రెండు ఝాములు గడచి రాత్రి మూడో ఝాములోనికి కాలు పెట్టింది . లోకములోని జనులందరూ శాంతులై , నిద్రాదేవి కృపకు పాత్రులై సుఖించు కాలము . చుట్టుపట్ల అంతా ప్రశాంతముగా నిశ్శబ్దములో అద్దినట్లు మౌనముగా ఉంది . చెట్లూ చేమలన్నీ తమను ఆశ్రయించుకొని ఉన్న పక్షులనన్నిటినీ తమలో దాచివేసి , భయపడి మూలకు అణగి కూర్చున్న పిల్లలవలె , కిక్కురుమనకుండా మూగబోయినాయి . అనతి దూరములోనే చిన్న వాగు ఒకటి ఇసుకలో ప్రవహిస్తూ , అత్తింటి కోడలి వలె వీలైనంత తక్కువ శబ్దము చేస్తూ తనదారిన తానుపోతున్నది .
దేవరాతుడు ఆశ్రమములో దర్భశయ్యపై పరుండినాడు . ఎడమచేయి చెవితో ఏదో ఏకాంతమాడుతున్నట్టు తల కింద ఉంది . నిద్ర చూడగా గాఢముగా ఉన్నట్టుంది . అయినా కారణము లేకుండానే హఠాత్తుగా అతనికి మెలకువ అయ్యింది . మెలకువైనా , అతనిది కళ్ళు మూసుకునే ఉండే వైఖరి . కానీ ఇప్పుడు కళ్ళు మూసుకుని యుండుటకు సాధ్యము కాలేదు . కళ్ళు తెరిచాడు . ముత్యము వంటి చిన్నదైన నూనె కైదీపపు వెలుగులో ఎదుటి గోడా , దానిపై వ్రేలాడుతున్న కృష్ణాజినమూ కంటబడ్డాయి . మరలా కళ్ళు మూసి నిద్రపోవుటకు ప్రయత్నించాడు . ప్రయత్నము సఫలము కాలేదు . అట్లే కళ్ళు తెరుచుకొనే పైకి తిరిగినాడు . వెల్లకిలా పడుకొని రెండు చేతులనూ ఎదపై నుంచుకున్నాడు . చుట్టూ చీకటి కమ్మినట్లైంది . ఇదేమిటీ అనుకొనే లోపలే ఏదో ఒక అలౌకిక దృశ్యపు దర్శనమైనట్లయింది . ఏదో గుర్తు తెలీని అడవి ఒకటి . ఆ అడవిలో ఒక మూల. ఏపుగా పెరిగి నిలుచున్న చెట్ల సముదాయము . ఆ చెట్ల మధ్య ఒక ఆశ్రమము . ఆశ్రమము నుండి చేతివేటు దూరంలో ఒక యేరు . యేటిలో నీరు పారుట స్పష్టముగా కనిపిస్తున్నది . ఆ సెలయేరు అంత పెద్దదీ కాదు , చిన్నదీ కాదు . అయినప్పటికీ , ఆశ్రమవాసుల పైన గౌరవముతో జలదేవతలు అక్కడ వెలసి , మౌనముగా చేతులు జోడించి ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తున్నది . ఆ ఆశ్రమము నుండి ఎవరో అతివేగిరముగా ఏదో అత్యవసరమైనట్లు బయలుదేరినారు . ధవళ వర్ణపు గడ్డమీసాలు , తెల్లగా అప్పుడే కురిసిన మంచువలె స్వఛ్చమైన జటామండలము , అతడొక వృద్ధుడనీ , తపస్వియనీ ఘోషిస్తున్నట్లు చెబుతున్నాయి . ముఖములో నిండిన తేజోకాంతులు ఆ ఉద్ఘోషను ఒప్పుకున్నట్లు , దానికి సాక్ష్యము నిస్తున్నట్లున్నాయి . అకారణముగా మెరుస్తున్నదేమో యనిపించే అతని మందహాసము అతని లోపల నిండిన ఆనంద సాగరాన్ని దాస్తున్న తెర వలె ఉంది . అన్నిటికన్నా మిన్నగా , రత్నదీపాలవలె వెలుగుతున్న ఆ కన్నులు , జగములోని చీకటినంతా బాపి వెలుగు నింపునట్లున్నాయి . ఆ కన్నుల మధ్యనుండీ కిందకు దిగిన అతని నాసిక , ఈతడు లోకానుగ్రహము కోసము దివినుండీ దిగివచ్చి యుండవలెను అని సూచిస్తున్నట్లుంది . ప్రశస్తమైన కొండపైని రాతిపానుపు వలె విశాలముగా వ్యాపించిన అతని నుదురు అతని హృదయ వైశాల్యాన్ని చిత్రిస్తున్నట్లుంది . అతడు ఏదో కాలాతీతమైనట్లు , వేళ మించిపోయినట్లు త్వరత్వరగా బయలుదేరినాడు . ఆశ్రమపు ముఖద్వారమునకు వచ్చి , వెనుతిరుగి , ఆశ్రమానికి ఒకసారి మొక్కి , మరలా బయలు వెడలినాడు . ఆ ఉదయపు మొదటి జాములో నిండిన ప్రకాశములో కూడా ఆశ్రమము , ఏదో చీకటి పట్టినట్లు నిస్తేజమగుతున్నది .
