SHARE

Wednesday, July 11, 2012

41. " మంత్ర ద్రష్ట " నలభై ఒకటవ తరంగము



నలభై ఒకటవ తరంగము

     విశ్వామిత్రుడు ఒక్క ఘడియ ధ్యానములో ఉండి , పరశురాముని మాటకు ప్రత్యుత్తరము ఇవ్వకనే బయటికి వచ్చి పారిజాతపు నీడలో రాతి పానుపు పై కూర్చున్నాడు . సమాహితమైన మనసుతో స్తబ్దుడై మహా సముద్రము వలె ఉన్న అతని పాదాల దగ్గర , ఏక కాలము లో అనేక జంఝా మారుతాలు వీస్తుండగా  క్షుబ్దుడై ,  తన ప్రాణమానాలను ఎత్తుకొని పైకి పోతున్న మేఘాలను పట్టుకోడానికి  పైకి చేతులు చాచాడా అన్నట్టు , ఆకాశపు ఎత్తుకు ఎగసి విసరుతున్న అలలను కలిగిన సముద్రుడిలా , పరశురాముడు  కూర్చున్నాడు . 

     విశ్వామిత్రుడు అడిగాడు , " రామా , నువ్వు నన్నేదో అడగాలని వచ్చావు ? ఎందుకు ? " 

     " మా కులదేవతలందరూ ముక్త కంఠముతో అంగీకరించారు , అయినా మేమంతా ముక్కు చివర కోపాన్ని కట్టుకున్న వారము . అది చాలదన్నట్టు అగ్ని భక్తులము . భార్గవులంటే కారణము లేకుండానే కోపగించువారు అని మాకు అపప్రథ వచ్చింది . నువ్వైతే ఆపో దేవి భక్తుడవు . నీ శాంతి మాకెక్కడిది అని అందరూ నీకు చెప్పి ఈ కార్యమును చేయుట మంచిది అని అంటున్నారు . మా కులమంతా తన తేజస్సునూ , తన తపస్సునూ , తన వర్చస్సునూ నాకు ఇచ్చింది . అస్త్రాస్త్ర సంపన్నులైన ఆ దుష్ట క్షత్రియుల నుండీ నాకేమీ భయము లేదు . వారి వారి అకార్యాలే వారిని చంపుతాయి . నేను నిమిత్త మాత్రుడిని . మామా , నన్ను చూస్తే చాలు , నా హుంకారమును వింటే చాలు, నేను ఈ గండ్ర గొడ్డలిని ఎత్తితే చాలు , వారు చచ్చి ఊరుకుంటారు . ఇలాగ అప్పుడే మృత్యు వశులైన ఆ ఖలులను వారి కంఠపు వేడి రక్తము కోసము మాత్రమే నేను చంపాలి , అంతే ! భార్గవుల తేజస్సంటే , సామాన్యము కాదనీ , సంకల్ప మాత్రము చేతనే లోకాలన్నిటినీ దహించి వేయగలదనీ తెలుసుకుంటారు . అయినా , పెద్దల మాట ప్రకారము నీకు అంతా చెప్పి నిన్ను ఒప్పించడానికి వచ్చాను . ఈ దొంగలు , అబద్ధాల కోరులు , పర ద్రవ్య అపహర్తలు బ్రాహ్మణుడి తేజస్సును కూడా చూడనీ " అని పళ్ళు పట పట కొరికాడు . 

     ఆ తేజో విజృంభణమును చూచి విశ్వామిత్రునికి ముచ్చటైంది . తన వెనకటి రూపము గుర్తొచ్చింది . వీడు నిజంగా బ్రాహ్మణుడేనా అనిపించింది . జమదగ్ని చెప్పినదంతా జ్ఞాపకము వచ్చింది . దానితో పాటు ఆనాడు వామ దేవుడు హిమవన్నగ చరియల వద్ద చెప్పిన భవిష్యము కూడా జ్ఞప్తి అయింది . " సరే , కాలము సమీపించింది . కావలసిన కార్యము నేను ఆపితే నిలుస్తుందా ? " అనుకొని , " ఊ , అలాగే కానీవయ్యా , కానీ జాతి క్షత్రియులు లేకుంటే భూమి దాస్యముతో నిండి పోతుంది . కాబట్టి వారిని వదలి , దుష్టులను మాత్రమే సంహారము చేయి " అన్నాడు . 

     " క్షత్రియుడొకడు ఎదురు వస్తే వాడు దుష్టుడా , శిష్టుడా అని ఎలాగ మామా, కనుక్కొనేది ? "

     " అదేమీ కష్టము కాదు . శిష్టులు ఎప్పుడూ సంప్రదాయబద్ధులు . నిన్ను చూచి మధు పర్కాన్ని ఇచ్చిన వాడు శిష్టుడు . " 

" నేను సూతకములో ఉన్నాను కదా , మధుపర్కాన్ని గ్రహించుటెలా ? " 

     " నీది స్వేఛ్చా ప్రారబ్ధము  . విధి విహితము కాదు . కాబట్టి , తానుగా వచ్చిన మధుపర్కాన్ని గ్రహించవచ్చు . " 

     " సరే , మామా , నీ అనుమతి దొరికింది , నేనిక బయలు దేరుతా . నువ్వు ఆతిథ్యమివ్వలేదే అనుకోవద్దు . నాకు ఇంకా ఏదో మంట మండుతున్నది కాబట్టి ఇప్పుడు  ఆకలి లేదు . మంచిది , మామా , అక్కడ నీ పక్కన ఉండిన ఆ శిశువు ఎవరిది ? " 

" దేవతలు ఇచ్చినది "

" ఆడా  ? , మగా ? "

" ఆడ పిల్ల " 

     " మామా , కోపగించవద్దు , ఆ అమ్మాయిని మాత్రము క్షత్రియునికి ఇవ్వవద్దు . సద్బ్రాహ్మణుడిని చూచి ఇవ్వు . లేదా నాకు చెప్పు , భూప్రదక్షిణలో నీకు సరియైన అల్లుడిని వెదకికొని వస్తాను . "

 విశ్వామిత్రుడు నవ్వాడు: " పువ్వు పుట్టినపుడే దాని గర్భములో కాయ ఉండదా ? అలాగే పుట్టి వచ్చిన ప్రతిదానితో పాటూ ఒక కనిపించని చేయి ఉంది , రామా . అది తెప్పను నడిపించు తెడ్డు లాగే జీవితాన్ని నడిపిస్తుంది . కాబట్టి , ఆ పాప సంగతి వదిలేయి , పైగా నువ్వు బయలు దేరినది మృత్యు దూతవై ! , కదా ? "  అన్నాడు . 

     రాముడికీ నవ్వు వచ్చింది . గలగలా నవ్వి ,  " ఔనౌను , మృత్యు దూతను కావాలని మహర్షి అనుమతి అడగటానికి వచ్చాను . " 

     " నువ్వు పుట్టుటకు ముందే నీ తండ్రికి తెలుసు  :  అతని తల్లికీ తెలుసు : నాకూ తెలుసు : క్షత్రియ కులాంతకుడైన భార్గవుడొకడు పుడతాడని : పుట్టినావు . నీ పని నువ్వు చేయుటకు దైవము ప్రేరేపిస్తుంది . అలాగే , వెళ్ళి రా ! మంగళమగు గాక ! కానీ , పాప కార్యము . వీలైనంత తక్కువగా చేయి . " 

     " మామా , చివరగా ప్రాయశ్చిత్తము చేసుకుంటాను . వారి అంతమయ్యే వరకూ వేరే ఆలోచన లేదు . మొదట హైహయ మారణ హోమము . దాని అవభృతమవగానే దాని ప్రాయశ్చిత్తము కోసము ఇంకొక హోమము . " అని విశ్వామిత్రునికి నమస్కరించి , వీడ్కొని , బయలుదేరాడు . 

Tuesday, July 10, 2012

40. " మంత్ర ద్రష్ట " నలభైయవ తరంగము



నలభైయవ తరంగము

      శిశు పోషణకై ఇక్కడే ఉండాలా ? లేక మరలా తపస్సుకు పోవాలా ? అన్న ఆలోచన విశ్వామిత్రుడికి. " తపస్సు చేసి ఫలమేమి ? దేహము శుద్ధమైంది . పంచభూత శుద్ధి కూడా అయింది . ప్రాణ సాక్షాత్కారమైంది . ఇన్నైనాక దొరకని ఆ బ్రాహ్మణ్యము ఇక దొరికినా ఏమి ? ఇలాగే ఒక లక్ష్యము , గురి తెలీకుండా పోనీ . తపస్సు చేద్దామా అంటే ఈ దేవతల పీడ ఒకటి . మనకు తెలీకుండానే మన దేహములోనికి ప్రవేశించి , వ్యాపారము చేయునట్లైతే  మేము ,  తెలీకుండానే   నీరు నిండు  కుండ , బానల కన్న హీనమైనట్టే కదా ! తేనెటీగలు కూడబెట్టిన తేనెను ఎవరో ఎత్తుకొని పోయినట్లే , నేను చేసి ఉంచుకున్న తపస్సునంతా స్వర్గాన్నిచ్చే నెపముతో ఈ దేవతలు కాజేసుకొని పోతే నేను తపస్సు చేసి ఫలమేమి ? " అని అతడు దీర్ఘముగా ఆలోచిస్తాడు . 

     " ఒకవేళ తపస్సు వద్దనుకుందాం , ఇక ఏమి చేయాలి ? మరలా రాజ్యము కట్టుకోవాలా ? లేదా ఆశ్రమమును కట్టుకొని , పాఠ ప్రవచనాలు చెప్పుకుంటూ ఏదో ఒకలా పడిఉండాలా ? ఊహూ .. కూడదు . అది లక్ష్యము లేని జీవనము . ఆ గుడ్డి బ్రతుకు కన్నా ఈ దేహాన్ని ఇక్కడే వదలి లోకాంతరాలకు ఎందుకు పోరాదు ? అంతటి ఆశ ఉంటే ఇంద్రుని పిలిపించుకుని , ఇంకొక స్వర్గాన్ని పంపించమంటే సరి . కానీ కేవలము తింటూ కూర్చుని , భోగాలలో తేలితే సుఖమేముంది ? బ్రతుకంటే అదే అంటే , నా ఆశ్రమములోని మృగాలకూ నాకూ ఏమి వ్యత్యాసము ? " అని ఆలోచనా తరంగాలు అతన్ని చుట్టుముట్టి ఆక్రమించాయి .

     అతడు ఇలాగ ఆలోచనామగ్నుడై ఉండగా శిశువు మరలా ఏడ్చి తానున్నానని గుర్తు చేసింది . అతడు ధ్యానము చేసి  ప్రాణమయుడై తన బొటన వేలిని ఆ శిశువు నోటిలో ఉంచాడు . శిశువు చొర చొరామని పీల్చుకుని తృప్తి పడి అలాగే నిద్రపోయింది .***  1

     రెండు నెమళ్ళు వచ్చి తమ రెక్కలను విప్పి శిశువుకు వింజామరలు వీచినట్లు వీస్తున్నాయి . ఇంకొక మగ నెమలి తన పింఛము విప్పి  కప్పింది . 

     అతనికి అది చూచి ఆశ్చర్యమైంది . ’ బిడ్డని తల్లి వదలి వెళ్ళింది , తండ్రినైన నేను ఏమి చేయాలో ఇంకా తెలుసుకోలేదు . ఇటువంటప్పుడు ఈ పక్షులు శిశువుకు ఉపచారము చేస్తున్నాయి . వీటికి చెయ్యమని చెప్పిందెవరు ? ఔను , నేను మొన్నటి రోజు స్నానానికి వెళుతూ ఈ నెమలికి చెప్పి వెళ్ళాను . అందుకని ఇవి నా పని చేస్తున్నాయా ? నాకూ వీటికీ సంబంధమేమి ? వచ్చినపుడు వీటికి ఆదరముతో ఉపచారము చేయుటేగా ? దానికి ఇవి ఇంతటి ప్రత్యుపకారము చేస్తున్నాయా ? అలాగైతే దేవతలు అంతటి కృతఘ్నులా ?  వారికి మేము పగలూ రేయీ అనక హవిస్సులను ఇస్తున్ననూ వారెందుకు మాకు ఉపకారము చేయుట లేదు ? మా తపస్సుకు ఏల అపకారము చేస్తారు ? "

     ఇలాగ ఆ ఆలోచనలో ఉండగా వాకిట్లో " మామా ! " అన్న పిలుపు వినిపించింది . గొంతు ఘనంగా , గోడలను చీల్చుకు వచ్చునట్లు కఠినముగా ఉంది . జమదగ్ని కంఠము ఉన్నట్టే ఉన్నా , అది కాదు . వెంటనే గుర్తుకు రాకున్నా , విశ్వామిత్రుడు ఆదరముతో , ’ లోపలకు రావయ్యా ! ’ అన్నాడు .  ఆ వచ్చింది పరశురాముడు  . ఉక్కు తో చేసిన బొమ్మ నడచివస్తున్నదా అన్నట్లు వచ్చాడు . దేహము లోని అంగాంగమూ ఒక పర్వతమైతే ఆ మూర్తి ఎలా గంభీరంగా నడవాలో అలా నడచి వచ్చాడు . చేతిలో పట్టుకున్న గండ్ర గొడ్డలి మెరుపు చెట్టులాగా మెరుస్తున్నది . మూటగట్టిన నల్ల మేఘమా అన్నట్లు వచ్చి నమస్కారము చేశాడు . అక్కడనే కొన్ని దర్భలు వేసి , దానిపై కూర్చోబెట్టి మునీంద్రుడు కుశల ప్రశ్నలు వేశాడు . రాముడు , " మామా , అంతా సర్వ నాశనమై పోయింది " అని ప్రారంభించి , తనను పొడుచుకొస్తున్న దుఃఖాన్ని పక్కకు తోస్తూ , నిట్టూర్పుల జాప్యాన్ని దాటుతూ , తమ ఆశ్రమపు దయనీయమైన కథను చెప్పాడు . హైహయుల కార్తవీర్యుడు శబలను కోరినది , శబల వెళ్లకుండా మొరాయించినదీ , దానికి అతడు చెలరేగి , జమదగ్నిని చంపి ఆశ్రమమునంతా ధ్వంసము చేసినదీ , ఇంతైనా కూడా శబల దొరక్కుండా తప్పించుకుని స్వర్గానికి  వెళ్ళిపోయినదీ ,... అంతా ఆగి ఆగి చెప్పాడు . 

