23.-- ఇరవై మూడవ భాగము --- పూర్ణపు దారి శాస్త్రము
ఆచార్యుడు , బుడిలులతో పాటు ఇంటికి బయలు దేరినాడు . దారిలో వారు అప్పుడపుడు మాట్లాడినారు , ’ ఆచార్యా , అపరిగ్రహమంటే ఏమనుకున్నావు ? ఎంతెంత ప్రయత్నించినా అధీనమునకు రాని ఇంద్రియమనే మదపుటేనుగుకు అదే అంకుశము " బుడిలులకు ఇంకా అపరిగ్రహపు జాడ్యము వదలలేదు .
ఆచార్యుడు , "నేనొక మాట అనవచ్చునా ? " అని వినయముతో అడిగినాడు .
బుడిలులు , " అడగవయ్యా , అడిగేవన్నీ అడగియే తీరవలెను . లేకుంటే అదే శలాక లాగా మారి, ఎప్పుడో ఒకసారి హృదయము శల్యమగును . " అన్నారు .
" సరే , తమరు చెప్పేది , ఇంద్రియ జయము అనేది తప్పక సాధించవలసిన విషయము అని నమ్మిన వారికి . దానిని నమ్మక , ఇంద్రియ లోలత్వమే జీవనపు ముఖ్యోద్దేశము అని నమ్మినవారికి , అటులే ఆచరించువారికి ఈ అపరిగ్రహము వలన ఏమి ప్రయోజనము ? "
బుడిలులు పకాలున నవ్వేశారు . " అదే మరి ! చీకట్లో కనబడక , గాడిద పిల్లను తెచ్చి మేకల మందలో కలిపేస్తే , గాడిద మేక అవుతుందా ? "
" కాదు "
" అలాగే ఇది కూడా ! ఐతే చూడు , మానవ మాత్రుడన్నవాడు ఎవడైనా సరే , ఎల్లపుడూ ఇంద్రియ జయమునే అపేక్షించును . అలాగ లేనివాడెవడైనా ఒకడున్నాడంటే , వాడు దారితప్పి , మనిషిగా మారిన మృగము అనవచ్చు . స్వభావమనునది , మృగము వలె ఇంద్రియ లోలత్వము కాకుండా ఆటంకములను కలిగించును .. అలాగే మనిషి ఒకవేళ ఇంద్రియ లోలుడైతే అతడి స్వభావము ఏదో ఒక అడ్డమును తెచ్చి రంగములో వదలును . "
" ఈ కార్యము చేయుటలో స్వభావమునకెందుకు అంత శ్రద్ధ ? "
" చూడు ఆచార్యా , స్వభావానికి శ్రద్ధాలేదు , అశ్రద్ధా లేదు . ప్రతి ఇంద్రియ కార్యమునకూ మనము కొంత విలువ నివ్వవలెను . అంటే , ఆ విలువకు తగిన శక్తి ఖర్చు అగుచుండును . అంగడిలో వ్యాపారము చేయునపుడు , మనము తీసుకువెళ్ళిన ధనము చాలకపోతే అప్పుచేసి వస్తాము కదా ? అలాగే జన్మమెత్తునపుడు మనము కొంత శక్తిని తెస్తాము . అది సత్కార్యముల వలన వృద్ధియగును . దుష్కార్యముల వలన క్షీణించును . ఈ జన్మలో మనము చేయు కార్యములకు మనము తెచ్చుకున్న శక్తి చాలకపోతే , మన స్వభావము మనకు కొంత ఇచ్చును . అదికుడా చాలకపోతే , అప్పుడు ఇంద్రియ దౌర్బల్యము మొదలైనవి వస్తాయి . కానీ అది ఈ జన్మలోనే కావచ్చు , లేదా జన్మాంతరములో కావచ్చు . "
" జన్మాంతరము ఉన్నదని ఎలా నమ్మేది ? "
" ఆలోచన చేయగలవారందరూ నమ్ముతారు . ఒకవేళ నమ్మరనుకుందాము , నష్టమేమిటి ? సముద్రమును చూడనివాడు సముద్రము రెండు కొబ్బరిచెట్ల లోతు ఉందంటే నమ్మేదెలా అని శంకిస్తే , సముద్రపు లోతుకేమి నష్టము ? దానివలెనే , వదిలేయి . ఇంకేమి , మీ ఇల్లు కూడా వచ్చింది , ఈ పనికిరాని మాటలు ఇక్కడే వదిలేద్దాం . "
ఆచార్యుని ఇల్లు వచ్చినది . ఆచార్యుడు పరుగెత్తివెళ్ళి తాను కాళ్ళూ చేతులూ కడుక్కున్నాడు , ఆ వేళకు వాకిలికి వచ్చిన ఆలంబిని బుడిలులకు పాద్యమునిచ్చి అర్ఘ్య ఆచమనములను తెచ్చిపెట్టింది . ఆచార్యుడు వచ్చి , బుడిలులను పిలుచుకువెళ్ళి కృష్ణాజినము వేసిన వేత్రాసనములో కూర్చోబెట్టాడు . అల్పాహారపు ఉపచారము కూడా అయినది .
