SHARE

Showing posts with label JEEVITHA CHUKKAANI. Show all posts
Showing posts with label JEEVITHA CHUKKAANI. Show all posts

Monday, November 5, 2012

4. " జీవిత చుక్కాని " నాలుగవ అంకం సంబరం


నాలుగవ అంకం  సంబరం



         ఈ అంకం లో మా చిన్నప్పటి పండుగల ఆనందము , ఆకాలపు అలవాట్లు ,  పిల్లలు ఎంతో మురిసేలా అమ్మ చేసే పిండి వంటలు , మా మనోల్లాసము వంటివి మధుర జ్ఞాపకాలు మెదలుతున్నాయి. 


                        అనంతపురం సాయినగరు లో మా పాత ఇంటి పండగ వాతావరణం. 


                           ఇక పండుగలు వస్తే, నిజంగా మాకు పండుగే ! అలాగని, మేమేదో ధూం ధాం గా చేసుకొనే వాళ్ళమని కాదు. ఆడంబరాలు లేకున్నా, పండుగలలోని నిజమైన ఆనందాన్ని , ఆ స్పూర్తినీ, ఎంతో హృద్యమైన అనుభూతులను పొందేవాళ్ళం.  బడాయిలు లేని ఆనాటి సంబరాలు ఎంత మనసుకు హత్తుకునేలా ఉండేవో ! 

                సంక్రాంతికి ఇంటిముందర ౪౦-౫౦ గజాల స్థలంలో  అమ్మ పూర్తిగా ఆవు పేడ తో కళ్ళాపి చల్లించేది. పెద్ద పెద్ద ముగ్గులు వేసేది. మా అక్కయ్యలు కూడా పోటీలు పడి ముగ్గులు వేసేవాళ్ళు. మేము వెళ్ళి గుమ్మడి పూలు, సుంకేసుల పూలు తెచ్చేవాళ్ళం. పేడతో గొబ్బెమ్మలు  చేసి ముగ్గుల మధ్యలో వుంచి, పూలతో అలంకరించి, పసుపు కుంకుమా పెట్టి  హారతి ఇచ్చేది. ఉదయాన్నే ఇంటిముందుకి హరిదాసు వచ్చేవాడు. తలపైన బొట్లు పెట్టిన గిన్నెలో  బియ్యం పోయించుకునేవాడు. గంగిరెద్దులు అలంకరణతో కొమ్ములు  ఊపుతుంటే, వాటిని తోలుకొని వచ్చిన వాళ్ళు ఎద్దుకీ, తమకీ కూడా పళ్ళు, డబ్బులు , ధాన్యము తీసుకొని వెళ్ళే వాళ్ళు. కోస్తా ఆంధ్రా లో ఉన్నంత కాక పోయినా, కోడి పందేలు జరిగేవి.  ఒక అతను హార్మోనియమ్ తెచ్చి, వాయిస్తూ, " పరమాత్మూనీ భజనా,,  పలీకీనంతటానా " అంటూ భిక్షానికొచ్చేవాడు. మిగతా రోజుల్లో కూడా వచ్చేవాడు కాబట్టి, ఆ పాట వినీ వినీ నేర్చేసుకున్నాము.  ఇంకొకాయనైతే, గోచీ పెట్టి పంచె కట్టి, ప్రతి ఇంటిముందుకూ వచ్చి, తలకిందుగా నిలుచొని, " హరి, హరి, హరి, " అంటూ ఉండేవాడు. అలా తలకిందులుగా ఉన్నప్పుడు,  ఆయన పక్కన పెట్టుకున్న బుట్ట లోని బియ్యాన్ని కోళ్ళు వచ్చి తింటుండేవి. ఒకో ఇంటి ముందూ సుమారు అరగంట అలా తలకిందుగా ఉండేవాడు. ఆయనకి వచ్చిన భిక్షమంతా కోళ్ళ పాలయ్యేది. 

           అమ్మ సంక్రాంతి రోజు భోజనంలోకి సద్ద రొట్టెలు, గుమ్మడికాయ కూరా తప్పనిసరిగా చేసేది. మేమంతా ఉదయాన్నే తలంటు స్నానం చేసి మా అమ్మతో పాటు దేవుడికి పూజ చేసి రొట్టెలకోసం కాచుకుని వుండేవాళ్లం. ఒకే పంక్తి లో కూచొని మా నాన్నతో కలిసి మేమంతా భోంచేస్తే, తాను మాత్రం మా భోజనాలు అయ్యాక చివర్న తినేది.

              సాయంత్రం కాగానే, కొత్త బట్టలు తొడుక్కుని, భోగి పళ్ళు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేవాళ్ళం. ఒక జంఖానా పొడుగ్గా పరచి, వరుసగా మమ్మల్ని కూచోపెట్టేది. అందరికీ హారతి ఇచ్చి, ఒక గిన్నెలో లేదా బుట్టలో రేగు పళ్ళు, చెరకు ముక్కలు, బెల్లం ముక్కలు,చిల్లర నాణేలు కలిపి, మా అందరికీ తలలపైన పోసేది. మేమైతే డబ్బులకోసం పోటీపడేవాళ్లం .అలా పిల్లలకు భోగి పళ్ళు పోస్తే వాళ్ళు ఏ దిష్టీ తగులకుండా ఆరోగ్యంగా ఉంటారని  అమ్మ నమ్మకం.

                        ఇక ఉగాది వస్తే, తెల్లవారే  లేచి తలంటి పోసుకుని, ఇంటి చెట్లోంచీ వేప పూత, చిగురుటాకులు తెచ్చి ఉగాది పచ్చడికి సిద్ధం చేసేవాళ్ళం.  ఆరోజు పంచాంగం చదివి, పూజయాక, హోళిగలతో ( బొబ్బట్లు ) కడుపునిండా భోజనం చేసి ఆటలకు వెళ్ళేవాళ్ళం. మా అమ్మ ఏ మధ్యాన్నమో భోంచేసి, కాస్త నడుం వాల్చగానే పని మనుషులు, చాకలి వాళ్ళూ వచ్చేవాళ్ళు. వాళ్ళకి భోజనాలు పెట్టి, ఇండ్లకు ప్రత్యేకంగా అన్ని పదార్థాలు వేసి ఇచ్చేది. ఎంత వంట చేసేదో కానీ, వాళ్ళు తెచ్చుకున్న గిన్నెలనీ నిండేవి.

                          బొజ్జ గణపయ్య వినాయక చవితి కైతే సందడే సందడి. మేము పొద్దున్నే లేచి ఒక మైలు దూరంలో వున్న  " ఆయిల్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ " కు వెళ్లి దొంగదారిన కాంపౌండు గోడ దూకి అక్కడున్న పెద్ద తోటలోకి వెళ్ళే వాళ్ళం. అక్కడ లేని పూల చెట్లు గాని పండ్ల చెట్టు గాని, ఇతర వృక్షాలు గాని లేవు. . పూజకు కావాల్సిన పత్రి, మర్రి ఆకులు, మామిడాకులు, మేడి, రావి ,  జువ్వి లాంటి ఆకులు, పూలూ కోసుకొని వచ్చే వాళ్ళం. మా లాగే మరి కొందరు వచ్చే వాళ్లు.

           ముందురోజే వినాయకుడి బొమ్మ తెచ్చే వాళ్ళం కాబట్టి, పొద్దున్నే పత్రి తెచ్చాక, స్నానం చేసి, వ్రతం పుస్తకం తీసుకొని వచ్చీరాని మంత్రాలు చదివి పూజ పూర్తి చేసే వాళ్ళం. అప్పటికి మేము ఏ మంత్రాలూ నేర్చుకోలేదు, నాకైతే ఒడుగు కూడా కాలేదు . అలా చేసే ఆ పూజకే తన్మయత్వం చెందే వాళ్ళం. తప్పనిసరిగా మా అమ్మ కుడుములు చేసేది. సాయంత్రం చంద్రుడు ఎక్కడ కనపడతాడో అని తల వంచుకుని  బెదురుతో నడిచే వాళ్ళం. కథ విని, మళ్ళీ పూజ చేసి ఆరుబయట కూర్చొని, పాటలూ, పొడుపుకథలూ చెప్పుకుంటూ గడిపే వాళ్ళం. అప్పుడు మాకు ఆరు నుంచి పన్నెండేళ్లుండేవి.

                   దసరా అయితే, ఎలాగూ పదిహేను రోజులు శెలవులుండేవి. సరస్వతీ పూజ రోజున శ్రద్ధగా పుస్తకాలను పూజించేవాళ్ళం.ఆయుధ పూజకు ఇంట్లో వున్న పనిముట్లూ, కుట్టూ   మిషనూ , సైకిళ్ళకు , పూజ చేసేవాళ్ళం. అంతకు మించి మా ఇంట్లో ఇంకేమీ ఉండేవి కాదు. మా అమ్మ కొన్నేళ్ళు  బొమ్మలకొలువు పెట్టేది. దశమి రోజు తప్పనిసరిగా గుడికి వెళ్ళేవాళ్ళం. శమీ చెట్టుకు పూజ చేసి, ప్రదక్షిణ చేసి, పెద్దలకు పత్రి ఇచ్చి, కాళ్ళకు నమస్కారం చేసేవాళ్ళం. అదేదో భక్తితో అనుకునేరు, ఆరోజు నమస్కరిస్తే, తప్పకుండా డబ్బులిచ్చేవాళ్ళు, అందుకని. మా పాఠ్య పుస్తకాల్లో దసరా గురించిన పాఠంలో, ’ అయ్యవారికి చాలు ఐదు వరహాలు, పిల్లవాళ్ళకు చాలు పప్పు బెల్లాలు ’ అని ఉండేది. స్కూల్లో టీచర్లు, అదేదో రూల్ ఐనట్టు, ప్రతి సారి పప్పు బెల్లాలు పంచేవారు. మేము ఏనాడూ అయిదు రూపాయలిచ్చిన పాపాన పోలేదు . 

         
                  మధ్యాహ్నమంతా పుల్లన్న బస్సుల్లో విహారం చేసేవాళ్ళం. ఆ రోజుల్లో బస్సుల పుల్లన్న అని ఒకాయన " శ్రీ వెంకటేశ్వరా ట్రాన్స్ పోర్ట్ సర్వీస్ "  నడిపేవాడు. ఆయుధపూజ రోజంతా పూలు, మామిడాకులు, గంధం బొట్లతో అలంకరించిన తమ బస్సుల్లో పిల్లలందరికీ  free ride ఏర్పాటు చేసేవాడు. ఒకోసారి అదే రోజు పీర్ల పండగ వచ్చేది. ముస్లిం సోదరులు పీర్లు పట్టుకొని ఊరేగింపుగా వెళ్ళేవారు. బస్సు కిటికీలోంచి అదంతా ఆసక్తిగా చూసేవాళ్ళం. 

          దీపావళి కి కూడా కొత్తబట్టలు తప్పనిసరిగా వుండేవి. నరక చతుర్దశి రోజు ఉదయాన్నే తలంటిపోసుకుని, టపాకాయలు కాల్చే వాళ్ళం. ఇంటిబయట అంతా దీపాలు పెట్టి చిచ్చుబుడ్లు, విమానాలు, ఇలా రకరకాలుగా కాల్చే వాళ్ళం. ఒకసారి దీపావళికి మా నాన్న దగ్గర డబ్బులు లేవు, అప్పుడు మేము కేవలము పాత న్యూస్ పేపర్లు రంగు కాయితాలు మొ.. నవి కాల్చాము, నాకు బాగా గుర్తు. రంగు కాగితాలు కాల్చినా రంగు మంటలు వచ్చేవి కావు . 

                                    వైకుంఠ ఏకాదశికి మా అమ్మ తప్పనిసరిగా గుడికి వెళ్ళేది. శివరాత్రికి కూడా గుడికి వెళ్ళి వచ్చేది. ఆ రోజు మేము, రెండవ ఆట, నాల్గవ ఆట సినిమాలు చూసే వాళ్ళం. ఇలా రాస్తూ వెళితే ఇదేదో పండగలపై వ్యాసంలా కనిపించినా, ఆశ్చర్యం లేదు. 

                      పండగ అని కాకపోయినా, ఎపుడైనా స్వీట్లు , కోడు వడలు (చేగోడీలు) , చక్కిలాలు ( జంతికలు ) , అత్తి రసాలు  చేసేది. మేము ఒకే రోజులో ఖాళీ చేస్తామేమో అని ఒక డబ్బాలో పోసి, మాకు అందకుండా పైన అటక మీద పెట్టేది. అది గమనించి, మేము చల్లగా ఆ డబ్బా దింపి, నేల మీద ఒక మూల పెట్టుకొనే వాళ్ళం. అటక పైన ఏదైనా అలాంటిదే ఒక ఖాళీ డబ్బా పెట్టి ఏమీ తెలియనట్లు ఉండే వాళ్ళం. మా అమ్మ చూపులెప్పుడూ పైని డబ్బా మీదనే ఉండేవి. మేము అటు పోతూ, ఇటు వస్తూ ఆ మూల డబ్బా లోంచి స్వీట్లు లాగించే వాళ్ళం. సాయంత్రంగా అది తెలిసికొని బుగ్గలు సొట్టలు పడేలాగా స్వచ్ఛంగా నవ్వేది కానీ తిట్టేది కాదు. ఆ రవ లడ్లు , అత్తిరసాలు ( అరిసెలు ), ఇతర చిరు తిళ్ళు  చేయాలంటే రెండు రోజుల ముందే విసురు రాయి ( తిరగలి) లో పిండి, చక్కెరా లాంటివి విసిరివుంచుకునేది పాపం. ఐతే విసరడంలో ఎపుడైనా సాయం  చేసేవాళ్ళం. అపుడే తెలుసు ఏదో చిరుతిండి చేయబోతున్నదని !

