీ వంపుకున్నట్లు గా అయిందే , అట్లయితే , ఈ ప్రపంచములోని అందరి ప్రాణములనూ తనలో నింపుకున్న ప్రాణమొకటి ఉండాలి . దానివల్లనే ఈ ప్రాణ ప్రాణములూ బతికి ఉండాలి " అని , ఏమేమో ఆలోచనలు వచ్చాయి .

Friday, June 15, 2012

16. " మంత్ర ద్రష్ట " పదహారవ తరంగము


పదహారవ తరంగము

కౌశికుడు ఆ తేజపు పరిచయము కోరెను. తేజస్సు రూపమును ధరించెను . అవ్యక్తమైన తేజోరాశి గా ఉన్నది , సాకారముగా , ఒక మూర్తీబింబమై నిలిచింది . చూడగా , అది ఒకటికాదు , మూడు బింబములు . 

మొదటిది తనకు గురువని చెప్పతగ్గ వామదేవుడు . రెండవది , ఎవరో ఒక రాజర్షి . మూడవది , ఇంకెవరో ఒక బ్రహ్మర్షి . ముగ్గురూ నిలుచున్నారు . ముగ్గురినీ మరల కౌశికుడు భక్తితో  పూజాదుల చేత సత్కరించెను . ముగ్గురికీ ఆసనాదులను కల్పించెను . ఆ తేజోమూర్తులు సావధానముగా ఆసనములలో కూర్చున్నారు . పార్థివ శరీరము ధరించి వచ్చిన వారి వలెనే మాట్లాడినారు . 

వామదేవుడు మొదట మాట్లాడినాడు . : " ఆ దినము నువ్వు మా ఆశ్రమములో నాకు నమస్కారము చేసినపుడు , నా దేహము నుంచీ నీ దేహమునకు ఏదో వచ్చినట్లు అయ్యెను కదా ? అదే నేను . ఇదిగో , నా కుడి పక్క ఇతడు నీ పితామహుడైన కుశికుడు . నాకు ఎడమ పక్క ఇతడు , ఋచీక మహర్షి.  మహాత్ముడైన ఈ కుశికుడు , ఋచీకుని పితామహుడైన చ్యవన మహర్షికి అతనికి అవసరమైన విధముగా సర్వ సేవలు చేసినాడు . దానివలన ప్రీతుడైన చ్యవన మహర్షి , కుశికునికి కావలసిన వరము ఇస్తానని చెప్పెను . అప్పుడు కుశికుడు , ’ తాను బ్రాహ్మణుడై , తపస్వికూడా కావలెనని ’ కోరెను . దేవేంద్రునితో సమానుడైన నరేంద్రుడై ఉండి కూడా , అది రుచించక తపస్సునూ , బ్రాహ్మణ్యమునూ కోరిన ఇతనిని చూచి చ్యవనుడు మిక్కిలి ఆశ్చర్యపోయి , ’ నీ కోరిక విఫలము కాదు . నీకు బ్రాహ్మణుడవగల యోగము లేకున్నా , నీ కుమారుడు బ్రాహ్మణుడు కాగలడు . నీ సంకల్పము నీలో కాకున్నా , నీ మనవడిలో సఫలమగును " అని అనుగ్రహించినాడు . 

" ఇక , ఈ ఋచీకుడు నీకు బావ. ఇతడు నీకు తెలుసు . నీ తండ్రి బహుకాలము అపుత్రుడై ఉండి , పుత్రార్థియై తపస్సు చేసినపుడు , అతనికి ఆ తపఃఫలముగా సత్యవతి అను ఒక కూతురు పుట్టినది . ఈ ఋచీకుడు సత్యవతిని వివాహమాడ దలచినపుడు , నీ తండ్రి ఇతనిని కన్యా శుల్కము గా ’ ఒక చెవి మాత్రము నల్లగా ఉండి , దేహమంతా చంద్రుని వలె ధవళ కాంతితో ఉన్న ఎనిమిది వందల గుర్రములను ’ అడిగెను . ఋచీకుడప్పుడు వరుణుని అనుగ్రహము వలన ఆ గుర్రములను పొంది , కన్యా శుల్కము చెల్లించి , సత్యవతిని పెళ్ళాడెను . " 

నీ తల్లి  మరియూ సోదరి ఇద్దరూ , పుత్రులు కావలెనని ఇతనిని ప్రార్థించగా , ఇతడు రెండు చరువు లను కల్పించి , ( చరువు అనగా , వడ్లు దంచి , బియ్యము చేసి , ఆ బియ్యముతో అన్నము చేసి , అగ్నికి ఆహుతిగా ఇచ్చునది ) ఒక దానిలో బ్రహ్మ తేజస్సునూ , ఇంకొక దానిలో క్షాత్ర తేజస్సునూ ఆవహించి , భార్యకు ఇచ్చి , " బ్రహ్మ తేజపు చరువును నువ్వు తీసుకో , క్షాత్ర తేజపు చరువును మీ తల్లికి ఇవ్వు . మీరిద్దరూ ఋతుస్నానము చేసిన రోజు , నువ్వు ఔదుంబరినీ ( మేడి ) , ఆమె అశ్వత్థమునూ సేవించి , మీ మీ చరువులను స్వీకరించండి " అని చెప్పెను . అయితే , తల్లీ బిడ్డలు , దైవ ప్రేరేపితులై , తమ సంకల్పము చేతనే , చరువులను మార్చుకున్నారు . దాని ఫలముగా , నువ్వు గాధిపత్నికి పుట్టినావు ( విశ్వామిత్రుని తండ్రి పేరు గాధి ) . సత్యవతి , తాను చేసిన తప్పును ఒప్పుకుని , క్షత్రియుడు తన గర్భమున వద్దని ప్రార్థించెను . అప్పుడామె గర్భమున జమదగ్ని పుట్టెను . జమదగ్ని కొడుకైన పరశురాముడు , క్షత్రియ కులాంతకుడై , క్షాత్ర తేజో విశిష్టము కల బ్రాహ్మణుడు . నువ్వు బ్రహ్మ తేజో విశిష్ఠుడవైన క్షత్రియుడవు . .... నిన్ను చూడ వచ్చిన వీరిద్దరికీ నువ్వు పూజ చెయ్యి . ఈ దినము ఇటుల నీకు వీరి కథ చెప్పాలని ఇక్కడికి పిలుచుకొని వచ్చాను " . 

