ఒకటవ అంకము
ఈ అంకంలో అమ్మ తో పరిచయం , పుట్టింటి సంగతులు , చిన్నప్పటి విశేషాలు , పెళ్ళికి ముందు ముచ్చట్లు చూడచ్చు.
మా అమ్మ తాను చనిపోయిన దాదాపు 25 సంవత్సరాలకు మళ్ళీ అందరి మనసుల్లోకి ఒక కొత్త జ్ఞాపకం లాగా రావాలనుకుందేమో మరి, పాత విషయాలు ( విన్నవీ, కన్నవీ, ) తెరలు తెరలుగా కళ్ళముందుకొస్తున్నాయి.
వింతేమంటే, ఎంత గుర్తుతెచ్చుకుందామన్నా మా అమ్మ సుందర ప్రశాంత వదనం కనిపిస్తుందే తప్ప అంత ప్రశాంతంగా ఉండడానికి ఆమె సుఖాలు అనుభవించింది ఎప్పుడో ఒక్కటీ జ్ఞాపకం రాదు. కష్టాల్లో కూడా పిల్లల సంతోషమే ఆమె సంతోషంగా కనిపించేది. ఐతే, తనకంటూ ప్రత్యేకంగా కోరికలు, సరదాలు లేవా? తన బ్రతుకు ఎలా గడిచింది ? చిన్నప్పుడు 10, 15 సంవత్సరాల వరకు చాలా సంతోషంగా గడిపిందని విన్నానే ? సరే, అది తెలియాలంటే, మనం 1918 వ సంవత్సరంలోకి వెళ్ళాలి
ఆరుగురు అన్నదమ్ములు, ఒక అక్క, ఒక చెల్లెలు, మురిపెంగా చూసుకొనే తల్లి, నెత్తిన పెట్టుకొనే తండ్రి, వీళ్ళంతా కలిసి చేసే హంగామా అంతా ఇంతా కాదు. అనంతపురం జిల్లా రాయదుర్గం తాలూకా లో శ్రీధర ఘట్ట అనే చిన్న పల్లెటూళ్ళో మా తాతయ్య ఊరి కరణం గా మంచి ఉద్యోగమే చేసేవారు. దేనికీ కొదవ లేదు. ఆడింది ఆట, పాడింది పాట లాగా ఉండేది. అదంతా మూణ్ణాళ్ళ ముచ్చటే అయింది. సరిగ్గా ఐదారేళ్ళు కూడా లేని వయసులో అన్న సదానంద రావు తో కలసి బళ్ళారి లో తిరుణాళ్ళ కని వెళ్ళింది. బళ్ళారి ఆ కాలంలో సంయుక్త ఆంధ్ర దేశం లో భాగం గా ఉండేది. అప్పుడు జరిగిందాని పర్యవసానం ఇంకోలా ఉండుంటే ఇదంతా జరిగేది కాదు, అసలు మా కుటుంబమే ఉండేది కాదేమో. తిరుణాళ్ళలో వింతలు చూస్తూ చిన్నారి పద్మావతి ( అదే, మా అమ్మ పేరు ) తప్పిపోయింది. ’ అన్న ’ ..... ’ అన్న ’ ... అంటూ, ఏడుస్తూ అటూ ఇటూ వెతుకుతూ తిరుగుతోందట. కన్నడ భాషలో ’ అన్న ’ అంటే మన " అన్నం " అన్నమాట. చూసినవాళ్ళు ’ అయ్యో పాపం ’ అంటూ, ఆకలైందేమో అని, తినడానికి ఏవేవో ఇవ్వజూపారట. అదృష్టవశాత్తూ, సదానంద ఇట్టే వచ్చి, చెల్లెల్ని కనుక్కొని, ఎత్తుకొని వెళ్ళాడు.
