SHARE

Thursday, January 17, 2013

8. " మహా దర్శనము--ఎనిమిదవ భాగము --సందడే సందడి


8. ఎనిమిదవ భాగము--- సందడే సందడి 

        " జాత కర్మ అనునది ఒక వైదీక కర్మ . దానికి లౌకిక అంటు సోకకూడదు . " అని దేవరాతుని హఠము . అయితే రాజ భవనము దానికి ఒప్పుకోలేదు . ’ వంశభూషణుడైన కొడుకు పుట్టినాడు . కాబట్టి దిగ్దిగంతాలకూ ఈ సమాచారము వ్యాపించవలెను ’ అని వారి వాదము . అంతేగాక , దేవరాతుని పై తన ప్రభావమును చూపి అతనిని రాజభవనపు సలహాను అంగీకరించునట్లు చేయవలెనని భార్గవుని ప్రయత్నములు . ఆ మిథిలా నగరములో భార్గవుని మాటను తిరస్కరించినది ఒక్కరే ఒక్కరు , వారే ఆ వృద్ధ బుడిలులు . " వారిని వదిలేయండి , తాము అపరిగ్రాహులు , ఇతరులు కూడా అపరిగ్రాహులుగా ఉండాలనే వారి ఆశ " అని చాలామంది మూతులూ ముక్కులూ ముడుచుకునేవారే . 

        మొత్తానికి జాతకర్మ రాజవాడలో జరుగు కర్మ వలెనే నడచింది . ఒక బండెడు చక్కెర పంచినారు . రాజాస్థానపు జ్యోతిష్యులే వచ్చి జాతకమును రాసినారు . వారికి అంతులేని ఆశ్చర్యము , ’ ఆచార్యులవారూ , నేనింతవరకూ ఇట్టి శుభ జాతకమును చూచియుండలేదు . తులా లగ్నము , చతుర్థములో కుజుడు ఉఛ్చములో ఉన్నాడు . దశమములో గురువు ఉఛ్చ. , ద్వితీయములో రవి ఉండుట చూస్తే , ఇతడు వంశభూషణుడే కాదు , లోకవిభూషణుడగుటలో సందేహమే లేదు . ఇతనికి ఎదురుమాట్లాడి నెగ్గగలవారే లేరు . " అని ఎన్నోవిధములుగా పొగిడినారు .  ఆదినము పుత్రోత్సవమని ఆచార్యుడు రెండు మూటల చక్కెరను తెప్పించినాడు . ఆస్థానమునుండీ మూడు మూటల చక్కెర వచ్చినది . ఐదు మూటల చక్కెరనూ పంచినారు . 

        నామకరణపు దినము కూడా అటులే అయినది . లోకభూషణుడగు వాడు పుట్టినాడన్న తర్వాత మహారాజుకు అభిమానము ఇనుమడించినది . ఒక నూరు బళ్ళ బియ్యమును సోపస్కరము ( ఇతర సంభారములు ) తోపాటు పంపినారు . దానిలో మిగిలించుకోవలెనను ఆలోచనకూడా లేక ఆచార్యుడు తన ఇంటిలో నిండిన బియ్యము , పప్పులను వాటితో చేర్చినాడు . వైదీక కర్మ ముగిసేవేళకు మధ్యాహ్నమయినది . మొదట పుణ్యాహ వాచనము , భూమినుండీ ఎప్పుడూ పైకి లేచు ఆఘాహ శక్తులను కడిగివేసి , పైనుండీ దిగు పుణ్యాహ శక్తులు అంతటా వ్యాపించునట్లు చేయుటయే పుణ్యాహపు ఉద్దేశము . ఆ ఉద్దేశము నెరవేరినట్లు వచ్చిన వారందరికీ తెలియునట్లు ఎక్కడెక్కడ చూచినా ప్రసన్నత నిండిపోయినది . నవగ్రహ హోమము , ఆయుష్య హోమములూ నడచినవి . నవగ్రహములు ప్రసన్నులై వచ్చి ఆహుతిని తీసుకొని పోవుటను అక్కడ జ్ఞాన చక్షువులున్న వారందరూ చూచి ’ వల్లె వల్లె ’ అన్నారు . ఆయుష్య హోమకాలములో అగ్ని ప్రసన్నుడై జ్వాలామాలా పరిశోభితుడైనను , శాంతుడై ప్రదక్షిణాకారముగా సంచరిస్తూ హవ్యమును స్వీకరించినాడు . హోమమునకు వచ్చిన ఋత్విజులు ’ మేము ఇంతవరకూ ఎన్నో హోమములు చేసినాము , కానీ యజ్ఞేశ్వరుడు ఇంతగా ప్రసన్నుడగుటను ఎక్కడా చూడలేదు . పొగ యనునదే లేదు , భలే , భలే ! చూడబోతే ఈ పిల్లవాడు దేవకార్యార్థియై జనించినట్లున్నది . ’ అని పాపడిని పొగడినారు . కొందరు ఇతరులు ’ మీరు సరిగ్గా చూడండి , అక్కడ కూర్చున్నది ఎవరు ? సాక్షాత్ ’ యజ్ఞవల్క్య ’ పేరున్న దేవరాతుడు . వారు ఆచార్యులు కూడా ! వారు ఎన్ని యాగములలో అధ్వర్యులై యజ్ఞేశ్వరుని , దేవతలనూ మెప్పించినారో ! వారే యజమానులై కూర్చున్నపుడు ఇలాగయగుట అదేమి ఆశ్చర్యము ? " అన్నారు . 

      తరువాత పితృ పూజారూపమైన ’ నాందీ ’  యజ్ఞము నెరవేరినది . పుత్రుడికి దేవరాతుడు ’ యాజ్ఞవల్క్యుడు ’ అనియే పేరు పెట్టినాడు . అక్కడికి వచ్చిన కులపతి వైశంపాయనుడు  , ఉద్ధాలకుని ముఖమును చూచినాడు . అతడు ముసి ముసిగా నవ్వుచూ , ’ " ఈ శిశువు బ్రహ్మ జ్ఞానియై , కర్మత్యాగము చేయునని ఆచార్యులకు బెదురు . దానివలన , ఈ పేరుంటే ఎల్లపుడూ అతనికి తాను కర్మఠ వంశపు వాడిని యని గుర్తుండవలెనని ఆచార్యుల అభిమతము . కానివ్వండి , ఇంటిలో ఎలాగైనా వేరే పేరుతోనే కదా పిలుస్తారు ! " అన్నాడు . వైశంపాయనులు తలయూపి , సత్యము  అన్నారు . మొత్తానికి మాధ్యాహ్నికపు వేళకు వైదిక కర్మ అంతా ముగిసినది . 

        ఆచార్యుల ఇంటి వెనకే ఒక పెద్దతోట !  దానిలో విస్తరించియున్న ఒక తటాకము . ఆ తటాకము పక్కనే విశాలముగా పాకశాలను కట్టినారు . " వంట అంతా సిద్ధముగానున్నది . అందరూ మాధ్యాహ్నికమునకు లేవ వచ్చును " అని వంటవారు వచ్చి అందరినీ హెచ్చరించినారు . త్రికాల స్నానము చేయువారు స్నానమునకు సిద్ధమైనారు . మిగిలిన వారు తమ తమ కర్మలలో ప్రవృత్తులైనారు . 

         అక్కడున్న వృద్ధులలో ఒకరికి ఒక ఆలోచన వచ్చింది , " కార్తీక మాసము వనభోజనము. ఉసిరి చెట్టు కూడా ఉంది , ఒక ధాత్రీ హవనము ఏల చేయరాదు ? " అనిపించి ఆచార్యులను వెదకికొని పోయి తమ సలహాను వారి ముందుంచినారు . వారు , " మంచి ఆలోచన , గృహ శౌచము కూడా గడచినది , ఎందుకు చేయరాదు ? అయినా ఇద్దరు కులపతులు వచ్చినారు , వారినొకసారి అడిగి చూదాము " అని వారిని పిలుచుకొని, కులపతులను వెతుక్కుంటూ పోయినారు .  

        ఇద్దరూ చెరువు ఒడ్డునే కనిపించినారు . ఒకరు అప్పుడే స్నానము చేసి , శిష్యుడు ఇచ్చిన మడి కట్టుకుంటున్నారు . ఇంకొకరు నీటిలో దిగుతున్నారు . ఆచార్యుడు వచ్చి , " యజమానులు ఏమో చెప్పవలెనని యున్నారు " అని విషయమును ప్రస్తావించినారు . కులపతి వైశంపాయనుడు తల ఊపుతూ , ’ మంచి సలహా , అటులే చేసెదము , అయినా ఉద్ధాలకులు కూడా రానీ . వారిని అడిగి చేదాము , ఆ వేళకు హవనమునకు కావలసిన సామగ్రినంతటినీ సిద్ధము చేసుకొనండి . దానికోసము ప్రత్యేకముగా ఒక చరువు కానివ్వండి , అన్నారు . ఆచార్యుడు సరేనని ఆ అనుమతిని నెరవేర్చుటకు శిష్యుడొకనిని పంపించి , తాను , సలహాను సూచించిన వృద్ధునితోపాటు ఉద్ధాలకుని కోసము కాచుకున్నాడు . 

         వారుకూడా వచ్చినారు , సలహాను విని , " ఎందుకు చేయరాదు ? అవశ్యము చేయవచ్చును . కానీ చాతుర్వర్ణముల వారందరూ రావలెను కదా ! " అన్నారు . వైశంపాయనులు " ఎక్కడికి వెళ్ళినా , రాజభవనపు వారందరూ రాలేదే అనునదొకటే కొరత . అయితే , ఆచార్యుల ఇంటిలో సమారాధనము అంటే ముఖ్యులైన వారందరూ వచ్చే ఉంటారు . అతి ముఖ్యముగా ఆ బుడిలులు వచ్చినారు కదా ? వారు వస్తే ఒక లక్ష మంది వచ్చినట్టు . " ఆసహస్రాత్ పంక్తిం పునంతి " అటువంటి వారొక్కరు వస్తే చాలు . వారు కూర్చున్న పంక్తి మాత్రమేనా ? వారు నడచిన అంతటా భోజనానికి కూర్చున్నవారంతా కృతార్థులే ! వారినే ఆపోశన ఇవ్వమని అడిగితే సరి ! " అన్నారు . అంతలో సన్నాహములకు వెళ్ళిన శిష్యుడు వచ్చి అంతా సిద్ధమగుచున్నది అని తెలిపినాడు . 

         బ్రహ్మయజ్ఞమైన తర్వాత ఇద్దరు కులపతుల సమ్ముఖములో బుడిలులు ధాత్రీ హవనము చేయుదురు అని నిర్ణయించడమైనది . సకాలములో ధాత్రీ హవనమై , అందరూ వైశ్వేదేవమును నెరవేర్చినారు . భోజనాత్పూర్వములోను , భోజనాత్పరము లోనూ వేదఘోషలు మ్రోగినవి . అప్పుడక్కడ ఉన్న చాతుర్వర్ణముల వారూ పుష్కలముగా భోజనము చేసినారు . సంధ్యవరకూ సమారాధన నడచినది . ఆచార్యుల గాదెలలో నింపిపెట్టిన బియ్యమూ , పప్పులూ అన్నీ వెచ్చమైనవి . అయినా ఆచార్యుని ముఖములో చింతాఛాయలే కనపడలేదు . " సర్వమూ సార్థకమైనది , భూత తృప్తి యయినది , ఈ బాలుడి జీవితములో కూడా సర్వమూ ఇటులనే సార్థకమవనీ , వాడు అనృణుడై కృతార్థుడు కానీ " అని నమస్కారము చేసినాడు . 

         ఇక్కడ ఆలంబినీ దేవి కూడా కొడుకు సౌఖ్యము కోసము ఏమేమి కావలెను అని ఆలోచిస్తుండినది . బహుదినములనుండీ సేకరించిన ధావళులన్నీ బయటికి వచ్చినాయి . మూడు నాలుగు నెలలనుండీ ఆలంబినీ , జాయంతులు కూడబెట్టిన చీరలూ పంచెలూ , మూటల్లోనున్నవన్నీ గాలికి ఆరేసినారు . జాయంతి మనవడికి హారతి నిచ్చుటకని ఉండలు సిద్ధపరచినది . తొట్టిలు తన స్థానములో అలంకృతమై పాపడిని పిలుచుకొని వచ్చుటకు ఏర్పాటు అయినది . ఆదినము సాయంకాలము అతివల సందడే సందడి . వారి సంభ్రమము మగవారు ఊహించి తెలుసుకోవలసినదే తప్ప , అనుభవించి అర్థము చేసుకొనుట వారి నుదుట రాయనే లేదు . ఆడవారు సంభ్రమము పొందుటకు తమ కార్యమే కానవసరము లేదు . తమకు సంబంధమే లేకున్ననూ , ఇంకొకరి ఇంటిపనే అయిననూ , దానిని అభిమానించగలరు . అలాంటపుడు , ఆచార్యులు , ఆచార్య పత్నులు ఊరికందరికీ కావలసినవారైనపుడు , ఇంక చెప్పవలెనా ? 

         పాటల పిలుపులలో , కోలాటము , పేరంటపు ఆటపాటలలో , నవ్వుల నర్తనములలో పూజమొదలు జరగవలసిన తంతులన్నీ జాయంతి నేతృత్వములో జరిగినాయి . అందరూ , ’ బాలింతను చూచినారా ? బిడ్డతల్లి వలె లేనే లేదు , పదహారేళ్ళ లేత పడుచువలె నున్నదే ? " అనువారే !  వచ్చినవారంతా పాపడిని చూసి ఆనందముతో , ’ ఆలంబీ ! మొదట నీ కొడుకుకు దిగదుడుచు . తొట్టిలు నిండా పరుండిన ఈ శిశువును చూచి ముచ్చట పడని వారెవరు ? దృష్టి తగలకుండా ఉంటుందా ? పున్నమి చంద్రునిలాగా వెలుగుతున్నాడు . ఆ నుదురు చూడు , ఆ చిన్ని ముక్కు చూడు , ఆ నోరు చూడు , ఆ పెదవులు చూడు  , అక్కడ చూడు ఆ చిన్ని చిన్ని చేతులు ! ఆ వేళ్ళు చూడు , ఎంతపొడుగ్గా ఉన్నాయో , ఆ చెవులు చూడు , అప్పుడే ఏనుగు చెవుల్లాగా లేవూ ? " అని పలువురు పలు రకాలుగా పొగడుతున్నారు . అందరి నోటిలోనూ ఒకే మాట ! " ఆలంబమ్మ అదృష్టవంతురాలు . అంతటి భర్త ! ఆ భర్తకు తగ్గ కొడుకు ! మొత్తానికి ఈ కొడుకును పొంది జన్మ సార్థకము చేసుకున్నది . ఆచార్యులు పుత్రుడు కావాలీ అని చేసిన తపస్సు సార్థకమైనది . " 

        వారు భవిష్యత్తును తెలిసినవారు కారు . వారిలో ఎవరైనా శాస్త్రజ్ఞులు ఉండిఉంటే , తాము ఆడినమాటలు లోకాభిరామముగా ఆడినవి కావు , అది శాస్త్రవాణి వలెనే తథ్యమగుతుంది అని తెలిసి , నమ్మకముతో నిండేవారు . 

        ఆ సందడులు , కోలాహలములు శాంతమైన తరువాత , ఆచార్యులు వచ్చి భార్యను మాట్లాడించినారు . ఆమె భర్త వచ్చినాడని లేవబోయింది . భర్త , " వద్దొద్దు , ఇకపైన నా పుత్రుడి తల్లివి అని నిన్ను గౌరవించవలెను . నువ్వు గౌరవించుకాలము గడచిపోయినది . చూడు , నేనొచ్చినది నిన్ను హెచ్చరించుటకు . ఇకమీద పాపడిని ఎత్తుకొనునపుడు మరవకుండా సరస్వతీ ధ్యానము చేయి . ఉయ్యాలలో పరుండబెట్టి ఊపునపుడు ’ భద్రం కర్ణేభిః ’ చెప్పుతూ ఉండు . ఒకవేళ సంస్కృతములో చెప్పుట వద్దనిపిస్తే , దాని అర్థమును లౌకిక భాషలో పాటగా చేసుకొని పాడుతూ ఉండు . మిగతా అప్పుడు , వాడిని తొడపైన వేసుకొని ఆడించునపుడు , ’ పూర్ణమదః ’ మరవవద్దు . నేనిక వస్తాను , పొద్దుటినుంచీ నీకు కూడా తీరిక లేనంత పనితో ఆయాసమై ఉంటుంది , పడుకొని నిద్రపో . దేవతలు నిన్నూ , నీ కొడుకునూ కాపాడనీ ! " అన్నాడు . ఆవేళకు భోజనానికి వెళ్ళిన జాయంతి వచ్చినది . అత్త వచ్చినది చూసి అల్లుడు గౌరవముగా లేచి వెళ్ళిపోయినాడు . 

        తల్లి , కూతురితో హాస్యమాడింది , " అదేమిటే , మొగుడిని పిలిపించుకున్నదానివి , కొడుకుని వారి చేతికి ఇచ్చి ఉండకూడదా ? " అన్నది . కూతురు ఆ హాస్యమును ఆనందిస్తూ , కొంటె తనము కనుపించునట్లు , " మేమిలాగ ఉండాలనే కదా , నువ్వుకోరేది ? వారి కొడుకును వారు ఎత్తుకుంటే నేను అడ్డురాకూడదే తప్ప , నేను ఇవ్వాలేమిటి ? అయినా మధ్యాహ్నము నుండీ , కావలసినంత సేపు చూస్తూ ఉన్నారు కదా ? ఈ నెల పురిటి మైల గడచిన తర్వాత వద్దన్నా ఎత్తుకుంటారు . ఇప్పుడు వచ్చినది , మంత్రములు జపము చేస్తూ ఉండు , ఆఖరికి మంత్రార్థమునైనా నెమరు వేస్తూ ఉండూ అని చెప్పుటకు ! " అన్నది . తల్లికి , కూతురు వెనుక చెప్పిన కల గుర్తుకు వచ్చి , ఈ బాలుడు ఎంతటి మహానుభావుడవుతాడో ,ఎవరికి తెలుసు ? అనిపించింది . ఆకు వక్కలు నోటిలో నిండి ఉండినవి , నిద్ర కంటిలో నిండి ఉండినది . మాట్లాడుతూ అలాగే మంచముపై వాలి ఒరిగింది . పొద్దుటినుండీ అలసి ఆయాసపడిన దేహము నిద్రలోకి జారింది . 

7. " మహా దర్శనము " ---ఏడవ భాగము -- -సుఖ ప్రసవము


 ఏడవ భాగము -- సుఖ ప్రసవము 

          మరు దినము ఆలంబిని తల్లితో కర్మ విచారము ప్రస్తావించి , భర్త తనకు చెప్పినదంతా చెప్పినది . తల్లికి ఆశ్చర్యము కాలేదు . " నువ్వు మంచి పనే చేసినావు , దేహమే నేను అనుకొనువారి మాట వేరు . దేహము నేను కాదు ; నేననేది వేరే ఇంకొకటుంది అని నమ్మువారు ఇటులనే చేయవలెను . నిజమే . ఆడది జన్మ ఎత్తినపుడే సిగ్గుపొరలను కప్పుకొనే పుడుతుంది . అలాగని  మెట్టినింటికి   ద్రోహము అగునట్లు చేయవచ్చునా ? అట్లు చేసిన , పుట్టింటికి కూడా ద్రోహము అయినట్లే . కాబట్టి నువ్వు చేసినది సరియైనదే . కానుపు గది ఎక్కడ అని అనుకున్నారు ? అది ముందు చెప్పు . " 

" నడిమింట్లోనే ఒక మూలలో తెరలు కట్టి చేయవలెను . " 

        " సరే , అక్కడే చేయండి , దానికి రెండు వైపుల నుండీ దారి ఉండనీ . బిడ్డ పుట్టగానే నేను మంత్రసానిని ఒక దారినుండీ బయటికి పిలుచుకొని వస్తాను . ఇంకొక దారి నుండీ నీ భర్త వచ్చి కర్మను ముగించుకొని వెళ్ళనీ . వారు వెళ్ళిపోగానే నువ్వు నన్ను పిలువు . నేను మంత్రసానితో పాటు వచ్చి తరువాతి కార్యము చేసెదను . " 

         ఆ దినము పంచమి , కర్మకు కావలసిన తేనె , నెయ్యి , బంగారము సిద్ధమయినాయి . ఆడవారు కర్మకు ఒప్పుకున్నందు వలన కర్మకు ఇక ఉన్న అడ్డు తీరిందని దేవరాతుడు బహుళ తృప్తుడైనాడు . 

