’మహాదర్శనము ’ శ్రీ దేవుడు నరసింహ శాస్త్రి గారు
’మహాదర్శనము ’ శ్రీ దేవుడు నరసింహ శాస్త్రి గారు రాసిన అనేక కృతులలో ప్రముఖమైన మూడింటిలో ఒకటి , చివరిది . ఇది యాజ్ఞవల్క్యుని కథ.
పేరుకి యాజ్ఞవల్క్యుని కథ యథాతథముగా రాసినా , ఇందులో అనేక తత్త్వ రహస్యములు , అంతరంగ రహస్యములు , ధ్యాన రహస్యములు మనిషి ఎంతవరకూ అభివృద్ధి చెందవచ్చునో కళ్ళకు కట్టినట్టు , తేలికైన భాషలో , సులభముగా అర్థమయ్యే రీతిలో వ్రాసినారు . మనలో , మన శరీరములో మనకు తెలియని ఇన్ని రహస్యములున్నవా అని అబ్బుర పరచే కావ్యము.
ఆధ్యాత్మికము , తత్త్వము అనగానే చాలామందికి ఒక విముఖత. నిజానికా విముఖత ఆధ్యాత్మికము పైనో , తత్త్వము పైనో కాదు. అది వ్రాసిన విధానము , వ్రాయుటకు వాడిన భాషలపైన మాత్రమే ఆ విముఖత . సరైన విధానములో సరైన భాష వాడి రాస్తే విషయమేదైనా పాఠకులను పట్టి ఉంచుతుంది అనునది ఈ పుస్తకము చక్కగా నిరూపిస్తుంది .
ఈ మహా దర్శనము పుస్తకము రాయుటకు ముందు దీనిని ఒక నాటక రూపముగా రాసియుండినారు . అది 1952 లో ఆకాశవాణిలో ప్రసారమయినది . ఆ నాటకము ఒక పత్రికలో కూడా ప్రచురించబడినది . ఆ తరువాత దీనినే విస్తరించి కాదంబరి ( నవల ) రూపములో వ్రాసినారు. అది కూడా ఇంకొక పత్రికలో ధారావాహికగా అచ్చయినది . 1935 ప్రాంతములో దేవుడు గారు అప్పట్లో ’ మీమాంస కంఠీరవ ’ బిరుదు తెచ్చుకున్న " శ్రీ వైద్యనాథ శాస్త్రి " గారి దగ్గర సంప్రదాయ బద్ధముగా ’ మీమాంసా శాస్త్రమును నేర్చుకున్నారు . ఆ సమయములో వారి మిత్రులొకరు యాజ్ఞవల్క్యుని విమర్శించినారట. అప్పుడు దేవుడు ఆ మిత్రుడితో " ఒక వేదము , ఒక బ్రాహ్మణము , ఒక ఉపనిషత్తు మానవ లోకానికి తెచ్చి ఇచ్చి, ఇంకొక ఉపనిషత్తుకు కారణమైన యాజ్ఞవల్క్యుడు మహాపురుషుడు . అతడిని ఇలాగ విమర్శించుట తగదు ’ అని చెప్పినారు . ఈ పుస్తకము వారు వ్రాయుటకు ప్రేరణ అదే .
శ్రీ దేవుడు నరసింహశాస్త్రి గారు రాసిన ’ మహా బ్రాహ్మణ ’ పుస్తకమును ’ మంత్ర ద్రష్ట ’ పేరుతో నేను చేసిన అనువాదము మీరంతా చదివియున్నారు . వారి కథా కథనము , శైలి , పాఠకుని కట్టి పడవేయు నటువంటి సన్నివేశ చిత్రణ మీకు పరిచితములే . ఈ పుస్తకము కూడా వారి ప్రతిభకు మరొక తార్కాణము. ఇటువంటి పుస్తకములు వ్రాయవలెనంటే కొన్ని సిద్ధులు కలిగి ఉండవలెను . సిద్ధులు ఉంటే చాలదు వాటిని తేలికగా విడమరచి చెప్ప గలగాలి , దానికి ప్రతిభ, నేర్పు ఉండాలి . ఇవన్నీ ఉన్నా స్వానుభవము లేకపోతే కేవలము మేధను ఉపయోగించి వ్రాయుట అసాధ్యము .
ఒకసారి చదువుట మొదలు పెట్టుట వరకే మన వంతు . తరువాత అది పూర్తియగు వరకూ నిలపకుండా చదివించే చాకచక్యము దేవుడు గారిది . ’ మహా బ్రాహ్మణ ’ ను అనువదించునపుడు నేను కొంత కష్ట పడినది నిజమే , కానీ ఈ ’ మహా దర్శనము ’ అనువదించుటకు నాకున్న సర్వ శక్తులూ , ప్రతిభలే కాక , దేవుడి గారి ఆశీర్వాదము , ఆ భగవంతుడి అనుగ్రహము లేక పూర్తి చేయుట దుస్సాధ్యము అని నాకు మొదట్లోనే అర్థమయినది . ఆయన శైలిలోని ఒక విశేషమేమంటే , ప్రతి పాత్రలోనూ తాను దూరి , కథ చెబుతున్నామన్న ధ్యాసతో కాక , ఆ నిమిషానికి ఆ పాత్ర ఏమాలోచించునో / అనుభవించునో అంత మాత్రమే , ఆ పాత్ర పరముగా వ్రాసి , సంభాషణలు కూడా తదనుగుణము గానే వ్రాయుట. పాఠకులకు సరిగ్గా అర్థము కావలెను కాబట్టి కావలసిన వివరాలన్నీ అప్పుడే చెప్పవలెను అన్న ఆత్రము ఏమాత్రమూ లేకుండా , కథతో పాటే పాఠకుడు కూడా నడుస్తూ , ఒక్కొక్కటీ ఆకళింపు చేసుకుంటూ , ముందుకూ వెనక్కూ పేజీలు తిప్పి తిప్పి సరి చూసుకుంటూ సరిగా అర్థము చేసుకుంటూ వెళ్ళేలా చేస్తాడు . దీనిలో ఏమాత్రమూ విసుగుదల కాదు కదా అసౌకర్యము కూడా లేక, మరింత ఆసక్తిగా చదివించేలా చేయడమే ఆయన ప్రత్యేకత. ఒకభాగములో చదివినది సరిగా అర్థము కాకున్నా , తరువాతి భాగములలో అది పూర్తిగా విశదమై మనల్ని ఆశ్చర్య చకితులను చేస్తుంది . అదీ ఆయన శైలి .
ఇందులోని కొన్ని నిగూఢ రహస్యములను , తత్త్వ బోధలను , సరిగా , తప్పులు లేకుండా , తప్పు అర్థము రాకుండా వ్రాయుట నాకు కత్తిమీద సామే అయినది . వారిని ప్రార్థించి , నేను ఎంతో కొంత కృతకృత్యుడనై ఉంటే దాని పూర్తి ఫలమూ , ఖ్యాతీ , శ్రీ దేవుడు గారికే నిస్సందేహముగా చెందుతుంది .
అనువాదము ఇంకా నడుస్తున్నది . సంక్రాంతి నుంచీ ఇవ్వగలనని అనుకుంటున్నాను .
శుభం భూయాత్
No comments:
Post a Comment