విశ్వామిత్రుడు ఆ మాట విని పరమ సంతోషముతో వారికి విశేషముగా పూజ చేసెను . ఆ బ్రహ్మ , క్షత్రియ తేజో రాశులు రెండూ అతనికి ’ ఇష్టార్థ సిద్ధి అగుగాక ’  యని  ఆశీర్వాదము చేసి మాయమయ్యెను . వామదేవుడు విశ్వామిత్రుని కోరికపై , ఇంకొక ఘడియ అక్కడే ఉండెను . 

విశ్వామిత్రుడు , వామదేవుని ఉపకారము ఎంతటిదో గ్రహించాడు . అది అతని హృదయానికి తెలుసు . దానిని చెప్పాలని వాక్కు ఎంత ప్రయత్నించినా వీలు కాలేదు . తోచీ తోచని మాటలతో ఇట్లనెను , " వామదేవా , ఎప్పుడెప్పుడు దేవతలకు కోపము వచ్చి నేను హతము కావలసి ఉండెనో , అప్పుడు నువ్వొచ్చి కాపాడినావు . తండ్రి , తనయుని కాపాడుట కన్నా ఎక్కువగా నువ్వు నన్ను కాపాడావు . నువ్వు నాకు చేసిన ఉపకారము ఇంతా అంతా కాదు . ఈ ఋణమును నేను ఎలా తీర్చగలను ? " అని వేడుకొనెను . 

వామదేవుడు నవ్వి అన్నాడు , " పిచ్చివాడా , ఉపకారము , ఋణము అని ఏదేదో మాట్లాడుతున్నావు . సూర్యుడు తన కిరణములతో సంగ్రహించిన ఉదకమును పర్జన్యుడు మరల వానగా వర్షించును . భూమి ఎవరికి ఋణము తీర్చాలి ? తనలో ఉన్న నీటిని పైకి చేదుకున్న ఆదిత్యునికా ? లేక మరలా తనకే వర్షముగా ఇచ్చిన పర్జన్యునికా ? అలాగే , అగ్నిదేవుడు మనకు ,  ఎవరికీ తెలియని వైశ్వానర విద్యను అనుగ్రహించినాడు . నేను నీకు ఆ వైశ్వానర విద్యను ఇవ్వాలని ఇంతవరకూ నీ జతలో ఉన్నాను . అయితే నీకు ఈ రోజు , మీ పూర్వజుడైన సింధు ద్వీప మహర్షి అనుగ్రహము వలన జలదేవతల ప్రసాదము దొరికి , ’ అపాం నపాత్ ’ స్వరూపము తెలిసింది . నువ్వు ఇంకా కృషి చేసి ఆవిద్యను ఉత్తేజిత పరచుకో . నువ్వు సమాధిలో చూసినది ఆపోజ్యోతి . సృష్టి యొక్క పూర్వ రూపమయితే అది ఆపోజ్యోతి . సృష్ఠి యొక్క ఉత్తర రూపమయితే అది అపాం నపాత్ . బ్రాహ్మణుడు కావలెననుకొన్నవాడు సర్వ ప్రయత్నముల చేతనూ ఈ ఆపోజ్యోతిని చూడవలెను . దీనినే , నచికేతునికి యముడు చెప్పినది . దీని పూర్వ స్వరూపము ప్రణవము . దీని అనుగ్రహము కోసమే అందరూ తపస్సు , బ్రహ్మచర్యమునూ పాటించేది . అదృష్టవశాత్తూ ఇది నీకు దొరికింది . "  

" నిజానికి నువ్వు జన్మతః బ్రాహ్మణుడవే అయిఉంటే , నీకు ఈ సాహసపు బుద్ధి  ఉండేది కాదు . నువ్వు సౌమ్యుడవై , దేవతల ఆసరా కోసము వేచి కూర్చొనేవాడివి . క్షత్రియుని రక్తము , బ్రాహ్మణుని తేజస్సు. అందుకే ఇటువంటి సాహసము చేసి నువ్వు ఆపోజ్యోతిని దర్శించావు . ఇది లోకపు అదృష్టము . " 

