ఔపాసన నాలుగవ భాగము - పునస్సంధానమ్
ఈ పునస్సంధానమును అగ్ని నష్టమయిన ప్రతిసారీ , మరలా ఔపాసన చేయుటకు ముందర , అధికారము కొరకు చేయవలెను.
ఇప్పుడు పునస్సంధానము పద్దతి ( చతుష్పాత్ర ప్రయోగము ) చూద్దాము.
ఉదయము సంధ్యావందనము ముగించి , శుచుడై మడిబట్టలతో , రెండుసార్లు ఆచమనము చేయవలెను.( ఓం కేశవాయ స్వాహా .... కృష్ణాయ నమః )
తర్వాత ( వీలైన పవిత్రమును ధరించి, ) ప్రాణాయామము చేయవలెను. ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః , పరమాత్మా దేవతా, దైవీ గాయత్రీ ఛందః ..( ఓం భూః...భూర్భువస్సువరోమ్ )
సంకల్పము : మమ ఉపాత్త -----ప్రీత్యర్థమ్ , అస్మాకం సహ కుటుంబానామ్ క్షేమ స్థైర్య , వీర్య , విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృధ్యర్థమ్ , ధర్మార్థ , కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థమ్ , అంతరతః ఔపాసనాగ్నే సద్యః పునస్సంధాస్యే | తతః స్థండిల ఉల్లేఖనాద్యగ్ని ప్రతిష్టాపనం కరిష్యే |
యత్రాగ్నిస్థాప్యతే , తత్ర సికతాభిర్మృదావాస్థండిలం చతురస్రం కృత్వా || అరత్ని మాత్రం ||
అగ్నిని ప్రతిష్ఠించు ఒక పరిశుద్ధమైన ప్రదేశములో అరత్ని మాత్రం అనగా, పిడికెడు తక్కువ మూరెడు పొడవు , అంతే వెడల్పు గల చతురస్రాకారం గల అరుగు మట్టితో కానీ , ఇసుకతో కానీ చేయవలెను. ఈ కాలము దీనికి బదులు ఇనప కుండమును లోపల ఇసుక వేసి వాడుతున్నారు. కొందరికి అది నిషిద్ధము. అవకాశమున్నవారు ఇటుకలతో ఒక కుండమును శాశ్వతముగా చేసుకోవచ్చును. ఆ కుండమునకు పశ్చిమమున , తూర్పుకు తిరిగి కూర్చోవలెను.
తస్యోపరి తండులైః పిష్టేనవా ప్రాదేశమాత్రం చతురస్రం కృత్వా ||
ఆ మట్టి అరుగుపైన బియ్యమును కానీ బియ్యపు పిండిని కానీ చతురస్రముగా నింపి పరచవలెను.
అంగుష్ఠానామికాభ్యాం , ద్వౌ, త్రయో వా దర్భాన్ గృహీత్వా | సంతత మృజూర్దక్షిణత ఆరభ్య ఉదక్సంస్థాః ప్రాచీస్తిస్రో రేఖా లిఖిత్వా | తాస్వేవ రేఖాసు పశ్చిమత ఆరభ్య ప్రాక్సంస్థాః ఉదీచీస్తిస్రో రేఖా లిఖిత్వా |
తర్వాత బొటనవేలు , ఉంగరపు వేళ్లతో రెండు లేక మూడు దర్భలు తీసుకొని , దానిపై ఆ దర్భ మొదళ్ళతో ( అగ్రములు కాదు ) పడమటి నుండీ తూర్పుకు మూడు నిలువు గీతలు గీయవలెను. ఆ గీతలు మొదట అరుగుకు కుడివైపునకు అనగా దక్షిణము వైపున మొదలుపెట్టి, రెండోగీత మధ్యలోనూ , చివరి గీత ఎడమ వైపు అనగా ఉత్తరమునకు ఉండవలెను. మరలా ఆ రేఖల పైన ఇప్పుడు అడ్డముగా , అంటే దక్షిణము నుండీ ఉత్తరానికి , మొదట పశ్చిమమునుండీ మొదలు పెట్టి ఒకటి , తర్వాత దానిపైన మధ్యలో ఒకటి , మూడోది తూర్పుకు మూడోది గీతలు గీయవలెను.
ఉల్లేఖన దర్భానాగ్నేయ్యాం నిరస్య | అప ఉపస్పృశ్య | అవాచీనేన పాణినా అద్భిరవోక్ష | శ్రోత్రియాంగారాదగ్నిమాహృత్య | ఆయతనే విధినాగ్నిమ్ భూర్భువస్సువరోం ఇతి ప్రతిష్ఠాప్య | అగ్న్యానయన పాత్రయోరక్షతోదకం నినీయ ||----
ఉల్లేఖనము చేసిన ఆదర్భలను కుండము బయట ఆగ్నేయానికి వేసి , నీటితో చేతులు తుడుచుకొన వలెను.
ఆ గీతలపైన కుడిచేతితో నీటితో అవోక్షణము చేయవలెను. అవోక్షణమనగా అరచేతిని బోర్ల వచ్చునట్టు పెట్టి నీటిని చిలకరించుట.చేతిలో మిగిలిన నీటిని తూర్పుకు కానీ ఉత్తరానికి కానీ వేయవలెను. వేరే నీటి పాత్రను కుండమునకు పదహారు అంగుళముల బయట ఉత్తరానికి కానీ తూర్పుకు కానీ పెట్టవలెను. ఈనీటిని ’ ప్రాక్తోయము ’ అందురు.