     అది విని విశ్వామిత్రుడు స్థాణువయ్యాడు. జమదగ్నిని తలచి దుఃఖమైంది . " ఎంత పని చేశారు ? నాకెందుకు తెలియ పరచలేదు ? జమదగ్ని దేహపు ముక్కలను అతికించి అగ్నిని ధ్యానము చేసి ఉంటే  అతడు ఆ ముక్కలను జోడించి ఇచ్చేవాడు . నేను కూడా ఇక్కడ ఏదో పని ఉండి సంవత్సరము నుండీ ఆవైపుకే రాలేకపోయాను . ఇంకా దేహముందా ? లేక సంస్కారము అయిపోయిందా ? " అని అడిగాడు . 

     " సంస్కారము అయిపోయింది . అయితే చితికి అగ్ని అంటించి , అది కాలుతుండగా ఒక తేజో మండలము పైకిలేచి , ఇంకో రెండు చిన్న తేజో మండలములు చూపించిన మార్గములో అన్నీ ఆకాశానికి వెళ్ళాయి . నేను వాటి వెన్నంటి పోతానన్నాను . మిగిలినవారు వదలలేదు   . అపర కర్మలన్నీ ముగిసి మూడు రోజులైంది . " 

" హు...."

     " ఇప్పుడు నిన్ను అడగాలని వచ్చాను . నాకు తండ్రిగారి పైన ఎంతటి అమోఘమైన ప్రేమ ఉండిందో నీకు తెలుసు . అంతటి తండ్రిని పోగొట్టుకొని ఊరక ఉండుటకు సాధ్యము కాదు . తండ్రిని చంపిన పాతకుని వదలుట కూడా సాధ్యము కాదు . అందుకే , వాడిపై యుద్ధము చేశాను . హైహయ కులమునే నిర్మూలించాను . అంతే కాదు , దుష్ట క్షత్రియులు ఎవరైనా కానీ , ఎక్కడైనా ఉండనీ వారిని ధ్వంసము చేస్తాను . ఇరవై ఒక్కసార్లు .  మామా ,  నా తండ్రి అర్చించుచున్న అగ్ని సప్తార్చి , త్రిరూపుడునూ  యై ఉన్నాడు కాబట్టి ఏడు మూళ్ళు ఇరవై ఒక్కసార్లు ఈ భూమండలమునంతా చుట్టి వస్తాను . కిరీట పతులైన వారి తలలు కోసి , మరుగుతున్న వేడి రక్తముతో పితృ తర్పణము చేస్తాను . బహుకాలముగా మాకూ హైహయులకూ ఉన్న ద్వేషము నాతలకు బాగా ఎక్కనీ . భూమి లో క్షత్రియ శేషము లేకుండా చేస్తాను . " 

     పరశురాముడి ఆవేశపు వేడికి ఆశ్రమము కాగి పోవునో అనిపించెను . నెమళ్ళు బెదిరాయి . పాప లేవకున్నా , అటూ ఇటూ పొర్లింది . విశ్వామిత్రుడు ఆ తేజో మూర్తి విజృంభణను మెచ్చుకొని , అలాగే లేచి , నాతో రా అని అగ్ని గృహపు వైపుకు నడిచాడు . పరశురాముడు వాకిటి వరకూ వచ్చి , " లేదు , మామా , ఇరవై ఒక్కసార్లు భూ ప్రదక్షిణ చేస్తాను . మకుట ధారుల కంఠ  రక్తముతో  ఎప్పుడు దొరికితే అప్పుడు పితృ తర్పణము చేస్తాను . ఒక్కొక్కసారి భూప్రదక్షిణమయ్యాక కురుక్షేత్రానికి వచ్చి తర్పణమిస్తాను . అలాగ ఇరవై ఒక్కసార్లు అగువరకూ నాకు పితృ సూతకము పోదు . అంతవరకూ నేను అగ్ని గృహాన్ని తాకను " అని బయటే నిలిచాడు . 
*** 1 --(  ఒకానొక కాలంలో మైసూరు ఈద్గా దగ్గర ’ దూధ్ పీర్ మకాన్ ’ అనే ఒక కట్టడము ఉండేది . అక్కడ ఒక పీర్ సమాధి ఉంది . ఆ పీర్ మహాశయుడు ముమ్మడి కృష్ణరాజ ఒడెయార్ కాలపు వాడు . తల్లి లేని పిల్లలను అతని దగ్గరకు తీసుకొని వెళితే అతడు తన బొటనవేలిని పిల్లల నోటిలో ఉంచేవాడు . బిడ్డ దానిని చీకి పొట్ట నిండి నిద్రపోయేది ) ... 

Monday, July 9, 2012

39. " మంత్ర ద్రష్ట " ముప్పై తొమ్మిదవ తరంగము



ముప్పై  తొమ్మిదవ తరంగము


     పగలు గడచి  రాత్రి యై , రేయి పగలు రెండూ గడచి వారమై , వారాలు గడచి పక్షమై , శుక్ల , కృష్ణ పక్షాలు ఒకదాని వెనుక ఒకటి పరుగెత్తి మాసాలై , ఋతువులై , ఆయనాలై  వర్షము పూర్తి కావస్తూ వచ్చింది . లేదా , పూర్తయ్యింది . ఇంకొక్క రోజైతే వర్షము ముగుస్తుంది . దేవతలు ఇచ్చిన గడువు ముగుస్తుంది . 


     ఈ రోజు పున్నమి . సంధ్య సమీపిస్తున్నదని పొడవగుతున్న నీడలు చెబుతున్నాయి . చెడ్డవాళ్ళు మంచి వాళ్ళైనపుడు జనులకు ప్రియులైనట్లే , వడ దెబ్బ కొట్టు నట్లు తీక్ష్ణమైన సూర్య కిరణాలు తమ తీవ్రతను వదలి , జనప్రియమై , లోపల ఉన్నవారిని బయటికి పిలుస్తున్నాయి . ఆశ్రమములో మృగ , పక్ష్యాదులు మధ్యాహ్నపు ఆయాసమును మరచినాయా అన్నట్లు లేచి తిరుగుతున్నాయి . విశ్వామిత్రుడు పారిజాతపు మొదట్లో బండ పైన కూర్చొని ఆలోచిస్తున్నాడు . 


     ఎందుకో తెలీకున్నా , అతని మనసు ఆ రోజు మేనక పెళ్ళిరోజు మదనుడు ఆడిన మాటలు గుర్తొస్తున్నాయి , " అహంకారము పెరగాలని విచిత్ర భోగాలనూ , విచిత్రానుభవాలనూ దేవతలు సమకూరుస్తారు " ....  ’ అహంకారమును పెంచుటే నా కార్యము ’ ......’ అహంకారమును కొలుచుటకొక సాధనముంది ’ ...... 


     అతనికి అనిపించింది , " అట్లయితే నా అహంకారము పెరిగిందా ? మేనక దొరికిందని నా మనసుకు మోదమైనది నిజము . ఆమెను పగలూ రాత్రీ అని లేకుండ కోరుతున్నదీ నిజము. ఆమె లేకపోతే ఒక ఘడియ కూడా బతకలేననిపించినదీ నిజమే . ఆమె చెంతన ఉంటే మిగిలినవన్నీ మరచునదీ నిజమే . అయితే ఇదేనా అహంకారము ? భోగవస్తువును కోరి దానికై ఆరాట పడుటేనా అహంకారమంటే ? లేక , దానికన్నా భిన్నమైనది ఇంకేమైనా ఉంటుందా ? 


     ’ మేనా వచ్చుటకు ముందు అలంకారము చేసుకోవాలనే కోరిక లేదు . ఇప్పుడది తీవ్రముగా ఉంది . దానికి ముందు ఇంకొకరిని మెప్పించాలన్నది కనిపించేది కాదు . ఇప్పుడు అదీ ఎక్కువైంది . ఇలాగ బాహ్య వృత్తి అయినదే అహంకారమా ? ’ విశ్వామిత్రుడు ఇలాగ ఏకాంతములో కూర్చొని ఆలోచన చేసి చాలా రోజులైంది . సాయంకాలపు నీరెండలో ఏదో ఒక విచిత్రమైన శక్తి ఉన్నట్టూ , అది తన లోపలికి ప్రవేశించినట్టూ తెలుస్తున్నది .  తనను ఆవరించినట్టున్న  ఏవో కట్లు సడలిపోతున్నట్టు కనపడుతున్నది . ఉన్నదేదో జారి జారి పడిపోతున్నట్టుంది . మనసు, పోయేదానిని ఆపలేదు , వస్తున్నదానిని నిరాకరించలేదు . అసమర్థుడైన యజమానుడు ఇంటిలోని వారి చెలగాటాలను చూచినా నిరోధించలేక, ఊరికే ఉన్నట్టు మనసు ఊరికే ఉంది . 


     మేనక , ఎప్పటి లాగైనట్టయితే కౌశికుడి చెంత కూర్చొని గారాలు పోతుండాలి . రెండు మూడు దినముల నుండీ ఆమె వేరే అయింది . ఆ వ్యత్యాసము కూడా బాగా కనపడుతోంది . . నది సముద్రాన్ని చేరునపుడు తన నీటి పీడనమే ఎక్కువై ముందుకు ప్రవహించలేక నిలబడి పోయినట్లు మేనక ఇప్పుడు సగము ముభావముగా ఉంది . చెరువుకు గండి పడినపుడు నీరు కారి పారినట్లు ఆమె మోహము క్షీణిస్తున్నది . అగ్నిగర్భ ఐన శమీ చెట్టువలె తేజోధారిణియై తనలో తేజస్సునుంచిన వాని వైపుకు మనసు పరుగెడుతున్నా , దేహము మాత్రము ఆయాసపడి దూరంగా ఉండాలనుకుంటున్నది . ఆమె తన దేవతత్వాన్ని వహించి ఎందుకిలా అవుతున్నది అని చూడగలదు . కానీ దానికి కూడా ఆమెకు ఎందుకో విసుగు . బహుశః పక్వమైన పళ్ళున్న చెట్టు ఇలాగే ఆయాసపడుతుందేమో ? 


     మానవ ధర్మానుసారము గర్భధారణ చేసిన మేనకకు విశ్వామిత్రుడు ఉపచారము చేస్తాడు . అతని తపోబలము చేత సంపాదించిన ద్రవ్యములతో ఆమెకు ఉపచారములు జరుగుతున్నాయి . ఆశ్రమ వృక్షము క్షీరాన్ని స్రవిస్తుంది . ఇంకొకటి తేనెను ఇస్తుంది . మరొకటి అమృతము వలె రుచిగానున్న పళ్ళనిస్తుంది . దిన దినమూ పళ్ళు , పాలు ,తేనె. కావాలన్నపుడు కొన్ని చిలగడ దుంపలు . మొత్తానికి భోజన ఉపచారాలకు లోటేమీ లేదు . 


     రాత్రి అయింది . సుమారు ఒక ఝాము గడచింది . మేనకకు ప్రసవ వేదన ప్రారంభమయ్యింది . ఎంతైనా దేవత కదా ? ఆమె సఖులు వచ్చారు . యథా కాలములో సుఖ ప్రసవమయ్యింది . ఆ ఆయాసములో కన్ను మూసుకున్న దానిని సఖులు కావాలని ఏవో సవములు నాకించి , ఇంకొంత సేపు నిద్రపుచ్చారు . మేనకకు బిడ్డని తనకు చూపకుండా దాచిపెట్టమని చెప్పాలనిపించింది. ఇంకో రెండు రోజులు పతితో పాటు సుఖంగా ఉండి అనంతరము స్వర్గానికి వెళ్ళునపుడు బిడ్డను ఇచ్చి వదలి వెళ్ళాలని కోరిక. కానీ ఎందుకో ఆమాట ఆమె చెప్పలేదు, సఖులు స్వతంత్రించలేదు . 


     పాప ఏడ్చింది . మేనక నిద్రపోతే , మాతృభావము నిద్రపోతుందా ? ఆమెకు మెలకువ వచ్చింది . అపరంజి బొమ్మలా ఉన్న పాపను ఒడికి తీసుకుని యథోచితముగా ఉపచారము చేసింది . ఇంకొకసారి పతి ప్రణయ బింబమా అన్నట్లు ఒడిలో పాలు తాగుతూ పడుకున్న పాపను చూసింది . ఆమె మనసు మారిపోయింది . 


     మేనకకు తెలియకుండానే మానవధర్మము వదలిపోయింది . ఆ మానవ శిశువు తన శరీరాన్ని తాకుటను సహించలేక  ఆ శిశువును వెనక్కు పెట్టేసింది . ప్రసవపు ఆయాసము మాయమైంది . దేహములో ఎప్పటిలాగానే శక్తి వచ్చింది . ఆమెను అడక్కుండానే దేహము భూమిని వదలి పైకి లేచింది . కంఠాన్ని దివ్య కుసుమ మాల అలంకరించింది . వస్త్ర భూషణాలు అన్నీ మారిపోయాయి . 


     మేనకకు చుట్టుపట్ల ఉన్న పదార్థాలు , వస్తువులు , బిడ్డ   అన్నీ చూసి మరలా గత వైభవము అంతా జ్ఞాపకము వచ్చింది . అదంతా తలచి , సుఖ స్వప్నాన్ని స్మరించుకున్నదాని వలె తనలోనే చిన్నగా నవ్వుతూ లేచి నేలను ముట్టకుండా గాలిలో తేలుతూ వచ్చి విశ్వామిత్రుని ముందు నిలచింది . అప్పు తీర్చి కృతార్థురాలై చేతులు జోడించి వీడ్కొలుపు భావముతో , " మునీంద్రా , నేను స్వర్గానికి బయలుదేరవచ్చు కదా ? " అంది . 


     గొంతులో మునుపటి మోహావేశము లేదు . నిశ్చలమైన స్థైర్యముంది . అది ఎక్కడికో పోయిన మునీంద్రుని మనసును మంత్రము వలె ఆకర్షించింది . అతడు ఎప్పటిలా ఉన్ననూ , ఎందుకో ఆమెను ముందువలె భావించలేక , దూరపు బంధువును చూసినట్టు , కలలో ఉన్నవాడు కళ్ళు తెరచినట్టు , ’ ఆ ’ అన్నాడు . 


