17. పదిహేడవ భాగము-- వివరణ
మాఘమాసము పరుగెత్తుకుంటూ వచ్చింది . అదే , అలాగ పరుగెత్తి వచ్చుటే కాలపురుషుని నియమమేమో అనిపిస్తుంది . ఏదైనా మనకు ఇష్టమైన కార్యముంటే ఆ కాలపు పరుగు సంభ్రమముతో చూస్తాము . అలాగు కాకుంటే , కాల చలనమునకు మన మనసులోని భారము వేసి , ఎంత నిదానము అంటాము . అలాగయితే కాలానికి మన సుఖదుఃఖాల రంగులే రంగులా ? దానికి తనకే సొంతమైన రంగులు లేవా ?
మనుష్యుడు తానే కర్తనని కూర్చున్నపుడు కాలానికి సొంత రంగులు ఎక్కడివి ? కాలము ఎవరికోసము దేనిని కాచి ఇస్తుందో అది ఎవరికీ తెలియదు ! త్రికాలజ్ఞులగు జ్ఞానులకు దానిని తెలుసుకొనుటకు అంత ఆసక్తి ఉండదు . అయ్యేది అవుతుంది , కావలసినది అవుతుంది , దానిని తెలుసుకొని చేయవలసినదేమి ? అని విరక్తితో చూచువారు వారు . కాలగర్భమును వెదకి చూడాలనుకునే ఆసక్తులకు , దానికి తగిన శక్తి లేదు . ఇలా ఉన్నపుడు కాలమునకు సొంత రంగులు ఎక్కడినుండీ రావలెను ?
ఆలంబిని , తల్లి జాయంతిని పిలిపించుకొని , చౌలమునకు కావలసినవన్నీ చేసుకున్నది . వారికి కర్మ యొక్క వైదికాంగమునకు కావలసినది సిద్ధ పరచుకొనుట కన్నా , లౌకికాంగపు ఆరతి ,అక్షింతలు , పూలు , పళ్ళు , తాంబూలాలకు కావలసినవి చేయుటలో కుతూహలము ఎక్కువ . అది చాలదన్నట్లు , రాజ భవనము వారు కావలసిన పదార్థములు వీరు అడిగిన వాటికి రెండు ముడు రెట్లు ఎక్కువగా పంపించి , ’ కార్యము వైదిక , లౌకిక రెండు అంగములలోనూ వైభవముగా జరగవలెను " అని విజ్ఞాపన చేసుకున్నారు .
చౌలము మాఘ శుద్ధ సప్తమి బుధవారము జరుగవలెనని నిర్ధారణ అయ్యింది . స్వయముగా బుడిలులే వచ్చి కూర్చొని చౌలకర్మనూ , అక్షరాభ్యాసమునూ నిర్వహించెదరు అని తెలిసినది . మంగళ వాద్యముల వారికి చెప్పడమయినది . రాజభవనపు క్షురకుడే రావలెను అన్నది కూడా నిర్ణయమైనది . కులపతులూ , రాజ పురోహితాదులు , అందరికీ విందు ఆహ్వానము వెళ్ళింది . తల్లీ కూతుళ్ళు మాట్లాడుకుంటూ సర్వమునూ సిద్ధము చేసుకుంటున్నారు .
" బుడిలులు వచ్చి పీటపైన కూర్చొనునది ఒకటే ఆలస్యము . మంచి ఎండిన కలప , సమిధలను సమర్పిస్తే యజ్ఞేశ్వరుడు ప్రజ్వలించునట్లు అంతా సూత్ర ప్రకారముగా నడచి పోవును . వంటవారు వంటలను చేస్తారు . మనది ఏమున్నను సాయంకాలపు కోలాహలమే . కొంచము కూడా హెచ్చుతగ్గులు కాకుండా ఉండలు , వాయనములను పంచవలెను . పెద్దవారికి పెద్ద ఉండలు , చిన్నవారికి చిన్న ఉండలు . పెద్ద ఉండలు నూరైనా ఉండవలెను " ఇత్యాదులు..