         ఆలంబినికి ఆయాసము ఎక్కువగుతూ వచ్చినది . కూర్చుంటే లేచుట , లేస్తే కూర్చొనుట కష్టమగుతున్నది . దేవరాతుడు అది చూచి అగ్ని పరిచర్యను తానే వహించి చేస్తున్నాడు . 

         ఆలంబిని తల్లి జాయంతి కూతురికి వేడినీళ్ళు ఇస్తూ , ’ గర్భము జారినది , ఇక రెండో మూడో దినములు , అంతే . " అన్నది . కూతురు , " వారి మాట ప్రకారమైతే రేపే జననము కావలెను " అన్నది . తల్లి , " అయినా కావచ్చును , అయితే , బిడ్డ మాత్రము , ...ఆలంబీ , ఏమీ అనుకోవద్దు , మాంచి భూతపు బిడ్డ అవుతుంది " అంది . ఇద్దరూ నవ్వినారు . 

         గురువారము తెల్లవారింది . నడిమింట్లోనే ఒక మూలలో ప్రసూతి గృహము సిద్ధమయినది . తల్లి , బాలింత పడక మొదలైనవన్నీ సిద్ధము చేసి ఉంచినది . అందరూ త్వరితముగానే భోజనములు కానిచ్చినారు . గర్భిణి కూడా భోజన శాస్త్రము అయిందనిపించినది . మధ్యాహ్నపు సూర్యుడు నెత్తిపై నుండి పశ్చిమమునకు దిగు సమయమునకు , పొద్దుటి నుండీ అప్పుడప్పుడు వస్తున్న నొప్పి తీవ్రమైనది . వెంటనే , మజ్జిగన్నము తింటున్న తల్లి భోజనము వదలి చేతులు కడుక్కొని పరుగెత్తి వచ్చినది . 

         ఆలంబిని ఎక్కువ సేపు నొప్పులు తినలేదు . తల్లిని ఆనుకొని ఒరిగి కూర్చునియుండగనే మరియొక నొప్పి వచ్చినది . దానితో పాటే , జలోదయ , శిరోదయములు రెండూ ఏకకాలములోనే అయినవి . ఇంకొక ఘడియ లోపలే శిశువు లోకానికి వచ్చినది . తాను వచ్చినట్టు ప్రకటించుటకా అన్నట్టు ఏడ్చింది . 

         తల్లి జాయంతి , కూతురికి చెప్పినట్లే మంత్ర సానిని పిలుచుకొని బయటికి వెళ్ళినది . వేరే వాకిలి నుండీ దేవరాతుడు లోపలికి వచ్చినాడు . ఆచార్యుడు కొడుకు కుడి భుజమును ముట్టుకొని , " సరస్వతీ దేవి నీకు మేధను ఇవ్వనీ , ఇంద్రుడు నీకు మేధను ఇవ్వనీ " అను అర్థము వచ్చు మంత్రమును ఉచ్చరించినాడు . బిడ్డతల్లిని ఉద్దేశించి , " అరుంధతీ సమానురాలా, నువ్వు స్తోత్రములు చేయుటకు పాత్రురాలవు . వీర పుత్రుని పొందిన ఓ వీరమాతా , నీకు మంగళమగు గాక " అని అభినందించినాడు . 

         అక్కడనుండి వెళుతూ ,’ నేనిక స్నానము చేస్తాను . కొడుకు పుట్టగానే నిలుచున్నవాడు నిలుచున్నట్టే నీటిలో దుముకి స్నానము చేయవలెనంట . ఆ నీరు ఎంతగా పైకి ఎగసిపడితే అంత అక్షయమైన లోకములు పితృ దేవతలకు దొరికి మా పితృ ఋణము తీరునంట. నువ్వు ఇప్పుడు బిడ్డకు స్తన్యము నిచ్చునపుడు మరచిపోకుండా సరస్వతిని ధ్యానించు , " హే సరస్వతీ దేవీ , సర్వ ప్రాణులకూ అన్న ప్రదాతయైనది నీ స్తనము . రత్నములనూ , ధనమునూ అధికముగా ఇచ్చునది నీ స్తనము . దేవతలందరికీ రక్షణనిచ్చునది నీ స్తనము . దానిని ఈ బిడ్డకు కూడా ఇవ్వు"  అని ఆమెను ధ్యానించి , బిడ్డకు స్తన్యమునివ్వు ’ అని నిర్దేశించి బయటికి వచ్చినాడు . 

         అతడు ఇవతలికి వచ్చిన తరువాత జాయంతీ , మంత్రసానులు మరలా వచ్చి బిడ్డకు వెచ్చటి నీరు ఇచ్చి , నాళమును కత్తరించి , చేయవలసినదంతా చేసి , బిడ్డకు స్తన్యపానము చేయించి తల్లీ బిడ్డలను నిద్రపుచ్చారు . 

         ఇక్కడ ఆచార్యుడు స్నానము చేసి లోపలికి వచ్చు వేళకు రాజ భవనము నుండీ రాజ పురోహితుడు , రాజ పురుషునితో పాటూ వచ్చినాడు . రాజ పురోహితుడు లోపలికి వస్తూనే ఆచార్యుడు ఎదురేగి " రండి రండి , రాజ పురోహితులు దయ చేయవలెను " అని స్వాగతము చెప్పినాడు . భార్గవుడు , ’ రథములో రాజపురుషుడు వచ్చినాడు . అతడిని రమ్మనండి ’ అన్నాడు . ఆచార్యుడు నీరుకారుతున్న శిరోజములను పిండుకుంటూ , " నాకోసము ఆపని మీరు చెయ్యండి , నేను మడి బట్ట కట్టుకొని వస్తాను ’ అని లోపలికి వెళ్ళినాడు . 

         అతడు బయటికి వచ్చువేళకు రాజ పురుషుడూ , పురోహితుడూ ఒక గదిలో కూర్చొనియున్నారు . ఇద్దరూ ఆచార్యునికి వందనము చేసి రాజాజ్ఞను తెలిపినారు : ’ శిశు జననమైన తర్వాత చేయవలసిన కర్మల నన్నిటినీ ఏ శంకా లేకుండా వైభవముగా జరిపించి రాజాశీర్వాదము చేయవలెనని మీకు చెప్పి రమ్మని మహారాజు మా ఇద్దరినీ పంపించినాడు " 

         ఆచార్యుడు , " ఇంట సుఖప్రసవమై పుత్ర జననమయినది . రాజాజ్ఞ ప్రకారము ఏ లోపమూ లేకుండా సర్వమునూ క్రమముగా జరిపించెదము . మేము చేయు ప్రతియొక్క కర్మ వలననూ మహారాజులకు నిస్సందేహముగా శ్రేయస్సు కలుగును అని వారికి తెలపండి . నేను సకాలములో వచ్చి దర్శనము చేసుకొనెదను " అన్నాడు . 

Wednesday, January 16, 2013

6. " మహా దర్శనము " ---ఆరవ భాగము--అదీ దోహదమేనా ?


అదీ దోహదమేనా ? 

         ఆలంబినీ దేవి ఇప్పుడు , పగలూ రాత్రీ యనక , మడి , మైల అను ఆలోచనయే లేక మంత్ర జపము చేస్తున్నది . మంత్రపు ప్రభావమేమో , ఆమెకు దేనిని చూసిననూ ఒక తేజోరాశి వలె కాన్పించును . దానితో పాటూ ఇంకో విశేషమేమనిన , ఎవరో ఒకరు , ఎల్లపుడూ తనతో పాటే  ఉన్నట్టనిపిస్తుంది . అదెవరు అని తెలుసుకోవలెనన్న కుతూహలము ఆమెకు అప్పుడప్పుడు కలుగుతుంది . అయితే ఆ కుతూహలము ప్రయత్నముగా మారులోపే మాఘ మాసపు తేలికపాటి తెల్ల మేఘము వలె పుట్టగానే కరగిపోతుంది . ఆ భావనయే రాత్రి పూట పడుకొని యున్నపుడు ఒక చిన్న శిశువు ఒడిలో పడుకొని యున్నట్లు ఒక భావనను కలిగిస్తుంది . వెంటనే లేచి , శిశువు ఒడిలో లేనిది చూసి అటూనిటూ చూచుట సామాన్యమైపోయినది . అగ్ని పరిచర్య చేస్తూ మూఢములను ఇస్తున్నపుడైతే సందేహము లేకుండా ఎవరో అమ్మా అంటూ తన చెంగు పట్టుకొని తిరుగాడినట్లనిపిస్తుంది . పొద్దున్నే లేచి మడి కట్టుకొని వచ్చి చల్ల చిలుకుటకు కూర్చున్నపుడు " అమ్మా , ఆ తాజా వెన్న ఇక్కడ కొంచమియ్యమ్మా ’ అని ఎవరో అడిగినట్లు భ్రమ చెంది వెన్నముంతలో నుండీ ఇంత దేవుకొని ఇచ్చుటకు తిరిగి , ఎవరూ లేనిది చూసి ఇదంతా నా భ్రాంతి అనుకుంటుంది . మొత్తానికి ఆమెకు సర్వమూ భర్తీ అయినట్లు , సర్వమూ పూర్ణముగా నున్నట్లు , ఎక్కడ చూసినా అంతా సమృద్ధిగా నిండియున్నట్లు అనిపిస్తుంది . 

         ఇలాగే ఆశ్వయుజ మాసము గడచినది . కార్తీకము ప్రవేశించినది . కార్తీకముతోనే ఆలంబినీ దేవి  మాతృత్వపు దినములూ దగ్గరపడినాయి . ఇప్పుడు గర్భములో పిండము అటూ ఇటూ కదలుటయే కాదు , తాను ఒక్కోసారి మనసులో మంత్రాన్ని మరిస్తే , తేనుపు వచ్చినదానికన్నా స్పష్టమైన ధ్వనితో లోపలినుండీ పూర్ణమదః అని మంత్ర జపము చేసినట్లు వినిపిస్తుంది . వృద్దులై , పది పన్నెండుగురు సంతానమును కన్న వారిని ఇదేమిటి ? అని అడిగినది . వారు నవ్వుతూ , ’ తల్లీ , ఆలంబీ ! ఇదేమిటో విచిత్రమును చెప్పుతున్నావు . మేము పెద్దలు చెప్పగా విన్నాము , మహాపురుషులు గర్భమునకు వచ్చినపుడు ఇలాగవుతుందని . కానీ మాకు ఆ అనుభవము లేదు . నువ్వు చెప్పేది వింటుంటే  వెనకటి పెద్దల మాట గుర్తుకు వస్తున్నది . ఏమైనా కానీ , నువ్వు కోపము చేసుకోను అంటే చెబుతాను , నీ కడుపు చూస్తే నీకు కవల పిలలు పుడతారేమో అనిపిస్తున్నది . ఏదేమైనా , దేవుడి దయ వలన గింజ వేరే , పొట్టు వేరే అయ్యి , మీ తల్లీ బిడ్డలు సుఖముగా ఉండుటను చూస్తే అదే మా భాగ్యము .’  అంటారు . 

        ఆలంబినీ దేవి తల్లికి , " ఈ పెరిగిన కడుపు ఇంత పెద్దగా కనిపిస్తున్నదే ? ఇందులో ఇంత పెద్ద బిడ్డ ఉన్నదా ? ఆలంబిని ఆ బిడ్డను ప్రసవించుట ఎలాగో ? " అని ఒక చిన్న కలవరము . " అయితేనేమి ? ఆమె దినమూ శ్రద్ధగా సేవ చేస్తున్న యజ్ఞేశ్వరుడు ఆమె చేతిని విడువడు " అని తర్కాతీతమైన ఒక దృఢవిశ్వాసము .

        ఒక దినము దేవరాతుడు నడిమింట్లో ఏదో గ్రంధపరిశీలనలో యున్నాడు . హఠాత్తుగా కార్తీక శుద్ధ సప్తమి గుర్తుకు వచ్చినది . ఆ దినపు విశేషమేమి యని ఎంత ఆలోచించినా గుర్తుకు రాదు . చివరికి దీర్ఘ కాలము ఆలోచించిన పిమ్మట , యాజ్ఞవల్క్యుడు వెనుక చెప్పినది జ్ఞాపకమైనది . చివాలున లేచి భార్యను వెతుక్కుంటూ వెళ్ళినాడు . ఆమెను చూచి , " మర్నాడు సప్తమీ గురువారము , ఆ దినము నువ్వు తల్లివవుతావు " అన్నాడు . ఆమె సహజమైన సిగ్గుతో తల వంచుకున్నది . దేవరాతుడు లజ్జా సుందరియైన ఆ పత్నిని సంభావిస్తూ " ఆలంబీ , నువ్వు నాకొక వరమును ఇవ్వాలి " అని ప్రార్థించినాడు . 

        ఆమె నీరవముగా తలయెత్తి చూసి , ’ మీరు నన్ను ప్రార్థించుటయా ? ’ అన్న భక్తి భావముతో కూడిన కటాక్షమును అతని వైపుకు సారించి ,’ ఏమని ? ’ అని అడిగినది . 

        నాథుడు ఆడవారి కన్న ఎక్కువ సిగ్గు పడుతూ , " నువ్వు కన్న బిడ్డకు మేధా జననము కావలెను , అది కూడా గర్భ నాళ ఛేదనము కన్నా ముందుగనే చేయుటకు అవకాశము నివ్వవలెను . " అన్నాడు . 

        పడతి , " మీరు అడుగుట ఎంత బాగున్నది ? మంత్రసానిని ఎలా తప్పించి మీకు ఆ అవకాశము నిచ్చెదను ? సాధ్యమేనా ? మీరే చెప్పండి ? " అన్నది . ఆ మాటలో , తాను ఒప్పుకున్నా అది జరుగుట సాధ్యము కాదు అను నిర్ధారణ నిండి ఉండింది  . 

         ఆచార్యుడు భార్యను పిలుచుకొని పోయి నడిమింటికి వచ్చినాడు . అక్కడ తానొక వేత్రాసనము నందు కూర్చొని , పక్కనే ఇంకొక వేత్రాసనమును లాగి వేసి , భర్యను దానిపై బలవంతముగా కూర్చోబెట్టి ’ విను ’ అని చెప్పనారంభించినాడు . 

          " ఈ జగత్తు అగ్నిష్టోమాత్మకమైనది . దీనిలో నున్న ప్రాణులను ఖనిజములు  , ఉద్భిజ్జములు  , అండజములు , జరాయుజములు అని నాలుగు విధములుగా వర్గీకరించిననూ , వాస్తవమునకు అన్నీ జరాయుజములే ! అనగా , ఒంటి పొర సంచీ లో పెరిగేవే ! మిగిలిన మూడూ గర్భమును వదలి వచ్చిన తరువాత పెరిగేవి  , కానీ జరాయుజము మాత్రము గర్భములో పెరిగి బయటికి వచ్చును . తండ్రి బీజమును తల్లి తన గర్భములో ఉంచి , దానిని తన అంగము కన్నా ఎక్కువగా అభిమానించి తన రక్త మాంసములను దానికిచ్చి పోషించి , సర్వావయవ విశిష్టముగా తల్లిదండ్రుల వలెనే ఉండు ప్రాణిగా చేయును . నాళఛ్చేదనము వరకూ ఆ బిడ్డకు వ్యక్తిత్వము రాదు . అలాగ ఆ బిడ్డ , ప్రత్యేక వ్యక్తి యగుటకన్నా ముందే తండ్రియైన వాడు వచ్చి ఆ శిశువు కుడి భుజమును ముట్టుకొని  , విహితములైన మంత్రోచ్చారణ చేసినచో ఆ శిశువు మనస్సూ , బుద్ధీ తండ్రి మనో బుద్ధుల స్థాయికి వస్తాయి . అప్పటినుండి , పెరిగే ఆ శిశువుతో పాటే అవి కూడాపెరుగును . ఇటుల , దోహదము చేయగా , ’  పెరిగిన చెట్టు యొక్క  పెరుగుదల అనే ఫలమును పొందుట ’ వంటిదే ఇది కూడా ! కాబట్టి , నా వంశపు వృద్ధిని లక్ష్యముగా పెట్టుకొని , వంశ భూషణుడైన కొడుకును ఇచ్చు తల్లివైన నీ నుండీ ఈ వరమును కోరినాను . " 

" సరియే , కుడి భుజము అంటిరి కదా ! అదేమి ? " 

         " దేవతలు దేహము లోనికి ప్రవేశించునది కుడి భుజము నుండియే ! ఈ దేహము యజ్ఞ మహా యజ్ఞముల వలన బ్రాహ్మణమగును . అటుల జరిగినపుడు దేహములో ఎక్కడంటే అక్కడ దేవతలను చూడ వచ్చు . అలాగ దేహము దేవాయతనమగు వరకూ ఆవాహన చేయవలసిన ఆవశ్యకత ఉంటుంది . ఆ ఆవాహన కుడి భుజమును ముట్టుకొనియే చేయవలెను . అది యెటుల అను దానిని నీకు చూడవలెనన్న కుతూహలము ఉంటే , మనము అష్టకా శ్రాద్ధమును చేస్తాము కదా ! అప్పుడు గుర్తు చేయి . విశ్వేదేవతలు వచ్చి బ్రాహ్మణులలో ఉండుటనూ , కార్యాంతములో వదలి , లేచి వెళ్ళిపోవుటనూ చూపించెదను . " 

" ఈ కర్మను చేయకుండిన ఏమగును ? " 

          " మన బిడ్డ మన వంశపు విశిష్ట లక్షణములను పొందుటకు బదులుగా తన పూర్వ వాసనలకు అనుగుణముగా పెరిగి , తన వ్యక్తిత్వమును దృఢము చేసుకొనును . ఇప్పుడు నేను ఈ కర్మను చేయలేదనుకో , నీ కొడుకు మన వంశమునకు తగ్గట్టు కర్మఠుడై పెరుగుటకు బదులుగా ఇంకేమో కావచ్చును . మేము రాజభవనము నకు వెళ్ళుట తెలుసు కదా , అయితే అది రాజానుగ్రహమును యాచించుటకు కాదు , రాజును అనుగ్రహించుటకు . అప్పుడు ఇటుల కాకుండా , ఇంకెందుకో కావచ్చును . కాబట్టి అట్టి భిన్న ప్రకృతిని చూడవలసి వచ్చుట ఇష్టము లేకనే నిన్ను కోరినది . నువ్వు ఒప్పుకొనియే తీరవలెను . నీ కొడుకు తపోలోకము నుండీ వచ్చినవాడు . అదీకాక, నీచేత పగలూ రాత్రీ ’ పూర్ణ మదః ’  అను మంత్ర జపమును చేయిస్తూ పూర్ణ ధ్యానములో నున్నవాడు . వాడికి మేధా జననము కాకున్న , వాడి కర్మశ్రద్ధ  సడలిపోయి పుట్టునపుడే బ్రహ్మజ్ఞుడై పుట్టుట వలన అటులనే పెరిగి సన్యాసి కావచ్చును . అటుల కారాదు . కర్మఠుల వంశములో కర్మ లోపము కాకూడదని ఈ ప్రార్థన . " 

       ఆలంబిని ఎన్నడూ , ఏ రీతిలోనూ భర్త మాటకు ప్రతి మాట చెప్పి ఎరుగదు. ఇప్పుడు అతడు స్త్రీ సహజమైన లజ్జను త్యజించి వర్తించవలెను అని ప్రార్థన చేయుచున్నాడు . ఊ అంటే తన స్త్రీత్వము అపరాధము అంటుంది . ఊహూ అంటే పత్నీత్వమునకు ద్రోహమైనట్టవుతుంది . ఏమి చేయుట ? 

