13. పదమూడవ భాగము-- మంత్రార్థము -2
ఆమె కన్నులు మూసుకున్ననూ , మనసు కళ్ళు తెరచుకొని , మెలకువగా , అభ్యాస బలము చేత మంత్రమును చెప్పుతుండినది . తల్లీ కొడుకులు కొంచముసేపు అలాగే ఉన్నారు . పొయ్యిలో ఉన్న మంట వారి సుఖమునకు తానెందుకు అడ్డము కావలెనని నిశ్శబ్దముగా మండి శాంతమైనది . అప్పుడు హఠాత్తుగా తల్లి , తాను వంటింట్లో పొయ్యి ముందర కూర్చున్నది గుర్తుకొచ్చి అదాటుగా కళ్ళు విప్పింది . కొడుకుకు మెలకువ కాకుండా ఉపాయముగా పొయ్యి సరిచేసినది . అంతలోనే కొడుకు కూడా లేచి , " ఎందుకమ్మా , మంత్రము నిలిపివేసినావు ? " అన్నాడు .
తల్లి నవ్వుతూ , " నిలపలేదయ్యా , మెల్లగా చెపుతున్నాను . నీకు ఏదో తూగు నిద్ర వచ్చినట్లుండినది " అన్నది .
" నిజమమ్మా , నువ్వు తొడపైన కూర్చోబెట్టుకున్నావు . నిద్ర వచ్చేసింది . ఇప్పుడు దూరముగా కూర్చుంటాను , మంత్రమును చెప్పు "
" నిద్ర వచ్చిందని నువ్వేమీ దిగులు పడవద్దు . నిద్రలో విన్నది ఇంకా బాగా పట్టుబడుతుందట . "
" అట్లయితే నువ్వు చెప్పుతూ ఉండు , నేను నిద్రపోతూ ఉంటాను "
’ ఇన్ని దినములూ అలాగే అవుతుండెడిది . నువ్వు తొట్టిలులోనో , తొడపైనో నిద్రపోతున్నపుడు నేను మంత్రములను చెప్పుతూనే ఉంటిని . "
బాలుడు , తనకు కావలసినదేదో ఒకటి దొరికినట్లు సంతోషపడుతూ అన్నాడు , " చూడమ్మా , నువ్వు మంత్రము చెప్పినపుడల్లా , ఏదో ఎక్కడో విన్నట్లుందే ! అనిపిస్తున్నది . ఎక్కడ విన్నాను అన్నది తెలీదు . "
ఆలంబినికి వాడి జన్మ పూర్వ వృత్తాంతమును , లేదా తాము చూచిన దృశ్యమును , ఆచార్యుల కల , అంతా వాడికి చెప్పవలె ననిపించెను . అయితే చెప్పవచ్చునో లేదో అని ఆలోచిస్తూ వాడి ముఖాన్ని చూస్తూ ఎందుకో , ’ వద్దు , ఇప్పుడు కాదు ’ అనిపించినది . వాడుకూడా , అమ్మ అట్లే చూచుట చూసి , అర్థము లేని నవ్వు నవ్వుచూ , ’ ఎందుకమ్మా , అట్లా చూస్తున్నావు ? ’ అన్నాడు . తల్లికి పుత్ర వాత్సల్యము అంతా తానే యై , ఆ వెనకటిదంతా మరిపించుటకు , చేతులు చాచి వాడిని హత్తుకొని , తల నిమురుతూ , ’ కాదురా , నీకింకా రెండు సంవత్సరాలే వయసు , ఎంత మాట్లాడుతున్నావే అని ఆశ్చర్యమైనదయ్యా , అందుకే అట్లా చూస్తూ ఉంటిని " అన్నది .
బాలుడు , అలాగా యని , మరలా ’ ఏదమ్మా , ఇంకా రెండు మంత్రాల అర్థము మళ్ళీ చెప్పవూ ? " అన్నాడు .
తల్లి , " ఒక గడియ తాళు , పొయ్యి సరి చేసి నీవైపుకు తిరిగి చెపుతాను " అన్నది . బాలుడు ఆమె వద్దన్ననూ వినక , తొడపై నుంచీ దిగి , కొంచము దూరములో , గురువు గారి వద్ద కూర్చొను శిష్యుని వలె గంభీరముగా ఆమె కోసము వేచి కూర్చున్నాడు . తల్లి కూడా , పొయిలో మంట రాజేసి , పప్పు ఇంకా ఉడుకుతున్నది చూచి , కొడుకు వైపుకు తిరిగినది .
" చూడు, ’ భద్రం కర్ణేభిః ’ అనునది రెండవ మంత్రము .
|| ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః | భద్రం పశ్యేమాక్షభిః యజత్రాః |
స్థిరైరంగై స్తుష్టువాగ్ం సస్తనూభిః | వ్యశేమ దేవహితం యదాయుః ||
అనునది దాని పూర్ణ రూపము . అర్థము చెప్పేదా ?
