SHARE

Tuesday, January 22, 2013

16. " మహా దర్శనము "--పదహారవ భాగము ---అతి నాచికేతుడు


16.  పదహారవ భాగము  --అతి నాచికేతుడు

         బుడిలులు వాకిలి దగ్గరే కాచుకొనియున్నారు . స్నాతకుడైన కొడుకు అటువైపు నుండీ వచ్చుటకూ , ఆచార్యుడు ఇటునుండీ పోవుటకూ సరిపోయింది . ఇద్దరూ ఒకేసారి లోనికి వెళ్ళినారు .  బుడిలులు , ’ ఎంతైనా , ఆచార్యులు ఋత్విజులు కాదా ? వారు ఆలస్యము చేయుట ఉంటుందా ? చూడండి , సరిగ్గా సమయానికే వచ్చినారు... కదా ? " అన్నారు . ఆచార్యుడు , ’ ఏమైనాసరే , ఎటులనో , పెద్దవారి దగ్గర ఆలస్యముగా వచ్చినానని మర్యాద పోగొట్టుకొనుటకు బదులు , సరిగ్గా సమయానికి  వచ్చినానని పొగిడించుకున్నాను కదా " అని సంతోష పడినాడు .  

         స్నాతకుడు , వచ్చుదారిలో తన మిత్రుడొకరి ఇంటిలో వైశ్వేదేవమునకు ఆగినాడు . మిత్రుని తల్లిదండ్రులు తమ సంబంధములో నున్న పిల్లను చూచుకొని వెళ్ళు అన్నారు . కాత్యాయనుడు , ఏదేమైనా , పిల్లను చూచు పని తన తల్లిదండ్రులది అని ఎంత చెప్పిననూ వినక ఆ పిల్లను , తల్లిదండ్రులతో సహా అక్కడికే రప్పించినారు . వారి మాట ప్రకారము , నక్షత్రానుకూల్యత , వర సామ్యము రెండూ సరిపోయినాయి . అక్కడి కలాపముల నన్నిటినీ ముగించుకొని బయలు దేరు వేళకు ఆలస్యమైపోయి , ఇక్కడికి సకాలమునకు వచ్చుటకు కాలేదు . 

         బుడిలులు , కొడుకు వినయముగా నున్నాడని చాలా సంతోషించినారు . రాజ పురోహితుడు భార్గవుడు , ఆచార్యుడు దేవరాతుడూ ఆ సంతోషములో భాగస్తులైనారు . బుడిలులు , "  మేము ఆ అమ్మాయిని చూచుటకు వెళ్ళేది ఎప్పుడు ? " అన్నారు . భార్గవుడు , ’ ఎప్పుడేమిటి ? అమావాస్య ఇక నాలుగైదు దినములే ఉంది , అది గడచిన తరువాత వెళ్ళేదే " అన్నాడు .

        ఆచార్యులు , " ఔనౌను , శుభస్య శీఘ్రం . అయినంత వేగముగా మన ద్వివేదుల కడుపున ఒక బిడ్డ కలిగి , బుడిలులు పౌత్రవంతులు కావలెను అని మా కోరిక  " అన్నారు . 

        ఇలాగే ఒక్కొక్కరు ఒక్కొక సంతోషపు మాట ఆడుతుండగా లోపలినుండీ పిలుపు వచ్చినది . బుడిలులు వెళ్ళి చూచుకొని వచ్చి , " అందరూ కాళ్ళు చేతులు కడుగుకొని మడి కట్టుకోవలెను " అన్నారు . అందరూ లేచినారు . 

          భోజన శాలలో ఒక్కొక్క పీట ముందరా ఒక్కొక్క అగ్రపు అరిటాకు వేసి , రకరకాల ఫలహారములు వడ్డించి యున్నవి . నేతిలో వేయించిన ఫలహారములు , వేపుడులు , పళ్ళు , పానీయములూ , అన్నీ సిద్ధముగానున్నవి . వాటి సువాసన అతిథుల వద్దకు వెళ్ళి ,  వారి ముక్కు పట్టుకొని లాగితెచ్చు దిట్టతనము గల గృహస్థుడి వలె అంతటా వ్యాపించినది . అతిథులందరికీ అర్ఘ్య పాద్యములు తానే ఇచ్చినారు . భార్గవుడు తాను ఇంటివాడనని తప్పించుకున్నాడు . ఆచార్యుడు వద్దని ఎంత వేడుకున్నా , వదలక , ’ నీ యోగ్యత మా అందరికన్నా గొప్పదయ్యా , మహాపురుషుడి తండ్రివి నువ్వు . నీకు అన్ని మర్యాదలూ తక్కువే " అని వారే అతని కాళ్ళు కడిగి , పిలుచుకొని వెళ్ళి అగ్రస్థానములో కూర్చోబెట్టినారు . 

         కొందరు ఆచార్యునికి అగ్ర స్థానమును ఇచ్చుటను విరోధించుటకు సిద్ధమయినారు . అయితే అది ఇంకో చోటయితే సాధ్యమయ్యేదే కానీ , బుడిలుల ఇంటిలో అయ్యేది కాదు . బుడిలులకు ఎదురు చెప్పలేక వారు కిమ్మనకుండా కూర్చున్నారు . 

         నిరాటంకముగా ఫలహారములు అయినవి . అందరూ బయలుదేరినారు . భార్గవుడు ’ ఆచార్యా , ఆలస్యమగునేమోనని నేను ఇంటికి వెళ్ళకుండా బండిలో ఇట్లే వచ్చినాను . మనమిద్దరమూ కలసి వెళదామా ’ అని నిలిచాడు . 

ఆచార్యుడు , ’ భార్గవా , నేను బుడిలులను అడగవలసిన అంశము ఒకటుంది . అది ఆలస్యమైతే ? " అన్నాడు . 

భార్గవుడు , ’ అది రహస్యమై , నేను ఉండకూడదు అనునదైతే ఇప్పుడే బయలుదేరుతాను ’ అన్నాడు . 

         ఆచార్యుడు నవ్వుతూ , " ఇది మహారాజుల ఏకాంతము వంటిదే , మా వాడు ఉన్నాడు చూడండి , వాడు చిలుక అనుకొని తెచ్చిపెట్టుకుంటే రాబందుపిల్ల అయినట్టయింది, వాడూ , వాడి ప్రశ్నలూ మాకు సమాధానాలిచ్చుట అసాధ్యమైపోయింది . ’ ఇది ఈదినము వద్దయ్యా , ఇంకొక దినము ’ అంటే ఊరికే ఉండిపోయే వాడి వైఖరి చూడవలెను . మీకు ఆ దినమే చెప్పినాను కదా , ’ లోపల కడగకున్న మడ్డి , బయట కడగకున్న మసి ’   బాగానే ఉంది , అయితే లోపల కడుగుకొనేది ఎట్లా అని అడిగినాడు . దానికేమి చెప్పవలెను ?  మంత్ర జపము తో అని యంటే , ఇంకొక ప్రశ్నకు దారి , ’ అలాగంటే ఏమి  ? ’ అని తప్పక అడుగుతాడు . ఏమి చేయుట ? " 

         " మహా పురుషుడవగల కొడుకును ఎత్తుకున్నది చిన్న విషయ మనుకున్నావా ?  మీ అమ్మ , అమ్మమ్మలు మీకు పెట్టిన వస , వెన్నలను కక్కిస్తాడు " భార్గవుడు నవ్వుతూ అన్నాడు . 

          " ఈ దినమేమయిందో తెలుసా ? ఏదో ప్రశ్న అడగవలెనని వచ్చినాడు . నేను , మనసును గట్టిగా పట్టుకొని ’ మాఘ మాసము వరకూ ఉండు ’ అన్నాను . మీకన్నా , మాకన్నా ఎక్కువగా , అటులనా సరే అని ఊరకే ఉండిపోయాడు . కథ చెప్పు అన్నాడు . గువ్వ , కాకి కథలు చెప్పుటకు పోతే ఈ కథలతో మనవంటివారికి వచ్చేదేముంది అనేసినాడు . ! " 

" ఆ మన వంటి వారు అంటే ఎవరయ్యా అని అడగలేదా ? " 

" అడగ వలెననుకున్నా , కానీ ఎందుకో అడగలేదు . " 

" సరే , తర్వాత ? " 

         " సరే , నచికేతుని కథ చెప్పు అన్నాడు . నేను రెండవ వరపు సంగతి ప్రస్తావించునపుడు వాళ్ళమ్మ వాడిని పిలిచింది . వెళుతూ , " నేనూ ఒక నచికేతుడిని అవుతాను . ఆ కథ నాకు పెద్దదిగా ఇంకొక దినము చెప్పండి " అని పరిగెత్తి పోతాడా ? " 

         " ఏదేమైనా మీరు అద్భుతమైన బిడ్డను పొందినారు . ఆచార్యా , వాడు మీకు తెలియకుండానే మీకొక వరము నిచ్చినాడు . " 

" అలాగంటే ? " 

        " అగ్ని విద్య , బ్రహ్మ విద్య రెంటినీ సాధించినవాడు నచికేతుడు . తానూ అటుల కావలెనని చెప్పి , మీ హృదయ భారమును తీసివేసినాడు " 

" నిజమే , ఆ మాత్రమైనా అయింది " 

         ఆ వేళకు బుడిలులు వెళ్ళువారి నందరినీ వీడ్కొలిపి వచ్చినారు . కూర్చున్న ఇద్దరూ లేచి నిలుచుని వారిని ఆహ్వానించినారు . బుడిలులు వారిని కూర్చోండి అని చెప్పి , " చూడండి , నా భార్య , కొడుకు వస్తాడని ఈ దినము ఇంత సంబర పడింది , కోడలు వస్తుందంటే ఆకాశానికి ఎగురుతుందేమో తెలీదు " అన్నారు . 

వారి మాటకు నవ్వుతూ , " అట్లయిన , పిల్లను ఒప్పుకున్నారా ? " అని అడిగినారు . 

         " ఇంకేమి , ఒప్పుకున్నట్లే . ఆ అమ్మాయిని నేను కూడా చూచియున్నాను . సాముద్రికము బాగుంది . అమ్మాయి కూడా లక్షణముగా ఉంది ., సోదరులున్నారు . వయసు పదో , పదకొండో ఉంటుంది . వంశము రెండు వైపులా బాగుంది  , ఇంకేమి కావలెను ? " 

" అట్లన్న , వెళ్ళుటకు ముందే అంతా నిర్ణయమైనట్టే కదా ? " 

         " చూడు భార్గవా , ఎవరో ఒక అమ్మాయిని తెచ్చుకోవలసినదే కదా ? తెలిసిన వారిలో , చూచిన పిల్ల అయితే మేలు కదా ? రేపు అమావాస్య ముగియగానే వెళ్ళి చూచి రావలెను . మాఘమాసములో తలపై జీలకర్రా బెల్లమూ పెట్టించి అక్షింతలు వేసేది . ఏమి , ఆచార్యా ? " 

" సరే , తమకు నచ్చినపుడు ఇంకా చెప్పేదేముంటుంది ? " 

భార్గవుడు రాగం తీస్తూ , ’ నేనొక మాట అనవచ్చా ? "  అన్నాడు 

బుడిలులు అన్య మనస్కంగా ఉండి , " చెప్పవలసినది చెప్పియే తీరవలెను . అదేమిటో చెప్పు ? " అన్నారు 

భార్గవుడు , " పెళ్ళి ఖర్చులు ? " అన్నాడు 

         బుడిలులు , " అదేమిటది ? మగ పెళ్ళి వారికి ఖర్చులేముంటాయి ? ఉంటే ఒంటి నిండా నగలు , లేకుంటే ఒక మాంగల్యము . నేను ఒక ఉసిరికాయంత బంగారము ఉంచుకున్నాను . దానిలోనే మాంగల్యము , ముక్కు పుడక , గాజులు చేయిస్తే సరిపోతుంది " 

        " అట్లు కాదు , బుడిలులు మనందరికన్నా యేలాగు శ్రేష్ఠులో , అలాగు వారి కోడలు కూడా బంగారు , ఆభరణాలు పెట్టుకొని శ్రేష్ఠురాలుగా ఉండవలెను . " 

బుడిలులు నవ్వి , " అట్లు కావలెనంటే , నేను కనిపించిన వారికందరికీ చేతులు జోడించి , చేయి చాచవలెను . " 

         " అలాగేమీ అవసరము లేదు . ఎలాగూ , సమావర్తన సందర్భముగా ఎవరైనా కావలసినదంతా  అంటే , సుమారు వెలగ పండంత బంగారము మీ కుటుంబమునకు చదివిస్తారు . దాన్ని వారు కోడలికే ఇవ్వనీ , మీరు కూడా మీదగ్గరున్నది ఆమెకు ఇవ్వండి , " 

        దాని అర్థము గ్రహించి , బుడిలులు మొదట ఒప్పుకోనే లేదు . చివరికి , " నువ్వు నాకు దశరాత్రి జ్ఞాతి కాని పిండభాగివి . నువ్వు ఇచ్చేది తీసుకుంటే నా అపరిగ్రహ వ్రతమేమీ చెడిపోదు , కానీ లోకమేమనుకుంటుంది ? అది గమనించు . " అన్నారు . 

         " సరే , మరి , భార్గవుడు రాజభవనమునకు కన్నము వేసి కొల్లగొట్టి తెచ్చి ఇల్లు నింపుకున్నాడే అనుకునే జనాలు , బుడిలుల ఇంట పెళ్ళైతే  అంత పీనాసిగా ఉత్తచేతులతో వచ్చాడు అనుకోరా ?  అది గమనించండి " 

        " సరే , ఎంతైనా నువ్వు రాజ పురోహితుడవు . నీకు ఎదురు చెప్పి బతుకుటకు అవుతుందా? అలాగే చేయి . ఏమి ఆచార్యా ? అమావాస్య అవగానే మీరిద్దరూ నా వెంట వచ్చి ఒక లగ్న పత్రిక చేయించి రావాలి . " 

         భార్గవుడు అన్నాడు , ’ ఇప్పటికి  నేను రాకపోయినా ఆచార్యులు తప్పక వస్తారు . మీరు మాఘ మాసములో లగ్నము పెట్టుకొంటారేమో  ? నేను అప్పుడు వస్తాను . రాజభవనపు నిర్బంధము . నన్ను వదిలివేయండి . " 

" కాదయ్యా , పెళ్ళి ఖర్చులన్నీ నావే అనువాడు లగ్నపత్రికకు రాకుంటే బాగా ? " 

" నిజమే , కానీ నిర్బంధము మరి , నన్ను వదిలేయండి ." 

ఆచార్యుడు నోరు తెరిచాడు . : " అట్లయితే పెళ్ళికి నన్ను వదలి వేసినట్టే కదా ? " 

        " ఇది మరీ బాగుంది , నువ్వు యాజ్ఞవల్క్యుని తండ్రివి . నువ్వూ , నీ కుటుంబమూ కొడుకును పిలుచుకొని రాకపోతే ఈ ఇంటిని వదలి పెండ్లికి వెళ్ళేది ఎవరు ?  ఏమంటావు భార్గవా ? " 

’ సరైన మాట . అది సరే , ఆచార్యులు ఏదో మాట్లాడవలెనని వచ్చినట్టుంది . " 

          " నాకు అదీ తెలుసు . అతడికి ఒకటే ఆలోచన . ఆ పాపడిని పెంచుట ఎలా అని కొండంత ఆలోచన . ఈ దినము వద్దు , ఇంకొక రోజు రా. వివరముగా చెప్పెదను . ఒకమాటలో నన్నడిగితే , అది ఒక గంధ గజము . దానికి ఏ లోపమూ లేకుండా చూసుకోండి . ఆ బాలుడికి కావలసినది కూడు , గుడ్డ కాదు . వాడు చిన్నవాడు అని హాస్యము చేయవద్దు . వాడు అడిగిన దానికంతా దాపరికము లేకుండా చెప్పండి . వయసు చాలదు అని మోహపడకండి . " 

" ఈ దినమేమో నేను నచికేతుని అవుతాను అన్నాడంట " 

        " వీడు అతి నచికేతుడు కావలెనయ్యా ! కానిమ్ము , ఇంకో దినము మాట్లాడదాము . " ఆచార్యుడూ , భార్గవుడూ బుడిలులకు నమస్కారము చేసి ఆశీర్వాదము పొంది వెళ్ళిపోయినారు .  

         వారు వాకిలి దాటుతుండగనే వెనకాల నుండీ బుడిలులు వచ్చి , ’ ఆచార్యా , చౌలపు దినమే అక్షరాభ్యాసము కూడా కానీ . న్యాయంగా ఐదో సంవత్సరము వరకూ ఆగవలెను . కానీ మీ కొడుకు సామాన్యుడు కాడు . కాబట్టి ఎలాగో జరగనీ " అన్నారు . 

         ఆచార్యుడు మారుమాట లేకుండా, ఏ ఉద్వేగమూ లేకుండా , " యజమానులు చెప్పినది వేద వాక్యము . అక్కడ మా వాదమే ఉండదు " అని ఒప్పుకొన్నాడు . మరలా అడిగినాడు , " అట్లయితే మాఘమాసములో చేయవచ్చును కదా ? " 

         " తప్పకుండా ! మీ ఇంట్లో అక్షరాభ్యాసపు బొబ్బట్లు , మా ఇంట్లో దేవతా సమారాధన బొబ్బట్లు . రెండూ ముగించుకొని పెళ్ళికి బయలుదేరవచ్చు . ఏమంటారు రాజ పురోహితులవారు ? సరేనా ? " 

         భార్గవుడు నవ్వుతూ చేతులు జోడించి అన్నాడు , " తండ్రి మాటను జవదాటని కుమారులము , మాదేముంది ? మేము ఎప్పటికీ మీ పుత్రులము . తమరు విధాయకులు; మేము విధేయులము " 

బుడిలులు , " సరే వెళ్ళిరండి " అని వారిని బండి ఎక్కించి తాము వెనుతిరిగినారు . 