ఆచార్యులు ముందటి దినమే స్థండిలము ఎక్కడ వేయవలెను ? నాపితుడు( క్షురకుడు )ఎక్కడ కూర్చోవలెను ? తనకు , బుడిలులకు మడి పంచలు ఎట్టివి ? యజ్ఞేశ్వరుని తెచ్చువారు ఎవరు ? సమిధలన్నీ సరిగ్గా ఉన్నాయా ? మొదలైన వివరములనన్నిటినీ చూసుకున్నాడు . కులపతులూ , దూరము నుండీ వచ్చువారందరూ ఆ సాయంత్రమే వచ్చినారు .
బుధవారము వచ్చింది . సూర్యుడు ఇంకా ముఖము చూపించునంత ఎత్తుకు ఎక్కినాడో లేదో , బుడిలుడూ , నిర్ణయించిన ఇతర బ్రాహ్మణులూ వచ్చినారు . కర్మ ఆరంభమై సాంగముగా నడచినది . మాత్రాసహ భోజనము చేసి వటువు చౌలము చేయించుకొని స్నానమునకు వెళ్ళినాడు . బుడిలులు వచ్చి , " నీళ్ళు పోస్తున్నపుడు నీ పుత్రుడికి కళ్ళు మూసుకొని చూడమని చెప్పమ్మా , ఆలంబమ్మా. వాడు ఏమిచెపుతాడో అది నాకూ , మీ యజమానులకూ చెప్పు " అని అన్నారు .
స్నానకాలములో ఆలంబిని నీరు పోయునపుడు కొడుకును ’ ఏమి కనపడుతున్నది ? ’ అని అడిగింది . వాడు కళ్ళు మూసుకుని చూచి , " ఐ ! ఇదేమమ్మా ఇదీ ? , చేపలు ? బిల బిలమని పారాడుతున్నాయి " అని అన్నాడు .
ఆచార్యుడూ , బుడిలులూ అది తెలుసుకొని బహు సంతోష పడినారు . ఆచార్యుడు , ’ దానివలన ఏమి సాధించవచ్చును ? ’ అని బుడిలుని అడిగినాడు . దానికి వారు నవ్వుతూ , ’ కానిమ్ము , ఆచార్యునికి ఈ ముసలోడి నోట ఏమి వస్తుందో వినాలని కుతూహలము . ముసలోడికి చెప్పవలెనను చపలత్వము . చెపుతాను . చూడు , ఈ చౌలము అన్నమయ కోశమూ , ప్రాణమయ కోశమూ స్వతంత్రమై వేరే వేరే అయినాయి అనుటకు గుర్తు . ఇంతవరకూ ఒకటిగా నున్న కోశములు వేరుపడిన గుర్తుగా ప్రాణమయ కోశము చేపలుగా కనిపించినది . ఇంక మనోమయ కోశమూ , విజ్ఞానమయ కోశమూ స్వతంత్రమగును . ఇక మాత్రా శిష్యుడగు కాలము ముగిసింది . పిత్రాశిష్యుడగు కాలము వచ్చినది . ఇక ముందు నువ్వు ఆ బాలకుడిని వీపుపై వేసుకొని ఆడించాలి చూడు , మరచి పోవద్దు . ఈ దినము చేపలను చూచినదాని ఫలముగా రేపు బాలుని ముఖముపైన భ్రూమధ్యనుండీ నెత్తిపై వరకూ ఒక నల్లటి గీత కనిపించును . అదేమిటీ అంటావేమో ? అది , అన్నమయ కోశమునకు అంకితమై ప్రాణమయ కోశము తాను పొందిన నలుపును వదలుట. ఆ నలుపు ఆ రూపముగా కనబడుతుంది . అది రెండు మూడు దినములుండి పోతుంది . దాని గురించి గాబరా పడవద్దని ఇంటిలో చెప్పు ."
