SHARE

Wednesday, February 26, 2014

1. ఔపాసన --మొదటి భాగము -ఉపోద్ఘాతము



ఔపాసన --మొదటి భాగము

          సనాతన ధర్మములో మూడు వర్ణముల వారికీ ఉపనయనము ఎంత ముఖ్యమైనదో ద్విజుడి జీవితములో ఔపాసన హోమము కూడా అంతే ముఖ్యమైనది. ద్విజులలో బ్రాహ్మణులకు మరీ ముఖ్యమైనది. ఔపాసనాహోమాన్ని అనేక పేళ్ళతో పిలుస్తారు. అగ్ని పరిచర్య అనీ , తండుల హోమమనీ , ఔపసదము , ఆవసత్యము, వైవాహికము , స్మార్తము , శ్రౌతము , గృహ్యము , శాలాగ్ని వంటి అనేక పేర్లున్నాయి.

         ఈ హోమానికి ఉన్న నేపథ్యము ఏమిటని చూస్తే , దీనికి మూలము యజ్ఞము. యజ్ఞమునకు , యాగమునకు , హోమమునకూ అనేక భేదములున్ననూ , ఇక్కడ యజ్ఞము అను పదమునకు సాంకేతిక అర్థము తీసుకోలేదు. ’ యజ్ ’ అన్న ధాతువుకు ’ దేవపూజ ’ అను అర్థము ఉన్నది. యజ్ + నఙ్ = యజ్ఞః ( పాణినీయ సూత్రము ) అనగా , ఏ విధముగనైననూ దేవతలను సంతోషపరచుదానిని ’ యజ్ఞము ’ అనవచ్చు.

|| దేవతోద్దేశపూర్వక ద్రవ్య త్యాగో-యాగః ||

         అను వివరణ ఉన్నట్లు , దేవతలను ఉద్దేశించి నిర్దిష్టమైన ద్రవ్యమును ( పదార్థమును ) అర్పించునదే యాగము లేక యజ్ఞము. ఏ దేవతకు దేనిని ఆశించి యే ద్రవ్యమును అర్పించవలెను అనుదానికి ప్రమాణము శృతి లోనే కలదు. అదెట్లున్ననూ , అగ్నిదేవుడికి దేవతలను ఉద్దేశించి హవిస్సును అర్పించు కార్యకలాపమునే ’ యజ్ఞము ’ అనవచ్చునని తెలియుచున్ననూ ’ యజ్ఞము అను పదమునకు ఇంకా విస్తారమైన అర్థములు వాడుకలో ఉన్నవి. భగవద్గీతలో భగవంతుడు అర్జునునికి ద్రవ్య యజ్ఞము , జ్ఞాన యజ్ఞము , తపో యజ్ఞము మొదలైనవి తెలిపి , చివరికి ’ ఆత్మ సాక్షాత్కారము ’ చేసుకొనుట కూడా యజ్ఞమే పొమ్మన్నాడు.

ఇలాగ దేవతలను సంతోష పరచుటకే అయిననూ , యజ్ఞము వలన అనేక లౌకిక ప్రయోజనములున్నాయి. మనుస్మృతిలో ఇలాగుంది:

|| అగ్నౌ ప్రాస్తాహుతిః సమ్యగాదిత్యముపతిష్ఠతే |
ఆదిత్యాజ్జాయతే వృష్ఠిః వృష్టేరన్నం తతః ప్రజాః ||

          విధిపూర్వకముగా అగ్నిలో వదలిన హవిస్సు యొక్క రసమునంతటినీ ఆదిత్యుడు పీల్చుకొనువాడు. కాబట్టి ఆ రసము ఆదిత్యుని చేరి వృష్ఠిగా పరిణమిస్తుంది. ఆ వర్షము వలన ఆహారము దొరకును. ఆహారము వలన జీవులు పుడతారు.

గీతలో కూడా ,

|| అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః |
యజ్ఞాద్భవతి పర్జన్యః యజ్ఞః కర్మ సముద్భవః || ( ౩-౧౪ )

         సర్వప్రాణుల పుట్టుట, పెరుగుటకు అన్నమే కారణము. అన్నము ( సస్యము ) వాన నుండీ కలుగును. ఆ వాన యజ్ఞముల వలన కలుగును. ఆ యజ్ఞములు వేదోక్తమైన కర్మల వలన సంభవించును.

