25. ఇరవై ఐదవ భాగము-- ఉపనయనము --1
చైత్ర శుద్ధ చతుర్థిన దేవరాతుని ఇంట్లో దేవతా సమారాధన. రాజధానిలోనున్న సర్వులకూ సంతర్పణ ఆహ్వానము వెళ్ళింది . "బ్రాహ్మణ భోజనము అయినవెంటనే రాజువారికి వర్తమానమును పంపవలెను . అంతవరకూ మహారాజులు ఉపవాసముతో వేచియుంటారు " అని భార్గవుడు అందరినీ తొందర చేయుచున్నాడు .
సకాలములో బ్రాహ్మణులు భోజనానికి కూర్చున్నారు . రాజ భవనమునకు ఆచార్యుడూ , భార్గవుడూ స్వయముగా వెళ్ళి చెప్పి వచ్చినారు . ఆ దినము సూర్యుడు దిగే సమయమునకు వైశంపాయనులు , ఉద్ధాలకులు , బుడిలులూ , భార్గవులూ , దేవరాతులూ అందరూ ఒక చోటికి చేరినారు . ఎక్కడో ఉన్న మహిదాసులను కూడా పిలిపించుకున్నారు . ఆరు మందీ కూర్చొని , మరుసటి దినము చేయవలసినదానిని గురించి ముచ్చటించుకుంటున్నారు .
దేవరాతుడు ప్రసన్నముగా నవ్వుతూ , " బుడిలులు పురోహితులన్న తర్వాత యజమానుని భారము తగ్గిపోయింది . మీరు చెప్పినట్లు చేస్తే చాలు , అంతే కదా ? " అన్నాడు .
బుడిలులు అతని నవ్వుకు ఉత్తరముగా ఒక నవ్వు నవ్వినా , గంభీరముగా , " ఏమయ్యా , కలియుగపు బ్రాహ్మణుల వలె అంతటినీ పురోహితుల నెత్తిపై వేస్తానంటున్నావే ? అలాగ కారాదు . ఇక్కడ ఎంతైనా , నువ్వు యజమానుడవు . నేను నీ ఋత్త్విజుడను . కాబట్టి , రేపు జరగవలసినదంతా ఈ దినమే నిర్ధారించుకో . ఇది తర్క పాదము కాదు , క్రియాపాదము . ఏమంటావు ? " అన్నారు .
వైశంపాయనులు అన్నారు , " సరే , ఆచార్యా , బుడిలులు అనుజ్ఞనిచ్చినారు , సరిపోయింది . ఏదో మొక్కుబడిగా , తూతూ మంత్రముగా ఉపనయనమని చేసి , మంత్రములు చెప్పి , కర్మము ముగించుట ఒక విధము . అయితే , మాతా పితరుల నుండీ వచ్చిన జన్మమును శుద్ధి చేసి , ఇంకొక మంత్ర జన్మమును ఇచ్చి , తల్లిదండ్రుల వంశములు రెండింటినీ ఉద్ధారమగునట్లు చేసి , వటువును కూడా ఉద్ధరించుట మన పద్దతి . నువ్వు అధ్వర్యుడవై వచ్చినపుడు , దేవతా సాక్షాత్కారము చేసుకొని , హోమము చేసి దీక్షితుడిని ఉద్ధరించుట కన్నా ఎక్కువ కార్యమిది . "
ఉద్ధాలకులు అన్నారు : " ఇది, ఎంతైనా , వటువు రెండవ జన్మ యెత్తు సందర్భము . మీరు కూడా , తెలిసినవారు , ఆస్తికులు , శ్రద్ధావంతులు . కాబట్టి పూర్వభావియై , ఏమేమి చేయవలెనో తెలుసుకొని ఉండండి , తప్పేమి? "
దేవరాతుడు భార్గవుని ముఖము చూచినాడు . అతడు మహిదాసునికి సైగ చేసి చూపించినాడు . మహిదాసుడు తలయెత్తి చూసి , తనవైపుకు చూస్తున్న ఆచార్యుని చూసి , " అవశ్యము , పెద్దవారు చెప్పినది సరిగ్గా ఉంది " అన్నారు . ఆచార్యుడు సమాహితుడై కూర్చున్నాడు .