Monday, January 21, 2013

15. " మహా దర్శనము "-- పదునైదవ భాగము --మనకు కావలసిన కథ


15. పదునైదవ భాగము -- మనకు కావలసిన కథ


        కొడుకుకు మూడో యేడు కూడా నిండింది . పెరిగిన దూడ తల్లి సన్నిధిని వదలినట్లే , వాడుకూడా తండ్రి వద్దకే ఎక్కువగా చేరుతూ వచ్చినాడు . తండ్రికీ , కొడుకుకూ ఋణానుబంధము బలముగా ఉండినది . తండ్రికి పదిమంది శిష్యులకు అధ్యాపనము , ప్రవచనములను గావించుట ఒకఎత్తైతే , కొడుకు వెంట ఉండుటే ఒక ఎత్తు . కొడుకు తల్లి సావాసము వదలకున్ననూ , ఆమెకు చెప్పి తండ్రి వద్దకు వచ్చి చేరును . ఇంతవరకూ తల్లి వెంట వెంటే తిరుగుతున్నట్టే , ఇప్పుడు తండ్రి వెంట వెంటే వెళ్ళును . తండ్రి ఇంటిలో ఉన్నపుడు , అతడు ఏమి చేస్తున్ననూ పక్కనే కొడుకు ఉండవలసినదే . చేస్తున్న పని అగ్ని పరిచర్య కావచ్చును , లేదా , శిష్యులకు అధ్యాపనము చేస్తుండుట కావచ్చును . తండ్రి తోడు మాత్రము వదలడు . 

        ఒక దినము కొడుకు తండ్రి తొడపైన కూర్చొని , ’ తండ్రీ , ఆ దినము నేను ఒకమాట అడిగినాను . సరే కానీవయ్యా , చెపుతాను అన్నారు . ఇప్పుడు అడిగేదా ? అన్నాడు . తండ్రి , ’ చూడయ్యా , యాజ్ఞవల్క్యా , ఇవి కార్తీక మాసము చివరి రోజులు . ఇంకా మార్గశిరము , పుష్యము రెండు నెలలు మనసును గట్టిగా పట్టుకో . మాఘ మాసములో చౌలము జరగనీ , ఆ  తరువాత ఏమి కావలసినా అడుగు . చెపుతాను . అంతవరకూ నువ్వు నేను చెప్పే కథలను వింటూ ఉండు . " అన్నాడు . 

         కొడుకు తన మనసు తన చేతిలో ఉన్నట్లే , తాను లేగదూడలను పట్టుకొని లాగికొని తెచ్చునట్లే , మనసును పట్టి లాగి తెచ్చువాడి వలె , ’ ఊ ’ అన్నాడు . అది చూసి తండ్రికి ఆశ్చర్యము ! మంచి సంయమశీలుని వలె మనసును బిగించువాడిలా ఉన్నాడే యని . కానీ , తనకు అయిన దర్శనము వలన ఎదురుగా ఉన్నవాడు మహా పురుషుడు అని తెలుసు కాబట్టి ఆశ్చర్య పడునట్లు కూడా లేడు . ఏదైతేనేమి , తన స్థితి విచిత్రముగా ఉంది . 

       తండ్రి కొడుకును , " కథ చెప్పవలెనా ? " అని అడిగినాడు . కొడుకు ’ ఊ ’ అన్నాడు . తండ్రి చెప్పనారంభించినాడు , ’ ఒక ఊళ్ళో ఒక చెట్టు , దానిపై ఒక కాకి ఉండింది .’ 

కొడుకు , తొడపైకూర్చున్నవాడు , అలాగే తండ్రి నోటిని తన చిట్టి చేతులతో మూసి , గంభీరముగా అన్నాడు, 

         " తండ్రీ , మనవంటి వారికి కాకి కథలతో వచ్చేదేమిటి ? వద్దు " కొడుకు మాటలో సత్య నిష్ఠురత , భావపు బిగి , రెండూ ఉన్నాయి . తండ్రికి ఇంకేమి మాట్లాడుటకూ నోరు రాలేదు , " మన వంటి వారు అంటే , ఎటువంటి వారు ? " అని అడుగవలెననిపించినది , అడుగుటకే అవలేదు , కానీ మాట్లాడకుండా ఎలా ఉండుట ? యాంత్రికముగా , యంత్రము వలె , మాట్లాడినాడు , " అట్లయితే , నీకు ఎటువంటి కథ కావలెనయ్యా ? " 

        " అప్పుడు నచికేతుని కథ చెప్పినారు కదా , దాన్ని ఇంకొక సారి చెప్పండి ,  బండి కింద పడుకున్న వాడి కథ చెప్పండి , అటువంటి కథలైతే , చెప్పుటకూ బాగు , వినుటకూ బాగు  " 

         తండ్రికి నిజమే యనిపించినది . వాడు అడుగుతున్నవన్నీ బ్రహ్మజ్ఞుల కథలు . ఈ కథలను ఇప్పటినుండే ’ బాగు ’ అంటే ఇక ముందు ఏమి గతి ? అని దిగులు కలిగింది . అయితేనేమి , త్రేతాగ్నులు చెప్పినారు కదా , వారే సర్వమునూ చూచుకొనెదరు . కాబట్టి దిగులు పడనవసరము లేదు  అని ఒక మొండి ధైర్యము . 

కానిమ్ము యని తండ్రి నచికేతుని కథ చెప్పినాడు . 

        " నచికేతుడు గౌతమ వాజశ్రవసుని కొడుకు . అతని తండ్రి స్వర్గమును పొందవలెనని ఒక యాగమును చేసినాడు . దానిలో , తనవద్దనున్న సర్వమునూ దానము చేయవలసి వచ్చెను . " 

         " అలాగ తన వద్దనున్నదంతా ఎందుకు తండ్రీ , ఇచ్చేది ? .... ఊ , తప్పయిపోయింది , ఇంకా రెండు నెలలు ఏమీ మాట్లాడకూడదు , ఆ తరువాత ఏమైనా అడగవచ్చును , సరే, తర్వాత ఏమైంది , చెప్పండి " 

తండ్రి ఏదేదో ఆలోచిస్తూ , ఒక నిట్టూరుపుతో అదంతా బయటికి పారద్రోలి , ముందరి కథ చెప్పనారంభించినాడు . 

         " అలాగ దక్షిణగా సర్వమునూ ఇచ్చునపుడు , ఇంట్లో ఉన్న ముసలి యావులను  దానమిచ్చినాడు . అవి ముసలివై , పళ్ళూడిపోయి , వాటికి  గడ్డితినుటకు కూడా చేతకాదు . అటువంటివి . అప్పుడు , నచికేతుడు ఆలోచించినాడు , ’ మాతండ్రి తన సర్వస్వమునూ దానము ఇచ్చివేస్తున్నాడు , అట్లయిన , నన్ను కూడా ఇచ్చివేయునా ? అలాగ ఇచ్చినా అది విశేషమేమీ కాదు . కొడుకు తండ్రి ఆస్థిలో భాగమే కదా ? అలాగైతే నన్ను ఎవరికి ఇచ్చునో ? అడిగి తెలుసుకుంటాను ’ అనిపించినది . " తండ్రీ ! నన్ను ఎవరికి ఇస్తావు ? ’ అని అడిగెను . తండ్రి తన ముఖ్యమైన పనులను గురించి ఆలోచిస్తూ  సమాధానము చెప్పలేదు . మరలా అడిగినాడు , మరలా సమాధానము లేదు . మరలా మరలా మూడు నాలుగు సార్లు అడిగినాడు . తండ్రికి కోపము వచ్చినది . యజ్ఞములో యజమానుడై యున్న వాడు , దీక్షితుడైన వాడు  కోపము చేసుకో కూడదు అనునది కూడా మరచినాడు . నిన్ను మృత్యువుకు ఇచ్చివేస్తాను అన్నాడు . యజ్ఞశాల అంతటా నిండియున్న దేవతలు తథాస్తు అన్నారు . మృత్యు దూతలు వచ్చినారు . నచికేతునిని పిలుచుకొని పోయినారు .

         " మృత్యువంటే యముడు కదా ? ఆతడు నచికేతుని మూడు దినములు పరీక్ష చేసినాడు . నాలుగవ దినము ఆకాశవాణి, ’ మొదట ఆ బాలుడిని సత్కరించు ’ అని మ్రోగింది . యముడు సరేనని , ఆ పిల్లవాడిని పిలిచి , " పాపము , నువ్వు వచ్చి మూడు దినములు అయినది , నిన్ను ఎవరూ పట్టించుకోలేదు , యోగ క్షేమములు కూడా అడుగలేదు , తిండీ నీరూ లేక అలాగే ఉన్నావు , ఆ మూడు దినములనూ మరచిపో , ఆ మూడు దినములు కష్టపడినావు కనుక , దినమునకు ఒకటిగా , మూడు వరములను ఇచ్చెదను " అన్నాడు 

         నచికేతుడు సరేనన్నాడు . ’ ధర్మ రాజా , మా తండ్రి గారికి నాపైన చాలా ప్రేమ . వారు ఇప్పుడు నేను లేనని శోకిస్తున్నారు . యాగమును పూర్తి చేసినారో , లేదో ? కాబట్టి  , వారి యాగము పూర్ణము కావలెను , వారు శోకరహితులు కావలెను , కోప రహితులు కావలెను , నువ్వు నన్ను తిరిగి మా లోకమునకు పంపించివేసిన , వారు నన్ను ముందరిలాగానే ప్రేమతో చూడవలెను.’ .ఇది నా మొదటి వరము "  అన్నాడు . యమ ధర్మరాజు ’ ఈ పిల్లవాడు తనకోసమై ఏమీ అడుగలేదు . తండ్రికోసము ఈ వరమును అడిగినాడు ’ అని సంతోషపడి , ’ అటులనే యగుగాక , ఈ వరమును ఇచ్చినాను , ఇక రెండవ వరమును అడుగుము ’ అన్నాడు  

         " నచికేతుడు సరేనని , ’ ధర్మరాజా , మా తండ్రిగారు యాగమును చేసినది స్వర్గము కోసము: ఆ స్వర్గమునకు పోవు దారి వేరే ఉన్నదా ? ఉంటే అది నాకు కూడా నేర్పించు ’  అన్నాడు . ధర్మరాజు అటులనేనని అతడికి అగ్నివిద్యను చెప్పినాడు . నచికేతుడు , చెప్పుతుండగనే ఆ విద్యను నేర్చేసుకున్నాడు . యముడికి సంతోషమై , ఆ విద్య ’ నాచికేతాగ్ని ’ అనే పేరుతోనే ప్రసిద్ధమవనీ అని , హెచ్చుగా ఇంకొక వరమును తానై ఇచ్చినాడు , ’ నచికేతా , ఈ అగ్నిని దినమునకు మూడు సార్లు ఆరాధించినవాడికి కావలసిన లోకములు దొరకును ’ అన్నాడు " 

        దేవరాతుడు కథ చెప్పుచుండగానే ఆవేళకే సరిగ్గా తల్లి యాజ్ఞవల్క్యుని పిలిచింది . " యజ్ఞయ్యా , ఇక్కడికి రావయ్యా " అన్న ఆమె పిలుపు విని యాజ్ఞవల్క్యుడు ఏమి చేయవలెనని అడుగువాడి వలె తండ్రి ముఖమును చూచినాడు . తండ్రి , ’ అమ్మ పిలుస్తున్నది , వెళ్ళిరా ’ అన్నాడు.

’ కథ ? ’ 

’ ఇంకొక దినము చెపుతానులే , ’ 

        " ఆ దినము ఈ కథను ఇంకా పెద్దగా చేసి చెప్పండి . నేను వినవలెను . నేను కూడా ఒక నచికేతుని కావలెను " అంటూ కొడుకు తల్లి వద్దకు పరుగెత్తి పోయినాడు . 

         తండ్రి , దిగ్భ్రాంతుడై కూర్చున్నాడు . " ఇంకా మూడు యేళ్ళే . అప్పుడే తానొక నచికేతుడిని కావలెనను ఆశ , అబ్బా ! " అనుకున్నాడు . అలాగే , ’ ఈ సంగతినంతా బుడిలులకు చెప్పవలెను ’ అనిపించినది . ఇంకా ఏమేమో ఆలోచనలు వచ్చినాయి . " ఔను , వారొక్కరే దీనికి సమాధానమును చెప్పగలరు " అని కాళ్ళూ చేతులూ కడుగుకొని మంచి దుస్తులు ధరించినాడు . 

         వెంటనే గుర్తుకు వచ్చింది , ఈ దినము ఆచార్యులు బుడిలుల ఇంటికి వెళ్ళవలసి యుండినది . బుడిలుల కొడుకు కాత్యాయనుడు  ఈ దినము సమావర్తనము చేసుకొని , స్నాతకుడై ఇంటికి వచ్చును . ఇక్కడ కొడుకును తొడపై కూర్చోబెట్టుకొని ముద్దు చేయుటలో ఆ సంగతే మరచిపోయినాడు . ’ ఇప్పుడైనా గుర్తొచ్చినది , అదే సంతోషము ’ అనుకొని , ఆత్రాత్రముగా వెళ్ళినాడు . 

14. " మహాదర్శనము "--పదునాలుగవ భాగము--మడ్డి-మసి


14. పదునాలుగవ భాగము--  మడ్డి-మసి


         తల్లికి ఇంకా ఆశ్చర్యము ఎక్కువైంది . శాస్త్ర విషయములు తెలుపుతుంటే , కొడుకు శ్రద్ధ చూపిస్తున్నాడు . తల్లి మాట అంటే చాలు , ఆమాటలో భావము,  శ్రద్ధ ఉన్నాయి . నాకు తెలీదు , కానీ అమ్మకు తెలుసు , తానుగా తెలుసుకొనుట తనకు పట్టుపడు వరకూ , తానుగా విచారము చేసి అర్థము చేసుకొనువాడనగు వరకూ తల్లే తనకు గురువు , దైవము అన్న భావముంది. ఆమె మాటను తీసివేయునట్లు లేదు . దానిని అనుసరించియే కృతార్థుడను కావలెను  అను నమ్మకము , శ్రద్ధ అందులో ఉన్నాయి . 

        ఆలంబినికి ఎందుకో గుండె బెదిరింది , " ఈ పసి బాలుడు ఇంతటి శ్రద్ధావంతుడైతే నా గతి ? వేళాకోళానికి కూడా వాడి దగ్గర ఒక అబద్ధమైనా చెప్పుటకు లేదు , తక్కెడలో పదార్థమును ఉంచునట్లు నాజూకుగా , నిష్ఠురముగా , నిజంగా ఉండవలెను . కాబట్టి వీడి దగ్గర నేను ఆలోచించకుండా ఏ మాటకూడా చెప్పుటకు లేదు . కానిమ్ము , నాకు ఇదీ ఒక సంస్కారమే . లోకోద్ధారము చేయు కొడుకును పొందిన భాగ్యము అంటే అది కొండ ఎక్కినట్లు కాదా ? ఆ దినమే వారు చెప్పినారు , ’ నీవలన వాడికి ఏ రీతిలోనూ ఇబ్బంది కాకుండా చూసుకో ’ యని . ఏదేమైనా , ఇక త్వరలోనే చౌలము అవుతుంది . ఆ తరువాత వారి భారమే . అంతవరకూ వీడు ఏమైనా అడిగితే , తనకు తెలిసినది మాయా మర్మము లేకుండా చెప్పవలెను . తనకు తెలియనిదైతే , తెలీదు , వారిని అడుగి చెపుతాను యని వ్యవధిని తీసుకొని , ఆ తరువాత చెప్పేది . ’ అని నిర్ణయించుకున్నది . సహజముగా అగ్ని మందిరము వైపుకు తిరిగి , ’ నా సంకల్పము సఫలమగునట్లు కరుణించు ’ అని నమస్కరించినది . 

         కొడుకు తల్లి చేసినది చూచినాడు . ఆమె తిరిగిన వైపుకు చూచినాడు . అక్కడ ఎవరూ కంట పడలేదు . అయినా అమ్మ చెప్పినది గుర్తుకొచ్చినది . తాను చేస్తున్నది ఎందుకు ఏమిటి అనునది లేశమైనా తెలియకుండానే తానూ అటువైపుకు తిరిగి నమస్కరించినాడు . తల్లి దగ్గరకు వచ్చి గొంతు అతి చిన్నదిగా చేసి , చెవిలో నోరు పెట్టి ’ అక్కడ ఎవరైనా దేవతలు వచ్చినారేమమ్మా ? " అని అడిగినాడు . 

        తల్లి , కొడుకు చెంపపై ఒక ముద్దిచ్చి చెప్పింది , ’ అగ్ని మందిరము ఉన్నది అటువైపే కదా ? కానీ , దేవతలు ఇక్కడున్నారు , అక్కడలేరు అనుటకు లేదు . వారు అంతటా ఉంటారు . " 

        " అంటే మన వంట్లోనూ ఉన్నారా ? ఈ కట్టెలలోనూ ఉన్నారా ? ఈ ఉడుకుతున్న పప్పులోనూ ఉన్నారా ? " అని అతి గంభీరముగా కొడుకు అడిగినాడు . 

        తల్లి కూడా అంతే గంభీరముగా చెప్పింది , " ఔనయ్యా , ఈ కట్టెలలో , ఈ బియ్యములో , ఈ పప్పులో , చిన్న పిల్లవాడివైన నీలో , పెద్దదాని నైన నాలో , అంతటా ఉన్నారు . అయితే , మండుటవలన  , ఉడుకుట వలన వారికి నొప్పి కలగదు . మనము చేయునదంతా వారికే . అయితే , వారికి దానివలన నొప్పి లేదు , బాధ లేదు . వారిని మరచితే , వారికి నొప్పి . " 

        " మరచితే వారికి నొప్పి ! సరేనమ్మా , వారిని మరచిపోకుండా చూసుకుంటాను . అదే కదా నువ్వు ఆ మంత్రములో చెప్పింది ? సరే , మరచితే వారికి నొప్పి , కాబట్టి మరవరాదు " 

         ఆలంబినికి ఆశ్చర్యముల వాన కురుస్తున్నట్లాయెను . " ఇదేమిటి ? ఈ బాలుడు ఇంత గహనముగా , గంభీరముగా లోతుగా మాట్లాడుతున్నాడంటే అర్థమేమి ? " అని ఆశ్చర్యము . ఏమేమో లెక్కలు వేసుకుంటూ , " సరే , వీడు ఇతర పిల్లలవలె కాదు , దేహము చిన్నది గా ఉండుట చూసి , వీరు నా కడుపున పుట్టినారు యన్న మోహమునకు లోనై మేమూ చెడి , పిల్లలనూ చెడగొట్టుతున్నాము . దేవా ,ఈ మోహపు చెర నుండీ విడిపించు . ఎవరో జీవుడు నన్ను నిమిత్తము చేసుకొని ఈ లోకమునకు వచ్చినాడు . వాడు వచ్చిన కార్యము నావలన చెడిపోకుండా చూడు . ఇదే సద్భావము నాలో ఎప్పటికీ ఉండనీ " యని మరొకసారి నమస్కరించినది . 

