SHARE

Wednesday, November 20, 2013

Monday, October 14, 2013

వేదోక్త గర్భాధానము- రతి విధి- సంభోగ నియమములు.

వేదోక్త గర్భాధానము- రతి విధి- సంభోగ నియమములు.





కాల మహిమయో , లేక అధికముగా సనాతనులు పుట్టుట వలననో ,ఈ తరము యువతీ యువకులు వేదములో తమ జీవితములకు ఉపయోగ పడు విషయములు , తమ కర్తవ్యముల గురించి యేమున్నదో తెలుసుకొనవలెనని ఉత్సాహ పడుచున్నారు. ఇది శుభ పరిణామమే. లైంగిక విశృంఖలత పెచ్చు పెరిగిన ఈ రోజులలో , తమకు యేది శ్రేయస్సునిచ్చునదో తెలియక అనేకులు అయోమయమున నున్నారు. జీవితమున అతి ముఖ్యమైన శృంగార విషయముల గురించి వేదము యేమి చెప్పుచున్నదీ యని  ఎందరో అడిగినారు. వారి ప్రశ్నలు పరి పరి విధములు. అడిగినవారికి యేదో కొంత చెప్పిన చాలదు. మొత్తము తెలిసికొనిన గానీ దాని సరియైన అర్థము కానీ , అందులోని తర్కముగానీ వారికి బోధ పడదు.

మొదట ఈ పుస్తకమును వ్రాయుటకు నాకు మనస్కరించలేదు. యేదో తెలియని సంకోచము నన్ను ఆపివేసినది. కానీ ఈ విషయముపై అవగాహనా రాహిత్యము అనేకులలో ఉండుట , పైగా ఎవరికి తోచినట్లు వారు రాస్తూ ఉండటము వలన కొంత వెకిలి తనము , అశ్లీలత చోటు చేసుకున్న సందర్భాలు అనేకము చూచియున్నాను. ఈనాటి కుర్రకారును మాత్రమే దృష్టిలో పెట్టుకుని , తీస్తున్న తెలుగు సినిమాల వలె కాకూడదని అనిపించి ఎలాగో రాయుట మొదలు పెట్టినాను. సహృదయులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

వివిధ వేద భాగములు , స్మృతులు , ఉపనిషత్తులు , అనేక ఇతర ప్రయోగ గ్రంధములలో స్త్రీపురుషుల కలయిక గురించీ , దాని విధానము , నియమములు మొదలైనవి సంగ్రహించి వీలైనన్ని ఎక్కువ వివరములు ఇచ్చి ఈ పుస్తకమును వెలికి తెచ్చుటకు ప్రయత్నము చేసితిని. ఇది కామ శాస్త్రము కాదు. కామ కళా రహస్యములు ఇందులో ఉండవు. రతి భంగిమలు మొదలైనవి ఇందులో చర్చించలేదు.

పూర్వకాలమున వివాహములు అతి చిన్న వయసులోనే జరిగేవి. బాలుడికి చిగురు మీసాల వయసు రాగానే అతడిని భార్యతో సమావేశనము చేయించేవారు. కాబట్టి , వారికి అన్నీ అర్థమగునట్లు వివరముగా యేమేమి చేయవలెనో పెద్దలు వివరించే వారు. వారికి సంభోగ నియమములు తెలియుటకు ఆధారము వేద మంత్రములు. వేద మంత్రములు మైథున విధి నియమములతో పాటూ సంభోగ ప్రక్రియను కూడా సంపూర్ణముగా వర్ణించి దంపతులు సుఖ సంతోషములతో రమించి  , సుపుత్రులను పొందుటకు అనువుగాను , దోషములు పాపములు కలుగకుండునట్లు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించినాయి.

ఈ కాలమున సంభోగ క్రియను సంతానము కోసము మాత్రమే ఎవరూ ఆచరించుట లేదు. అయిననూ , ఉత్తమ సంతానము పొందగోరువారికి ఈ పుస్తకము ఒక కరదీపిక వంటిది.

గర్భాధాన సమయమున చేయవలసిన విధులు , సమయాసమయములు , భర్త , భార్య వద్ద వ్యవహరించ వలసిన పద్దతులు , సంయోగమునకు కావలసిన అనువైన విషయముల వివరణ ఇవ్వబడినాయి. ఉదాహరణకు , సంభోగమునకు ముందు తాంబూలము వేసుకోవడము యొక్క ప్రాముఖ్యత, దీపము ఉండవలసిన అవసరము , శరీరముపై బట్టలు తీసివేయుటకు గల శాస్త్రవిహిత కారణము , ఇంతేగాక , గర్భాధాన సమయములో ముఖ్యముగా వరుడు చెప్పవలసిన మంత్రములు , వాటి వివరణ , మానవులు సలుపు రతి క్రియలో దేవతల పాత్ర , మగవాడికి సంభోగ సమయమున కావలసిన శారీరిక , మానసిక యోగ్యతలు , ఆడపిల్లకు తగిన వయసు మొదలైనవి వివరింపబడినవి.

పుత్రులు / లేదా పుత్రికలు కావలెనన్న , యేయే దినములు అనువైనవి , ఎటువంటి పుత్రులు కావలెనన్న యే దినము అనుకూలము మొదలగు విషయములు వివరింపబడినాయి. 

ఇవి ఈ నాడు సమాచార విస్ఫోటనము ఎంత ఎక్కువగా ఉన్ననూ , నూతన యౌవ్వన వంతులకు మార్గదర్శనము తప్పక ఈయగలవు. దూర దర్శనులలోనూ , చలన చిత్రములలోనూ , అంతర్జాలము లోనూ లభ్యమయ్యే వివరములు గానీ , దృశ్యములుగానీ వారిని తప్పుత్రోవ పట్టించేవే ఎక్కువగా ఉంటున్నాయి.

నేడు వధూవరుల వయస్సు పూర్వకాలము వలె కాదు కాబట్టి , వారికి ఎంతో కొంత సమాచారము , అవగాహన ఉండనే ఉండును. అయిననూ , శుభములు కావలెననువారు తప్పక తెలుసుకోవలసిన విషయములు ఇందులో ఎన్నో గలవు.

ఈ పుస్తకము లో సంభోగ ప్రక్రియ సవివరముగా వర్ణింపబడిననూ , అశ్లీలతకు ఎంతమాత్రమూ చోటు  లేకుండా , ఒక శాస్త్రము వలె , నిబద్ధతతో రాయబడినది. బాల్యము దాటినవారందరూ తప్పక చదవ దగినది. కానీ నేటి సమాజ , చట్టముల దృష్ట్యా , ఈ వివరములు ఎవరుబడితే వారు సులభముగా చదివేలాగ అందరికీ లభ్యము చేయుట ఉచితము కాదను ఉద్దేశముతో , ఇంకొక చోట ఇచ్చి , కావలసినవారు మాత్రమే దానిని కొనుక్కొనే సదుపాయము ఏర్పరచబడినది. ఇంతే గాక , ఈ పుస్తకము ద్వారా వచ్చు ద్రవ్యము అనేక సమాజ హితమైన కార్యములకు ఉపయోగింపబడును. కాబట్టి దయచేసి సహకరించవలసినదిగా ప్రార్థన. పుస్తకము మొదటగా పీడీఎఫ్ రూపములో తయారుచేసి లంకె అతి త్వరలో ఇవ్వబడును. వివరములకు దయ చేసి ఈ బ్లాగును చూస్తూ ఉండండి.

ముందే చెప్పినట్టు " శ్రీ సమయజ్ఞ సామాజిక సభా ట్రస్ట్ " కార్యకలాపములకు ఈ ద్రవ్యము ఉపయోగపడును. ఈ ట్రస్ట్ కోసము ఇదివరకే విరాళమునిచ్చిన వారందరికి ఈ పుస్తకము ( పిడీ ఎఫ్ ఫార్మాట్ )  అతి త్వరలో పంపబడును.






Thursday, April 11, 2013

" విభాత వీచికలు " -----మహాదర్శనము---ఉప సంహారము


మహాదర్శనము---ఉప సంహారము


         యాజ్ఞవల్క్యుడి గురించి ప్రాచుర్యములోనున్న విషయము తక్కువ. వాజసనేయ సంహిత ( శుక్ల యజుర్వేదము ) , బృహదారణ్యకోపనిషత్ ( యాజ్ఞవల్క్య , జనకుల సంవాదము ) మైత్రేయ్యుపనిషత్తు ( మైత్రేయి , యాజ్ఞవల్క్యుల సంవాదము ) మొదలైనవి ప్రాచుర్యములోనున్నను, యాజ్ఞవల్క్యుని గురించిన ఎక్కువ విషయములు శ్రీ దేవుడు నరసింహ శాస్త్రి గారు పరిశోధించి తమదైన శైలిలో మిక్కిలి ఆసక్తిదాయకముగా వ్రాసిన ఎన్నో విషయములు ఈనాటికీ సులభముగా ఆచరణీయములు. 

        పంచప్రాణములు ( ప్రాణోపాన వ్యానోదాన సమానములు ) మానవుని భౌతిక , మానసిక ఆరోగ్యములకు ఎంత ముఖ్యమైనవో , ఆధ్యాత్మిక పురోభివృద్ధికి ఎట్లు ఉపయోగపడునో , వాటిని ఆరాధించుటెట్లో , వాటివలన పొందగలుగు లబ్ధులేమిటో వాటిని ఎందరో సాధకులు ఈ నాటికీ  సాధన చేస్తూ ఉత్తమ గతి దిశగా పయనించుచున్నారు. వీటి గురించి ఏ మాత్రమూ అవగాహన లేనివారికి ఇదంతా ఒక పుక్కిటి పురాణము. ఇటువంటి ఆధ్యాత్మికమైన విషయములలో ఆసక్తి కలుగుటయే ఒక అదృష్టమని చెప్ప వలెను. ఆ తరువాత అందులో దిగితే గానీ వాటి గొప్ప దనము బోధ పడదు. పంచాగ్ని యజ్ఞము , పంచాత్మ సంక్రమణము , పంచభూతముల అనుగ్రహము పొందుట వంటివి ప్రతిఒక్కరూ అనుష్ఠించదగిన బృహదనుష్ఠానములు.  మానవుడికి సాధ్యము కానిదేదీ లేదు అను మాట తరచూ వింటుంటాము. అది ఎంత నిజమో , అంత అబద్ధము కూడా ! ఎందుకంటే ,  ప్రయత్నము చేయని వారికి అన్నీ అసాధ్యములే , అబద్ధములే ! . ప్రయత్నించినవాడు ఎన్నడూ విఫలము కాడు. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరి జన్మ హక్కు. దేవతలు , ఇటువంటి అనుష్ఠానములపై ఆసక్తి గల వారికై వేయి కళ్ళతో ఎదురు చూస్తుంటారు అన్నది ఇందులో కాలు పెట్టిన ప్రతి ఒక్కరికీ అనుభవమే. ఇట్టి సత్యములను మరొకసారి మన ముందుకు తెచ్చి మనలను కార్యోనుముఖులుగా చేయుటకు ఉపయోగపడేదే ఈ యాజ్ఞవల్క్యుని చరిత్రము. 

        సృష్ఠిలో సర్వులూ పరమాత్మ స్వరూపులనీ , బ్రహ్మ పదార్థము లేని చోటు లేదనీ మనమే ఆ బ్రహ్మ అని ఆదిశంకరుల వంటి మహనీయులు ఎందరో చెప్పియున్నారు. వారు చెప్పినది అసత్యమగునా ? మానవుడు సత్యమును గుర్తించుటలో కూడా ఎన్నో భ్రమలకు లోనైయున్నాడు. తన శక్తికి అందుబాటులో ఉండి , తనకు సాధ్యమయితే అది సత్యము, లేకున్న అసత్యము. తన శక్తిని వృద్ధిపరచుకోవచ్చునన్న విషయము అతడికి తట్టదు. అనేక ప్రారబ్ధ కారణముల చేత పుట్టుకతో వచ్చిన శక్తి మాత్రమే తనకు ప్రాప్తమన్న భ్రాంతిని వదలి ప్రయత్నించిననాడు సర్వశక్తులూ అతడివే !. 

యాజ్ఞవల్క్యుడు సాధించిన విషయములు సాధించుటకు అందరూ శక్తులే. ఇక్కడ లోపించినది శక్తి కాదు. దృఢమైన సంకల్పము ! 

ఆ సంకల్ప బలమును పెంచుకొనుటకు మనకు ఇట్టి చరిత్రములు ఎంతో ఆవశ్యకములు. 

|| జనాస్సర్వే సుఖినస్సంతు || 

Wednesday, April 10, 2013

81. " మహాదర్శనము " -- ఎనభై ఒకటవ ( చివరి ) భాగము ----చివరి పండగ ?


81. ఎనభై ఒకటవ ( చివరి )  భాగము---  చివరి పండగ ? 


          ఈ దినము ఆశ్రమములో భగవతి గారి నేతృత్వములో నానా భక్ష్య భోజ్యములు పాకమగుచున్నాయి. ఏమైనా సరే , భగవానులు వైశ్వదేవమునకు చెప్పు వేళకు అన్నీ అయి ఉండవలెను. కాబట్టి వేగ వేగముగా అన్నీ జరుగుతున్నవి. 

          వైశ్వదేవమయినది. ఈ దినము నడిమింట్లో ఆకులు వేసినారు. సుడివేసిన అరిటాకులు, పెద్ద పెద్ద అగ్రములు గలవి , మధ్యలో ఒక ఆకు , దానికి కుడి పక్క మూడు ఆకులు, ఎడమపక్క రెండు ఆకులు. ప్రతిదానిలోనూ సిద్ధమైన పంచ భక్ష్యములు , పంచాన్నములు , పరమాన్న , ససూప వ్యంజనములై వడ్డించబడి యున్నవి. ఒక్కొక్క అరటి దొన్నె పెట్టి  , దానిలో సద్యో ఘృతము వడ్డించియున్నది. 

రాజధాని నుండీ , గార్గి , జనకులు వచ్చినారు. వారి మిత పరివారము వస్తున్నది. 

       భగవానులు నడిమింటికి వచ్చి చూచినారు. వారికి ఇంతటి భవ్యమైన సంతర్పణ కాచుకున్నదని తెలియదు. " కాత్యాయనీ , ఇది ఎవరెవరికి ? " అని అడిగినారు. 

" మధ్యలో వేసినది తమరికి. కుడి పక్క ముగ్గురు శిష్యులు , ఎడమపక్క ఇద్దరు బ్రహ్మవాదినులు. "

గార్గి మధ్యలో అన్నది, " ఎడమ పక్క ఆడ శిష్యులు , కుడి పక్క మగ శిష్యులు అనవలసినదేమో ? " 

భగవతి వెంటనే ఉత్తరమిచ్చింది , " ఒకరు శిష్యులైననూ భార్య. తమరు శిష్యులైనది ఎప్పుడో తెలీదు. "

" భగవానులకు సర్వజ్ఞాభిషేకము అయినాక లోకము లోకమే శిష్యులైపోయినారు. "

భగవానులు దానికి అన్నారు : " నిజము , అయితే , జగద్గురు పట్టమును నేను ఒప్పుకోలేదు. " 

      " క్షమించితే చెపుతాను, తమరికి ఏదీ అవసరము లేదు, అన్నీ కావలసినది మాకే. పట్టపుటేనుగుకు సింగారము చేసినట్లు , మాకొకరు సర్వజ్ఞులు కావలసియుండిరి. మాకొకరు జగద్గురువులు కావలసి యుండిరి. అందుకని మహారాజులు మాకొక సర్వజ్ఞ జగద్గురువులను కరుణించినారు "

మైత్రేయి తనకు తానే చెప్పుకున్నది, " ఔను , ఆత్మనః కామాయ సర్వం ప్రియం భవతి. తనకోసమే అన్నీ కావలసినది. "

భగవానులు అన్నారు : " మీ జగద్గురువులకు కావలసినదొకటే ఒకటి. అది , మహాదర్శనము. "

జనకుడు చేతులు జోడించి అన్నాడు , " అది అయిన వేళకు ఇదంతా జరిగినది అని మా అందరి భావన." 

భగవతి అన్నది , " మహారాజులు అన్నది అన్ని విధములా బాగుంది. మహా దర్శనమైనదని ఇంత సంభ్రమము ,న్యాయమే. "

భగవానులు అన్నారు : " మరలా మహా దర్శనమునకు వెళ్ళెదను అని ఈ సంభ్రమములన్నీ "   అని వడ్డించిన ఆకులను చేతితో చూపించినారు. 

మహారాజులు తికమక పడి , " అంటే ? " అని అడిగినారు.