           ఒకసారి మా పెద్దన్న కడుపు లో ఉన్నపుడు ఎప్పుడూ పాములు కలలోకి వచ్చేవట. ఒక రాత్రి ఏదో పని మీద దొడ్లో తలుపు తీస్తే ఎదురుగా నిలువెత్తు నాగు పాము పడగ ఎత్తి నిలుచుందట. అమ్మని చూసి, పడగ దింపి వెళ్ళిపోయిందట. అలా కడుపుతో ఉన్నవాళ్ళకి పాము కనబడితే, ఆ పుట్ట బోయే వారివల్ల కష్టాలు తప్పవంటారు. అది ఒక మూఢ నమ్మకమే ఐనా, మా అమ్మ విషయంలో నిజమే అయింది. 

           మరో సారి ఎదురింటి మేడ మీద చిన్ని కృష్ణుడు పాకుతూ, ఆడుతూ కనిపించాడట.  వాళ్ళ చిన్నప్పుడు పొలాల్లో కొరివి దయ్యాలు గున గునా నడుస్తూ పోవడం చూసిందట. ఈ విషయాలు ఎన్నో సార్లు చెప్పింది కానీ వాటి అర్థం ఇప్పటికీ విశ్లేషణ కు అందడం లేదు. ఇలాంటి విషయాలు అమ్మ చెబితే మాకు అవన్నీ మామూలు విషయాలుగా అనిపించేవి , ఏమీ ఆశ్చర్యం వేసేది కాదు . ఇప్పుడు తలచుకుంటే రోమా లు నిక్కబొడుచుకుంటాయి 


          పై వన్నీ చదివాక, చెప్పండి, అన్నీ మామూలు విషయాలే కాదంటారా ? . ఐతే, ఆర్భాటాలు, బడాయిలూ లేని అవన్నీ మధుర స్మృతులు. ఎందుకంటే, ఆ రోజులు, ఆ పరిస్థితులు మళ్ళీ రావు. అవన్నీ మా అమ్మలోని ఒక కోణాన్ని ఎంతో అందంగా  చూపుతాయి. ఆ అనుభవాలు మనిషి మానసిక ఆరోగ్యానికి కావలసిన  ముఖ్యమైన వాటిలో భాగాలు. . ఈనాడు పల్లెలలో కూడా అటువంటి సంబరాలు అంతరించి పోతున్నాయి.

Tuesday, October 30, 2012

3. " జీవిత చుక్కాని " మూడవ అంకం మాధుర్యం


మూడవ అంకం                                     మాధుర్యం


      ఈ అంకం లో అమ్మ పెళ్ళయ్యాక కొత్తలో పడిన తికమకలు , పిల్లల ఆలన , మా చిన్నతనం , అందరికీ అమ్మ మీద అభిమానం , అమ్మ సౌహార్ద్రం , గృహ సౌఖ్యం వంటి తీపి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి....

      పెళ్ళయినా అమ్మ రెండేళ్ళు పుట్టింటిలోనే ఉంది. అతి చిన్న వయసులో పదమూడేళ్ళకే పెళ్ళి జరిగినా, అమ్మ ఆలోచనలు మాత్రం పరిపక్వంగా వుండేవి. గొప్ప నిర్ణయాలు తీసుకొనే శక్తి అప్పటికే ఉంది.  ముఖ్యమైన సమయంలో అమ్మ ఇంత గొప్పగా స్పందిస్తుందని మా తాతయ్య గానీ , మేనమామలు గానీ అనుకోలేదు .      

వింత నాటకం

      తమ మేనమామ చెల్లెలికి తెచ్చిన సంబంధం అన్నలకు ఎంతమాత్రమూ ఇష్టం లేదు . బళ్ళారిలోని సంపన్న కుటుంబానికి , అందులోనూ , పరివారము దండిగా ఉన్నవారికి ఇచ్చి చేయాలని వారి ఆశ.  కానీ  తండ్రి , మేనమామల మాటకి ఎదురు చెప్పలేకపోయారు. వారి ఇష్టాలతో ప్రమేయం లేకుండా పెళ్ళి ఘనంగా జరిగింది. అయిదు రోజుల పెళ్ళి.  అమ్మాయి మరీ చిన్న పిల్ల కాబట్టి, కాపురానికి తరువాత పంపిస్తామన్నారు. ’కాదు, వెంటనే పంపవలసిందే ’ అని పట్టు పట్టాడు నాన్న . అందుకు బావ మరుదులు  ఒప్పుకోలేదు. ఇంకా చిన్న పిల్ల. మంచీ చెడ్డా తెలిసే వయసుకాదు ,  ఇంటి పనులు నేర్పించి పంపిస్తాము ’ అన్నారు.  వారిమీద కోపంతో వారిని దారికి తెచ్చుకోవాలని మా నాన్న ఒక వింత నాటకమాడారు. అదే అమ్మని భయపడేలా చేసి, వదంతులు నమ్మేలా చేసింది.  పెళ్ళయ్యీ ,  భార్య కాపురానికి రాని వ్యక్తి, అందులోనూ, ఒంటరివాడు, పెద్ద దిక్కు లేని వాడు. ఇంట్లో దీపం పెట్టేవారు లేరు, పెళ్ళయ్యాక కూడా ఈ ఒంటరి కష్టాలు ఎందుకనుకున్నాడు నాన్న.  దాన్ని పరిష్కరించుకోవాలని,  బావ మరుదులను  భయపెట్టడం  జరిగింది. కాపురానికి రాకముందే అమ్మకు సవతి పోరు తప్పదనీ , అన్యాయం జరిగిందనే వదంతి ఆ నోటా, ఈ నోటా అమ్మ వరకు వచ్చింది. తానా, ఐదో క్లాసు మించి చదువుకోలేదు. నిండా ౧౫ ఏళ్ళు లేవు. ఎటూతోచని పరిస్థితి. లోక జ్ఞానముందని ఎలా అనుకుంటాము ? ఈనాటిలాగా చదివి తెలుసుకోడానికి అప్పుడు విరివిగా కథల పుస్తకాలుండేవి కాదు, . సినిమాలనేవి  అప్పటికి ఇంకా ఎవరికీ తెలీదు.   ఆడదిక్కు లేని ఇల్లు. తల్లి ముందే పోయింది. ఉన్న ఒక్క అక్క కూడా పెళ్ళై అత్తవారింట్లో ఉంది.. చెల్లెలు మరీ చిన్న పిల్ల. ఆ ఇంటికి తానే ఆడ దిక్కు. ఆ సమయంలో  , ఆ దేశ కాల పరిస్థితులలో ఆమె తీసుకున్న నిర్ణయం అత్యంత సాహసోపేతమైనదనే చెప్పాలి.

      తన భర్త తన వాళ్ళ పై ’ గుర్రు ’ గా ఉన్నాడు. తన కాపురం ఏమౌతుందో అన్న భయం. అనుభవ రాహిత్యం. అవగాహన అనేది ఏముందో ఏమో ? భర్త దగ్గరకు వెళతానని తెగేసి చెప్పింది. అందరూ వారించారు, కాస్త ఆగమని. ఒక వైపు భర్త నుంచి  ఒత్తిడి. ఇంకా ఏమేమి జరిగిందో మరి, ఆమెకే తెలుసు.

ఇచ్చిన మాట

      " నాకు మీ అందరి కంటే నా భర్తే ముఖ్యం. మీతో నాకు పని లేదు " అని చెప్పించేలా పరిస్థితులు కల్పించబడ్డాయి. అందరూ అవాక్కు. తనని తీసుకు వెళ్ళడానికి భర్త రాలేదు. అన్నదమ్ములు పంపడానికే ఒప్పుకోలేదు , మరి తీసుకెళ్ళుతారా ? సమయానికి మేనమామ దగ్గర లేడు . నాన్న ఎటూ చెప్పలేకపోయినారు . ఎడ్ల బండిలో కొందరు వితంతువులు బళ్ళారి వెళుతుంటే వారిని బ్రతిమాలి , కొద్ది పాటి సారెతో బయలు దేరింది. బళ్ళారిలో భర్త ఇంటిదగ్గర దింపారు .తనని చూసి , ఆశ్చర్యపోయిన భర్త  ఒకే షరతు పెట్టాడు, .  " మళ్ళీ ఎప్పుడూ పుట్టింటికి నా అనుమతి లేకుండా పోకూడదు .  అలాగైతేనే ఇంట్లోకి రా". అని. రెండో మాట లేకుండా ఒప్పుకుంది.  50  సంవత్సరాలు అంటే చనిపోయే వరకు ఆ మాట మీదే నిలబడింది. 50 సంవత్సరాలు ! ఇది సినిమా కాదు. నిజంగా జరిగింది.ఆ వూరికీ, ఈ వూరికీ మధ్య 50 కిలో మీటర్లు కూడా లేవు. మధ్యలో కానుపులకు, పెళ్ళిళ్ళకు, ఏ మూడు నాలుగు సార్లో మాత్రమే  భర్త దయ తలిస్తేనే వెళ్ళింది. పుట్టింటి వాళ్ళే ఎప్పుడైనా వచ్చి చూసేవారు. వస్తే ఒక పూట కూడా ఉండే వారు కాదు. ఒక సారి కానుపుకని, భర్త ఒప్పుకుంటాడు అనే నమ్మకంతో, ఎడ్ల బండిలో  వెళ్ళింది. పుట్టింటి వారు మొదట్లో సంతోషించినా, తర్వాత ఆడదిక్కు లేదని భయపడి వాపసు పంపేశారు. నెలలు నిండిన గర్భిణి, మళ్ళీ బండిలో వాపసు వచ్చేసింది. అనుమతి లేకుండా ఎందుకెళ్ళావు? చెల్లెలిని ఆమాత్రం చూసుకోలేనివాళ్ళు నిన్ను కాపురానికి సకాలంలో పంపక ఎందుకు అడ్డుకున్నారు ? జవాబు వాళ్ళనే అడిగి తెలుసుకురా .  అంటూ , గర్భిణి అని కూడా చూడకుండా వెనక్కు తరిమేశాడు భర్త . శ్రీధర ఘట్ట లో  ఆసుపత్రి లేదని, ఇంకో వూరికి అదే బండిలో తరలింపు . అప్పుడు ఒక అన్నగారు తాము చేసింది తప్పేనని అనుకుని వచ్చి  ఆదుకున్నారు. కానీ, అప్పటికే అమ్మ భయాందోళనలకు గురి అవ్వడం వల్లనో, ఇంకెందుకో గానీ, ఆ పుట్టిన పిల్లాడు, ఆరేడు నెలలకే తనువు చాలించాడు. అయితే ఉన్నణ్ణాళ్ళూ ఆరోగ్యంగా ఉండి, చాలా ముద్దుగా ఉండే వాడట.

      తాను కాపురానికి వచ్చిన మొదటిరోజే భర్త ఉన్న ఇంటి గల వాళ్ళ ద్వారా తెలిసిందేమిటంటే, తనని కాపురానికి వెంటనే రప్పించుకోవడానికి భర్త తన మీద తానే పుకార్లు పుట్టించుకుని నాటకమాడాడని !

మరువ లేని జ్ఞాపకాలు

                               కానీ, భార్యని కాపురానికి రానీకుండా రెండేళ్ళు పుట్టింటిలోనే ఉంచుకున్నారని, బావ మరుదులపై కోపం పోలేదు.  క్రమేణా  రాకపోకలు పూర్తిగా తగ్గిపోయాయి. తనకూ సంసారం, పిల్లలు, వారి ఆలనా పాలనా, బాధ్యతలు ఎక్కువయ్యాయి. ఇక పూర్తిగా పుట్టింటిని మరచిపోయింది . మరచిపోయింది అనేకంటే అలా అందరు అనుకున్నారు అంటే సబబుగా ఉంటుంది . ఎన్నోసార్లు తాను ఒక్కత్తెనే ఉన్నాననుకొని, అమ్మ కంట తడిపెట్టుకోవడం ఆరేడేళ్ళ పిల్లాడిగా చూసిన నాకు బాగా జ్ఞాపకం. అమ్మ ఏడుస్తుందంటే మనసు దిగాలుగా అయిపోయేది. నన్ను గమనించిన అమ్మ, ఏమీ తెలీనట్టు, ’ పాడు పొగ ’ అని తిట్టుకొనేది .నేనొక్కడే కాదు,మా అక్కలు, అన్నలు కూడా ఇలాంటివి చాలా చూశారు.   అప్పట్లో వంట అంతా కట్టెలు, వంట చెరుకుతోనే కదా. పచ్చి కట్టెలు కాలక ఒకోసారి ఇల్లంతా పొగతో నిండిపోయేది. వూదుగొట్టంతో వూపిరితిత్తులు అలసిపోయేలా వూదేది. నాకు అత్యంత పాత జ్ఞాపకం ఏంటంటే , అపుడు నా వయసెంతోగానీ,  తన కాళ్ళు రెండూ చాచి, మా తమ్ముణ్ణి కాళ్ళపై పడుకోబెట్టుకొని, వాడిపై నీళ్ళు పోసేది.  తర్వాత కాలంలో కూడా మా అక్కయ్యల పిల్లల్ని  అలాగే పడుకోబెట్టుకుని నీళ్ళు పోసేది. నీళ్ళు పోసేటప్పుడు ఏడుస్తారని, ముఖం నిండా అంతులేని సంతోషం చూపిస్తూ, " బుడుకూస్ " అంటూ తలని పైనుంచీ కిందికి ఒక్కసారిగా ఆడిస్తూ  నవ్వుతూ నీళ్ళు పోసేది. ఆ ’ బుడుకూస్ ’ అనే పదంలో, ’ బు ’  మరియు  ’ డు ’  అక్షరాలను కలిపి ఒకే అక్షరంగా పలికేది ’ బ్డు ’ లాగా. ’ కూ ’ ని దీర్ఘం తీస్తూ ’ కూ..... ’ అని పాటలాగా పలికేది.