       కొడుకు కూడా నిర్విషణ్ణముగా పవిత్రమైన చూపులతో ఏ సంశయమూ లేకుండా చేతులు జోడించినాడు . తల్లి అది చూచి , తనలోని మాతృ వాత్సల్యము ప్రవాహమై పొంగి బయటికి వస్తుండగా , ఇక దానిని తట్టుకొనలేక , వాడిని మరలా దగ్గరికి తీసుకొని , ముద్దు పెట్టుకొని , తొడపై కూర్చోబెట్టుకొని , హత్తుకున్నది . కొడుకు తన అంగములలో ఒక భాగము , వాటి కన్నా ఎలాగ వేరే అవుతాడు అన్న నమ్మకము ఉండవలెను , తన కాళ్ళూ చేతుల వలె వాడుకూడా తనవాడే అన్న ఖచ్చితమైన , దృఢమైన భావము ఆమెకు ఉండవలెను , లేకున్న, అలాగ హత్తుకొనుటకు సాధ్యమా ? ఆమెకు కొడుకు తన అంగములకన్నా వేరే యను భావమే ఉన్నట్లు లేదు . 

       అలాగ ఒక ఘడియ వాడిని పట్టుకొని ఉండి , " యజ్ఞీ , నువ్వు చెలుకోలు తీసుకొని నడిమింట్లో గుర్రము ఆట ఆడుకొని రా, అంతలోపల నేను చింతపండు పిసికి గిన్నెలో వేస్తాను " అన్నది . వాడు సరేనమ్మా అని మూలనున్న చెలుకోలును తీసుకొని నడిమింట్లోకి వెళ్ళినాడు . 

         తల్లి వెళుతున్న కొడుకును మరియొకసారి తిరిగి చూచినది . మరలా పిలిచి ముద్దు పెట్టుకోవాలనిపించినది . వెంటనే గృహిణీ భావము వచ్చి , ఆ భావము పెద్దదై , ’ ఇలాగ వీడితో ఆటలాడుచూ మిగిలిన పనులను చెడగొట్టుకోకూడదు , వంట చెడిపోతే వైశ్వేదేవము చెడిపోతుంది . వారూ , వారి శిష్యులూ ఏమీ అనరు , అది వారి మంచితనము . అలాగని పనులను చెడగొట్టవచ్చునా ? ’ అని గృహిణి కార్యములో కొనసాగింది . అమె పులుసులోకి చింతపండు రసము పిండి , పొయ్యిపైనున్న అన్నపు తప్పేలా ను తీసి , ఇటువైపు పెట్టి , పులుసు గిన్నెను ఎత్తి పొయ్యిపైన పెట్టింది . 

        ఆ వేళకు కొడుకు గుర్రము ఆటను నిలిపి మళ్ళీ వచ్చినాడు . తల్లి , చింతపండు పిసికిన పాత్రను కడుగుచున్నది . కొడుకు వచ్చి తల్లివద్ద నిలుచొని , ’ ఏమిటమ్మా , ఎప్పుడు చూసినా ఆ పాత్ర కడిగేది  , ఈ పాత్ర కడిగేది , నువ్వు పాత్రలు కడిగేదే పెద్ద పనిగా పెట్టుకున్నావు కదమ్మా ? " అన్నాడు . 

       తల్లికి దానికీ నవ్వు వచ్చింది . " కాదయ్యా , యజ్ఞయ్యా , పాత్రలు లోపలా కడగవలెను , బయటా కడగవలెను , అవునా కాదా , చెప్పు ? లోపల కడగకుంటే మడ్డి , బయట కడగకుంటే మసి , కాదేమీ ? చెప్పూ ? "  అంది 

        కొడుకు మళ్ళీ గంభీరుడై , బాల భావనను ఎక్కడో వదలి వేసినవాడిలాగా , అదే మాటను మరలా మరలా పలికినాడు . " లోపలా కడగవలెను , బయటా కడగవలెను,  లోపల కడగకుంటే మడ్డి , బయట కడగకుంటే మసి , " అని తన ఒంటిని చూసుకొని , ’ బయట కడుగుట తెలుసు , కానీ లోపల కడిగేదెలాగ ? ’ అని తనలో తాను మాట్లాడుకొనునట్లు అన్నాడు . 

తల్లి ఎక్కడో , ఏదో పనిలో మునిగిఉన్నది , ’ వారు వచ్చినాక వారిని అడుగు , చెపుతారు ’ అన్నది . 

       కొడుకు ’ సరే వారినే అడగవలెను , లోపల కడిగేది ఎలాగా అని . సరే , లోపల కడగకుంటే మడ్డి , బయట కడగకుంటే మసి ’ అనుకుంటూ ఉన్నాడు . 

Saturday, January 19, 2013

13. " మహాదర్శనము " -- పదమూడవ భాగము- మంత్రార్థము--2


 13. పదమూడవ భాగము-- మంత్రార్థము -2 

        ఆమె కన్నులు మూసుకున్ననూ , మనసు కళ్ళు తెరచుకొని , మెలకువగా , అభ్యాస బలము చేత మంత్రమును చెప్పుతుండినది . తల్లీ కొడుకులు కొంచముసేపు అలాగే ఉన్నారు . పొయ్యిలో ఉన్న మంట వారి సుఖమునకు తానెందుకు అడ్డము కావలెనని నిశ్శబ్దముగా మండి శాంతమైనది . అప్పుడు హఠాత్తుగా తల్లి , తాను వంటింట్లో పొయ్యి ముందర కూర్చున్నది గుర్తుకొచ్చి అదాటుగా కళ్ళు విప్పింది . కొడుకుకు మెలకువ కాకుండా ఉపాయముగా పొయ్యి సరిచేసినది . అంతలోనే కొడుకు కూడా లేచి , " ఎందుకమ్మా , మంత్రము నిలిపివేసినావు ? " అన్నాడు . 

తల్లి నవ్వుతూ , "  నిలపలేదయ్యా , మెల్లగా చెపుతున్నాను . నీకు ఏదో తూగు నిద్ర వచ్చినట్లుండినది " అన్నది .

" నిజమమ్మా , నువ్వు తొడపైన కూర్చోబెట్టుకున్నావు . నిద్ర వచ్చేసింది . ఇప్పుడు దూరముగా కూర్చుంటాను , మంత్రమును చెప్పు " 

" నిద్ర వచ్చిందని నువ్వేమీ దిగులు పడవద్దు . నిద్రలో విన్నది ఇంకా బాగా పట్టుబడుతుందట . "

" అట్లయితే నువ్వు చెప్పుతూ ఉండు , నేను నిద్రపోతూ ఉంటాను " 

’ ఇన్ని దినములూ అలాగే అవుతుండెడిది . నువ్వు తొట్టిలులోనో , తొడపైనో నిద్రపోతున్నపుడు నేను మంత్రములను చెప్పుతూనే ఉంటిని . " 

        బాలుడు , తనకు కావలసినదేదో ఒకటి దొరికినట్లు సంతోషపడుతూ అన్నాడు , " చూడమ్మా , నువ్వు మంత్రము చెప్పినపుడల్లా , ఏదో ఎక్కడో విన్నట్లుందే ! అనిపిస్తున్నది . ఎక్కడ విన్నాను అన్నది తెలీదు . " 

         ఆలంబినికి వాడి జన్మ పూర్వ  వృత్తాంతమును , లేదా తాము చూచిన దృశ్యమును , ఆచార్యుల కల , అంతా వాడికి చెప్పవలె ననిపించెను . అయితే చెప్పవచ్చునో లేదో అని ఆలోచిస్తూ వాడి ముఖాన్ని చూస్తూ ఎందుకో , ’ వద్దు , ఇప్పుడు కాదు ’ అనిపించినది . వాడుకూడా , అమ్మ అట్లే చూచుట చూసి , అర్థము లేని నవ్వు నవ్వుచూ , ’ ఎందుకమ్మా , అట్లా చూస్తున్నావు ? ’ అన్నాడు . తల్లికి పుత్ర వాత్సల్యము అంతా తానే యై , ఆ వెనకటిదంతా మరిపించుటకు , చేతులు చాచి వాడిని హత్తుకొని , తల నిమురుతూ , ’ కాదురా , నీకింకా రెండు సంవత్సరాలే వయసు , ఎంత మాట్లాడుతున్నావే అని ఆశ్చర్యమైనదయ్యా , అందుకే అట్లా చూస్తూ ఉంటిని " అన్నది . 

బాలుడు , అలాగా యని , మరలా ’ ఏదమ్మా , ఇంకా రెండు మంత్రాల అర్థము మళ్ళీ చెప్పవూ ? " అన్నాడు . 

       తల్లి , " ఒక గడియ తాళు , పొయ్యి సరి చేసి నీవైపుకు తిరిగి చెపుతాను " అన్నది . బాలుడు ఆమె వద్దన్ననూ వినక , తొడపై నుంచీ దిగి , కొంచము దూరములో , గురువు గారి వద్ద కూర్చొను శిష్యుని వలె గంభీరముగా ఆమె కోసము వేచి కూర్చున్నాడు . తల్లి కూడా , పొయిలో మంట రాజేసి  , పప్పు ఇంకా ఉడుకుతున్నది చూచి , కొడుకు వైపుకు తిరిగినది .  

" చూడు, ’ భద్రం కర్ణేభిః ’ అనునది రెండవ మంత్రము . 

|| ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః | భద్రం పశ్యేమాక్షభిః యజత్రాః | 
స్థిరైరంగై స్తుష్టువాగ్ం సస్తనూభిః | వ్యశేమ దేవహితం యదాయుః || 

అనునది దాని పూర్ణ రూపము . అర్థము చెప్పేదా ? 

       కొడుకు తల్లి ముఖాన్నే చూస్తూ ఏకాగ్రతతో వింటున్నాడు . ఆ ఏకాగ్రతను చూస్తే , పెద్దవారికి కూడా సాధ్యము కానంత ఏకాగ్రత అది !  అటూ ఇటూ అల్లాడక , నిలుచున్న స్థంభమునైనా అనేకాగ్రత యనవచ్చేమో , వాడు మాత్రము అటుల అనునట్లు లేడు . 

       తల్లి అది చూసి కొంచము ఆశ్చర్యముతో , ’ విను  , యజ్ఞీ , నీకన్నా నేను పెద్దదాన్ని . ఔనా కాదా ? అలాగే , మనకన్నా పెద్దవాళ్ళు దేవతలు . అయితే , వారు కన్నులకు కనపడరు . అలాగని వారు లేరు అనలేము . ఆ దేవతలకు చేసే ప్రార్థన ఇది,’ 

       తల్లి , కొడుకు ఏమైనా చెపుతాడా యని నిలిపింది . కొడుకు అది తెలుసుకొని , ’ అప్పుడే చెప్పితిని కదమ్మా , నువ్వు సరే ననువరకూ నేను మధ్యలో ఏమీ మాట్లాడను ’ అన్నాడు .

        తల్లి , అలాగే కానీవయ్యా అని  మళ్ళీ ఆశ్చర్యపడుతూ అంది , ’ ఆ దేవతలను గురించి భక్తుడు  అంటాడు , 
 ’ఓ దేవతలారా , మేము  చెవుల ద్వారా శుభమైనదానినే వినెదము , కన్నులనుండీ శుభమైనదానిని చూచెదము . మేము ఎల్లపుడూ యజ్ఞమునందు ఉండెదము . మా అంగములు గట్టిగా స్థిరముగా  ఉండనీ , మేము బ్రతికున్నంత వరకూ దేవతలకు హితమైనదానినే చేసెదము .’  ’ అది మంత్రపు అర్థము . నువ్వింక చెప్పేది , అడిగేది అంతా చేయవచ్చు ’ 

       " అది కాదమ్మా , దేవతలు కంటికి కనపడరు అన్నావు , అయినా ఉన్నారు అన్నావు . అదేమిటీ ? నేను ఇప్పుడు చిన్న పిల్లవాడిని . నన్ను అగ్నిని ముట్టుకోవద్దు అంటావు , అదే , నేను నీ అంత పెద్దవాడినైతే ముట్టుకోవచ్చు అంటావు , ఇప్పుడు నాకు అటక పైన ఏముందో తెలీదు , ఎక్కి చూస్తే తెలుస్తుంది . అటులేనా అమ్మా , ఇప్పుడు నువ్వు చిన్న వాడివి, పెద్దవాడివైన తరువాత దేవతలను చూడ వచ్చును అనేనా దీని అర్థము ? చెప్పమ్మా ? " 

        కొడుకు అడిగిన మాట ముద్దుగా ఉండింది . తల్లి మనసు , ముద్దుగా ఉన్ననూ , పెద్ద వారి మాటలవలె ఉన్న కొడుకు మాటలను విని ఆశ్చర్య పడింది . అయినా దాని అర్థము కన్నా , వాడి ముద్దు మాటలనే గమనిస్తూ , కొడుకుకు సమాధానము చెప్పింది , 

         " చూడయ్యా , నువ్వు దేవతల గురించి విన్నావు . నేను మీ తండ్రిగారి వెంట యజ్ఞ యాగాదులకు వెళ్ళినాను కదా , ఒక్కొక్క సారి దేవతలు వచ్చి ఆహుతులను తీసుకొనుటను చూసినాను . అయితే అది ప్రతి దినమూ జరగదు . అదిగాక , ఇంకోటి చూడు , మన అగ్ని మందిరములో చూచినావా ? ఎవరో పెద్దవారు కూర్చున్నట్లే ఉంటుంది , ఎవరు అని చూస్తే ఈ కళ్ళకు ఎవరూ కనపడరు . ఇట్లున్నపుడు , దేవతలు ఉన్నారు అనవలెనా లేదా ? " 

        " నువ్వు చెప్పిన అగ్ని మందిరపు మాట నిజమమ్మా .. నాకు కూడా అనిపించినది . అయితే ఇంకొకటి , అంటే దేవతలు ఉన్నారని చెప్పినావు కదా ! అది నాకు తెలియదు . " 

" చూడయ్యా , ఇంకా కొన్ని రోజులు పోనీ , నువ్వు పెద్దవాడవైనాక వారిని అడుగు . వారు అంతా చెపుతారు " 

       " అలాగే కానీయమ్మా , ఇప్పుడు నేను నోరు మూసుకుని , నువ్వు చెప్పినదంతా విన్నాను . అలాగే ఇంకా కొన్ని రోజులు నోరు మూసుకుని ఉంటాను . ఆ తరువాత తండ్రి గారిని అడుగుతాను . సరేనా ? ఇప్పుడు , నువ్వు అన్నావు ఇంతే కదా , శుభమైనదాన్నే విందాము , శుభమైన దానినే చూద్దాము , యజ్ఞములో ఉందాము , గట్టిగా ఉందాము , దేవతల హితమునే చేద్దాము . అంతా సరియే కదమ్మా ? " 

" సరిగ్గా చెప్పినావయ్యా " 

        " నాకెందుకో ఇది సరిగ్గా అర్థము కాలేదు . అయితే నువ్వన్నావు కదా , పెద్ద వాడినయ్యాక తెలుస్తుంది అని ! అంతవరకూ నువ్వు ఏమి చేయమంటే అది చేస్తాను . తర్వాతది చెప్పమ్మా " 

మూడో మంత్రము ఇది అన్యత్ శ్రేయః అనేది . 

   ||  ’ అన్యత్ శ్రేయః అన్యదుతేవ ప్రేయః తే ఉభే నానార్థే పురుషం సీనీతః | 
తయోః శ్రేయః ఆదదానస్య సాధు భవతి | హీయతే అర్థాత్ య  ఉ ప్రేయ వృణీతే  ||

" అమ్మా , నాకు ఈ మంత్రము చెప్పవలెననిపిస్తున్నది , చెప్పవచ్చునా ? " 

" దానికి కూడా ఆగితే మంచిది నాయనా "

     " ఐతే సరే , అలాగే ఆగుతాను , చెప్పవలెను అనిపించినపుడు నీదగ్గరకు వస్తాను . చెప్ప వచ్చునో , లేదో నువ్వు చెప్పుదువు గాని ! సరే , దీని అర్థము చెప్పు " 

      దాని అర్థము , : శ్రేయస్సు ప్రేయస్సు అనునవి రెండు . అవి రెండూ వేర్వేరు .  రెంటికీ లక్ష్యములు వేరే వేరే . రెండూ మనుష్యుని కట్టివేస్తాయి . వాటిలో శ్రేయస్సును పట్టిన వానికి శుభము కలుగును . ప్రేయస్సుకావాలంటే , వాడు గురిని వదలి దారి తప్పుతాడు  " 

       కొడుకు అది విని గంభీరుడైనాడు . కన్ను రెప్ప కొట్టలేదు . ఏదో ధ్యానిస్తున్నట్లున్నాడు . ముఖ ముద్రా , దేహ భావమూ ఏదో గొప్ప భావముతో కనిపిస్తున్నాయి . ఇప్పుడు వాడిని చూస్తే , ఎవరో జ్ఞాని , తపస్సు చేసినవాడు , ఏదో మహా వాక్యపు అనుసంధానములో ఉన్నట్టు కనిపిస్తున్నాడు ( మహా వాక్యము అంటే బ్రహ్మమును బోధించు వాక్యము ) 

       అది చూచి ఆలంబినికి మరలా ఆశ్చర్యమైనది . " మిగిలిన వారంతా బంతులు , గోళీలు ఆడే వయసు .వీడేమో మంత్రార్థమును అడుగుతున్నాడు . విని  , దానిని మథనము చేయుటకు ప్రయత్నిస్తున్నాడు . ఇదేమిటి వీడి లోక విలక్షణ నడత అని ఆమెకు ఆశ్చర్యమే ఆశ్చర్యము . ఏమైనా సరే , భర్తకు ఈ మాట చెప్పవలెను . " అనుకున్నది . 

        తల్లి , కొడుకు సమాధికి భంగము కలిగించలేదు . సద్దు చేయకుండా లేచి వంట పని చూసుకున్నది . కొంచము సేపైన తర్వాత ఏదో భారమును మోస్తున్న వాడు దానిని దించి , ఊహ్  అనునట్లు , కొడుకు నిట్టూర్పు వదలి లేచినాడు . 