         భగవతి అన్నారు : " నేను చెపుతాను వినండి. వీరు ఈ దినము పరివ్రాజకులై వెళ్ళెదరంట. అందుకని , ’ నీకు కావలసిన వంటకాలు వడ్డించు , నీ అభిమానమునకు సంతోషము కానీ ’ అన్నారు. ఈ శిష్యులను పిలచి , ’ కణ్వా , నువ్వు దక్షిణ దేశములో కావేరీ తీరములో ఒక గురుకులమును ఏర్పరచు ’ అన్నారు. మాధ్యందినుడికి ’ ఈ ఆశ్రమమంతా అప్పజెప్పినారు. మా అనుమతిని కోరినారు. అది దొరకగానే ’ జై శంకరా ’ అని వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నారు. " 

" గార్గి అన్నది , " ఇదంతా మాకు తెలియదే ? "

        " మహారాజు అన్నాడు , " మాకు వచ్చిన పత్రములో ఈ దినము తప్పకుండా భోజనమునకు రావలెను అని మాత్రము రాసి ఉంది. అందువలన నేను భగవతి గార్గి ని పిలుచుకొని ఏనుగు పైన వచ్చినాను. పరివారము వెనుక వస్తున్నది " 

గార్గి లేచి నమస్కారము చేసినది: " నాకు ఒక వరమునివ్వ వలెను " 

మహారాజు , కణ్వుడూ , మాధ్యందినుడూ నమస్కారములు చేసి ఒక్కొక్క వరమునడిగినారు. 

భగవానులు భగవతి ముఖము చూచి , ’ నువ్వు ? ’ అన్నారు. 

ఆమె నవ్వుతూ అన్నది , " వారంతా మీకు బయటి వారు అని వరమునడుగుచున్నారు. మీరు నన్ను అడుగుతున్నారే ,మొదట వారివన్నీ నెరవేరనీ "

భగవానులు , " అటులనే అవుతుంది, మీకు ఏమేమి కావలెనో అడగండి " అన్నారు. 

భగవతి గార్గి అమృతత్వమును కరుణించవలెను అన్నారు. 

మహారాజు, భగవానులు చివరి వరకూ నా దేశములోనే ఉండవలెను అన్నారు.

కణ్వుడు , " నా గురుకులమునకు సపత్నీకులై వచ్చి దర్శనమిచ్చి , కొంతకాలము మా ఆతిథ్యమును స్వీకరించి, మమ్ములను ఆశీర్వదించవలెను " అన్నాడు. 

      మాధ్యందినుడు , " ఈ ఆశ్రమములో ఇంకా కొంతకాలముండి నా ఆశ్రమ పాలన సరిగ్గా ఉందో లేదో ,  తప్పో ఒప్పో చెప్పవలెను. సరిగ్గా ఉంటే సరే, లేకపోతే మరలా ఆశ్రమమును తమరే వహించవలెను " అన్నాడు. 

’ భగవతి ఏమంటారు ?"  అని భగవానులు అడిగినారు.

         కాత్యాయని నవ్వుతూ ," వీరందరూ కోరిన కోరికలు నెరవేరునంటే నేను ఇప్పుడు ఊరికే ఉంటే చాలు. ఈ దినము ఉదయము యజ్ఞేశ్వరుని, " నా భర్త సదా ఇంటిలో ఉండునట్లు అనుగ్రహించు " అని వేడుకున్నాను. ఆతడు కృప జేసి , వీరందరి నోటిలో ఈ మాటలు పలికించినాడు.

         భగవానులు ఒక ఘడియ ఊరికే ఉండి అన్నారు: " మేమెక్కడున్ననూ సదా బ్రహ్మానుసంధానము చేయువారము. మాకు ఏ దేశమైతేనేమి ? కాత్యాయనీ , వీరందరికీ వారు కోరిన వరమునివ్వు " అన్నారు. అందరూ సంతోషముగా భోజనానికి కూర్చున్నారు. 


                    ||  భద్రం   శుభం   మంగళం  ||                                                                                                                                                                                                                                                                                                                                                                                        

80. " మహాదర్శనము "--ఎనభైయవ భాగము--ఆత్మానాం కామాయ


80. ఎనభైయవ భాగము--  ఆత్మానాం కామాయ


         మైత్రేయికి భగవానులు తనను వెతుక్కుంటూ వచ్చినది ఆశ్చర్యమైనది. లేచి నిలుచుకొని ఆహ్వానించినది. భగవానులు తామే మాట్లాడినారు: " మైత్రేయీ , నేను చివరిదైన సన్యాసాశ్రమమును వహించెదను. అనుమతినివ్వు. నువ్వు కావాలంటే , నీకూ , కాత్యాయనికీ ఆర్థిక సంబంధము లేకుండా సర్వమూ వ్యవస్థ చేసి వెళ్ళెదను. "

మైత్రేయి శాంతముగా అడిగినది , " భగవానులు ఈ ఆలోచన చేయుటకు కారణమేమి ? "

" ఇంతే మైత్రేయీ , నేను అమృతత్వమును పొందుటకు సన్యాసము తీసుకొనెదను"

" అటులనా ? ఇదేదో అర్థపు మాటను చెప్పినారు. నేను దానిని పొందితే నాకు కూడా అమృతత్వము లభించునా ? "

        " అదెలాగగును , మైత్రేయీ ? నీకు అర్థము ఉంటే , అర్థవంతులు పొందునట్లే నువ్వూ దేహ సుఖమును పొందవచ్చును. అమృతత్వము ఆత్మకు సంబంధించినది. దానిని అర్థముతో పొందుటకు సాధ్యము కాదు. "

        " దేవా ! నాకు అమృతత్వము తప్ప వేరేమీ వద్దు. అదీకాక, తమరు నాకు అభివచనమును ఇచ్చినారు. దాని ప్రకారము నాకు అమృతత్వమును ఇవ్వక తమరెలాగ దానిని పొందెదరు ? మొదట నీకు , ఆ తరువాత నాకు మైత్రేయీ , అని మాట ఇచ్చినారు కదా ? "

         " నిజము. మైత్రేయీ , నీకు ఇదివరకూ చెప్పినదంతా మరలా ఒకసారి సంగ్రహముగా చెప్పెదను. విను. మొదటిది ఆత్మ అమృతము. ఆత్మయే అమృతము. దానిని నమ్ముటకు అడ్డుగా ఉన్నది , ఆత్మ వేరే , నేను వేరే అనుకొని ఉండుట. ఎవడు ఆత్మ వేరే , నేను వేరే యనునో  , వాడు తెలియని వాడు. అతడు చేసినదంతా బూడిదలో చేసిన హోమమగును. ఇలాగ తాను వేరే అనుకొనుటకు కామనయే కారణము. కామము వేరే , తాను వేరే అని తెలియక పోవుటయే ఆ మోహమునకు కారణము. మైత్రేయీ , నేను నిన్ను పత్నియని అంగీకరించినదీ , నువ్వు నన్ను పతియని అంగీకరించినదీ ఆ కామన వల్లనే ! లోకములోనున్న ప్రతియొక్కరూ తనకన్నా ప్రత్యేకమైన ఏదేదో కోరెదరు కదా , దానికంతా వారి వారి కామన యే కారణము. అంతేకాదు , తాను ప్రత్యేకముగా ఉండును : అపూర్ణుడై యుండును ! ఆ అపూర్ణతను పోగొట్టుకొనుటకు ఇది సాధనమా యని దేనినో కామించును. తానే పూర్ణము అన్నది మరచి , తాను అపూర్ణుడని నమ్మి , ఈ కామనను ఆశ్రయించి ఉండును. 

        " అది గనక తప్పి , తాను పూర్ణుడనని తెలిస్తే , అది అనుభవమునకు వస్తే , ఎవరూ దేనినీ కామించరు . అంతా తానే అయినపుడు ఏది కావలెను ? ఏది వద్దు ? దీనిని అనుసంధానము చేయి. ఇదే పూర్ణత్వము , ఇదే అమృతత్వము. ఇదే మహా దర్శనము. దీనిని పొందనివాడికి బహు పెద్ద హాని . అతడి జననము అసార్థకము :  దీనిని పొందిన వానికి బహు పెద్ద లాభము. అతడి జననము సార్థకము. అతడు కృతకృత్యుడు. బ్రాహ్మణుడు. " 

       మైత్రేయి ఆ మాటలోనున్న అర్థమును గ్రహించుటే కాదు , అనుభవించినది. చివరికి లేచి నమస్కారము చేసి , " ఈ మాటలను ఎన్నో సార్లు భగవానుల నుండే విన్నాను. అయితే , ఇప్పటి వలె , అవి నన్ను గ్రహించి ఉండలేదు. " అన్నది. 

        " సరే , మైత్రేయీ , మనము వాటిని అర్థము చేసుకొని తిరుగు కాలమొకటి , అవి మనలను అర్థము చేసుకొని తిరుగు కాలము ఇంకొకటి. రెండవది కాల కర్మలు పక్వమైన కాలము. ఇదే నాకు ఇప్పుడు వచ్చినది , అందుకే సన్యాసము. " 

" తమరిచ్చిన వరమును ఇంకొకసారి ఇవ్వవలసినది. "

" అట్లంటే ? "

      " తమరు , ’ నువు మొదట , ఆ తరువాతే నేను ’ అనుచుంటిరి. ఇప్పుడు తమరు సన్యాసము తీసుకుంటానని అంటున్నారు. అప్పటికి సన్యాసములో తమరే మొదట అన్నట్టయింది. " 

" ఆడవారికి సన్యాసము లేదు కదా ? "

" అలాగయితే ( అన్న మాట నిలవక పోతే ) తమరికది ఎలాగ సిద్ధించును ? " 

          భగవానులకు ఇప్పుడు సంకటము కలిగింది. ఏమి చేయుట ? ఒక్క సన్యాసము అనే చర్య వలన కావలసినదంతా అయింది అంటే , అప్పుడు తాను సన్యాసము తీసుకోవలసిన అవసరము లేదు. ఆలోచించినారు : చివరికన్నారు :" మైత్రేయీ , నువ్విప్పుడు ముక్తిభాజనురాలివైనావు. ( ముక్తికి పాత్రురాలు )  చిన్న పిల్లలమే అయిపోతే అప్పుడు నేను కావలసినది చేయవచ్చును కదా ? " 

" నాకు అర్థము కాలేదు "

         " ఈ దేహము పంచభూతముల నుండీ ఏర్పడినది. తన్మాత్రలనుండీ అంతః కరణమూ , స్థూల భూతములనుండీ శరీరమూ ఏర్పడినాయి.  ఈ భూతములు , తన్మాత్రలూ నీకు అనుమతినిచ్చి , నువ్వు అశరీరమైన ఆత్మలో ఒకటయితే ? అని నేను అడిగినది "

" అప్పుడు అనుమతి అవసరమే లేకపోయి , ఇంక అనుమతి అడిగేదెవరిని   ? "

" సరే " 

79. " మహాదర్శనము " --డెబ్భై తొమ్మిదవ భాగము --పండిన పండు


79. డెబ్భై తొమ్మిదవ భాగము --  పండిన పండు


          కణ్వ మాధ్యందినులు వచ్చి భగవానులను చూచి, " ఉపనిషత్తు   సిద్ధమైనది " అన్నారు. భగవానులు పరామర్శగా చూచుటకు దానిని తీసుకున్నారు. 

" ఎలాగ రాసినారు ? "

" తమరు అనుజ్ఞ ఇచ్చినట్లే , ఆదిత్య దేవుని ఉపాసన వలన రాసినాము. "

" మిక్కిలి మంచి పని చేసినారు. ఆదిత్యుని అనుమతితో విలిఖిత మైనది అన్న తరువాత , మేము చూడ వలసినది ఏమీ లేదు "

" అందులో తమరి పేరుతో ఉల్లేఖనము ఉంది " 

         " ఔను , మైత్రేయికీ , మాకు కలిగిన సంవాదమని ఉల్లేఖించినారు. అది ఇంకా జరగవలసిన భవిష్యద్విషయము. మేమూ దానిని గురించే ఆలోచిస్తున్నాము. "

" మాకు రెండు మూడు విషయములు వివరించుటకు కాలేదు "

" అవి ఏవి ? "              

" మొదటిది , ఎవడైనా తనను తాను హీనుడనుకుంటే వాడిని గొప్పవాడిని చేయుట ఎలాగ ? "

          " దానికేమిటంట ? మంథ విద్య సహాయముతో దానిని చేయవచ్చును. ఆ విద్య మీకు పాఠమయినది కదా ? ఔను , అయింది. ప్రయోగము సిద్ధము కాలేదు. అందువలన సందేహము వచ్చింది. సందేహమును నివారించునది శ్రద్ధ. ఇది గుర్తుంచుకోండి. లోకములో నున్న విషయములన్నీ శ్రేయస్సు , ప్రేయస్సు అని రెండు విధములు. లోకములో ఆసక్తిని ఎక్కువ చేయునవన్నీ ప్రేయస్సు. ఆత్మలో అభిరుచిని పెంచునవన్నీ శ్రేయస్సు. మనో దౌర్బల్యము వలన , శ్రద్ధారాహిత్యము వలన మానవుడు ప్రేయస్సును పట్టుకొనును. మనో బలము చేత , శ్రద్ధ చేత మానవుడు శ్రేయస్సును పట్టుకొనును. ప్రేయో మార్గము ఉత్తరోత్తర ( తరువాతి విషయములు ) ప్రధానము. శ్రేయో మార్గము పూర్వ పూర్వ ( ముందరి విషయములు ) ప్రధానము. కాబట్టి , శ్రద్ధావంతులకు , ఇతరులకు శ్రద్ధకలగ వలెనని మధు విద్యలో వంశ్యమును చెప్పినట్లే , ఈమంథ విద్యకూ వంశ్యమును రాయండి. అంతా సరిపోవును. మనుష్యుడు గొప్పవాడు. అలా కాకుంటే అతడు ఆత్మ విద్యను నేర్వలేడు. ఆత్మ విద్యను నేర్చినవాడు గొప్పవాడగును. అయిందా , ఇంకొకటి ? ".           

" మనకన్నా గొప్ప కొడుకు కావలెనంటే ఏమి చేయవలెను ? "

          " ఇది మంచి ప్రశ్న. అయితే , వేదపురుషుడు దానిని ఇలాగ అంటాడు; దానిని నాత మౌద్గల్యుడు , కుమార హారీతుడు , ఉద్ధాలక అరుణులు ఎరుగుదురు. వారిని అనుసంధానము చేసి వారినుండీ తెలుసుకోండి. స్థూలముగా అర్థమిదీ : పతి , పత్నిలో పుత్రుడిని పొందును. కాబట్టి ఆమె విషయములో ఈతడు ఎలాగ నడచుకొనును అనునది ముఖ్యము. ఆమెను దాసివలె చేసుకుంటే పుత్రుడు దాసీ పుత్రుడగును. అలాకాక, తాను వీరుడననే అభిమానముతో , ఆమెకు వీర పత్ని యను అభిమానము పుట్టునట్లు చేసి ఆమెలో పుత్రుడిని పొందితే , అతడు వీరపుత్రుడగును. అలాగే ,  ఉపనిషత్తు కావలెనంటే ,  అది చేసి చూసిన వారినుండీ నేర్చుకుని చేయవలెను. ఇంకేమి , చెప్పండి. "

కణ్వ మాధ్యందినులు లేచి నమస్కారము చేసినారు. అనుమతి పొంది వెళ్ళిపోయినారు. 

         దేవరాత దంపతులు దేహమును వదలి ఒక సంవత్సరమయినది. ఈ సంవత్సరమంతా శ్రీమంతుల ఇంటి వివాహము వలె సంభ్రమముగా పితృ యజ్ఞము నడచింది. మాసికముల దినము భగవానులు రజతమయ పాత్రలలో దేవతలకూ , కాంచన మయ పాత్రలలో పితరులకూ హవ్య కవ్య ( హవ్యమంటే దేవతలకు ఇచ్చునది , కవ్యమంటే పితరులకు ఇచ్చునది ) దానము చేసినారు. వారు తమకు కావలసినపుడు పితరులనూ , దేవతలనూ రప్పించుకొనేవారు. వారికది ఒక ఆట. 

