SHARE

Monday, January 14, 2013

4. " మహా దర్శనము "--- నాలుగవ భాగము--- నక్క తోక తొక్కినవాడు


4.  నక్క తోక తొక్కినవాడు

        శ్రావణ శుద్ధ సప్తమి రోజు ఆచార్య దేవరాతుని ఇంట్లో సీమంతోన్నయనము . రాజ పురోహితుడు మొదలుకొని , రాజధానిలోని బ్రాహ్మణ శ్రేష్ఠులందరూ దయ చేసినారు . ఆశ్రమవాసులలో ముఖ్యులను మాత్రము పిలిచినారు . వారిలో కూడా అతి ముఖ్యులు ఉద్ధాలకుడు , వైశంపాయనుడు . 

         సంస్కారము సకాలములో నెరవేరింది . రాజభవనపు వైణికుడు పురోహితుల మంత్రముతో పాటు  వీణావాదనము గావించినాడు . సామగానమయినది . ఋక్కులను పఠించి బ్రాహ్మణులు దంపతులను  దీవించినారు . బయటినుండీ ఎవరో వచ్చినట్టూ , వారి సన్నిధి తమకెంతో ప్రీతి పాత్రమైనట్టూ అందరికీ అదేదో భావన . ఎవరొచ్చినారు ? ఏమిటీ అని వివరాలడిగితే ఎవరూ చెప్పలేరు .  అలాగని , తమకు స్పష్టముగా అనుభవమైన భావనను ఎవరూ కాదనలేరు . 

        కర్మాంతములో బ్రహ్మణాశీర్వాదము జరుగుతుండగా బ్రాహ్మణ ముత్తైదువలు స్వరమెత్తి పాటలు పాడినారు . కొత్త చీరకట్టుకొని పెళ్ళికూతురి కళతో మెరుస్తున్న ఆలంబినీ దేవికీ , గర్భ దీక్షతో ప్రకాశిస్తున్న ఆచార్యునికీ హారతి యెత్తి , దిష్టి తీసి మనస్ఫూర్తిగా దీవెనలందించినారు . అంతా సాంగముగా నడిచింది . అతిథులంతా భోజన తాంబూలాది ఉపచారముల నన్నిటినీ స్వీకరించి తమ ఇళ్ళకు మరలినారు . 

         దేవరాతునికి యజ్ఞేశ్వరుడు చెప్పినది జ్ఞాపకము ఉంది. సీమంతోన్నయనము కానీ అని వేచియున్నాడు . ఈ దినము వరకూ , ఈ కర్మ ముగియు వరకూ గర్భములో నున్న వాడి పైన తనకు అధికారము లేదు . సీమంతమయినాక  గర్భస్థ జీవుడు తన వంశానికి చేరి తన వాడయ్యాడు . ఆ తరువాతనే తాను అడగ దలచుకొన్నదంతా అడిగే అధికారము తనకి వస్తుంది . అంతవరకూ తాను ఆ జీవుడిని మాట్లాడించుటకు కూడా లేదు . 

         " ఇప్పుడు ఆ జీవుడు తన కొడుకైనాడు , నేను వాడిని మాట్లాడించేదా , లేక వాడే నన్ను మాట్లాడించవలెనా ? మాలో ఎవరు జ్ఞాన వృద్ధులో వారిని ఇతరులు మాట్లాడించవలెను . ఈ వ్యవస్థ  తెలిసేదెలాగు ? పిండము చిన్నదయినంత మాత్రాన , అందులో ఉన్నవాడు చిన్నవాడు అనుట యెలా ? దేహ దృష్టితో అలాగ అనవచ్చునేమో కానీ , దేహములో, దేహముకాని ఇంకొకడు ఉండగా , ఈ చిన్నా పెద్దా తారతమ్యము తెలిసేదెలా ? ఎవరు తెలుపగలరు ? " అని ఆచార్యునికి ఈ దినము కూడా పెద్ద ఆలోచన . 

          దానితోపాటూ ఇంకో యోచన . కొడుకు అంటే ’ మాత్రా శిష్యుడు’  . ఉపనయనము అయ్యే వరకు వాడికి తల్లే గురువు . కాబట్టి , తల్లినుండి ఏమేమి నేర్వవలెనో అవన్నీ నేర్వాలంటే ఆమె వాడికి బ్రహ్మవిద్యను కూడా నేర్పవలెను . ఇంతవరకూ తాను భార్యను కర్మ కాండలో తనకు కావలసినట్లు మలచు కొన్నాడే తప్ప బ్రహ్మ విద్యను ఆమెకు చెప్పించ లేదు . బ్రహ్మవిద్య అంటే అదొక కొత్త అనుభవము . దానిని నేర్చితే ఆమె సంసారానికి అయోగ్యురాలవుతుందని తనకు బెదురు . ఇప్పుడిక , ఆ బెదురు వల్ల ముందరి తరము కుంఠితమవుతుందంటే అది న్యాయము కాదు . జరగ వలసిన దంతా జరిగియే తీరవలెను . దీనికి విశ్వమంతా కట్టుబడియే యున్నది . ఈ విశ్వములో ఏదైనా ఒక మూలలో ఏదైనా ఒకటి మంచో , చెడో జరిగితే , అది విశ్వమునంతా వ్యాపించును . ఒక పాత్రలో నీరు తీసుకొని , దానిలో ఒక ముద్ద చెక్కెర గానీ , ఉప్పుగానీ వేస్తే అది కరగి నీరంతా వ్యాపిస్తుంది . అది ఎక్కువగా ఉంటే నీటికి తన రుచిని ఇస్తుంది . అదలా చేయుటకు చాలినంత లేకున్నా , నీటి రుచిని కొంచమైనా మార్చును . అదే విధముగా , వ్యక్తి వ్యక్తి యొక్క కార్య కలాపములన్నీ కూడా విశ్వ వ్యవహారమును రూపించును అను నమ్మకము ఉన్న ఆచార్యుడు , పుత్రుడు గర్భములో ఉండగానే తల్లి వాడికి శిక్షణను ప్రారంభించ వలెను అనుదాన్ని ఎలా మరవగలడు ?  దాన్ని ఎలా తిరస్కరించగలడు ? 

          అదీకాక , సాక్షాత్తూ యజ్ఞేశ్వరుడే చెప్పినాడు కదా , " దేవ , ఋషి , పితరులు ఆ జీవుడు మరలా భూమిలో పుట్టుటకు నిన్ను ఎంచుకున్నారు " అని ! అలాంటపుడు తాను ఎలా నడచుకొనవలెను ! అది చాలదన్నట్టు , " ఇపుడు గర్భములో పుట్టబోయే కొడుకు మీ వంశమును మాత్రమే కాదు , లోకాన్నే ఉద్ధరించును " అన్నపుడు , తాను ఆ శిశువు శిక్షణను ఎటుల కుంఠితము చేయగలడు ? ఇక తప్పదు , తల్లియే బిడ్డకు శిక్షణ నిచ్చుటకు కావలసిన సామర్థ్యమును తల్లికి కల్పించి ఇవ్వవలెను . లేకున్న , తాను కర్తవ్య లోపము చేసినవాడవుతాడు . అది సర్వథా కూడదు . " 

          " ఈ విషయము సరే , మరి నా భయము  లేదా  , సంశయము తీరుటెలా ? గర్భమున నున్న జీవుడితో మాట్లాడువరకూ సంశయము తీరదు . కాబట్టి , ఇప్పటికి , సంశయమే లేనప్పుడు ఎలా నడచుకొనెదనో , అలా నడచుకొనవలెను . మొత్తానికి , ఎవరో విశ్వోద్ధారము చేయుటకు సామర్థ్యమున్న జీవుడు మా కడుపున పుట్టబోతున్నాడు . వాడు పుట్టి పెరిగిన తరువాత అతడి సామర్థ్యములో ఏ లోపమూ కనబడకుండా చూసుకొను భారము నాది . ఇప్పుడు తానేమి లోపము చేసిననూ అది ముందు ముందు  వాడి సామర్థ్యమును కుంఠితము చేయవచ్చు . కాబట్టి , నేను దీనిని నా పత్ని ద్వారా నెరవేర్చవలెను . నెరవేర్చుట మాత్రమే కాదు , ఆ కార్యము మొత్తము సంతృప్తిగా జరుగునట్లు సర్వభారమును వహించవలెను . "

          " సరే , అట్లే , ఆ జీవుడు వచ్చినపుడు మాట్లాడుటకు మొదట నేను పిలవరాదు . వాడే వచ్చి మాట్లాడించనీ . ఔను  , అదే మంచిది , జ్ఞాన వృద్ధులు ఎవరో తెలియనపుడు ఇంకేమి చేయవలెను ? యజ్ఞేశ్వరుని మాటల వలన , వాడే జ్ఞాన వృద్ధుడు యని అనిపిస్తున్ననూ , అది నేరుగా ధృవము కాలేదు .  కాబట్టి , వాడే వచ్చువరకూ వేచియుండవలెను . వాడు వచ్చినపుడు , నీకు తల్లివలన ఏమేమి , ఎటువంటి  శిక్షణ కావలెను ? అని వాడినే అడగవచ్చును . విశ్వోద్ధారము చేయుటకు వచ్చువాడికి ఆత్మోద్ధారపు దారి తెలియకుండునా ? ఒకటయితేనే కదా ఇంకోటి అయ్యేది ? " 

        ఆ దినమంతా వచ్చినవారితో నవ్వుతూ మాట్లాడుచున్ననూ బ్రాహ్మణ భోజన సమయములోను , భోజనోత్తర తాంబూల సేవన వేళ లోను , అనుక్షణమూ అతడికి అదే యోచన . ఏమైతేనేమి , అందరూ వెళ్ళిపోయినాక ,  సాయంత్రము వేళకి తప్పో ఒప్పో ,ఒక నిర్ధారణకు వచ్చి , మనసు తేలికైనది . 

       ఇంకేమి చీకట్లు ముసుర బోతున్నాయి , దేవరాతుడు స్నానానికి లేవవలెను , అప్పుడు ఒక బ్రాహ్మణుడు ఆచార్యుని పిలుస్తూ లోపలికి వచ్చినాడు . అప్పటికే తేలిక మనసుతో ఉన్న ఆచార్యుడు తనను పిలిచిన గొంతు ఎవ్వరిదో , వచ్చినదెవరో వెంటనే గుర్తించి , " దయ చేయండి , బుడిలులు మరలా వచ్చి నన్ను పావనము చేసినారు " అని లేచి అభిముఖముగా వచ్చినాడు . వచ్చిన వాడు బుడిలుడు . రాజ పురోహితుడు భార్గవుని దగ్గర బంధువు . అధ్యయన , అధ్యాపనములలో పేరు ప్రతిష్టలు పొందినవాడైననూ , రాజాశ్రయము వద్దని ,  అంతంత మాత్రముగా ఉన్నా , ఏదో ఉన్నంతలో గుట్టుగా ఉన్నవాడు . అయినా , బ్రాహ్మణ మండలములో సర్వుల గౌరవానికీ పాత్రుడైనవాడతడు . 

బుడిలుడు , " దేవరాతా, నిజం చెప్పు , నువ్వు నక్క తోక తొక్కి వచ్చినవాడివా కాదా ? " అంటూ లోపలికి వచ్చినాడు . 

     దేవరాతుడు అతనికి పాదోదకమునిచ్చి , పిలుచుకొని పోయి నడిమింట్లో వేత్రాసనముపై కూర్చోబెట్టి ,  " మీ మాట నిజమే అయిఉండాలి , కాకుంటే మీరు మరలా వచ్చేవారా ? " అని నవ్వాడు . 

       " నేనెందుకు మళ్ళీ వచ్చినానో తెలుసా ? నేను ఈ వేళకే స్నానము చేసి ముక్కు పట్టుకొని కూర్చొని ఉండవలసినది . కానీ , నిన్ను చూచి , నీకొక సంగతి చెప్పి ఇంటికి  వెళదామని వచ్చినాను . అప్పుడే చెప్పి ఉండవచ్చు గదా అంటావేమో , అది అలాగ పదిమందిలో చెప్పే మాట కాదు . అదొక రహస్యము కూడా, అందుకే చెప్పలేదు . ఈ దినము నువ్వు దర్భాసనము మీద కూర్చొనియున్నపుడు నేను నిన్ను చూస్తూ ఉన్నవాడిని  , అటులే ఊరికే చూస్తూ ఉండాలా లేదా ?  ఊహూ , ఊరికే ఉండకుండా కర్మ జరుగుతున్నపుడు సంయమము చేసినాను . లేదంటే , ఏదో ఒక ప్రబలమైన శక్తి నాతో సంయమము చేయించినది అంటావా , సరే అటులే అనుకుందాం . ఎవరో ఒక మహా తపస్వి ఇక్కడికి వచ్చినాడు . నీ తండ్రి , తాతలు అందరూ అతని వెనకాలే చేతులు కట్టుకొని , శిష్యులు గురువుగారి వెనకాల ఎలాగ వస్తారో , అలాగ వస్తున్నారు . ఇదేమిటా అని నేను ఆశ్చర్య పడుతున్నాను . అప్పుడే ఆ వచ్చినవాడి తేజస్సు చూసి , ఇంతటి తేజస్విని నేను ఇంతవరకూ చూసి యుండలేదే అనుకొంటూ లేచి నిలుచున్నాను . మీ తండ్రి గారిని చూసి , "  వీరెవరు ? "  అంటున్నాను . ’ దేవతలూ , ఋషులూ ఇతడిని లోకోద్ధారమునకై పంపించినారు . మా అదృష్టము . మా ఇంటిలో పుడతాడు . మా దేవరాతుని అదృష్టమే అదృష్టము " అని మాయమైనారు . నేనూ సరేనని తలాడించినాను . అప్పటినుండీ నీకు ఈ సంగతి చెప్పాలని కాచుకొనియున్నాను . సమయము దొరకక , వెళ్ళిపోయి మళ్ళీ వచ్చినాను . నీకు చెప్పిన తరువాతే స్నానానికి వెళదామని వచ్చినాను . ముఖ్యముగా నీ కొడుకు తండ్రికే కాదు , తాత ముత్తాతలకూ కీర్తి తెచ్చువాడు అవుతాడు .  అతిపిత , అతి పితామహుడు ( తండ్రినే కాదు , తాత ముత్తాతలనూ మించువాడు ) అవుతాడు .  అందులో సందేహము లేదు . ఇప్పుడు చెప్పు , నువ్వు నక్క తోక తొక్కినావా లేదా ?  తండ్రిని మించిన తనయుడవబోయే వాడిని ఎత్తుకొనే నువ్వు భాగ్యవంతుడివా కాదా ? " 

" బుడిలుల వంటి మహనీయుల ఆశీర్వాదము వలన అలాగయిన , అది ఆశీర్వాదపు మహత్యము కాదా ? " 

" నీ మహత్యాన్ని నాతో పంచుకోవాలనున్నావా , బాగుంది , సరే , నేనిక వెళ్ళి రానా ? " 

       దేవరాతుడు బుడిలునికి నమస్కారము చేసి , తన భార్యను పిలచి  , ఆమె చేత కూడా నమస్కారము చేయించినాడు . అతని ఆశీర్వాదమును ఇద్దరూ పొందినారు . బుడిలుడు బయలుదేరాడు .

దేవరాతుడు " మాట " అన్నాడు . 

      బయలుదేరిన బుడిలుడు నిలచి , " త్వరగా ముగించు , ఇంకా నేను వెళ్ళి , స్నానము , సంధ్యావందనము , అగ్ని హోత్రమూ చేయవలెను " అన్నాడు . 

" అటులే , బ్రాహ్మణ సమాజములో జ్ఞానము చేతనే కదా వృద్ధత్వము ? " 

       " దానిలో సందేహమా ? బ్రాహ్మణులలో జ్ఞాన వృద్ధులకు అగ్ర తాంబూలము . క్షత్రియులలో పరాక్రమము . వైశ్యులలో ఐశ్వర్యము . ఇతరులలో వయో వృద్ధత్వము " 

       " సరే , ఒకవేళ మీరు చెప్పినట్లే తండ్రిని మించువాడొకడు ,  తండ్రి ఎదురుగా వచ్చినాడనుకుందాం . అప్పుడు తండ్రి అతనికి నమస్కారమెలా చేస్తాడు ? తండ్రి యైనందువలన పెద్దవాడిని కదా , మరి సత్కారము చేయుటెలా ? " 

       " అటువంటి సమయము వస్తే కొడుకు దేహముతో నమస్కారము చేయవలెను , తండ్రి మనస్సుతో నమస్కారము చేయవలెను . "

" ఓహో  , సరే , నాకిది అర్థమే అయి ఉండలేదు " 

        " ఇకమీదట అంతా అర్థమవుతుంది . మీ ఇంటిలో నైతే ఇలాగే జరగబోతున్నది . నేనిక వస్తా ... పొద్దు వాలేపోయింది ..." అని బుడిలుడు త్వరత్వరగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు . దేవరాతుడు  అతడిని వీడ్కొలిపి తాను కూడా స్నానానికి వెళ్ళినాడు . 

3. " మహా దర్శనము "--- మూడవ భాగము-- త్రేతాగ్నులు


3. త్రేతాగ్నులు

          దేవరాతునికి భార్యతో మాట్లాడుటకు ఆ పగలంతా అవకాశమే కలుగలేదు . భార్గవుడు వెళ్ళిన తరువాత , స్నానము , సంధ్య , అగ్నిహోత్రములు , రాత్రి భోజనము ... ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ , ఇంక దేనికీ సమయమే దొరక్కుండా అయింది . 

