SHARE

Wednesday, February 20, 2013

40. " మహాదర్శనము " ---నలభైయవ భాగము --జ్యోతిర్దర్శనము


40. నలభైయవ భాగము-- జ్యోతిర్దర్శనము


        యాజ్ఞవల్క్యునికి ఇంతవరకూ లేని ధర్మ సంకటమొకటి ప్రాప్తమైంది . ఇంతవరకూ తన బ్రహ్మ కర్మలు ముగిసిన తర్వాత జపమునకు కూర్చొనేవాడు . 

          ఒక్కో దినము అప్రతిమమైన తేజోమండలము ఒకటి కనిపించేది . అది సర్వ దిక్కులనూ తన వెలుగుతో నింపుతూ అది ఉన్నంత వరకూ తేజస్సు తప్ప ఇంకేదీ కనిపించేది కాదు . అది చక్షుర్గోచరమగు ప్రకాశమా ? లేక అలౌకికమైన ఇంకేదైనా ప్రకాశమా -అనునది తెలుసుకోవలెనని కుతూహలము కలిగేది . అయితే , ఆ మండలము ఉన్నపుడు మాత్రము ఆ కుతూహలమునకు అవకాశమే లేదు . మనో బుద్ధులు ఆ మండలమును తప్ప ఇతరమైన దేనినీ గమనించవు . ఆ తేజస్సు ఎదురుగా ఉన్నపుడు చెవులు బాహ్య శబ్దములను వినుచుండుట లేదు . ఊపిరాడుచుండెడిదో లేదో , అదికూడా తెలియదు . స్పర్శ యైతే ఎక్కడికో పారిపోయి ఉండెడిది . ఆ తేజస్సు లేనపుడే ఈ కుతూహలము కలిగేది , కలిగినపుడు  మనసు ," ఇది జాగ్రత్స్వప్నము అయిఉండాలి . మెలకువ లో నున్నట్లే బాహ్య స్మృతి ఉన్నది . కలలో వలె జ్ఞానేంద్రియముల కర్మ నడచుచున్నది . " అంటుంది . ఆలోచనలు దానికన్నా ముందుకు పోయేవి కావు. అక్కడికే తుంచివేసినట్లు కుతూహలమే ఆరిపోయేది .  

          ఇప్పుడు యాజ్ఞవల్క్యునికి అగ్ని దేవుడి ఆదేశము వచ్చినది . " పంచ భూతములను ప్రత్యేక ప్రత్యేకముగా చూడు ." అని . కానీ చూచుటెలా ? ఎటు తిరిగిననూ పంచభూతములనుండీ ఏర్పడిన వస్తుజాలమే కంటికి కనబడుతున్నది . కావలెనన్న , అగ్ని ధ్యానము వలన పంచభూతములు గూడు కట్టుకొని యున్న చేతనా ప్రకాశమును చూడ వచ్చును . తానే ఆ గూడు అనుకొని ఆ చైతన్యము పుట్టుచున్నది . అది గర్భములో నున్నపుడు దానిని మాట్లాడించి చూడవలెను . కానీ బ్రహ్మచారియైన తనకు అదెలా సాధ్యము ? 

ఇలాగ అసాధ్యమైన దానిని వదలి , సాధ్యమైన జపమును చేస్తూ ఉందామా అంటే ఒకసారి ప్రశ్న మనసులోకి వచ్చినాక , ఊరికే కూర్చొనుటకు సాధ్యము కాదు . దీని వలన , దీర్ఘ కాలము జరుగుతున్న జపము కొంచము సేపే క్లుప్త కాలములో జరిగి , మిగిలిన సమయమంతా ఆ విచారములోనే గడచిపోతున్నది . ఒకటే ప్రశ్న. పంచభూతములను ప్రత్యేకముగా చూచుట ఎలా ? వెనుకా ముందూ తిరిగి తిరిగీ అదే ప్రశ్న , అదే ప్రశ్న , అదే ప్రశ్న .

          ఇలాగ ప్రశ్నను ముందుంచుకొని పరిభావిస్తున్నపుడు ఆ దినము ధేనువు మాట్లాడినది జ్ఞాపకము వచ్చినది . ధేనువు చెప్పినదంతా గుర్తొచ్చింది . " ఉత్తరము చెప్పునది ఉదానము . ఉదానపు వెనుకల ఉన్న ప్రాణము వరకూ నా ప్రశ్న పోవలెను . అప్పుడు కోష్ఠగతమైన ప్రాణము , విశ్వములోనున్న ప్రాణమును చేరి , విశ్వపు ఏమూలనో ఉన్న ఉత్తరమును పట్టుకొని తెచ్చును . అయితే , ఇప్పుడు నాకు కావలసినది క్రియ. ఈ క్రియ , మొదట వాగ్రూపముగా ఉత్తరమును పొందవలెను . దానికేమి చేయవలెను ? ... సరే , మొదట వ్యాపారపు కథను విందాము , తర్వాత వ్యాపారము చేయు ఆలోచన " అను సిద్ధాంతమునకు వచ్చినాడు . 

          " ప్రాణదేవుడినే సాక్షాత్కరించుకొని ఏల అడుగరాదు ? " అని ఇంకొక ప్రశ్న లేచింది . అయితే అతడిని అడుగుటకు ఏదో బెదురు . "  ’అడగమని అగ్ని దేవుని అనుమతి యైనది’ , అనిన చాలు " అని ఇంకో ధైర్యము . అయినా నిశ్చయము చేసుకోలేదు . ఎందుకో దిగులవుతుంది . " నేనిన్ని దినములు ప్రాణ పరిచర్యను చేసినాను . అదీకాక, ప్రాణ దేవుడు నాకు కొత్తవాడేమీ కాదు , కాబట్టి దిగులెందుకు ? " అని అధైర్యమును పోగొట్టు నమ్మకము ఒకటి . 

ఇలాగే నలిగిపోయి మరలా పయోవ్రతమును ఆరంభించినాడు . ఒక మండలము పయోవ్రత మందుండి ప్రాణదేవుని అడుగవలెను అని నిర్ణయించుకున్నాడు . 

         అయితే , ఇంకొకరి ఆశ్రమములో ఉండి , వారిని అడుగక , తానే స్వతంత్రించుటెలా ? కాబట్టి , ఉద్ధాలకుల అనుమతి పొంది , ఆచార్యాణి అనుజ్ఞతో పయోవ్రతమును ఆరంభించవలెను అనుకున్నాడు .

          ఒక దినము ఆచార్య ఉద్ధాలకులు దిగుపొద్దులో ఆశ్రమపు తల వాకిట్లో ఉన్న రాతి పానుపు పైన కృష్ణాజినమును పరచుకొని కూర్చున్నారు . యాజ్ఞవల్క్యుడు వస్తున్నది చూచినాడు . వారికి యాజ్ఞవల్క్యుడంటే అమితమైన అభిమానము . దానికి తోడు , ఆచార్యాణులనుండీ ప్రాణాగ్ని సంభాషణమును విన్న తరువాత ఆ అభిమానము   గౌరవముగా మారింది . ఇప్పుడు వస్తున్న వాడినీ  ఆముఖములోని భావమునూ చూచి , " ఏదో అడుగవలెనని వస్తున్నట్లుంది . ఇతడు అగ్ని, ప్రాణ , ఆదిత్యులను వదలి ఇక దేనినీ అడిగేవాడు కాదు , ఏది అడిగిననూ చెప్పవలెను " అనుకున్నారు . వారు తమ అంగాంగములూ యాజ్ఞవల్క్యుని చూచి ప్రసన్నములైనది చూచినారు . ఆశ్చర్యమైనది . అంటే దేవతలు తమ భక్తులను చూచి ఇంత విశ్వాసము చూపెదరా ? ఇకముందు ఏమగునో గానీ , ఈతడి వలన మాకు ఇప్పుడే ప్రయోజనమైనట్లయింది . " అని ప్రసన్నులై, సావధానులై కూర్చున్నారు . 