" నువ్వు ఋణము గురించి మాట్లాడుతున్నావు . ఇంకొన్ని దినములు కానివ్వు . ఈ భువన బ్రహ్మాండాలన్నీ ఒకటే అనునది నీ మనసుకు గోచరము కానివ్వు . ఆ దినము వరకూ , ఈ ఋణము మాటను అట్టిపెట్టి ఉండు . ఆకులు వాయు భక్షకములై మొక్కను పెంచును . వేర్లు జల భక్షకములై మొక్కను పెంచును . ఆకు తాగిన  వాయువును వేరూ , వేరు తాగిన నీటిని ఆకులూ త్యజిస్తాయి . మొక్కకు ఈచివర ఆకు , ఆ చివర వేరు . అలాగే మనమందరమూ ఒకే మొక్క యొక్క ఆకులు , వేర్లూ వలెనే అని నీ మనసుకు అర్థమయితే , అప్పుడు , ఈ సృష్ఠి యొక్క కేవలము నాలుగైదు ఘట్టముల లో కనపడు ఈ వైవిధ్యమునూ , ద్వైతమునూ దృష్టిలో పెట్టుకొని ఆడు మాటలు నిలబడతాయా ? అలాగైన , ఋణము లేదా అనవద్దు . బ్రహ్మాండ కవాటమును ఛేదించి పోవువరకు ఋణ -ఋణి  భావము ఉంటుంది . ఎంతవరకూ , మన కంటికి జడ -చైతన్యములు , స్త్రీ- పురుషులూ మొదలగు భేదము కనిపించునో , అంతవరకూ ఉంటుంది . " 

" నేను ఏ దేవతల అనుగ్రహము వలన ఋషి అయ్యానో , ఆ దేవతలను హవిర్ముఖముగా అర్చించు . సత్యమును తెలుసుకొని బోధించు . లోకపు స్థితిని విశృంఖలుడవు  కాకుండా పాలించు . అప్పటికి నువ్వు అనృణి ( ఋణము తీరినవాడు ) అయ్యెదవు . " 

విశ్వామిత్రుడు ఆమాటలను వింటూ వింటూనే , జోలపాట వింటున్న శిశువు ,  ప్రయత్నము లేకుండానే నిద్రావశుడగునట్లు , సమాధి స్థితికి వెళ్ళెను . వామదేవుని మాటలన్నీ ఆ సమాధి స్థితికి వెళ్ళిన విశ్వామిత్రుని మనసులో వజ్ర ఖచితములైనట్లే నిలిచెను . 

సమాధికి వెళ్ళి , వృత్తి రహితుడై , శిలా స్తంభము వలె కూచున్న విశ్వామిత్రుని చూచి వామదేవుడు " రాతికి ఒక ఆకారము వచ్చింది . ఇక బొమ్మ కావలెను . దానికి ప్రాణము రావలెను . ఇంకా ఎంత దూరము !!  గురుదేవుని ఆజ్ఞ  మేరకు మొదటి మెట్టు అయింది . నాటిన మర్రి కొమ్మ చిగురించింది . ఇంకా ఇది మహా వృక్షము కావలెను . అవుతుంది , దానికేమీ సందేహము లేదు.. " అని సంతోషముతో తల ఊపి , అక్కడే అదృశ్యుడాయెను . 

15 . మంత్ర ద్రష్ట " పదునైదవ తరంగము




పదునైదవ తరంగము

     కౌశికుడు వింధ్యను దాటి దక్షిణమునకు వచ్చాడు . వింధ్య పాదమున ప్రవహించు రేవానదీ తీరము అతని మనస్సుకు సుందరముగా , హాయిగా అనిపించి , అక్కడనే ఆ జంబు వృక్షముల నడుమ ఒక పర్ణశాలను కట్టుకొని తపస్సు కై నిలిచాడు . " నేను ఇక ముందు అందరికీ మిత్రుడనై ఉండాలి , ఏమి జరిగిననూ , నావలన ఎవ్వరికీ , ఏ రీతిలోనూ కీడు జరగకూడదు " అని సంకల్పించుకొని , తనకు ’ విశ్వామిత్రుడు ’ అని పేరు పెట్టుకున్నాడు . 

     అతని తపస్సంపత్తి అతనికి ఖ్యాతి తెచ్చి పెట్టింది . ఏ ఆశ్రమమునందు చూచిననూ , విశ్వామిత్రుని మాటే . వశిష్ఠుల వంటి బ్రహ్మర్షుల పైననే దాడి చేసినాడని అందరికీ ఒక విధమైన అబ్బురము , గౌరవము కూడా ! ఎవరైనా వచ్చినపుడు అకస్మాత్తుగా ఆ వృత్తాంతము గురించి అడిగేవారు . అప్పుడు కౌశికునికి సిగ్గు కలిగి , " అదొక సాహసము . అయితే అదే ప్రవృత్తి నాకు బలమై ఉండి ఉంటే , నేను తపస్వి అయ్యేవాడినా ? అప్పుడు ఓడిపోయినది మంచికే జరిగింది " అని నవ్వేవాడు . కానీ , తాను ఇప్పుడు చేస్తున్న తపస్సు ఉద్దేశమేమిటి అన్నదానిని మాత్రము ఎవరికీ చెప్పడు . ఎవరైనా బలవంతపెట్టి , రెట్టించి అడిగితే  , " నాకిప్పుడు చేసేందుకు వేరే  ఇంకేమి పని ఉంది ? " అనేవాడు . ఇలాగే , నిష్కామముగా  తపస్సు చేస్తున్నాడని అతని ఖ్యాతి ఇంకా పెరిగింది . ఎక్కడెక్కడి ఆశ్రమములలోనూ , రాజర్షి విశ్వామిత్రుని వృత్తాంతము తెలియని వారే లేరు . అతని దగ్గర అస్త్ర విద్యను సంగ్రహించుటకు అనేకులు వచ్చారు . అంతమందిలో ఏ ఒకరికో మాత్రమే ఆ విద్యను ఉపదేశించేవాడు . అయితే , అతనికి దిగులు . శత్రుత్వము తో కూడుకున్న ప్రవృత్తి ఉన్నపుడు , చెడు సంకల్పముతో సంపాదించిన విద్య. దానిని ఇతరులకు ఇచ్చిన , వైర ప్రవృత్తి పుట్టినచో ?  అని ఉలుకు . 