                దీనికి ఓ  పదేళ్ళు వెనక్కి వెళితే, అదే, నేను పుట్టక ముందు, అప్పటికి మా పెద్దక్కయ్యకు 16--18  ఏళ్ళుంటాయి. మిగిలినవాళ్ళంతా చిన్న వాళ్ళు. చిన్నపుడే చనిపోయిన అన్నయ్య తో పాటూ, నాకూ, మా పెద్దక్కయ్యకూ మధ్యలో ఇంకా 10 మంది ఉన్నారు. చనిపోయిన అన్న పేరు  ’ శేషాద్రి ’ అట. ఆ పేరు మన కుటుంబంలో ఎవరూ పెట్టుకోకూడదు, మనకు అచ్చిరాదు అని మా నాన్న చెప్పేవాడు. ’ శేష ’ అనే పదమే వద్దనే వాడు. తర్వాత రెండు సార్లు మా అమ్మకు గర్భం నిలవలేదని మా అక్కయ్యలు చెబుతారు. ఆ కాలంలో పాతవూరిలో ప్రభుత్వ ఆస్పత్రి ఉండేది. ( చెరువుకట్ట కింద ). ఇప్పటికీ ఆ బిల్డింగు ఉంది కాని ఆస్పత్రి గా కాదనుకొంటాను . కానుపులతో నీరసించి ఏదో ఒక రోగంతో మా అమ్మ బాధపడేది.  అక్కడ చాలా సార్లు అడ్మిట్ అయిందట. తాను ఆస్పత్రిలో ఉంటే చిన్న పిల్లలకి తిండి ఎలా ? పిల్లలు తనతో పాటే  ఆస్పత్రిలో ఉండేవాళ్ళు. ఒక్కోసారి పిల్లలు ఆకలని ఏడిస్తే అర్ధరాత్రయినా సరే, ఇంటికి వచ్చి పూర్తి వంట చేసి పెట్టి వెళ్ళేది.

      ఇంట్లో జరిగీ జరగని పరిస్థితి. మా నాన్న స్కూల్లో పనిచెయ్యడమేగాక కొన్ని ఇళ్ళలో ట్యూషన్ లు చెప్పేవారు. ఇంజనీరింగు కాలేజీలో అప్పటి ప్రిన్సిపాలు శ్రీ దామోదరం గారనే వారింటిలో పిల్లలకి ట్యూషన్ చెప్పేవారు. మా నాన్నకి సంతానమెక్కువని తెలిసి, వాళ్ళు జీతం మాత్రమే గాక మధ్య మధ్య లో బియ్యం, పప్పులు మొ||నవి ఏదో ఒక సాకు చెప్పి ఇచ్చేవాళ్ళట. అమ్మ పెళ్ళై కాపురానికొచ్చిన కొత్తలో, మా నాన్న ఉంటున్న ఇంటి ఓనరు చాలా బాగా ఆదరించారట. వారి పిల్లలకు మా నాన్న  అంతవరకు డబ్బు తీసుకోకుండా ట్యూషను చెప్పేవారట. అందుకని, మా అమ్మకు వారు ఒక బంగారు గొలుసు చేయించి ఇచ్చారు. అదికాక మా అమ్మకి ఒక ఒడ్డాణము, నెక్లెసు, గాజులు, పోగులు, కమ్మలు అన్నీ కలిపి సుమారు ౨౦౦ తులాల బంగారు ఉండేదట.

      కానీ తరువాతి కాలంలో అందులో ఏమీ మిగిలినట్టు లేదు. ఆ రోజుల్లో అప్పుడప్పుడు రాగి సంకటి ( ముద్ద ) చేసేది మా అమ్మ. నీళ్ళు ఎసరు పెట్టి నప్పటి నుంచి మేమందరం తట్టలు ( కంచాలు ) తీసుకొని పొయ్యి చుట్టూ కూర్చొనే వాళ్ళం. ’  మొదటి ముద్ద నాకంటే నాకు ’ అని పోట్లాటలు.

      ఇవన్నీ ఒక ఎత్తయితే, మా నాన్న తో వేగడం ఇంకో ఎత్తు. ప్రతిదానికీ ఆయనకి ముక్కుమీదే కోపం. నోటికి వచ్చినట్టు దుర్భాషలాడి, మా అమ్మని ఒకోసారి కొట్టేవాడు. చారులో ఉప్పు తక్కువైనా తప్పే, తన కళ్ళజోడు కనిపించకున్నా మా అమ్మ తప్పే, చివరికి,ఇంటికి ఏమైనా కావాలని అడిగినా తప్పే. మా నాన్న ఇంట్లో ఉంటే మేమంతా ఎలకపిల్లలు కలుగులో ఉన్నట్టు, అక్కడా, ఇక్కడా దాక్కొని ఉండే వాళ్ళం. ఆ బాధలు భరించలేక ఒక్కోసారి మా అమ్మ, పక్కనే ఉన్న దిగుడు భావిలో దాక్కునేది. మా ఇంటికి అర కిలోమీటర్లో " అమ్మవారి చెరువు " అని ఒక చెరువుండేది. అందులో నీళ్ళు మరీ ఎక్కువ లేకున్నా, ఎప్పుడూ ప్రవాహం ఉండి, నీళ్ళు శుభ్రంగా ఉండేవి. మా నాన్న నించి తప్పించుకోవాలని బట్టలు ఉతికే నెపంతో పెద్ద  పిల్లలని తీసుకొని అక్కడికి వెళ్ళి అమ్మ చాలాసేపు గడిపేది. ఒకసారి, కావాలని పడిందో లేక, ప్రమాదవశాత్తూనో గానీ, అమ్మ చెరువులో పడిపోయింది. అక్కడే బట్టలు ఉతుకుతూ ఉన్న చాకలి మహిళలు చూసి, రక్షించి పిలుచుకు వచ్చారు. మాకు తెలిసి మా అమ్మ కు ఇలాంటి బాధలు చాలానే , కానీ మాకు తెలీకుండా ఆమె ఎన్ని బాధలు పడిందో, ఆమెకు, మా నాన్నకే తెలియాలి.   గుడ్డిలో మెల్ల అన్నట్టు, అప్పటికి సొంత ఇంట్లో, అదీ, వూరికి దూరంగా విసిరేసినట్టు వుండటంతో, మా ఇంటి విషయాలు ఎవ్వరికీ తెలిసేవి కావు.

      ఈనాడు మా అందరికీ ఉన్నత చదువులు, ఉద్యోగాలు ఉన్నా, మేము మా మూలాలు మరచిపోలేదు. డబ్బు, సుఖాలు శాశ్వతం కావు. ఆనాడు మేము ఆర్థికంగా ఎలా వున్నా, క్రమశిక్షణ, సంప్రదాయాలు, పెద్దలకు మర్యాద ఇవ్వడము, లాంటి వాటిలో మాకు మేమే సాటిగా ఉండేవాళ్ళము. చిన్నప్పుడు మేము అంగడికి( కొట్టు ) వెళ్ళి ఏమైనా కొన్నప్పుడు, పొరపాటున మాకు చిల్లర ఎక్కువ వస్తే, వెంటనే వాపసు ఇచ్చే వాళ్ళం. అది మా అమ్మ మాకు నేర్పిన మొదటి పాఠాల్లో ఒకటి.

గోమాత

              నేను పుట్టకముందు, తర్వాత కూడా,  మా ఇంట్లో ఆవులు, గేదెలు ఉండేవి. ఒకసారి మా ఆవు ఈనడానికి సిద్ధంగా వుంది. ఉదయాన్నే అది కళ్ళు గుండ్రంగా తిప్పుతూ, ముందుకూ వెనక్కూ నడుస్తూ, ’ అంబా ’ అంటూ అరుస్తున్నది. విషయం అర్థమైన మా అమ్మ ఆరోజు ఉదయం మాకు తినడానికి ఎంతసేపటికీ ఏమీ చెయ్యలేదు. ఐదు నిమిషాలకోసారి ఆవు దగ్గరకెళ్ళి, దాని తల, గంగడోలు నిమిరి దానితో ఏమో మాట్లాడేది. ఏదో  అర్థమైనట్టు అది తల వూపేది. మా అమ్మ అటు వెళ్ళగానే కొన్ని నిమిషాలకే మళ్ళీ అరిచేది. మళ్ళీ మా అమ్మ వచ్చేది. వీపు నిమిరీ, తల నిమిరీ ఏదో చెబుతూ వుండేది. మా అమ్మ వున్నంతసేపు అది మామూలుగా వూరికే ఉండేది. మా అమ్మ వెళ్ళగానే మళ్ళీ అరుపు. అలాగ సుమారు ఒక గంట తర్వాత అది ఈనింది. వెంటనే అమ్మ దానికి బెల్లము, ఏవో ఆకులు, పళ్ళు తినిపించింది. కడుగు నీళ్ళు ( కుడితి ) తాగించింది. ఆ దూడకు హారతి ఇచ్చి, లోపలికి వెళ్ళింది. ఆ ఆవు తనదూడ వొళ్ళంతా నాకి శుభ్రం చేసే వరకు మమ్మల్ని దాని దగ్గరకు వెళ్ళనిచ్చేది కాదు.

       ఆ ఆవుకి పాలు పిండాలంటే, మా అమ్మ మాత్రమే ఆ పని చెయ్యాలి. పిల్లలము మాదగ్గర ఆ ఆవు గారాలు పోయేది. తల దువ్వితే దువ్వించుకునేది. గంగడోలు నిమిరితే, మోర ఎత్తి నిమిరించుకునేది. కానీ మా అమ్మ, మరియు  తన దూడ తప్ప ఇతరులు ఎవరైనా పొదుగు ముట్టుకుంటే, వాళ్ళని కాలితో తన్నేది. ఒకసారి  అమ్మకు ఆరోగ్యం బాగలేక, మా పెద్దన్న పాలు పిండాలని అనుకున్నాడు. మా అమ్మ చీర ఒకటి కట్టుకుని, పాలు పిండడం మొదలు పెట్టాడు. సరిగ్గా అప్పుడే మా అన్నని ఎవరో ఏదో అడిగారు. మా అన్న, పాలు పిండుతూనే జవాబిచ్చాడు. అంతే, మా అన్న గొంతు వినగానే, ఆవు ’ ఫెడీ ’ మని  కాలితో ఒక తన్ను తన్నింది. ఇప్పుడది తలచుకుంటే ఇంకోటి గుర్తు వస్తున్నది.

                   నా చిన్నప్పుడు, N.T.R  , వాణిశ్రీ నటించిన  " చిన్న నాటి స్నేహితులు "అనే సినిమాకి ,మా అమ్మ, మా ౪వ అక్కయ్య కలసి వెళ్ళారు. ఆ సమయంలోనే, మా పెద్దక్కయ్య, మరియు మూడో అక్కయ్య ఇద్దరూ నెలలు నిండి  ఇంచుమించు ఒకే సారి  గర్భిణితో ఉన్నారు. వాళ్ళిద్దరూ ఇంట్లోనే వుండిపోయారు. వాళ్ళకు చాలా జాగ్రత్తలు చెప్పి మరీ వెళ్ళింది. అది కూడా, ఇంట్లో వుంటే, వారిని చూస్తూ ఆందోళన  పడేదని, ఎవరో సలహా ఇచ్చినందుకు వెళ్ళింది. అదేమి చిత్రమో, ఆ సినిమాలో వాణిశ్రీ, దేవికలు కూడా ఒకే సారి గర్భవతులై, ప్రసవ వేదన పడే సీన్లున్నాయి. అది చూస్తూ, మా అమ్మ నిలవలేక, సినిమా మధ్యలోనే వదిలేసి, మా అక్కయ్యని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయింది.

ఆరాధన
                మా అమ్మ ఐదో క్లాసుకు మించి చదువుకోలేదు. బయటి ఉద్యోగం అంటూ ఏమీ లేదు. పొజిషను గానీ, పవరు గానీ లేవు. ఆర్థికంగా అంతంత మాత్రమే. చూడ్డానికి కూడా అందగత్తె అని ఎవరూ అనలేదు. తనకు చట్టి ముక్కు వుంటుందని మా అమ్మకు న్యూనతా భావం ఉండేదేమో. పొడుగ్గా కొనదేలిన ముక్కులు వున్నవాళ్ళు గొప్ప అందగత్తెలని మా అమ్మ ఎప్పుడూ అనుకునేది. సినీ నటి జయప్రద ఫోటో మొదటిసారి చూసినప్పుడు ఎంత మెచ్చుకుందో !  అలా మా అమ్మకు ఏమీ లేకున్నా , మా అమ్మ ప్రభావం చాలా మంది మీద చాలా రకాలుగా ఉండింది. అప్పుడు తెలిసేదికాదు కానీ, ఇప్పుడు ఆలోచిస్తే, అది నిజమే అనడానికి, ఇవన్నీ గుర్తొస్తున్నాయి .

                            చిన్నప్పుడు మా అక్కయ్యలు గానీ, మేము గానీ బయట ఎవరితోనైనా పోట్లాడినప్పుడు, వారు చివరికి ఓడిపోయి, ఉక్రోషంగా, " మీ అమ్మ ముఖం చూసి ఊరుకుంటున్నా " అనేవాళ్ళు. బహుశ, వాళ్ళ పెద్దవాళ్ళు మా అమ్మ మీద గౌరవం వాళ్ళకు కూడా నూరి పోశారేమో.  తర్వాతి కాలంలో . మా మూడవ అక్క, బావగారు మా పక్కింట్లోనే ఉండేవారు.  వాళ్ళ పిల్లలు మా ఇంట్లో ఆడుకుంటూ, ఒక్కోసారి స్నానాలూ, భోజనాలూ అన్నీ మా ఇంట్లోనే చేసేవారు. అది మా బావకి అంతగా నచ్చేది కాదు. అలా చూసినప్పుడు ఎవరు చెప్పినా వినకుండా వాళ్ళని లాక్కుపోయేవారు. అలాగని మేమంటే  ఏదో వ్యతిరేకత అని కాదు. ఆయన మనస్తత్వమే అంత. గంటలు గంటలు మా నాన్నగారితో హస్కు వేసుకుని కూర్చొనేవారు కూడా.  ఐతే మా అమ్మ ఎదురుగా ఎప్పుడూ పిల్లల్ని లాక్కువెళ్ళేవారు కాదు. అలా మా అమ్మ లేదనుకొని ఒక్కోసారి పొరపాటున లాక్కువెళ్ళినప్పుడు, మా అమ్మ చూసి,  " వాళ్ళు ఇక్కడే  భోంచేస్తారు లెండి " అనేది. అంతే, మరి మాట్లాడకుండా వెళ్ళిపోయే వారు.