ఇప్పుడు కుండములో అగ్నిని ప్రతిష్టించవలెను. ఈ అగ్నిని శ్రోత్రియుడి ఇంటినుండీ తేవలెను. ఇద్దరు ముత్తైదువలు ఒక మట్టిది కానీ ,ఇత్తడిది కానీ రాగిది కానీ పాత్రలో అగ్నిని ఉంచి, దానిపై అదే విధమైన ఇంకో పాత్రను బోర్లించి కప్పి తీసుకురావలెను. ఈ అగ్నిని వంట ఇంటి పొయ్యి నుండీ కానీ , నీళ్ళు కాచుకొను హండా నుండీ కానీ తేవలెను. దానిని యజమానుని దగ్గర ఉంచి పసుపు కుంకుమలు పెట్టుకోవలెను. ఆ అగ్నిని యజమానుడు స్థండిలము( కుండము ) లో ప్రతిష్టించవలెను. అగ్ని తెచ్చిన పాత్రలను ఒకదానిలో ఒకటి ఉంచి పైదానిలో అక్షితలు , నీళ్ళు వేయవలెను.
( ఈ మధ్య దీనికి బదులుగా కర్పూరమును వెలిగించి , లేదా నేతితో తడిపిన ప్రత్తి వత్తులను వెలిగించి అగ్నిని ప్రతిష్ఠించుచున్నారు )
ఇంధనేనాగ్నిం వ్యజననేన , ధమన్యావా ప్రజ్వాల్య | ----
ఇప్పుడు కుండములో చిన్న పుడకలు , పిడకలు వంటివి వేసి ఊదు గొట్టముతో ఊది కానీ , విసనకర్ర తో విసరి కానీ అగ్నిని బాగుగా మండునట్లు చేయవలెను. నోటితో ఎప్పటికీ ఊదరాదు. ఊదవలసి వస్తే , అరచేతిలోకి ఊది అగ్నికి తగులునట్లు చేయవలెను. నేరుగా యజ్ఞేశ్వరుడిపై నోటితో ఎప్పుడూ ఊదరాదు.
ఉపావరోహ ఇతి , అశ్వథ్థ సమిధోపరి , ముఖాదగ్నిమ్ , బహిర్నిరస్య , తత్సమిధం అగ్నౌ నిక్షిపేత్ ---
ఒక రావి సమిధను నోటితో ఊది , కింది మంత్రము చెప్పి యజ్ఞేశ్వరునిలో వేసేది.
ఓం ఉపావరోహ జాతవేదః పునస్త్వం దేవేభ్యో హవ్యం వహనః ప్రజానన్ |
ఆయు ప్రజాగ్ం రయిమస్మాసుధేహ్యజస్రో దీదిహినో దురోణే ||
చత్వారిశృంగేత్యగ్నిం ధ్యాత్వా ||
అగ్ని ప్రతిష్ఠాపన అయిన తర్వాత అగ్నిదేవుడిని ఈ మంత్రముతో ధ్యానించవలెను.
చత్వారి శృంగా త్రయోఅస్యపాదా ద్వే శీర్‌షే సప్త హస్తాసో అస్య |
త్రిధాబద్ధో వృషభో రోరవీతి మహోదేవో మర్త్యాగ్ం ఆవివేశ ||
అగ్నిమ్ ధ్యాయామి | తర్వాత ఈ శ్లోకముతో యజ్ఞేశ్వరునికి ముందు భాగములో అక్షతలు నీళ్ళు వేయవలెను. యజ్ఞేశ్వరుడు ఎప్పుడూ తూర్పుకే తిరిగి ఉండును. కాబట్టి ముందు భాగమనగా కుండమునకు తూర్పు వైపుకు వేయవలెను. అప్పుడు యజ్ఞేశ్వరుడు నీటిని ఇష్టపడక , వెనుకకు తిరుగును , అనగా యజమానునికి అభిముఖముగా తిరుగును. ( ప్రయోగ పుస్తకములలో ఇష్టపడక , భయపడి అన్న పదాలు వాడిఉంటారు. కానీ నీరు అలాగ చల్లుటకు కారణము అది కాదని నా అభిమతము. ఇంకే కారణమో అయినా , మొత్తానికి అగ్నిని కర్త తనకు అభిముఖుడిగా చేసుకొనుటయే దీని ఉద్దేశము. )తనకు అభిముఖుడు కావలెనని అగ్నిని ఈ విధముగా ప్రార్థించవలెను.
|| సప్తహస్తశ్చతుశృంగః సప్తజిహ్వో ద్విశీర్షకః | త్రిపాత్ప్రసన్న వదనస్సుఖాశీనశ్శుచిస్మితః |
స్వాహాంతు దక్షిణే పార్శ్వే దేవీం వామే స్వధాం తథా | బిభ్రద్దక్షిణ హస్తైశ్చ శక్తిమన్నం స్రువం స్రుచం ||
తోమరం వ్యజనం వామైర్ఘృత పాత్రం తు ధారయన్ | మేషారూఢో జటాబద్ధో గౌరవర్ణో మహద్యుతిః ||
ధూమధ్వజో లోహితాక్షః సప్తార్చిస్సర్వకామదః || ఆత్మాభిముఖమాశీన ఏవం ధ్యేయో హుతాశనః ||
ఏషహి దేవ ఇతి అక్షతోదకం పూర్వ భాగే క్షిప్త్వా | యజ్ఞేశ్వరం హస్తాభ్యాం ఆత్మాభిముఖీ కృత్య |
అక్షతలు నీళ్ళు యజ్ఞేశ్వరునకు తూర్పు భాగమున వేసి , తన వైపుకు తిరగమని చేతులతో చూపవలెను.
ఈ మంత్రముతో ప్రార్థించవలెను.
