SHARE

Wednesday, March 12, 2014

4. ఔపాసన -- నాలుగవ భాగము - పునస్సంధానమ్


    ఔపాసన నాలుగవ భాగము - పునస్సంధానమ్


         ఈ పునస్సంధానమును అగ్ని నష్టమయిన ప్రతిసారీ , మరలా ఔపాసన చేయుటకు ముందర , అధికారము కొరకు చేయవలెను.

ఇప్పుడు పునస్సంధానము పద్దతి ( చతుష్పాత్ర ప్రయోగము ) చూద్దాము.


ఉదయము సంధ్యావందనము ముగించి , శుచుడై మడిబట్టలతో , రెండుసార్లు ఆచమనము చేయవలెను.( ఓం కేశవాయ స్వాహా .... కృష్ణాయ నమః ) 
తర్వాత ( వీలైన పవిత్రమును ధరించి, ) ప్రాణాయామము చేయవలెను. ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః , పరమాత్మా దేవతా, దైవీ గాయత్రీ ఛందః ..( ఓం భూః...భూర్భువస్సువరోమ్ )

సంకల్పము :  మమ ఉపాత్త -----ప్రీత్యర్థమ్ , అస్మాకం సహ కుటుంబానామ్ క్షేమ స్థైర్య , వీర్య , విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృధ్యర్థమ్ , ధర్మార్థ , కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థమ్ , అంతరతః ఔపాసనాగ్నే సద్యః పునస్సంధాస్యే | తతః స్థండిల ఉల్లేఖనాద్యగ్ని ప్రతిష్టాపనం కరిష్యే |

యత్రాగ్నిస్థాప్యతే , తత్ర సికతాభిర్మృదావాస్థండిలం చతురస్రం కృత్వా || అరత్ని మాత్రం ||

        అగ్నిని ప్రతిష్ఠించు ఒక పరిశుద్ధమైన ప్రదేశములో అరత్ని మాత్రం అనగా, పిడికెడు తక్కువ మూరెడు పొడవు , అంతే వెడల్పు గల చతురస్రాకారం గల అరుగు మట్టితో కానీ , ఇసుకతో కానీ చేయవలెను. ఈ కాలము దీనికి బదులు ఇనప కుండమును లోపల ఇసుక వేసి వాడుతున్నారు. కొందరికి అది నిషిద్ధము. అవకాశమున్నవారు ఇటుకలతో ఒక కుండమును శాశ్వతముగా చేసుకోవచ్చును. ఆ కుండమునకు పశ్చిమమున , తూర్పుకు తిరిగి కూర్చోవలెను. 

తస్యోపరి తండులైః పిష్టేనవా ప్రాదేశమాత్రం చతురస్రం కృత్వా || 

ఆ మట్టి అరుగుపైన బియ్యమును కానీ బియ్యపు పిండిని కానీ చతురస్రముగా నింపి పరచవలెను. 

అంగుష్ఠానామికాభ్యాం , ద్వౌ, త్రయో వా దర్భాన్ గృహీత్వా | సంతత మృజూర్దక్షిణత ఆరభ్య ఉదక్సంస్థాః ప్రాచీస్తిస్రో రేఖా లిఖిత్వా | తాస్వేవ రేఖాసు పశ్చిమత ఆరభ్య ప్రాక్సంస్థాః ఉదీచీస్తిస్రో రేఖా లిఖిత్వా |

        తర్వాత బొటనవేలు ,  ఉంగరపు వేళ్లతో రెండు లేక మూడు దర్భలు తీసుకొని , దానిపై ఆ దర్భ మొదళ్ళతో ( అగ్రములు కాదు ) పడమటి నుండీ తూర్పుకు మూడు నిలువు గీతలు గీయవలెను. ఆ గీతలు మొదట అరుగుకు కుడివైపునకు అనగా దక్షిణము వైపున మొదలుపెట్టి, రెండోగీత మధ్యలోనూ , చివరి గీత ఎడమ వైపు అనగా ఉత్తరమునకు ఉండవలెను. మరలా ఆ రేఖల పైన ఇప్పుడు అడ్డముగా , అంటే దక్షిణము నుండీ ఉత్తరానికి , మొదట పశ్చిమమునుండీ మొదలు పెట్టి ఒకటి , తర్వాత దానిపైన  మధ్యలో ఒకటి , మూడోది తూర్పుకు మూడోది గీతలు గీయవలెను. 






          ఉల్లేఖన దర్భానాగ్నేయ్యాం నిరస్య | అప ఉపస్పృశ్య | అవాచీనేన పాణినా అద్భిరవోక్ష | శ్రోత్రియాంగారాదగ్నిమాహృత్య | ఆయతనే విధినాగ్నిమ్ భూర్భువస్సువరోం ఇతి ప్రతిష్ఠాప్య | అగ్న్యానయన పాత్రయోరక్షతోదకం నినీయ ||----

ఉల్లేఖనము చేసిన ఆదర్భలను కుండము బయట ఆగ్నేయానికి వేసి , నీటితో చేతులు తుడుచుకొన వలెను. 

         ఆ గీతలపైన కుడిచేతితో నీటితో అవోక్షణము చేయవలెను. అవోక్షణమనగా  అరచేతిని బోర్ల వచ్చునట్టు పెట్టి నీటిని చిలకరించుట.చేతిలో మిగిలిన నీటిని తూర్పుకు కానీ ఉత్తరానికి కానీ వేయవలెను. వేరే నీటి పాత్రను కుండమునకు పదహారు అంగుళముల బయట ఉత్తరానికి కానీ తూర్పుకు కానీ పెట్టవలెను. ఈనీటిని ’ ప్రాక్తోయము ’ అందురు. 

        ఇప్పుడు కుండములో అగ్నిని ప్రతిష్టించవలెను. ఈ అగ్నిని శ్రోత్రియుడి ఇంటినుండీ తేవలెను. ఇద్దరు ముత్తైదువలు ఒక మట్టిది కానీ ,ఇత్తడిది కానీ రాగిది కానీ పాత్రలో అగ్నిని ఉంచి, దానిపై అదే విధమైన ఇంకో పాత్రను బోర్లించి కప్పి తీసుకురావలెను. ఈ అగ్నిని వంట ఇంటి పొయ్యి నుండీ కానీ , నీళ్ళు కాచుకొను హండా నుండీ కానీ తేవలెను. దానిని యజమానుని దగ్గర ఉంచి పసుపు కుంకుమలు పెట్టుకోవలెను.  ఆ అగ్నిని యజమానుడు స్థండిలము( కుండము ) లో ప్రతిష్టించవలెను. అగ్ని తెచ్చిన పాత్రలను ఒకదానిలో ఒకటి ఉంచి పైదానిలో అక్షితలు , నీళ్ళు వేయవలెను. 

( ఈ మధ్య దీనికి బదులుగా కర్పూరమును వెలిగించి , లేదా నేతితో తడిపిన ప్రత్తి వత్తులను వెలిగించి అగ్నిని ప్రతిష్ఠించుచున్నారు ) 

ఇంధనేనాగ్నిం వ్యజననేన , ధమన్యావా ప్రజ్వాల్య | ----

        ఇప్పుడు కుండములో చిన్న పుడకలు , పిడకలు వంటివి వేసి ఊదు గొట్టముతో ఊది కానీ , విసనకర్ర తో విసరి కానీ అగ్నిని బాగుగా మండునట్లు చేయవలెను. నోటితో ఎప్పటికీ ఊదరాదు. ఊదవలసి వస్తే , అరచేతిలోకి ఊది అగ్నికి తగులునట్లు చేయవలెను. నేరుగా యజ్ఞేశ్వరుడిపై నోటితో ఎప్పుడూ ఊదరాదు. 

ఉపావరోహ ఇతి , అశ్వథ్థ సమిధోపరి , ముఖాదగ్నిమ్ , బహిర్నిరస్య , తత్సమిధం అగ్నౌ నిక్షిపేత్ ---

ఒక రావి సమిధను నోటితో ఊది , కింది మంత్రము చెప్పి యజ్ఞేశ్వరునిలో వేసేది.

ఓం ఉపావరోహ జాతవేదః పునస్త్వం దేవేభ్యో హవ్యం వహనః ప్రజానన్ |
ఆయు ప్రజాగ్ం రయిమస్మాసుధేహ్యజస్రో దీదిహినో దురోణే ||

చత్వారిశృంగేత్యగ్నిం ధ్యాత్వా ||

అగ్ని ప్రతిష్ఠాపన అయిన తర్వాత అగ్నిదేవుడిని ఈ మంత్రముతో ధ్యానించవలెను. 

చత్వారి శృంగా త్రయోఅస్యపాదా ద్వే శీర్‌షే సప్త హస్తాసో అస్య |
త్రిధాబద్ధో వృషభో రోరవీతి మహోదేవో మర్త్యాగ్ం ఆవివేశ ||

        అగ్నిమ్ ధ్యాయామి | తర్వాత ఈ శ్లోకముతో యజ్ఞేశ్వరునికి ముందు భాగములో అక్షతలు నీళ్ళు వేయవలెను. యజ్ఞేశ్వరుడు ఎప్పుడూ తూర్పుకే తిరిగి ఉండును. కాబట్టి ముందు భాగమనగా కుండమునకు తూర్పు వైపుకు వేయవలెను. అప్పుడు యజ్ఞేశ్వరుడు నీటిని ఇష్టపడక , వెనుకకు తిరుగును , అనగా యజమానునికి అభిముఖముగా తిరుగును. ( ప్రయోగ పుస్తకములలో ఇష్టపడక , భయపడి అన్న పదాలు వాడిఉంటారు. కానీ నీరు అలాగ చల్లుటకు కారణము అది కాదని నా అభిమతము. ఇంకే కారణమో అయినా , మొత్తానికి అగ్నిని కర్త తనకు అభిముఖుడిగా చేసుకొనుటయే దీని ఉద్దేశము. )తనకు అభిముఖుడు కావలెనని అగ్నిని ఈ విధముగా ప్రార్థించవలెను.

|| సప్తహస్తశ్చతుశృంగః సప్తజిహ్వో ద్విశీర్షకః | త్రిపాత్ప్రసన్న వదనస్సుఖాశీనశ్శుచిస్మితః |
 స్వాహాంతు దక్షిణే పార్శ్వే దేవీం వామే స్వధాం తథా | బిభ్రద్దక్షిణ హస్తైశ్చ శక్తిమన్నం స్రువం స్రుచం ||
తోమరం వ్యజనం వామైర్ఘృత పాత్రం తు ధారయన్ | మేషారూఢో జటాబద్ధో గౌరవర్ణో మహద్యుతిః ||
ధూమధ్వజో లోహితాక్షః సప్తార్చిస్సర్వకామదః || ఆత్మాభిముఖమాశీన ఏవం ధ్యేయో హుతాశనః ||

ఏషహి దేవ ఇతి అక్షతోదకం పూర్వ భాగే క్షిప్త్వా | యజ్ఞేశ్వరం హస్తాభ్యాం ఆత్మాభిముఖీ కృత్య | 

అక్షతలు నీళ్ళు యజ్ఞేశ్వరునకు తూర్పు భాగమున వేసి , తన వైపుకు తిరగమని చేతులతో  చూపవలెను. 
ఈ మంత్రముతో ప్రార్థించవలెను. 

ఏష హి దేవః ప్రదిశోనుసర్వాః పూర్వోహి జాతస్స ఉ గర్భే అన్తః |
సవిజాయమానస్సజనిష్యమాణః ప్రత్యన్ముఖాస్తిష్ఠతి విశ్వతోముఖః ||

హే అగ్నే! ప్రాఙ్ముఖోదేవ ప్రత్యఙ్ముఖస్సన్ | మమాభిముఖో భవ | సుప్రసన్నో భవ , వరదో భవ |

ఓం భూర్భువస్సువరోమితి అగ్నేరష్టాఙ్గుల దేశే జలేన ప్రోక్ష్య |

అగ్ని చుట్టూ , ఎనిమిదంగుళముల దూరములో  ఓం భూర్భువస్సువః అను( గాయత్రీ ) మంత్రముతో నీటిని ప్రోక్షించవలెను. 

         ప్రాగాది పరిమృజ్య  , త్రిస్సమ్మార్ష్టి --అనగా , చూపుడు , నడిమి , ఉంగరపు వేళ్ళతో మొదట ఆగ్నేయము నుండీ ఈశాన్యమునకు , తర్వాత నైఋతి నుండీ ఆగ్నేయమునకు , ఆ తరువాత నైఋతి నుండీ వాయవ్యమునకు , చివరగా వాయవ్యము నుండీ ఈశాన్యమునకు సంధులు కలియునట్లు నాలుగు పక్కలందూ నీటి గీతలు గీయవలెను. దీనినే పరిసమూహనము అందురు. 

అగ్నేర్దశాఙ్గుల పరిమితి దేశే అగ్న్యాయతనాన్యగ్నయే నమిత్యాద్యష్టభిర్నమోంతైరలంకృత్య |

అనగా అగ్నికి పది అంగుళదూరములో తూర్పు నుండీ మొదలు బెట్టి ఎనిమిది దిక్కులందూ ’ అగ్నయే నమః ’ మొదలగు నామములతో  పూలు , అక్షతలచే అలంకారము చేయవలెను. 

అగ్నయే నమః | హుతవహాయ నమః | హుతాశినే నమః | కృష్ణ వర్తనే నమః | దేవముఖాయ నమః | సప్తజిహ్వాయ నమః | వైశ్వానరాయ నమః | జాతవేదసే నమః | మధ్యే శ్రీ యజ్ఞపురుషాయ నమః |

అలంకరణాదంతః ప్రాగాది ప్రదక్షిణం దక్షిణోత్తరైః , ఉత్తరాధరై ప్రాగుదగగ్రైః షోడశ్షోడశ దర్భైః అగ్నిమ్ పరిస్తృణాతి ||

          అలంకరణమునకు ఒక అంగుళములోపల కుండమునకు నాలుగు వైపులా దర్భలతో పరిస్తరణము చేయవలెను. అనగా , ఒక్కో వైపునా పదహారు పదహారు దర్భలను పరచవలెను. మొదట తూర్పువైపు మొదలుపెట్టి , ఆ పదహారు దర్భలు తూర్పు కొనలుగా పరచవలెను. తర్వాత దక్షిణాన పదహారు దర్భలు , తూర్పు పరిస్తరణము మొదళ్ళపై అగ్రములు వచ్చునట్లు , అటులే పడమట , పదహారు దర్భలను , దక్షిణ పరిస్తరణపు మొదళ్ళపై మొదళ్ళు వచ్చునట్లు , అలాగే , ఉత్తర పరిస్తరణపు దర్భల మొదళ్ళు పశ్చిమ పరిస్తరణపు కొనల పైనా , అగ్రములైతే తూర్పు పరిస్తరణపు అగ్రముల కిందా వచ్చేలా పరచవలెను. 

ఉత్తరేణాగ్నిం ప్రాగగ్రాన్ ద్వాదశ దర్భాన్ సగ్గ్‌స్తీర్య

అనగా అగ్నికి ఉత్తరమున , ఉత్తర పరిస్తరణము బయట , పన్నెండు దర్భలను తూర్పు కొనలుగా ( అగ్రములుగా ) పరచవలెను. 

తేషు , దక్షిణ వామ హస్తాభ్యాం పాత్రాణ్యాదాయ | ద్వంద్వన్యంచి ప్రయునక్తి దర్వాజ్య స్థాల్యౌ , ప్రోక్షణ సృవావితి, చతుష్పాత్రాణి ప్రయుంజ్య |

ఆ పరచిన పన్నెండు దర్భలపైన , చతుష్పాత్రలను ఉంచవలెను. 