     ఆతని వేదాధ్యయనము బలమైంది . అతని అధ్యయన క్రమమే వేరు . అతను ఒక మంత్రమును ఆరంభిస్తే , దేహతత్త్వములో దాని పరిణామమేమిటి ? జగత్తత్త్వమందు దాని పరిణామమేమి ? ఆ మంత్రము వలన దేవత యొక్క యే రూపము ప్రసిద్ధమగును ? ఆ రూపమునకూ , అండ పిండ బ్రహ్మాండములకూ సంబంధమేమిటి ? ఆ రూపము ఆ దేవతకు ఎందుకు వచ్చింది ? అనివార్య కారణముల వల్లనో , నైమిత్తిక కారణముల వల్లనో వచ్చి ఉంటే , దాని నిత్య స్వరూపమేమిటి ? జగత్తులో దాని సృష్టి ఎందుకు జరిగింది ? ఆ దేవత స్థితికి గల ఉద్దేశమేమి ? ఎప్పుడు లయమగును ? అది ఎంతకాలానికి ఒకసారి , రూపాంతర , నామాంతరములను పొందును ? ఆ రూపాంతర , నామాంతరములు చెందినపుడు , దానికి పూజ ఎవరి వలన , ఎక్కడ జరుగును ? ఇటువంటి నిగూఢములైన విషయములను అర్థము చేసుకొనును . ఋక్కు అయినా , యజుస్సు అయినా , అథర్వణ మయినా , సామము చేసి ఉపబృంహణము చేసెడివాడు . అప్పుడప్పుడు ఇలాగ దేవతా రహస్యమును ఛేదించునపుడు , ఒక్కొక్క సారి ఆదేవత కోపానికి పాత్రుడగును . అప్పుడు , ఏదో ఒక తెలియని తేజస్సు వచ్చి , తనను ఆవరించి నిలచి , ఆ దేవత కోపము నుండీ రక్షించును . అయినా , ఆ దేవత కోపమునుండీ కలిగిన తిరస్కారము కొంత కాలమైననూ అతనిని మ్లానము చెయ్యకుండా వదలదు . అటువంటి సందర్భములలో అతడు ఆశ్రమమును వదలి బయటికి పోవును .  లేదా, కందమూలాలు , గడ్డలు , చిలగడ దుంపలు అన్నిటినీ మరచి , ఎనిమిది పదిరోజులైనా , స్నాన పానాదులు లేక గుడిసె లోనే ఉండిపోయేవాడు . 

     దేవతా కోపము వచ్చినపుడు తనను కాపాడుచున్న ఆ తేజస్సు ఏది అని తెలుసుకోవాలని కుతూహలము . అయితే , ఎవరిని అడగాలి ? ఇలాగే  ఇదే ఆలోచనలో ఉన్నపుడు , వామదేవుడు చెప్పిన మాట గుర్తుకొచ్చెను . మనస్సు కు ప్రశ్న వేసిన , అదే సమాధానము ఇస్తుంది అన్న మాట గుర్తొచ్చి , " అయ్యో , నా పిచ్చితనము కాకపోతే , దేవతల రహస్యమునే ఛేదించగలిగిన వాడికి ఈ తేజస్సు రహస్యము ఛేదించుట తెలియదా ? చూద్దాము ." అనుకొనెను . అయితే , ఆ తేజస్సు దేవతా కోపము వచ్చినప్పుడు మాత్రమే కనిపించును , ఇతర కాలములలో కనపడదు . ఏమి చేయుట ? 

     కౌశికుని మనసు బెదరలేదు . దేవతలందరిలోను , ఆపో దేవి మిక్కిలి దయార్ద్ర హృదయము కలది . ఆ దేవి , " ఉశతీరివ మాతరః " పిల్లలను ఎత్తుకోవాలని వచ్చు తల్లి వంటిది . వారిని పిలచి , వారి దయ వలన ఈ తేజస్సు యొక్క రహస్యము ఛేదించవలెను అనుకొని సిద్ధమయ్యాడు. 

     ఆపో దేవి మంత్రములు ఇంకొన్ని ఉన్నాయి . దేనిని తీసుకోవాలి ? ఒక్కొక్క దానిగురించి యోచనలో పడి , చివరికి ఒక మంత్రాన్ని వెతుక్కున్నాడు . దానినే ఆవృత్తి చేయుచూ , ఒకో సారి దాన్నే సామముగా ఉపబృంహణము చేస్తూ ,  దాని అర్థమును మనసులో పరిభావన చేస్తూ కూర్చున్నాడు . అది గాయత్రీ ఛందస్సు లోని మంత్రము . మూడు పాదాలు , పాదానికి ఎనిమిదెనిమిది అక్షరాలు . 

 దాని అర్థము , " నీలోఉన్న శివతమమైన ( మిక్కిలి సుఖకరమైన )  రసము ఏదో , దానిని తల్లులు పిల్లలకు స్తన్యమిచ్చునట్లు నాకు ఇవ్వుము " అని.