      ఒక సమయం లో మా చిన్నప్పుడు,  మా ఇంటిమీద మా నాన్న అప్పు చేశారు. ఆకాలంలో ఒక కాబూలీవాలా ఉండే వాడు. వాడికి ఇల్లు ఆయకం ( తనఖా ) పెట్టారు మా నాన్న. అతడు వడ్డీ కోసం వచ్చి , లేదంటే, మా నాన్న గారిని చాలా బెదరించి వెళ్ళే వాడు. అప్పుడు మా అమ్మ ఎదురుగా ఉంటే మాత్రం అదేమిటో, భయంతో నమస్కారం చేసి, " మాజీ, హాయన్కీ కొంచం చెప్పండి "  అని పిల్లి లాగా వెళ్ళిపోయేవాడు. ఆ కిటుకు తెలుసుకొని ఒకోసారి మా నాన్న ఇంట్లో ఉన్నా, లేడని మా అమ్మతో చెప్పించేవారు.

      మా అమ్మ దగ్గరికి వచ్చే మా స్కూలు టీచర్లు గాని, బయటి వాళ్ళు ఎవరైనా సరే, తమలోని మంచి గుణాలు మాత్రమే కనిపించేలా జాగ్రత్త పడేవారనుకొంటాను. నిజానికి వాళ్ళకా అవసరం లేదు. మా అమ్మ అందరినీ ఒకేలా చూసేది. అదొక రకమైన అభిమానంతో వారు అలా చేసేవారేమో.

                  మా నాన్న గారు రెండు మూడు స్కూళ్ళు నడిపే వారు. గవర్నమెంటు గ్రాంటు వచ్చేది. సాయి నగరులో ఉన్న ఒక స్కూలుని " కేశవయ్య స్కూలు " అని అందరూ పిలిచే వాళ్ళు. అందులో ఆడవాళ్ళకు మాత్రమే టీచరు ఉద్యోగాలిచ్చి మా నాన్న వారిని ప్రోత్సహించేవారు . అప్పట్లో అలా ఆడవారు మాత్రమే టీచర్లుగా ఉన్న పాఠశాలలు మా ప్రాంతం లో ఉండేవి కావు .   రెండు పొడుగాటి గుడిసెలే ఆ స్కూళ్ళు. పిల్లలు ఆడుకోడానికీ, ప్రేయర్ చేయడానికీ తగినంత స్థలం ఉండేది. పాతవూరు లో ఉన్న ఇంకో దాన్ని " శ్రీ భారతి విద్యానికేతన్ " అని పిలిచే వాళ్ళు. టీచర్లు మా అమ్మ అంటే ఎందుకనో మరి, ఎంతో భక్తి చూపే వారు. అదేదో, మా నాన్న కింద పనిచేసే వాళ్ళు కాబట్టి అలా ప్రవర్తించేవారనుకుంటే పొరపాటు. మా అమ్మా వాళ్ళతో ఏనాడూ అధికారంగా మాట్లాడ లేదు.
                    1960--65 లలో అనుకుంటాను , మా ఇంటి దగ్గర్లో లక్ష్మి దేవమ్మ, సాలమ్మ అని ఇద్దరు అక్కాచెళ్ళెల్లుండే వారు. వాళ్ళు ఇద్దరూ మా నాన్న గారి స్కూల్లో చదివి , తర్వాత అక్కడే పనిచేసేవారు. తరువాత కాలంలో లక్ష్మి దేవమ్మ  A.P  గవర్నమెంటులో పంచాయతి రాజ్ మినిస్టరయ్యింది.

వాళ్లకి మా అమ్మంటే ఎంత ఆరాధనా భావమంటే, ఏ పండగ వచ్చినా ఇద్దరూ వచ్చి, ఏదైనా కానుక ఇచ్చి, పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకొనే వారు. " ఎందుకమ్మా ఇదంతా ? "  అంటే, ’ పండగ పూట దేవతను పూజిస్తే మాకే మంచిది కదమ్మా ! " అనే వాళ్ళు. అదేమి చిత్రమో., మా అమ్మ ఎవరినీ కొట్టడం గానీ తిట్టడం గానీ కనీసం గద్దించడం గానీచేయక పోయినా, మేమందరం టైముకు మా పనులు పూర్తి చేసుకొని, బుద్ధిగా వుండే వాళ్ళం. ఆర్థికంగా ఎన్ని కష్టాలున్నా, మాకు తెలిసేది కాదు. అలాగని, ఏదో అప్పులు చేసి మాకు అన్నీ అమర్చేదని కాదు. ఏమీ లేకున్నా, అది మాకు అర్థం కానివ్వకుండా మమ్మల్ని సమిష్టిగా వుంచి, ఒక తాటిపై నిలిపేది. కాలం తెలీకుండా ఆనందంగా నవ్వుతూ వుండేవాళ్లం. దేవుడి దయ వల్ల ఆ రోజుల్లో విద్య పూర్తిగా ఫ్రీ గా సాగేది. మాలో కొందరికి స్కాలర్షిప్పులు వచ్చేవి కూడా!.

Friday, October 5, 2012

2. " జీవిత చుక్కాని " రెండవ అంకము


రెండవ అంకం ( మా నాన్న గారి పరిచయం ) 


           అనంతపురం లో తాడిపత్రి మండలంలో చిన్న పప్పూరు అనే పల్లెటూరు ఉంది. అక్కడికి దగ్గర్లో " అశ్వథ్థం "  అనే ఊర్లో భాస్కర శేషయ్య గారని  జమీందారు లతో తూగగల ఒక భూస్వామి  ఉండే వారు. వారే మా తాత గారు. అప్పటికి ఆయన ’ గార్లదిన్నె శేషయ్య ’ గా పిలవబడే వారట. ’  వారి సొంత ఊరు నిజానికి  గార్ల దిన్నె . అదీ అనంతపురం జిల్లాలోనే ఉంది. ఆ కాలంలో ఆయన చాలా ధనికుల్లో ఒకరు.  . ఆయన తండ్రి గారు, శ్రీ సుబ్బయ్య గారు. వారికి తండ్రి గారు శ్రీ అయ్యంభొట్లు గారు. అప్పటివరకూ భాస్కరభొట్ల అని ఉన్న మా ఇంటిపేరు ఏ కారణం చేతనో  మాతాతగారి కాలంలో ’ భాస్కర ’ గా మిగిలిపోయింది. అశ్వత్థం లో మాతాతగారు  కట్టించిన శివాలయం ఇప్పటికీ ఉంది . 

          1902  నుండి 1912  మధ్య కాలంలో ఇండియాలో, ముఖ్యంగా, దక్షిణ దేశంలో ’ ప్లేగు ’ వ్యాధి ప్రబలి, ఊళ్ళకు ఊళ్ళే తుడిచి పెట్టుకు పోయాయని, పాత తరం వారు ఇప్పటికీ గుర్తు చేసుకుంటుంటారు. లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అందులో మా నాన్నమ్మ, తాతయ్యలు కూడా ఉన్నారు. మొదట మా నాన్నకు  5 --6   ఏళ్ళ వయసులో వాళ్ళమ్మ పోయింది.  మా తాతయ్యే ( శ్రీ శేషయ్య ) అన్నీ అయి మా నాన్నని పెంచారట. మా నాన్నకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. తాతయ్య మళ్ళీ పెళ్ళి చేసుకోలేదు. . ఆయనకి చాలా ఓపిక, సహనం ఎక్కువని మా నాన్న చెప్పే వారు. ఆయనకి నియమ నిష్టలు ఎక్కువ. శ్రీ విద్యా ఉపాసకులు , ఆయనే ఇంట్లో వంట చేసే వారట,  త్రికాల సంధ్యలు, ఔపోసనలు, త్రికాలాగ్నిహోత్రాలతో ఇంట్లో శ్రోత్రియ వాతావరణము ఉండేది. వేద ఘోషలతో వచ్చీ పోయే అభ్యాగతులతో సందడిగా ఉండేది. మా తాతగారి ఇంటి ఈ వివరాలను , మా నాన్న చెప్పిన ఇతర విషయాలు , మాతాతగారి నేపథ్యం , మా నాన్న మరియు మా చిన్నాన్నల  వైదీక కర్మల ఆసక్తి మరియు ఆచరణ వంటి విషయాలు ప్రామాణికంగా తెలుపుతున్నాయి . ముఖ్యంగా , మా తాతగారు రెండుసార్లు కలలో కనిపించిన వైనం కూడా వీటికి ఆధారంగా నిలుస్తున్నది .  నాన్న చెప్పలేదు గానీ, మా తాతయ్య బహుశః పౌరోహిత్యం  చేసేవారో లేక టీచరుగానో ఉండేవారనుకొంటాను. మా నాన్నపేరు శ్రీ  కేశవయ్య. , ఆయన తమ్ముడి పేరు ,  శ్రీ మృత్యుంజయ శాస్త్రి. తాతయ్య,  కొడుకులిద్దరిని కష్టపడి పెంచారట. ఐతే, మా నాన్నకి  9 -  10  ఏళ్ళకే, మా తాతయ్య గారు కూడా పోయారట. అదృష్టమో, దైవసంకల్పమో, మా నాన్నా, చిన్నాన్నా వ్యాధి బారిన పడలేదు. అప్పటికే, వీరి ఆస్థిని ఎవరికి అందింది వారు దోచేశారట. కొందరు నకిలీ పత్రాలు సృష్టించి, ఆస్థిలో సింహభాగం కాజేశారట. పోయింది పోగా, మిగిలింది కూడా తక్కువేమీ కాదట. వీళ్ళ పేరుతో ఇంకా కొంత ఆస్థి ఉండేదట. 

          అది తెలిసి, ఒకామె, "  మీ చిన్నాన్న భార్యను, నీకు పిన్నమ్మను,  నిన్ను పెంచుకుంటాను " అని చెప్పి, మా నాన్నని బళ్ళారి కి తీసుకొని పోయిందట. వెళ్ళాక, రెండు రోజులకే, చెంబు చేతికిచ్చి, బియ్యం ముష్టి ఎత్తుకుని రమ్మని పంపించిందట. చెంబుకి నామాలు పెట్టి, పిల్ల వాణ్ణి పంచెకట్టీ పంపేదట. మా నాన్న అమాయకంగా అలాగే ఒక   పది పదిహేను రోజులు   చేశాడట. అంతలో, " ఎర్ర సీతమ్మ " అనే ఒకామె, ’  నీ మేనమామ కూతురిని ’ అని చెప్పి పిలుచుకు పోవడానికి వచ్చిందట. తరువాత, మా నాన్న గుడిలో కూర్చొని ఎందుకిలా అందరూ నన్ను మోసం చేస్తున్నారు అని  జరిగిందానికి బాధ పడుతుండగా, పక్క పల్లె నుంచి వచ్చిన ఒకాయన , ’ ఈ పిల్లాడినెక్కడో చూశానే ’  అనుకొని,  వివరాలు తెలిసికొని,

           "  అయ్యో, నీవు గార్లదిన్నె శేషయ్య కొడుకువా "  అని కళ్ళ నీళ్ళు పెట్టుకొని,  బాధ పడి, తనతో  తీసుకెళ్ళారట. ఆ పుణ్య దంపతులే , వీరికి తల్లీ, తండ్రీ అయి పెంచారట. ఆ సమయంలో,మా నాన్న గారి మేనమామ గారయిన తూముచెర్ల రామకృష్ణయ్య గారు,  వీరి పేరుతో ఇంకా భూములున్నాయని విని, తూముచెర్లకు పిలిపించారు. "  మీ అత్తా, నేను .....,ఇద్దరమే కదా, నాకు తోడుండండి. నా ఆస్థి నా తర్వాత  మీకే " అని చెప్పి దగ్గర ఉండమన్నారు. వచ్చాక, ఎనుములు ( గేదెలు ) కాచేందుకు పురమాయించాడు. అప్పుడు, హట్టి శంకర రావు గారని ఒక బంధువులాయన, వచ్చి, యోగ క్షేమాలు  విచారించి, " మా ధర్మవరానికి రా, నీకు   SSLC వరకు చెప్పించి, పంచాయతి స్కూల్లో టీచర్ ఉద్యోగం ఇప్పిస్తాను " అని చెప్పి, ఆయనే చార్జీలు పెట్టుకుని, పిలుచుకుని వెళ్ళి, స్కూల్లో టీచర్ గా చేర్పించారు. మా పిన్నప్ప  ( మా చిన్నాన్నని మేము పిన్నప్ప అని పిలిచే వాళ్ళం ) మాత్రం, మేనమామగారింట్లోనే ఉండి, తర్వాత పౌరోహిత్యం  నేర్చుకున్నారు.