        ఆమె ఒక ఘడియ ఆలోచించినది . " భర్త చెప్పుతున్నది సరియైనదే . భర్త ఇంటి సాంప్రదాయము  కర్మకు పెట్టింది పేరు . పది మందే శిష్యులను ఇంటిలో ఉంచుకొని అధ్యాపనాదులను జరిపిస్తున్ననూ ఆచార్యుడు అను ప్రాశస్త్యానికి పాత్రమైనది . దేశ విదేశములలో ఆచార్య దేవరాతుని ఆధ్వర్యమంటే , బ్రహ్మ మొదలగు మిగిలిన ఋత్విజులందరూ ఒళ్ళంతా కళ్ళు చేసుకొని ఆర్తిజ్యమును వహించుటనూ , ఇక యాగము చేయించు యజమానులైతే , ’ ఆచార్యులు ఆధ్వర్యము వహిస్తే తమ ఇష్ట సిద్ధి ప్రాప్తించినట్లే ’  అని విశ్వాసముతో సంతోషించుటనూ తాను కళ్ళారా చూచినది . ఇప్పుడు అతడే ప్రార్థిస్తున్నపుడు కాదని ఎలాగ అనుట ? తనకు లజ్జతో ప్రాణమే పోయినట్లైననూ చింతలేదు . భర్త ఇంటి పేరు ప్రఖ్యాతులు కాపాడియే తీరవలెను . " అన్న దృఢ నిశ్చయమునకు వచ్చినది . " అలాగే కానివ్వండి  , కానీ మంత్రసాని ఉంటుంది కదా ? " 

       దేవరాతుడు అన్నాడు , " నువ్వు ఒప్పుకున్నావు , ఇక మంత్రసాని సంగతి వదిలేయి . ఈ దినము ఇంకా చతుర్థి . ఇంకా మూడు దినములుంది . అంతలోపల ఆమెకు కర్మ స్వరూపమును తెలియజెప్పి , జననమగునపుడు నువ్వొక ఘడియ బయటికి రావలెను అని చెప్పి ఉంచుదాము . "

       ఆలంబినికి అది అంత సులభ సాధ్యముగా అగుపించలేదు . కానీ దానికోసము తానెందుకు వెనుకాడాలి ? ఏదైనా సరే , అది వారికే కట్టబెడితే సరి , అని ’ ఆ పనేదో మీరే చేసుకోవలెను , నావల్ల సాధ్యము కాదు ’ అన్నది . 

        భార్యతో అన్నాడు , " చూడు ,మరచే పోయాను ,  మీ అమ్మగారు తొలిచూలు కానుపు అని అప్పుడే వచ్చియున్నారు . వారికి కర్మ స్వరూపమును , దాని ఫలమునూ తెలియజేయి , మిగతాది ఆమెయే చూచుకొనగలరు  " 

ఆలంబినికి ఈ మాట నచ్చింది. " సరే , అటులే " అన్నది . మొగుడూ పెళ్ళాలిద్దరికీ మోస్తున్న భారమేదో దింపినట్టైంది . 

         ఆలంబినికి ఏదో జ్ఞాపకము వచ్చి , వెళుతున్నది తిరిగి నిలచి , భర్తనడిగింది , " జననమైన తరువాత ’ భద్రం కర్ణేభిః " అనే మంత్రమును ఉపదేశము చేస్తాను అంటిరి కదా , దానివలన ఈ కార్యము జరగదా ? " 

       దేవరాతుడు భార్యకు గుర్తుందన్న తృప్తితో నవ్వుతూ , " నేను చెప్పిన కర్మ , బీజమంత్రము వంటిది . జపాదులు దానికి ఎరువు వంటివి మాత్రమే . " అన్నాడు . 

సరేనంటూ ఆలంబిని వెళ్ళిపోయింది .

5. " మహా దర్శనము "--- ఐదవ భాగము---దర్శనమైనది


5. దర్శనమైనది 


         శ్రావణ శుద్ధ పౌర్ణమి , సోమవారము . దేవరాత దంపతులు పూర్ణమాస యాగమును చేసినారు . యజ్ఞేశ్వరుడు మూడు కుండములలో కూర్చొని ప్రసన్నముగా హవ్యమును స్వీకరించినాడు . దేవరాతునికి ఏదో ఒక విచిత్రమైన ప్రసన్నత వచ్చింది . గడచిన తొమ్మిది పది రోజులనుండీ , దినదినమూ , " ఈ దినము తప్పక సంయమము చేసి గర్భస్థ శిశువును మాటలాడించవలెను " అనుకుంటాడు . కానీ ఏదో దిగులు వంటి భయము . తనకన్నా ఉత్తములు అని మనసు ఒప్పుకొన్న వారి సమక్షమునకు పోవుటకు బెదరునట్లు , దేవరాతుడు ఏవో కుంటి సాకులను ముందుంచుకొని ఊరికే ఉంటాడు . ఈ దినము దృఢముగా నిర్ణయించుకున్నాడు . " ఏమైనా కానీ , ఈ రోజు మాట్లాడించియే తీరవలెను . ఇంకెన్ని దినములు ఊరకే ఉండవలెను ? ఇంకెన్ని దినములు ఊరకే ఉండేది ? ఊరకే ఉంటే , బిడ్డకు ఏమి చెప్పాలన్నది భార్యకు తెలియక ఆమే , ఆమె వలన తానూ , ఇద్దరూ కర్తవ్య భ్రష్ఠులవుతాము . అది సరియైనది కాదు . " అయినా బెదురు పోలేదు . సంయమము చేస్తేనేమి ? చేయకున్ననేమి ? అనే సంశయము ఇంకా ప్రబలముగా నున్ననూ , సంయమము చేసే తీరవలెనన్న సిద్ధాంతమే ప్రబలమైనది . చలితో ఒణుకుతున్ననూ , చన్నీరన్న భయమున్ననూ , స్నానము చేసే తీరవలెనన్న హఠముతో , నీటిలోనికి దిగు వైదీక బ్రాహ్మణుని వలె అతడు కూడా సంయమానికి సిద్ధుడైనాడు . 

        పగలు గడచి సాయంత్రమైనది . స్నానమయినది , సంధ్యాకర్మ కూడా అయినది . అగ్నిహోత్రమయినది , ఫలహారమయినది . అప్పుడు దేవరాతుడు భార్యను పిలచి , " ఈ దినము ఇంటి పనులను వేగిరముగా ముగించుకో , వేరే పనిఉన్నది " అన్నాడు . ఆమె , " అటులనే , నాకు కూడా పొద్దుటి నుంచీ గిలకలా తిరుగుతూ పని చేసి , ఒళ్ళంతా పండినట్లైనది . మీ ఆజ్ఞ నాకు కూడా అనుకూలమే . ఎప్పుడెపుడు శయ్యపై వాలుదామా అన్నట్లుంది , అటులనే " అని , ఆత్రముగా చేతికి దొరికిన పనిని చేస్తున్నది . అంతలోనే దేవరాతుడు మళ్ళీ వచ్చి , ’ ఆతరపడి భోజనము వదిలేస్తావేమో , ఒద్దొద్దు , రెండు ప్రాణాల దానవు , " అంటాడు . ఆమె నవ్వుతూ , " మీ అనుజ్ఞ అయినాక ఇంకేమి ? ఏదో ఫలహారము చేసి రెండు అరటి పళ్ళుతిని , పాలు మాత్రమే తాగాలనుకున్నాను , ఇప్పుడు ఏకంగా భోజనమే చేసి , పళ్ళూ పాలూ స్వీకరించి వస్తాను " అని తన పనిలో తాను నిమగ్నమైంది .  . 

         దేవరాతుడు శయ్యా గృహములో భార్యకై వేచియున్నాడు . ఆమె కూడా వేగిరమే వచ్చినది . ఈ దినము భర్తకు తాంబూలపు ఉపచారము లేదు కాబట్టి , తాను వచ్చేటప్పుడే తాంబూలము వేసుకొనే వచ్చినది . తాను పడుకొనే వరకూ ఆమె పడుకోదని , దేవరాతుడు మంచానికి అడ్డము పడినాడు . " ఆమె పడుకోనీ , నిద్ర పోనీ , సుమారు అర్ధరాత్రికి సంయమము చేయవలెను " అనుకున్న దేవరాతునికి భార్య పరుండినపుడైతే మెలకువ ఉండినది , ఇంకో ఘడియలోపలే ఆమెకన్నా ఎక్కువగా గాఢనిద్రలోకి జారిపోయినాడు . 

        సుమారు మూడవ ఝాము . దానిలో కూడా సగము గడచినది . అప్పుడు దేవరాతునికి ఒక స్వప్నము . ఆ కలలో దేవరాతుడు అగ్నిగృహము నుండీ వచ్చి బచ్చలి ఇంటికి వెళ్ళి కాలూ చెయ్యీ కడుక్కుని వచ్చి శుద్ధాచమనము చేస్తున్నాడు . ఎవరో ముఖద్వారము నుండీ లోపలికి వచ్చి , " ఆచార్యా , అభివాదయే ! " అంటున్నారు . నోటిమాటకు తగ్గట్టుగా అభివాదము కూడా చేసినారు . వారిని  , " ఆయుష్మాన్ భో విధి " అని ఆశీర్వాదము చేయవలెను . అయితే వారి పేరు తెలియదు . కాబట్టి పేరు చెప్పవలసిన చోట ఏదో శక్తి వలన ప్రేరితుడై , తాను ఏమి చేయుచున్నానన్న దానిపై గమనమే లేకుండా , ’ యాజ్ఞవల్క్య విధి ’ అంటాడు . ఇతడు , ’ ఇదేమి నేను ఇలా చేసితిని ’ అనుకొనేలోపలే , ఆ అభివాదకుడు " తమరు చెప్పినది సరిగ్గానే ఉన్నది . అదే నా పేరు కానివ్వండి . నామ రూపములు సత్యము కాదు అని తెలిసినప్పుడు , వ్యవహారమునకు ఏ పేరైతేనేమి ? " అని నవ్వుతాడు . దేవరాతుడికి , ’ ఇతడేనేమో మా కడుపున వచ్చి పుట్టి మా పుత్రుడగువాడు ? ’ అని తోచినది . ఎవరో , ’ అవును , ఇతడే ! మొదట నమస్కారము చేయి . ఆ తేజస్సు చూచినావా ? యజ్ఞేశ్వరుని వలె ప్రకాశిస్తున్నాడు . ’ అంటారు . దేవరాతునికి బుడిలుడు చెప్పినది జ్ఞాపకమునకు వచ్చి , అతనికి మనసా నమస్కరిస్తాడు . ఆగంతకుడు అది తెలుసుకొని , ’ ఎంతైనా నేను మీ కొడుకుని . నాకెందుకు నమస్కారము ? మీ జ్యోతి వలన ప్రయోజనమును పొందుటకు వచ్చినవాడను ’ అంటాడు . దేవరాతుడు , ’ మీరు ఎక్కడి నుండీ వచ్చినారు ? " అని అడగవలె ననుకుంటాడు . మాట నోటి నుండీ వెలువడుట కన్నా ముందే , అతడు దానిని తెలుసుకున్నవాడివలె , ’ నేనే చెప్పవలెనని యుంటిని , మీరే అడిగినది మంచిదే అయినది . ఇకపైన నన్ను ఏకవచనములో యాజ్ఞవల్క్య అనియే సంబోధించండి . తమ బిరుదు ’ యజ్ఞవల్క్య ’ అని ! తమరి పుత్రుడనని నాకు ఆ పేరు కానివ్వండి . నేను తపో లోకమునందు ఉంటిని . అక్కడ ఎవరూ నామ రూపములను అంతగా గౌరవించరు . ఒక దినము , నేను తమ దంపతుల దర్శనము చేసి , గర్భమును చేరితిని కదా , దానికి ముందే దేవతలూ , ఋషులూ , తమరి పితరులూ మా ఆశ్రమమునకు వచ్చి , ’ నువ్వు భూలోకమునకు వెళ్ళి రావలసియున్నది . ’ అన్నారు . ’ నేను అక్కడ ఎన్ని దినములు ఉండవలెను ? ’ అని అడిగితిని . దానికి వారు , ఒక పురుషమానము ఉండవలెను . అక్కడ విశ్వోద్ధారమునకు ఒక సంహిత , ఒక బ్రాహ్మణము , ఒక ఉపనిషత్తు యొక్క అవతారము కావలసియున్నది . దానికోసమై నువ్వక్కడికి వెళ్ళవలెను ’ అన్నారు . ’ నేను ఇక్కడ ఒక రూపములోనుండి , అక్కడ ఇంకొక రూపముతో ఉండవచ్చు కదా ? ’ అని నేను అడిగితిని . వారు , " కాదు , మహా విష్ణువు యొక్క ఆజ్ఞ అయిన దేమనగా నీ సంపూర్ణ తేజస్సుతో నువ్వు అక్కడ పుట్టవలెను అని ! అందుకే మేము ముగ్గురమూ వచ్చినాము ." అన్నారు . మహా విష్ణువు యొక్క ఆజ్ఞ అన్న తర్వాత ,నేను మారు మాట్లాడక ఒప్పుకున్నాను . "  

         దేవరాతునికి ఈ వేళకు అతడి సామీప్యము వలన పరిచయము బలమై మాటలాడుటకు ధైర్యము వచ్చినది . " ఆ దినము ఎందుకో ఆత్రాత్రముగా వచ్చుచుంటిరి ? " అని అడిగినాడు . " అవును , దానికీ కారణము ఉన్నది . మొదట మీరు నన్ను బహు వచనములో సంబోధించుట మానవలెను . నేను , ఆరు నెలలు నిండినాయి , గర్భము పెరిగినది , అనుకొని వచ్చినాను . తపోలోకమున మేము పున్నమి నుండీ పున్నమికి లెక్క వేసుకుంటే , మీరు అమావాశ్య నుండీ అమావాశ్యకు లెక్క వేసెదరు . దానివలన పదునైదు దినములు వెనుక ముందు అయినది . దానివలన మీకేమీ ఇబ్బంది కాలేదు కదా ? నేను అటుల అకాలము నందు వచ్చినందు వలన మీతో మాట్లాడుటకు  మరలా తమరింటిలో సీమంతము జరుగు వరకూ వేచి ఉండవలసి వచ్చినది . ఆ దినము  తమరి పితృ పితామహులు నాతో పాటు వచ్చి నన్ను అనుగ్రహించినారు . ఆదినము ఆ వృద్ధులొకరు మమ్ములను చూచినారు . వారు మీ తండ్రిగారి స్నేహితులని తెలుస్తున్నది . వారుకూడా ’ నీపేరేమి ? ’ అని అడుగవలె ననుకొను లోపల మేము అంతర్థానమైతిమి . మీకది తెలిసియే ఉండవలెను . " 

దేవరాతుడు , " ఔను ,ఔను . " అని తలాడించినాడు . 

        యాజ్ఞవల్క్యుడు కొనసాగించి అన్నాడు , " అప్పటినుండీ మీరు నన్ను చూడవలెనని సంయమము చేయుచుండినదీ నాకు తెలుసు . నేనే వచ్చి మిమ్ములను చూచుట విహితము  కానీ అప్పటికింకా గర్భము నందున్న పిండములో ప్రాణము  సరిగ్గా చేతికి దొరకునట్లే లేదు , అక్కడున్న కరణములూ నాడులూ ఇంకా సమాహితముగా లేనందు వలన , నేనే మీకు ఈ గడచిన పది రోజులుగా అవకాశము ఇవ్వలేదు . అది తప్పయినచో మన్నించవలెను . " 

" ఒక వేళ అలాగ సంయమము చేసినచో యేమయ్యెడిది ? " 

" ఈ పిండము సడలి , పడిపోయెడిది . ఇంకొక గర్భ కాలము వరకూ వేచి ఉండవలసి వచ్చేది . " 

         " మంచిది , ఇంకొక సంహిత , బ్రాహ్మణము , ఉపనిషత్తు లను లోకానికి ఇవ్వవలెనని జన్మమెత్తుతున్నావు కదా ! అంటే అప్పుడు వేదములు అయిదు అవుతాయా ? " 

        " లేదు , ఎప్పటికీ వేదములు నాలుగే ! బహుశః నేను తేబోయే వేదము ఇప్పటి యజుర్వేదములో చేరిపోయి ఇంకొక పేరుతో వ్యవహరింప బడవచ్చు . బ్రాహ్మణములోనే ఉపనిషత్తు ఉండటము వలన , వాటివలన ఎట్టి బాధా కలుగునట్లు లేదు . " 

" ఇటుల సంహిత , బ్రాహ్మణోపనిషత్తులను కరుణించు నీకు మేము ఎటువంటి శిక్షణను ఇవ్వవలెను ? " 

          యాజ్ఞవల్క్యుడు నవ్వి అన్నాడు , " ఈ జన్మము దేవకార్యార్థమై కలుగుతున్నది . అటులన్ననేమి ? అని మీ సంశయము !  ఈ జగత్తు , కాల -దేశములకు అంకితమై నడుస్తున్నది . కాలము ఎప్పుడునూ పాకము చేయు స్వభావము కలది . దాని పాకము వలన ప్రతియొక్క చేతనమూ తన తేజస్సులోనూ , సామర్థ్యములోనూ క్షీణతను చూడవచ్చును . వీణను శృతి చేసి వదలితే , మ్రోగించినా , మ్రోగించకున్నా శృతి తగ్గుట లేదూ ? అటుల ! అప్పుడు దేవతలు ఆ క్షీణతను తీసివేసి మరలా మొదటివలె చేయుదురు . ఇప్పుడు జగత్తు అటులనే క్షీణతను పొందియున్నది . అది వక్రమగులోపల దానిని సరితూకము చేయు సాధనము నొకదానిని సిద్ధము చేయవలెనని దేవతలు ఆలోచించి , ఆ పనికి నన్ను దర్విగా చేసుకున్నారు . కాబట్టి ఈ జన్మమును , లేదా కర్మ కరణమును సరిగ్గా ఉంచుకొనుట దేవతల పని . అదీగాక , ’ వయమగ్నేర్హి మానుషాః ’ అంటే మేము అగ్నిని నమ్ముకున్నవారము . అయినా మీరు అడిగినందుకు చెప్పెదను , మా కాబోయే తల్లికి మీరు ’ పూర్ణమదః పూర్ణమిదం ’ అను ఒక మంత్రమును నేర్పండి . ఆమె అదొక్క దానినే ప్రసవమగు వరకూ జపము చేస్తూ ఉండనీ , ఆ తర్వాత నన్ను తొట్లలో వేసినపుడు , దానితో పాటు ’ భద్రం కర్ణేభిః ’ మంత్రమును చెప్పితే చాలు . ఆమె మడి , మైల యను ఆలోచనలే లేకుండా , సర్వ కాలము లందూ ఈ మంత్రములను వీలయినంతగా పారాయణము చేస్తూ ఉండనీ . " 

         దేవరాతుడు తన సంశయము గురించి అడుగవచ్చునో లేదో అని మనసులో ఆలోచించాడు . యాజ్ఞవల్క్యుడు దానికి కూడా ఉత్తరము నిచ్చాడు , " తమరు , ’ నా పుత్రుడు బ్రహ్మవాదియై బ్రహ్మను ఎంచుకొని కర్మలను వదలివేస్తే ఏమి గతి ? ’ అని సంశయము పడ నవసరము లేదు . నేను అప్పుడే చెప్పితిని కదా , సంహిత , బ్రాహ్మణములను జగత్తుకు ఇచ్చుటలో కర్మముల నన్నిటినీ అద్దము వలె స్వచ్ఛ పరుస్తాను . ఈ కురు , పాంచాల , కాశీ , మద్ర దేశము లన్నిటిలోనూ తమరి కీర్తి గర్జించునట్లు చేస్తాను . ఆ పిమ్మట ఇంకా అవకాశమున్న , సన్యాసమును తీసుకొనెదను , సమ్మతమే కదా ? " 

         దేవరాతుడికి ఏమి చెప్పుటకూ మాట రాలేదు . కొడుకు చెప్పిన దాంట్లో అతనికి కొంచము కూడా సందేహము రాలేదు . సూర్యుడిని చూసినపుడు అతడు తేజోరాశి యనుదానికి ప్రమాణాంతరము ఏమీ అవసరము లేనట్టే , అతని మాటలలోనే స్వతహాగా ఏదో ప్రమాణమున్నట్లే అనిపించి , అతడిని అది ఒప్పించినది . 