     మేనకకు దానిని చూచి మనసు మరగి పోయింది . దేవతలు తమ ఆటను బాగానే ఆడారు అన్నది చూచి , నవ్వుకుని ,  వెనకటి ప్రణయాన్ని కావాలని తెచ్చుకొని , ప్రయత్నపూర్వకంగా వద్ద చేరి , " దేవా , మేలుకో . నీ బిడ్డను తీసుకో . సమయము దగ్గర పడింది . నన్ను వీడ్కొలుపు. నీ అనుమతి లేక నేను పోలేను . " అని ఎలాగైతే ఉచితమో , అలాగ ఉపచారము చేసింది . 


     మునీంద్రునికి మెలకువ వచ్చింది . ఇంద్రియాలు తమ ప్రాణానికే ప్రాణమైనట్టిది వెళ్ళిపోవునని గాబరా పడి దుఃఖ మూర్తులై కరగలేక రోదించునట్లు గోల పెట్టాయి . అతడు దేహేంద్రియ మనో వృత్తులను అతి కష్టము మీద సంబాళించుకొని "  అలాగైతే వెళ్ళిపోవలసిందేనా ? "  అన్నాడు . ’ మేనా ’ అనుటకు పోయిన నోరు పలుకకుండానే నియమానికి కట్టుబడిన గోడ వలె నిలుచున్నది .  ఆమెకూ తెలిసింది . ఆమె , " దేవా! మన్నించు . మేము స్వతంత్రులము కాదు . నీకు అంతా తెలుసు . నేను వచ్చినపుడు నన్ను వద్దన్న ఆ గట్టితనముతోనే నన్నిపుడు సాగనంపు . నువ్వు నాకు ఇచ్చిన ప్రేమ తీపి గుర్తు నా హృదయములో ఎప్పుడూ ఉంటుంది . లే , ఇదిగో , ఆ బిడ్డ సంరక్షణ భారము వహించు . స్వర్గపు ఒక భోగము సాని వచ్చి నాదగ్గర స్వర్గాన్నే మరచి సుఖంగా ఉండినది అని గర్వ పడవలసిన వాడివి కదా ,  నువ్వు ? " అని తెలియజెప్పింది . మునీంద్రుని మనసు సమ్మతమై , తొలకరి వాన నీటి బొట్ల వలె రెండు పెద్ద కన్నీటి బొట్లు రాలినా , వివేకము అతనిలో సహజమైన స్థైర్యాన్ని మెరపింప జేసింది  . సంయమనముతో స్థిరంగా తలఊపి , ఆమె ఔపచారిక కానుకను నవ్వుతూ స్వీకరించి , " వెళ్ళునపుడు చెబుతానన్నావు కదా ? "  అన్నాడు . 


     మేనక నవ్వుతూ , " ప్రభూ , ఇప్పుడయినది ఆడ పిల్ల. అది పెరిగి యౌవనవతి అగువరకూ ఆగు . ఆమె ఎవరిని వరిస్తుంది అన్నది నీ ప్రశ్నకు సమాధానము . ఆమె క్షత్రియుడిని వరిస్తుందో , బ్రాహ్మణుడిని వరిస్తుందో  చూసుకో . నీ అల్లుడు క్షత్రియుడైతే నువ్వూ క్షత్రియుడవే . బ్రాహ్మణుడైతే నువ్వూ బ్రాహ్మణుడవే . " అంది .


     విశ్వామిత్రుడు ఇంకా ఏమో అడగాలని అనిపించుచున్ననూ , దాన్నంతా అలాగే సమ్మాళించుకుని , కేవలము సమతౌల్యము గల మునీంద్రులకు మాత్రమే సాధ్యమయిన మనోస్తిమితముతో మేనకను వీడ్కొలిపాడు . మేఘాలు లేని ఆకాశము వైపుకు నేలనుండీ ఒక మెరుపుతీగ ప్రసరించి ఆకాశపు నీలిమను చేరి మాయమైంది . అతడు తిరిగి చూచేటప్పటికి మాయమైన మెరుపు దిగంతాన్ని వ్యాపించినట్లు అరుణోదయపు బంగారు వర్ణము కనిపించింది . ఆశ్రమ వాసిని ఎక్కడా అని పక్షులన్నీ అడుగుతున్నట్టు కలకలా రావాలు చేశాయి . 


     విశ్వామిత్రుడు కావలసినది అయింది అన్న నిశ్చయముతో ఉన్నా , దేహపు ఏదో ఒక ప్రాణమే బయటికి పోయినట్టైంది . ఆ వేళలో తాను నిద్రలేచి స్నానాదులను ముగించి కర్తవ్య కర్మలను చేసి చాలా రోజులయిందని గుర్తొచ్చి నవ్వొచ్చింది . ఈరోజు ఇక ఏ అడ్డము లేదు, సూర్యోదయానికైనా స్నానము కానీ అని లేచాడు . పాప ఏడుపు వినిపించింది. నవ్వి , ఆ వేళకే లేచి తిరుగుతున్న నెమలి నొకదాన్ని పిలచి , " పాపను చూసుకో " అని చెప్పి నదికి వెళ్ళాడు .

Saturday, July 7, 2012

అందరికీ నమోవాకాలు

     ప్రపంచపు నాలుగు చెరుగుల నుండీ వీక్షకులు మంత్ర ద్రష్ట  కాదంబరిని  అత్యంత శ్రద్ధాసక్తులతో చదువుతున్నారు .   మీ ఆదరణ , అభిమానము నన్ను ఉద్దీపితుడను చేస్తున్నది . 


     మనకు స్వాతంత్ర్యము వచ్చు వరకూ అణగదొక్కబడిన హిందూ సంస్కృతి  మరలా తలయెత్తి సగర్వంగా తన వైభవాన్ని చాటుకోవాలంటే , మన సంస్కృతీ సాంప్రదాయాలను ప్రతిబింబించే దేనినైనా గౌరవించి ఆదరించాలన్న మీ అందరి  అభిమతమూ , మీ సంస్కారమూ , మీ అభిమానమూ చూస్తుంటే , దాని ముందు నేను ఎంత చిన్నవాడనో అర్థమగుతున్నది . ఏదో కేవలము నా సంతోషము కోసము మొదలు పెట్టిన ఈ అనువాదము ఇప్పుడు ఇంతటి ఆదరణ కు నోచుకోవడముతో , నా బాధ్యత పెరిగి , ఒళ్ళంతా కళ్ళు చేసుకుని , మనసూ బుద్ధీ ఏకాగ్రతను నింపుకొని రాయవలసిన అగత్యము కనబడుతున్నది ..


     ఎందరో మహానుభావులు , విద్యావంతులు , సాహితీ అభిమానులు , సంప్రదాయ బద్ధులు , ఆచార శీలురు అయిన మీ అందరి పలు విధాలైన  అభిలాషలు , అభీష్టాలు ఈ ఒక్క విషయములో సమాన భావాన్ని వహించడము ఎంతో హర్షణీయము , ఆమోద యోగ్యము గా ఉంది . 


     కొన్నాళ్ళు కుంటు బడిన హైందవ సంస్కృతిని పునరుద్ధరించాలన్న దృఢమైన అందరి ఆకాంక్ష  ద్యోతకమగుతున్నది . ముఖ్యంగా నేటి యువతీ యువకులు , ఈ విషయాలపై    ఆసక్తి పెంచుకోవడము అత్యంత  శుభ పరిణామము. 


     నా వల్ల ఎటువంటి పొరపాట్లూ తప్పిదాలూ జరగకుండా విజయవంతంగా , జనాదరణ యోగ్యంగా  ఈ అనువాదాన్ని పూర్తి చేయుటకు ఆ భగవంతుడి కృప కోసము ప్రార్థిస్తున్నాను . 


మీ జనార్దన శర్మ

38. " మంత్ర ద్రష్ట " ముప్పై ఎనిమిదవ తరంగము



ముప్పై  ఎనిమిదవ తరంగము

     దంపతులు నిర్విషయానందాన్ని పొందినవారి లాగా దేశ కాలాలను మరచి , ఎక్కడో , ఎందులోనో లీనమై పోయినా , జగత్తు కాలాన్ని మరవలేదు . సూర్య భగవానుడు ఎప్పటిలాగే అహస్కరుడై తూర్పు దిశను అలంకరించు సువేళ అయినదని కోడి జగాన్ని హెచ్చరించింది . యోగి , భోగులిద్దరికీ సమంగా ప్రియమైన ఆ సమయం లో నిద్ర లేచిన విశ్వామిత్రుడు కాంతా దేహపు గాఢాలింగనము ఇంకా సడలిపోక , దాన్ని అలాగే అనుభవిస్తూ మెలకువ వచ్చినా కన్ను తెరవక , " దిన దినమూ ఇష్టాపూర్తి కర్మలను చేయుట దీనికోసమే కాదా ? స్వర్గపు వేశ్యాంగనల భోగము కోసమే కదా ? అవే ఇక్కడికి వచ్చాక , ఈ కర్మల కష్ట నిష్టూరాలెందుకు ? " అని ఏమేమో ఆలోచిస్తున్నాడు . అతని ఇంకొక మనసు , ’ నీకు కర్మలు అవసరము లేదు . కానీ లోక రక్షణ భారమును వహించిన వారికి అవసరమే కదా ? నీ వంటి వారే కర్మ సన్యాసము చేస్తే లోకపు గతి ఏమి ? ’ అంటుంది . చివరికి ఇలా సిద్ధాంతము చేసుకున్నాడు , ’ ఈమెకు వరము నిచ్చాను . ఈమె సహవాసము నాకు కూడా కావాలనిపిస్తుంది . నా మిత్రులైన దేవతలకు కావలసిన బలి మొదలైనవి సకాలానికి అందకపోతే వారికి ఇక్కట్లు తప్పవు . అలా జరగకుండా , నా తపోబలము నుండీ హవిర్భాగాలు వారికి సకాలానికి అందునట్లు చూడాలి . ఎవరికీ ఇబ్బంది లేకుండా ఇంకొంత కాలము నిరాటంకముగా దాంపత్య సౌఖ్యమును అనుభవించుటకు అనుకూలము కావాలి . "  ఆ సిద్ధాంతము రూపు చెందుతున్నంతలోనే మూసుకున్న కళ్ళకి మరలా నిద్ర వచ్చింది . లేదా , వచ్చినట్టైంది . అందులో ఒక చిన్న కల: 

     ఆ కలలో  మరలా మోహిని యైన మేనక మోహ ప్రసాదాన్ని వేడుటకు వ్రతము చేసింది . ప్రసన్నుడై విశ్వామిత్రుడు వరము నిచ్చుటకు చేయి చూపుతున్నాడు . దేవతలందరూ విషణ్ణులై , దీనులై తమకు న్యాయంగా చెందవలసినది ఏదో తప్పిపోయినట్లు , చప్పిడి ముఖాలు వేసుకుని నిలుచున్నారు . అప్పుడు కౌశికుడు , " లేదు , లేదు , ఇదిగో , మీది మీకే , ఈమెది ఈమెకే " అని ఏమో భాగములు చేస్తాడు . దేవతలు సంతోష పడి , నీ తపస్సు అక్షయమగు గాక అని ఆశీర్వదిస్తారు . మేనక సంతోషముతో తేలిపోయి నట్టవుతుంది . వెనక నుంచీ ఎవరో ముసలి వారు ఒకరు , వెనకటి కల్పము వారు , అనేక కల్పాల తెరలను తొలగించుకొని వచ్చినవారి వలె ఎదురుగా వచ్చి  " సిద్ధం సాధ్యాయ కల్ప్యతే " అని గర్జిస్తారు . దేవతలు ఆ భవ్య మూర్తి ఎదురుగా వినమ్రులై నిలచి , మా రహస్యాన్ని నువ్వొక్కడవు ఛేదించినది చాలదా ? అని వేడుకుంటున్నారు . ఆ మహా పురుషుని గర్జన , దేవతల ప్రార్థన , వీటి మధ్య హవిస్సును ఎత్తి అగ్నిలో వినియోగించు దీక్షితుడి లాగా , విశ్వామిత్రుడు మేనకను విసర్జనము చేస్తాడు . 

     కలలో అలా అయినట్లే నిజంగా మేనకను దూరంగా చేత్తో తోసి , ఆ చేతికి ఏమో అయినట్లై అతడికి మెలకువ వచ్చింది . మేనకకు కూడా ఏదో కల. పలవరిస్తున్నది . స్పష్టాస్పష్టంగా ఉన్న మాటలు కౌశికుని కుతూహలాన్ని ఇనుమడించాయి . " ఊహూ , ఒక సంవత్సరము "  ’ లేదు , లేదు ’ ’ అలాగైతే నాకు మీ స్వర్గమే వద్దు ’... మేనకకు మెలకువైపోయింది . తనకన్న ముందే లేచిన పతిని చూచి అతడిని హత్తుకొని ఏడ్చింది . 

     అతనికి కుతూహలమై , ’ ఏమిటిది ? ఏమిటిది ? ’ అని ఓదారుస్తాడు . ఆమే పూర్తిగా మేలుకుని , " దేవా , నేను తొందర పడ్డాను " అంది . 

" ఏమి తొందర ? " 

     " నేను నీ మోహ ప్రసాదాన్ని కోరి , దాన్ని పొందుట మానవధర్మము కదా . ఈ ధర్మాన్ని ఆశ్రయించి మానవ స్త్రీని అయ్యానని దేవతలు నాపై కోపగించారు "

’ దాని ఫలితము ? " 

     " నాకు స్వర్గవాసాన్ని నిరాకరించవచ్చు . ఇంకా కోపమయితే , సంతోష పడు శక్తిని లాగివేసుకొని , నిత్య దుఃఖినిని గా చేయవచ్చు . "

" అలాగైతే ఇప్పుడు వారి కోపము ఏ ఫలాన్నిచ్చింది ? " 

     " ఈ మానవ ధర్మాన్ని వదలి , వెంటనే వెనుకకు తిరిగి రావాలని వారు , రానని నేను . చివరికి ఒక మాసము , ఒక ఋతువు , ఒక ఆయనము అని పెంచుకుంటూ పోయి అంతిమంగా ఒక సంవత్సరము పాటు ఇక్కడ ఉండి , ప్రేమ ఫలాన్ని నీకు అప్పజెప్పి , వెనుకకు రావాలని తెలియజేశారు . "

" మరి , నాకు మీ స్వర్గమే వద్దు అన్నావు కదా ? అదేమిటి ? " 

     మేనక ఎండా వానా కలసినట్లు , అశ్రువులు రాలుతున్న నవ్వుతో చెప్పింది. ఆ ముద్దు , ఆ మోహము , ఆ చెలువము , ఆ సుఖము..అన్నిటినీ పలికించు ఒక ముత్యము , కౌశికుని దేహము , మనసు , బుద్ధులలో ఆనంద తరంగాలను రేపుతుండగా   " చెప్పే తీరాలా ? " అంది . బ్రతిమాలితేనే చెప్పేది అన్న అర్థము ధ్వనించగా , ముఖ ముద్రలో , అంగ భంగిమలో స్పష్టముగా కనిపించింది . 