అతడు వస్తున్నాడు . అతడికి అన్నివైపులా వెలుగు పరచుకొని ఉండి , ఆ వెలుగు అతనికి మాత్రము తన నీడ అనే అంటును సోక కుండా జాగ్రత్త పడినట్లుంది . మంటలేని అగ్నివలె ప్రజ్వలిస్తున్ననూ , శాంతముగా ఉన్న అతడు కొండ ఎక్కి , గుట్టలూ వాలు చరియలూ దిగి , తోపులను కోనలనూ దాటి , మనోవేగముతో వచ్చి , దేవరాతనికి నమస్కరించి , " నేను మీ కడుపున పుడతాను " అంటున్నాడు . దేవరాతనికి , " నువ్వెవ్వరవు ? మమ్మల్నెందుకు ఎంచుకున్నావు ? " అని అడగవలె ననిపిస్తుంది . అంతలోపలే అతడు చిన్న తేజోపిండమై , దేవరాతని సరసన పడుకుని యున్న ఆతని ధర్మపత్ని ఆలంబినీ దేవి గర్భమును ప్రవేశిస్తాడు . అతని ప్రశ్న ఇంకా మాటలు దాల్చి బయటికి వచ్చు ప్రయత్నము జరుగునంతలోనే ఇదంతా జరిగిపోయింది .
దేవరాతునికి ఆశ్చర్యమైనది . తన భార్య గర్భవతి యైనప్పటి నుండీ అతడు విధి పూర్వకముగా ఏమేమి చేయవలెనో ఆయా సంస్కారముల నన్నిటినీ సకాలములో చేసినాడు . పుంసవనమైనది . చూలింత కోరికలన్నీ తీర్చడమైనది . ఇంకో పదిరోజులకు సీమంతము జరగనున్నది . ఇప్పుడు ఇదొక అలౌకిక ఘటన. అతనికిది అతి విచిత్రముగా అనిపించి , ఆశ్చర్యమై , మనసులోనే ప్రశ్నా పరంపరలు తరంగముల వలె మూగుతున్నాయి . " అట్లైతే , మా ఆశాసౌధాలు వ్యర్థాలు కావు , వేదకర్మలు సార్థకమవుతున్నాయి , మా వంశములో లోకోత్తరుడైన ఒక బ్రహ్మర్షి ఉదయిస్తాడు . ఆత్మోద్ధారము చేసుకున్న అతని వలన వంశము ఉద్ధారమై , లోకము కూడా సద్గతిని పొందగల దారిని కనుక్కుని ఉద్ధారమవుతుంది " అని అతని మనసు ఆనంద నర్తనము చేసింది .
సంతోషమైనా, దుఃఖమైనా తనవారితో పంచుకోనిదే మనసు ఊరుకోదు . సంతోషమైతే ఇనుమడించి ఆనందం రెట్టింపవుతుంది , దుఃఖమైతే , పంచబడి పలచబడి మనిషిని ఓదారుస్తుంది . అందుకేనేమో , మానవుడు సంఘజీవియై సాంగత్యాన్ని అపేక్షించేది ?