         ( వీటినే యజ్ఞపాత్రలనీ, యజ్ఞాయుధములనీ అంటారు. ఇవి , సుక్కు , సృవము , ఆజ్య పాత్ర , ప్రోక్షణ పాత్ర. స్రుక్కు సృవము అనేవి చెక్కతో చేసిన గరిటెలవంటివి. వీటిని చేయుటకు కొన్ని రకాల వృక్షములనుండీ మాత్రమే కలప తెచ్చి చేస్తారు. సాధారణముగా వీటిని , ఔదుంబరి ( మేడి ) , వెలగ , మోదుగ , ఖదిర ( చండ్ర ) చెట్లనుండీ చేస్తారు. అవి మాత్రమే వాడాలి. సిద్ధపరచిన స్రుక్కు సృవాలు విరివిగా విపణిలో దొరకుతాయి. వీటి ఆకారములు వేర్వేరుగా ఉంటాయి. ఇక పాత్రలు ఇత్తడివి కానీ కంచువి కానీ వాడతారు. పైవి దొరకకపోయిన , స్రుక్కు సృవములుగా మోదుగ ఆకులు గానీ , రావి ఆకులు గానీ వాడతారు. అయితే , ఆకులను వాడినపుడు , ఏది స్రుక్కు , ఏది స్రువము అని బాగా గుర్తు పెట్టుకోవలెను. ఒకటి ( స్రుక్కు ) పెద్దది , ఒకటి( సృవము )  చిన్నదీ అయితే గుర్తు పెట్టుకోవచ్చు. పాత్రలకు బదులు చిన్న అరటి దొన్నెలు వాడవచ్చు. )

         వాటిని పరచిన దర్భలపై ఎలా ఉంచాలంటే , మొదట కుడి చేతిలో స్రుక్కును , ఎడమచేతితో ఆజ్య పాత్రనూ తీసుకొని , రెంటినీ ఒకమారే దర్భలపై ప్రక్కప్రక్కగా బోర్లించవలెను. అంటే స్రుక్కు కు ఉత్తరంగా ఆజ్య పాత్ర  ఉండవలెను. తర్వాత , కుడిచేత ప్రోక్షణ పాత్రను , ఎడమచేత సృవమునూ తీసుకొని , ఒకేమారు రెంటినీ , ముందు బోర్లించిన పాత్రలకు పైన , ( పాత్రల పైన కాదు ) అంటే ఆ పాత్రలకు తూర్పు వైపున ఒకదానికొకటి తగలకుండునట్లు బోర్లించవలెను. స్రుక్కు, సృవములను ఉంచునపుడు , వాటి బిలములు తూర్పుకూ , దండములు పడమటికీ ఉండునట్లు పెట్టవలెను. ఇదే పాత్రాసాదన. ( బొమ్మ చూడుడు )

స్థౌల్య దైర్ఘ్యాభ్యామ్ సమౌ , సాగ్రౌ ద్వేదర్భౌ , అప్రచ్ఛిన్నాగ్రౌ ప్రాదేశమాత్రే పవిత్రీ కృత్య | 

         లావుగా , దీర్ఘముగా ఉన్న అగ్రములు తెగిఉండని రెండు దర్భలను , రెండు కొనలూ సమానముగా చేర్చి , మధ్యలో ముడి వేసి , జానెడుకన్నా ఎక్కువ ( జుత్తెడు ) పొడవు ఉండునట్లు చూసి , అధికముగా ఉన్న పొడవును మొదళ్ళవైపు కత్తరించవలెను. వీటిని గోటితో ఎప్పటికీ తుంచరాదు. ఉద్ధరిణె తోనో , ఇంకేదైనా గట్టి వస్తువుతోనో కత్తరించవలెను. దీనినే పవిత్రము అందురు. ఈ పవిత్రమును నీటిలో అద్దవలెను ( అద్భిరనుమృజ్య ) 

ఉత్తానే ప్రోక్షణ పాత్రే నిధాయ ---ప్రోక్షణ పాత్రను, అనగా , స్రుక్కుకు తూర్పున బోర్లించి పెట్టియున్న పాత్రను వెల్లకిలా తిప్పి అక్కడేపెట్టి , దానిలో పవిత్రము నుంచవలెను. 

ప్రోక్ష్య-- ఆ పవిత్రమును నీటిలో అద్ది , దానితో ఆ ప్రోక్షణ పాత్రలో ప్రోక్షించి , పవిత్రమును మరలా అందులోనే పెట్టవలెను. 

అపరేణాగ్నిమ్ పరిస్తరణాద్బహిః పవిత్రాంతర్హితే ప్రోక్షణ పాత్రే అప ఆనీయ 

         ప్రోక్షణ పాత్రను పైకెత్తి , పరిస్తరణములకు వెలుపల ,  అగ్నికి ప్రదక్షిణముగా చుట్టూ తిప్పి పశ్చిమ భాగమున , అంటే కర్త ముందుకు వచ్చునట్లు పెట్టుకొనవలెను. పాత్రలో అక్షతలు , నీళ్ళు వేయవలెను. 

         ఉత్తానయోర్హస్తయోః అంగుష్ఠోప కనిష్ఠికాభ్యాముదగగ్రే గృహీత్వా ----ఆ పాత్రలోని పవిత్రపు కొనలను ఎడమచేతి బొటనవేలు , ఉంగరపు వేళ్ళతోను, మొదలును కుడిచేతి వేళ్ళతోను అరచేతులు వెల్లకిల ఉండునట్లు , పట్టుకొనవలెను. 

         ప్రాచీస్త్రిరుత్పూయ ---అలాగ వేళ్ళతో పట్టుకొన్న ఆపవిత్రము మధ్యభాగమును ప్రోక్షణ పాత్రలోని నీటిలో ముంచి , ఆ నీటిని , పశ్చిమము నుండీ తూర్పుకు, తూర్పునుండీ పశ్చిమమునకూ , మరలా మూడవసారి పశ్చిమమునుండీ తూర్పుకు పవిత్రముతో తోయవలెను. 

సపవిత్రేణ పాణినా , పాత్రాణ్యుత్తానాని కృత్వా ---పవిత్రమును కుడిచేతిలోకి తీసుకొని ,స్రుక్కును , ఆజ్యపాత్రను , సృవమును ప్రోక్షించి వాటిని వెల్లకిలా తిప్పి పెట్టవలెను.  

         ఉత్తానేన హస్తేన త్రిఃప్రోక్ష్య ---చేతిని వెలికిలగా ఉండునట్లు , ప్రోక్షణ పాత్రలోని నీటిని,  తిప్పిపెట్టిన పాత్రలపైన , మూడు మూడు మార్లు ప్రోక్షణ చేయవలెను. మూడిటికీ కలిపి మొత్తము తొమ్మిది సార్లు పవిత్రాన్ని నీటిలో అద్ది ప్రోక్షణ చేయవలెను. 
తత్పాత్రం దక్షిణతో నిధాయ ---ఆ ప్రోక్షణ పాత్రను , మరలా పైకెత్తి , యజ్ఞేశ్వరునికి ప్రదక్షిణముగా , పరిస్తరణములకు వెలుపల నుండీ తిప్పి , దక్షిణ దిశలో పెట్టవలెను. 

తే పవిత్రే ఆజ్యపాత్రే నిధాయ ----ఆ ప్రోక్షణ పాత్రలోని పవిత్రమును తీసుకొని , ఉత్తరమున నున్న ఆజ్యపాత్రలో ఉంచవలెను. 

         ఆజ్యం విలాప్య--విలీనమప్యగ్నావధిశ్రిత్య ---వేరే ఏదైనా ఒక పాత్రలో నేతిని కరగించి , ఆ కరగిన నేతిని ఆజ్యపాత్రలో వేసుకొని ,  నేయి కరగి ఉన్నప్పటికినీ , ఆ ఆజ్యపాత్రను యజ్ఞేశ్వరునిపై కాచి, తీయవలెను. అనగా సంస్కారము కోసము అలాగ చేయవలెను.

         అపరేణాగ్నిం పరిస్తరణాద్బహిః పవిత్రాంతర్హితాయాం ఆజ్యస్థాల్యామాజ్యం నిరూప్య ----పవిత్రమును ఆజ్య పాత్రలో తూర్పు కొనలుగా ఉంచి , ఆ పాత్రను పైకెత్తి పరిస్తరణములకు బయటనుండీ యజ్ఞేశ్వరునికి ప్రదక్షిణముగా తిప్పి తన ముందు ఉంచుకోవలెను. 

          పరిస్తరణాదధస్తాత్ ఉదీచోంగారాన్నిరూహ్య | తేష్వధిశ్రిత్య | దర్వీస్తరణయోర్మధ్యే అంగారాన్నిరూహ్య ---స్రుక్కుకు , ఉత్తర పరిస్తరణమునకు మధ్యలో , కుండమునుండీ మూడు నిప్పులను తీసి పెట్ట వలెను. ఎలాగంటే , నిప్పులను పరిస్తరణపు కిందిభాగమునుండీ ( పరిస్తరణాన్ని కొంచము పైకి లేపి ) ఉత్తరానికి వచ్చేలా చేయవలెను. 

         జ్వలతా దర్భేణావద్యుత్య ---ఒక దర్భను యజ్ఞేశ్వరునిలో వెలిగించి ఆ మండుతున్న దర్భ యొక్క మంట ప్రతిబింబము నేతిలో కనపడేలా నేతిపైన తిప్పవలెను. ఆ దర్భను ఉత్తరమునకు వేయవలెను. 

ద్వే దర్భాగ్రే ప్రచ్ఛిద్య , ప్రక్షాళ్య , ప్రత్యస్య ---రెండు దర్భ కొనలను దేనితోనైనా తుంచి , నీళ్ళలో కడిగి నేతిలో వేయవలెను. గోటితో తుంచరాదు.

మధుకైటభనామానౌ ద్వావేతావాజ్య హారిణౌ | తయోర్నిరసనార్థాయ ద్వే దర్భాగ్రే వినిక్షిపేత్ | 
         మధుకైటభులు అను ఇద్దరు రాక్షసులు ఆజ్యసారమును హరించువారు , ఆ రాక్ష బాధ తొలగుటకు రెండు దర్భ కొనలను ఆజ్యపాత్రలో వేయవలెను.

’ అప ఉపస్పృశ్య ’---చేతులు నీటితో తుడుచుకొనవలెను. 
         జ్వలతా దర్భేణ త్రిః పర్యగ్ని కరణం కృత్వా --ఒక దర్భను వెలిగించి నేతి పాత్రకు ప్రదక్షిణముగా మూడుసార్లు తిప్పవలెను. ఇదే పర్యగ్నికరణము. 
’ ఉదగుద్వాస్య ’ నేతి పాత్రను ఉత్తరమునకు ఎత్తిపెట్టి , 
అంగారాన్ ప్రత్యూహ్య --ముందు తీసియుండు నిప్పులను మరలా ఉత్తర పరిస్తరణము క్రిందనుండీ తీసి మరలా యజ్ఞేశ్వరునిలో వేయవలెను. నిప్పులను తీయునపుడు , వేయునపుడు పరిస్తరణపు దర్భలను పూర్తిగా పైకెత్తరాదు. ఒక చివర మాత్రము పైకెత్త వలెను. 

ఉదగగ్రాభ్యాం పవిత్రాభ్యామ్ పురస్తాదారభ్య పశ్చాన్నీత్వా , పురస్తాసమాప్తిః | ఏవం త్రిరుత్పూయ | పవిత్ర గ్రంధిం విస్రస్య | అప ఉపస్పృశ్య | ప్రాగగ్రమగ్నౌ ప్రహరతి --

ఆజ్యపాత్రను పరిస్తరణముల బయత నుండి ప్రదక్షిణముగా తిప్పి పశ్చిమమున , అనగా తన ముందర ఉంచుకోవలెను. 

          ప్రోక్షణ పాత్రకు చేసినట్లే , ఆజ్యపాత్రలోకూడా పవిత్రమును ఉత్తరమునకు కొనలుండునట్లు రెండు చేతుల బొటన , ఉంగరపు వేళ్ళతో పట్టుకొని , నేతిలో ముడిని ఉంచి , పశ్చిమమునుండీ తూర్పుకు , మరల తూర్పు నుండీ పశ్చిమమునకు ,తిరిగి పశ్చిమమునుండీ తూర్పుకు , మూడు మార్లు నేతిని తోయవలెను. మూడవ సారి తూర్పుకు ముగియవలెను. తర్వాత పవిత్రమును ముడి విప్పి , నీటిలో తడిపి , తూర్పు కొనలుగా యజ్ఞేశ్వరునిలో వేయవలెను. 

దర్భైస్సహ సృవం దక్షిణేన హస్తేనాదాయ | వామేన జుహూం | మూడు దర్భలను చేతిలో తీసుకొని , ఆ దర్భలతో సహా కుడి చేతితో స్రువమును ( స్రుక్కుకు ఉత్తరముగా ఉండునది ) తీసుకోవలెను. అటులే ఎడమ చేతితో స్రుక్కును తీసుకోవలెను. 

యుగపదగ్నౌ ప్రతితప్య --హోమము చేయు పార్శ్వములకు అనగా , రెంటి బిలములను వేడి తగులునట్లుగా యజ్ఞేశ్వరునికి చూపవలెను. 

       వామ కనిష్ఠికానామికా సంధౌ జుహూం గృహీత్వా | తస్యోపరి సృవం -- ఎడమ చేతి చిటికెన - ఉంగరపు వేళ్ళ మధ్యన స్రుక్కును , మధ్యమ - చూపుడు వేళ్ళ మధ్య సృవమును ఉంచుకోవలెను. బిలములు పైకి వచ్చునటులుండవలెను. ఒకదానికొకటి తగల రాదు. 

అగ్రైః అంతరతోభ్యాగారం సర్వతో బిలమభి సమాహారం మూలైర్దండం | 

          కుడి చేతిలోని దర్భలతో , పైన ఉండు సృవమును , దాని బిలమును దర్భకొనలతో సవరించవలెను. ( నిమిరినట్లు చేయవలెను ) అలాగే దర్భ కొనలతోనే బిలపు వెనుక భాగము , చుట్టునూ తుడిచి , సృవము యొక్క దండమును మాత్రము ( చేతితో పట్టుకొను పొడుగాటి భాగము ) దర్భ మొదళ్ళతో సవరించవలెను. 

         ఇతి వ్యుత్క్రమేణ ధారయిత్వా -- తర్వాత , వేళ్ళ మధ్యలోనున్న సృవమును , స్రుక్కును వాటి స్థానములను మార్చ వలెను, అనగా ఇప్పుడు స్రుక్కున్న చోటికి సృవము , సృవమున్న చోటికి స్రుక్కునూ ఉంచవలెను. ఇప్పుడు సృవము కిందికీ ,స్రుక్కు పైకీ ఉండును. 
జుహూమగ్రైరంతరతోభ్యాగారం | ప్రాచీమ్ | మధ్యైర్బాహ్యతః ప్రతీచీం మూలైర్దండం |

సృవమును సవరించినట్లే , దర్భల కొనలతో బిలమును , వెనుక భాగమును , చుట్టునూ తుడిచి , దండమును మాత్రము దర్భ మొదళ్ళతో తుడువవలెను. 

