మూడవ అంకం మాధుర్యం
ఈ అంకం లో అమ్మ పెళ్ళయ్యాక కొత్తలో పడిన తికమకలు , పిల్లల ఆలన , మా చిన్నతనం , అందరికీ అమ్మ మీద అభిమానం , అమ్మ సౌహార్ద్రం , గృహ సౌఖ్యం వంటి తీపి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి....
పెళ్ళయినా అమ్మ రెండేళ్ళు పుట్టింటిలోనే ఉంది. అతి చిన్న వయసులో పదమూడేళ్ళకే పెళ్ళి జరిగినా, అమ్మ ఆలోచనలు మాత్రం పరిపక్వంగా వుండేవి. గొప్ప నిర్ణయాలు తీసుకొనే శక్తి అప్పటికే ఉంది. ముఖ్యమైన సమయంలో అమ్మ ఇంత గొప్పగా స్పందిస్తుందని మా తాతయ్య గానీ , మేనమామలు గానీ అనుకోలేదు .
వింత నాటకం
తమ మేనమామ చెల్లెలికి తెచ్చిన సంబంధం అన్నలకు ఎంతమాత్రమూ ఇష్టం లేదు . బళ్ళారిలోని సంపన్న కుటుంబానికి , అందులోనూ , పరివారము దండిగా ఉన్నవారికి ఇచ్చి చేయాలని వారి ఆశ. కానీ తండ్రి , మేనమామల మాటకి ఎదురు చెప్పలేకపోయారు. వారి ఇష్టాలతో ప్రమేయం లేకుండా పెళ్ళి ఘనంగా జరిగింది. అయిదు రోజుల పెళ్ళి. అమ్మాయి మరీ చిన్న పిల్ల కాబట్టి, కాపురానికి తరువాత పంపిస్తామన్నారు. ’కాదు, వెంటనే పంపవలసిందే ’ అని పట్టు పట్టాడు నాన్న . అందుకు బావ మరుదులు ఒప్పుకోలేదు. ఇంకా చిన్న పిల్ల. మంచీ చెడ్డా తెలిసే వయసుకాదు , ఇంటి పనులు నేర్పించి పంపిస్తాము ’ అన్నారు. వారిమీద కోపంతో వారిని దారికి తెచ్చుకోవాలని మా నాన్న ఒక వింత నాటకమాడారు. అదే అమ్మని భయపడేలా చేసి, వదంతులు నమ్మేలా చేసింది. పెళ్ళయ్యీ , భార్య కాపురానికి రాని వ్యక్తి, అందులోనూ, ఒంటరివాడు, పెద్ద దిక్కు లేని వాడు. ఇంట్లో దీపం పెట్టేవారు లేరు, పెళ్ళయ్యాక కూడా ఈ ఒంటరి కష్టాలు ఎందుకనుకున్నాడు నాన్న. దాన్ని పరిష్కరించుకోవాలని, బావ మరుదులను భయపెట్టడం జరిగింది. కాపురానికి రాకముందే అమ్మకు సవతి పోరు తప్పదనీ , అన్యాయం జరిగిందనే వదంతి ఆ నోటా, ఈ నోటా అమ్మ వరకు వచ్చింది. తానా, ఐదో క్లాసు మించి చదువుకోలేదు. నిండా ౧౫ ఏళ్ళు లేవు. ఎటూతోచని పరిస్థితి. లోక జ్ఞానముందని ఎలా అనుకుంటాము ? ఈనాటిలాగా చదివి తెలుసుకోడానికి అప్పుడు విరివిగా కథల పుస్తకాలుండేవి కాదు, . సినిమాలనేవి అప్పటికి ఇంకా ఎవరికీ తెలీదు. ఆడదిక్కు లేని ఇల్లు. తల్లి ముందే పోయింది. ఉన్న ఒక్క అక్క కూడా పెళ్ళై అత్తవారింట్లో ఉంది.. చెల్లెలు మరీ చిన్న పిల్ల. ఆ ఇంటికి తానే ఆడ దిక్కు. ఆ సమయంలో , ఆ దేశ కాల పరిస్థితులలో ఆమె తీసుకున్న నిర్ణయం అత్యంత సాహసోపేతమైనదనే చెప్పాలి.