       " అమ్మా , నాకేమో శ్రేయస్సే కావాలి అనిపిస్తున్నది , ప్రేయస్సు అంటే ఏమి ? అనునది తెలీదు . అది నువ్వే చెప్పమ్మా . ఏమైనా సరే  నువ్వు  చెప్పువరకూ నీమాట ప్రకారమే నడచుకొంటాను , అంతే ! " 

Friday, January 18, 2013

12. " మహా దర్శనము " --పన్నెండవ భాగము--మంత్రార్థము-1


12.    పన్నెండవ భాగము--  మంత్రార్థము --1

        బాలుడికి రెండు వర్షములు నిండినాయి . లేచి బాగా అటూ ఇటూ బుడి బుడి నడకలు నడుస్తున్నాడు . అయినా తల్లి వెనకే ఉంటాడు . ఆమె పొద్దున్నే లేచి ఇంటి పనులు చేయునపుడు , చలి యని తనకు కట్టిన ఉన్ని కుళావిని విప్పకుండానే , ఆమె వెనకాలే తిరుగుతాడు . ఆమె స్నానము చేయునపుడు తానూ స్నానము చేస్తాడు . ఆమె మడి కట్టుకుంటే తానూ మడి కట్టుకుంటాడు . ఆమె భర్తతో అగ్ని పరిచర్య చేస్తుంటే , తాను పక్కనే గోడకు ఆనుకొని కూర్చుంటాడు . ఆమె వంటలో ఉంటే , గౌరీ పూజలో ఉంటే , తాను కూడా అక్కడక్కడే ఉంటాడు . నిద్ర వస్తే వెళ్ళి పడకపైన పడుకోకుండా , అక్కడే తల్లి పక్కనే ఒక కృష్ణాజినము పైన ధావళి తుండు కప్పుకొని నిద్రపోతాడు . 

         అయితే ఇప్పుడొక మార్పు వచ్చింది . ఒక దినము తల్లి యేదో చిన్నగా జపము చేస్తున్నది విన్నాడు . వాడి కుతూహలము పెరిగి , ’ అమ్మా , నువ్వు చెప్పుతున్నది ఏమి ? ’ అన్నాడు . తల్లి ఏమి చెప్పవలెను ? ఆమెకు ఏమీ తోచక , ’ ఇంకొక దినము చెపుతానయ్యా ’ అన్నది . పాపడు సరేనమ్మా అని ఊరకున్నాడు . 

        తల్లికి గుర్తొచ్చింది , భర్త , "  పాపడు దేహము చిన్నదైన మాత్రాన వాడికి ఏమీ తెలియదనుకున్నావా ? వాడు పెరిగినాడు . బుద్ధి, మనస్సులు రెండూ పెరిగినవాడు అనుకొని వ్యవహరించు " అని చెప్పినది స్మరణకు వచ్చినది . 

         వాడిని పిలచింది , " అది కాదురా , యజ్ఞీ , నువ్వు ఏదో అడిగినావు , నేను ఏదో ఆలోచిస్తూ ఇంకొక దినము చెపుతాను అంటిని . నువ్వు అదే చాలని సరేనమ్మా అనేసినావే ? న్యాయమేనా ? " అని అడిగింది . 

       కొడుకు పరుగెత్తి వచ్చి తల్లి మెడ చుట్టూ తన చిట్టి చేతులు వేసి ఊగుతూ , ’ నేనింకేమి చేసేదమ్మా ? నువ్వు చేసేదే నేనూ చేసినాను " అన్నాడు . 

"నేను చేసేది ఏమిటి ? " 

       " ఏమిటేమిటి ? ఎండిన పిడకల తో పాటూ పచ్చి పిడకలు కలిసిపోయి వస్తే , ఇదింకా పచ్చిది అని అటువైపుకు  తీసి పెడతావు కదా ? నేనూ అట్లే , ఇంకా కాలము రాలేదు , వస్తే అమ్మే చెపుతుంది అనుకొని ఊరకే ఉన్నాను " 

       ఆలంబినికి ఆశ్చర్యమైంది . చూస్తే మూడు వర్షాల పిల్లవాడు . కానీ , వాడు ఆడిన మాట చూస్తే , పది సంవత్సరాల వాడికి కూడా లేని వివేకము కనిపిస్తోంది , మాటలో ఏ మాత్రమూ తడబాటుగానీ , పిల్లతనము కానీ లేక , స్ఫుటముగా ఉంది . శుద్ధంగా ఉంది , స్వర నియమాలకు సరిపోయినట్లుంది . ’ ఇందుకేనేమో , వారు అట్లు చెప్పినది ? " అనుకొని , మరలా పుత్రుడిని అలాగే హత్తుకొని అంది , " కాదయ్యా , నీకు ఆకలి అయిందనుకో , నేను ఇంకోదినము అంటే ఊరకుంటావా ? " 

          కొడుకు ఆలోచించి అన్నాడు , " నువ్వడిగేది సరిగ్గా లేదనిపిస్తుందమ్మా , అది ఊరికే ఉండుటకు వీలు కాదు . కడుపు నామాట వినదు . కాబట్టి నిన్ను గోడాడించుకుంటాను . ఉహూ , అది కాదు , పొట్ట నన్ను ఏడిపిస్తుంది , నేను ఏడుస్తాను . నువ్వు వెంటనే ఏదో ఒకటి చేసి ఆ ఏడుపు నిలుచునట్లు చేస్తావు . అయితే ఇది అలాగ కాలేదు . నేను అడిగినాను , నువ్వు ఇంకొక దినము అన్నావు . నాకన్నా నువ్వు పెద్ద దానివి కదా , నీమాట వినవలెను అనిపించినది . అందుకే ఊరకున్నాను . నేనింక ఏమి చేయవలసినదమ్మా ? ఏడ్చి ఉండవలెనా ? ఏడుపు రాలేదు . " 

" నువ్వు ఆకలైనపుడే ఏడవలేదు , నిద్ర వచ్చినపుడు కూడా ఏడవలేదు , ఇంక దేనికయ్యా , ఏడుస్తావు ? " 

       " కాదమ్మా , నేను ఏడువ వలెను అని నీ దగ్గరకు వస్తాను . నువ్వు వెనక్కు తిరిగి , మెడ వంకర చేసి చూస్తే ఏడుపు పారిపోతుంది , నవ్వు వస్తుంది . నేనేం చేసేది ? " 

          ఆలంబిని సంతోషముతో కొడుకును హత్తుకొని ముద్దు పెట్టుకుంది . వాడు తనలాగే తల తిప్పి , మెడ వంకర చేసుకొని చూచేది , తనకు కోపము వస్తే , తగ్గించేది , ఇష్టమైన మాట అంటే అనుకరించేది ...ఇవన్నీ ఆమెకు భలే ముద్దుగా అనిపించి , " నువ్వు ఇలాగ చేస్తుంటే నిన్నెవరురా , ముద్దు చెయ్యనిది ? " అని మరలా రెండు సార్లు ముద్దాడింది . 

         కొడుకు నవ్వుతూ , ఆమె ముద్దు తప్పించుకునేందుకు చేతితో తల్లి ముఖమును తోసేస్తూ , " ఇందుకేనా అమ్మా , నన్ను పిలచినది ? " అన్నాడు . వాడికి ఆమె చేతుల సంకెల నుండీ తప్పించుకొనుటకు వీలు కాలేదు . 

        " కాదు నాయనా , చెపుతాను , కూర్చో ..నేను నిన్ను ఎత్తుకున్నపుడల్లా, మూడు మంత్రములలో ఏదో ఒక మంత్రమును చెప్పుతూనే ఉండవలెను . " పూర్ణమదః " అనేది మొదటి మంత్రము . 

" అదా , నాకు తెలుసు , తండ్రి గారు మంట ముందర ..." 

" దాన్ని మంట అనకూడదయ్యా ...! అది యజ్ఞేశ్వరుడు . నోరు తిరగకుంటే , ’ అగ్ని ’ అను . " 

" అలాగ ఎందుకూ ?? అది మంట కాదా అమ్మా ? " 

         " చూడయ్యా , ఇప్పుడు పొయ్యిలో ఉన్నది మంట . అది మన పని చేస్తుంది . కానీ అక్కడ , అగ్ని మందిరములో ఉన్నది దేవత . ఆ దేవత పని మనము చేయవలెను . కాబట్టి ఆ దేవత మనకు యజమాని అన్నమాట . మన యజమానుని ఎవరైనా , రారా , పోరా అంటారా ? నేను నీ తండ్రి గారిని , రండి , వెళ్ళండి అని మర్యాదతో మాట్లాడించునట్లే , మనము ’ అగ్ని ’ , యజ్ఞేశ్వరుడు ’ అని గౌరవముతో పలుకవలెను , కాదా చెప్పూ ? " 

       " అటులనా అమ్మా , అయితే  అలాగే .  తండ్రిగారు అగ్నుల ముందర కూర్చొనునట్లే నేను కూడా పద్మాసనము వేసుకొని కూర్చుంటాను , చెప్పు  " 

          ఆలంబినికి ఆశ్చర్యమైనది . " తాను మంట ను మర్యాదతో ’ అగ్ని ’ అని చెప్పమన్నట్లే , తాను జపించే మంత్రానికి కూడా మర్యాద ఇచ్చి , ఆసనములో సరిగ్గా కూర్చొని జపించవలెను. ఈ మొదటి నియమమే మరచిపోయినాను , కదా ! " అనిపించినది . అప్పుడు శిశువు అని ఎత్తుకొని తిరుగుతున్నపుడు , ఆసన నియమములు అవసరము లేకుండినవి . ఇప్పుడు శిశువు కొడుకైనపుడు , ఆ నియమము అవసరము లేదనుట న్యాయమా ? ఇది సరి కాదు . ఇది కూడా కొడుకు నుండే తెలిసింది . కొడుకుకు , శిష్యుడికి ఓడిపోతే తప్పులేదు . అదీకాక , వారు ఆదినమే చెప్పినారు కదా ? వీడు మనకన్నా ఎన్నో రెట్లు ఎక్కువ అని , కాబట్టి , వీడితో ఓడిపోతే తప్పేమి ? " అనుకొని , తాను ఉన్నచోటే ఆసనమును సరిచేసుకొని , పూర్వాభిముఖముగా కూర్చున్నది . కొడుకు పక్కనే ఉత్తరాభిముఖముగా కూర్చున్నాడు . తల్లి చెప్పసాగింది . 

కుమారా , ఇది మొదటి మంత్రము 

||  ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే 
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే  || 

" దీనికి అర్థమేమమ్మా ? " 

       " చూడయ్యా , మీ తండ్రిగారిని అడిగితే  దాని అర్థము విస్తారముగా చెప్పగలరు . నేను చిన్నదిగా క్లుప్తముగా చెపుతాను " 

        " అంటే , నువ్వు చెట్టును లోపల ఉంచుకున్న గింజవలె చిన్న అర్థము చెపుతావు , తండ్రి గారైతే దానిని చెట్టును చేసి చెపుతారు , సరే చెప్పు , మధ్యలో ఈ మాటలేమిట్రా  అనవద్దు , ఈ పూర్ణమూ , నువ్వు వంటింట్లో బొబ్బట్టుకు చేసే పూర్ణమూ ఒకటేనా అమ్మా ? " 

        " ఎక్కడి నుండీ ఎక్కడికి పోతావురా , ఆ పూర్ణము , కొబ్బరికాయ , బెల్లమూ తప్ప ఇంకేమీ అవసరము లేని పూర్ణము . కానీ మంత్రములో చెప్పే పూర్ణము వేరొకటి ! అది కూడా దీనిలాగానే ఇంకేమీ అవసరము లేని పూర్ణము . మంత్రపు అర్థము చెపుతాను విను , ’ అదీ పూర్ణము , ఇదీ పూర్ణము . పూర్ణము నుండీ పుట్టునదీ పూర్ణము . పూర్ణము నుండీ పూర్ణమును తీసివేసిననూ , పూర్ణము పూర్ణముగానే మిగులును . " 

       " ఇప్పుడు అర్థమైంది . వంటింట్లో ఉన్న పూర్ణము ఒకటి . దానినుండీ ఒక ఉండ తీసేస్తే , అదీ పూర్ణము , ఇదీ పూర్ణము. అదీకాక , పూర్ణము నుండీ పూర్ణమును తీసేస్తే పూర్ణము పూర్ణముగానే ఉంటుంది, సరిపోయిందా లేదా ? " 

        ఆలంబినికి ఏమి చెప్పాలో తోచలేదు . కొడుకు చెపుతున్నది, తాను చెప్పిన మాటలే ! దానిని పూర్ణపు ఉండకు పోల్చినాడు , అంతే ! ఇదెందుకు వీడికి ఇలాగ తోచినది ? " అని ఆలోచిస్తూ ఊరకే కూర్చుంది . 

ఆవేళకు పొయ్యిలో మంట కొంచము తక్కువవుతూ వచ్చింది . పొయ్యి వైపుకు తిరిగినది . 

         కొడుకు , " ఏమమ్మా , ఇంకొక అర్థమును చెపుతాను , విను . మన దొడ్లో చెట్లు ఉన్నాయి కదా ? మామిడి చెట్టే అనుకో , అది చెట్టు అగువరకూ దానిలో ఆకులు మాత్రమే ఉంటాయి . అది పెరిగి బలిసిన తరువాత దానిలో పూలు , కాయలూ పళ్ళు వస్తాయి . అంటే ఏమిటి ? పువ్వుగా ఉండినది కాయగా మారి , అది పండువరకూ వేచి ఉంటే అగు పండు పూర్ణము . అది పూర్ణమైన చెట్టు నుండీ వచ్చింది . దాన్ని కోసి , ఆ పండైన పూర్ణమును  చెట్టు నుండీ తీసుకున్నా , చెట్టు పూర్ణముగానే మిగులుతుంది . అయితే , వంటింట్లో తయారైన పూర్ణము చెట్టుది కావడము వలన అయిన పూర్ణము . ( ఒకటి సిద్ధము , ఇంకోటి సిద్ధము నుండీ అగు సాధ్యము ) సరిగ్గా చెప్పితినా లేదా ? " 

         తల్లి కొడుకు మాటకు ఏమీ చెప్పలేకపోయినది . ఆమాటను అక్కడికి ముగించవలెనని , అపండితుడు పండితుడి మాటను ముగించుటకు అది తనకు అర్థము కాకున్ననూ " బహు బాగున్నది " అని తలఊపునట్లే , వాడి అర్థమును ఆమోదించి , " ఇదంతా నాకు చెప్పిన ఏమి ఫలము ? మీ తండ్రిగారి వద్ద చెప్పు . వారు దానిని నిర్ణయించి , తప్పో ఒప్పో చెప్పగలరు . తరువాతివి వింటావా లేదా ? " అన్నది . 

        కొడుకు తనవల్ల తప్పయింది అని తెలిసి పలుకు పెద్దవాడి వలె , అన్నాడు , ’ ఓహో , నేను మధ్యలో మాట్లాడినది తప్పయింది . దానివల్ల నీ మనసుకు బాధ కలిగిందో ఏమో ? ఇంక మాట్లాడనమ్మా , ఇప్పుడు నేనన్నది తప్పయిందమ్మా , ఇక నువ్వు చెప్పు , నేను వింటాను " అని చేతులు కట్టుకొని వినయ వినమ్రుడై కూర్చున్నాడు . 

        తల్లి కొడుకు ముఖము చూసినది . ఆమె సంతోషము పట్టరానంతగా అయిపోయింది . కొడుకు తల నిమిరి , హత్తుకొని , తొడపైన కూర్చోబెట్టుకొని , తరువాత మంత్రము చెప్పినది . 

" రెండవది " భద్రం కర్ణేభిః " మంత్రము .దాని పూర్ణ స్వరూపము ఇది : 

ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః | భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః | 

స్థిరైరంగైస్తుష్టువాగ్ం సస్తనూభిః | వ్యశేమ దేవహితం యదాయుః || 

         దాని అర్థము ఇలాగు . ఓ దేవతలారా , చెవుల ద్వారా శుభమైనదానిని వినెదము , కన్నులనుండీ శుభమైనదానిని చూచెదము . యజ్ఞమునందు ఉండెదము . స్థిరమైన అంగములున్న , దేహములున్న వారమై పొగడెదము . ఆయుష్షు ఉన్నంతవరకూ దేవహితమును ఆచరిస్తాము . 

మూడో మంత్రము ఇది 

॥  అన్యత్ శ్రేయః అన్యదుతేవ ప్రేయః తే ఉభే నానార్థే పురుషం సీనీతః | 
తయోః శ్రేయః ఆదదానస్య సాధు భవతి | హీయతే అర్థాద్య ఉ ప్రేయోవృణీతే ॥

       దాని అర్థము , : శ్రేయస్సు అనునది ఒకటి , ప్రేయస్సు అనునదొకటి . రెంటికీ లక్ష్యములు వేరే వేరే . రెండూ పురుషుని కట్టివేస్తాయి . వాటిలో శ్రేయస్సును అంగీకరించినవానికి శుభము కలుగును . ఎవడు ప్రేయస్సును పట్టుకొనునో , వాడు గురి తప్పినవాడు . " 

        ఆలంబిని మంత్రార్థమునే మననము చేసి చెప్పుచూ కొడుకును చూడలేదు . ఆమెకు ఆ దినము ఆ మంత్రములను , మంత్రార్థము లను పలుకుతుంటే వాటిలో ఎన్నడూ చూడని సొగసు తోచి , వాటివైపుకే మనసు లాగబడి , కట్టుబడిపోయినది . కొడుకు ఒడిలోకి వచ్చి అలాగే ఎదపైన వాలి తలపెట్టుకున్నాడు . తల్లి వాత్సల్యముతో కొడుకును హత్తుకొని , వాడి తలపైన తన చెంపలు ఆనించి , ఏదో అనిర్వచనీయమైన సుఖము తోచి సర్వమునూ మరచిపోయినది . తానూ అలాగే కన్నులు మూసుకున్నది . 