కొడుకు తల్లి ముఖాన్నే చూస్తూ ఏకాగ్రతతో వింటున్నాడు . ఆ ఏకాగ్రతను చూస్తే , పెద్దవారికి కూడా సాధ్యము కానంత ఏకాగ్రత అది ! అటూ ఇటూ అల్లాడక , నిలుచున్న స్థంభమునైనా అనేకాగ్రత యనవచ్చేమో , వాడు మాత్రము అటుల అనునట్లు లేడు .
తల్లి అది చూసి కొంచము ఆశ్చర్యముతో , ’ విను , యజ్ఞీ , నీకన్నా నేను పెద్దదాన్ని . ఔనా కాదా ? అలాగే , మనకన్నా పెద్దవాళ్ళు దేవతలు . అయితే , వారు కన్నులకు కనపడరు . అలాగని వారు లేరు అనలేము . ఆ దేవతలకు చేసే ప్రార్థన ఇది,’
తల్లి , కొడుకు ఏమైనా చెపుతాడా యని నిలిపింది . కొడుకు అది తెలుసుకొని , ’ అప్పుడే చెప్పితిని కదమ్మా , నువ్వు సరే ననువరకూ నేను మధ్యలో ఏమీ మాట్లాడను ’ అన్నాడు .
తల్లి , అలాగే కానీవయ్యా అని మళ్ళీ ఆశ్చర్యపడుతూ అంది , ’ ఆ దేవతలను గురించి భక్తుడు అంటాడు ,
’ఓ దేవతలారా , మేము చెవుల ద్వారా శుభమైనదానినే వినెదము , కన్నులనుండీ శుభమైనదానిని చూచెదము . మేము ఎల్లపుడూ యజ్ఞమునందు ఉండెదము . మా అంగములు గట్టిగా స్థిరముగా ఉండనీ , మేము బ్రతికున్నంత వరకూ దేవతలకు హితమైనదానినే చేసెదము .’ ’ అది మంత్రపు అర్థము . నువ్వింక చెప్పేది , అడిగేది అంతా చేయవచ్చు ’
" అది కాదమ్మా , దేవతలు కంటికి కనపడరు అన్నావు , అయినా ఉన్నారు అన్నావు . అదేమిటీ ? నేను ఇప్పుడు చిన్న పిల్లవాడిని . నన్ను అగ్నిని ముట్టుకోవద్దు అంటావు , అదే , నేను నీ అంత పెద్దవాడినైతే ముట్టుకోవచ్చు అంటావు , ఇప్పుడు నాకు అటక పైన ఏముందో తెలీదు , ఎక్కి చూస్తే తెలుస్తుంది . అటులేనా అమ్మా , ఇప్పుడు నువ్వు చిన్న వాడివి, పెద్దవాడివైన తరువాత దేవతలను చూడ వచ్చును అనేనా దీని అర్థము ? చెప్పమ్మా ? "
కొడుకు అడిగిన మాట ముద్దుగా ఉండింది . తల్లి మనసు , ముద్దుగా ఉన్ననూ , పెద్ద వారి మాటలవలె ఉన్న కొడుకు మాటలను విని ఆశ్చర్య పడింది . అయినా దాని అర్థము కన్నా , వాడి ముద్దు మాటలనే గమనిస్తూ , కొడుకుకు సమాధానము చెప్పింది ,
" చూడయ్యా , నువ్వు దేవతల గురించి విన్నావు . నేను మీ తండ్రిగారి వెంట యజ్ఞ యాగాదులకు వెళ్ళినాను కదా , ఒక్కొక్క సారి దేవతలు వచ్చి ఆహుతులను తీసుకొనుటను చూసినాను . అయితే అది ప్రతి దినమూ జరగదు . అదిగాక , ఇంకోటి చూడు , మన అగ్ని మందిరములో చూచినావా ? ఎవరో పెద్దవారు కూర్చున్నట్లే ఉంటుంది , ఎవరు అని చూస్తే ఈ కళ్ళకు ఎవరూ కనపడరు . ఇట్లున్నపుడు , దేవతలు ఉన్నారు అనవలెనా లేదా ? "
" నువ్వు చెప్పిన అగ్ని మందిరపు మాట నిజమమ్మా .. నాకు కూడా అనిపించినది . అయితే ఇంకొకటి , అంటే దేవతలు ఉన్నారని చెప్పినావు కదా ! అది నాకు తెలియదు . "
" చూడయ్యా , ఇంకా కొన్ని రోజులు పోనీ , నువ్వు పెద్దవాడవైనాక వారిని అడుగు . వారు అంతా చెపుతారు "
" అలాగే కానీయమ్మా , ఇప్పుడు నేను నోరు మూసుకుని , నువ్వు చెప్పినదంతా విన్నాను . అలాగే ఇంకా కొన్ని రోజులు నోరు మూసుకుని ఉంటాను . ఆ తరువాత తండ్రి గారిని అడుగుతాను . సరేనా ? ఇప్పుడు , నువ్వు అన్నావు ఇంతే కదా , శుభమైనదాన్నే విందాము , శుభమైన దానినే చూద్దాము , యజ్ఞములో ఉందాము , గట్టిగా ఉందాము , దేవతల హితమునే చేద్దాము . అంతా సరియే కదమ్మా ? "
" సరిగ్గా చెప్పినావయ్యా "
" నాకెందుకో ఇది సరిగ్గా అర్థము కాలేదు . అయితే నువ్వన్నావు కదా , పెద్ద వాడినయ్యాక తెలుస్తుంది అని ! అంతవరకూ నువ్వు ఏమి చేయమంటే అది చేస్తాను . తర్వాతది చెప్పమ్మా "
మూడో మంత్రము ఇది అన్యత్ శ్రేయః అనేది .