          ఆలంబినీ దేవి కూడా , పెనిమిటి స్నానాదులకు సర్వమూ సిద్ధము చేస్తూ ఆతడు తనకేదో చెబుతాడు అన్నది పూర్తిగా మరచేపోయింది . స్నానానికి నీరు అందించినపుడు గుర్తొచ్చింది . కానీ రుద్రము చెప్పుకుంటూ స్నానము చేస్తున్న భర్తను అడుగుటెలాగా అని ఊరికే ఉండిపోయింది . మరలా అగ్నిహోత్రమయిన తర్వాత , భోజనానికి ముందు భర్తకు గుర్తు చేసింది . అతడు , " మధ్యాహ్నము సమయమే దొరకలేదు , ఈ రాత్రి నిద్ర పోవుటకు వేగిరము వచ్చేయి , అంతా చెబుతాను " అని తన భోజనమును ముగించుకొని వెళ్ళినాడు . ఆమె మడితోనే అగ్నులకు మూఢములనిచ్చి ( పేడతో చేసిన ఎండిన ఉండలు ) వారి పరిచర్యలను ముగించుకొని తన భోజనము అయిందనిపించుకొని , పాలు తోడు పెట్టి , తాంబూలము తీసుకొని వడి వడిగా శయ్యా గృహమును చేరినది . శయ్యాగృహానికి ఆనుకొనే నడిమిల్లు , అక్కడే దేవరాతుడు తనను చూచుటకు వచ్చే గృహస్థులను ఆహ్వానించి కూర్చోబెట్టేది ,  ఉదయం పూట తన దగ్గరున్న పదహారు మంది శిష్యులకు  పాఠ ప్రవచనములను చెప్పేది . ఇలాగ , పొద్దునా సాయంత్రమూ తనవంతు పని తాను చేసిన తర్వాత నడిమిల్లు , పెద్ద మనుషుల ఇంటి ఇంతుల వలె నిర్లిప్తమౌతుండినది . ఒక్కొక్క రోజు దేవరాతుడు రాత్రి  భోజనమైన పిదప అక్కడున్న వేత్రాసనములలో సుఖంగా కూర్చొని తన పాటికి తాను ఆలోచనలలో మునిగిపోయేవాడు . 

         శయ్యాగృహానికి మరలిన పడతి , మూలలో ఒక ఆసనములో కూర్చొని ,  పైకి వస్తున్న చంద్రుణ్ణి తదేకంగా చూస్తున్న కాంతుని చూడలేదు . అతడు కూడా అన్యమనస్కుడై యుండి భార్య అటుగా వెళ్ళడము గమనించలేదు . అదీకాక , నడిమింట్లో ఉన్న చిరు దీపము అక్కడున్న దాని నంతటినీ తెచ్చి కన్నులకు పట్టించ గలంత ప్రకాశముగా కూడా లేదు . 

         ఆమె , భర్త శయ్యాగృహములో ఉన్నాడనుకొన్నది , అతని శయ్య శూన్యముగా ఉండుటను చూసి వెనక్కు తిరిగి చూసింది . అప్పుడు , మూలకూర్చున్న భర్తను చూసి , తాను వచ్చినది సూచించుటకు చిన్నగా దగ్గింది . ఆ దగ్గు , భర్త గమనాన్ని ఆమె వైపుకు మరల్చింది . అతడు తిరిగి చూసి , " నువ్వు ఇంత త్వరగా వస్తావనుకోలేదు, అందుకే ఈ ఉదయిస్తున్న చంద్రుడి సొగసు చూస్తూ కూచున్నాను . ఇప్పుడు చూడు , ఈ చంద్రుడు ఎర్రగా పగడపు రాశి వలె ఉన్నాడు . వీడే ఇంక కొంత సేపైతే ఇంకా పైకి వచ్చి వెండి వర్ణానికి వస్తాడు . అదెందుకో మనసులోకి వచ్చింది . నీ గర్భములోనున్న శిశువు కూడా ఇలాంటివాడే . పుట్టినపుడు దుర్బలమైన శిశువుగా ఉండి , పెరిగి పెద్దయినాక ఏమవుతాడోనని సంశయ పడుతున్నాను " అన్నాడు . 

" మన కడుపున పుట్టేవాడు మన మాట వినకపోతే ఇంకెవరి మాట వింటాడు ?  కాబట్టి మీరు ఆ సంశయాన్ని వదలండి " 

         " నాకిక సంశయమేదీ లేదు . నాకన్నా ప్రబలుడగు పుత్రుడు పుట్టుటలో నాకే సందేహమూ లేదు . అయితే , పుత్రుడు బ్రహ్మ పరాయణుడై కర్మత్యాగము చేసి , కర్మ భ్రష్టుడైతే ఏమి చేయుట ? అదొకటే సంశయము " 

" మధ్యాహ్నము మీ స్నేహితులు ఏదో చెప్పినట్లుంది ? " 

        " నువ్వు నిలుచున్నావు , నేను కూర్చున్నాను . ఈ మాటలు ఇక్కడ వద్దు , అదంతా విస్తారంగా చెపుతాను పదవే , " అని దేవరాతుడు భార్యతో పాటూ శయ్యాగృహానికి వచ్చినాడు . అక్కడ ఆకులు వక్కలు వేసుకుంటూ మళ్ళీ మాటలు మొదలయ్యాయి . భార్గవుడు తన సంశయ నివారణ కోసము అన్నదంతా చెప్పి , " చూడు , ఆలంబీ , నిన్న రాత్రి చూసినది ఎందుకో భీతి గొలుపుతున్నది . వచ్చి నీ గర్భాన్ని చేరినవాడు శ్వేత వస్త్ర ధారి యైననూ నా మనస్సుకు అతడు సన్యాసి అయి ఉండవచ్చును అనిపించినది . కాబట్టి నీ గర్భములో పుట్టువాడు సన్యాసియయితే ఏమి గతి అని దిగులు . " అన్నాడు

         ఆమె , నోటిలో తాంబూలము ఉన్నదని కూడా మరచి గొల్లున నవ్వింది . నోటిలోని ఎర్రటి తాంబూలపు ద్రవము చింది ఉండాలి . దేవరాతుడు ఉత్తరీయము పైన పడిన ఎర్రటి చుక్కలను భార్యకు ఆ చీకటిరాత్రి ముసినవ్వుతో చూపించాడు . ఆమె నమస్కారము చేసి ,"  అగ్నిహోత్రములో  నిప్పు రవ్వలు ఎగసినట్లైంది . తప్పు మన్నించవలెను " అని దానిని తుడిచింది . 

     " ఇది ముఖ్యముగా నీ రాజ్యము . ఇక్కడ నువ్వేమి చేసినా చేయించుకోవలసినదే " అధికారము కోల్పోయినవాడిలా అన్నాడు భర్త .

         " కావాలని చేసి ఉంటే మీ ఆక్షేపణ సరిగ్గానే ఉండేది .  కానీ ఇది హఠాత్తుగా జరిగింది . అదీగాక , దానికి కారణము మీరే . దేనికీ భయపడని మీరు , ’ గర్భములో మగ పిల్లవాడే పుడతాడు , వాడు సన్యాసియే అవుతాడు ’ అంటూ దిగులు పడుతుంటే నాకు నవ్వు వచ్చింది . ఏమైతేనేమి , మీ కోపము నమస్కారము తో సరి . సరే , ఒకవేళ పుట్టే బిడ్డ ఆడపిల్లయితే ? " 

       " ఇందుకే మిమ్మల్ని , ఆడవారు , అయోగ్యులు అనేది . పుంసవనము అయిన పిమ్మట ఆడపిల్ల ఎలాగవుతుంది ? నీ గర్భములో మగ పిల్లవాడే పుడతాడు . ఆ విషయములో ఆవగింజంత కూడా అనుమానము లేదు . సంస్కారమునకు బలము లేదా ? మీ ఆడవారు , తల తీసి ముందు పెట్టినా నమ్మరు , దూడ ఎదురుగ్గా నిలుచున్నా , దీనికి మూడే కాళ్ళేమో అని సందేహపడే జాతి . అదంతా సరి కాదు , సంస్కార విహితమైనది జరిపినాక , గర్భస్థమైన పిండము మగపిల్లవాడే అవుతాడు . అంతే కాదు , నాకన్నా ప్రబలుడు కూడా అవుతాడు . నా సందేహమల్లా , వాడు ఒకవేళ కర్మ త్యాగము చేసి సన్యాసియయితే ఎలాగా అని మాత్రమే . " 

" కర్మలలో , సంస్కారములలో ఇంత శ్రద్ధ ఉన్నవారు , కొడుకు సన్యాసి కాకుండా  మీరొక హోమాన్ని చేయండి " 

       " అది అంత సులభము కాదు . అయినా , ఆలంబీ , నువ్వు చెప్పేది నిజము . నాకు యజ్ఞవల్క్యుడు--అంటే కొత్త యజ్ఞములను నేర్పించువాడు అని బిరుదు . సన్యాసి కాకుండా చేయుటకు ఒక యజ్ఞమును రచించవచ్చు . కానీ , సన్యాసమంటే ఏమిటనుకున్నావు ? కర్మఠ బ్రాహ్మణుల సంస్కృతీ సర్వస్వపు గోపుర కలశమది . కానీ అక్కడ చెప్పినది కర్మ త్యాగము . దాన్ని నా మనసు ఒప్పుకోదు . అలాగని స్వతంత్రించి ఏమైనా చేద్దామా అంటే , సన్యాసము అనేది శాస్త్రము ఒప్పుకున్నదే , నిషిద్ధమేమీ కాదు . నా ధర్మ సంకటము అక్కడే . " 

      " అలాగైతే నేను చెప్పినట్టు చేయండి , వాడికి గర్భ పంచమములోనే ఉపనయనము చేయండి . ఒక వేదమైనా సాంగముగా అధ్యయనము చేయగానే సమావర్తనము చేయించి పెళ్ళి చేసెయ్యండి . మీ కొడుకైన తర్వాత , వాడు ధర్మాన్ని మీరడు . గృహస్థుడై పడిఉంటాడు . " 

         దేవరాతుడు అది సాధ్యము కాదని తల అడ్డముగా ఊపుతూ అన్నాడు , " ఒక వేదము చదవగానే అయిపోయిందనుకున్నావా ? నీ గర్భములో ఉన్నవాడు స్వంతముగా వేరొక వేదాన్నే పొందగలవాడు కావలెను . అదీ కాక , ఆలంబీ , యజ్ఞేశ్వరుడి వలె , .....నా మాట జాగ్రత్తగా విను ,  కర్మ కాండ , బ్రహ్మ కాండలు రెండింటిలోనూ ఉపపాద్యుడైన యజ్ఞేశ్వరుడి వలె జాత వేదుడు కాకపోయినా అతడికి సమానముగా సర్వజ్ఞ కల్పుడు కావలెను . అంతటి కొడుకును పొందలేకపోతే నేను యజ్ఞవల్క్యుడనై ఏమి సార్థకత ? అలాగని , ఏదో నోటిమాటగా బ్రహ్మవాది యగుట హితము కూడా కాదు . ఆడిన మాట ,  అనుభవపు బలముతో శృతియంతటి దృఢమతి కావలెను . అలాగ కావలెనంటే , పరిపూర్ణమైన బ్రహ్మమును సాక్షాత్కరించుకోవలెను . అంటే , దానికి కర్మ త్యాగము ఒకటే గతి . నా సందిగ్ధము అర్థమైందా ? నేను చెప్పుతున్నది అదే .  అలాగయినప్పుడు , నేను ’ కర్మ శౌండ శౌండీరుడు ’ అని పొందిన ఈ ప్రసిద్ధి , ఈ ప్రఖ్యాతి , నాతోనే ముగిసిపోతుంది . అదే నా దిగులు . ఇప్పుడు నా దిగులు ఎటువంటిదో , దాని రూపమేదో చూచినావా ? అర్థమైందా ? "

         ఆలంబిని దీర్ఘంగా నిట్టూర్చింది . పొడినవ్వు నవ్వుతూ  అంది , " మీ దిగులు అర్థమైంది . అయితే , ఇది కూడా , ఆడ పిల్లలను కన్న వారి దిగులు వంటిదే , ఏనాటికైనా కూతురిని మగని వెంట పంపించియే తీరవలెను , ఇంటిలోనే ఉంచుకొనుటకు లేదు , అని ఆలోచించినట్లే . పోనివ్వండి , కన్యాదానము చేయునపుడు  ’ ఈమెకు పుట్టు కొడుకు మన ఇద్దరికీ కొడుకు కానీ , ద్వాముష్యాయణుడు కానీ ’ అని సంకల్పము చేసినట్లే , మీ కొడుకు కూడా కర్మ కాండ , జ్ఞాన కాండ రెండింటిలోనూ నైపుణ్యమును పొందువాడు అగునట్లు చేయండి ." 

     " కర్మ త్యాగము చేసే ’ విద్వత్తు యొక్క సన్యాసపు ’ అర్థము నీకింకా పూర్తిగా విశదము కాలేదు. దానివలన  , నీకు తోచిన ఉపాయమును సూచిస్తున్నావు . కానిమ్ము , దీనికి దేవతా శరణము తప్ప వేరే ఏ దారీ లేనట్లుంది . దేవుడు ఎలాగు చేస్తే అలాగే అవుతుంది . నాకేమో ఇది భారీ శల్యమైపోయింది " అని అతడు పెద్ద నిట్టూర్పు వదిలాడు . 

      నిట్టూర్పులాగానే దేహముకూడా దీర్ఘముగా శయ్యను పరచుకుంది . కాలాతీతమవుతున్నదని గమనించి ఇద్దరూ త్వరగా నిద్ర పోవలెనని దుప్పటిని పైకి లాగుకున్నారు . కానీ నిద్రాదేవి అనుగ్రహము ఒకరికైతే ఇంకొకరికి కాలేదు . 

      అతడు ఇంకొంచము సేపు ఎటూకాని ఆలోచనలతో పెనుగులాడి , చివరికి కేవలము ఆయాసముతో మాత్రము వచ్చు నిశ్చేష్టారూపమైన మగతలోని జారిపోయాడు . 

        సుమారు ఒక జాము గడచి ఉంటుంది . ఇద్దరూ చల్లటి నిద్రలో మునిగియున్నారు . లోకవ్యాపారమంతా మరపు వచ్చింది . అపుడతడికి ఒక కల . కలలో ముగ్గురు బ్రాహ్మణులు వచ్చినారు . ఒకరికన్నా ఒకరు తేజస్వులు . ముఖమును చూడగానే వారు ఎవరన్నది తెలుసుకొనుటకు వీలు కాకున్ననూ , మనసుకు , బాగా పరిచయమున్న వారిలాగానే అనిపిస్తున్నది . కానీ ఎంత ప్రయత్నించినా , వారెవరు ? ఎక్కడ చూచినాను ? అన్నది జ్ఞాపకమే రావడము లేదు . అయినా , దేవరాతుడు తన గృహస్థ ధర్మానికి తగినట్టు వారికి అర్ఘ్య పాద్యాదులన్నిటినీ ఇచ్చినాడు . మధుపర్కమును ఇవ్వవలెనని ఆత్రపడుతున్నాడు . ఆలంబి వంటింట్లో ఎక్కడో ఏదో సిద్ధము చేస్తూ ఉన్నట్లుంది . తనకవసరమని , ఆమెను పిలిచి ఆమె పనులకు ఆటంకము కలిగించుట ఇష్టము లేదు . ఇలాగ సతమతమగుచుండగా , వారిలో జ్యేష్ఠుడు నవ్వుతూ అన్నాడు , " మేము మీ ఇంటి వారమే . మాకు మధుపర్కము వద్దు . మేమిప్పుడు నీకు ఏదో చెప్పాలని ఈ రూపములో వచ్చినాము . ఇలా రా "  అని పిలచి , తమతో పాటు అతడినీ కూర్చోబెట్టుకున్నారు . అలాగే , కొంటెతనపు నవ్వొకటి నవ్వి , ’ మేమెవ్వరమో గుర్తు తెలిసిందా ? " అంటాడు . 

        ఆచార్యుడు లేదనలేడు , పరిచయపు జ్ఞాపకమూ రాదు . ఇలాగే అతడు సంకట పడుతుండగా " సరే , నీ సంకటము మాకు అర్థమైనది . మేము ఎప్పటికీ పరోక్షప్రియులము . కాబట్టి ఇలాగ తెలిసీ తెలియకుండా ఉండటములో విచిత్రమేమీ లేదు . మేమే చెప్పెదము , విను . మీ దంపతులు నిత్యమూ సేవించు అగ్నులు మేమే . నేను గార్హపత్యాగ్నిని . ఇతడు దక్షిణాగ్ని . అతడు ఆహవనీయాగ్ని . మేము మీరు ఉంచిన కుండములలో మాత్రమే ఉన్నామని భావించవద్దు . మీ దేహములోనూ ఉన్నాము . మా అనుగ్రహము వల్లనే మీ దంపతులకు నిన్నటి దినము మీ గర్భమునకు వచ్చిన మహానుభావుడి దర్శనమైనది . " 

        ఆచార్యులు లేచి నిలుచున్నారు . ప్రవర చెప్పి వారందరికి కలిపి ఒకసారి నమస్కారము చేసినాడు . ప్రత్యేకముగా కూడా ఒక్కొక్కరికీ నమస్కారము చేసినాడు . " మీ అనుజ్ఞ కావలెను , మీరు చెప్పుదానిని వినుటకన్నా ముందే ,  ఇదే ఎక్కువన్నట్లు నమస్కారములు చేయుట అపరాధమైతే క్షమించవలెను . " అని నమస్కరించి అన్నాడు . 