దేవరాతుడు పక్కనే పరుండిన భార్యను పిలిచాడు . ఆమె మెలకువగానే యున్నది . .అతనికి ఆశ్చర్యమైంది , " నీవు లేచే ఉన్నావా ? అలాగైతే ఏదైనా విచిత్రాన్ని చూసినావా ? " అని అడిగాడు . ఆమె , " అవును , నేను చూసినదాన్ని మీకు చెప్పవలెనని యున్నాను . అంతలో మీరే పిలిచినారు " అని తాను చూసినది చెప్పింది , " ఒక వాగు తీరములోనున్న ఆశ్రమమొకటి , ఆ ఆశ్రమమునుండీ తెల్లటి వస్త్రములు కట్టుకొనియున్న సాధువొక్కరు వచ్చి నా గర్భమును ప్రవేశించినారు . " అంది .
దేవరాతునికి పట్టరానంత ఆశ్చర్యమైనది . సంభ్రమముతో " అవునా ? " యని కొంత తడవు ఊరికే ఉండి , " చూడు , నాకు కూడా నీకు కనిపించినదంతా కనిపించింది . దాన్నే నీకు చెప్పాలని పిలిచినాను . అప్పటికే నువ్వు మేల్కొని , నేను చూసినదే నువ్వు కూడా చూసినావు " అన్నాడు .
ఆలంబినీ దేవి స్త్రీ సహజమైన కుతూహలముతో అడిగింది , " అయితే మరి దీని అర్థమేమిటి ? "
దేవరాతుడు నవ్వి అన్నాడు , " అర్థమేమిటి ? స్పష్టముగానే ఉంది కదా ? నా కన్నా ప్రబలుడైన కొడుకు కావాలని నేను చేసిన తపస్సు ఫలించింది . ఎవరో ఒక తపస్వి నీ గర్భమును చేరినాడు . పుట్టి లోకాన్ని ఉద్ధరించుటకు ఇక్కడికి వచ్చినాడు . "
" ఏమిటీ ? మీకన్నా ప్రబలుడా ? మేమెలా నమ్ముట ? ఈ చుట్టుపక్కలే కాదు , దేశ దేశాంతరముల నుండీ కూడా యజ్ఞ యాగాదుల విషయములలో ఎట్టి సందేహము వచ్చినా , తీర్చుకొనుటకు మీ దగ్గరికే వస్తారు . ఇక మీ కన్నా ప్రబలుడంటే ఎటువంటి వాడు ? "
" చూడు కాంతామణీ , నువ్వు చెప్పినది అబద్ధము కాదు, అయితే , నాది కర్మ కాండ. ఏవేవో ఆశలను పెట్టుకొని చేయు కర్మల గుత్తులే ఈ కర్మ కాండలు . అయితే , పెద్దలు ఏమంటారంటే , ఈ ప్రపంచపు వెలుపల ఇంకేదో ఒకటి ఉందట . అది ఈ విశ్వాన్నంతా వ్యాపించి ఉందట. నీలోపల , నాలోపల మాత్రమే కాక , చీమ , దోమ ,వాటికన్నా చిన్నవైన క్రిమి కీటకాలు మొదలుకొని ఏనుగు , ఒంటె వరకూ ఉన్న సమస్త సచేతన ప్రాణులలోనూ ఉన్న చైతన్యము అదేనట . అట్లే , జీవమున్న స్థావర జంగమములన్నీ బ్రతికియున్నది దాని వలననేనట . సూర్య చంద్రులలో ప్రకాశముగా కూర్చున్నదీ అదేనట !. ఇక్కడ ఉన్నదంతా దానికోసమై వదలి , ....వింటూన్నావా ? ఈ ఊరు వదలి ఇంకో ఊరికి పోవువాడివలె , మనము చేస్తున్నదానినంతా , మన ఆశలనన్నిటినీ , దానికోసమై వదలి జీవిస్తే అది దొరుకుతుందట . అది నిజమైతే , ఇక్కడున్న అన్నిటికన్నా అదే ఎక్కువ అయితే , అప్పుడు దానిని తెలిసినవాడు నా కన్నా ప్రబలుడు అవుతాడా కాదా ? "