         యాజ్ఞ వల్క్యుడు లేచి , ’ నేను వెళ్ళి వచ్చెదను , కాలాతీతమగుతున్నది . నేను చెప్పినది నిజము అనుటకు సాక్షిగా కార్తీక శుక్ల సప్తమి దినము నా జననమగును . అప్పుడు తప్పకుండా మేధా జననమును చేయండి . మిగిలినదంతా శాస్త్ర ప్రకారము జరగనివ్వండి . " అని చెప్పి అభివాదనము చేసినాడు . దేవరాతుడు కూడా వేదోక్తముగా కొడుకుకు ఆశీర్వాదము చేస్తుండగా , మంత్రము ముగిసే దానికన్నా ముందుగనే మెలకువ అయినది . మెలకువ అయినా కూడా మంత్రము తానే పలుకుతూ పూర్తి అయినది . 

        ఆలంబినీ దేవి కూడా ఆ మంత్ర శ్రవణము చేత మేలుకొని , ’ ఇదేమి ? పడక పై పరుండియే మంత్రమును చెప్పుతున్నారు , బాగున్నది వరస ! ’ అంది . 

        దేవరాతుడు నవ్వుతూ , " అంతా నీ పుత్రుని ప్రభావము ! " అని కల గురించి చెప్పినాడు . ఆమె , ’ అదేమిటి , కల అంటారు ? మీరు ఎవరితోనో మాట్లాడుచుండుట నాకు అర్థమయింది . అదంతా నేను కూడా విన్నాను కదా ? " అని ఆశ్చర్యపోయింది . 

          దేవరాతుడు , ’ నువ్వే ముఖ్యముగా ధన్యురాలవు . కృతార్థురాలవు . నీ పుణ్యము వలన ఈ ఇంటిలో ఇంకా ఏమేమో విచిత్రములు , నమ్మశక్యము గానివి , జరుగుతాయి . నిన్ను చేపట్టి నేను కూడా ధన్యుడనైనాను  అను కాలము వచ్చినది " అని విచిత్రమైన తృప్తి ధ్వనించు పలుకు పలికాడు . 

       ఆలంబిని , ’ ఆ ? ఇదేమి చమత్కారము ? మీ చేయి పట్టి మీవంటి విద్వాంసుల ఇల్లు చేరి నేను కృతార్థురాల నైనానని రాత్రింబవళ్ళూ అనుకుంటున్నాను . " అంది .

         దేవరాతుడు భార్యపై విశ్వాసముతో ఆమెను ఆలింగనము చేసుకొని ,"  బీజము ఎంత మంచిదైతేనేమి ? దానికి తగ్గట్టు సంపన్నమైన క్షేత్రము కూడా కావలెను ." అని చుంబించాడు . ఆమె కూడా భర్త యొక్క ఆ స్తుతినీ , మోహన కార్యమునూ వద్దనకుండా విశ్వాసముతో  స్వీకరించినది . 

Monday, January 14, 2013

4. " మహా దర్శనము "--- నాలుగవ భాగము--- నక్క తోక తొక్కినవాడు


4.  నక్క తోక తొక్కినవాడు

        శ్రావణ శుద్ధ సప్తమి రోజు ఆచార్య దేవరాతుని ఇంట్లో సీమంతోన్నయనము . రాజ పురోహితుడు మొదలుకొని , రాజధానిలోని బ్రాహ్మణ శ్రేష్ఠులందరూ దయ చేసినారు . ఆశ్రమవాసులలో ముఖ్యులను మాత్రము పిలిచినారు . వారిలో కూడా అతి ముఖ్యులు ఉద్ధాలకుడు , వైశంపాయనుడు . 

         సంస్కారము సకాలములో నెరవేరింది . రాజభవనపు వైణికుడు పురోహితుల మంత్రముతో పాటు  వీణావాదనము గావించినాడు . సామగానమయినది . ఋక్కులను పఠించి బ్రాహ్మణులు దంపతులను  దీవించినారు . బయటినుండీ ఎవరో వచ్చినట్టూ , వారి సన్నిధి తమకెంతో ప్రీతి పాత్రమైనట్టూ అందరికీ అదేదో భావన . ఎవరొచ్చినారు ? ఏమిటీ అని వివరాలడిగితే ఎవరూ చెప్పలేరు .  అలాగని , తమకు స్పష్టముగా అనుభవమైన భావనను ఎవరూ కాదనలేరు . 

        కర్మాంతములో బ్రహ్మణాశీర్వాదము జరుగుతుండగా బ్రాహ్మణ ముత్తైదువలు స్వరమెత్తి పాటలు పాడినారు . కొత్త చీరకట్టుకొని పెళ్ళికూతురి కళతో మెరుస్తున్న ఆలంబినీ దేవికీ , గర్భ దీక్షతో ప్రకాశిస్తున్న ఆచార్యునికీ హారతి యెత్తి , దిష్టి తీసి మనస్ఫూర్తిగా దీవెనలందించినారు . అంతా సాంగముగా నడిచింది . అతిథులంతా భోజన తాంబూలాది ఉపచారముల నన్నిటినీ స్వీకరించి తమ ఇళ్ళకు మరలినారు . 

         దేవరాతునికి యజ్ఞేశ్వరుడు చెప్పినది జ్ఞాపకము ఉంది. సీమంతోన్నయనము కానీ అని వేచియున్నాడు . ఈ దినము వరకూ , ఈ కర్మ ముగియు వరకూ గర్భములో నున్న వాడి పైన తనకు అధికారము లేదు . సీమంతమయినాక  గర్భస్థ జీవుడు తన వంశానికి చేరి తన వాడయ్యాడు . ఆ తరువాతనే తాను అడగ దలచుకొన్నదంతా అడిగే అధికారము తనకి వస్తుంది . అంతవరకూ తాను ఆ జీవుడిని మాట్లాడించుటకు కూడా లేదు . 

         " ఇప్పుడు ఆ జీవుడు తన కొడుకైనాడు , నేను వాడిని మాట్లాడించేదా , లేక వాడే నన్ను మాట్లాడించవలెనా ? మాలో ఎవరు జ్ఞాన వృద్ధులో వారిని ఇతరులు మాట్లాడించవలెను . ఈ వ్యవస్థ  తెలిసేదెలాగు ? పిండము చిన్నదయినంత మాత్రాన , అందులో ఉన్నవాడు చిన్నవాడు అనుట యెలా ? దేహ దృష్టితో అలాగ అనవచ్చునేమో కానీ , దేహములో, దేహముకాని ఇంకొకడు ఉండగా , ఈ చిన్నా పెద్దా తారతమ్యము తెలిసేదెలా ? ఎవరు తెలుపగలరు ? " అని ఆచార్యునికి ఈ దినము కూడా పెద్ద ఆలోచన . 

          దానితోపాటూ ఇంకో యోచన . కొడుకు అంటే ’ మాత్రా శిష్యుడు’  . ఉపనయనము అయ్యే వరకు వాడికి తల్లే గురువు . కాబట్టి , తల్లినుండి ఏమేమి నేర్వవలెనో అవన్నీ నేర్వాలంటే ఆమె వాడికి బ్రహ్మవిద్యను కూడా నేర్పవలెను . ఇంతవరకూ తాను భార్యను కర్మ కాండలో తనకు కావలసినట్లు మలచు కొన్నాడే తప్ప బ్రహ్మ విద్యను ఆమెకు చెప్పించ లేదు . బ్రహ్మవిద్య అంటే అదొక కొత్త అనుభవము . దానిని నేర్చితే ఆమె సంసారానికి అయోగ్యురాలవుతుందని తనకు బెదురు . ఇప్పుడిక , ఆ బెదురు వల్ల ముందరి తరము కుంఠితమవుతుందంటే అది న్యాయము కాదు . జరగ వలసిన దంతా జరిగియే తీరవలెను . దీనికి విశ్వమంతా కట్టుబడియే యున్నది . ఈ విశ్వములో ఏదైనా ఒక మూలలో ఏదైనా ఒకటి మంచో , చెడో జరిగితే , అది విశ్వమునంతా వ్యాపించును . ఒక పాత్రలో నీరు తీసుకొని , దానిలో ఒక ముద్ద చెక్కెర గానీ , ఉప్పుగానీ వేస్తే అది కరగి నీరంతా వ్యాపిస్తుంది . అది ఎక్కువగా ఉంటే నీటికి తన రుచిని ఇస్తుంది . అదలా చేయుటకు చాలినంత లేకున్నా , నీటి రుచిని కొంచమైనా మార్చును . అదే విధముగా , వ్యక్తి వ్యక్తి యొక్క కార్య కలాపములన్నీ కూడా విశ్వ వ్యవహారమును రూపించును అను నమ్మకము ఉన్న ఆచార్యుడు , పుత్రుడు గర్భములో ఉండగానే తల్లి వాడికి శిక్షణను ప్రారంభించ వలెను అనుదాన్ని ఎలా మరవగలడు ?  దాన్ని ఎలా తిరస్కరించగలడు ? 

          అదీకాక , సాక్షాత్తూ యజ్ఞేశ్వరుడే చెప్పినాడు కదా , " దేవ , ఋషి , పితరులు ఆ జీవుడు మరలా భూమిలో పుట్టుటకు నిన్ను ఎంచుకున్నారు " అని ! అలాంటపుడు తాను ఎలా నడచుకొనవలెను ! అది చాలదన్నట్టు , " ఇపుడు గర్భములో పుట్టబోయే కొడుకు మీ వంశమును మాత్రమే కాదు , లోకాన్నే ఉద్ధరించును " అన్నపుడు , తాను ఆ శిశువు శిక్షణను ఎటుల కుంఠితము చేయగలడు ? ఇక తప్పదు , తల్లియే బిడ్డకు శిక్షణ నిచ్చుటకు కావలసిన సామర్థ్యమును తల్లికి కల్పించి ఇవ్వవలెను . లేకున్న , తాను కర్తవ్య లోపము చేసినవాడవుతాడు . అది సర్వథా కూడదు . " 

          " ఈ విషయము సరే , మరి నా భయము  లేదా  , సంశయము తీరుటెలా ? గర్భమున నున్న జీవుడితో మాట్లాడువరకూ సంశయము తీరదు . కాబట్టి , ఇప్పటికి , సంశయమే లేనప్పుడు ఎలా నడచుకొనెదనో , అలా నడచుకొనవలెను . మొత్తానికి , ఎవరో విశ్వోద్ధారము చేయుటకు సామర్థ్యమున్న జీవుడు మా కడుపున పుట్టబోతున్నాడు . వాడు పుట్టి పెరిగిన తరువాత అతడి సామర్థ్యములో ఏ లోపమూ కనబడకుండా చూసుకొను భారము నాది . ఇప్పుడు తానేమి లోపము చేసిననూ అది ముందు ముందు  వాడి సామర్థ్యమును కుంఠితము చేయవచ్చు . కాబట్టి , నేను దీనిని నా పత్ని ద్వారా నెరవేర్చవలెను . నెరవేర్చుట మాత్రమే కాదు , ఆ కార్యము మొత్తము సంతృప్తిగా జరుగునట్లు సర్వభారమును వహించవలెను . "

          " సరే , అట్లే , ఆ జీవుడు వచ్చినపుడు మాట్లాడుటకు మొదట నేను పిలవరాదు . వాడే వచ్చి మాట్లాడించనీ . ఔను  , అదే మంచిది , జ్ఞాన వృద్ధులు ఎవరో తెలియనపుడు ఇంకేమి చేయవలెను ? యజ్ఞేశ్వరుని మాటల వలన , వాడే జ్ఞాన వృద్ధుడు యని అనిపిస్తున్ననూ , అది నేరుగా ధృవము కాలేదు .  కాబట్టి , వాడే వచ్చువరకూ వేచియుండవలెను . వాడు వచ్చినపుడు , నీకు తల్లివలన ఏమేమి , ఎటువంటి  శిక్షణ కావలెను ? అని వాడినే అడగవచ్చును . విశ్వోద్ధారము చేయుటకు వచ్చువాడికి ఆత్మోద్ధారపు దారి తెలియకుండునా ? ఒకటయితేనే కదా ఇంకోటి అయ్యేది ? " 

        ఆ దినమంతా వచ్చినవారితో నవ్వుతూ మాట్లాడుచున్ననూ బ్రాహ్మణ భోజన సమయములోను , భోజనోత్తర తాంబూల సేవన వేళ లోను , అనుక్షణమూ అతడికి అదే యోచన . ఏమైతేనేమి , అందరూ వెళ్ళిపోయినాక ,  సాయంత్రము వేళకి తప్పో ఒప్పో ,ఒక నిర్ధారణకు వచ్చి , మనసు తేలికైనది . 

       ఇంకేమి చీకట్లు ముసుర బోతున్నాయి , దేవరాతుడు స్నానానికి లేవవలెను , అప్పుడు ఒక బ్రాహ్మణుడు ఆచార్యుని పిలుస్తూ లోపలికి వచ్చినాడు . అప్పటికే తేలిక మనసుతో ఉన్న ఆచార్యుడు తనను పిలిచిన గొంతు ఎవ్వరిదో , వచ్చినదెవరో వెంటనే గుర్తించి , " దయ చేయండి , బుడిలులు మరలా వచ్చి నన్ను పావనము చేసినారు " అని లేచి అభిముఖముగా వచ్చినాడు . వచ్చిన వాడు బుడిలుడు . రాజ పురోహితుడు భార్గవుని దగ్గర బంధువు . అధ్యయన , అధ్యాపనములలో పేరు ప్రతిష్టలు పొందినవాడైననూ , రాజాశ్రయము వద్దని ,  అంతంత మాత్రముగా ఉన్నా , ఏదో ఉన్నంతలో గుట్టుగా ఉన్నవాడు . అయినా , బ్రాహ్మణ మండలములో సర్వుల గౌరవానికీ పాత్రుడైనవాడతడు . 

బుడిలుడు , " దేవరాతా, నిజం చెప్పు , నువ్వు నక్క తోక తొక్కి వచ్చినవాడివా కాదా ? " అంటూ లోపలికి వచ్చినాడు . 

     దేవరాతుడు అతనికి పాదోదకమునిచ్చి , పిలుచుకొని పోయి నడిమింట్లో వేత్రాసనముపై కూర్చోబెట్టి ,  " మీ మాట నిజమే అయిఉండాలి , కాకుంటే మీరు మరలా వచ్చేవారా ? " అని నవ్వాడు . 

       " నేనెందుకు మళ్ళీ వచ్చినానో తెలుసా ? నేను ఈ వేళకే స్నానము చేసి ముక్కు పట్టుకొని కూర్చొని ఉండవలసినది . కానీ , నిన్ను చూచి , నీకొక సంగతి చెప్పి ఇంటికి  వెళదామని వచ్చినాను . అప్పుడే చెప్పి ఉండవచ్చు గదా అంటావేమో , అది అలాగ పదిమందిలో చెప్పే మాట కాదు . అదొక రహస్యము కూడా, అందుకే చెప్పలేదు . ఈ దినము నువ్వు దర్భాసనము మీద కూర్చొనియున్నపుడు నేను నిన్ను చూస్తూ ఉన్నవాడిని  , అటులే ఊరికే చూస్తూ ఉండాలా లేదా ?  ఊహూ , ఊరికే ఉండకుండా కర్మ జరుగుతున్నపుడు సంయమము చేసినాను . లేదంటే , ఏదో ఒక ప్రబలమైన శక్తి నాతో సంయమము చేయించినది అంటావా , సరే అటులే అనుకుందాం . ఎవరో ఒక మహా తపస్వి ఇక్కడికి వచ్చినాడు . నీ తండ్రి , తాతలు అందరూ అతని వెనకాలే చేతులు కట్టుకొని , శిష్యులు గురువుగారి వెనకాల ఎలాగ వస్తారో , అలాగ వస్తున్నారు . ఇదేమిటా అని నేను ఆశ్చర్య పడుతున్నాను . అప్పుడే ఆ వచ్చినవాడి తేజస్సు చూసి , ఇంతటి తేజస్విని నేను ఇంతవరకూ చూసి యుండలేదే అనుకొంటూ లేచి నిలుచున్నాను . మీ తండ్రి గారిని చూసి , "  వీరెవరు ? "  అంటున్నాను . ’ దేవతలూ , ఋషులూ ఇతడిని లోకోద్ధారమునకై పంపించినారు . మా అదృష్టము . మా ఇంటిలో పుడతాడు . మా దేవరాతుని అదృష్టమే అదృష్టము " అని మాయమైనారు . నేనూ సరేనని తలాడించినాను . అప్పటినుండీ నీకు ఈ సంగతి చెప్పాలని కాచుకొనియున్నాను . సమయము దొరకక , వెళ్ళిపోయి మళ్ళీ వచ్చినాను . నీకు చెప్పిన తరువాతే స్నానానికి వెళదామని వచ్చినాను . ముఖ్యముగా నీ కొడుకు తండ్రికే కాదు , తాత ముత్తాతలకూ కీర్తి తెచ్చువాడు అవుతాడు .  అతిపిత , అతి పితామహుడు ( తండ్రినే కాదు , తాత ముత్తాతలనూ మించువాడు ) అవుతాడు .  అందులో సందేహము లేదు . ఇప్పుడు చెప్పు , నువ్వు నక్క తోక తొక్కినావా లేదా ?  తండ్రిని మించిన తనయుడవబోయే వాడిని ఎత్తుకొనే నువ్వు భాగ్యవంతుడివా కాదా ? " 

" బుడిలుల వంటి మహనీయుల ఆశీర్వాదము వలన అలాగయిన , అది ఆశీర్వాదపు మహత్యము కాదా ? " 

" నీ మహత్యాన్ని నాతో పంచుకోవాలనున్నావా , బాగుంది , సరే , నేనిక వెళ్ళి రానా ? " 

       దేవరాతుడు బుడిలునికి నమస్కారము చేసి , తన భార్యను పిలచి  , ఆమె చేత కూడా నమస్కారము చేయించినాడు . అతని ఆశీర్వాదమును ఇద్దరూ పొందినారు . బుడిలుడు బయలుదేరాడు .

దేవరాతుడు " మాట " అన్నాడు . 

      బయలుదేరిన బుడిలుడు నిలచి , " త్వరగా ముగించు , ఇంకా నేను వెళ్ళి , స్నానము , సంధ్యావందనము , అగ్ని హోత్రమూ చేయవలెను " అన్నాడు . 

" అటులే , బ్రాహ్మణ సమాజములో జ్ఞానము చేతనే కదా వృద్ధత్వము ? " 

       " దానిలో సందేహమా ? బ్రాహ్మణులలో జ్ఞాన వృద్ధులకు అగ్ర తాంబూలము . క్షత్రియులలో పరాక్రమము . వైశ్యులలో ఐశ్వర్యము . ఇతరులలో వయో వృద్ధత్వము " 

       " సరే , ఒకవేళ మీరు చెప్పినట్లే తండ్రిని మించువాడొకడు ,  తండ్రి ఎదురుగా వచ్చినాడనుకుందాం . అప్పుడు తండ్రి అతనికి నమస్కారమెలా చేస్తాడు ? తండ్రి యైనందువలన పెద్దవాడిని కదా , మరి సత్కారము చేయుటెలా ? " 

       " అటువంటి సమయము వస్తే కొడుకు దేహముతో నమస్కారము చేయవలెను , తండ్రి మనస్సుతో నమస్కారము చేయవలెను . "

" ఓహో  , సరే , నాకిది అర్థమే అయి ఉండలేదు " 

        " ఇకమీదట అంతా అర్థమవుతుంది . మీ ఇంటిలో నైతే ఇలాగే జరగబోతున్నది . నేనిక వస్తా ... పొద్దు వాలేపోయింది ..." అని బుడిలుడు త్వరత్వరగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు . దేవరాతుడు  అతడిని వీడ్కొలిపి తాను కూడా స్నానానికి వెళ్ళినాడు . 

3. " మహా దర్శనము "--- మూడవ భాగము-- త్రేతాగ్నులు


3. త్రేతాగ్నులు

          దేవరాతునికి భార్యతో మాట్లాడుటకు ఆ పగలంతా అవకాశమే కలుగలేదు . భార్గవుడు వెళ్ళిన తరువాత , స్నానము , సంధ్య , అగ్నిహోత్రములు , రాత్రి భోజనము ... ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ , ఇంక దేనికీ సమయమే దొరక్కుండా అయింది . 