          ముగ్గురూ నవ్వినారు . పెద్దవాడు అన్నాడు , " మాకూ మీకూ సామరస్యము ఉన్నది . నువ్వేమి చేసినా అది మాకు అపరాధముగా తోచదు . అదలా ఉండనీ , విను, నిన్నటి దినము నీకు మా అనుగ్రహము వల్లనే ఆ దర్శనము అయినది . అయితే , దానిని సుఖముగా తీసుకొనుటకు బదులు , నువ్వు దానిని ప్రమాదపు కారణము చేసుకున్నావు . నువ్వు ఈ దినము ఉదయము నుండీ పడుతున్న సంకటము నీ దేహములోనున్న మమ్ములను కూడా బలముగా దుఃఖింపజేస్తున్నది . కాబట్టి అది వద్దు అని చెప్పుటకు మేమే వచ్చినాము ... హా! హా!  , ’ మీరే నాకు తెలియ కుండానే దానిని నివారించ వచ్చును కదా..అనబోతున్నావు , ఔను , అది మాకు సాధ్యమే .  నీ ఎదురుగా రాకుండానే నీ మనసును తిప్పుటకు మాకు సాధ్యమే , కానీ నువ్వు భక్తుడవు , కావలసిన వాడవు , సఖుడవు అని నీకు ప్రత్యక్షముగా ముఖతః చెప్పి నిన్ను సంతోష పరచవలెనని వచ్చినాము . నువ్వు సంతోషముగా ఉంటే మాకు సంతోషము . నువ్వు దుఃఖ పడుతూ ఉంటే మాకూ దుఃఖము . కాబట్టి మేము చేయుపని బహుశః స్వార్థమన్నా అనవచ్చు .  స్వార్థము లేని లోక వ్యవహారము ఉంటుందా ? స్వార్థము  , పరార్థము అని మనసులో ఉన్నంత వరకూ అది కర్మ కాండ. ఆ భేదము చెరగిపోతే అదే జ్ఞాన కాండ . అర్థమైనదా ? " 

        దేవరాతునికి మహాశ్చర్యమైనది. వీరు కూడా కర్మ కాండ , జ్ఞాన కాండలను గురించి మాట్లాడుతూ నా భయాన్ని ఇంకా ఎక్కువ చేస్తున్నారే ? కానీ వీరు త్రేతాగ్నులు . " నీ సంతోషమే మా సంతోషము , నీ దుఃఖమే మా దుఃఖము " అంటున్నారు . కాబట్టి మారు మాట్లాడక  , తాను చెప్పాలనుకున్నది ఒక ’ సరే ’ తో ముగించాడు . 

       మాట్లాడుతున్న ఆ జ్యేష్టుడు చిరునవ్వు నవ్వుతూ తాను చెప్పాలనుకున్న దానిని కొనసాగించినాడు . :" రెండు నదులు వచ్చి చేరుతాయి . రెండూ ఒకటగు వరకూ ఆ నీరు , ఈ నీరు అనవచ్చు . రెండూ ఒకటైన తర్వాత వాటిలో ఏది తాను కరగి పోయానని ఏడవాలి ? " 

      దేవరాతుడు మనసులోనే గుణకారము చేసినాడు . " నేను ఏదో చెబుతున్నారు అనుకున్నాను , వీరు చెప్పేది కర్మ కాండ , జ్ఞాన కాండ లకు సంబంధించినదేనా ? అలాగైతే రెంటికీ భేదము లేదా ? "

        జ్యేష్టుడు ఇతడి మనసులో ఉన్నది తెలిసినట్లే అన్నాడు , " ఔను , రెంటికీ భేదము లేదు . భేదమున్నదని నువ్వు భావించుకొని పొద్దుటినుండీ దుఃఖ పడుతున్నావు . జాతవేదుడనని ప్రఖ్యాతి పొందిన నన్ను ( అలా అనేటప్పటికి మిగిలిన ఇద్దరూ అంతర్థానమై అతడొక్కడే ఉన్నాడు ) ’ కాండద్వయోపపాద్యాయ కర్మ బ్రహ్మ స్వరూపిణే ’ అని అహర్నిశలూ నమస్కారము చేయు నువ్వు దాని అర్థమునెందుకు గమనించలేదు ? నీకున్న సంశయాన్ని వదలు . ఎలాగా ? ఇంకా పరిహారము కాలేదే అంటావా ? సీమంతమగు వరకూ తాళు . సీమంతమైన తర్వాత గర్భస్థుడై యున్న జీవుడిని మాట్లాడించు . అతడు నీకు తృప్తి యగునట్లు సమాధాన మిచ్చును . మా దేవతలము ,  కర్మ కాండపు ఋషులు , నీ వంశపు పితృ దేవతలు అందరూ కలిసి నీ వంశమును మాత్రమే కాదు , లోకమునే ఉద్ధరించ గల మహా పురుషుడిని నీకు కొడుకగునట్లు అనుగ్రహిస్తాము చూడు , నీకు నిదర్శనము కావాలని చెపుతున్నాను ,  రేపు నీకు రాజ భవనము నుండీ సోపస్కరములు ( సంభారములు ) వస్తాయి కదా , వాటితో పాటు కుండెడు పాలనిచ్చు రెండు ఆవులు కూడా వస్తాయి . ఒకటి ఎర్రది , ఇంకోటి నల్లది . నీకు రాజ పురోహితుడు చెప్పినవాటిలో ఆవులు లేవు , నిజమా కాదా ? " 

" ఔను , ఆవులున్నట్లు చెప్పలేదు " 

      " నేనే నీకు అంతటినీ చెప్పగలను , కానీ నీకు నేను చెప్పుటకన్నా , గర్భస్థ శిశువే చెప్పిన , ఎక్కువ నమ్మకము కాగలదని అతని ద్వారానే చెప్పిస్తాను . ఇకనైనా దుఃఖమును వదలి  స్వస్థుడవు కమ్ము . నువ్వు సంకట పడినంతా మాకది జ్వరమని మరవద్దు . " 

    దేవరాతుడికి ఏదో ఒక తెర తనపైనుండి జారి కింద పడినట్లాయెను . వాక్కు అతని ప్రయత్నము లేకనే " అనుజ్ఞ , దుఃఖాన్ని వదలినాను " అన్నది . 

      యజ్ఞేశ్వరుడు , " చూడు , నువ్వు ఎంత దుఃఖ పడుతుంటివో చూడు " అని తన చేతిని బార్లా చాచినాడు . అక్కడ ఒక నల్లటి గుట్ట ఉంది . అది సుమారు ఒకటిన్నర మనిషి ఎత్తు . అది అంటుకొని మండుతున్నది . 

       ఇంకొకసారి చెవిలో మోగింది , " ఆచార్యా , మరవద్దు , ఈ దేహము నీది కాదు . నీకు దాన్ని ఇచ్చిన మేము అందులో ఉన్నాము . నువ్వు నీవియని అనుభవించు సుఖ దుఃఖములన్నీ మాకు కూడా కలుగుతాయి . కాబట్టి నువ్వు ఎల్లపుడూ సంతోషముగానే ఉండవలెను . " 

      ఆచార్యుడు అదివిని సిగ్గు పడ్డాడు . తమ ఆజ్ఞ అని తిరిగి చూసే వేళకు అక్కడ ఎవరూ లేరు . మనసు , " అట్లయిన , మేము సుఖ దుఃఖముల అనుభవములో కూడా స్వతంత్రులము కామా ? వాటిలో కూడా మేము దేవతలకు అంకితులై ఉండవలెనేమి ? అని పుంఖాను పుంఖములుగా ప్రశ్నలు వస్తుండగానే మెలకువ అయ్యింది . 

Sunday, January 13, 2013

మకర సంక్రమణము--ఉత్తరాయణ పుణ్యకాలము


         మకర సంక్రమణము--ఉత్తరాయణ పుణ్యకాలము





     సౌరమానము ప్రకారము సూర్యుడు ఒక రాశి నుండీ ఇంకో రాశిని ప్రవేశించుటను ’ సంక్రమణము ’ అంటారు.

     సంవత్సరములో పన్నెండు సంక్రమణములు సంభవిస్తాయి. వీటిలో కర్కటక సంక్రమణము , మకర సంక్రమణము ముఖ్యమైనవి. కర్కటక సంక్రమణము తో దక్షిణాయణము , మకర సంక్రమణము తో ఉత్తరాయణము మొదలవుతాయి. 

     కొన్ని సంక్రమణముల తరువాత కానీ , ముందర కానీ , లేక తరువాతా ముందరా-రెండు వైపులా కానీ ఉన్న ఘడియలను పుణ్యకాలము అంటారు. ఉదాహరణకు మేష మాసము ప్రారంభమయ్యే మేష సంక్రమణము ముందరి పది ఘడియలు , అలాగే తరువాతి పది ఘడియలూ పుణ్యకాలము( రెండున్నర ఘడియలైతే ఒక గంట ) అలాగే తులా సంక్రమణములో కూడా ! 

కర్కటక సంక్రమణములో నైతే ముందరి ముప్పైఘడియలు పుణ్యకాలము.

మకర సంక్రమణములో నైతే తరువాతి ఇరవై ఘడియలు పుణ్యకాలము. 

     ఈ సారి మకర సంక్రమణము ఉదయము తొమ్మిదిన్నర-పది గంటల మధ్య సంభవిస్తున్నది ( ఇది వాక్య సిద్ధాంతము ప్రకారము.  అదే దృగ్గణిత ప్రకారమైతే పదకొండున్నర తరువాత. కానీ శాస్త్ర వచనము ప్రకారము దృగ్గణితమునకు రసక్షయము , బాణ వృద్ధీ కలుగును కాబట్టి , వాక్య సిద్ధాంతమే సమంజసమని అనేకుల మతము ) 

కాబట్టి ఉదయము తొమ్మిదిన్నర తరువాత నుండీ పగలంతా ( దాదాపు ఎనిమిది గంటల సమయము ) పుణ్యకాలమే !!

     ఉత్తరాయణ ప్రవేశ  కాలములో సమస్త నదులు , వాపీకూప తటాకములు ,సమస్త జలములూ గంగోదకముతో తుల్యమై యుండి, నరుల యొక్క పాపములను పోగొట్టుటకు సిద్ధముగా ఉండును. 

సంక్రమణ పుణ్యకాలములో చేయవలసినవి

     సంక్రమణ పుణ్యకాలములో విశిష్టమైన ఫలములు పొందవలెనన్న, పితృ దేవతలకు శ్రాద్ధము , సూర్యనారాయణుడి పూజ, జపములు , దానములు చేయుట శుభప్రదమని ఋషుల వల్లనూ , పురాణ వచనముల వల్లనూ  మనకు తెలియుచున్నది.

     పితృ శ్రాద్ధమును పిండ రహితముగా చేయవలెను. శ్రాద్ధము చేయుటకు కారణాంతరముల వలన వీలుకాకున్నచో , కనీసము పితృ తర్పణములైనా వదలవలెను. ( తర్పణ విధానము ఇదే బ్లాగులో ఉన్నది దయచేసి చూడగలరు.)  శ్రాద్ధమూ తర్పణమూ చేసేవారు అంతవరకూ ఉపవాసము ఉండవలెను. లేనివారు ఉపవాసము ఉండకూడదు. చాలామంది పుణ్యకాలములో ఉపవాసముండ వలెనని అంటారు. కానీ 

|| ఆదిత్యేఽహని సంక్రాంతౌ గ్రహణే చంద్ర సూర్యయోః |
  ఉపవాసో న కర్తవ్యః  పుత్రిణా గృహిణా సదా || 

అను జైమిని వచనము ప్రకారము , సంతానము కల గృహస్థులు ఆది వారాలు , సంక్రమణముల లోను , సూర్య చంద్రుల గ్రహణముల నాడు ఉపవశించరాదు . 

     తరువాత , ఎవరి జన్మ నక్షత్రములో సూర్య సంక్రమణము సంభవించునో వారికి ఆ మాసములోనే, వైరము , కష్టము , ధన క్షయము  , కలుగును. రేపు ఉత్తరాషాఢా నక్షత్ర జాతకులకు దోషము. దీనికి పరిహారము: 

నంది వర్ధనము , తామర ఆకులు , పసుపు , తెల్ల ఆవాలు, లొద్ధుగ లు కలిపిననీటితో , సంక్రమణ సమయములో స్నానము చేసిన క్షేమకరము. ఇది కాక, 

అన్ని సంక్రాంతులలోనూ విష్ణుపదాదులు ఉండును. కాబట్టి విష్ణుపూజ చేసిన ఫల ప్రదము. 

సూర్యనారాయణుడి పూజ ( కూష్మాండ పూజ )

     ఈ పూజ చేయుటకు శుభ ముహూర్తమునెంచుకొని చేయవలెను. ఈ సారి 14-01-2013 నాడు , ఉదయము పదిగంటల నుండీ నుండీ పదిన్నర వరకూ ( రవి హోరలోనూ , ) అలాగే మధ్యాహ్నము పన్నెండు నుండీ ఒంటి గంట వరకూ ( బుధ హోరలోనూ ) చాలా శుభమైనది. 

     పూజకు , దీపారాధన చేసి , ఇంటికి తూర్పు దిశలో గోమయముతో కానీ గో మూత్రముతో కానీ అలికి , దానిపై బియ్యము లేదా గోధుమలను పోసి , దానిపై బంగారము వలె నున్న పసుపు పచ్చటి  గుమ్మడికాయను ఉంచవలెను ( బూడిద గుమ్మడి కాయ పనికిరాదు )   పసుపు పచ్చటి  గుమ్మడికాయ సూర్యుడికి సంకేతము. దానికి పసుపు కుంకుమ, గంధపు బొట్లు పెట్టి , నూతన వస్త్రము ( ఎర్రటి లేదా పచ్చటి ) కప్పవలెను. తరువాత బంగారముతో కానీ , ఇత్తడితో కానీ చేసిన లక్ష్మీనారాయణుల విగ్రహమును ఆ గుమ్మడి కాయపై నుంచి , దానిని పంచ గవ్యములతో శోధించవలెను ( స్నానము చేయించవలెను ) పూలతో అలంకరించి , 

తరువాత ,ఈ విధముగా సంకల్పము చెప్పవలెను 

     ( ఆచమనము ప్రాణాయామము అయినతరువాత ) , ఏవంగుణ విశేషణ విశిష్టాయాం , శ్రీ లక్ష్మీ నారాయణ / కులదేవతా ప్రీత్యర్థం , మమ ఇహ జన్మని సమస్త పాప క్షయార్థం , మమ మనోభీష్ట సిధ్యర్థం , మకర సంక్రమణ ప్రయుక్త ఉత్తరాయణ పుణ్యకాలే సకల దేవతా ప్రీథ్యర్థం , శ్రీ లక్ష్మీనారాయణ పూజాం కరిష్యే ||  తదాదౌ నిర్విఘ్నతా పరి సమాప్త్యర్థం , గణపతి పూజాం కరిష్యే  అని చెప్పి , 

  మొదట గణపతి పూజనము సలిపి , లక్ష్మీనారాయణులకు  కలశ పూజ , ఆదిగా షోడశోపచార పూజలు చేయవలెను. నైవేద్యం , మహా మంగళారతి తరువాత మంత్రపుష్పం సమర్పించవలెను.

     ఈ విధముగా పూజ అయిన తరువాత , పూజ చేసిన విగ్రహమును , గుమ్మడికాయను , యథాశక్తి దక్షిణలతో వేద వేత్త , కుటుంబవంతుడైన సద్బ్రాహ్మణునికి పుణ్యకాలములోనే దానము ఇవ్వవలెను. ( సంక్రమణ పుణ్యకాలములో అంతటా ఉన్న నీరు గంగా జలముతో సమానమగును. శుద్ధమైన ఆత్మగల ద్విజులందరూ బ్రహ్మ సమ్మితులౌతారు. వారికి ఏ కొంచము దానము చేసిననూ అది మేరు సమానమవుతుంది. సముద్రమే మేఖలగా గల భూమిని చక్కగా దానము చేసినవానికి వచ్చే ఫలము ఈ ఉత్తమమైన దానమును చేసిన నరుడు పొందును.  --స్కాంధ పురాణము ) 

దానములు ఎప్పుడునూ తూర్పువైపుకు తిరిగి ఇవ్వవలెను. 

శుభం భూయాత్

2. " మహా దర్శనము " --రెండవ భాగము--- సీమంతము


        మధ్యాహ్నమై జాము గడుస్తూ ఉంది . మూడో జాము అని సూర్యుడు తన ప్రచండ కిరణాలను ఉపసంహరించు కుంటున్నాడు . పొద్దుటి నుంచీ మబ్బులు ముసిరి , సంక్రమణమా అన్నట్లున్న దినము ఇప్పుడు కొంచము సేపటి నుండీ తేటపడింది . అయినా చుట్టూ దిగంతాల వైపు మేఘాల ఆక్రమణ బలంగా ఉంది . మేఘాలు మాయావుల వలె సూర్యునితో దొంగాట లాడుతున్నాయి . 

         దేవరాతునికి  ఆలోచనల్లో అంతా నిన్నటి రాత్రి చూసిన దృశ్యమే ! మాధ్యాహ్నిక కర్మల నన్నిటినీ ముగించి భోజనము పూర్తి గావించుకుని వచ్చాడు . చిన్న చౌకపు శల్య నొకదానిని భుజంపై వేసుకుని , మడి పంచతోనే ప్రాంగణపు పక్కన నీడలో పచారు చేస్తున్నాడు . సన్నగా చలి మొదలైంది . ధావళిని ఎందుకు కప్పుకోరాదు అనిపిస్తున్నది . తాంబూలము నోటిలో కరగుతున్నది . అన్యమనస్కంగా తాంబూలాన్ని నములుతున్నాడు . " ఇంకేమి , ఆలంబి వస్తుంది , ఆమెతో పుట్టబోయే పిల్లవాడి సంగతులు మాట్లాడవలెను . ఇప్పుడు ప్రస్తుతానికి గర్భిణిగా తాను చేయవలసినదేమి ? ముందు ముందు తల్లియై చేయవలసినదేమి ? అంతటినీ చెప్పాలి . " అని ఆలోచిస్తున్నాడు . అరకన్ను మూసుకుని చేస్తున్న ఆ ఆలోచనలో శిష్యుడొక్కడు వచ్చి నిలుచున్నదానిని ఆచార్యుడు గమనించలేదు . ఇంకాసేపవుతుండగా , "  ఆచార్యులకు ఈ సమయము విడుపేనా " అంటూ భార్గవుడు దగ్గరికి వచ్చాడు . 

