SHARE

Friday, January 25, 2013

19. " మహాదర్శనము --పంతొమ్మిదవ భాగము --గోవుల వెంబడి


19. పంతొమ్మిదవ భాగము--   గోవుల వెంబడి

          
         సూర్యోదయమైన కొంచము సేపటిలోపలే అగ్నిహోత్రమును ముగించుకొని , ఆలంబిని పాల కోసమని గోశాలకు వెళ్ళినది . ఆ రోజు కొడుకు ఎప్పటివలె అగ్ని మందిరములో కూర్చోక , తల్లితో పాటు గోశాలకు వెళ్ళినాడు . పాలు పిండుట అంతా ముగిసినాక , గోపాలకుడు ఆ గోవులన్నిటినీ మందగా బయటికి పంపించినాడు. పశువులు వెళ్ళునపుడు యాజ్ఞవల్క్యుడు ప్రతియొక్క ఆవునూ ముట్టి ముట్టి చూచినాడు . ఏదీ కూడా ఆ స్పర్శను వద్దనలేదు . వాటికి ఏమి సుఖము అనిపించినదో , ఒక్క ఘడియ నిలచి , ఆ స్పర్శను స్వీకరించి , ముందుకు సాగినవి . 

కుమారుడు తల్లి వీపునెక్కి ఊగుతూ , ’ అమ్మా, నాకు ఒక కోరిక కలిగింది ’ అన్నాడు .

" ఏమిటయ్యా ? " అన్నది తల్లి ఆప్యాయంగా . 

" ఈ ఆవులతో పాటూ నేను కూడా పోయివస్తాను " 

" పోవచ్చు , అయితే అవి తిరిగి వచ్చేది సాయంత్రానికే . అంతవరకూ నువ్వు ఏమీ తినకుండా ఉండుట సాధ్యమా ? " 

" ఆ గోపాలకుడు రోజూ ఏమి చేస్తాడు , మరి ? "

" అతడు ఇప్పుడు చద్దన్నము తిని , మధ్యాహ్నానికై బుట్ట తీసుకొని వెళతాడు " 

" నేను అయోధ్య ధౌమ్యుల శిష్యుడు చేసినట్లే చేస్తాను " 

" అంటే ఏమి చేస్తావూ ? " 

" వాడు ఆవుల పొదుగు దగ్గర నోరు పెట్టి పాలు తాగేవాడట ! " 

" సరిపోయింది , పుణ్యాత్మా , నువ్వు అలాగ చేసేవాడవే ! ! అయితే హోమధేనువు దగ్గర మాత్రము అట్లా చేయవద్దు " 

" ఎందుకమ్మా ?"

          " చూడు , హోమధేనువంటే దాని పాలను దినమూ హోమానికి ఉపయోగించవలెను . దానికి ముందే దూడ తాగవలెను . మరి అలాంటపుడు , పొదుగులోని పాలన్నీ నువ్వే తాగేస్తే , పాపం , దాని దూడ గతి ఏమి ? హోమానికి ఏమి చేసేది ? " 

         " అయితే నువ్వు ఆ ఎర్రావునే కదా , ఈ సారి హోమధేనువు చేసినది ? అది నాకు వద్దులే , తెల్లావు గంగ కానీ , నల్లావు కాళి కానీ అయితే ఫరవాలేదు కదా ? , అమ్మా , ఈ రోజు ఒకటైంది . " 

" ఏమిటీ ? " 

" ఆవులు మాట్లాడుతున్నాయి . నేను వాటిని ముట్టి ముట్టిఅడిగినాను , నేను కూడా ఈ దినము మీతో పాటే  కాచేందుకు రానా ? అని . ఒక్కొక్క ఆవు , ’ ఊ ’ అన్నాయి "

" ఊ అన్నాయి ! నీ తలకాయ . ఆవులు మాట్లాడినాయి అని ఇంకెవరి దగ్గరైనా అంటే నవ్వుతారు " 

" నిజంగా , అమ్మా ! అవి మాట్లాడినాయి .... అంటే నేను అబద్ధం చెప్పుతానా ? " 

         పిల్లవాడి ముఖము ఎర్రనైంది . అబద్ధము చెప్పుట మహాపాపము అన్న నమ్మకము ఉన్నవాడివలె , స్పష్టముగా మాట్లాడిన కొడుకును చూసి , ఇక వికోపమునకు వదలరాదు అని , " అలాగేమి ? నువ్వు అబద్ధము చెప్పేవాడివి కాదు , అయినా వారికి ఒకమాట చెప్పి వెళ్ళుట మంచిది . ఈ దినము వారు అధ్యాపనములో నున్నారు . సమయము సరిపోదు , రేపు వెళ్ళవచ్చులే , నీతో ఆవులు మాట్లాడుతున్నాయన్నావు కదా ? నాకు కూడా వినపడేటట్లు మాట్లాడతాయా ? " అన్నది . 

