SHARE

Monday, July 16, 2012

44. " మంత్ర ద్రష్ట " నలభై నాలుగవ తరంగం



నలభై నాలుగవ తరంగం

     విశ్వామిత్రుడు విస్తుపోయాడు . గుహలో వేరెవరూ లేరు . వినిపించిన గొంతు లావుగా లేదు . సన్నగా ఉంది . ఎవరో పలికి ఉండాలి ? ఎవరు పలికి ఉంటారు ? బయటి నుంచీ మాట్లాడారనడానికి సాధ్యమే లేదు . బయటి నుంచీ మాట్లాడితే పెద్దగా మాట్లాడాలి. ఆ స్వరము మృదువుగా , అతి దగ్గర నుంచీ మాట్లాడినట్టుంది . అయితే అది మగ గొంతో ఆడ గొంతో చెప్పడానికి కూడా సాధ్యము కాదు . 

     విన్నదయితే నిజము  ... అది పలికినదెవరో తెలీదు . అలాగే ఆశ్చర్యం లో కొంత సేపుండి  చివరికి , తెలుసుకోవలసినదే అనిపించినది . ఎలాగ తెలుసుకోవడము ? 

     ధ్యానములో కూర్చున్నాడు . మరలా ప్రాణాన్ని అనుసంధానము చేశాడు . ప్రాణ దర్శనమైంది . యథావిధిగా ఆరాధించి , " దేవా , అనుమతినివ్వాలి , ఇలాగ అజ్ఞాతంగా మాట్లాడినది ఎవరు ? " అని ప్రార్థించుకున్నాడు . ప్రాణుడు పకపకా నవ్వి అన్నాడు , " ఈ మాత్రము తెలీదా ? కలలో నా తండ్రిని చూశావు . నా తండ్రి యొక్క విరాట్ స్వరూపమే జగన్నాథుని తేరు . దాన్నీ చూశావు . అది నీకు అర్థం కాలేదు . ఇదేమిటీ అని అడిగావు . నేనే నీకు బదులిచ్చాను . అయితే , తెలిసినవారు నన్ను సమిష్టిగా,  వ్యష్టిగా ఆరాధిస్తారు . సమిష్టి అయినపుడు నేను ప్రాణము . వ్యష్టి అయినపుడు ఐదు రూపాలతో ప్రతి దేహాన్నీ పట్టి ఉంటాను . ఆదాన , విసర్జన , శబ్దన , ధారణ, పోషణ అనే పంచ క్రియలను అహర్నిశలూ చేస్తూ స్థితి కర్త అయి ఉన్నది నేను . నా రూపాన్ని సమిష్టి లో చూశావు . కావాలంటే అడుగు , వ్యష్టి అయి కనిపిస్తాను . " 

     " దేవా , నీ అనుగ్రహమైతే ఆ వ్యష్టి రూపాన్ని చూపించు . దానికన్నా ముందు , నాకు కాలపురుషుని దర్శనము ఎందుకయింది అన్నది చెప్పు . " 

     " నువ్వు ప్రాణుడనయిన నన్ను చూశావు . నీ వృత్తి నాకన్న కొంచము వెనక్కు వెళ్ళి నా తండ్రిని గురించి భావనము చేసింది . అది వెళ్ళి అతనిని సంధించింది . అతని దర్శనమైంది . వృత్తి ఎందుకు అటు తిరిగింది అంటావేమో ? అది ఇప్పుడే వద్దు . అది దేవ రహస్యము . ఇది మాత్రము  చెపుతాను , తెలుసుకొని ఉండు , " వృత్తియే జీవితము . మనో వృత్తుల సముదాయమే మనస్సు . మనసును ప్రేరేపించువాడను నేను . నన్ను ప్రేరేపించువాడు కాలము . ఈ మాత్రము తెలుసుకొని ఉండు . , కాబట్టి , నా ప్రేరణ చేతనే నీకు కాలవృత్తి పుట్టింది . కాల వృత్తి వలననే నీకు కాల పురుషుని దర్శమయింది . నా ప్రేరణ చేతనే , ఇప్పుడు పలికినదెవరూ అని తెలుసుకోవాలను ప్రవృత్తి పుట్టినది . నీలో శబ్దనము లేదేమి ? అహోరాత్రాలు నీ చెవిలో సడి వినిపిస్తుండలేదా ? అదేమిటని ఏనాడైనా అడిగావా ? ఇదే దేవరహస్య మనునది . నువ్వు నన్ను చూచుటకు ముందే నేను నీ దేహములో లేనా ? నువ్వు గర్భములోనికి రాకముందే నీకోసము వచ్చి ఇక్కడ దేహాన్ని ఏర్పరచి నిన్ను తీసుకొచ్చిన వాడిని నేను . ఇలాగ ఈ దేహాన్ని ఏర్పరచి , నువ్వు ఉండు వరకూ దేహాన్ని కాపాడుకొని ఉండి , ఇక్కడి నుండీ వెళ్ళే కాలము వచ్చినపుడు నిన్ను వెంట తీసుకొని వెళ్ళే వాడనూ నేనే ! . అయితే , నువ్వెలాగైతే నన్ను ఇంతవరకూ ఎరుగవో , అలాగే జీవితాంతమూ తెలియని వారు ఎంతో మంది ఉన్నారు . సరే , ఇప్పుడు నువ్వు చూడాలన్నది ఎవరిని ? చెప్పు , నీకు ఎవరిని చూడలని కోరిక ? మేము ఐదుగురు సోదరులము . ఐదుగురినీ చూడాలంటావా ? " 

" ఔను దేవా , నేను ఐదుగురినీ చూడాలి " 

" ఇదిగో చూడు "

     విశ్వామిత్రుని ఎదురుగా ఐదు జ్వాలలు నిలుచున్నాయి . చూడటానికి పాముల్లాగా కనిపిస్తున్నాయి . అయినా , ధగ ధగ మని వెలుగుతున్నాయి . సౌమ్యముగా నున్న ఆ జ్వాలల దర్శనము చేత విశ్వామిత్రుని అంతః కరణము పరమ శాంతమై , శీతలమై , కుండలో తోడు పెట్టిన పెరుగు వలె నిశ్చలంగా ఉంది . మునీంద్రుడు వారందరికి సమిష్టిగా పూజ చేసి ," దేవా అనుజ్ఞ ఇవ్వు , ప్రత్యేకంగా పూజలు చేయాలనుకున్నాను . జ్యేష్టానుక్రమమును తెలియజేయి " అని ప్రార్థించాడు .

     ప్రాణుడు అన్నాడు , " ఇదిగో , ఇతడు వ్యాన దేవుడు . దేహాద్యంతమూ ఉండి , దాన్ని ధరించి ఉండు త్రివిక్రమ స్వరూపుడు ఇతడు . ఇతడు ఉండుట వలననే దేహములో ఉష్ణము నిలిచి ఉండుట. ఇతడు ఏ భాగాన్ని విడచునో ఆ భాగము హిమశీతలమై వ్యాపార శూన్యమగును . ...ఈతడు అపాన దేవుడు . దేహములో ఉన్న విసర్జన క్రియలన్నీ ఇతనివి . ఇతను తన వ్యాపారాన్ని ఒక్క ఘడియ నిలిపివేస్తే , వెంటనే మృత్యుపాశము వచ్చి పట్టుకొనును. ఇక ప్రాణుడ నయిన నేను మధ్యముడను . ఆదానమంతా నాది . నువ్వు ఊపిరి పీల్చునపుడు నిఃశ్వాసము అపాన దేవుడిది , ఉఛ్చ్వాసము నాది . యోగము వలన నన్ను ఆరాధించి , చంచలుడైన నన్ను నిశ్చలముగా చేసుకుంటే  మనో బల , బుద్ధి బల , దేహ బలములు హెచ్చును . నేను కుపితుడనగుటయే రోగము . ...ఇదిగో , ఇతడు ఉదాన దేవుడు . నీ దేహములో నడచు శబ్ద క్రియలన్నీ ఇతనివి . ఇతడే నీకు ’ జగన్నాథుడి తేరు ’ అని చెప్పినది . మా అందరి సుఖ దుఃఖాలను బయటికి చెప్పువాడే ఈతడు . ఇతడు అప్రసన్నుడైతే చెవులకు చెవుడు వస్తుంది . ఇంద్రియాలు దుర్బలములవుతాయి . ... ఇక్కడ చూడు , అందరికన్నా చిన్నవాడైనా వామనుడి వలె తేజస్వియై ఉన్న ఈ మహానుభావుడే సమాన దేవుడు . బయటి నుంచీ వచ్చిన ఏదీ కూడా విషమము కాకుండా అంతటినీ జీర్ణించుకొని దాన్నంతా అన్న రసముగా చేసి దేహములో ఎవరెవరికి ఏమేమి కావాలో అది మాత్రమే ఇస్తూ , అందరినీ కాపాడుతూ స్థితి కర్తయై ఉంటాడితడు .  ఈ మా ఐదుగురినీ సాక్షాత్కరించుకొని ,  దేహములో ఎల్లప్పుడూ అవిశ్రాంతముగా నడుస్తున్న సృష్టి స్థితి లయ వ్యాపారాలన్నీ మావి అని తెలిసికొని , భావన చేస్తూ ఉండుటయే పంచాగ్ని హోత్రము . ఇంకేమి కావాలో అడుగు . " 

     " దేవా , పరమానుగ్రహమయినది . ఈ పంచాగ్ని హోత్రము నాలో ఎల్లపుడూ నడుస్తూ ఉండునట్లుగా నాకు అనుగ్రహించు . ఇక అనుమతి అయితే నేను తమరందరికీ క్రమముగా పూజ ఒనరుస్తాను . తమరు అనుగ్రహించి స్వీకరించండి . " అని మరలా నమస్కారము చేశాడు . ప్రాణ పంచకము అతని పూజను స్వీకరించి , అతనిని అనుగ్రహించి అంతర్ధానమును పొందెను . 

Saturday, July 14, 2012

SAMAYAJNA SAAMAAJIKA SABHAA TRUST


                  సమయజ్ఞ సామాజిక సభా ట్రస్ట్


             Samayajna Saamaajika Sabhaa Trust


                           # 47 , 3rd Floor , 2nd Main , PP Layout ,
                 BSK_ 3rd Stage , Bangalore 560085





                     OUR PLEASURE IS IN  SERVING THE MANKIND


       The Trust has the noble objective of serving the mankind , as this is the purpose of life. This trust primarily aims to bridge the gap between attainment of knowledge and its application to mankind. Knowledge, when incomplete or incorrect, can create turbulence in society. The right knowledge, if used wrongly, can create turbulence in minds which affects the society

SAMAYAJNA SAAMAAJIKA SABHAA TRUST ( SSST)
aims to impart the ancient knowledge to aspirants and serve the needy by making them harmonious to nature , using methods passed on to us by our ancestors.

     The Vedas are our source of knowledge and Vedic knowledge has proved itself that , the world has the Vedas as solid base. Every country , directly or indirectly has drawn its life force from Vedas , the way of life as explained in the Vedas. Though the paths differ, the goal is common.

     The Vedas are bestowed upon the mankind, as a holy gift. SSST strives to rationalize and apply the Vedic teachings to suit the present day environment, thus making it the most relevant science the world ever has.

     Our country is flourishing and regarded as spiritual path finder for the rest of the world because of our ancient knowledge and wisdom. Because of that knowledge, India sustained itself and is guiding the world in terms of spirituality. This knowledge is for the benefit of entire population. All the religions have this knowledge as basis. When this is used for the benefit of the masses , then its main purpose is served.

SSST  explores the possibilities of solving the present problems of the masses by using the ancient knowledge and making it applicable to modern times. Simulation and comparisons of basic life needs of ancient and modern times , filling the gaps with acceptable methods, making the life simple and meaningful by eliminating the stresses by including the peace methods for a satisfactory life style.

SSST   envisages to bring home the fact that, everyone in this world deserves a dignified but simple way of life, can lead such a life with utmost satisfaction . Bringing harmony among people, other living things & environment is the first step. Happiness will not happen, it has to be created.

SSST   propagates the rational behavior as narrated in the Vedas, and highlights its relevance , with the belief that, Vedas are valid not for a particular time period and not for the benefit of particular Caste, Creed and Area. Exploring the adaptability of Vedic preachings to today’s changed perceptions and beliefs is the need of the hour .

This Trust operates purely on public funds. Everyone is welcome to participate / involve in whatever way they can.


Activities of the Trust


* Impart Knowledge by in house teachings , organize seminars ., bring out books

* Find and identify core problems of the society.