         పునః ప్రతితప్య --ముందువలెనే స్రుక్కు సృవములు రెంటినీ మరలా అగ్నికి చూపి కాచవలెను. కాచునపుడు స్రుక్కు కుడి చేతిలోను , సృవము ఎడమ చేతిలోను ఉండవలెను. 
        ప్రోక్ష్య --చేతిలోని దర్భలను నీటిలో అద్ది , స్రుక్కు- సృవములను ప్రోక్షించి --నిధాయ -- ఆజ్య పాత్రకు ఎడమ అంటే ఉత్తరమునకు సృవమును , దానికి ఉత్తరమున స్రుక్కును నేలపైన ఉంచవలెను. 
దర్భానగ్గిస్సగ్గ్ం స్పృశ్య -- చేతిలోని దర్భలను నీటితో తుడిచి , -- అగ్నౌ ప్రహరతి -- తూర్పుకొనలుగా అగ్నిలో వేయవలెను. 

అగ్నిం పరిషిచ్య ---ఇప్పుడు కింది విధముగా అగ్ని పరిషేచనం చేయవలెను.

కుడిచేతితో కొద్దిగా నీరు తీసుకొని , హోమకుండమునకు బయట కుడి ప్రక్క , అనగా దక్షిణము న పడమటి నుండి తూర్పుకు  ధారగా ఈ మంత్రముతో నేలపై నీరు వదలవలెను. 

అదితేను మన్యస్వ | 

తర్వాత మళ్ళీ నీరు తీసుకొని , కుండమునకు పశ్చిమమున , దక్షిణము నుండీ ఉత్తరమునకు ( దక్షిణపు నీటిని కలుపుకొని ) ధారగా ఈ మంత్రముతో నేలపై నీరు వదలవలెను.

అనుమతేను మన్యస్వ |

తర్వాత మళ్ళీ కుండమునకు ఎడమవైపున /ఉత్తరము వైపు , పడమటి నుండి తూర్పుకు ( పశ్చిమపు నీటిని కలుపుకొని) ధారగా ఈ మంత్రముతో నీరు వదలవలెను. 

 సరస్వతేను మన్యస్వ |  

చివరిగా కుండమునకు తూర్పున , ఈశాన్యమునుండీ మొదలుపెట్టి కుండము చుట్టూ ప్రదక్షిణముగా మరలా ఈశాన్యమునే కలుపుతూ ధారగా ఈ మంత్రముతో నీరు వదలవలెను. 

దేవసవితః ప్రసువ |

         ఇక్కడివరకు చతుష్పాత్ర ముగిసినది. ఏ సందర్భములో అయిననూ , చతుష్పాత్ర ప్రయోగమంటే ఇలాగే చేయవలెను. ఆ తరువాత సందర్భాన్ని బట్టి ప్రధానాహుతులు ఉండును. ఇప్పుడు పునస్సంధానపు ప్రధానాహుతులు వేయవలెను. 

         సృవేణ చతుర్గృహీతమాజ్యం స్రుచి క్షిప్త్వా | సృవం భూమౌ నిక్షిప్య | స్రుచం దక్షిణ హస్తేన గృహీత్వా | 

          సృవముతో నేతిని నాలుగు సార్లు తీసుకొని స్రుక్కులోకి వేసుకొని , సృవమును కిందపెట్టి , స్రుక్కును కుడి చేతిలోకి తీసుకొని , --అయాశ్చేతి జుహుయాత్ | కింది మంత్రముతో ఆహుతి వేయవలెను 

ఓం || అయాశ్చాగ్నేఽస్యనభిశస్తీశ్చ సత్యమిత్త్వమయా అసి | 
అయసా మనసా ధృతోఽయసా హవ్య మూహిషేఽయానో ధేహి భేషజగ్గ్ం స్వాహా ||

అగ్నయే అయస ఇదమ్ ||( పలకవలెను ) 

సృవేణ సకృద్గృహీత్వా | --సృవముతో ఒకసారి నెయ్యి తీసుకొని కింది మంత్రముతో ఆహుతి వేయవలెను. 

సర్వప్రాయశ్చిత్తార్థం భూర్భువస్సువస్వాహా ||

ప్రజాపతయ ఇదమ్ || ( పలకవలెను ) 

[ హోమము చేయునపుడు ఆహుతి సరిగ్గా ఎప్పుడు వేయవలెను అనుదానికి వివరణ : - అత్రోచ్చార్చరణే విశేషః |  || సకారే సూతకం విద్యాద్వకారే రిపు వర్ధనమ్ | ఆయుర్నాశోహకారేస్యాదాహుతిః కుత్ర ధీయతే || 

        స్వాహా అను పదములో , స కారము ఉచ్చరించుట మొదలు పెట్టినపుడు ఆహుతి చేసిన , త్వరలో కర్త మైల పడును. వకారము చెప్పునపుడు ఆహుతి వేసిన , శత్రు వృద్ధి కలుగును. హకారము పలుకునపుడు వేసిన , ఆయువు క్షీణించును. అందువలన ఆహుతి ఎప్పుడు వేయవలెననగా , 

|| సకారేచ వకారేచ హకారేచ విసర్జయేత్ |
స్వాహాంతే జుహుయాదగ్నౌ ఏతద్ధోమస్య లక్షణం ||

సకారము , వకారము , హకారములను వదలి , స్వాహాంతమందు , అనగా స్వాహా అని స్వరితముతో పూర్తిగా పలికిన తరువాతనే ఆహుతి వేయవలెను. ]

పునః సృవేణాజ్యం చతుర్గృహీత్వా | స్రుచి నిక్షిప్య | పూర్వవత్ చతుర్గృహీతం సర్వత్ర || 

పూర్వము వలెనే మరలా నాలుగు మార్లు సృవముతో ఆజ్యమును తీసుకొని స్రుక్కులోకి వేసుకొనవలెను. కింది ఈ మంత్రమే కాక , మిగిలిన అన్ని ప్రధానాహుతులు వేయునపుడు కూడా , అన్ని ఆహుతులూ ఈ ప్రకారమే వేయవలెను. 

ప్రధానాహుతులు 

ఓం || మహాహవిర్హోతా | సత్యహవిరధ్వర్యుః | అచ్యుత పాజా అగ్నీత్ | అచ్యుతమనా ఉపవక్తా | అనధృష్యశ్చా ప్రతిధృష్యశ్చ యజ్ఞస్యాభిగరౌ | అయాస్య ఉద్గాతా వాచస్పతే హృద్విధేనామన్ | విధేమ తే నామ | విధేస్త్వమస్మాకం నామ | వాచస్పతిస్సోమమపాత్ | మాదైవ్యస్తంతుశ్ఛేదిమా మనుష్యః | నమః పృథివ్యై స్వాహా || ( ఆహుతి వేయవలెను )

అగ్నయ ఇదమ్ |

ఓం || మనోజ్యోతిర్జుషతామాజ్యం విచ్ఛిన్నం యజ్ఞగ్ం సమిమందధాతు | 
యాఇష్టా ఉషసో నిమ్రుచశ్చతాస్సందధామి హవిషా ఘృతేన స్వాహా ||

మనసే జ్యోతిషే ఉషేభ్యో నిమృగ్భ్య ఇదమ్ ||

ఓం || యదస్మిన్ యజ్ఞేఽతరగామమంత్రతహ్ కర్మతోవా | 
అనయాఽహుత్యా తచ్ఛమయామి సర్వం తృప్యంతు దేవా ఆవృధంతాం ఘృతేన స్వాహా ||

దేవేభ్య ఇదమ్ |

ఓం || త్రయస్త్రిగ్ం శత్తన్తవో యేవితత్నిరే | య ఇమం యజ్ఞగ్గ్ం స్వధయాదదంతే తేషాంఛిన్నం ప్రత్యేతద్ధధామి స్వాహా ఘర్మో దేవాగ్ం అప్యేతుస్వాహా ||

అగ్నయే తంతుమత ఇదమ్ |

తన్తుతన్వన్రజసో భానుమన్విహి జ్యోతిష్మతః పథోరక్షధియాకృతాన్ | 
అనుల్బణం వయతజోగువామపోమనుర్భవ జనయా దైవ్యం జనగ్గ్స్వాహా ||

అగ్నయే తంతుమత ఇదమ్ |

ఓం || ఉద్భుధ్యస్స్వాగ్నే ప్రతిజాగృహ్యేన మిష్టాపూర్తేసగ్ంసృజేధామయం చ |
పునః కృణ్వగ్గ్ంస్త్వా పితరం యువానమన్వాతాగ్ం సీత్వయి తన్తుమేతగ్గ్ం స్వాహా ||

అగ్నయే తంతుమత ఇదమ్ |

ఓం || ఉదుత్తమం వరుణపాశమస్మదవాధమం విమధ్యమగ్గ్ం శ్రథాయ | 
అథావయమాదిత్య వ్రతే తవానాగసో అదితయేస్యామస్వాహా ||

ఓం || ఉద్వయం తమసస్పరి పశ్యంతో జ్యోతిరుత్తరమ్ |
దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమగ్గ్స్వాహా ||

దేవేభ్య ఇదమ్ |

ఓం || ఉదుత్యం జాతవేదసం దేవంవహంతి కేతవః |
దృశే విశ్వాయ సూర్యగ్గ్ం స్వాహా | 

సూర్యాయేదమ్ | 

ఓం || చిత్రమ్ దేవానాముదగాదనీకం | చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః |
 ఆప్రా ద్యావా పృథివీ అంతరిక్షగ్ం సూర్య ఆత్మా జగతస్తస్థుషశ్చ స్వాహా ||

సూర్యాయేదమ్ |

ఓం || అగ్నేఽభ్యావర్తిన్నభిన ఆవర్తస్వాయుషా వర్చసా | 
సన్యా మేధయా ప్రజయా ధనేనస్వాహా || 

అగ్నయేఽభ్యావర్తిన ఇదమ్ |

ఓం || అగ్నే అంగిరశ్శతంతేసంత్వావృతస్సహస్రంత ఉపావృతః |
తాసాం పోషస్య పోషేణ పునర్నోనష్టమాకృధి పునర్నోరయిమాకృధి స్వాహా || 

అగ్నయేఽంగిరస ఇదమ్ |

పునరూర్జా నివర్తస్వ పునరగ్న ఇహాయుషా | పునర్నఃపాహి విశ్వతస్స్వాహా ||
అగ్నయ ఇదమ్ | 

ఓం || సహరయ్యా నివర్తస్వాగ్నే పిన్వస్వధారయా | విశ్వఫ్శ్నియా విశతస్పరి స్వాహా || 

అగ్నయ ఇదమ్ | సృవేణ సకృద్గృహీత్వా | జుహుయాత్ |

సృవముతో ఒకసారి నేతిని  తీసుకొని , కింది మంత్రము చెప్పి హోమము చేయవలెను. 

సర్వ ప్రాయశ్చిత్తార్థం , భూర్భువస్సువస్వాహా ||

ప్రజాపతయ ఇదమ్ |

[ పై మంత్రాలన్నిటినీ నేర్చుకున్నవారు కూడా , హోమము చేయునపుడు ఏమంత్రము తర్వాత ఏది అని గుర్తుపెట్టుకొనుటకు , కింది చిట్టాను ఉపయోగించవచ్చు. ఆయా మంత్రాల మొదటిపదాలను చేర్చి కూర్చిన వాక్యమిది. దీన్ని కంఠోపాఠం చేయుట వలన సులభముగా గుర్తు పెట్టుకోవచ్చును. వేదాభ్యాసములో ఇటువంటి చిట్టాలను " కవులు "  అంటారు. ]

|| అయాశ్చేతి సమస్త వ్యాహృత్యాచద్వే ఆహుతీర్జుహుయాన్నోపవసేచ్చతుర్గృహీతేనాజ్యేన మహాహవిర్హోతేత్యనువాకేన మనోజ్యోతిర్యదస్మిన్యజ్ఙే త్రయస్త్రిగ్ం శత్తన్తున్తన్వన్నుద్బుధ్యస్వోదుత్తమ ఉద్వయం తమసస్పరి ఉదుత్యం చిత్రం దేవానామగ్నేభ్యావర్తిన్నగ్నే అంగిరః పునరూర్జా సహ రయ్యేతి చతస్రోభ్యావర్తినీర్హుత్వా | వ్యాహృత్యాచై కామాహుతిం హుత్వా ||

 ఉత్తర పరిషేచనం కృత్వా |

ఇప్పుడు మరలా వెనుకటి వలెనే , ఈ కింది మంత్రములతో అగ్ని పరిషేచనము చేయవలెను. 

కుడిచేతితో కొద్దిగా నీరు తీసుకొని , హోమకుండమునకు బయట కుడి ప్రక్క , అనగా దక్షిణము న పడమటి నుండి తూర్పుకు  ధారగా ఈ మంత్రముతో నేలపై నీరు వదలవలెను. 

అదితేఽన్వ మగ్గ్‌స్థాః  | 

తర్వాత మళ్ళీ నీరు తీసుకొని , కుండమునకు పశ్చిమమున , దక్షిణము నుండీ ఉత్తరమునకు ( దక్షిణపు నీటిని కలుపుకొని ) ధారగా ఈ మంత్రముతో నేలపై నీరు వదలవలెను.

అనుమతేఽన్వ మగ్గ్‌స్థాః  | 

తర్వాత మళ్ళీ కుండమునకు ఎడమవైపున /ఉత్తరము వైపు , పడమటి నుండి తూర్పుకు ( పశ్చిమపు నీటిని కలుపుకొని) ధారగా ఈ మంత్రముతో నీరు వదలవలెను. 

 సరస్వతేఽన్వ మగ్గ్‌స్థాః  | 

చివరిగా కుండమునకు తూర్పున , ఈశాన్యమునుండీ మొదలుపెట్టి కుండము చుట్టూ ప్రదక్షిణముగా మరలా ఈశాన్యమునే కలుపుతూ ధారగా ఈ మంత్రముతో నీరు వదలవలెను. 

దేవసవితః ప్రాసావీః |

హోమాంతే యజ్ఞేశ్వరం ధ్యాయామితి పూజాం- ఆజ్యోపహార నైవేద్యం కృత్వా ||

యస్య స్మ్రుత్యాచ నామోక్త్యా | తపోహోమ క్రియాదిషు | న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం | మంత్ర హీనం క్రియాహీనం భక్తిహీనం హుతాసన | యద్ధుతం మయాదేవ పరిపూర్ణం తదస్తు మే | అనేన పునస్సంధాన హోమేన భగవాన్ సర్వాత్మకః యజ్ఞేశ్వరస్సుప్రీణాతు || 

|| ఇతి పునస్సంధాన హోమః || 


 ( ఔపాసనా విధానము తరువాతి భాగములో ) 

Wednesday, March 5, 2014

3. ఔపాసన --మూడవ భాగము - పూర్వ సిద్ధత



ఔపాసన మూడవ భాగము - పూర్వ సిద్ధత

కిందటి భాగములో వేదకాలము నాటి ఔపాసనా క్రమము చూచినాము కదా

ఇక , ప్రస్తుత కాలపు విధివిధానము , దాని నేపథ్యమూ చూద్దాము.