ఏష హి దేవః ప్రదిశోనుసర్వాః పూర్వోహి జాతస్స ఉ గర్భే అన్తః |
సవిజాయమానస్సజనిష్యమాణః ప్రత్యన్ముఖాస్తిష్ఠతి విశ్వతోముఖః ||
హే అగ్నే! ప్రాఙ్ముఖోదేవ ప్రత్యఙ్ముఖస్సన్ | మమాభిముఖో భవ | సుప్రసన్నో భవ , వరదో భవ |
ఓం భూర్భువస్సువరోమితి అగ్నేరష్టాఙ్గుల దేశే జలేన ప్రోక్ష్య |
అగ్ని చుట్టూ , ఎనిమిదంగుళముల దూరములో ఓం భూర్భువస్సువః అను( గాయత్రీ ) మంత్రముతో నీటిని ప్రోక్షించవలెను.
ప్రాగాది పరిమృజ్య , త్రిస్సమ్మార్ష్టి --అనగా , చూపుడు , నడిమి , ఉంగరపు వేళ్ళతో మొదట ఆగ్నేయము నుండీ ఈశాన్యమునకు , తర్వాత నైఋతి నుండీ ఆగ్నేయమునకు , ఆ తరువాత నైఋతి నుండీ వాయవ్యమునకు , చివరగా వాయవ్యము నుండీ ఈశాన్యమునకు సంధులు కలియునట్లు నాలుగు పక్కలందూ నీటి గీతలు గీయవలెను. దీనినే పరిసమూహనము అందురు.
అగ్నేర్దశాఙ్గుల పరిమితి దేశే అగ్న్యాయతనాన్యగ్నయే నమిత్యాద్యష్టభిర్నమోంతైరలంకృత్య |
అనగా అగ్నికి పది అంగుళదూరములో తూర్పు నుండీ మొదలు బెట్టి ఎనిమిది దిక్కులందూ ’ అగ్నయే నమః ’ మొదలగు నామములతో పూలు , అక్షతలచే అలంకారము చేయవలెను.
అగ్నయే నమః | హుతవహాయ నమః | హుతాశినే నమః | కృష్ణ వర్తనే నమః | దేవముఖాయ నమః | సప్తజిహ్వాయ నమః | వైశ్వానరాయ నమః | జాతవేదసే నమః | మధ్యే శ్రీ యజ్ఞపురుషాయ నమః |
అలంకరణాదంతః ప్రాగాది ప్రదక్షిణం దక్షిణోత్తరైః , ఉత్తరాధరై ప్రాగుదగగ్రైః షోడశ్షోడశ దర్భైః అగ్నిమ్ పరిస్తృణాతి ||
అలంకరణమునకు ఒక అంగుళములోపల కుండమునకు నాలుగు వైపులా దర్భలతో పరిస్తరణము చేయవలెను. అనగా , ఒక్కో వైపునా పదహారు పదహారు దర్భలను పరచవలెను. మొదట తూర్పువైపు మొదలుపెట్టి , ఆ పదహారు దర్భలు తూర్పు కొనలుగా పరచవలెను. తర్వాత దక్షిణాన పదహారు దర్భలు , తూర్పు పరిస్తరణము మొదళ్ళపై అగ్రములు వచ్చునట్లు , అటులే పడమట , పదహారు దర్భలను , దక్షిణ పరిస్తరణపు మొదళ్ళపై మొదళ్ళు వచ్చునట్లు , అలాగే , ఉత్తర పరిస్తరణపు దర్భల మొదళ్ళు పశ్చిమ పరిస్తరణపు కొనల పైనా , అగ్రములైతే తూర్పు పరిస్తరణపు అగ్రముల కిందా వచ్చేలా పరచవలెను.
ఉత్తరేణాగ్నిం ప్రాగగ్రాన్ ద్వాదశ దర్భాన్ సగ్గ్‌స్తీర్య
అనగా అగ్నికి ఉత్తరమున , ఉత్తర పరిస్తరణము బయట , పన్నెండు దర్భలను తూర్పు కొనలుగా ( అగ్రములుగా ) పరచవలెను.
తేషు , దక్షిణ వామ హస్తాభ్యాం పాత్రాణ్యాదాయ | ద్వంద్వన్యంచి ప్రయునక్తి దర్వాజ్య స్థాల్యౌ , ప్రోక్షణ సృవావితి, చతుష్పాత్రాణి ప్రయుంజ్య |
ఆ పరచిన పన్నెండు దర్భలపైన , చతుష్పాత్రలను ఉంచవలెను.
