మకర సంక్రమణము--ఉత్తరాయణ పుణ్యకాలము
సౌరమానము ప్రకారము సూర్యుడు ఒక రాశి నుండీ ఇంకో రాశిని ప్రవేశించుటను ’ సంక్రమణము ’ అంటారు.
సంవత్సరములో పన్నెండు సంక్రమణములు సంభవిస్తాయి. వీటిలో కర్కటక సంక్రమణము , మకర సంక్రమణము ముఖ్యమైనవి. కర్కటక సంక్రమణము తో దక్షిణాయణము , మకర సంక్రమణము తో ఉత్తరాయణము మొదలవుతాయి.
కొన్ని సంక్రమణముల తరువాత కానీ , ముందర కానీ , లేక తరువాతా ముందరా-రెండు వైపులా కానీ ఉన్న ఘడియలను పుణ్యకాలము అంటారు. ఉదాహరణకు మేష మాసము ప్రారంభమయ్యే మేష సంక్రమణము ముందరి పది ఘడియలు , అలాగే తరువాతి పది ఘడియలూ పుణ్యకాలము( రెండున్నర ఘడియలైతే ఒక గంట ) అలాగే తులా సంక్రమణములో కూడా !
కర్కటక సంక్రమణములో నైతే ముందరి ముప్పైఘడియలు పుణ్యకాలము.
మకర సంక్రమణములో నైతే తరువాతి ఇరవై ఘడియలు పుణ్యకాలము.
ఈ సారి మకర సంక్రమణము ఉదయము తొమ్మిదిన్నర-పది గంటల మధ్య సంభవిస్తున్నది ( ఇది వాక్య సిద్ధాంతము ప్రకారము. అదే దృగ్గణిత ప్రకారమైతే పదకొండున్నర తరువాత. కానీ శాస్త్ర వచనము ప్రకారము దృగ్గణితమునకు రసక్షయము , బాణ వృద్ధీ కలుగును కాబట్టి , వాక్య సిద్ధాంతమే సమంజసమని అనేకుల మతము )
కాబట్టి ఉదయము తొమ్మిదిన్నర తరువాత నుండీ పగలంతా ( దాదాపు ఎనిమిది గంటల సమయము ) పుణ్యకాలమే !!
ఉత్తరాయణ ప్రవేశ కాలములో సమస్త నదులు , వాపీకూప తటాకములు ,సమస్త జలములూ గంగోదకముతో తుల్యమై యుండి, నరుల యొక్క పాపములను పోగొట్టుటకు సిద్ధముగా ఉండును.
సంక్రమణ పుణ్యకాలములో చేయవలసినవి
సంక్రమణ పుణ్యకాలములో విశిష్టమైన ఫలములు పొందవలెనన్న, పితృ దేవతలకు శ్రాద్ధము , సూర్యనారాయణుడి పూజ, జపములు , దానములు చేయుట శుభప్రదమని ఋషుల వల్లనూ , పురాణ వచనముల వల్లనూ మనకు తెలియుచున్నది.
పితృ శ్రాద్ధమును పిండ రహితముగా చేయవలెను. శ్రాద్ధము చేయుటకు కారణాంతరముల వలన వీలుకాకున్నచో , కనీసము పితృ తర్పణములైనా వదలవలెను. ( తర్పణ విధానము ఇదే బ్లాగులో ఉన్నది దయచేసి చూడగలరు.) శ్రాద్ధమూ తర్పణమూ చేసేవారు అంతవరకూ ఉపవాసము ఉండవలెను. లేనివారు ఉపవాసము ఉండకూడదు. చాలామంది పుణ్యకాలములో ఉపవాసముండ వలెనని అంటారు. కానీ
|| ఆదిత్యేఽహని సంక్రాంతౌ గ్రహణే చంద్ర సూర్యయోః |
ఉపవాసో న కర్తవ్యః పుత్రిణా గృహిణా సదా ||
అను జైమిని వచనము ప్రకారము , సంతానము కల గృహస్థులు ఆది వారాలు , సంక్రమణముల లోను , సూర్య చంద్రుల గ్రహణముల నాడు ఉపవశించరాదు .