          సరే, టీచర్ గా ట్రైనింగ్ అయి, 3 నెలలు గడచినా జీతం రాకపోయేసరికి, వెళ్ళి అడిగారట. తాసీల్దారు గారి ద్వారా , పిల్లవాడి పనితీరు గురించి విచారించి, నమ్మకం కుదిరాక, జీతం ఇచ్చారట. మా నాన్న మొదటి జీతం, 8  రూపాయలట. ట్యూషన్ లు చెప్పి ఇంకో 7  -  8  రూపాయలు సంపాదించే వారట.  మా నాన్న శ్రద్ధ, పని తీరు నచ్చి,  తాసిల్దారు గారు హోటల్ వాడికి చెప్పి, మా నాన్న దగ్గర డబ్బులు తీసుకో వద్దని చెప్పినారట. ఆయనే ఇచ్చే వారట.  మాటల్లో, మా నాన్న విషయాలు అడిగి, తోపుదుర్తి లో బంధువులున్నారని, ములకనాటి వాడని తెలుసుకున్నాడట.

          ఆ తాసిల్దారు గారి దగ్గర డెప్యూటీ తాసిల్దారుగా వున్న శ్రీ సీతారామరావు గారే, నేను మొదట పరిచయం చేసిన మా అమ్మ మేనమామ గారు. 

          మా అమ్మంటే వాళ్ళ మేనమామ  సీతా రామయ్య గారికి చాలా అభిమానము. అసలు ఆయన మా అమ్మను పెంచుకుందామనుకున్నారట.  మా నాన్నను చూసి, పిల్లవాడు బుద్ధిమంతుడి లాగా ఉన్నాడు, పద్మావతి కి సరియైనవాడు అని చెప్పి, మా తాతయ్య నీలకంఠరావు గారినీ, అమ్మ అన్నయ్య సదానంద ని పిలిపించారు.

          " కాదయ్యా,  నేనే ఒక పనికిమాలిన వాణ్ణి , ఎన్నో సంవత్సరాలు   వృథా అయిపోయాయి ,  ఉద్యోగం కూడ ఖాయం  కాలేదు, ఇంకా SSLC   ఫలితాలు   రాలేదు, నాకు పెళ్ళి అప్పుడే ఎందుకు " అని మా నాన్న అడ్డు చెప్పితే, వాళ్ళు వినక, ఉద్యోగం ఖాయం చేయిస్తాము, ఒప్పుకో, అన్నారు. తప్పుతాననుకున్న లెక్కల పేపర్లో సరిగ్గా 36 మార్కులు రావడం తో, ఒప్పుకోక తప్పలేదు.  ఐతే, మా నాన్నకి, పుట్టిన తేదీ గానీ, జాతకం గానీ తెలియదు. పుట్టింది కూడా 1906 లోనో, 1908  లోనో అనేవాడు. ఆయనకున్న షరతు ఒక్కటే. అమ్మాయికి సుమంగళి యోగం ఉండాలి, అల్పాయుష్కురాలు కాకూడదు. మా అమ్మ జాతకంలో ఆ రెండూ సరిపోయాయి. కాని అమ్మది అత్త లేని నక్షత్రం ( ఆశ్లేష ).  మా నాన్నమ్మ అప్పటికే కాలం చేసి ఉండటంతో, ’ సరే ’ అన్నాడు.  

          అప్పటికి మా నాన్నకు 21  సంవత్సరాలు ఉండచ్చు . పెళ్ళయ్యాక, తాడిపత్రి కి  ట్రాన్స్ఫర్ అడిగి వేయించుకున్నాడు. అక్కడి సబ్-తాసిల్దారు గారింట్లో రూము తీసుకుని ఒక రెండేళ్ళు ఒక్కడే ఉండే వాడు. పెళ్ళయాక కూడా ఒక్కడే ఉండటానికి ఓ కారణముంది . ఆ కారణానికీ  మా అమ్మకు  ఏ సంబంధం లేకపోయినా ఆమె జీవితంలో పెనుతుఫానులు వచ్చాయి . 

          ఆ సబ్-తాసిల్దారు గారింట్లో ఎక్కువ రోజులు భోజనం చేస్తే బాగుండదని, వేరే వంట చేసుకొనేవాడు. అది చూసి, ఆ సబ్-తాసిల్దారు గారి భార్య రామ లక్ష్మమ్మ  వచ్చి, పొయ్యిలో నీళ్ళు పోసేసేది. ’ పెళ్ళాం వచ్చి, ఇద్దరు పిల్లలయ్యే వరకు మా ఇంట్లోనే భోజనం ’ అని ఆర్డరు వేసేసింది. ఆమెను మా నాన్న ’ అక్కా ’ అని పిలిచే వాడు.   మేము ఆమెని మా నాన్న సొంత అక్క అనుకునే వాళ్ళం. ఎందుకంటే, ఎప్పుడూ, ’ మా అక్క  ’ అనే ప్రస్తావించే వాడే కాని, అసలు విషయం ఎప్పుడూ చెప్పలేదు. ఒకసారి, మా అమ్మ పోయాక 5 -- 6  ఏళ్ళకు, తన జీవిత చరిత్ర మొత్తం చెప్పితే, మా పెద్దక్కయ్య దాన్నంతా రికార్డు చేసుకుంది.

          తరువాత, ’ గుత్తి ’ లో ఉన్న భూమా రెడ్డి అనే ఆసామి, వచ్చి, ఎలాగున్నావయ్యా? అని అడిగాడట. ఆయన మా నాన్నకి ముందే పరిచయం. ఆయనతో, ’ వీళ్ళు నన్ను వంట చేసుకోనివ్వడం లేదు, గుత్తి కి ట్రాన్స్ ఫర్ చేయించండి ’ అని అడిగి, గుత్తి కి బదిలీ అయ్యాడు.

         తరువాతి కాలంలో  అనంతపురంలో కమలా నగరులో మా నాన్న దగ్గరుండి ఇల్లు కట్టించుకున్నాడు. అప్పుడు మా నాన్న, చిన్నాన్న, వారి మేన మామ అందరూ కలసి సమిష్టిగా ఆ ఇంట్లోనే ఉండేవారు. 

          ఆ తరువాత, ఆస్థులు పంచుకుని, మా నాన్న సాయినగరులో విశాలమైన స్థలంలో చిన్న ఇల్లు కట్టుకున్నాడు. మా చిన్నాన్న  వారి కుటుంబం ఇప్పటికీ కమలానగరు లోని ఇంట్లోనే ఉన్నారు. 

          అప్పటికి మా నాన్నకు మిగిలిన ఆస్థి చాలా తక్కువ. చిన్న వయసులోనే, అనాథ కావడము, ఆస్థి చేతికి రావడముతో, ఉక్కిరి బిక్కిరై, మార్గ దర్శనము లేక, వృథా ఖర్చులు చేసి , అంతా పోగొట్టుకున్నాడు. మేనమామ కూడా అన్యాయం చేశాడని, తమ్ముడితో కలిసి, తనకు రావలసింది రాకుండా చేశాడనీ చెప్పేవాడు. నా చిన్నప్పుడు, ఆ విషయాల గురించి ఘర్షణలు జరగడం నాకింకా గుర్తే.

          అయితే, మా తరం వాళ్ళకి, అది మాత్రం మాకు చెందని ఆస్థి. వాటివివరాలు గానీ, హక్కుల గురించి గానీ, మా నాన్న మాకు ఏనాడూ చెప్పలేదు. వాటి గురించి మాకు ఆలోచనలు గానీ, ఆశ గానీ ఏ మాత్రం ఉండేవి కావు. ఒక వేళ ఏమైనా సెటిల్మెంటు అయి ఉండిందో కూడా మాకు తెలీదు.. అప్పటికి మేము బాగా చిన్న పిల్లలము.

          మా చిన్నాన్న మా నాన్నతో పోలిస్తే మృదుభాషి. మనిషి మంచి నిదానస్తుడు. ఆ ఆస్థి గొడవలు రాకుండా వుంటే వారి కుటుంబముతో మాకు అనుబంధము బాగానే ఉండేది. అన్నదమ్ములు విడిపోయాక, కొంతకాలము రాకపోకలుండేవి. తరువాత తగ్గిపోయాయి. పిల్లలము మేము వెళ్ళి వచ్చే వాళ్ళము. తరువాత అదీ తగ్గిపోయింది. కనీసం శుభకార్యాలకు, తద్దినాలకు కూడా కలవడం లేదు. ఎపుడైనా సినిమా హాళ్ళలోనో మార్కెట్టులోనో  కనిపిస్తే మాట్లాడే వాళ్ళం. మా బంధాలు తగ్గిపోయాక మా చిన్నాన్నకి కలిగిన సంతానముతో మాకు పరిచయము కూడా లేదు. 

Tuesday, October 2, 2012

1. " జీవిత చుక్కాని " ఒకటవ అంకము


                         ఒకటవ అంకము                          

          ఈ అంకంలో అమ్మ తో పరిచయం ,  పుట్టింటి సంగతులు , చిన్నప్పటి విశేషాలు , పెళ్ళికి ముందు ముచ్చట్లు చూడచ్చు.

                      మా అమ్మ తాను చనిపోయిన దాదాపు 25 సంవత్సరాలకు మళ్ళీ అందరి మనసుల్లోకి ఒక కొత్త జ్ఞాపకం లాగా రావాలనుకుందేమో మరి, పాత విషయాలు  ( విన్నవీ, కన్నవీ, ) తెరలు తెరలుగా కళ్ళముందుకొస్తున్నాయి.
వింతేమంటే, ఎంత గుర్తుతెచ్చుకుందామన్నా మా అమ్మ సుందర ప్రశాంత వదనం కనిపిస్తుందే తప్ప అంత ప్రశాంతంగా ఉండడానికి ఆమె సుఖాలు అనుభవించింది ఎప్పుడో ఒక్కటీ జ్ఞాపకం రాదు.  కష్టాల్లో కూడా పిల్లల సంతోషమే ఆమె సంతోషంగా కనిపించేది. ఐతే, తనకంటూ ప్రత్యేకంగా కోరికలు, సరదాలు లేవా?  తన బ్రతుకు ఎలా గడిచింది ? చిన్నప్పుడు  10, 15  సంవత్సరాల వరకు చాలా సంతోషంగా గడిపిందని విన్నానే ? సరే, అది తెలియాలంటే, మనం 1918 వ సంవత్సరంలోకి వెళ్ళాలి

          ఆరుగురు అన్నదమ్ములు,  ఒక అక్క, ఒక చెల్లెలు, మురిపెంగా చూసుకొనే తల్లి, నెత్తిన పెట్టుకొనే తండ్రి, వీళ్ళంతా కలిసి చేసే హంగామా అంతా ఇంతా కాదు. అనంతపురం జిల్లా రాయదుర్గం తాలూకా లో శ్రీధర ఘట్ట  అనే చిన్న పల్లెటూళ్ళో మా తాతయ్య ఊరి కరణం గా  మంచి ఉద్యోగమే చేసేవారు. దేనికీ కొదవ లేదు. ఆడింది ఆట, పాడింది పాట లాగా ఉండేది. అదంతా మూణ్ణాళ్ళ ముచ్చటే అయింది.  సరిగ్గా ఐదారేళ్ళు కూడా లేని వయసులో అన్న సదానంద రావు తో కలసి బళ్ళారి లో తిరుణాళ్ళ కని వెళ్ళింది. బళ్ళారి ఆ కాలంలో సంయుక్త ఆంధ్ర దేశం లో భాగం గా ఉండేది.  అప్పుడు జరిగిందాని పర్యవసానం ఇంకోలా ఉండుంటే ఇదంతా జరిగేది కాదు, అసలు మా కుటుంబమే ఉండేది కాదేమో. తిరుణాళ్ళలో వింతలు చూస్తూ చిన్నారి పద్మావతి ( అదే, మా అమ్మ పేరు ) తప్పిపోయింది.  ’ అన్న ’ ..... ’ అన్న ’ ...  అంటూ, ఏడుస్తూ అటూ ఇటూ వెతుకుతూ తిరుగుతోందట. కన్నడ భాషలో ’ అన్న ’  అంటే  మన " అన్నం " అన్నమాట. చూసినవాళ్ళు ’ అయ్యో పాపం ’ అంటూ, ఆకలైందేమో అని, తినడానికి ఏవేవో ఇవ్వజూపారట. అదృష్టవశాత్తూ, సదానంద ఇట్టే వచ్చి, చెల్లెల్ని కనుక్కొని, ఎత్తుకొని వెళ్ళాడు.

          అమ్మకు అదెంత గుర్తో కానీ , మా చిన్నపుడు " బొట్టుకు రెండు ద్రాక్షా పళ్ళు బళ్ళారి సంతలో కొనుక్కోండి " అని పాడేది . బొట్టు అంటే ఒకటిన్నర పైసా.  మాకు ఆ కాలములో ప్రతిదానికీ బళ్ళారితో ముడిపడిన ఏదో ఒకటి చెప్పేది . 

       అలా ఆ  గండం గడచి, మళ్ళీ మామూలుగా ఆటపాటలతో ఓ ఐదారేళ్ళు సంతోషంగా ఉండగా, అదిగో, ఆ మాయదారి పిల్లవాడు , బంధువుల పిల్లాడేనట , ఏదో పెళ్ళిలో  వచ్చి, మా అమ్మమ్మ  కృష్ణవేణమ్మ చేతిని కొరికాడట. మొదట ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అది సెప్టిక్ అయ్యి, ప్రాణాంతకమై, చివరికి మనిషే పోయింది. అలా పది పదకొండేళ్ళ లోనే తల్లిని పోగొట్టుకున్న మా అమ్మను, మా తాతయ్యే అన్నీ తనే అయి చూసుకున్నాడు.