తన భర్త తన వాళ్ళ పై ’ గుర్రు ’ గా ఉన్నాడు. తన కాపురం ఏమౌతుందో అన్న భయం. అనుభవ రాహిత్యం. అవగాహన అనేది ఏముందో ఏమో ? భర్త దగ్గరకు వెళతానని తెగేసి చెప్పింది. అందరూ వారించారు, కాస్త ఆగమని. ఒక వైపు భర్త నుంచి ఒత్తిడి. ఇంకా ఏమేమి జరిగిందో మరి, ఆమెకే తెలుసు.
ఇచ్చిన మాట
" నాకు మీ అందరి కంటే నా భర్తే ముఖ్యం. మీతో నాకు పని లేదు " అని చెప్పించేలా పరిస్థితులు కల్పించబడ్డాయి. అందరూ అవాక్కు. తనని తీసుకు వెళ్ళడానికి భర్త రాలేదు. అన్నదమ్ములు పంపడానికే ఒప్పుకోలేదు , మరి తీసుకెళ్ళుతారా ? సమయానికి మేనమామ దగ్గర లేడు . నాన్న ఎటూ చెప్పలేకపోయినారు . ఎడ్ల బండిలో కొందరు వితంతువులు బళ్ళారి వెళుతుంటే వారిని బ్రతిమాలి , కొద్ది పాటి సారెతో బయలు దేరింది. బళ్ళారిలో భర్త ఇంటిదగ్గర దింపారు .తనని చూసి , ఆశ్చర్యపోయిన భర్త ఒకే షరతు పెట్టాడు, . " మళ్ళీ ఎప్పుడూ పుట్టింటికి నా అనుమతి లేకుండా పోకూడదు . అలాగైతేనే ఇంట్లోకి రా". అని. రెండో మాట లేకుండా ఒప్పుకుంది. 50 సంవత్సరాలు అంటే చనిపోయే వరకు ఆ మాట మీదే నిలబడింది. 50 సంవత్సరాలు ! ఇది సినిమా కాదు. నిజంగా జరిగింది.ఆ వూరికీ, ఈ వూరికీ మధ్య 50 కిలో మీటర్లు కూడా లేవు. మధ్యలో కానుపులకు, పెళ్ళిళ్ళకు, ఏ మూడు నాలుగు సార్లో మాత్రమే భర్త దయ తలిస్తేనే వెళ్ళింది. పుట్టింటి వాళ్ళే ఎప్పుడైనా వచ్చి చూసేవారు. వస్తే ఒక పూట కూడా ఉండే వారు కాదు. ఒక సారి కానుపుకని, భర్త ఒప్పుకుంటాడు అనే నమ్మకంతో, ఎడ్ల బండిలో వెళ్ళింది. పుట్టింటి వారు మొదట్లో సంతోషించినా, తర్వాత ఆడదిక్కు లేదని భయపడి వాపసు పంపేశారు. నెలలు నిండిన గర్భిణి, మళ్ళీ బండిలో వాపసు వచ్చేసింది. అనుమతి లేకుండా ఎందుకెళ్ళావు? చెల్లెలిని ఆమాత్రం చూసుకోలేనివాళ్ళు నిన్ను కాపురానికి సకాలంలో పంపక ఎందుకు అడ్డుకున్నారు ? జవాబు వాళ్ళనే అడిగి తెలుసుకురా . అంటూ , గర్భిణి అని కూడా చూడకుండా వెనక్కు తరిమేశాడు భర్త . శ్రీధర ఘట్ట లో ఆసుపత్రి లేదని, ఇంకో వూరికి అదే బండిలో తరలింపు . అప్పుడు ఒక అన్నగారు తాము చేసింది తప్పేనని అనుకుని వచ్చి ఆదుకున్నారు. కానీ, అప్పటికే అమ్మ భయాందోళనలకు గురి అవ్వడం వల్లనో, ఇంకెందుకో గానీ, ఆ పుట్టిన పిల్లాడు, ఆరేడు నెలలకే తనువు చాలించాడు. అయితే ఉన్నణ్ణాళ్ళూ ఆరోగ్యంగా ఉండి, చాలా ముద్దుగా ఉండే వాడట.