         ఈ మధ్య ఇప్పుడిప్పుడు భగవానులకు అలమ్ భావము వచ్చినది . అన్నీ చాలు , ఇంకేమీ వద్దు అను భావము ఎక్కువైనది. మొదటి నుండీ వారికి సహజముగనే ఉదాసీన భావము. వారు మనసు పెట్టి శ్రద్ధా భక్తులతో చేస్తున్నది అధ్యయనము , అధ్యాపనములు. ఇప్పుడు కూడా వాటిలో శ్రద్ధ తగ్గలేదు. అయితే మొదటిలాగా ఉత్సాహము లేదు. వారి మనసు ఏ ఆలోచన వచ్చిననూ , " కిం తేన కర్మ ? ( నీకు కర్మ ఎందుకు ? ) దానివలన కర్మ చేయుటయా ? ఏమి చేద్దాము ? అనిపిస్తుంది. కట్టెలన్నీ కాలి పోయిన తరువాత వైశ్వానరుడు  బూడిద లో అంతర్థానము కావలెను. అయితే భగవానుల విషయము లో అలాగ కాలేదు. దానికి వ్యతిరేకమయినది. వారికి వ్యక్తము పైన వైరాగ్యము పెరిగినట్టల్లా వారి తేజస్సు వృద్ధియగుతున్నది. అదేనా ఆత్మ జ్ఞానపు ప్రభావము ? ఏమీ వద్దన్నపుడు పెరిగేది , ఏదైనా కావాలన్నపుడు తక్కువయ్యేది ? అయి ఉండవలెను. శాస్త్రపు మాట నిజమయితే , అనుభవించినవారు ఎవరూ అబద్ధమనరు , పెద్దదో , చిన్నదో ఏదైనా కావాలన్నపుడు , కావలెను అన్నపుడే అశరీరి శరీరి అయ్యేది. శరీరము వచ్చిన తరువాత , ఒక్కడే ఉండుట వీలుకాక, రెండోదానిని కలుపుకున్నట్లే , రెండు మూడై , మూడు ముప్పది అయి,అలాగే పెంచుకుంటూ వెళ్ళి ఈ అపార విశ్వమయినది. ఇలా ఉన్నపుడు , వెను తిరిగిన వానికి , -కొమ్మనువద్దని , మొదలు వైపుకు వచ్చినవాడికి- తేజస్సు వృద్ధియగుటలో విశేషమేముంది ? "

         భగవానులకు ఈ అలమ్ భావము పెరుగుతూ వచ్చి , ఒకదినము , ఈ కపిచేష్టలు ఇంకెన్ని దినములు ? అనిపించినది. మాగుతూ వచ్చిన పండు చెట్టుకు భారమయి నట్టయింది. తనది అన్నది ఏదీ ఉండని స్థితిని అంటే సన్యాసమును అవలంబించ వలెను అనిపించినది. కానీ చేపట్టిన భార్యలు ఇద్దరున్నారు. ఒకతె బ్రహ్మవాదిని. ఇంకొకతె ధర్మచారిణి. ఇద్దరికీ తెలపకుండా వెళ్ళిపోవుటెలాగ ? 

          భగవానులు ఆలోచించినారు. ఇక నేను చేయవలసినది కూడా ఏమీ మిగలలేదు. దైవము నా ద్వారా ఒక సంహిత , ఒక బ్రాహ్మణము , ఒక ఉపనిషత్తు లను కరుణించి , నందనపు నందాదీపము నొకదానిని వెలిగించినది. ఉద్ధాలకుల గురుకులమును అర్ధ శతమానము నడిపించి శిష్య సంపత్తును పెంచుట అయినది. కణ్వ మాధ్యందినులు ఇద్దరూ ప్రచండులైనారు. ఔను, వారిని కులపతులుగా చేయవలెను. అదొక్కటీ మిగిలుంది. అదేమంత పెద్ద పని కాదు. కావేరీ తీరములో గురుకులమును కట్టమని చెప్పి, కణ్వుడిని దక్షిణమునకు పంపించునది , అతడు శక్తుడు, అంతేకాక తపస్వి. విద్యను తెలిసినవాడు. దేవతానుగ్రహమునూ సంపాదించినాడు. అన్నిటికన్నా ఎక్కువగా ఆత్మవిద్యా సంపన్నుడు. అతడే ఒక గురుకులమును కూడా నిర్మించగలడు. మాధ్యందినుడు ఎంతైనా కణ్వుడికి ఎడమ చేయి వంటివాడు. కాబట్టి అతడికి ఈ ఆశ్రమమును ఇచ్చెదను. ఇక మిగిలినవారు భార్యలు. అయ్యో ! నాకెంతటి పిచ్చి ! పుట్టిన అంకురము తన ఆహారమును తలపై మోసుకొని తెస్తుంది. అటువంటప్పుడు , వారిద్దరి భారమును నేను మోయవలెనా ? " వారు నా మీద భారమును మోపినారు. నేను దానిని మోస్తున్నాను" అను భావపు బీజమే ఈ సంసారము ! సరే , ఓ సంసారమా! నీకు తృప్తి కలగనీ , అన్నీ వదలివెళ్ళునపుడు ఎవరికైనా ఎందుకు బాధ కలగవలెను ? అని పలురకాలుగా ఆలోచించినారు. 

          వీలయినంత సేపూ కనులు మూసుకొని ధ్యానాసక్తురాలై కూర్చునే మైత్రేయికి భగవానులలో కలిగిన ఈ మార్పు తెలియలేదు. నీడకు నీడయై , సహధర్మచారిణి యైన కాత్యాయనికి మార్పు వచ్చినది తెలియకుండా పోలేదు. అయితే , ఈ మార్పు ఎక్కడ ఏ వైపుకు తిరుగునో అన్నది ఆమెకూ తెలియదు. ఏమవుతుందో కానీ అని మొండి ధైర్యమును తెచ్చుకున్ననూ ఆమె ఓ కంట కనిపెట్టుట మానలేదు. 

          భగవానులు సన్యాసియై వెళ్ళిపోవలెనని నిర్ణయించుకున్నారు. దానికోసమై ఏ ప్రయత్నమూ జరగ నవసరము లేదు. అయితే భార్యల అనుమతి తీసుకోవలెను. వీరిద్దరిలో మొదట ఎవరికి ఈ విషయము చెప్పుట ? ఉన్నంత వరకూ ధర్మము , అంతా ముగిసిన తరువాత బ్రహ్మము కాబట్టి కాత్యాయనికి ముందుగా ఈ సంగతిని తెలియపరచ వలెను. ఆ తరువాతే మైత్రేయికి అని నిర్ధారించుకున్నాడు. 

" కాత్యాయనీ , రేపటి దినము మనము ఏమేమి తినవలెనని ఆశ ఉందో అవన్నీ చేయి. " 

కాత్యాయని అడిగింది, " రేపేమి విశేషము ? "

" మేము సన్యాసము తీసుకొని వెళ్ళిపోవలె ననుకున్నాము"

" మేమేదైనా అపరాధము చేసినామా  యేమి ? "

" ఛీ ! ఛీ ! . మీరందరూ సరిగ్గా ఉన్నందువలననే మా వైరాగ్యము పక్వమైనది. మేము ఇప్పుడు పరమ తృప్తులము. తృప్తికి గుర్తుగా మా సన్యాసము "

" అయితే రేపు ఇష్టమైన వంటలు చేయుట ఏమిటికి ?  ? " 

" మీ అభిమానము పూర్ణము కానీ యని ! " 

" మా అభిమానము పూర్ణము కావలెననునది ఏమిటికి ? "

" ఔను , మీ అనుమతి లేనిదే సన్యాసము లభించుటెలాగ ? "

" అట్లనా ? మరి మీ శిష్యుల అనుమతి కూడా కావలెనా ? "

" శిష్యులు మేము చెప్పినట్లు వినేవారు. మేము మీరు చెప్పినట్లు వినేవారము. " 

         కాత్యాయని రెప్పపాటు కాలము ఊరికే ఉంది. " అన్ని విషయములలోనూ ఆమె అక్క , నేను చెల్లెలు. కాబట్టి ఆమెతో మొదట ప్రస్తావించండి. నాదేమి , ఉండనే ఉంటుంది. " ఆమె అక్కడ నిలవలేదు , వెళ్ళిపోయింది. భగవానులు ఆమె ఆంతర్యమేమై ఉండునా యని ఆలోచించినారు. అన్నీ వదలివెళ్ళే ఆలోచనలో ఉన్న వారికి కాత్యాయని హృదయమేమో అర్థము కాలేదు. 

          " కానిమ్ము , ఆమె చెప్పినట్లే వింటాను. మొదట మైత్రేయి దగ్గర ప్రస్తావిస్తే , ఆమె బ్రహ్మవాదిని. ఒప్పుకొని తీరును. ఆ తరువాత యేమి ? కాత్యాయని లోకవాసనా వాసురాలు. ఆమెకు భర్త కన్నా హెచ్చుగా ఆస్తిమీద అభిమానము. " అని భగవానులు లేచి మైత్రేయి వద్దకు వెళ్ళినారు. 


Tuesday, April 9, 2013

78. " మహాదర్శనము " --డెబ్భై ఎనిమిదవ భాగము --చివరి దినములు


78. డెబ్భై ఎనిమిదవ భాగము--  చివరి దినములు

          దేవరాతుడు పయో వ్రతమును ఆరంభించి తొమ్మిది నెలలయినవి. దీక్షను వదలినాడు. గడ్డమూ , శిఖా పెరిగి ఇంతింత పొడుగ్గా అయినాయి. అలాగని రూపము ఘోరముగా లేదు. ముఖము సౌమ్యముగా ఉంది. అన్నిటికన్నా ఎక్కువగా , కనుల దృష్టి ప్రశాంతమైనది. అయినా ఏదో ఒక అలౌకికత. పోగొట్టుకున్న తన రత్నమును వెదకు వానివలె ఏదో ఒక వెదకుచున్న చూపు. భగవానులతో ఉన్నపుడు కనులు మూసుకొని మౌనముగా కూర్చుంటాడు. ఒక్కడే ఉన్నపుడు కనులు తెరచి ఏదో ఒక వ్యాపారము చేస్తూ ఉంటాడు. సామాన్యముగా ఒక చేతిని అడ్డముగా ఉంచి, ’ ఇలాగ కామము ఆగి ఉన్నది , అయితే అది ప్రవాహమునకు అడ్డముగా ఉంచిన చేయి వలెనే. చేయి అడ్డమైతే ప్రవాహము ఆగునా ? అలాగ ఖండము అఖండమగుటకు అడ్డముగా ఉన్నది కామము. ఒకసారి గనక ఖండము అఖండము వైపుకు తిరిగితే ఖండము తాను అఖండమగును. నిజంగా సంకల్పిస్తే అప్పుడు కామమును ఆపుట ఏమిగొప్ప ! అయితే ఖండము ఎరుగదు , తానే అఖండమని! కాబట్టే ఈ కామపు జోరు , అధికారము." అని గల గలా నవ్వుతాడు. 

         ఆలంబిని వచ్చేది  ’ తన స్నానానికి నీరు ఇచ్చుటకు ’ అని అతడిది ఒక సిద్ధాంతము. ఆమె ఎప్పుడు  వచ్చినా , ’ ఏమి , స్నానానికి సమయమయినదా ? ’ అంటాడు. స్నానము చేస్తే , అభ్యాస బలము చేత నిత్య కర్మ , అగ్నిహోత్రములను చేస్తాడు. అయితే ఆహార విచారములో మాత్రము బహు కచ్చితము. పాలు తప్ప ఇంకేమీ తీసుకోడు. ఒక్కొక్క నాడు , ’ ఆలంబినీ , నేను పాలను మాత్రమే తీసుకొనుట ఎందుకో తెలుసా ? మనము తీసుకున్న ఆహారము మూడు పాలు అగును. ఒక భాగము దేహమునకు అనవసరమై మలమై బయటికి వచ్చేస్తుంది. ఇంకొక భాగము సూక్ష్మముగా రక్తమై శరీర భాగముల నిర్మాణములో ఉపయోగపడును. దానికన్నా సూక్ష్మమైన భాగము మనసును చేరుతుంది. కాబట్టి ఆహారశుద్ధి వలన సత్త్వ శుద్ధి, సత్త్వ శుద్ధి వలన మనశ్శుద్ధి . కాబట్టి , చూడు , మనస్సు   శుద్ధముగా ఉండవలెను అనువాడు ఆహార శుద్ధి వైపు సంపూర్ణ లక్ష్యము పెట్టవలెను. " అంటాడు.   

          ఇంకొక దినము తానే ఆలంబినిని పిలచి ," నువ్వు ఊ అను ఆలంబినీ , , ఈ కర్మలన్నీ మనకు నానావిధములైన స్వర్గములను తెచ్చిచ్చునది నిజము. అవి ఎలా వస్తాయి ? ఈ కర్మలు పుణ్యములైనందు వలన.     ఒకవేళ మన కర్మ పాపమైనది అనుకో , అప్పుడు ఏమి కావలెను? పాపలోకములు కలగవలెను. మనము ఒక కర్మ చేస్తే దానికన్నా విరుద్ధమైన మరొక ఫలము వచ్చుట ఉంటుందా ? దారిలో నడిస్తే పొట్ట నిండునా , భోజనము చేయాలి గానీ? ఇలాగైతే , కర్మ చేస్తే బ్రహ్మ దొరకునా ? మొక్కజొన్న పైరులో గోధుమలు వస్తాయా ? అలాగని కర్మను చేయకుండుటెట్లు ? కర్మ చేయకుండా ఉండుటకూ లేదు, కర్మ చేయకపోతే దేహము వినవలెను కదా ? కాబట్టి కర్మము చేసే తీరవలెను అను. ఆ ! చూడు ! ఆలంబినీ ! గుట్టు దొరికింది , కర్మ ఆహారము వలెనే , ఇక సరే , దేహపు రక్షణకు తిను ఆహారము వేరే , బొజ్జ పెంచుటకు గేదెలు తినునట్లు తిను ఆహారము వేరే , కాదా ? అలాగే కర్మ కూడా! "

     ఆలంబినికి,’ ఇదేమిటి ? వీరికేమైనా పిచ్చి పట్టినదా ? లేక పిచ్చి పట్టుటకు ముందు సూచనగా ఇలాగ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారా ? " అనిపిస్తుంది.

         అది అతడికి ఎలాగో తెలిసిపోవును. వెంటనే అతడు నవ్వి , " నాకు పిచ్చి పట్టింది అనుకుంటున్నావేమో ? పిచ్చివాడికీ జాణకూ  ఏమి తేడా ? ఇతరులకు కావలసిన మాటలనే చెప్పుచూ , ఏమైనా సరే , ఇతరులను తృప్తి పరచవలెను అని తన వ్యవహారముల నన్నిటినీ అటువైపుకు తిరుగునట్లు చేసుకున్నవాడు జాణ. అటుల కాక, తనకోసము తాను తనతో ఆడుకొను మాటలను ఇంకొకరి దెప్పుడు లేకుండా ఆడుకొనువాడు పిచ్చివాడు. సరిగ్గా చూస్తే , ఈ జగత్తులో ఇతరులకు తనను బలి ఇచ్చుకొని తనను అంతగా కుంగ జేసుకున్నవాడు పిచ్చివాడా ? లేక ఇతరుల గోజు వద్దేవద్దని తనకు తోచినట్లు చేయువాడు పిచ్చివాడా ? నేను చెప్పేది నీకు తెలియక పోతే నీ కొడుకు ఆ భగవానుడున్నాడు కదా , వాడిని అడుగు. ఏమి చేయుట ? నాకు కావలసినది వాడిలో ఉంది. వాడు ఇచ్చుటకు ఇంకా మనసు చేయలేదు. అలాగని ఇవ్వక పోయేవాడు కాదు. సరేలే , ఏదో ఒకరోజుకు ఇవ్వనే ఇవ్వవలెను , ఇస్తాడు " అంటాడు. ఆలంబిని ," ఔనౌను, మీకు కాకపోతే ఇంకెవరికిస్తాడు ? " అంటుంది. దేవరాతుడు పెద్దగా నవ్వి , " నేను ఆశ్రమమునకు వచ్చినదే అందుకు ఆలంబినీ. గంగా యమునా సంగమములో ప్రాణము వదిలితే ముక్తి యంట ! అలాగ , ఈతని సన్నిధానమే మాకు సంగమము. ఏమంటావు ? " అంటాడు. 

        ఆలంబినికి రానురాను మొగుడి విచిత్ర వర్తనము అలవాటై పోయినది. అయినా ఆమెకు ఒక ఆశ్చర్యము. ఎన్నో సంవత్సరాలనుండీ కర్మమే సరియైనది అనేవారు ఇప్పుడు కర్మకు మించి ఇంకేదో ఉంది అంటారు. అదేమిటి ? నేను కూడా దాన్నెందుకు పొందరాదు ? " అనుకుంటుంది. 

         ఈమె కూడా ఇప్పుడు భర్త వలెనే పయోవ్రతములో ఉన్నది. ఆమెకు ఒక ఆశ ఉండినది, మనవడిని ఎత్తుకోవలెను. ఇప్పుడది కూడా లేదు. అదెట్లో , ఆ ఆశ కాలిన నేలపై పడిన వాన నీటి వలె ఇంకిపోయింది. భర్త యొక్క చింతయే అంతా అయినపుడిక వేరే చింతనలు , ఆశలూ ఏముంటాయి ? 