* Find solutions to problems and identify the methods to solve them.

* Identify and felicitate eminent people in this field.

* Encourage public to participate and bring out their contribution to the society.

* Awards & Rewards as recognition for the services of any one in the concerned field.

* Financial help to poor and deserving students / youth

* Help to destitute children.

         Though formally yet to be operative , activities like teaching , bringing out books have started in 2007.

        A few books are ready for publication . Basic facilities like a building and other infra-structure are in place . Land for the permanent building is acquired with private funds. Construction of permanent building will start in a year.


       This is a sincere attempt for a noble cause and public are invited to participate and extend their support. Many eminent scholars have kindly pledged their support and participation.


Those willing to help financially pl use this information

samayajna@gmail.com   /   janardhan36@gmail.com

+91 9902 719 702   /   9916 583 783


DETAILS OF BANK ACCOUNT

Name: B.Janardhana Rao
Address : # 47 , 2nd Floor , 2nd Main , PP Layout ,
Banasankari 3rd Stage , Bangalore 560085
A/c Number 6405 9935 532
State Bank of Mysore ,

Bank Code : SBM Colony Branch - IFSC : SBMY 0040575

PARTICIPATE ACTIVELY AND LIVE  THE WAY YOU DREAM !!

Friday, July 13, 2012

43. " మంత్ర ద్రష్ట " నలభై మూడవ తరంగము



నలభై మూడవ తరంగము

     విశ్వామిత్రుడు మరలా హిమాలయానికి వెళ్ళాడు . భగీరథుని తపస్సు లోక సంరక్షణార్థమై కిందికి దిగుతున్నదా అన్నట్టు కిందికి దిగుతున్న భాగీరథి యొక్క తుంపురులతో పవిత్రమై , దేవదారు చెట్ల సువాసనతో మనోహరమై , నిర్జనమై , ఏకాంతంగా ఉన్న ఒక గుహలో తపస్సుకు కూర్చున్నాడు . తపస్సు ఆరంభించుటకు ముందే ఒకసారి వెళ్ళి వామదేవుని చూసి రావాలను కోరిక . అందునా  , ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి రావడానికైనా ఆటంకము లేదు. ఆకాశగమనమును మేనక నేర్పించింది . అనుకుంటే వెళ్ళి రావచ్చు . కానీ ఇంకా వెళ్ళాలని అనిపించ లేదు . 

     మనసు అప్పుడప్పుడు మేనకను తలుస్తుంది . జరిగిపోయిన దేనికీ పశ్చాత్తాప పడునట్లు లేదు  . పడనవసరము లేదు . అయితే , ’ ఆమె ఉండి ఉంటే ప్రాణాగ్ని దేవుడి సందర్శనము అయ్యేది కాదు . కాబట్టి ఆమె వెళ్ళిపోయినదే మంచిదైంది . కానీ ఆమె ఉన్నపుడు ఇంద్రుని అప్పు తీర్చే ఆలోచన చేసిఉంటే బాగుండేది . అది కాలేదు ’ 

     ఇప్పటికైనా ఏదో ఒకటి చేసి ఆ అప్పు తీర్చి ఆ తరువాత నిశ్చింతగా ఏల తపస్సు చేసుకోరాదు ? అంటే , ఇంకొక కన్యను వెదకి , పెళ్ళాడి , ఆమెతో యాభై మంది పిల్లల్ని కని వారిని బలి ఇవ్వాలి . అది సామాన్యమైన పని కాదు . పిల్లలంటే తల్లి , తండ్రి ఇద్దరికీ చెందినవారు . తల్లి అనుమతి లేనిదే ఆమె కన్న పిల్లల్ని బలి ఇచ్చేదెలా ? 

     అదే ఆలోచన బలమైంది . ఆలోచన అపారంగా శిరోభారము తెచ్చేలా బలమైనపుడు , ’ ఛీ , నేను చింతించి ప్రయోజనము లేదు , కనిపించని చేయి ఉంది కదా ! దానికి కావలసినప్పుడే తానే అన్నీ చేస్తుంది  ’ అని ఆ ఆలోచనని మరలుస్తాడు . చెరువునీటి పైన పాచిని చేత్తో తొలగిస్తే వెనక్కు పోయినా మరలా తిరిగివచ్చి అలముకున్నట్లే , అతడు బహిర్ముఖుడైతే చాలని ఆ ఆలోచన కాచుకుని ఉండి , మామిడి పళ్ళ కాలంలో చీకటీగ లాగా వచ్చి  ముసురుకుంటుంది . 

     ఇప్పుడు అతని తపస్సూ గంభీరమైంది . వెనకటిలాగా ఇప్పుడతడు పొట్టనింపుటకు దుంపలకోసము వెదకుతూ వెళ్ళడు . ఆకలైతే , దాహమైతే , ప్రాణ ధ్యానము చేసి  అనుసంధానము చేసి ఆ క్షుత్పిపాసలను కట్టివేస్తాడు . మరలా గంగా తీరానికి వెళ్ళినపుడు నీరు తీసుకుని అభిమంత్రించి తాగితే అది ప్రాణానికి అన్నమై , పానమై తర్పణము చేస్తుంది . 

     అతడి తపస్సు ఇప్పుడు ధ్యాన యోగము . వెనకటిలా మంత్ర యోగము కాదు . అప్పటిలాగా దేవ సాక్షాత్కారము కావాలను కోరిక లేదు . నిత్య కర్మయైన బ్రహ్మ యజ్ఞాన్ని చేస్తాడు . సూర్య దర్శనమైన రోజు వెళ్ళి స్నానము చేసి వస్తాడు . మిగిలిన సమయములో , దేహములో పని చేస్తున్నదేది ? ఎందుకు చేస్తున్నది ? అని ధ్యానము చేసి చూస్తాడు . మనస్సు ఏదైనా ఒకదానిని కోరుకుంటే , వద్దు , కూడదు అనకుండా , ’ నీవెందుకు ఇలా కోరుతున్నావు ? ’ అని దాని వెనక తొంగి చూచుటకు ప్రయత్నిస్తాడు . మనసు అతనితో దాగుడు మూతలాడు దానివలె , కాసేపు మూగదై , ఇంకొక ఘడియలోనే ప్రకటమై అడవిలోని సెలయేరు వలె అక్కడ కొంచము , ఇక్కడ కొంచము కనిపిస్తుంది . మనో వృత్తి గోచరమైందా ? చేతికి చిక్కిందా ? అదెందుకలా ప్రవర్తిస్తుంది ? అని దాన్ని పట్టి , దాని పుట్టు పూర్వోత్తరాలు విచారించు పనిలో మునుగుతాడు . 

     అప్పు తీర్చు ఆలోచనకు తోడు బ్రాహ్మణ్యపు ఆలోచన . " స్వర్గ సౌఖ్యాలు అనుభవించాను , ప్రాణ దర్శనము చేసి భూసురుడనయ్యాను . కానీ బ్రాహ్మణుడనయ్యానో లేదో ఇంకా తెలీదు కదా ! అదెలా తెలుసుకోవడము ? ఒకవేళ తెలియకపోతే కలుగు నష్టమేమి ? ఎప్పుడు కావాలో అప్పుడే అవుతాను . ఇకపై నేను దానికోసము ఆరాట పడను . ప్రాణ దర్శనము లాగే ఏదో ఒక దినము ఆ బ్రాహ్మణ్యము కూడా ఎదురుగా వచ్చి నిలుస్తుంది . ఇప్పుడు తపస్సు గురించి తప్ప ఇంకోటి ఆలోచించరాదు . ఈ మనసు ,  చేస్తున్న పనిని చేయనీకుండా ఉండేందుకు ఒక నెపమును వెతుకుతుంది . భూతకాలానికో  , భవిష్యత్ కాలానికో వెళ్ళి , వర్తమానాన్ని మరపిస్తుంది . దీన్ని ఇలాగే వదలరాదు . ముందున్న దానిపై లగ్నము కాకుండా , భూత భవిష్యత్తులను విభాగిస్తూ  , వర్తమానాన్ని వదలే ఈ మనసును కట్టి ఉంచాలి . ఇప్పుడు కూర్చున్నది తపస్సుకు కాబట్టి దానిలో నిమగ్నము కావాలి . కానీ ఏదో ఒక కనిపించని ప్రవాహము , ఈడ్చుకొని , లాగుకొని వెళ్ళుతున్నది . నేను వద్దన్నా నన్ను సాన ఱాతికి తగిలిస్తున్నది . సాన ఱాయి కూడా నా కష్ట నష్టాలను గమనించకుండా రుద్దుతున్నది . రుద్దనీ ! నేను ఒక క్రియ అయ్యాక తెలుసుకోగలనే కానీ దానికి ముందే తెలుసుకోలేను కదా ! ’

     ’ ఛా .. ఛా  ఆపాలి . ఇప్పుడే కదా భవిష్యపు చింతన వద్దన్నాను , మరలా దానికే వెళుతున్నాను . వర్తమానములో ఉండుటకు సాధ్యము కాదా ? ఎలా సాధ్యము ? వర్తమాన క్షణమే లేదు . రాబోవు దాన్ని గడచిపోయినది మింగివేస్తున్నది . పైనుంచి ప్రవహించి వచ్చిన నీరు కిందికి ఉరుకుతున్నది . ఆ ఉరుకుటకు సుడులు తిరుగుతూ సిద్ధమయ్యేది ఒక వైపు , ఉరికి దుమికేది ఇంకో వైపు . ఈ పక్క నుంచీ చూస్తే ఉరుకుతున్న నీరు . ఆ పక్కనుండీ చూస్తే దుమికి ఉన్న నీరు . ఈ మధ్యలో దుముకుతున్న నీరు ఏది అంటే ఎలా చెప్పేది ? ’ 

     అలాగయితే జీవితములో వర్తమాన క్షణమే లేదా ? భూతకాలపు చివరి కొనయే  , భవిష్యపు ప్రారంభము , ఇవి రెండూ చేరి అయ్యే రెప్పపాటు కాలమే వర్తమానము .  అకటా ! ఈ వర్తమానములో బ్రతుకుట ఎలా ? భూతకాలములో చేరుతున్న క్షణాన్ని భవిష్యత్తు నుండీ లాక్కొని , దానికి వర్తమానమని పేరు పెట్టి కలలు కంటున్నాము, కాదా ? ఇది నిజం కాదా ? " 

     విశ్వామిత్రునికి ఇటువంటి ఆలోచనలు కొత్త కాదు . ఎన్నో సార్లు రోజంతా ఇలాగే ఆలోచనలు చేస్తూ కూర్చున్న దినాలున్నాయి . అయితే ఇప్పుడు వర్తమాన క్షణము లేదు అని అర్థమై భయంకరంగా అనిపిస్తున్నది . ఏదో తన సర్వస్వమూ పోయినట్టైంది . భయంకరమైన ప్రవాహములో తాను నిలుచుటకు  చాలా కష్టపడి పట్టుకున్న ఒక బండ చేజారి , ముందుకు కొట్టుకొని పోవుటకు  సిద్ధమై సర్వ నాశనమైనట్లు గాబరా పడు వాడివలె , అన్యమనస్కంగా నడుస్తూ తెలీకుండానే జారి పడిపోయిన వాడిలాగా అనిపించి ఆయాస పడుతున్నాడు . కళ్ళు తెరచి ఉంచుటకు కూడా చేత గానట్టు , కాలూ చేయీ ఆడక , అలాగే గుహ గోడకు ఒరిగిపోయాడు . ఓడిపోయిన ఇంద్రియాలు విశ్రాంతిని కోరి , జీవుడికి ఒక కలను కల్పించి ఇచ్చి , ఆటాడడానికి ఏదైనా ఇచ్చి బిడ్డను వదలి  పరుగెత్తు తల్లి వలె ఎక్కడికో పారిపోయి దాక్కున్నాయి . విశ్వామిత్రుని జాగృతావస్థ సడలి , మగత లోకి వెళ్ళి  , కలలోకి జారింది . 

