ఔపాసన మూడవ భాగము - పూర్వ సిద్ధత
కిందటి భాగములో వేదకాలము నాటి ఔపాసనా క్రమము చూచినాము కదా
ఇక , ప్రస్తుత కాలపు విధివిధానము , దాని నేపథ్యమూ చూద్దాము.
అగ్ని ద్విజుడికి ఎలా వచ్చినదీ మొదట చూశాము. ఉపనయనములో మొదట వటువు తండ్రి , తన ఔపాసనాగ్ని నుండి కుమారునికి ఉపనయనాగ్నిని ఇస్తాడు. ఉపనయనము నాటి సాయంకాలము నుండీ వటువు సంధ్యావందనమూ , అగ్నికార్యమూ మొదలు పెడతాడు. ఆ అగ్నిని మూడు రాత్రులు అవిచ్ఛిన్నముగా ఉంచుకొని తరువాత వీలును బట్టి అగ్నికార్యము పొద్దునా సాయంత్రమూ చేస్తాడు. ఆ అగ్నిని పాణిగ్రహణము వరకూ ఉంచుకుంటాడు. వివాహములో మరలా తండ్రి తనయునికి ’ ఔపాసనాగ్ని ’ ని ఇస్తాడు. ఆ అగ్నితోనే వరుడు వివాహములోని హోమములు చేస్తాడు. వధువుతో కూడా చేతులు పట్టి చేయిస్తాడు. అప్పుడు చేసేవి లాజహోమములు. ( పేలాలతో చేసేవి ). వివాహము పూర్వకాలము ఎనిమిదిరోజులు జరిగేది. వివాహము కన్య ఇంట్లో జరిగేది కాబట్టి అన్నిరోజులూ వరుడూ , అతని ముఖ్య బంధువులూ అక్కడే ఉండేవారు. వివాహము ఎనిమిది నుండీ అయిదు , మూడు రోజులకు తగ్గింది. చివరికి ఈనాడు ఒకరోజే చేస్తున్నారు. అయిననూ హోమము మొదలగు తంతులు తప్పని సరిగా చేస్తున్నారు. వివాహము తర్వాత వరుడు పెళ్ళికూతురిని తన ఇంటికి పిలుచుకొని వచ్చునపుడు తనకు లభించిన ఔపాసనాగ్నిని తనతో కూడా ఇంటికి తెచ్చుకుంటాడు. కొంచము పాతకాలము వారికి గుర్తు ఉండే ఉంటుంది , పెళ్ళికుమారుడు ఔపాసనాగ్నిని ’ ధూపార్తి వంటి’ పాత్రలో ( చిల్లులున్న చిన్న మట్టి కుండలో ) ఇంటికి తీసుకొని వచ్చేవాడు.
ఇక్కడ అగ్న్యాధానము అనే ప్రక్రియ లుప్తమైనది , గమనించండి. ( లేక , ఆ అగ్న్యాధానము ఎప్పుడో పూర్వీకులలో ఎవరైనా చేసి , ఆ అగ్నిని కాపాడుకుంటూ భావి తరాలకు ఇచ్చేవారేమో. )
ఈ కాలము ఛత్రములలో పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. పొద్దున ఎనిమిది నుండీ రెండు వరకే పెళ్ళి మంటపము మనది. ఇటువంటి సందర్భములలో ఔపాసనాగ్ని గురించి ఎవరికి పట్టింది ? సందర్భము వచ్చింది కాబట్టి ఇది రాస్తున్నాను, ఈ మధ్య ఒక పెళ్ళికి వెళ్ళాను. వరుడు కాస్త పద్దతులు తెలిసినవాడే. అంతేగాక , పెళ్ళిలో తన మంత్రాలన్నీ తానే చెప్పుకున్నాడు, పురోహితుడే ఆశ్చర్యపోయేలా ! పెళ్ళి ఒక ఛత్రములోనే చేశారు. ఇంటికి వెళ్ళేటప్పుడు సామగ్రి , సరంజామా అంతా సర్దుకుని వెళ్ళిపోతుండగా హఠాత్తుగా వరుడికి గుర్తొచ్చింది , ’ ఎక్కడా నా ఔపాసనాగ్నీ ? ’ అంటూ రంకెలు వేశాడు. అదృష్టవశాత్తూ అగ్ని అలాగే ఉండింది , నిప్పులతో ! అక్కడున్న చాలామందికి అదేమిటో తెలీదు కూడా. వరుడంటే అలా ఉండాలి.