          యాజ్ఞవల్క్యుడు వచ్చినాడు . వచ్చి , పెద్దవారిని చూచినపుడు చిన్నవారికి కలుగు సహజమైన వినయ విశ్వాసములతో అభివాదనము చేసి ఆశీర్వాదమును పొంది వారి అనుమతితో నేలపైన కూర్చున్నాడు.  ఆచార్యుడు వద్దని , ఎవరినో పిలచి లోపలినుండీ ఒక కృష్ణాజినమును తెప్పించి పరచి , దానిపైన కూర్చోమని అన్నారు . యాజ్ఞవల్క్యుడు అటులే చేసినాడు . 

         అదే సమయానికి ఆచార్యాణి కూడా అటు వచ్చి , " చూచితిరా ? ఇదిప్పుడు సరియైన జోడి . ఆ దినము అగ్నిదేవుని అనుమతియైనది . మీరు వచ్చిన తరువాత మీ వద్ద పంచాత్మ సంక్రమణ విద్యనూ , అవస్థా క్రమ విచారమునూ గురించి ప్రస్తావించవలెనని ! ఈ దినము కుమారుడు దానికే వచ్చినాడేమో ? " అన్నారు . 

          యాజ్ఞవల్క్యుడు ఏమి చెప్పవలెనో తెలియక, తల పంకించినాడు . ఆచార్యుడు అప్పుడే సరిగ్గా అన్నాడు , " వాడికేమి , పుణ్యవంతుడు .! వాడు జాతవేదుడు . వాడికి తెలియనిది లేదు . అయినా , రాజ్యపు విస్తారమునూ , వైభవమునూ చూడని యువరాజు వలె ఉన్నాడు . మేమైతే ఎప్పుడో చెప్పినాము , అతడికి కావలసినది అడగవచ్చునని . ఒకవేళ అతడు అడిగే విషయము మాకు తెలియదనుకుందాము , అతనిచేత పరిచర్యలను చేకొన్న అగ్ని ప్రాణులే దానిని చెపుతారు . దీనికి నువ్వే సాక్షి ! " అన్నారు . 

          వారి మాట విని యాజ్ఞవల్క్యునికి ఆలోచనలు చుట్టుముట్టినాయి . వీరు , జాతవేదుడిని అంటున్నారు . ఆచార్యాణి నోటి ద్వారా , అగ్నిదేవుడు సర్వజ్ఞ బీజముందని చెప్పినాడు . అలాగయితే నేను చేయవలసినది ఒక్క తపస్సు మాత్రమే . సకాలములో ఋతులింగ న్యాయము ( బాహ్య ప్రపంచములో ఆయా ఋతువులకు తగ్గట్టుగా చెట్లు , పక్షులు మొదలైన  ఆయా గుర్తులు ఎవరి అపేక్ష లేకుండా వ్యక్తమగును --అను న్యాయము ) వలన అది తానే కనిపిస్తుంది . అలాగే కానిమ్ము , నేను ఆగి వేచియుంటే నష్టమేమిటి ? వారినోటనే వస్తున్నది కదా , నన్ను కాపాడుటకు ప్రాణాగ్నులిద్దరూ సిద్ధముగా ఉన్నారని ? " అని ఊరకే కూర్చున్నాడు . 

         ఆచార్యులు , " యాజ్ఞ వల్క్యా , వచ్చిన కారణమేమో చెప్పనేలేదే ? " అన్నారు . అతడేమి చెప్పవలెను , ? తన ప్రశ్నను పక్కకుపెట్టి , " తల్లిగారు అప్పుడే చెప్పినారు , ఇక నేను దానినే మరలా చెప్పుట ఎందుకని ఊరకే ఉన్నాను " అన్నాడు . 

          ఆచార్యులు , ’ అలాగా ? ’ అని వెనక్కు తిరిగి చూచినారు . ఆలాపిని ఒక కృష్ణాజినమును తెచ్చి గడప లోపల వేసుకొని కూర్చున్నది . అది చూచి ఉద్ధాలకులకు బహు సంతోషమైనది . " నువ్వున్నావో లేదో యని తిరిగి చూచితిని . ఇదిగో , చూడు . అమృత మేఘము వచ్చింది . నానుండీ అమృత వర్షము కురిపిస్తున్నది . ఇద్దరం ఆ వర్షపు ప్రయోజనమును పొందెదము " అని యాజ్ఞవల్క్యుని వైపుకు తిరిగినారు . 

          " చూడు యాజ్ఞవల్క్యా , పంచాత్మ సంక్రమణము , అవస్థాత్రయముల విచారములో మొదట అవస్థాత్రయమును తీసుకొనవలెను . ఈ అవస్థాత్రయమును గురించి చెప్పుటకు ముందే  చెప్పవలసినది ఇంకాఉంది ,అది విను . అజ్ఞులు ( తెలియని వారు ) అవస్థ నుండీ అవస్థకు ప్రకృతి వశమున వెళ్ళి వచ్చెదరు . విజ్ఞుడయినవాడు (  తెలిసినవాడు ) వాటికి సాక్షి కావలెను . వాడికి కల , నిదుర అనునవి ఒక గది నుండీ ఇంకొక గదికి వెళ్ళివచ్చు నట్లుండవలెను . విజ్ఞుడగువరకూ ఇది సాధ్యము కాదు . ఇది అగువరకూ విజ్ఞుడు కాలేడు . ఇదే ఇక్కడున్న రహస్యము . " 

యాజ్ఞవల్క్యుడు ఒళ్ళంతా చెవులై వింటున్నాడు . ఆలాపిని ఆ విద్య తెలిసినదాని వలెనే అనుసంధానము చేస్తున్నది . అప్పటికే ఆమెకు సాక్షీభావము కూడా వచ్చింది . 