తరువాత , ఎవరి జన్మ నక్షత్రములో సూర్య సంక్రమణము సంభవించునో వారికి ఆ మాసములోనే, వైరము , కష్టము , ధన క్షయము , కలుగును. రేపు ఉత్తరాషాఢా నక్షత్ర జాతకులకు దోషము. దీనికి పరిహారము:
నంది వర్ధనము , తామర ఆకులు , పసుపు , తెల్ల ఆవాలు, లొద్ధుగ లు కలిపిననీటితో , సంక్రమణ సమయములో స్నానము చేసిన క్షేమకరము. ఇది కాక,
అన్ని సంక్రాంతులలోనూ విష్ణుపదాదులు ఉండును. కాబట్టి విష్ణుపూజ చేసిన ఫల ప్రదము.
సూర్యనారాయణుడి పూజ ( కూష్మాండ పూజ )
ఈ పూజ చేయుటకు శుభ ముహూర్తమునెంచుకొని చేయవలెను. ఈ సారి 14-01-2013 నాడు , ఉదయము పదిగంటల నుండీ నుండీ పదిన్నర వరకూ ( రవి హోరలోనూ , ) అలాగే మధ్యాహ్నము పన్నెండు నుండీ ఒంటి గంట వరకూ ( బుధ హోరలోనూ ) చాలా శుభమైనది.
పూజకు , దీపారాధన చేసి , ఇంటికి తూర్పు దిశలో గోమయముతో కానీ గో మూత్రముతో కానీ అలికి , దానిపై బియ్యము లేదా గోధుమలను పోసి , దానిపై బంగారము వలె నున్న పసుపు పచ్చటి గుమ్మడికాయను ఉంచవలెను ( బూడిద గుమ్మడి కాయ పనికిరాదు ) పసుపు పచ్చటి గుమ్మడికాయ సూర్యుడికి సంకేతము. దానికి పసుపు కుంకుమ, గంధపు బొట్లు పెట్టి , నూతన వస్త్రము ( ఎర్రటి లేదా పచ్చటి ) కప్పవలెను. తరువాత బంగారముతో కానీ , ఇత్తడితో కానీ చేసిన లక్ష్మీనారాయణుల విగ్రహమును ఆ గుమ్మడి కాయపై నుంచి , దానిని పంచ గవ్యములతో శోధించవలెను ( స్నానము చేయించవలెను ) పూలతో అలంకరించి ,
తరువాత ,ఈ విధముగా సంకల్పము చెప్పవలెను
( ఆచమనము ప్రాణాయామము అయినతరువాత ) , ఏవంగుణ విశేషణ విశిష్టాయాం , శ్రీ లక్ష్మీ నారాయణ / కులదేవతా ప్రీత్యర్థం , మమ ఇహ జన్మని సమస్త పాప క్షయార్థం , మమ మనోభీష్ట సిధ్యర్థం , మకర సంక్రమణ ప్రయుక్త ఉత్తరాయణ పుణ్యకాలే సకల దేవతా ప్రీథ్యర్థం , శ్రీ లక్ష్మీనారాయణ పూజాం కరిష్యే || తదాదౌ నిర్విఘ్నతా పరి సమాప్త్యర్థం , గణపతి పూజాం కరిష్యే అని చెప్పి ,
మొదట గణపతి పూజనము సలిపి , లక్ష్మీనారాయణులకు కలశ పూజ , ఆదిగా షోడశోపచార పూజలు చేయవలెను. నైవేద్యం , మహా మంగళారతి తరువాత మంత్రపుష్పం సమర్పించవలెను.
ఈ విధముగా పూజ అయిన తరువాత , పూజ చేసిన విగ్రహమును , గుమ్మడికాయను , యథాశక్తి దక్షిణలతో వేద వేత్త , కుటుంబవంతుడైన సద్బ్రాహ్మణునికి పుణ్యకాలములోనే దానము ఇవ్వవలెను. ( సంక్రమణ పుణ్యకాలములో అంతటా ఉన్న నీరు గంగా జలముతో సమానమగును. శుద్ధమైన ఆత్మగల ద్విజులందరూ బ్రహ్మ సమ్మితులౌతారు. వారికి ఏ కొంచము దానము చేసిననూ అది మేరు సమానమవుతుంది. సముద్రమే మేఖలగా గల భూమిని చక్కగా దానము చేసినవానికి వచ్చే ఫలము ఈ ఉత్తమమైన దానమును చేసిన నరుడు పొందును. --స్కాంధ పురాణము )
దానములు ఎప్పుడునూ తూర్పువైపుకు తిరిగి ఇవ్వవలెను.
శుభం భూయాత్
No comments:
Post a Comment