          తండ్రికి ముద్దుల కూతురు   తోటే లోకం. ఆయన లాగే ఆయన రాసిన పాటలు శ్రావ్యం గా  పాడేది కదా మరి ! ఆయన పూజకి దేవుడి గది శ్రద్ధగా  ఆవుపేడతో అలికి ,ముగ్గులు పెట్టేది.  పూలు, పాలు , దీపాలు, , అన్నీ సిద్ధం చేసేది.  ఆయన తొడపై కూచొని తనకు వచ్చిన శ్లోకాలు, పద్యాలు చెప్పేది. భోజనం ఆయన ముద్దలు చేసి తినిపిస్తేనే తినేది.  ఎపుడు చూసినా ఆయన ఒళ్ళోనే ఉండేది. అన్నదమ్ముల మధ్య లేదంటే, తండ్రి ఒళ్ళోనే.  ఎంత మురిపెం ?   ఒకోసారి అన్నదమ్ములు అందరూ తలో వాయిద్యం వాయిస్తూ ఉంటే , తండ్రి కూడా వారితో చేరి కీర్తనలు పాడేవాడు . అప్పుడు కూడా కూతురు వంత పాడనిదే నడవదు !  " ఆ నీలకంఠ రావు కి పద్మావతి ఒక్కత్తే కూతురా ఏమిటి ? అంత గారాబం ! "  అనుకున్న వాళ్ళు ఉండి ఉంటారు. అయినా గారాబం ఎంత కాలం చేస్తారు? యుక్త వయస్సు  వచ్చేదాకా . ఆ కాలం లో ఆడ పిల్లలకి ’ అష్టా వర్షాద్భవేత్ కన్యా ’ అనే న్యాయాన్ని అనుసరించి , చిన్న వయసులోనే పెళ్ళి చేసేవారు . తల్లిలేని పిల్ల, త్వరగా పెళ్ళి చేస్తేనే మంచిది. అని చెప్పని వాళ్ళుంటారా ? అదీ 1930  ప్రాంతాల్లో !.  ఆమె మేనమామ శ్రీ సీతారామరావు ఆ బాధ్యత నెత్తిన వేసుకున్నాడు.  తన పెద్ద మేనకోడలు రామలక్ష్మి కి కూడా ఆయనే మంచి సంబంధం తెచ్చి పెళ్ళి చేశాడాయె ! కరణం శ్రీ రాములు అని బంధువుల అబ్బాయిని వెదకి, పెళ్ళిచేసి సంతోషించాడు. ఆయనకు కూతుర్లు లేరు. చురుకైన చూపులతో ఎప్పుడూ హుషారుగా ఉండే పద్మావతి అంటే ఆయనకి ఎంతో వాత్సల్యము. ఆయన ఈ కథ జరిగే  కాలంలో అనంతపురం లో డిప్యూటీ తహసీల్దారు గా ఉండేవారు. తరువాతి కాలంలో తాశీల్దారు కూడా అయ్యారు. 

" జీవిత చుక్కాని " పునరాగమించిన పునీత

               

                    పునరాగమించిన పునీత

నేను : మా అమ్మ మళ్ళీ తిరిగి వచ్చింది, తెలుసా ?

మీరు : ఐతే ఏంటట ? వెళ్ళిన వాళ్ళు వస్తారు.

నేను : అలా కాదు, మా అమ్మ తప్పి పోయి మళ్ళీ రాలేదు. అదేదో చిన్నప్పుడు తప్పిపోయి వచ్చింది. అది వేరే సంగతి. మా చనిపోయిన అమ్మ ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చింది.

మీరు : అదే నేనూ అనేది . అది మామూలే.

నేను : ఇంకో జన్మ తీసుకొని రాలేదు. మా అమ్మగానే మళ్ళీ వచ్చింది.

మీరు ; అయ్యా ! అవునయ్యా ! అలాగే వస్తారు. అది మామూలేనని చెప్పాగా ?

నేను : నేను చెప్పింది సరిగ్గా విన్నారా ?

మీరు : నన్ను విసిగించకండి. చనిపోయిన మీ అమ్మ, మీ అమ్మ లాగే తిరిగి వచ్చింది. అంతేగా ? చనిపోయిన వాళ్ళు దాదాపు అందరూ అలాగే తిరిగి వస్తారు. అందులో వింతేముంది ?

నేను : ....? .... ?....

మీరు : కంగారు పడకు. ప్రతి సంవత్సరం శ్రాద్ధం అందుకోవడానికి పోయిన వాళ్ళు రారా? అలాగన్న మాట.

నేను : ఇది అలా కాదండీ ! మా అమ్మ తనంతట తాను రావడం కాదు. మేం పిలిపించుకున్నాం .

మీరు : ఏమిటీ ? పిలిపించుకున్నారా  ? .. అదెలా ? నమ్మమంటావా ? ,...

నేను ( గర్వంగా ) ఐతే వినండి. ( అదే, చదవండి )

" జీవిత చుక్కాని " ముందుమాట


మాతృ దేవో భవ ----------- -------పితృదేవో భవ

                                ముందుమాట

                రోజూ వార్తాపత్రికలు చూస్తే , మరణించిన వాళ్ళకు శ్రద్ధాంజలి ఘటిస్తూ వాళ్ళ ఫోటో తో కూడా ప్రకటనలు వుంటాయి. ఆదివారాలు కొంచెం ఎక్కువగా వుంటాయి.  ఎందుకో  తెలీదు . కానీ,  కొన్ని మాత్రం  బడాయికి  పూర్తి పేజి లేదా అరపేజి వుంటాయి. రోజుకు ఒక్క ఆంధ్రప్రదేశ్ నే తీసుకున్నా, వేలమంది చనిపోతూ వుంటారు... పోనీ,.. వందలలో అయినా వుంటారు కదా ! అలా వందల్లోనో, వేలలోనో  పొయ్యే వాళ్ల శ్రద్ధాంజలి ప్రకటనలు వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. ఎందుకలా ? " శ్రద్ధాంజలి " కి నోచుకోని  వాళ్ళు అందుకు అనర్హులా ? వాళ్ళలో ఏ గొప్పదనమూ వుండదా ? లేక ప్రకటనలు ఇవ్వగలిగే స్తోమత లేకనా ? ఆసక్తి లేకనా ? పై కారణాలు అన్నో కొన్నో అయి వుండవచ్చును. ఏ కారణమూ లేకపోవచ్చు కూడా !

          మా అమ్మ చనిపోయినప్పుడు మేము ఎలాంటి ప్రకటనా ఇవ్వలేదు. పైన చెప్పిన ఏ ఒక్క కారణమూ కాదు.   ఎందుకంటే, మా అమ్మ బ్రతికిన  రోజుల్లో ఆమెను ఎంత యధాలాపం గా  పరిగణించామో పోయినప్పుడూ అంతే యధాలాపంగా పరిగణించడం వలన.  అందుకే ఎలాంటి ప్రకటనా ఇవ్వలేదు. ఇలాంటివి రాయొచ్చో లేదో కానీ,   ’ అలాంటివన్నీ మన సంప్రదాయం కాదు ’ అనే అభిప్రాయం ఏ మూలో వుందేమో ! ఆమె పోయేనాటికి ఆమెకు భర్తా,  ఆరుగురు కూతుళ్ళూ,  అల్లుళ్ళూ,  ఐదుగురు కొడుకులూ,  నలుగురు కోడళ్ళూ,  పదహారుగురు మనవలూ,  మనవరాళ్ళూ  వున్నారు. ఎవరికీ ఆ ఆలోచనే రాలేదు. పత్రికలో ప్రకటన ఇస్తే తప్ప ఆ పోయిన వ్యక్తికి పరిపూర్ణత వచ్చినట్టు, గౌరవం ఇచ్చినట్టు  అని చెప్పడం నా ఉద్దేశం కాదు.   పత్రికలో  ప్రకటన ఇచ్చినా, ఇవ్వకున్నా, పోయినవారి గొప్పదనాన్ని మాత్రం మరచి పోకూడదు. 
ఐతే అనూహ్యంగా, మా అమ్మ మరణ వార్త ’ ఆంధ్ర పత్రిక ’ దినపత్రికలో " ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు శ్రీ భాస్కర కేశవయ్య గారికి సతీ వియోగం "  అనే శీర్షికతో  సమాచారంగా వేశారు. 

          మా అమ్మ ఎవరు ? ఆమె గొప్పదనము ఏమిటి ? అంటే నాదగ్గర వెంటనే ఏ సమాధానమూ లేదు . ఆమె చదువు అయిదో తరగతి . పుట్టి పెరిగింది ఒక కుగ్రామములో .. ఆస్తిపాస్తులు అంతంత మాత్రమే . అనాకారి కాకపోయినా అందగత్తె కూడా కాదు . పెద్ద పదవులూ హోదాలూ ఏమీ లేవు . మరి ?  ..... 

           వీటితో సంబంధము లేకుండా ఒక మనిషిలో గొప్పదనము ఉండకూడదా ?  ఉండకూడదో లేదో గానీ , కొంతమందికి ఉంటుంది . ఎలా ఉంటుంది అంటే ఒకమాటలో ఎలా చెప్పగలము ? 

          ఆమె పోయి నేటికి 27 సంవత్సరాలు కావస్తున్నది. ఒకసారి వెనక్కి తిరిగి  చూసుకుంటే  పత్రికలో ని ప్రకటనలు ఆమెకు న్యాయం చేసేవి కావేమో అనిపిస్తున్నది .  ఎందుకంటే ఆమె అతి మామూలుగా పుట్టి, పెరిగి, విలక్షణంగా  బ్రతికి, మామూలుగా చనిపోయిన  అసాధారణమైన వ్యక్తి. అలాంటి వాళ్ళు ఎక్కడో కాని తారసపడరు. ఆమెలోని కొన్ని పార్శ్వాలు కొన్ని సినిమాలలోనూ, నవలలలోనూ ఆయా పాత్రల్లో చూసి వుంటాము కానీ పూర్తిగా ఆమె వ్యక్తిత్వం గూర్చి చెప్పాలంటే  అది నిజంగా సాధ్యం కాదు . 

           కొందరామెను అవదూతలతో పోల్చదగ్గ వ్యక్తి అన్నారు . ఈమె ఉన్న చోట ఇతరులకు సుఖ సంతోషాలు  ఉంటాయి అన్నారు .  అందులోని సత్యం ఆమె పోయాక , ఆ సుఖ సంతోషాలు దూరం అయ్యాక  గానీ మాకు అర్థం కాలేదు. ఆమె ఒక గొప్ప వెలుగులాంటిది. చీకటిని చూస్తేగానీ వెలుగు విలువ తెలీదు. , ఆమె ఉన్నంతకాలం మాకు చీకటి అంటే తెలీదు. అలాగే వెలిగిపోతున్న ఆమె గొప్పదనమూ తెలీదు. 

          అలాంటి ఆమెను గురించి  తెలుసుకోవడం అందరికీ అంతో ఇంతో తప్పక ఉపయోగపడుతుంది అనిపించి కలం పట్టాను . . అది అందరి హక్కు కూడా ! ఎందుకంటే, ఆమె తన జీవితంలో  ఎవరు తారసపడినా , వారికి సంతోషాన్ని పంచి పెట్టింది కానీ, తర తమ భేదాలు చూప లేదు. బ్రతికినప్పుడు ఆమెను కలుసుకోలేదన్న చిన్న కారణం చేత  ఇతరులు ఆమె వలన  ఏ లబ్ధీ పొందరాదు అనే సంకుచితత్వం దేవుడి దయ వలన మాకు రాలేదు.  ఆమెను గురించి చెప్పే ప్రయత్నమే మీ చేతుల్లో వున్న ఈ పుస్తకానికి దారి తీసింది.

          అలాగని ఇదేదో జీవిత చరిత్ర కాదు. కథ అంతకన్నా కాదు. మా అమ్మ ని మేం పొగుడుకోవడం కాదు. అలా పొగడ్తలతో ఆమె గొప్పదనాన్ని చాటింపు వేయాలంటే ఆమెని అవమాన పరచినట్టే అవుతుంది. ఆమె నిజజీవితంలో జరిగిన ఆసక్తికరమైన విషయాల సమాహారమిది. ఆ విషయాలు, విశేషాలు ఎవరికి ఎలా ఉపయోగపడుతాయో  , ఎంత మంది మనసులు నిండుతాయో చెప్పడం కష్టం. కానీ ఒకటి నిజం. ఆమెను తలచుకున్న వాళ్ళకి మనసులో ఎంత బాధ ఉన్నా మటుమాయమవుతుంది. 

          ఆమె అతి మామూలుగా బ్రతికిన మహోన్నత వ్యక్తి అని ఆమె ఉన్నపుడు తెలుసుకోక, ఉదాసీనంగా వుండి గొప్ప తప్పే చేశాము.

          జన్మనిచ్చిన తల్లి ఋణం ఎలా తీర్చుకోవాలో తెలియని ఆరాటం తోనూ, మానవాతీత విలువలతో నిరాడంబరంగా వుండి, తాను భరింపరాని కష్టాలు అనుభవించినా, ఇతరులకు ఆహ్లాదాన్ని ఇచ్చిన వ్యక్తిగా  నిలచిన ఆమె  ఆత్మకి   సంతోషం కలగాలనే కాంక్షతో  నిజాయితీగా  స్పందించి చేస్తున్న ప్రయత్నమిది. దీంతో నా ఋణం తీరేది కానేకాదు. కాని ఇప్పటికైనా ఈ ప్రయత్నం చేయకపోతే నైతికంగా నేరమే అవుతుంది.