( వీటినే యజ్ఞపాత్రలనీ, యజ్ఞాయుధములనీ అంటారు. ఇవి , సుక్కు , సృవము , ఆజ్య పాత్ర , ప్రోక్షణ పాత్ర. స్రుక్కు సృవము అనేవి చెక్కతో చేసిన గరిటెలవంటివి. వీటిని చేయుటకు కొన్ని రకాల వృక్షములనుండీ మాత్రమే కలప తెచ్చి చేస్తారు. సాధారణముగా వీటిని , ఔదుంబరి ( మేడి ) , వెలగ , మోదుగ , ఖదిర ( చండ్ర ) చెట్లనుండీ చేస్తారు. అవి మాత్రమే వాడాలి. సిద్ధపరచిన స్రుక్కు సృవాలు విరివిగా విపణిలో దొరకుతాయి. వీటి ఆకారములు వేర్వేరుగా ఉంటాయి. ఇక పాత్రలు ఇత్తడివి కానీ కంచువి కానీ వాడతారు. పైవి దొరకకపోయిన , స్రుక్కు సృవములుగా మోదుగ ఆకులు గానీ , రావి ఆకులు గానీ వాడతారు. అయితే , ఆకులను వాడినపుడు , ఏది స్రుక్కు , ఏది స్రువము అని బాగా గుర్తు పెట్టుకోవలెను. ఒకటి ( స్రుక్కు ) పెద్దది , ఒకటి( సృవము ) చిన్నదీ అయితే గుర్తు పెట్టుకోవచ్చు. పాత్రలకు బదులు చిన్న అరటి దొన్నెలు వాడవచ్చు. )
వాటిని పరచిన దర్భలపై ఎలా ఉంచాలంటే , మొదట కుడి చేతిలో స్రుక్కును , ఎడమచేతితో ఆజ్య పాత్రనూ తీసుకొని , రెంటినీ ఒకమారే దర్భలపై ప్రక్కప్రక్కగా బోర్లించవలెను. అంటే స్రుక్కు కు ఉత్తరంగా ఆజ్య పాత్ర ఉండవలెను. తర్వాత , కుడిచేత ప్రోక్షణ పాత్రను , ఎడమచేత సృవమునూ తీసుకొని , ఒకేమారు రెంటినీ , ముందు బోర్లించిన పాత్రలకు పైన , ( పాత్రల పైన కాదు ) అంటే ఆ పాత్రలకు తూర్పు వైపున ఒకదానికొకటి తగలకుండునట్లు బోర్లించవలెను. స్రుక్కు, సృవములను ఉంచునపుడు , వాటి బిలములు తూర్పుకూ , దండములు పడమటికీ ఉండునట్లు పెట్టవలెను. ఇదే పాత్రాసాదన. ( బొమ్మ చూడుడు )
స్థౌల్య దైర్ఘ్యాభ్యామ్ సమౌ , సాగ్రౌ ద్వేదర్భౌ , అప్రచ్ఛిన్నాగ్రౌ ప్రాదేశమాత్రే పవిత్రీ కృత్య |
లావుగా , దీర్ఘముగా ఉన్న అగ్రములు తెగిఉండని రెండు దర్భలను , రెండు కొనలూ సమానముగా చేర్చి , మధ్యలో ముడి వేసి , జానెడుకన్నా ఎక్కువ ( జుత్తెడు ) పొడవు ఉండునట్లు చూసి , అధికముగా ఉన్న పొడవును మొదళ్ళవైపు కత్తరించవలెను. వీటిని గోటితో ఎప్పటికీ తుంచరాదు. ఉద్ధరిణె తోనో , ఇంకేదైనా గట్టి వస్తువుతోనో కత్తరించవలెను. దీనినే పవిత్రము అందురు. ఈ పవిత్రమును నీటిలో అద్దవలెను ( అద్భిరనుమృజ్య )
ఉత్తానే ప్రోక్షణ పాత్రే నిధాయ ---ప్రోక్షణ పాత్రను, అనగా , స్రుక్కుకు తూర్పున బోర్లించి పెట్టియున్న పాత్రను వెల్లకిలా తిప్పి అక్కడేపెట్టి , దానిలో పవిత్రము నుంచవలెను.
ప్రోక్ష్య-- ఆ పవిత్రమును నీటిలో అద్ది , దానితో ఆ ప్రోక్షణ పాత్రలో ప్రోక్షించి , పవిత్రమును మరలా అందులోనే పెట్టవలెను.
అపరేణాగ్నిమ్ పరిస్తరణాద్బహిః పవిత్రాంతర్హితే ప్రోక్షణ పాత్రే అప ఆనీయ
ప్రోక్షణ పాత్రను పైకెత్తి , పరిస్తరణములకు వెలుపల , అగ్నికి ప్రదక్షిణముగా చుట్టూ తిప్పి పశ్చిమ భాగమున , అంటే కర్త ముందుకు వచ్చునట్లు పెట్టుకొనవలెను. పాత్రలో అక్షతలు , నీళ్ళు వేయవలెను.
ఉత్తానయోర్హస్తయోః అంగుష్ఠోప కనిష్ఠికాభ్యాముదగగ్రే గృహీత్వా ----ఆ పాత్రలోని పవిత్రపు కొనలను ఎడమచేతి బొటనవేలు , ఉంగరపు వేళ్ళతోను, మొదలును కుడిచేతి వేళ్ళతోను అరచేతులు వెల్లకిల ఉండునట్లు , పట్టుకొనవలెను.
ప్రాచీస్త్రిరుత్పూయ ---అలాగ వేళ్ళతో పట్టుకొన్న ఆపవిత్రము మధ్యభాగమును ప్రోక్షణ పాత్రలోని నీటిలో ముంచి , ఆ నీటిని , పశ్చిమము నుండీ తూర్పుకు, తూర్పునుండీ పశ్చిమమునకూ , మరలా మూడవసారి పశ్చిమమునుండీ తూర్పుకు పవిత్రముతో తోయవలెను.
సపవిత్రేణ పాణినా , పాత్రాణ్యుత్తానాని కృత్వా ---పవిత్రమును కుడిచేతిలోకి తీసుకొని ,స్రుక్కును , ఆజ్యపాత్రను , సృవమును ప్రోక్షించి వాటిని వెల్లకిలా తిప్పి పెట్టవలెను.
ఉత్తానేన హస్తేన త్రిఃప్రోక్ష్య ---చేతిని వెలికిలగా ఉండునట్లు , ప్రోక్షణ పాత్రలోని నీటిని, తిప్పిపెట్టిన పాత్రలపైన , మూడు మూడు మార్లు ప్రోక్షణ చేయవలెను. మూడిటికీ కలిపి మొత్తము తొమ్మిది సార్లు పవిత్రాన్ని నీటిలో అద్ది ప్రోక్షణ చేయవలెను.
తత్పాత్రం దక్షిణతో నిధాయ ---ఆ ప్రోక్షణ పాత్రను , మరలా పైకెత్తి , యజ్ఞేశ్వరునికి ప్రదక్షిణముగా , పరిస్తరణములకు వెలుపల నుండీ తిప్పి , దక్షిణ దిశలో పెట్టవలెను.
తే పవిత్రే ఆజ్యపాత్రే నిధాయ ----ఆ ప్రోక్షణ పాత్రలోని పవిత్రమును తీసుకొని , ఉత్తరమున నున్న ఆజ్యపాత్రలో ఉంచవలెను.