     కలలో మహా భయంకర రూపుడైన ఒక పురుషుడు కనిపించాడు . ఆకాశానికీ భూమికీ తగులుతున్నట్టు నిలబడ్డ ఆ మహా పురుషుడి ఆకారము భయంకరంగా ఉన్నా , అతడు మాత్రము సౌమ్యంగానే , ప్రఫుల్ల వదనుడై , స్మిత సుందరుడై , ప్రసన్నుడై ఉన్నాడు . విశ్వామిత్రుడు అపూర్వంగా కనిపించు ఆ మహా పురుషుని సమీపించి , యథోచితముగా సత్కారము చేసి , ’ నువ్వు ఎవరు ? ’ అని అడుగుతాడు . అతడు నవ్వి , ’ నన్ను చూశావా ? అసలు ఎవరికైనా నేను తెలిసి ఉంటే కదా నువ్వు నన్ను చూచి ఉండుటకు ? కాబట్టి నేనే నా పరిచయాన్ని చేస్తాను , విను . నువ్వు ఇంతసేపూ ఎవరిని గురించి ఆలోచిస్తున్నావో , ఆ కాలమే నేను . చూడు , ఇక్కడ పైరును పెంచుతాను , అక్కడ పెరిగిన పైరును భక్షిస్తాను . ఇలాగే రేపటి అన్నాన్ని పెంచుతూ , పెరిగిన అన్నాన్ని భక్షిస్తూ ఉండుటే నా పని . ’ అంటాడు. 

      విశ్వామిత్రుడు పర్వతము ముందర ఒక చిన్న చెకుముకి రాయి నిలబడి మాట్లాడినట్టు అతడిని మాట్లాడించాడు , " అన్నమూ , అన్నాదుడూ తానే అని ప్రాణుడు చెప్పినాడు కదా  " అంటాడు . కాల పురుషుడు దిక్కులు పిక్కటిల్లేలా  , పర్వతాలు పగులునట్లు నవ్వుతూ , "  ’ ఆత్మా వై పుత్ర నామాసి ’--- ప్రాణుడు నా కొడుకే . వాడు ముందుగా పుట్టిన అన్నము . వాడినే నేను చివరగా తినబోయేది " అంటాడు .

     విశ్వామిత్రునికి ఎందుకో భయమనిపిస్తుంది . నా గతి ఏమిటి అని అడగాలి . అంతలోపలే మాట అక్కడికే నిలిచిపోతుంది . కాల పురుషుడు ఎర్రబడినా కూడా సుందరమైన తన కన్నులతో చంద్రికలాగా మనోహరమైన వీక్షణాలను ప్రసరిస్తూ  ," విశ్వామిత్రా , ఉన్నదంతా ఒకటే ఒకటి . అది అప్పుడు , ఇప్పుడు అనునది లేనేలేదు . ఇప్పుడు అంటే దానికి రెండు కొనలు , ముందర , వెనుక. కాదా , చూడు " అంటాడు . 

     అపారమైన జన సమూహపు ఒక దృశ్యము . పర్వతము వంటి ఒక తేరు . జనాలు దానిని లాగుతున్నారు . వారి సంభ్రమము , సంతోషమూ అంతా , ఇంతా అని చెప్పుటకు సాధ్యము కాదు . వారు భూభారమంతటి  ఆ రథాన్ని లాగుతున్నారు . అది ముందు ముందుకు వస్తున్నట్టల్లా , దానిని లాగే వారే దాని కిందపడి చచ్చిపోతున్నారు . చచ్చినవారిని పట్టించుకోకుండానే జనాలు ముందుకు లాగుతూనే ఉన్నారు . 

     విశ్వామిత్రుడు ఆ మరణాలను చూడలేక కళ్ళు మూసుకోవాలనుకుంటాడు . కళ్ళు ఇంకా విశాలంగా తెరుచుకుంటాయి . రథము నేరుగా కంటిలోపలికే వస్తుంది . హా..హా.. అనుకొనే లోపలే కళ్ళ నుండీ దిగి ఎద లోపలికి వస్తుంది . ఆ భారాన్ని తట్టుకోలేక గాబరా పడి  , విశ్వామిత్రుడు పెద్దగా అరుస్తూ మేలుకుంటాడు . అతని అరుపు ఆ గవి అంతా నిండి దాని  ప్రతిధ్వని తనను ముంచెత్తేలోపల తానూ కళ్ళు తెరిచాడు . అతనికి ఇంకా తేరు కళ్ళలో  కూర్చున్నట్టే ఉంది . ఎదలో ఏదో భారంగా ఉంది . ఇంకా గాబరా అలాగే ఉన్నట్టుంది . 

     పూర్తిగా మెలకువ అయినా కూడా ఇంకా స్వప్నపు భావము అలాగే ఉంది . తేరు , జనాలు , మరణాలు , మరచిపోయేలా లేవు . ఇది ఏమిటి అని ఆలోచిస్తుండగా, ఎవరో ఉత్తరమిచ్చినట్టైంది , " ఇదే జగన్నాథుడి తేరు " 

Thursday, July 12, 2012

42. " మంత్ర ద్రష్ట " నలభై రెండవ తరంగము



నలభై రెండవ తరంగము

     విశ్వామిత్రునికి ఆశ్చర్యమైంది . అతడు ఇంతవరకూ కనిపించని చేయి గురించి ఆలోచిస్తుండలేదు . మేనకను కావాలంటే ఇంద్రుని అభిమానము సంపాదించుకుని , తాను జీవనపర్యంతమూ ఉంచుకొని ఉండవచ్చు . లేదా , తపోధనాన్ని ఇచ్చి ఆమెను కొనుక్కొని ఉండవచ్చు . అయినా తాను తూష్ణీ భావముతో ఆమెను వదలివేశాడు . అదీ , పక్వమైన పండును వదలి తన పాటికి తాను నిమ్మకు నీరెత్తినట్టున్న చెట్టు వలె ! ఇదంతా ఆ కనిపించని చేయి ప్రభావమా ? అదే తనను నడిపిస్తున్నదా ? అలాగయితే ఎందుకు నాకు ఇదివరకే తోచలేదు ? ఇదేనేమో , మదనుడు చెప్పిన అహంకారపు పెరుగుదల ? " అని ఏవేవో ఆలోచనలు . 

     ఆ ఆలోచనలలో ఎంతో సేపు గడచిపోయింది . పొద్దు నెత్తికెక్కి పడమటి వైపుకు దిగింది . పడమటికి ఉన్న నీడలు దిగంతానికి సాగిపోయాయి. విశ్వామిత్రుడు సుఖాసనములో కూర్చున్నాడు . వద్దకు వచ్చి చేరిన జింక తనను నిమిరి వీపుగోకాలని సైగ చేసింది . కొమ్ముతో గోక్కుని చూపించింది . అతడు నిశ్చలుడై కూర్చుండటం చూసి వెళ్ళిపోయింది . పక్షి ఒకటి వచ్చి ఏడుపునో , నవ్వునో చెప్పుకోవాలనో ఏమో , తొడపై కూర్చుని ముఖాన్ని చూచి కిచ కిచ మంది . శిలా ప్రతిమలా ఉన్న అతని ముఖములో తనకు సరియైన సమాధానము దొరకదనో ఏమో , కాసేపు ఉండి , సరియైన ఉపచారము దొరకలేదని కోపము తెచ్చుకుని వెళ్ళిపోవు అతిథి వలె లేచి ఎగిరిపోయింది .  

     " ఔను , ఈ కనిపించని చేతిని చూడాలి . ఇక మీదట అదే తన తపస్సు యొక్క లక్ష్యము . దేవతలను చూడటమయింది , దేవతలు ఇచ్చు భాగ్యపు పరమావధి ఏమిటో అదీ చూచాడు . ఇంక కావలసినదేమి ?  కనపడని చేతిని చూచుటొకటే పని . దాని కోసమై మరలా హిమాలయ పర్వత సానువులలో నదీ  కొండా ఉన్న చోట ఏదైనా గుహలో ఉండిపోవాలి . " 

     అంతలోపల బహిర్ముఖుడయ్యాడు . మరలా శిశువు ఆలోచన వచ్చింది . ’ ఈ పాపకు అన్నపానాల యోచన లేకున్నా , ఉపచారాలు కావాలి . ఆ ఉపచారాలకు నేను నిలిస్తే నా తపస్సు సాగదు . ఏమి చేయుట ? మేనక నాకు అప్పజెప్పినట్లే , నేను కూడా ఇంకొకరికి అప్పజెప్పి ఎందుకు పోరాదు ? " 

     " ఔను , ఇదే మాలినీ తీరములో ఎన్నో ఆశ్రమాలున్నాయి . అక్కడ ఉన్న మహర్షులలో ఎవరైనా ఒకరికి ఒప్పజెప్పాలి . అయితే ఎవరికి ఒప్పజెప్పాలి ? కాశ్యపుల ఆశ్రమములో క్షత్రియ కుమారులు ఉంటారు . అది వద్దు . ఆత్రేయుల ఆశ్రమములో అవధూత సంప్రదాయము . వారు జాతిని గౌరవించరు . ఇక మారీచులు తపస్వులే అయినా కట్టుబాట్లు లేనివారు . జాబాలి వారు  నాస్తికులు . ఇక చివరిది ఆ కణ్వులది . వారు బ్రహ్మచారులు . అయినా వర్ణాశ్రమ ధర్మములో శ్రద్ధ ఉన్నవారు . వారు అధిభూతానికన్నా ఆధ్యాత్మాన్ని అవలంబించినవారు . అక్కడుండనీ . అదే సరియైన ప్రదేశము . అదీకాక, ఆ తపోవనము ,  నగరాల బాధలకు లోనుకానంత దూరంగా ఉంది . కణ్వ  మహర్షి కూడా నాకు కావలసినవాడు . త్రిశంకువు యాగానికి అందరికన్నా ముందుగా ఒప్పుకుని వచ్చినవాడు . 

     ఈ వేళకు సాయంకాలమైంది . మేనక ఉన్నపుడు పూట పూటకూ సరియైన అన్నపానాలను అడుగుతున్న దేహము ఇప్పుడు తనకు ఆకలయిందని , దాహమయిందని కూడా చెప్పదు . కారణమేమని ఆలోచిస్తే అర్థమైంది, అప్పుడు ఆ భోగిని సాన్నిధ్యము వలన దేహము కూడా భోగాన్ని కోరుతుండినది . అడిగితే తన ప్రార్థన వమ్ముకాదని తెలిసి అడుగుతుండినది . ఇప్పుడు ఆ భోగిని సన్నిధి తప్పింది . మహర్షి మనసు తపస్సుకు అభిముఖమైంది. ఇక నన్ను వినే వారెవరు ? తన ప్రార్థన వమ్ము కాక మరేమవుతుంది ? అని ఊరకుంది . అదీ కాక  , మునీంద్రుని ఇఛ్చా శక్తితో  పాప కోసము విజృంభించినదై అక్కడ సోమశక్తి యై ప్రవేశించి  , ఆ పాపకు ఆహారమైన ప్రాణము , తన ఆహారాన్ని తానే మోసుకుని పుట్టిన మొలక లాగా , తన ఆహారాన్ని అక్కడే చూసుకుంది . మునీంద్రుడు ఇప్పుడు ,  ఆకలి లేకున్నా  జ్వలిస్తున్న హవ్యవాహనుడి వలె వెలుగుతున్న   ప్రాణము ,  తనలోని ఒక భాగాన్నే తిని , సౌమ్యముగా వెలుగుతున్నది చూసి ఆశ్చర్యపడుతాడు . 

     ఆ ఆశ్చర్యములో ప్రాణార్చిని చూసి  అక్కడే ఒక చిన్న పూజ చేసి , " ఈ నీ రహస్యాన్ని నాకు చూపించు , ఉపకారము చేయి , కాపాడు " అని ప్రార్థిస్తాడు . 

     ప్రాణాగ్ని అభిముఖమైంది .: " మునీంద్రా , నేను పగలూ రేయీ నీలో ఉన్నాను . నువ్వు ఇంతవరకూ నన్ను చూడలేదు. నువ్వు భుజించిన  భోజనాన్ని భుజించి , నువ్వు త్రావిన పానీయాలనన్నిటినీ త్రావి , నువ్వు పొందిన భోగముల నన్నిటినీ పొంది నీ లోపల కూర్చున్న నన్ను నువ్వు ఈ రోజు చూచినది , నీకు దేవతల అనుగ్రహ ఫలము . మేనక నీదగ్గర ఉండిన దాని ఫలముగా , దేవత సంపర్కము వలన , నువ్వూ దేవతవైనావు . నీ దేహమిప్పుడు మానవ దేహమైననూ నువ్వు దేవతవై ఉన్నావు . అందువలననే నేను నీకు దర్శనమిచ్చాను . నేను నీకు ప్రసన్నమైనానని , నేను ఈ రోజు నీకు దర్శనమిస్తానని , తెలుసు కాబట్టి దేహము నీతో మాట్లాడింది . మేనకను విడిచి పెట్టావు కాబట్టే నేను నీకు దర్శనమిచ్చాను . అయితే నేనే అంతిమ లక్ష్యము అనుకోకు . అన్నమూ నేనే , అన్నాదుడనూ నేనే !  అయితే ఈ నా వెనక ఉన్నది ఎవరో , అది చూడు . నీ మీది అభిమానముతో చెప్పాను . నువ్వు భూసురుడవయ్యావు . ఇప్పుడు నేను చెప్పింది నీ మీది అభిమానముతో  అన్నది మరవకు .  ఆ నాడు వసంతుడి తో వచ్చి ,  పంచ బాణుడు  చెప్పింది అదే . "

విశ్వామిత్రుడు , " భూసురుడైతే బ్రాహ్మణుడయినట్టే కదా ! " అనుకున్నాడు . 