కొడుకు అది బహు సామాన్యమైన సంగతి అన్నట్లు , " దానికేమి , రేపు నీ హోమధేనువునే మాట్లాడిస్తాను . చూడు , నువ్వీ దినము వారితో మాట్లాడి రేపు నన్ను పంపించమ్మా ! " అని చేతులు పట్టుకొని అడిగినాడు . 

        కొడుకు ఆశపడుటను చూసి తల్లి , ’ దానికి ఇంతగా అడగవలెనా ? అలాగే కానీ ! అదేం పెద్ద పని ? ఇక వెళ్ళి నేను పెరుగు చిలకవలెను . నువ్వు వెళ్ళి నడిమింట్లో కూర్చో . అధ్యయనము అవుతున్నది " అని వెళ్ళిపోయినది . 

         ఆ సాయంత్రము అగ్నికార్యమైన వెంటనే కొడుకు తల్లికి సైగ చేసినాడు . " తండ్రిని అడిగినావా ? అనుమతి ఇచ్చినారా ? " అన్నది ఆ సైగ భావము . తల్లి , కొడుకు సైగ చూచి , విస్మయపడుతూ భర్తకు చెప్పింది , " మీ కొడుకు రేపు ఆవులతో పాటూ వెళ్లవలె నంట " 

" అంటే ? "

" వాడినే అడగండి . వివరమంతా చెపుతాడు . అయోధ్య ధౌమ్యుని శిష్యుడు చేసినట్లే ఆవు పాలు తాగి సాయంత్రానికి ఇంటికి వస్తాడంట" 

" ఏమిటయ్యా సంగతి ? " 

        " ఏమీ లేదు , ఈదినము నేను గోశాలలో ఉన్నపుడు ,’ నువ్వు కూడా మా జట్టులో ఎందుకు రాకూడదు ? " అని ఒక గొంతు వినిపించింది . చూస్తే , ఆవు మాట్లాడించి నట్లయింది . ’ నిజమా , చూద్దాము ’ అని ఒక్కొక్క ఆవునూ ముట్టీ నేను మీతో పాటూ వచ్చేదా అని అడిగినాను , ’ రావయ్యా ’ అన్నాయి . అందుకని వెళ్ళి రావాలి అనుకున్నాను " 

          ఆచార్యుడు గంభీరుడైనాడు . ఆవులు , కావాలన్నపుడు మౌనము గానే మాట్లాడగలవు అని అతడు వినియున్నాడు . అదీకాక , అతనికి ఒక యోగి దర్శనమై యుండినది . ఆతడు , జగత్తంతా శాంతముగా నిద్రకు జారిన పిమ్మట , ఈతనితో నిద్రలోనే సంభాషణ చేసినాడు . ఆతడు మాట్లాడినది ఇతడికి బాగా వినిపిస్తుంది . ’ ఈతడు దానికి తన మనస్సులో ఇచ్చిన ఉత్తరము అతనికి వినిపించును . ఇప్పుడు మనము కర్మేంద్రియముతో ఈ వ్యాపారము జరుపుతున్నాము , అలాగే కర్మేంద్రియము తో కాక, జ్ఞానేంద్రియముతో కూడా ఈ వ్యాపారమును జరపవచ్చునా ? ఆ జ్ఞానేంద్రియముతో వ్యాపారము చేయుట సామాన్యులకు సాధ్యము కాదా ? కలలలో కర్మేంద్రియములు లేకనే కదా , వ్యాపారము సాధ్యమయ్యేది ? మరి అది మెలకువ లోనూ సాధ్యమా " అని అనేక ప్రశ్నలు పుంఖానుపుంఖములుగా వచ్చినవి . దానికి సరియైన సమాధానము దొరకలేదు . అయిననూ ఇప్పుడు ఆచార్యుడు కొడుకును అడిగినాడు , " అలాగయితే , పొద్దున్నే ఏమి తిని వెళతావు ? " కొడుకు ఏమీ చెప్పకుండా తల్లి ముఖము చూసినాడు . తల్లి , ’ నువ్వు కూడా ఆవులను తోలుకుని వెళ్ళేవారి వలెనే చద్ది తిని వెళ్ళవలెను ’ అంది .