        దేవరాతునికి భార్గవుడు అప్పుడప్పుడు అలాగ వచ్చి పలకరించుట కొత్తేమీ కాదు . అయితే ఈ దినము అతనికి ఆ రాక కావాలనిపించ లేదు . అట్లాగని , వచ్చినవాడిని ఆహ్వానించకుండా ఉండటము అవుతుందా ?  వెంటనే ఆ వైపుకు తిరిగినాడు . ముఖము ఎప్పటివలెనే మందహాస ప్రసన్నమైంది . అయినా అతనికి నోటినుండీ ఏమాటా రాలేదు . బహుశః రాబోవు శిశువు ఆలోచన బలంగా ఉండుటను సూచిస్తున్నది. వచ్చిన వాణ్ణి ఊరికే కళ్ళప్పగించి చూస్తున్నాడు . 

భార్గవుడు మరలా అడిగాడు , " ఏమిటో , ఆచార్యులు ఏదో లోకంలో ఉన్నట్టుంది , నోటి నుండీ మాటలే రావడము లేదు ? " 

         దేవరాతుడు నవ్వాడు . " ఔను , భార్గవులు వచ్చినపుడు రండి అని ఉపచారము చేయకుండా ఉంటే ,, నేను ఎదురుగ్గా ఉన్నా లేనట్లే కదా ! నిజం చెప్పాలంటే , మీ భవ్యమైన ఆకారము , దానికి తగినట్లు ఉట్టిపడుతున్న మీ ఠీవి , దానితో పాటు మీరు వచ్చిన వైఖరి , అవన్నీ చూసి మనసు అదరిపోయింది . మాట బెదరిపోయినట్టు ఎక్కడికో పారిపోయింది . దాన్ని పట్టి తెచ్చుటకు దాని వెంటనే మనసు పోయింది . బుద్ధి అక్కడ కొంచము , ఇక్కడ కొంచము అయిపోయింది . అదంతా సరే , రండి , దయచేయండి . ఇక్కడే కూర్చుందామా ? లేక నడిమింటికి వెళదామా ? " 

         " నేను గుర్రపు బండిలో వచ్చినాడను . ఆ బండి గడ గడ శబ్దము విని మీరు వాకిలి వద్దకు వస్తారు అనుకున్నా. వాకిలి వద్దకు రాలేదేమా , ఏదో విశేషముంటుంది అనుకొని లోపలికి వచ్చినాను . మీ శిష్యుడొకడు నన్ను చూసి మీకు చెప్పాలని లోపలికి పరుగెత్తి వచ్చినాడు . ఇదిగో వాడు ఇక్కడే నిలుచున్నాడు . మీరు వాణ్ణి చూసినట్లు లేదు . ఇదంతా చూసి నేను , మీరిక్కడే ఉన్నారా లేక లోకాంతరములలో సంయమమై ఉన్నారో అని అడిగినాను , తప్పులేదు కదా ? " 

        " భార్గవులు ఏమి చేసినా తప్పుకాదు . అలాంటప్పుడు తప్పెలా వెదికేది ? రండి వెళదాము " అని దేవరాతుడు అక్కడే నిలుచున్న శిష్యునికి కళ్లతోనే ఏదో సూచించి , భార్గవుడిని పిలుచుకొని నడిమింటికి వెళ్ళినాడు . 

       నడిమింటిలో  కృష్ణాజినములతో శోభిస్తున్న వేత్రాసనములు  ( వెదురు బద్దలతో చేసిన ఆసనములు ) . వాటిలో ఇద్దరూ కూర్చున్నారు . భార్గవుడు  విజయపు మందహాసమును చిందిస్తూ , " ఆచార్యులవారు నేనిప్పుడు వచ్చినది ఎందుకో చెప్పగలరా ? " అని అడిగాడు . 

          ఆచార్యులు అదే రీతిలోనే , అయితే వినయాన్ని వీడని నవ్వు నవ్వుతూ , " మీరు చెబితే తెలుసుకుంటాను , నిజానికి నేనే రావాలనుకున్నాను. అంతలో మీరే వచ్చినారు . మొదట మీరు చెప్పాలనుకున్నది చెప్పండి , తర్వాత నేను చెప్పాల్సినది చెపుతాను . " అన్నాడు

          భార్గవుడు చెప్పదొడగినాడు , " ఈ పొద్దున్నే అన్ని కర్మలనూ ముగించుకుని ఎప్పటివలె రాజ భవంతికి వెళ్ళినాను . అక్కడి కార్యాలన్నీ అయిన పిదప , మహారాజా వారు ఏకాంతములో ఏదో లోకాభిరామాయణము మాట్లాడుతూ కూర్చున్నారు . నేనపుడు సమయము చూసి వారికి ఎరుక పరచినాను , ’ మన ఆచార్యుల ఇంట సీమంతము జరగవలసియున్నది , రాజ భవంతి నుండీ , తమరి గౌరవానికీ , వారి గౌరవానికి తగినట్లు ఏదైనా చేసిన బాగుండును . " అన్నాను . వారు , ’ మాకు తెలియనే లేదే ? ’ అని ఆశ్చర్యపడినారు . " ఆచార్యుల స్వభావము తమ సన్నిధానమునకు పరిచితము కానిదేమి కాదు . వారు నిత్య తృప్తులు . ఏమి కావలెనన్ననూ , ఉన్నదాంట్లోనే జరగనీ , కావాలన్న దేవుడే ఇచ్చి అన్నీ జరిపించనీ అంటారు . కాని మాకు అలాగుండుటకు సాధ్యము కాదు. " అన్నాను . వెంటనే మహారాజుగారు , ’ నూరు నిష్కములు , పది మూటలు బియ్యము , దానికి తగిన సంభారములు  అన్నీ పంపించవలెను అని అనుమతి నిచ్చినారు . అవన్నీ ఈ దినమో రేపో వస్తాయి . వచ్చినపుడు , ’ ఇవన్నీ మాకెందుకు ? " అని ఎక్కడ వెనుకకు తిరిగి పంపిస్తారో , అటుల చేయవద్దని చెప్పడానికే వచ్చినాను . మీకు సమ్మతమే కదా ? నేను చేసినదాంట్లో తప్పేమీ లేదు కదా ? " 

     ఆచార్యులు నవ్వేసినారు . " ఇప్పుడిది సరే పోయింది . నేను సీమంతాన్ని ఆడంబరంగా చేయాలా లేక , వైదిక కర్మ కదా , దాన్ని నిరాడంబరంగా చేయాలా అని ఆలోచిస్తున్నాను . ఇక ఇప్పుడు రాజ సహాయము సమకూరినందు వల్ల ఆడంబరముగానే చేయవలెనన్నట్లే కదా ? సరే లెండి , అలాగే చేద్దాము . " అన్నాడు . 

       భార్గవుడు మరలా అన్నాడు , " మీరు ఒక ఆశ్రమమును కట్టుకొని యుంటే ఆ మాటే వేరు . అప్పుడు నేను మీ ఆశ్రమవాసులంతా చేరి అయినంత సులభముగా నెరవేర్చుకోండి అని చెప్పేవాడిని . కానీ మీరు ఇలా రాజధాని లోనే అగ్రహారీకులు గా ఉంటూ ఏదో పేదవాడి వలె మీకు తగినట్లు మీరు ఆ ఉత్సవాన్ని ఆచరిస్తే , మేమంతా తల దించుకోవలసి వస్తుంది . రాజ భవనపు వైభవముతో కాకున్నా , తమ అంతస్తుకు తగ్గట్టు గౌరవముగా  అయినా కావద్దా ? వైదీక కర్మ , లోకాడంబరమెందుకు  అంటారేమో ? మనుష్యుడు ఉత్సవ ప్రియుడు . వాడు ఏపని చేసినా డోలు వాయించినట్టు పదిమందికీ తెలియవలెను . వేదములోనే చెప్పలేదా , ’ బృహద్వదేమ విథతే సువీరాః ’ --సరైన సంతానము కోసము గట్టిగా మంత్రము చెప్పి యజ్ఞము చేయవలెను అని ? కాబట్టి , నేను చెప్పినట్లే చేయండి . " 

       ఆచార్యులు భార్గవుని మాట ఒప్పుకున్నట్లు ముఖ ముద్రతోనే సూచిస్తూ , " రాజ పురోహితులు శ్రీ భార్గవ భట్టు గారు ఆదేశిస్తుండగా , నేను కాదనుటకు అగునా ? అయితే , సీమంతములో మేము చేయవలసిన క్రియలన్నీ అప్పుడే సాంగముగా జరిగినాయి . అందుకే , సీమంతము కేవలము ఔపచారికమే కదా , చేయాలా వద్దా అని ఆలోచించు చుండినది . అందువలననే మీరు వచ్చినపుడు అన్యమనస్కముగా ఉండినది . " అన్నాడు . 

" అలాగంటే ? " 

        ఆ వేళకు శిష్యుడు వచ్చి , ఒక మేజాను తీసుకొని వచ్చి , దాని పైన మడి ధావళులను  ఒక చెంబు గోరు వెచ్చని నీటిని తెచ్చి పెట్టినాడు .ఆచార్యుడు , ’ మొదట ఈ పని కానివ్వండి , పిమ్మట అంతా చెబుతాను " అని వారిని తొందర పెట్టారు . భార్గవుడు అక్కడే బచ్చలిలో కాళ్ళు చేతులు కడుక్కుని , మడి ధావళి నొకదాన్ని కట్టుకొని , ఇంకో దాన్ని కప్పుకుని , ఆ వేళకు వచ్చిన ఫలహారాన్ని స్వీకరించినాడు . ఆచార్యునికి కూడా రాజ పురోహితుని బలవంతము పైన అటుకుల ఒగ్గరిణి ఫలహారమైనది . ఇద్దరూ వేడి పాలను సేవించినారు . మరలా మాటలు మొదలయ్యాయి . 

        ఆచార్యుడు కిందటి రాత్రి జరిగినదంతా చెప్పినాడు . " చూడండి , భార్గవా , నేను నాకన్నా ప్రబలుడైన పుత్రుడిని పొందవలెను అని హోమ హవనములను చేసినది నిజమే , కానీ నిన్న దర్శనమైనట్లు , పుట్టబోవు వాడు బ్రహ్మజ్ఞానియైతే ఏమి గతి ? యజ్ఞవల్క్య అని ప్రసిద్ధి పొందిన మా వంశము ఏమవుతుంది ? నాకిదే యోచన అయిపోయింది " అన్నాడు . 

        " వదిలేయండి  , దీనికింత యోచన యెందుకు ? మిథిలా నగరములో ఉన్నారు . విద్య ఉన్నదంతా కురు , పాంచాల , కాశీ ప్రదేశములయితే , ఆ విద్యకు గౌరవమున్నది మన జనక మహారాజుల వారి వద్ద . ’ యథా రాజా తథా ప్రజాః ’ మీరు కర్మ విద్యలో పొందిన పేరును మీ కుమారుడు బ్రహ్మవిద్యలో పొందితే మీకు ఇష్ట సిద్ధి యైనట్లే కదా ? " 

" అలాగని నాకున్న జ్ఞానమంతా మట్టిపాలు కావలెనా ? నేను సంపాదించినదంతా వ్యర్థము కావలెనా ? " 

        " ఆ మాటెలా వచ్చింది ? బ్రహ్మవాదులు , అన్ని విద్యలకూ మూలస్థానము మన బ్రహ్మవిద్య అనేకదా చెప్పుకుంటారు ? ఒకవేళ మీ పుత్రుడు కర్మ విద్యను వదిలేస్తేనో  అంటున్నారు  , ఉపనయన సమయములో మహా యజ్ఞముల నన్నిటినీ చేస్తానని వాడిచేత ప్రమాణము చేయించండి . అవన్నీ చేసేటప్పటికి ఏమవుతుందో చూద్దాము . " 

దేవరాతుడికి అది సమ్మతమైనది . " అలాగే చేయవలెను , ఇక వేరే దారి లేదు ’ అని నోటినుంచీ మాట కూడా వచ్చింది . 

        " ఆచార్యా , ఏదో జీవము వచ్చి ప్రవేశించినది , ఇంకేమిలే అని సీమంతాన్ని వదలివేయకండి . సీమంతమును చేయండి . గర్భిణికి  పాపిడి తీసి , వీణానాద పూర్వకముగా మంత్రమును ఉచ్చరిస్తే , ఆ నాదము తరంగ తరంగములుగా గర్భిణి యొక్క గర్భాన్ని చేరి , అక్కడున్న పిండమునకు చేతనము కలిగి , వైదీకమవుతుంది . ఆ పిండము శిశువై బయటికి వచ్చిన తర్వాత ఆ శిశువు బుద్ధి వైదీక మార్గములోనే నడుచును . మీరిక యోచించవలదు . " 

        ఆచార్యుడు తాను కిందటి రాత్రి చూసినది మరువలేదు , కానీ శాస్త్ర సమ్మతముగా పలుకుతున్న రాజ పురోహితుని మాటను తిరస్కరించలేక , " నిజము , నిజము , అట్లే కావలెను . సంస్కారములను వదలిన వారుంటారా ? సీమంతము చేసే తీరవలెను ," అన్నాడు . 

ఇంకొంత సేపు భార్గవుడు అలాగే అదీ ఇదీ మాట్లాడి  , బయలుదేరి వెళ్ళిపోయినాడు . 

1. " మహా దర్శనము " -- మొదటి భాగము --- అలౌకిక ఘటన


          రెండు ఝాములు గడచి రాత్రి మూడో ఝాములోనికి కాలు పెట్టింది . లోకములోని జనులందరూ శాంతులై , నిద్రాదేవి కృపకు పాత్రులై సుఖించు కాలము . చుట్టుపట్ల అంతా ప్రశాంతముగా నిశ్శబ్దములో అద్దినట్లు మౌనముగా ఉంది . చెట్లూ చేమలన్నీ తమను ఆశ్రయించుకొని ఉన్న పక్షులనన్నిటినీ తమలో దాచివేసి , భయపడి మూలకు అణగి కూర్చున్న పిల్లలవలె , కిక్కురుమనకుండా మూగబోయినాయి . అనతి దూరములోనే  చిన్న వాగు ఒకటి  ఇసుకలో ప్రవహిస్తూ , అత్తింటి కోడలి వలె వీలైనంత తక్కువ శబ్దము చేస్తూ తనదారిన తానుపోతున్నది . 

         దేవరాతుడు ఆశ్రమములో దర్భశయ్యపై పరుండినాడు . ఎడమచేయి చెవితో ఏదో ఏకాంతమాడుతున్నట్టు తల కింద ఉంది . నిద్ర చూడగా గాఢముగా ఉన్నట్టుంది . అయినా కారణము లేకుండానే హఠాత్తుగా అతనికి మెలకువ అయ్యింది . మెలకువైనా , అతనిది కళ్ళు మూసుకునే ఉండే వైఖరి . కానీ ఇప్పుడు కళ్ళు మూసుకుని యుండుటకు సాధ్యము కాలేదు . కళ్ళు తెరిచాడు . ముత్యము వంటి చిన్నదైన నూనె కైదీపపు వెలుగులో ఎదుటి గోడా , దానిపై వ్రేలాడుతున్న కృష్ణాజినమూ కంటబడ్డాయి . మరలా కళ్ళు మూసి నిద్రపోవుటకు ప్రయత్నించాడు . ప్రయత్నము సఫలము కాలేదు . అట్లే కళ్ళు తెరుచుకొనే పైకి తిరిగినాడు . వెల్లకిలా పడుకొని రెండు చేతులనూ ఎదపై నుంచుకున్నాడు . చుట్టూ చీకటి కమ్మినట్లైంది . ఇదేమిటీ అనుకొనే లోపలే ఏదో ఒక అలౌకిక దృశ్యపు దర్శనమైనట్లయింది . ఏదో గుర్తు తెలీని అడవి ఒకటి . ఆ అడవిలో ఒక మూల. ఏపుగా పెరిగి నిలుచున్న చెట్ల సముదాయము . ఆ చెట్ల మధ్య ఒక ఆశ్రమము . ఆశ్రమము నుండి చేతివేటు దూరంలో ఒక యేరు . యేటిలో నీరు పారుట స్పష్టముగా కనిపిస్తున్నది . ఆ సెలయేరు అంత పెద్దదీ కాదు , చిన్నదీ కాదు . అయినప్పటికీ , ఆశ్రమవాసుల పైన గౌరవముతో జలదేవతలు అక్కడ వెలసి , మౌనముగా చేతులు జోడించి ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తున్నది . ఆ ఆశ్రమము నుండి ఎవరో అతివేగిరముగా ఏదో అత్యవసరమైనట్లు బయలుదేరినారు . ధవళ వర్ణపు గడ్డమీసాలు , తెల్లగా అప్పుడే కురిసిన మంచువలె స్వఛ్చమైన జటామండలము , అతడొక వృద్ధుడనీ , తపస్వియనీ ఘోషిస్తున్నట్లు చెబుతున్నాయి . ముఖములో నిండిన తేజోకాంతులు ఆ ఉద్ఘోషను ఒప్పుకున్నట్లు , దానికి సాక్ష్యము నిస్తున్నట్లున్నాయి . అకారణముగా మెరుస్తున్నదేమో యనిపించే అతని మందహాసము అతని లోపల నిండిన ఆనంద సాగరాన్ని దాస్తున్న తెర వలె ఉంది . అన్నిటికన్నా మిన్నగా , రత్నదీపాలవలె వెలుగుతున్న ఆ కన్నులు , జగములోని చీకటినంతా బాపి వెలుగు నింపునట్లున్నాయి . ఆ కన్నుల మధ్యనుండీ కిందకు దిగిన అతని నాసిక , ఈతడు లోకానుగ్రహము కోసము దివినుండీ దిగివచ్చి యుండవలెను అని సూచిస్తున్నట్లుంది . ప్రశస్తమైన కొండపైని రాతిపానుపు వలె విశాలముగా వ్యాపించిన అతని నుదురు అతని హృదయ వైశాల్యాన్ని చిత్రిస్తున్నట్లుంది . అతడు ఏదో కాలాతీతమైనట్లు , వేళ మించిపోయినట్లు త్వరత్వరగా బయలుదేరినాడు . ఆశ్రమపు  ముఖద్వారమునకు వచ్చి , వెనుతిరుగి , ఆశ్రమానికి ఒకసారి  మొక్కి , మరలా బయలు వెడలినాడు . ఆ ఉదయపు మొదటి జాములో నిండిన ప్రకాశములో కూడా ఆశ్రమము , ఏదో చీకటి పట్టినట్లు నిస్తేజమగుతున్నది . 