ఆ వేళకు మహిదాసుని కొడుకు శాండిల్యుడు వచ్చినాడు . మహిదాసుడు వాడిని పిలచి బుడిలుడు మాట్లాడుతున్న విషయమును చెప్పి , " కూర్చో , విను , ఈ మహానుభావుల మాటలు వినే భాగ్యము మరలా ఎన్నటికో " అన్నాడు .
బుడిలులు ఆరంభించినారు : " ఇది , అంటే ఈ ఉపనయనము అనేది , అగ్ని, వాయు , ఆదిత్యుల తేజస్సును సంగ్రహించు కార్యము . దేహములో అగ్ని , వాయు , ఆదిత్యులు ఉన్నారు . నోరు , నాసిక , కన్నులలో వారు ఉండి వ్యాపారమును చేయుచుండుట యే కొద్ది మందికో తప్ప ఎవరికీ తెలియదు . ఈ ముగ్గురే భౌతిక ప్రపంచములో భూమి , అంతరిక్ష , ఆకాశములలో ఉన్నారు . ఈ ముగ్గురు దేవతల అనుగ్రహమును తండ్రి కొడుకుకు సంపాదించి ఇచ్చు సంస్కారము ఈ ఉపనయనము . ఉపనయనమైన వెంటనే వటువు స్వతంత్రుడగును . స్వయముగా అగ్ని , వాయు ఆదిత్యులను ఆరాధించువాడగును . రేపటి దినము మొదటి పని అగ్నిని ఆరాధించుట. రెండవది , ప్రాణమునకు పదే పదే వచ్చి ఆవరించు అశౌచమును పోగొట్టుటకు ఆచమనము చేయుటను నేర్పుట. మూడవది , ఆదిత్యుని చూపించి , అతని సావితృ కిరణమును సంగ్రహించి దానిని హృదయము నందు నింపుకొనుట . ఈ ముగ్గురు దేవతలను వేరే వేరే అనుకొని కర్మ చేసి కృతకృత్యుడయితే కర్మకాండలో కృతార్థుడగును . వీరంతా ఒకరే అనుకొని చేస్తే జ్ఞాన కాండమగును . ఇలాగ , రేపటి దినమున జరగబోవు కార్యము , కాండద్వయమునకు బీజమును ఆపాదించునది . "
శాండిల్యుడు లేచి బుడిలులకు నమస్కారము చేసినాడు . : ఈ మాటలన్నీ మాకు ఏదో ఒక రీతిలో పరిచితములే . అగ్ని , ఆదిత్య , వాయువులు మేము అహర్నిశలూ అనుసంధానము చేసుకొను దేవతలు . వారిని వేరే వేరేగా చూచుట , ఒక్కటిగా చూచుట , ఇది మాకు అర్థముకాని విషయము . కాబట్టి నామీద కృపతో దీనిని ఇంకొంచము వివరముగా చెప్పండి " అని ప్రార్థించినాడు .