" మీరు ఇంతకు ముందెప్పుడూ ఆ విషయమును ప్రస్తావించి ఉండలేదే , కదా ? "
" అవును , ఆ సంగతే మాట్లాడలేదు . నిజం చెప్పాలంటే , నాకు అది లేదు అన్న అపనమ్మకమైతే లేదు కానీ , దానికోసము సర్వమునూ త్యాగము చేయడమన్నది నాకు మింగుడు పడదు . చూడు ఆలంబీ , యజ్ఞములో అధ్వర్యుడు ఫలానా దేవుడిని పిలవాలని ప్రైష ( ఆహ్వానము ) నిస్తాడు . హోతృడు ఓం అని ఆ దేవతా సంబంధమైన సూక్తమును పారాయణ చేసి , ఆ దేవతను ఆకర్షించును . ఉద్గాతృడు ఆ సూక్తాన్ని సామముగా ఉపబృంహణ చేసి పాడి ఆ దేవత మన సూక్ష్మ ఇంద్రియములకు గోచరమగునట్లు చేస్తాడు . ఏదైనా హెచ్చుతగ్గులైతే బ్రహ్మ స్థానములో ఉన్నవాడు సరిపరచును . అప్పుడు అధ్వర్యుడు ఆ దేవతకు హోమము చేసి యజమానుని ఇష్టమేదో దానిని సాధించును . ఈ వైభవములో మునిగియున్న వానికి అన్నీ వదలి చప్పగా కూర్చొని ఉండుటన్నది ఎట్లు మనస్కరించును ? అదీకాక , ఆ మార్గమును పట్టినవాడు దానికి బ్రహ్మ విద్య అనే పేరు ....."
" బ్రహ్మ విద్య అంటే ? "
" బ్రహ్మమనగా గొప్పది . దేనికన్నా మరి గొప్పది ఏదీ లేదో , అదే అన్నిటికన్నా గొప్పది , ఆ ’ అది ’ ఏదో ఏమిటో చెప్పేవాడికీ తెలీదు , వినేవాడికి ఎంతమాత్రము తెలీదు . అదే బ్రహ్మ . దానిని సంపాదించి ఇచ్చే విద్యయే బ్రహ్మ విద్య . దీనిలో ఇంకో అందముంది , తెలుసా ? "
" చెప్పండి "
" ఆ బ్రహ్మము కోసము మనము అన్నిటినీ , అంతటినీ వదలి మిడుకుతూ కాచుకొని కూర్చోవాలట . అది తపస్సుకు దొరకదట . దానము వలన పొందుటకు వీలు కాదట . అధ్యయనము , ప్రవచనముల వల్ల అసలే దొరకదట . ఏమి చేసినా పొందుటకు వీలు కానేకాదట . అది తానుగా మనలను అనుగ్రహించువరకూ వేచి ఉండాలట. ఇది నాకెందుకో పట్టలేదు , నచ్చలేదు . అయినా , దానిని శృతి చెప్పుతున్నది కాబట్టి గౌరవించవలెను . గౌరవిద్దాం . ఒప్పుకుందాం . అంతే కానీ , అది మన జీవనానికి ఒక రూపు ఇవ్వడము వద్దనుకుని , నేను దానివైపుకు చూడనే లేదు , పట్టించుకోనే లేదు . "
" మరి ఇప్పుడు మీ పుత్రుడు మీకన్నా ప్రబలుడవుతాడు అంటిరి కదా , అది యెట్లు ? "