|| ’ అన్యత్ శ్రేయః అన్యదుతేవ ప్రేయః తే ఉభే నానార్థే పురుషం సీనీతః |
తయోః శ్రేయః ఆదదానస్య సాధు భవతి | హీయతే అర్థాత్ య ఉ ప్రేయ వృణీతే ||
" అమ్మా , నాకు ఈ మంత్రము చెప్పవలెననిపిస్తున్నది , చెప్పవచ్చునా ? "
" దానికి కూడా ఆగితే మంచిది నాయనా "
" ఐతే సరే , అలాగే ఆగుతాను , చెప్పవలెను అనిపించినపుడు నీదగ్గరకు వస్తాను . చెప్ప వచ్చునో , లేదో నువ్వు చెప్పుదువు గాని ! సరే , దీని అర్థము చెప్పు "
దాని అర్థము , : శ్రేయస్సు ప్రేయస్సు అనునవి రెండు . అవి రెండూ వేర్వేరు . రెంటికీ లక్ష్యములు వేరే వేరే . రెండూ మనుష్యుని కట్టివేస్తాయి . వాటిలో శ్రేయస్సును పట్టిన వానికి శుభము కలుగును . ప్రేయస్సుకావాలంటే , వాడు గురిని వదలి దారి తప్పుతాడు "
కొడుకు అది విని గంభీరుడైనాడు . కన్ను రెప్ప కొట్టలేదు . ఏదో ధ్యానిస్తున్నట్లున్నాడు . ముఖ ముద్రా , దేహ భావమూ ఏదో గొప్ప భావముతో కనిపిస్తున్నాయి . ఇప్పుడు వాడిని చూస్తే , ఎవరో జ్ఞాని , తపస్సు చేసినవాడు , ఏదో మహా వాక్యపు అనుసంధానములో ఉన్నట్టు కనిపిస్తున్నాడు ( మహా వాక్యము అంటే బ్రహ్మమును బోధించు వాక్యము )
అది చూచి ఆలంబినికి మరలా ఆశ్చర్యమైనది . " మిగిలిన వారంతా బంతులు , గోళీలు ఆడే వయసు .వీడేమో మంత్రార్థమును అడుగుతున్నాడు . విని , దానిని మథనము చేయుటకు ప్రయత్నిస్తున్నాడు . ఇదేమిటి వీడి లోక విలక్షణ నడత అని ఆమెకు ఆశ్చర్యమే ఆశ్చర్యము . ఏమైనా సరే , భర్తకు ఈ మాట చెప్పవలెను . " అనుకున్నది .
తల్లి , కొడుకు సమాధికి భంగము కలిగించలేదు . సద్దు చేయకుండా లేచి వంట పని చూసుకున్నది . కొంచము సేపైన తర్వాత ఏదో భారమును మోస్తున్న వాడు దానిని దించి , ఊహ్ అనునట్లు , కొడుకు నిట్టూర్పు వదలి లేచినాడు .
" అమ్మా , నాకేమో శ్రేయస్సే కావాలి అనిపిస్తున్నది , ప్రేయస్సు అంటే ఏమి ? అనునది తెలీదు . అది నువ్వే చెప్పమ్మా . ఏమైనా సరే నువ్వు చెప్పువరకూ నీమాట ప్రకారమే నడచుకొంటాను , అంతే ! "
"నిద్ర వచ్చిందని నువ్వేమీ దిగులు పడవద్దు . నిద్రలో విన్నది ఇంకా బాగా పట్టుబడుతుందట" - బాగుంది
ReplyDelete==============================================================
కొంత కాలం తన విద్యాభ్యాసం, శిష్యరికం చేసినా శిష్యుని అనుకున్న స్థాయిలో progress కలుగలేదని
ఓ గురువుగారు ఆ శిష్యుడికి పగటి బోధ మాని రాత్రుళ్ళు మొదలుపెట్టారు - అంతే ఆ శిష్యుని దశతిరిగింది.