తాను కాపురానికి వచ్చిన మొదటిరోజే భర్త ఉన్న ఇంటి గల వాళ్ళ ద్వారా తెలిసిందేమిటంటే, తనని కాపురానికి వెంటనే రప్పించుకోవడానికి భర్త తన మీద తానే పుకార్లు పుట్టించుకుని నాటకమాడాడని !
మరువ లేని జ్ఞాపకాలు
కానీ, భార్యని కాపురానికి రానీకుండా రెండేళ్ళు పుట్టింటిలోనే ఉంచుకున్నారని, బావ మరుదులపై కోపం పోలేదు. క్రమేణా రాకపోకలు పూర్తిగా తగ్గిపోయాయి. తనకూ సంసారం, పిల్లలు, వారి ఆలనా పాలనా, బాధ్యతలు ఎక్కువయ్యాయి. ఇక పూర్తిగా పుట్టింటిని మరచిపోయింది . మరచిపోయింది అనేకంటే అలా అందరు అనుకున్నారు అంటే సబబుగా ఉంటుంది . ఎన్నోసార్లు తాను ఒక్కత్తెనే ఉన్నాననుకొని, అమ్మ కంట తడిపెట్టుకోవడం ఆరేడేళ్ళ పిల్లాడిగా చూసిన నాకు బాగా జ్ఞాపకం. అమ్మ ఏడుస్తుందంటే మనసు దిగాలుగా అయిపోయేది. నన్ను గమనించిన అమ్మ, ఏమీ తెలీనట్టు, ’ పాడు పొగ ’ అని తిట్టుకొనేది .నేనొక్కడే కాదు,మా అక్కలు, అన్నలు కూడా ఇలాంటివి చాలా చూశారు. అప్పట్లో వంట అంతా కట్టెలు, వంట చెరుకుతోనే కదా. పచ్చి కట్టెలు కాలక ఒకోసారి ఇల్లంతా పొగతో నిండిపోయేది. వూదుగొట్టంతో వూపిరితిత్తులు అలసిపోయేలా వూదేది. నాకు అత్యంత పాత జ్ఞాపకం ఏంటంటే , అపుడు నా వయసెంతోగానీ, తన కాళ్ళు రెండూ చాచి, మా తమ్ముణ్ణి కాళ్ళపై పడుకోబెట్టుకొని, వాడిపై నీళ్ళు పోసేది. తర్వాత కాలంలో కూడా మా అక్కయ్యల పిల్లల్ని అలాగే పడుకోబెట్టుకుని నీళ్ళు పోసేది. నీళ్ళు పోసేటప్పుడు ఏడుస్తారని, ముఖం నిండా అంతులేని సంతోషం చూపిస్తూ, " బుడుకూస్ " అంటూ తలని పైనుంచీ కిందికి ఒక్కసారిగా ఆడిస్తూ నవ్వుతూ నీళ్ళు పోసేది. ఆ ’ బుడుకూస్ ’ అనే పదంలో, ’ బు ’ మరియు ’ డు ’ అక్షరాలను కలిపి ఒకే అక్షరంగా పలికేది ’ బ్డు ’ లాగా. ’ కూ ’ ని దీర్ఘం తీస్తూ ’ కూ..... ’ అని పాటలాగా పలికేది.