బుడిలులు అడిగినారు , " ఎక్కడ మన యాజ్ఞవల్క్యుడు ? "
" ఇప్పుడే లేచి కాళ్ళు ముఖం కడుక్కుని వస్తున్నాడు . "
అంతలో యాజ్ఞవల్క్యుడు వచ్చి బుడిలులకు సాష్టాంగ నమస్కారము చేసినాడు . బుడిలులు , " సుఖీభవ ’ అని ఆశీర్వాదము చేసి , వాడిని తనవైపుకు ఎత్తుకున్నారు . వారి ముఖము ఉదయించు సూర్యునివలె విస్తారమైనది . ప్రకాశముగా కూడా అయింది . వాడిని ఎత్తుకొని తమ తొడపై కూర్చోబెట్టుకొని యథోచితంగా సత్కరిస్తూ , " సందేహము లేదు ఆచార్యా , నీ కొడుకు ఈ వయసుకే విప్రుడైనాడు . మన దూరపు ఆశ నెరవేరింది . ఇక వీడు దేవుని దయ వలన సర్వజ్ఞుడగును . ఈ చుట్టు పక్కల దేశములలో వీడిని గెలువగల విద్వాంసులే కాదు , వీడితో సమానులైన విద్వాంసులు కూడా ఉండరు . " అని తమ సంతోషమును ప్రకటముగా వ్యక్తపరచినారు .
యాజ్ఞవల్క్యుడు ఏమీ తెలియనివాడివలె , " తాతా, నేను మిమ్మల్ని చూడాలనుకున్నాను " అన్నాడు
బుడిలులు విస్మయపు నవ్వు నవ్వుచూ , " కారణము ? " అన్నారు .
యాజ్ఞవల్క్యుడు అన్నాడు , " నేను తమరిని రెండు మాటలు అడగవలెననుకున్నాను . అదేమో , మా తండ్రిగారిని అడుగలేదు . మీరు ఊ అంటే మిమ్మల్ని అడుగుతాను : లేదంటే వారినే అడుగుతాను "
" నువ్వేమనుకున్నావు ? "
" నాకు మా తండ్రి సగము చెప్పినారు , మిగతా సగము వారే చెప్పనీ అన్నారు . తమకు ఇష్టమైతే అలాగే కానివ్వండి , నేను తెలుసుకోవాలి , అంతే ! అది ఇక్కడినుండీ అయితేనేమి , అక్కడినుండీ అయితేనేమి ? నాకెందుకు ? " అన్నాడు .
బుడిలులు ముసిముసిగా నవ్వుతూ ఆచార్యులవైపు చూచినారు . ఆచార్యుడు , " నేనేమీ చెప్పించలేదు , అవన్నీ వాడి స్వంత మాటలు " అన్నాడు .
బుడిలులు యాజ్ఞవల్క్యుని వీపు నిమురుతూ , " అలాగేనయ్యా , అడుగు , పెరిగే ఈ చెట్టుకు నన్ను కూడా ఒక చెంబు నీరు పోయనీ " అన్నాడు.