         ఒక దినము భగవానులు తానుగా తల్లిని చూడవలెనని వచ్చినారు. " అమ్మా , నీకు దేవతలు ఒక వరమును ఇచ్చినారు " అన్నారు. ఆమెకు భర్త అంటున్న, ’ వాడు కావాలంటే దానిని ఇవ్వగలడు ’ అనే మాట గుర్తొచ్చి , " తప్పకుండా కానిమ్ము , ఇవ్వవయ్యా ! " అని కొంగు చాచింది. 

" దేవతలు నీకు స్వేఛ్చా మరణమను వరమును ఇచ్చినారు " 

" అంటే ఏమిటయ్యా ? "

" చూడమ్మా , మరణము కాల , కర్మ సంయోగము వలన సంభవించేది. అలాగ కాకుండా నువ్వు కావాలన్నప్పుడు కాల కర్మలు మృత్యువును తీసుకొస్తాయి. ’  

" అంటే అప్పుడేమవుతుంది ? "

        " చూడమ్మా , కాలము వచ్చినపుడు ఈ శరీరములో నున్న జీవుడు ఈ శరీరమును వదలి వెళ్ళిపోవును. అప్పుడు అతడికి కామములు లేకున్నచో ముక్తుడగును. సకాముడై ఉంటే , యథాకాముడై లోకములను పొందును. " 

" ఇదేనా వారు చెప్పేది ? వారు పదే పదే ’ కావాలంటే నీ కొడుకు భగవాన్ ఇవ్వగలడు , ఇస్తాడు ’ అంటారు. వారు అనేది ఇదేనా ? "

        భగవానులు నవ్వుతూ , "కావచ్చును. నువ్వు అదంతా పట్టించుకోవద్దు. నన్ను కొడుకుగా కన్నావు. నాకు ఈ జన్మను ఇచ్చినావు. అందువలన నీకు కావాలన్న లోకములు దొరకును. నీకు కావలసినది చెప్పు. నువ్వు చెప్పేలోపలే దేవతలు అస్తు అంటారు " 

         " చూడు నాయనా , ఈ మధ్య వారికి దేహము కృశిస్తూ వచ్చినది . అందువలన నాకు కలుగుతున్న దిగులు ఇంతా అంతా అని చెప్పలేను. అదీకాక, ఆ దిగులును గురించి నేను ఎవరి దగ్గర చెప్పుకోవలెను ? ఒకవేళ చెప్పుకున్నా , విన్న వారు నా అదృష్టాన్ని మార్చగలరా ? అని ఇంతవరకూ ఊరికే ఉన్నాను. ఈ దినము ఏమైనా కానీ , నీ దగ్గరకు వచ్చి చెబుదామని మనసు చేసుకున్నాను. నువ్వే వచ్చి స్వేఛ్చా మరణము పొందవచ్చని దేవతలు వరమునిచ్చినారని అన్నావు. చూడు , నాకున్న ఆశలు రెండు. ఒకటి, ముత్తైదువగా చావవలెను. వారి ముందర కన్నుమూయవలెను. అలాగని వారిని ఇంకొకరి చేతిలో పెట్టి చావలేను. కాబట్టి , ఇప్పుడు నువ్వు చెప్పిన స్వేఛ్చా మరణము కానిమ్ము , అయితే , వారు పోవు కాలమునకు ఒక ముహూర్తము ముందర నా మరణము కలగ వలెను. ఇది ఒక ఆశ. "

" అలాగే అవుతుంది , ఇంకొకటి ? "

      " అబ్బ! , ఎద ను  నాటిన శూలము తీసేసినట్లయింది , నీ మాట వలన నాకు ఎంతో తేలికైంది. ఇక సంతోషముతో అడుగుతాను , అక్కడ నీ దేవతలను అడుగు , దానిని వారు ఇవ్వనీ , ఆ తరువాత నా నోటితో చెప్పెదను. " 

" సరేనమ్మా ! దానిని దేవతలు జరిపించెదరు , చెప్పు " 

" చూడు నాయనా , నాకు భర్త పైన  ఎంత ఆశో అనుకున్నా ఫరవా లేదు, పోయిన తరువాత కూడా వారెక్కడున్నా నేను కూడా అక్కడే ఉండ వలెను. అదే నా ఆశ "

        " ఇంతేనా ? నీకేమిటమ్మా , వదలకుండా అగ్నిహోత్రమును చేసిన మీకు ఒకటే గతియగును , పిచ్చిదానా , సరే , దేవతలు ఒప్పుకున్నారు. నేను వచ్చువరకూ మీరిద్దరూ బ్రహ్మలోకములో ఉండండి. ఈ దేహానంతరము నేను కూడా అక్కడికే వస్తాను. మనమందరమూ ముక్తికి వెళదాము. " 

" ముక్తి అంటేనేమి నాయనా ? " 

" నేను  , నువ్వు అన్న భేదములన్నీ వదలి , నీటిలో నీరు కలసిపోవునట్లే చైతన్యము చైతన్యములో చేరి పోవును. "

" నువ్వు వెయ్యి చెప్పు నాయనా ! నాకు  , ఈ తల్లీ కొడుకు , భార్యా భర్త అన్న నాటకమే బాగుంది. ఇది ఇలాగే నిలచునా ?? "

" ఇది నిలవదు. అయితే , మనకు చాలంటే లేచి వెళ్ళిపోవచ్చును. "

" ఏమో , చూడవయ్యా , ఇది మీ ఇద్దరికీ సంబంధించినది. మీరు ఎలాగ చెప్పితే అలాగ నేనూనూ ! "                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                              

77. " మహాదర్శనము " --డెబ్భై యేడవ భాగము --దర్శనము


77 . డెబ్భై యేడవ భాగము-- దర్శనము

          భగవతికి ఎదురు కొండపై గోవులు మేస్తున్నది చూచుటకే ఒక సంతోషము. వర్ణ వర్ణముల పశువులు పచ్చటి అడవిలో పచ్చటి చెట్ల మధ్య తిరుగుతున్నది చూస్తే ఆమెకు కలుగు సంతోషము ఇంతింత అని చెప్పుటకు సాధ్యము కాదు. ఆ సంతోషమును ఇంకొకరితో పంచుకోవలెను. అదే మనుష్య స్వభావము. తీపి చేసిన దినము ఒకడే భోజనము చేయకూడదు అన్నారు పెద్దలు. ఒక్కరే రమించుటెలా ? అన్నది శాస్త్రము. శాస్త్రపు మాట , పెద్దల మాట అటుంచితే , స్వభావము అడిగినదానిని లేదనుట ఉందా ? అయితే ఒక విశేషము. సుఖ దుఃఖములు రెండింటినీ పంచుకుంటే , సుఖము రెట్టింపు అవుతుంది, దుఃఖము సగమవుతుంది. బహుశః వాటికి కూడా గుణాకార , భాగహారములు వస్తాయేమో ? ఒకటి గుణాకారమవుతుంది. ఇంకొకటి భాగహారమవుతుంది. దానివలననే నేమో మనుష్యుడు సంఘజీవి ? 

          భగవతి ఒకదినము తమ సంతోషము  పట్టలేక వెళ్ళి మైత్రేయిని పిలుచుకు వచ్చింది. ఆమె అంతవరకూ పశువులను ఆ విధముగా చూచి యుండలేదు. కాత్యాయని యొక్క కన్నులతో ఆ గోధనమును చూచినపుడు , అదికూడా ఆ కొండ నేపథ్యములో , చెట్లమధ్య , పచ్చికబయళ్ళలో అవి తిరుగుతుండగా చూచితే , ఏదో అనిర్వచనీయమైన తృప్తి అయినది. అలాగే ఇంకో ఘడియ చూస్తూ నిలబడింది, " గోవు అంటే సమృద్ధికి సంకేతము. ఆ గోవులు పచ్చచీర కట్టిన వనస్థలిలో తిరుగుచుండుటను చూస్తే మనసుకు ఎంతో హృద్యముగా ఉంది. చూచితివా , ఆ దృశ్యములోని సౌందర్యము ? కనులు మెచ్చుకున్నాయి, మనసు నిండింది , ఏదో శాంతి కలిగింది! చెల్లీ , నీ కోరిక నిజంగా ఎంత అందమైనదో ! " అన్నది. 

         దాన్నలా పరిభావిస్తుండగా ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. " మేము ఇంతగా సంతోషించునది ఇదంతా మాది అనియేనా ? లేక , అదంతా సమృద్ధి ప్రతీకలైన సౌందర్యపు ముద్దలనియా ?  " ఆమె విచారపరురాలైనది. ఔను ! ఒక చిగురుటాకు చేతికి చిక్కితే , దానిని తన మనోభావనతో మరలా పచ్చటి చెట్టులో పెట్టి చూచు జాతి. అయినా ఆ దినము ఆమె ఎందుకో ఆ విషయమును  ముందుకు తీసుకుపోలేదు.  

         కాత్యాయనికి భగవానులను కూడా పిలుచుకు వచ్చి ఆ దృశ్యమును చూపించవలెనని మురిపెము. కానీ , భగవానులు తనమాట పాలించరు అన్న అపనమ్మకము లేకున్ననూ ఎదో సంకోచము. అత్తను పిలుచుకు వచ్చి చూపించినది. ఆమె కూడా మిక్కిలి సంతోషించినది. " మీ ఆశ్రమమునకు వచ్చిన దినము నుండీ ఒక్కొక్క దినము ఒక్కొక్క విచిత్రమును చూపిస్తున్నావు. రెండు దినములలోనే ఆ కొత్త కాలువకు పిలుచుకొని వెళ్ళినావు. కాలువ  నీరు వచ్చి పడుతున్న  చెరువైతే నిజంగా మనోహరముగా ఉంది. అన్నిటికన్నా , నువ్వు వెళ్ళి నిలుచుంటే ఆ లేగదూడలు నీ చుట్టూ చేరి తోకలనెత్తి దుముకుతూ ఎగురుతూ ఆడే దృశ్యము మాత్రము నిజంగా మనసులను గెలిచేది. కాదే , అదెంత వేగిరముగా నువ్వు  వాటిని మచ్చిక చేసుకున్నావు ? అక్కడ కూడా మన ఇంట్లో ఆవులూ దూడలూ ఉన్నాయి , అయితే అవి ఇంతగా మాలిమి కాలేదు. పాలు తాగుతున్ననూ నువ్వు పిలిస్తే పరుగెత్తి వస్తాయో ఏమో ? " అన్నది.

        కాత్యాయనికి ఆ స్తుతి విని చాలా సంతోషమైనది. ’ అమ్మా , ఏదైనా చేసి , భగవానులను ఒక దినము పిలుచుకొని వచ్చి ఈ దృశ్యమును చూపించవలెను కదా ? " అన్నది. ఆ మాటలో . ’ ఇది నావల్ల సాధ్యము కాదు , మీరే పూనుకోవలెను’ అన్న భావము నిండి ఉంది. ’ ఏదో ఒకటి చేసి పిలుచుకొని రండి , ’ ఊ ’ అనండి  ’ అన్న ప్రార్థన నిండి ఉంది. 

         ఆలంబిని నవ్వింది. " అది కాదే , నువ్వు చెబితే మీ భగవానులు వినరా ? నేనే చెప్పాల్నా ? అవసరము లేదు , నువ్వు రా అంటే వాడు వస్తాడు. " అంది. కాత్యాయని వినలేదు, " అట్లు కాదమ్మా! వారు కళ్ళు మూసుకుని కూర్చొని అన్నీ చూచినానని సంతోష పడువారు. మనము కళ్ళు తెరచి చూచి సంతోషపడు వారము. అదేమో కళ్ళు మూసి చూచుటకన్నా, కళ్ళు తెరచి చూచుట తక్కువ అని మన భావన. కాబట్టి వారిని పిలిస్తే ఎక్కడ అపరాధమగునో అని దిగులు. మీరైతే అది వేరు. ఎంతైనా మీరు వారి తల్లి. మీ మాట మీరుట ఉండదు. నా కష్టము చూడండి. నేను మెచ్చినదానిని వారు మెచ్చ వలెను. వారు మెచ్చకుంటే నాకు తృప్తి లేదు. అలాగని వారిని నేరుగా పిలుచుటకూ లేదు. అందుకే మిమ్ములను అడుగుతున్నాను. " 

         ఆలంబిని కొడుకును పిలుచుకు వచ్చుటకు ఒప్పుకున్నది. కాత్యాయని అంది : " అది గనక అయితే ఇంకో రెండు మూడు దినములలో కావలెను. చూడండి , మహారాజుల నెల బ్రహ్మచర్యము ఇంకో రెండు మూడు దినములకు తీరును. ఆ తరువాత ఆ పుణ్యాత్ముడు భగవానులకు విడుపు ఇస్తారో లేదో ? " 

         " అది కుడా నిజమే! మహారాజులు పయోవ్రతమును పట్టి నెల కావస్తున్నది కదా ? అదేమి కాత్యాయనీ , ఇతరుల విషయములో ఒక సంవత్సరము బ్రహ్మ చర్యము అన్నవారు మహారాజుల విషయములో ఒక నెల అన్నారు ? "

         " ఏమిటమ్మా తెలియనట్లే అడుగుతున్నారే ? ఇతరులు అంటే మామగారే కదా ! మామ గారిని అదిమివేసే పనులేమున్నాయి ? పైగా బ్రాహ్మణులు కదా. మహారాజైతే క్షత్రియులు. బ్రాహ్మణుల వలె అన్నీ వదలి కూర్చొనుటకు అవుతుందా ? రాచకార్యముల భారము ఎక్కువ. అందుకే అవధి తగ్గించినారు. దానితో పాటు పయోవ్రతము , ఏకాంతవాసము అదనముగా ఉన్నాయి కదా ? మామగారైతే కుటుంబములో ఒకరై ఉన్నారు. "

" అదీ నిజమే. సరే , మీ భగవానులను ఏ దినము పిలవాలి ?"

" మీకు ఎప్పుడు తోచితే అప్పుడు. " 

" ఈ దినము ఇంకా మాధ్యాహ్న స్నానానికే చాలా సమయముంది. ఈ దినమే ఎందుకు కాకూడదు ? "

         ఆలంబిని నేరుగా కొడుకును వెతుక్కుంటూ వెళ్ళింది. కాత్యాయని కూడా వెనకే వెళ్ళింది. భగవానులు సుఖాసనములో నడిమింట్లో కూర్చున్నారు. కనులు విశాలముగా తెరచియున్ననూ వాటికి ఏమీ కనపడుట లేదు అని నేరుగా ఉన్న ఆ చూపు తెలుపుతూ వచ్చినవారిని హెచ్చరిస్తున్నట్టుంది. 

        అత్తాకోడళ్ళు వెళ్ళి ఎదురుగా నిలుచున్నారు. కొంతసేపటికి భగవానులు వారిని చూచి, " పిలవకూడదా అమ్మా ? " అని లేచి నిలుచున్నారు. తల్లి నవ్వుతూ , " నువ్వు యే లోకమునకు వెళ్ళినావో ఏమో అని పిలవలేదు. కాత్యాయని ఏమో చెప్పవలెనని వచ్చినది. " అన్నారు. 

భగవానులు నవ్వుతూ , " నేనేమి పులినా , ఎలుగుబంటునా ? తానే వచ్చి చెప్పకూడదేమి ? " అన్నారు. 

" ఇంకేమీ లేదు , ఎదురుగా కొండపైన పశువులు మేస్తున్నాయి. నువ్వు వచ్చి చూడవలెనంట! " 

       " ఇంతేనా ? పద , ఇప్పుడే వెళ్ళి చూచి వద్దాము" అని భగవానులు కదిలినారు. " దేవుడి దయ ! వంటకూడా ముగిసింది " అని కాత్యాయని కూడా వెంట నడచింది. 

         భగవానులు కొండ పైన మేస్తున్న గోవులను చూచినారు. కొండ పక్కగా పారి వస్తున్న కాలువను చూచినారు. కొండకు ఈ వైపున చేరుకున్న విశాలమైన చెరువును చూచినారు. అన్నీ చూచి , " చూడమ్మా , ఇదంతా ఈమె వలన అయినవి. ఈమె వేయి ఆవులు కావలెనన్నది. అంతేకాక, దానికోసము మనకు కొంచము కూడా శ్రమ కలగరాదు అన్నది. దేవతలు సరేనన్నారు. చూడు. పశువులు వచ్చినాయి , వాటికి కొట్టములయినాయి. తాగుటకు నీరని , కాలువ వచ్చినది. కాలువ నీరు నిలుచుటకు చెరువయినది. ఇది సంసారము. ఊరికే పెరుగుతూ పోవడమే దీని స్వభావము. " అని, " భగవతి వచ్చి ఏమేమి చూడవలెనో చెప్పవలెను. మాకు కన్నులున్ననూ అన్నిటినీ చూడవు. " అన్నారు. 