ఇంటికి తెచ్చుకున్న ఆ అగ్నిలోనే ప్రవేశ హోమము చేయాలి. తర్వాత అదే అగ్నిలో వధువు స్థాలీపాకము చేయాలి. ( ఈ రెండింటి గురించీ పొడిగించుట లేదు ) స్థాలీపాకమయిన రోజునుండీ మూడు రోజులు వధూవరులిద్దరూ బ్రహ్మచర్యమును పాటించి , ఉప్పు , కారములు వర్జించి , నేలపైన ( మంచమును వదలి ) పడుకోవలెను. తమ ఇద్దరి మధ్యలో ఆ మూడురాత్రులూ ఒక రావికొమ్మను గానీ ,మేడి లేదా జువ్వి కొమ్మనుగానీ ఉంచుకొని దానిలో విశ్వావసు గంధర్వులను ఆవాహన చేసి షోడశోపచారములతో పూజ చేయవలెను. దీని తరువాతనే , మంచిరోజు చూసి సమావర్తనము ( గర్భాధానము ) చేయించవలెను.
స్థాలీపాకమయిన రోజే రాత్రిని మూడు భాగములు చేయగా మొదటి భాగములోనే వరుడు ఔపోసన మొదలుపెట్టాలి. ఒకవేళ ఆదినము వేళ మించిపోయి ఉంటే మరుసటి నాటి సాయంకాలము మొదలుపెట్ట వలెను. అప్పటినుండీ ప్రతి దినమూ సాయంప్రాతస్సంధ్యలలో ఔపాసనను వదలక చేయవలెను. స్థాలీపాక ఔపోసనలను రాత్రి మూడవ భాగములో చేయరాదు.
ఔపాసన చేయుటకు తగిన కాలము :- ప్రాతఃకాలమైతే , బ్రాహ్మీ ముహూర్తము నుండీ , కిరణములతో కూడిన సూర్యుడు రేఖామాత్రంగా కనిపించే లోపల ఎప్పుడైనా చేయవచ్చు. అధమ పక్షము , సూర్యోదయమైన ఒకటిన్నర ఘంటలోగా చేయవలెను. సాయమౌపాసన అయితే , సూర్యుడు అస్తమించిన తర్వాతనే , అయితే ఆకాశంలో ఎరుపు ఉన్నంతలోపే చేయాలి. అధమపక్షము , ప్రదోష కాలాంతము లోపల చేయాలి.
ఇక్కడొక ప్రశ్న కలగవచ్చును. ఈ కాలము , ఔపాసనాగ్ని లేనివారు , అగ్న్యాధానము తెలీనివారు తిరిగి ఔపాసన మొదలు పెట్టాలంటే ఎలాగ ? అసలు వైవాహికాగ్నినే పొరపాటునో గ్రహపాటునో తెచ్చుకోనివారికి ఏదైనా పద్దతి ఉందా ? భగవంతుడు కరుణామయుడు. ఈ ప్రశ్న మీకు కలిగినా , నిజానికి మీకు స్ఫురింపజేసినది ఆ కరుణామయుడే. దీనికి తప్పక ఒక మార్గముంది. ఈ కాలమే కాదు వెనకటి కాలములో వారికి కూడా ఈ పరిస్థితి మామూలే. ఏ ఒక్క రోజు ఔపాసన మానినా అగ్ని నష్టమయినట్లే. అలాగ విచ్ఛిన్నమయిన అగ్నిని పునరాధానము చేసుకొనవలెను. దీన్నే పునస్సంధానము అనీ , విచ్ఛిన్నాగ్ని సంధానము అనీ అంటారు. తండ్రి మరణించినవారుకూడా దీనిని ఈ విధముగా పొందవచ్చును. వివాహాగ్నిని స్వీకరించకుండా తనను తాను గృహస్థునిగా భావించేవాడిని ’ వృథా పాకి ’ అంటారు. వాడింట భోజనము చేయరాదని నిర్ణయ సింధువు చెబుతున్నది.