ఆజ్యం విలాప్య--విలీనమప్యగ్నావధిశ్రిత్య ---వేరే ఏదైనా ఒక పాత్రలో నేతిని కరగించి , ఆ కరగిన నేతిని ఆజ్యపాత్రలో వేసుకొని , నేయి కరగి ఉన్నప్పటికినీ , ఆ ఆజ్యపాత్రను యజ్ఞేశ్వరునిపై కాచి, తీయవలెను. అనగా సంస్కారము కోసము అలాగ చేయవలెను.
అపరేణాగ్నిం పరిస్తరణాద్బహిః పవిత్రాంతర్హితాయాం ఆజ్యస్థాల్యామాజ్యం నిరూప్య ----పవిత్రమును ఆజ్య పాత్రలో తూర్పు కొనలుగా ఉంచి , ఆ పాత్రను పైకెత్తి పరిస్తరణములకు బయటనుండీ యజ్ఞేశ్వరునికి ప్రదక్షిణముగా తిప్పి తన ముందు ఉంచుకోవలెను.
పరిస్తరణాదధస్తాత్ ఉదీచోంగారాన్నిరూహ్య | తేష్వధిశ్రిత్య | దర్వీస్తరణయోర్మధ్యే అంగారాన్నిరూహ్య ---స్రుక్కుకు , ఉత్తర పరిస్తరణమునకు మధ్యలో , కుండమునుండీ మూడు నిప్పులను తీసి పెట్ట వలెను. ఎలాగంటే , నిప్పులను పరిస్తరణపు కిందిభాగమునుండీ ( పరిస్తరణాన్ని కొంచము పైకి లేపి ) ఉత్తరానికి వచ్చేలా చేయవలెను.
జ్వలతా దర్భేణావద్యుత్య ---ఒక దర్భను యజ్ఞేశ్వరునిలో వెలిగించి ఆ మండుతున్న దర్భ యొక్క మంట ప్రతిబింబము నేతిలో కనపడేలా నేతిపైన తిప్పవలెను. ఆ దర్భను ఉత్తరమునకు వేయవలెను.
ద్వే దర్భాగ్రే ప్రచ్ఛిద్య , ప్రక్షాళ్య , ప్రత్యస్య ---రెండు దర్భ కొనలను దేనితోనైనా తుంచి , నీళ్ళలో కడిగి నేతిలో వేయవలెను. గోటితో తుంచరాదు.
మధుకైటభనామానౌ ద్వావేతావాజ్య హారిణౌ | తయోర్నిరసనార్థాయ ద్వే దర్భాగ్రే వినిక్షిపేత్ |
మధుకైటభులు అను ఇద్దరు రాక్షసులు ఆజ్యసారమును హరించువారు , ఆ రాక్ష బాధ తొలగుటకు రెండు దర్భ కొనలను ఆజ్యపాత్రలో వేయవలెను.
’ అప ఉపస్పృశ్య ’---చేతులు నీటితో తుడుచుకొనవలెను.
జ్వలతా దర్భేణ త్రిః పర్యగ్ని కరణం కృత్వా --ఒక దర్భను వెలిగించి నేతి పాత్రకు ప్రదక్షిణముగా మూడుసార్లు తిప్పవలెను. ఇదే పర్యగ్నికరణము.
’ ఉదగుద్వాస్య ’ నేతి పాత్రను ఉత్తరమునకు ఎత్తిపెట్టి ,
అంగారాన్ ప్రత్యూహ్య --ముందు తీసియుండు నిప్పులను మరలా ఉత్తర పరిస్తరణము క్రిందనుండీ తీసి మరలా యజ్ఞేశ్వరునిలో వేయవలెను. నిప్పులను తీయునపుడు , వేయునపుడు పరిస్తరణపు దర్భలను పూర్తిగా పైకెత్తరాదు. ఒక చివర మాత్రము పైకెత్త వలెను.
ఉదగగ్రాభ్యాం పవిత్రాభ్యామ్ పురస్తాదారభ్య పశ్చాన్నీత్వా , పురస్తాసమాప్తిః | ఏవం త్రిరుత్పూయ | పవిత్ర గ్రంధిం విస్రస్య | అప ఉపస్పృశ్య | ప్రాగగ్రమగ్నౌ ప్రహరతి --
ఆజ్యపాత్రను పరిస్తరణముల బయత నుండి ప్రదక్షిణముగా తిప్పి పశ్చిమమున , అనగా తన ముందర ఉంచుకోవలెను.
ప్రోక్షణ పాత్రకు చేసినట్లే , ఆజ్యపాత్రలోకూడా పవిత్రమును ఉత్తరమునకు కొనలుండునట్లు రెండు చేతుల బొటన , ఉంగరపు వేళ్ళతో పట్టుకొని , నేతిలో ముడిని ఉంచి , పశ్చిమమునుండీ తూర్పుకు , మరల తూర్పు నుండీ పశ్చిమమునకు ,తిరిగి పశ్చిమమునుండీ తూర్పుకు , మూడు మార్లు నేతిని తోయవలెను. మూడవ సారి తూర్పుకు ముగియవలెను. తర్వాత పవిత్రమును ముడి విప్పి , నీటిలో తడిపి , తూర్పు కొనలుగా యజ్ఞేశ్వరునిలో వేయవలెను.
దర్భైస్సహ సృవం దక్షిణేన హస్తేనాదాయ | వామేన జుహూం | మూడు దర్భలను చేతిలో తీసుకొని , ఆ దర్భలతో సహా కుడి చేతితో స్రువమును ( స్రుక్కుకు ఉత్తరముగా ఉండునది ) తీసుకోవలెను. అటులే ఎడమ చేతితో స్రుక్కును తీసుకోవలెను.