          ఆచార్యులు కొనసాగించినారు : " చూడు , ఈ రహస్యమును తెలుసుకొనుట కోసము ఇంద్రుడు నూటొక్క సంవత్సరములు బ్రహ్మచర్యము పాటించినాడు . ఇంకొక మార్గము ద్వారా దానిని  ఛేదించిన యమధర్మరాజు  నచికేతునికి ఆ రహస్యమును చెప్పినాడు . జాగృదవస్థ చివర , స్వప్నావస్థ ఆరంభమున ఉన్న స్థితిలో ఈ సాక్షీభావము లభించును . జాగృదవస్థలో కర్మేంద్రియములతో చేరిన మనసు వాటినుండీ విడిపించుకొని స్వప్నపు జ్ఞానేంద్రియములకు ఇంకా దొరకని సంధి సమయములో దీనిని చూడవలెను . మనసు , ఇటు ఇంద్రియాలు అటు బుద్ధి , రెండింటికీ సంబంధించినట్లు ఉంటే , అప్పుడు లాగి కట్టిన తాడువలె జీవము తన సంకల్ప వికల్పములను చేస్తూ కూర్చొనును . అలాకాక, ఇంద్రియ సంబంధమును వదలి బుద్ధికి మాత్రమే సంబంధించునట్లు ఉంటే , మనసు నేలపై పడియున్న తాడు వలె ఏ పనీ లేక , తానున్ననూ లేనట్లే అగును . అప్పుడు కనిపించు జాగృత్ , స్వప్న , సుషుప్తి అను మూడు అవస్థలూ కాక, నాలుగవ అవస్థలో సాక్షి దర్శనమగును . అలాగయినపుడు జాగృత్ కాదు , స్వప్నము కాదు , సుషుప్తి అసలే కాదు , ఈ స్థితిలో కూర్చొని చూచుట నేర్చినవాడికి తత్త్వ దర్శనమగును . ఆ దర్శనము ఇటు జాగృత్తు , అటు సుషుప్తి లను ఆవరించినపుడు ఆ రెండు అవస్థలూ లేకుండాపోవును . ఇలాగ జాగృత్సుషుప్తులు రెండూ ఉన్ననూ లేకుండా పోయినపుడు , ఆ సాక్షీ భావము అంతటా తానే నిండి మహా దర్శనమగును . తెలిసిందా , యాజ్ఞవల్క్యా ? "

         యాజ్ఞాల్క్యుడు వెనుక తనకు కలిగిన జ్యోతిర్దర్శనమును జ్ఞాపకము చేసుకున్నాడు . వాన పడగానే తడిసిపోవు నేల వలె , అతని జీవము తన విశ్వ స్థానమైన భ్రూ మధ్యమును వదలినది .( జీవుడికి విశ్వతైజస్యప్రాజ్ఞుడు అని మూల నామము . భ్రూ మధ్యమము , కంఠము , హృదయము అను మూడు స్థానములు . ) తైజస స్థానమగు కంఠమును ఇంకా చేరలేదు . ఇంద్రయోని స్థానములో ఎవరో పైనుండీ లాగుతున్నారు . కిందకు వెళ్ళకుండా ఎవరో నిలిపివేసినారు . కుమారునికి ఈ విశాల జగత్తంతయూ ఆచార్యుల మాటలలో కేంద్రీకృతమైనట్టుంది . లాగుతున్నది ఎవరు ?  తనను కిందకు పడకుండా నిలుపుతున్నదెవరు ? అనునది చూచుటకు కూడా అవకాశము లేదు . దేహమంతా చెవులే అయితే ఎలా వినవచ్చునో అలాగ వింటున్నాడు . 

          ఆచార్యులు దానిని చూచినారు . వారు అతడి దేహమును ప్రవేశించకయే అతడి స్థితిని కనిపెట్టినారు . అంతా అద్దములో చూచినట్లే వారికి స్ఫురించినది . దానిని , అతడి స్థితినీ భార్యకు కూడా చూపించవలెనని వారికి ఇష్టము . అయితే ఆమెకూడా అనుసంధానము చేస్తున్నది . 

         ఆచార్యులు ఒక ఘడియ ఊరికే ఉన్నారు . అప్పుడు వారికి ఒక ఆలోచన వచ్చింది : " యాజ్ఞవల్క్యుడు ఇలాగ వ్యాపారవంతుడైనదెలాగ ? తన మాటయొక్క బలము వలన అనునట్లయితే , ఇంతవరకూ ఈ విషయమును అనేకులకు చెప్పియున్నాను . వారెవరికీ మొదటిసారికే ఇలాగ వ్యాపారము ఆరంభము కాలేదు . కాబట్టి ఇది యాజ్ఞవల్క్యుని పూర్వపుణ్యమై యుండవలెను " అనుకున్నారు . 

        అంతలో యాజ్ఞవల్క్యుడు వ్యాపారమును ముగించి బయటికొస్తున్నట్లు కనిపించినది . మరలా అతడిని సంబోధించి అన్నారు : " చూడు యాజ్ఞవల్క్యా , అక్కడున్నపుడే చూడు. నిన్ను కిందకు పడకుండా ఆపుతున్నది ఎవరు ? పైకి లాగుతున్నది ఎవరు ? " ఈసారి మాటలో ఆజ్ఞాభావము ఉంది . పెద్దవారు చిన్నవారికి చెప్పునపుడు కనిపించు వాత్సల్యము , అధికారమూ రెండూ ఉన్నాయి .

       యాజ్ఞవల్క్యుడు చూచినాడు : తనను పైకి లాగుతున్నవి సూర్య కిరణములు . తానున్నది భూమ్యాకాశములు రెండూ కాని అంతరిక్షము . అక్కడ నుండీ కిందకు పడకుండా , తరుణి ఒకతె తన చేతులను చాచి  అతడిని పట్టిఉన్నది . ఆమెను అడిగితే , " నేను సూర్యగణమునకు చెందినదానిని .  ఇప్పటికింతే చాలు " అని దాక్కుంటున్నది . ఆమె మాయమైనట్లే సూర్య కిరణములు కూడా మాయమగుచున్నవి . అయితే , ఆ పైని లాగుట , కింది పట్టు ఇవి తప్పలేదు . 

      ఆచార్యులు ఆమె ఆడిన మాటను అలౌకిక శ్రవణ శక్తితో  విన్నారు . బహు సంతోషమయినది . కుమారుడికి తనకుతానుగా మెలకువ కానీలెమ్మని నెమ్మదితో కాచి కూర్చున్నారు . 

        కొంతసేపటికి యాజ్ఞవల్క్యుడు మేలుకున్నాడు . అంతవరకూ అతడు చేసిన , చేస్తున్న వ్యాపారమంతా  తన ముందున్న పాత్రలోని నీటిలో ఈదుతున్న చేపల వ్యాపారము వలె  స్పష్టముగా కనపడుచున్ననూ ఆచార్యులు ఒక్క మాట కూడా మాట్లాడకుండా కూర్చున్నారు . యాజ్ఞవల్క్యుడు కనులు తెరచి నవ్వుచూ ఆచార్యునికి నమస్కారము చేసినాడు . ఆచార్యులు అడిగినారు : 

" ఏమేమి చూచితివి యాజ్ఞవల్క్యా ? " 

        " ఏమి చెప్పుదును ఆచార్యా ?  నేను చూచినది  చెప్పుటకు నాకు మాటలు చాలడము లేదు . కాబట్టి కొంచము హెచ్చుతక్కువ అయితే క్షమించవలెను . మొదట భ్రూమధ్యము నుండీ ఏదో ఒక అదృశ్య పదార్థము మెరిసి కిందికి దొరలినట్లాయెను . అప్పుడు నా తల ముందుకు వాలి పడిపోవలసినది . ఎవరో పడుతున్న తలను అలాగే నిలిపివేసినారు . లోపల , పడుచున్న ఆ పదార్థమును ఎవరో ఆదుకొని అక్కడే నిలిపినారు . నేను ఉన్నది భూమికాదు , ఆకాశమూ కాదు అనిపించినది . వెంటనే తానుగా అర్థమైనది , ఇది అంతరిక్షము అని . అక్కడ తమరు చెప్పుచున్నవి , నేనాడినవి మాటలు గా కాకుండా , వ్యాపారమును ప్రచోదించు క్రియల వలె ఉన్నాయి . అటు ఆదిత్యుని కిరణాలు , ఇటు ఆదిత్యగణపు దేవియొకతె , ఇద్దరూ ఒక జ్యోతిర్మండలమును పట్టుకొనియున్నారు . ’ఆ జ్యోతిర్మండలమే నేను ’ అన్నది స్ఫురించుచుండెను . ఆ పక్కలోనే , తమరు చెప్పినట్లు ఒక తాడు వదులుగా వేలాడుతూ యుండెను . ఆ మండలమునకు తానొక సంపుటములో నున్నట్లు తోచినది . తాను జ్యోతియై ఉన్నందు వల్లనో ఏమో , అంతటా జ్యోతియే కనిపించు చుండినది . "