11. " మహాదర్శనము " -- పదకొండవ భాగము-- ఉన్నతి త్రయము --2


11. పదకొండవ భాగము--  ఉన్నతి త్రయము -2


         మరుదినము , మరలా భోజనాలైన వెంటనే దేవరాతుని ఇంటిలో సభ చేరినది . అక్కడ ఉన్న వారు అతనితో పాటు ఇంకా ఇద్దరు , మరియూ , శిశువు రూపములో నున్న ఒక మహానుభావుడు . అయినా , ఆ ముగ్గురికీ పాపడు చిన్న దేహములో చిన్నవాడి వలె కనపడుతున్ననూ , ఆ జీవనము మాత్రము తామందరి కన్నా ఉత్తమమైనదన్న విషయములో అణుమాత్రము సందేహము లేదు . 

      దేవరాతుడు మనసులో దేవతలకు పూజాదులను సమర్పించి , ఆరంభించినాడు . ’ మీ తల్లి వచ్చినారా ? ’ యని ఆలంబినిని అడిగినాడు . 

" ఇగో , ఇక్కడే తెరవెనుకే కూర్చొని ఉంది " 

        " సరే "   దేవరాతుడు ప్రారంభించినాడు . " నిన్న కాయోన్నతి గురించి చెప్పడమయినది . ఈ దినము మానోన్నతి , విద్యోన్నతుల గురించి చెప్పవలెను కదా ?  మానోన్నతి యనునది మనకు ఎవరికీ తెలియని విషయము కాదు . అయితే అది కొందరు మాత్రమే ఆచరణలో పెట్టిన విషయము . గతి లేని వారు , దరిద్రులు , దీనులైన వారి విషయమును వదిలేద్దాము , వారికి మానము , మర్యాదలు లేవు అంటాము . అలాగయితే మాన  , మర్యాదలు ఉన్నవారు ఏమి చేయవలెను అనుదానిని మాత్రము మనము ఆలోచించము . తనకేదో ఒక అంతస్తు ఉంది , అనేదే మానము . ఆ మానము వలననే , సముద్రమునకు ఒడ్డు వలె మనకు ఒక మర్యాద ఏర్పడి ఉండునది . శ్రోత్రియ బ్రాహ్మణుడు తనకు దాహముతో ప్రాణమే పోవుచున్ననూ కాళ్ళూ చేతులూ కడుక్కొని శుద్ధాచమనము చేయు వరకూ నీరు తాగడు . అలాగే ఉత్తములు ఎవరూ మాసిన బట్టలను వేసుకోరు . అలాగే మనసులో వచ్చు ఆలోచనలను , అది యోగ్యమైనది , ఇది అయోగ్యమైనది అని విభాగించుకుని , దాని ప్రకారము నడచుకొనుట మానోన్నతి . " 

         " కలప కావాలనుకొను వాడు వేలి మందముతో నున్న చెట్టును కొట్టడు . సమిధలు కావాలను వాడు పెద్ద కొమ్మను నరకడు . దాని వలెనే , తన స్థాయి  , అంతస్తులకు తగ్గదానిని తప్ప వేరే దేనిని చేసేదిలేదు అను హఠమే మానోన్నతి . 

         " వేరే మాటలలో చెప్పవలెనన్న , ప్రతియొక్క మానవుడూ , తనకు కీర్తి రావలెను అంటాడు . ఆ కీర్తి ఎట్లుండవలెను అని నిర్ధారించేది మానోన్నతి . ఎవరైనా తనకు ’ గొప్ప కాముకాగ్రణి ’ అని కీర్తి రావాలి అంటాడేమి ? అట్లేమయినా వస్తే దాన్ని అపకీర్తి అంటాము . ఇలాగ కీర్తి , అపకీర్తి అని నిర్ణయించేది ఏదో , అదే మానోన్నతి . 

         " కాబట్టి తనది కానిది, తనకు తగనిది,  తనకు వద్దనే ఒక మర్యాద కల్పించు కొనునది కూడా ఒక మానోన్నతి . ఇతరులకు హింస కాకుండా , తనకు నొప్పి కలుగకుండా నడచుకొనునది ఒక మానోన్నతి . అంతేనా ? " కామ క్రోధాదులకు వశుడై పిచ్చి పట్టినట్లు నడచుకోకుండా , పెద్దలు చెప్పిన మార్గములోనే నడుస్తాను అని తనలోనే ఈశ్వరుడున్నాడని , అదే ఈశ్వరుడు ఇతరుల లోనూ ఉన్నాడని నమ్మి , ఈశ్వరునికి ద్రోహము కాకుండా నడచుకొనుటే మానోన్నతి . అయితే మానవుడు అతి వేగముగా ఇఛ్చా ద్వేషములకు వశుడై వ్యవహరిస్తాడు . ఇతరులను మెప్పింపవలెనన్న దాక్షిణ్యము చేతనో , తన యోగ క్షేమములకు హానియగునన్న లోభముచేతనో , తానే సరైనవాడు అన్న మోహము చేతనో అపమార్గములో ప్రవర్తిస్తాడు . అటుల జరగనీకుండా నిలిపెడి శక్తి ఏది ఉందో అది మానోన్నతి . న్యాయమైన  , ధర్మమైన ఆత్మ వినియోగమే మానోన్నతి . తెలిసిందా ? " 

" దీనిని మనము ఏదో ఒక రూపములో చేస్తూనే యున్నాము కదా ? " 

         " అవునాలంబీ , అక్కడే మానవుని మనసు చెడిపోయేది . అభ్యాసపు బలము వల్లనో , విద్యాబలము వల్లనో , తనదే ఒప్పు , మిగిలినవారిదే తప్పు అన అహంకారము వల్లనో , మొత్తానికి ఎట్లో ఆపత్కాలములో చెడిపోవును . అటుల కాకుండా చూసుకోవలెను అని దీని ఉపదేశము . ధనవంతుడొకడికి , భార్య వచ్చి , గుమ్మడి కాయ చెడిపోయినది అని చెప్పిందట. వాడు , పోనీలే , ఆవుకు వెయ్యి అన్నాడట. అది కూడా ముట్టలేదట . సరే , అలాగయిన , దానమివ్వు అన్నాడట . అటువంటి పదార్థమును దానము చేయరాదను జ్ఞానమూ , తానొక శ్రీమంతుడు , తాను అట్టి దానమును చేయరాదను దార్ఢ్యమూ ఉంటే వాడు అటుల చెప్పేవాడా ? 

         " ఇంకొక సారి ఒక రాజు యుద్ధములో ఓడిపోయి , శత్రువు చెరలో చిక్కినాడట . శత్రువు తనకు శరణాగతుడై సామంతుడై ఉంటే , వాడిని వదలివేసి అతనికి ముందరి లాగే స్థాన మానములను ఇచ్చెదనని చెప్పెనట . దానికి ఆ ఓడిన వాడు , ’ నీపైన ఎత్తిన చేతులతో నీకు నమస్కరించుట నా వంటి వానికి యోగ్యము కాదు . ఏనాటికైనా పోవు  అశాశ్వతమైన దేహపు భోగమునకై నేను నీకు చేతులు జోడించి వేడుకోను " అన్నాడట . అటుల శాశ్వతమైన దానిని అశాశ్వతమైన దానికోసము బలి ఇవ్వకుండా ఉండుటే మానోన్నతి . 

         " నేను అప్పుడే చెప్పినట్లు దీనిని పొందుటకు అదృష్టము ఉండవలెను . ఆలంబీ , ఇది అందరికీ తెలుసు . కానీ దానిని వహించగల ధైర్యము , ధృతి , సామర్థ్యము అందరికీ ఉండదు . కాబట్టి దానిని పెంచుటకు తల్లిదండ్రులు , ముఖ్యముగా తల్లి కష్టపడవలెను . 

          ఆలంబిని అది విని , " అట్లయిన , మాతృత్వమంటే ఇంత కఠినమైనదా ? " అనిపించినది .  " ఔనౌను , ఇది చేయవలసిన కార్యము . నా కొడుకు లో ఇది ఉండవలసిన సద్గుణము . దానికోసము నేను కష్ట పడవలెను , కష్ట పడతాను ." అనుకున్నది . దీనినంతా ఒక్క ’ సరే ’ అని చెప్పి ముగించింది . 

          ఆచార్యుడు కొనసాగించాడు , " మానోన్నతి అంటే ఏమిటో తెలుసుకున్నావు కదా , సూక్ష్మముగా చెప్పవలెనంటే , ఇదే , సమాజమును ...లేదా సమాజమనే ఏనుగును నియంత్రణలో నుంచు అంకుశము . దీనినే ఇతర మాటలలో ధర్మమంటారు . ధర్మము అనేక ముఖములు కలది . పులి ధర్మము వేరే , ఆవు ధర్మము వేరే . వృక్ష ధర్మము , తీగ ధర్మములు వేరు వేరు .ఇట్లు నానాముఖమై, అడుగడుగునకూ భిన్నముగా నుండు ధర్మమును ఆరాధించుటయే మానోన్నతి . అది పర్వతమంత ఎత్తైనదైననూ గాలి సుడి కన్నా సూక్ష్మమైనది . బలమైన మనసు దీన్ని అర్థము చేసుకొనగలదు . నోటితో చెప్పవలెనంటే ఎలాగెలాగ ఎంతెంత చెప్పిననూ చాలక , ఇంకా మిగిలియే ఉండును . అట్లని దీనిని వదలివేయుటకు ఎవరికీ సాధ్యము కాదు . కాబట్టి మనసును ఒద్దిక చేసుకొని ధర్మమును ఆరాధించెదనను పట్టుతో వ్యవహారము చేయుటయే మానోన్నతి . " 

" ఇక విద్యోన్నతి విషయమును కొంత చెప్పవచ్చునా ? " 

" అటులే , వింటున్నాము " 

          " నిజానికి అన్నిటికన్నా సులభమైనది విద్యోన్నతి . కాయోన్నతి లో దేహమును గురించి, మానోన్నతిలో మనసును లక్ష్యము చేసి నట్లే , విద్యోన్నతి లో బుద్ధిని సూక్ష్మపరచుకొనవలెను . అది ఎలాగంటావా ? అది ఆలోచన వలన మాత్రమే సాధ్యము . విద్య అనేది , గమ్యాన్ని చేర్చు సాధనము . ఆ గమ్యాన్ని చేర్చు సామర్థ్యమును సంపాదించి ఇచ్చునది యని ఆ విద్యను ఆరాధించుట విద్యోన్నతి . "

          " అందరూ దీన్ని సాధించవలెను అను ఆశయము సదాశయము . నిజము . అయితే సామాన్యముగా సర్వులూ విద్యను ’ అశనాయా పిపాసా ’ రూపమైన , అనగా , ఆకలిదప్పులు అను మృత్యువును దాటించు సాధనమనియే ఆరాధించెదరు . ఇంతటి జీవనోపాయ సాధకమైన వృత్తిని అవలంబించు చేతనమును ఇచ్చు విద్యయే అపరా విద్య . దీనిని సాధించుటవలన కూడు గుడ్డలు సమృద్ధియగును . కానీ మనుష్యుని లక్ష్యము అంతేనా ? " 

          "  కూడు గుడ్డలకు అవతల ఇంకేదో ఉంది అని నమ్ముటకూ ఒక విలక్షణమైన సామర్థ్యము కావలెను . ఆలంబీ అంతటి అవతలి దాన్ని సాధించి ఇచ్చునది పరా విద్య . భక్తుడొకనికి ఎవరో ఒక ముత్యపు హారాన్ని ఇచ్చినారట . అతడు , ఇచ్చినవారిపైన గౌరవముతో దాన్ని తీసుకున్నాడట . కానీ అతడికి కావలసినది తన ఇష్ట దైవము . ఆ హారపు ముత్యములలో ఆ ఇష్ట దైవము ఉందో లేదో యని ఒక్కొక్కదాన్నీ పగలగొట్టి చూచి , దానిలో తన తన ఇష్ట దైవము లేదని దాన్ని పారవేసినాడట ! అట్లే , తన చుట్టూ ఉన్నదాంట్లో అమృతముందా ? అని వెదుకవలెను . పువ్వు నుండీ పువ్వుకు సాగి వాటిలోని మధువును సంగ్రహించు తుమ్మెద వలె ,  భూమిలోనున్న  నీరువలె లోకములో నున్న కనపడని అమృతమును వెదకవలెను . ఆ అమృతము ఎక్కడ నిండి ఉండునో అక్కడికి పోవు సామర్థ్యమును కల్పించి ఇచ్చునదే విద్య . ఆ విద్యను గురించి అందరూ చెప్పెదరు , కానీ దాన్ని తెలిసినవారు లక్షకు ఒక్కరుంటే ఎక్కువ . అటువంటి విద్యను సాధించునది విద్యోన్నతి . " 

           " ఇలాగ అందరూ తెలుసుకున్నాము అనుకున్ననూ ఎవరూ చూడని ఆ విద్యను పొందుట ఎట్లు ? అనెదవేమో , ఈ సమాజము అను వృక్షము ఒకటుంది . అది ఎంతోకాలానికి ఒకసారి మాత్రమే ఈ విద్యోన్నతి ఉన్న మహాపురుషుడు యను సత్ఫలాన్ని ఇచ్చేది . అపుడేమవునో తెలుసా ? ఒక సూర్యుని ఉదయమైతే , అతని కిరణాలు ఎంతవరకూ పోగలవో , అంతవరకూ పగలు అగునట్లే , అమృతపు ప్రవాహమొకటి పారును . లేదా , అమృత వర్షము కురియును . అలాగు  కురియు అమృతసోనలు కూడా అసహ్యమని ఇంటిలోపలికి వెళ్ళిపోవు వారు లేకపోలేదు . ఎలాగంటే , దినదినమూ ఉదయించు సూర్యుని చూచువారిలో , ’ ఈ సూర్యుడు స్థావర జంగమముల ఆత్మ '  యని నమస్కరించు వారెందరు ? అలాగే , విద్యోన్నతి ఉన్న మహాపురుషుడు అమృతమే జీవన లక్ష్యము అని సాగిననూ ,  ’ ఇది నా అనుభవము , మీరు కూడా పొంది కృతార్థులు కండి ’ అని పిలుస్తున్ననూ దానిని వినక చెవిటివారివలె అందరూ వెళ్ళిపోతారు . దేశ కాలములు ప్రసన్నమై , పంచభూతములు సరేనని ఒప్పుకొని , దేవ , ఋషి , పితరులు అనుగ్రహించ వలెననుకొన్నపుడే అంతటి మహాత్ముని ఉదయమగును . " 

          " ఆలంబీ  , నువ్వు పుణ్యాత్మురాలవు . అంతటి మహాపురుషుని గర్భమున మోసి పుత్రునిగా పొందినావు . నీ రక్త మాంసాలు ఆ చేతనానికి గూడు కట్టి ఇచ్చినాయి . వాటిలో చేరుకున్న ఆ చేతనము తన స్వస్వరూపమును తెలుసుకొనుటకు ఇబ్బంది కాకుండునట్లు కాయోన్నతిని సాధించి ఇచ్చుటకు ఒప్పుకున్న నువ్వు , ఆ దేహములోని బుద్ధి అంధకారావృతమైన గుహ కాకుండా చూసుకో . ఆ బుద్ధి పరిశుద్ధమై , తనలో ప్రతిఫలించిన చైతన్యపు బింబమును సాక్షాత్కరించుకొనుటకు అనుకూలమగునట్లు , ఆ బుద్ధికి ఇప్పటి నుండి శ్రేయస్సు , ప్రేయస్సులను నేర్పించు . దాని శ్రేయస్సు ,  ప్రేయస్సు కన్నా గొప్పదని తప్పక చెబుతుండు . ముఖ్యముగా ఒకటి మరవద్దు , ఆ మహానుభావుడు మన కడుపున పుట్టినందుకు మనలను తల్లిదండ్రులుగా పొందినందుకు విచారించు సందర్భము రాకుండా చూసుకో . " 

" అటులనే , మరి ఈ బుడమకాయ వంటి బొమ్మకి ఇంకా మాటలే రావు కదా , దీనికి అర్థమగునట్లు చెప్పుట ఎలాగ ? "

          " దానికి ఒక ఉపాయముంది , అది బుడమ కాయ , బొమ్మ , మాటలు రావు , వివేకము లేదు మొదలైనవన్నీ నీ భ్రాంతులు . ఆలంబీ , ఈ శిశువు దేహములోనున్న చైతన్యము కొడుకని భావించక , నీతో సమమైన మనసు గలవారితో మాట్లాడునట్లే మాట్లాడు . అయితే , నువ్వు వాడిని మాట్లాడించునపుడు అన్నీ తెలిసిన సమాన వయస్కులతో మాట్లాడినట్లు మాట్లాడుట లేదు అన్నది కూడా మరవద్దు . ఆలంబినీ దేవి ఒప్పుకున్నది . దేవరాతుడు , ’ నేను ఇంతవరకూ , ఇటువంటి మాటలనే మాట్లాడలేదు కదా ! అవెలా వచ్చినాయి ? " అని ఆలోచిస్తూ కూర్చున్నాడు . 

          ఆలంబిని తొడపై పడుకున్న పాపడు నవ్వాడు .  ఆ వయసు పిల్లలు ఏడ్చుట తెలిసినది , నవ్వుటను చూచియే ఉండలేదు , ఇదేమాశ్చర్యము  అని తల్లిని అడిగింది . ఆమె వచ్చి చూచి , ’ ఇదేమి విచిత్రమో ? నేను కూడా ఇంతవరకూ చూచియుండలేదు  ’ అని ఆశ్చర్యపోయినది . 

         ఆచార్యునికి , ’ ఆ నవ్వు నాకోసమే ’ అనిపించింది . " అలాగైతే , నేనింతవరకూ మాట్లాడినది , ఈ పాపడైన మహాభావుని ప్రభావమా ? " అనుకొని పాపడి వైపుకు తిరిగినాడు . అతనికి ఉత్తరమిచ్చినట్లు పాపడు మళ్ళీ ఒకసారి నవ్వాడు . 

         ఆచార్యుడు ఆలోచనలో పడ్డాడు . తానింతకు మునుపు కూడా  అమృతము గురించి మాట్లాడినది ఉన్నమాటే . అయితే , ఆ అమృతము మరణమును మించినది అను అర్థములో మాత్రమే . ఈ దినము అమృతమంటే బ్రహ్మానందము అను అర్థములో . ఇతడు ఇలాగే , నాకు తెలియకుండానే నన్ను మార్చివేయునా ? ఇప్పుడు కర్మఠుడనైన నేను పోను పోనూ బ్రహ్మిష్ఠుడ నౌతానా ? అనిపించినది . మరలా కొడుకును చూసినాడు , వాడు మరలా నవ్వినాడు . 