యజ్ఞముల ఆవశ్యకత

          మానవుడు రకరకాల కర్మలను చేస్తూనే ఉంటాడు. మళ్ళీ గీతలోనే చెప్పినట్లు , | న హి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్యకర్మకృత్ | --ఎవరూ ఒక్క క్షణముకూడా కర్మ రహితులై ఉండలేరు. అయితే ఆ కర్మ ఏది చేయవలెను అన్నది ఎంచుకొను స్వాతంత్ర్యము మానవునికి ఉన్నది.
అయితే శృతి ఇలాగంటుంది ,

|| యజ్ఞోపి శ్రేష్ఠతమమ్ కర్మ ||

యజ్ఞమే అన్ని కర్మముల కన్నా శ్రేష్టమైనది.

కాబట్టి మన శ్రేయస్సుకు వేదమే తెలిపిన యజ్ఞమనే కర్మను ఎంచుకొనుట ఉచితము కాదా !!

         సరే , యజ్ఞమే గొప్ప కర్మ అని వేదమెందుకు అన్నది ?  వేదము ఉన్నది మానవాళి కోసమే. దేవతల కోసము కాదు. వేద విహిత కర్మలను చేయగలుగువాడు మానవుడే కానీ దేవతలు కాదు. వారు చేయాలనుకున్నా , మానవుడిగా పుట్టి చేయవలసినదే. కాబట్టి మానవుడికి యజ్ఞమే గొప్ప కర్మ యని వేదము తెలుపుటకు కారణమేమి ? అందులోని లౌకికార్థము లేదా , లౌకిక ప్రయోజనము ఏమిటి ?

          లోకములో చైతన్యము ఉండవలెనన్న , ఉష్ణము మరియూ కాంతి తప్పనిసరిగా అవసరము. అవి లేనినాడు చైతన్యము లేదు , జీవులు లేరు. చీకట్లో విత్తనము నాటబడినా , అది వెలుగు వైపుకే తీగగా పెరుగుతుంది. కాంతి లేని , మేఘావృతమైన దినమును సంస్కృతములో ’ దుర్దినము ’ అంటారు. ( మేఘచ్ఛన్నేఽహ్ని దుర్దినమ్ --- అమర కోశం ). కాబట్టి , చైతన్యము , ఉత్సాహము వంటివి కలగాలంటే అది ఎండ , వెలుగుల వలననే సాధ్యము. ఉష్ణము దేహములో ఉన్నంత వరకే దేహపు అస్తిత్వము. ఈ ఉష్ణము , వెలుగు లకు మూలము , సూర్యుడు మరియు అగ్ని. సూర్యుడు మనకు అన్నివేళలా అందుబాటులో ఉండడు. వాడినుండి మనకు అన్నివేళలా , అన్ని ప్రాంతాలలో ఉష్ణము దొరకదు. ఇక మిగిలినది అగ్ని.

         సూర్యోపాసన , సూర్య పూజ ల ఫలితములు వేరు , అగ్న్యుపాసన యొక్క ఫలితములు వేరు. సూర్యుడు ఒకదానికి అవసరమైతే , అగ్ని ఇంకొకదానికి అవసరమగును. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడిమి , వెలుగు కావాలంటే అగ్నియే శరణము. ( ఈ కాలము సౌర శక్తిని ఉపయోగించి ఎప్పుడు కావాలంటే అప్పుడు కాంతి , ఉష్ణములను పొందే ప్రయత్నము మానవుడు చేయుచున్నా , దానికి అనేక పరిమితులు గలవు )  కాబట్టి అగ్ని సంరక్షణ , ఉపాసనలు అవసరము. ఈ దృక్పథముతోనే మానవ జీవితములో అగ్ని ఆరాధన అనేది ఒక భాగమైపోయింది.

యజ్ఞములు ఆరంభమైనది ఎప్పుడు ?

|| సహ యజ్ఞాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః |
అనేన ప్రసవిష్యధ్వమేష వోఽస్త్విష్ట కామధుక్ ||

      అని గీతలో చెప్పినట్లు , ప్రజాపతి ప్రజలను సృష్ఠించునపుడే వారితో పాటే యజ్ఞములను సృష్ఠించినాడు. ( ప్రజలనుద్దేశించి , ) ఈ యజ్ఞముల వలన మీరు వృద్ధి పొందండి, యజ్ఞములు మీరు కోరినవి ఇచ్చును గాక ||

|| దేవాన్భావయతానేన తే దేవా భావయంతు వః |
పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ ||

         ఈ యజ్ఞముల వలన మీరు దేవతలను తృప్తి పరచండి , దేవతలు మిమ్మల్ని అనుగ్రహించి మిమ్మల్ని తృప్తి పరుస్తారు. ఇలాగ పరస్పర సహకారముతో వృద్ధి పొంది పరమ శ్రేయస్సు అగు మోక్షమును పొందండి.

కాబట్టి ఇచ్చిపుచ్చుకొనుటయే యజ్ఞము.