     ఇరవై నాలుగు దినములాయెను . ప్రాణ వాయువు యొక్క ఊర్ధ్వ గతినీ , అపాన వాయువు యొక్క అధోగతినీ బంధించి నిలిపి , మనస్సు నుంచీ శ్వాస వరకు అంతటినీ ఆపో దారికి వచ్చునట్లు చేశాడు. దేహములోని భూతములన్నీ ఆపో గతినే పట్టి తూగుతున్నాయి . లోకములో ఎక్కడినుంచీ ఎక్కడివరకూ ఆపో భూతము ఉన్నదో , అక్కడంతా , విశ్వామిత్రునికి అప్రతిహతమైన ( అడ్డు లేకుండా ) గతి ( గమనము ) వచ్చెను . ఆపో దేవి సహజముగా సరళమైనది . దయాసంపన్నురాలు . వారు తమ రహస్యముల నన్నిటినీ విశ్వామిత్రునికి చూపిస్తూ వస్తున్నారు . విశ్వామిత్రుడు అన్నిటిని చూస్తూ వస్తున్నాడు . ఆపోదేవి వచ్చిన చోట్లెల్లా , ఒక్కొక్క జ్యోతి ఆమె వెనకే వస్తున్నది . వారి ఒక్కొక్క రహస్యము తెలుస్తున్న కొద్దీ , కౌశికుని దేహములో ఒక్కొక్క భాగము శుద్ధమై , వీణ తంతి పలికినట్లు పలుకుతున్నది . చివరికి అతడు ఆ దేవిని , ఈ తేజస్సు ఎవరిది అని అడుగుతాడు . వారు నవ్వుతారు . ముందర దృశ్యము గోచరమైంది . 

     మంద్రముగా వెలుగు ఉన్న సముద్ర లోకమొకటి . అక్కడ , ఎటు చూసినా నీరే ! పైన , కింద, మధ్యలో ..ప్రతిచోటా నీరే ! అది నీరా లేక నీటి వంటి ఇంకొక ద్రవమా ..ఏమీ తెలియుటలేదు . దానిలో ప్రవాహము లేదు . అలాగని దానిలో రాళ్ళు , మట్టి వంటి ఘనపదార్థాలూ లేవు . స్ఫటిక ముద్ద కరిగి నీరైతే ఎలా వెలుగుతుందో , అలా ఉంది . అలాగని తీక్షణమైన వెలుగు లేదు . అదొక అలౌకికమైన ప్రకాశము . అక్కడున్న దానిని కన్ను చూస్తున్నది అనడము కన్నా , అదే కంటికి కనపడుతున్నది అంటే సరి అన్నట్టుంది . 

     అలాగున్న , అపూర్వమైనా కూడా , తెలియనిదేమీ కాదు అనిపిస్తున్న ఆ పదార్థమును చూస్తుండగానే , ఏదో ఒక తేజః కణము వచ్చి అక్కడ వెలసింది . అది చూస్తుండగానే పెరుగుతున్నది . పెరిగి పెద్దదై , చూచుటకు రొట్టె ఆకారములో ఉంది . ఇంతై వటుడింతై అన్నట్టు పెరిగి పెరిగి మొత్తం అంతా అదే నిండిపోయింది . చివరికి పగిలిపోయింది . దానిలోపల , దేవ , మానవ , తిర్యక్, సృష్ఠి అంతా ఉంది . గాజుబొమ్మల వలె కనపడు రాయి , మట్టి , చెట్టు, పుట్ట , ప్రాణి , పక్షి , పాము , మొదలైన వాటి నుంచీ  , నీరు , గాలులతో చేసిన బొమ్మలవలె కనపడు దేవతల వరకూ అన్నీ ఉన్నాయి . 

     కౌశికుని మనసు ఇదేమిటీ అంటుంది . ఏదో ఒక అలౌకిక అశరీరవాణి  ," ఇది ఆపో రసము . అది బ్రహ్మాండము . దీనిని మనువు తపస్సు చేత చూడగలిగాడు . ఇప్పుడు నువ్వు చూశావు . " అంటున్నది . అంతలోనే దానికి తోడు ఇంకొక ప్రశ్న . " దీనిని చూసిన ప్రయోజనము ? " దానికక్కడే అలాగే సమాధానము , " బ్రహ్మాండము పెరిగి  పగులుటను చూసినవాడు కావాలంటే ఇంకొక బ్రహ్మాండమును సృష్ఠించవచ్చు ." 

     మరల ప్రశ్న , " అదంత సులభమా ? "  మరలా ఉత్తరము , " అదెంత పని ? మట్టి ఉంటే కుండ చేయలేమా ? "

" మట్టి లేకుంటే ? "

" అండ పిండముల మూల మూలలలోనూ , బీజరూపములో ఉండనే ఉంది . " 

" ఐతే చేసి చూద్దామా ? " 

" ఇంకా సమయము రాలేదు "

" ఊహూ....చేసి చూడవలసినదే . " 

     సమాధానముగా ఒక కేక. విశ్వామిత్రుని దేహములోని కణ కణమూ ఆ కేక విని హడలిపోయింది . బ్రహ్మాండము చేయాలనే సంకల్పమే మరచిపోయాడు . భీతి చెందాడు . తనకన్నా పెద్దది ఏదో వచ్చి , తనను పట్టి , చెరకును విరచినట్లు విరిచేస్తుందేమో అనిపించింది . వెంటనే ఏదో ఒక తేజస్సు వచ్చి అడ్డు నిలుచుంది . శాంతంగా , హితముగా , ప్రసన్నమైన ఆ తేజస్సు వచ్చి నిలచింది . కబళించుటకు వచ్చిన ఆ అవ్యక్త క్రూర జ్వాల మాయమయింది . 