     " పిచ్చి వాడా ! బ్రాహ్మణ్యమంటే అంత సులభమా ?  భూసురుడగుటలో ఏముంది గొప్ప ? నన్ను చూసిన వారందరూ భూసురులు అవుతారు . నన్ను కావాలన్న వారెవరైనా చూడవచ్చు . నీ ప్రశ్నకు సమాధానము నన్ను అడగవద్దు . నువ్వే వెతుక్కో " . విశ్వామిత్రునికి కూడా ఇక ఏమీ మాట్లాడాలనిపించలేదు . 

     ఆ వేళకు సాయంత్రమవుతున్నది . విశ్వామిత్రుడు పాపను తీసుకుని వెళ్ళి కణ్వుని ఆశ్రమములో అప్పజెప్పాడు . వారు , " ఔనౌను , ఈ పాప మాకు కావలసి ఉంది . " అని విశ్వాసముతో విశ్వామిత్ర పుత్రికను తమ దత్త పుత్రికగా స్వీకరించారు . త్రికాలజ్ఞులైన వారు కూడా , విశ్వామిత్రుడు బ్రాహ్మణుడయ్యాడా అన్న ప్రశ్నకు ఉత్తరమివ్వలేదు . అతడు కూడా వారిని బలవంత పెట్టలేదు . 

Wednesday, July 11, 2012

41. " మంత్ర ద్రష్ట " నలభై ఒకటవ తరంగము



నలభై ఒకటవ తరంగము

     విశ్వామిత్రుడు ఒక్క ఘడియ ధ్యానములో ఉండి , పరశురాముని మాటకు ప్రత్యుత్తరము ఇవ్వకనే బయటికి వచ్చి పారిజాతపు నీడలో రాతి పానుపు పై కూర్చున్నాడు . సమాహితమైన మనసుతో స్తబ్దుడై మహా సముద్రము వలె ఉన్న అతని పాదాల దగ్గర , ఏక కాలము లో అనేక జంఝా మారుతాలు వీస్తుండగా  క్షుబ్దుడై ,  తన ప్రాణమానాలను ఎత్తుకొని పైకి పోతున్న మేఘాలను పట్టుకోడానికి  పైకి చేతులు చాచాడా అన్నట్టు , ఆకాశపు ఎత్తుకు ఎగసి విసరుతున్న అలలను కలిగిన సముద్రుడిలా , పరశురాముడు  కూర్చున్నాడు . 

     విశ్వామిత్రుడు అడిగాడు , " రామా , నువ్వు నన్నేదో అడగాలని వచ్చావు ? ఎందుకు ? " 

     " మా కులదేవతలందరూ ముక్త కంఠముతో అంగీకరించారు , అయినా మేమంతా ముక్కు చివర కోపాన్ని కట్టుకున్న వారము . అది చాలదన్నట్టు అగ్ని భక్తులము . భార్గవులంటే కారణము లేకుండానే కోపగించువారు అని మాకు అపప్రథ వచ్చింది . నువ్వైతే ఆపో దేవి భక్తుడవు . నీ శాంతి మాకెక్కడిది అని అందరూ నీకు చెప్పి ఈ కార్యమును చేయుట మంచిది అని అంటున్నారు . మా కులమంతా తన తేజస్సునూ , తన తపస్సునూ , తన వర్చస్సునూ నాకు ఇచ్చింది . అస్త్రాస్త్ర సంపన్నులైన ఆ దుష్ట క్షత్రియుల నుండీ నాకేమీ భయము లేదు . వారి వారి అకార్యాలే వారిని చంపుతాయి . నేను నిమిత్త మాత్రుడిని . మామా , నన్ను చూస్తే చాలు , నా హుంకారమును వింటే చాలు, నేను ఈ గండ్ర గొడ్డలిని ఎత్తితే చాలు , వారు చచ్చి ఊరుకుంటారు . ఇలాగ అప్పుడే మృత్యు వశులైన ఆ ఖలులను వారి కంఠపు వేడి రక్తము కోసము మాత్రమే నేను చంపాలి , అంతే ! భార్గవుల తేజస్సంటే , సామాన్యము కాదనీ , సంకల్ప మాత్రము చేతనే లోకాలన్నిటినీ దహించి వేయగలదనీ తెలుసుకుంటారు . అయినా , పెద్దల మాట ప్రకారము నీకు అంతా చెప్పి నిన్ను ఒప్పించడానికి వచ్చాను . ఈ దొంగలు , అబద్ధాల కోరులు , పర ద్రవ్య అపహర్తలు బ్రాహ్మణుడి తేజస్సును కూడా చూడనీ " అని పళ్ళు పట పట కొరికాడు . 

     ఆ తేజో విజృంభణమును చూచి విశ్వామిత్రునికి ముచ్చటైంది . తన వెనకటి రూపము గుర్తొచ్చింది . వీడు నిజంగా బ్రాహ్మణుడేనా అనిపించింది . జమదగ్ని చెప్పినదంతా జ్ఞాపకము వచ్చింది . దానితో పాటు ఆనాడు వామ దేవుడు హిమవన్నగ చరియల వద్ద చెప్పిన భవిష్యము కూడా జ్ఞప్తి అయింది . " సరే , కాలము సమీపించింది . కావలసిన కార్యము నేను ఆపితే నిలుస్తుందా ? " అనుకొని , " ఊ , అలాగే కానీవయ్యా , కానీ జాతి క్షత్రియులు లేకుంటే భూమి దాస్యముతో నిండి పోతుంది . కాబట్టి వారిని వదలి , దుష్టులను మాత్రమే సంహారము చేయి " అన్నాడు . 

     " క్షత్రియుడొకడు ఎదురు వస్తే వాడు దుష్టుడా , శిష్టుడా అని ఎలాగ మామా, కనుక్కొనేది ? "

     " అదేమీ కష్టము కాదు . శిష్టులు ఎప్పుడూ సంప్రదాయబద్ధులు . నిన్ను చూచి మధు పర్కాన్ని ఇచ్చిన వాడు శిష్టుడు . " 

" నేను సూతకములో ఉన్నాను కదా , మధుపర్కాన్ని గ్రహించుటెలా ? " 

     " నీది స్వేఛ్చా ప్రారబ్ధము  . విధి విహితము కాదు . కాబట్టి , తానుగా వచ్చిన మధుపర్కాన్ని గ్రహించవచ్చు . " 

     " సరే , మామా , నీ అనుమతి దొరికింది , నేనిక బయలు దేరుతా . నువ్వు ఆతిథ్యమివ్వలేదే అనుకోవద్దు . నాకు ఇంకా ఏదో మంట మండుతున్నది కాబట్టి ఇప్పుడు  ఆకలి లేదు . మంచిది , మామా , అక్కడ నీ పక్కన ఉండిన ఆ శిశువు ఎవరిది ? " 

" దేవతలు ఇచ్చినది "

" ఆడా  ? , మగా ? "

" ఆడ పిల్ల " 

     " మామా , కోపగించవద్దు , ఆ అమ్మాయిని మాత్రము క్షత్రియునికి ఇవ్వవద్దు . సద్బ్రాహ్మణుడిని చూచి ఇవ్వు . లేదా నాకు చెప్పు , భూప్రదక్షిణలో నీకు సరియైన అల్లుడిని వెదకికొని వస్తాను . "

 విశ్వామిత్రుడు నవ్వాడు: " పువ్వు పుట్టినపుడే దాని గర్భములో కాయ ఉండదా ? అలాగే పుట్టి వచ్చిన ప్రతిదానితో పాటూ ఒక కనిపించని చేయి ఉంది , రామా . అది తెప్పను నడిపించు తెడ్డు లాగే జీవితాన్ని నడిపిస్తుంది . కాబట్టి , ఆ పాప సంగతి వదిలేయి , పైగా నువ్వు బయలు దేరినది మృత్యు దూతవై ! , కదా ? "  అన్నాడు . 

     రాముడికీ నవ్వు వచ్చింది . గలగలా నవ్వి ,  " ఔనౌను , మృత్యు దూతను కావాలని మహర్షి అనుమతి అడగటానికి వచ్చాను . " 

     " నువ్వు పుట్టుటకు ముందే నీ తండ్రికి తెలుసు  :  అతని తల్లికీ తెలుసు : నాకూ తెలుసు : క్షత్రియ కులాంతకుడైన భార్గవుడొకడు పుడతాడని : పుట్టినావు . నీ పని నువ్వు చేయుటకు దైవము ప్రేరేపిస్తుంది . అలాగే , వెళ్ళి రా ! మంగళమగు గాక ! కానీ , పాప కార్యము . వీలైనంత తక్కువగా చేయి . " 

     " మామా , చివరగా ప్రాయశ్చిత్తము చేసుకుంటాను . వారి అంతమయ్యే వరకూ వేరే ఆలోచన లేదు . మొదట హైహయ మారణ హోమము . దాని అవభృతమవగానే దాని ప్రాయశ్చిత్తము కోసము ఇంకొక హోమము . " అని విశ్వామిత్రునికి నమస్కరించి , వీడ్కొని , బయలుదేరాడు . 

Tuesday, July 10, 2012

40. " మంత్ర ద్రష్ట " నలభైయవ తరంగము



నలభైయవ తరంగము

      శిశు పోషణకై ఇక్కడే ఉండాలా ? లేక మరలా తపస్సుకు పోవాలా ? అన్న ఆలోచన విశ్వామిత్రుడికి. " తపస్సు చేసి ఫలమేమి ? దేహము శుద్ధమైంది . పంచభూత శుద్ధి కూడా అయింది . ప్రాణ సాక్షాత్కారమైంది . ఇన్నైనాక దొరకని ఆ బ్రాహ్మణ్యము ఇక దొరికినా ఏమి ? ఇలాగే ఒక లక్ష్యము , గురి తెలీకుండా పోనీ . తపస్సు చేద్దామా అంటే ఈ దేవతల పీడ ఒకటి . మనకు తెలీకుండానే మన దేహములోనికి ప్రవేశించి , వ్యాపారము చేయునట్లైతే  మేము ,  తెలీకుండానే   నీరు నిండు  కుండ , బానల కన్న హీనమైనట్టే కదా ! తేనెటీగలు కూడబెట్టిన తేనెను ఎవరో ఎత్తుకొని పోయినట్లే , నేను చేసి ఉంచుకున్న తపస్సునంతా స్వర్గాన్నిచ్చే నెపముతో ఈ దేవతలు కాజేసుకొని పోతే నేను తపస్సు చేసి ఫలమేమి ? " అని అతడు దీర్ఘముగా ఆలోచిస్తాడు . 

     " ఒకవేళ తపస్సు వద్దనుకుందాం , ఇక ఏమి చేయాలి ? మరలా రాజ్యము కట్టుకోవాలా ? లేదా ఆశ్రమమును కట్టుకొని , పాఠ ప్రవచనాలు చెప్పుకుంటూ ఏదో ఒకలా పడిఉండాలా ? ఊహూ .. కూడదు . అది లక్ష్యము లేని జీవనము . ఆ గుడ్డి బ్రతుకు కన్నా ఈ దేహాన్ని ఇక్కడే వదలి లోకాంతరాలకు ఎందుకు పోరాదు ? అంతటి ఆశ ఉంటే ఇంద్రుని పిలిపించుకుని , ఇంకొక స్వర్గాన్ని పంపించమంటే సరి . కానీ కేవలము తింటూ కూర్చుని , భోగాలలో తేలితే సుఖమేముంది ? బ్రతుకంటే అదే అంటే , నా ఆశ్రమములోని మృగాలకూ నాకూ ఏమి వ్యత్యాసము ? " అని ఆలోచనా తరంగాలు అతన్ని చుట్టుముట్టి ఆక్రమించాయి .