           అతడు వస్తున్నాడు . అతడికి అన్నివైపులా వెలుగు పరచుకొని ఉండి  , ఆ వెలుగు అతనికి మాత్రము  తన నీడ అనే అంటును సోక కుండా జాగ్రత్త పడినట్లుంది . మంటలేని అగ్నివలె ప్రజ్వలిస్తున్ననూ , శాంతముగా ఉన్న అతడు కొండ ఎక్కి , గుట్టలూ  వాలు చరియలూ దిగి , తోపులను కోనలనూ దాటి , మనోవేగముతో వచ్చి , దేవరాతనికి నమస్కరించి , " నేను మీ కడుపున పుడతాను "  అంటున్నాడు .  దేవరాతనికి , " నువ్వెవ్వరవు ? మమ్మల్నెందుకు ఎంచుకున్నావు ? " అని అడగవలె ననిపిస్తుంది . అంతలోపలే అతడు చిన్న తేజోపిండమై , దేవరాతని సరసన పడుకుని యున్న ఆతని ధర్మపత్ని ఆలంబినీ దేవి గర్భమును ప్రవేశిస్తాడు . అతని ప్రశ్న ఇంకా మాటలు దాల్చి బయటికి వచ్చు ప్రయత్నము జరుగునంతలోనే ఇదంతా జరిగిపోయింది . 

          దేవరాతునికి ఆశ్చర్యమైనది . తన భార్య గర్భవతి యైనప్పటి నుండీ అతడు విధి పూర్వకముగా ఏమేమి చేయవలెనో ఆయా సంస్కారముల నన్నిటినీ సకాలములో చేసినాడు . పుంసవనమైనది . చూలింత కోరికలన్నీ తీర్చడమైనది . ఇంకో పదిరోజులకు సీమంతము జరగనున్నది . ఇప్పుడు ఇదొక అలౌకిక ఘటన. అతనికిది అతి విచిత్రముగా అనిపించి , ఆశ్చర్యమై , మనసులోనే ప్రశ్నా పరంపరలు తరంగముల వలె మూగుతున్నాయి . " అట్లైతే , మా ఆశాసౌధాలు వ్యర్థాలు కావు , వేదకర్మలు సార్థకమవుతున్నాయి  , మా వంశములో లోకోత్తరుడైన ఒక బ్రహ్మర్షి ఉదయిస్తాడు . ఆత్మోద్ధారము చేసుకున్న అతని వలన వంశము ఉద్ధారమై , లోకము కూడా సద్గతిని పొందగల దారిని కనుక్కుని ఉద్ధారమవుతుంది " అని అతని మనసు ఆనంద నర్తనము చేసింది . 

         సంతోషమైనా, దుఃఖమైనా తనవారితో పంచుకోనిదే మనసు ఊరుకోదు . సంతోషమైతే ఇనుమడించి ఆనందం రెట్టింపవుతుంది  , దుఃఖమైతే ,  పంచబడి పలచబడి  మనిషిని ఓదారుస్తుంది . అందుకేనేమో , మానవుడు సంఘజీవియై సాంగత్యాన్ని అపేక్షించేది ? 

          దేవరాతుడు పక్కనే పరుండిన భార్యను పిలిచాడు . ఆమె మెలకువగానే యున్నది . .అతనికి ఆశ్చర్యమైంది , " నీవు లేచే ఉన్నావా ? అలాగైతే ఏదైనా విచిత్రాన్ని చూసినావా ? " అని అడిగాడు .  ఆమె , " అవును , నేను చూసినదాన్ని మీకు చెప్పవలెనని యున్నాను . అంతలో మీరే పిలిచినారు " అని తాను చూసినది చెప్పింది , " ఒక వాగు తీరములోనున్న ఆశ్రమమొకటి  , ఆ ఆశ్రమమునుండీ తెల్లటి వస్త్రములు కట్టుకొనియున్న సాధువొక్కరు వచ్చి నా గర్భమును ప్రవేశించినారు . " అంది . 

          దేవరాతునికి పట్టరానంత ఆశ్చర్యమైనది . సంభ్రమముతో " అవునా ? " యని కొంత తడవు ఊరికే ఉండి , " చూడు , నాకు కూడా నీకు కనిపించినదంతా కనిపించింది . దాన్నే నీకు చెప్పాలని పిలిచినాను . అప్పటికే నువ్వు మేల్కొని , నేను చూసినదే నువ్వు కూడా చూసినావు " అన్నాడు . 

ఆలంబినీ దేవి స్త్రీ సహజమైన కుతూహలముతో అడిగింది , " అయితే మరి దీని అర్థమేమిటి ? " 

         దేవరాతుడు నవ్వి అన్నాడు , " అర్థమేమిటి ? స్పష్టముగానే ఉంది కదా ? నా కన్నా ప్రబలుడైన కొడుకు కావాలని నేను చేసిన తపస్సు ఫలించింది . ఎవరో ఒక తపస్వి నీ గర్భమును చేరినాడు . పుట్టి లోకాన్ని ఉద్ధరించుటకు ఇక్కడికి వచ్చినాడు . " 

         " ఏమిటీ ? మీకన్నా ప్రబలుడా ? మేమెలా నమ్ముట ? ఈ చుట్టుపక్కలే కాదు , దేశ దేశాంతరముల నుండీ కూడా యజ్ఞ యాగాదుల విషయములలో ఎట్టి సందేహము వచ్చినా , తీర్చుకొనుటకు మీ దగ్గరికే వస్తారు . ఇక మీ కన్నా ప్రబలుడంటే ఎటువంటి వాడు ? " 

         " చూడు కాంతామణీ , నువ్వు చెప్పినది అబద్ధము కాదు, అయితే , నాది కర్మ కాండ. ఏవేవో ఆశలను పెట్టుకొని చేయు కర్మల గుత్తులే ఈ కర్మ కాండలు . అయితే , పెద్దలు ఏమంటారంటే , ఈ ప్రపంచపు వెలుపల ఇంకేదో ఒకటి  ఉందట . అది ఈ విశ్వాన్నంతా వ్యాపించి ఉందట. నీలోపల , నాలోపల మాత్రమే కాక , చీమ  , దోమ ,వాటికన్నా చిన్నవైన క్రిమి కీటకాలు మొదలుకొని ఏనుగు , ఒంటె వరకూ ఉన్న సమస్త సచేతన ప్రాణులలోనూ ఉన్న చైతన్యము అదేనట . అట్లే , జీవమున్న స్థావర జంగమములన్నీ బ్రతికియున్నది దాని వలననేనట . సూర్య చంద్రులలో ప్రకాశముగా కూర్చున్నదీ అదేనట !. ఇక్కడ ఉన్నదంతా దానికోసమై వదలి , ....వింటూన్నావా ?  ఈ ఊరు వదలి ఇంకో ఊరికి పోవువాడివలె , మనము చేస్తున్నదానినంతా , మన ఆశలనన్నిటినీ ,  దానికోసమై వదలి జీవిస్తే అది దొరుకుతుందట . అది నిజమైతే , ఇక్కడున్న అన్నిటికన్నా అదే ఎక్కువ అయితే , అప్పుడు దానిని తెలిసినవాడు నా కన్నా ప్రబలుడు అవుతాడా కాదా ? " 

" మీరు ఇంతకు ముందెప్పుడూ ఆ విషయమును ప్రస్తావించి ఉండలేదే , కదా ? " 

         " అవును , ఆ సంగతే మాట్లాడలేదు . నిజం చెప్పాలంటే , నాకు అది లేదు అన్న అపనమ్మకమైతే లేదు కానీ , దానికోసము సర్వమునూ త్యాగము చేయడమన్నది నాకు మింగుడు పడదు . చూడు ఆలంబీ , యజ్ఞములో అధ్వర్యుడు ఫలానా దేవుడిని పిలవాలని ప్రైష ( ఆహ్వానము ) నిస్తాడు . హోతృడు ఓం అని ఆ దేవతా సంబంధమైన సూక్తమును పారాయణ చేసి , ఆ దేవతను ఆకర్షించును . ఉద్గాతృడు ఆ సూక్తాన్ని సామముగా ఉపబృంహణ చేసి పాడి ఆ దేవత మన సూక్ష్మ ఇంద్రియములకు గోచరమగునట్లు చేస్తాడు . ఏదైనా హెచ్చుతగ్గులైతే బ్రహ్మ స్థానములో ఉన్నవాడు సరిపరచును . అప్పుడు అధ్వర్యుడు ఆ దేవతకు హోమము చేసి యజమానుని ఇష్టమేదో దానిని సాధించును . ఈ వైభవములో మునిగియున్న వానికి అన్నీ వదలి చప్పగా కూర్చొని ఉండుటన్నది ఎట్లు  మనస్కరించును ? అదీకాక , ఆ మార్గమును పట్టినవాడు దానికి బ్రహ్మ విద్య అనే పేరు ....."  

" బ్రహ్మ విద్య అంటే ? "  

         " బ్రహ్మమనగా గొప్పది . దేనికన్నా మరి గొప్పది ఏదీ లేదో , అదే అన్నిటికన్నా గొప్పది , ఆ ’ అది ’ ఏదో ఏమిటో చెప్పేవాడికీ తెలీదు , వినేవాడికి ఎంతమాత్రము తెలీదు . అదే బ్రహ్మ . దానిని సంపాదించి ఇచ్చే విద్యయే బ్రహ్మ విద్య . దీనిలో ఇంకో అందముంది , తెలుసా ? " 

" చెప్పండి " 

         " ఆ బ్రహ్మము కోసము మనము అన్నిటినీ , అంతటినీ వదలి మిడుకుతూ కాచుకొని కూర్చోవాలట . అది తపస్సుకు దొరకదట . దానము వలన పొందుటకు వీలు కాదట . అధ్యయనము , ప్రవచనముల వల్ల అసలే దొరకదట . ఏమి చేసినా పొందుటకు వీలు కానేకాదట . అది తానుగా మనలను అనుగ్రహించువరకూ వేచి ఉండాలట. ఇది నాకెందుకో పట్టలేదు , నచ్చలేదు . అయినా , దానిని శృతి  చెప్పుతున్నది కాబట్టి గౌరవించవలెను . గౌరవిద్దాం . ఒప్పుకుందాం . అంతే కానీ , అది మన జీవనానికి ఒక రూపు ఇవ్వడము వద్దనుకుని , నేను దానివైపుకు చూడనే లేదు  , పట్టించుకోనే లేదు . " 

" మరి ఇప్పుడు మీ పుత్రుడు మీకన్నా ప్రబలుడవుతాడు అంటిరి కదా , అది యెట్లు ? " 

         " బహుశః , వాడి శ్రద్ధ ఈ కర్మ కాండను ఒప్పుకొని , ఇంకా ముందుకు పోవచ్చేమో ! అయితే ఒక మాట . నా పుత్రుడు కర్మ కాండను తిరస్కరించుటకు నేను ఒప్పుకోను , అది వాడి ఇష్టానికి వదలను . వాడు బ్రహ్మ విద్యను నేర్చుకోవాలన్నా , మన కర్మ కాండలో నిపుణుడై , ఎక్కడ ఎవరికి ఏ సంశయము వచ్చినా దానిని పరిహరించగల వాడు కావలెను . ఎక్కడెవరే యాగాన్ని చేయవలెనన్ననూ ’ ఈ దేవరాతుడి కొడుకును పిలవాలి . లేకుంటే యాగము పూర్ణమే కాదు ’ అనవలెను . రాజాధిరాజు కూడా వాడిని పల్లకి ఎక్కించి కూర్చోబెట్టుకొని పిలుచుకొని వెళ్ళి బండినిండా దక్షిణను సమర్పించవలెను . ఇప్పుడు నాకు వీరంతా చేరి యజ్ఞవల్క్యుడు అని కదా బిరుదునిచ్చినారు , ? ఈ నా కుమారుడు ఈ బిరుదు వలన యజ్ఞవల్క్యుని కొడుకు ’ యాజ్ఞవల్క్యుడు ’ అని ప్రసిద్ధుడు కావలెను . ఆ తర్వాత కావలెనన్న , వాడికి బ్రహ్మవిద్య రానీలే . అలాకాక , వాడేమైనా బ్రహ్మ విద్య కోసము మన శ్రౌత విద్యను వదిలేస్తానంటే , నేను వాడినే వదిలేస్తాను . కానీ , వాడు అలాగు చేయడనుకో ! నాకు నమ్మకముంది . మన పుత్రుడు మనకు ఎదురు చెప్పకుండా  , మనకి ఎల్లప్పుడూ విధేయుడై ఉండేలా అగ్ని వలన వరము పొందినాను . " 

 " మీరు ఈ బ్రహ్మ విద్య సంగతిని ముందెప్పుడూ ప్రస్తావించియే ఉండలేదే ? " 

        " దానికి సందర్భము రాలేదు . అయినా , అవకాశమెక్కడ ?  నేను ప్రాజాపత్య వ్రతములో నున్నవాడిని .  అది చాలదన్నట్టు తెల్లారిన దగ్గరనుండీ పొద్దుగూకేవరకూ , కాదు , కాదు ... సంవత్సరము మొదలై సంవత్సరము  ముగిసే వరకూ అనుదినమూ ఏదో ఒక ఇష్టి , యాగము అని కూర్చొనువాడను . ఆ యాగానికి దర్భలు తేవడము , ఈ ఇష్ఠికి సమిధలు తేవడము , దానితో పాటు ఆ వచ్చినవారికి సమాధానాలిస్తూ వారి సంశయాలను పరిహరిస్తూ ... వీటిలోనే కాలమంతా గడచి పోవుచుండినది . ఈ దినమే కదా , ఈ దృశ్యము చూడటము వలన , ఈ అపరాత్రి మనమిద్దరమూ మాట్లాడుకునే యోగము కలిగింది ?  ఒకవేళ నాకు మెలకువైనా , నిద్రిస్తున్న నిన్ను చూసి , పొద్దుటినుంచీ గానుగెద్దు లాగా తిరుగుతూ రోకి రోకి అలసిపోయావని నిన్ను లేపుటకు మనసే ఒప్పేది కాదు . ఈ దినము అన్ని విధులనూ పక్కనబెట్టి నేను చూసిన విచిత్రాన్ని నీకు కూడా చెప్పాలని అనిపించి , నిన్ను పిలిచినాను . అదేవేళకు అదేమి గ్రహచారమో , నువ్వుకూడా లేచినావు . నీకు ఇంకోటి తెలుసా ఆలంబీ ? "

         ఈ వేళకి దేవరాతుడికి వాచాలత్వపు ప్రవృత్తి బలమైంది . లేచి కూర్చొని ఉంటే ఆశ్చర్యమేమీ లేదు , కానీ అతడు లేవకుండా , అట్లాగే పక్కకు పొరలి , మోచేతులపైన భారాన్ని వేసి , తలయెత్తి , భార్య వైపుకు తిరిగి అన్నాడు : " విను , నాకు ఇంకొక సహించలేని అంశమేమిటంటే , ఆ బ్రహ్మ విద్యను తెలిసిన వారు కుక్క, నక్క, చండాలుడాదిగా , అన్నిటినీ సమ భావముతో చూడవలెనంట ! అది నాకు నచ్చదు , దానిని నేను ఆమోదించలేను . బ్రాహ్మణుడై , సర్వ శ్రేష్టుడూ , జ్యేష్టుడూ యై , మేము ఆరాధించు దేవతను , మనలను ఆరాధించువారినీ , అన్నిటికన్నా మిన్నగా స్పర్శన , దర్శనములకు అయోగ్యులైన వారిని సమానమని భావించుట యేలాగు ? ఇదొక పెద్ద బహు జటిలమైన సమస్య . దానివల్లనే నేను బ్రహ్మవిద్య జోలికే పోలేదు , పోను కూడా ! నేను ఒప్పుకునే దేమిటంటే , ’ సర్వేషామవిరోధేన బ్రహ్మ కర్మ ’ చేయుట !  అనగానేమి ?  మనము  చేసే కర్మ , జాగరూకతగా , ఎవరికీ , ఏ ప్రాణికి కూడా , చేతనాచేతనమైన దేనికీ , యే రీతిలోనూ హింస కలగకుండా  చూసుకోవడము . ’ శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే ’ --రెండు కాళ్ళ ప్రాణులకూ , నాలుగు కాళ్ళ ప్రాణులకూ కూడా శుభము జరగనీ అని కర్మ చేయుట " 

       " ఔనౌను , ఇప్పుడు మీరు చేసే కర్మ అలాగే ఉన్నది . మీ జీవ కారుణ్యపు విషయములో ఎవరూ సందేహపడుటకు లేదు . ఎవరికైనా ఇబ్బంది కలుగుట ఉంటే , అది మీకే ! అయితే అది మీకు అలవాటైపోయింది . " 

      " ఏమి చేయుట ? నీకు ఇబ్బందులు తప్పుటలేదు . నా చేబట్టినందుకు నువ్వూ ఇన్ని కష్టములను సహించవలసి వచ్చింది . "

" నాకేమీ కష్టము లేదు . ఇవన్నీ నాకు కూడా అలవాటే " 

          ఆ వేళకు తొలికోడి కూసింది . అది విని ఇద్దరూ " ఇదేమిటి , అప్పుడే కోడికూత వేళ అయింది , సరే , ఇంకేమి , స్నానానికి లేచు సమయమైంది " అనుకున్నారు . దేవరాతుడు , " ఈ పొద్దు మధ్యాహ్నపు భోజనము తర్వాత నువ్వడిగితే , నేనేమి చేయవలెనని ఉన్నానో అదంతా వివరిస్తాను . నీకు ఇష్టమే కదా ? " అని అడిగినాడు .  దానికి సమాధానంగా ఆమె " అలాగంటే ఈ దినము వైశ్వదేవము త్వరగా అగునట్లు చూసుకోవలెను . మీ మాటలు నాకు బెల్లం పాకము వంటివి . అదీకాక , ఈ దినము పురాణము కూడా లేదు . సాయంత్రమొక వేళ వరకైనా మాట్లాడుకోవచ్చు " అంది . 