     విశ్వామిత్రుని చిత్తము మేలుకొనింది . పదే పదే  వచ్చి తనను కాపాడుచున్న ఆ తేజస్సు ఏమది ? దాని  పరిచయము కావాలని చేసుకున్న సంకల్పానికి ప్రకటమై దాని పరిచయమును తెలిపింది . ఆ తేజస్సుకు అతని మనస్సు అలవాటుగా పూజలు సలిపింది . మొదటే శాంతమై , ప్రసన్నముగా నున్న తేజస్సు , ఆ పూజాదులతో ఇంకా ప్రసన్నమై వరప్రదానమునకు సిద్ధమైంది .

Thursday, June 14, 2012

14 . " మంత్ర ద్రష్ట " పదునాలుగవ తరంగము




పదునాలుగవ తరంగము

     ఇక్ష్వాకు వంశపు మహారాజైన త్రిశంకువు తమ వంశాభివృద్ధికి దోహదమైన  గురువు గారిని దర్శించుటకు వచ్చియున్నాడు. రాజపరివారమంతా ఆశ్రమానికి అనతి దూరములో విడిది అయింది . వినయమును సూచించు వేషధారణతో కొద్ది పరివారముతో వచ్చి , మహారాజు త్రిశంకువు బ్రహ్మర్షియైన గురువుల దర్శనము చేసి ఇప్పుడు అతిథిశాలలో ఉన్నాడు . ఈ దినము మధ్యాహ్నము పైన , సూర్యుడు కొంచము దిగినాక , గురుదేవులను అతడు మరల చూచును . తన ప్రార్థనను వినిపించును . ఈదినము , ఆదినము కౌశికుడు వచ్చిన సంభ్రమము ఏమీ లేదు . అయినా, త్రిశంకువు వశిష్ఠులను  బాల్యమునుండే గురువుగా ఒప్పుకున్న వినీతుడు . కానీ అతనిలో వినయము ఆవగింజంత కూడా లేదు . అయితే వేషములో మాత్రమున్నది . అతడు వచ్చినది గురువు గారిని యజ్ఞము కోసము పిలవాలని. కాబట్టి అతనివల్ల ఆశ్రమమునకు ఏ బాధా లేదు . అయినా , ఆశ్రమ వాసులకు ఈ రాజమహారాజులు వస్తే ఏమూలో శంక ఒకటి తప్పదు . 

     దిగుపొద్దు అయింది . వశిష్ఠులు త్రిశంకువును పిలిపించుకున్నారు . మూర్ధాభిషిక్తుడైన ఒక మహారాజు తన గురువు గారికి  ఎలాగ  అభివాదము చేయవలెనో అలాగే చేసి ఇతడూ ,  రాజశిష్యునికి ఏయే గౌరవ ఆశీర్వాదములను చేయాలో వాటినంతటినీ చేసి వశిష్ఠులూ కూర్చున్నారు . గురుదేవులే సంభాషణను మొదలుపెట్టారు . 
" అనుజ్ఞ ఇవ్వండి , మహారాజులను ఇక్కడివరకూ రప్పించిన మహత్తర కార్యము ఏమది ? " 

     " గురుదేవా , ఇప్పటివరకూ నానా యజ్ఞములను చేసి ఉన్నాను . మీకు తెలిసినదే . ఇప్పుడు ఇంకొక యజ్ఞము చేయవలెననిపిస్తున్నది . "

" సావధానముగా వింటున్నాను , అనుజ్ఞ ఇవ్వండి " 

     " యజ్ఞము చేసినవాడు , దేహాంతమున స్వర్గమును పొందును అనునది లోకానికి తెలిసినదే . అయితే , సశరీరంగానే స్వర్గానికి పోవలెనని నా ఆశ. " 

     " మహారాజా , అలాగ సశరీరంగా స్వర్గానికి వెళ్ళినవారు పూర్వము అనేకులు ఉన్నారు . అయితే , దేవ కార్యార్థియైతే మాత్రమే ! . దేవతలు మనుష్యులను తమకు తామే పిలిపించుకున్నవారు . అంతే కానీ మనుషులు తాముగా ముందుపడి వెళ్ళుటకు లేదు . " 

   " అసాధ్యమైనదానిని సాధ్యము చేయుటకే కదా , యజ్ఞమున్నది ? " 

     " ఔను , కానీ , దీనిని నువ్వు సకామముగా కోరుతున్నావు . దీనివలన జరగబోయే  లోక క్షేమము ఏదీ లేదు . వృథాగా అక్కడి భోగాలను కోరి ఈ మనుషులు ,  దేహమును అక్కడికెందుకు తీసుకొని పోవలెను ? ఈ మానవ దేహము సురలోకపు భోగాలను అనుభవించుటకు సమర్థమైనది అనుకున్నావా ? నీవు అనేక యజ్ఞములను చేసి దేవతలను ఆరాధించినవాడివి . ఇక్కడ ఉండు వరకూ అక్కడి భోగములకు సమానమైన భోగములను అనుభవించు . ఇక్కడున్న మా నందినిని ఆరాధించి ఆమె అనుజ్ఞ పొంది , ఆమె పాలను త్రాగిన , నువ్వు ముసలితనము లేకుండా వజ్రకాయుడవు కాగలవు . ఈ దేహానంతరము , ముందు ముందు స్వర్గ సుఖము తనకు తానే దొరకును . తానే సిద్ధముగా దొరకుదానిని ప్రత్యేకముగా పొందుటకు ఈ విశేష ప్రయత్నము ఎందుకు ? "