దీనికి ఓ పదేళ్ళు వెనక్కి వెళితే, అదే, నేను పుట్టక ముందు, అప్పటికి మా పెద్దక్కయ్యకు 16--18 ఏళ్ళుంటాయి. మిగిలినవాళ్ళంతా చిన్న వాళ్ళు. చిన్నపుడే చనిపోయిన అన్నయ్య తో పాటూ, నాకూ, మా పెద్దక్కయ్యకూ మధ్యలో ఇంకా 10 మంది ఉన్నారు. చనిపోయిన అన్న పేరు ’ శేషాద్రి ’ అట. ఆ పేరు మన కుటుంబంలో ఎవరూ పెట్టుకోకూడదు, మనకు అచ్చిరాదు అని మా నాన్న చెప్పేవాడు. ’ శేష ’ అనే పదమే వద్దనే వాడు. తర్వాత రెండు సార్లు మా అమ్మకు గర్భం నిలవలేదని మా అక్కయ్యలు చెబుతారు. ఆ కాలంలో పాతవూరిలో ప్రభుత్వ ఆస్పత్రి ఉండేది. ( చెరువుకట్ట కింద ). ఇప్పటికీ ఆ బిల్డింగు ఉంది కాని ఆస్పత్రి గా కాదనుకొంటాను . కానుపులతో నీరసించి ఏదో ఒక రోగంతో మా అమ్మ బాధపడేది. అక్కడ చాలా సార్లు అడ్మిట్ అయిందట. తాను ఆస్పత్రిలో ఉంటే చిన్న పిల్లలకి తిండి ఎలా ? పిల్లలు తనతో పాటే ఆస్పత్రిలో ఉండేవాళ్ళు. ఒక్కోసారి పిల్లలు ఆకలని ఏడిస్తే అర్ధరాత్రయినా సరే, ఇంటికి వచ్చి పూర్తి వంట చేసి పెట్టి వెళ్ళేది.
ఇంట్లో జరిగీ జరగని పరిస్థితి. మా నాన్న స్కూల్లో పనిచెయ్యడమేగాక కొన్ని ఇళ్ళలో ట్యూషన్ లు చెప్పేవారు. ఇంజనీరింగు కాలేజీలో అప్పటి ప్రిన్సిపాలు శ్రీ దామోదరం గారనే వారింటిలో పిల్లలకి ట్యూషన్ చెప్పేవారు. మా నాన్నకి సంతానమెక్కువని తెలిసి, వాళ్ళు జీతం మాత్రమే గాక మధ్య మధ్య లో బియ్యం, పప్పులు మొ||నవి ఏదో ఒక సాకు చెప్పి ఇచ్చేవాళ్ళట. అమ్మ పెళ్ళై కాపురానికొచ్చిన కొత్తలో, మా నాన్న ఉంటున్న ఇంటి ఓనరు చాలా బాగా ఆదరించారట. వారి పిల్లలకు మా నాన్న అంతవరకు డబ్బు తీసుకోకుండా ట్యూషను చెప్పేవారట. అందుకని, మా అమ్మకు వారు ఒక బంగారు గొలుసు చేయించి ఇచ్చారు. అదికాక మా అమ్మకి ఒక ఒడ్డాణము, నెక్లెసు, గాజులు, పోగులు, కమ్మలు అన్నీ కలిపి సుమారు ౨౦౦ తులాల బంగారు ఉండేదట.
కానీ తరువాతి కాలంలో అందులో ఏమీ మిగిలినట్టు లేదు. ఆ రోజుల్లో అప్పుడప్పుడు రాగి సంకటి ( ముద్ద ) చేసేది మా అమ్మ. నీళ్ళు ఎసరు పెట్టి నప్పటి నుంచి మేమందరం తట్టలు ( కంచాలు ) తీసుకొని పొయ్యి చుట్టూ కూర్చొనే వాళ్ళం. ’ మొదటి ముద్ద నాకంటే నాకు ’ అని పోట్లాటలు.