       " ఆ సంపుటమే బుద్ధి , యాజ్ఞవల్క్యా . ఆ వేలాడుతున్న తాడు వలె నిర్వ్యాపారముగా నున్న ప్రకాశమే మనసు . నిన్ను కిందకు పడకుండా పట్టుకున్నామె ఉషా దేవి . ఇదిగో , ఆమెయే వచ్చినది . ఋగ్వేదపు ఉషా సూక్తముతో ఆమెను ఆరాధించు " 

ఆచార్యుల అనుజ్ఞమేరకు యాజ్ఞవల్క్యుడు ఉషా సూక్తమును చెప్పినాడు . అది సామముగా పరిణమించినది . 

ఇటూ ఆచార్యులూ , ఆచార్యణీ ఆ సామము ముగియువరకూ చేతులు జోడించి నిలుచున్నారు . 

        అంతా ముగిసిన తరువాత ఆచార్యులు అన్నారు , " యాజ్ఞవల్క్యా , ఈ దినము నీకు సాక్షీ దర్శనమైనది . ఇకముందు నీకు తత్త్వ శాస్త్రమును అభ్యాసము చేయుటకు అధికారము వచ్చినది . ఇప్పుడు నీకు అయినది దర్శనము . నువ్వు తత్త్వమును సమగ్రముగా తెలుసుకుంటే అది ’ మహా దర్శనమగును ’ . "

        యాజ్ఞవల్క్యుడు ఆచార్యవాక్కును ఆశీర్వాదమని పరిగ్రహించి , నమస్కారము చేసినాడు . ఆచార్యాణి , తనకు నమస్కారము చేయుటకు వచ్చిన కుమారుని వారించి , " అది మాకు మూల స్థానము , అక్కడ అయినదంతా మాకూ అయినట్లే " అని అంటున్ననూ , యాజ్ఞవల్క్యుడు ఆమెకూ నమస్కారము చేసినాడు . 

Tuesday, February 19, 2013

39. " మహాదర్శనము "--ముప్పై తొమ్మిదవ భాగము-- సర్వజ్ఞుడు 2


39.  సర్వజ్ఞుడు 2


         ఆచార్యాణితో నడచిన సంభాషణ వలన యాజ్ఞవల్క్యునికి జ్ఞానోదయమైనది . తనలో తాను మాట్లాడుకుంటున్నట్లు అన్నాడు ."  అలాగయితే , ఈ చిన్నదీ , పెద్దదీ అనుకుంటూన్న భేదమంతా పరిమాణములోనే కానీ , జాతిలో కాదు ! " 

        దానిని ఒప్పుకున్నట్లు అన్నాడు , " అలాగయితే ప్రకృతి చేతికి దొరకువరకూ ఈ చిన్నతనము . దీని గుర్తుగా శోక మోహములు . ప్రకృతినుండీ ముక్తుడైతే ఇవి లేవు . అప్పటి స్థితి ఏమిటి తల్లీ ? "

         " ప్రకృతి బయట ఉన్నవాడిని శృతీ భగవతి కూడా వర్ణించలేక , ’ మహాన్ ’ అనీ , ’ బ్రహ్మ ’ అనీ ఊరకుండి పోయింది . ఇంకొక చోట బ్రహ్మను గురించి , ’ సత్యం జ్ఞానమనంతం  బ్రహ్మ ’ అన్నది . ఈ వాక్యములో నున్న జ్ఞానము బయటి వస్తువుల విషయమును సంగ్రహించుకొను భాండారము కాదు , యాజ్ఞవల్క్యా , అనుకూల కాలములో మఠములో కనిపించు చిగురు వలెనే  ఇదీ ! . అదీకాక , సంగ్రహ భాండారమైన జ్ఞానము , మనోవృత్తి .  దానిని వదిలితే , అనగా మనసు నుండీ బయటికి పోతే బుద్ధివృత్తి . అక్కడినుండీ కూడా బయటికి పోతే అక్కడ జ్ఞానమే తానై యున్న బ్రహ్మ . అక్కడికి పోవచ్చును . అయితే , చక్కెరను నోట్లో వేసుకుంటే ఎలాగుంది అంటే ’ తియ్యగా ఉంది ’ అనవచ్చు , తీపిని వర్ణించుటకగునా ? అటులనే , దానిని చెప్పుటెలాగో తోచక , ’ అది జ్ఞానము ’ అంటాము , తెలిసిందా ? " 

" తెలిసింది " 

        " ఇప్పుడు నీ ప్రశ్నను తీసుకుందాము . జ్ఞాన రూపియైన బ్రహ్మ పంచభూతములలోనూ , గుణత్రయములోనూ  అనగా , ప్రకృతిలో చేరినందువలన , ఇలాగ చిన్నవాడై యున్నాడు . ఇలాగ ప్రకృతికి చిక్కి , చిన్నవాడయిననూ , తన గుణములను పోగొట్టుకోలేదు కదా ? కాబట్టి అతని సర్వజ్ఞత్వము ఎక్కడికి పోయింది ? " 

" తల్లీ , ఇది నిజంగా ప్రౌఢ వాదము . మాట యొక్క బలము చేత నా నోటిని మూయించినారు , కదా ? . "

       " కాదు యాజ్ఞవల్క్యా , నీ నోరు మూయించే అవసరము నాకు లేదు . నువ్వు నా కడుపున పుట్టిన కొడుకు లాంటి వాడవు . నిజంగా నీకు చెప్పవలెనంటే , ఇంత సేపూ మాట్లాడినది నేను కాదు . నీ ఉపాస్య దేవత యైన అగ్ని దేవుడు . ఔనో కాదో చూడు . "

        యాజ్ఞవల్క్యుడు కన్నులు మూసి అనుసంధానము చేసినాడు . ఇంతవరకూ తన దేహములో , తాను కోరిన చోట దర్శనమిస్తున్న అగ్నిదేవుడు ఇప్పుడు ఆచార్యాణిలో కూర్చొని పలుకుతున్నాడు . దేవుడికి నమస్కారాదులు చెల్లించి , " ఇదేమి విచిత్రము ? ఇందుకేనేమి , ఈ రోజు నాతో జపము చేయించ నియ్యకుండా ఇక్కడికి పిలుచుకు వచ్చినది ? " అని అడిగినాడు . 