     కౌశికుడు జిగ జిగా మెరుస్తున్న ఆ రసికత్వపు కొంటెతనాన్ని ఆమెకే పంపుతూ , " నీకు చెప్పాలని లేకపోతే వద్దు . కష్టమైతే కూడదు . ఆయాసమైతే దాన్నలాగే ఉంచు " అని పలికాడు. మాట వద్దంటున్నా , " చెవులు చేటలు చేసుకుని వింటాను : చెప్పకపోతే పీడిస్తాను . ఏమైనా కానీ , చెప్పే తీరాలి " అని ఆమె నడుమును పట్టుకొని ఉన్న అతని కుడి చేయి అంటున్నది . 

     పైకి కాదన్నా , కావాలి-వద్దు అన్న మనో భావాన్ని చూచిన మేనక మురిసిపోతూ , ప్రియుడి ముంగురులు సవరిస్తూ , " స్వర్గములో దొరకని వస్తువొకటి దొరికింది . దాన్ని వదలి వచ్చేయి అన్నారు . రానన్నాను . స్వర్గవాసాన్ని తప్పిస్తాము అన్నారు . మీ స్వర్గమే వద్దు అన్నాను , అంతే ! " అంది . 

     కౌశికునికి సంతోష సాగరములో తానొక కలకండ ముక్కలా కరగిపోతున్న భావన కలిగింది . ఏమి చెప్పాలో తోచక , " ప్రేమ ఫలమంటే ఏమి ? " అని అడిగాడు . మేనక స్త్రీ సహజమైన సిగ్గును పక్కకుపెట్టి , ఒక ముద్దు ఇచ్చి , " ఒక బిడ్డ " అంది . 

" ఎలాంటి బిడ్డ? " 

" ఆడ పిల్ల " 

" ఆడపిల్లే ఎందుకు ? " 

     " భార్యకు మోహము ఎక్కువైతే ఆడపిల్ల . భర్తకు మోహము ఎక్కువైతే మగ పిల్లవాడు " 

     కౌశికుడు ఏమీ పలుకలేక , భావశూన్యుడై మోహపూరితమైన మనసుతో పడతి ఒడిలో చేరాడు . ఆమె వద్దనలేదు .

Friday, July 6, 2012

37. " మంత్ర ద్రష్ట " ముప్పై ఏడవ తరంగము



ముప్పై  ఏడవ తరంగము

     విశ్వామిత్రుని రాకకై అతని దారిని కాచి ఉన్న మేనక ఆరాటపడుతున్నది . " ఆ మహర్షి ఏమైనా తన దివ్య జ్ఞానము చేత ఆరోజు తనకు ఓటమి అగునని తెలిసి తప్పించుకున్నాడా ? " అని దిగులు . తన జ్ఞాన బలముతో తరువాతి ఝాము లోపల ఏమవుతుందో అని చూడాలని ఆమెకు కుతూహలము . ఏదైనా అది తనకు కావలసినది కాకపోతే ? అని చూచుటకు కూడా దిగులు . మునీంద్రుడెక్కడ ఉన్నాడో చూద్దామని ఒక భావము , కానీ చూచుటకు కావలసిన స్థైర్యము లేదు . ఆమె తన మనసు శిథిలమగుటను ప్రకటించుటకు కూడా లేదు , సఖులున్నారు . చాలా కష్టము మీద , నవ్వుతూ తిరుగుతున్నది . ఆమె ఎక్కడున్నా , ఆమె మనసు మాత్రము , చెవులకు ఏ సడి వినిపించినా విశ్వామిత్రుడు వచ్చాడేమో అని తిరిగి చూస్తున్నది . 

     చివరికి విశ్వామిత్రుడు వచ్చాడు . కొంచము జాగైంది . వస్తుండగానే , " మేనా , ఆలస్యమైందా " అంటూ వచ్చాడు . ఆ రెండక్షరాలను విని , అతని రూపమును చూచి పడతి హృదయము చల్లనైంది . చూచు వారున్నారను విషయాన్ని మరచి పతిని కౌగలించుకుంది . 

     కనిపించకుండా ఉన్న ఆ సఖులిద్దరూ అది చూచి ఆశ్చర్యపడ్డారు . వారి జన్మలో , ఆడదానికి అంత మోహము కలుగుతుందనీ , కలగ గలదనీ తెలియలేదు . రంభకు ఆశ్చర్యము పెరిగి , అసూయ కలిగింది . ఘృతాచీ కి , ఆ మహర్షి మహిమ ఇంకెటువంటిదో అని ఆశ్చర్యమై , సాధ్యమైతే తానుకూడా ఈ సుఖమును ఒకసారైనా అనుభవించాలి అనిపించింది . 

     మేనక మనసు ప్రసన్నమవుతుంటే, పూజా మంటపమంతా ప్రసన్నమై నవ్వులు పూసినట్టైంది . మునీంద్రుడిచ్చిన విశ్వాసముతో కూడిన గాఢాలింగనముతో  తృప్తి పడి  అతనిని పిలుచుకొని వెళ్ళి మంటపపు మధ్యలో ఏర్పరచిన మందాసనము పై కూర్చోబెట్టింది . చూచుటకు , మేనక అతని చేయి పట్టుకోలేదు , చేయి పట్టుకొను నెపముతో ఎత్తుకొని వెళ్ళి కూర్చోబెట్టినట్టు ఉంది . 

     ఆ పడతి , వేటగాడు తాను గుచ్చబోవు పిడిబాకు సులభముగా నాటుటకు తన వేట పశువుకు నూనె చమరినట్లు , అతనికి ఒళ్ళంతా నూనె చమరింది . ఆ చెరుగు నడుముకు చుట్టి , కుచ్చిళ్ళు ఎత్తి కట్టి , చేతి గాజులను పైకి సవరించుకుని , చేతులతో నూనె వత్తి వత్తి అదిమి రాస్తూ ఉంటే మృదంగ తాళముల వలె సొగసుగా సడి చేస్తూ , తన మోహాన్ని అతని తలకు పట్టిస్తున్నట్టుంది . అంగాంగాలనూ పట్టి పట్టి నూనె రాసి నిమురుతుంటే , తన బాణాన్ని ప్రయోగించుటకు సరైన చోటు ఏదని వెదకుతున్నట్టుంది . మొత్తానికి నూనె రాయడము అయింది . అక్కడికే వేడి నీరూ వచ్చింది . నూనె రాసిన శ్రమతో ఆ మోహిని ముఖమూ , శరీరమూ ఎర్రబడ్డాయి . కానీ ఉత్సాహము తగ్గలేదు . తానే నీరు పోసి స్నానము చేయించాలని కులుకుతూ కూచుంది . బట్టలకు రంగులు అద్దే అద్దకపు పనివాడు ఎంతో ఓపికగా , విశ్వాసంగా ఆ బట్టలు తడిపి జాడించునట్లు , ఏదో యజ్ఞము చేస్తున్నట్టి శ్రద్ధతో నీళ్ళు పోయడము ముగించింది . " దేవా , నీ నిత్య కర్మ ముగిసే వేళకు నేను వచ్చేస్తాను " అని తాను స్నానానికి దిగింది . 

     ఆ సేవను చూసి పరవశిస్తున్న ఘృతాచీ వెంటనే ముందుకు వచ్చి మేనకను పిలుచుకొని పోయి స్నానము చేయించింది . రంభకు , " నిజంగా మేనక అదృష్టవంతురాలు " అనిపించింది .

     ఇంకొక ఘడియలోపల మేనక మడి కట్టుకుని వచ్చింది . ఇంకొక పూజా పీఠము సిద్ధమైంది . మనోహరంగా మరుని మగత నిద్ర వలె   సొంపైన అలలతో జంపాల గా తేలియాడే సముద్రమైన ఆ పూజా మంటపములో నాథుని కూర్చోబెట్టి , ఆమె పూజ ప్రారంభించింది . తూర్పు దిశలో కనిపించే తెలుపు ఎరుపై , ఎరుపులన్నీ  కలసికట్టుగా వచ్చినట్టున్న చంద్రబింబము పైకి వచ్చి కనబడు వరకూ పూజ నడుస్తూనే ఉంది . 

     ఆ పూజా విధానాన్ని ఎవరు వర్ణించగలరు ?  తీసిన గంధము పంచేంద్రియాలకూ సంతర్పణ చేసినట్టుంది . అర్చించిన కుసుమాలలో కేవలము రూప గంధాలు మాత్రమే కాక , అలౌకికమైన ఇంకేదో నవ చైతన్యము ప్రతి సుమము లోనూ ఇంతింత నిండినట్లుంది . ఇంకా సరిగా చెప్పాలంటే , సాలె పురుగు తన గూటికి చిక్కిన ఆహారాన్ని పట్టి అది కదలకుండా , సూక్ష్మమైన తన మృదువైన దారాలతో దాని చుట్టూ కట్టినట్లు , ఆ మోహిని తన మోహ మంత్రపు బీజాక్షరాలను ఆ మానవేంద్రుని మనసు ముగ్ధము కావాలని మనసుతోనే ప్రయోగిస్తూ , ఆ ప్రయోగపు క్రౌర్యాన్ని దాచుటకు పూజ నెపముతో పువ్వులని అర్పించినట్టుంది . నైవేద్యము సమర్పించినపుడైతే ఆమె వైఖరిని చూడాల్సిందే , వెలుగుతున్న దివ్య జ్యోతిర్లత తన జీవన సార్థకత కోసము ఇష్ట దైవానికి సమర్పిస్తున్నదా అన్నట్టూ , ఆడ తీగ ఒకటి ఆశ్రయ దాత యైన మహా వృక్షానికి తన సర్వస్వమునూ కానుకగా ఇస్తున్నట్టూ , మానవాతీతమైన ఏవేవో భక్ష్య భోజ్య రస చోష్యాలను సమర్పించుకుంది . దేవతల ఆహారమైన అమృతము లేకున్నా , దానికి సమానమైన దివ్య ఔదనపు భోజనము చేత  జిహ్వ , ఉదరము , శరీరముతో పాటు అతని పంచప్రాణాలూ తృప్తి చెందాయి . 

     చివరగా మంత్రపుష్పాన్ని సమర్పించి పునః పూజ కూడా ముగించి , పూజ అంతమయ్యే సరికి విశ్వామిత్రునికి తాను నిజంగా ఏదో ఒక దేవతననీ , ఆమె భక్తికి ఏమి కావాలన్నా , అడిగిన వరము ఎటువంటిదైనా కానీ , నిశ్శంకగా ,  నిర్లోభముతో  , పూర్ణ మనస్సుతో ఇవ్వాలి అనిపించింది .

     ఆ భావనను కళ్ళు , ముఖము , శరీరాలు మనసు కన్నా ముందే , భావము పలుకై బయటపడుటకన్నా ముందే సూచించి , అభయము నిస్తున్నాయి . అతని నాలుక ఆ సుఖ సాగరములో ఎక్కడో కరగిపోయి ఉండాలి , లేకపోతే మాట బయటికి రావడానికి అంత జాప్యమెందుకు ? మనసు ఆ సుఖ తరంగిణి లో ఎక్కడో కొట్టుకొని పోయి ఉండాలి , లేకపోతే మాట పలుకకుండా ఉంటుందా ?  

     మొత్తానికి మేనక పూజను ముగించింది . అసలే ప్రాణముతో  కలయ తిరుగు వెండి బొమ్మ లాగా ఉన్నది , ఇప్పుడు శృంగారపు సొగసు , సౌఖ్యపు ఓజస్సు , శ్రద్ధ యొక్క తేజస్సు చేరి అలౌకిక మన మోహన మూర్తి అయింది . పూజ అంతా అయ్యాక పూజా సాఫల్యం కోసము ఒక ఫలాన్ని తెచ్చి అర్పించింది . 

     విశ్వామిత్రుడు మేనకను లేపి దృఢాలింగన పూర్వకముగా తొడపైన కూర్చోబెట్టుకుని , చుబుకాన్ని పట్టి , చిదిమి , బుగ్గలు నిమిరి , ముద్దు పెట్టుకుని , చెదరిన కురులను సవరించి , చెమరిస్తున్న చెమటని తుడిచి , ముఖం లో ముఖము పెట్టి , " ఏమిటీ సంభ్రమము ? ఈ ఉపచారములేమిటి ? నేను , చక్కెర ముద్ద నీటిలో పడినట్టయ్యానే !! " అని మృదువుగా అడిగాడు . 

     మేనక మౌనముగా ఆ ఉపచారాల నన్నిటినీ స్వీకరించి , చెప్పాలా వద్దా అని ఇంకా మౌనములోనే ఉండగా , మగవాడు తనను అర్పించుకున్న ఆడదానికి తానూ తనను అర్పించుకుంటూ , " మేనా , మౌనమేల ? ఈ ఉపచారపు గోపురానికి మాటల కలశము అలంకరించు , చిత్రము పూర్తి కానీ " అన్నాడు . 

     మేనక మృదువుగా నవ్వింది . ముందే అదంతా తెలిసినట్టు , ఎక్కడో కనిపించని వీణలు మోహన రాగం లో దైవతము తో మొదలుపెట్టి ఒక తాన వరుసను ఆరోహణలో మృదువుగా పలికి షడ్జములో నిలిపాయి . ఆ వీణల తంత్రులన్నీ ఒకదానినొకటి చూసి నవ్వినట్లు కదలిపోయి , మేనక చెవి పోగులలాగా మెరిశాయి . 

     మేనక , " దేవా " అంది. ఆమె నోటి నుండీ తర్వాత ఏమీ బయటికి రాలేదు . ముని పెదాలు రెండూ ఒకదానికొకటి భద్రంగా చేరి, ఆమె వహించిన మౌన ముద్ర వీగిపోవుటకా అన్నట్టు ఆమె అధరాన్ని చప్పుడు చేస్తూ చుంబించి , " మాట్లాడు , చెప్పు , ఏమి కావాలన్నా చేద్దాము, చెప్పు " అన్నాడు . 

     దివ్యాంగన , వెన్నెలలో వికసించిన కలువలనుండీ తరంగాలుగా వస్తున్న పరిమళములాగా , ఆగి ఆగి సగము సగమే వస్తున్న తన ముద్దు మాటలను తన కంటి చూపులతో పూర్తి చేస్తూ , " దేవా , నాకు మోహ భిక్ష కావాలి " అంది . 