         కాత్యాయని భగవానులు గోవులను చూచుటకు వచ్చినారు అన్న సంతోషములో అన్నీ మరచింది. సహజముగానే సరళమైనది. మాటకు మాట జోడించునది కాదు. అందులోనూ సంతోషములో మైమరచిపోయినపుడు ఇక చెప్పవలెనా ?   

         ఆమె ముందుకు వచ్చి గోవులను చూపించి, చెట్లనూ , పచ్చిక బయళ్ళనూ చూపించి , పచ్చిక దిన్నెలతో నిండిన ఆ వాలు మైదానములో అవన్నీ ఎంత సొగసుగా కనిపిస్తున్నాయో వర్ణించినది. భగవానులు అంతా విని తల ఊపి, " కాత్యాయనీ , ఇవి ఇంత సుందరముగా ఉండుటకు కారణమేమో తెలుసా ? " అని అడిగినారు. 

" లేదు "

       " నీ అభిమానము. ఆ అభిమానముతో ఇదంతా నాది అని చూస్తున్నావు. ఆ నాది అన్నదానివలన  నీ సంతోషము ఇబ్బడిముబ్బడి యగుచున్నది. నాది అనుట వలన సంతోషము రెట్టింపైతే,  " నేను " అన్నట్లయితే , గోవులన్నీ , గోవులే కాదు ఈ కొండ అంతా , ఈ నీరంతా , ఈ ఆకాశమంతా , అంతేనేమి , అంతా నేనే అన్నపుడు ఆ సంతోషము ఎంత కావలెను ? "

     కాత్యాయని దాని భావమును అనుభవించి ఒక ఘడియ తన్మయురాలైనది. ఆలంబిని కూడా తన్మయురాలైనది. అయితే భావమును అనుభవించి కాదు. 

       భగవానులు మరలా అడిగినారు." ఆ దినము నువ్వు , జ్ఞాన నగరపు కాలువను ఇక్కడికి తెచ్చినారు , దాని చివర చెరువుంది  అన్నది ఇదేనా ? పోనివ్వు , ఈనాడైనా వచ్చి చూచినాను కదా ? "

" అదేమిటి , ఈనాడైనా అంటున్నారు ? మీరు చూచిననూ నెమ్మదే ! చూడకున్ననూ నెమ్మదే ! "

         " ఔను , ఔను. చూచిననూ మీరు బ్రహ్మమే ! చూడకున్ననూ మీరు బ్రహ్మమే ! కానీ చూచితే మీరు ముక్తులు. చూడకపోతే మీరు బద్ధులు. అంతే వ్యత్యాసము. ! అది సరే , నువ్వు ’ ఈనాడైనా అంటున్నారు ’ అని అడిగినావు కదా ? మరి , మహారాజు జ్ఞాన నగరమునుండీ తెచ్చిన కాలువ. దాని నీరు నిలుచుటకు కట్టిన చెరువు చూచితిరా అంటే లేదు అనకుండా , ’ ఊ చూచినాను ’ అనవచ్చా ? అందుకే అన్నాను "

         భగవానులు దీర్ఘ కాలము ఆ గోసంపత్తును చూస్తూ నిలుచున్నారు. తల్లి , దూడలను కాత్యాయని మాలిమి చేసుకున్నది చెప్పినది. భగవానులు నవ్వి అన్నారు, " అమ్మా! నీ కోడలంటే ఏమనుకున్నావు ? ఆ ఏనుగుల వంటి ఆబోతులునాయే , వాటిని చూచినా లక్షము లేదంట ! వెళ్ళి , వాటి పక్కన నిలబడి, ఒళ్ళు నిమురుతుందంట ! ఈమె పిలిస్తే అవి లేగదూడల కన్నా ఎక్కువగా పరుగెత్తి వస్తాయంట ! "

" అవన్నీ నీకు ఎవరు చెప్పినారు ? "

" ఆ గోపాలకుల ముఖ్యుడున్నాడు కదా , అతడు వచ్చి చెప్పినాడు. "

అలాగే కొంతసేపు ఆ గోవుల సంగతి మాట్లాడుతూ వారంతా వెనుదిరిగినారు. 

        రాజు బ్రహ్మచర్యము ముగిసింది. దేహము తేలికగా ఉంది. ఏకాంత వాసము వలన ముఖమునకు వర్ఛస్సు వచ్చింది. మనసు చూచిన వైపుకు పరుగెత్తుట తప్పింది. రాజిప్పుడు రాజ భవనములో ఉన్నప్పటికన్నా శాంతుడూ, దాంతుడూ అయినాడు. 

         భగవానులు రాజును పిలిపించినారు. ఆ దినము ఉపదేశమని అతడికి తెలుసు. రాజును పూర్వాభిముఖముగా కూర్చోబెట్టి , తాము ఉత్తరాభిముఖులై కూర్చొని, భగవానులు తమ కమండలము నుండీ మంత్రజలమును రాజుమీద చల్లినారు. రాజుకు తాను అనునది ఏమున్నదో అదంతా మూటగట్టుకొని  మూలాధారమునకు దిగింది. దృష్టి రెప్ప కొట్టుటను మాని భగవానులనే చూస్తున్నది. చేతులు , అరచేతులు వెల్లకిలగా తొడలపైనున్నవి. తలా వీపూ , అంగాంగములు నేరుగా గూటము కొట్టినట్టు కూర్చున్నవి. 

        భగవానులు ’ ప్రజ్ఞాన ఘనః ప్రత్యగర్థో బ్రహ్మేవాహమస్మి  ’ అను మంత్రోపదేశము చేసినారు. మంత్రపు అక్షరములు ఒక్కొక్కటీ ఒక్కొక్క అఖాతమంతటి గంభీరములై చెవులనుండీ దేహము లోపలికి దిగి వాసమేర్పరచు కొన్నట్టాయెను. 

     భగవానులు, " ఈ మంత్రమును కనులు మూసి నూటెనిమిది సార్లు జపము చేసి ఏమవుతుందో చెప్పండి " అని తమ పాటికి తాము కూర్చున్నారు. 

       రాజు మంత్రమును జపించుట ఆరంభించినారు. మేరు ప్రదక్షిణ ( మధ్యమానామికాంగుళుల మధ్య కణుపులకు మేరువని పేరు )  చేసి లెక్కవేస్తున్నది తప్పిపోయింది. నోటితో మంత్రాక్షరములను చెప్పుచున్నది తప్పిపోయింది. లోపలంతా మంత్ర జపము నడుస్తున్నది.

         అంగాంగములలోనూ ఏదో తేజస్సు పరచుకున్నట్టు భాసమగుచున్నది. ఆ పరచుకున్నదానిని తేజస్సు అనుటకన్నా ఇంకేదో అనుట సరియైనది. తేజస్సంటే చక్షుగోచరమైన రూపమున్నది అన్నట్లగును. అది రూపము కాదు, నాలుకతో రుచి చూచు రసము కాదు. శ్రోత్ర గ్రాహ్యమైన శబ్దము కాదు. ఘ్రాణము నుండీ గ్రహించు గంధము కాదు , త్వక్కునుండీ తెలియు స్పర్శ కాదు. అయినా బాగా తెలుస్తున్నది. అదేదో ప్రత్యేకమైనది. అయితే , వేడి కాదు , చలువ కాదు , అంతటిది. దానిని రాజు అంతవరకూ చూడలేదు. చూడలేదని , తాను దానిని గుర్తించలేను అని లేదనునట్లు కూడా లేదు. 

         అంతటి దొకటి ఆతని అంగాంగములను వ్యాపించినది, మెల్లగా వెనుతిరిగి వచ్చినట్టుంది. అంగాంగము లొకటొకటీ అది లేనిదే నిలువలేక తత్తర పడుతున్నవి. అలాగని పడిపోవునట్లు లేదు. చెదలు తిని మట్టిగా చేసిననూ నిలిచున్న వెదురు తడక వలె తన భావమును తాను మోసుకొని నిలచినట్లున్నది. ఆ ’ ఏదో ’ ఒక చైతన్యమందామా అంటే అది ఎద గూడు పక్క ఒకటై కలసినట్లుంది. ఘనమగుచున్నది. దాని కవచము జారి పడుతున్నది. కవచము జారగా అది సజాతీయమైన ఇంకొక పిండముతో చేరినట్లయినది. స్త్రీ పురుషులు ఒకరినొకరు దృఢముగా ఆలింగనము చేసుకొన్నట్లయింది. ఇంకేమీ స్మరణకు లేదు. విస్మరణమా ? అదీ కాదు. అహంభావపు కొన ఒకటి , అస్మితా భావపు కొన యొకటి. ఆ రెండూ సూక్ష్మములు. సూక్ష్మాత్ సూక్ష్మములు. అవి రెండూ కలసి పోయినాయి. 

         మంత్రము ఇంకా పలుకుతున్నది. ఉత్తర క్షణములోనే చిన్న పిండము మరలా విడివడి ప్రత్యేకమైనది. కవచము ఎక్కడినుండో వచ్చి మరలా దానిని కప్పినది. ఇప్పుడు కవచము ముందటి వలె తమోమయమై లేదు. తేజోమయమైనట్టుంది. అదంతా మరలా హృదయము దగ్గరకు వచ్చి చేరుతున్నది. అక్కడ తేజో మండలమయినది. దానిలో ఏమేమో చేరినట్లుంది. రాను రానూ చిన్నదవుతున్నది. అది నేరుగా మధ్యలోనున్న దారిలో వెళ్ళ వలెను అంటుంది. ఎవరో , ’ అక్కడికి పోవచ్చులే , ఇంకా కాలముంది ’ అంటున్నారు. 

" నేను అక్కడికే పోవలెను "


 " లేదు , నువ్వు మమ్మల్ని మించుటకు లేదు. మేము లాగిన వైపుకు నువ్వు తిరగవలెను. "

" అయితే నువ్వెవరు ? "

         " మేము నీ విద్యా కర్మ వాసనలము. నువ్వు యెత్తినది ఇదొకటే జన్మము కాదు. నీకెన్నో జన్మలయినాయి. ఆయా జన్మలలో నువ్వు సంపాదించిన విద్యా, నువ్వు ఆచరించిన కర్మ, నువ్వు సంగ్రహించిన వాసనలు-ఇవే మేము. "

" అయితే నేనెవరు ? "

         " అది మేము చూడలేము. పితృ లోకములో అది తెలియును. అప్పుడు నీకు నామ  రూపాత్మకమైన దేహము వచ్చును. ఋషులు నువ్వు చేయు కర్మకు కావలసిన జ్ఞానమును ఇస్తారు. నీ భోగమునకు అవసరమగు ఐశ్వర్యమును దేవతలు ఇస్తారు. నువ్వూ ఒక ప్రాణివై జన్మిస్తావు. " 

" అలాగయితే నాదంటూ ఏమీ లేదా ? "

" ఉపచరితముగా ( ఉపాసించబడినది )  కావలసినంత ఉన్నది. వాస్తవముగా ఏమీ లేదు. " 

" మీరు, అంటే విద్యా కర్మ వాసనలు నావి కావా  ? "

" మేము కాలము వచ్చినపుడు వదలి వెళ్ళెదము. "

"వదలి వెళ్ళుట అంటేనేమి ?" 

" మేము జ్ఞానములో పరిసమాప్త మయ్యెదము."

" అది ఎప్పుడు ? "

" భగవానులంతటి వారి దయ కలిగినపుడు"

        అంతవరకూ ఆ చైతన్య కణము ఏదో వాయు సాగరములో తేలుతున్నది, అప్పుడు హఠాత్తుగా కిందకు పట్టి లాగినట్లాయెను. కణము పెద్దదయింది. దానికి అంగాంగములు పుట్టినవి. మొదటి వలె జనక మహారాజు అయినది. రథములో కూర్చున్నాడు. తన విద్యా కర్మ వాసనలు ఒక్కటి కూడా వెంట లేవు. 

         రాజా జనకుడు రథములో వీధిలో వెళుచున్నాడు. రథాశ్వములు వేగముగా ముందుకు దూకుతున్నవి. తానూ , తన రథమూ నీటి లోపల, నీటి మధ్యలో వెళుతున్ననూ , తనకు ఊపిరాడుటకు ఆ నీరు అడ్డంకి కాలేదు. రథము నీటిని దాటి వస్తున్నది.  ఇంకెక్కడికి లాగుకొని వెళ్ళెడిదో ? జనకుడు ఎగురుతాడు. మెలకువ అవుతుంది , మంత్రము పలుకుతున్నది. 

" సరే , మంత్రము నూటెనిమిది సార్లు అయినది, రాజా వారు లేవవచ్చును. "

         రాజు కనులు తెరచినాడు. తాను కళ్ళు మూసుకున్నపుడు చుట్టూ ఏమేమి ఉండినదో , అదంతా అక్కడక్కడే ఉంది. భగవానులు తన పక్కన అదే దర్భాసనము పైన అక్కడే అదే దృఢాసనములో కూర్చున్నారు. తానూ పద్మాసనములో తొడల పైన చేతులుంచుకొని కూర్చున్నాడు. అయితే ఒక వ్యత్యాసమైనది. 

     నీరు ఇంకిపోయి , బలిసిన టెంకాయలో కొబ్బెర గిటక గా మారి , పైనున్న పెంకు అనెడి కవచమును వదలినది అన్నది తెలియునట్లే , తాను ఈ దేహము కాదు , వేరే అన్న అవగాహన వచ్చినది. 

         భగవానులు ఏమీ తెలియనట్లు , ’ ఏమైనది ? ’ అంటారు. రాజు జరిగినదంతా చెపుతాడు. అలాగ చెప్పునపుడూ , తాను వేరే , చెపుతున్నవారు ఇంకెవరో అనిపించుతున్నది. భగవానులు అంతా విని, ’ ఇదంతా ఏమో అర్థమయినదా ? ’ అంత్టారు. 

        రాజు నమ్రుడై చిన్న గొంతుతో , ’ లేదు ’ అంటాడు. " ఒక జన్మాంతరమగుట . ఈ జీవుడు ఈ దేహమును వదలి వెళ్ళునపుడు, కరణాదులలో నున్న చైతన్యమునంతా  ప్రాణ దేవుడు లాగేసుకుంటాడు. ఆ ప్రాణుడు మనసుతో కలిసిపోతాడు. విద్యా కర్మ వాసనలు వెంట వచ్చి హృదయము నుండీ నేరుగా బ్రహ్మ రంధ్రమునకు వెళ్ళు మార్గమును వదలి ఇంకెక్కడి నుండో జీవమును మోసుకొని పోతాడు. అది ఈ దేహమును వదలుట. దానిని చూడండి అలాగే జీవుడు సుషుప్తావస్థకు వస్తాడు. అప్పుడు తనకు కావలసినాదంతా సృష్ఠించుకొని విహారము చేసి జాగృత్తుకు వస్తాడు. ఇదంతా మీరు చూచినారు. చూచిన తరువాత అడుగ వలెను. విన్న దానిని నెమరువేసుకుంటూ ఉండవలెను. చివరికి అదే తాను కావలెను. మంచిది , ఈనాటికి ఇంత చాలు. ఇంకా రెండు నెలలు ఉంటారు కదా , అప్పుడు అడుగుట మొదలైనవన్నీ కానివ్వండి, ఇక లేద్దాము" అని మొదటివలె మంత్ర జలమును ప్రోక్షించినారు. చెరువు కట్ట తెగినపుడు నీరు బయటికి దూకునట్లు , మొదటి స్థితిగతులన్నీ వచ్చి నిండి , జరిగినదంతా విస్మృతి అయినట్లాయెను.   

76. " మహాదర్శనము " -- డెబ్భై ఆరవ భాగము-- సంభావనలు


76. డెబ్భై ఆరవ భాగము--  సంభావనలు

         మరుసటి దినము అపరాహ్ణపు దిగుపొద్దులో రాజసభ ,  రాజ భవనములో సమావేశమైనది. సర్వజ్ఞ కానుకను ఏమి చేయవలె ననునది ఆ దినపు పర్యాలోచన యొక్క విషయము. 

         " భగవానులకు వచ్చినది కాబట్టి , అదంతా వారికే ఇవ్వవలెను యని ఒక మతము. " " భగవానులు అప్పుడే దానిని మీకు తోచినట్లు వినియోగించండి అని చెప్పినారు. కాబట్టి మనమంతా కూర్చొని మనకు తోచిన రీతిలో వినియోగించవలెను. " అని ఇంకొక మతము. ఇద్దరికీ ఆమోదమగునట్లు చర్చ జరిగి  చివరికి , " దానిలో సగమును గురుకులమునకు కానుకగా అర్పించెదము. మిగిలినది బయటినుండీ వచ్చిన , మరియూ ఆస్థానపు విద్వాంసులకు యథోచితముగా పంచెదము " అని నిర్ణయించినారు. 