          ఆలంబినీ దేవి కూడా , పెనిమిటి స్నానాదులకు సర్వమూ సిద్ధము చేస్తూ ఆతడు తనకేదో చెబుతాడు అన్నది పూర్తిగా మరచేపోయింది . స్నానానికి నీరు అందించినపుడు గుర్తొచ్చింది . కానీ రుద్రము చెప్పుకుంటూ స్నానము చేస్తున్న భర్తను అడుగుటెలాగా అని ఊరికే ఉండిపోయింది . మరలా అగ్నిహోత్రమయిన తర్వాత , భోజనానికి ముందు భర్తకు గుర్తు చేసింది . అతడు , " మధ్యాహ్నము సమయమే దొరకలేదు , ఈ రాత్రి నిద్ర పోవుటకు వేగిరము వచ్చేయి , అంతా చెబుతాను " అని తన భోజనమును ముగించుకొని వెళ్ళినాడు . ఆమె మడితోనే అగ్నులకు మూఢములనిచ్చి ( పేడతో చేసిన ఎండిన ఉండలు ) వారి పరిచర్యలను ముగించుకొని తన భోజనము అయిందనిపించుకొని , పాలు తోడు పెట్టి , తాంబూలము తీసుకొని వడి వడిగా శయ్యా గృహమును చేరినది . శయ్యాగృహానికి ఆనుకొనే నడిమిల్లు , అక్కడే దేవరాతుడు తనను చూచుటకు వచ్చే గృహస్థులను ఆహ్వానించి కూర్చోబెట్టేది ,  ఉదయం పూట తన దగ్గరున్న పదహారు మంది శిష్యులకు  పాఠ ప్రవచనములను చెప్పేది . ఇలాగ , పొద్దునా సాయంత్రమూ తనవంతు పని తాను చేసిన తర్వాత నడిమిల్లు , పెద్ద మనుషుల ఇంటి ఇంతుల వలె నిర్లిప్తమౌతుండినది . ఒక్కొక్క రోజు దేవరాతుడు రాత్రి  భోజనమైన పిదప అక్కడున్న వేత్రాసనములలో సుఖంగా కూర్చొని తన పాటికి తాను ఆలోచనలలో మునిగిపోయేవాడు . 

         శయ్యాగృహానికి మరలిన పడతి , మూలలో ఒక ఆసనములో కూర్చొని ,  పైకి వస్తున్న చంద్రుణ్ణి తదేకంగా చూస్తున్న కాంతుని చూడలేదు . అతడు కూడా అన్యమనస్కుడై యుండి భార్య అటుగా వెళ్ళడము గమనించలేదు . అదీకాక , నడిమింట్లో ఉన్న చిరు దీపము అక్కడున్న దాని నంతటినీ తెచ్చి కన్నులకు పట్టించ గలంత ప్రకాశముగా కూడా లేదు . 

         ఆమె , భర్త శయ్యాగృహములో ఉన్నాడనుకొన్నది , అతని శయ్య శూన్యముగా ఉండుటను చూసి వెనక్కు తిరిగి చూసింది . అప్పుడు , మూలకూర్చున్న భర్తను చూసి , తాను వచ్చినది సూచించుటకు చిన్నగా దగ్గింది . ఆ దగ్గు , భర్త గమనాన్ని ఆమె వైపుకు మరల్చింది . అతడు తిరిగి చూసి , " నువ్వు ఇంత త్వరగా వస్తావనుకోలేదు, అందుకే ఈ ఉదయిస్తున్న చంద్రుడి సొగసు చూస్తూ కూచున్నాను . ఇప్పుడు చూడు , ఈ చంద్రుడు ఎర్రగా పగడపు రాశి వలె ఉన్నాడు . వీడే ఇంక కొంత సేపైతే ఇంకా పైకి వచ్చి వెండి వర్ణానికి వస్తాడు . అదెందుకో మనసులోకి వచ్చింది . నీ గర్భములోనున్న శిశువు కూడా ఇలాంటివాడే . పుట్టినపుడు దుర్బలమైన శిశువుగా ఉండి , పెరిగి పెద్దయినాక ఏమవుతాడోనని సంశయ పడుతున్నాను " అన్నాడు . 

" మన కడుపున పుట్టేవాడు మన మాట వినకపోతే ఇంకెవరి మాట వింటాడు ?  కాబట్టి మీరు ఆ సంశయాన్ని వదలండి " 

         " నాకిక సంశయమేదీ లేదు . నాకన్నా ప్రబలుడగు పుత్రుడు పుట్టుటలో నాకే సందేహమూ లేదు . అయితే , పుత్రుడు బ్రహ్మ పరాయణుడై కర్మత్యాగము చేసి , కర్మ భ్రష్టుడైతే ఏమి చేయుట ? అదొకటే సంశయము " 

" మధ్యాహ్నము మీ స్నేహితులు ఏదో చెప్పినట్లుంది ? " 

        " నువ్వు నిలుచున్నావు , నేను కూర్చున్నాను . ఈ మాటలు ఇక్కడ వద్దు , అదంతా విస్తారంగా చెపుతాను పదవే , " అని దేవరాతుడు భార్యతో పాటూ శయ్యాగృహానికి వచ్చినాడు . అక్కడ ఆకులు వక్కలు వేసుకుంటూ మళ్ళీ మాటలు మొదలయ్యాయి . భార్గవుడు తన సంశయ నివారణ కోసము అన్నదంతా చెప్పి , " చూడు , ఆలంబీ , నిన్న రాత్రి చూసినది ఎందుకో భీతి గొలుపుతున్నది . వచ్చి నీ గర్భాన్ని చేరినవాడు శ్వేత వస్త్ర ధారి యైననూ నా మనస్సుకు అతడు సన్యాసి అయి ఉండవచ్చును అనిపించినది . కాబట్టి నీ గర్భములో పుట్టువాడు సన్యాసియయితే ఏమి గతి అని దిగులు . " అన్నాడు

         ఆమె , నోటిలో తాంబూలము ఉన్నదని కూడా మరచి గొల్లున నవ్వింది . నోటిలోని ఎర్రటి తాంబూలపు ద్రవము చింది ఉండాలి . దేవరాతుడు ఉత్తరీయము పైన పడిన ఎర్రటి చుక్కలను భార్యకు ఆ చీకటిరాత్రి ముసినవ్వుతో చూపించాడు . ఆమె నమస్కారము చేసి ,"  అగ్నిహోత్రములో  నిప్పు రవ్వలు ఎగసినట్లైంది . తప్పు మన్నించవలెను " అని దానిని తుడిచింది . 

     " ఇది ముఖ్యముగా నీ రాజ్యము . ఇక్కడ నువ్వేమి చేసినా చేయించుకోవలసినదే " అధికారము కోల్పోయినవాడిలా అన్నాడు భర్త .

         " కావాలని చేసి ఉంటే మీ ఆక్షేపణ సరిగ్గానే ఉండేది .  కానీ ఇది హఠాత్తుగా జరిగింది . అదీగాక , దానికి కారణము మీరే . దేనికీ భయపడని మీరు , ’ గర్భములో మగ పిల్లవాడే పుడతాడు , వాడు సన్యాసియే అవుతాడు ’ అంటూ దిగులు పడుతుంటే నాకు నవ్వు వచ్చింది . ఏమైతేనేమి , మీ కోపము నమస్కారము తో సరి . సరే , ఒకవేళ పుట్టే బిడ్డ ఆడపిల్లయితే ? " 

       " ఇందుకే మిమ్మల్ని , ఆడవారు , అయోగ్యులు అనేది . పుంసవనము అయిన పిమ్మట ఆడపిల్ల ఎలాగవుతుంది ? నీ గర్భములో మగ పిల్లవాడే పుడతాడు . ఆ విషయములో ఆవగింజంత కూడా అనుమానము లేదు . సంస్కారమునకు బలము లేదా ? మీ ఆడవారు , తల తీసి ముందు పెట్టినా నమ్మరు , దూడ ఎదురుగ్గా నిలుచున్నా , దీనికి మూడే కాళ్ళేమో అని సందేహపడే జాతి . అదంతా సరి కాదు , సంస్కార విహితమైనది జరిపినాక , గర్భస్థమైన పిండము మగపిల్లవాడే అవుతాడు . అంతే కాదు , నాకన్నా ప్రబలుడు కూడా అవుతాడు . నా సందేహమల్లా , వాడు ఒకవేళ కర్మ త్యాగము చేసి సన్యాసియయితే ఎలాగా అని మాత్రమే . " 

" కర్మలలో , సంస్కారములలో ఇంత శ్రద్ధ ఉన్నవారు , కొడుకు సన్యాసి కాకుండా  మీరొక హోమాన్ని చేయండి " 

       " అది అంత సులభము కాదు . అయినా , ఆలంబీ , నువ్వు చెప్పేది నిజము . నాకు యజ్ఞవల్క్యుడు--అంటే కొత్త యజ్ఞములను నేర్పించువాడు అని బిరుదు . సన్యాసి కాకుండా చేయుటకు ఒక యజ్ఞమును రచించవచ్చు . కానీ , సన్యాసమంటే ఏమిటనుకున్నావు ? కర్మఠ బ్రాహ్మణుల సంస్కృతీ సర్వస్వపు గోపుర కలశమది . కానీ అక్కడ చెప్పినది కర్మ త్యాగము . దాన్ని నా మనసు ఒప్పుకోదు . అలాగని స్వతంత్రించి ఏమైనా చేద్దామా అంటే , సన్యాసము అనేది శాస్త్రము ఒప్పుకున్నదే , నిషిద్ధమేమీ కాదు . నా ధర్మ సంకటము అక్కడే . " 

      " అలాగైతే నేను చెప్పినట్టు చేయండి , వాడికి గర్భ పంచమములోనే ఉపనయనము చేయండి . ఒక వేదమైనా సాంగముగా అధ్యయనము చేయగానే సమావర్తనము చేయించి పెళ్ళి చేసెయ్యండి . మీ కొడుకైన తర్వాత , వాడు ధర్మాన్ని మీరడు . గృహస్థుడై పడిఉంటాడు . " 

         దేవరాతుడు అది సాధ్యము కాదని తల అడ్డముగా ఊపుతూ అన్నాడు , " ఒక వేదము చదవగానే అయిపోయిందనుకున్నావా ? నీ గర్భములో ఉన్నవాడు స్వంతముగా వేరొక వేదాన్నే పొందగలవాడు కావలెను . అదీ కాక , ఆలంబీ , యజ్ఞేశ్వరుడి వలె , .....నా మాట జాగ్రత్తగా విను ,  కర్మ కాండ , బ్రహ్మ కాండలు రెండింటిలోనూ ఉపపాద్యుడైన యజ్ఞేశ్వరుడి వలె జాత వేదుడు కాకపోయినా అతడికి సమానముగా సర్వజ్ఞ కల్పుడు కావలెను . అంతటి కొడుకును పొందలేకపోతే నేను యజ్ఞవల్క్యుడనై ఏమి సార్థకత ? అలాగని , ఏదో నోటిమాటగా బ్రహ్మవాది యగుట హితము కూడా కాదు . ఆడిన మాట ,  అనుభవపు బలముతో శృతియంతటి దృఢమతి కావలెను . అలాగ కావలెనంటే , పరిపూర్ణమైన బ్రహ్మమును సాక్షాత్కరించుకోవలెను . అంటే , దానికి కర్మ త్యాగము ఒకటే గతి . నా సందిగ్ధము అర్థమైందా ? నేను చెప్పుతున్నది అదే .  అలాగయినప్పుడు , నేను ’ కర్మ శౌండ శౌండీరుడు ’ అని పొందిన ఈ ప్రసిద్ధి , ఈ ప్రఖ్యాతి , నాతోనే ముగిసిపోతుంది . అదే నా దిగులు . ఇప్పుడు నా దిగులు ఎటువంటిదో , దాని రూపమేదో చూచినావా ? అర్థమైందా ? "

         ఆలంబిని దీర్ఘంగా నిట్టూర్చింది . పొడినవ్వు నవ్వుతూ  అంది , " మీ దిగులు అర్థమైంది . అయితే , ఇది కూడా , ఆడ పిల్లలను కన్న వారి దిగులు వంటిదే , ఏనాటికైనా కూతురిని మగని వెంట పంపించియే తీరవలెను , ఇంటిలోనే ఉంచుకొనుటకు లేదు , అని ఆలోచించినట్లే . పోనివ్వండి , కన్యాదానము చేయునపుడు  ’ ఈమెకు పుట్టు కొడుకు మన ఇద్దరికీ కొడుకు కానీ , ద్వాముష్యాయణుడు కానీ ’ అని సంకల్పము చేసినట్లే , మీ కొడుకు కూడా కర్మ కాండ , జ్ఞాన కాండ రెండింటిలోనూ నైపుణ్యమును పొందువాడు అగునట్లు చేయండి ." 

     " కర్మ త్యాగము చేసే ’ విద్వత్తు యొక్క సన్యాసపు ’ అర్థము నీకింకా పూర్తిగా విశదము కాలేదు. దానివలన  , నీకు తోచిన ఉపాయమును సూచిస్తున్నావు . కానిమ్ము , దీనికి దేవతా శరణము తప్ప వేరే ఏ దారీ లేనట్లుంది . దేవుడు ఎలాగు చేస్తే అలాగే అవుతుంది . నాకేమో ఇది భారీ శల్యమైపోయింది " అని అతడు పెద్ద నిట్టూర్పు వదిలాడు . 

      నిట్టూర్పులాగానే దేహముకూడా దీర్ఘముగా శయ్యను పరచుకుంది . కాలాతీతమవుతున్నదని గమనించి ఇద్దరూ త్వరగా నిద్ర పోవలెనని దుప్పటిని పైకి లాగుకున్నారు . కానీ నిద్రాదేవి అనుగ్రహము ఒకరికైతే ఇంకొకరికి కాలేదు . 

      అతడు ఇంకొంచము సేపు ఎటూకాని ఆలోచనలతో పెనుగులాడి , చివరికి కేవలము ఆయాసముతో మాత్రము వచ్చు నిశ్చేష్టారూపమైన మగతలోని జారిపోయాడు . 

        సుమారు ఒక జాము గడచి ఉంటుంది . ఇద్దరూ చల్లటి నిద్రలో మునిగియున్నారు . లోకవ్యాపారమంతా మరపు వచ్చింది . అపుడతడికి ఒక కల . కలలో ముగ్గురు బ్రాహ్మణులు వచ్చినారు . ఒకరికన్నా ఒకరు తేజస్వులు . ముఖమును చూడగానే వారు ఎవరన్నది తెలుసుకొనుటకు వీలు కాకున్ననూ , మనసుకు , బాగా పరిచయమున్న వారిలాగానే అనిపిస్తున్నది . కానీ ఎంత ప్రయత్నించినా , వారెవరు ? ఎక్కడ చూచినాను ? అన్నది జ్ఞాపకమే రావడము లేదు . అయినా , దేవరాతుడు తన గృహస్థ ధర్మానికి తగినట్టు వారికి అర్ఘ్య పాద్యాదులన్నిటినీ ఇచ్చినాడు . మధుపర్కమును ఇవ్వవలెనని ఆత్రపడుతున్నాడు . ఆలంబి వంటింట్లో ఎక్కడో ఏదో సిద్ధము చేస్తూ ఉన్నట్లుంది . తనకవసరమని , ఆమెను పిలిచి ఆమె పనులకు ఆటంకము కలిగించుట ఇష్టము లేదు . ఇలాగ సతమతమగుచుండగా , వారిలో జ్యేష్ఠుడు నవ్వుతూ అన్నాడు , " మేము మీ ఇంటి వారమే . మాకు మధుపర్కము వద్దు . మేమిప్పుడు నీకు ఏదో చెప్పాలని ఈ రూపములో వచ్చినాము . ఇలా రా "  అని పిలచి , తమతో పాటు అతడినీ కూర్చోబెట్టుకున్నారు . అలాగే , కొంటెతనపు నవ్వొకటి నవ్వి , ’ మేమెవ్వరమో గుర్తు తెలిసిందా ? " అంటాడు . 

        ఆచార్యుడు లేదనలేడు , పరిచయపు జ్ఞాపకమూ రాదు . ఇలాగే అతడు సంకట పడుతుండగా " సరే , నీ సంకటము మాకు అర్థమైనది . మేము ఎప్పటికీ పరోక్షప్రియులము . కాబట్టి ఇలాగ తెలిసీ తెలియకుండా ఉండటములో విచిత్రమేమీ లేదు . మేమే చెప్పెదము , విను . మీ దంపతులు నిత్యమూ సేవించు అగ్నులు మేమే . నేను గార్హపత్యాగ్నిని . ఇతడు దక్షిణాగ్ని . అతడు ఆహవనీయాగ్ని . మేము మీరు ఉంచిన కుండములలో మాత్రమే ఉన్నామని భావించవద్దు . మీ దేహములోనూ ఉన్నాము . మా అనుగ్రహము వల్లనే మీ దంపతులకు నిన్నటి దినము మీ గర్భమునకు వచ్చిన మహానుభావుడి దర్శనమైనది . " 

        ఆచార్యులు లేచి నిలుచున్నారు . ప్రవర చెప్పి వారందరికి కలిపి ఒకసారి నమస్కారము చేసినాడు . ప్రత్యేకముగా కూడా ఒక్కొక్కరికీ నమస్కారము చేసినాడు . " మీ అనుజ్ఞ కావలెను , మీరు చెప్పుదానిని వినుటకన్నా ముందే ,  ఇదే ఎక్కువన్నట్లు నమస్కారములు చేయుట అపరాధమైతే క్షమించవలెను . " అని నమస్కరించి అన్నాడు . 

          ముగ్గురూ నవ్వినారు . పెద్దవాడు అన్నాడు , " మాకూ మీకూ సామరస్యము ఉన్నది . నువ్వేమి చేసినా అది మాకు అపరాధముగా తోచదు . అదలా ఉండనీ , విను, నిన్నటి దినము నీకు మా అనుగ్రహము వల్లనే ఆ దర్శనము అయినది . అయితే , దానిని సుఖముగా తీసుకొనుటకు బదులు , నువ్వు దానిని ప్రమాదపు కారణము చేసుకున్నావు . నువ్వు ఈ దినము ఉదయము నుండీ పడుతున్న సంకటము నీ దేహములోనున్న మమ్ములను కూడా బలముగా దుఃఖింపజేస్తున్నది . కాబట్టి అది వద్దు అని చెప్పుటకు మేమే వచ్చినాము ... హా! హా!  , ’ మీరే నాకు తెలియ కుండానే దానిని నివారించ వచ్చును కదా..అనబోతున్నావు , ఔను , అది మాకు సాధ్యమే .  నీ ఎదురుగా రాకుండానే నీ మనసును తిప్పుటకు మాకు సాధ్యమే , కానీ నువ్వు భక్తుడవు , కావలసిన వాడవు , సఖుడవు అని నీకు ప్రత్యక్షముగా ముఖతః చెప్పి నిన్ను సంతోష పరచవలెనని వచ్చినాము . నువ్వు సంతోషముగా ఉంటే మాకు సంతోషము . నువ్వు దుఃఖ పడుతూ ఉంటే మాకూ దుఃఖము . కాబట్టి మేము చేయుపని బహుశః స్వార్థమన్నా అనవచ్చు .  స్వార్థము లేని లోక వ్యవహారము ఉంటుందా ? స్వార్థము  , పరార్థము అని మనసులో ఉన్నంత వరకూ అది కర్మ కాండ. ఆ భేదము చెరగిపోతే అదే జ్ఞాన కాండ . అర్థమైనదా ? " 

        దేవరాతునికి మహాశ్చర్యమైనది. వీరు కూడా కర్మ కాండ , జ్ఞాన కాండలను గురించి మాట్లాడుతూ నా భయాన్ని ఇంకా ఎక్కువ చేస్తున్నారే ? కానీ వీరు త్రేతాగ్నులు . " నీ సంతోషమే మా సంతోషము , నీ దుఃఖమే మా దుఃఖము " అంటున్నారు . కాబట్టి మారు మాట్లాడక  , తాను చెప్పాలనుకున్నది ఒక ’ సరే ’ తో ముగించాడు . 