ఇవన్నీ ఒక ఎత్తయితే, మా నాన్న తో వేగడం ఇంకో ఎత్తు. ప్రతిదానికీ ఆయనకి ముక్కుమీదే కోపం. నోటికి వచ్చినట్టు దుర్భాషలాడి, మా అమ్మని ఒకోసారి కొట్టేవాడు. చారులో ఉప్పు తక్కువైనా తప్పే, తన కళ్ళజోడు కనిపించకున్నా మా అమ్మ తప్పే, చివరికి,ఇంటికి ఏమైనా కావాలని అడిగినా తప్పే. మా నాన్న ఇంట్లో ఉంటే మేమంతా ఎలకపిల్లలు కలుగులో ఉన్నట్టు, అక్కడా, ఇక్కడా దాక్కొని ఉండే వాళ్ళం. ఆ బాధలు భరించలేక ఒక్కోసారి మా అమ్మ, పక్కనే ఉన్న దిగుడు భావిలో దాక్కునేది. మా ఇంటికి అర కిలోమీటర్లో " అమ్మవారి చెరువు " అని ఒక చెరువుండేది. అందులో నీళ్ళు మరీ ఎక్కువ లేకున్నా, ఎప్పుడూ ప్రవాహం ఉండి, నీళ్ళు శుభ్రంగా ఉండేవి. మా నాన్న నించి తప్పించుకోవాలని బట్టలు ఉతికే నెపంతో పెద్ద పిల్లలని తీసుకొని అక్కడికి వెళ్ళి అమ్మ చాలాసేపు గడిపేది. ఒకసారి, కావాలని పడిందో లేక, ప్రమాదవశాత్తూనో గానీ, అమ్మ చెరువులో పడిపోయింది. అక్కడే బట్టలు ఉతుకుతూ ఉన్న చాకలి మహిళలు చూసి, రక్షించి పిలుచుకు వచ్చారు. మాకు తెలిసి మా అమ్మ కు ఇలాంటి బాధలు చాలానే , కానీ మాకు తెలీకుండా ఆమె ఎన్ని బాధలు పడిందో, ఆమెకు, మా నాన్నకే తెలియాలి. గుడ్డిలో మెల్ల అన్నట్టు, అప్పటికి సొంత ఇంట్లో, అదీ, వూరికి దూరంగా విసిరేసినట్టు వుండటంతో, మా ఇంటి విషయాలు ఎవ్వరికీ తెలిసేవి కావు.
ఈనాడు మా అందరికీ ఉన్నత చదువులు, ఉద్యోగాలు ఉన్నా, మేము మా మూలాలు మరచిపోలేదు. డబ్బు, సుఖాలు శాశ్వతం కావు. ఆనాడు మేము ఆర్థికంగా ఎలా వున్నా, క్రమశిక్షణ, సంప్రదాయాలు, పెద్దలకు మర్యాద ఇవ్వడము, లాంటి వాటిలో మాకు మేమే సాటిగా ఉండేవాళ్ళము. చిన్నప్పుడు మేము అంగడికి( కొట్టు ) వెళ్ళి ఏమైనా కొన్నప్పుడు, పొరపాటున మాకు చిల్లర ఎక్కువ వస్తే, వెంటనే వాపసు ఇచ్చే వాళ్ళం. అది మా అమ్మ మాకు నేర్పిన మొదటి పాఠాల్లో ఒకటి.