          ఇదంతా ముగుస్తుండగా మేస్త్రీ వచ్చి కనపడినాడు. " మహాస్వామి వారి ఆజ్ఞ అయినట్లు , సవత్సములైన సహస్ర గోవులను సర్వ సౌకర్యములతో ఉంచుకొనుటకు అనుకూల మగునట్లు ఆశ్రమములో  ఏర్పాట్లు చేసినాము. " అని నివేదించినాడు. 

" ఎంతమంది మనుషులను ఇచ్చినారు ? "

" గో సేవకనే నలభై కుటుంబములు నిర్ణయమైనవి. వారందరికీ నాయకుడై , సకుటుంబుడైన ఇంకొకడు. మొత్తం నలభై ఒక్క కుటుంబములు. "

" వారందరూ సుఖముగా ఉండునట్లు ఇళ్ళూ వాకిళ్ళూ కట్టించి ఇచ్చినారా ? "

" అయినది , మహాస్వామీ " 

" పశువులకు పాకలు,  కోష్టములు అయినాయా ? "

" అనుమతి అయితే వివరముల నన్నిటినీ ఇచ్చెదను. " 

" వివరములు వద్దు. మేము ఆశ్రమమునకు గోదానము చేసినందుకు ఆశ్రమవాసులకు దాని వలన ఇబ్బంది కాకూడదు , అంతే! "

         " సరే  , గోవులకు , దూడలకు , ఎడ్లు , ఆబోతులకూ అంతా వ్యవస్థ అయినది. ధాన్యాలు , గడ్డి , మేత, దాణాలు నింపి పెట్టుకొనుటకు గోదాములు , గాదెలూ అయినాయి. గోవులు మేసి వచ్చుటకు గోవనములను విభజించినాము. వాటికీ , గొల్లలకూ ఆహారమును , ధాన్యములనూ పెంచుటకు కావలసినంత భూమి కేటాయించినాము. "

         " సరే , సర్వ విధములా ఈ దానము సుఖకరముగా ఉండవలెను. భగవానులు అక్కడికి వచ్చువరకూ మనవైపు అధికారి యొకరు ఉండనీ. వారు వచ్చిన తరువాత , వారికి సర్వమునూ అప్పజెప్పి వారి అనుమతి పొంది రావచ్చును. "

" ఆజ్ఞ "

" భగవానులు ఆశ్రమమునకు ఎప్పుడు దయచేస్తారంట ! "

" అదింకా స్పష్టముగా తెలియదు. "

" భగవతివారు వెళతారేమో చూడండి "

’ లేదు , మహాస్వామీ , వారు ఇక్కడికే వస్తున్నారు. వెంట రాజపురోహితులు కుడా వచ్చినట్లుంది. 

భగవతికీ , అశ్వలులకు దారి ఇచ్చి మేస్త్రీ అటు జరిగినాడు. రాజు లేచి వారిని ఆహ్వానించినాడు. 

        రాజే మొదట మాట్లాడినాడు : " జ్ఞాన సత్రము ఆరంభమయిన దినము నుండీ తమరిద్దరిలో ఎవరినీ ప్రత్యేకముగా చూడలేదు , కోపము లేదు కదా ? "

        అశ్వలుడు అన్నాడు: " సన్నిధానము జ్ఞాన సత్రము జరిపించినది మా బుద్ధి పరివర్తన యగుటకు కారణమైనది. మేమంతా నోటితో ఏమేమో చెప్పుచుంటిమి. దానికి ప్రత్యేకమైన అర్థమున్నదని మా మనసుకు తోచి యుండలేదు. ఇప్పుడంతా వేరే అయిపోయినది. " 

          గార్గి అందుకున్నది , " మేమంతా బ్రహ్మవాదులము. అయినా అదేమయినదో ఏమో గానీ , బ్రహ్మము పరిపూర్ణము అని నోటితో చెప్పుచూ చెప్పుచూ కేవలము బహిర్ముఖులముగనే ఉంటున్నాము. మేము సరే , ఉద్ధాలక అరుణులు , ఉషస్తులు , కహోళులు , వీరందరూ ప్రఖ్యాతులైనవారు. వీరందరూ శరణాగతి అయినారు అంటే ఆ బ్రహ్మజ్ఞుని అంతస్తేమిటి ? ఎంతటిది ? ముఖ్యముగా మాకు ఏ జన్మలోదో పుణ్యము పరిపక్వమై ఈ జ్ఞాన సత్రములో భాగస్వాముల మైనాము. "

          రాజు అన్నాడు, " తామందరూ ఇలాగ పొగడుతున్నందు వలన , మాకు కూడా  ఈ జ్ఞాన సత్రము వలన కలిగిన లాభము చెప్పెదము. మేము మాకు కలిగిన స్వప్నముల విషయము చెప్పినాము కదా ? అక్కడ స్వయం దేవగురువులు అనుజ్ఞ ఇచ్చినందువల్లనే ఈ సర్వజ్ఞాభిషేకమును నిర్వహించినది. వారు , సర్వజ్ఞుడే గెలుచును అన్నారు. మనము దానిని ఇటు తిప్పి , గెలిచినవాడే సర్వజ్ఞుడు అన్నాము. ఆ దినము మీరు గంగా స్నానము సంగతి చెప్పిన దినము నుండీ భగవానులే సర్వజ్ఞ పీఠమును అధిరోహించే వారేమో యని యనిపించెడిది. ఇప్పుడు అది నిర్వివాదమై ధృవీకరించబడినది. "

          " నేనే కదా మొదట లేచి ప్రశ్నను అడిగినవాడిని , అప్పుడేమయిందో తెలుసా ? అక్కడ కూర్చున్నది మేము చూచిన దేవరాతుల కొడుకైన యాజ్ఞవల్క్యుడు కాదు. ఏదో ఒక తేజోరాశి అనిపించి మాట్లాడుటకే భయమైనది. ఇంటికి వచ్చి స్నానము చేసి మరలా అగ్నిహోత్రమును చేయువరకూ ప్రకృతస్థుడ నగుటకు కాలేదు. "

" మీరు చెప్పే దాంట్లో ఆవగింజంత కూడా అబద్ధము లేదు. అయినా నా మనసు విదగ్ధులు దగ్ధమైనపుడు కలచివేసింది. " 

         " తమరన్నది నిజము. మాకూ అటులే అయినది. ఎంతైనా గురువులు కదా ? మేము వారి పాద మూలలో కూర్చొని నేర్చుకోలేదా ? అయిపోయింది. ఇక చేసేదేముంది ? "

        " సన్నిధానము వేయి చెప్పండి , నాకైన దుఃఖములో నేను నేరుగా భగవానుల వద్దకు వెళ్ళి ఏడ్చేసినాను. విదగ్ధులకు ఉత్తమ గతి దొరకవలెను అని ప్రార్థించినాను. వారు కూడా పెద్దమనసుతో అటులే అగును అన్నారు. " అని వెనుకటి దినము భగవానులు చెప్పినదంతా చెప్పినది. 

అశ్వలుడన్నాడు. " అట్లయితే అది దేవతా కోపము వలన అయినది. నేను భగవానులే కోపించి అటుల చేసిరేమో అనుకున్నాను. " 

        గార్గి అన్నది :" ఏమో , అయినది అయినది. ఇప్పుడు వారి గురుకులమూ , వారి కుటుంబమూ వారు లేరని వ్యథ పడకుండా చేయుట మహాస్వామి వారి చేతిలో ఉంది "

       రాజు , వ్యథతో సంకోచించిన మనసుతో అన్నారు. " ఆ విషయములో మేమూ తమరి వలెనే చాలా వ్యథ చెందినాము. అందువలన తాము చెప్పినట్లే చేయుటకు సిద్ధముగా ఉన్నాము. " 

        " తమరు వారికి ఏమేమో ఇవ్వవలె ననుకున్నారు. ఈ దినము సర్వజ్ఞ కానుకలో సగమును విద్వాంసులకు పంచెదము అన్నారు. అదీ ఇదీ అంతా చేర్చి వారికోసమై ఒక లక్ష అట్టిపెట్టండి. దానిలో వారి కుటుంబమునకు సగము , గురుకులానికి సగము ఇప్పించండి. "

       " అటులనే. ఇంకొక సమాచారము విన్నారా ? కురు పాంచాల దేశపు విద్వత్సమూహమంతా నిన్ననే ఇక్కడినుండీ వెళ్ళిపోయినారంట!  వారిలో ఒక్కరు కూడా లేరు. "

        " పాపము , కొమ్ములు పోగొట్టుకున్న వృషభము వలెనే అయినవి వారి పాట్లు. ఏమి మహా విశేషము ? కాకపోతే , వారిలోని విద్వత్ప్రముఖులంతా కలిసి వచ్చి చెప్పి విదగ్ధులను ముందుకు తోసినారు పాపం. వారికి మాత్రమేమి తెలుసు ఇలాగవునని ! ఇట్లయిన తరువాత వారు యే ముఖముతో యింకా ఇక్కడే ఉంటారు ? ఏమైనా సరే , ఎవరెవరు వచ్చియున్నారు అన్నది తెలుసు. సన్నిధానమునకు సమ్మతమైతే , వారందరికీ ఒకటికి రెండుగా ఇవ్వవలెను. " 

" చాలా మంచి సలహా. అదీకాక, కురుపాంచాల విద్వాంసు లంతటి విద్వాంసులు ఈ పృథ్విలో ఎక్కడ వెదకిననూ దొరకరు. కాబట్టి వారికై ఇలాగ చేయుట సర్వథా సాధువైనది. "

మహారాజులే అన్నారు : " ఇదే కాక ,  వాదములో భాగులైన వారందరికీ విశేషమైన సంభావనలు ఇవ్వవలెననీ నిర్ణయించు కున్నాను. " 

     " మేమిద్దరం వాదములో భాగులైన వారము. కాబట్టి మేము మాట్లాడ కూడదు. అయినా తమరి యోచన సాధువైనది. అంత మాత్రమే చెప్పగలము. "

     " సరే, తమరు ఒప్పుకున్నందుకు నాకు చాలా సంతోషమైనది. సర్వజ్ఞ కానుకగా వచ్చినదానితో పాటు మరికొంత చేర్చి వితరణ చేసెదము. " 

" అటులనే "

        గార్గి, " నాకొక సందేహమున్నది. చెప్పవచ్చును అంటే చెప్పేస్తాను. అయితే నానుండీ సమాధానము చెప్పించుట మాత్రము కారాదు. సన్నిధానము నాయంత స్పష్టము గానే తమ మనసులో నున్నది చెప్పవలెను " 

" అటులనే , అనుజ్ఞ ఇవ్వండి " 

     " వెనుక ఒకసారి అనుజ్ఞ ఇచ్చియుంటిరి. : భగవానులకు తమరిని శిష్యులుగా పరిగ్రహించవలెను అని అడిగినపుడు ’ గురు-శిష్య పరీక్షయైన తరువాత ఆ మాట ’ అన్నారని. ఇప్పుడు ఈ జ్ఞాన సత్రము జరిపినది ఆ గురు పరీక్షకేనా ? "

         మహారాజు నవ్వినాడు:  " తమరు అనుకున్నది చాలా సరిగ్గా ఉంది.  విద్వత్ప్రియులని ప్రఖ్యాతమైన, దానమునకు ప్రసిద్ధమైన ,  వంశములో పుట్టినవారు ఎలాగ చేయవలెనో అలాగ చేసినాను.   అన్నిటికన్నా మిన్నగా దైవ సహాయము కలిసి వచ్చింది. విదగ్ధుల మరణము ఒక్కటీ తప్ప , ఇక అన్నివిధములా జ్ఞాన సత్రము ససూత్రముగా , యథోచితముగా , జరిగినది యని నా నమ్మకము. అయితే , చూచినవారు మీరు  , ఈ విషయమును చెప్పవలెను. " 

         అశ్వలుడన్నాడు : " వెనుకటి మహారాజు ఇఛ్చ కూడా ఈడేరింది.  మన విదేహ రాజ్యములో కురు పాంచాలుల విద్వాంసులను మించగల విద్వాంసుడు పుట్టవలెనని వారి కల. వారుగనక ఈ జ్ఞాన సత్రములో ఉండి ఈ సర్వజ్ఞాభిషేకమును చూచి ఉంటే ఎంత సంతోషించెడి వారో ? అంతేనా ? సన్నిధానము ఆ కిరీటమును భగవానుల తలపైన పెట్టినపుడు నాకైతే ఒక ఘడియ వెనుకటి మహారాజులు తమలో ఆవాహన అయినట్లే కనబడు చుండినది. "  

      " భగవానులు సామాన్యులు కారు. వారి దగ్గర కూర్చుంటే ఏదో దివ్య తేజస్సు నొకదానిని పట్టి పురుష విగ్రహమై అచ్చుపోసినట్టుండినది. అబ్బా ! ఆ దృశ్యమును గుర్తు చేసుకుంటే ఇప్పుడు కూడా ఒళ్ళు ఝుమ్మంటుంది. "     

        అశ్వలుడు మరలా అన్నాడు: " వెనుక బుడిలులు అనేవారు, అతడు తపోలోకము నుండీ లోకోద్ధారమునకై వచ్చిన వాడయ్యా ! ముందు ముందు అతని వలన ఏమేమి కావలసి యున్నదో ! చూస్తూ ఉండండి’ అనేవారు. అంతేకాక , అతడు అతి పిత , అతి పితామహుడయ్యా , అనేవారు. అయితే మేమెవ్వరూ ఆ బాల యాజ్ఞవల్క్యుడు  ఇలాగ భగవానులై సర్వజ్ఞులవుతారని అనుకొని యుండ లేదు. ఇప్పుడు ఆ మహా పురుషుని ఆశ్రమము గంగా సాగరము వలె యాత్రాభూమి యైపోయినది "

        " ఇది దేశ విదేశముల అధిపతుల సమక్షములో , విద్వాంసుల సమ్ముఖములో జరిగినది ఇంకా మంచిదైంది. సరే , గురు పరీక్ష అయినది. ఇప్పుడు సన్నిధానము చేయవలె ననుకున్నది యేమి ? "

" యేమి ఏమిటి ? భగవతి ఏమి చెప్పితే అదే. ! "

        " మేమెంతయిననూ వచ్చిన నగకు  అలంకారము చేయువారము మాత్రమే! నగలను చేయించు వారము కాదు. సన్నిధానము యేమేమి చేయవలెనని ఉన్నదీ చెప్పితే , దాన్నే పట్టుకొని , ఇలాగ చేయండి , ఇలాగ చేయవద్దండి అని చెప్పేవారము. కాబట్టి , మొదట అక్కడి నుండీ అనుజ్ఞ కావలెను. " 

        " మేమూ దానినే ఆలోచిస్తున్నాము. ఇంకా దారి తోచలేదు. భగవానులను ఇంకా కొన్ని దినములు ఇక్కడే నిలిపి ఉంచుకొని, ఈ దేశ విదేశముల అధిపతుల సన్నిధానములో వారి సేవకు ఈ విదేహ రాజ్యమునూ , మమ్ములనూ అర్పించు కొనుటయని ఒక మనసు. అయితే , బ్రహ్మవిద్య ఏమైననూ గురు శిష్యులకు మాత్రమే సంబంధించినది. కాబట్టి భగవానులను ఏకాంతములో చూచి వారినుండీ ఉపదేశము పొందవలెను అని ఇంకొక మనసు. "

         గార్గి తలాడించినది . " మొదటిగా తమరు ఈ రాష్ట్రాధిపతుల సమ్ముఖములో రాజ్య దానము చేయుట మంచిది. అయితే , దానికి భగవానులు ఒప్పుకుంటారనే నమ్మకము నాకు లేదు. రాజ్యము తమరిది కాదు , అది తమ కుల ధనము. ఉన్నంత వరకూ రాజ్యాధికారమును సన్నిధానము అనుభవించవచ్చునే కానీ , తమరు దానము చేయవచ్చునని నాకు అనిపించుట లేదు. నా బుద్ధికి తోచిన విషయము భగవానుల బుద్ధికి తోచదను మాటే లేదు. కాబట్టి అది సాధ్యము కాదు. రెండవది సన్నిధానము క్షత్రియులు. బ్రాహ్మణులైతే అన్నిటినీ త్యాగము చేసి వైరాగ్యముతో వెళ్ళి పోవచ్చును. క్షత్రియుడు అటుల చేయుటకు లేదు. అతడు బహిర్వ్యాపారములో ధర్మమును వదలి పోవుటకు లేదు. ఏదున్ననూ , అభ్యంతర వ్యవహారములో బ్రహ్మారాధనను పెట్టుకోవచ్చునే గానీ బాహ్యాభ్యంతరములు రెండింటిలోనూ బ్రాహ్మణుని వలె బ్రహ్మ పరాయణుడగుటకు లేదు. చివరిగా ఉద్ధారమును ఆపేక్షించు సన్నిధానము భగవానులను వెదకికొని వెళ్ళునదే సరి. కాబట్టి , ఈ సారి తమరు దేశాధిపతుల నందరినీ పిలుచుకొని వెళ్ళి భగవానులను ఆశ్రమమునకు వదలి రండి. శుభమైన తిథి వారములను చూచుకొని , శాస్త్రములో చెప్పిన ప్రకారముగా , తమరు మిత్ర సమేతులై వారిని ఆశ్రయించండి. వారు తమరిని తప్పకుండా అనుగ్రహిస్తారు. "   "   

        " రాజు అశ్వలుల ముఖమును చూచినారు. అశ్వలుడు, " భగవతి అనుజ్ఞ ఇచ్చినది సరియని తోచుచున్నది. శాస్త్ర దృష్టితో అలాగ చేయుట శ్రేయస్కరము. బ్రహ్మబోధనమును పొందుట అనేది ఆత్మోద్ధారపు విషయము. రాజ్యపు విషయములో మాత్రము ఇది ఖచ్చితముగా స్వంత విషయము కాదు. దీనిని దానము చేయుటకు లేదు. ఈ ధర్మ బ్రహ్మల రెండింటిలోనూ భగవతి యొక్క అభిమతము సాధువైనది. " 

         రాజు భగవతి అభిప్రాయమును సంపూర్ణముగా ఆమోదించినారు. ఇంక రెండు దినముల తరువాత తిథి వార నక్షత్రములు బాగున్నవనీ , ఆ దినము ప్రయాణము చేసి వెళ్ళుట శుభమనీ నిర్ణయించబడినది. 