     మునికి మెలకువ లాగా అయింది . ఒక ఘడియ ఏమీ మాట్లాడలేదు . రెప్పలు వేయు నంత జాగృతి కొచ్చాడు . అంతలోనే ఆ భావాన్ని తీసి పారేసినట్టు , వద్దని విసిరేసినట్టు , తనకు తానుగా కావాలని ముడిని సడలించుకొని మహా ప్రవాహములో దుముకు ఉప్పు మూట వలె , ఆ మోహినికి వశమైన ఈశ్వరుడి వలె  వశమై  " కానిమ్ము , దేవీ , ఈ దినమునుండీ ఇంకొక అధ్యాయము . ఈ దినము నుండీ నేనిక నీ సేవకుడను . కావాలని నిన్ను కోరి సేవించు దాసుడను, సరేనా ? ఇంకేమి కావాలి ? " అన్నాడు .

     మేనక తృప్తి , గర్వము నిండిన చూపుతో కాంతుని చూసింది . ఆ చూపులో అదేముందో , ఏ పిలుపుందో  ? ఎట్టి మోహముందో ? ఏమి ఉద్దీపనముందో ? ఏ ఉప బృంహణ శక్తి ఉందో ? మునీంద్రుడు తాను మైమరచి పోతూ , ఆ మోహిని పైన పడి , ఆమెకూడా మైమరచి పోవునట్లు హత్తుకున్నాడు . 

     పూర్ణాహుతి తీసుకొని విజృంభించి శాంతుడగు యజ్ఞేశ్వరుని వలె , చుట్టుపక్కల అంతా ఏదో శాంతి నిండింది . రంభా , ఘృతాచీలు ఒకరినొకరు చూసి నవ్వి , నిజంగా ఈమె అదృష్టవంతురాలు అని తల ఆడిస్తూ , తిరస్కార భావాన్ని రానీకుండా అక్కడనుంచీ జారుకున్నారు . 

     అదృశ్యం గా ఉన్న గంధర్వులు శ్రావ్యంగా , మృదువుగా , మోహకమైన గానాన్ని వాద్య సమేతంగా వాయించారు . శృంగార మంటపము మరొకసారి సుగంధాన్ని చల్లి , దీపాల కాంతిని అపహరించి , వాటిని సూర్యోదయ కాలపు నక్షత్రాలలాగా చేసింది . 

Thursday, July 5, 2012

36. " మంత్ర ద్రష్ట " ముప్పై ఆరవ తరంగము



  ముప్పై  ఆరవ తరంగము


     విశ్వామిత్రుడు ఈ రోజు ఎందుకో వేళకు రాలేదు . ఇప్పుడతడు మేనక నుంచీ  ఆకాశగమనాన్ని నేర్చుకున్నాడు . ఎక్కడికి కావాలన్నా ఆకాశములో వెళ్ళి వస్తాడు . ఇప్పుడు స్తంభన విద్య కూడా బాగా అభ్యాసమైంది . భూతాలను జయించిన అతడు , దేహములోని పృథ్వీ భూతాన్ని , ఆపో భూతాన్ని స్తంభనము చేసి సంకల్ప మాత్రముతోనే ఎక్కడికైనా వెళ్ళగలడు . ఈ రోజు జమదగ్ని ఆశ్రమానికి వెళ్ళాడు . అక్కడ ఆ కామధేనువును చూసినపుడల్లా , ఇక ఏ కౌశికుడొచ్చి ఆ ఆశ్రమాన్ని ధ్వంసము చేస్తాడో అని ఒక చింత . హైహయులూ , భార్గవులూ మొదటినుంచీ రాయి-టెంకాయి . హైహయుల్లోనే ఎవరైనా పుడతాడేమో ? వారు కాకపోతే ఇక ఎవ్వరూ భార్గవులకు ఎదురు పడువారు లేరు . అందువలన మృత్యువు ఎక్కడనుండీ రావచ్చు అని ఒక ఊహ. ఆ మాటను జమదగ్ని తో అంటే , " వదిలేయి మామా , క్షాత్రము బ్రాహ్మమును ఎదురిస్తే , మొదట తాను నష్టమైతేనే కదా , అ తర్వాత మాకు హాని చేసేది !! అట్లే హైహయులు దుష్టులైతే  వారి కులమే ధ్వంసమై పోతుంది . మొత్తానికి క్షత్రియులు దుష్టులగు సూచనలున్నాయి . సరే పద , భవితవ్యమును తప్పించే యోచన నాకు లేదు . అయ్యేవీ పొయ్యేవీ దైవానివి . " అంటాడు . ఏమి చేసినను అతనికి విశ్వామిత్రుని పంతము రాదు . అయ్యేతీరాలి అని అతనికి అనిపించనే అనిపించదు . " అయితేనేమి ? పోతేనేమి ? ఉన్నంతవరకూ సూటిగా ఉంటే సరి . మా కులదైవము అగ్ని . మా యోగ క్షేమాలు అతనికి సంబంధించినవి . " అంటాడు . 

     విశ్వామిత్రునికి మనోభావము కొంచము ఇటువైపుకు తిరిగింది . రానురాను ,  బరితెగించి తిరుగుతూ మేసే  పశువును కట్టేస్తే  అది పెనుగులాడినట్లు , మేనక సహవాసములో భోగాలను అనుభవిస్తూ , సమాధి కొంచము శిధిలమైంది . ఉదయాస్తమయ సమయములే కాక , మధ్యాహ్నమే కాక , మిగిలిన సమయాలలో కూడా సహజముగా వస్తున్న సమాధి స్థితి ఇప్పుడు కొంచము కష్టము మీద , ప్రాణాయామము ద్వారా సాధించవలసి వస్తున్నది . సంకల్పము లేకున్ననూ బయటికి చిమ్ముతున్న ప్రాణ శక్తి ఇప్పుడు శరదృతువు నది వలె అల్ప వాహిని అయింది . విశ్వామిత్రుడికి అది గమనానికి వచ్చినపుడు ,’  కావాలన్నప్పుడు అది పిచ్చి ప్రవాహము ఎందుకు కారాదు లే ’  అని తనకు తానే సమాధాన పడతాడు .

     విశ్వామిత్ర జమదగ్నులిద్దరూ ఏమేమో ఆలోచిస్తున్నారు . ఆ మాటా ఈ మాటా మాట్లాడుతున్న జమదగ్ని , " మామా , ఇంద్రుడి అప్పు తీరిందా ? లేదా , తీర్చే ఆలోచన ఏదైనా చేశావా ? " అన్నాడు . అంతవరకూ విశ్వామిత్రుడు ఇంద్రుడు పంపిన స్వర్గపు సంగతి అతనికి చెప్పి ఉండలేదు . చెబుదామా అనిపించి , ఎందుకో వద్దులే అనుకొని , " ఇంకా లేదు . అయితే అతి త్వరలో తీర్చాలి . దానికన్నా ముందే ఋషి పుత్రులను పొందాలి కదా , ఆ విధానమేదో తెలుసుకోవాలి . లేకపోతే ఇంద్రుడి అప్పు తీర్చుటెలా అని ఆలోచిస్తున్నాను . "  అన్నాడు . జమదగ్ని , " నువ్వు ఆ అప్పును అలాగే ఉంచుకోవద్దు . మంచిది కాదు . ఎవరైనా దేవతను అనుసంధానము చేసుకొనో , లేక ఏదైనా యజ్ఞము చేసో మొదట ఆ అప్పును తీర్చే ఆలోచన చెయ్యి " అన్నాడు . 

     విశ్వామిత్రుడు నవ్వి , " జమదగ్నీ ,  ’ యాభై మంది సంతానాన్ని బలి ఇవ్వాలి . అంతమందిని ఎలా పొందుట ? ’ అని ఆలోచన . ఏ పుణ్యవతి యాభై మంది పిల్లల్ని పొందుతుంది ? ఏ తల్లి తన పిల్లల్ని నాకోసము బలి ఇస్తుంది ? పిల్లలంటే తల్లిదండ్రులకు ఇద్దరికీ సమానముగా చెందినవారు కదా ! అయినా కూడా  , ఆ బలిని అనుకోగానే  అలా ఎలా ఇచ్చేది ? దానికో  కారణము లేనిదే ఎలా ?  ఇదే ఆలోచన "  అన్నాడు . 

     జమదగ్ని తన వయసుకు తగినట్టు ఆ గొప్ప విషయాన్ని లఘువుగా తీసుకొని  , " మామా , ఇదంతా త్రిశంకువును స్వర్గానికి పంపించిన దానికన్నా ఎక్కువా ? ఇంకొకసారి అశ్వినీ దేవతలను పిలిపించి అడిగితే సరి . లేదా , ప్రాణుల గర్భాలకు కారణుడైన సవితృ దేవుడినే అనుసంధానము చేసుకొని అసంఖ్యాకమైన సంతానాన్ని పొందుటెలా అని అడిగితే సరి . దీనికంత ఆలోచన దేనికి , మహా ! "  అని నవ్వుతూ చెప్పాడు . 

     విశ్వామిత్రునికి  ఔనౌను అనిపించింది . ఒకవేళ మేనకకు ఈ రహస్యము తెలిసి ఉండవచ్చో ఏమో విచారించాలి, అనుకున్నాడు . అయినా , జమదగ్నికి ఆ సంగతి చెప్పకుండా , " ఇక సంధ్య సమీపిస్తుంది , నేను వెళ్ళొస్తా  " అని బయలుదేరాడు .

     అంతవరకూ మేనల్లుడు , మామ ఎలా వస్తాడు , ఎలా వెళతాడు అన్నది చూడలేదు . అప్పుడు మేనమామ వెళ్ళిన తర్వాత , " ఈ రహస్యము కశ్యపుడికి తెలిసి ఉండాలి . క్షేత్రానుగుణముగా ఫలించుట లాగా బీజమునిచ్చు అతనికి ఏకము అనేకమగునట్లు చేయు విధానము కూడా తెలిసి ఉండాలికదా ! " అనిపించింది . ఆ మాట మామకు చెబుదామని బయటికి వడి వడిగా వచ్చాడు . మామ లేడు . మామ ఆశ్రమ దారిలో ఒక యోజనము వరకూ పరుగెత్తి వచ్చాడు . కనపడలేదు . దారిలో అడుగుజాడలు కూడా లేవు . ’ అలా అయితే అతడు ఇంకో దారిలో వెళ్ళుంటాడా ? ’  ..’ వీలులేదు ’  .. ’ అలాగయితే అతడు ఆకాశగమనము చేసి ఉంటాడా ? ’  ..’ కావచ్చు . ఈ మధ్య అతడికి కొన్ని సిద్ధుల విషయములో ఆసక్తి వచ్చింది . మాటా మంతీ లో కూడా కర్మజులైన దేవతల వలె వ్యవహరిస్తాడు . ఈ మార్పు కు కారణమేమి ? " అని ఆలోచిస్తూ వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు . 

Wednesday, July 4, 2012

35. " మంత్ర ద్రష్ట " ముప్పై అయిదవ తరంగము



ముప్పై  అయిదవ తరంగము

     మేనక ఆశ్రమ భూమిని స్వర్గము చేయుటకు పూనుకుంది . సరస్వతీ నదీ తీరపు తపోవనములోనే ఉండాలంటే ఆమెకెందుకో మనసొప్పలేదు . అందుకని అక్కడి నుండీ కొంచము ఉత్తరం గా ప్రవహిస్తున్న మాలినీ నదీ తీరములో , ఒక తోపులో స్వర్గ ఖండమొకటి రచింపబడినది . ఆ స్వర్గపు చుట్టూ ఎల్లప్పుడూ ఒక మేఘము కమ్ముకొని ఉంటుంది . ఆ మేఘపు మాటున పచ్చటి చెట్లూ , పూల మొక్కలూ , తీగలతో తూగు మంటపము ఒకటి తయారైంది . ఆ మంటపములో ఒక సొగసైన శయ్యామందిరము . దాని చుట్టూ ఉన్న తీగలూ పొదల నిండా పళ్ళూ పూలూ నిండి ఉన్నాయి . 

     మేనక తన ప్రభావముతో ఒక వీణను సృష్టించింది . ఆ వీణ దశ విధ నాదాలనూ పలుకుతుంది . సంగీత విదుషీమణి లాగా ఏ రాగము కావాలన్నా పాడుతుంది . మేనక నాట్యము చేయవలె నంటే , ముద్దుగా మద్దెల లాగా తాళాన్ని వాయిస్తుంది . సదా అక్కడ సంగీత , నర్తనాల తరంగాలు , లహరులు సుఖంగా , మనోహరంగా , అక్కడ వీస్తున్న చల్లగాలి అలలపైన తేలి వస్తూ , మనసును మైమరపిస్తున్నవి . అలా అనుట కన్నా మనసుకు మైమరపును కానుకగా ఇస్తున్నవి అన్నచో బాగుండును . 

     ఆ శయ్యా మందిరములో దీపము లేదు . : తైలము నిండుకుంది , వత్తి కొండెక్కింది అన్న సమస్యలు లేవు ., జ్యోతిర్లతలు చిన్న చిన్న సూర్య చంద్రుల లాగా అక్కడక్కడా పొదగబడి , కొంచము గాలి తగిలిన చాలు , ఉస్సుమంటే బుస్సుమని పడగలెత్తు పాములవలె , గాలి ఆడితే సహించలేక ప్రజ్వరిల్లునట్టు , సోకిన గాలినే పట్టి మండించునట్టు , సన్నగా సొగసైన దీపపు కణికలను మెరపిస్తూ చీకటిని తినేస్తున్నవి . అంతేనా ,, గాలి వీచినప్పుడల్లా వేలకొద్దీ దీప కణికలు కనిపించి , మందిరమంతా వెలుగుతో నిండి , మందిరాన్ని కప్పిన మేఘము వెండి మబ్బు లాగా కనిపిస్తుంది . 

     అలాగ ఆ వెండి మబ్బు మధ్యలో , తూగుతున్న ఆ హరిత మందిరం లో మేనక తన పూజా మందిరాన్ని కట్టుకుంది . ఆమెకు దానిని భోగమందిరము అనుటకు ఇష్టము లేదు . స్వర్గములో ఉన్న తన రాజ భవనము భోగ మందిరము . ఇది నిజంగా తాను తన దేవుడి పూజకోసము కట్టుకున్న పూజా మంటపము. 