యాజ్ఞవల్క్యుడు అన్నాడు , " నిన్న మా హోమధేనువు, ’ ప్రాణము అన్ని దేహములలోనూ ఉంది , ఈ జగత్తులో అంతటా ఉంది ’ అన్నది . దానిని సాక్షాత్కరించుకొనుట ఎట్లు ? ఇది మొదటిది , రెండోది , శాస్త్రమంటే ఏమి ? మనము దానిని తెలిసికొనుట ఎట్లు ? అది తెలిసినదనుదానికి గుర్తేమి ? "
బుడిలులు గంభీరులైనారు . " చూడయ్యా , యాజ్ఞ వల్క్యా , ప్రాణము గురించి విను , అది దేహములో నున్నపుడు అగ్ని అవుతుంది . అందుకే మనము అగ్ని పూజ చేసేది . అది కార్యము చేయునపుడు వాయువగును . దేహములో అయితే దానిని ప్రాణమంటాము , బయటికి శ్వాసిస్తూ ఉంటే దాన్ని వాయువు అంటాము . అదే , ఆకాశములో సర్వ ప్రాణధారియైన ఆదిత్యుడు కూడ. నువ్వు అగ్నిహోత్రమును స్వతంత్రముగా చేయు వరకూ ఇలాగే ధ్యానము చేస్తూ ఉండు , ఇక శాస్త్ర విషయము చెప్పేదా ? "
" చెప్పండి "
"చూడయ్యా , మనము వ్యవహారము చేసేది బహిర్ముఖము , అంతర్ముఖము అని రెండు విధములు . బహిర్ముఖమంటే , మనకన్నా విశాలమైన ఈ జగత్తులో ఇంద్రియ మనో బుద్ధుల చేత వ్యాపారము చేయునది . అది జాగ్రత్తు . ఒకవేళ అది తప్పిందనుకో , అప్పుడేమవుతుంది ? కలలా అవుతుంది . మేలుకుని ఉన్ననూ , కంటికి ఏమో కనిపిస్తుంది , చెవికి ఏమో వినిపిస్తుంది . అలాగ , విని , చూచుటలో ఒక నియమము ఉంది . , ఆ నియమానుసారముగా కళ్ళు చూచి , చెవులు వింటే అప్పుడేమవుతుంది ? అప్పుడు అంతర్ముఖమవుతుంది . సామాన్యముగా మనమందరమూ బహిర్ముఖులము , ఎందుకో తెలుసా ? "
" యమధర్మ రాజు నచికేతునికి చెప్పినాడు కదా , తాతా ? "
" ఔనయ్యా , నాకు తెలిసినంతవరకూ అదొక్కచోటే దీనిని ప్రస్తావించినది . బ్రహ్మ , ఇంద్రియములను బహిర్ముఖంగా ఉంచాడట ! అందుకే మనము బహిర్ముఖులమే అయ్యాము . అయితే , ధీరుడైన ఒకడు , అంటే , ఇంద్రియముల వశుడు కాకుండా , ఇంద్రియములను తన వశము చేసుకున్నవాడు అంతర్ముఖుడగును . అలాగ అంతర్ముఖుడయినాక ఏమవుతుందో తెలుసా ? "
యాజ్ఞవల్క్యుడు గంభీరముగా ఆలోచించినాడు : " ఇంద్రియములకు వశుడు కాక, ఇంద్రియములను వశపరచుకొన్నవాడు....? "
బుడిలులు పిల్లవాడి గంభీరమైన ఆ భావమును చూచి , తూష్ణీ భావముతో ఊరికే కూర్చున్నారు . ఆలంబిని, ఆచార్యులు అక్కడే నిలుచున్నారు . వారు తమకు ప్రత్యేకమైన అస్తిత్వము లేనట్టే , స్థంభముల వలె అవాక్కై నిలచి వింటున్నారు .