స్నానమైనది . వటువు మరలా వచ్చి తండ్రి పక్కన కూర్చున్నాడు . అక్షరాభ్యాసము అయింది . మంత్రములను చెపుతున్న బుడిలులు ఉన్నట్టుండి మధ్యలో నిలిపినారు . " నిషుసీద సరస్వతి " అను మంత్రమును సామముగా పాడినారు . వెనక్కు తిరిగి చూచినారు . ఉద్ధాలకులు , వైశంపాయనులు ’ సరే , సరే , ’ అన్నారు . ఉద్ధాలకులు మాత్రము ’ గణానాం త్వా ’ కూడా కానివ్వండి అన్నారు . వైశంపాయనులు కానివ్వండి , మంచిదే అన్నారు . బుడిలులు ’ గణానాం త్వా ’ మంత్రాన్ని సామముగా పాడినారు . కర్మమంతా యథాక్రమముగా నడిచింది .
అక్షరాభ్యాస కాలములో నిషుసీద , గణానాం త్వా అను మంత్రములను సామముగా పురోహితులు పాడినది ఎందుకు అన్నది ఎవరికీ అర్థము కాలేదు . కానీ , బుడిలులతో , మీది అక్రమము అని చెప్పుటకు ఎవరికీ ధైర్యము లేదు . అడిగితే కులపతులు అడగవలెను . వారిద్దరూ ఒప్పుకున్నారు . అయినా ఊరకే ఉంటే సందేహ నివృత్తి యగుటెట్లు ? వటువులు వెళ్ళి ఆచార్యుడిని పట్టుకున్నారు . ఆవేళకు అక్కడున్న రాజ పురోహితుడు కూడా , ఔను , ఆచార్యా , నాకు కూడా అర్థము కాలేదు . కాబట్టి వారిని అడుగుట మంచిది " అన్నాడు . ఆచార్యునికి కూడా నిజంగా అర్థము కాలేదు . కాబట్టి మధ్యాహ్నము తర్వాత అడుగవలెను అని నిర్ణయించినారు .
వైశ్వదేవము అంతా ముగిసిన తర్వాత , ఆచార్య దంపతులనూ , కుమారునీ కూర్చోబెట్టి అందరూ ఆశీర్వాదము చేసినారు . ఇంకేమి అందరూ తాంబూల చర్వణము మొదలుపెట్టవలెను, అప్పుడు రాజ పురోహితుడు ఆచార్యునికి సైగ చేసినాడు . ఆతడు బుడిలుని అడిగినాడు : " యజమానులతో ఒక విషయమును ప్రస్తావించవలెను . "
" అవశ్యము అడుగవయ్యా , ఒక వేళ మాకు తెలియకుంటే కులపతులు , అందులోనూ దిగ్ధంతుల వంటి వారు ఇద్దరున్నారు . దేవతలు ఉన్నారు . న్యాయముగా ఇది బ్రహ్మ సభ, ఇక్కడ కాకపోతే , నీ సందేహములు ఇంకెక్కడ తీరును ? అడుగు "
" తమరు ఈ దినము ’ నిషుసీద ’ , ’ గణానాం త్వా ’ అనే రెండు మంత్రాలను సామముగా ఎందుకు పాడినారు అన్నది తెలియలేదు . అందుకని మేమంతా తమరిని సందేహ నివారణ కోసము ఆశ్రయించినాము "
" చూడండి , కులపతులారా ! కావాలన్నా నేను ఆచార్యుని మాటకు ప్రతియాడగలనా ? అతని మాట ఎంత వినయ సంపన్నమైనదో చూచితిరా ? ఉత్తరము కోసము నన్ను ఆశ్రయించినారంట ! ఇంతటి వచోవైఖరి యున్నవాడనియే ఈ మహా పురుషుడు నీ గర్భమున పుట్టినాడయ్యా . ! కులపతుల అనుజ్ఞ అయితే నేనే చెప్పెదను . "
వైశంపాయనుడు ఉద్ధాలకుల ముఖము చూచి , అనుజ్ఞ పొంది అన్నాడు , " మేము లోకపు దృష్టిలో కులపతులము . తమరు అపరిగ్రాహులై కులపతిత్వము వద్దన్నారు . అయితే , యోగ్యతలో తమరు మాకన్నా పెద్దవారు . ఇప్పుడు కూడా మీరు ఔనంటే మేము తమదగ్గర శిష్యరికం చేయుటకు సంసిద్ధులము ......"