       మరుదినము భూరి భోజనము , విద్వత్సంభావనా వినియోగము , దాని మరుసటి దినము ప్రస్థానము అని నిర్ణయమైనది. 

       రాజభవనపు రాజపురుషుడొకడు సపరివారుడై వెళ్ళి భగవానులనూ , మిగిలిన విద్వాంసులనూ చూచి ఏమేమి చెప్పవలెనో అంతటినీ చెప్పి వచ్చినారు.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                        

75. " మహాదర్శనము " --డెబ్భై ఐదవ భాగము--రాజ సభలో


75. డెబ్భై ఐదవ భాగము -- రాజ సభలో


         మరుదినము ప్రాతఃకాలములో చేయవలసిన కార్యములన్నీ చేసి , భగవానులు , తాము వెనుక ఉంటుండిన గుడిసెకు చేరినారు. కాత్యాయని అల్పాహారమునూ , పాలనూ తీసుకొని అక్కడికి వెళ్ళింది. 

          భగవానులు ఆమె ఇచ్చినవి తీసుకొని, " కాత్యాయనీ , ఈ దినము ఇంకేమీ అవసరము లేదు, కాబట్టి ఏకాంతముగా ఉండాలనుకుంటున్నాను. " అన్నారు. కాత్యాయని , " దేవా , అది తమరి ఇఛ్చ , అయితే , తమరే చెప్పునట్లు పరేఛ్చా ప్రారబ్ధమేమున్నదో ఎవరికి తెలుసు ? " అన్నది. 

" అట్లయితే , ఈ దినము మేము చేయవలసినది ఏమైనా ఉందా ? " 

" నాకేమి తెలుసు ? "

" మరి , అలాగంటివి ? "

          " తమరు అనే మాట గుర్తొచ్చింది , చెప్పినాను. ఈ దినము యే గార్గి వస్తుందో, అథవా రాజే దర్శనార్థియై వస్తాడో, అథవా తమరి తండ్రిగారే  దయ చేస్తారో, ఎవరికి తెలుసు ? చూడగా , తమరి తండ్రిగారు ఏదో ఆలోచనలో ఉన్నట్టుంది. కానీ నేను వారిని ఏమిటా ఆలోచన అని ఎలా అడగగలను ? "

         " సరే , అయ్యేది కానీలే , నేను మాత్రము ఏకాంతముగా ఉండవలె ననుకున్నాను. కానీ నువ్వు చెప్పినది నిజము. శరీరధారి యైనవాడు సుఖ దుఃఖములను తప్పించుకోలేడు. మన ఇఛ్చ ప్రకారము అయితే సుఖము, ఇంకోలాగ అయితే దుఃఖము. అంతే కదా ? "

        " తమరికి సుఖ దుఃఖాలు కూడా ఉంటాయా ? నాటకము లాడు వారి వలె తమరు కూడా ఇతరుల కోసము సుఖ దుఃఖములను చూపిస్తారు , అంతే! "

          " ఛీ , పాడు దానా ! కనిపెట్టినావు. కాత్యాయనీ , నిజము. అయితే దీనిని గుట్టుగా ఉంచు. గుర్తుంచుకో. మాకు సుఖదుఃఖములు లేకున్ననూ సుఖముగా ఉన్న వాడిని సూచి సుఖించవలెను , దుఃఖముగా ఉన్న వాడిని చూచి దుఃఖించవలెను. లేకుంటే, ఈ క్షర పురుషుడు, ఈ దేహము శాపము నిచ్చును. " 

" అట్లేమి ? "

         వీరు ఇలాగ మాట్లాడు చుండగనే ఆలంబిని, ’ ఏం చేస్తున్నావయ్యా ? "  అని వచ్చింది. కాత్యాయని ఆమెను చూచి లేచి నిలబడింది. అలాగ లేచి నిలుచున్న కోడలిని చూచి, ’ నువ్వు వెళ్ళిపోవద్దమ్మా , ఈ     ఎద్దును కట్టడానికి నువ్వే సరియైన పగ్గము! " అని కొడుకు వైపుకు తిరిగింది. కొడుకు కూడా లేచి నిలుచున్నాడు. " ఏమిటమ్మా ? ’ అని వినయముతో అడిగినాడు. 

          తల్లి అన్నది : " నువ్వు సర్వజ్ఞుడవు! నీకు తెలియనివీ ఉంటాయా ? అయినా చెపుతాను. మీ తండ్రిగారు కబురు పంపినారు. రాజ పురుషులు నిన్ను రాజభవనానికి పిలుచుకొని వెళ్ళుటకు వస్తున్నారంట ! " 

          కొడుకు నవ్వినాడు , " చూడమ్మా, ఈ దినము ఏకాంతములో ఉండవలెనని నేను సంకల్పించుకొని ఇక్కడికి వచ్చినాను. అదే సంగతి ఈమెకూ చెప్పుచున్నాను. చివరికి నువ్వొచ్చినావు. రాజ భవనమునకు ఇలాగ వెళ్ళకూడదేమో ? "

          " చూడయ్యా , నిన్ననే సర్వజ్ఞాభిషేకమును చేయించుకున్నావు. కాబట్టి , ఆ కిరీటమునూ , అప్పుడు ఇచ్చిన వస్త్రాభరణములనూ ధరించి , కట్టుకొని, పెట్టుకొని వెళితే చందము. నాకైతే , నిజంగా చెపుతాను , నిన్ను ఆ వేషములో ఎంత చూసిననూ తృప్తి లేదు. " 

          " అట్లేమి ? నీ తృప్తికై ఏమి కావాలన్నా చేస్తాను , లేవమ్మా ! నువ్వు సంతోష పడుతానంటే ఈ నగరములో ఉండే వరకూ ఆ బట్టలనే కట్టుకొని తిరిగితే సరి. దానికేమి ? కాత్యాయినీ , వెళ్ళి అవన్నీ తీసుకొనిరా. " 

కాత్యాయని సరేనని వెళ్ళింది.

ఆలంబిని  " ఇంకొకటి , " అంది

" చెప్పు "

" మీ తండ్రిగారు కూడా నీతో రాజ సభకు రావలె ననుకొనుచున్నారు. పిలుచుకొని వెళతావా ? "

         "ఇదింకా బాగుంది , ఇది , మీరు తల్లిదండ్రులు ఇచ్చిన దేహము. దీనికి కలుగు వైభవమంతా మీవలన. కాబట్టి , వారొక్కరే కాదు , నువ్వూ రా. అయితే ఒక మాట. మీరిద్దరూ పల్లకిలో ఒకే వైపు కూర్చోండి , నేను మీ ఎదురుగా కూర్చుంటాను. " 

          అంతలోపల కాత్యాయని సర్వజ్ఞ వస్త్రభూషణములను తెచ్చిచ్చి , " రాజ పురుషుడు వచ్చినట్లుంది " అన్నది.  భగవానులు వస్త్ర భూషణములను ధరించు వేళకు స్వయం దేవరాతుడే రాజపురుషుని పిలుచుకొచ్చినాడు. 

         రాజ పురుషుడు వచ్చి సాష్టాంగ నమస్కారము చేసి , మహారాజులు ఇతర దేశాధిపతులతోనూ , విద్వాంసులతోనూ సర్వజ్ఞులను ప్రతీక్షించుచున్నారు. రెండు పల్లకీలు వస్తున్నాయి. " అని విన్నవించినాడు. 

" సరే , అమ్మా , నువ్వూ నీ కోడళ్ళూ సిద్ధము కండి. కాత్యాయనీ , కణ్వుడినీ , మాధ్యందినుడినీ సిద్ధము కమ్మని చెప్పు. 

          మహారాజూ , ఇతర దేశాధిపతులూ సవిద్వాంసులై సర్వజ్ఞులను గజద్వారములో ఎదుర్కొని , పిలుచుకొని వెళ్ళినారు. సర్వజ్ఞులకు సలుపవలసిన మర్యాదలన్నీ సలిపి , అందరినీ స్వస్థానములలో కూర్చోబెట్టి , మహారాజు చేతులు జోడించి , వినీతుడై, " ఏదైనా అనుజ్ఞ కావలెను. మేమంతా విని కృతార్థులగుటకు వేచియున్నాము. " అని తెలియజేసినాడు. 

          భగవానులు నవ్వుచూ అన్నారు , " ఈ దినము మేము వృత్తిని తిరోధానము చేసి ( మరుగు పరచి ) ఏకాంతములో ఉండవలెనని యున్నాము. మహారాజుల ఆజ్ఞను మీరలేక ఇక్కడికి వచ్చినాము. తమందరి దర్శనమై మనసు ఇంకా సంతుష్టమైనది. కాబట్టి , తమరు ఏదైనా అడగండి , దానికి ఉత్తరముగా మాకు తెలిసినది చెప్పెదము " 
          భగవానులు జలతారు వస్త్రములను కట్టుకున్నారు. జలతారు ఉత్తరీయమును తమ కృష్ణాజినపు ఉత్తరీయము పైన కప్పుకున్నారు. తలపైన రత్నమయమైన పాండిత్య కిరీటము శోభిస్తున్నది. ముంజేతికి రత్నమయమైన కడియముంది. వేళ్ళకు మూడు మూడు అనర్ఘ్యమైన( వెలలేని ) ఉంగరములు. జలతారు వస్త్రము పైన రత్నమయమైన శృంఖల. కాలికి రత్నమయమైన పెండేరము. పాదములకు రత్నమయమైన పాదుకలు. చూడగా , ఆ రత్నముల కాంతితో వారి ముఖము దేదీప్యమానమైనట్లుంది. అయితే , నిజంగా చూస్తే , వారి తేజస్సు వలన ఆ సర్వమూ వ్యాప్యమైనట్లుది. వేష భూషణములకు కొత్త కాంతి వచ్చినట్లుంది. అందరికీ ఆశ్చర్యమేమంటే , మహానది మహాపూరములో ( ప్రవాహములో ) వచ్చి సముద్రమును చేరిననూ, సముద్రము తనపాటికి తాను ఉండునట్లు ,  సర్వజ్ఞాభిషేకము భగవానులలో లేశమైనా వ్యత్యాసము కలిగించలేదు. 

    అందరూ గార్గిని ఏమైనా అడగవలెనని సూచించినారు. ఆమె వినయముతో , " మా ఆటోపమంతా ముగిసింది. ఇంకేమున్ననూ వినుట , అంతే! మన మహారాజులు ఇతరులవలె కాదు. వేదోపనిషత్తులను సాంగముగా తెలిసినవారు. వారు అడుగుటా , భగవానులు చెప్పుటా బాగుండును. "

సర్వానుమతితో మహారాజులే లేచినారు. అన్నారు: " భగవానులు ప్రసన్నులై మా ప్రశ్నకు ఉత్తరము చెప్పవలెను. మనుష్యుడు యే జ్యోతి వలన తన కార్యములను చేయును ? "

" ప్రశ్న బాగున్నది. మనుష్యుడు యే జ్యోతి వలన తన కార్యములను చేయును ? రాజా , మనుష్యుడే యేమి , ప్రాణ జాతులన్నీ కూడా ఆదిత్యుడను తేజస్సు వలన ప్రచోదితమై తమ తమ కార్యము లన్నిటినీ చేయును. ఆదిత్యుడు తన కిరణముల ద్వారా సర్వమునూ సృజించును. సర్వమునూ స్థితిలో కాపాడును. సర్వమునూ లయము చేసి తనలో ఉపసంహారము చేసుకొనును. సుఖ నిద్రలో పరుండిన పురుషుని జాగృత్తుకు తెచ్చునది ఆతని కిరణము. ఆదిత్యుడు పురుషుని హృదయమును ప్రవేశించి , నానా విధములైన వ్యాపారములకు కారణమగును. ఒక రూపముతో తపనము చేసి , ఇంకొక రూపముతో వర్షమును వర్షించి , అన్న కారణమగు వాడూ వాడే! అన్నాదుడై దేహములో కూర్చొని అన్నిటినీ జీర్ణించువాడూ వాడే! కాబట్టి , సృష్టికి వచ్చిన భూతజాలమంతా తన సర్వకార్యములకూ ఆదిత్యునికి ఋణి. ఆదిత్యుడు లేకపోతే ఎవరికైనా ఏమి చేయుటకు అవుతుంది ? "

" రాత్రి పూట ఆదిత్యుడుండడు కదా ? "

" ఔను , ఆతడు అప్పుడు దేశాంతరములో ఉండును అని శృతి చెప్పుచున్నది. ఆతడు కంటికి కనబడకున్ననూ , ఆతని కిరణములు ఉండనే ఉంటాయి. లేకుంటే ఉక్కపోయుట ఎలా జరుగును ? కాబట్టి ఆదిత్యుడు ఎల్లపుడూ ఉండనే ఉంటాడు. అయినా ఆతడు రాత్రిపూట ఉండడని లోక ప్రసిద్ధి. అప్పుడు చంద్రుడు జ్యోతియై అందరిచేతా పనులు చేయించును. "

" చంద్రుడు లేనపుడు , జ్యోతి యేది ,భగవాన్ ? "

" చంద్రుడు ప్రతిరాత్రీ ఉండనే ఉంటాడు. శుక్ల పక్షములో సూర్యుడి నుండీ దూరముగా పోతూ పోతూ ఆతని కళాభివృద్ధియగును. కృష్ణ పక్షములో ఆతను తన కళలను ఒక్కొక్క దినమునకు ఒక్కొక్కటిగా దేవతలకు ఇచ్చి, ఇంకొక్క కళ మాత్రమే మిగిలి యున్నది అన్నపుడు సూర్యుడిని ప్రవేశించును. అతడి నుండీ తన కళలన్నీ పొంది , దినమున కొకటిగా పెంచుకుంటూ పోవును. అయినా అతడు లేని కాలము  ఉంది యని లోకప్రసిద్ది ఉంది కదా ? అప్పుడు , సూర్యుడూ చంద్రుడూ ఇద్దరూ లేనపుడు అగ్నియే జ్యోతి. " 

" వీరు ముగ్గురూ లేనపుడు జ్యోతి యేది , దేవా ? "

" వీరు ముగ్గురూ బాహ్య జ్యోతులు. వీరు ఎవరూ లేనపుడు పురుషుడు తన కరణములనే జ్యోతిగా చేసుకొనును. చీకటిలో వాణి ఇతనికి జ్యోతియగును. వాణి వినిపించిన చోటికి వెళ్ళును. వాణిని పట్టుకొని అన్ని వ్యాపారములూ చేయును. కాబట్టి అప్పుడు వాణియే జ్యోతి. "

" ఆ వాణికూడా లేనపుడో , దేవా ? "