గోమాత
నేను పుట్టకముందు, తర్వాత కూడా, మా ఇంట్లో ఆవులు, గేదెలు ఉండేవి. ఒకసారి మా ఆవు ఈనడానికి సిద్ధంగా వుంది. ఉదయాన్నే అది కళ్ళు గుండ్రంగా తిప్పుతూ, ముందుకూ వెనక్కూ నడుస్తూ, ’ అంబా ’ అంటూ అరుస్తున్నది. విషయం అర్థమైన మా అమ్మ ఆరోజు ఉదయం మాకు తినడానికి ఎంతసేపటికీ ఏమీ చెయ్యలేదు. ఐదు నిమిషాలకోసారి ఆవు దగ్గరకెళ్ళి, దాని తల, గంగడోలు నిమిరి దానితో ఏమో మాట్లాడేది. ఏదో అర్థమైనట్టు అది తల వూపేది. మా అమ్మ అటు వెళ్ళగానే కొన్ని నిమిషాలకే మళ్ళీ అరిచేది. మళ్ళీ మా అమ్మ వచ్చేది. వీపు నిమిరీ, తల నిమిరీ ఏదో చెబుతూ వుండేది. మా అమ్మ వున్నంతసేపు అది మామూలుగా వూరికే ఉండేది. మా అమ్మ వెళ్ళగానే మళ్ళీ అరుపు. అలాగ సుమారు ఒక గంట తర్వాత అది ఈనింది. వెంటనే అమ్మ దానికి బెల్లము, ఏవో ఆకులు, పళ్ళు తినిపించింది. కడుగు నీళ్ళు ( కుడితి ) తాగించింది. ఆ దూడకు హారతి ఇచ్చి, లోపలికి వెళ్ళింది. ఆ ఆవు తనదూడ వొళ్ళంతా నాకి శుభ్రం చేసే వరకు మమ్మల్ని దాని దగ్గరకు వెళ్ళనిచ్చేది కాదు.
ఆ ఆవుకి పాలు పిండాలంటే, మా అమ్మ మాత్రమే ఆ పని చెయ్యాలి. పిల్లలము మాదగ్గర ఆ ఆవు గారాలు పోయేది. తల దువ్వితే దువ్వించుకునేది. గంగడోలు నిమిరితే, మోర ఎత్తి నిమిరించుకునేది. కానీ మా అమ్మ, మరియు తన దూడ తప్ప ఇతరులు ఎవరైనా పొదుగు ముట్టుకుంటే, వాళ్ళని కాలితో తన్నేది. ఒకసారి అమ్మకు ఆరోగ్యం బాగలేక, మా పెద్దన్న పాలు పిండాలని అనుకున్నాడు. మా అమ్మ చీర ఒకటి కట్టుకుని, పాలు పిండడం మొదలు పెట్టాడు. సరిగ్గా అప్పుడే మా అన్నని ఎవరో ఏదో అడిగారు. మా అన్న, పాలు పిండుతూనే జవాబిచ్చాడు. అంతే, మా అన్న గొంతు వినగానే, ఆవు ’ ఫెడీ ’ మని కాలితో ఒక తన్ను తన్నింది. ఇప్పుడది తలచుకుంటే ఇంకోటి గుర్తు వస్తున్నది.
నా చిన్నప్పుడు, N.T.R , వాణిశ్రీ నటించిన " చిన్న నాటి స్నేహితులు "అనే సినిమాకి ,మా అమ్మ, మా ౪వ అక్కయ్య కలసి వెళ్ళారు. ఆ సమయంలోనే, మా పెద్దక్కయ్య, మరియు మూడో అక్కయ్య ఇద్దరూ నెలలు నిండి ఇంచుమించు ఒకే సారి గర్భిణితో ఉన్నారు. వాళ్ళిద్దరూ ఇంట్లోనే వుండిపోయారు. వాళ్ళకు చాలా జాగ్రత్తలు చెప్పి మరీ వెళ్ళింది. అది కూడా, ఇంట్లో వుంటే, వారిని చూస్తూ ఆందోళన పడేదని, ఎవరో సలహా ఇచ్చినందుకు వెళ్ళింది. అదేమి చిత్రమో, ఆ సినిమాలో వాణిశ్రీ, దేవికలు కూడా ఒకే సారి గర్భవతులై, ప్రసవ వేదన పడే సీన్లున్నాయి. అది చూస్తూ, మా అమ్మ నిలవలేక, సినిమా మధ్యలోనే వదిలేసి, మా అక్కయ్యని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయింది.