        అగ్ని దేవుడు ప్రసన్నుడై , " ఔను , ఇక నీకు దేహ తత్త్వ , మనస్తత్త్వములను బోధించవలెను . ఇప్పుడు చెప్పినది జీవ తత్త్వము మాత్రమే . ఈ దినము నీకు సర్వజ్ఞ బీజపు యోచన వచ్చినపుడు , నువ్వు అడిగి ఉంటే అప్పుడే అక్కడే చెప్పేవాడిని . నువ్వు అడుగలేదు . అందుకని ఇక్కడికి పిలుచుకొచ్చి , ఈ ముఖముగా చెప్పినాను . ఇదంతా మా దేవతల ఆట. ఇప్పటికి ఇంత తెలుసుకో, చాలు " అన్నాడు . 

అగ్ని దేవుని మాట ముగిసిన తర్వాత ఆలాపిని అడిగినది . " నమ్మకము కుదిరిందా? యాజ్ఞవల్క్యా ? " 

" సరే , మరి దేహతత్త్వ , మనస్తత్త్వముల గురించి ఎప్పుడు చెప్పెదరు ? "

        " అది ఇంతవరకూ మాట్లాడినవారి ఇష్టము . నేను ఒకటి మాత్రము చెపుతాను , వినియుండు . వారు తిరిగి వచ్చిన తర్వాత , వారి దగ్గర , ఛాందోగ్యములోని , ఇంద్ర విరోచనోపాఖ్యానమును , తైత్తిరీయపు పంచాత్మ సంక్రమణ విద్యనూ అడుగు . "

       యాజ్ఞవల్క్యుడు సరేనన్నాడు . నమస్కార పూర్వకముగా వీడ్కొని , తన గుడిసెకు వెళ్ళినాడు . దారిలో తనకు కలిగిన అనుభవమును గురించే ఆలోచనలు . 

38. " మహాదర్శనము "--ముప్పై ఎనిమిదవ భాగము--సర్వజ్ఞుడు 1


38. ముప్పై ఎనిమిదవ భాగము--   సర్వజ్ఞుడు-1


" ప్రశ్నయైతే బాగానే ఉంది , కానీ యాజ్ఞవల్క్యా , వెనకా ముందూ చూడకయే అడిగిన ప్రశ్నకు నేనేమని ఉత్తరమిచ్చేది ? " 

        యాజ్ఞవల్క్యునికి అయోమయముతో తబ్బిబ్బు అయినది . మిగిలిన వారిని ఒక్క ప్రశ్నతో పల్టీలు కొట్టించుతున్న యాజ్ఞవల్క్యుడు ఇప్పుడు తానే పల్టీ కొట్టునట్లాయెను . ముఖము తనలోని క్షుబ్ధతను  చూపుచుండగా అడిగినాడు . " తమరు చెప్పినది అర్థము కాలేదు ."  

       " నువ్వు రేపు , అనగా ఇంక కొన్ని సంవత్సరములలో మహా విద్వాంసులతో పోరాడుటకు నిలువవలసిన వాడివి . అప్పుడు ప్రశ్న వేస్తే ఎలా ఉండవలెనో తెలుసా ? నువ్వు ముష్ఠి తో కొట్టితే , నీ సర్వ సామర్థ్యమునూ దానిలో ఉపయోగించునట్లు ఉండవలెను . ప్రశ్న వేస్తే ఎదుటివాడిని నిరుత్తరుడిని చేసి నీటిలోకి తోసినట్లు ఉండవలెను , నీట పడ్డ వాడు , మొదట తనను కాపాడుకొని , అనంతరము తనను తోసిన వాడి వైపుకు తిరుగవలెను కదా ? అలాకాక, సిద్ధుడై నిలచు ఉన్నవాడిని తోసినట్లు కారాదు . ఈ చిన్నది , ఈ పెద్దది అనునది ఎలా అనికదా , నీ ప్రశ్న ? నీ ప్రశ్నలోనే ఉత్తరమున్నది . చూసుకో , చిన్నది , పెద్దది అను భేదము ఎందులో ?  జాతిలోనా , పరిమాణములోనా ? "

యాజ్ఞవల్క్యుడు ఆలోచించినాడు . ఒక ఘడియ యైన తర్వాత , " ఉన్న భేదం అంతా పరిమాణము లోనే తప్ప , జాతిలో కాదు . "

        " నేను కూడా అదే చెప్పేది . నీ చేతిలోనున్న బీజమూ , దానినిచ్చిన చెట్టుకు కారణమైన బీజమూ ఒకటే జాతి యంటే నీకెందుకు స్ఫురించలేదు , తెలుసా ? ఇంద్రియాతీతమైన విషయమును ఇంద్రియములతో కొలుచుటకు సిద్ధమైనావు ! ఇప్పుడు ’ కృత్వా చింత ’ చేయి . ( అలాగయిన , ఇలాగ కావచ్చును అని ఒప్పుకొనుట కృత్వా చింత .) ఇంద్రియములు బహిర్ముఖములు . నేను , నేను యను చేతనమును ఏ ఇంద్రియము చేత చూస్తావు ? కఠము ( కఠోపనిషత్తు ) లో చెప్పినట్లు ఆ ప్రత్యగాత్మను చూచుటకు ఆవృత్త చక్షువు కావలెను . అదయినంత మాత్రాన చాలదు . ధీరుడు కూడా అయి ఉండవలెను . అప్పుడు  ఆ ’ నేను ’ కనబడును.  అది ఇంద్రియ వృత్తియా ?  "

" కాదు " 

" సరే , నువ్వు విషయమును గ్రహించినావు . కాబట్టి , ఆవృత్త చక్షువూ , ధీరుడూ అయినవాడు సాక్షాత్కరించుకొను స్థితిని బట్టి చెప్పిన మాటను నువ్వు ఎక్కడో నిలచి ప్రశ్నిస్తే తప్పు కాకున్నా , ఏమని ఉత్తరమివ్వ వలెను ? "  

" ఔను , ప్రశ్నలోనే తప్పుంది " 

      " అలాగనవద్దు . గెలుచుటకే పుట్టిన వాడి నోటిలో ఓడిపోతిని అన్న మాట రాకూడదు . కాబట్టి ప్రశ్న తప్పు అనవద్దు , వేరే దృష్టితో చూడవలసినది అని , ఆ దారిని వదలి ఈ దారిని పట్టుకో "

" తమ వంటి వైచక్షణ్యము వచ్చిన తర్వాతే కదా , ఆ మాట ? "

      " మరలా నువ్వు అదే తప్పు చెయ్య వద్దు . చెట్టును ఆశ్రయించిన తీగ ఎంత ఎత్తుకు వెళ్ళ వచ్చును అంటే , తాను ఆశ్రయించిన చెట్టు ఎత్తు వరకూ అన్నట్లే , అగ్ని దేవుడూ , ప్రాణదేవుల ఉపాసకుడవైన నువ్వు  కూడా వారివలె విశ్వంభరుడవు కావలెను . ఇప్పుడు చేస్తున్న ఆదిత్యోపాసనము పూర్తియైన తర్వాత , ఈ విశ్వమును దాటి వెళ్ళవలెనంటే , నువ్వు ఈ దేహముతోనే వెళ్ళెదవా ? " 

" లేదు , ఏమైననూ ఈ దేహము పంచభూతములతో ఏర్పడినది .  ఈ భూతముల నుండీ బయటికి వెళ్ళినపుడే కదా , విశ్వమును దాటేది ? "