అమ్మకు అదెంత గుర్తో కానీ , మా చిన్నపుడు " బొట్టుకు రెండు ద్రాక్షా పళ్ళు బళ్ళారి సంతలో కొనుక్కోండి " అని పాడేది . బొట్టు అంటే ఒకటిన్నర పైసా. మాకు ఆ కాలములో ప్రతిదానికీ బళ్ళారితో ముడిపడిన ఏదో ఒకటి చెప్పేది .
అలా ఆ గండం గడచి, మళ్ళీ మామూలుగా ఆటపాటలతో ఓ ఐదారేళ్ళు సంతోషంగా ఉండగా, అదిగో, ఆ మాయదారి పిల్లవాడు , బంధువుల పిల్లాడేనట , ఏదో పెళ్ళిలో వచ్చి, మా అమ్మమ్మ కృష్ణవేణమ్మ చేతిని కొరికాడట. మొదట ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అది సెప్టిక్ అయ్యి, ప్రాణాంతకమై, చివరికి మనిషే పోయింది. అలా పది పదకొండేళ్ళ లోనే తల్లిని పోగొట్టుకున్న మా అమ్మను, మా తాతయ్యే అన్నీ తనే అయి చూసుకున్నాడు.
తండ్రికి ముద్దుల కూతురు తోటే లోకం. ఆయన లాగే ఆయన రాసిన పాటలు శ్రావ్యం గా పాడేది కదా మరి ! ఆయన పూజకి దేవుడి గది శ్రద్ధగా ఆవుపేడతో అలికి ,ముగ్గులు పెట్టేది. పూలు, పాలు , దీపాలు, , అన్నీ సిద్ధం చేసేది. ఆయన తొడపై కూచొని తనకు వచ్చిన శ్లోకాలు, పద్యాలు చెప్పేది. భోజనం ఆయన ముద్దలు చేసి తినిపిస్తేనే తినేది. ఎపుడు చూసినా ఆయన ఒళ్ళోనే ఉండేది. అన్నదమ్ముల మధ్య లేదంటే, తండ్రి ఒళ్ళోనే. ఎంత మురిపెం ? ఒకోసారి అన్నదమ్ములు అందరూ తలో వాయిద్యం వాయిస్తూ ఉంటే , తండ్రి కూడా వారితో చేరి కీర్తనలు పాడేవాడు . అప్పుడు కూడా కూతురు వంత పాడనిదే నడవదు ! " ఆ నీలకంఠ రావు కి పద్మావతి ఒక్కత్తే కూతురా ఏమిటి ? అంత గారాబం ! " అనుకున్న వాళ్ళు ఉండి ఉంటారు. అయినా గారాబం ఎంత కాలం చేస్తారు? యుక్త వయస్సు వచ్చేదాకా . ఆ కాలం లో ఆడ పిల్లలకి ’ అష్టా వర్షాద్భవేత్ కన్యా ’ అనే న్యాయాన్ని అనుసరించి , చిన్న వయసులోనే పెళ్ళి చేసేవారు . తల్లిలేని పిల్ల, త్వరగా పెళ్ళి చేస్తేనే మంచిది. అని చెప్పని వాళ్ళుంటారా ? అదీ 1930 ప్రాంతాల్లో !. ఆమె మేనమామ శ్రీ సీతారామరావు ఆ బాధ్యత నెత్తిన వేసుకున్నాడు. తన పెద్ద మేనకోడలు రామలక్ష్మి కి కూడా ఆయనే మంచి సంబంధం తెచ్చి పెళ్ళి చేశాడాయె ! కరణం శ్రీ రాములు అని బంధువుల అబ్బాయిని వెదకి, పెళ్ళిచేసి సంతోషించాడు. ఆయనకు కూతుర్లు లేరు. చురుకైన చూపులతో ఎప్పుడూ హుషారుగా ఉండే పద్మావతి అంటే ఆయనకి ఎంతో వాత్సల్యము. ఆయన ఈ కథ జరిగే కాలంలో అనంతపురం లో డిప్యూటీ తహసీల్దారు గా ఉండేవారు. తరువాతి కాలంలో తాశీల్దారు కూడా అయ్యారు.
No comments:
Post a Comment