బుడిలులు అటులనేనని తలయూపి చెప్పనారంభించినారు : " ఈ ఉపనయనము చేసుకున్నవాడు ద్విజుడవుతాడు . గురు , వేద , వ్రత , దేవతా సామీప్యమును పొందును . ఈ ఒక్క కర్మలో మాత్రమే , ఆచార్యుడు , శిష్యుడూ ఇద్దరూ కర్మాధికారులుగా ఉండునది . ఆచార్యుడు కావలసినవాడు పన్నెండు వేలసార్లు గాయత్రీ మంత్రజపము చేస్తేనే , అతడికి శిష్యునికి ఉపదేశము చేసే అధికారము వచ్చేది . కాబట్టి మన ఆచార్యులు మొన్నటినుండీ పట్టుదలతో కూర్చొని , పన్నెండు వేల సార్లు గాయత్రి జపము చేసినారు . రెండవది , ఆచార్యుడూ , శిష్యుడూ ఇద్దరూ కృఛ్రమును - అదికూడా మూడు సార్లు - చేసుకోవలెను . ( కృఛ్రము అంటే , మూడు దినములు పగటి పూట మాత్రమే , మరి మూడు దినములు రాత్రి పూట మాత్రమే భోజనము చేసి, ఇంకో మూడు దినములు అయాచిత భోజనము చేసి , తరువాత మూడు దినములు ఉపవాసముండుట. దీనినే సాంతపన వ్రతము అని కూడా అంటారు ) ఆచార్యుడు అజ్ఞాతముగా సంభవించిన పాపపు ప్రాయశ్చిత్తముగాను , శిష్యుడు కామాచారము , కామమైన కామ భక్షణాది దోషములకు ప్రాయశ్చిత్తముగానూ !. తరువాత , దేవతలనూ , పితరులనూ పూజించి , వటువుకు చౌల భోజనములను చేయించి , ఆచార్యుని వద్దకు సుముహూర్తములో పిలుచుకు వస్తారు . అనగానేమి ? ప్రాణమునకు అన్నమునిచ్చి , దానిని సంతృప్తి పరచిన తరువాతనే మిగిలిన కార్యక్రమము . ఇదంతా అర్థమయిందా ? "
" అయింది , తరువాతివి అనుజ్ఞనియ్యవలెను . "
" అనంతరము ఆచార్యుడు శిష్యుడి కోసమై హోమము చేయుటకు లౌకికాగ్నిని తెప్పించి దానిని మంత్రాగ్నిగా చేయును . దానిలో హోమము చేసి వటువుకు కౌపీన ధారణము చేసి , వాడికి రెండవ జన్మ రానియ్యమని , మాతృ గర్భమునందున్న ఉల్బము ( మాంసపు తిత్తి ) ను పోలియుండు కొత్త బట్టలను ధరింపజేసి , కప్పును . అప్పుడు చెప్పు మంత్రములకు దేవతలు ఎవరో తెలుసా ? మిత్రావరుణులు . మిత్రావరుణులంటే ఎవరు ? పగటికీ , ప్రాణవృత్తికీ దేవత మిత్రుడు ( సూర్యుడు ) . రాత్రికీ , అపాన వృత్తికీ దేవత వరుణుడు . అంటే , రాత్రింబగళ్ళనూ ప్రాణాపానములనూ అనుసంధానము చేయునది ఈ కౌపీన వస్త్ర ధారణ..... ఆ ? "
" అనంతరము యజ్ఞోపవీత ధారణము . యజ్ఞోపవీత ధారణ మంత్రమునకు అధిదేవత ఆ పరమాత్మయే ! ఆ మంత్రపు అర్థమేమి ? " ఓ యజ్ఞోపవీతమా ! మమ్మల్ని అవిద్యాది దోషములనుండీ తప్పించు . నువ్వు ప్రజాపతితో పాటూ పుట్టినవాడవు . మమ్మల్ని , యజ్ఞ స్వరూపుడైన విష్ణువు వద్దకు పోవునట్లు చేయి . బలిష్ఠుడవైన నిన్ను ధరించుట వలన నాకు బ్రహ్మ వర్ఛస్సు లభించనీ ! అని దాని అర్థము . తరువాత , ఆచమనము . ఆచమనము అంటే ఏమిటి ? ప్రాణమును కప్పుకొనుట / రక్షించుకొనుట . అంటే , ప్రాణానికి సంజీవని వంటిది ఆచమనము . ఆ తరువాత , తన కుడిచేతిని పట్టుకొని తనను నడిపించవలెనని , పవమానాగ్ని , ప్రజాపతులకు హోమము చేయును . అంటే , అగ్నిని గురించి , ప్రాణాగ్నుల జనకుడైన విరాట్పురుషుడిని గురించి హోమము చేయును . అర్థమైనదా ? "