ఇద్దరూ ఇంకొక ఘడియ అలాగే ఉండి , స్వరము * సరిపోవు వరకు పడుకొనియుండి లేచినారు . 

( *  స్వరము :  నాసిక లోకి వచ్చు శ్వాసకే స్వరము అనిపేరు . నిద్రలేవగానే శ్వాస  ముక్కులో ఏ వైపు నుండీ ఆడుతున్నదీ చూసుకోవలెను . కుడి ముక్కు లో ఆడేది సూర్యుడు . ఎడమ ముక్కులో ఆడేది చంద్రుడు . రెంటిలోనూ ఆడేది జీవము -- అని స్వరము మూడు విధములు . ఫలానా తిథులలో , ఫలానా వారములలో , ఈయీ స్వరాలే ఉండవలెను అను నియమము ఉంది . స్వరశాస్త్రములో ఈ విషయము వివరింపబడి ఉండును . )

Tuesday, December 4, 2012

శ్రీ దేవుడు నరసింహ శాస్త్రి గారి " ’మహాదర్శనము ’ ' -- త్వరలో


         ’మహాదర్శనము ’ శ్రీ దేవుడు నరసింహ శాస్త్రి గారు 








         ’మహాదర్శనము ’ శ్రీ దేవుడు నరసింహ శాస్త్రి గారు రాసిన అనేక కృతులలో ప్రముఖమైన మూడింటిలో ఒకటి ,   చివరిది . ఇది యాజ్ఞవల్క్యుని కథ. 

     పేరుకి యాజ్ఞవల్క్యుని కథ యథాతథముగా రాసినా , ఇందులో అనేక తత్త్వ రహస్యములు , అంతరంగ రహస్యములు , ధ్యాన రహస్యములు మనిషి ఎంతవరకూ అభివృద్ధి చెందవచ్చునో కళ్ళకు కట్టినట్టు , తేలికైన భాషలో , సులభముగా అర్థమయ్యే రీతిలో వ్రాసినారు .     మనలో , మన శరీరములో మనకు తెలియని ఇన్ని రహస్యములున్నవా అని అబ్బుర పరచే కావ్యము. 

     ఆధ్యాత్మికము , తత్త్వము అనగానే చాలామందికి ఒక విముఖత. నిజానికా విముఖత ఆధ్యాత్మికము పైనో , తత్త్వము పైనో కాదు. అది వ్రాసిన విధానము , వ్రాయుటకు వాడిన భాషలపైన మాత్రమే ఆ విముఖత . సరైన విధానములో సరైన భాష వాడి రాస్తే విషయమేదైనా పాఠకులను పట్టి ఉంచుతుంది అనునది ఈ పుస్తకము చక్కగా నిరూపిస్తుంది . 

        ఈ మహా దర్శనము పుస్తకము రాయుటకు ముందు దీనిని ఒక నాటక రూపముగా రాసియుండినారు . అది 1952  లో ఆకాశవాణిలో ప్రసారమయినది . ఆ  నాటకము ఒక పత్రికలో కూడా ప్రచురించబడినది . ఆ తరువాత దీనినే విస్తరించి కాదంబరి ( నవల ) రూపములో వ్రాసినారు. అది కూడా ఇంకొక పత్రికలో ధారావాహికగా అచ్చయినది . 1935 ప్రాంతములో దేవుడు గారు అప్పట్లో ’ మీమాంస కంఠీరవ ’ బిరుదు తెచ్చుకున్న  " శ్రీ వైద్యనాథ శాస్త్రి "  గారి దగ్గర సంప్రదాయ బద్ధముగా ’ మీమాంసా శాస్త్రమును నేర్చుకున్నారు . ఆ సమయములో వారి మిత్రులొకరు యాజ్ఞవల్క్యుని విమర్శించినారట.  అప్పుడు దేవుడు ఆ మిత్రుడితో  " ఒక వేదము , ఒక బ్రాహ్మణము , ఒక ఉపనిషత్తు మానవ లోకానికి తెచ్చి ఇచ్చి, ఇంకొక ఉపనిషత్తుకు కారణమైన యాజ్ఞవల్క్యుడు మహాపురుషుడు . అతడిని ఇలాగ విమర్శించుట తగదు ’ అని చెప్పినారు . ఈ పుస్తకము వారు వ్రాయుటకు ప్రేరణ అదే . 

          శ్రీ దేవుడు నరసింహశాస్త్రి గారు రాసిన ’ మహా బ్రాహ్మణ ’ పుస్తకమును ’ మంత్ర ద్రష్ట ’ పేరుతో నేను చేసిన అనువాదము మీరంతా చదివియున్నారు . వారి కథా కథనము , శైలి , పాఠకుని కట్టి పడవేయు నటువంటి సన్నివేశ చిత్రణ మీకు పరిచితములే . ఈ పుస్తకము కూడా వారి ప్రతిభకు మరొక తార్కాణము. ఇటువంటి పుస్తకములు వ్రాయవలెనంటే కొన్ని సిద్ధులు కలిగి ఉండవలెను . సిద్ధులు ఉంటే చాలదు వాటిని తేలికగా విడమరచి చెప్ప గలగాలి , దానికి ప్రతిభ, నేర్పు ఉండాలి . ఇవన్నీ ఉన్నా స్వానుభవము లేకపోతే కేవలము మేధను ఉపయోగించి వ్రాయుట అసాధ్యము . 

         ఒకసారి చదువుట మొదలు పెట్టుట వరకే మన వంతు . తరువాత అది పూర్తియగు వరకూ నిలపకుండా చదివించే చాకచక్యము దేవుడు గారిది . ’ మహా బ్రాహ్మణ ’ ను అనువదించునపుడు నేను కొంత కష్ట పడినది నిజమే , కానీ ఈ ’ మహా దర్శనము ’ అనువదించుటకు నాకున్న సర్వ శక్తులూ , ప్రతిభలే కాక ,  దేవుడి గారి ఆశీర్వాదము , ఆ భగవంతుడి అనుగ్రహము లేక పూర్తి చేయుట దుస్సాధ్యము అని నాకు మొదట్లోనే అర్థమయినది . ఆయన శైలిలోని ఒక విశేషమేమంటే , ప్రతి పాత్రలోనూ తాను దూరి , కథ చెబుతున్నామన్న ధ్యాసతో కాక , ఆ నిమిషానికి ఆ పాత్ర ఏమాలోచించునో / అనుభవించునో అంత మాత్రమే , ఆ పాత్ర పరముగా వ్రాసి , సంభాషణలు కూడా తదనుగుణము గానే వ్రాయుట. పాఠకులకు సరిగ్గా అర్థము కావలెను కాబట్టి కావలసిన వివరాలన్నీ అప్పుడే చెప్పవలెను అన్న ఆత్రము ఏమాత్రమూ లేకుండా , కథతో పాటే పాఠకుడు కూడా నడుస్తూ , ఒక్కొక్కటీ ఆకళింపు చేసుకుంటూ , ముందుకూ వెనక్కూ పేజీలు తిప్పి తిప్పి సరి చూసుకుంటూ సరిగా అర్థము చేసుకుంటూ వెళ్ళేలా చేస్తాడు . దీనిలో ఏమాత్రమూ విసుగుదల కాదు కదా అసౌకర్యము కూడా లేక, మరింత ఆసక్తిగా చదివించేలా చేయడమే ఆయన ప్రత్యేకత. ఒకభాగములో చదివినది సరిగా అర్థము కాకున్నా , తరువాతి భాగములలో అది పూర్తిగా విశదమై మనల్ని ఆశ్చర్య చకితులను చేస్తుంది . అదీ ఆయన శైలి . 

         ఇందులోని కొన్ని నిగూఢ రహస్యములను , తత్త్వ బోధలను , సరిగా , తప్పులు లేకుండా , తప్పు అర్థము రాకుండా వ్రాయుట నాకు కత్తిమీద సామే అయినది . వారిని ప్రార్థించి , నేను ఎంతో కొంత కృతకృత్యుడనై ఉంటే దాని పూర్తి ఫలమూ , ఖ్యాతీ , శ్రీ దేవుడు గారికే నిస్సందేహముగా చెందుతుంది . 

అనువాదము ఇంకా నడుస్తున్నది . సంక్రాంతి నుంచీ ఇవ్వగలనని అనుకుంటున్నాను . 

శుభం భూయాత్

Tuesday, November 13, 2012

కార్తీకమాస ఆదిత్య ఉపాసన





                              ||  విష్ణురశ్వతరో రంభా  సూర్యవర్చాశ్చ సత్యజిత్ |
                                 విశ్వామిత్రో మఖాపేత ఊర్జమాసం నయంత్యమీ ||

                                 భానుమండల మధ్యస్థం వేదత్రయ నిషేవితం |
                                  గాయత్రీ ప్రతిపాద్యం తం విష్ణుం భక్త్యా నమామ్యహం ||

                ధ్యేయస్సదా సవితృ మండల మధ్యవర్తి నారాయణస్సరసిజాసన సన్నివిష్టః |
                కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటీ హరీ హిరణ్మయ వపుః ధృతశంఖ చక్రః ||

          కార్తీకమాసమందు ’ విష్ణువు ’ అను పేరుతో సూర్యుడు తన రథముపై సంచరించుచుండును . ’ విశ్వామిత్ర ’ మహర్షి , ’ రంభ ’ అను అప్సరస , ’ సూర్యవర్చసుడు ’ అను గంధర్వుడు , ’ సత్యజిత్తు అను యక్షుడు , ’ అశ్వతరము ’ అను సర్పము , ’ మఖాపేత ’ అను రాక్షసుడు ఆయన వెంట ఉందురు .

          ఆయన సూర్యమండలమునకు మధ్య స్థితుడైయుండును . మూడు వేదములు ఆయనను స్తుతించును . గాయత్రీ మంత్రము ద్వారా ప్రతిపాద్యుడైన ఆవిష్ణువునకు నేను భక్తితో నమస్కరించుచున్నాను . విష్ణ్వాదిత్యుడు ఆరు వేల కిరణములతో శోభిల్లుచుండును . అతడు అరుణ వర్ణమును కలిగియుండును .

యమాదిత్యుని మాహాత్మ్యము 


      ఒకసారి యమధర్మరాజు తన లోకమున ఆశీనుడై ,  పాశములను , దండములను ధరించిన తన దూతలను ఇట్లు ఆదేశించెను .

       " విష్ణు స్వరూపుడైన సూర్య భగవానుని యొక్క భక్తుల సమీపమునకు మీరు వెళ్లవలదు , ఏలనన, వారిని ఈ లోకమునకు తీసుకొని వచ్చుట తగదు .  నిరంతరమూ తమ హృదయములను సూర్యుని యందే లగ్నమొనర్చిన ఆయన భక్తులకును , సూర్యభగవానుని పూజించెడి వారికినీ మీరు దూరమునుండియే ప్రణమిల్లి రాగలరు . సర్వకాల సర్వావస్థల యందును సూర్యుని నామములను కీర్తించెడివారు యమలోకమునకు రానక్కరలేదు . భాస్కరుని కొరకు నిత్య నైమిత్తికము లైన యజ్ఞములను ఆచరించు వారి వైపు మీరు కన్నెత్తి యైనను చూడరాదు . మీరు సూర్య భక్తులను తాకిననూ , లేక వారిని యమలోకమునకు తీసుకొని వచ్చుటకు ప్రయత్నించినను మీకు పుట్టగతులుండవు . పుష్పములతో , ధూపదీపములతో , అందమైన వస్త్రములతో సూర్యుని సేవించువారిని మీరు బంధింపరాదు . ఎందుకనగా వారు మా తండ్రికి మిత్రులు . ఆశ్రితులకు ఆశ్రయమైనవారు .  సూర్యమందిరమును శుభ్రపరచెడు వారు , లేదా సూర్యమందిరమును నిర్మించువారు అయిన వారియొక్క మూడు తరములవారిని మీరు బంధింపరాదు . తండ్రియైన సూర్యభగవానుని అర్చించు భక్తుల వంశములవారికి కూడా మీరు సర్వదా దూరముగా ఉండవలెను :"

      మహాత్ముడైన యమధర్మరాజు ఇట్లు ఆదేశించినను ఒకసారి యమభటులు ప్రమత్తులై , ఆ ఆదేశమును జవదాటి , సూర్యభక్తుడైన సత్రాజిత్తు కడకు వెళ్ళిరి . కానీ సత్రాజిత్తు తేజస్సునకు ఆ యమభటులు మూర్ఛితులై భూమిపై పడిపోయిరి . వారి యపరాధమును మన్నింపజేయుటకు యముడు కాశీ యందు యమాదిత్యుని ప్రతిష్టించి , తీవ్రముగా తపస్సు చేసెను . తత్ఫలితముగా సూర్య భగవానుడు ప్రత్యక్షమై ఆయనకు పెక్కు వరములిచ్చెను .

       ఈ యమాదిత్యుడు కాశీ యందు , యమేశ్వరునకు పశ్చిమ దిశయందును , ఆత్మవీరేశ్వరునకు తూర్పు దిశయందునూ , సంకట ఘట్టమున ప్రతిష్ఠితుడై యున్నాడు . యమాదిత్యుని దర్శించేవారికి యమలోకము దర్శించు సందర్భము రాదు . మంగళవారముతో కూడిన చతుర్దశియందు స్నానము చేసి యమేశ్వరుని , యమాదిత్యుని దర్శించెడివారు సకల పాపములనుండీ ముక్తులగుదురు . యమధర్మరాజు ప్రతిష్ఠించిన యమేశ్వరునకూ , యమాదిత్యునకూ ప్రణతులను అర్పించెడివారు యమలోక యాతనలను అనుభవింపవలసిన పనిలేదు సరికదా , వారికి యమలోకమును చూడవలసినపని కూడా లేదు . అంతేగాక , యమ తీర్థమున శ్రాద్ధమొనర్చి , యమాదిత్యుని పూజించువారు పితృ ఋణమునుండీ ముక్తులయ్యెదరు .

      కాశీ యందు పండ్రెండు మంది ఆదిత్యులు ప్రతిష్టితులై యున్నారు . ఈ ద్వాదశాదిత్యుల ఆవిర్భావ కథలను వినినవారికీ , వినిపించినవారికీ, దుర్గతులు దూరమై సద్గతులు లభించును .

( పద్మ పురాణము )

లోకాస్సమస్తాస్సుఖినస్సంతు

Monday, November 12, 2012

వివాహము లో అరుంధతీ నక్షత్ర దర్శనము


వివాహము లో అరుంధతీ నక్షత్ర దర్శనము

          వివాహములోని అనేకమైన తంతులలో , అనగా , అంకురార్పణము అయిన తర్వాత , పెళ్ళికుమారుని , పెళ్ళికూతురును చేయుట ,గౌరీ పూజ , వరపూజ , అటుతర్వాత మధుపర్కము , జీలకర్రా బెల్లము , తలంబ్రాలు  మొదలు ఆచరించు అనేక కార్యముల తో పాటు విశిష్టమైనది అరుంధతీ నక్షత్ర దర్శనము. వివాహ సమయములో వరుడు తన క్షేమాభివృద్ధుల కోసము అనేక మంది దేవతలను ప్రార్థించును . దానికొరకు పెళ్ళికుమారుని చేత పురోహితుడు అనేక మంత్రములను చెప్పించును . 