     " మీరు చెప్పినది నిజమే. కానీ ఇప్పుడు నేను ఆ ఆశకు వశుడై ఉన్నాను . సర్వ ప్రయత్నముల చేతా నేను దానిని సాధించియే తీరవలెను . లేకపోతే నాకు మనసు స్తిమితముగా  ఉండదు . "

     " మహారాజులు , ఈ కార్యములో సహకరించుటకు నేను సామర్థ్యము లేనివాడిని అనునది తెలుసుకొని , నన్ను వదలివేయుట మంచిది  " 

     " దేవా , ఇక్ష్వాకు వంశస్థుల సిద్ధికి మూర్తి స్వరూపులైన తమను వదలుట అంటే ఎలా ? స్వర్గ , మర్త్య , పాతాళ లోక వాసులందరూ , కర్మ కాండ , జ్ఞానకాండ లు రెండింటికీ తమను గురువులని అంగీకరించినవారు . ఇటువంటి తమను వదలి , మరల నేను వేరే ఎవరిని అపేక్షించాలి ? " 

     " మహారాజా , నేను కూడా అపుడే చెప్పాను కదా , బహుశః మమ్మల్ని పరీక్షించుటకు ఇటువంటి ఆశ నీకు కలిగిందో , ఏమో ? ఎలాగైనా సరే , మమ్మల్ని వదలి వేయి. ఇటువంటి అల్పమైన ఆశలన్నీ విహితమైనవి కాదు . స్వధర్మమైన ప్రజాపాలనను చేసి కృతార్థుడివి కాకుండా , ఇక్కడ నీ ధర్మమును వదలివేసి , కాలాంతరములో లభ్యము కాగల స్వర్గము ఈ రోజే దొరకాలి అనునది సరి కాదు . అయినా సరే , ఒకసారి వెళ్ళి వచ్చెదవా ? పంపిస్తాను . లేదా , స్వర్లోకపు ఏదైనా భోగ వస్తువు కావాలన్న చెప్పు , తెప్పించి ఇస్తాను . "

     వశిష్ఠుల కంఠమున మార్పు వచ్చిననూ అది గుర్తించక  , త్రిశంకువు  " లేదు , గురుదేవా , నా పుత్రుడు హరిశ్చంద్రునికి పట్టమును కట్టి నేను స్వర్గానికి వెళ్ళి అక్కడే పడిఉంటాను . " 

     " అది సాధ్యము కాదు . దానికై ఒక కర్మను సృష్ఠించి చేయించ వచ్చును , ...అయినా వద్దులే , మహారాజా , మన్నించు . ఈ వ్యుత్క్రమము  (  పరిశోధన ) వద్దు . నీకు కావాలంటే ఆ పనికి తగిన వేరే ఋత్విక్కులను , పురోహితులనూ చూసుకో . మమ్మల్ని వదలివేయి . " 

      త్రిశంకువు దీని తర్వాత కూడా ఏదో చెప్పబోయెను . అయితే వశిష్ఠులు లేచి నవ్వారు . సమావేశము ముగిసింది . మహారాజు అవాక్కై వెళ్ళిపోయాడు . " సరే , ఈ పని సాధ్యమే నని తెలిసింది కదా , అంతేకాక , వారే చెప్పారు , కావాలంటే ఇంకొకరిని వెతుక్కో అని , ఇంకొకసారి వారిని చూడనా ఈ విషయమై ?  వద్దు , వద్దు , వశిష్ఠులు లేదంటే లేదు . ఔనంటే ఔను. ఏ దాక్షిణ్యానికీ లోబడరు . వారిని మాట్లాడించితే పని కాదు . దేవి గారిని చూడాలి . చూద్దాం , ఆమె సిద్ధి లక్ష్మి యంతటివారు . వారి దర్శనము చేసుకొని   మొదట ఇష్ట సిద్ధి కై అభ్యర్థన చేయాలి . ఆమె సహజముగనే ,’ అస్తు ’ అంటారు . దాని తర్వాత గురుదేవులు అడగకుండానే ఒప్పుకుంటారు . ఇతరులు చేయగలిగిననూ , కుల పురోహితుని వదలివేయుట అయినపని కాదు . వద్దు , ఇప్పుడు కనిపించిన ఈ దారే మంచిది " అని , అతిథిశాల కు వెళ్తూ , దారిలోనే గోశాలలో నందిని ధేనువుకు ఉపచారములు చేస్తూ నిలబడిన దేవిగారి దర్శనమునకు వెళ్ళెను . 

     అరుంధతి , రాజశిష్యుని నమస్కారాలను యథోచితముగా గ్రహించెను . ఆశీర్వాదములు అయినవి . త్రిశంకువు కుశల ప్రశ్నలయిన తరువాత , " మాతా  , పెద్దమనసుతో , నా ఇష్టార్థ సిద్ధి అగునట్లు అనుగ్రహించవలెను . " అని మరల నమస్కారము చేసెను . దేవి గారు , " ఇష్టార్థమేదో దొరకుతుంది , అయితే , దానికోసము దారిపొడవునా కష్టపడాలి కదా ." అన్నారు . 

     త్రిశంకువు తాను తలచినదే అయినది అని సంతోషముతో విర్ర వీగెను . " ఔను , ఔను . గురుదేవులు దానికోసము ఒక   కొత్త కర్మను ఏర్పాటుచేయాలి అన్నారు . నిజమే , దారిపొడవునా కష్టముంది . అయితే ఏమి ? తమ ఆశీర్వాదమే మమ్మల్ని కాపాడుతుంది . " అని వినయముతో వీడ్కొని వచ్చెను. 