" ఇంకో రహస్యము , యాజ్ఞవల్క్యా , ఈ పంచ భూతములన్నీ ఒకదాని నుండే కదా వచ్చినవి ? అంటే , ఆత్మనుండీ కదా ? "

" ఔను , ఆత్మనః ఆకాశస్సంభూతః " 

" ఇక్కడ ఒక ఘడియ నిలచి చూడు , ఆ తరువాత ముందుకు వెళదాము . ఆకాశమంటే ఏమిటి ? దానిని చూపించ గలవా ? "

        యాజ్ఞవల్క్యుడు ఆలోచించినాడు : " ఆకాశమంటే ఏమి ? వెలుగు కన్నా సూక్ష్మమై , వాయువుకు అవకాశమును ఇవ్వవలెనంటే , అది ఎంత తేటగా ఉండవలెను ? అటువంటి దానిని చూపుట ఎలా ? శాస్త్రము , ’ శబ్ద గుణకమాకాశం ’ అంటున్నది . కేవలము శబ్ద గుణము మాత్రమే ఉన్నదానిని , తేజో గ్రాహియైన చక్షువు కానీ , స్పర్శ గ్రాహియైన ’ త్వక్కు ’  కానీ , సాక్షాత్కరించుకొనుట యెలా ? అవి రెండూ వద్దు , శబ్ద గ్రాహియైన శ్రోత్రమైనా గ్రహించనీ అంటే , శ్రోత్రేంద్రియము నకు దొరకు శబ్దములకు ఒక్కొక్క రూపముంది , పరిమితి ఉంది.  అలాగైతే ఆకాశము అగ్రాహ్యమా ? "

యాజ్ఞవల్క్యుని సందేహము తెలుసుకొని ఆలాపిని అన్నది , " చూచితివా యాజ్ఞవల్క్యా , ఆకాశమును చూపించుట ఎంత కష్టమో తెలిసిందా ? పోనీ , ఆకాశము నుండీ సంభవించిన వాయువును , వాయువు నుండీ సంభవించిన తేజస్సునూ , దానినుండీ సంభవించిన జలమునూ , దానితో కలిగిన పృథ్వినీ అంటే , ఈ పంచభూతములలో ఒకదానినైననూ సాక్షాత్కరించి ఇవ్వగలవా ?  పోనీ , నువ్వైనా సాక్షాత్కరించు  కున్నావా ? " 

        యాజ్ఞవల్క్యుడు మరలా ఆలోచించినాడు . ఇప్పటికి అతడికి తెలియదు అనునది తెలిసింది . వట్టి ప్రశ్నలతో లాభములేదు అని నిర్ధారించుకొని , అతడన్నాడు , " ఈ దినము మాతా ఆచార్యాణి సరస్వతి వలె పలుకుచున్నారు . వట్టి ప్రశ్నలు వేసి నా అజ్ఞానమును ప్రదర్శించుట బదులు , విషయమును చెప్పి , నన్ను జ్ఞానిగా చేయు గాక " 

      ఆలాపిని ఆ మాట విని గంభీరురాలైనది : అప్రసన్నము కాకుండా , తన మాటను కొనసాగించినది . " వీటన్నిటినీ ఒక్కొక్కటిగా సాక్షాత్కరించుకొని చూచి కృతార్థుడవు కమ్ము అని నేను ఈ ప్రశ్నలను అడిగినాను . ఇప్పుడు సిద్ధాంతమును చెప్పెదను వినుము . ఈ పంచ భూతములకు ఒక్కొక్క దానికీ ఒక్కొక్క ప్రత్యేకత ఉంది . ఇవన్నీ తండ్రీ కొడుకులవలె అయిననూ , తండ్రి వేరే , కొడుకు వేరే అనునట్లే ఇవి కూడా .  సాంఖ్యము , దీనినంతటినీ ప్రకృతి యనీ , దీని పట్టులో  చిక్కిన పురుషుడు , దీని పట్టు నుండీ విడిపించు కొనుటయే ముక్తి యనీ అన్నది . ముక్తిని పొందిన కొందరు పురుషులుంటే , వారేమవుతారు అనుదానిని చెప్పలేదు . ఇప్పుడు నువ్వు చెప్పు , అయితే ’ కృత్వా చింత ’ తో చెప్పు అన్నది మరవవద్దు . ఈ పంచభూతాత్మకములై గుణత్రయ విశిష్టురాలైన ప్రకృతి సంసర్గమును వదలిన వారు ఎలా ఉండవలెను ? "

      " ఔను , ప్రకృతస్థుడైన పురుషుడు ఎలా ఉన్ననూ , ప్రకృతి నుండీ విమోచనమును పొందిన పురుషుడు  తన పూర్వ స్థితిని పొందినవాడై యుండవలెను . సందేహము లేదు ."

       " కారాగారములో ఉన్న పురుషుడు తనను బంధించియున్న గది యొక్క నాలుగు గోడల మధ్యలో  తప్ప , ఇంకెక్కడా తిరుగుటకు లేదు . అతడే , అక్కడి నుండీ ముక్తుడై బయటికి వస్తే ఎక్కడికైనా పోవచ్చును కదా ? "

" ఔను "

      " బంధ ముక్తుడైన వాడి స్థితి వలెనే , ప్రకృతి ముక్తుడైన వాడి స్థితి అనగానే మనము ఏమని చెప్పవలెను ? మనకు తెలిసినది ప్రకృతి గ్రస్థుడైన వాడి స్థితి మాత్రమే . ప్రకృతి ముక్తుడైన వాడి స్థితి దానికి ప్రతిగా ఉండవలెను కదా ? "

" ఔను "

" ఏదీ , ఇప్పుడు ద్వాసుపర్ణశృతి ని చెప్పు "

       " రెండు పక్షులు ముద్దైన గూటిలో ఉన్నాయి . రెండూ ఎప్పుడూ కలిసే ఉంటాయి . రెంటికీ ఒకటే పేరు . ఒకే చెట్టులో ఉంటాయి . వాటిలో ఒకటి రుచియైన పళ్ళను తింటూన్నది . ఇంకొకటి ఏమీ తినకుండా చూస్తూ కూచుంది . " 

" తర్వాత ? "

     " పండు తినే కార్యములో మగ్నమైన పక్షి పరవశమై , మోహము చెంది శోకిస్తుంటే . పండు తినని పక్షి ఈశ్వరుడైనది. ఆ పక్షి , ఈ పక్షిని చూచి ( సావాసము వలన )  తానూ దానివలెనే అగును . "

" ఇక్కడే ఉంది రహస్యము , యాజ్ఞవల్క్యా , భోగమగ్నుడై ఉండుట అంటే , పరవశమై , మోహ శోకముల చేత చిన్నవాడగుట. అది లేక పోతే ? "

" ఆ పక్షి , ఈ పక్షి వలెనే అగును . "

" అలాగవడమంటే , అప్పుడు , భేదమేమైపోయింది ?  అవి విజాతి పక్షులైతే ఒక పక్షి ఇంకొకదాని వలెనే అగుటకు సాధ్యమయ్యేదా ? "

" లేదు "

        " దీన్ని ఒకవైపు ఉంచుకొని , రసవాదమును చూడు . అది చెప్పేది ఇంతే , ’ ముట్టుకుంటే చేతులు నల్లబారు సీసమును , మెరుస్తున్న బంగారముగా చేయవచ్చును ’ అని కదా ? 