" వాణి అనేది కరణము. కరణము జడమైనది. కరణమును జ్యోతియనునది ఔపచారమునకే. బ్రాహ్మణ దంపతుల కొడుకు బ్రహ్మ కర్మ చేయకున్ననూ వాడిని ఔపచారమునకు బ్రాహ్మణుడని పిలుచుట లేదా ? అలాగే ఇదీ ! జాగృత్తులో అయితే ఇది ( కరణము ) ఇంకొక జ్యోతి యొక్క ప్రకాశముతో వెలుగును. ఆ ఇంకొక ప్రకాశమున్ననూ , స్వప్నములో అయితే ఇది ( వాణి యనే కరణము ) వెలుగకుండా ఉండును . ఇలాగ జాగృత్తు లో కరణములను ప్రకాశింప జేయుచూ తాను లేనట్టున్న ఆ జ్యోతి స్వప్నములో అంతా తానేయగును. అప్పుడు అది కరణము కన్నా ప్రత్యేకమైనది అని బాగా తెలియును. ఆ జ్యోతి యేదో తెలుసా ? అదే  , మీలోనూ , నాలోనూ ఎల్లపుడూ ఉండు ఆత్మ జ్యోతి. అది కార్యమగు శరీరము , కరణమగు వాణి-ఈ రెండింటికన్నా విలక్షణమైనది. ప్రత్యేకమైనది. ఆ ఆత్మను తెలిసినవారు  అతడిని అసంగుడు అంటారు. నీటిలో వేసిన పాదరసము వేరుగా ఉండునట్లే , పాలలో వేసిన మరకతమణి తన ప్రభావము చేత పాలను పచ్చగా చేసిననూ , పాల వలన ప్రభావితము కాకుండా వేరుగా ఉండునట్లు , ఈ శరీరపు హృదయములో జ్యోతియై ఉన్ననూ ఈ శరీరము , కరణముల వలన ఏమీ ప్రభావితము కాకుండుట చేత అతడిని అసంగుడు అన్నారు. శృతి చెపుతుంది , ’ వాడిని చూడవలెనంటే స్వప్నములోనే! ’ అని. ఎందుకంటే , జాగృత్తులో బహిర్ముఖమై లేచి ఆడుతున్నట్టు ఆడుతున్న ఈ కరణముల వ్యాపారములో ఆత్ముడు మబ్బుల చాటున నున్న సూర్యుని వలె మాటుగా నుండును. సుషుప్తిలో అక్కడ అంతా తానై నిండి యుండిననూ , తెలివికి సాధనమైన బుద్ధి నిర్లిప్తముగా తూష్ణీభావముతో ఉండుట చేత , అప్పుడు అతడిని తెలుసనుట ఎలాగ ? తెలియలేదనుట ఎలాగ ? కాబట్టి , శృతి , అతడిని చూడవలెనంటే సంధి స్థానమైన స్వప్నమే సరి అన్నది. ఆ ఆత్ముడు , జ్యోతికే జ్యోతి. బయటి ఆదిత్యాదుల లోనూ ప్రకాశమై ఉండువాడు అతడే. ఇలాగ లోపలా  , బయటా అంతటా నిండియున్న ఆతడిని తెలిసినవాడే కృతార్థుడు. " 

రాజు ఇంకా ఏదో అడగబోయినాడు. భగవానులు దానిని నివారించి , " అప్పుడే మధ్యాహ్నమగుచున్నది. కర్మఠులకు కర్మచేయు ఆత్రము. ఈ దేశాధిపతులు , తీవ్రమగుచున్న వైశ్వానరుడి ఉపాసన సకాలములో నిర్వహించనీ. నేటికి ఇక్కడికే చాలిద్దాము " అన్నారు. 
 అందరూ గబగబా లేచినారు. రాజు చేతులు జోడించి  , ఇంకొక ఘడియ కూర్చోమని ప్రార్థించి , కోశాధికారిని పిలచి ఏమో అడిగినారు. అతడు నివేదిక చదివినట్లు ఏదో చెప్పిన తరువాత , రాజు మరలా భగవానులకు చేతులు జోడించి , " నిన్నటి దినము వచ్చిన కానుక పన్నెండు లక్షలకు దగ్గర దగ్గరగా ఉంది. అనుజ్ఞ అయితే దానిని ఆశ్రమమునకు పంపించెదను ? " అన్నారు. 

భగవానులు నవ్వినారు. " ఇప్పుడే  , నా నోటి నుండే వచ్చింది  ,’ లోపలా బయటా అంతటా నిండియున్న వాడు ఆత్మ ’ దానిని ఇంత త్వరగా ఎందుకు అబద్ధము చేయవలెను ? దీనిని ఇచ్చినవారు దేవతలు. వారు అందరి శరీరములలోనూ ఉన్నారు. కాబట్టి , ఇచ్చినవారికి తృప్తి కానీయని, వారికి దానిని ఈ విద్వాంసుల ద్వారా అర్పించండి. ఆశ్రమవాసులకు కావలెనన్నచో , వారికిచ్చుటకు దేవతలు సిద్ధముగా ఉన్నారు. ఆశ్రమవాసులు అందరూ కాకున్నా, కొందరైనా ఈ అంతటా నిండిన ఆత్మ దర్శనములో , విచారములో, మననములో , ఆసక్తి కలవారు కానీ" అని చెప్పి లేచినారు. 

అందరూ భగవానులను పంపించుటకు వాకిలి వరకూ వచ్చినారు. అక్కడ పల్లకీ నెక్కునపుడు భగవానులు రాజును పిలచి , " చూడండి , మనము పశువుకు గడ్డి వేసేది అది పాలిస్తున్నదనో , ఇచ్చుననో కదా ? అలాగే దూర ప్రయాణమునకు బయలు దేరినవాడే కదా శకటము మొదలైన సంభారముల నన్నిటినీ  సిద్ధము చేసుకొనును. తమరు ఇప్పుడు విద్వత్సమూహమును కట్టుకొని , వారినందరినీ పోషిస్తూ వారినుండీ వేదోపనిషత్తుల నన్నిటినీ సంగ్రహించు చున్నారు. ఇదెందుకు ? ఆలోచించండి , ఎందుకీ ఆడంబరములన్నీ  అనుదానిని గూర్చి చింతించండి " అని , అందరినీ వీడ్కొని వెడలివచ్చినారు.   

Monday, April 8, 2013

74. " మహాదర్శనము "--డెబ్భై నాలుగవ భాగము --ఖండము అఖండమయితే


74. డెబ్భై నాలుగవ భాగము--  ఖండము అఖండమయితే 


        గార్గి వెళ్ళిపోయిన తరువాత, ఆడవారంతా ఒక్కొక్కరుగా అక్కడనుండీ వెళ్ళిపోయినారు. కాత్యాయనికి భగవానులను సర్వజ్ఞులని అందరూ , లోకమే ఒప్పుకున్నదని సంతోషము. మైత్రేయికి , భగవానుల సర్వజ్ఞత్వము ప్రకటమై బహిరంగమగు దినము వచ్చినది కదా! యని సంతోషము. ఆలంబినికి తన కొడుకు లోకోత్తరుడైనాడని శరీరమంతా ఉబ్బిపోవునంతటి సంతోషము. ఆమెకయితే ఎన్నిసార్లు ఆనందముతో కనులు చెమర్చినాయో తెలియదు. 

         ఇద్దరు శిష్యులు వచ్చి  నమస్కారము చేసి, చేతులు జోడించినారు. భగవానులు , " ఏదో ఉన్నట్లుందే ? ఏమిటి ? " అన్నారు. " జ్ఞాన సత్రములో జరిగినది ఉపనిషత్తు. దానిని లిపిబద్ధము చేసి శాశ్వతము చేయుటకు అనుమతి కావలెను. " అన్నారు. భగవానులు , " ఆలోచించండి. ఇదొక అధ్యాయము. సరే , రాసి ఉంచండి. అయితే ఇంకా రెండు అధ్యాయములు మిగిలినవి. కానిమ్ము , అవికూడా సకాలములో అవుతాయి, తొందర లేదు. " అన్నారు.       

          దేవరాతుడికి కొడుకుకు సర్వజ్ఞాభిషేకమైనది  ఎక్కడలేని ఆనందాన్నిచ్చింది. ఇంటికి రాగానే కొడుకును హత్తుకొని ముద్దాడవలెననుకున్నాడు. అయితే గార్గి ప్రసంగము అడ్డు వచ్చింది. భగవానులు ఆమెతో ఆడిన ప్రతిమాట ఆ వృద్ధునికి తనను గురించే చెప్పినట్లు తోచింది. అందులోనూ చివరగా వారు ఆమెను అడిగిన వరమైతే తనను గురించే చెప్పినట్లు నమ్మకముగా అనిపించింది. " ఇప్పుడు కొడుకుతో కూచొని మాట్లాడవలెనంటే ఎందుకో దిగులవుతుంది. తాను కూడా శాకల్యుడి వలెనే దేవతలను ఎవరికి వారు ప్రత్యేకము అనుకొని ఆరాధించినాడు. అఖండమొకటి ఉందని శాస్త్రము చెప్పుచున్ననూ దానిని అంతగా గమనింపక ఖండ ఖండములనే ఉపాసన చేసినాడు. అఖండోపాసకుడైన కొడుకు దగ్గర తానెలా మాట్లాడేది ?  మాట్లాడునపుడు హెచ్చుతక్కువగా తనకూ శాకల్యునికి అయినట్టే అయితే ? శాకల్యునికైతే సద్గతి దొరకవలెనని కోరుటకు గార్గి ఉంది. తనకెవరు ? "

         దేవరాతుని భ్రాంతులకు అంతులేకుండా పోయింది. ఏమేమో ఊహించుకున్నాడు. చివరికి అందరూ వెళ్ళిపోయి , తానూ కొడుకూ ఇద్దరే కూర్చున్నపుడు ఇక విధిలేక , ఎంత భయమగుచున్ననూ కొడుకుతో మాట్లాడినాడు, " ఏమయ్యా , అట్లయితే ఖండోపాసన వలన ప్రయోజనమే లేదా ? "

         భగవానులు వెంటనే , వినయమును వదలకనే , గురువుకు పాఠమును అప్పజెప్పు శిష్యుడి వలె  అన్నారు : " ఖండోపాసన కామ్యమైతే మాత్రమే చెడ్దది. కామములేని ఆ వస్తువును ఉపాసన చేసినపుడు ఏ కామమును కోరుట ? "

" అయితే ఈ యజ్ఞయాగాదులన్నీ కామమేనేమి ? " 

         " కాక మరేమిటి ? బ్రాహ్మణుడైతే , తన ఆస్తి యైన దేవానుగ్రహము పెరగనీ , తాను చేసిన ఆశీర్వాదములు సఫలము కానీ , అని యజ్ఞ యాగాదులను చేయును. ఇతరులైతే తమకు నేరుగా ఫలము దొరకనీ అని చేయుదురు. ఇలాగ పరార్థ , స్వార్థములు రెండూ లేక , యజ్ఞయాగాదులను చేయువారు ఎవరు ? ఎందుకు చేస్తారు ?"

" అట్లయితే , దేవతలూ మనుష్యులూ పరస్పరము భావిస్తూ , ఇద్దరూ సుఖముగా ఉండవలెను అంటారు కదా ? "

          " నిజము , అయితే ఆ సుఖముగా ఉండుట అన్నారు కదా , అక్కడే ఉంది మర్మము. చూడండి  , సుఖముగా ఉండుట అంటే ఇంద్రియ ప్రపంచము కదా ? ఇది రాజాధిరాజులకు సంభావన ఇచ్చి , వారిని గొప్పవారిని చేసి తానూ గొప్పవాడయినట్టే ! మనము వద్దన్నా , కావాలన్నా , ఏదో ఒక రూపములో ఇది లోకములో జరుగుతున్నదే కదా ? "

" అయితే మరి లోకోద్ధారమంటే ఏమిటి ? "

          " అది భారీ వర్షమును కురిపించునట్టిది. ఖండోపాసన అంటే మన తోటకు మనము నీరు పెట్టుకున్నట్టు ! కానీ భారీ వర్షము అంటే దేశమంతా తడవడము మాత్రమే కాదు , బావులు , చెరువులూ, తటాకములూ , నదులూ అన్నీ నిండుతాయి. అలాగ , అఖండోఫాసన వలన మాత్రమే అగును. అదే లోకోద్ధారము. "

" మనము ఖండము నుండీ అఖండమునకు వెళ్ళుట ఎలాగ ? "

          " మీరు తెలియని వారివలె నన్నడిగితే నేనేమి చెప్పేది ?  మనసులో కామము నుంచుకొని, అఖండోపాసన చేసినా , అది ఖండోపాసనే. కామము లేక దేనిని ఉపాసన చేసిననూ అది అఖండోపాసనే! లేదా, మీరడిగిన దానికి నేరుగా ఉత్తరము నివ్వవలెనంటే , స్వార్థమే కామము . అది తన వరకే ఉండవచ్చును , లేదా , తన కుటుంబము , తన దేశము , తన లోకము, ఏదైనా సరే , కామము కామమే!  ఆ కామము ఉండువరకూ చూచునదంతా వేరే వేరే ! అప్పుడు అన్నీ ఖండ ఖండములే. దానిని వదలిపెట్టితే , ఇంటిని కట్టు గోడలను పడగొట్టితే , ఇల్లు పోయి బయలగునట్లు, అంతా ఒకటవును. అప్పుడు ప్రవాహము వచ్చి , ఎక్కడ చూసినా నీరే నీరు అగునట్లు , ఖండము అఖండమగును. "

          కొడుకు మాటలు వింటుంటే తండ్రికి తాను కూర్చున్న చోటి నుండీ ఎవరో , తనను మోసుకొని పోయి ఏదో ఆకాశ సముద్రములో వేసినట్లు , అక్కడ ’ తాను ’ అన్నపుడు నిండిన కుండ వలె , తాను లేనన్నపుడు పగిలిన కుండ వలె, తోచుచున్నది. ఎక్కడెక్కడ చూచినను ఏదో నిండుదనము , ఏదో శూన్యము. అయితే ఆ శూన్యము ,  ఖాళీగా ఉన్న శూన్యము కాదు. ఇంకేమీ లేనందువలన , అంతా తానే అయినందువలన  కనిపించు నిండిన శూన్యము. అక్కడ ఏమీ అర్థము కాదు. అర్థము కాదా అంటే , ఆ అర్థమేమో తెలియకున్ననూ అర్థమయినట్లే ఉంది. అర్థమే తానైతే , అర్థమయింది అనవలెనా ? లేక అర్థము కాలేదు అనవలెనా ? 

         దేవరాతునికి అదివరకూ అట్టి అనుభవము ఎప్పుడూ అయి ఉండలేదు. తానొక కలకండ ముక్కగా మారి నీటిలో పడినట్లు , ఆ ముక్క ఘడియ ఘడియకూ కరగిపోవు చున్నట్లు అనిపిస్తున్నది. తాను ఎన్నో వర్షముల నుండీ  సంపాదించుకున్న ఆస్తి అంతా వానకు చిక్కిన పచ్చి ఇటుక వలె కరగి పోవుచున్నదే యని దిగులవుతున్నది. దానితో పాటే , ’ పోనివ్వు , మట్టి , మట్టిలో కలసిపోయింది , నష్టమేమిటి ? ’ అని ధైర్యము కూడా ఉంది. అయినా ఆ భీతి-ధైర్యములు ఏదో సముద్రములో లేచే కెరటములవలె , తాను ఆ సముద్రపు అడుగున ఉండి , పైనా కిందా , లోపలా బయటా , చుట్టూరా అంతటా నీరే నీరై చలనములేక ఘనమైనట్టు అనిపిస్తున్నది.  

          దేవరాతుడు మేలుకున్నాడు. అంతవరకూ చూసినది కల కాదు. జాగ్రత్తు అసలే కాదు . కనులు తెరచినాడో , మూసినాడో తెలీదు.  అయితే విచిత్రానుభవము అయినదని బాగా జ్ఞాపకము ఉంది. ఆ అనుభవము ఇంకా అయితే బాగుండును అన్నట్టుందే కానీ , ఇక వద్దు అనిపించలేదు. 

          ఠక్కున ఒక ఆలోచన తట్టింది.  " ఇది ఈతడి సన్నిధానములో ఉన్నందు వలన అయినదా ? " అనిపించింది. " దీనిని పరీక్షించెదను. ఈ అనుభవము ఈతడి సాన్నిధ్యము వల్లనే అయి ఉంటే , నేను ఆశ్రమమునకు వెళ్ళి ఇతడితో పాటే ఉంటాను. " అనుకున్నాడు. భగవానులు అక్కడే ఉన్నారు. 

        ఆచార్యునికి బహిర్ముఖ స్థితి సంపూర్ణముగా కలిగి , " సంధ్యా స్నానపు కాలము ’ అనిపించినది. కొడుకుతో , ’ ఏమిటయ్యా , స్నానానికి వెళదామా ?’ అని అడిగినాడు. సరేనని వారు కూడా లేచినారు. 

" మరచాను , రేపు రాజ భవనమునకు మనమే వెళదామా ? లేక వారు రానీ అని వేచిఉందామా ? " అన్నారు. 

        " వారు వచ్చి పిలిస్తే వెళదాము , తొందరేమిటి ? వారు ఎలాగ చేస్తే అలాగ  సరి యని ఉంటే సరిపోతుంది. " అని సమాధానము వచ్చింది.