          మొదట పెళ్ళికుమారుడు వధువుతో , " ఓ కన్యా , నా గృహమునకు వచ్చి నాతో కాపురము చేయుచూ సంతాన సమృద్ధిగలదానివి కమ్ము , నా గృహమునకు వచ్చి , గృహస్థుని ధర్మములగు అతిథి అభ్యాగతులను పూజించుట , ఆదరించుట చేయుటలో నాకు సహకరించుము , పుత్రులు , మనవలు కలిగినాక వారికి కూడా ఇవియన్నియూ బోధించుము " అని చెప్పును (  ఇహ ప్రియం ప్రజయా తే సమృధ్యతా ......వివిధ మావదాసి ||  అనే మంత్రము )

          ఆ తరువాత , || సుమంగలీరియమ్ వధూరిమాగ్ం .........విపరేతన   || అనే మంత్రము చెప్పును . దాని అర్థము  , వివాహమునకు వచ్చిన వారితో , " బహుకాలము వరకూ సువాసినీత్వము కలిగియుండెడి  ఈ వధువు చూచి , ఆమెకు ఆయుర్భాగ్యములనొసగి , ఆశీర్వదించి తరువాత మీ ఇండ్లకు స్వేఛ్చగా వెళ్ళుడు " అని ప్రార్థిస్తాడు .

     తరువాత ధృవ నక్షత్రమును గూర్చి , ’ తనకు జీవితమున శత్రు బాధలు లేకుండా కాపాడుమని ’ ప్రార్థించును . 

         అటుతరువాత , భార్యతో సహా  ఆకాశములోని సప్తర్షి మండలములో నున్న అరుంధతీ నక్షత్రమును దర్శించి , ఈ విధముగా ప్రార్థించును "  కశ్యపుడు మొదలగు ఏడుగురు ఋషులు తమ తమ భార్యలు ఏడుగురిలోను , వశిష్ఠుని భార్య యైన అరుంధతీ దేవి అగ్రగణ్యురాలనీ , అతి పవిత్రమైన పతివ్రత యని , మనస్సునందైననూ , ఒక్క క్షణమైననూ పతిని మరువక సదా తలచుచుండుననీ , అతి నిశ్చలమైనదనీ తలచి ఒప్పుకొనిరి . అందువలన , అరుంధతిగాక మిగిలిన ఆరుగురు స్త్రీలు అరుంధతిని తమలో అగ్రగణ్యురాలు అను భావమును వహించిరి .  అట్టి పరమ సాధ్వియైన అరుంధతీ దర్శనముచేత పవిత్ర భావములు పెంపొందిన , నా భార్యను మీ ఏడుగురితో పాటు ఎనిమిదవ దానినిగా ను , పవిత్రమైనదానిగాను తలచి ఆశీర్వదించండి . " . అనగా తాను ఎనిమిదవ ఋషిని యని భావించునట్లు అర్థము . ( || సప్త ఋషయః ప్రథమం కృత్తికానామరుంధతీం ......అస్మాకమేధత్వష్టమీ ||  అనే మంత్రము ) 

తర్వాత అగ్నిహోత్రుని , గంధర్వులను , సూర్యుడిని , ఇతర దేవతలనూ ప్రార్థించును . 

         ఒక సంసారము బాగుగా నడవవలెనంటే దానిలో ఆ ఇంటి గృహిణి యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది . అందుకే ఇంటిని చూచి ఇల్లాలిని చూడు అన్నారు . ఒక ఇల్లు నిలవాలన్నా , కూలిపోవాలన్నా అది ఆ ఇంటి ఇల్లాలి వల్లనే అవుతుంది . కాబట్టి తన ఇల్లాలికి అరుంధతిని చూపించి సద్బుద్ధి కలిగించునట్లు చేయమని ప్రార్థించుట. 

        సముద్రము పక్కన కూర్చొనగానే , మనము వద్దనుకొన్ననూ చల్లగాలి వచ్చి ఎటుల తాకునో , అట్లు , అరుంధతిని చూడగనే ఆమె ప్రభావము వలన మనసు పవిత్రమగును అని ప్రతీతి . 

Monday, November 5, 2012

4. " జీవిత చుక్కాని " నాలుగవ అంకం సంబరం


నాలుగవ అంకం  సంబరం



         ఈ అంకం లో మా చిన్నప్పటి పండుగల ఆనందము , ఆకాలపు అలవాట్లు ,  పిల్లలు ఎంతో మురిసేలా అమ్మ చేసే పిండి వంటలు , మా మనోల్లాసము వంటివి మధుర జ్ఞాపకాలు మెదలుతున్నాయి. 


                        అనంతపురం సాయినగరు లో మా పాత ఇంటి పండగ వాతావరణం. 


                           ఇక పండుగలు వస్తే, నిజంగా మాకు పండుగే ! అలాగని, మేమేదో ధూం ధాం గా చేసుకొనే వాళ్ళమని కాదు. ఆడంబరాలు లేకున్నా, పండుగలలోని నిజమైన ఆనందాన్ని , ఆ స్పూర్తినీ, ఎంతో హృద్యమైన అనుభూతులను పొందేవాళ్ళం.  బడాయిలు లేని ఆనాటి సంబరాలు ఎంత మనసుకు హత్తుకునేలా ఉండేవో ! 

                సంక్రాంతికి ఇంటిముందర ౪౦-౫౦ గజాల స్థలంలో  అమ్మ పూర్తిగా ఆవు పేడ తో కళ్ళాపి చల్లించేది. పెద్ద పెద్ద ముగ్గులు వేసేది. మా అక్కయ్యలు కూడా పోటీలు పడి ముగ్గులు వేసేవాళ్ళు. మేము వెళ్ళి గుమ్మడి పూలు, సుంకేసుల పూలు తెచ్చేవాళ్ళం. పేడతో గొబ్బెమ్మలు  చేసి ముగ్గుల మధ్యలో వుంచి, పూలతో అలంకరించి, పసుపు కుంకుమా పెట్టి  హారతి ఇచ్చేది. ఉదయాన్నే ఇంటిముందుకి హరిదాసు వచ్చేవాడు. తలపైన బొట్లు పెట్టిన గిన్నెలో  బియ్యం పోయించుకునేవాడు. గంగిరెద్దులు అలంకరణతో కొమ్ములు  ఊపుతుంటే, వాటిని తోలుకొని వచ్చిన వాళ్ళు ఎద్దుకీ, తమకీ కూడా పళ్ళు, డబ్బులు , ధాన్యము తీసుకొని వెళ్ళే వాళ్ళు. కోస్తా ఆంధ్రా లో ఉన్నంత కాక పోయినా, కోడి పందేలు జరిగేవి.  ఒక అతను హార్మోనియమ్ తెచ్చి, వాయిస్తూ, " పరమాత్మూనీ భజనా,,  పలీకీనంతటానా " అంటూ భిక్షానికొచ్చేవాడు. మిగతా రోజుల్లో కూడా వచ్చేవాడు కాబట్టి, ఆ పాట వినీ వినీ నేర్చేసుకున్నాము.  ఇంకొకాయనైతే, గోచీ పెట్టి పంచె కట్టి, ప్రతి ఇంటిముందుకూ వచ్చి, తలకిందుగా నిలుచొని, " హరి, హరి, హరి, " అంటూ ఉండేవాడు. అలా తలకిందులుగా ఉన్నప్పుడు,  ఆయన పక్కన పెట్టుకున్న బుట్ట లోని బియ్యాన్ని కోళ్ళు వచ్చి తింటుండేవి. ఒకో ఇంటి ముందూ సుమారు అరగంట అలా తలకిందుగా ఉండేవాడు. ఆయనకి వచ్చిన భిక్షమంతా కోళ్ళ పాలయ్యేది. 

           అమ్మ సంక్రాంతి రోజు భోజనంలోకి సద్ద రొట్టెలు, గుమ్మడికాయ కూరా తప్పనిసరిగా చేసేది. మేమంతా ఉదయాన్నే తలంటు స్నానం చేసి మా అమ్మతో పాటు దేవుడికి పూజ చేసి రొట్టెలకోసం కాచుకుని వుండేవాళ్లం. ఒకే పంక్తి లో కూచొని మా నాన్నతో కలిసి మేమంతా భోంచేస్తే, తాను మాత్రం మా భోజనాలు అయ్యాక చివర్న తినేది.

              సాయంత్రం కాగానే, కొత్త బట్టలు తొడుక్కుని, భోగి పళ్ళు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేవాళ్ళం. ఒక జంఖానా పొడుగ్గా పరచి, వరుసగా మమ్మల్ని కూచోపెట్టేది. అందరికీ హారతి ఇచ్చి, ఒక గిన్నెలో లేదా బుట్టలో రేగు పళ్ళు, చెరకు ముక్కలు, బెల్లం ముక్కలు,చిల్లర నాణేలు కలిపి, మా అందరికీ తలలపైన పోసేది. మేమైతే డబ్బులకోసం పోటీపడేవాళ్లం .అలా పిల్లలకు భోగి పళ్ళు పోస్తే వాళ్ళు ఏ దిష్టీ తగులకుండా ఆరోగ్యంగా ఉంటారని  అమ్మ నమ్మకం.

                        ఇక ఉగాది వస్తే, తెల్లవారే  లేచి తలంటి పోసుకుని, ఇంటి చెట్లోంచీ వేప పూత, చిగురుటాకులు తెచ్చి ఉగాది పచ్చడికి సిద్ధం చేసేవాళ్ళం.  ఆరోజు పంచాంగం చదివి, పూజయాక, హోళిగలతో ( బొబ్బట్లు ) కడుపునిండా భోజనం చేసి ఆటలకు వెళ్ళేవాళ్ళం. మా అమ్మ ఏ మధ్యాన్నమో భోంచేసి, కాస్త నడుం వాల్చగానే పని మనుషులు, చాకలి వాళ్ళూ వచ్చేవాళ్ళు. వాళ్ళకి భోజనాలు పెట్టి, ఇండ్లకు ప్రత్యేకంగా అన్ని పదార్థాలు వేసి ఇచ్చేది. ఎంత వంట చేసేదో కానీ, వాళ్ళు తెచ్చుకున్న గిన్నెలనీ నిండేవి.

                          బొజ్జ గణపయ్య వినాయక చవితి కైతే సందడే సందడి. మేము పొద్దున్నే లేచి ఒక మైలు దూరంలో వున్న  " ఆయిల్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ " కు వెళ్లి దొంగదారిన కాంపౌండు గోడ దూకి అక్కడున్న పెద్ద తోటలోకి వెళ్ళే వాళ్ళం. అక్కడ లేని పూల చెట్లు గాని పండ్ల చెట్టు గాని, ఇతర వృక్షాలు గాని లేవు. . పూజకు కావాల్సిన పత్రి, మర్రి ఆకులు, మామిడాకులు, మేడి, రావి ,  జువ్వి లాంటి ఆకులు, పూలూ కోసుకొని వచ్చే వాళ్ళం. మా లాగే మరి కొందరు వచ్చే వాళ్లు.

           ముందురోజే వినాయకుడి బొమ్మ తెచ్చే వాళ్ళం కాబట్టి, పొద్దున్నే పత్రి తెచ్చాక, స్నానం చేసి, వ్రతం పుస్తకం తీసుకొని వచ్చీరాని మంత్రాలు చదివి పూజ పూర్తి చేసే వాళ్ళం. అప్పటికి మేము ఏ మంత్రాలూ నేర్చుకోలేదు, నాకైతే ఒడుగు కూడా కాలేదు . అలా చేసే ఆ పూజకే తన్మయత్వం చెందే వాళ్ళం. తప్పనిసరిగా మా అమ్మ కుడుములు చేసేది. సాయంత్రం చంద్రుడు ఎక్కడ కనపడతాడో అని తల వంచుకుని  బెదురుతో నడిచే వాళ్ళం. కథ విని, మళ్ళీ పూజ చేసి ఆరుబయట కూర్చొని, పాటలూ, పొడుపుకథలూ చెప్పుకుంటూ గడిపే వాళ్ళం. అప్పుడు మాకు ఆరు నుంచి పన్నెండేళ్లుండేవి.

                   దసరా అయితే, ఎలాగూ పదిహేను రోజులు శెలవులుండేవి. సరస్వతీ పూజ రోజున శ్రద్ధగా పుస్తకాలను పూజించేవాళ్ళం.ఆయుధ పూజకు ఇంట్లో వున్న పనిముట్లూ, కుట్టూ   మిషనూ , సైకిళ్ళకు , పూజ చేసేవాళ్ళం. అంతకు మించి మా ఇంట్లో ఇంకేమీ ఉండేవి కాదు. మా అమ్మ కొన్నేళ్ళు  బొమ్మలకొలువు పెట్టేది. దశమి రోజు తప్పనిసరిగా గుడికి వెళ్ళేవాళ్ళం. శమీ చెట్టుకు పూజ చేసి, ప్రదక్షిణ చేసి, పెద్దలకు పత్రి ఇచ్చి, కాళ్ళకు నమస్కారం చేసేవాళ్ళం. అదేదో భక్తితో అనుకునేరు, ఆరోజు నమస్కరిస్తే, తప్పకుండా డబ్బులిచ్చేవాళ్ళు, అందుకని. మా పాఠ్య పుస్తకాల్లో దసరా గురించిన పాఠంలో, ’ అయ్యవారికి చాలు ఐదు వరహాలు, పిల్లవాళ్ళకు చాలు పప్పు బెల్లాలు ’ అని ఉండేది. స్కూల్లో టీచర్లు, అదేదో రూల్ ఐనట్టు, ప్రతి సారి పప్పు బెల్లాలు పంచేవారు. మేము ఏనాడూ అయిదు రూపాయలిచ్చిన పాపాన పోలేదు . 

         
                  మధ్యాహ్నమంతా పుల్లన్న బస్సుల్లో విహారం చేసేవాళ్ళం. ఆ రోజుల్లో బస్సుల పుల్లన్న అని ఒకాయన " శ్రీ వెంకటేశ్వరా ట్రాన్స్ పోర్ట్ సర్వీస్ "  నడిపేవాడు. ఆయుధపూజ రోజంతా పూలు, మామిడాకులు, గంధం బొట్లతో అలంకరించిన తమ బస్సుల్లో పిల్లలందరికీ  free ride ఏర్పాటు చేసేవాడు. ఒకోసారి అదే రోజు పీర్ల పండగ వచ్చేది. ముస్లిం సోదరులు పీర్లు పట్టుకొని ఊరేగింపుగా వెళ్ళేవారు. బస్సు కిటికీలోంచి అదంతా ఆసక్తిగా చూసేవాళ్ళం. 

          దీపావళి కి కూడా కొత్తబట్టలు తప్పనిసరిగా వుండేవి. నరక చతుర్దశి రోజు ఉదయాన్నే తలంటిపోసుకుని, టపాకాయలు కాల్చే వాళ్ళం. ఇంటిబయట అంతా దీపాలు పెట్టి చిచ్చుబుడ్లు, విమానాలు, ఇలా రకరకాలుగా కాల్చే వాళ్ళం. ఒకసారి దీపావళికి మా నాన్న దగ్గర డబ్బులు లేవు, అప్పుడు మేము కేవలము పాత న్యూస్ పేపర్లు రంగు కాయితాలు మొ.. నవి కాల్చాము, నాకు బాగా గుర్తు. రంగు కాగితాలు కాల్చినా రంగు మంటలు వచ్చేవి కావు . 

                                    వైకుంఠ ఏకాదశికి మా అమ్మ తప్పనిసరిగా గుడికి వెళ్ళేది. శివరాత్రికి కూడా గుడికి వెళ్ళి వచ్చేది. ఆ రోజు మేము, రెండవ ఆట, నాల్గవ ఆట సినిమాలు చూసే వాళ్ళం. ఇలా రాస్తూ వెళితే ఇదేదో పండగలపై వ్యాసంలా కనిపించినా, ఆశ్చర్యం లేదు. 

                      పండగ అని కాకపోయినా, ఎపుడైనా స్వీట్లు , కోడు వడలు (చేగోడీలు) , చక్కిలాలు ( జంతికలు ) , అత్తి రసాలు  చేసేది. మేము ఒకే రోజులో ఖాళీ చేస్తామేమో అని ఒక డబ్బాలో పోసి, మాకు అందకుండా పైన అటక మీద పెట్టేది. అది గమనించి, మేము చల్లగా ఆ డబ్బా దింపి, నేల మీద ఒక మూల పెట్టుకొనే వాళ్ళం. అటక పైన ఏదైనా అలాంటిదే ఒక ఖాళీ డబ్బా పెట్టి ఏమీ తెలియనట్లు ఉండే వాళ్ళం. మా అమ్మ చూపులెప్పుడూ పైని డబ్బా మీదనే ఉండేవి. మేము అటు పోతూ, ఇటు వస్తూ ఆ మూల డబ్బా లోంచి స్వీట్లు లాగించే వాళ్ళం. సాయంత్రంగా అది తెలిసికొని బుగ్గలు సొట్టలు పడేలాగా స్వచ్ఛంగా నవ్వేది కానీ తిట్టేది కాదు. ఆ రవ లడ్లు , అత్తిరసాలు ( అరిసెలు ), ఇతర చిరు తిళ్ళు  చేయాలంటే రెండు రోజుల ముందే విసురు రాయి ( తిరగలి) లో పిండి, చక్కెరా లాంటివి విసిరివుంచుకునేది పాపం. ఐతే విసరడంలో ఎపుడైనా సాయం  చేసేవాళ్ళం. అపుడే తెలుసు ఏదో చిరుతిండి చేయబోతున్నదని !

           ఒకసారి మా పెద్దన్న కడుపు లో ఉన్నపుడు ఎప్పుడూ పాములు కలలోకి వచ్చేవట. ఒక రాత్రి ఏదో పని మీద దొడ్లో తలుపు తీస్తే ఎదురుగా నిలువెత్తు నాగు పాము పడగ ఎత్తి నిలుచుందట. అమ్మని చూసి, పడగ దింపి వెళ్ళిపోయిందట. అలా కడుపుతో ఉన్నవాళ్ళకి పాము కనబడితే, ఆ పుట్ట బోయే వారివల్ల కష్టాలు తప్పవంటారు. అది ఒక మూఢ నమ్మకమే ఐనా, మా అమ్మ విషయంలో నిజమే అయింది. 