యుగపదగ్నౌ ప్రతితప్య --హోమము చేయు పార్శ్వములకు అనగా , రెంటి బిలములను వేడి తగులునట్లుగా యజ్ఞేశ్వరునికి చూపవలెను.
వామ కనిష్ఠికానామికా సంధౌ జుహూం గృహీత్వా | తస్యోపరి సృవం -- ఎడమ చేతి చిటికెన - ఉంగరపు వేళ్ళ మధ్యన స్రుక్కును , మధ్యమ - చూపుడు వేళ్ళ మధ్య సృవమును ఉంచుకోవలెను. బిలములు పైకి వచ్చునటులుండవలెను. ఒకదానికొకటి తగల రాదు.
అగ్రైః అంతరతోభ్యాగారం సర్వతో బిలమభి సమాహారం మూలైర్దండం |
కుడి చేతిలోని దర్భలతో , పైన ఉండు సృవమును , దాని బిలమును దర్భకొనలతో సవరించవలెను. ( నిమిరినట్లు చేయవలెను ) అలాగే దర్భ కొనలతోనే బిలపు వెనుక భాగము , చుట్టునూ తుడిచి , సృవము యొక్క దండమును మాత్రము ( చేతితో పట్టుకొను పొడుగాటి భాగము ) దర్భ మొదళ్ళతో సవరించవలెను.
ఇతి వ్యుత్క్రమేణ ధారయిత్వా -- తర్వాత , వేళ్ళ మధ్యలోనున్న సృవమును , స్రుక్కును వాటి స్థానములను మార్చ వలెను, అనగా ఇప్పుడు స్రుక్కున్న చోటికి సృవము , సృవమున్న చోటికి స్రుక్కునూ ఉంచవలెను. ఇప్పుడు సృవము కిందికీ ,స్రుక్కు పైకీ ఉండును.
జుహూమగ్రైరంతరతోభ్యాగారం | ప్రాచీమ్ | మధ్యైర్బాహ్యతః ప్రతీచీం మూలైర్దండం |
సృవమును సవరించినట్లే , దర్భల కొనలతో బిలమును , వెనుక భాగమును , చుట్టునూ తుడిచి , దండమును మాత్రము దర్భ మొదళ్ళతో తుడువవలెను.
పునః ప్రతితప్య --ముందువలెనే స్రుక్కు సృవములు రెంటినీ మరలా అగ్నికి చూపి కాచవలెను. కాచునపుడు స్రుక్కు కుడి చేతిలోను , సృవము ఎడమ చేతిలోను ఉండవలెను.
ప్రోక్ష్య --చేతిలోని దర్భలను నీటిలో అద్ది , స్రుక్కు- సృవములను ప్రోక్షించి --నిధాయ -- ఆజ్య పాత్రకు ఎడమ అంటే ఉత్తరమునకు సృవమును , దానికి ఉత్తరమున స్రుక్కును నేలపైన ఉంచవలెను.
దర్భానగ్గిస్సగ్గ్ం స్పృశ్య -- చేతిలోని దర్భలను నీటితో తుడిచి , -- అగ్నౌ ప్రహరతి -- తూర్పుకొనలుగా అగ్నిలో వేయవలెను.
అగ్నిం పరిషిచ్య ---ఇప్పుడు కింది విధముగా అగ్ని పరిషేచనం చేయవలెను.
కుడిచేతితో కొద్దిగా నీరు తీసుకొని , హోమకుండమునకు బయట కుడి ప్రక్క , అనగా దక్షిణము న పడమటి నుండి తూర్పుకు ధారగా ఈ మంత్రముతో నేలపై నీరు వదలవలెను.
అదితేను మన్యస్వ |
తర్వాత మళ్ళీ నీరు తీసుకొని , కుండమునకు పశ్చిమమున , దక్షిణము నుండీ ఉత్తరమునకు ( దక్షిణపు నీటిని కలుపుకొని ) ధారగా ఈ మంత్రముతో నేలపై నీరు వదలవలెను.
అనుమతేను మన్యస్వ |
తర్వాత మళ్ళీ కుండమునకు ఎడమవైపున /ఉత్తరము వైపు , పడమటి నుండి తూర్పుకు ( పశ్చిమపు నీటిని కలుపుకొని) ధారగా ఈ మంత్రముతో నీరు వదలవలెను.
సరస్వతేను మన్యస్వ |
చివరిగా కుండమునకు తూర్పున , ఈశాన్యమునుండీ మొదలుపెట్టి కుండము చుట్టూ ప్రదక్షిణముగా మరలా ఈశాన్యమునే కలుపుతూ ధారగా ఈ మంత్రముతో నీరు వదలవలెను.
దేవసవితః ప్రసువ |
ఇక్కడివరకు చతుష్పాత్ర ముగిసినది. ఏ సందర్భములో అయిననూ , చతుష్పాత్ర ప్రయోగమంటే ఇలాగే చేయవలెను. ఆ తరువాత సందర్భాన్ని బట్టి ప్రధానాహుతులు ఉండును. ఇప్పుడు పునస్సంధానపు ప్రధానాహుతులు వేయవలెను.
సృవేణ చతుర్గృహీతమాజ్యం స్రుచి క్షిప్త్వా | సృవం భూమౌ నిక్షిప్య | స్రుచం దక్షిణ హస్తేన గృహీత్వా |
సృవముతో నేతిని నాలుగు సార్లు తీసుకొని స్రుక్కులోకి వేసుకొని , సృవమును కిందపెట్టి , స్రుక్కును కుడి చేతిలోకి తీసుకొని , --అయాశ్చేతి జుహుయాత్ | కింది మంత్రముతో ఆహుతి వేయవలెను
ఓం || అయాశ్చాగ్నేఽస్యనభిశస్తీశ్చ సత్యమిత్త్వమయా అసి |
అయసా మనసా ధృతోఽయసా హవ్య మూహిషేఽయానో ధేహి భేషజగ్గ్ం స్వాహా ||
అగ్నయే అయస ఇదమ్ ||( పలకవలెను )
సృవేణ సకృద్గృహీత్వా | --సృవముతో ఒకసారి నెయ్యి తీసుకొని కింది మంత్రముతో ఆహుతి వేయవలెను.