          అగ్ని ద్విజుడికి ఎలా వచ్చినదీ మొదట చూశాము. ఉపనయనములో మొదట వటువు తండ్రి , తన ఔపాసనాగ్ని నుండి కుమారునికి ఉపనయనాగ్నిని ఇస్తాడు. ఉపనయనము నాటి సాయంకాలము నుండీ వటువు సంధ్యావందనమూ , అగ్నికార్యమూ మొదలు పెడతాడు. ఆ అగ్నిని మూడు రాత్రులు అవిచ్ఛిన్నముగా ఉంచుకొని తరువాత వీలును బట్టి అగ్నికార్యము పొద్దునా సాయంత్రమూ చేస్తాడు. ఆ అగ్నిని పాణిగ్రహణము వరకూ ఉంచుకుంటాడు. వివాహములో మరలా తండ్రి తనయునికి ’ ఔపాసనాగ్ని ’ ని ఇస్తాడు. ఆ అగ్నితోనే వరుడు వివాహములోని హోమములు చేస్తాడు. వధువుతో కూడా చేతులు పట్టి చేయిస్తాడు. అప్పుడు చేసేవి లాజహోమములు. ( పేలాలతో చేసేవి ). వివాహము పూర్వకాలము ఎనిమిదిరోజులు జరిగేది. వివాహము కన్య ఇంట్లో జరిగేది కాబట్టి అన్నిరోజులూ వరుడూ , అతని ముఖ్య బంధువులూ అక్కడే ఉండేవారు. వివాహము ఎనిమిది నుండీ అయిదు , మూడు  రోజులకు తగ్గింది. చివరికి ఈనాడు ఒకరోజే చేస్తున్నారు.  అయిననూ హోమము మొదలగు తంతులు తప్పని సరిగా చేస్తున్నారు. వివాహము తర్వాత వరుడు పెళ్ళికూతురిని తన ఇంటికి పిలుచుకొని వచ్చునపుడు తనకు లభించిన ఔపాసనాగ్నిని తనతో కూడా ఇంటికి తెచ్చుకుంటాడు.   కొంచము పాతకాలము వారికి గుర్తు ఉండే ఉంటుంది ,  పెళ్ళికుమారుడు ఔపాసనాగ్నిని ’ ధూపార్తి వంటి’ పాత్రలో ( చిల్లులున్న  చిన్న మట్టి కుండలో ) ఇంటికి తీసుకొని వచ్చేవాడు.

          ఇక్కడ అగ్న్యాధానము అనే ప్రక్రియ లుప్తమైనది , గమనించండి. ( లేక , ఆ అగ్న్యాధానము ఎప్పుడో పూర్వీకులలో ఎవరైనా చేసి , ఆ అగ్నిని కాపాడుకుంటూ భావి తరాలకు ఇచ్చేవారేమో. )

          ఈ కాలము ఛత్రములలో పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. పొద్దున ఎనిమిది నుండీ రెండు వరకే పెళ్ళి మంటపము మనది. ఇటువంటి సందర్భములలో ఔపాసనాగ్ని గురించి ఎవరికి పట్టింది ? సందర్భము వచ్చింది కాబట్టి ఇది రాస్తున్నాను, ఈ మధ్య ఒక పెళ్ళికి వెళ్ళాను. వరుడు కాస్త పద్దతులు తెలిసినవాడే. అంతేగాక , పెళ్ళిలో తన మంత్రాలన్నీ తానే చెప్పుకున్నాడు, పురోహితుడే ఆశ్చర్యపోయేలా ! పెళ్ళి ఒక ఛత్రములోనే చేశారు. ఇంటికి వెళ్ళేటప్పుడు సామగ్రి ,  సరంజామా అంతా సర్దుకుని వెళ్ళిపోతుండగా హఠాత్తుగా వరుడికి గుర్తొచ్చింది , ’ ఎక్కడా నా ఔపాసనాగ్నీ ? ’ అంటూ రంకెలు వేశాడు. అదృష్టవశాత్తూ అగ్ని అలాగే ఉండింది , నిప్పులతో ! అక్కడున్న చాలామందికి అదేమిటో తెలీదు కూడా. వరుడంటే అలా ఉండాలి.

          ఇంటికి తెచ్చుకున్న ఆ అగ్నిలోనే ప్రవేశ హోమము చేయాలి. తర్వాత అదే అగ్నిలో వధువు స్థాలీపాకము చేయాలి. ( ఈ రెండింటి గురించీ పొడిగించుట లేదు ) స్థాలీపాకమయిన రోజునుండీ మూడు రోజులు వధూవరులిద్దరూ బ్రహ్మచర్యమును పాటించి , ఉప్పు , కారములు వర్జించి , నేలపైన ( మంచమును వదలి )  పడుకోవలెను. తమ ఇద్దరి మధ్యలో ఆ మూడురాత్రులూ ఒక రావికొమ్మను గానీ ,మేడి లేదా జువ్వి కొమ్మనుగానీ ఉంచుకొని దానిలో విశ్వావసు గంధర్వులను ఆవాహన చేసి షోడశోపచారములతో పూజ చేయవలెను. దీని తరువాతనే , మంచిరోజు చూసి సమావర్తనము ( గర్భాధానము ) చేయించవలెను.

          స్థాలీపాకమయిన రోజే రాత్రిని మూడు భాగములు చేయగా మొదటి భాగములోనే వరుడు ఔపోసన మొదలుపెట్టాలి. ఒకవేళ ఆదినము వేళ మించిపోయి ఉంటే మరుసటి నాటి సాయంకాలము మొదలుపెట్ట వలెను. అప్పటినుండీ ప్రతి దినమూ సాయంప్రాతస్సంధ్యలలో ఔపాసనను వదలక చేయవలెను. స్థాలీపాక ఔపోసనలను రాత్రి మూడవ భాగములో చేయరాదు.

          ఔపాసన చేయుటకు తగిన కాలము :-  ప్రాతఃకాలమైతే , బ్రాహ్మీ ముహూర్తము నుండీ , కిరణములతో కూడిన సూర్యుడు రేఖామాత్రంగా కనిపించే లోపల ఎప్పుడైనా చేయవచ్చు. అధమ పక్షము , సూర్యోదయమైన ఒకటిన్నర ఘంటలోగా చేయవలెను.  సాయమౌపాసన అయితే , సూర్యుడు అస్తమించిన తర్వాతనే , అయితే ఆకాశంలో ఎరుపు ఉన్నంతలోపే చేయాలి. అధమపక్షము , ప్రదోష కాలాంతము లోపల చేయాలి.

          ఇక్కడొక ప్రశ్న కలగవచ్చును. ఈ కాలము , ఔపాసనాగ్ని లేనివారు , అగ్న్యాధానము తెలీనివారు తిరిగి ఔపాసన మొదలు పెట్టాలంటే ఎలాగ ? అసలు వైవాహికాగ్నినే పొరపాటునో గ్రహపాటునో  తెచ్చుకోనివారికి ఏదైనా పద్దతి ఉందా ?  భగవంతుడు కరుణామయుడు. ఈ ప్రశ్న మీకు కలిగినా , నిజానికి మీకు స్ఫురింపజేసినది ఆ కరుణామయుడే. దీనికి తప్పక ఒక మార్గముంది. ఈ కాలమే కాదు వెనకటి కాలములో వారికి కూడా ఈ పరిస్థితి మామూలే. ఏ ఒక్క రోజు ఔపాసన మానినా అగ్ని నష్టమయినట్లే. అలాగ విచ్ఛిన్నమయిన అగ్నిని పునరాధానము చేసుకొనవలెను. దీన్నే పునస్సంధానము అనీ , విచ్ఛిన్నాగ్ని సంధానము అనీ అంటారు. తండ్రి మరణించినవారుకూడా దీనిని ఈ విధముగా పొందవచ్చును. వివాహాగ్నిని స్వీకరించకుండా తనను తాను గృహస్థునిగా భావించేవాడిని ’ వృథా పాకి ’ అంటారు. వాడింట భోజనము చేయరాదని నిర్ణయ సింధువు చెబుతున్నది.

          అగ్ని విచ్ఛిన్నము కాకుండా చూచుకొనుట యెలా ? ఒక్కోసారి మన చేతిలో లేని కారణముల చేత ఔపాసనను చేయలేము. ఔపాసన చేయకున్నా , కొద్దిరోజులు అగ్ని విచ్ఛిన్నము కాకుండా చూసుకొనే పద్దతి ఒకటుంది. ఔపాసన చేసిన ప్రతిసారీ దీనిని పాటిస్తే అనుకోకుండా కలిగే విఘ్నముల బారినుండీ తప్పింౘుకోవచ్చు. ఆ పద్దతి రెండు రకాలు. ఒకటి ఆత్మారోపణమ్ , రెండోది సమిధారోపణమ్. మంత్రపూర్వకముగా ఆత్మారోపణమ్ చేస్తే , ఔపాసనాగ్ని తన నోటిలో ఉండిపోతుంది. తరువాత ఔపాసన కొన్నిరోజులు చేయలేకపోయినా , తిరిగి చేసినపుడు తన నోటిలోని అగ్నిని మంత్రపూర్వకముగా ఒక సమిధలోకి తెచ్చి , దానిని అగ్నికి వేయవచ్చును. అప్పుడు అగ్ని విచ్ఛిన్నము కానట్లే. రెండోది సమిధారోపణమ్ అనగా , ఒక రావి సమిధలోకి అగ్నిని మంత్రపూర్వకముగా ఆరోపణ చేసుకొనవచ్చును. వేరే వూరికి వెళ్ళినా , అక్కడ ఆ సమిధనుండీ మరలా అగ్నిని మంత్రపూర్వకముగా తెచ్చుకొని అక్కడే ఔపాసన చేయవచ్చు. కానీ ఇవి చేసేవారు అనేక నియమ నిష్టలతో ఉండవలెను. బ్రాహ్మణుడి ముఖంలో అగ్ని ఉంటుంది అనుటకు కారణమిదే. అబద్ధాలుగానీ , దూషణలుగానీ చెడ్డమాటలుగానీ ఆడరాదు. అభోజ్యాలు భుజింపరాదు. సమిధారోపణము చేసినా ఇవే నియమాలు పాటించ వలెను. 

ఈ పునస్సంధానమ్ చేయుటకు ముందు దానిగురించి రెండు మాటలు

          ఏ హోమము చేయవలెనన్నా మొదట దానికి అధికారము మనకు ఉండవలెను. అధికారమనగా శాస్త్రములు వివరించినతీరులో మనము అర్హులమై ఉండవలెను. తరువాత , దీనికి చేయునది కూడా ఒక హోమమే కాబట్టి , హోమపు నియమములను పాటించవలెను. ఇందులో భాగంగా , కృచ్ఛ్రాచరణము , అగ్ని ఆవాహన , పూజ , హోమములో ఉపయోగించు పాత్రల శుద్ధీకరణ , ( శుద్ధీకరణ అనగా కేవలము శుభ్రముగా కడుగుట యని కాదు, ఇది మంత్రము , తంత్రపూర్వకముగా శుద్ధము చేయుట ) , హోమ ద్రవ్యములను కూడా అట్లే శుద్ధి చేయుట , మొదలగునవి. దీనినంతటినీ కలిపి హోమపు  పరిభాషలో , " అగ్ని ముఖము " అంటారు. అగ్నిముఖము తర్వాతనే ప్రధాన హోమము చేయవలెను. ఈ అగ్ని ముఖము రెండు విధములు. ఒకటి చతుష్పాత్ర ప్రయోగ విధము , రెండోది షట్పాత్ర ప్రయోగ విధము. ఇక్కడ చేయునది చతుష్పాత్ర ప్రయోగమే. ఆ పేర్లను బట్టి , వాటిలో నాలుగు లేక ఆరు పాత్రలు ఉపయోగిస్తారు. ఈ పాత్రలనే ’ యజ్ఞాయుధములు ’ అని కూడా అంటారు. నిత్య , నైమిత్తిక కర్మలన్నిటిలోనూ చతుష్పాత్ర ప్రయోగము , కామ్య కర్మలలో షట్పాత్ర ప్రయోగమునూ అనుసరిస్తారు. నిత్య  కర్మలనగా , నిత్యమూ తప్పక చేయవలసినవి , ఇక , మన ఇష్టముతో నిమిత్తము లేకుండా ఆయా సందర్భములు వచ్చినపుడు తప్పక చేయవలసినవాటిని నైమిత్తిక కర్మలు అంటారు. .ఉదాహరణకి ,  ఔపాసన , సంధ్యావందనములు నిత్య కర్మలు. ప్రతి దినమూ తప్పక చేయవలసినవి. శ్రాద్ధములు , ఉపాకర్మ , గ్రహణ సమయములలో చేయు హోమములు , వంటివి నైమిత్తిక కర్మలు. మనముగా కోరి చేయు పూజలు , వ్రతములు , గణ , రుద్ర , చండీ ఇత్యాది హోమములు కామ్య కర్మలు.

 ఈ పునస్సంధానమును అగ్ని నష్టమయిన ప్రతిసారీ , మరలా ఔపాసన చేయుటకు ముందర , అధికారము కొరకు చేయవలెను.
తర్వాత పునస్సంధానము పద్దతి ( చతుష్పాత్ర ప్రయోగము ) చూద్దాము.

Friday, February 28, 2014

2. ఔపాసన-- రెండవ భాగము - త్రేతాగ్నులు



2. ఔపాసన రెండవ భాగము - త్రేతాగ్నులు



ఔపాసన రెండవ భాగము - త్రేతాగ్నులు

మొదటి భాగములో, మానవుడు తన శ్రేయస్సుకై ఉపాసన చేయవలసినది అగ్నినేయని తెలుసుకున్నాము.

          ఈ అగ్న్యుపాసనను యజ్ఞము , హోమము వంటి అనేక విధములుగా పలికినా అక్కడ చేయునది , హవిస్సును అగ్నికి అర్పణ చేయుటయే ! అట్టి యజ్ఞము చేసి , యజ్ఞశేషమును భుజించువాడిని అమృతాశి అంటారు. వాడే పుణ్యాత్ముడు.

|| యజ్ఞశిష్టాశినః సంతో ముచ్యంతే సర్వ కిల్బిషైః |
భుంజతే త్వేత్వఘం  పాపా యే పచంత్యాత్మ కారణాత్ ||

         అటువంటి యజ్ఞము చేయుటవలన తన పాపములన్నిటినీ పోగొట్టుకుంటాడు మానవుడు. దేవతలకు హవిస్సునీయక , తనకోసమే అన్నమును వండుకొని తినువాడు పాపియే అవుతాడు. వాడు పాపమునే భుజించినట్టు ! --గీత

         ఇలాగ , యజ్ఞముల  మహత్వమును భగవంతుడు తెలిపి , మనుష్యులు మరియూ దేవతల నడుమ యజ్ఞముల ద్వారా చక్రమునొకదానిని ఏర్పరచినానని తెలిపినాడు. మనుషులిచ్చిన హవిఃప్రదానమును స్వీకరించి , దేవతలు వర్షమును , సస్యములనూ కావలసినంతగా ప్రసాదిస్తారు. దానివలన మనుషులు తృప్తులై మరలా దేవతలను తృప్తి పరుస్తారు. ఈ చక్రమును ఎవరు అనుసరించరో వారి బ్రతుకు వ్యర్థమే నని భగవంతుడే అంటాడు.