ఉద్ధాలకులు , " వీరిదీ మాదీ ఈ విషయములో ఏకవాక్యమే ." అన్నారు . వైశంపాయనులు కొనసాగించినారు ," కాబట్టి తమరు చెప్పితే మేము కూడా తెలుసుకొని న్యూనాతిరేకములుంటే సరిచేసుకుంటాము . "
బుడిలులు అన్నారు , " కానివ్వండి , మాకు వయో వృద్ధత్వముతో పాటు జ్ఞాన వృద్ధత్వమును కూడా తమరు కల్పిస్తే నేనెందుకు వద్దన వలెను ? సత్యా యేతే ఆశిషస్సంతు . ఈ ఆశీర్వాదములు నిజముకానీ అని ముందే అనుకుందాం , వినండయ్యా ,! "
" దేహములో షట్చక్రములున్నాయి . వాటన్నిటిలో మూలాధార చక్రమే జ్యేష్ఠము . అక్కడనుండి , చెరువు నుండీ బయలుదేరి కాలువలోకి వచ్చు నీరు వలె శక్తిబయలు దేరి దేహమునందంతటా ప్రసరిస్తుంది . దానిని అధిభూతముగా ( పర బ్రహ్మముగా ) తెలుసుకొను వారు అనేకులు . వారు దానిని అన్నమయ కోశగతముగా చూచి , దేహము సశక్తమైనది అంటారు . దానినే ఆధ్యాత్మకముగా చూచువారు , మనోబుద్ధులలో దాని ఆటను చూచి, " చూచితిరా , వాడి మనో బుద్ధులు ఎంత పటుత్వముతో ఉన్నాయో " అంటారు . అది అధియజ్ఞమైనపుడు ( ప్రధాన యజ్ఞము అనగా , ఉపాసనల వలన దేవతలను సంతృప్తి పరచినపుడు ) దేవతా శక్తి స్వరూపమై దేహములో ప్రకటమై , అమానుష కర్మలను చేయించును . అది అధిదైవతమైనపుడు ( దేవాంశతో కూడినది ) ఈ శక్తి ప్రసారము దేహపు ఆద్యంతమూ కలిగి , అంగాంగములలో భిన్నముగా కనపడిననూ , ఒకటే యనునది అర్థమగును . దాని వలన వేదవిదులైన వారు అధి యజ్ఞమైన శక్తి ప్రసారమును కర్మ కాండ యనీ , జ్ఞాన కాండ యనీ చూచెదరు . ఇదంతా అర్థమైనది కదా ? ఇంకా వినండి ,
" అక్షరాభ్యాస కాలములో , అంటే ఈ దినము ఉదయమే నేను మంత్రములను చెప్పుతుంటే , కుమారుని దేహములో శక్తి వ్యూహమై తూగుతున్నది కనిపించింది . అది దేహములో నున్న నాడినాడులనూ వ్యాపించుతున్నది కూడా తెలిసింది . అది సరస్వతీ నాడిని స్పర్శిస్తున్నది కూడా గోచరమైనది . సరస్వతీ నాడి ఎక్కడ ఉన్నదీ చెప్పవలెనా ? ..సరే , చెప్పెదను . "
" సరస్వతి సుషుమ్న నాడి వెనుక ఉంటుంది . ( సుషుమ్న నాడి మూలాధార చక్రము నుండీ ఆజ్ఞా చక్రము వరకూ ఉన్న నాడి, దీని నుండియే కుండలినీ శక్తి ప్రసరించేది). ఆ సరస్వతీ నాడిని ప్రచోదనము చేసినవాడు , సర్వజ్ఞుడవుతాడు . ఇప్పుడు మనము ఏ పదార్థమును గురించియైనా మనకు తెలిసినట్లు , మనము చూచినట్లు , మనకు