     అతడు ఇలాగ ఆలోచనామగ్నుడై ఉండగా శిశువు మరలా ఏడ్చి తానున్నానని గుర్తు చేసింది . అతడు ధ్యానము చేసి  ప్రాణమయుడై తన బొటన వేలిని ఆ శిశువు నోటిలో ఉంచాడు . శిశువు చొర చొరామని పీల్చుకుని తృప్తి పడి అలాగే నిద్రపోయింది .***  1

     రెండు నెమళ్ళు వచ్చి తమ రెక్కలను విప్పి శిశువుకు వింజామరలు వీచినట్లు వీస్తున్నాయి . ఇంకొక మగ నెమలి తన పింఛము విప్పి  కప్పింది . 

     అతనికి అది చూచి ఆశ్చర్యమైంది . ’ బిడ్డని తల్లి వదలి వెళ్ళింది , తండ్రినైన నేను ఏమి చేయాలో ఇంకా తెలుసుకోలేదు . ఇటువంటప్పుడు ఈ పక్షులు శిశువుకు ఉపచారము చేస్తున్నాయి . వీటికి చెయ్యమని చెప్పిందెవరు ? ఔను , నేను మొన్నటి రోజు స్నానానికి వెళుతూ ఈ నెమలికి చెప్పి వెళ్ళాను . అందుకని ఇవి నా పని చేస్తున్నాయా ? నాకూ వీటికీ సంబంధమేమి ? వచ్చినపుడు వీటికి ఆదరముతో ఉపచారము చేయుటేగా ? దానికి ఇవి ఇంతటి ప్రత్యుపకారము చేస్తున్నాయా ? అలాగైతే దేవతలు అంతటి కృతఘ్నులా ?  వారికి మేము పగలూ రేయీ అనక హవిస్సులను ఇస్తున్ననూ వారెందుకు మాకు ఉపకారము చేయుట లేదు ? మా తపస్సుకు ఏల అపకారము చేస్తారు ? "

     ఇలాగ ఆ ఆలోచనలో ఉండగా వాకిట్లో " మామా ! " అన్న పిలుపు వినిపించింది . గొంతు ఘనంగా , గోడలను చీల్చుకు వచ్చునట్లు కఠినముగా ఉంది . జమదగ్ని కంఠము ఉన్నట్టే ఉన్నా , అది కాదు . వెంటనే గుర్తుకు రాకున్నా , విశ్వామిత్రుడు ఆదరముతో , ’ లోపలకు రావయ్యా ! ’ అన్నాడు .  ఆ వచ్చింది పరశురాముడు  . ఉక్కు తో చేసిన బొమ్మ నడచివస్తున్నదా అన్నట్లు వచ్చాడు . దేహము లోని అంగాంగమూ ఒక పర్వతమైతే ఆ మూర్తి ఎలా గంభీరంగా నడవాలో అలా నడచి వచ్చాడు . చేతిలో పట్టుకున్న గండ్ర గొడ్డలి మెరుపు చెట్టులాగా మెరుస్తున్నది . మూటగట్టిన నల్ల మేఘమా అన్నట్లు వచ్చి నమస్కారము చేశాడు . అక్కడనే కొన్ని దర్భలు వేసి , దానిపై కూర్చోబెట్టి మునీంద్రుడు కుశల ప్రశ్నలు వేశాడు . రాముడు , " మామా , అంతా సర్వ నాశనమై పోయింది " అని ప్రారంభించి , తనను పొడుచుకొస్తున్న దుఃఖాన్ని పక్కకు తోస్తూ , నిట్టూర్పుల జాప్యాన్ని దాటుతూ , తమ ఆశ్రమపు దయనీయమైన కథను చెప్పాడు . హైహయుల కార్తవీర్యుడు శబలను కోరినది , శబల వెళ్లకుండా మొరాయించినదీ , దానికి అతడు చెలరేగి , జమదగ్నిని చంపి ఆశ్రమమునంతా ధ్వంసము చేసినదీ , ఇంతైనా కూడా శబల దొరక్కుండా తప్పించుకుని స్వర్గానికి  వెళ్ళిపోయినదీ ,... అంతా ఆగి ఆగి చెప్పాడు . 

     అది విని విశ్వామిత్రుడు స్థాణువయ్యాడు. జమదగ్నిని తలచి దుఃఖమైంది . " ఎంత పని చేశారు ? నాకెందుకు తెలియ పరచలేదు ? జమదగ్ని దేహపు ముక్కలను అతికించి అగ్నిని ధ్యానము చేసి ఉంటే  అతడు ఆ ముక్కలను జోడించి ఇచ్చేవాడు . నేను కూడా ఇక్కడ ఏదో పని ఉండి సంవత్సరము నుండీ ఆవైపుకే రాలేకపోయాను . ఇంకా దేహముందా ? లేక సంస్కారము అయిపోయిందా ? " అని అడిగాడు . 

     " సంస్కారము అయిపోయింది . అయితే చితికి అగ్ని అంటించి , అది కాలుతుండగా ఒక తేజో మండలము పైకిలేచి , ఇంకో రెండు చిన్న తేజో మండలములు చూపించిన మార్గములో అన్నీ ఆకాశానికి వెళ్ళాయి . నేను వాటి వెన్నంటి పోతానన్నాను . మిగిలినవారు వదలలేదు   . అపర కర్మలన్నీ ముగిసి మూడు రోజులైంది . " 

" హు...."

     " ఇప్పుడు నిన్ను అడగాలని వచ్చాను . నాకు తండ్రిగారి పైన ఎంతటి అమోఘమైన ప్రేమ ఉండిందో నీకు తెలుసు . అంతటి తండ్రిని పోగొట్టుకొని ఊరక ఉండుటకు సాధ్యము కాదు . తండ్రిని చంపిన పాతకుని వదలుట కూడా సాధ్యము కాదు . అందుకే , వాడిపై యుద్ధము చేశాను . హైహయ కులమునే నిర్మూలించాను . అంతే కాదు , దుష్ట క్షత్రియులు ఎవరైనా కానీ , ఎక్కడైనా ఉండనీ వారిని ధ్వంసము చేస్తాను . ఇరవై ఒక్కసార్లు .  మామా ,  నా తండ్రి అర్చించుచున్న అగ్ని సప్తార్చి , త్రిరూపుడునూ  యై ఉన్నాడు కాబట్టి ఏడు మూళ్ళు ఇరవై ఒక్కసార్లు ఈ భూమండలమునంతా చుట్టి వస్తాను . కిరీట పతులైన వారి తలలు కోసి , మరుగుతున్న వేడి రక్తముతో పితృ తర్పణము చేస్తాను . బహుకాలముగా మాకూ హైహయులకూ ఉన్న ద్వేషము నాతలకు బాగా ఎక్కనీ . భూమి లో క్షత్రియ శేషము లేకుండా చేస్తాను . " 

     పరశురాముడి ఆవేశపు వేడికి ఆశ్రమము కాగి పోవునో అనిపించెను . నెమళ్ళు బెదిరాయి . పాప లేవకున్నా , అటూ ఇటూ పొర్లింది . విశ్వామిత్రుడు ఆ తేజో మూర్తి విజృంభణను మెచ్చుకొని , అలాగే లేచి , నాతో రా అని అగ్ని గృహపు వైపుకు నడిచాడు . పరశురాముడు వాకిటి వరకూ వచ్చి , " లేదు , మామా , ఇరవై ఒక్కసార్లు భూ ప్రదక్షిణ చేస్తాను . మకుట ధారుల కంఠ  రక్తముతో  ఎప్పుడు దొరికితే అప్పుడు పితృ తర్పణము చేస్తాను . ఒక్కొక్కసారి భూప్రదక్షిణమయ్యాక కురుక్షేత్రానికి వచ్చి తర్పణమిస్తాను . అలాగ ఇరవై ఒక్కసార్లు అగువరకూ నాకు పితృ సూతకము పోదు . అంతవరకూ నేను అగ్ని గృహాన్ని తాకను " అని బయటే నిలిచాడు . 
*** 1 --(  ఒకానొక కాలంలో మైసూరు ఈద్గా దగ్గర ’ దూధ్ పీర్ మకాన్ ’ అనే ఒక కట్టడము ఉండేది . అక్కడ ఒక పీర్ సమాధి ఉంది . ఆ పీర్ మహాశయుడు ముమ్మడి కృష్ణరాజ ఒడెయార్ కాలపు వాడు . తల్లి లేని పిల్లలను అతని దగ్గరకు తీసుకొని వెళితే అతడు తన బొటనవేలిని పిల్లల నోటిలో ఉంచేవాడు . బిడ్డ దానిని చీకి పొట్ట నిండి నిద్రపోయేది ) ... 

Monday, July 9, 2012

39. " మంత్ర ద్రష్ట " ముప్పై తొమ్మిదవ తరంగము



ముప్పై  తొమ్మిదవ తరంగము


     పగలు గడచి  రాత్రి యై , రేయి పగలు రెండూ గడచి వారమై , వారాలు గడచి పక్షమై , శుక్ల , కృష్ణ పక్షాలు ఒకదాని వెనుక ఒకటి పరుగెత్తి మాసాలై , ఋతువులై , ఆయనాలై  వర్షము పూర్తి కావస్తూ వచ్చింది . లేదా , పూర్తయ్యింది . ఇంకొక్క రోజైతే వర్షము ముగుస్తుంది . దేవతలు ఇచ్చిన గడువు ముగుస్తుంది . 


     ఈ రోజు పున్నమి . సంధ్య సమీపిస్తున్నదని పొడవగుతున్న నీడలు చెబుతున్నాయి . చెడ్డవాళ్ళు మంచి వాళ్ళైనపుడు జనులకు ప్రియులైనట్లే , వడ దెబ్బ కొట్టు నట్లు తీక్ష్ణమైన సూర్య కిరణాలు తమ తీవ్రతను వదలి , జనప్రియమై , లోపల ఉన్నవారిని బయటికి పిలుస్తున్నాయి . ఆశ్రమములో మృగ , పక్ష్యాదులు మధ్యాహ్నపు ఆయాసమును మరచినాయా అన్నట్లు లేచి తిరుగుతున్నాయి . విశ్వామిత్రుడు పారిజాతపు మొదట్లో బండ పైన కూర్చొని ఆలోచిస్తున్నాడు . 


     ఎందుకో తెలీకున్నా , అతని మనసు ఆ రోజు మేనక పెళ్ళిరోజు మదనుడు ఆడిన మాటలు గుర్తొస్తున్నాయి , " అహంకారము పెరగాలని విచిత్ర భోగాలనూ , విచిత్రానుభవాలనూ దేవతలు సమకూరుస్తారు " ....  ’ అహంకారమును పెంచుటే నా కార్యము ’ ......’ అహంకారమును కొలుచుటకొక సాధనముంది ’ ...... 


     అతనికి అనిపించింది , " అట్లయితే నా అహంకారము పెరిగిందా ? మేనక దొరికిందని నా మనసుకు మోదమైనది నిజము . ఆమెను పగలూ రాత్రీ అని లేకుండ కోరుతున్నదీ నిజము. ఆమె లేకపోతే ఒక ఘడియ కూడా బతకలేననిపించినదీ నిజమే . ఆమె చెంతన ఉంటే మిగిలినవన్నీ మరచునదీ నిజమే . అయితే ఇదేనా అహంకారము ? భోగవస్తువును కోరి దానికై ఆరాట పడుటేనా అహంకారమంటే ? లేక , దానికన్నా భిన్నమైనది ఇంకేమైనా ఉంటుందా ? 


     ’ మేనా వచ్చుటకు ముందు అలంకారము చేసుకోవాలనే కోరిక లేదు . ఇప్పుడది తీవ్రముగా ఉంది . దానికి ముందు ఇంకొకరిని మెప్పించాలన్నది కనిపించేది కాదు . ఇప్పుడు అదీ ఎక్కువైంది . ఇలాగ బాహ్య వృత్తి అయినదే అహంకారమా ? ’ విశ్వామిత్రుడు ఇలాగ ఏకాంతములో కూర్చొని ఆలోచన చేసి చాలా రోజులైంది . సాయంకాలపు నీరెండలో ఏదో ఒక విచిత్రమైన శక్తి ఉన్నట్టూ , అది తన లోపలికి ప్రవేశించినట్టూ తెలుస్తున్నది .  తనను ఆవరించినట్టున్న  ఏవో కట్లు సడలిపోతున్నట్టు కనపడుతున్నది . ఉన్నదేదో జారి జారి పడిపోతున్నట్టుంది . మనసు, పోయేదానిని ఆపలేదు , వస్తున్నదానిని నిరాకరించలేదు . అసమర్థుడైన యజమానుడు ఇంటిలోని వారి చెలగాటాలను చూచినా నిరోధించలేక, ఊరికే ఉన్నట్టు మనసు ఊరికే ఉంది . 