ఆరాధన
మా అమ్మ ఐదో క్లాసుకు మించి చదువుకోలేదు. బయటి ఉద్యోగం అంటూ ఏమీ లేదు. పొజిషను గానీ, పవరు గానీ లేవు. ఆర్థికంగా అంతంత మాత్రమే. చూడ్డానికి కూడా అందగత్తె అని ఎవరూ అనలేదు. తనకు చట్టి ముక్కు వుంటుందని మా అమ్మకు న్యూనతా భావం ఉండేదేమో. పొడుగ్గా కొనదేలిన ముక్కులు వున్నవాళ్ళు గొప్ప అందగత్తెలని మా అమ్మ ఎప్పుడూ అనుకునేది. సినీ నటి జయప్రద ఫోటో మొదటిసారి చూసినప్పుడు ఎంత మెచ్చుకుందో ! అలా మా అమ్మకు ఏమీ లేకున్నా , మా అమ్మ ప్రభావం చాలా మంది మీద చాలా రకాలుగా ఉండింది. అప్పుడు తెలిసేదికాదు కానీ, ఇప్పుడు ఆలోచిస్తే, అది నిజమే అనడానికి, ఇవన్నీ గుర్తొస్తున్నాయి .
చిన్నప్పుడు మా అక్కయ్యలు గానీ, మేము గానీ బయట ఎవరితోనైనా పోట్లాడినప్పుడు, వారు చివరికి ఓడిపోయి, ఉక్రోషంగా, " మీ అమ్మ ముఖం చూసి ఊరుకుంటున్నా " అనేవాళ్ళు. బహుశ, వాళ్ళ పెద్దవాళ్ళు మా అమ్మ మీద గౌరవం వాళ్ళకు కూడా నూరి పోశారేమో. తర్వాతి కాలంలో . మా మూడవ అక్క, బావగారు మా పక్కింట్లోనే ఉండేవారు. వాళ్ళ పిల్లలు మా ఇంట్లో ఆడుకుంటూ, ఒక్కోసారి స్నానాలూ, భోజనాలూ అన్నీ మా ఇంట్లోనే చేసేవారు. అది మా బావకి అంతగా నచ్చేది కాదు. అలా చూసినప్పుడు ఎవరు చెప్పినా వినకుండా వాళ్ళని లాక్కుపోయేవారు. అలాగని మేమంటే ఏదో వ్యతిరేకత అని కాదు. ఆయన మనస్తత్వమే అంత. గంటలు గంటలు మా నాన్నగారితో హస్కు వేసుకుని కూర్చొనేవారు కూడా. ఐతే మా అమ్మ ఎదురుగా ఎప్పుడూ పిల్లల్ని లాక్కువెళ్ళేవారు కాదు. అలా మా అమ్మ లేదనుకొని ఒక్కోసారి పొరపాటున లాక్కువెళ్ళినప్పుడు, మా అమ్మ చూసి, " వాళ్ళు ఇక్కడే భోంచేస్తారు లెండి " అనేది. అంతే, మరి మాట్లాడకుండా వెళ్ళిపోయే వారు.
ఒక సమయం లో మా చిన్నప్పుడు, మా ఇంటిమీద మా నాన్న అప్పు చేశారు. ఆకాలంలో ఒక కాబూలీవాలా ఉండే వాడు. వాడికి ఇల్లు ఆయకం ( తనఖా ) పెట్టారు మా నాన్న. అతడు వడ్డీ కోసం వచ్చి , లేదంటే, మా నాన్న గారిని చాలా బెదరించి వెళ్ళే వాడు. అప్పుడు మా అమ్మ ఎదురుగా ఉంటే మాత్రం అదేమిటో, భయంతో నమస్కారం చేసి, " మాజీ, హాయన్కీ కొంచం చెప్పండి " అని పిల్లి లాగా వెళ్ళిపోయేవాడు. ఆ కిటుకు తెలుసుకొని ఒకోసారి మా నాన్న ఇంట్లో ఉన్నా, లేడని మా అమ్మతో చెప్పించేవారు.