         ఆచార్యునికి దిగులు పుట్టింది . అయినా సంతోషము తప్పలేదు : " ఒకవేళ అయితేనేమి ? కర్మలో కామముందట . అది తప్పితే , కర్మ నిష్కామమైతే , బ్రహ్మమే గతియట ! కానిమ్ము , అదికూడా ఏమీ అవిహితమైనది కాదు కదా , బ్రహ్మము ఎందెందు చూసినా ఉంది అనుట ఉందిగదా , దానినే ఇంకా గట్టిగా చెప్పునట్లవుతుంది . " అని ఇంకా ఏమేమో ఆలోచిస్తూ అక్కడినుండీ లేచి వెళ్ళిపోయినాడు . వెళ్ళునపుడు పాపడి ముఖమొకసారి చూడాలనిపించెను . " వద్దు , వద్దు " అని ఎవరో తోసుకొని వెళ్ళినట్లే అయింది , వెళ్ళిపోయినాడు . 

10. " మహా దర్శనము " --పదవ భాగము--ఉన్నతి త్రయము -1 -


పదవ భాగము--ఉన్నతి త్రయము --1


       అతడు భార్గవుని ఇంటినుండీ వచ్చు వేళకు , ఆలంబినీ , జాయంతులు పిల్లవాడి గురించి ఏమో చర్చిస్తున్నారు . ఆచార్యుడు వస్తున్నది తెలిసి జాయంతి , " అదిగో , నీ భర్త వస్తున్నట్లుంది , వారిని అడుగు, వారైతే సరిగ్గా చెపుతారు. " అన్నది . ఆచార్యుడు కాళ్ళు కడుక్కొని భార్యను చూచుటకు వచ్చినాడు . ఆమె , ’ భార్గవులు ఎందుకు రమ్మనినారు ? " అని అడిగింది . 

        అతడు నవ్వుతూ అన్నాడు , " మనము రాజాశ్రయము పెద్దగా కోరక ,  వద్దనుకున్నవారము . నీ కొడుకు పుట్టిన యోగము చూస్తే , వాడిని రాజ-మహారాజులందరూ తాముగా అనుగ్రహించెదరని కనపడుతున్నది . మహారాజు గారు బిడ్డను చూచుటకు వచ్చెదరట ! అతనికి చాలా కాలము నుండీ కురు , పాంచాల , కాశీ లలోని విద్వాంసులను మించిన విద్యా సంపన్నుడు మిథిలా నగరములో ఉండిన బాగుండును అన్న ఆశ . అందుచేతనే వైశంపాయన , ఉద్ధాలకులవంటి కులపతులను పిలిపించుకొని ఆశ్రమములను కట్టి ఇచ్చినది . వారికన్నా శ్రేష్ఠుడైన విద్వాంసుడు ఇంకొకడు కావలెనని రాజు గారి ఆశ . అతడు , బుడిలులు చెప్పినది భార్గవుల ద్వారా విని , ఆ పాపడిని నేను చూడ వలెను అని ఆశపడినారట ! అందుకై , ఏ దినము మహారాజును పిలుచుకొని రావలెను యని అడుగుటకు పిలిపించినారు . " 

       " నేను మాట్లాడవచ్చునో మాట్లాడకూడదో తెలీదు , ఏమైనా కానీ , దానిని తప్పించుటయే మంచిది . రాజ దృష్టి తగిలితే తప్పకుండా అపాయమగునట ! " 

        " ఆ మాటకోసము తప్పించుట సాధ్యము కాదు . అయినా , యజ్ఞేశ్వరుని ప్రసాదము మన ఇంటిదీ ఉంది , చాలదంటే బుడిలులు తెచ్చి ఇచ్చినదీ ఉంది . ఈ రెంటినీ మీరగల  దృష్టి దోషము అదెంత ? కాబట్టి రానివ్వు , నీ కొడుకుకు రాజసేవా యోగము ఉంది , అయితే అది రాజు చేయు సేవయో లేదా రాజుకు చేయు సేవయో తెలియవలెను . " 

       జాయంతి లోపలినుండే అన్నది , " అది రాజు చేయు సేవవల్లనే జరగనీ అని ఇప్పటినుండీ సంకల్పము చేసిన సరిపోవును . " ... అంతలోనే ఏదో జ్ఞాపకము వచ్చినదానిలాగా , " ఆలంబీ , వారినడుగమ్మా , కాయోన్నతి , మానోన్నతి , విద్యోన్నతి అనగానేమి ? అని . వారైతే దానిని వివరించి చెప్పెదరు . నువ్వూ నేనూ ఎంత తలలు బద్దలు కొట్టుకున్నా ప్రయోజనము లేదు " అన్నది . 

         ఆ వేళకు పాపడు లేచి ఏడ్చాడు . తల్లి , " ఎత్తుకోవే , ఎప్పుడనగా ఎత్తుకున్నావో ఏమో , " అంది . కూతురు ఎత్తుకొని , " నిజంగానే బుడిలులు అదేమిటో చెప్పినారు కదా ! ఏమిటది ? మాకు అర్థము కాలేదు . మాకు అర్థమగునట్లు చెప్పకూడదా ? " అని వినయముతో అడిగింది . 

         ఆచార్యునికి కూడా దారిలో వస్తూ అదే ఆలోచన . తనకు  అర్థమయినదానికన్నా ఎక్కువగా ఆ మాటలకు ఇంకేదో అర్థము ఉండవలెననిపిస్తున్నది . ఇప్పుడు భార్య , ఆమె ద్వారా అత్తగారు అడుగుతున్నారు . చెప్పకుండుటెలా ? అందుకని ప్రవచనమునకు అనుకూలమగునట్లు ఒక ఆసనమును తెప్పించి , దానిపై కూర్చొని , సావధానముగా చెప్పుట మొదలిడినాడు . అతని మాట , తాను గొప్పవారనుకున్న వారి ఎదురుగా మాట్లాడుతున్నట్టు జాగ్రత్తగా వస్తున్నది . అతడు చెప్పుటకు సిద్ధమైనాడే కానీ , ఏమి చెప్పవలె ననుదానిని నిర్ణయించుకోలేదు .  అట్లని , అపనమ్మకము , అయోమయమూ ఏమీ లేవు .  మనస్సులో గురువు గారికీ , వాగీశ్వరునికీ , వాత్సల్య రూపుడైన యజ్ఞేశ్వరునికీ నమస్కరించి చెప్పుట మొదలిడినాడు . 

        " చూడు , ఇప్పుడు నువ్వు పాపడిని ఎత్తుకున్నావు . ఇప్పుడు నీ భావన ఏమిటి ? కొడుకు ఏడ్చినాడు అని ఎత్తుకున్నావు . కర్మ ధర్మ సంబంధము వలన నీ రొమ్ము పాలు శిశువును పెంచుతున్నవి . ఇందులో నీ సంకల్పము ఏదైనా ఉందా ? " 

        ఆలంబిని తనను తాను పరీక్షించుకొన్నది , మనసులో ఏ సంకల్పమూ లేదు , పిల్లవాడు పెరగవలెను అని ఏదో జనాంతికమైన ఆశ . అయితే , అది కావాలని వివేకముతో చేసిన సంకల్పము కాదు . తల్లికి సహజముగా వచ్చు ఆశ. ఆమెకు ఆశ్చర్యమైనది . ఉత్తరమునిచ్చినది , " నిజము , ఖచ్చితమైన సంకల్పము ఏమీ లేదు. అయితే , ఆదినము మీరు నేర్పించిన సరస్వతీ ప్రార్థన ఒకటీ ఉంది , ఇంకేమీ లేదు . " 

         " సరే , మీ తల్లి నిలుచుకొనే ఉన్నట్లుంది , కూర్చొని వినవచ్చును అని చెప్పు . ఇక విను , ధనమును సంపాదించి రాశి పోసుకొను వైశ్యుని కన్నా , లోకములో ధర్మమును కాపాడు కొనుట కోసము ప్రాణమునే పణముగా పెట్టి రక్షించు క్షత్రియుని కన్నా , మనము బ్రాహ్మణులే శ్రేష్ఠులు అనుకుంటాము . అట్లయిన , మన కర్మ , ఆ ఆర్జన కన్నా , ఆ పాలన కన్నా గొప్పదిగా ఉండవలెను కదా ? 

" అవును " 

         " దానికి తగ్గ దేహమును మనము పొందియున్నామా ? మనది విద్యార్జన  . మన పాలనము ఏమున్ననూ విద్యా పాలన. ఈ రెండూ ధనార్జన , లోక పాలనల కన్నా గొప్పవే అయిఉంటే , దానికి తగ్గ దేహమంటే , అది వైశ్య , క్షత్రియుల దేహములకన్నా ఉత్తమముగా ఉండవలెను కదా ? ఇప్పుడు మనము కాయ పుష్ఠి ఏమున్నా అది క్షత్రియులకే సొంతము అనుకున్నాము . అది తప్పించవలెను . బ్రాహ్మణుని దేహము క్షత్రియుని దేహము కన్నా ఉత్తమమై ఉండవలెను . అటుల కావలెనన్న ఏమి కావలెను ? కండలు ఉంటే , కష్టమును సహించు శక్తి ఉంటే చాలా ? అంటే  , అది కాదు . మనుష్యుని దేహమంతా నరములతో నిర్మింపబడినది . అక్కడ ఆ నరములు స్వతంత్రముగా , కోమలముగా , సొంపుగా పెరుగుటకు అనుకూలత ఉండవలెను . అదే బ్రాహ్మణ దేహపు శ్రేష్ఠత . దానిని సాధించుటకు మనము ప్రయత్నిస్తున్నామా ? ఏ దేహము ఎలాగుండిన , విద్యార్జన , పాలన సమర్థమగుతుంది? అని మనము ఏనాడైనా ఆలోచించినామా ? ఈ ప్రశ్నకి సమాధానమే కాయోన్నతి . " 

" ఈ ప్రశ్న వచ్చేది పెద్దవారైన తరువాత కదా ? " 

         " కాదు . మనుష్యుని సమాజములో అటుల కాదు . మిగిలిన ప్రాణులన్నీ తల్లి తోడు వదలగనే స్వతంత్రమగుచున్నాయి . కానీ మనుషులు అటుల కాదు . వారి లేతదనమే సుమారు నాలుగైదు సంవత్సరములు . అంతవరకూ దేహమునకు తగిన మార్గ దర్శనము అవసరము లేదా ? తప్పక కావలెను . కాబట్టి తల్లి కొడుకుకు చేయవలసినది చాలా ఉంది . ఆమె పుత్రుడికి స్తన్యమును ఇచ్చునపుడు , వాడు ముందు ముందు ఏమి కావాలనునది సంకల్ప పూర్వకముగా నిర్ణయము చేసుకోవలెను . దానిని మనసులో పైకి తెస్తుండవలెను . నువ్వే అనుకో , నీ కొడుకు మంచి కర్మఠుడు కావలెను యని సంకల్పించుచున్నావు . నేను చెప్పేది సంకల్పము , మనో వృత్తి కాదు . బుద్ధిని ఉపయోగించకుండా జరిగేదంతా వృత్తివలన అగును . బుద్ధి పూర్వకముగా అయ్యేది సంకల్పము వలన జరిగేది . కర్మకు దేవతలు లేనిదే వీలు కాదు . కాబట్టి కర్మఠుడవ వలసిన వాడు దేవతా మయమైన శరీరమును పొందవలెను . దానికోసము , తల్లి తన కొడుకును దేవతామయమైన శరీరము కలవాడవనీ అని సంకల్పిస్తూ స్తన్యపానమును చేయించవలెను . అప్పుడే ఆలంబీ , దేవతామయమైన శరీరము పెరిగేది , అదే కాయోన్నతి . " 

" ఒకమాట అడగవచ్చునా ? " ఆలంబి వినయముగా అడిగింది . 

" అడుగు , ఏ విధమైన సందేహములూ మిగలకుండా అన్నీ అడుగు ." 

" మరి , ఈ జ్ఞానమే లేకుండా పెంచితే ? " 

         " మంచి ప్రశ్నే ! విను , ప్రతి దేహములోనూ దేవాంశములు ఉండనే ఉంటాయి . అవి లేక పోతే , మనము చూసేది కేవలము కన్నులతో మాత్రమే అనుకున్నావా ? అటుల గోళములతో మాత్రమే చూడగలిగితే , గోళములున్న పీనుగ ఎందుకు చూడలేదు ? సంకల్ప పూర్వకముగా పెంచిన శరీరములో కనులు , చర్మ చక్షువులగుటతో పాటు జ్ఞాన చక్షువులు కూడా కాతగ్గ యోగ్యతను పొందును . వాన వలన పెరిగిన కంకులూ కంకులే , నీరు పోసి పెంచిన కంకులూ కంకులే . కానీ , రెండవ జాతిలో ఉన్న మృదుత్వాది గుణములు మొదటి జాతి లో ఉంటాయా ? అదే , నిస్సంకల్పముగా పెరిగిన దేహమునకూ , సంకల్ప పూర్వకముగా పెంచిన దేహమునకూ ఉన్న వ్యత్యాసము . అదీగాక , నిస్సంకల్పముగా పెరిగిన దేహములో , పాడుపడిన గుడిలో పిశాచములు చేరినట్లు , అసురులు వచ్చి చేరుతారు . అట్టి దేహము సులభముగా పాపమును చేయును , పుణ్యమును విరోధించును . " 

      " పాప పుణ్యములనగా నేమి , దేవా ? " ఆలంబిని భర్తతో అంత నేరుగా ఎప్పుడూ మాట్లాడియుండలేదు . ఆ ప్రశ్న ఆమెకే ఆశ్చర్యమును కలిగించింది . 

         దేవరాతుడు , అది విని , ఏమీ ఉద్విగ్నుడు కాకుండానే చెప్పినాడు : " పాపము , పుణ్యము అంటే , అపూర్ణత్వము  , పూర్ణత్వములు . ఒకటి ఎక్కువైతే జగపు వినాశనము . ఇంకొకటి ఎక్కువైతే జగపు ఉద్ధారము . నేల , తనకు తోచినట్లే , అడిగేవారు - చెప్పేవారు లేక పెరిగితే అది అడవి . అటుల కాక , ఒకరి సంకల్పముతో పెరిగితే అది పొలము . అట్లే కాయోన్నతి కూడా ! ఇప్పుడు తెలిసిందా , కాయోన్నతి అంటే ఏమి అని ? ఇప్పుడు చెప్పు , నువ్వు నా కొడుకు విషయములో ఏమి చేయవలెననుకొన్నావు ?? 

         " దేవా , నేను మీ అంత తెలిసిన దాన్ని కాదు . మీరు చెప్పినట్లు చేస్తే , మీ ఇష్టానుకూలముగా నడచుకుంటే కృతార్థురాలిని అనుకున్నదానిని . ఇప్పుడు సంకల్ప పూర్వకముగా కొడుకు శరీరమును పెంచు అని అనుజ్ఞ ఇచ్చినారు , నేను దానిప్రకారమే నడచుకుంటాను . ఈ దేహము దేవతావాసము కానీ యని సంకల్పము చేసి , సరస్వతిని ధ్యానిస్తూ బిడ్డడికి స్తన్యపానము చేయిస్తున్నాను . అటులనే , మానోన్నతి , విద్యోన్నతులను గురించి చెప్పండి . నాచేతనైనంత వరకూ తెలుసుకొని నడచుకుంటాను . " 

          " నువ్వు పుణ్యాత్మురాలవు , ఆలంబీ ! ఈ జగత్తులో తెలియకున్ననూ , తమకు తెలియదు అని చెప్పుటకు వెనుకాడి , చిత్తములను చెడగొట్టే వారే ఎక్కువ. నువ్వేమో నిస్సంకోచముగా , నాకు తెలియదు , మీరు చెప్పండి , తెలుసుకొని నడచుకుంటాను అంటున్నావు . నీవంటి స్పష్ట భాషిణిని భార్యగా పొందిన నేనే ధన్యుడను . సాయంత్రము కావస్తున్నది . నేను వెళ్ళి ముందరి కార్య కలాపములకు సిద్ధమవుతాను . రేపో మర్నాడో ఈ మానోన్నతి , విద్యోన్నతుల గురించి చెప్పెదను . " 

         భార్యకు చెప్పి , దేవరాతుడు వెనుతిరిగినాడు . అతనికి ఆశ్చర్యము . " నేను చెప్పినది అందరికీ తెలిసినదే . అయినా ఎవరూ ప్రయత్నించరెందుకో ? అయినా , నేను మాత్రము ఇంత సమంజసముగా ఎప్పుడు చెప్పినాను ? బుడిలులు చెప్పినట్లు ఇదంతా ఉయ్యాల ఊగుతున్న ఆ మహానుభావుడి ప్రభావమా ? " అని రకరకాలుగా ఆలోచనలు . వాడిని గురించే ఆశ్చర్యముతో ఆలోచిస్తూ స్నాన గృహమునకు వెళ్ళినాడు . 

Thursday, January 17, 2013

9. " మహాదర్శనము " --తొమ్మిదవ భాగము--అపరిగ్రాహి


తొమ్మిదవ భాగము  ---అపరిగ్రాహి 

        పాపడికి రెండు నెలలు నిండినాయి . ఆ రెండు నెలలలో రెండుసార్లు తొట్టిలు మార్చవలసి వచ్చింది . ఆలంబినికీ , జాయంతికీ , బిడ్డ అలాగ పెరుగుతున్నది చూసి చాలా సంతోషము . దేవరాతుడు కన్నారా చూస్తున్నాడు కాబట్టి నమ్మక తప్పలేదు . 

         రెండు నెలలు నిండి రెండు మూడు దినములయి ఉంటుంది . బుడిలుడు ’ ఆచార్యా ’ అంటూ వచ్చినాడు . దేవరాతుడు బయటికి ఎక్కడికో  వెళ్ళవలెను అని సిద్ధమవుతున్నవాడు , అతని గొంతు విని , ’ దయ చేయండి ’ అని వాకిలి దగ్గరకు వచ్చి లోపలికి పిలుచుకొని పోయినాడు . దేవరాతుడు అంచులు మడతలు పోకుండా అందముగా , పద్దతిగా కట్టుకొన్న ధోవతిని చూచి బుడిలుడు , " దీనికే కదటయ్యా మేమంతా నిన్ను అంతగా మెచ్చుకొనేది ! భలే , ఎంతబాగా ధోవతి కట్టుకున్నావు ! సరే , ఎక్కడికైనా కార్యార్థివై వెళుతున్నావా ? నేను ఒంటి బ్రాహ్మణుడను ఎదురు వచ్చినట్లాయె కదా " అన్నాడు . 