అగ్ని విచ్ఛిన్నము కాకుండా చూచుకొనుట యెలా ? ఒక్కోసారి మన చేతిలో లేని కారణముల చేత ఔపాసనను చేయలేము. ఔపాసన చేయకున్నా , కొద్దిరోజులు అగ్ని విచ్ఛిన్నము కాకుండా చూసుకొనే పద్దతి ఒకటుంది. ఔపాసన చేసిన ప్రతిసారీ దీనిని పాటిస్తే అనుకోకుండా కలిగే విఘ్నముల బారినుండీ తప్పింౘుకోవచ్చు. ఆ పద్దతి రెండు రకాలు. ఒకటి ఆత్మారోపణమ్ , రెండోది సమిధారోపణమ్. మంత్రపూర్వకముగా ఆత్మారోపణమ్ చేస్తే , ఔపాసనాగ్ని తన నోటిలో ఉండిపోతుంది. తరువాత ఔపాసన కొన్నిరోజులు చేయలేకపోయినా , తిరిగి చేసినపుడు తన నోటిలోని అగ్నిని మంత్రపూర్వకముగా ఒక సమిధలోకి తెచ్చి , దానిని అగ్నికి వేయవచ్చును. అప్పుడు అగ్ని విచ్ఛిన్నము కానట్లే. రెండోది సమిధారోపణమ్ అనగా , ఒక రావి సమిధలోకి అగ్నిని మంత్రపూర్వకముగా ఆరోపణ చేసుకొనవచ్చును. వేరే వూరికి వెళ్ళినా , అక్కడ ఆ సమిధనుండీ మరలా అగ్నిని మంత్రపూర్వకముగా తెచ్చుకొని అక్కడే ఔపాసన చేయవచ్చు. కానీ ఇవి చేసేవారు అనేక నియమ నిష్టలతో ఉండవలెను. బ్రాహ్మణుడి ముఖంలో అగ్ని ఉంటుంది అనుటకు కారణమిదే. అబద్ధాలుగానీ , దూషణలుగానీ చెడ్డమాటలుగానీ ఆడరాదు. అభోజ్యాలు భుజింపరాదు. సమిధారోపణము చేసినా ఇవే నియమాలు పాటించ వలెను.
ఈ పునస్సంధానమ్ చేయుటకు ముందు దానిగురించి రెండు మాటలు
ఏ హోమము చేయవలెనన్నా మొదట దానికి అధికారము మనకు ఉండవలెను. అధికారమనగా శాస్త్రములు వివరించినతీరులో మనము అర్హులమై ఉండవలెను. తరువాత , దీనికి చేయునది కూడా ఒక హోమమే కాబట్టి , హోమపు నియమములను పాటించవలెను. ఇందులో భాగంగా , కృచ్ఛ్రాచరణము , అగ్ని ఆవాహన , పూజ , హోమములో ఉపయోగించు పాత్రల శుద్ధీకరణ , ( శుద్ధీకరణ అనగా కేవలము శుభ్రముగా కడుగుట యని కాదు, ఇది మంత్రము , తంత్రపూర్వకముగా శుద్ధము చేయుట ) , హోమ ద్రవ్యములను కూడా అట్లే శుద్ధి చేయుట , మొదలగునవి. దీనినంతటినీ కలిపి హోమపు పరిభాషలో , " అగ్ని ముఖము " అంటారు. అగ్నిముఖము తర్వాతనే ప్రధాన హోమము చేయవలెను. ఈ అగ్ని ముఖము రెండు విధములు. ఒకటి చతుష్పాత్ర ప్రయోగ విధము , రెండోది షట్పాత్ర ప్రయోగ విధము. ఇక్కడ చేయునది చతుష్పాత్ర ప్రయోగమే. ఆ పేర్లను బట్టి , వాటిలో నాలుగు లేక ఆరు పాత్రలు ఉపయోగిస్తారు. ఈ పాత్రలనే ’ యజ్ఞాయుధములు ’ అని కూడా అంటారు. నిత్య , నైమిత్తిక కర్మలన్నిటిలోనూ చతుష్పాత్ర ప్రయోగము , కామ్య కర్మలలో షట్పాత్ర ప్రయోగమునూ అనుసరిస్తారు. నిత్య కర్మలనగా , నిత్యమూ తప్పక చేయవలసినవి , ఇక , మన ఇష్టముతో నిమిత్తము లేకుండా ఆయా సందర్భములు వచ్చినపుడు తప్పక చేయవలసినవాటిని నైమిత్తిక కర్మలు అంటారు. .ఉదాహరణకి , ఔపాసన , సంధ్యావందనములు నిత్య కర్మలు. ప్రతి దినమూ తప్పక చేయవలసినవి. శ్రాద్ధములు , ఉపాకర్మ , గ్రహణ సమయములలో చేయు హోమములు , వంటివి నైమిత్తిక కర్మలు. మనముగా కోరి చేయు పూజలు , వ్రతములు , గణ , రుద్ర , చండీ ఇత్యాది హోమములు కామ్య కర్మలు.
ఈ పునస్సంధానమును అగ్ని నష్టమయిన ప్రతిసారీ , మరలా ఔపాసన చేయుటకు ముందర , అధికారము కొరకు చేయవలెను.
తర్వాత పునస్సంధానము పద్దతి ( చతుష్పాత్ర ప్రయోగము ) చూద్దాము.
బాగున్నది
ReplyDelete