మా అమ్మ దగ్గరికి వచ్చే మా స్కూలు టీచర్లు గాని, బయటి వాళ్ళు ఎవరైనా సరే, తమలోని మంచి గుణాలు మాత్రమే కనిపించేలా జాగ్రత్త పడేవారనుకొంటాను. నిజానికి వాళ్ళకా అవసరం లేదు. మా అమ్మ అందరినీ ఒకేలా చూసేది. అదొక రకమైన అభిమానంతో వారు అలా చేసేవారేమో.
మా నాన్న గారు రెండు మూడు స్కూళ్ళు నడిపే వారు. గవర్నమెంటు గ్రాంటు వచ్చేది. సాయి నగరులో ఉన్న ఒక స్కూలుని " కేశవయ్య స్కూలు " అని అందరూ పిలిచే వాళ్ళు. అందులో ఆడవాళ్ళకు మాత్రమే టీచరు ఉద్యోగాలిచ్చి మా నాన్న వారిని ప్రోత్సహించేవారు . అప్పట్లో అలా ఆడవారు మాత్రమే టీచర్లుగా ఉన్న పాఠశాలలు మా ప్రాంతం లో ఉండేవి కావు . రెండు పొడుగాటి గుడిసెలే ఆ స్కూళ్ళు. పిల్లలు ఆడుకోడానికీ, ప్రేయర్ చేయడానికీ తగినంత స్థలం ఉండేది. పాతవూరు లో ఉన్న ఇంకో దాన్ని " శ్రీ భారతి విద్యానికేతన్ " అని పిలిచే వాళ్ళు. టీచర్లు మా అమ్మ అంటే ఎందుకనో మరి, ఎంతో భక్తి చూపే వారు. అదేదో, మా నాన్న కింద పనిచేసే వాళ్ళు కాబట్టి అలా ప్రవర్తించేవారనుకుంటే పొరపాటు. మా అమ్మా వాళ్ళతో ఏనాడూ అధికారంగా మాట్లాడ లేదు.
1960--65 లలో అనుకుంటాను , మా ఇంటి దగ్గర్లో లక్ష్మి దేవమ్మ, సాలమ్మ అని ఇద్దరు అక్కాచెళ్ళెల్లుండే వారు. వాళ్ళు ఇద్దరూ మా నాన్న గారి స్కూల్లో చదివి , తర్వాత అక్కడే పనిచేసేవారు. తరువాత కాలంలో లక్ష్మి దేవమ్మ A.P గవర్నమెంటులో పంచాయతి రాజ్ మినిస్టరయ్యింది.
వాళ్లకి మా అమ్మంటే ఎంత ఆరాధనా భావమంటే, ఏ పండగ వచ్చినా ఇద్దరూ వచ్చి, ఏదైనా కానుక ఇచ్చి, పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకొనే వారు. " ఎందుకమ్మా ఇదంతా ? " అంటే, ’ పండగ పూట దేవతను పూజిస్తే మాకే మంచిది కదమ్మా ! " అనే వాళ్ళు. అదేమి చిత్రమో., మా అమ్మ ఎవరినీ కొట్టడం గానీ తిట్టడం గానీ కనీసం గద్దించడం గానీచేయక పోయినా, మేమందరం టైముకు మా పనులు పూర్తి చేసుకొని, బుద్ధిగా వుండే వాళ్ళం. ఆర్థికంగా ఎన్ని కష్టాలున్నా, మాకు తెలిసేది కాదు. అలాగని, ఏదో అప్పులు చేసి మాకు అన్నీ అమర్చేదని కాదు. ఏమీ లేకున్నా, అది మాకు అర్థం కానివ్వకుండా మమ్మల్ని సమిష్టిగా వుంచి, ఒక తాటిపై నిలిపేది. కాలం తెలీకుండా ఆనందంగా నవ్వుతూ వుండేవాళ్లం. దేవుడి దయ వల్ల ఆ రోజుల్లో విద్య పూర్తిగా ఫ్రీ గా సాగేది. మాలో కొందరికి స్కాలర్షిప్పులు వచ్చేవి కూడా!.