" బహుశః , వాడి శ్రద్ధ ఈ కర్మ కాండను ఒప్పుకొని , ఇంకా ముందుకు పోవచ్చేమో ! అయితే ఒక మాట . నా పుత్రుడు కర్మ కాండను తిరస్కరించుటకు నేను ఒప్పుకోను , అది వాడి ఇష్టానికి వదలను . వాడు బ్రహ్మ విద్యను నేర్చుకోవాలన్నా , మన కర్మ కాండలో నిపుణుడై , ఎక్కడ ఎవరికి ఏ సంశయము వచ్చినా దానిని పరిహరించగల వాడు కావలెను . ఎక్కడెవరే యాగాన్ని చేయవలెనన్ననూ ’ ఈ దేవరాతుడి కొడుకును పిలవాలి . లేకుంటే యాగము పూర్ణమే కాదు ’ అనవలెను . రాజాధిరాజు కూడా వాడిని పల్లకి ఎక్కించి కూర్చోబెట్టుకొని పిలుచుకొని వెళ్ళి బండినిండా దక్షిణను సమర్పించవలెను . ఇప్పుడు నాకు వీరంతా చేరి యజ్ఞవల్క్యుడు అని కదా బిరుదునిచ్చినారు , ? ఈ నా కుమారుడు ఈ బిరుదు వలన యజ్ఞవల్క్యుని కొడుకు ’ యాజ్ఞవల్క్యుడు ’ అని ప్రసిద్ధుడు కావలెను . ఆ తర్వాత కావలెనన్న , వాడికి బ్రహ్మవిద్య రానీలే . అలాకాక , వాడేమైనా బ్రహ్మ విద్య కోసము మన శ్రౌత విద్యను వదిలేస్తానంటే , నేను వాడినే వదిలేస్తాను . కానీ , వాడు అలాగు చేయడనుకో ! నాకు నమ్మకముంది . మన పుత్రుడు మనకు ఎదురు చెప్పకుండా , మనకి ఎల్లప్పుడూ విధేయుడై ఉండేలా అగ్ని వలన వరము పొందినాను . "
" మీరు ఈ బ్రహ్మ విద్య సంగతిని ముందెప్పుడూ ప్రస్తావించియే ఉండలేదే ? "
" దానికి సందర్భము రాలేదు . అయినా , అవకాశమెక్కడ ? నేను ప్రాజాపత్య వ్రతములో నున్నవాడిని . అది చాలదన్నట్టు తెల్లారిన దగ్గరనుండీ పొద్దుగూకేవరకూ , కాదు , కాదు ... సంవత్సరము మొదలై సంవత్సరము ముగిసే వరకూ అనుదినమూ ఏదో ఒక ఇష్టి , యాగము అని కూర్చొనువాడను . ఆ యాగానికి దర్భలు తేవడము , ఈ ఇష్ఠికి సమిధలు తేవడము , దానితో పాటు ఆ వచ్చినవారికి సమాధానాలిస్తూ వారి సంశయాలను పరిహరిస్తూ ... వీటిలోనే కాలమంతా గడచి పోవుచుండినది . ఈ దినమే కదా , ఈ దృశ్యము చూడటము వలన , ఈ అపరాత్రి మనమిద్దరమూ మాట్లాడుకునే యోగము కలిగింది ? ఒకవేళ నాకు మెలకువైనా , నిద్రిస్తున్న నిన్ను చూసి , పొద్దుటినుంచీ గానుగెద్దు లాగా తిరుగుతూ రోకి రోకి అలసిపోయావని నిన్ను లేపుటకు మనసే ఒప్పేది కాదు . ఈ దినము అన్ని విధులనూ పక్కనబెట్టి నేను చూసిన విచిత్రాన్ని నీకు కూడా చెప్పాలని అనిపించి , నిన్ను పిలిచినాను . అదేవేళకు అదేమి గ్రహచారమో , నువ్వుకూడా లేచినావు . నీకు ఇంకోటి తెలుసా ఆలంబీ ? "
ఈ వేళకి దేవరాతుడికి వాచాలత్వపు ప్రవృత్తి బలమైంది . లేచి కూర్చొని ఉంటే ఆశ్చర్యమేమీ లేదు , కానీ అతడు లేవకుండా , అట్లాగే పక్కకు పొరలి , మోచేతులపైన భారాన్ని వేసి , తలయెత్తి , భార్య వైపుకు తిరిగి అన్నాడు : " విను , నాకు ఇంకొక సహించలేని అంశమేమిటంటే , ఆ బ్రహ్మ విద్యను తెలిసిన వారు కుక్క, నక్క, చండాలుడాదిగా , అన్నిటినీ సమ భావముతో చూడవలెనంట ! అది నాకు నచ్చదు , దానిని నేను ఆమోదించలేను . బ్రాహ్మణుడై , సర్వ శ్రేష్టుడూ , జ్యేష్టుడూ యై , మేము ఆరాధించు దేవతను , మనలను ఆరాధించువారినీ , అన్నిటికన్నా మిన్నగా స్పర్శన , దర్శనములకు అయోగ్యులైన వారిని సమానమని భావించుట యేలాగు ? ఇదొక పెద్ద బహు జటిలమైన సమస్య . దానివల్లనే నేను బ్రహ్మవిద్య జోలికే పోలేదు , పోను కూడా ! నేను ఒప్పుకునే దేమిటంటే , ’ సర్వేషామవిరోధేన బ్రహ్మ కర్మ ’ చేయుట ! అనగానేమి ? మనము చేసే కర్మ , జాగరూకతగా , ఎవరికీ , ఏ ప్రాణికి కూడా , చేతనాచేతనమైన దేనికీ , యే రీతిలోనూ హింస కలగకుండా చూసుకోవడము . ’ శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే ’ --రెండు కాళ్ళ ప్రాణులకూ , నాలుగు కాళ్ళ ప్రాణులకూ కూడా శుభము జరగనీ అని కర్మ చేయుట "
" ఔనౌను , ఇప్పుడు మీరు చేసే కర్మ అలాగే ఉన్నది . మీ జీవ కారుణ్యపు విషయములో ఎవరూ సందేహపడుటకు లేదు . ఎవరికైనా ఇబ్బంది కలుగుట ఉంటే , అది మీకే ! అయితే అది మీకు అలవాటైపోయింది . "
" ఏమి చేయుట ? నీకు ఇబ్బందులు తప్పుటలేదు . నా చేబట్టినందుకు నువ్వూ ఇన్ని కష్టములను సహించవలసి వచ్చింది . "
" నాకేమీ కష్టము లేదు . ఇవన్నీ నాకు కూడా అలవాటే "
ఆ వేళకు తొలికోడి కూసింది . అది విని ఇద్దరూ " ఇదేమిటి , అప్పుడే కోడికూత వేళ అయింది , సరే , ఇంకేమి , స్నానానికి లేచు సమయమైంది " అనుకున్నారు . దేవరాతుడు , " ఈ పొద్దు మధ్యాహ్నపు భోజనము తర్వాత నువ్వడిగితే , నేనేమి చేయవలెనని ఉన్నానో అదంతా వివరిస్తాను . నీకు ఇష్టమే కదా ? " అని అడిగినాడు . దానికి సమాధానంగా ఆమె " అలాగంటే ఈ దినము వైశ్వదేవము త్వరగా అగునట్లు చూసుకోవలెను . మీ మాటలు నాకు బెల్లం పాకము వంటివి . అదీకాక , ఈ దినము పురాణము కూడా లేదు . సాయంత్రమొక వేళ వరకైనా మాట్లాడుకోవచ్చు " అంది .
ఇద్దరూ ఇంకొక ఘడియ అలాగే ఉండి , స్వరము * సరిపోవు వరకు పడుకొనియుండి లేచినారు .
( * స్వరము : నాసిక లోకి వచ్చు శ్వాసకే స్వరము అనిపేరు . నిద్రలేవగానే శ్వాస ముక్కులో ఏ వైపు నుండీ ఆడుతున్నదీ చూసుకోవలెను . కుడి ముక్కు లో ఆడేది సూర్యుడు . ఎడమ ముక్కులో ఆడేది చంద్రుడు . రెంటిలోనూ ఆడేది జీవము -- అని స్వరము మూడు విధములు . ఫలానా తిథులలో , ఫలానా వారములలో , ఈయీ స్వరాలే ఉండవలెను అను నియమము ఉంది . స్వరశాస్త్రములో ఈ విషయము వివరింపబడి ఉండును . )
bagundi .. na adrusta vasamuna e blog choosanu. dhanyunni.
ReplyDeleteమీ స్పందనకు ధన్యవాదములు
Delete