     ఈ దినము మంటపములో ఒక విశేష పూజ జరుగుటకు సర్వమూ సిద్ధముగా ఉంది . ఈ రోజు బహుళ చవితి . ఆమె పూజ సరిగ్గా చంద్రోదయానికి .  మానస సృష్టి చేత కావలసినవన్నీ తెచ్చుకున్నది . అయితే ఒక్కటి కూడా వట్టి కళ్ళకు కనిపించదు . తన దేవుడికి ఒక ఉన్నతాసనమును కల్పించింది . 

     విద్యున్మయమైన మేఘపు ఖండమొకటి శిల్పి పనితనము చేత కాంతి పొగలను కక్కుతున్న  దివ్య రత్నము వలె మెరుస్తూ నిలిచింది . ఏదో ఒక అసాధారణ దివ్య సువాసన ఆ ప్రదేశమంతటా వ్యాపించి నాసికకు మాత్రమేనా , సర్వేంద్రియాలకూ , సర్వాంగాలకూ సొంపైన విందు దొరికిన అనుభూతినిస్తున్నది . 

కానీ ఆ సౌరభము ఎక్కడనుండీ వస్తున్నదో ఎవరికీ అర్థమగునట్లు ఉండదు . 

     అక్కడ ఏ రీతిలో చూసినా ఎక్కడా ఏమీ లేనట్టే ఉన్నా , ఏవేవో గొప్ప కార్యాలు జరుగుతున్నట్టు మనసుకు మాత్రము అర్థమయ్యే ఏదో ఒక విచిత్ర ఉత్సాహము కనబడుతున్నది . 

     అయితే పనిచేయువారు ఎవ్వరూ కనపడరు . చేస్తున్న కార్యమేమిటో కూడా కనపడదు . కానీ అదృశ్య హస్తాలు అత్యంతోత్సాహముతో , అనంత సంభ్రమముతో ఏదో పెద్ద పనే చేస్తున్నట్టు బోధపడుతున్నది .

     హఠాత్తుగా  ఆ తెల్ల మేఘములో ఏదో చలనమైంది . పూలగాలిలో తేలుతూ సాగుతున్న ఒక మేఘము ఏదో పరాకులో ఇంకొక తనవంటి మేఘాన్ని తగిలితే అగునట్లు , మొక్కలో తన ఆనందములో తాను ఓలలాడుతున్న పుష్పము తెలీకుండానే ఇంకొక పుష్పాన్ని తాకితే అగునట్లు , ఆ శృంగార మేఘములో ఒక చిన్న ప్రమాదమైనట్లు , అనుమతి లేకుండానే దీపాలు వెలిగాయి . వాయిద్యాలు తమకు తాముగా పలుకుతున్నాయి . పూలమాలలు కదలుతున్నాయి . మంటపము తల ఊపుతున్నట్లు అయింది . 

     ఇంతవరకూ అదృశ్యముగా పనిచేస్తున్న లలామ ఆ మాత్రానికే , ఆ అల్పాందోళనకే క్షోభ పడి , కోపము పూని చిరాకుగా ఎవరది అని గద్దించింది . ఆమెకు గాభరా. స్వర్గములోని ఇంద్రుడికున్న పరమ సౌభాగ్యాలలో ఒకతె అనిపించుకున్నది , సుమబాణుని లలిత ప్రహరణములలో బహు తీవ్రమైన అస్త్ర రత్నముగా పేరుగన్నది , తాను కొంచము మైమరిస్తే తనను అపహరించుకొని పోవుటకు సిద్ధంగా ఉన్న రాక్షసుల పాలిట పడుటే అని తెలిసినది , అనుకోని ఆ ఆందోళనకు క్షోభ పడితే ఆశ్చర్యమేముంది ? ఏకాంతాన్ని కోరి మాటుగా తన మనోరథాన్ని సిద్ధించుకోవాలని ఉన్న స్త్రీ హృదయము ఏదో అడ్డు వచ్చినదని చిరాకు పడితే అది విచిత్రమెందుకవుతుంది ? 

     కాపలా ఉన్న గంధర్వుడు పొదరింటినుండీ తొంగి చూచు పువ్వు వలె , అక్కడ లేని ఒక తెరచాటు నుండీ తగ్గి , వంగి చూస్తున్నట్టు కనిపించాడు. కనిపించి , చేతులు జోడించి , " మంగళము దేవీ , తమ చెలులు  వచ్చినారు " అన్నాడు . అతని మాట అయిపోవుటకన్నా ముందే , రంభ , ఘృతాచీ లు వచ్చారు . 

     మేనకకు , ’  అయ్యో , వీరెందుకు వచ్చారు ? ’ అని మనసుకు ఏదో శంక కలిగింది . అయినా తన ప్రాణ సఖులు , కాబట్టి , ఎటువంటి శంకా కనిపించని సంతోషపు భావముతో ముందుకు వచ్చి , ఆలింగనము చేసుకొని , చేతులు నొక్కి , పిలుచుకొని వెళ్ళి అప్పటికప్పుడే సంకల్ప సిద్ధమైన మంచము మీద కూర్చోబెట్టింది . అది ఘృతాచీ కి వక్రంగా కనబడక పోయినా , సహజంగా దుడుకుతనమున్న రంభ , " ఇదేమిటి , ఇక్కడున్న ఈ శృంగార మంటపము ఎవరికి ప్రత్యేకము ? " అంది .

     మేనక బెదిరింది . అధికారి ఎదుట నిలిచి , తన సౌజన్యాన్ని వర్ణించుకుంటున్న దొంగ , తాను దొంగిలించి దాచుకున్న వస్తువు తన దగ్గర నుండీ కిందపడితే బెదరునట్లు బెదరి , అంతలోనే తమాయించుకుని , అక్కడున్న పూలగుత్తితో రంభ చెంప స్పృశించి , " నువ్వో ?  నీ కొంటె తనమో ? ఎవరికట ? నీ యజమానికా ? " అంది . రంభ కిల కిలా నవ్వి , " నీ భాగ్యము మాకూ కలగాలని అనుగ్రహమా ?  నీ భాగ్యమునువ్వే ఉంచుకో . కావాలంటే , నీ ప్రాణ సఖి ఈ ఘృతాచీకి పంచి ఇవ్వు . నేను బీద దాన్ని . ఏదో స్వర్గం లో పడి ఉండి , ఇంద్రసభలో కులుకుతూ , నందనవనములో పాడుతూ , దేవ గంధర్వులతో ఆడుతూ , ఒక మూల పడిఉన్న నాకెందుకీ మనుష్యలోకపు జీవన భాగ్యము ? అంతా నీకే ఉండనీ " అంది . 

     మేనక కు  చాపల్యము వదలి మనసు మళ్ళీ స్థిరమైంది . అలాగే అక్కడే ఒక సుఖాసనములో కూర్చుంది . ఒక ఘడియ అన్య మనస్కముగా ఉండి , గంభీరమై , స్థిరంగా ఉన్న చూపులతో , ఏదో దృష్టి లో పెట్టుకుని అన్నట్లు , తల పంకించి అంది , " రంభా , నిజము, నేను కూడా నీ లాగే దేవలోకపు భాగ్యము ఇక ముందు ఉంటుందా అని అడిగాను . అది మరవద్దు . దేవేంద్రుడు నన్ను తనకు తానుగా మోహించి , తన ముద్దుకోసము నన్ను పిలిపించుకుని , మోజు తీరిందో ఏమో , నన్ను అటక ఎక్కించి , " నువ్వు నాకోసము ఒక పని చేయాలి . భూమికి వెళ్ళి నా మిత్రుని ఆరాధించి రావాలి " అన్నపుడు దేవేంద్రుని మూతిని మీటి , " నీకు ఇంకే పనీ లేదా లేక , ఆ పనికి ఇంకెవరూ లేరా ?" అని తిరస్కరించాను . చివరికి ఎంతో బలవంతముగా , దాక్షిణ్యానికి బద్ధురాలనై , మహేంద్రుని మాట మీరలేక , ఇక్కడికొచ్చాను . ఇక్కడ ఎలాగుందో తెలుసా ?  దేవలోకము నన్ను మరచిపోతే చాలు అన్నట్టుంది .  రంభా , నిజంగా మనుష్యులు సుఖ జీవులు . తినుట , తాగుట ఏమీ అవసరము లేక , చేయుటకు ఏ పనీ లేక ,  సోమరి తనము అలముకొన్న దేవలోకానికన్నా , చేయుటకు చేతినిండా పని ఉండి , చేయకుంటే నష్టపోతామన్న మనుష్యలోకమే నాకు బాగుంది . చూడు , ఏనాడైనా నేను నా ఇంటిలో ఏ ప్రభువు వచ్చినా , ఇంత అలంకారము చేసేదానినా ? చూడు .  నా సంగతి సరే , నువ్వే చెప్పు , ఇంద్రుడు నీ ఇంటికి వచ్చినా నీకు ఇంత సంభ్రమము గా ఉంటుందా ? నువ్వే , ఎన్నోసార్లు , ఏదో వచ్చాడు కదా అని తప్పని సరై  లఘువుగా ఆడేదానివి , మరచిపోయావా ? ఈ ఘృతాచీని చూడు , అది ఆ కుబేరుని పుత్రుని వరించి కష్టాలు బాధలు పడింది . ఇప్పుడు అది నా వంతైంది . అయితే  ఇది అనుకూల దాంపత్యము. అంతే తేడా. " 

     ఘృతాచీ నవ్వింది . రంభ , మేనక మాటని ఏదో పరాకులో విన్నదానివలె , నమ్మనిదాని వలె  నవ్వింది . ఘృతాచీ , " అలాగైతే దాంపత్యమో ? "  అంది . తాను అడగ వలెననుకొన్న మాటని ఘృతాచీయే అడిగినట్లు , రంభ కొంటెగా తల నాట్యం చేస్తున్నట్టు ఊపుతూ , కళ్ళెగరేసి , కళ్ళలో ప్రశ్నార్థకం చూపింది .   మేనక ఆ మాట యొక్క సంపూర్ణార్థాన్ని సంపూర్ణంగా , మనసారా ఒప్పుకున్నదాని వలె , " ఔను " అంది . 

     స్నేహితురాళ్ళిద్దరికీ ఆశ్చర్యమైంది . వారిద్దరికీ కూడా మాట పెగలలేదు . సహజంగా సరళమైన స్వభావమున్న ఘృతాచీకి  కానీ , తుంటరిదైన రంభకు కానీ పలుకుటకు మాట రానట్లు , నోటి నుండీ శబ్దమే రాలేనంత ఆశ్చర్యమైంది .

     మేనకే మాట్లాడింది , " చూశారా , అక్కడ దేవలోకములో అందరూ నన్ను ఆరాధించువారే . వచ్చినవారంతా మేనక నచ్చింది అని మేనక ప్రేమభిక్షకై వారంతట వారే వచ్చేవారు . వారి మోహము , మారి మాటలు , చేష్టలు అన్నీ నాకు కోతుల అల్లరి వలె అనిపించేది . అయ్యో పాపం , కొబ్బరి చెట్టుపై నున్న కాయను తల ఎత్తి చూసి వదరే కోతులవలె నున్న వారిని చూస్తే నాకు జాలి తప్ప ప్రేమ ఎక్కడి నుంచీ వస్తుంది ? ఇప్పుడేమైందో తెలుసా ? వల్లనని ముఖం తిప్పుకున్న వాణ్ణి నా జాణతనముతో ఒప్పించి చేతికి చిక్కిన వలపు ఎక్కడ జారిపోతుందో అని , దానిని కాపాడుకోవడము కోసము ఒళ్ళంతా కళ్ళు చేసుకొని , పగలూ రాత్రీ అనిలేకుండా కాపలా కాస్తూ కూచునే భాగ్యము నాకు దొరికింది . చెలులారా , మీరు వచ్చినది , ఈ వలపు కోసము నేను దేన్ని పణముగా పెట్టానో , నా ప్రేమ ఎంత వెలలేనిదో మీకు చూపించాలని నేననుకున్న శుభ ముహూర్తం లో !  శ్రీమంతుడై , వచ్చినవారికి కావాలన్నది ఇచ్చే యయాతి అంతటివాడు భిక్షకోసం చేయి చాపినట్లే , స్వర్గం లో అందరికన్నా మిన్నగా , అప్సరో గణ శిరోమణియైన దాన్ని ,ఈ రోజు విశ్వామిత్రుని , ...ఒక్క మనుష్యుని , ....మీ దృష్టిలో మనకన్నా కింది స్థాయి వాడైననూ , నా దృష్టిలో ఇంతవరకూ ఎరుగని , పుట్టనట్టి దేవతలందరికన్నా పైస్థాయిలో ఉన్నవాడైన  ప్రియతముడి మోహ భిక్షను యాచించడానికి ఈ పెద్ద ఆటను రచించవలసి , రచించాను .

      ఎలాగూ వచ్చారు , మీరు కూడా ఈ ఆటను చూసి కృతార్థులు కండి . ఏ జన్మ పుణ్యమో నాకు ఇప్పుడు ’  మగని ప్రేమను పొందాలి , ఆ ప్రేమ అనేది పొందితీరవలసిన ఒక భాగ్యము ’ అనిపించింది . రంభా , నాకు తెలుసు , నువ్వు కొంటె తనము తో ,  ’ అయ్యో పిచ్చిదానా , పుట్టుకతో చాపల్యము ఉన్నదానివి , నీకా ఈ ఏకాగ్రత ..ఇదంతా నిజమేనా ’ అని హాస్యమాడుతున్నావు . నిజము . తపస్వి సన్నిధానము వలన నా చిత్తానికి సహజ చాంచల్యము తప్పి , హిమాలయము లోని నీరు గడ్డకట్టి నట్లే , నిశ్చలత లభించింది . ఇక నాకు సమయమవుతున్నది . మీరు స్వర్గవాసులు . మీకు కాలము తెలియదు . నేనిప్పుడు మర్త్య లోకపు దానిని . నాకు కాలము ముఖ్యము . ఇదిగో , అప్పుడే సంధ్య కావస్తున్నది . నా పతిదేవుడు వచ్చు సమయము . అతని ఆహ్నికాదులు ముగిసేటప్పటికి చంద్రోదయమవుతుంది . ఆ వేళకు నా పూజ మొదలవుతుంది . ఈ వేళ నేను గెలవకపోతే , ఇంకొక సంవత్సరము వేచి చూడాల్సి వస్తుంది . మీరిద్దరూ ఇక్కడే ఇంకో ఘడియ ఉండండి . అంతా చూసి వెళుదురు గాని " అంది . ఇద్దరూ ఒప్పుకున్నారు . మేఘములో మేఘము చేరునట్లు , ఒక సువాసనలో ఇంకొక సువాసన కలసిపోయి నట్లు , ఒక వెలుగులో ఇంకొక వెలుగు అణగిపోయినట్లు , వారిద్దరూ అక్కడే అదృశ్యంగా నిలిచారు .