     మేనక , ఎప్పటి లాగైనట్టయితే కౌశికుడి చెంత కూర్చొని గారాలు పోతుండాలి . రెండు మూడు దినముల నుండీ ఆమె వేరే అయింది . ఆ వ్యత్యాసము కూడా బాగా కనపడుతోంది . . నది సముద్రాన్ని చేరునపుడు తన నీటి పీడనమే ఎక్కువై ముందుకు ప్రవహించలేక నిలబడి పోయినట్లు మేనక ఇప్పుడు సగము ముభావముగా ఉంది . చెరువుకు గండి పడినపుడు నీరు కారి పారినట్లు ఆమె మోహము క్షీణిస్తున్నది . అగ్నిగర్భ ఐన శమీ చెట్టువలె తేజోధారిణియై తనలో తేజస్సునుంచిన వాని వైపుకు మనసు పరుగెడుతున్నా , దేహము మాత్రము ఆయాసపడి దూరంగా ఉండాలనుకుంటున్నది . ఆమె తన దేవతత్వాన్ని వహించి ఎందుకిలా అవుతున్నది అని చూడగలదు . కానీ దానికి కూడా ఆమెకు ఎందుకో విసుగు . బహుశః పక్వమైన పళ్ళున్న చెట్టు ఇలాగే ఆయాసపడుతుందేమో ? 


     మానవ ధర్మానుసారము గర్భధారణ చేసిన మేనకకు విశ్వామిత్రుడు ఉపచారము చేస్తాడు . అతని తపోబలము చేత సంపాదించిన ద్రవ్యములతో ఆమెకు ఉపచారములు జరుగుతున్నాయి . ఆశ్రమ వృక్షము క్షీరాన్ని స్రవిస్తుంది . ఇంకొకటి తేనెను ఇస్తుంది . మరొకటి అమృతము వలె రుచిగానున్న పళ్ళనిస్తుంది . దిన దినమూ పళ్ళు , పాలు ,తేనె. కావాలన్నపుడు కొన్ని చిలగడ దుంపలు . మొత్తానికి భోజన ఉపచారాలకు లోటేమీ లేదు . 


     రాత్రి అయింది . సుమారు ఒక ఝాము గడచింది . మేనకకు ప్రసవ వేదన ప్రారంభమయ్యింది . ఎంతైనా దేవత కదా ? ఆమె సఖులు వచ్చారు . యథా కాలములో సుఖ ప్రసవమయ్యింది . ఆ ఆయాసములో కన్ను మూసుకున్న దానిని సఖులు కావాలని ఏవో సవములు నాకించి , ఇంకొంత సేపు నిద్రపుచ్చారు . మేనకకు బిడ్డని తనకు చూపకుండా దాచిపెట్టమని చెప్పాలనిపించింది. ఇంకో రెండు రోజులు పతితో పాటు సుఖంగా ఉండి అనంతరము స్వర్గానికి వెళ్ళునపుడు బిడ్డను ఇచ్చి వదలి వెళ్ళాలని కోరిక. కానీ ఎందుకో ఆమాట ఆమె చెప్పలేదు, సఖులు స్వతంత్రించలేదు . 


     పాప ఏడ్చింది . మేనక నిద్రపోతే , మాతృభావము నిద్రపోతుందా ? ఆమెకు మెలకువ వచ్చింది . అపరంజి బొమ్మలా ఉన్న పాపను ఒడికి తీసుకుని యథోచితముగా ఉపచారము చేసింది . ఇంకొకసారి పతి ప్రణయ బింబమా అన్నట్లు ఒడిలో పాలు తాగుతూ పడుకున్న పాపను చూసింది . ఆమె మనసు మారిపోయింది . 


     మేనకకు తెలియకుండానే మానవధర్మము వదలిపోయింది . ఆ మానవ శిశువు తన శరీరాన్ని తాకుటను సహించలేక  ఆ శిశువును వెనక్కు పెట్టేసింది . ప్రసవపు ఆయాసము మాయమైంది . దేహములో ఎప్పటిలాగానే శక్తి వచ్చింది . ఆమెను అడక్కుండానే దేహము భూమిని వదలి పైకి లేచింది . కంఠాన్ని దివ్య కుసుమ మాల అలంకరించింది . వస్త్ర భూషణాలు అన్నీ మారిపోయాయి . 


     మేనకకు చుట్టుపట్ల ఉన్న పదార్థాలు , వస్తువులు , బిడ్డ   అన్నీ చూసి మరలా గత వైభవము అంతా జ్ఞాపకము వచ్చింది . అదంతా తలచి , సుఖ స్వప్నాన్ని స్మరించుకున్నదాని వలె తనలోనే చిన్నగా నవ్వుతూ లేచి నేలను ముట్టకుండా గాలిలో తేలుతూ వచ్చి విశ్వామిత్రుని ముందు నిలచింది . అప్పు తీర్చి కృతార్థురాలై చేతులు జోడించి వీడ్కొలుపు భావముతో , " మునీంద్రా , నేను స్వర్గానికి బయలుదేరవచ్చు కదా ? " అంది . 


     గొంతులో మునుపటి మోహావేశము లేదు . నిశ్చలమైన స్థైర్యముంది . అది ఎక్కడికో పోయిన మునీంద్రుని మనసును మంత్రము వలె ఆకర్షించింది . అతడు ఎప్పటిలా ఉన్ననూ , ఎందుకో ఆమెను ముందువలె భావించలేక , దూరపు బంధువును చూసినట్టు , కలలో ఉన్నవాడు కళ్ళు తెరచినట్టు , ’ ఆ ’ అన్నాడు . 


     మేనకకు దానిని చూచి మనసు మరగి పోయింది . దేవతలు తమ ఆటను బాగానే ఆడారు అన్నది చూచి , నవ్వుకుని ,  వెనకటి ప్రణయాన్ని కావాలని తెచ్చుకొని , ప్రయత్నపూర్వకంగా వద్ద చేరి , " దేవా , మేలుకో . నీ బిడ్డను తీసుకో . సమయము దగ్గర పడింది . నన్ను వీడ్కొలుపు. నీ అనుమతి లేక నేను పోలేను . " అని ఎలాగైతే ఉచితమో , అలాగ ఉపచారము చేసింది . 


     మునీంద్రునికి మెలకువ వచ్చింది . ఇంద్రియాలు తమ ప్రాణానికే ప్రాణమైనట్టిది వెళ్ళిపోవునని గాబరా పడి దుఃఖ మూర్తులై కరగలేక రోదించునట్లు గోల పెట్టాయి . అతడు దేహేంద్రియ మనో వృత్తులను అతి కష్టము మీద సంబాళించుకొని "  అలాగైతే వెళ్ళిపోవలసిందేనా ? "  అన్నాడు . ’ మేనా ’ అనుటకు పోయిన నోరు పలుకకుండానే నియమానికి కట్టుబడిన గోడ వలె నిలుచున్నది .  ఆమెకూ తెలిసింది . ఆమె , " దేవా! మన్నించు . మేము స్వతంత్రులము కాదు . నీకు అంతా తెలుసు . నేను వచ్చినపుడు నన్ను వద్దన్న ఆ గట్టితనముతోనే నన్నిపుడు సాగనంపు . నువ్వు నాకు ఇచ్చిన ప్రేమ తీపి గుర్తు నా హృదయములో ఎప్పుడూ ఉంటుంది . లే , ఇదిగో , ఆ బిడ్డ సంరక్షణ భారము వహించు . స్వర్గపు ఒక భోగము సాని వచ్చి నాదగ్గర స్వర్గాన్నే మరచి సుఖంగా ఉండినది అని గర్వ పడవలసిన వాడివి కదా ,  నువ్వు ? " అని తెలియజెప్పింది . మునీంద్రుని మనసు సమ్మతమై , తొలకరి వాన నీటి బొట్ల వలె రెండు పెద్ద కన్నీటి బొట్లు రాలినా , వివేకము అతనిలో సహజమైన స్థైర్యాన్ని మెరపింప జేసింది  . సంయమనముతో స్థిరంగా తలఊపి , ఆమె ఔపచారిక కానుకను నవ్వుతూ స్వీకరించి , " వెళ్ళునపుడు చెబుతానన్నావు కదా ? "  అన్నాడు . 


     మేనక నవ్వుతూ , " ప్రభూ , ఇప్పుడయినది ఆడ పిల్ల. అది పెరిగి యౌవనవతి అగువరకూ ఆగు . ఆమె ఎవరిని వరిస్తుంది అన్నది నీ ప్రశ్నకు సమాధానము . ఆమె క్షత్రియుడిని వరిస్తుందో , బ్రాహ్మణుడిని వరిస్తుందో  చూసుకో . నీ అల్లుడు క్షత్రియుడైతే నువ్వూ క్షత్రియుడవే . బ్రాహ్మణుడైతే నువ్వూ బ్రాహ్మణుడవే . " అంది .


     విశ్వామిత్రుడు ఇంకా ఏమో అడగాలని అనిపించుచున్ననూ , దాన్నంతా అలాగే సమ్మాళించుకుని , కేవలము సమతౌల్యము గల మునీంద్రులకు మాత్రమే సాధ్యమయిన మనోస్తిమితముతో మేనకను వీడ్కొలిపాడు . మేఘాలు లేని ఆకాశము వైపుకు నేలనుండీ ఒక మెరుపుతీగ ప్రసరించి ఆకాశపు నీలిమను చేరి మాయమైంది . అతడు తిరిగి చూచేటప్పటికి మాయమైన మెరుపు దిగంతాన్ని వ్యాపించినట్లు అరుణోదయపు బంగారు వర్ణము కనిపించింది . ఆశ్రమ వాసిని ఎక్కడా అని పక్షులన్నీ అడుగుతున్నట్టు కలకలా రావాలు చేశాయి . 


     విశ్వామిత్రుడు కావలసినది అయింది అన్న నిశ్చయముతో ఉన్నా , దేహపు ఏదో ఒక ప్రాణమే బయటికి పోయినట్టైంది . ఆ వేళలో తాను నిద్రలేచి స్నానాదులను ముగించి కర్తవ్య కర్మలను చేసి చాలా రోజులయిందని గుర్తొచ్చి నవ్వొచ్చింది . ఈరోజు ఇక ఏ అడ్డము లేదు, సూర్యోదయానికైనా స్నానము కానీ అని లేచాడు . పాప ఏడుపు వినిపించింది. నవ్వి , ఆ వేళకే లేచి తిరుగుతున్న నెమలి నొకదాన్ని పిలచి , " పాపను చూసుకో " అని చెప్పి నదికి వెళ్ళాడు .

Saturday, July 7, 2012

అందరికీ నమోవాకాలు

     ప్రపంచపు నాలుగు చెరుగుల నుండీ వీక్షకులు మంత్ర ద్రష్ట  కాదంబరిని  అత్యంత శ్రద్ధాసక్తులతో చదువుతున్నారు .   మీ ఆదరణ , అభిమానము నన్ను ఉద్దీపితుడను చేస్తున్నది . 


     మనకు స్వాతంత్ర్యము వచ్చు వరకూ అణగదొక్కబడిన హిందూ సంస్కృతి  మరలా తలయెత్తి సగర్వంగా తన వైభవాన్ని చాటుకోవాలంటే , మన సంస్కృతీ సాంప్రదాయాలను ప్రతిబింబించే దేనినైనా గౌరవించి ఆదరించాలన్న మీ అందరి  అభిమతమూ , మీ సంస్కారమూ , మీ అభిమానమూ చూస్తుంటే , దాని ముందు నేను ఎంత చిన్నవాడనో అర్థమగుతున్నది . ఏదో కేవలము నా సంతోషము కోసము మొదలు పెట్టిన ఈ అనువాదము ఇప్పుడు ఇంతటి ఆదరణ కు నోచుకోవడముతో , నా బాధ్యత పెరిగి , ఒళ్ళంతా కళ్ళు చేసుకుని , మనసూ బుద్ధీ ఏకాగ్రతను నింపుకొని రాయవలసిన అగత్యము కనబడుతున్నది ..


     ఎందరో మహానుభావులు , విద్యావంతులు , సాహితీ అభిమానులు , సంప్రదాయ బద్ధులు , ఆచార శీలురు అయిన మీ అందరి పలు విధాలైన  అభిలాషలు , అభీష్టాలు ఈ ఒక్క విషయములో సమాన భావాన్ని వహించడము ఎంతో హర్షణీయము , ఆమోద యోగ్యము గా ఉంది . 