యజ్ఞములు అవసరము లేని వారు , చేయనవసరము లేని వారు ఎవరు ?

|| ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః |
తైర్దత్తానప్రదాయైభ్యో యో భుంక్తే స్తేన ఏవ సః ||

         మీకు ఇష్టమైన భోగములను యజ్ఞపూజితులైన దేవతలు ఇస్తారు. దేవతలు ఇచ్చు కొన్నిటిని ( నీరు , వెలుగు , ఉష్ణము , సస్యములు మొ|| ) ఉపయోగించుకొని , తిరిగి దేవతలకు ఏమీ ఇవ్వకుండా తాను మాత్రము అనుభవించువాడు చోరుడే అవుతాడు.

కాబట్టి ,ప్రతియొక్కరూ , ఎప్పుడో ఒకప్పుడు దేవతలకు హవ్యమును ఇచ్చి తీరవలసిందే. ఎవరికీ మినహాయింపు లేదు.


        సరే , బాగానే ఉంది , అయితే అగ్నికి బదులు సూర్యుడిని ఎందుకు ఉపాసించరాదు ? సూర్యుడు ఎక్కడో ఉన్నంత మాత్రాన మనకు మానసికముగా అందుబాటులో లేనట్టా ? అనే ప్రశ్న కలగవచ్చు. దీనికి సమాధానము కూడా వేదమే చెబుతుంది, తైత్తిరీయ బ్రాహ్మణములో ఇలాగుంది,

|| అగ్నిం వావాదిత్యః సాయం ప్రవిశతి ||మరియూ ,
|| సౌరం తేజః సాయమగ్నిం సంక్రమతే |

అనగా , సూర్యుని తేజస్సు సాయంకాలములో అగ్నిని ప్రవేశిస్తుంది. అలాగే ,

ఉద్యంతం వావాదిత్యమగ్నిరను సమారోహతి |

         అనగా , అగ్ని యొక్క తేజస్సు ప్రాతః కాలములో సూర్యుని చేరును. అంతేకాక, ఇంకొన్ని నియమముల ప్రకారము , ఔపాసనా హోమము రోజుకు విధిగా రెండు సార్లు చేయవలెను. మొదటిసారి చేస్తున్నపుడు సాయంకాలమే మొదలు పెట్ట వలెను. సాయంకాలము చేసినవాడే ప్రాతః కాలములో కూడా చేయవలెను. సాయంకాలము పాలతో చేస్తే , ప్రాతః కాలము కూడా పాలతోనే చేయవలెను. ( నెయ్యి , పెరుగులతో చేసినా అదేవిధముగా అదే పదార్థముతో సాయంత్రమూ పొద్దున్నా చేయవలెను. ) దీనికి కారణమేమంటే ,  సాయంకాలము మరియూ తరువాతి ప్రాతః కాలమూ అనుష్ఠానము చేసిన హోమములు రెండుగా కనిపించినా అవి రెండూ కలిపి ఒక్క హోమమేయనబడును. కాబట్టి , మొదట సాయంత్రమే మొదలుపెట్టి చేయవలెను గనక , తిరిగి ప్రాతఃకాలములో చేయునది దానికి కొనసాగింపే గనక , రెండు పూటలా అగ్నినే  ఉపాసించి , అగ్నికే ఆహుతినీయవలెను.

        అంతే కాక , ఔపాసనలో పలికే మంత్రములను చూస్తే , వాటికి , అగ్నీ , జ్యోతీ ఒక్కటే , సూర్యుడూ , జ్యోతీ ఒక్కటే అన్న అర్థము వస్తుంది.

|| అగ్నిర్జోతిర్జ్యోతిరగ్నిః స్వాహా ||
|| సూర్యో జ్యోతిర్జ్యోతిః సూర్యః స్వాహా ||

అనికానీ , లేదా

|| అగ్నిర్జోతిర్జ్యోతిస్సూర్యః స్వాహా ||
|| సూర్యో జ్యోతిర్జ్యోతిరగ్నిః స్వాహా ||

         అని పలుకుతాము. మొదటిది అసంసృష్ఠ హోమమనీ , రెండోది సంసృష్ఠ హోమమనీ అంటారు. ఏ విధముగానైనా చేయవచ్చు. కాబట్టి ఏ విధముగా హోమము చేసిననూ హవిస్సును అగ్నికే ఇచ్చుటకు ఇదే కారణము. అందుకే దీనిని ’ అగ్నిహోత్రము ’ అంటారు.


( మిగిలిన వివరములూ , విధానములు తరువాతి భాగములలో చూడుడు )

No comments:

Post a Comment