          ఆచార్యుడు , ’ నీ కొడుకుకు ఎప్పుడూ చద్దన్నము పెట్టవద్దు . వండిన వంటలో ప్రాణము అది వేడిగా ఉన్నంతవరకే ఉండును . ఆరిపోయినాక, దానిని ప్రాణము వదలును . దేహములో జరుగు కార్యములన్నీ , ప్రత్యక్ష , అప్రత్యక్షముగా ప్రాణము వలననే జరుగును . ఇక్కడ అన్నమై అన్నమయ కోశములనూ , అక్కడ అన్నాదుడై ప్రాణ పంచకమునూ , మనోబుద్ధులనూ నడిపించు ప్రాణమునకు చద్దన్నము హితము కాదు . కాబట్టి వేరేగా హవిస్సు వలె అన్నము చేసి , దానికి ఉప్పు , నెయ్యి , పెరుగు వేసి వడ్డించు . వాడు వెళ్ళిరానీ. చూడు నాయనా , నిన్ను రమ్మన్న ఆవును , నీకు ఆకలైనపుడు మాట్లాడించు . ఏమి చేయవలె నన్నది అదే తెలియజేయును " అన్నాడు . 

           ఆరాత్రి ఆచార్యుడు , కొడుకు నిద్రపోయిన తర్వాత వాడిదగ్గర కూర్చొని రక్షోఘ్న మంత్రములను పారాయణము చేసి ’ రేపు వీడు పశువులను కాచుటకు వెళ్ళినపుడు వీడికి చెడ్డదేమీ జరగకుండనీ , అంతా మంచే జరగనీ ’ అని ప్రార్థించాడు . కొడుకును వెళ్ళిరమ్మని ఎందుకు చెప్పినాడు ? అని అతనికే చోద్యము . అది కూడా వాడి ప్రభావమేమో ? 

          ఈ మధ్య అతనికి ఒక విచిత్రానుభవము కలుగుచుండినది . కొడుకు వద్ద ఉంటే , కామ్యేష్టుల సంగతులు రావడమూ , వాటికి బదులుగా పశుయజ్ఞముల విచారము తలలో నిండిపోవడము జరుగుతున్నది " ఆ యజ్ఞముల అర్థము ఇంకేమో అయి ఉండ వచ్చునా ? కావచ్చు. ఒక్క పశు యజ్ఞమేనా ? యజ్ఞ యజ్ఞమునకూ ఇంకేదో అంతరార్థము ఉన్నదై ఉండవచ్చును . యూపాదులను స్థాపించి , యజ్ఞములను చేయు అధికారమున్న వారి విషయము సరే , ఆ అధికారము లేని వారుకూడా ఆ యజ్ఞ ఫలము పొందవలెనన్న ఏమి చేయవలెను ? ఏ రీతిలో చేస్తే ఆ యజ్ఞము బ్రహ్మ యజ్ఞమగును ? " అని కొన్ని విచిత్రమైన ప్రశ్నలు తరంగములుగా వస్తాయి . 

          అతడు కొన్ని సార్లు , దీనికి కారణమేమి యని వెదకి చూచినాడు . జ్ఞాతముగా ఏ కారణమూ తెలియలేదు . " సరే , ఇతడి ప్రభావమే అయిఉండాలి . లేకుంటే అలాగెందుకవుతుంది ? ’ అని ఆలోచించినాడు . కొడుకు సన్నిధానము లేనపుడు ఆ తరహా ప్రశ్నలు గుర్తు తెచ్చుకుందామన్నా రావు . ఇలాగ , అన్వయ వ్యతిరేకములతో , కొడుకు ప్రభావమే దీనికి కారణము అన్న సిద్ధాంతమునకు వచ్చినాడు . 

1 comment:

  1. చద్దన్నము పెట్టవద్దు. వండిన వంటలో ప్రాణము అది వేడిగా ఉన్నంతవరకే ఉండును - బాగుంది

    ReplyDelete