      " అదెలాగనగా ,  సీసములో సప్త కంచుక దోషమున్నది . దానిలో మూడు పోతే తామ్రమగును . దానిలో కూడా ఒకటి పోతే వెండి . ఇంకొక కంచుకము పోతే బంగారము . ఆ చివరి కంచుకమూ పోతే అది సిద్ధరసము . సిద్ధ రసము తనలో పడ్డ లోహములన్నిటినీ భృంగముగా చేయును . భృంగము తన అరవై నాలుగు రెట్ల తామ్రమును బంగారము చేయును . ఇప్పుడు చెప్పు , సిద్ధరసమునకు సప్త కంచుక దోషము ప్రాప్తమైతే ఏమికావలెను ? " 

" సీసము కావలెను "

" సీసపు సప్త కంచుక దోషము పోతే ? ’

" అప్పుడది సిద్ధరసము కాకున్ననూ , భృంగమైనా కావలెను . "

" ఇదంతా లోహపు విషయము . ఈ సాధన ప్రక్రియను జీవుడికి జోడించి చెప్పు " 


Monday, February 18, 2013

37. " మహాదర్శనము "--ముప్పై ఏడవ భాగము -- సర్వజ్ఞ బీజము


37. ముప్పై ఏడవ భాగము--  సర్వజ్ఞ బీజము


         యాజ్ఞవల్క్యుడు ఎప్పటివలె సూర్యోదయానికి ముందరి బ్రాహ్మీ ముహూర్తములో లేచి , తన స్నాన, సంధ్యా , అగ్ని కార్యములను ముగించుకొని జపములో కూర్చున్నాడు . అతడు జపములో ఉపాస్య దేవతను సాక్షాత్కరించుకొనడు . అయినా అతడికి జపము చేయునంతసేపూ ఎవరో తనవెంటనే ఉన్నట్టు ఉంటుంది . అతడి శోభ అదే , వెంట ఉన్నవారు ఎవరూ అనుదానిని చూడడు . 

        మాధ్యాహ్నికపు సమయము వరకూ జపములో ఉండి మధ్యాహ్నపు సమయము మరలా స్నానము చేసి అప్పటి కర్మలన్నిటినీ నెరవేర్చినాడు . ఆ దినము ఏదో విశేష కారణమని అతడిని ఋగ్వేదోపాధ్యాయులు గౌతములు భోజనమునకు రావలసినదిగా చెప్పియున్నారు . అక్కడ వైశ్వదేవము అయినది . అనంతరము వచ్చి , ఎప్పటివలె అతడు తన గుడిసెలో జపమగ్నుడయినాడు . 

       దారిలో వచ్చునపుడు , ఎలాగో ఏమిటో , బుడిలులు తరచూ చెప్పెడి సర్వజ్ఞుడగు ఆలోచన మనసులోకి వచ్చింది . ’ కానీలే , ఆదిత్యుని ప్రసాదము దొరికిన తరువాత ఆ ఆలోచన ’ అనుకొని , గుడిసెలో కూర్చున్నాడు . 

       జపమెందుకో బహుకాలము నడవలేదు . ఆహారములో దోషమేమైనా ఉందా అని తాను భుజించినదంతా సింహావలోకనము చేసుకొని చూచినాడు . లేదు , దానిలో దోషమేమీ ఉండలేదు . దేహములో ఏదైనా దోషము సంభవించినదా యని చూచుకున్నాడు . దేహము ఎప్పటివలె తేలికగానున్నది . దేహప్రకృతి స్వస్థముగా నుండినది . 

       ఇలాగెపుడైనా జపభంగమైతే వీణను తీసుకొని వాదనములో కూర్చోవడము అతడికి వాడుక. వీణను తీసుకొన్నా అక్కడ కూడా అతడి మనసు రమించలేదు . అయినా కొంతసేపు వాయించినాడు . అది కూడా బలవంతపు బ్రాహ్మణార్థమైనది . దానిని పక్కకు పెట్టినాడు . మనసుకు ఏదో జాడ్యము . అక్కడ ఇంటిలో తల్లిదండ్రులకు ఏవైనా అనారోగ్యాలు సంభవించి దానివలన మనసు ఇలాగయి ఉండవచ్చునా అని ఆలోచించినాడు . ఐనా , ఆశ్రమము మిథిలకు  కేవలము ఒక అర్ధ దినపు దారి . అటులేమయినా అయినచో , వార్త వచ్చియుండవలెను , ఏమీ రాలేదు . 

        అగ్నిదేవుడినో , ప్రాణదేవుడినో సాక్షాత్కరించుకొని సంగతేమో అడుగుదామా అనిపించినది . ఆ ఆలోచన రాగానే నవ్వి , ’ దేవతలంటే ఏమి , దూడను కట్టివేయు గూటములా ? చీటికి మాటికీ వారిని అడుగుట అయితే , మనము ప్రత్యేకులము అనుకొనుట దేనికి ? వారికి సమర్పణ చేసుకొనుట అయినది కదా , సర్వగతులైన వారు తమ వస్తువులను కాపాడుకొనుటను బాగా తెలిసినవారు . కాబట్టి నేనేమీ అడగను " అని నిశ్చయించుకున్నాడు . 

        ఆచార్యుల వద్దకు వెళ్ళి ఈ మనో జాడ్యమును పరిహరించుకుందామా అంటే వారు కాశీ నుండీ ఇంకా తిరిగి రాలేదు . ఇక ఉన్న ఒకే గతి , ఆచార్యాణి . వారికి ఇప్పుడు  ఏ సమయమో ఏమో ? ఏమైనా సరే , అక్కడికే వెళ్ళెదను , వారికి సమయముంటే ఒక్క ఘడియ అక్కడే ఉండి , మనో జాడ్యమును వారి వాక్యగంగలో కడుగుకొన వచ్చును " అని బయలుదేరినాడు . 

        ఆచార్యాణి యందు యాజ్ఞవల్క్యునికి బహుళ గౌరవము . వారు స్త్రీ సృష్టిలో పరాకాష్ఠ అని అతడి భావన. వారు రూపములో అంతటి విశిష్టత ఉన్నవారు కాదు . అలాగని గౌర వర్ణపు వారి ముఖములో గానీ శరీరాంగములలో గానీ ఏ లోపమూ లేదు . కన్నుముక్కు మొదలైనవన్నీ చక్కగా ఉన్నాయి . అయితే , అతడికి గోచరమగుచుండినది వారి రూప సంపత్తు కాదు . గుణ సంపత్తు . వారు ఆచార్యులకు ధర్మ పత్ని మాత్రమే కాదు , మోక్ష పత్ని కూడా ! ధర్మ పత్నియై , అతిథి పూజనము , దేవయజనము మొదలైనవాటిలో సహధర్మచారిణి యైనట్లే , వారు తమ విరామ కాలములో కూర్చొని ఆతనికి సమానముగా విచారములు చేయువారు . కావాలన్నప్పుడు ఆతనితోపాటు కావలసినంత సేపు సమాధిలో కూడా కూర్చోగలరు . యాజ్ఞవల్క్యుని దృష్టిలో ఆశ్రమపు నిర్వహణ ఆచార్యులకన్నా ఆచార్యాణికే ఎక్కువ అలవడింది. తనకు , పత్ని కాబోయే కాత్యాయని కూడా వీరి వలెనే అయితే ! అని ఒక కోరిక. వెంటనే సమాధానము కూడా . తాను మెచ్చినది రంభ, తాను మునిగినది గంగ అన్నట్లు , తనకు దొరికినదే తనకు పంచామృతము ! అని . మొత్తానికి ఆశ్రమములో ఎక్కడెక్కడ ఎంతెంత తిరిగి చూచినా వారి చేతి పనితనము కనిపిస్తుంది . వారి వద్దకు వెళ్ళి కూచుంటే గంగా సాగరపు ఒడ్డుకు వెళ్ళి కూర్చున్నట్లే ఒక పవిత్రమైన ప్రశాంత భావన. 