           మరో సారి ఎదురింటి మేడ మీద చిన్ని కృష్ణుడు పాకుతూ, ఆడుతూ కనిపించాడట.  వాళ్ళ చిన్నప్పుడు పొలాల్లో కొరివి దయ్యాలు గున గునా నడుస్తూ పోవడం చూసిందట. ఈ విషయాలు ఎన్నో సార్లు చెప్పింది కానీ వాటి అర్థం ఇప్పటికీ విశ్లేషణ కు అందడం లేదు. ఇలాంటి విషయాలు అమ్మ చెబితే మాకు అవన్నీ మామూలు విషయాలుగా అనిపించేవి , ఏమీ ఆశ్చర్యం వేసేది కాదు . ఇప్పుడు తలచుకుంటే రోమా లు నిక్కబొడుచుకుంటాయి 


          పై వన్నీ చదివాక, చెప్పండి, అన్నీ మామూలు విషయాలే కాదంటారా ? . ఐతే, ఆర్భాటాలు, బడాయిలూ లేని అవన్నీ మధుర స్మృతులు. ఎందుకంటే, ఆ రోజులు, ఆ పరిస్థితులు మళ్ళీ రావు. అవన్నీ మా అమ్మలోని ఒక కోణాన్ని ఎంతో అందంగా  చూపుతాయి. ఆ అనుభవాలు మనిషి మానసిక ఆరోగ్యానికి కావలసిన  ముఖ్యమైన వాటిలో భాగాలు. . ఈనాడు పల్లెలలో కూడా అటువంటి సంబరాలు అంతరించి పోతున్నాయి.

Sunday, November 4, 2012

సర్వేంద్రియాణాం నయనం ప్రధానమ్


     
ఇది చదివి కంటి  చూపు వేగముగా మెరుగు పరచుకొని , పూర్తి ఆరోగ్యము పొందండి






     ఆరోగ్యం భాస్కరాదిఛ్చేత్ ..అంటారు .. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. అంతే కాదు , మంచి కంటి చూపు కూడా ఇస్తాడు . జాతకంలో  సూర్యుడి స్థితిని బట్టి జాతకుని కంటి చూపెలా ఉంటుందో చెబుతారు 

     ఇవన్నీ వినడానికి బాగున్నాయి . అసలెవరైనా దీని మీద ఒక పరిశోధన గానీ ప్రయోగము కానీ చేసి ఫలితాలు చూశారా ? అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది . "  సూర్య థెరపీ " అని ఏదైనా ఉందా ?  నాకు వీటి గురించి మొదట్లో తెలిసేది కాదు . 1993  నుంచీ కంప్యూటర్ పై చాలా పని చేసేవాడిని . రోజుకు 18 గంటలు . ఇంకేముంది ? రెండేళ్ళకే అద్దాలు వచ్చాయి , సరే వయసు కూడా వచ్చింది కదా , ఇది వయసు ప్రభావము అనుకున్నా. 

     2006  లో ,  మా నాన్నగారు ఎప్పుడో 1937  లో రాసిన ఒక రాత పుస్తకము  నా కంట బడింది . అందులో సూర్యుడికి అర్ఘ్యము ఇచ్చే పద్దతి , దాని ఫలితాలు విపులముగా  ఆయన దస్తూరితో రాసి ఉంది . ఆ పుస్తకము అన్నేళ్ళూ నేను చూడక పోవడమే ఆశ్చర్యం . ఆయన 1995  లోనే స్వర్గస్తులైనారు . ఆ తరువాత , అందులోని విషయమే ఇంకో పుస్తకము లో కూడా చదివాను . అప్పటికి నా కళ్ళ పరిస్థితి ఘోరముగా ఉండింది . రోజూ తలనొప్పి , తల తిరగడము , ఒకరకమైన వికారము ఉండేవి .  రెండు మూడు నెలలకు ఒకసారి కళ్ళజోడు మార్చాల్సి వచ్చేది .

      ఒకసారి మహా ఇబ్బంది పడి , 2008 లో , మా నాన్న గారి పుస్తకములోని ప్రకారము సూర్యుడికి అర్ఘ్యము రోజూ ఇచ్చుట  మొదలు పెట్టాను . ఒక పదిరోజులకే కళ్ళ మంటలు పూర్తిగా తగ్గిపోయాయి . తలనొప్పి , వికారము పూర్తిగా తగ్గాయి . నెలరోజులకే నా కళ్ళు చల్లగా , అంతకు ముందు కుంచించుకుని సగం మూసినట్టు ఉండేవి పూర్తిగా , సహజంగానే విప్పారినాయి . ఆరునెల్లయింది , అంతా బాగా ఉంది . 

     ఒకసారి డాక్టరు దగ్గరకు వెళ్ళాను , ఊరికేనే  ( మాకు అక్కడ సంవత్సరానికి రెండు సార్లు ఉచితముగా చూస్తారు . ) వారు చూసి , కళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నాయి , అదే కళ్ళజోడు వాడండి , ఇంకేమీ అవసరము లేదు అన్నారు . అంతకు ముందు ప్రతిసారీ కళ్ళ సైటు మారింది అని వేరే రాసిచ్చేవారు . నేనేమీ మాట్లాడకుండా వచ్చాను . తర్వాత ఆరునెల్లకు మళ్ళీ ’ ఊరికే ’ వెళ్ళాను . మళ్ళీ అదే మాట, కళ్ళకి ఏ ఇబ్బందీ లేదు , అదే కళ్ళజోడు అని . అప్పుడు అడిగాను , ’ మరి అంతకు ముందు ప్రతి మూడు నెలలకీ జోడు మార్చవలసి వచ్చేది కదా , నా కంప్యూటర్ పని ఏమీ తగ్గలేదు , మరి ఎందుకు నాకు ఇబ్బంది కలగ లేదు ? ’  అని . ఆ డాక్టరు గారికి విదేశాలలో కూడా మంచి పేరుంది . కానీ ఆయన జవాబు చెప్పలేదు , ’ అరుదుగా  కొంతమందికి అనుకోకుండా కళ్ళు బాగవుతాయి , దానికి కారణాలు చెప్పలేము ’ అన్నారు . 

     అప్పటినుండీ నేను సూర్యుడికి రోజూ అర్ఘ్యము ఇవ్వడము మానలేదు . ఈ విషయము ఒకసారి ఆర్కుట్ లో రాశాను . అది చదివి అర్ఘ్యము ఇచ్చే పద్దతి చెప్పండీ అని చాలా మంది అడిగితే , వారికి రాసిచ్చాను . మధ్యలో వారము పదిరోజులు ఎపుడైనా అర్ఘ్యము ఇవ్వడానికి వీలయ్యేది కాదు . కానీ నాకు ఎటువంటి ఇబ్బందీ కలగలేదు . నేను ఆర్కుట్ లో రాసినది పాటించినవారిలో ఒకరిద్దరు, తమకు కూడా మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు . 


     మొన్న అధిక మాసము , తర్వాత పితృపక్షాలు రావడముతో , నాకు వేరే జపాలు ఉపాసనలు ఎక్కువ కావడముతో , రెండు నెలలు అర్ఘ్యము వదలలేదు . రెండు రోజుల కిందట నాకు మళ్ళీ తలనొప్పి వచ్చింది . అప్పుడు అర్ఘ్యము మానేసినది గుర్తొచ్చి , మళ్ళీ నిన్నటినుండీ  మొదలుపెట్టాను . ఈ రోజునుండీ నాకు మళ్ళీ కళ్ళు ఎంతో బాగున్నాయి , తలనొప్పి కూడా అదే పోయింది . డాక్టరు దగ్గరకు వెళితే , మళ్ళీ అదే పాట , మీ కళ్ళకు వచ్చిన ఇబ్బందేమీ లేదు , అదే జోడు అని . 

అందుకని వెంటనే ఇది అందరితో మళ్ళీ పంచుకుందామని రాస్తున్నాను . 


శ్రీ సూర్య నమస్కారం , అర్ఘ్యం చ...లఘునా

 దీనికి కావలసినవి , 1 . ఒక రాగి గిన్నె కానీ చెంబు కానీ . 2  .ఎర్ర చందనము . ఇది చెక్కలుగా దొరుకుతుంది , కొన్ని చోట్ల పొడిగా కూడా దొరుకుతుంది . చెక్క తీసుకుంటే , రోజూ గంధము తీయాలి , పొడి అయితే దాన్ని రుద్ది గంధము చేయుట సులభము . ఓ నూరు రూపాయల చెక్క గానీ , పొడిగానీ కొనుక్కుంటే సంవత్సరము పైన వస్తుంది .   ఇదికాక, రోజూ కొన్ని ఏవైనా ఎరుపు రంగు పూలు కావాలి . ఒక కుండీలో కనకాంబరాలు కానీ , ఇంకేవైనా ఎర్ర పూలిచ్చే గులాబీ , మందారము వంటి చెట్టుకానీ పెట్టుకోండి . 

విధానము 

స్నానము, సంధ్యావందనము ముగించి , 
మొదట ఎర్ర చందనము గంధము తీసి ( ఒక బటాణీ గింజంత అయినా చాలు ) రాగి చెంబులోని నీటిలో కలపండి . బాగా ఉద్ధరిణతో కలియబెట్టి , అందులోకి చిన్న చిన్న పూలు గానీ , పెద్ద పూలైతే వాటి రేకులు గానీ కలపండి . 

తర్వాత  సూర్యునికెదురుగా నిలిచి  ఈ కింది మంత్రము చెప్పి నమస్కరించండి 

సూర్య మంత్రం 

||  ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతి కరాయ ధీమహి 

తన్నో ఆదిత్య ప్రచోదయాత్ ||

     తర్వాత కింది మంత్రము చెప్పుచూ ఇరవైనాలుగు సార్లు ఆత్మ ప్రదక్షిణము చేస్తూ , ప్రతి ప్రదక్షిణము తర్వాత , పూర్తి సూర్య నమస్కారము గానీ ( యోగా పద్దతిలో ) , లేదా , ఊరికే సాష్టాంగ నమస్కారముగానీ , అదీ వీలు కాకున్న , వంగి నేలను ముట్టి నమస్కారము గానీ చేయండి . ఇరవై నాలుగు సార్లు వీలుకాకున్న , పన్నెండు సార్లో , అదీ వీలుకాకున్న ఆరు సార్లో  చేయండి . అయితే శ్రద్ధ ముఖ్యము. వీలైనన్ని ఎక్కువ సార్లు చేయుటకే ప్రయత్నించండి .మొదట ఒక వారము రోజులు  అలవాటు అయ్యేవరకూ కాస్త కష్టమనిపించవచ్చు . ఆ తర్వాత అలవాటుగా , గబగబా చేసేస్తారు . మంత్రము కూడా అప్పటికి నోటికి వచ్చేస్తుంది . 

 సూర్య నమస్కారం 

||  వినతా తనయో దేవః కర్మ సాక్షీ సురేశ్వరః 
సప్తాశ్వ సప్త రజ్జుశ్చ అరుణో మే ప్రసీదతు ||


|| మిత్ర , రవి , సూర్య, భాను , ఖగ , పూష , హిరణ్య గర్భ, మరీచ , ఆదిత్య , సవిత్ర , అర్క , భాస్కరేభ్యో నమః ||

ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి.

( పై మంత్రము 24  పర్యాయములు చెప్పి  ప్రతిసారి  ప్రదక్షిణ సాష్టాంగ నమస్కారములు చెయ్య వలెను )


ఆ తర్వాత ,. సూర్య అర్ఘ్యం  

ఈ కింది మంత్రము చెప్పి రాగి చెంబులోని  గంధము  , పూలు కలిపిన నీటితో మూడు సార్లు కానీ , పన్నెండు సార్లు కానీ అర్ఘ్యము వదలండి. అర్ఘ్యము వదలునపుడు లేచి నిలుచొని, దోసిటి నిండా చెంబులోని నీళ్ళు తీసుకుని , మంత్రము చెప్పి , అంజలితో కిందికి వదలండి , లేదా , ఏ చెట్టు మొదట్లోకో , కుండీ లోకో వదలండి . 

||  నమస్సవిత్రే జగదేక చక్షసే  | జగత్ ప్రసూతి స్థితి నాశ హేతవే |

త్రయీ మయాయ త్రిగుణాత్మ ధారిణే | విరించి నారాయణ శంకరాత్మనే ||

శ్రీ ఉషా సంజ్ఞా ఛాయా సమేత సూర్య నారాయణ పర బ్రహ్మణే నమః 
ఇదమర్ఘ్యం సమర్పయామి  (ఎర్ర చందనము , ఎర్ర పూలు కలిపిన నీళ్ళతో  మూడు పర్యాయములు )

౩. తర్వాత సూర్య ధ్యానం 

ఈ శ్లోకము చెప్పి మనసులో సూర్యునికి నమస్కరించండి .

||  ధ్యేయస్సదా సవితృ మండల మధ్య వర్తి | నారాయణ సరసిజాసన సన్నివిష్టః |
కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటీ | హరీ హిరణ్మయ వపుర్ధృత శంఖ చక్రః |

ఉదయం బ్రహ్మ స్వరూపం మధ్యాహ్నం తు మహేశ్వరః | అస్తమానే స్వయం విష్ణుః త్రిమూర్తిశ్చ దివాకరః || 


సమాప్తం



రోజూ సంధ్య వేళలలో ఈ స్తోత్రము చదువుకోండి సర్వ శుభములూ పొందండి . 
ఏక వింశతి సూర్య నామాని 
( హోమాదులలో ఉపయోగించవచ్చును.  సంధ్యా కాలం లో పఠించిన , సర్వ పాప ముక్తులు అగుదురు )

|| వికర్తనో వివస్వాం చ మార్తాండో భాస్కరో రవిః | లోక ప్రకాశకః శ్రీమాన్ లోక చక్షుర్గ్రహేశ్వరః | 
లోక సాక్షీ త్రిలోకేశః కర్తా హర్తా తిమిస్రహా | తపనస్తాపనశ్చైవ శుచిస్సప్తాశ్వ వాహనః |
గభస్తి హస్తో బ్రహ్మా చ సర్వ దేవ నమస్కృతః | ఏక వింశతిరిత్యేష స్తవ ఇష్టస్సదా మమ | 
శరీరారోగ్యదశ్చైవ ధన వృద్ధి యశస్కరః | స్తవ రాజ ఇతి ఖ్యాతస్త్రిషు లోకేషు విశ్రుతః || 

సూర్యస్తవము 
( బ్రహ్మ ఉపదేశించినది-- భవిష్య పురాణము  ) 

* నమస్సూర్యాయ నిత్యాయ రవయే కార్య భానవే | భాస్కరాయ మతంగాయ మార్తాండాయ వివస్వతే |
ఆదిత్యాయాది దేవాయ నమస్తే రశ్మి మాలినే | దివాకరాయ దీప్తాయ అగ్నయే మిహిరాయ చ | 
* ప్రభాకరాయ మిత్రాయ నమస్తేఽదితి సంభవ | నమో గోపతయే నిత్యం దిశాం చ పతయే నమః | 
నమో ధాత్రే విధాత్రే చ అర్యమ్ణే వరుణాయ చ | పూష్ణే ఖగాయ మిత్రాయ పర్జన్యాయాంశవే నమః | 
* నమో హితకృతే నిత్యం ధర్మాయ తపనాయ చ | హరయే హరితాశ్వాయ విశ్వస్య పతయే నమః | 
విష్ణవే బ్రహ్మణే నిత్యం త్ర్యంబకాయ తథాత్మనే | నమస్తే సప్త లోకేశ నమస్తే సప్త సప్తయే | 
*ఏకస్మైహి నమస్తుభ్యమేక చక్ర రథాయ చ | జ్యోతిషాం పతయే నిత్యం సర్వ ప్రాణ భృతే నమః | 
హితాయ సర్వ భూతానాం శివాయార్తి హరాయ చ | నమః పద్మ ప్రబోధాయ నమో వేదాది మూర్తయే | 
* కాదిజాయ నమస్తుభ్యం నమస్తారా సుతాయ చ | భీమజాయ నమస్తుభ్యం పావకాయ చ వై నమః |
ధిషణాయ నమో నిత్యం నమః కృష్ణాయ నిత్య దా | నమోఽస్త్వధితి పుత్రాయ నమో లక్ష్యాయ నిత్యశః|
( సర్వాభీష్ట సిధ్ధి కి ప్రాతః సాయంకాలాలు పఠించ వలెను ) 
----------

తరువాత కానీ , అర్ఘ్యమునకు ముందేకానీ తల్లిదండ్రులకు నమస్కరించండి .

మాతా పితర వందనము

మాతృ నమస్కారం

|| యా కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః | నమామి జననీం దేవీం పరాం ప్రకృతి రూపిణీం |
కృఛ్చ్రేణ మహతా దేవ్యా ధారితోహం యథోధరే | త్వత్ప్రసాదాజ్జగదృష్టం మాతర్నిత్యం నమోస్తుతే |
పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః | వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతి హేతవే ||

పితృ నమస్కారం

|| స్వర్గాపవర్గ ప్రదమేక మాంద్యం బ్రహ్మ స్వరూపం పితరం నమామి
యతో జగత్పశ్యతి చారు రూపం తం తర్పయామస్సలిలైస్తిలైర్యుతైః || 
పితరో జనయంతీహ పితరో పాలయంతి చ |
పితరో బ్రహ్మ రూపాహి తేభ్యో నిత్యం నమో నమః |
యస్మాద్విజయతే లోకస్తస్మాద్ధర్మః ప్రవర్తతః |
నమస్తుభ్యం పితస్సాక్షాత్ బ్రహ్మ రూప నమోస్తుతే || 

సమస్త సన్మంగళాని భవంతు