     కొన్నాళ్ళు కుంటు బడిన హైందవ సంస్కృతిని పునరుద్ధరించాలన్న దృఢమైన అందరి ఆకాంక్ష  ద్యోతకమగుతున్నది . ముఖ్యంగా నేటి యువతీ యువకులు , ఈ విషయాలపై    ఆసక్తి పెంచుకోవడము అత్యంత  శుభ పరిణామము. 


     నా వల్ల ఎటువంటి పొరపాట్లూ తప్పిదాలూ జరగకుండా విజయవంతంగా , జనాదరణ యోగ్యంగా  ఈ అనువాదాన్ని పూర్తి చేయుటకు ఆ భగవంతుడి కృప కోసము ప్రార్థిస్తున్నాను . 


మీ జనార్దన శర్మ

38. " మంత్ర ద్రష్ట " ముప్పై ఎనిమిదవ తరంగము



ముప్పై  ఎనిమిదవ తరంగము

     దంపతులు నిర్విషయానందాన్ని పొందినవారి లాగా దేశ కాలాలను మరచి , ఎక్కడో , ఎందులోనో లీనమై పోయినా , జగత్తు కాలాన్ని మరవలేదు . సూర్య భగవానుడు ఎప్పటిలాగే అహస్కరుడై తూర్పు దిశను అలంకరించు సువేళ అయినదని కోడి జగాన్ని హెచ్చరించింది . యోగి , భోగులిద్దరికీ సమంగా ప్రియమైన ఆ సమయం లో నిద్ర లేచిన విశ్వామిత్రుడు కాంతా దేహపు గాఢాలింగనము ఇంకా సడలిపోక , దాన్ని అలాగే అనుభవిస్తూ మెలకువ వచ్చినా కన్ను తెరవక , " దిన దినమూ ఇష్టాపూర్తి కర్మలను చేయుట దీనికోసమే కాదా ? స్వర్గపు వేశ్యాంగనల భోగము కోసమే కదా ? అవే ఇక్కడికి వచ్చాక , ఈ కర్మల కష్ట నిష్టూరాలెందుకు ? " అని ఏమేమో ఆలోచిస్తున్నాడు . అతని ఇంకొక మనసు , ’ నీకు కర్మలు అవసరము లేదు . కానీ లోక రక్షణ భారమును వహించిన వారికి అవసరమే కదా ? నీ వంటి వారే కర్మ సన్యాసము చేస్తే లోకపు గతి ఏమి ? ’ అంటుంది . చివరికి ఇలా సిద్ధాంతము చేసుకున్నాడు , ’ ఈమెకు వరము నిచ్చాను . ఈమె సహవాసము నాకు కూడా కావాలనిపిస్తుంది . నా మిత్రులైన దేవతలకు కావలసిన బలి మొదలైనవి సకాలానికి అందకపోతే వారికి ఇక్కట్లు తప్పవు . అలా జరగకుండా , నా తపోబలము నుండీ హవిర్భాగాలు వారికి సకాలానికి అందునట్లు చూడాలి . ఎవరికీ ఇబ్బంది లేకుండా ఇంకొంత కాలము నిరాటంకముగా దాంపత్య సౌఖ్యమును అనుభవించుటకు అనుకూలము కావాలి . "  ఆ సిద్ధాంతము రూపు చెందుతున్నంతలోనే మూసుకున్న కళ్ళకి మరలా నిద్ర వచ్చింది . లేదా , వచ్చినట్టైంది . అందులో ఒక చిన్న కల: 

     ఆ కలలో  మరలా మోహిని యైన మేనక మోహ ప్రసాదాన్ని వేడుటకు వ్రతము చేసింది . ప్రసన్నుడై విశ్వామిత్రుడు వరము నిచ్చుటకు చేయి చూపుతున్నాడు . దేవతలందరూ విషణ్ణులై , దీనులై తమకు న్యాయంగా చెందవలసినది ఏదో తప్పిపోయినట్లు , చప్పిడి ముఖాలు వేసుకుని నిలుచున్నారు . అప్పుడు కౌశికుడు , " లేదు , లేదు , ఇదిగో , మీది మీకే , ఈమెది ఈమెకే " అని ఏమో భాగములు చేస్తాడు . దేవతలు సంతోష పడి , నీ తపస్సు అక్షయమగు గాక అని ఆశీర్వదిస్తారు . మేనక సంతోషముతో తేలిపోయి నట్టవుతుంది . వెనక నుంచీ ఎవరో ముసలి వారు ఒకరు , వెనకటి కల్పము వారు , అనేక కల్పాల తెరలను తొలగించుకొని వచ్చినవారి వలె ఎదురుగా వచ్చి  " సిద్ధం సాధ్యాయ కల్ప్యతే " అని గర్జిస్తారు . దేవతలు ఆ భవ్య మూర్తి ఎదురుగా వినమ్రులై నిలచి , మా రహస్యాన్ని నువ్వొక్కడవు ఛేదించినది చాలదా ? అని వేడుకుంటున్నారు . ఆ మహా పురుషుని గర్జన , దేవతల ప్రార్థన , వీటి మధ్య హవిస్సును ఎత్తి అగ్నిలో వినియోగించు దీక్షితుడి లాగా , విశ్వామిత్రుడు మేనకను విసర్జనము చేస్తాడు . 

     కలలో అలా అయినట్లే నిజంగా మేనకను దూరంగా చేత్తో తోసి , ఆ చేతికి ఏమో అయినట్లై అతడికి మెలకువ వచ్చింది . మేనకకు కూడా ఏదో కల. పలవరిస్తున్నది . స్పష్టాస్పష్టంగా ఉన్న మాటలు కౌశికుని కుతూహలాన్ని ఇనుమడించాయి . " ఊహూ , ఒక సంవత్సరము "  ’ లేదు , లేదు ’ ’ అలాగైతే నాకు మీ స్వర్గమే వద్దు ’... మేనకకు మెలకువైపోయింది . తనకన్న ముందే లేచిన పతిని చూచి అతడిని హత్తుకొని ఏడ్చింది . 

     అతనికి కుతూహలమై , ’ ఏమిటిది ? ఏమిటిది ? ’ అని ఓదారుస్తాడు . ఆమే పూర్తిగా మేలుకుని , " దేవా , నేను తొందర పడ్డాను " అంది . 

" ఏమి తొందర ? " 

     " నేను నీ మోహ ప్రసాదాన్ని కోరి , దాన్ని పొందుట మానవధర్మము కదా . ఈ ధర్మాన్ని ఆశ్రయించి మానవ స్త్రీని అయ్యానని దేవతలు నాపై కోపగించారు "

’ దాని ఫలితము ? " 

     " నాకు స్వర్గవాసాన్ని నిరాకరించవచ్చు . ఇంకా కోపమయితే , సంతోష పడు శక్తిని లాగివేసుకొని , నిత్య దుఃఖినిని గా చేయవచ్చు . "

" అలాగైతే ఇప్పుడు వారి కోపము ఏ ఫలాన్నిచ్చింది ? " 

     " ఈ మానవ ధర్మాన్ని వదలి , వెంటనే వెనుకకు తిరిగి రావాలని వారు , రానని నేను . చివరికి ఒక మాసము , ఒక ఋతువు , ఒక ఆయనము అని పెంచుకుంటూ పోయి అంతిమంగా ఒక సంవత్సరము పాటు ఇక్కడ ఉండి , ప్రేమ ఫలాన్ని నీకు అప్పజెప్పి , వెనుకకు రావాలని తెలియజేశారు . "

" మరి , నాకు మీ స్వర్గమే వద్దు అన్నావు కదా ? అదేమిటి ? " 

     మేనక ఎండా వానా కలసినట్లు , అశ్రువులు రాలుతున్న నవ్వుతో చెప్పింది. ఆ ముద్దు , ఆ మోహము , ఆ చెలువము , ఆ సుఖము..అన్నిటినీ పలికించు ఒక ముత్యము , కౌశికుని దేహము , మనసు , బుద్ధులలో ఆనంద తరంగాలను రేపుతుండగా   " చెప్పే తీరాలా ? " అంది . బ్రతిమాలితేనే చెప్పేది అన్న అర్థము ధ్వనించగా , ముఖ ముద్రలో , అంగ భంగిమలో స్పష్టముగా కనిపించింది . 

     కౌశికుడు జిగ జిగా మెరుస్తున్న ఆ రసికత్వపు కొంటెతనాన్ని ఆమెకే పంపుతూ , " నీకు చెప్పాలని లేకపోతే వద్దు . కష్టమైతే కూడదు . ఆయాసమైతే దాన్నలాగే ఉంచు " అని పలికాడు. మాట వద్దంటున్నా , " చెవులు చేటలు చేసుకుని వింటాను : చెప్పకపోతే పీడిస్తాను . ఏమైనా కానీ , చెప్పే తీరాలి " అని ఆమె నడుమును పట్టుకొని ఉన్న అతని కుడి చేయి అంటున్నది . 

     పైకి కాదన్నా , కావాలి-వద్దు అన్న మనో భావాన్ని చూచిన మేనక మురిసిపోతూ , ప్రియుడి ముంగురులు సవరిస్తూ , " స్వర్గములో దొరకని వస్తువొకటి దొరికింది . దాన్ని వదలి వచ్చేయి అన్నారు . రానన్నాను . స్వర్గవాసాన్ని తప్పిస్తాము అన్నారు . మీ స్వర్గమే వద్దు అన్నాను , అంతే ! " అంది . 

     కౌశికునికి సంతోష సాగరములో తానొక కలకండ ముక్కలా కరగిపోతున్న భావన కలిగింది . ఏమి చెప్పాలో తోచక , " ప్రేమ ఫలమంటే ఏమి ? " అని అడిగాడు . మేనక స్త్రీ సహజమైన సిగ్గును పక్కకుపెట్టి , ఒక ముద్దు ఇచ్చి , " ఒక బిడ్డ " అంది . 

" ఎలాంటి బిడ్డ? " 

" ఆడ పిల్ల " 

" ఆడపిల్లే ఎందుకు ? " 

     " భార్యకు మోహము ఎక్కువైతే ఆడపిల్ల . భర్తకు మోహము ఎక్కువైతే మగ పిల్లవాడు " 

     కౌశికుడు ఏమీ పలుకలేక , భావశూన్యుడై మోహపూరితమైన మనసుతో పడతి ఒడిలో చేరాడు . ఆమె వద్దనలేదు .

Friday, July 6, 2012

37. " మంత్ర ద్రష్ట " ముప్పై ఏడవ తరంగము



ముప్పై  ఏడవ తరంగము

     విశ్వామిత్రుని రాకకై అతని దారిని కాచి ఉన్న మేనక ఆరాటపడుతున్నది . " ఆ మహర్షి ఏమైనా తన దివ్య జ్ఞానము చేత ఆరోజు తనకు ఓటమి అగునని తెలిసి తప్పించుకున్నాడా ? " అని దిగులు . తన జ్ఞాన బలముతో తరువాతి ఝాము లోపల ఏమవుతుందో అని చూడాలని ఆమెకు కుతూహలము . ఏదైనా అది తనకు కావలసినది కాకపోతే ? అని చూచుటకు కూడా దిగులు . మునీంద్రుడెక్కడ ఉన్నాడో చూద్దామని ఒక భావము , కానీ చూచుటకు కావలసిన స్థైర్యము లేదు . ఆమె తన మనసు శిథిలమగుటను ప్రకటించుటకు కూడా లేదు , సఖులున్నారు . చాలా కష్టము మీద , నవ్వుతూ తిరుగుతున్నది . ఆమె ఎక్కడున్నా , ఆమె మనసు మాత్రము , చెవులకు ఏ సడి వినిపించినా విశ్వామిత్రుడు వచ్చాడేమో అని తిరిగి చూస్తున్నది . 

     చివరికి విశ్వామిత్రుడు వచ్చాడు . కొంచము జాగైంది . వస్తుండగానే , " మేనా , ఆలస్యమైందా " అంటూ వచ్చాడు . ఆ రెండక్షరాలను విని , అతని రూపమును చూచి పడతి హృదయము చల్లనైంది . చూచు వారున్నారను విషయాన్ని మరచి పతిని కౌగలించుకుంది . 