         ఆచార్యుడు నవ్వుతూ , " మీరే అలాగన్న ఎలాగు ? మీరే కదా చెపుతారు , " సర్వే దేవా వేదవిది బ్రాహ్మణే ప్రతివసంతి "  దేవతలందరూ వేదవిదుడైన బ్రాహ్మణునిలో ఉంటారు అని ! అలాగైనపుడు మీరు ఒంటి అనుట ఎలాగు ? " అన్నాడు . 

        బుడిలుడు నవ్వి అన్నాడు , " ఇదే చూడు మాయ అనేది ! మనకు తెలిసిన విషయమును మూసి , వేరొకదాన్ని పలికిస్తుంది కదా అది ! మంచిది , నావలన నీ కార్యమునకు తొందరేమీ కాలేదు కదా ? " 

        " ఏమీ లేదు , భార్గవులు ఎందుకో పిలిచినారు . తరువాత కూడా వెళ్ళవచ్చును . వెళ్ళకున్నా ఫరవాలేదు . మీరు వచ్చినారంటే నాకు మిగిలినవేవీ గణ్యములు కావు . " 

" అయితే సరే , నేను వచ్చినది ఒక విచిత్రమైన పని మీద . నీ భార్యకు పురిటి నెల గడిచింది కదా ? " 

" అప్పుడే గడచిపోయింది , గడచి ఒక నెల అవుతున్నది . " 

" మంచిదైంది , నేను పాపడిని చూడవలెను , అందుకే వచ్చినాను " 

" ఆమే ఎత్తుకొని రావచ్చునా లేక తమరే ఒక అడుగు అక్కడికి దయచేసెదరా ? " 

        " ఇంకెవరైనా అయిఉంటే , ఇక్కడికే రానిమ్ము అనేవాడిని , అయితే , ఆ పొద్దు చూచిన దృశ్యము మరచునట్లు లేదు . అందువలన , యే మహానుభావుడో మీ ఇంటికి వచ్చినాక , మేము అక్కడికి వెళ్ళుటయే సరి , అది సరేగానీ ఇదేమో చూచినావా ? " 

        బుడిలుడు నడుముకు కట్టుకున్న ఒక చిన్న డబ్బీ తీసినాడు . దానిలో యజ్ఞేశ్వరుని ప్రసాదమైన విభూతీ , ఒక తమలపాకులో రక్షా ఉన్నాయి . 

       " అతని దర్శనమునకు వెళ్ళునపుడు రిక్త హస్తాలతో వెళ్ళకూడదు అని తెచ్చినాను . మీ ఇంట్లో లేనిది తెచ్చినాను అన్న అహంకారము కాదులేవయ్యా !  ! " 

      " సరే పోయింది , మీరందరూ ఆశీర్వాదము చేయవలసిన బుడం కాయ వాడు . మాకందరికీ ఆచార్య స్థానము లో నున్న మీరే ఇలాగంటే ఇంకెటులో ? " 

       " అట్లు కాదయ్యా , ఆ శిశువు దేహము చిన్నదైనా గొప్ప ఆత్మ . మనము దానిని మరచిపోరాదు . అది , యే యే ప్రభావముల చేత , యేయే సిద్ధులతో పుట్టిందో మనకేమి తెలుసు ? " 

       దేవరాతునికి అవుననిపించినది . భార్యకు ఏకాంతములో ఈ సంగతి చెప్పవలెను అనిపించినది . ఆ భావముతో బుడిలుడి సిద్ధాంతమును ఒప్పుకుంటూ , " మీరే అంటిరి కదా , ఉన్నమాటని మాయ మరపిస్తుంది అని , నాకూ అదే జరిగింది . ఇకపైన జాగరూకతగా ఉంటే సరి . రండి , వెళదాము " అన్నాడు . 

" వీధిలో నడచి వచ్చినాను . ఒక చెంబెడు నీరు తెప్పించు . కాళ్ళు కడుక్కొని వస్తాను . " 

       బుడిలుడు వద్దన్ననూ ఆచార్యుడు వదలక , తానే కాళ్ళుకడిగి తుడిచినాడు . ఇద్దరూ పాపడిని చూచుటకు వెళ్ళినారు . వీరు వస్తున్నది చూచి ఆలంబిని చెరుగు సరిగ్గా కప్పుకున్నది . కూతురితో ఏమో మాట్లాడుతున్న జాయంతి లేచి వెళ్ళి తెర వెనుక నిలచింది . 

        బుడిలుడు వచ్చి ఉయ్యాలలోని పాపడిని చూసినాడు . ఎవరో తెలిసినవారిని చూసినట్లే సంతోషపడి , " ఆచార్యా , సందేహమే లేదు , నేను ఆ దినము , సీమంతము నాడు చూసిన ముఖము ఇదేనయ్యా , ఆవగింజంత కూడా వ్యత్యాసము లేదు . " అని వేదమంత్రముతో ఆశీర్వదించి , రక్షనూ , విభూతినీ తల్లి చేతికిచ్చి , " దీనిని పాపడి ఉయ్యాలలో ఉంచమ్మా , మొత్తానికి  వీర పత్నివై , వీరమాతవు కూడా అయినావు . ఈ దేహమును చూస్తే , నీ కొడుకు ఒక పెద్ద మర్రి వృక్షమువంటి వాడగుటలో ఆశ్చర్యము లేదు . నీ కడుపున పుట్టి కాయోన్నతి ని పొందినాడు . ఇక మానోన్నతి , విద్యోన్నతులను సంపాదించి ఇవ్వటము మీ దంపతుల ధర్మము . " అని మరలా ఒకసారి ఆశీర్వదించినాడు . 

       దేవరాతునికి , వృద్ధ బుడిలుడు కొడుకును మెచ్చుకొన్నాడని గొప్ప సంతోషమైనది . వెనుతిరిగి బయటికి వస్తూ బుడిలుడు , " ఏమయ్యా , రాజపుత్రులకు కూడా దొరకని దేహము కదా అది , బహు సంతోషమయినది " అని మరలా అన్నాడు . దేవరాతుడు , " యజుర్వేదుల ఇంట పుట్టినాడు , మాది ఎంతైనా ఆధ్వర్యము కదా ! దానికి తగ్గట్టు గట్టిగా ఉండవలెనా లేదా " అని నవ్వినాడు .

      బుడిలుడు చటుక్కున వెనక్కు తిరిగి , " వీడు కేవలము శ్రౌత విద్యా సంపన్నుడగు పాపడు కాదు , ఆ సౌందర్యము చూస్తే , కర్మ బ్రహ్మలు రెండింటికీ అధికారియగునట్లు కనపడుతున్నాడు . ఏమైనా కానీ  వాడిని అపరిగ్రాహిగా చేయి " అన్నాడు .

" అపరిగ్రాహిని చేయుట ఎలాగ ? " 

       " అదేమి పెద్ద విషయము ? అన్యాయార్జితమైన విత్తము వద్దన్న చాలు . గురువు గారని వచ్చి తీసుకోండి అని గురు దక్షిణ ఇచ్చినా , ’ నువ్వు ఉద్ధారమైనావు అని నమ్మకము వచ్చు వరకూ నేనుతీసుకోను ’ అంటే సరి . నీ చూపు చూస్తుంటే , ’ అలాగన్న , కుటుంబ భరణమునకు ఏమి గతి ? ’ అనేవాడిలా ఉన్నావు . చూడు , మొదటిది , మనుష్యుని మనసు ఎల్లపుడూ అర్థ కామముల వైపుకే తిరుగుతుంటుంది . రెండోది , బిడ్డ పుట్టుటకు ముందు తల్లికి స్తన్యము ఉండునట్లే , వారివారిని కాపాడుతూ , వారివారిచేత వారివారికి తగ్గ పనులు చేయించు ప్రారబ్ధము ఒకటుందనే సంగతిని మనము మరచినాము . కాబట్టి అపరిగ్రహము కష్టమేమీ కాదు . అపరిగ్రహము లేనివాడికి మానోన్నతి ఎక్కడిది ? మానోన్నతి లేనివాడికి విద్యోన్నతి ఎక్కడిది ? కాబట్టి మొదట అపరిగ్రహమును నేర్పించు . నేను చెప్పింది మనసుకు ఎక్కిందా ? " 

       దేవరాతుడు ఒప్పుకున్నాడు .అతని మనసుకు అర్థమైనది , " కొడుకుకు చిన్నవాటికి ఆశ పడకుండునట్లు నేర్పించవలెను . ఏమితీసుకున్నా , కార్యాంతములో దక్షిణా రూపముగా రావలెనే తప్ప , మధ్యలోనే ఆశపోతు వలె చేయి చాచరాదు . "... ’ అది సరియే కదా ’ అనిపించి , ఆచార్యుడు బుడిలుడి మాట ఒప్పుకున్నాడు . 

       బుడిలుడు ఇంకొంత సేపుండి , బిడ్డడి భవిష్యత్తు గురించి మాట్లాడి , వెళ్ళిపోయినాడు . దేవరాతుడు కూడా అతడిని పంపించివేసి , వెళ్ళి భార్గవుడిని చూచుకొని వచ్చినాడు . 

8. " మహా దర్శనము--ఎనిమిదవ భాగము --సందడే సందడి


8. ఎనిమిదవ భాగము--- సందడే సందడి 

        " జాత కర్మ అనునది ఒక వైదీక కర్మ . దానికి లౌకిక అంటు సోకకూడదు . " అని దేవరాతుని హఠము . అయితే రాజ భవనము దానికి ఒప్పుకోలేదు . ’ వంశభూషణుడైన కొడుకు పుట్టినాడు . కాబట్టి దిగ్దిగంతాలకూ ఈ సమాచారము వ్యాపించవలెను ’ అని వారి వాదము . అంతేగాక , దేవరాతుని పై తన ప్రభావమును చూపి అతనిని రాజభవనపు సలహాను అంగీకరించునట్లు చేయవలెనని భార్గవుని ప్రయత్నములు . ఆ మిథిలా నగరములో భార్గవుని మాటను తిరస్కరించినది ఒక్కరే ఒక్కరు , వారే ఆ వృద్ధ బుడిలులు . " వారిని వదిలేయండి , తాము అపరిగ్రాహులు , ఇతరులు కూడా అపరిగ్రాహులుగా ఉండాలనే వారి ఆశ " అని చాలామంది మూతులూ ముక్కులూ ముడుచుకునేవారే . 

        మొత్తానికి జాతకర్మ రాజవాడలో జరుగు కర్మ వలెనే నడచింది . ఒక బండెడు చక్కెర పంచినారు . రాజాస్థానపు జ్యోతిష్యులే వచ్చి జాతకమును రాసినారు . వారికి అంతులేని ఆశ్చర్యము , ’ ఆచార్యులవారూ , నేనింతవరకూ ఇట్టి శుభ జాతకమును చూచియుండలేదు . తులా లగ్నము , చతుర్థములో కుజుడు ఉఛ్చములో ఉన్నాడు . దశమములో గురువు ఉఛ్చ. , ద్వితీయములో రవి ఉండుట చూస్తే , ఇతడు వంశభూషణుడే కాదు , లోకవిభూషణుడగుటలో సందేహమే లేదు . ఇతనికి ఎదురుమాట్లాడి నెగ్గగలవారే లేరు . " అని ఎన్నోవిధములుగా పొగిడినారు .  ఆదినము పుత్రోత్సవమని ఆచార్యుడు రెండు మూటల చక్కెరను తెప్పించినాడు . ఆస్థానమునుండీ మూడు మూటల చక్కెర వచ్చినది . ఐదు మూటల చక్కెరనూ పంచినారు . 

        నామకరణపు దినము కూడా అటులే అయినది . లోకభూషణుడగు వాడు పుట్టినాడన్న తర్వాత మహారాజుకు అభిమానము ఇనుమడించినది . ఒక నూరు బళ్ళ బియ్యమును సోపస్కరము ( ఇతర సంభారములు ) తోపాటు పంపినారు . దానిలో మిగిలించుకోవలెనను ఆలోచనకూడా లేక ఆచార్యుడు తన ఇంటిలో నిండిన బియ్యము , పప్పులను వాటితో చేర్చినాడు . వైదీక కర్మ ముగిసేవేళకు మధ్యాహ్నమయినది . మొదట పుణ్యాహ వాచనము , భూమినుండీ ఎప్పుడూ పైకి లేచు ఆఘాహ శక్తులను కడిగివేసి , పైనుండీ దిగు పుణ్యాహ శక్తులు అంతటా వ్యాపించునట్లు చేయుటయే పుణ్యాహపు ఉద్దేశము . ఆ ఉద్దేశము నెరవేరినట్లు వచ్చిన వారందరికీ తెలియునట్లు ఎక్కడెక్కడ చూచినా ప్రసన్నత నిండిపోయినది . నవగ్రహ హోమము , ఆయుష్య హోమములూ నడచినవి . నవగ్రహములు ప్రసన్నులై వచ్చి ఆహుతిని తీసుకొని పోవుటను అక్కడ జ్ఞాన చక్షువులున్న వారందరూ చూచి ’ వల్లె వల్లె ’ అన్నారు . ఆయుష్య హోమకాలములో అగ్ని ప్రసన్నుడై జ్వాలామాలా పరిశోభితుడైనను , శాంతుడై ప్రదక్షిణాకారముగా సంచరిస్తూ హవ్యమును స్వీకరించినాడు . హోమమునకు వచ్చిన ఋత్విజులు ’ మేము ఇంతవరకూ ఎన్నో హోమములు చేసినాము , కానీ యజ్ఞేశ్వరుడు ఇంతగా ప్రసన్నుడగుటను ఎక్కడా చూడలేదు . పొగ యనునదే లేదు , భలే , భలే ! చూడబోతే ఈ పిల్లవాడు దేవకార్యార్థియై జనించినట్లున్నది . ’ అని పాపడిని పొగడినారు . కొందరు ఇతరులు ’ మీరు సరిగ్గా చూడండి , అక్కడ కూర్చున్నది ఎవరు ? సాక్షాత్ ’ యజ్ఞవల్క్య ’ పేరున్న దేవరాతుడు . వారు ఆచార్యులు కూడా ! వారు ఎన్ని యాగములలో అధ్వర్యులై యజ్ఞేశ్వరుని , దేవతలనూ మెప్పించినారో ! వారే యజమానులై కూర్చున్నపుడు ఇలాగయగుట అదేమి ఆశ్చర్యము ? " అన్నారు . 

      తరువాత పితృ పూజారూపమైన ’ నాందీ ’  యజ్ఞము నెరవేరినది . పుత్రుడికి దేవరాతుడు ’ యాజ్ఞవల్క్యుడు ’ అనియే పేరు పెట్టినాడు . అక్కడికి వచ్చిన కులపతి వైశంపాయనుడు  , ఉద్ధాలకుని ముఖమును చూచినాడు . అతడు ముసి ముసిగా నవ్వుచూ , ’ " ఈ శిశువు బ్రహ్మ జ్ఞానియై , కర్మత్యాగము చేయునని ఆచార్యులకు బెదురు . దానివలన , ఈ పేరుంటే ఎల్లపుడూ అతనికి తాను కర్మఠ వంశపు వాడిని యని గుర్తుండవలెనని ఆచార్యుల అభిమతము . కానివ్వండి , ఇంటిలో ఎలాగైనా వేరే పేరుతోనే కదా పిలుస్తారు ! " అన్నాడు . వైశంపాయనులు తలయూపి , సత్యము  అన్నారు . మొత్తానికి మాధ్యాహ్నికపు వేళకు వైదిక కర్మ అంతా ముగిసినది . 

        ఆచార్యుల ఇంటి వెనకే ఒక పెద్దతోట !  దానిలో విస్తరించియున్న ఒక తటాకము . ఆ తటాకము పక్కనే విశాలముగా పాకశాలను కట్టినారు . " వంట అంతా సిద్ధముగానున్నది . అందరూ మాధ్యాహ్నికమునకు లేవ వచ్చును " అని వంటవారు వచ్చి అందరినీ హెచ్చరించినారు . త్రికాల స్నానము చేయువారు స్నానమునకు సిద్ధమైనారు . మిగిలిన వారు తమ తమ కర్మలలో ప్రవృత్తులైనారు . 

         అక్కడున్న వృద్ధులలో ఒకరికి ఒక ఆలోచన వచ్చింది , " కార్తీక మాసము వనభోజనము. ఉసిరి చెట్టు కూడా ఉంది , ఒక ధాత్రీ హవనము ఏల చేయరాదు ? " అనిపించి ఆచార్యులను వెదకికొని పోయి తమ సలహాను వారి ముందుంచినారు . వారు , " మంచి ఆలోచన , గృహ శౌచము కూడా గడచినది , ఎందుకు చేయరాదు ? అయినా ఇద్దరు కులపతులు వచ్చినారు , వారినొకసారి అడిగి చూదాము " అని వారిని పిలుచుకొని, కులపతులను వెతుక్కుంటూ పోయినారు .  

        ఇద్దరూ చెరువు ఒడ్డునే కనిపించినారు . ఒకరు అప్పుడే స్నానము చేసి , శిష్యుడు ఇచ్చిన మడి కట్టుకుంటున్నారు . ఇంకొకరు నీటిలో దిగుతున్నారు . ఆచార్యుడు వచ్చి , " యజమానులు ఏమో చెప్పవలెనని యున్నారు " అని విషయమును ప్రస్తావించినారు . కులపతి వైశంపాయనుడు తల ఊపుతూ , ’ మంచి సలహా , అటులే చేసెదము , అయినా ఉద్ధాలకులు కూడా రానీ . వారిని అడిగి చేదాము , ఆ వేళకు హవనమునకు కావలసిన సామగ్రినంతటినీ సిద్ధము చేసుకొనండి . దానికోసము ప్రత్యేకముగా ఒక చరువు కానివ్వండి , అన్నారు . ఆచార్యుడు సరేనని ఆ అనుమతిని నెరవేర్చుటకు శిష్యుడొకనిని పంపించి , తాను , సలహాను సూచించిన వృద్ధునితోపాటు ఉద్ధాలకుని కోసము కాచుకున్నాడు . 