" అప్పుడు ఆచార్యుడు , సూర్యాత్ముడూ , అగ్న్యాత్ముడూ యై , తన ముందున్న కుమారుడు శుచి కావలెనని సూర్యదేవతా ప్రీతి కోసము అంజలి క్షాళనము చేయును ( చేతులు కడుగును ) . అప్పుడు చెప్పే మంత్రపు అర్థము ఏమిటి ? ’ మేము సవితృదేవుని వైపు వారము . శ్రేష్ఠమూ , సర్వమునూ ఇచ్చునదీ , శత్రు నాశకరమూ అయిన ఆతని ధనమును పొందెదము గాక " అని . ఇక్కడ శత్రు నాశకరము అంటేనేమి ? శత్రువంటే కామము . కామము లేకుంటే పూర్ణము కాగల చేతనమును , కామము అపూర్ణము చేయును అన్నతర్వాత , ఇక కామమున కన్నా పెద్ద శత్రువుంటుందా ? ఈ మంత్రమును చెప్పి, తన పాత్రలోని నీటిని వటువు పాత్రలోకి , వటువు చేతులనుండీ ఆచార్యుడు వదలును . దీనివలన ఏమగును ? ఆచార్యుని దేహములోనున్న శక్తి నీటి ద్వారా వటువును చేరును . అప్పుడు వటువు దానిని గ్రహణము చేసి శిష్యుడగును . అలాగ , అప్రత్యక్షముగా సిద్ధమైన శిష్యత్వమును ప్రత్యక్షము చేసుకొనుట హస్త గ్రహణము . అది కూడా అటులనే ! సవితృ దేవుని అనుజ్ఞతో అశ్వినీ దేవతల బాహువులనుండీ , పూషుని హస్తములతో, " హే , ఇంతటి దేవా , నీ హస్తమును పట్టుకొనెదను " అని మంత్రము . మరలా రెండు సార్లు పాత్రలో నుండీ నీరు దోసిళ్ళతో శిష్యుడి పాత్రకు వదలినపుడు " సవితృడు నీ హస్తమును పట్టుకున్నాడు . అగ్ని నీకు ఆచార్యుడైనాడు " అని చెప్పును . దీన్ని క్రియాపదము అంటారా ? లేక పొద్దు గడుపుటకు ఆడే మాటలంటారా ? "
ఈ సారి మహిదాసుడు మాట్లాడినాడు , " అగునా మరి ? ఆచార్యుడైన వాడు తనలో అశ్వినులనూ , పూషుడినీ , అగ్నినీ ఆవాహించుకోక పోతే ఈ శిష్యత్వము సిద్ధమగునా మరి ? కాబట్టి ఇది క్రియా పదమే , సందేహము లేదు ".
బుడిలులు కొనసాగించినారు : " అనంతరము వటువును వ్రతపతియైన ఆదిత్యునికి ఇచ్చెదను అని సంకల్పించి , ఆచార్యుడు వటువును ఆదిత్యునికి చూపి , " సవితృ దేవుడా ! ఈ బ్రహ్మచారి నీవాడు . వీడిని కాపాడు ’ అని వటుదానము చేయును . అనంతరము శిష్యాచార్యులు ఇద్దరూ అగ్ని వద్ద పరస్పర అభిముఖముగా నిలచి , ఆచార్యుడు ’ నువ్వు భాస్కరుడి బ్రహ్మచారివి . ప్రాణుడి బ్రహ్మచారివి . భాస్కరుడు భాస్కర రూపుడవైన నిన్ను ఉపనయనము చేసినాడు ( తనవద్దకు చేర్చుకున్నాడు ) ఆ భాస్కరుడికి నిన్ను ఇచ్చెదను " అని ప్రతిజ్ఞ చేయును . తదనంతరము , వాడిని ’ శ్రేయస్వి యవనీ ’ అని పూర్వాభిముఖముగా చేసి ’ ధీరులూ , కవులూ అయినవారు మనఃపూర్వకముగా వీడిలో దేవతలు ఉండునట్లు చేసి రెండవ జన్మను ప్రసాదించగలరు ’ అని వాడి భుజములను తాకి , తరువాత వాడి హృదయమును తాకును . తాను భుజముల ద్వారా అనుగ్రహించిన దేవతాంశములు వాడి హృదయములో ఎప్పటికీ నిలచి ఉండనీ అని దాని రహస్యము .