          నిజానికి మానవుడు హోమములంటూ ఏదో కొత్తగా తాను మొదలు పెట్టునది ఏదీలేదు. వాడి పుట్టుకనుండే  , కాదు , పుట్టుటకు ముందే వాడికోసము యజ్ఞము ఆరంభమై ఉంటుంది. షోడశ సంస్కారములలో మొదటిదైన గర్భాధాన సంస్కారము , దాని అంగముగా నడచు హోమము మొదలగునవి , జనించబోవు జీవికోసమే జరపబడతాయి. అలాగ పుట్టుకతోనే అగ్న్యారాధనకు లోబడి పుట్టిన శిశువు ఉపనయనమైన తర్వాత వటువై గాయత్రీ మంత్రోపదేశము పొంది , గాయత్రీ ఉపాసన చేస్తాడు. గాయత్రి ఉపాసన అనగా కాంతి యొక్క ఉపాసనే . అగ్ని యొక్క ఇంకొక రూపమే కాంతి. అంతేకాక , వటువు రెండు పూటలా అనుష్ఠించవలసిన అగ్నికార్యము / సమిదాధానము కూడా అగ్నియొక్క ఆరాధనయే ! బ్రహ్మచర్యాశ్రమమును దాటిన తరువాత గృహస్థుడైన తరుణుడు  ’ ఔపాసనము ’ అను పేరుతో మరలా అగ్ని ఆరాధననే ప్రారంభిస్తాడు. ఔపాసనను అనుష్ఠానము చేస్తాడు. ఔపాసనాగ్నిని ’ గృహ్యాగ్ని ’ లేక ’ స్మార్తాగ్ని ’ అంటారు. దాని తర్వాత చేయు విశేష అగ్ని ఆరాధనను శ్రౌతాగ్ని ఉపాసన అంటారు.

దీన్ని ఎప్పుడు మొదలుపెట్ట వలెను ?

|| జాతపుత్రః కృష్ణ కేశః అగ్నినాదధీత |
జాయామవాప్య దశమేఽహన్యగ్నినాదధీత |

-----బోధాయన గృహ్య సూత్రము.

          అనగా , పుత్రప్రాప్తి తరువాత నల్ల వెంట్రుకలు ఉన్నపుడే అగ్నులను ఆధానము చేయవలెను. ఇది అగ్న్యాధానము చేయుటకు మనకున్న గరిష్ట పరిమితి. కానీ సంప్రదాయ నియమముల ప్రకారము వివాహమైన పదవ రోజునుండీ అగ్నులను ఆధానము చేయవలెను . దీనికి , గృహస్థు యొక్క పత్ని ఆమోదము , సహకారము కావలెను. అట్లే ఆగ్నిని తన జీవన పర్యంతమూ కాపాడుకుంటూ వస్తాడు. జన్మతోపాటు దొరికిన అగ్నిని విస్తృత పరచుకొంటూ వస్తాడు కాబట్టి దీనిని శ్రౌతాగ్ని లేదా వైతానిక అగ్ని అంటారు. ఈ శ్రౌతాగ్నినే ’ త్రేతాగ్ని ’ అని కూడా అంటారు. అనగా మూడు అగ్నులు. వీటిని ’ గార్హపత్యాగ్ని ’ , ’ దక్షిణాగ్ని ’, ’ ఆహవనీయాగ్ని ’ అనే పేర్లతో పిలుస్తారు.

వివాహమైన తర్వాత మొదటిసారి అగ్న్యాధానము చేయుట ఒక ఉత్సవము.

          తైత్తిరీయ బ్రాహ్మణ వాక్యము ప్రకారము , సాధారణముగా బ్రాహ్మణుడు వసంతకాలము లోను , క్షత్రియుడు గ్రీష్మము లోను , వైశ్యుడు శరదృతువులోనూ అగ్న్యాధానము చేయవలెను. ఈ అగ్నిని , కృత్తిక , రోహిణి , పునర్వసు , పూర్వ ఫల్గుని , ఉత్తర ఫల్గుని , చిత్రా నక్షత్రములలో ఆధానము చేయవచ్చును. అంతేకాక , వైశాఖ అమావాస్య యందు , రోహిణీ నక్షత్రము తో కూడినది--చాలా ముఖ్యమైనది. అయిననూ ,

యదైవైనమ్ యజ్ఞ ఉపనమేత్ | అథాదధీత |

         అను వాక్యము ననుసరించి , ఎప్పుడు సోమయాగమును చేయ వలెనని ఇచ్ఛ కలుగునో , లేక వ్యాధి ముదిరి మరణము సన్నిహితమగునో , పుణ్యప్రాప్తికై అప్పుడే అగ్న్యాధానము చేయవచ్చును.


పైవాటిని పరిశీలిస్తే , పుట్టుక నుండే మనిషికి యజ్ఞపు అనుష్ఠానము సహజముగానే జరుగుతున్నది అనవచ్చును.

         ఈ కాలపు అనేకులకు ఇవేవీ తెలియక పోవచ్చు. దానికి కారణము మన సంస్కృతి అనేక బాహ్య కారణాలవల్ల మంటగలసి పోవుటయే ! కిందపడినవాడు మరలా పైకి లేచి దుమ్ము దులుపుకొని ఎలాగైతే మరలా పరుగెత్తుతాడో , అలాగే , లుప్తమైన మన సంస్కృతిలోని శిష్టాచారములను తిరిగి మనము మన జీవితములోనికి తెచ్చుకొనుట ఎంతైనా అవసరము.

         ఔపాసనా హోమము అనునది , మిగిలిన యజ్ఞములతో పోలిస్తే సాంకేతికంగా చాలా సరళమూ , సులభమూ తేలికా యైనది. ఇక్కడ హోమము , యజ్ఞము , యాగము అను పదాల సాంకేతిక అర్థము , వాటి తేడాలను తెలుసుకుందాము.

          దైనందిన జీవితములో అనునిత్యమూ మనము గణహోమము , రుద్ర హోమము , దుర్గా హోమము , చండీ హోమము మొదలగు పేర్లు వింటుంటాము. అట్లే , రాజసూయ యాగము , అశ్వమేధ యాగము వంటి  పేర్లను కూడా విని యుంటాము. యజ్ఞము , మరియూ యాగము అనునవి ఒకదానికొకటి పర్యాయ పదాలుగా భావించ వచ్చును. వాటికి ముఖ్యమైన భేదములు ఏవీ లేవు. అయితే , హోమములు మరియు యజ్ఞములు పర్యాయ పదములు కావు. వాటికి వ్యత్యాసములున్నవి.

           ఒకే అగ్నిలో మంత్రముల చివర ’ స్వాహా ’ అను పదమును చేర్చి , ఒక దినము లోపల , లేదా అతితక్కువ దినముల పాటు నడచు అగ్ని ఉపాసనను ’ హోమము ’ లేదా ’ హవనము ’ అంటారు. ఈ హోమముల గురించి వేదములోని వాక్యములలో ’ జుహుయాత్ ’ అను పదము ఉండును. అనగా , వేదములో విధించ బడిన కర్మల వివరణలో ఎక్కడెక్కడ ’ జుహుయాత్ ’ అన్న పదము వచ్చునో , అవన్నీ హోమములని అర్థము. వాటన్నిటిలోనూ మంత్రపు చివర ’ స్వాహా ’ అను పదము వచ్చును. ఈ హోమములను ’ దర్వీ హోమములు ’ లేక ’ గృహ్య హోమము ’ అని కూడా అంటారు. హోమములలో సాధారణముగా నెయ్యి , పాలు , చరువు ( వడ్లు దంచి , ఆ బియ్యముతో చేసిన అన్నము ) , సమిధలు వంటి పదార్థములు వాడతారు.

          అలాకాక, మూడు అగ్నులలో , రెండు లేక మూడు వేదములతో ఆశ్రావణ , ప్రత్యాశ్రావణాదులతో అనుష్టించు అగ్ని ఉపాసనలను ’ యజ్ఞము ’ లేక ’ యాగము ’ అంటారు. ఈ యజ్ఞములలోని మంత్రాల చివర ’ వషట్ ’  అను పదము  వచ్చును. ఆశ్రావణ , ప్రత్యాశ్రావణములంటే , యజ్ఞము చేయునపుడు , అధ్వర్యువు  మొదలగు ఋత్త్విజుల మధ్య దేవతల ఆవాహన , స్తోత్రములకు , ఓశ్రావయ , ’ అస్తు వౌషట్ ’ , ’ యజ ,  ’ యే యజామహే ’ , మరియూ ’ వౌషట్ ’ అను పదాల వాడకము. యాగములలో సాధారణముగా సోమరసము వాడతారు. యాగములు అనేక దినములలో జరుగును. ఒక వారము , పది రోజులు , పక్షము , నెల .. ఇలాగ.  ఈ యజ్ఞ యాగాదులు అనేక రకములు. అందులో ప్రధానముగా ఇరవై ఒక విధములూ , మరలా వాటిలో అనేక విధములూ ఉన్నాయి. యజ్ఞ యాగాల గురించి ఇక్కడికి ఆపి , హోమము ,ఔపాసన గురించి చూద్దాం .

          ఔపాసన కొరకు అగ్న్యాధానము ఎప్పుడు మొదలుపెట్టవలసినదీ చూచినాము. అగ్న్యాధానమంటే హోమము కాదు. ఆ కర్మ వలన త్రేతాగ్నులైన గార్హపత్య , దక్షిణాగ్ని మరియూ ఆహవనీయములు సిద్ధిస్తాయి. అరణులను మథించి అగ్నిని పుట్టించుట అగ్న్యాధానము లోని ప్రధాన కర్మ. అగ్న్యాధానమును అనుష్ఠించు దంపతులు దానికి ఒక వారము ముందే గణహోమమును చేయవలెను. జప , హోమాల వలన శరీరమును శుద్ధి చేసుకొనవలెను. దానిలో భాగముగా కూష్మాండ హోమమును చేయవలెను. కృచ్ఛ్రములు మొదలగు వ్రతములు ఆచరించవలెను. లోకవ్యవహారములనుండీ కూడా శుద్ధుడై ఉండవలెను. దీనినే బోధాయనుడు ఇలాగంటాడు,

అగ్నిన్ ఆధాస్యమానః ,,,!
యేనాస్యా కుశలగ్ం స్యాత్తేన కుశలం కుర్వీత |
యాన్యృణాని ఉత్థిత కాలాని స్యుస్తాని వ్యవహరేత్ |
అనుజ్ఞాపయీతవా |

         -అగ్నిని ఆధానము చేయువాడు ఎవరితోనైనా వైషమ్యముతో కలహము కలిగి ఉంటే అతడిని సమీపించి మాటలాడి సముదాయించవలెను. ఎవరితోనైనా అప్పుతీసుకొని ఉంటే , అప్పు తీర్చు అవధి ముగిసి ఉంటే ఆధానమునకు ముందే అప్పుతీర్చివేయవలెను. అది వీలుకాకపోతే , అప్పు ఇచ్చినవాడితో అగ్న్యాధానము చేయుటకు అనుమతినైనా పొందవలెను.

        అగ్న్యాధానమునకు ముందు దంపతులు దానికి ఏమేమి నియమములను పాటించవలెనో ఋత్త్విక్కుల నుండీ తెలుసుకొని అవన్నీ నెరవేర్చవలెను.  అరణులను అశ్వత్థ వృక్షపు కొమ్మలతో చేయుదురు. అరణులతో అగ్ని మంథనమును గురించిన అనేక వివరములను ఇక్కడ వ్రాయుట లేదు. వాటిని కావలసినవారు అప్పుడే తెలుసుకొనవచ్చును. లేదా ఆ వివరములను వేరొక వ్యాసములో ఇచ్చెదను.

          అరణులను మథించగా పుట్టిన అగ్నిని పూర్తిగా గార్హపత్య కుండములో వేయవలెను. దీనిని గార్హపత్యాధానము అంటారు. తరువాత ఈ అగ్ని నుండి ఒక అంశమును తీసుకొని దక్షిణాగ్ని కుండములో స్థాపించవలెను. దీనికి దక్షిణాగ్న్యాధానము అని పేరు. సూర్యుడు సగము ఉదయించినపుడు గార్హపత్య కుండము నుండీ అగ్నిని తీసుకొని ఆహవనీయ కుండములో వేయుటను ఆహవనీయాధానము అంటారు. ఈ విధముగా అగ్న్యాధానము నుండీ త్రేతాగ్నులు సిద్ధిస్తాయి.

          పిమ్మట త్రేతాగ్నులలో ధాన్యములతో వ్యాహృతి మంత్రములు చెప్పి హోమము చేయవలెను. మూడు అగ్నులలోను మంత్రపూర్వకముగా సమిధలను వేయవలెను. తరువాత అగ్ని ఉపస్థానము ( తన క్షేమము కొరకు , కోరికలు తీరుట కొరకు అగ్నిని వేడుట ) చేయవలెను. ఆ తరువాత గార్హపత్యములో ఆజ్య సంస్కారమును చేసుకొని ఆహవనీయములో పూర్ణాహుతినీ , కూష్మాండ హోమమునూ చేయవలెను. ఆపైన మథించిన అగ్నుల సంస్కారము కొరకు నేతితో అగ్నిహోత్ర హోమమును చేయవలెను. సాయంకాలము మరియూ ప్రాతః కాలము చేయవలసిన అగ్నిహోత్రమును కలిపి ఒకేసారి చేయవలెను.

          మొదటి అగ్నిహోత్రమును సాయంకాలమే చేయవలసి ఉన్ననూ , ఆధానము చేసిన అగ్నుల సంస్కారము కొరకు ప్రాతఃకాలమే రెంటినీ కలిపి ఒకేసారి  అనుష్ఠిస్తారు. ఈ మొదటి హోమములో మంత్రోచ్చారణ ఉండక , మౌనముగా చేయుట వలన దీనిని తూష్ణీమగ్నిహోత్రం అంటారు. తర్వాత కొన్ని మంత్రములతో పవమానేష్టి చేయవలెను. ఆధానము చేసిన సాయంకాలమే అగ్నిహోత్రము ప్రారంభమగును.

          ఈ అగ్నులను పన్నెండు రాత్రుల కాలము జాగ్రత్తగా అగ్ని నష్టము కాకుండా రక్షించుకొని ఉండవలెను. తరువాత వచ్చు మొదటి పౌర్ణమి నాడు లేదా , అనుకూలమైన ఒక పౌర్ణమి నాడు ’ అన్వారంభణీయేష్టి ’ చేసి , మరుసటి దినము , అనగా కృష్ణపక్ష ప్రతిపత్ నాడు ’ పూర్ణమాసేష్టి ’ ని చేయవలెను.

          ( ఔపాసన క్రమము ఎవరికి వారు చేసుకొను పద్దతి చివరగా ఇవ్వబడును. ఇప్పుడు చర్చించునవన్నీ ఋత్త్విజుల సహాయముతో చేయవలెను. ఇవి ఔపాసన మొదలు పెట్టుటకు ముందర చేయవలసిన కార్యములు కాబట్టి కర్తవ్యమును మాత్రము వివరించడమైనది. ఇవన్నీ ముఖ్యముగా యజ్ఞములను చేయగోరువారు చేయవలసినవి. కేవలము ఔపాసన చేయగోరువారికి ఇంత క్రమము లేదు. అది తరువాతి భాగములలో వచ్చును. )

ఇలాగ సిద్ధించిన అగ్నులను కాపాడుకుంటూ ప్రతి పౌర్ణమి , అమావాస్యలలో ఇష్టులను ఆచరించవలెను.