బుడిలులు కొనసాగించారు , " అలాగ ఇంద్రియములను వశపరచుకొన్నవాడు అంతర్ముఖుడగును. బహిర్ముఖ వ్యాపారములలో కళ్ళు ముఖ్యమైనవి . కళ్ళతో చూచుట సరే , కానీ కళ్ళతో చూచినదంతా , చెవితో విన్నపుడు ఆవృత చక్షుడవగలడు . అప్పుడు , చెవితో విన్నపుడే , అది శాస్త్రము . అంతవరకూ అది శాస్త్రమైననూ కానట్టే . అలాగ కళ్ళతో చూచినదానిని చెవితో విన్నప్పుడేమవుతుందో తెలుసా ? అంతవరకూ తాను చూచినది చెపుతున్న వాడు , శాస్త్రమును తెలుసుకొని తత్త్వజ్ఞుడగును . అంటే , తాను చూచిన మర్మపు అర్థమును తెలుసుకొని చెప్పువాడగును . "
" మరి అంతవరకూ ? "
" అప్పుడే చెప్పితిని కదా ? చూచినది తనకు తోచినట్లు చెప్పుతుండును . మనసుకు తోచినదానిని బుద్ధితో వివేచన చేసిననూ , అది అతత్త్వమే అవుతుంది కానీ తత్త్వమెలా అవుతుంది ? అలాగు తత్త్వజ్ఞుడగువరకూ ఆత్మజ్ఞుడెలా అవగలడు ? ఆత్మజ్ఞుడగువరకూ బ్రహ్మజ్ఞుడెలా అవగలడు ? బ్రహ్మజ్ఞుడగు వరకూ సర్వజ్ఞుడెలా అవగలడు ? కాబట్టి , తత్త్వజ్ఞుడు కావలెనని , చూచినదాని ’ దాని తనము ’ కనుక్కోవలె ననుకొన్నవాడు , శాస్త్రమును ఆశ్రయించును . అంతర్ముఖుడగు వరకూ శాస్త్రమును ఆశ్రయించడు . ఆవృత చక్షుడగు వరకూ అంతర్ముఖుడు కాలేడు , ఇంద్రియ మనో బుద్ధులు స్వతః తమకు తోచినట్లు వర్తించు వరకూ ఆవృతచక్షుడు కాలేడు . ... కాబట్టి అన్నిటికన్నా ముందు ఇంద్రియములను అదుపులో ఉంచుకోవలెననునది మనకు ఆదేశము . అనంతరము మనసు , తరువాత బుద్ధి .....ఇలాగ ఒకటొకటీ అదుపులోకి రాగలవు . కాబట్టి , తత్త్వమును చెప్పునది శాస్త్రము ! ఇంద్రియ మనో బుద్ధులు తన అధీనములో ఉన్నవాడికి మాత్రమే అది అర్థమగును . తెలిసిందా ? "
యాజ్ఞవల్క్యుడు అనన్యసాధ్యమైన ఏకాగ్రతతో వింటున్నాడు : " అంటే , మా తండ్రిగారు చెప్పినట్లు , ఈ చివరలో నున్న శ్రేయస్సును పట్టుకున్న వాడికి శాస్త్రము ! దాని ఆ చివర పూర్ణము . పూర్ణమునకు పోవు దారి శాస్త్రము , అంతేనా ? "
బుడిలులు బహు సంతోషపడినారు : " బహు సులభముగా , గొప్పగా నిరూపించినావు , చూడు ఆచార్యా , వాడు చెప్పినది ఎంత సరళముగా ఉందో ! తనకు తోచినట్లు పోయే ప్రేయస్సు యొక్క దారి వదలి , శ్రేయస్సు వైపుకు తిరిగినవాడికి శరణమైనది శాస్త్రము . దాని చివర పూర్ణము . పూర్ణపు దారి శాస్త్రము !! భలే బాగా చెప్పావయ్యా ."
బుడిలులు అ మాటనే ఆలోచిస్తున్నవారిలాగా ఒక్క ఘడియ అదే ధ్యానములోనున్నారు . మూసిన కళ్ళు తెరచి , " ఆచార్యా , నీ కొడుకు సర్వజ్ఞుడగుటకే పుట్టినవాడు . గర్భాష్టమము వరకు వేచియుండవద్దు . గర్భ పంచమములోనే ఉపనయన సంస్కారము చేసెయ్యి " అన్నారు.
No comments:
Post a Comment