" అప్పుడు ఆచార్యుడు కుమారుడిని దక్షిణములో కూర్చోబెట్టుకొని వాడిచేత అగ్ని కార్యమును చేయించును . వటువు అగ్ని దేవునితో , " ఓ జాతవేదుడా , అనగా , పుట్టినపుడే సర్వమునూ తెలిసికొనియే పుట్టు అగ్ని దేవుడా ! నేను నీకు సమిధలను ఆహుతినిచ్చెదను . నువ్వు సమిధల వలన వర్ధిల్లునట్లే , మనము -గుర్తుంచుకో , ’ నేను ’ కాదు , -మనము బ్రహ్మవర్ఛస్సు తో , అనగా ధ్యానముతో వర్ధిల్లెదము . " అని సమిధాదానము చేయును . అనంతరము అగ్నికి అరచేతులను చూపించి , మూడు సార్లు , నీ తేజస్సు నాకు కూడా రానీ ! యని తన ముఖమును తుడుచుకొనును . అక్కడ కూడా ఒక రహస్యముంది . అగ్ని , వాయు , ఆదిత్యులు ముఖ , నాసిక , చక్షువులలో ఉందురు . అగ్నియొక్క తేజస్సు ఆ ముగ్గురిలోనూ కనపడనీ ! యని ఒక అభిప్రాయము . "
అంతా తలలూపారు. బుడిలులు మరలా , : అనంతరము అగ్నిని ఉపస్థానము చేసి , అనగా లేచి నిలబడి స్తుతి చేసి ’ నాకు మేధనూ , ప్రజ్ఞనూ ఇవ్వు . అగ్ని తన తేజస్సునూ , ఇంద్రుడు ఇంద్రియమునూ , సూర్యుడు ప్రకాశమునూ ఇవ్వనీ ! . హే అగ్ని దేవుడా ! నీ దయవలన నేను తేజస్విగనూ , వర్ఛస్విగనూ , హరస్విగనూ , దానపాత్రుడిగనూ ( దానమునకు అర్హుడు ) కానిమ్ము . ’ అని ప్రార్థించి అనంతరము రుద్రుడిని రక్షణార్థము వేడుకొనును . రుద్రుడనగా మరేమిటో , మరెవ్వరో కాదు , ’ ప్రాణానాం గ్రంధిరసి రుద్రః’. ప్రాణములు ఒకదానినొకటి సంధించిన వెంటనే చెలరేగిపోవును . అదే రుద్రుడు . మన ఇంద్రియముల నుండీ బయలువెడలు వృత్తులన్నీ ప్రాణములే . మనము కార్యాంతరములో నున్నపుడు మనసు అందులో నిమగ్నమై ఉన్నందువలన , వృత్తులు మననుండీ బయటికి వెదజల్ల బడుతున్నది మనము చూడలేము . అలా చూచినవారికి రుద్ర దర్శనమగును. ఆ రుద్రుడు పుట్టిన వెంటనే , ’ దేనిని చంపవలెను ? , దేనిని ఘాతము చేయవలెను ? ’ అనియే కార్యోన్ముఖుడగును . కాబట్టి ఆ రుద్రుడిని , " ఓ రుద్రా ! , మా పిల్లలను , మనవలనూ చంపవద్దు , మా గోవులను , అశ్వములనూ చంపవద్దు . మా వీరులను చంపవద్దు . నీకు హవిస్సులను ఇచ్చి ప్రసన్నుడిని చేసుకొనెదము ’ అని రుద్రుని నుండీ రక్షా యాచన చేయును . అక్కడ రక్షను తీసుకొని యథా స్థానములలో ఉంచుకొనును . "