Tuesday, July 3, 2012

34. " మంత్ర ద్రష్ట " ముప్పై నాలుగవ తరంగము



ముప్పై  నాలుగవ తరంగము

     విశ్వామిత్రుడు గాభరా పడిపోయాడు . అతడికి , తాను చేయకూడని మహా పాపాన్ని చేస్తున్నట్టు బోధపడింది . దేవేంద్రుని పరమ ప్రియ విలాసినిని కన్నీరు కార్చు దుస్థితికి తెచ్చానని మనసు బెదరింది . తానొక దివ్య స్త్రీని అన్న జన్మసిద్ధమైన అహంకారాన్ని వదలి , మానవునితో మానవ స్త్రీలాగే సరళముగా సంసారము చేస్తున్న సాధు స్వభావమున్న దానిని , ఒక పామరుడివలె , కఠిన స్వభావమున్న వాడి లాగా కలత పెట్టిన  తన విశ్వ మైత్రి నిజమైనదేనా ? అని హృదయము గొప్ప గగ్గోలు పెట్టింది . 

       ఏదైనా చేసి ఆమె దుఃఖాన్ని ఆపాలి . ఆమె కన్నీరు నిలచి , ఆ కళ్ళను మునుపటి లాగా సంతోషముతో తళతళలాడే లాగా చేయాలి అన్న దృఢ నిశ్చయము బుద్ధికి తనంతట తానుగా వచ్చింది . వెంటనే అతని సర్వాంగ , ఉపాంగాలన్నీ ఆ నిశ్చయాన్ని కార్యరూపానికి తెచ్చుటకు సిద్ధమయ్యాయి . అతనికి తెలియకుండానే అతని చేయి ఆమె కన్నీటిని తుడిచింది . ముఖము ఆ ముఖారవిందాన్ని ఆక్రమించి , పెదవి పెదవిని బంధించి , మోహరసాన్ని పెంచి  దుఃఖాన్ని తుడిచేయుటకు ఉరకలతో ముందుకు సాగి , దేహము దేహాన్ని పట్టుకొని గాఢ పరిష్వంగముతో తన సర్వస్వాన్నీ అర్పించాలన్నట్టు ఆలింగనము చేసుకుంది . సృష్టిలోనున్న మగతనము , ఆడతనాలు రెండూ వీరి స్వరూపములు గా మారి  , మరలా ఐక్యము నొందుటకు ఒకదానినొకటి ఆలింగనము చేసుకున్నాయో అన్నంత దృఢమైన ఆ కౌగిలిలో , స్త్రీ తన దుఃఖాన్ని మరచిందో , లేక మగవాడికి దానముగా ఇచ్చేసిందో , లేక దారి తప్పి  స్వతంత్రమై , తన పట్టును సడలించుకున్న భర్తను పట్టులో ఉంచగల  అంకుశము లాగా ఉండనీ అని ఎక్కడో దాచిపెట్టిందో , మొత్తానికి , కారు మబ్బులు కమ్మి ఉరుములూ మెరుపులతో ఆర్భటిస్తున్న వాన కుంభ ద్రోణ వృష్ఠిలాగా కురుస్తుండగా , హఠాత్తుగా కనిపించు ఉత్తరాయణపు ఎండ లాగా , స్త్రీ ముఖము బిగి తప్పి , సడలి , చిరునవ్వు కనిపించింది . 

     బలంగా మీటి , ఒత్తిపట్టి లాగినపుడు నొప్పి కలిగినా హితంగా కావలసిన స్వరాన్నే పలుకు వీణ తంతి లాగా , ఆ విశ్వామిత్రుని బిగి కౌగిలిలో నలిగినా , ఆ పట్టులో సుఖము కనిపించి , గాఢ చుంబనము వలన సంతోషపడి , తన కోరిక ఈడేరునన్న ఆనందముతో ఆ ఇంతి మొగుడిని ఆలింగనము చేసుకొని , వడ్డీని కలిపి ఇచ్చు ఋణగ్రస్తురాలి వలె , తన గాఢాలింగనముతో అతనిని బిగించి , తన సుఖ సంతోషాలను అతడికి తిరిగి ఇచ్చింది . నిజము చెప్పవలెనన్న , ఇద్దరికీ ఒంటిపై స్పృహ లేదు . దేహ యంత్రాలు తాముగా స్వతంత్రించి పనిచేసి ఆనందపడునట్లు కనిపిస్తున్నాయి . 

     ఇలాగే ఇద్దరూ ఎంతసేపు ఒకరి కౌగిలిలో ఒకరున్నారో ! చివరికి సన్నగా చెమట్లు పట్టి ,  దేహాద్యంతమూ వ్యాపించి , చల్లగాలి తగిలి చల్లబడి ,  ఆ గాఢాలింగనపు వేడిని శాంతము చేశాయి . అప్పుడు ఏదో బలవంతాన , ఇష్టములేకున్నను వేరు దారిలేక బయటికి తొయ్యబడో , లాగబడో వచ్చినవారిలాగా , ఇద్దరూ బహిర్ముఖులయ్యారు . వికసించిన దిరిసెన  పువ్వు సువాసననూ , పరాగాన్నీ చల్లుతూ , గాలిలో తేలిపోవునట్లు , చిన్నగా తల ఊపుతూ , తన అంతరంగపు సుఖ సంతోషాలను చల్లుతూ , మేనక అంది , "  దేవా !  ఈ వేళెందుకు ఇంత నిష్టురమయ్యారు ? "

     విశ్వామిత్రుడు మేనక ఎదపైన వాలివున్నాడు . ఆ స్పర్శాసుఖము దేహేంద్రియ మనో బుద్ధుల నన్నిటినీ వ్యాపించి సుఖోన్మత్తమగునట్లు చేసింది . లోగొంతుకతో అన్నాడు , " దేవీ , అహంకారము పెరిగిపోయి , తాను చేసేదే సరియైనది అన్న భ్రాంతి ఉన్నపుడు , ధర్మ స్వరూపము తెలియక , అభిమాన  మోహాలతో మనసు ఆవరింపబడినపుడు ఇలాగే అవుతుంది . ! గృహస్థుడ నయ్యాక ఇచ్చి పుచ్చుకోవడము కూడా  ధర్మానికి ఒక అంగమని మరచాను . అదీకాక , విశ్వానికే మిత్రుడ నయ్యాక , వలచివచ్చిన దానికి మిత్రుడను కాకపోవుట ఉంటుందా ? అని , అది కూడా కాక , ఇప్పుడు నువ్వు నా ధర్మ పత్ని , నువ్వు ధర్మ సూక్ష్మమును చెప్పినా కూడా అప్పుడది నా మనసుకు పట్టలేదు . ఇదిగో , ఈ రోజుతో సరి , ఇక ముందు నీ మాటకు అడ్డురాను . నీకు తోచినట్లు చేయి . ఇకముందు మనమిద్దరం జంట పక్షుల్లాగా ఉందాము . భోగము హితముగనూ , ప్రియముగనూ ఉండాలంటే భర్త భార్యకు తనను ఇచ్చేసుకోవాలి . " 

     మేనక అది విని సంతోషపడింది . లోతుగా ఉన్న నీరు  తేటపడి  స్వఛ్చంగా ప్రసన్నమయినట్టు ప్రసనురాలై , " దేవా , నిజము. ఆడదంటే భోగ దేవి . కానీ భోగము పొందేది మగవాడు . మగవాని సుఖముకోసము తన సర్వస్వాన్నీ అర్పించి అతని సుఖములో తన సుఖాన్ని చూసుకునేదే కదా ఆడతనమంటే ? తన ముఖాన్ని అద్దం లో చూసుకొని సంతోషపడునట్లే , మగవాని సుఖము తనలో ప్రతిఫలించినపుడు సంతోషపడేదే ఈ ఆడజాతి . నేను ఉయ్యాలనై ఊగిస్తాను . నువ్వు అందులో కూర్చొని ఊగు . ఊగుతూ నువ్వు సంతోష పడితే నేను కూడా సంతోష పడుతాను . నేను పండై , పువ్వై , పాటై నిన్ను ఆరాధిస్తాను . నా ఆరాధనతో నువ్వు ప్రసన్నుడవైతే నా పూజ ఫలించినట్లే . నా దైవము నన్ను వలచినట్లే : అని నేనూ సుఖపడతాను . ఈ రోజు నుండీ మా దేవతల పద్దతిలో వ్యవహారము జరగనీ . అపార తపః ప్రభావమున్న నువ్వు కూడా కర్మజుడైన దేవత వలె నాతో విహరించు . సుఖదుఃఖాలు అను చీకటి వెలుగుల మానవ జీవితము ను దాటి సదా సుఖులగు దేవ జీవితమును కొన్ని రోజులు గడుపుదాము . నీకు ఇంద్రుడు మాట ఇచ్చినట్టు ఈ ఆశ్రమ భూమి ఇప్పటి నుండి కొంతకాలము ఒక చిన్న స్వర్గము గా మారనీ  " అంది . మాట మంజులమై , వీణా నాదమువలె హితము గానూ , ప్రియము గానూ , మృదువు గానూ ఉండి మనోహరముగా అనిపించింది . 

విశ్వామిత్రుడు ఒప్పుకున్నాడు.  

Monday, July 2, 2012

33. " మంత్ర ద్రష్ట " ముప్పై మూడవ తరంగము



ముప్పై  మూడవ తరంగము

     సంసార చక్రమొకటి ఆరంభమైంది . దేవలోకపు ఆడది , మానవలోకపు మగవాడితో సంసారము చేయుట ఆరంభించింది . 

     ఆ విచిత్ర జీవనము వికసించిన పూవు వలె లోక విలక్షణమైన కామ ప్రపంచమైనది . మానవ స్త్రీలలాగా ఎందులోనూ మితము గా ఉండక , ఒక్కొక్కదానిలోనూ తాను అనంత సామర్థ్య సంపన్నురాలనని చాటుకుంటున్న స్త్రీ అన్ని విధాలా భర్త మనసును రంజింపజేయాలని ప్రయత్నిస్తున్నది . తన దారిలోనున్న బండను సర్వ ప్రకారములా ఆరాధించి తనదిగా చేసుకొనుటకు సర్వ ప్రయత్నామూ చేస్తున్న నది వలె , మేనక  విశ్వామిత్రుడిని తనవాడిని చేసుకొనుటకు ప్రయత్నాలు చేస్తున్నది . విశ్వామిత్రుడు ఆ స్త్రీసంగమము లో సర్వేంద్రియ సంతర్పణమున్నదని తెలిసినవాడైనా , ఆమెను చూసినపుడు ఎందుకో , ఏమో బెదురుతాడు . 

     ఆశ్రమములో రానురానూ కొంచకొంచంగా ఏదేదో మార్పు అవుతున్నది . చెట్లూ తీగలూ , పుట్టలు పొదలు కొత్తరూపాన్ని సంతరించుకున్నట్టున్నాయి . బొమ్మలతోనూ , రాళ్ళతోనూ మట్టితోనూ  ఆటలాడుతూ సంతోషము మూర్తీభవించిన ఆడపిల్లవలె ఉన్న ఆశ్రమపు స్థిరమైన భావము మారి , దేన్నో దాచిపెట్టుకొని , తన రహస్యమును ఇతరులెక్కడ తెలుసుకుంటారో అని తనలో తాను బెదురుతూ , తనకు కావలసిన ఇష్ట వస్తువు ఏదో తెలియకున్నా , ఇష్టవస్తువొకటి కావాలని ఆత్రంగా కాచుకున్న భావమొకటి వచ్చింది . 

     చెట్టును చూస్తే , తనలోనే గూడు కట్టుకున్న పక్షి తాను కాసిన పండునో పువ్వునో వెదకుతుంటే , ఇదెందుకు , నా రహస్యమును తెలుసుకొంటున్నది అంటున్నట్లుంది . ఆ చెట్టునాశ్రయించిన లతలు , గాలులు తనను పట్టుకొని కులుకులు చూపిస్తే , ఎవరైనా చూస్తారేమోనని బెదురుతో , ఇష్టమైనా కూడా , ఎందుకు భయపెడతావు ? అని ప్రియుడిని ఉరిమి చూసే కామిని వలె కనిపిస్తుంది . పక్షి జంట పండు కొరికి తింటూ , ఆడ , మగ పక్షులు కలసి మెలసి కులుకుతున్నా కూడా , ఏదో చెప్పలేని , చెప్పరానిది కావాలని ఒకదానినొకటి అడుగుతున్నట్టున్నాయి . ఇదివరకూ విరోధభావము కనపడకుండా సజీవమైన మట్టిబొమ్మలా అన్నట్టు సాధుస్వభావముతో ప్రవర్తిస్తున్న మృగాలు ఇప్పుడు , ఆడ మగ కలసి జంటలుగా తమకు ఒక ఏకాంత ప్రదేశము వెదుకుతూ , తమను ఎవరూ మాట్లాడించ కూడదని ముఖాలు గంటు పెట్టుకొని , విడిగా వెళ్ళు మనోభావాలను ప్రకటముగా చూపుతున్నాయి . ...అంతెందుకు , ? ఆశ్రమపు పక్కన ప్రవహిస్తున్న నది కూడా , వెనక్కుతిరిగి చూస్తూ హడావుడిగా వెళుతున్న స్త్రీ వలె కనిపిస్తున్నది . 