          ఈ జన్మలో మా అమ్మ పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావని ముందే అన్నాను కదా ! దానర్థం ఏమిటంటే, గత జన్మలో పరిష్కారం కాని, పరిహారం కాని విషయాలు ఆమెకున్నాయని ! అలాగైతే ఆ  కష్టాలేవో అనుభవించి కర్మ ఫలం తీరి కాలం చేసి వుండవచ్చును .  అలా కాకుండా, తాను మాత్రం కష్టాలు పడుతూ, చెరగని చిరునవ్వుతో అందరికీ శాంతిని  సంతోషాన్నీ ఇవ్వగలిగిన గుణం ఆమెది.  కాబట్టి గతజన్మలో చాలా పుణ్యం కూడా చేసి వుండాలి. ఆ పుణ్యం ఆమెకి కాకుండా,పిల్లలము మాకు ఉపయోగపడింది.  కొన్ని ఆత్మలు,  తమ పుణ్య ఫలం ద్వారా కేవలం ఇతరులకి మంచి చేసి తాము మాత్రం వ్యథలు అనుభవించి వెళ్ళిపోతాయని ఎక్కడో చదివాను.  ఆమె ఎంత గొప్ప ఆత్మ అన్నది ఇతరులపై ఆమె ప్రభావం ఎంతగా ఉండిందో తెలుసుకుంటే అర్థమవుతుంది.  . "  ఆ భగవంతుడు తన కు మారుగా ప్రతి ఇంటిలోనూ తన  అంశని ఇలా పంపుతాడు . సందేహం లేదు. .."  . ఇలా ఎవరైనా చెపితే ఎంత బావుణ్ణు ! .

 మీ చిరునవ్వుని నేను గమనింపకపోలేదు.

      ’" ఇవేవో మహా జ్ఞానులు, తాత్వికులు తేల్చాల్సిన విషయం . నాబోటి అజ్ఞాని కి అందని విషయం ’ " అనే కదా !  ముమ్మాటికీ! కానీ, నాబోటి అజ్ఞానికి కూడా ఒక విషయం స్పష్టం గా, ఖచ్చితం గా తెలుసు. ఆమె కేవలం మామూలు ఆత్మ ఐనట్టైతే, ఇంత కాలం తర్వాత, ఈ విషయాలు  ఎంతమాత్రం  బయటికి వచ్చేవి కావు.  ఈ బయటకు వచ్చిన విషయాలు ఎవరినైనా ఆకట్టుకున్టాయో లేదో  తెలీదు. ఆమె గొప్పదనం ఏమిటో ఠక్కున అడిగితే చెప్పడానికి ఏముంది అనిపిస్తుంది. ఏ విషయం గొప్పదో, ముఖ్యమైనదో తోచడం లేదు. కానీ ఆమెలో ఏదో ప్రత్యేకత వుంది. అది ఏమిటో ఈ పుస్తకం చదివి తెలుసుకుని,   మీలాంటి చదువరులు ఆమెను ఎలా అభివర్ణిస్తారో తెలుసుకోవాలనుంది.

          మా తండ్రి గారు భాస్కరభొట్ల  కేశవయ్య గారు, 1995, మే 22 న  ( వైశాఖ బహుళ అష్టమి )  కాలం చేసినారు. అంతకు పదేళ్ళముందు, 1985 డిసెంబరు 11 న ( కార్తీక అమావాశ్య ) మా తల్లి పరమపదించారు. మా తండ్రిగారికి శ్రాద్ధ కర్మలు చేస్తున్న సమయంలో వచ్చిన ఆలోచన ఇది. చూస్తుండగానే 15 ఏళ్ళు గడచిపోయాయి. ఎప్పటికైనా రాయగలనా అనేది నా అంతర్మధనం.

          ఎందుకు రాయలేకపోయాను అంటే రకరకాల కారణాలు వున్నా, అన్నింటికన్నా ముఖ్యమైనది, బలీయమైన సంకల్పము, నియమ నిష్టలు  పాటించడము వంటివి చాలా ముఖ్యమని ఆలశ్యంగా అర్థం కావడం. ఇంతటి మహత్తర విషయాలని  ఆషామాషీగా ఉంటూ రాయడం కుదరదనే సత్యాన్ని నాకు పరోక్షంగా తెలిపింది కూడా మా అమ్మే. 


 సమాచారం అంతా సేకరించి సర్వధారి సంవత్సరం విజయదశమి 19-10-2008 రోజున రాయడం మొదలుపెట్టాను .

          ఈ పుస్తకం రాసేముందు,  దీనికి స్పందన ఎలా వుంటుందో, అసలు రాయడం వల్ల ఏదైనా ఉపయోగం ఉంటుందా అని అనిపించింది. కాని, రెండేళ్ళకిందట నేను దీని విషయం కొందరు మిత్రుల తో చెప్పడం, అప్పుడప్పుడు దీనిని గూర్చి వారు ఆసక్తిగా అడగడం వలన  నా ఉత్సాహం పెరిగి, నన్ను రాసేంతవరకు నడిపించింది.

నా ఈ ప్రయత్నం నా తల్లి ఆశీర్వాదంతో విజయీకృతమౌతుందని నా నమ్మకం.

          అలాగే, రాస్తున్న విషయాలను నిర్మొహమాటంగా, నిష్పక్షపాతంగా చెబుతూ, ఆత్మస్తుతి, పరనిందలను దరికిరాకుండా చేసిన ప్రయత్నమిది.  ఈ పుస్తకం కేవలం మా కుటుంబీకులను, బంధువులను లక్ష్యంగా రాయలేదు. ఇది కొంతవరకూ నా వ్యక్తిగత కోణం నించీ రాసినా, ఇది సర్వులకు వివేచనా కారణం, మనోరంజకం, విజ్ఞానదాయకం కావాలనే ఉద్దేశంతో, విషయాన్ని రెండుగా విభజించి , మొదటి భాగంలో అమ్మ గురించిన సమాచారం నేరుగానూ , రెండో భాగం లో అందరికీ పనికి వచ్చే  , ’ మానసిక ఆరోగ్యము ’, ’ ధ్యానము ’ , ’ వంటలు ’,  ’ పాటలు ’ ,  ’ కలల విశ్లేషణ ’   , ’ వస్తు వాస్తు ’  వంటి మరిన్ని అనుబంధ అంశాలను జోడించడం జరిగింది. సహృదయులకు అభినందనలతో,

                           " సర్వేజనాః సుఖినో భవంతు  "

Saturday, September 29, 2012

" జీవిత చుక్కాని " పుస్తకము పై కొన్ని స్పందనలు


 2008  లో     నేను రాసిన " జీవిత చుక్కాని " పుస్తకము పై కొన్ని స్పందనలు . ఇవన్ని " ఆర్కుట్ " నుంచి తీసుకున్నవి . 

ఈ పుస్తకము మా తల్లిగారి జీవితము లో జరిగిన కొన్ని విశేషాలు . వాస్తవ , యదార్థ సంఘటనలు . 



మా అమ్మ ఎవరు ? ఆమె గొప్పదనము ఏమిటి ?  

ఆమె చదువు అయిదో తరగతి . పుట్టి పెరిగింది ఒక కుగ్రామములో .. ఆస్తిపాస్తులు అంతంత మాత్రమే . అనాకారి కాకపోయినా అందగత్తె కూడా కాదు . పెద్ద పదవులూ హోదాలూ ఏమీ లేవు . మరి ?  ..... 

 వీటితో సంబంధము లేకుండా ఒక మనిషిలో మాట్లాడుకోవడానికి ఇంకేమైనా ఉంటుందా ?  నేను రాసింది అదే .  అలాగని ఆమె ఏ సన్యాసిని నో , యోగిని నో అనుకుంటే తప్పు . ఆమె  ఒక  మామూలు గృహిణి . 



Feb 17 2009



Goutham
@ Sharma garu
ఇప్పుడే మీ e-book download చేసుకొన్నా.

ఎంత మంది చెప్పండి వాళ్ళ భావాలకి అక్షర రూపం ఇచ్చేది. 

ఈ విషయం లొ మిమల్ని అభినందించకుండ ఉండలెకున్నా!! మరిన్ని విషయాలు పుస్తకం చదివిన తర్వాత చేస్తాను 
I read your e-book over last weekend and made some notes on my pdf. 


General Comments 

మీ పుస్తకం " జీవిత చుక్కాని" చదువుతూ వుంటే ఎవరో చుట్టాలయిన మన పక్కన కూర్చొని కబుర్లు చెప్తునట్టు వుంది. ఇది మీ 'సరళరచనా' శైలిని చెప్తోంది. మీరు మరే పుస్తకం వ్రాసినా, తప్పక చదువరులని engage చేస్తారని అనిపిస్తొంది. మీ story-telling skills చూస్తూ వుంటే.


ఈ పుస్తకం చదివిన వాళ్ళు "అమ్మ"ని మరింత గౌరవిస్తారు అంటే అతిశయొక్తి కాజాలదు !!

     ఈ పుస్తకం లో మీరు చెప్పాలనుకొన్న మీ అమ్మగారి విలక్షణమయిన వ్యక్తిత్వమే కాదు, మీ పరిశీలన శక్తి,ఒక వ్యక్తిలో ఎంచవలసిన గుణగణలు, మీ విశ్లేషణా పద్దతి అన్ని అగుపిస్తున్నాయి. ఇది మీ వ్యక్తిత్వాన్ని కూడ చదువరులకి చెప్పకనే చెప్తున్నాయి.

     నా వుద్దేశం ఇక్కడ మిమల్ని పొగడటం ఎంత మాత్రం కాదు. మీ పుస్తకం చదవాగనే నాకు మీ పై గలిగిన అభిప్రాయం మాత్రమే అని గమనించగలరు. ఇంతకు ముందే చెప్పినట్టు తల్లిని ఎంత గౌరవించినా ఆ భావలకి అక్షర రూపం ఇచ్చి, ఇలా అక్షరసుమాంజలి సమర్పించేది ఎంత మంది చెప్పండి ? మిమల్ని మొదట ఆ ప్రయత్నానికి అయినా మెచ్చుకొని తీరాలి. kudos !!

     ఈ పుస్తకం కేవలం, ఒక సాటి మనిషి తల్లి గురించి తెలుసుకోవటమనే కొణంలొనే కాకుండా, కాసేపు, ఎవరి తల్లి వారికి గొప్ప అని సహజంగా అనిపించే భావనను పక్కన బెట్టి చూస్తే, పెద్దగా చదువుకోని , స్తితిమంతురాలు కాని ఒక సాదసీద వ్యక్తి అని అనుకొనే వారి జీవితం లో, ప్రత్యకించి ఎముంటుందిలే ఈ రొజుల్లో, తొందరపడి నిర్ణయానికి రాకూదదని. 'సంస్కారం, వ్యక్తిత్వం'; చదువు, హొదా, పరపతి, డబ్బుకి సంబందం లేదని, రచయిత వారి (వారి అమ్మగారి)జీవితం లోకి మనకి తొంగి చూసే అవకాశంగా, ఒక case-study లాగ ఆ నాటి మనుషులు, ఆ తరం సంగతులు ఈ తరం వారికి తెలిపే ప్రయత్నంగా, రచయిత పడే తాపత్రయన్ని చిత్తగించవచ్చును.
Goutham
contd....

Specific Comments

*  " మీ చిరునవ్వు నేను గమనింపకపొలేదు" అని మీరు అన్నపుడు, మీరు పొరబడలేదు. దాని ముందు వ్యాఖ్య చదవగానే ఎవరి మొమయిన దరహాసం చిందించవలసిందే అన్నమాట. చదువరులు ఎల react అవుతారో మీ guess బావుంది.

* రెండవ అంకంలో మీ నాన్నగారి బళ్ళరి యాత్ర, ప్లేగు విషయాలు చదువుతూంటే ఆ నాటి దేశకాలమాన పరిస్థితులు, స్థితిగతులు, మనుషుల్లో అమాయకత్వం, మోసం, మంచితనం, మనుషుల మనస్తత్వం (hotel వాడు డబ్బులు పుచ్చుకోకపొవటం) కొంచంగ బోదపడ్తున్నాయి. మోసానికి కాలంతో పనిలేదేమో, ఆ రొజుల్లొ వున్నయి, ఈ రొజూ వున్నాయి. కాని మీ నాన్నగారిని చేరదీసినటు వంటి సహ్రుదుయులు తగ్గారేమో !!

* ఆ రొజుల్లో కూడా అన్ని transfers వున్నాయి అంటే అశ్చర్యం వేస్తొంది. My dad has a transferable job and we happened to grow in different places. I could connect to that.
* రెండవ అంకంలో "కొన్ని" మీ విషయాలు, చదవరులకి అక్కర్లేనివి చెప్పరని అనిపిస్తొంది. మీరు గమనిస్తే మొదటి అంకం కన్నా రెండవ అంకం పెద్దగా వుంది. ఇక్కడ మీ అమ్మగారి గురించి చెప్పటం మీ అభిమతం కాబట్టి, రెండవ అంకం లొ కొన్ని cut చేసి, మొదటి అంకంలో మరిన్ని మీ అమ్మగరి pre-marriage life విషయాలు add చేస్తే బావుంటుంది అని నా అభిప్రాయం.

Goutham

contd....

* మూడవ అంకం చాల బావుంది. ముఖ్యంగా "గొమాత" sub-section లో ఆవు తన్నే విషయం నేను connect అవ్వగలిగాను. మా తాతగారి ఇంట్లొ అలాంటి behavior వున్న గేదె ఒకటి వుండేది.

* మూడవ అంకంలో లొ ముగింపు వ్యాఖ్య చాలా బావుంది. అలాంటి జీవిత సత్యాలు, అన్ని chapters లో పెట్టి highlight/bold చేస్తే బావుంతుంది అని నా అభిప్రాయం. ఇలాంటి చెణుకులు, జీవిత సత్యాలు, quotations, సామెతలు విరివిరిగా వాడితే మరింత వన్నె వస్తుంది మీ రచనకి.
* నాల్గవ అంకం "సంబరం" కొంచం నన్ను నిరాశపర్చింది. మీరు page 20 లో "ఇలా రాస్తూ పొతే ఇది పండగ వ్యాసం అవుతుందనుకొన్నా" , నాకు మీ పుస్తకం main goal miss అవ్వకుండా, ఇంకొన్ని experiences share చేసుకొవచు అనిపించింది. మీ siblings అనుభవాలు జతచెయ్యొచు.