         వారుకూడా వచ్చినారు , సలహాను విని , " ఎందుకు చేయరాదు ? అవశ్యము చేయవచ్చును . కానీ చాతుర్వర్ణముల వారందరూ రావలెను కదా ! " అన్నారు . వైశంపాయనులు " ఎక్కడికి వెళ్ళినా , రాజభవనపు వారందరూ రాలేదే అనునదొకటే కొరత . అయితే , ఆచార్యుల ఇంటిలో సమారాధనము అంటే ముఖ్యులైన వారందరూ వచ్చే ఉంటారు . అతి ముఖ్యముగా ఆ బుడిలులు వచ్చినారు కదా ? వారు వస్తే ఒక లక్ష మంది వచ్చినట్టు . " ఆసహస్రాత్ పంక్తిం పునంతి " అటువంటి వారొక్కరు వస్తే చాలు . వారు కూర్చున్న పంక్తి మాత్రమేనా ? వారు నడచిన అంతటా భోజనానికి కూర్చున్నవారంతా కృతార్థులే ! వారినే ఆపోశన ఇవ్వమని అడిగితే సరి ! " అన్నారు . అంతలో సన్నాహములకు వెళ్ళిన శిష్యుడు వచ్చి అంతా సిద్ధమగుచున్నది అని తెలిపినాడు . 

         బ్రహ్మయజ్ఞమైన తర్వాత ఇద్దరు కులపతుల సమ్ముఖములో బుడిలులు ధాత్రీ హవనము చేయుదురు అని నిర్ణయించడమైనది . సకాలములో ధాత్రీ హవనమై , అందరూ వైశ్వేదేవమును నెరవేర్చినారు . భోజనాత్పూర్వములోను , భోజనాత్పరము లోనూ వేదఘోషలు మ్రోగినవి . అప్పుడక్కడ ఉన్న చాతుర్వర్ణముల వారూ పుష్కలముగా భోజనము చేసినారు . సంధ్యవరకూ సమారాధన నడచినది . ఆచార్యుల గాదెలలో నింపిపెట్టిన బియ్యమూ , పప్పులూ అన్నీ వెచ్చమైనవి . అయినా ఆచార్యుని ముఖములో చింతాఛాయలే కనపడలేదు . " సర్వమూ సార్థకమైనది , భూత తృప్తి యయినది , ఈ బాలుడి జీవితములో కూడా సర్వమూ ఇటులనే సార్థకమవనీ , వాడు అనృణుడై కృతార్థుడు కానీ " అని నమస్కారము చేసినాడు . 

         ఇక్కడ ఆలంబినీ దేవి కూడా కొడుకు సౌఖ్యము కోసము ఏమేమి కావలెను అని ఆలోచిస్తుండినది . బహుదినములనుండీ సేకరించిన ధావళులన్నీ బయటికి వచ్చినాయి . మూడు నాలుగు నెలలనుండీ ఆలంబినీ , జాయంతులు కూడబెట్టిన చీరలూ పంచెలూ , మూటల్లోనున్నవన్నీ గాలికి ఆరేసినారు . జాయంతి మనవడికి హారతి నిచ్చుటకని ఉండలు సిద్ధపరచినది . తొట్టిలు తన స్థానములో అలంకృతమై పాపడిని పిలుచుకొని వచ్చుటకు ఏర్పాటు అయినది . ఆదినము సాయంకాలము అతివల సందడే సందడి . వారి సంభ్రమము మగవారు ఊహించి తెలుసుకోవలసినదే తప్ప , అనుభవించి అర్థము చేసుకొనుట వారి నుదుట రాయనే లేదు . ఆడవారు సంభ్రమము పొందుటకు తమ కార్యమే కానవసరము లేదు . తమకు సంబంధమే లేకున్ననూ , ఇంకొకరి ఇంటిపనే అయిననూ , దానిని అభిమానించగలరు . అలాంటపుడు , ఆచార్యులు , ఆచార్య పత్నులు ఊరికందరికీ కావలసినవారైనపుడు , ఇంక చెప్పవలెనా ? 

         పాటల పిలుపులలో , కోలాటము , పేరంటపు ఆటపాటలలో , నవ్వుల నర్తనములలో పూజమొదలు జరగవలసిన తంతులన్నీ జాయంతి నేతృత్వములో జరిగినాయి . అందరూ , ’ బాలింతను చూచినారా ? బిడ్డతల్లి వలె లేనే లేదు , పదహారేళ్ళ లేత పడుచువలె నున్నదే ? " అనువారే !  వచ్చినవారంతా పాపడిని చూసి ఆనందముతో , ’ ఆలంబీ ! మొదట నీ కొడుకుకు దిగదుడుచు . తొట్టిలు నిండా పరుండిన ఈ శిశువును చూచి ముచ్చట పడని వారెవరు ? దృష్టి తగలకుండా ఉంటుందా ? పున్నమి చంద్రునిలాగా వెలుగుతున్నాడు . ఆ నుదురు చూడు , ఆ చిన్ని ముక్కు చూడు , ఆ నోరు చూడు , ఆ పెదవులు చూడు  , అక్కడ చూడు ఆ చిన్ని చిన్ని చేతులు ! ఆ వేళ్ళు చూడు , ఎంతపొడుగ్గా ఉన్నాయో , ఆ చెవులు చూడు , అప్పుడే ఏనుగు చెవుల్లాగా లేవూ ? " అని పలువురు పలు రకాలుగా పొగడుతున్నారు . అందరి నోటిలోనూ ఒకే మాట ! " ఆలంబమ్మ అదృష్టవంతురాలు . అంతటి భర్త ! ఆ భర్తకు తగ్గ కొడుకు ! మొత్తానికి ఈ కొడుకును పొంది జన్మ సార్థకము చేసుకున్నది . ఆచార్యులు పుత్రుడు కావాలీ అని చేసిన తపస్సు సార్థకమైనది . " 

        వారు భవిష్యత్తును తెలిసినవారు కారు . వారిలో ఎవరైనా శాస్త్రజ్ఞులు ఉండిఉంటే , తాము ఆడినమాటలు లోకాభిరామముగా ఆడినవి కావు , అది శాస్త్రవాణి వలెనే తథ్యమగుతుంది అని తెలిసి , నమ్మకముతో నిండేవారు . 

        ఆ సందడులు , కోలాహలములు శాంతమైన తరువాత , ఆచార్యులు వచ్చి భార్యను మాట్లాడించినారు . ఆమె భర్త వచ్చినాడని లేవబోయింది . భర్త , " వద్దొద్దు , ఇకపైన నా పుత్రుడి తల్లివి అని నిన్ను గౌరవించవలెను . నువ్వు గౌరవించుకాలము గడచిపోయినది . చూడు , నేనొచ్చినది నిన్ను హెచ్చరించుటకు . ఇకమీద పాపడిని ఎత్తుకొనునపుడు మరవకుండా సరస్వతీ ధ్యానము చేయి . ఉయ్యాలలో పరుండబెట్టి ఊపునపుడు ’ భద్రం కర్ణేభిః ’ చెప్పుతూ ఉండు . ఒకవేళ సంస్కృతములో చెప్పుట వద్దనిపిస్తే , దాని అర్థమును లౌకిక భాషలో పాటగా చేసుకొని పాడుతూ ఉండు . మిగతా అప్పుడు , వాడిని తొడపైన వేసుకొని ఆడించునపుడు , ’ పూర్ణమదః ’ మరవవద్దు . నేనిక వస్తాను , పొద్దుటినుంచీ నీకు కూడా తీరిక లేనంత పనితో ఆయాసమై ఉంటుంది , పడుకొని నిద్రపో . దేవతలు నిన్నూ , నీ కొడుకునూ కాపాడనీ ! " అన్నాడు . ఆవేళకు భోజనానికి వెళ్ళిన జాయంతి వచ్చినది . అత్త వచ్చినది చూసి అల్లుడు గౌరవముగా లేచి వెళ్ళిపోయినాడు . 

        తల్లి , కూతురితో హాస్యమాడింది , " అదేమిటే , మొగుడిని పిలిపించుకున్నదానివి , కొడుకుని వారి చేతికి ఇచ్చి ఉండకూడదా ? " అన్నది . కూతురు ఆ హాస్యమును ఆనందిస్తూ , కొంటె తనము కనుపించునట్లు , " మేమిలాగ ఉండాలనే కదా , నువ్వుకోరేది ? వారి కొడుకును వారు ఎత్తుకుంటే నేను అడ్డురాకూడదే తప్ప , నేను ఇవ్వాలేమిటి ? అయినా మధ్యాహ్నము నుండీ , కావలసినంత సేపు చూస్తూ ఉన్నారు కదా ? ఈ నెల పురిటి మైల గడచిన తర్వాత వద్దన్నా ఎత్తుకుంటారు . ఇప్పుడు వచ్చినది , మంత్రములు జపము చేస్తూ ఉండు , ఆఖరికి మంత్రార్థమునైనా నెమరు వేస్తూ ఉండూ అని చెప్పుటకు ! " అన్నది . తల్లికి , కూతురు వెనుక చెప్పిన కల గుర్తుకు వచ్చి , ఈ బాలుడు ఎంతటి మహానుభావుడవుతాడో ,ఎవరికి తెలుసు ? అనిపించింది . ఆకు వక్కలు నోటిలో నిండి ఉండినవి , నిద్ర కంటిలో నిండి ఉండినది . మాట్లాడుతూ అలాగే మంచముపై వాలి ఒరిగింది . పొద్దుటినుండీ అలసి ఆయాసపడిన దేహము నిద్రలోకి జారింది . 

7. " మహా దర్శనము " ---ఏడవ భాగము -- -సుఖ ప్రసవము


 ఏడవ భాగము -- సుఖ ప్రసవము 

          మరు దినము ఆలంబిని తల్లితో కర్మ విచారము ప్రస్తావించి , భర్త తనకు చెప్పినదంతా చెప్పినది . తల్లికి ఆశ్చర్యము కాలేదు . " నువ్వు మంచి పనే చేసినావు , దేహమే నేను అనుకొనువారి మాట వేరు . దేహము నేను కాదు ; నేననేది వేరే ఇంకొకటుంది అని నమ్మువారు ఇటులనే చేయవలెను . నిజమే . ఆడది జన్మ ఎత్తినపుడే సిగ్గుపొరలను కప్పుకొనే పుడుతుంది . అలాగని  మెట్టినింటికి   ద్రోహము అగునట్లు చేయవచ్చునా ? అట్లు చేసిన , పుట్టింటికి కూడా ద్రోహము అయినట్లే . కాబట్టి నువ్వు చేసినది సరియైనదే . కానుపు గది ఎక్కడ అని అనుకున్నారు ? అది ముందు చెప్పు . " 

" నడిమింట్లోనే ఒక మూలలో తెరలు కట్టి చేయవలెను . " 

        " సరే , అక్కడే చేయండి , దానికి రెండు వైపుల నుండీ దారి ఉండనీ . బిడ్డ పుట్టగానే నేను మంత్రసానిని ఒక దారినుండీ బయటికి పిలుచుకొని వస్తాను . ఇంకొక దారి నుండీ నీ భర్త వచ్చి కర్మను ముగించుకొని వెళ్ళనీ . వారు వెళ్ళిపోగానే నువ్వు నన్ను పిలువు . నేను మంత్రసానితో పాటు వచ్చి తరువాతి కార్యము చేసెదను . " 

         ఆ దినము పంచమి , కర్మకు కావలసిన తేనె , నెయ్యి , బంగారము సిద్ధమయినాయి . ఆడవారు కర్మకు ఒప్పుకున్నందు వలన కర్మకు ఇక ఉన్న అడ్డు తీరిందని దేవరాతుడు బహుళ తృప్తుడైనాడు . 

         ఆలంబినికి ఆయాసము ఎక్కువగుతూ వచ్చినది . కూర్చుంటే లేచుట , లేస్తే కూర్చొనుట కష్టమగుతున్నది . దేవరాతుడు అది చూచి అగ్ని పరిచర్యను తానే వహించి చేస్తున్నాడు . 

         ఆలంబిని తల్లి జాయంతి కూతురికి వేడినీళ్ళు ఇస్తూ , ’ గర్భము జారినది , ఇక రెండో మూడో దినములు , అంతే . " అన్నది . కూతురు , " వారి మాట ప్రకారమైతే రేపే జననము కావలెను " అన్నది . తల్లి , " అయినా కావచ్చును , అయితే , బిడ్డ మాత్రము , ...ఆలంబీ , ఏమీ అనుకోవద్దు , మాంచి భూతపు బిడ్డ అవుతుంది " అంది . ఇద్దరూ నవ్వినారు . 

         గురువారము తెల్లవారింది . నడిమింట్లోనే ఒక మూలలో ప్రసూతి గృహము సిద్ధమయినది . తల్లి , బాలింత పడక మొదలైనవన్నీ సిద్ధము చేసి ఉంచినది . అందరూ త్వరితముగానే భోజనములు కానిచ్చినారు . గర్భిణి కూడా భోజన శాస్త్రము అయిందనిపించినది . మధ్యాహ్నపు సూర్యుడు నెత్తిపై నుండి పశ్చిమమునకు దిగు సమయమునకు , పొద్దుటి నుండీ అప్పుడప్పుడు వస్తున్న నొప్పి తీవ్రమైనది . వెంటనే , మజ్జిగన్నము తింటున్న తల్లి భోజనము వదలి చేతులు కడుక్కొని పరుగెత్తి వచ్చినది . 

         ఆలంబిని ఎక్కువ సేపు నొప్పులు తినలేదు . తల్లిని ఆనుకొని ఒరిగి కూర్చునియుండగనే మరియొక నొప్పి వచ్చినది . దానితో పాటే , జలోదయ , శిరోదయములు రెండూ ఏకకాలములోనే అయినవి . ఇంకొక ఘడియ లోపలే శిశువు లోకానికి వచ్చినది . తాను వచ్చినట్టు ప్రకటించుటకా అన్నట్టు ఏడ్చింది . 

         తల్లి జాయంతి , కూతురికి చెప్పినట్లే మంత్ర సానిని పిలుచుకొని బయటికి వెళ్ళినది . వేరే వాకిలి నుండీ దేవరాతుడు లోపలికి వచ్చినాడు . ఆచార్యుడు కొడుకు కుడి భుజమును ముట్టుకొని , " సరస్వతీ దేవి నీకు మేధను ఇవ్వనీ , ఇంద్రుడు నీకు మేధను ఇవ్వనీ " అను అర్థము వచ్చు మంత్రమును ఉచ్చరించినాడు . బిడ్డతల్లిని ఉద్దేశించి , " అరుంధతీ సమానురాలా, నువ్వు స్తోత్రములు చేయుటకు పాత్రురాలవు . వీర పుత్రుని పొందిన ఓ వీరమాతా , నీకు మంగళమగు గాక " అని అభినందించినాడు . 

         అక్కడనుండి వెళుతూ ,’ నేనిక స్నానము చేస్తాను . కొడుకు పుట్టగానే నిలుచున్నవాడు నిలుచున్నట్టే నీటిలో దుముకి స్నానము చేయవలెనంట . ఆ నీరు ఎంతగా పైకి ఎగసిపడితే అంత అక్షయమైన లోకములు పితృ దేవతలకు దొరికి మా పితృ ఋణము తీరునంట. నువ్వు ఇప్పుడు బిడ్డకు స్తన్యము నిచ్చునపుడు మరచిపోకుండా సరస్వతిని ధ్యానించు , " హే సరస్వతీ దేవీ , సర్వ ప్రాణులకూ అన్న ప్రదాతయైనది నీ స్తనము . రత్నములనూ , ధనమునూ అధికముగా ఇచ్చునది నీ స్తనము . దేవతలందరికీ రక్షణనిచ్చునది నీ స్తనము . దానిని ఈ బిడ్డకు కూడా ఇవ్వు"  అని ఆమెను ధ్యానించి , బిడ్డకు స్తన్యమునివ్వు ’ అని నిర్దేశించి బయటికి వచ్చినాడు . 

         అతడు ఇవతలికి వచ్చిన తరువాత జాయంతీ , మంత్రసానులు మరలా వచ్చి బిడ్డకు వెచ్చటి నీరు ఇచ్చి , నాళమును కత్తరించి , చేయవలసినదంతా చేసి , బిడ్డకు స్తన్యపానము చేయించి తల్లీ బిడ్డలను నిద్రపుచ్చారు . 

         ఇక్కడ ఆచార్యుడు స్నానము చేసి లోపలికి వచ్చు వేళకు రాజ భవనము నుండీ రాజ పురోహితుడు , రాజ పురుషునితో పాటూ వచ్చినాడు . రాజ పురోహితుడు లోపలికి వస్తూనే ఆచార్యుడు ఎదురేగి " రండి రండి , రాజ పురోహితులు దయ చేయవలెను " అని స్వాగతము చెప్పినాడు . భార్గవుడు , ’ రథములో రాజపురుషుడు వచ్చినాడు . అతడిని రమ్మనండి ’ అన్నాడు . ఆచార్యుడు నీరుకారుతున్న శిరోజములను పిండుకుంటూ , " నాకోసము ఆపని మీరు చెయ్యండి , నేను మడి బట్ట కట్టుకొని వస్తాను ’ అని లోపలికి వెళ్ళినాడు . 

         అతడు బయటికి వచ్చువేళకు రాజ పురుషుడూ , పురోహితుడూ ఒక గదిలో కూర్చొనియున్నారు . ఇద్దరూ ఆచార్యునికి వందనము చేసి రాజాజ్ఞను తెలిపినారు : ’ శిశు జననమైన తర్వాత చేయవలసిన కర్మల నన్నిటినీ ఏ శంకా లేకుండా వైభవముగా జరిపించి రాజాశీర్వాదము చేయవలెనని మీకు చెప్పి రమ్మని మహారాజు మా ఇద్దరినీ పంపించినాడు " 

         ఆచార్యుడు , " ఇంట సుఖప్రసవమై పుత్ర జననమయినది . రాజాజ్ఞ ప్రకారము ఏ లోపమూ లేకుండా సర్వమునూ క్రమముగా జరిపించెదము . మేము చేయు ప్రతియొక్క కర్మ వలననూ మహారాజులకు నిస్సందేహముగా శ్రేయస్సు కలుగును అని వారికి తెలపండి . నేను సకాలములో వచ్చి దర్శనము చేసుకొనెదను " అన్నాడు .