పునరాధానము

          అగ్నులను రక్షించుకుంటూ వస్తుండగా ఎపుడైనా అనివార్య కారణముల వలన అగ్ని నష్టమైతే తిరిగి అగ్న్యాధానము చేయవలసి ఉంటుంది. దీనినే శ్రౌత ప్రక్రియలో ’ పునరాధానము ’ అంటారు. పునరాధానము చేయుటకు ఆషాఢ పౌర్ణమి తర్వాత వచ్చు అమావాస్య , పాడ్యమి , లేదా విదియ ఈ మూడురోజులలో ఎప్పుడైనా పునర్వసూ నక్షత్రము వస్తే ఆనాడు మాత్రమే చేయవలెను. ఇది కుదరకపోతే , ఉత్తరాయణము లోని ఏదైనా శుక్ల పక్షములో పునర్వసు నక్షత్రము వచ్చినపుడు చేయవచ్చును. పునరాధానములోని ఒక విశేషమేమంటే , దర్భలతో నిర్మించిన పగ్గముతో ఆధానము చేయవలెను. ( అరణి మథనముతో కాదు )

అగ్నిహోత్రము పద్దతి

         ఈ కింద రాయబోవునది వేదకాలములోని ప్రక్రియ, మరియూ క్లుప్తముగా వివరణ మాత్రమే. ఈ కాలము ఆచరించు పద్దతి ఇదే వ్యాసములో తరువాత చూచెదరు. ) ఈ వ్యాసపు మొదటి భాగములో చెప్పినట్టు అగ్నిహోత్రమును సాయంకాలమే మొదలుపెట్టవలెను. ఆదినము ఉదయమే వపనము , మంత్రాచమనము , మంత్రప్రోక్షణలతో శుద్ధుడై ’ అగ్నిసూర్య ప్రజాపతయః ప్రీయంతామ్ " అని పుణ్యాహమును చేయవలెను. గార్హపత్యాగ్నికి పశ్చిమమున దంపతులు కూర్చొని ,ఆచమనము , ప్రాణాయామములు చేసి

సత్యధికారే యావజ్జీవమ్ అగ్నిహోత్రం హోష్యామి |

          అని సంకల్పము చెప్పుకొనవలెను. తర్వాత గార్హపత్యాగ్నిలో గృహ్య సూత్రము లో చెప్పినట్టుఆజ్య సంస్కారము చేయవలెను. తర్వాత స్రుక్ మరియూ సృవములను సంమార్జన చేసి ఆహవనీయాగ్నిలో దశహోత్ర హోమమునూ , తర్వాత స్రువముతో కూష్మాండ హోమమునూ చేయవలెను. ఇవి అగ్నిహోత్రమును మొట్ట  మొదట ఆరంభించునపుడు చేయవలసిన విధులు. ( స్రుక్కు స్రువములనగా , నేతిని , పాలను మొదలగువాటిని గిన్నెనుండీ తీసుకొని అగ్నిలో వేయుటకు ఉపయోగించే చెక్క గరిటలు. వీటినే దర్వి అని అంటారు )

          కిందచెప్పబోవు విధానమును బాగుగా పరిశీలించండి. తర్వాత చెప్పబోవు ఈనాటి పద్దతితో పోల్చి చూడండి. అనేక పోలికలున్ననూ , మార్పులు జరిగినది తెలుస్తుంది. వాటికి కారణములు ఏమిటీ యని ఒక్కరైనా ఆలోచించి ఒక తీర్మానము నకు వస్తే చాలా మంచిదని నా విన్నపము. ఈ వివరణ అంతా కేవలము అర్థము చేసుకొనుటకే తప్ప ఈనాటి పరిస్థితులకు అన్వయము చేసుకొనుటకు కాదు. ఈ నాడు ఆచరించు క్రమము ఈ వ్యాసపు అంతమున ప్రత్యేకముగా ఇవ్వబడును.

తరువాత , ’ ఉపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం సాయమగ్ని హోత్రం పయసా హోష్యామి ’ అని సాయంకాలమూ ,

’ ప్రాతరగ్నిహోత్రం పయసా హోష్యామి " అని ప్రాతఃకాలమూ సంకల్పము చెప్పి ప్రధానమైనాగ్నిహోత్ర హోమమును చేయవలెను.

          అగ్నిహోత్ర హోమమునకు అవసరమైన అగ్నిహోత్రస్థాలి ( కుండము ) , స్రువము , స్రుక్కు , దర్భలు , సమిధలు --ఈ హోమ సాధనములను గార్హపత్యమునకు పశ్చిమమున ఒక చెక్క పలక పైన ఉంచుకొనవలెను. తర్వాత అగ్నిహోత్రము కొరకు ఆవుపాలను పిండి తేవలెను. ఆ ఆవును అగ్నిహోత్రశాలకు దక్షిణములో , ఉత్తరాభిముఖముగా కట్టివేయవలెను. ఆ పాలను బ్రాహ్మణుడే పిండవలెను.

         తర్వాత మూడు అగ్నులకూ క్రమముగా పరిషేచనము చేయవలెను. మొదట గార్హపత్యమునకు పశ్చిమమున కూర్చొని , కుండములోని నిప్పులను కొన్నిటిని అక్కడే కుండపు బయట ఉత్తరానికి వేసి , ఆ నిప్పులపై పాలను కాచవలెను. దర్భలతో అభిద్యూతన మరియూ పర్యగ్నికరణములను చేయవలెను. తర్వాత , కాచిన పాలను ఉత్తరానికి తీసిపెట్టి , నిప్పులను మరలా కుండములోనికే వేయవలెను. కుడిచేతిలో స్రువము మరియు సమిధలను , ఎడమ చేతిలో అగ్నిహోత్ర హవణినీ ( పాలు , పెరుగు వంటి వాటిని వంచుటకు , వంపు ఉన్న ఒకానొక గరిట )  తీసుకొని గార్హపత్యాగ్నిలో కాచవలెను. అగ్నిహోత్ర హవణిని దర్భ కూర్చపైన పెట్టి పాలను స్రువముతో నాలుగుసార్లు అగ్నిహోత్ర హవణిలోకి నింపుకొనవలెను. ఒకవేళ ఋత్విజుడు అగ్నిహోత్రమును చేస్తుంటే , ఇదంతా చేయుటకు యజమానుని అనుమతి తీసుకోవలెను. ఋత్త్విజుడితో చేయించవచ్చుకానీ అమావాస్య పౌర్ణములలో , అనగా పర్వకాలములో అగ్న్యాధానము చేసినవాడే హోమమును చేయవలెను.

          పాలను నింపిన తర్వాత ఒక సమిధను అగ్నిహోత్రహవణి యొక్క దండముపై పెట్టి ,ఆ హవణిని ఆహవనీయాగ్ని కుండము పశ్చిమమున ఒక వేదికపై కూర్చ పైన పెట్టవలెను. ఆహవనీయాగ్నిలో ఆ సమిదాధానము చేసి హవణిలోని పాలతో హోమము చేయవలెను. ఇదే ప్రధానమైన అగ్నిహోత్ర హోమము. అనంతరము హోమశేషాన్ని ప్రాశనము ( తాగుట ) చేయవలెను. ఇదే విధముగా మూడు అగ్నులలోనూ సమిదాధానము చేసి ఉత్తర పరిషేచనము చేయవలెను. సాయంకాలము హోమము తర్వాత అగ్న్యుపస్థానము చేయవలెను. ఔపాసనా హోమము రోజుకు విధిగా రెండు సార్లు చేయవలెను. మొదటిసారి చేస్తున్నపుడు సాయంకాలమే మొదలు పెట్ట వలెను. సాయంకాలము చేసినవాడే ప్రాతః కాలములో కూడా చేయవలెను. సాయంకాలము పాలతో చేస్తే , ప్రాతః కాలము కూడా పాలతోనే చేయవలెను. ( నెయ్యి , పెరుగులతో చేసినా అదేవిధముగా అదే పదార్థముతో సాయంత్రమూ పొద్దున్నా చేయవలెను. ) దీనికి కారణమేమంటే ,  సాయంకాలము మరియూ తరువాతి ప్రాతః కాలమూ అనుష్ఠానము చేసిన హోమములు రెండుగా కనిపించినా అది ఒక్క హోమమేయనబడును.

నిత్యమూ అగ్నిహోత్రమును అనుష్టించుటకు త్రేతాగ్నులను తప్పనిసరిగా రక్షించుకొని ఉండవలెను. ఈ సంరక్షణ అనునది రెండు విధములు.

          ఒకటి అజస్ర పక్షము. అనగా , మూడు అగ్నులనూ సర్వవేళలా కాపాడుకుంటూ ఉండవలెను. రెండవది , ఉద్ధరణ పక్షము. అనగా ఒక్క గార్హపత్యాగ్నిని మాత్రము సదా కాలమూ రక్షించుకొని , అగ్నిహోత్రము మొదలు అనేక కార్యములు చేయునపుడు ఆ గార్హపత్యాగినే దక్షిణాగ్ని మరియూ ఆహవనీయాగ్ని కుండములలో ప్రతిష్ఠించి  అనుష్ఠానమును చేయవలెను.

          పైవన్నీ ముందే చెప్పినట్టు వేదకాలములో చేసెడి పద్దతులు. ఈ కాలమునకు అనేక మార్పులు వచ్చినవి. మూల స్పూర్తి మారకున్ననూ , ఒక్కో యుగ ధర్మమును బట్టి క్రమము కొంత మారుతుండును.

ఇక ఇప్పటికి చాలు, మిగిలిన విషయములను తర్వాతి భాగములలో చూద్దామా. 

Wednesday, February 26, 2014

1. ఔపాసన --మొదటి భాగము -ఉపోద్ఘాతము



ఔపాసన --మొదటి భాగము

          సనాతన ధర్మములో మూడు వర్ణముల వారికీ ఉపనయనము ఎంత ముఖ్యమైనదో ద్విజుడి జీవితములో ఔపాసన హోమము కూడా అంతే ముఖ్యమైనది. ద్విజులలో బ్రాహ్మణులకు మరీ ముఖ్యమైనది. ఔపాసనాహోమాన్ని అనేక పేళ్ళతో పిలుస్తారు. అగ్ని పరిచర్య అనీ , తండుల హోమమనీ , ఔపసదము , ఆవసత్యము, వైవాహికము , స్మార్తము , శ్రౌతము , గృహ్యము , శాలాగ్ని వంటి అనేక పేర్లున్నాయి.

         ఈ హోమానికి ఉన్న నేపథ్యము ఏమిటని చూస్తే , దీనికి మూలము యజ్ఞము. యజ్ఞమునకు , యాగమునకు , హోమమునకూ అనేక భేదములున్ననూ , ఇక్కడ యజ్ఞము అను పదమునకు సాంకేతిక అర్థము తీసుకోలేదు. ’ యజ్ ’ అన్న ధాతువుకు ’ దేవపూజ ’ అను అర్థము ఉన్నది. యజ్ + నఙ్ = యజ్ఞః ( పాణినీయ సూత్రము ) అనగా , ఏ విధముగనైననూ దేవతలను సంతోషపరచుదానిని ’ యజ్ఞము ’ అనవచ్చు.

|| దేవతోద్దేశపూర్వక ద్రవ్య త్యాగో-యాగః ||

         అను వివరణ ఉన్నట్లు , దేవతలను ఉద్దేశించి నిర్దిష్టమైన ద్రవ్యమును ( పదార్థమును ) అర్పించునదే యాగము లేక యజ్ఞము. ఏ దేవతకు దేనిని ఆశించి యే ద్రవ్యమును అర్పించవలెను అనుదానికి ప్రమాణము శృతి లోనే కలదు. అదెట్లున్ననూ , అగ్నిదేవుడికి దేవతలను ఉద్దేశించి హవిస్సును అర్పించు కార్యకలాపమునే ’ యజ్ఞము ’ అనవచ్చునని తెలియుచున్ననూ ’ యజ్ఞము అను పదమునకు ఇంకా విస్తారమైన అర్థములు వాడుకలో ఉన్నవి. భగవద్గీతలో భగవంతుడు అర్జునునికి ద్రవ్య యజ్ఞము , జ్ఞాన యజ్ఞము , తపో యజ్ఞము మొదలైనవి తెలిపి , చివరికి ’ ఆత్మ సాక్షాత్కారము ’ చేసుకొనుట కూడా యజ్ఞమే పొమ్మన్నాడు.

ఇలాగ దేవతలను సంతోష పరచుటకే అయిననూ , యజ్ఞము వలన అనేక లౌకిక ప్రయోజనములున్నాయి. మనుస్మృతిలో ఇలాగుంది:

|| అగ్నౌ ప్రాస్తాహుతిః సమ్యగాదిత్యముపతిష్ఠతే |
ఆదిత్యాజ్జాయతే వృష్ఠిః వృష్టేరన్నం తతః ప్రజాః ||

          విధిపూర్వకముగా అగ్నిలో వదలిన హవిస్సు యొక్క రసమునంతటినీ ఆదిత్యుడు పీల్చుకొనువాడు. కాబట్టి ఆ రసము ఆదిత్యుని చేరి వృష్ఠిగా పరిణమిస్తుంది. ఆ వర్షము వలన ఆహారము దొరకును. ఆహారము వలన జీవులు పుడతారు.

గీతలో కూడా ,

|| అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః |
యజ్ఞాద్భవతి పర్జన్యః యజ్ఞః కర్మ సముద్భవః || ( ౩-౧౪ )

         సర్వప్రాణుల పుట్టుట, పెరుగుటకు అన్నమే కారణము. అన్నము ( సస్యము ) వాన నుండీ కలుగును. ఆ వాన యజ్ఞముల వలన కలుగును. ఆ యజ్ఞములు వేదోక్తమైన కర్మల వలన సంభవించును.

యజ్ఞముల ఆవశ్యకత

          మానవుడు రకరకాల కర్మలను చేస్తూనే ఉంటాడు. మళ్ళీ గీతలోనే చెప్పినట్లు , | న హి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్యకర్మకృత్ | --ఎవరూ ఒక్క క్షణముకూడా కర్మ రహితులై ఉండలేరు. అయితే ఆ కర్మ ఏది చేయవలెను అన్నది ఎంచుకొను స్వాతంత్ర్యము మానవునికి ఉన్నది.
అయితే శృతి ఇలాగంటుంది ,

|| యజ్ఞోపి శ్రేష్ఠతమమ్ కర్మ ||

యజ్ఞమే అన్ని కర్మముల కన్నా శ్రేష్టమైనది.

కాబట్టి మన శ్రేయస్సుకు వేదమే తెలిపిన యజ్ఞమనే కర్మను ఎంచుకొనుట ఉచితము కాదా !!

         సరే , యజ్ఞమే గొప్ప కర్మ అని వేదమెందుకు అన్నది ?  వేదము ఉన్నది మానవాళి కోసమే. దేవతల కోసము కాదు. వేద విహిత కర్మలను చేయగలుగువాడు మానవుడే కానీ దేవతలు కాదు. వారు చేయాలనుకున్నా , మానవుడిగా పుట్టి చేయవలసినదే. కాబట్టి మానవుడికి యజ్ఞమే గొప్ప కర్మ యని వేదము తెలుపుటకు కారణమేమి ? అందులోని లౌకికార్థము లేదా , లౌకిక ప్రయోజనము ఏమిటి ?

          లోకములో చైతన్యము ఉండవలెనన్న , ఉష్ణము మరియూ కాంతి తప్పనిసరిగా అవసరము. అవి లేనినాడు చైతన్యము లేదు , జీవులు లేరు. చీకట్లో విత్తనము నాటబడినా , అది వెలుగు వైపుకే తీగగా పెరుగుతుంది. కాంతి లేని , మేఘావృతమైన దినమును సంస్కృతములో ’ దుర్దినము ’ అంటారు. ( మేఘచ్ఛన్నేఽహ్ని దుర్దినమ్ --- అమర కోశం ). కాబట్టి , చైతన్యము , ఉత్సాహము వంటివి కలగాలంటే అది ఎండ , వెలుగుల వలననే సాధ్యము. ఉష్ణము దేహములో ఉన్నంత వరకే దేహపు అస్తిత్వము. ఈ ఉష్ణము , వెలుగు లకు మూలము , సూర్యుడు మరియు అగ్ని. సూర్యుడు మనకు అన్నివేళలా అందుబాటులో ఉండడు. వాడినుండి మనకు అన్నివేళలా , అన్ని ప్రాంతాలలో ఉష్ణము దొరకదు. ఇక మిగిలినది అగ్ని.