       మాట్లాడుతున్న ఆ జ్యేష్టుడు చిరునవ్వు నవ్వుతూ తాను చెప్పాలనుకున్న దానిని కొనసాగించినాడు . :" రెండు నదులు వచ్చి చేరుతాయి . రెండూ ఒకటగు వరకూ ఆ నీరు , ఈ నీరు అనవచ్చు . రెండూ ఒకటైన తర్వాత వాటిలో ఏది తాను కరగి పోయానని ఏడవాలి ? " 

      దేవరాతుడు మనసులోనే గుణకారము చేసినాడు . " నేను ఏదో చెబుతున్నారు అనుకున్నాను , వీరు చెప్పేది కర్మ కాండ , జ్ఞాన కాండ లకు సంబంధించినదేనా ? అలాగైతే రెంటికీ భేదము లేదా ? "

        జ్యేష్టుడు ఇతడి మనసులో ఉన్నది తెలిసినట్లే అన్నాడు , " ఔను , రెంటికీ భేదము లేదు . భేదమున్నదని నువ్వు భావించుకొని పొద్దుటినుండీ దుఃఖ పడుతున్నావు . జాతవేదుడనని ప్రఖ్యాతి పొందిన నన్ను ( అలా అనేటప్పటికి మిగిలిన ఇద్దరూ అంతర్థానమై అతడొక్కడే ఉన్నాడు ) ’ కాండద్వయోపపాద్యాయ కర్మ బ్రహ్మ స్వరూపిణే ’ అని అహర్నిశలూ నమస్కారము చేయు నువ్వు దాని అర్థమునెందుకు గమనించలేదు ? నీకున్న సంశయాన్ని వదలు . ఎలాగా ? ఇంకా పరిహారము కాలేదే అంటావా ? సీమంతమగు వరకూ తాళు . సీమంతమైన తర్వాత గర్భస్థుడై యున్న జీవుడిని మాట్లాడించు . అతడు నీకు తృప్తి యగునట్లు సమాధాన మిచ్చును . మా దేవతలము ,  కర్మ కాండపు ఋషులు , నీ వంశపు పితృ దేవతలు అందరూ కలిసి నీ వంశమును మాత్రమే కాదు , లోకమునే ఉద్ధరించ గల మహా పురుషుడిని నీకు కొడుకగునట్లు అనుగ్రహిస్తాము చూడు , నీకు నిదర్శనము కావాలని చెపుతున్నాను ,  రేపు నీకు రాజ భవనము నుండీ సోపస్కరములు ( సంభారములు ) వస్తాయి కదా , వాటితో పాటు కుండెడు పాలనిచ్చు రెండు ఆవులు కూడా వస్తాయి . ఒకటి ఎర్రది , ఇంకోటి నల్లది . నీకు రాజ పురోహితుడు చెప్పినవాటిలో ఆవులు లేవు , నిజమా కాదా ? " 

" ఔను , ఆవులున్నట్లు చెప్పలేదు " 

      " నేనే నీకు అంతటినీ చెప్పగలను , కానీ నీకు నేను చెప్పుటకన్నా , గర్భస్థ శిశువే చెప్పిన , ఎక్కువ నమ్మకము కాగలదని అతని ద్వారానే చెప్పిస్తాను . ఇకనైనా దుఃఖమును వదలి  స్వస్థుడవు కమ్ము . నువ్వు సంకట పడినంతా మాకది జ్వరమని మరవద్దు . " 

    దేవరాతుడికి ఏదో ఒక తెర తనపైనుండి జారి కింద పడినట్లాయెను . వాక్కు అతని ప్రయత్నము లేకనే " అనుజ్ఞ , దుఃఖాన్ని వదలినాను " అన్నది . 

      యజ్ఞేశ్వరుడు , " చూడు , నువ్వు ఎంత దుఃఖ పడుతుంటివో చూడు " అని తన చేతిని బార్లా చాచినాడు . అక్కడ ఒక నల్లటి గుట్ట ఉంది . అది సుమారు ఒకటిన్నర మనిషి ఎత్తు . అది అంటుకొని మండుతున్నది . 

       ఇంకొకసారి చెవిలో మోగింది , " ఆచార్యా , మరవద్దు , ఈ దేహము నీది కాదు . నీకు దాన్ని ఇచ్చిన మేము అందులో ఉన్నాము . నువ్వు నీవియని అనుభవించు సుఖ దుఃఖములన్నీ మాకు కూడా కలుగుతాయి . కాబట్టి నువ్వు ఎల్లపుడూ సంతోషముగానే ఉండవలెను . " 

      ఆచార్యుడు అదివిని సిగ్గు పడ్డాడు . తమ ఆజ్ఞ అని తిరిగి చూసే వేళకు అక్కడ ఎవరూ లేరు . మనసు , " అట్లయిన , మేము సుఖ దుఃఖముల అనుభవములో కూడా స్వతంత్రులము కామా ? వాటిలో కూడా మేము దేవతలకు అంకితులై ఉండవలెనేమి ? అని పుంఖాను పుంఖములుగా ప్రశ్నలు వస్తుండగానే మెలకువ అయ్యింది . 

Sunday, January 13, 2013

మకర సంక్రమణము--ఉత్తరాయణ పుణ్యకాలము


         మకర సంక్రమణము--ఉత్తరాయణ పుణ్యకాలము





     సౌరమానము ప్రకారము సూర్యుడు ఒక రాశి నుండీ ఇంకో రాశిని ప్రవేశించుటను ’ సంక్రమణము ’ అంటారు.

     సంవత్సరములో పన్నెండు సంక్రమణములు సంభవిస్తాయి. వీటిలో కర్కటక సంక్రమణము , మకర సంక్రమణము ముఖ్యమైనవి. కర్కటక సంక్రమణము తో దక్షిణాయణము , మకర సంక్రమణము తో ఉత్తరాయణము మొదలవుతాయి. 

     కొన్ని సంక్రమణముల తరువాత కానీ , ముందర కానీ , లేక తరువాతా ముందరా-రెండు వైపులా కానీ ఉన్న ఘడియలను పుణ్యకాలము అంటారు. ఉదాహరణకు మేష మాసము ప్రారంభమయ్యే మేష సంక్రమణము ముందరి పది ఘడియలు , అలాగే తరువాతి పది ఘడియలూ పుణ్యకాలము( రెండున్నర ఘడియలైతే ఒక గంట ) అలాగే తులా సంక్రమణములో కూడా ! 

కర్కటక సంక్రమణములో నైతే ముందరి ముప్పైఘడియలు పుణ్యకాలము.

మకర సంక్రమణములో నైతే తరువాతి ఇరవై ఘడియలు పుణ్యకాలము. 

     ఈ సారి మకర సంక్రమణము ఉదయము తొమ్మిదిన్నర-పది గంటల మధ్య సంభవిస్తున్నది ( ఇది వాక్య సిద్ధాంతము ప్రకారము.  అదే దృగ్గణిత ప్రకారమైతే పదకొండున్నర తరువాత. కానీ శాస్త్ర వచనము ప్రకారము దృగ్గణితమునకు రసక్షయము , బాణ వృద్ధీ కలుగును కాబట్టి , వాక్య సిద్ధాంతమే సమంజసమని అనేకుల మతము ) 

కాబట్టి ఉదయము తొమ్మిదిన్నర తరువాత నుండీ పగలంతా ( దాదాపు ఎనిమిది గంటల సమయము ) పుణ్యకాలమే !!

     ఉత్తరాయణ ప్రవేశ  కాలములో సమస్త నదులు , వాపీకూప తటాకములు ,సమస్త జలములూ గంగోదకముతో తుల్యమై యుండి, నరుల యొక్క పాపములను పోగొట్టుటకు సిద్ధముగా ఉండును. 

సంక్రమణ పుణ్యకాలములో చేయవలసినవి

     సంక్రమణ పుణ్యకాలములో విశిష్టమైన ఫలములు పొందవలెనన్న, పితృ దేవతలకు శ్రాద్ధము , సూర్యనారాయణుడి పూజ, జపములు , దానములు చేయుట శుభప్రదమని ఋషుల వల్లనూ , పురాణ వచనముల వల్లనూ  మనకు తెలియుచున్నది.

     పితృ శ్రాద్ధమును పిండ రహితముగా చేయవలెను. శ్రాద్ధము చేయుటకు కారణాంతరముల వలన వీలుకాకున్నచో , కనీసము పితృ తర్పణములైనా వదలవలెను. ( తర్పణ విధానము ఇదే బ్లాగులో ఉన్నది దయచేసి చూడగలరు.)  శ్రాద్ధమూ తర్పణమూ చేసేవారు అంతవరకూ ఉపవాసము ఉండవలెను. లేనివారు ఉపవాసము ఉండకూడదు. చాలామంది పుణ్యకాలములో ఉపవాసముండ వలెనని అంటారు. కానీ 

|| ఆదిత్యేఽహని సంక్రాంతౌ గ్రహణే చంద్ర సూర్యయోః |
  ఉపవాసో న కర్తవ్యః  పుత్రిణా గృహిణా సదా || 

అను జైమిని వచనము ప్రకారము , సంతానము కల గృహస్థులు ఆది వారాలు , సంక్రమణముల లోను , సూర్య చంద్రుల గ్రహణముల నాడు ఉపవశించరాదు . 

     తరువాత , ఎవరి జన్మ నక్షత్రములో సూర్య సంక్రమణము సంభవించునో వారికి ఆ మాసములోనే, వైరము , కష్టము , ధన క్షయము  , కలుగును. రేపు ఉత్తరాషాఢా నక్షత్ర జాతకులకు దోషము. దీనికి పరిహారము: 

నంది వర్ధనము , తామర ఆకులు , పసుపు , తెల్ల ఆవాలు, లొద్ధుగ లు కలిపిననీటితో , సంక్రమణ సమయములో స్నానము చేసిన క్షేమకరము. ఇది కాక, 

అన్ని సంక్రాంతులలోనూ విష్ణుపదాదులు ఉండును. కాబట్టి విష్ణుపూజ చేసిన ఫల ప్రదము. 

సూర్యనారాయణుడి పూజ ( కూష్మాండ పూజ )

     ఈ పూజ చేయుటకు శుభ ముహూర్తమునెంచుకొని చేయవలెను. ఈ సారి 14-01-2013 నాడు , ఉదయము పదిగంటల నుండీ నుండీ పదిన్నర వరకూ ( రవి హోరలోనూ , ) అలాగే మధ్యాహ్నము పన్నెండు నుండీ ఒంటి గంట వరకూ ( బుధ హోరలోనూ ) చాలా శుభమైనది. 

     పూజకు , దీపారాధన చేసి , ఇంటికి తూర్పు దిశలో గోమయముతో కానీ గో మూత్రముతో కానీ అలికి , దానిపై బియ్యము లేదా గోధుమలను పోసి , దానిపై బంగారము వలె నున్న పసుపు పచ్చటి  గుమ్మడికాయను ఉంచవలెను ( బూడిద గుమ్మడి కాయ పనికిరాదు )   పసుపు పచ్చటి  గుమ్మడికాయ సూర్యుడికి సంకేతము. దానికి పసుపు కుంకుమ, గంధపు బొట్లు పెట్టి , నూతన వస్త్రము ( ఎర్రటి లేదా పచ్చటి ) కప్పవలెను. తరువాత బంగారముతో కానీ , ఇత్తడితో కానీ చేసిన లక్ష్మీనారాయణుల విగ్రహమును ఆ గుమ్మడి కాయపై నుంచి , దానిని పంచ గవ్యములతో శోధించవలెను ( స్నానము చేయించవలెను ) పూలతో అలంకరించి , 

తరువాత ,ఈ విధముగా సంకల్పము చెప్పవలెను 

     ( ఆచమనము ప్రాణాయామము అయినతరువాత ) , ఏవంగుణ విశేషణ విశిష్టాయాం , శ్రీ లక్ష్మీ నారాయణ / కులదేవతా ప్రీత్యర్థం , మమ ఇహ జన్మని సమస్త పాప క్షయార్థం , మమ మనోభీష్ట సిధ్యర్థం , మకర సంక్రమణ ప్రయుక్త ఉత్తరాయణ పుణ్యకాలే సకల దేవతా ప్రీథ్యర్థం , శ్రీ లక్ష్మీనారాయణ పూజాం కరిష్యే ||  తదాదౌ నిర్విఘ్నతా పరి సమాప్త్యర్థం , గణపతి పూజాం కరిష్యే  అని చెప్పి , 

  మొదట గణపతి పూజనము సలిపి , లక్ష్మీనారాయణులకు  కలశ పూజ , ఆదిగా షోడశోపచార పూజలు చేయవలెను. నైవేద్యం , మహా మంగళారతి తరువాత మంత్రపుష్పం సమర్పించవలెను.

     ఈ విధముగా పూజ అయిన తరువాత , పూజ చేసిన విగ్రహమును , గుమ్మడికాయను , యథాశక్తి దక్షిణలతో వేద వేత్త , కుటుంబవంతుడైన సద్బ్రాహ్మణునికి పుణ్యకాలములోనే దానము ఇవ్వవలెను. ( సంక్రమణ పుణ్యకాలములో అంతటా ఉన్న నీరు గంగా జలముతో సమానమగును. శుద్ధమైన ఆత్మగల ద్విజులందరూ బ్రహ్మ సమ్మితులౌతారు. వారికి ఏ కొంచము దానము చేసిననూ అది మేరు సమానమవుతుంది. సముద్రమే మేఖలగా గల భూమిని చక్కగా దానము చేసినవానికి వచ్చే ఫలము ఈ ఉత్తమమైన దానమును చేసిన నరుడు పొందును.  --స్కాంధ పురాణము ) 

దానములు ఎప్పుడునూ తూర్పువైపుకు తిరిగి ఇవ్వవలెను. 

శుభం భూయాత్

2. " మహా దర్శనము " --రెండవ భాగము--- సీమంతము


        మధ్యాహ్నమై జాము గడుస్తూ ఉంది . మూడో జాము అని సూర్యుడు తన ప్రచండ కిరణాలను ఉపసంహరించు కుంటున్నాడు . పొద్దుటి నుంచీ మబ్బులు ముసిరి , సంక్రమణమా అన్నట్లున్న దినము ఇప్పుడు కొంచము సేపటి నుండీ తేటపడింది . అయినా చుట్టూ దిగంతాల వైపు మేఘాల ఆక్రమణ బలంగా ఉంది . మేఘాలు మాయావుల వలె సూర్యునితో దొంగాట లాడుతున్నాయి . 

         దేవరాతునికి  ఆలోచనల్లో అంతా నిన్నటి రాత్రి చూసిన దృశ్యమే ! మాధ్యాహ్నిక కర్మల నన్నిటినీ ముగించి భోజనము పూర్తి గావించుకుని వచ్చాడు . చిన్న చౌకపు శల్య నొకదానిని భుజంపై వేసుకుని , మడి పంచతోనే ప్రాంగణపు పక్కన నీడలో పచారు చేస్తున్నాడు . సన్నగా చలి మొదలైంది . ధావళిని ఎందుకు కప్పుకోరాదు అనిపిస్తున్నది . తాంబూలము నోటిలో కరగుతున్నది . అన్యమనస్కంగా తాంబూలాన్ని నములుతున్నాడు . " ఇంకేమి , ఆలంబి వస్తుంది , ఆమెతో పుట్టబోయే పిల్లవాడి సంగతులు మాట్లాడవలెను . ఇప్పుడు ప్రస్తుతానికి గర్భిణిగా తాను చేయవలసినదేమి ? ముందు ముందు తల్లియై చేయవలసినదేమి ? అంతటినీ చెప్పాలి . " అని ఆలోచిస్తున్నాడు . అరకన్ను మూసుకుని చేస్తున్న ఆ ఆలోచనలో శిష్యుడొక్కడు వచ్చి నిలుచున్నదానిని ఆచార్యుడు గమనించలేదు . ఇంకాసేపవుతుండగా , "  ఆచార్యులకు ఈ సమయము విడుపేనా " అంటూ భార్గవుడు దగ్గరికి వచ్చాడు . 

        దేవరాతునికి భార్గవుడు అప్పుడప్పుడు అలాగ వచ్చి పలకరించుట కొత్తేమీ కాదు . అయితే ఈ దినము అతనికి ఆ రాక కావాలనిపించ లేదు . అట్లాగని , వచ్చినవాడిని ఆహ్వానించకుండా ఉండటము అవుతుందా ?  వెంటనే ఆ వైపుకు తిరిగినాడు . ముఖము ఎప్పటివలెనే మందహాస ప్రసన్నమైంది . అయినా అతనికి నోటినుండీ ఏమాటా రాలేదు . బహుశః రాబోవు శిశువు ఆలోచన బలంగా ఉండుటను సూచిస్తున్నది. వచ్చిన వాణ్ణి ఊరికే కళ్ళప్పగించి చూస్తున్నాడు . 

భార్గవుడు మరలా అడిగాడు , " ఏమిటో , ఆచార్యులు ఏదో లోకంలో ఉన్నట్టుంది , నోటి నుండీ మాటలే రావడము లేదు ? " 

         దేవరాతుడు నవ్వాడు . " ఔను , భార్గవులు వచ్చినపుడు రండి అని ఉపచారము చేయకుండా ఉంటే ,, నేను ఎదురుగ్గా ఉన్నా లేనట్లే కదా ! నిజం చెప్పాలంటే , మీ భవ్యమైన ఆకారము , దానికి తగినట్లు ఉట్టిపడుతున్న మీ ఠీవి , దానితో పాటు మీరు వచ్చిన వైఖరి , అవన్నీ చూసి మనసు అదరిపోయింది . మాట బెదరిపోయినట్టు ఎక్కడికో పారిపోయింది . దాన్ని పట్టి తెచ్చుటకు దాని వెంటనే మనసు పోయింది . బుద్ధి అక్కడ కొంచము , ఇక్కడ కొంచము అయిపోయింది . అదంతా సరే , రండి , దయచేయండి . ఇక్కడే కూర్చుందామా ? లేక నడిమింటికి వెళదామా ? " 

         " నేను గుర్రపు బండిలో వచ్చినాడను . ఆ బండి గడ గడ శబ్దము విని మీరు వాకిలి వద్దకు వస్తారు అనుకున్నా. వాకిలి వద్దకు రాలేదేమా , ఏదో విశేషముంటుంది అనుకొని లోపలికి వచ్చినాను . మీ శిష్యుడొకడు నన్ను చూసి మీకు చెప్పాలని లోపలికి పరుగెత్తి వచ్చినాడు . ఇదిగో వాడు ఇక్కడే నిలుచున్నాడు . మీరు వాణ్ణి చూసినట్లు లేదు . ఇదంతా చూసి నేను , మీరిక్కడే ఉన్నారా లేక లోకాంతరములలో సంయమమై ఉన్నారో అని అడిగినాను , తప్పులేదు కదా ? " 

        " భార్గవులు ఏమి చేసినా తప్పుకాదు . అలాంటప్పుడు తప్పెలా వెదికేది ? రండి వెళదాము " అని దేవరాతుడు అక్కడే నిలుచున్న శిష్యునికి కళ్లతోనే ఏదో సూచించి , భార్గవుడిని పిలుచుకొని నడిమింటికి వెళ్ళినాడు . 

       నడిమింటిలో  కృష్ణాజినములతో శోభిస్తున్న వేత్రాసనములు  ( వెదురు బద్దలతో చేసిన ఆసనములు ) . వాటిలో ఇద్దరూ కూర్చున్నారు . భార్గవుడు  విజయపు మందహాసమును చిందిస్తూ , " ఆచార్యులవారు నేనిప్పుడు వచ్చినది ఎందుకో చెప్పగలరా ? " అని అడిగాడు . 