     కనిపించకుండా ఉన్న ఆ సఖులిద్దరూ అది చూచి ఆశ్చర్యపడ్డారు . వారి జన్మలో , ఆడదానికి అంత మోహము కలుగుతుందనీ , కలగ గలదనీ తెలియలేదు . రంభకు ఆశ్చర్యము పెరిగి , అసూయ కలిగింది . ఘృతాచీ కి , ఆ మహర్షి మహిమ ఇంకెటువంటిదో అని ఆశ్చర్యమై , సాధ్యమైతే తానుకూడా ఈ సుఖమును ఒకసారైనా అనుభవించాలి అనిపించింది . 

     మేనక మనసు ప్రసన్నమవుతుంటే, పూజా మంటపమంతా ప్రసన్నమై నవ్వులు పూసినట్టైంది . మునీంద్రుడిచ్చిన విశ్వాసముతో కూడిన గాఢాలింగనముతో  తృప్తి పడి  అతనిని పిలుచుకొని వెళ్ళి మంటపపు మధ్యలో ఏర్పరచిన మందాసనము పై కూర్చోబెట్టింది . చూచుటకు , మేనక అతని చేయి పట్టుకోలేదు , చేయి పట్టుకొను నెపముతో ఎత్తుకొని వెళ్ళి కూర్చోబెట్టినట్టు ఉంది . 

     ఆ పడతి , వేటగాడు తాను గుచ్చబోవు పిడిబాకు సులభముగా నాటుటకు తన వేట పశువుకు నూనె చమరినట్లు , అతనికి ఒళ్ళంతా నూనె చమరింది . ఆ చెరుగు నడుముకు చుట్టి , కుచ్చిళ్ళు ఎత్తి కట్టి , చేతి గాజులను పైకి సవరించుకుని , చేతులతో నూనె వత్తి వత్తి అదిమి రాస్తూ ఉంటే మృదంగ తాళముల వలె సొగసుగా సడి చేస్తూ , తన మోహాన్ని అతని తలకు పట్టిస్తున్నట్టుంది . అంగాంగాలనూ పట్టి పట్టి నూనె రాసి నిమురుతుంటే , తన బాణాన్ని ప్రయోగించుటకు సరైన చోటు ఏదని వెదకుతున్నట్టుంది . మొత్తానికి నూనె రాయడము అయింది . అక్కడికే వేడి నీరూ వచ్చింది . నూనె రాసిన శ్రమతో ఆ మోహిని ముఖమూ , శరీరమూ ఎర్రబడ్డాయి . కానీ ఉత్సాహము తగ్గలేదు . తానే నీరు పోసి స్నానము చేయించాలని కులుకుతూ కూచుంది . బట్టలకు రంగులు అద్దే అద్దకపు పనివాడు ఎంతో ఓపికగా , విశ్వాసంగా ఆ బట్టలు తడిపి జాడించునట్లు , ఏదో యజ్ఞము చేస్తున్నట్టి శ్రద్ధతో నీళ్ళు పోయడము ముగించింది . " దేవా , నీ నిత్య కర్మ ముగిసే వేళకు నేను వచ్చేస్తాను " అని తాను స్నానానికి దిగింది . 

     ఆ సేవను చూసి పరవశిస్తున్న ఘృతాచీ వెంటనే ముందుకు వచ్చి మేనకను పిలుచుకొని పోయి స్నానము చేయించింది . రంభకు , " నిజంగా మేనక అదృష్టవంతురాలు " అనిపించింది .

     ఇంకొక ఘడియలోపల మేనక మడి కట్టుకుని వచ్చింది . ఇంకొక పూజా పీఠము సిద్ధమైంది . మనోహరంగా మరుని మగత నిద్ర వలె   సొంపైన అలలతో జంపాల గా తేలియాడే సముద్రమైన ఆ పూజా మంటపములో నాథుని కూర్చోబెట్టి , ఆమె పూజ ప్రారంభించింది . తూర్పు దిశలో కనిపించే తెలుపు ఎరుపై , ఎరుపులన్నీ  కలసికట్టుగా వచ్చినట్టున్న చంద్రబింబము పైకి వచ్చి కనబడు వరకూ పూజ నడుస్తూనే ఉంది . 

     ఆ పూజా విధానాన్ని ఎవరు వర్ణించగలరు ?  తీసిన గంధము పంచేంద్రియాలకూ సంతర్పణ చేసినట్టుంది . అర్చించిన కుసుమాలలో కేవలము రూప గంధాలు మాత్రమే కాక , అలౌకికమైన ఇంకేదో నవ చైతన్యము ప్రతి సుమము లోనూ ఇంతింత నిండినట్లుంది . ఇంకా సరిగా చెప్పాలంటే , సాలె పురుగు తన గూటికి చిక్కిన ఆహారాన్ని పట్టి అది కదలకుండా , సూక్ష్మమైన తన మృదువైన దారాలతో దాని చుట్టూ కట్టినట్లు , ఆ మోహిని తన మోహ మంత్రపు బీజాక్షరాలను ఆ మానవేంద్రుని మనసు ముగ్ధము కావాలని మనసుతోనే ప్రయోగిస్తూ , ఆ ప్రయోగపు క్రౌర్యాన్ని దాచుటకు పూజ నెపముతో పువ్వులని అర్పించినట్టుంది . నైవేద్యము సమర్పించినపుడైతే ఆమె వైఖరిని చూడాల్సిందే , వెలుగుతున్న దివ్య జ్యోతిర్లత తన జీవన సార్థకత కోసము ఇష్ట దైవానికి సమర్పిస్తున్నదా అన్నట్టూ , ఆడ తీగ ఒకటి ఆశ్రయ దాత యైన మహా వృక్షానికి తన సర్వస్వమునూ కానుకగా ఇస్తున్నట్టూ , మానవాతీతమైన ఏవేవో భక్ష్య భోజ్య రస చోష్యాలను సమర్పించుకుంది . దేవతల ఆహారమైన అమృతము లేకున్నా , దానికి సమానమైన దివ్య ఔదనపు భోజనము చేత  జిహ్వ , ఉదరము , శరీరముతో పాటు అతని పంచప్రాణాలూ తృప్తి చెందాయి . 

     చివరగా మంత్రపుష్పాన్ని సమర్పించి పునః పూజ కూడా ముగించి , పూజ అంతమయ్యే సరికి విశ్వామిత్రునికి తాను నిజంగా ఏదో ఒక దేవతననీ , ఆమె భక్తికి ఏమి కావాలన్నా , అడిగిన వరము ఎటువంటిదైనా కానీ , నిశ్శంకగా ,  నిర్లోభముతో  , పూర్ణ మనస్సుతో ఇవ్వాలి అనిపించింది .

     ఆ భావనను కళ్ళు , ముఖము , శరీరాలు మనసు కన్నా ముందే , భావము పలుకై బయటపడుటకన్నా ముందే సూచించి , అభయము నిస్తున్నాయి . అతని నాలుక ఆ సుఖ సాగరములో ఎక్కడో కరగిపోయి ఉండాలి , లేకపోతే మాట బయటికి రావడానికి అంత జాప్యమెందుకు ? మనసు ఆ సుఖ తరంగిణి లో ఎక్కడో కొట్టుకొని పోయి ఉండాలి , లేకపోతే మాట పలుకకుండా ఉంటుందా ?  

     మొత్తానికి మేనక పూజను ముగించింది . అసలే ప్రాణముతో  కలయ తిరుగు వెండి బొమ్మ లాగా ఉన్నది , ఇప్పుడు శృంగారపు సొగసు , సౌఖ్యపు ఓజస్సు , శ్రద్ధ యొక్క తేజస్సు చేరి అలౌకిక మన మోహన మూర్తి అయింది . పూజ అంతా అయ్యాక పూజా సాఫల్యం కోసము ఒక ఫలాన్ని తెచ్చి అర్పించింది . 

     విశ్వామిత్రుడు మేనకను లేపి దృఢాలింగన పూర్వకముగా తొడపైన కూర్చోబెట్టుకుని , చుబుకాన్ని పట్టి , చిదిమి , బుగ్గలు నిమిరి , ముద్దు పెట్టుకుని , చెదరిన కురులను సవరించి , చెమరిస్తున్న చెమటని తుడిచి , ముఖం లో ముఖము పెట్టి , " ఏమిటీ సంభ్రమము ? ఈ ఉపచారములేమిటి ? నేను , చక్కెర ముద్ద నీటిలో పడినట్టయ్యానే !! " అని మృదువుగా అడిగాడు . 

     మేనక మౌనముగా ఆ ఉపచారాల నన్నిటినీ స్వీకరించి , చెప్పాలా వద్దా అని ఇంకా మౌనములోనే ఉండగా , మగవాడు తనను అర్పించుకున్న ఆడదానికి తానూ తనను అర్పించుకుంటూ , " మేనా , మౌనమేల ? ఈ ఉపచారపు గోపురానికి మాటల కలశము అలంకరించు , చిత్రము పూర్తి కానీ " అన్నాడు . 

     మేనక మృదువుగా నవ్వింది . ముందే అదంతా తెలిసినట్టు , ఎక్కడో కనిపించని వీణలు మోహన రాగం లో దైవతము తో మొదలుపెట్టి ఒక తాన వరుసను ఆరోహణలో మృదువుగా పలికి షడ్జములో నిలిపాయి . ఆ వీణల తంత్రులన్నీ ఒకదానినొకటి చూసి నవ్వినట్లు కదలిపోయి , మేనక చెవి పోగులలాగా మెరిశాయి . 

     మేనక , " దేవా " అంది. ఆమె నోటి నుండీ తర్వాత ఏమీ బయటికి రాలేదు . ముని పెదాలు రెండూ ఒకదానికొకటి భద్రంగా చేరి, ఆమె వహించిన మౌన ముద్ర వీగిపోవుటకా అన్నట్టు ఆమె అధరాన్ని చప్పుడు చేస్తూ చుంబించి , " మాట్లాడు , చెప్పు , ఏమి కావాలన్నా చేద్దాము, చెప్పు " అన్నాడు . 

     దివ్యాంగన , వెన్నెలలో వికసించిన కలువలనుండీ తరంగాలుగా వస్తున్న పరిమళములాగా , ఆగి ఆగి సగము సగమే వస్తున్న తన ముద్దు మాటలను తన కంటి చూపులతో పూర్తి చేస్తూ , " దేవా , నాకు మోహ భిక్ష కావాలి " అంది . 

     మునికి మెలకువ లాగా అయింది . ఒక ఘడియ ఏమీ మాట్లాడలేదు . రెప్పలు వేయు నంత జాగృతి కొచ్చాడు . అంతలోనే ఆ భావాన్ని తీసి పారేసినట్టు , వద్దని విసిరేసినట్టు , తనకు తానుగా కావాలని ముడిని సడలించుకొని మహా ప్రవాహములో దుముకు ఉప్పు మూట వలె , ఆ మోహినికి వశమైన ఈశ్వరుడి వలె  వశమై  " కానిమ్ము , దేవీ , ఈ దినమునుండీ ఇంకొక అధ్యాయము . ఈ దినము నుండీ నేనిక నీ సేవకుడను . కావాలని నిన్ను కోరి సేవించు దాసుడను, సరేనా ? ఇంకేమి కావాలి ? " అన్నాడు .

     మేనక తృప్తి , గర్వము నిండిన చూపుతో కాంతుని చూసింది . ఆ చూపులో అదేముందో , ఏ పిలుపుందో  ? ఎట్టి మోహముందో ? ఏమి ఉద్దీపనముందో ? ఏ ఉప బృంహణ శక్తి ఉందో ? మునీంద్రుడు తాను మైమరచి పోతూ , ఆ మోహిని పైన పడి , ఆమెకూడా మైమరచి పోవునట్లు హత్తుకున్నాడు . 

     పూర్ణాహుతి తీసుకొని విజృంభించి శాంతుడగు యజ్ఞేశ్వరుని వలె , చుట్టుపక్కల అంతా ఏదో శాంతి నిండింది . రంభా , ఘృతాచీలు ఒకరినొకరు చూసి నవ్వి , నిజంగా ఈమె అదృష్టవంతురాలు అని తల ఆడిస్తూ , తిరస్కార భావాన్ని రానీకుండా అక్కడనుంచీ జారుకున్నారు . 

     అదృశ్యం గా ఉన్న గంధర్వులు శ్రావ్యంగా , మృదువుగా , మోహకమైన గానాన్ని వాద్య సమేతంగా వాయించారు . శృంగార మంటపము మరొకసారి సుగంధాన్ని చల్లి , దీపాల కాంతిని అపహరించి , వాటిని సూర్యోదయ కాలపు నక్షత్రాలలాగా చేసింది .