         సూర్యోపాసన , సూర్య పూజ ల ఫలితములు వేరు , అగ్న్యుపాసన యొక్క ఫలితములు వేరు. సూర్యుడు ఒకదానికి అవసరమైతే , అగ్ని ఇంకొకదానికి అవసరమగును. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడిమి , వెలుగు కావాలంటే అగ్నియే శరణము. ( ఈ కాలము సౌర శక్తిని ఉపయోగించి ఎప్పుడు కావాలంటే అప్పుడు కాంతి , ఉష్ణములను పొందే ప్రయత్నము మానవుడు చేయుచున్నా , దానికి అనేక పరిమితులు గలవు )  కాబట్టి అగ్ని సంరక్షణ , ఉపాసనలు అవసరము. ఈ దృక్పథముతోనే మానవ జీవితములో అగ్ని ఆరాధన అనేది ఒక భాగమైపోయింది.

యజ్ఞములు ఆరంభమైనది ఎప్పుడు ?

|| సహ యజ్ఞాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః |
అనేన ప్రసవిష్యధ్వమేష వోఽస్త్విష్ట కామధుక్ ||

      అని గీతలో చెప్పినట్లు , ప్రజాపతి ప్రజలను సృష్ఠించునపుడే వారితో పాటే యజ్ఞములను సృష్ఠించినాడు. ( ప్రజలనుద్దేశించి , ) ఈ యజ్ఞముల వలన మీరు వృద్ధి పొందండి, యజ్ఞములు మీరు కోరినవి ఇచ్చును గాక ||

|| దేవాన్భావయతానేన తే దేవా భావయంతు వః |
పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ ||

         ఈ యజ్ఞముల వలన మీరు దేవతలను తృప్తి పరచండి , దేవతలు మిమ్మల్ని అనుగ్రహించి మిమ్మల్ని తృప్తి పరుస్తారు. ఇలాగ పరస్పర సహకారముతో వృద్ధి పొంది పరమ శ్రేయస్సు అగు మోక్షమును పొందండి.

కాబట్టి ఇచ్చిపుచ్చుకొనుటయే యజ్ఞము.

యజ్ఞములు అవసరము లేని వారు , చేయనవసరము లేని వారు ఎవరు ?

|| ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః |
తైర్దత్తానప్రదాయైభ్యో యో భుంక్తే స్తేన ఏవ సః ||

         మీకు ఇష్టమైన భోగములను యజ్ఞపూజితులైన దేవతలు ఇస్తారు. దేవతలు ఇచ్చు కొన్నిటిని ( నీరు , వెలుగు , ఉష్ణము , సస్యములు మొ|| ) ఉపయోగించుకొని , తిరిగి దేవతలకు ఏమీ ఇవ్వకుండా తాను మాత్రము అనుభవించువాడు చోరుడే అవుతాడు.

కాబట్టి ,ప్రతియొక్కరూ , ఎప్పుడో ఒకప్పుడు దేవతలకు హవ్యమును ఇచ్చి తీరవలసిందే. ఎవరికీ మినహాయింపు లేదు.


        సరే , బాగానే ఉంది , అయితే అగ్నికి బదులు సూర్యుడిని ఎందుకు ఉపాసించరాదు ? సూర్యుడు ఎక్కడో ఉన్నంత మాత్రాన మనకు మానసికముగా అందుబాటులో లేనట్టా ? అనే ప్రశ్న కలగవచ్చు. దీనికి సమాధానము కూడా వేదమే చెబుతుంది, తైత్తిరీయ బ్రాహ్మణములో ఇలాగుంది,

|| అగ్నిం వావాదిత్యః సాయం ప్రవిశతి ||మరియూ ,
|| సౌరం తేజః సాయమగ్నిం సంక్రమతే |

అనగా , సూర్యుని తేజస్సు సాయంకాలములో అగ్నిని ప్రవేశిస్తుంది. అలాగే ,

ఉద్యంతం వావాదిత్యమగ్నిరను సమారోహతి |

         అనగా , అగ్ని యొక్క తేజస్సు ప్రాతః కాలములో సూర్యుని చేరును. అంతేకాక, ఇంకొన్ని నియమముల ప్రకారము , ఔపాసనా హోమము రోజుకు విధిగా రెండు సార్లు చేయవలెను. మొదటిసారి చేస్తున్నపుడు సాయంకాలమే మొదలు పెట్ట వలెను. సాయంకాలము చేసినవాడే ప్రాతః కాలములో కూడా చేయవలెను. సాయంకాలము పాలతో చేస్తే , ప్రాతః కాలము కూడా పాలతోనే చేయవలెను. ( నెయ్యి , పెరుగులతో చేసినా అదేవిధముగా అదే పదార్థముతో సాయంత్రమూ పొద్దున్నా చేయవలెను. ) దీనికి కారణమేమంటే ,  సాయంకాలము మరియూ తరువాతి ప్రాతః కాలమూ అనుష్ఠానము చేసిన హోమములు రెండుగా కనిపించినా అవి రెండూ కలిపి ఒక్క హోమమేయనబడును. కాబట్టి , మొదట సాయంత్రమే మొదలుపెట్టి చేయవలెను గనక , తిరిగి ప్రాతఃకాలములో చేయునది దానికి కొనసాగింపే గనక , రెండు పూటలా అగ్నినే  ఉపాసించి , అగ్నికే ఆహుతినీయవలెను.

        అంతే కాక , ఔపాసనలో పలికే మంత్రములను చూస్తే , వాటికి , అగ్నీ , జ్యోతీ ఒక్కటే , సూర్యుడూ , జ్యోతీ ఒక్కటే అన్న అర్థము వస్తుంది.

|| అగ్నిర్జోతిర్జ్యోతిరగ్నిః స్వాహా ||
|| సూర్యో జ్యోతిర్జ్యోతిః సూర్యః స్వాహా ||

అనికానీ , లేదా

|| అగ్నిర్జోతిర్జ్యోతిస్సూర్యః స్వాహా ||
|| సూర్యో జ్యోతిర్జ్యోతిరగ్నిః స్వాహా ||

         అని పలుకుతాము. మొదటిది అసంసృష్ఠ హోమమనీ , రెండోది సంసృష్ఠ హోమమనీ అంటారు. ఏ విధముగానైనా చేయవచ్చు. కాబట్టి ఏ విధముగా హోమము చేసిననూ హవిస్సును అగ్నికే ఇచ్చుటకు ఇదే కారణము. అందుకే దీనిని ’ అగ్నిహోత్రము ’ అంటారు.


( మిగిలిన వివరములూ , విధానములు తరువాతి భాగములలో చూడుడు )

Tuesday, February 25, 2014

అగ్నికార్యము ---విధానము



అగ్నికార్యము

పరాశరులు  ద్విజుల కర్తవ్యములను గురించి ఇలాగంటారు

|| అగ్నికార్య పరిభ్రష్ఠా స్సంద్యౌపాసన వర్జితాః | వేదం చ యేనధీయానాస్తే సర్వే వృషలాస్మృతాః || 

" అగ్నికార్యము   సంధ్యావందనము , బ్రహ్మ యజ్ఞము , వైశ్వదేవము ,  ఔపాసనము , వేదాధ్యయనము --వీటిని వదలిన ద్విజులు ’ వృషలులు ’ అనబడతారు.  వృషలుడనగా పతితుడు. అట్టివానికి సమాజమున గౌరవముగానీ ఇతర శుభ కర్మలు చేయు అధికారము గానీ ఉండదు.ఇవి చేయుట వలన గౌరవము , అధికారమే కాకుండా అనేక ఇతర  విశేషమైన మహోపయోగములు కూడా కలవు. 

మొదటిదైన ’ అగ్ని కార్యమును ’  గురించి తెలుసుకుందాము. దీనినే ’ సమిదాధానము ’ అనికూడా అంటారు. బ్రహ్మచారులు చేయునది సమిదాధానము. గృహస్థులు చేయునది ’ ఔపోసనము ’ 

అగ్నికార్యమనగా అగ్నిని వెలిగించి చేయు ఏదో ఒక కార్యము కాదు. బ్రహ్మచారి అగ్ని ( యజ్ఞేశ్వరుని యొక్క )  పరిచర్యను చేయుటనే అగ్నికార్యము అందురు. పూర్వము మృత్యుదేవత బ్రహ్మచారులను పట్టి పీడించేది. ఆ మృత్యువు బారి నుండీ బ్రహ్మచారులు పడకుండా అగ్నిదేవుడు వారిని వరమిచ్చి కాపాడినాడు. కాబట్టి మృత్యు దేవతనుండీ బ్రహ్మచారులను కాపాడి ఉద్ధరించిన అట్టి అగ్నిదేవుని పరిచర్య చేయుట బ్రహ్మచారుల విధి. అగ్నికార్యము వదలిన బ్రహ్మచారులను సమిధలుగా మృత్యువు తీసుకొనును. ( అగ్నికార్యమును వదలిపెట్టిన బ్రహ్మచారులకు ప్రాయశ్చిత్తంగా ’ మితాక్షరి ’ , చంద్రిక ’ , ’ ఋగ్విధానము ’ యను గ్రంధములలో తీవ్ర విధానములు విధింపబడినవి. ఒకసారి మానేస్తే శివాలయం లో ’ మానస్తోకే ’ మంత్రాన్ని నూరు సార్లు జపించవలెను. సంధ్య , అగ్నికార్యములను వదలిన వాడు ఎనిమిది వేల గాయత్రీ జపాన్ని చేయవలెను. )

జపము , తపము , స్తోత్రము , అర్చన , పూజ వీటన్నిటికన్నా హోమము చేయుట వలన అతి శీఘ్రముగా ఫలితములు కలుగును. దీనికి కారణమేమనగా , పైవాటిని అనుష్ఠించునపుడు మన మనస్సును నిశ్చలముగా భగవంతుని పైనే కేంద్రీకరించుట అతి కష్టము. అనేక విధములైన ఆలోచనలతో చేయు ఆ పూజలు భగవంతునికి చేరుటకు కఠోర దీక్ష అవసరము. అయితే , హోమములోని విశేషమేమనగా , మనము హవ్యములను ఆహుతి ఇచ్చిన మరుక్షణమే అవి యజ్ఞేశ్వరునికి అందును. ఆ ఆహుతులను యజ్ఞేశ్వరుడు హవ్య కవ్యములుగా మార్చి మనము ఉద్దేశించిన దేవతలకు అందించును.  అందువలన హోమము అతి ఉపయుక్తమైన అనుష్ఠానము. 

హోమమనిన మరియేమో కాదు , మానవులు , దేవతల మధ్య ఒక ఒడంబడిక. మనకు కావలసిన అనేక శుభములను దేవతలు లిప్తకాలములో ఇవ్వగల సమర్థులు. వారు చేయునదెల్లా మన మనసులను ప్రేరేపించుటయే. మనకు ఏ కార్యము కావలెనన్ననూ , ఇంకొకరి అవసరము తప్పదు కదా, అలాగ అందరి మనసులను మనకు అనుకూలముగా మార్చగల శక్తి కలవారు. అయితే దేవతలకు కావలసిన హవ్య కవ్యములు వారికి అతి దుర్లభములు. మన వలె వారు భోజనము చేయలేరు. నీటిని త్రాగలేరు. కేవలము వారికని సంకల్పించి ఎవరైనా సమర్పిస్తే , వాటిని చూచి గానీ , ఆఘ్రాణించి గానీ తృప్తి పడతారు. వాటిని సంపాదించుటకు వారికి దేహము లేదు, అనగా మానవుడికి వలె పాంచభౌతికమైన దేహము లేదు. కనుక అవి మానవులు మాత్రమే వారికి ఇచ్చుటకు సమర్థులు. ఈ రహస్యమును తెలుసుకొని , అందరూ దేవతలను ఆరాధించునది అందుకే. 


 అగ్ని కార్యము చేయుట వలన , అతి గొప్పవైన  బ్రహ్మ వర్చస్సు, మేధ , బుద్ధి , తేజస్సు, పరివారము , ఇంద్రియ పుష్టి , బలము , సంపదలు మొదలగునవి కలుగుతాయి. అగ్నికార్యము చేయువానిని చెడుశక్తులు తేరిపారి కూడా చూడలేవు. ఇతరుల పాపపు దృష్టి వారిపై పడదు. 

క్రమము తప్పక అగ్నికార్యమును చేయు బ్రహ్మచారి మేధస్సును , తేజస్సును , వర్చస్సును చూచినచో అతనికి సర్వులూ వశము కావలసినదే. అనగా , అతడిని అందరూ అభిమానముతో ఆరాధించెదరు. 
అగ్నికార్యము చేయుట నేర్చుకొన్న తర్వాత , రోజూ చేస్తూ ఉంటే , అలవాటు అయిపోయి అయిదు నిముషములకన్నా ఎక్కువ తీసుకోదు. మొదట్లో ఎక్కువ సమయము పట్టవచ్చును. కాబట్టి శ్రద్ధ ఉన్నవారు తీరిక సమయములో మొదట నేర్చుకొని తరువాత అనుష్ఠించవచ్చును. ( వీలైతే ఇందులోని మంత్రములను పలికి ఆడియో ఫైల్ గా ఇవ్వగలను  )

అగ్నికార్యము నిత్య నైమిత్తిక కార్యముకోవకు వస్తుంది. అనగా ,ఏ కర్మను తప్పనిసరిగా ప్రతిదినమూ చేయవలెనో , ఏ కర్మను చేయకపోతే దానికి ప్రత్యవాయము కలదో అది నిత్య కర్మ. నైమిత్తికమనగా విశేష దినములలో చేయవలసిన కార్యములు. ఉపాకర్మ , శ్రాద్ధములు , అమావాస్య , గ్రహణ ఇత్యాది తర్పణములు మొదలైనవి. 


అగ్ని కార్యములో ఉపయోగించవలసిన సమిధలు : అగ్నికార్యము చేసిన ప్రతిసారీ పద్ధెనిమిది సమిధలు అవసరమగును.  శమీ ( జమ్మి ) , పలాశ ( మోదుగ ) , వైకంకత ( వెలగ ) , అశ్వత్థ ( రావి ) , ఔదుంబర ( మేడి , అత్తి ) , బిల్వ ( మారేడు ) , చందన ( గంధపు చెక్క ) , శాల (  సాల ) , దేవదారు , ఖాదిర ( చండ్ర ) ఈ చెట్ల లో ఏదో ఒక చెట్టు సమిధనైనా , లేదా అనేక చెట్ల సమిధలనైనా వాడ వచ్చు.  ఈ సమిధలు  బొటన వేలికన్నా లావు ఉండరాదు , పైన బెరడు తీసి ఉండరాదు, పురుగులు , చెదలు పట్టి ఉండరాదు , జుత్తెడు ( జానెడు కన్న కొంచము ఎక్కువైన , అనగా ఆరు అంగుళాలైనా ఉన్నది )  పొడవు ఉండవలెను. చీలి కాని , రెండు కొమ్మలుగా గానీ ఉండరాదు. ఆకులతో చేరి ఉండరాదు. పూర్తిగా ఎండిపోయి కృశించి ఉండరాదు. వంకర తిరిగి ఉండరాదు. కణుపులు ఉండరాదు. అటువంటి సమిధలనే వాడవలెను. 