          ఆచార్యులు అదే రీతిలోనే , అయితే వినయాన్ని వీడని నవ్వు నవ్వుతూ , " మీరు చెబితే తెలుసుకుంటాను , నిజానికి నేనే రావాలనుకున్నాను. అంతలో మీరే వచ్చినారు . మొదట మీరు చెప్పాలనుకున్నది చెప్పండి , తర్వాత నేను చెప్పాల్సినది చెపుతాను . " అన్నాడు

          భార్గవుడు చెప్పదొడగినాడు , " ఈ పొద్దున్నే అన్ని కర్మలనూ ముగించుకుని ఎప్పటివలె రాజ భవంతికి వెళ్ళినాను . అక్కడి కార్యాలన్నీ అయిన పిదప , మహారాజా వారు ఏకాంతములో ఏదో లోకాభిరామాయణము మాట్లాడుతూ కూర్చున్నారు . నేనపుడు సమయము చూసి వారికి ఎరుక పరచినాను , ’ మన ఆచార్యుల ఇంట సీమంతము జరగవలసియున్నది , రాజ భవంతి నుండీ , తమరి గౌరవానికీ , వారి గౌరవానికి తగినట్లు ఏదైనా చేసిన బాగుండును . " అన్నాను . వారు , ’ మాకు తెలియనే లేదే ? ’ అని ఆశ్చర్యపడినారు . " ఆచార్యుల స్వభావము తమ సన్నిధానమునకు పరిచితము కానిదేమి కాదు . వారు నిత్య తృప్తులు . ఏమి కావలెనన్ననూ , ఉన్నదాంట్లోనే జరగనీ , కావాలన్న దేవుడే ఇచ్చి అన్నీ జరిపించనీ అంటారు . కాని మాకు అలాగుండుటకు సాధ్యము కాదు. " అన్నాను . వెంటనే మహారాజుగారు , ’ నూరు నిష్కములు , పది మూటలు బియ్యము , దానికి తగిన సంభారములు  అన్నీ పంపించవలెను అని అనుమతి నిచ్చినారు . అవన్నీ ఈ దినమో రేపో వస్తాయి . వచ్చినపుడు , ’ ఇవన్నీ మాకెందుకు ? " అని ఎక్కడ వెనుకకు తిరిగి పంపిస్తారో , అటుల చేయవద్దని చెప్పడానికే వచ్చినాను . మీకు సమ్మతమే కదా ? నేను చేసినదాంట్లో తప్పేమీ లేదు కదా ? " 

     ఆచార్యులు నవ్వేసినారు . " ఇప్పుడిది సరే పోయింది . నేను సీమంతాన్ని ఆడంబరంగా చేయాలా లేక , వైదిక కర్మ కదా , దాన్ని నిరాడంబరంగా చేయాలా అని ఆలోచిస్తున్నాను . ఇక ఇప్పుడు రాజ సహాయము సమకూరినందు వల్ల ఆడంబరముగానే చేయవలెనన్నట్లే కదా ? సరే లెండి , అలాగే చేద్దాము . " అన్నాడు . 

       భార్గవుడు మరలా అన్నాడు , " మీరు ఒక ఆశ్రమమును కట్టుకొని యుంటే ఆ మాటే వేరు . అప్పుడు నేను మీ ఆశ్రమవాసులంతా చేరి అయినంత సులభముగా నెరవేర్చుకోండి అని చెప్పేవాడిని . కానీ మీరు ఇలా రాజధాని లోనే అగ్రహారీకులు గా ఉంటూ ఏదో పేదవాడి వలె మీకు తగినట్లు మీరు ఆ ఉత్సవాన్ని ఆచరిస్తే , మేమంతా తల దించుకోవలసి వస్తుంది . రాజ భవనపు వైభవముతో కాకున్నా , తమ అంతస్తుకు తగ్గట్టు గౌరవముగా  అయినా కావద్దా ? వైదీక కర్మ , లోకాడంబరమెందుకు  అంటారేమో ? మనుష్యుడు ఉత్సవ ప్రియుడు . వాడు ఏపని చేసినా డోలు వాయించినట్టు పదిమందికీ తెలియవలెను . వేదములోనే చెప్పలేదా , ’ బృహద్వదేమ విథతే సువీరాః ’ --సరైన సంతానము కోసము గట్టిగా మంత్రము చెప్పి యజ్ఞము చేయవలెను అని ? కాబట్టి , నేను చెప్పినట్లే చేయండి . " 

       ఆచార్యులు భార్గవుని మాట ఒప్పుకున్నట్లు ముఖ ముద్రతోనే సూచిస్తూ , " రాజ పురోహితులు శ్రీ భార్గవ భట్టు గారు ఆదేశిస్తుండగా , నేను కాదనుటకు అగునా ? అయితే , సీమంతములో మేము చేయవలసిన క్రియలన్నీ అప్పుడే సాంగముగా జరిగినాయి . అందుకే , సీమంతము కేవలము ఔపచారికమే కదా , చేయాలా వద్దా అని ఆలోచించు చుండినది . అందువలననే మీరు వచ్చినపుడు అన్యమనస్కముగా ఉండినది . " అన్నాడు . 

" అలాగంటే ? " 

        ఆ వేళకు శిష్యుడు వచ్చి , ఒక మేజాను తీసుకొని వచ్చి , దాని పైన మడి ధావళులను  ఒక చెంబు గోరు వెచ్చని నీటిని తెచ్చి పెట్టినాడు .ఆచార్యుడు , ’ మొదట ఈ పని కానివ్వండి , పిమ్మట అంతా చెబుతాను " అని వారిని తొందర పెట్టారు . భార్గవుడు అక్కడే బచ్చలిలో కాళ్ళు చేతులు కడుక్కుని , మడి ధావళి నొకదాన్ని కట్టుకొని , ఇంకో దాన్ని కప్పుకుని , ఆ వేళకు వచ్చిన ఫలహారాన్ని స్వీకరించినాడు . ఆచార్యునికి కూడా రాజ పురోహితుని బలవంతము పైన అటుకుల ఒగ్గరిణి ఫలహారమైనది . ఇద్దరూ వేడి పాలను సేవించినారు . మరలా మాటలు మొదలయ్యాయి . 

        ఆచార్యుడు కిందటి రాత్రి జరిగినదంతా చెప్పినాడు . " చూడండి , భార్గవా , నేను నాకన్నా ప్రబలుడైన పుత్రుడిని పొందవలెను అని హోమ హవనములను చేసినది నిజమే , కానీ నిన్న దర్శనమైనట్లు , పుట్టబోవు వాడు బ్రహ్మజ్ఞానియైతే ఏమి గతి ? యజ్ఞవల్క్య అని ప్రసిద్ధి పొందిన మా వంశము ఏమవుతుంది ? నాకిదే యోచన అయిపోయింది " అన్నాడు . 

        " వదిలేయండి  , దీనికింత యోచన యెందుకు ? మిథిలా నగరములో ఉన్నారు . విద్య ఉన్నదంతా కురు , పాంచాల , కాశీ ప్రదేశములయితే , ఆ విద్యకు గౌరవమున్నది మన జనక మహారాజుల వారి వద్ద . ’ యథా రాజా తథా ప్రజాః ’ మీరు కర్మ విద్యలో పొందిన పేరును మీ కుమారుడు బ్రహ్మవిద్యలో పొందితే మీకు ఇష్ట సిద్ధి యైనట్లే కదా ? " 

" అలాగని నాకున్న జ్ఞానమంతా మట్టిపాలు కావలెనా ? నేను సంపాదించినదంతా వ్యర్థము కావలెనా ? " 

        " ఆ మాటెలా వచ్చింది ? బ్రహ్మవాదులు , అన్ని విద్యలకూ మూలస్థానము మన బ్రహ్మవిద్య అనేకదా చెప్పుకుంటారు ? ఒకవేళ మీ పుత్రుడు కర్మ విద్యను వదిలేస్తేనో  అంటున్నారు  , ఉపనయన సమయములో మహా యజ్ఞముల నన్నిటినీ చేస్తానని వాడిచేత ప్రమాణము చేయించండి . అవన్నీ చేసేటప్పటికి ఏమవుతుందో చూద్దాము . " 

దేవరాతుడికి అది సమ్మతమైనది . " అలాగే చేయవలెను , ఇక వేరే దారి లేదు ’ అని నోటినుంచీ మాట కూడా వచ్చింది . 

        " ఆచార్యా , ఏదో జీవము వచ్చి ప్రవేశించినది , ఇంకేమిలే అని సీమంతాన్ని వదలివేయకండి . సీమంతమును చేయండి . గర్భిణికి  పాపిడి తీసి , వీణానాద పూర్వకముగా మంత్రమును ఉచ్చరిస్తే , ఆ నాదము తరంగ తరంగములుగా గర్భిణి యొక్క గర్భాన్ని చేరి , అక్కడున్న పిండమునకు చేతనము కలిగి , వైదీకమవుతుంది . ఆ పిండము శిశువై బయటికి వచ్చిన తర్వాత ఆ శిశువు బుద్ధి వైదీక మార్గములోనే నడుచును . మీరిక యోచించవలదు . " 

        ఆచార్యుడు తాను కిందటి రాత్రి చూసినది మరువలేదు , కానీ శాస్త్ర సమ్మతముగా పలుకుతున్న రాజ పురోహితుని మాటను తిరస్కరించలేక , " నిజము , నిజము , అట్లే కావలెను . సంస్కారములను వదలిన వారుంటారా ? సీమంతము చేసే తీరవలెను ," అన్నాడు . 

ఇంకొంత సేపు భార్గవుడు అలాగే అదీ ఇదీ మాట్లాడి  , బయలుదేరి వెళ్ళిపోయినాడు . 

1. " మహా దర్శనము " -- మొదటి భాగము --- అలౌకిక ఘటన


          రెండు ఝాములు గడచి రాత్రి మూడో ఝాములోనికి కాలు పెట్టింది . లోకములోని జనులందరూ శాంతులై , నిద్రాదేవి కృపకు పాత్రులై సుఖించు కాలము . చుట్టుపట్ల అంతా ప్రశాంతముగా నిశ్శబ్దములో అద్దినట్లు మౌనముగా ఉంది . చెట్లూ చేమలన్నీ తమను ఆశ్రయించుకొని ఉన్న పక్షులనన్నిటినీ తమలో దాచివేసి , భయపడి మూలకు అణగి కూర్చున్న పిల్లలవలె , కిక్కురుమనకుండా మూగబోయినాయి . అనతి దూరములోనే  చిన్న వాగు ఒకటి  ఇసుకలో ప్రవహిస్తూ , అత్తింటి కోడలి వలె వీలైనంత తక్కువ శబ్దము చేస్తూ తనదారిన తానుపోతున్నది . 

         దేవరాతుడు ఆశ్రమములో దర్భశయ్యపై పరుండినాడు . ఎడమచేయి చెవితో ఏదో ఏకాంతమాడుతున్నట్టు తల కింద ఉంది . నిద్ర చూడగా గాఢముగా ఉన్నట్టుంది . అయినా కారణము లేకుండానే హఠాత్తుగా అతనికి మెలకువ అయ్యింది . మెలకువైనా , అతనిది కళ్ళు మూసుకునే ఉండే వైఖరి . కానీ ఇప్పుడు కళ్ళు మూసుకుని యుండుటకు సాధ్యము కాలేదు . కళ్ళు తెరిచాడు . ముత్యము వంటి చిన్నదైన నూనె కైదీపపు వెలుగులో ఎదుటి గోడా , దానిపై వ్రేలాడుతున్న కృష్ణాజినమూ కంటబడ్డాయి . మరలా కళ్ళు మూసి నిద్రపోవుటకు ప్రయత్నించాడు . ప్రయత్నము సఫలము కాలేదు . అట్లే కళ్ళు తెరుచుకొనే పైకి తిరిగినాడు . వెల్లకిలా పడుకొని రెండు చేతులనూ ఎదపై నుంచుకున్నాడు . చుట్టూ చీకటి కమ్మినట్లైంది . ఇదేమిటీ అనుకొనే లోపలే ఏదో ఒక అలౌకిక దృశ్యపు దర్శనమైనట్లయింది . ఏదో గుర్తు తెలీని అడవి ఒకటి . ఆ అడవిలో ఒక మూల. ఏపుగా పెరిగి నిలుచున్న చెట్ల సముదాయము . ఆ చెట్ల మధ్య ఒక ఆశ్రమము . ఆశ్రమము నుండి చేతివేటు దూరంలో ఒక యేరు . యేటిలో నీరు పారుట స్పష్టముగా కనిపిస్తున్నది . ఆ సెలయేరు అంత పెద్దదీ కాదు , చిన్నదీ కాదు . అయినప్పటికీ , ఆశ్రమవాసుల పైన గౌరవముతో జలదేవతలు అక్కడ వెలసి , మౌనముగా చేతులు జోడించి ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తున్నది . ఆ ఆశ్రమము నుండి ఎవరో అతివేగిరముగా ఏదో అత్యవసరమైనట్లు బయలుదేరినారు . ధవళ వర్ణపు గడ్డమీసాలు , తెల్లగా అప్పుడే కురిసిన మంచువలె స్వఛ్చమైన జటామండలము , అతడొక వృద్ధుడనీ , తపస్వియనీ ఘోషిస్తున్నట్లు చెబుతున్నాయి . ముఖములో నిండిన తేజోకాంతులు ఆ ఉద్ఘోషను ఒప్పుకున్నట్లు , దానికి సాక్ష్యము నిస్తున్నట్లున్నాయి . అకారణముగా మెరుస్తున్నదేమో యనిపించే అతని మందహాసము అతని లోపల నిండిన ఆనంద సాగరాన్ని దాస్తున్న తెర వలె ఉంది . అన్నిటికన్నా మిన్నగా , రత్నదీపాలవలె వెలుగుతున్న ఆ కన్నులు , జగములోని చీకటినంతా బాపి వెలుగు నింపునట్లున్నాయి . ఆ కన్నుల మధ్యనుండీ కిందకు దిగిన అతని నాసిక , ఈతడు లోకానుగ్రహము కోసము దివినుండీ దిగివచ్చి యుండవలెను అని సూచిస్తున్నట్లుంది . ప్రశస్తమైన కొండపైని రాతిపానుపు వలె విశాలముగా వ్యాపించిన అతని నుదురు అతని హృదయ వైశాల్యాన్ని చిత్రిస్తున్నట్లుంది . అతడు ఏదో కాలాతీతమైనట్లు , వేళ మించిపోయినట్లు త్వరత్వరగా బయలుదేరినాడు . ఆశ్రమపు  ముఖద్వారమునకు వచ్చి , వెనుతిరుగి , ఆశ్రమానికి ఒకసారి  మొక్కి , మరలా బయలు వెడలినాడు . ఆ ఉదయపు మొదటి జాములో నిండిన ప్రకాశములో కూడా ఆశ్రమము , ఏదో చీకటి పట్టినట్లు నిస్తేజమగుతున్నది . 

           అతడు వస్తున్నాడు . అతడికి అన్నివైపులా వెలుగు పరచుకొని ఉండి  , ఆ వెలుగు అతనికి మాత్రము  తన నీడ అనే అంటును సోక కుండా జాగ్రత్త పడినట్లుంది . మంటలేని అగ్నివలె ప్రజ్వలిస్తున్ననూ , శాంతముగా ఉన్న అతడు కొండ ఎక్కి , గుట్టలూ  వాలు చరియలూ దిగి , తోపులను కోనలనూ దాటి , మనోవేగముతో వచ్చి , దేవరాతనికి నమస్కరించి , " నేను మీ కడుపున పుడతాను "  అంటున్నాడు .  దేవరాతనికి , " నువ్వెవ్వరవు ? మమ్మల్నెందుకు ఎంచుకున్నావు ? " అని అడగవలె ననిపిస్తుంది . అంతలోపలే అతడు చిన్న తేజోపిండమై , దేవరాతని సరసన పడుకుని యున్న ఆతని ధర్మపత్ని ఆలంబినీ దేవి గర్భమును ప్రవేశిస్తాడు . అతని ప్రశ్న ఇంకా మాటలు దాల్చి బయటికి వచ్చు ప్రయత్నము జరుగునంతలోనే ఇదంతా జరిగిపోయింది . 

          దేవరాతునికి ఆశ్చర్యమైనది . తన భార్య గర్భవతి యైనప్పటి నుండీ అతడు విధి పూర్వకముగా ఏమేమి చేయవలెనో ఆయా సంస్కారముల నన్నిటినీ సకాలములో చేసినాడు . పుంసవనమైనది . చూలింత కోరికలన్నీ తీర్చడమైనది . ఇంకో పదిరోజులకు సీమంతము జరగనున్నది . ఇప్పుడు ఇదొక అలౌకిక ఘటన. అతనికిది అతి విచిత్రముగా అనిపించి , ఆశ్చర్యమై , మనసులోనే ప్రశ్నా పరంపరలు తరంగముల వలె మూగుతున్నాయి . " అట్లైతే , మా ఆశాసౌధాలు వ్యర్థాలు కావు , వేదకర్మలు సార్థకమవుతున్నాయి  , మా వంశములో లోకోత్తరుడైన ఒక బ్రహ్మర్షి ఉదయిస్తాడు . ఆత్మోద్ధారము చేసుకున్న అతని వలన వంశము ఉద్ధారమై , లోకము కూడా సద్గతిని పొందగల దారిని కనుక్కుని ఉద్ధారమవుతుంది " అని అతని మనసు ఆనంద నర్తనము చేసింది . 

         సంతోషమైనా, దుఃఖమైనా తనవారితో పంచుకోనిదే మనసు ఊరుకోదు . సంతోషమైతే ఇనుమడించి ఆనందం రెట్టింపవుతుంది  , దుఃఖమైతే ,  పంచబడి పలచబడి  మనిషిని ఓదారుస్తుంది . అందుకేనేమో , మానవుడు సంఘజీవియై సాంగత్యాన్ని అపేక్షించేది ? 

          దేవరాతుడు పక్కనే పరుండిన భార్యను పిలిచాడు . ఆమె మెలకువగానే యున్నది . .అతనికి ఆశ్చర్యమైంది , " నీవు లేచే ఉన్నావా ? అలాగైతే ఏదైనా విచిత్రాన్ని చూసినావా ? " అని అడిగాడు .  ఆమె , " అవును , నేను చూసినదాన్ని మీకు చెప్పవలెనని యున్నాను . అంతలో మీరే పిలిచినారు " అని తాను చూసినది చెప్పింది , " ఒక వాగు తీరములోనున్న ఆశ్రమమొకటి  , ఆ ఆశ్రమమునుండీ తెల్లటి వస్త్రములు కట్టుకొనియున్న సాధువొక్కరు వచ్చి నా గర్భమును ప్రవేశించినారు . " అంది . 

          దేవరాతునికి పట్టరానంత ఆశ్చర్యమైనది . సంభ్రమముతో " అవునా ? " యని కొంత తడవు ఊరికే ఉండి , " చూడు , నాకు కూడా నీకు కనిపించినదంతా కనిపించింది . దాన్నే నీకు చెప్పాలని పిలిచినాను . అప్పటికే నువ్వు మేల్కొని , నేను చూసినదే నువ్వు కూడా చూసినావు " అన్నాడు . 