     విశ్వామిత్రునికి ఇప్పుడు ధ్యానము కుదురుట లేదు . ఈతరాని వాడు నీటిలో పడితే  , గాభరాతో నీరు మింగి , కన్ను మూసినా తెరచినా చుట్టుపక్కల నీరే చూస్తూ , తాను బయట పడగలనా అని కాళ్ళూ చేతులూ కదలిస్తున్నట్టు , కళ్ళుమూసి ధ్యానానికి కూర్చున్నా , కళ్ళు తెరచి బయటికి చూసినా ప్రతిచోటా ముద్దులు మూటకట్టినట్టున్న  లలన హొయలు చూపిస్తూ ఒక్కసారిగా చూపుల తుంపురులతో ముఖాన్ని కొట్టి వెళుతున్నట్టు భావన . మనసును ఏకాగ్రతతో ధ్యానములో లీనము చేద్దామంటే , చేజారి కిందపడ్డ పాదరసము పటాపంచలై అన్నివైపులకూ జారునట్లు , చేసిన ప్రయత్నము విఫలమై మనో గమనము నానాముఖములై ఎక్కడెక్కడ చూసినా దేవాంగనలనే చూస్తోంది . మనసును నిరోధించి , మరలా పట్టులోకి తెచ్చుకోవాలని ఎంత కుదురుగా కూర్చున్నా , ఆ మనసు అంతే సులభముగా తప్పించుకుని వెళ్ళి వెళ్ళి మేనక ఒడిలోకి చేరుతున్నది . ఇంత కష్టపడి చేసిన ప్రయత్నాలన్నీ వృథా అయినా విశ్వామిత్రుని కెందుకో కోపము రాదు . దీక్షగా ధ్యానానికి కూర్చోవాలన్న పట్టుదల పుట్టనే పుట్టదు . కానీ , ఒక ఆలోచన మాత్రము అప్పుడప్పుడు వస్తుంది . " ఈ దేవతలు మన కన్నా సమర్థులు . సృష్టిలో మనకన్నా ఒక మెట్టు పైనున్నవారు . మనకు తెలీని ఎన్నో విషయాలు వారికి సహజముగానే తెలిసుంటాయి . అవన్నీ తెలుసుకోవాలి ." అని ఒక చిన్న ఆలోచన మేఘ గర్భములో అవ్యక్తముగా తిరుగు మెరుపు వలె , ఒక్కొక్కసారి మెరసి మాయమగుతున్నది .

     మేనక ఇప్పుడు ఆశ్రమపు రాణి . ఆమె అమృతపానము చేసినట్టిది . ఆమెకు భోజన పానీయాలు అవసరము లేవు . ప్రాణారాధన తత్పరుడైన మునికి భోజనము కావాలంటే కావాలి , వద్దంటే వద్దు ..అయినా , మేనక మానవ స్త్రీ లాగా వ్యవహరిస్తున్నది . సంకల్ప మాత్రముననే భోజనమును సృష్టించ గలదైననూ , ప్రయత్న పూర్వకముగా వంట చేస్తుంది . విశ్వామిత్రునికి అది ఒక చోద్యము . స్వర్గలోకములో దేవేంద్రుడు మెచ్చిన వార వధువుగా  ఉన్నది , ఇప్పుడు తానుగా వంట చేయుటకు పొయ్యి ఊది , కళ్ళు ఎర్రబడగా , పెదాలు తడారిపోయి , బడలిపోయి , అలాగే  ఇంటిపనికి అలవాటు అయినది చూసి , " ఈమెకీ వనవాసమేమిటి ? " అనిపిస్తుంది . ఎన్నోసార్లు అడ్డు నిలచి , " వద్దు , ఈ పని చాలించు " అంటే ,  సన్నగా తెరచుకున్న పెదాలతో , తెల్లటి పలువరస మెరుస్తుండగా ఒకసారి నవ్వి , " ఒంటికి కష్టమైనా మనసుకు హాయినిచ్చే పని ఇది  " అంటుంది . ప్రతిసారీ ఆమెకే గెలుపు . ఇతనికే ఓటమి . 

     చివరికి ఇద్దరూ కలసి ఒక ఒప్పందానికి వచ్చారు . హోమకాలములో యజ్ఞేశ్వరుని ప్రార్థించి ఒక ఉపాయాన్ని కల్పించుకోవాలని కూడబలుక్కున్నారు  . అప్పుడే యజ్ఞేశ్వరుడు మేనకకు దర్శనమిచ్చి , " మేనకా , భలే జరిగింది . మానవుని చేయి పట్టి నువ్వు కూడ మానవ కాంతవయ్యావు . జంతువులూ , ప్రాణులూ అన్నీ పుట్టినప్పుడే తమ భోగ సాధనముల నన్నిటినీ వెంట తెచ్చుకుంటాయి అన్న తత్వమును మరచి , మానవులవలె అన్నము కోసము శ్రమిస్తున్నావు కదా !  కల్ప వృక్షమును ప్రార్థించు . నువ్వున్న ఈచోట ఒక వృక్షములో తన అంశని నిలిపి , నీకు కావలసినదంతా ఇస్తుంది " అన్నాడు . 

     మేనక , " దేవా , మన్నించు . చెరువులో నీరు నిండుగా ఉన్నా , ఎప్పుడైతే అది భావిలోకి వస్తుందో , అప్పుడు తన స్వాతంత్ర్యాన్ని పోగొట్టుకున్నట్టు , నేను దేవలోక వాసాన్ని వదలి ఇక్కడికొచ్చాక , ఈ క్షేత్రానికి తగినట్టు మారితే విచిత్రమేముంది ? " అంది . 

     అగ్ని మరల దరహాసము చేసి , " వద్దు , నువ్వు దైవత్వాన్ని వదలి మనిషిగా మారవద్దు . దైవ కార్యము కోసము దైవత్వాన్ని నిలుపుకొని ఉండు . అలాగని , మానవాతీతమై పతి నాశకివి కావద్దు . మానవ స్త్రీవై అల్ప బుద్ధివి అయితే దేవకార్యము చెడును . అలాగని , నీ అతి ప్రజ్ఞ చేత దేశ , కాల ధర్మాలను అతిక్రమించినా దేవకార్యము జరగదు . కాబట్టి , ఫలభారముతో వంగిన తీగలాగా , నువ్వు వివేకముతో వ్యవహరించి , కాయ పండగునట్లు ప్రవర్తించు " అని పలికి అంతర్ధానమయ్యాడు . 

     మేనక లేచి , భర్తకు నమస్కారము చేసి , " దేవా , నాకు జన్మతః ప్రాప్తమైన కొన్ని ప్రభావాలున్నాయి . అనుమతి అయితే , వాటిలో ఒకదానిని ప్రయోగించి , ఈ చెట్లలో ఒకదానిలో కల్పవృక్షపు అంశాన్ని ఆరోపిస్తాను . సంకల్పము చేతనే సర్వమునూ ఇచ్చు స్వర్గ మహీరుహము వలెనే , ఇది కూడా మనకు కావలసినదంతా ఇస్తుంది . " అని విజ్ఞాపన చేసింది . 

     విశ్వామిత్రుడు అది విని నవ్వాడు , " దేవీ , నిజమే . నువ్వు జన్మ వలన నాకన్నా ఉత్తమురాలవు . నేను మానవుడిని . నువ్వు దేవి . అయినా నువ్వు నా ఇంతివి . ఎంతైనా , నువ్వు నా పోష్య వర్గానికి చేరినదానివి . నేను చక్రవర్తిగా ఉండినవాడను . ఇప్పుడు బ్రాహ్మణుడవ్వాలని ఉన్నవాడను . స్త్రీ విత్తమువల్ల జీవనము చేయుట పాప వృత్తి . ధర్మము కాదు . నేను దాన్ని ఎలా ఒప్పుకోగలను ? " అన్నాడు . 

     మేనక ఒక ఘడియ అవాక్కైంది . తాను దేవతయైననూ , తన ప్రభావముతో అతని మనస్సును దారంలా మార్చి , తన సంకల్పానికి అనుగుణముగా నడచుకొనునట్లు చేయగలిగినదైననూ , ధర్మ , అధర్మాల సంగతి యని బెదరి , వెనక్కు తగ్గింది . ఏం చేయాలి ? అనుకున్నది . తన ప్రజ్ఞా బలముతో చూచి , అంది , " దేవా , ఎదురు మాట్లాడి ఆయాసపడేలా చేస్తానేమో అని బెదురుగా ఉంది . తమ అనుమతి అయితే ధర్మాన్ని గురించి రెండు మాటలు చెప్పనా ? " అంది . 

     విశ్వామిత్రునికి ఆశ్చర్యమైంది . అయినా , అప్సరసలకు విచిత్రమైన ఒక మేధా శక్తి ఉంటుందని తెలిసిన అతని మనసు , " అలాగే , ఆమె ఏమి చెబుతుందో చూద్దాము " అని ఆమె మాట వినుటకు సిద్ధమై , " కానివ్వు "  అన్నాడు . 

     మేనక చెప్పింది , " దేవా , ఆడది మానవుని పోష్య వర్గానికి చెందినదన్నది నిజమే అయినా , ఆమె అతని ఆస్తి అన్నది మరువరాదు . గర్భవతి యైనదానిని పెళ్ళిచేసుకొనువాడు , గర్భములో ఉన్న బిడ్డను తన బిడ్డ అని ఒప్పుకొని ,  వాడిని సహూఢపుత్రుడుగా ( భార్యతో పాటూ కొడుకును కూడా  పొంది )  పరిగ్రహించునట్లే , ప్రభావ సంపన్నురాలైన దాన్ని పెళ్ళి చేసుకున్నవాడు ,  ఆమెకు పతి యైనట్లే , ఆమె ప్రభావాలకు కూడా పతి అవుతాడు కదా ? గోవును కొన్నవాడు పగ్గాన్ని తిరిగి ఇచ్చేసినట్టు , నువ్వు నన్ను వివాహమాడి నాదగ్గర ఉన్న ప్రభావాల నన్నిటిని వెనక్కు తిరిగి ఇవ్వలేదు . అంతేకాక , నేను నిన్ను వరించినది ఇంద్రుని అనుమతి తోనే . నేనేమీ శాపగ్రస్తురాలనై మానవలోకానికి రాలేదు కాబట్టి నా ప్రభావాలను వదలిరాకుండా నాతోనే తెచ్చుకున్నాను . ఇన్ని రోజులూ నాయంతట నేను వాటిని ఉపయోగించకూడదని ఊరికే ఉన్నాను . ఈ దినము నువ్వే యజ్ఞేశ్వరుని ప్రార్థించి సాధనము నొకదానిని పొందాలని అనుకున్నావు . యజ్ఞేశ్వరుడే ,  దేవతయైన నన్ను నీదానినిగా చేసినపుడు , నా ప్రభావాలన్నీ నీవి కాలేదా ? రుద్ర ప్రసాదాన్ని స్వీకరించినట్లే , ఆపోదేవి అనుగ్రహాన్ని అంగీకరించినట్లే , నా ప్రభావాలను కూడా ఇప్పించుకో ." 

     విశ్వామిత్రుని మనసుకు  ఆమె ఆలోచనా సరళి శుద్ధముగా ఉన్నదని అర్థమైంది . అన్నాడు , " మేనకా , నువ్వు చెప్పినది ధర్మ సమ్మతముగానే ఉంది . ధర్మమును తెలుసుకొనుట కష్టము . బుద్ధికి ఎన్నడూ అది గోచరమైనది లేదు . కాబట్టి మనకు తెలిసినంతవరకూ సకారణముగా విచారము చేసి ఒక సిద్ధాంతానికి రావాలన్న సాధు సంప్రదాయానికి అనుగుణముగానే నువ్వు కూడా సకారణముగా నీ సిద్ధాంతాన్ని ప్రస్తావించావు . దానిని ఒప్పుకోరాదనుటకు నాకు ఏ కారణమూ కనిపించుట లేదు . కాబట్టి దానిని ఖండించుటకు నాదగ్గర మాటలు లేవు . అయినా , మన పెద్దలు ఎవరూ ఈ విధముగా చేసి ఉండలేదన్నది ఒకటి .: ఈ సిద్ధాంతాన్ని అంగీకరిస్తే ఫలము  నాకు వస్తుంది కాబట్టి , దీనిని ధర్మమని అంగీకరించుటలో , నాకు తెలీకుండానే మానవ సహజమైన ప్రలోభము ప్రవర్తిస్తుందేమో అన్న భీతి ఇంకొకటి : దీనిని అంగీకరించుటలో నాకు ఆత్మ తృప్తి లేదనునది మరొకటి : ఇలాగ మూడు కారణాల చేత ప్రస్తుతానికి నీ సిద్ధాంతాన్ని అంగీకరించకపోతే కోప పడవద్దు . నీ ప్రభావముతో నా మనసును జడముగా చేసి , నీమాటను ఒప్పుకొనునట్లు చేయవద్దు . ఇంద్రుడు కూడా , " స్వర్గానికి వచ్చుట లేదన్న , స్వర్గాన్నే నీ వద్దకు వచ్చునట్లు చేస్తే ఏమి చేస్తావో చూద్దాము " అన్నది జ్ఞాపకము ఉంది . స్వర్గవాసిని ఒకతె వస్తే స్వర్గమే వచ్చినట్టా ? అలాగే నువ్వొస్తే నీ ప్రభావాలు వచ్చినట్టు కాదు . కానీ ఆగు . అలాగే కావాలంటే , త్రిశంకువును స్వర్గానికి పంపించిన ప్రభావము నాలో ఇంకా కొంతైనా ఉండాలి కదా . దానిని ఉపయోగించుకుందాము . చివరికి పరిస్థితి అలా గనక వస్తే అప్పుడు నీ ప్రభావాన్ని తీసుకుంటానులే " అన్నాడు . 

     మాట మృదువుగా , హృదయానికి హత్తుకొనేలా , ఆత్మ విశ్వాసముతో , పక్షిని పట్టుకొన్న వాడు దానికి నొప్పికాకుండా పట్టుకున్ననూ , పట్టు మాత్రము బిగువుగా ఉన్నట్టు, వినుటకు ప్రియంగానే ఉన్నా , కపి ముష్ఠిలాగా దృఢంగా ఉంది. 

     మేనక ఆమాటలు వింటూనే కొంతసేపు నిశ్చేష్టురాలైంది.  సన్నగా ఏడుపు మొదలై , చివరికి వల వలా ఏడ్చింది . దేవతయై , సంతోష సాగరములో ఈదుతున్నామె , ఏడుపును చూసి కూడా ఉండలేదు, వినికూడా ఉండలేదు . మనస్తాపము అన్నదానినే ఎరుగనిది . తన జీవితములో తాను చేయవలసిన పని కాకపోవుట అంతవరకూ చూడలేదు . తన మొదటి ఆశా భంగములో చిన్నపిల్లలా ఏడిస్తే అందులో విశేషమేముంది ? మానవ లోకానికి వచ్చాక మానవుని సహజ గుణమైన ఏడుపును ఎలా తప్పించుకోగలదు ? ఏడ్చుటకు రాకున్నా , ఆమె స్త్రీ స్వభావమే ఆమెను ఏడ్పించింది .