తోచినట్లు చెపుతున్నాము . అయితే , తత్వమును - తత్-త్వ అంటే , అసలైన ’ దాని తనము ’ ను చూచినామా ? ఇప్పుడు మనము చేస్తున్నది వారి వారి మనోబుద్ధుల వ్యాపారమైన వ్యాఖ్యానమయిందే తప్ప తత్వ ప్రవచనము అగుటలేదు . ఇప్పుడు మనము గమనించుచున్నది ఇంద్రియ సాక్షాత్కారమును మాత్రమే . ఇంద్రియములతో ఎదుటివాడు తాను చెప్పు విషయమును ప్రత్యక్షము చేసుకోగలడా లేదా ---ఇది మన ప్రమాణ లక్షణము . అయితే , తత్వము ప్రమాణ గోచరము కాదు . అది , ప్రత్యక్ష -అనుమాన - ఉపమానము ల కన్నా అవతలిది . దానిని ప్రదర్శన చేయుటకు విశేషమైన శక్తి కావలెను . సరస్వతీ ప్రచోదన వలన ఈ విశేష శక్తి లభించును . కొన్ని శరీరములలో ఈ విశేష శక్తి వాక్కుకు వ్యాపించును . అటువంటి వారిని మనము ఉపాధ్యాయులు అంటాము "
" ఇంతటి సరస్వతీ నాడి ఈ బాలుడిలో ప్రచోదిత మగుచుండుటను నేను చూచినాను . అది ఎప్పుడో ఒకసారి ఈ దేహములో జరుగుతుంటే చాలదు . నిరంతరమూ జరగనీ అని నిషుసీద సరస్వతి అను మంత్రమును సామముగా పాడి ఆ శక్తికి అభివందనము చేసి , ఈ బిడ్డను అభినందించి నేను కృతార్థుడనయినాను . దీనినంతనూ చూచిన కులపతులు ’ గణానాం త్వా ’ కూడా కానివ్వమని అనుజ్ఞ నిచ్చినారు. . దాని రహస్యమును వినండి "
: ఈ శక్తి ప్రసారము మూలాధార చక్రము నుండీ సూక్ష్మ శరీరపు నాడులలో చేరినపుడు సరస్వతి యగును . అప్పుడు ఆమె , పరా--పశ్యంతి --మధ్యమా - వైఖరి యను నాలుగు స్థానములలో ప్రకటమై వ్యూహమును కట్టి ఆడించును . అది గణపతి వ్యూహమగును . అప్పుడు గరిక వలె మూడు మూడై , దేహమునంతా వ్యాపించియున్న స్థూల నాడులలో సంచరించును . దేహము స్థూలమైనందు వలన అక్కడక్కడ విఘ్నములు ఏర్పడును . ఈ విఘ్నములు బాహ్యముగా ఉండవచ్చును , అభ్యంతరముగా ఉండవచ్చును . దానివలన బాహ్యాభ్యంతరముల విఘ్నములు కించిత్తు కూడా ఉండకుండా చేయుటకే మనము గణపతిని పూజించేది . దానికోసము , ఈ శక్తి ప్రసారము ఈ దేహములో కించిత్తూ విఘ్నము లేకుండా జరగనీ యని ’ గణానాం త్వా ’ చెప్పమని కులపతుల అనుజ్ఞ అయినది . నేను దాని ప్రకారమే సామముగా పాడినాను . "
" అదేమి , సామముగానే ఎందుకు పాడవలెను ? యజుస్సు వలె ఎందుకు చెప్పరాదు ? యజుస్సు ఛందో బద్ధముగా లేదందురా , ఋక్కు వలె అయినా పాడి యుండవచ్చును కదా ? " సభలో ఎవరో అడిగినారు .