* (page 20) "అలా కడుపుతూ వున్నవాళ్ళకి పాము కనపడితే, ఆ పుట్టబొయే బిడ్డ వల్ల కష్టాలు తప్పవంటారు" ఔనా?? నిజమా?? మా అమ్మ నన్ను కడుపుతూవున్నపుడు, మా నాన్నగారితోపాటు yezdi మీద అదిలాబాద్ road మీద వెడుతూంటే, పడగ విప్పుకొని కూర్చొన్న పాము కనిపించిందంట. ఎంతకి కదలకపొతే మా అమ్మ పుట్టబొయే బిడ్డ పేరులో నీ పేరు కలుపుతా అంటె వెళ్ళిపొయిందంట. నేను yezdi సౌంద్ కి బయపడి వెళ్ళి వుంటుంది అంటె, మా అమ్మ లెంపలు వెసుకో అనేది. నా వలన ఆవిడ ఎప్పుడు కష్టపడినట్లు ఎపుడు మరి చెప్పలేదు !!

Goutham
errata to my previous post.


* మీ పుస్తక పరిచయ వ్యాఖ్యలలో (page iv)లో, ఈ " Max. no. of people born based on తిథి" analogy, నాలానే చాల మందికి అర్థం అవ్వకపొవచ్చు. దాన్ని మరింత clarity తో explain చెయ్యగలరు



Mar 11
Laxmi Haya Vadan
Thank you for providing some useful and intellectual stuff sir.. I ve downloaded it.. just have read the synopsis.. chaala bagundi.. not finding time.. but will complete it. Thank you once again for providing a book of "Values". We all need some more like this from you sir.
Thank You Very Much Once Again,
Vadan.

God might delay

namaskaram janardhana rao garu, Mee raasina book mottam chadivanu..chala baagundi.. maaku teliyani enno vishayalu chakkaga vivarincharu..intha manchi book maaku andinchinaduku chala thanks...

Mar 11
Venkatesh

@Sir..

Nice presentation...ela unnadhi/jarigindhi alage rasinattunnaru..
e pusthakam lo modati pages chaduthunte ney naaku maa mother gurthocharu...i feel its very much related to my life..
Anyways..I will contact you personally..
Thank you very much for posting this book here

MegaStar
Janardhan garu

modhati rendu ankaalu chadivaanu....

asalu ..chala baundhi...naku telugu chadavatam baga vachu kabatti...use ayindhi....

Inko 2-3 days lo complete chestha mostly..

Inka Feedback ivvataniki nenu mee mundhu chala chinnavanni...

Chala Nerchukovachu idhi chadhivi...thts for sure :-)

__Last lo VamshaVrukshalu chusa.. Hatsoff andi...ela gather chesaru information...?

ma Vamsha vruksham kuda...ma pedhamma valla abbayi chesthunadu..He's doing research on tht.... 


Mar 12
.JAHNAVI

sir!!thanks first of all.i'm impressed with ur writing ,u have penned in the way as if the bed time stories.ur mothers persona is really great.i think not many people know what actually their parents are,n if they know they don't put in words...rather than that episode u have give very useful info regarding Ayurveda,health n cookery.

Mar 12
rajesh
@janardhan rao sir
I suggest to create a blog if you dont have one. Upload the file there.
(Similarly you can create a Facebook account)
You can keep track of your writings/reader responses easily there.
i just downloaded it but didnot read it yet. Will read it and let you know how it is :)

Mar 17
Chandrasekhar

Nice book
I thank you for providing such an useful book. I wish more such books will be available for downloading.

Mar 17
Pramila
Respected Janardhan Rao garu
Nenu okka modati bhagam gurinche chadava galigenu, migataavi samayaabhavam valla inkaa chadavale. But naaku anipinchanadi entante, mee talli meeda gauravam koddi meeru ala raaseru, kaani general gaa mana bharateeya kutumbaalalo chooste inchu-minchu pratee talli alage vuntundemo ani anipistundi..

Ofcourse, meeru raasina vidhaanam chaala chaala baagundi. Nenu bhavaalu vunna, ee vidhamgaa raayalenemo.
I can compare your mother with mine or with my ammamma for that matter. Maa ammamma garu ippudu 77 yrs old and maa amma sashtipoorthiki daggara paduthondi. Kaani ippatikee kuda vaallu maakandariki oka vata vruksham laa vunnaru ( unfortunately I lost my Paternal grandma) Kaani veellantha vundabatte manam eeroju ila vunnamemo anipistundi.

Nenu kooda oka abbayi ki talline (working mother)..... veellandari tho poliste oka 30% ina vaalla laa ayithe baagundu ani vundi, kaani maa amma antha saantham, sahanam, orpu naaku raale. Edo oka chota react avutoo vuntanu. Entha prayatninchina aa santham-orpu raavatle. Bahusa generation gap valla emo. Ina ekkadaina edaina tappu jarugutoo vunte choosi-choodanattu oorukovaala!!!!! edirinchadam tappantara!!!!!! emo......

 Mar 21
Narayana Rao
Good way
Publishing E-books is good.
http://knol.google.com provides opportunity to publish articles and books in telugu.
Invite all telugu people to use of it. It is a google venture.
11. Mar 11
кαятнєєк вк
fabulous work andi

 Apr 12
Sreedhar
@Rao Garu
Me ee book almost complete cheysa, naku kallu chemmagillayi(konni sanii veysalalo), amma everiki cheydu cheyadu.
good to know about her,may her soul rest in peace.


 Feb 26
Time never stops ( Siri )

Rao uncle,..
........nijjanga idi chaduvuthunte ma thathaya gari kadha chaduvuthunnattu ga undi....
..........andari illu ilage unatayi emo..........thrikala sandhyalu ......trikala agni hothralu ........ivvanni vintunte ma thagaru baga gurthuku vacharu........nenu ammamma intlu peragatam valla ma amma valla nanna gari chethi goru muddalu tene adrustam naaku dorikindi...............ayana tana sontha kuthullaku kuda eppudu tinipincha ledu ani ammamma cheppedi........Pedda JEYAR SWAMI gari ki athi sannihithulu kavatam ayyannu andaru aradhinche varu..........ippatiki chestharuna china tanam lo ayana viluva naaku pedaga teleedu kani...........ippudu anipisthundi nenu adrusta vanthu ralini ani 

Thursday, September 27, 2012

జీవిత చుక్కాని -ఉపోద్ఘాతము


            జీవిత చుక్కాని -ఉపోద్ఘాతము 

       అంతరిక్షం లో ఒక అపారమైన తేజో రాశి మిరుమిట్లు గొలుపుతోంది. ఆ తేజో రాశి చిన్న చిన్న దీపాల వంటి కాంతి పుంజాల సమూహము. దూరం నించీ చూస్తే ఒకే రాశి లాగా కనిపిస్తోంది. ఆ దీప పుంజాలు కొన్ని వేలు ఉంటాయి. ఎంతో ఆసక్తిగా , ప్రతీక్షిస్తున్నాయి. అది తరచుగా జరిగే సమావేశమే అయినా ప్రతిసారీ ఆ సమూహములో కొత్త కొత్త కాంతి పుంజాలు పాల్గొంటాయి. 

     పరమాత్మ సన్నిధిలో జరిగే ఆ సమావేశము ఎంతో అద్భుతమైనది. ఎప్పుడెప్పుడా అని ఉత్సాహముతో , ఒక నూతన ఉత్తేజముతో , అన్ని దీపాలూ ఎదురుచూస్తున్నాయి. ఆ దీప పుంజాలని మన సౌకర్యము కోసము " ఆత్మలు " అని పిలుద్దామా ? ఆ ఆత్మలు తమ తమ కర్మల ఫలితాన్ని అనుభవించడానికి ఆత్రం గా ఎదురుచూస్తున్నాయి. 

     తమ కర్తవ్యాలను అప్పటికే తెలుసుకున్నాయి , ఇక మిగిలింది, ఆ భూమి పైన జన్మ తీసుకోవడమే ! 

అక్కడే  పేచీ వచ్చింది. 

     అన్ని వేల ఆత్మలలో ఎక్కువ శాతము తమ భావి తల్లి దండ్రులని తామే ఎంపిక చేసుకున్నాయి కూడా !

అయితే , ఆ పరమాత్ముని అంతిమ నిర్ణయము కోసము వేచి ఉన్నాయి. 

     విచిత్రంగా , ఎన్నో వేల ఆత్మలు తమ రాబోయే జన్మలో ఒకే కుటుంబములో జన్మించడానికి ఉత్సుకత చూపుతున్నాయి. 

     ఆ రోజు భూమిపై ఏకాదశి. భూమి పైన ఏ తిథి ఉంటుందో,  ఆ తిథి సూచించే  సంఖ్యని బట్టి అంతమంది మాత్రమే ఒకే కుటుంబములో జన్మించడానికి అనుమతి ఉంటుంది. అయితే ప్రతిసారీ అంతమందీ తప్పనిసరిగా ఒకే కుటుంబాన్ని ఎంచుకోవాలని లేదు. ఆ సంఖ్య , ఆ కుటుంబములో జన్మించదలచిన ఆత్మల యొక్క గరిష్ట పరిమితి మాత్రమే. అంతకు తక్కువగానో , ఒక్కరుకూడా లేకుండా కూడా ఉండవచ్చు.

     అన్ని వేల ఆత్మలలో పదకొండు మందిని ఎంపిక చేయడము ఆ పరమాత్మునికి కూడా కష్టముగానే ఉంది. 

     వారి వారి భూతకాల , గత జన్మల  కర్మల ఫలితాన్ని ఎంతో కూలంకషంగా పరిశీలించిన మీదట కూడా పదకొండు మందిని ఎంపిక చేయడము కష్టముగా ఉంది. ఎందుకంటే, అన్ని వేల ఆత్మలలో చాలావరకు అందరూ ఆ కుటుంబములో జన్మించడానికి అర్హులే. 

పరమాత్మ ఒక పరీక్ష పెట్టాడు. 

" రాబోయే జన్మలో మొదటి భాగము దరిద్రముతో , కష్టాలతో బాధ పడడానికి ఎందరు సిద్ధం గా ఉన్నారు ? " 

దానికి అన్ని ఆత్మలూ ఒప్పుకున్నాయి . 

" రెండవ భాగములో కష్టాలు ఎవరు అనుభవించడానికి సిద్ధం గా ఉన్నారు ? " 

మళ్ళీ అన్ని ఆత్మలూ ఒప్పుకున్నాయి . 

ఇక ఆ పరమాత్మునికి కూడా కర్తవ్యం తోచలేదు. 

     వేరే కుటుంబములో జన్మ నిర్ణయమైన వారిలో ఒకరు అన్నారు ," ఇక పాచికలు వేసి ఎంపిక చేయడమే మార్గము "
     పరమాత్మునికి అదే సరియైనదిగా తోచింది. అటువంటి పరిస్థితిని ఎన్నో వేల సంవత్సరాలకు ఒకసారి గానీ ఆయన ఎదుర్కోలేదు మరి !.

అన్న విధం గానే పాచికలు వేసి పదకొండు మందిని ఎంపిక చేశారు.

     ఈ తతంగమంతా అయి నిర్ణయమైనాక , ఎంపికకాని వారు నిరాశగా వేరే తల్లిదండ్రులని ఎన్నుకున్నారు. కానీ ఒక ఆత్మ మాత్రము సమయము కోసము వేచిచూస్తున్నది.
సమయము చూసి , ఇలా అంది " ఓ పరమాత్మా , ఇప్పడు భూమిమీద ద్వాదశి ఘడియలు వచ్చాయి కాబట్టి అదనంగా ఇంకొకరికి అవకాశం ఇవ్వడం న్యాయము . అప్పుడు పన్నెండు మంది అవుతారు . " అని. 

     పరమాత్మకు తప్పలేదు, అయితే, ఒక షరతు పెట్టాడు, " ద్వాదశి వచ్చినా , ఈ రోజుకి అతి కొద్ది ఘడియలే ఉంటుంది కాబట్టి, నీవు ఆ కుటుంబములో అతితక్కువ కాలమే ఉండి తిరిగి నావద్దకి రాగలవు " అని.

     ఆ ఆత్మ సంతోషముగా ఒప్పుకున్నది. " ఆ తల్లి దండ్రుల కడుపున పుట్టడమే ఒక వరము. నాకు అది చాలు " అన్నది.

     అదిచూసి ఇంకా రెండు ఆత్మలు పోటీ పడ్డాయి. కానీ తిథి ప్రకారము వారికి అవకాశము లేదు కాబట్టి, వారిపై కనికరముతో భగవానుడు అన్నాడు ," మీరు ఆ తల్లిదండ్రుల కడుపున పడి , పుట్టకముందే మరణించి నా వద్దకు రాగలరు. దీనిలో మీకు సంపూర్ణ స్వేఛ్చ ఉన్నది " 

  " మహా భాగ్యము " అని ఆ రెండు ఆత్మలూ ఒప్పుకున్నాయి. 

     పరమాత్ముడు తేలికగా నిట్టూర్చాడు. అతి క్లిష్టమైన ఘట్టం ముగిసింది , ఇక జన్మల సమయాలు వారి వారి కర్మఫలం నిర్దేశిస్తుంది అని తలచి, " మీకందరికీ శుభమగుగాక ! " అని ఆశీర్వదించాడు. 

     ఒకసారి ఆ భావి మాతాపితరులను అవలోకించాడు.
" వారికి ఇంకా వివాహమే కాలేదే , ఈ ఆత్మలది ముందస్తు ప్రణాళిక అన్నమాట, కలియుగ ప్రభావము ఇంత తీవ్రమా ?"  అని ఆశ్చర్య పోయాడు. 

     ఆ భావి తల్లిని చూడగానే అంతటి భగవానునికి కూడా ఉద్వేగము ఉప్పొంగింది. " వీరి ఆతృత ఎంతైనను సమంజసమే , ఈ కలియుగమున అటువంటి మాత దొరకుట దుర్లభము. తల్లీ , నీవు ధన్యురాలవు " అని అక్కడినుండే ఆశీర్వదించాడు.