సర్వప్రాయశ్చిత్తార్థం భూర్భువస్సువస్వాహా ||
ప్రజాపతయ ఇదమ్ || ( పలకవలెను )
[ హోమము చేయునపుడు ఆహుతి సరిగ్గా ఎప్పుడు వేయవలెను అనుదానికి వివరణ : - అత్రోచ్చార్చరణే విశేషః | || సకారే సూతకం విద్యాద్వకారే రిపు వర్ధనమ్ | ఆయుర్నాశోహకారేస్యాదాహుతిః కుత్ర ధీయతే ||
స్వాహా అను పదములో , స కారము ఉచ్చరించుట మొదలు పెట్టినపుడు ఆహుతి చేసిన , త్వరలో కర్త మైల పడును. వకారము చెప్పునపుడు ఆహుతి వేసిన , శత్రు వృద్ధి కలుగును. హకారము పలుకునపుడు వేసిన , ఆయువు క్షీణించును. అందువలన ఆహుతి ఎప్పుడు వేయవలెననగా ,
|| సకారేచ వకారేచ హకారేచ విసర్జయేత్ |
స్వాహాంతే జుహుయాదగ్నౌ ఏతద్ధోమస్య లక్షణం ||
సకారము , వకారము , హకారములను వదలి , స్వాహాంతమందు , అనగా స్వాహా అని స్వరితముతో పూర్తిగా పలికిన తరువాతనే ఆహుతి వేయవలెను. ]
పునః సృవేణాజ్యం చతుర్గృహీత్వా | స్రుచి నిక్షిప్య | పూర్వవత్ చతుర్గృహీతం సర్వత్ర ||
పూర్వము వలెనే మరలా నాలుగు మార్లు సృవముతో ఆజ్యమును తీసుకొని స్రుక్కులోకి వేసుకొనవలెను. కింది ఈ మంత్రమే కాక , మిగిలిన అన్ని ప్రధానాహుతులు వేయునపుడు కూడా , అన్ని ఆహుతులూ ఈ ప్రకారమే వేయవలెను.
ప్రధానాహుతులు
ఓం || మహాహవిర్హోతా | సత్యహవిరధ్వర్యుః | అచ్యుత పాజా అగ్నీత్ | అచ్యుతమనా ఉపవక్తా | అనధృష్యశ్చా ప్రతిధృష్యశ్చ యజ్ఞస్యాభిగరౌ | అయాస్య ఉద్గాతా వాచస్పతే హృద్విధేనామన్ | విధేమ తే నామ | విధేస్త్వమస్మాకం నామ | వాచస్పతిస్సోమమపాత్ | మాదైవ్యస్తంతుశ్ఛేదిమా మనుష్యః | నమః పృథివ్యై స్వాహా || ( ఆహుతి వేయవలెను )
అగ్నయ ఇదమ్ |
ఓం || మనోజ్యోతిర్జుషతామాజ్యం విచ్ఛిన్నం యజ్ఞగ్ం సమిమందధాతు |
యాఇష్టా ఉషసో నిమ్రుచశ్చతాస్సందధామి హవిషా ఘృతేన స్వాహా ||
మనసే జ్యోతిషే ఉషేభ్యో నిమృగ్భ్య ఇదమ్ ||
ఓం || యదస్మిన్ యజ్ఞేఽతరగామమంత్రతహ్ కర్మతోవా |
అనయాఽహుత్యా తచ్ఛమయామి సర్వం తృప్యంతు దేవా ఆవృధంతాం ఘృతేన స్వాహా ||
దేవేభ్య ఇదమ్ |
ఓం || త్రయస్త్రిగ్ం శత్తన్తవో యేవితత్నిరే | య ఇమం యజ్ఞగ్గ్ం స్వధయాదదంతే తేషాంఛిన్నం ప్రత్యేతద్ధధామి స్వాహా ఘర్మో దేవాగ్ం అప్యేతుస్వాహా ||
అగ్నయే తంతుమత ఇదమ్ |
తన్తుతన్వన్రజసో భానుమన్విహి జ్యోతిష్మతః పథోరక్షధియాకృతాన్ |
అనుల్బణం వయతజోగువామపోమనుర్భవ జనయా దైవ్యం జనగ్గ్స్వాహా ||
అగ్నయే తంతుమత ఇదమ్ |
ఓం || ఉద్భుధ్యస్స్వాగ్నే ప్రతిజాగృహ్యేన మిష్టాపూర్తేసగ్ంసృజేధామయం చ |
పునః కృణ్వగ్గ్ంస్త్వా పితరం యువానమన్వాతాగ్ం సీత్వయి తన్తుమేతగ్గ్ం స్వాహా ||
అగ్నయే తంతుమత ఇదమ్ |
ఓం || ఉదుత్తమం వరుణపాశమస్మదవాధమం విమధ్యమగ్గ్ం శ్రథాయ |
అథావయమాదిత్య వ్రతే తవానాగసో అదితయేస్యామస్వాహా ||
ఓం || ఉద్వయం తమసస్పరి పశ్యంతో జ్యోతిరుత్తరమ్ |
దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమగ్గ్స్వాహా ||
దేవేభ్య ఇదమ్ |
ఓం || ఉదుత్యం జాతవేదసం దేవంవహంతి కేతవః |
దృశే విశ్వాయ సూర్యగ్గ్ం స్వాహా |
సూర్యాయేదమ్ |
ఓం || చిత్రమ్ దేవానాముదగాదనీకం | చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః |
ఆప్రా ద్యావా పృథివీ అంతరిక్షగ్ం సూర్య ఆత్మా జగతస్తస్థుషశ్చ స్వాహా ||
సూర్యాయేదమ్ |
ఓం || అగ్నేఽభ్యావర్తిన్నభిన ఆవర్తస్వాయుషా వర్చసా |
సన్యా మేధయా ప్రజయా ధనేనస్వాహా ||
అగ్నయేఽభ్యావర్తిన ఇదమ్ |
ఓం || అగ్నే అంగిరశ్శతంతేసంత్వావృతస్సహస్రంత ఉపావృతః |
తాసాం పోషస్య పోషేణ పునర్నోనష్టమాకృధి పునర్నోరయిమాకృధి స్వాహా ||
అగ్నయేఽంగిరస ఇదమ్ |
పునరూర్జా నివర్తస్వ పునరగ్న ఇహాయుషా | పునర్నఃపాహి విశ్వతస్స్వాహా ||
అగ్నయ ఇదమ్ |
ఓం || సహరయ్యా నివర్తస్వాగ్నే పిన్వస్వధారయా | విశ్వఫ్శ్నియా విశతస్పరి స్వాహా ||
అగ్నయ ఇదమ్ | సృవేణ సకృద్గృహీత్వా | జుహుయాత్ |
సృవముతో ఒకసారి నేతిని తీసుకొని , కింది మంత్రము చెప్పి హోమము చేయవలెను.