ఇవేవీ దొరకని పక్షములో చివరికి దర్భలను కూడా వాడ వచ్చును కానీ అగ్నికార్యమును చేయుట మానరాదు అని కొందరి మతము. 

విశేష నియమములు : అగ్ని కార్యము చేయుటకు ఒక స్థండిలము కావలెను. అనగా హోమ కుండము. దీనిని ఇటుకలతో చేసుకొన వచ్చును. లేదా ఈ మధ్య వాడుటకు సిద్ధముగా ఉన్న అనేక లోహపు స్థండిలములు దొరకుచున్నవి. దానిలోపల ఇసుక వేసి , పైన కొద్దిగా బియ్యము కానీ బియ్యపు పిండిగానీ పరచవలెను. ఉపనయనము అయిన నాటి నుడీ ఆ ఉపనయనాగ్నిలోనే సాయంత్రము మొదలుపెట్టి , ఉదయమూ , సాయంత్రమూ అగ్నికార్యము చేయవలెను. అది కుదరని యెడల , లౌకికాగ్ని లోనే చేయవలెను. హోమములు , యజ్ఞములు చేయునపుడు , అగ్నిని ప్రార్థించి , హోమానికి రక్షగా మంత్రములతో అభిమంత్రించిన నీటిని , బ్రహ్మను నియమించి , యజ్ఞాయుధములను ( అనగా షట్పాత్రలు లేదా చతుష్పాత్రలు ) మరియు ఆజ్యమును , చరువును సంస్కరించి , అగ్నికి పరిస్తరణములు , పరి సమూహనము , అలంకారము , పూజ మొదలగునవి  చేయు కర్మను " అగ్ని ముఖము " అందురు. అందులో నెయ్యి అవసరమగును. 

 అగ్ని కార్యము చేయుటకు షట్పాత్ర , చతుష్పాత్ర ప్రయోగము లేదు. పూర్తి స్థాయిలో అగ్నిముఖము చేయకపోయినా , కొన్ని క్రమములను పాటించవలెను. విధానములో వాటిని చూడ వచ్చును. 

స్నానముతో శుచుడై , మడి బట్టలు కట్టుకొని , సంధ్యావందనము చేసి , ఆ తరువాత తూర్పుకు తిరిగి హోమకుండము ముందర ఆసనముపై కూర్చొనవలెను. స్నాన సంధ్యలు చేయకుండా ఎన్నటికినీ అగ్నికార్యము చేయరాదు. చేసిననూ నిష్ఫలమగును. యే అనుష్ఠానము చేసిననూ , మొదట విధిగా రెండు సార్లు ఆచమనము చేయవలెను. ఒక్క సారి మాత్రమే చేయరాదు.  ఆచమనము , ప్రాణాయామము చేసి  ఈ విధముగా సంకల్పము చెప్పవలెను ,

విధానము : 
మమోఽపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య , శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం , ప్రాతరగ్ని ( సాయంకాలమైతే  సాయమగ్ని అని ) హోమ కార్యం కరిష్యే | ( లేదా సమిధమాధాస్యే )  ( కుడి చేతితో నీళ్ళు ముట్టుకొన వలెను ) 

కుండములో కట్టెలు , ఎండిన పిడకలు మొదలైనవి వేసి అగ్నిని ప్రజ్వలింపజేయవలెను. ప్రజ్వలింపజేయునపుడు ఈ మంత్రమును చెప్పవలెను

|| ఉపావరోహ జాతవేదః పునస్త్వమ్ | దేవేభ్యో హవ్యం వహనః ప్రజానన్ |
ఆయుః ప్రజాగ్ం రయిమస్మాసు ధేహి | అజస్రో  దీదిహినో దురోణే ||

భూర్భువస్సువరోం | అగ్నిమ్ ప్రతిష్టాపయామి. 

ఇప్పుడు  ఒక  సమిధను తీసుకొని, జ్వలిస్తున్న యజ్ఞేశ్వరుడికి ఆహుతి వేసి ఈ కింది మంత్రమును చెప్పవలెను.

|| ఓం స్వాహా జుషస్వనః సమిధమగ్నే అద్యశోచా బృహద్యజతం ధూమమృణ్వన్ |
ఉపస్పృశ దివ్యగ్ం సానస్తూపైః సగ్ం రశ్మిభిస్తతనః సూర్యస్య ||

అగ్నిని ప్రజ్వలించిన తరువాత ఈ మంత్రాన్ని చెప్పవలెను

|| పరిత్వాగ్నే పరిమృజామ్యాయుషా చ ధనేన చ | సుప్రజాః ప్రజయా భూయాసగ్ం సువీరో వీరైస్సువర్చా వర్చసా సుపోషః పోషైః స్సుగృహో గృహైస్సుపతిః పత్యా సుమేధా మేధయా సుబ్రహ్మా బ్రహ్మ చారిభిః ||

ఇప్పుడు  అక్షతలు , పూలు తీసుకొని కుండమునకు ఎనిమిది మూలలందూ కొద్దిగా ఉంచుతూ అగ్నిదేవుడికి అలంకారము ,చేయవలెను. తూర్పు నుండీ మొదలు పెట్టి , ఆగ్నేయమూల మీదుగా ప్రదక్షిణముగా వదలుతూ ఈశాన్యము వరకూ ఎనిమిది దిక్కులలోనూ అక్షతలు వదలునపుడు వరుసగా ఈ ఎనిమిది మంత్రములను చెప్పవలెను

|| అగ్నయే నమః | హుతవహాయ నమః | హుతాశినే నమః | కృష్ణ వర్త్మనే నమః | దేవముఖాయ నమః | సప్తజిహ్వాయ నమః | వైశ్వానరాయ  నమః | జాతవేదసే నమః || 

అటులే అగ్ని మధ్యలో కూడా వేసి ఈ మంత్రమును చెప్పవలెను

|| మధ్యే శ్రీ యజ్ఞపురుషాయ నమః || 

ఇప్పుడు కింది విధముగా అగ్ని పరిషేచనం చేయవలెను.

కుడిచేతితో కొద్దిగా నీరు తీసుకొని , హోమకుండమునకు బయట కుడి ప్రక్క , అనగా దక్షిణము న పడమటి నుండి తూర్పుకు  ధారగా ఈ మంత్రముతో నేలపై నీరు వదలవలెను. 

అదితేను మన్యస్వ | 

తర్వాత మళ్ళీ నీరు తీసుకొని , కుండమునకు పశ్చిమమున , దక్షిణము నుండీ ఉత్తరమునకు ( దక్షిణపు నీటిని కలుపుకొని ) ధారగా ఈ మంత్రముతో నేలపై నీరు వదలవలెను.

అనుమతేను మన్యస్వ |

తర్వాత మళ్ళీ కుండమునకు ఎడమవైపున /ఉత్తరము వైపు , పడమటి నుండి తూర్పుకు ( పశ్చిమపు నీటిని కలుపుకొని) ధారగా ఈ మంత్రముతో నీరు వదలవలెను. 

 సరస్వతేను మన్యస్వ |  

చివరిగా కుండమునకు తూర్పున , ఈశాన్యమునుండీ మొదలుపెట్టి కుండము చుట్టూ ప్రదక్షిణముగా మరలా ఈశాన్యమునే కలుపుతూ ధారగా ఈ మంత్రముతో నీరు వదలవలెను. 

దేవసవితః ప్రసువ |

ఇప్పుడు మిగిలిన పదిహేడు సమిధలను తీసుకొని , ఒక్కొక్క దానినీ కింది పదిహేడు మంత్రములతో 
( ఒక మంత్రమునకు ఒక సమిధ ) స్వాహాకారము చెప్పి క్రమముగా సమిదాధానము ( ఆహుతి ) చేయవలెను. 

౧. || అగ్నయే సమిధమాహార్షం బృహతే జాతవేదసే యథా త్వమగ్నే సమిధా సమిధ్య స ఏవం మామాయుషా వర్చసా సన్యా మేధయా ప్రజయా పశుభిర్బ్రహ్మ వర్చసేనాన్నాద్యేన సమేధయ స్వాహా ||

౨. ఏధోఽస్యేధిషీమహి స్వాహా ||

౩. సమిదసి సమేధిషీమహి స్వాహా ||

౪. తేజోఽసి తేజో మయి ధేహి స్వాహా ||

౫. అపో అద్యాన్వచారిషగ్ం రసేన సమసృక్ష్మహి పయస్వాగ్ం అగ్న ఆగమం తం మా సగ్ంసృజ వర్చసా స్వాహా ||

౬. సం మాగ్నే వర్చసా సృజ ప్రజయా చ ధనేన చ స్వాహా ||

౭. విద్యున్మే అస్య దేవా ఇంద్రో విద్యాథ్సహ ఋషిభిస్వాహా ||

౮. అగ్నయే బృహతే నాకాయ స్వాహా ||

౯. ద్యావాపృథివీభ్యాగ్ స్వాహా ||

౧౦. ఏషా తే అగ్నే సమిత్తయా వర్ధస్వ చాప్యాయస్వ చ తయాహం వర్ధమానో భూయాసమాప్యాయమానశ్చ స్వాహా ||

౧౧. యో మాగ్నే భాగినగ్ం సంతమథాభాగం చికీర్షత్య భాగమగ్నే తం కురు మామగ్నే భాగినం కురు స్వాహా ||

౧౨. సమిధ మాధాయాగ్నే సర్వవ్రతో భూయాసగ్గ్ స్వాహా ||

౧౩. భూః స్వాహా ||  అగ్నయ ఇదమ్ నమమ

౧౪. భువః స్వాహా || వాయవ ఇదం నమమ

౧౫. సువః స్వాహా || సూర్యాయేదం నమమ

౧౬. భూర్భువస్సువస్స్వాహా || ప్రజాపతయ ఇదం నమమ 

౧౭. స్వాహా జుషస్వనః | 

సమిధలు సరిపడా లేని పక్షములో కనీసము చివరి అయిదు ఆహుతులనైనా వేయవలెను. ( భూః స్వాహా నుండీ స్వాహా జుషస్వనః   వరకూ ) 

ఇప్పుడు మరలా వెనుకటి వలెనే , ఈ కింది మంత్రములతో అగ్ని పరిషేచనము చేయవలెను. 

కుడిచేతితో కొద్దిగా నీరు తీసుకొని , హోమకుండమునకు బయట కుడి ప్రక్క , అనగా దక్షిణము న పడమటి నుండి తూర్పుకు  ధారగా ఈ మంత్రముతో నేలపై నీరు వదలవలెను. 

అదితేఽన్వ మగ్గ్‌స్థాః  | 

తర్వాత మళ్ళీ నీరు తీసుకొని , కుండమునకు పశ్చిమమున , దక్షిణము నుండీ ఉత్తరమునకు ( దక్షిణపు నీటిని కలుపుకొని ) ధారగా ఈ మంత్రముతో నేలపై నీరు వదలవలెను.

అనుమతేఽన్వ మగ్గ్‌స్థాః  | 

తర్వాత మళ్ళీ కుండమునకు ఎడమవైపున /ఉత్తరము వైపు , పడమటి నుండి తూర్పుకు ( పశ్చిమపు నీటిని కలుపుకొని) ధారగా ఈ మంత్రముతో నీరు వదలవలెను. 

 సరస్వతేఽన్వ మగ్గ్‌స్థాః  | 

చివరిగా కుండమునకు తూర్పున , ఈశాన్యమునుండీ మొదలుపెట్టి కుండము చుట్టూ ప్రదక్షిణముగా మరలా ఈశాన్యమునే కలుపుతూ ధారగా ఈ మంత్రముతో నీరు వదలవలెను. 

దేవసవితః ప్రాసావీః |

తరువాత కింది మంత్రములు చెప్పుచూ అగ్న్యుపస్థానము చేయవలెను. అగ్ని ఉపస్థానము అనగా యజ్ఞేశ్వరుని ప్రార్థిస్తూ , బ్రహ్మచారి , తనను సర్వదా కాపాడమని , తనకు తేజస్సు , వర్చస్సు , మేధ , బుద్ధి , సంపదలు , బలము మొదలగునవి ఇవ్వమని వేడుకొనుట. 

|| యత్తే అగ్నే తేజస్తేనాహం తేజస్వీ భూయాసమ్ | యత్తే అగ్నే వర్చస్తేనాహం వర్చస్వీ భూయాసమ్ | యత్తే అగ్నే హరస్తేనాహం హరస్వీ భూయాసమ్ || 

|| మయి మేధాం మయి ప్రజాం మయ్యగ్నిస్తేజో దధాతు | మయి మేధాం మయి ప్రజాం మయీంద్ర ఇంద్రియం దధాతు | మయి మేధాం మయి ప్రజాం మయి సూర్యో భ్రాజో దధాతు || 


ఈ కింది మంత్రమును చెప్పుచూ హోమ కుండపు తూర్పు వైపు నుండీ గానీ ఉత్తరము నుండీ గానీ ఒక సమిధతో భస్మమును సంగ్రహించవలెను. 

|| మానస్తోకే తనయే మాన ఆయుషి మా నో గోషు మా నో అశ్వేషు రీరిషః | వీరాన్మానో రుద్రభామితో వధీర్‌హవిష్మంతో నమసా విధేమ తే || 

తరువాత , ఆ భస్మమును ఈ మంత్రములు చెప్పుచూ శరీరములోని ఆయా భాగములలో ఉంచుకొనవలెను. 

మేధావీ భూయాసమ్ | (  లలాటమున భస్మమును పూసుకొన వలెను )

తేజస్వీ భూయాసమ్ | ( హృదయమున )

వర్చస్వీ భూయాసమ్ | ( కుడి భుజము )

బ్రహ్మ వర్చస్వీ భూయాసమ్ | ( ఎడమ భుజము )

ఆయుష్మాన్ భూయాసమ్ | ( కంఠము ) 

అన్నదో భూయాసమ్ | ( జఠరము  అనగా నాభి పైభాగము ) 

యశస్వీ భూయాసమ్ | ( శిరస్సు )

సర్వ సమృద్ధో భూయాసమ్ | ( శిరస్సు )

తర్వాత ఈ మంత్రములను చెప్పవలెను

|| పునస్త్వాదిత్యా రుద్రా వసవస్సమింధతాం పునర్బ్రహ్మాణో వసునీథయజ్ఞైః | ఘృతేనత్వం తనువో వర్ధయస్వ సత్యాస్సంతు యజమానస్య కామా స్వాహా || 

యజ్ఞేశ్వరుడికి ప్రదక్షిణము చేసి మరలా తన స్థానములో నిలుచుకొని నమస్కరిస్తూ ఇది చెప్పవలెను.

||మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాశన | యద్ధుతంతు మయా దేవ పరిపూర్ణం తదస్తు మే || 

|| స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం | ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే హవ్యవాహన | శ్రియం దేహి మే హవ్యవాహన | ఓమ్ నమః || 

అభివాదనమ్ 

( ఇక్కడ ప్రవర చెప్పుకోవలెను )

|| చతుస్సాగర పర్యంతం .........అహంభో అభివాదయే || 

|| హోమాంతే శ్రీ యజ్ఞపురుషాయ నమః || ధ్యానాది షోడశోపచారాన్ సమర్పయామి ||

అనేన ప్రాతః ( సాయం )  సమిదాధాన హోమేన భగవాన్ శ్రీ యజ్ఞేశ్వరః ప్రీయతామ్ || 

భగవదర్పణమ్

|| కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేస్స్వభావాత్ | 
కరోమి యద్యద్సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి ||


|| శుభం భూయాత్ ||