     హమ్మయ్య , దేవి గారి అనుగ్రహము అయింది అని గురుదేవులకు ఎలాగ తెలిపేది ? లేదా , ఎవరి ద్వారా చెప్పించాలి ? త్రిశంకువుకు పెద్ద కష్టమే వచ్చింది . వామదేవులు ఆశ్రమములో ఉంటే బాగుండెడిది . వారు వశిష్ఠులతో పాటే ఆర్త్విజ్యము  ( ఋత్విజుడై యజ్ఞ కార్యము ) చేసేవారు. వారు కారణాంతరముల వలన హిమాలయమునకు వెళ్ళినారట . ఇంకా రాలేదు . అందువలన అనాలోచితముగానే త్రిశంకువు వశిష్ఠుల పుత్రులను ఆశ్రయించాడు . వారూ ఆలోచించారు . తండ్రేమో కాదన్నారు . తల్లిగారైతే అవుతుంది అన్నారు . ఏమి చేయాలి ?   రెండు మూడు రోజులు పదే పదే వచ్చి పీడిస్తున్న మహారాజు బలవంతానికి లోనై , తండ్రి దగ్గర ప్రస్తావన తెచ్చారు . అక్కడినుండి సరియైన సమాధానము రాలేదు . అక్కడికే వదిలేశారు . 

     అయితే త్రిశంకువు వదలలేదు . వేకువ పొద్దునే నిత్యకర్మలను నెరవేర్చుకొని వచ్చి వశిష్ఠుల పుత్రుల పక్కన కూర్చుంటాడు. వారు మధ్యాహ్న కర్మకు లేచునపుడు లేస్తాడు . మరల మూడో ఝాము పొద్దుకు వచ్చి కూర్చుంటాడు . సాయంకాలానికి లేచి వెళ్ళిపోతాడు . ఇలాగే కొన్ని దినములు నడిచింది . 

     ఒక రోజు ఏదో దుర్ముహూర్తములో త్రిశంకువు , " నేను ఇన్ని రోజులనుండీ తమరిని ఆశ్రయించిననూ తమకు దయ రాలేదు " అని వినయముగానే చెప్పుకున్నాడు . వశిష్ఠుల నూరుగురు కొడుకులలో ఒక్కడు , " గురుదేవులు పని జరగదు అన్నారు కదా . మేమేమి చేయగలము ? కావాలంటే ఆ కార్యమునకు దక్షులైన వేరొకరిని వెతుక్కొని పోవచ్చును . మావల్ల అయితే సాధ్యము కాదు . " అన్నాడు. 

     త్రిశంకువు , " కుల పురోహితులను వదలుట మంచిదికాదని సంకట పడుతున్నాను " అన్నాడు . 

ఇంకొకడు సమాధానమిచ్చెను : " వీలుకానప్పుడు ఏమి చేస్తారు ? " 

మరలా రాజు అడిగెను , " అలాగని కుల పురోహితులను విడువ వచ్చునా ? " 

 ఇంకొకరు , " వారే వదలినారు కదా ? " 

" అట్లయితే ఇప్పుడు నేనెవరిని ?  వారి శిష్యుడను కానా ? " 

ఎవరో దుడుకుగా అన్నారు , " చండాలుడివి " 

అందరూ ’ హా హా  ’ అన్నారు . ఆ మనువంశపు రాజు , మూర్ధాభిషిక్తుడు , కులపతి వశిష్ఠుల శిష్యుడు , ఇటువంటి వానిని చండాలుడు అనవచ్చునా ? 

 ఛీ ఛీ యని అందరూ ఛీత్కారము చేశారు . 

     త్రిశంకువు అక్కడే తలపై చేతులు పెట్టుకొని కూర్చున్నాడు . కోపమొచ్చింది . గురుపుత్రుల పైన కోపము తెచ్చుకోకూడదని దిగ మింగాడు . అతడు అక్కడే కూర్చున్నట్లే సాక్షాత్ వశిష్ఠులు వచ్చారు . " మహారాజా , ఇలాగ కాకుండా ఉండవలసినది . అయిపోయింది . ఇప్పుడైనా నువ్వు ఆ  ఆశ  వదిలితే , ఈ చండాలత్వము నిన్ను ఏమీ చేయదు . లేదూ , నీ ఆశ తీరాలంటే , దక్షిణాన ఒక రాజర్షి ఉన్నాడు . అతడు కూడా ఈ కార్యమును చేయగలడు . కావాలన్న , వెళ్ళి అతడిని ఆశ్రయించు . నువ్వు ఇంకొక్కరిని పురోహితునిగా వరించనంత వరకూ ఈ చండాలత్వము నిన్ను ముట్టకుండా దూరంగా ఉంటుంది . " అని అనుగ్రహించారు. 

     దుడుకుగా మాట్లాడిన కొడుకు ముఖము వైపు తిరిగిచూచారు . అక్కడేమి కనిపించిందో , ? " హూ , జరిగేది జరగనీ " అనే అర్థములో చేయి ఆడిస్తూ వెళ్ళిపోయారు . 

     త్రిశంకువు ,  ఆశ నెరవేరుతుందనే సంతోషం లో తనకు చండాలత్వము రానున్నదని మరచి అందరికీ యథావిధిగా సత్కారములు చేసి , ఆశ్రమముముండీ వెళ్ళిపోయెను .