బుడిలులు కులపతి ముఖము చూచినారు . ఉద్ధాలకులు , " అయ్యగారు దానిని కూడా చెప్పేయండి , ఈ దినము తమరి ముఖములో సరస్వతి నర్తిస్తున్నది . మేము కూడా విని , ఆమె పూజ చేసి కృతార్థులము అయ్యెదము " అన్నారు .
బుడిలులు ’ అనుజ్ఞ ’ యని నమస్కరించి చెప్పినారు . చెప్పుటకు ముందే యాజ్ఞవల్క్యుని వైపుకు తిరిగి చూచినారు . కుమారుడు నిశ్చలముగా పద్మాసనములో ధ్యానాసక్తుడై యున్నట్లు కూర్చున్నాడు. అది అందరికీ చూపించి బుడిలులు అన్నారు : , " అవును , మీరు అడిగిన ప్రశ్న సమంజసమైనది . ఒకే మంత్రము ఋగ్యజుస్సామ వేద త్రయములో వస్తే దాని వినియోగము ఎలాగ అనునది మీ ప్రశ్న . వినండి , ఋక్కు వలన అవ్యక్తము వ్యక్తమగును . వ్యక్తమైనదానిని విస్తారము చేయునది సామము . అటుల అభివ్యక్తమై విస్తారమైనదానిని ఆరాధించుటకు యజుస్సు . కాబట్టి దేహములో చూచిన శక్తి ప్రసారము నిత్యము కానీ యని , విస్తరించనీ యని , సదా నిర్విఘ్నముగా జరగనీ యని , నేను ఆ మంత్రమును సామముగా పాడినాను . "
అందరూ లేచి వచ్చి బుడిలులకు ప్రణామములు చేసినారు . వారిలో కులపతులు కూడా చేరినారు . బుడిలుడు ’ వేద పురుషాయ నమః ’ యని ఆ ప్రణామములను అంగీకరించినారు . ఇంకా కుమారుడు మాత్రము కళ్ళు తెరవలేదు . బుడిలులు, " తామందరూ నేను చెప్పిన సమాధానమును ఒప్పుకున్నారు . అందుకు తామందరికి నమస్కారములు . అయితే , ఆగండి , ఎవరి కోసము దీనిని చేసినానో ఆతడు ఏమి చెప్పునో విందాము . " అని కుమారుని వైపుకు తిరిగి , " ఏమయ్యా , యాజ్ఞవల్క్యా , ఇప్పుడు చెప్పినదంతా సరిగ్గా ఉన్నదేమయ్యా ? " యని వినయముగా , విశ్వాసముతో అడిగినారు .
కుమారుడు కళ్ళు తెరచి , గంభీరముగా , సంతుష్టుడై , తలాడిస్తూ " సరిగ్గా ఉంది " అన్నాడు .
బుడిలుడు ’ బ్రతుకు జీవుడా ’ యన్నట్టు నిట్టూర్చినాడు .
ReplyDeleteఒకే మంత్రము ఋగ్యజుస్సామ వేద త్రయములో వస్తే దాని వినియోగము ఎలాగ అనునది మీ ప్రశ్న . వినండి , ఋక్కు వలన అవ్యక్తము వ్యక్తమగును . వ్యక్తమైనదానిని విస్తారము చేయునది సామము . అటుల అభివ్యక్తమై విస్తారమైనదానిని ఆరాధించుటకు యజుస్సు - అద్భుతం
=============================================================
ఇది బాగుంది అని ఒక్కక్కటీ ఎంచి చెప్తూ పోతే ప్రతీది బాగుందనే వున్నది. మహాదర్శనము పేరు కు తగ్గట్లున్నది