ఆలంబినీ దేవి స్త్రీ సహజమైన కుతూహలముతో అడిగింది , " అయితే మరి దీని అర్థమేమిటి ? " 

         దేవరాతుడు నవ్వి అన్నాడు , " అర్థమేమిటి ? స్పష్టముగానే ఉంది కదా ? నా కన్నా ప్రబలుడైన కొడుకు కావాలని నేను చేసిన తపస్సు ఫలించింది . ఎవరో ఒక తపస్వి నీ గర్భమును చేరినాడు . పుట్టి లోకాన్ని ఉద్ధరించుటకు ఇక్కడికి వచ్చినాడు . " 

         " ఏమిటీ ? మీకన్నా ప్రబలుడా ? మేమెలా నమ్ముట ? ఈ చుట్టుపక్కలే కాదు , దేశ దేశాంతరముల నుండీ కూడా యజ్ఞ యాగాదుల విషయములలో ఎట్టి సందేహము వచ్చినా , తీర్చుకొనుటకు మీ దగ్గరికే వస్తారు . ఇక మీ కన్నా ప్రబలుడంటే ఎటువంటి వాడు ? " 

         " చూడు కాంతామణీ , నువ్వు చెప్పినది అబద్ధము కాదు, అయితే , నాది కర్మ కాండ. ఏవేవో ఆశలను పెట్టుకొని చేయు కర్మల గుత్తులే ఈ కర్మ కాండలు . అయితే , పెద్దలు ఏమంటారంటే , ఈ ప్రపంచపు వెలుపల ఇంకేదో ఒకటి  ఉందట . అది ఈ విశ్వాన్నంతా వ్యాపించి ఉందట. నీలోపల , నాలోపల మాత్రమే కాక , చీమ  , దోమ ,వాటికన్నా చిన్నవైన క్రిమి కీటకాలు మొదలుకొని ఏనుగు , ఒంటె వరకూ ఉన్న సమస్త సచేతన ప్రాణులలోనూ ఉన్న చైతన్యము అదేనట . అట్లే , జీవమున్న స్థావర జంగమములన్నీ బ్రతికియున్నది దాని వలననేనట . సూర్య చంద్రులలో ప్రకాశముగా కూర్చున్నదీ అదేనట !. ఇక్కడ ఉన్నదంతా దానికోసమై వదలి , ....వింటూన్నావా ?  ఈ ఊరు వదలి ఇంకో ఊరికి పోవువాడివలె , మనము చేస్తున్నదానినంతా , మన ఆశలనన్నిటినీ ,  దానికోసమై వదలి జీవిస్తే అది దొరుకుతుందట . అది నిజమైతే , ఇక్కడున్న అన్నిటికన్నా అదే ఎక్కువ అయితే , అప్పుడు దానిని తెలిసినవాడు నా కన్నా ప్రబలుడు అవుతాడా కాదా ? " 

" మీరు ఇంతకు ముందెప్పుడూ ఆ విషయమును ప్రస్తావించి ఉండలేదే , కదా ? " 

         " అవును , ఆ సంగతే మాట్లాడలేదు . నిజం చెప్పాలంటే , నాకు అది లేదు అన్న అపనమ్మకమైతే లేదు కానీ , దానికోసము సర్వమునూ త్యాగము చేయడమన్నది నాకు మింగుడు పడదు . చూడు ఆలంబీ , యజ్ఞములో అధ్వర్యుడు ఫలానా దేవుడిని పిలవాలని ప్రైష ( ఆహ్వానము ) నిస్తాడు . హోతృడు ఓం అని ఆ దేవతా సంబంధమైన సూక్తమును పారాయణ చేసి , ఆ దేవతను ఆకర్షించును . ఉద్గాతృడు ఆ సూక్తాన్ని సామముగా ఉపబృంహణ చేసి పాడి ఆ దేవత మన సూక్ష్మ ఇంద్రియములకు గోచరమగునట్లు చేస్తాడు . ఏదైనా హెచ్చుతగ్గులైతే బ్రహ్మ స్థానములో ఉన్నవాడు సరిపరచును . అప్పుడు అధ్వర్యుడు ఆ దేవతకు హోమము చేసి యజమానుని ఇష్టమేదో దానిని సాధించును . ఈ వైభవములో మునిగియున్న వానికి అన్నీ వదలి చప్పగా కూర్చొని ఉండుటన్నది ఎట్లు  మనస్కరించును ? అదీకాక , ఆ మార్గమును పట్టినవాడు దానికి బ్రహ్మ విద్య అనే పేరు ....."  

" బ్రహ్మ విద్య అంటే ? "  

         " బ్రహ్మమనగా గొప్పది . దేనికన్నా మరి గొప్పది ఏదీ లేదో , అదే అన్నిటికన్నా గొప్పది , ఆ ’ అది ’ ఏదో ఏమిటో చెప్పేవాడికీ తెలీదు , వినేవాడికి ఎంతమాత్రము తెలీదు . అదే బ్రహ్మ . దానిని సంపాదించి ఇచ్చే విద్యయే బ్రహ్మ విద్య . దీనిలో ఇంకో అందముంది , తెలుసా ? " 

" చెప్పండి " 

         " ఆ బ్రహ్మము కోసము మనము అన్నిటినీ , అంతటినీ వదలి మిడుకుతూ కాచుకొని కూర్చోవాలట . అది తపస్సుకు దొరకదట . దానము వలన పొందుటకు వీలు కాదట . అధ్యయనము , ప్రవచనముల వల్ల అసలే దొరకదట . ఏమి చేసినా పొందుటకు వీలు కానేకాదట . అది తానుగా మనలను అనుగ్రహించువరకూ వేచి ఉండాలట. ఇది నాకెందుకో పట్టలేదు , నచ్చలేదు . అయినా , దానిని శృతి  చెప్పుతున్నది కాబట్టి గౌరవించవలెను . గౌరవిద్దాం . ఒప్పుకుందాం . అంతే కానీ , అది మన జీవనానికి ఒక రూపు ఇవ్వడము వద్దనుకుని , నేను దానివైపుకు చూడనే లేదు  , పట్టించుకోనే లేదు . " 

" మరి ఇప్పుడు మీ పుత్రుడు మీకన్నా ప్రబలుడవుతాడు అంటిరి కదా , అది యెట్లు ? " 

         " బహుశః , వాడి శ్రద్ధ ఈ కర్మ కాండను ఒప్పుకొని , ఇంకా ముందుకు పోవచ్చేమో ! అయితే ఒక మాట . నా పుత్రుడు కర్మ కాండను తిరస్కరించుటకు నేను ఒప్పుకోను , అది వాడి ఇష్టానికి వదలను . వాడు బ్రహ్మ విద్యను నేర్చుకోవాలన్నా , మన కర్మ కాండలో నిపుణుడై , ఎక్కడ ఎవరికి ఏ సంశయము వచ్చినా దానిని పరిహరించగల వాడు కావలెను . ఎక్కడెవరే యాగాన్ని చేయవలెనన్ననూ ’ ఈ దేవరాతుడి కొడుకును పిలవాలి . లేకుంటే యాగము పూర్ణమే కాదు ’ అనవలెను . రాజాధిరాజు కూడా వాడిని పల్లకి ఎక్కించి కూర్చోబెట్టుకొని పిలుచుకొని వెళ్ళి బండినిండా దక్షిణను సమర్పించవలెను . ఇప్పుడు నాకు వీరంతా చేరి యజ్ఞవల్క్యుడు అని కదా బిరుదునిచ్చినారు , ? ఈ నా కుమారుడు ఈ బిరుదు వలన యజ్ఞవల్క్యుని కొడుకు ’ యాజ్ఞవల్క్యుడు ’ అని ప్రసిద్ధుడు కావలెను . ఆ తర్వాత కావలెనన్న , వాడికి బ్రహ్మవిద్య రానీలే . అలాకాక , వాడేమైనా బ్రహ్మ విద్య కోసము మన శ్రౌత విద్యను వదిలేస్తానంటే , నేను వాడినే వదిలేస్తాను . కానీ , వాడు అలాగు చేయడనుకో ! నాకు నమ్మకముంది . మన పుత్రుడు మనకు ఎదురు చెప్పకుండా  , మనకి ఎల్లప్పుడూ విధేయుడై ఉండేలా అగ్ని వలన వరము పొందినాను . " 

 " మీరు ఈ బ్రహ్మ విద్య సంగతిని ముందెప్పుడూ ప్రస్తావించియే ఉండలేదే ? " 

        " దానికి సందర్భము రాలేదు . అయినా , అవకాశమెక్కడ ?  నేను ప్రాజాపత్య వ్రతములో నున్నవాడిని .  అది చాలదన్నట్టు తెల్లారిన దగ్గరనుండీ పొద్దుగూకేవరకూ , కాదు , కాదు ... సంవత్సరము మొదలై సంవత్సరము  ముగిసే వరకూ అనుదినమూ ఏదో ఒక ఇష్టి , యాగము అని కూర్చొనువాడను . ఆ యాగానికి దర్భలు తేవడము , ఈ ఇష్ఠికి సమిధలు తేవడము , దానితో పాటు ఆ వచ్చినవారికి సమాధానాలిస్తూ వారి సంశయాలను పరిహరిస్తూ ... వీటిలోనే కాలమంతా గడచి పోవుచుండినది . ఈ దినమే కదా , ఈ దృశ్యము చూడటము వలన , ఈ అపరాత్రి మనమిద్దరమూ మాట్లాడుకునే యోగము కలిగింది ?  ఒకవేళ నాకు మెలకువైనా , నిద్రిస్తున్న నిన్ను చూసి , పొద్దుటినుంచీ గానుగెద్దు లాగా తిరుగుతూ రోకి రోకి అలసిపోయావని నిన్ను లేపుటకు మనసే ఒప్పేది కాదు . ఈ దినము అన్ని విధులనూ పక్కనబెట్టి నేను చూసిన విచిత్రాన్ని నీకు కూడా చెప్పాలని అనిపించి , నిన్ను పిలిచినాను . అదేవేళకు అదేమి గ్రహచారమో , నువ్వుకూడా లేచినావు . నీకు ఇంకోటి తెలుసా ఆలంబీ ? "

         ఈ వేళకి దేవరాతుడికి వాచాలత్వపు ప్రవృత్తి బలమైంది . లేచి కూర్చొని ఉంటే ఆశ్చర్యమేమీ లేదు , కానీ అతడు లేవకుండా , అట్లాగే పక్కకు పొరలి , మోచేతులపైన భారాన్ని వేసి , తలయెత్తి , భార్య వైపుకు తిరిగి అన్నాడు : " విను , నాకు ఇంకొక సహించలేని అంశమేమిటంటే , ఆ బ్రహ్మ విద్యను తెలిసిన వారు కుక్క, నక్క, చండాలుడాదిగా , అన్నిటినీ సమ భావముతో చూడవలెనంట ! అది నాకు నచ్చదు , దానిని నేను ఆమోదించలేను . బ్రాహ్మణుడై , సర్వ శ్రేష్టుడూ , జ్యేష్టుడూ యై , మేము ఆరాధించు దేవతను , మనలను ఆరాధించువారినీ , అన్నిటికన్నా మిన్నగా స్పర్శన , దర్శనములకు అయోగ్యులైన వారిని సమానమని భావించుట యేలాగు ? ఇదొక పెద్ద బహు జటిలమైన సమస్య . దానివల్లనే నేను బ్రహ్మవిద్య జోలికే పోలేదు , పోను కూడా ! నేను ఒప్పుకునే దేమిటంటే , ’ సర్వేషామవిరోధేన బ్రహ్మ కర్మ ’ చేయుట !  అనగానేమి ?  మనము  చేసే కర్మ , జాగరూకతగా , ఎవరికీ , ఏ ప్రాణికి కూడా , చేతనాచేతనమైన దేనికీ , యే రీతిలోనూ హింస కలగకుండా  చూసుకోవడము . ’ శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే ’ --రెండు కాళ్ళ ప్రాణులకూ , నాలుగు కాళ్ళ ప్రాణులకూ కూడా శుభము జరగనీ అని కర్మ చేయుట " 

       " ఔనౌను , ఇప్పుడు మీరు చేసే కర్మ అలాగే ఉన్నది . మీ జీవ కారుణ్యపు విషయములో ఎవరూ సందేహపడుటకు లేదు . ఎవరికైనా ఇబ్బంది కలుగుట ఉంటే , అది మీకే ! అయితే అది మీకు అలవాటైపోయింది . " 

      " ఏమి చేయుట ? నీకు ఇబ్బందులు తప్పుటలేదు . నా చేబట్టినందుకు నువ్వూ ఇన్ని కష్టములను సహించవలసి వచ్చింది . "

" నాకేమీ కష్టము లేదు . ఇవన్నీ నాకు కూడా అలవాటే " 

          ఆ వేళకు తొలికోడి కూసింది . అది విని ఇద్దరూ " ఇదేమిటి , అప్పుడే కోడికూత వేళ అయింది , సరే , ఇంకేమి , స్నానానికి లేచు సమయమైంది " అనుకున్నారు . దేవరాతుడు , " ఈ పొద్దు మధ్యాహ్నపు భోజనము తర్వాత నువ్వడిగితే , నేనేమి చేయవలెనని ఉన్నానో అదంతా వివరిస్తాను . నీకు ఇష్టమే కదా ? " అని అడిగినాడు .  దానికి సమాధానంగా ఆమె " అలాగంటే ఈ దినము వైశ్వదేవము త్వరగా అగునట్లు చూసుకోవలెను . మీ మాటలు నాకు బెల్లం పాకము వంటివి . అదీకాక , ఈ దినము పురాణము కూడా లేదు . సాయంత్రమొక వేళ వరకైనా మాట్లాడుకోవచ్చు " అంది . 

ఇద్దరూ ఇంకొక ఘడియ అలాగే ఉండి , స్వరము * సరిపోవు వరకు పడుకొనియుండి లేచినారు . 

( *  స్వరము :  నాసిక లోకి వచ్చు శ్వాసకే స్వరము అనిపేరు . నిద్రలేవగానే శ్వాస  ముక్కులో ఏ వైపు నుండీ ఆడుతున్నదీ చూసుకోవలెను . కుడి ముక్కు లో ఆడేది సూర్యుడు . ఎడమ ముక్కులో ఆడేది చంద్రుడు . రెంటిలోనూ ఆడేది జీవము -- అని స్వరము మూడు విధములు . ఫలానా తిథులలో , ఫలానా వారములలో , ఈయీ స్వరాలే ఉండవలెను అను నియమము ఉంది . స్వరశాస్త్రములో ఈ విషయము వివరింపబడి ఉండును . )

Tuesday, December 4, 2012

శ్రీ దేవుడు నరసింహ శాస్త్రి గారి " ’మహాదర్శనము ’ ' -- త్వరలో


         ’మహాదర్శనము ’ శ్రీ దేవుడు నరసింహ శాస్త్రి గారు 








         ’మహాదర్శనము ’ శ్రీ దేవుడు నరసింహ శాస్త్రి గారు రాసిన అనేక కృతులలో ప్రముఖమైన మూడింటిలో ఒకటి ,   చివరిది . ఇది యాజ్ఞవల్క్యుని కథ. 

     పేరుకి యాజ్ఞవల్క్యుని కథ యథాతథముగా రాసినా , ఇందులో అనేక తత్త్వ రహస్యములు , అంతరంగ రహస్యములు , ధ్యాన రహస్యములు మనిషి ఎంతవరకూ అభివృద్ధి చెందవచ్చునో కళ్ళకు కట్టినట్టు , తేలికైన భాషలో , సులభముగా అర్థమయ్యే రీతిలో వ్రాసినారు .     మనలో , మన శరీరములో మనకు తెలియని ఇన్ని రహస్యములున్నవా అని అబ్బుర పరచే కావ్యము. 

     ఆధ్యాత్మికము , తత్త్వము అనగానే చాలామందికి ఒక విముఖత. నిజానికా విముఖత ఆధ్యాత్మికము పైనో , తత్త్వము పైనో కాదు. అది వ్రాసిన విధానము , వ్రాయుటకు వాడిన భాషలపైన మాత్రమే ఆ విముఖత . సరైన విధానములో సరైన భాష వాడి రాస్తే విషయమేదైనా పాఠకులను పట్టి ఉంచుతుంది అనునది ఈ పుస్తకము చక్కగా నిరూపిస్తుంది . 

        ఈ మహా దర్శనము పుస్తకము రాయుటకు ముందు దీనిని ఒక నాటక రూపముగా రాసియుండినారు . అది 1952  లో ఆకాశవాణిలో ప్రసారమయినది . ఆ  నాటకము ఒక పత్రికలో కూడా ప్రచురించబడినది . ఆ తరువాత దీనినే విస్తరించి కాదంబరి ( నవల ) రూపములో వ్రాసినారు. అది కూడా ఇంకొక పత్రికలో ధారావాహికగా అచ్చయినది . 1935 ప్రాంతములో దేవుడు గారు అప్పట్లో ’ మీమాంస కంఠీరవ ’ బిరుదు తెచ్చుకున్న  " శ్రీ వైద్యనాథ శాస్త్రి "  గారి దగ్గర సంప్రదాయ బద్ధముగా ’ మీమాంసా శాస్త్రమును నేర్చుకున్నారు . ఆ సమయములో వారి మిత్రులొకరు యాజ్ఞవల్క్యుని విమర్శించినారట.  అప్పుడు దేవుడు ఆ మిత్రుడితో  " ఒక వేదము , ఒక బ్రాహ్మణము , ఒక ఉపనిషత్తు మానవ లోకానికి తెచ్చి ఇచ్చి, ఇంకొక ఉపనిషత్తుకు కారణమైన యాజ్ఞవల్క్యుడు మహాపురుషుడు . అతడిని ఇలాగ విమర్శించుట తగదు ’ అని చెప్పినారు . ఈ పుస్తకము వారు వ్రాయుటకు ప్రేరణ అదే . 

          శ్రీ దేవుడు నరసింహశాస్త్రి గారు రాసిన ’ మహా బ్రాహ్మణ ’ పుస్తకమును ’ మంత్ర ద్రష్ట ’ పేరుతో నేను చేసిన అనువాదము మీరంతా చదివియున్నారు . వారి కథా కథనము , శైలి , పాఠకుని కట్టి పడవేయు నటువంటి సన్నివేశ చిత్రణ మీకు పరిచితములే . ఈ పుస్తకము కూడా వారి ప్రతిభకు మరొక తార్కాణము. ఇటువంటి పుస్తకములు వ్రాయవలెనంటే కొన్ని సిద్ధులు కలిగి ఉండవలెను . సిద్ధులు ఉంటే చాలదు వాటిని తేలికగా విడమరచి చెప్ప గలగాలి , దానికి ప్రతిభ, నేర్పు ఉండాలి . ఇవన్నీ ఉన్నా స్వానుభవము లేకపోతే కేవలము మేధను ఉపయోగించి వ్రాయుట అసాధ్యము . 

         ఒకసారి చదువుట మొదలు పెట్టుట వరకే మన వంతు . తరువాత అది పూర్తియగు వరకూ నిలపకుండా చదివించే చాకచక్యము దేవుడు గారిది . ’ మహా బ్రాహ్మణ ’ ను అనువదించునపుడు నేను కొంత కష్ట పడినది నిజమే , కానీ ఈ ’ మహా దర్శనము ’ అనువదించుటకు నాకున్న సర్వ శక్తులూ , ప్రతిభలే కాక ,  దేవుడి గారి ఆశీర్వాదము , ఆ భగవంతుడి అనుగ్రహము లేక పూర్తి చేయుట దుస్సాధ్యము అని నాకు మొదట్లోనే అర్థమయినది . ఆయన శైలిలోని ఒక విశేషమేమంటే , ప్రతి పాత్రలోనూ తాను దూరి , కథ చెబుతున్నామన్న ధ్యాసతో కాక , ఆ నిమిషానికి ఆ పాత్ర ఏమాలోచించునో / అనుభవించునో అంత మాత్రమే , ఆ పాత్ర పరముగా వ్రాసి , సంభాషణలు కూడా తదనుగుణము గానే వ్రాయుట. పాఠకులకు సరిగ్గా అర్థము కావలెను కాబట్టి కావలసిన వివరాలన్నీ అప్పుడే చెప్పవలెను అన్న ఆత్రము ఏమాత్రమూ లేకుండా , కథతో పాటే పాఠకుడు కూడా నడుస్తూ , ఒక్కొక్కటీ ఆకళింపు చేసుకుంటూ , ముందుకూ వెనక్కూ పేజీలు తిప్పి తిప్పి సరి చూసుకుంటూ సరిగా అర్థము చేసుకుంటూ వెళ్ళేలా చేస్తాడు . దీనిలో ఏమాత్రమూ విసుగుదల కాదు కదా అసౌకర్యము కూడా లేక, మరింత ఆసక్తిగా చదివించేలా చేయడమే ఆయన ప్రత్యేకత. ఒకభాగములో చదివినది సరిగా అర్థము కాకున్నా , తరువాతి భాగములలో అది పూర్తిగా విశదమై మనల్ని ఆశ్చర్య చకితులను చేస్తుంది . అదీ ఆయన శైలి . 

         ఇందులోని కొన్ని నిగూఢ రహస్యములను , తత్త్వ బోధలను , సరిగా , తప్పులు లేకుండా , తప్పు అర్థము రాకుండా వ్రాయుట నాకు కత్తిమీద సామే అయినది . వారిని ప్రార్థించి , నేను ఎంతో కొంత కృతకృత్యుడనై ఉంటే దాని పూర్తి ఫలమూ , ఖ్యాతీ , శ్రీ దేవుడు గారికే నిస్సందేహముగా చెందుతుంది . 

అనువాదము ఇంకా నడుస్తున్నది . సంక్రాంతి నుంచీ ఇవ్వగలనని అనుకుంటున్నాను . 

శుభం భూయాత్