సర్వ ప్రాయశ్చిత్తార్థం , భూర్భువస్సువస్వాహా ||
ప్రజాపతయ ఇదమ్ |
[ పై మంత్రాలన్నిటినీ నేర్చుకున్నవారు కూడా , హోమము చేయునపుడు ఏమంత్రము తర్వాత ఏది అని గుర్తుపెట్టుకొనుటకు , కింది చిట్టాను ఉపయోగించవచ్చు. ఆయా మంత్రాల మొదటిపదాలను చేర్చి కూర్చిన వాక్యమిది. దీన్ని కంఠోపాఠం చేయుట వలన సులభముగా గుర్తు పెట్టుకోవచ్చును. వేదాభ్యాసములో ఇటువంటి చిట్టాలను " కవులు " అంటారు. ]
|| అయాశ్చేతి సమస్త వ్యాహృత్యాచద్వే ఆహుతీర్జుహుయాన్నోపవసేచ్చతుర్గృహీతేనాజ్యేన మహాహవిర్హోతేత్యనువాకేన మనోజ్యోతిర్యదస్మిన్యజ్ఙే త్రయస్త్రిగ్ం శత్తన్తున్తన్వన్నుద్బుధ్యస్వోదుత్తమ ఉద్వయం తమసస్పరి ఉదుత్యం చిత్రం దేవానామగ్నేభ్యావర్తిన్నగ్నే అంగిరః పునరూర్జా సహ రయ్యేతి చతస్రోభ్యావర్తినీర్హుత్వా | వ్యాహృత్యాచై కామాహుతిం హుత్వా ||
ఉత్తర పరిషేచనం కృత్వా |
ఇప్పుడు మరలా వెనుకటి వలెనే , ఈ కింది మంత్రములతో అగ్ని పరిషేచనము చేయవలెను.
కుడిచేతితో కొద్దిగా నీరు తీసుకొని , హోమకుండమునకు బయట కుడి ప్రక్క , అనగా దక్షిణము న పడమటి నుండి తూర్పుకు ధారగా ఈ మంత్రముతో నేలపై నీరు వదలవలెను.
అదితేఽన్వ మగ్గ్‌స్థాః |
తర్వాత మళ్ళీ నీరు తీసుకొని , కుండమునకు పశ్చిమమున , దక్షిణము నుండీ ఉత్తరమునకు ( దక్షిణపు నీటిని కలుపుకొని ) ధారగా ఈ మంత్రముతో నేలపై నీరు వదలవలెను.
అనుమతేఽన్వ మగ్గ్‌స్థాః |
తర్వాత మళ్ళీ కుండమునకు ఎడమవైపున /ఉత్తరము వైపు , పడమటి నుండి తూర్పుకు ( పశ్చిమపు నీటిని కలుపుకొని) ధారగా ఈ మంత్రముతో నీరు వదలవలెను.
సరస్వతేఽన్వ మగ్గ్‌స్థాః |
చివరిగా కుండమునకు తూర్పున , ఈశాన్యమునుండీ మొదలుపెట్టి కుండము చుట్టూ ప్రదక్షిణముగా మరలా ఈశాన్యమునే కలుపుతూ ధారగా ఈ మంత్రముతో నీరు వదలవలెను.
దేవసవితః ప్రాసావీః |
హోమాంతే యజ్ఞేశ్వరం ధ్యాయామితి పూజాం- ఆజ్యోపహార నైవేద్యం కృత్వా ||
యస్య స్మ్రుత్యాచ నామోక్త్యా | తపోహోమ క్రియాదిషు | న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం | మంత్ర హీనం క్రియాహీనం భక్తిహీనం హుతాసన | యద్ధుతం మయాదేవ పరిపూర్ణం తదస్తు మే | అనేన పునస్సంధాన హోమేన భగవాన్ సర్వాత్మకః యజ్ఞేశ్వరస్సుప్రీణాతు ||
|| ఇతి పునస్సంధాన హోమః ||
( ఔపాసనా విధానము తరువాతి భాగములో )
అయ్యా చాలా అద్భుతంగా ప్రయోగం కళ్ళకు కట్టినట్లు చూపించారు. ధన్యవాదములు
ReplyDeleteధన్యవాదములండీ
ReplyDelete