       ఆలాపినికి కూడా అంతే ! యాజ్ఞవల్క్యునిపై ఒక విచిత్రమైన వాత్సల్యము . మాతృ వాత్సల్యము వలెనే దృఢమైననూ , కొడుకన్న కోరికతో చూచియే తీరవలెనన్న చపలము లేదు . ఒక్కోసారి అతడిని ఒక వారము వరకూ చూడకుండానే ఉంటుంది . అప్పుడామెకు వాడు గుర్తే రాడు . ఆమె తానుగా వెళ్ళి వాడిని చూచుట అనునది లేనేలేదు . వాడే వస్తే , తనకు ఎంత పని ఉన్నా అన్నీ వదలి వాడితో కూర్చొని మాట్లాడతారు . ఆమె మాట , చేతలూ అన్నీ కర్మ బ్రహ్మ విచారములను వదలి ఇంకో వైపుకు తిరగవు . ఇద్దరికీ పరము పైన ఉన్న కాంక్ష ఇహము పైన అంతగా లేదు . 

        యాజ్ఞవల్క్యుడు వచ్చు వేళకు ఆలాపిని బట్టలను ఆరవేసి , దాని వలన కలిగిన కొంచము ఆయాసముతో కొద్దిపాటి విశ్రాంతి తీసుకొని , ఒక విరామాసనములో ఆనుకొని సౌకర్యముగా కూర్చున్నారు . మనసు తాత్కాలిక విషయము వైపుకు తిరిగి , ’ చూచితివా ? ఈ దేహము ఇంత దృఢముగా నున్నా ,ఈ  కొంచము బడలికను సహించలేదు . ఈ క్షర పురుషుని స్వరూపమే ఇదియేమో ? కావాలన్నపుడు ఎంత ఆయాసమైనా సహించి కార్యపరులై తిరుగుచున్ననూ , దేహమునకు ఆయాసము మాత్రము తప్పదు కదా ? ఇదేనేమో మృత్యువంటే ? సరే , దీనిని దాటుట ఎట్లు ? ఈ క్షరము ఎప్పటికైనా మృత్యువు పాలే కదా ! బహుశః సర్వజ్ఞత్వము నైనా సాధించ వచ్చునేమో గానీ మరణ రాహిత్యమును సంపాదించుటకు వీలు కాదేమో . ఈ దేహము పుట్టినపుడే మృత్యువుకు నోటి ముద్దగా పుట్టియున్నపుడు , అమరత్వమన్నది ఎలా సాధ్యము ? యుగాంతరముల వరకూ ఉన్ననూ , చిరంజీవి యైననూ చివరికి నామ రూపములను వదలి తీరవలెను కదా ! " అని ఆమెకు ఏవేవో ఆలోచనలు . 

        యాజ్ఞవల్క్యుడు వచ్చి ప్రణామము చేసి వాకిట నిలుచున్నాడు . ఆలాపిని వాడిని చూసి పొంగివచ్చు హర్షముతో ," రావలెను , మహర్షులగు వారు దయచేయవలెను " అని ఒక కృష్ణాజినమును చూపించి , తాను లేచి కూర్చున్నది . యాజ్ఞవల్క్యుడు ఆ స్తుతిని గ్రహిస్తూ , " ఈ ఆశీర్వాదముల చేత నేను మహర్షిని కాకపోతే దానికి కారణము నా దోషమనే భావించ వలెను " అని వినయ ప్రసన్నముగా పలుకుతూ వచ్చి ఆసనములో కూర్చున్నాడు . 

        " యాజ్ఞ వల్క్యా , రాబోవు తరాలలో కాశీ , మద్ర , కురు పాంచాల మిథిలా నగరములకెల్లా కర్మ బ్రహ్మ విద్వాంసుడంటే నువ్వొక్కడవే అవుతావు . అంతటి శుభ దినమును చూడవలెనని నాకు ఎంతో ఆశ ! . అయితే , దానితో పాటు , అంటే ,  పరా , అపరా విద్యలతో పాటు లౌకిక విద్యలను చేర్చుకొని నువ్వు సర్వజ్ఞుడ వెందుకు కారాదు ? అని ఒక ప్రశ్న ! " 

       యాజ్ఞవల్క్యుడు ఆశ్చర్యపోయినాడు . " తల్లీ ! మీరేమి పర చిత్త దర్శకులా ? ఈ మధ్యాహ్నము గౌతముల ఇంటి నుండీ నా గుడిసెకు వెళ్ళునపుడు ఈ సర్వజ్ఞ బీజపు విచారము వచ్చినది , నిజము . అయితే , నేను దానిని పట్టి ముందుకు పోయి ఆలోచించలేదు . ఇప్పుడు తమరు కూడా అదే విషయమే చెపుతున్నారే ? " అన్నాడు . 

        ఆచార్యాణి అన్నది , " చూడు యాజ్ఞవల్క్యా , నువ్వు వచ్చుటకు ముందు , ఆయాసము పొందిన దేహము చిరంజీవి యగుట , లేదా దేహపు యోచనయే లేక సర్వజ్ఞుడగుట యను రెండు యోచనలూ వచ్చినాయి . నాశనము పొందు దేహమును అమరము చేయుటకన్నా , సర్వజ్ఞత్వమును సాధించుటయే సులభమేమో ? అని ఆలోచిస్తున్నాను . నీకు సమ్మతమైతే దాని గురించే మాట్లాడదాము . నీ అభిప్రాయమేమి ? "

         యాజ్ఞవల్క్యుడు ఒప్పుకున్నాడు . " నేను మాట్లాడితే , ఆ శాస్త్రము ఇలా అంటుంది , ఈ శాస్త్రము అలా అంటుంది అని శాస్త్ర వచనములను పలుకుతూ వాటి ముసుగులో నా అభిప్రాయములను చెప్పవలెను . తమరయితే , శాస్త్ర వాక్కులను సూత్రములకు భాష్యము వ్రాసినట్లు , ప్రవచనము చెప్పునట్లు చిత్ర విచిత్రముగా విషయమును చెప్పగలరు . తమరి వాక్యసుధను శ్రవణము చేస్తే నాకు కలుగు ఆనందము అంతా ఇంతా కాదు . " 

         ఆ స్తుతి వలన ఆచార్యాణి తృప్తి పడి అన్నది , " చూడు యాజ్ఞవల్క్యా , నిధిని కాపాడుతూ చుట్టుకొని యున్న ఘట సర్పమునకు బంగారు వర్ణము వస్తుందట ! అలాగే శాస్త్ర నిధిపుడైన వాడికి వాక్సౌందర్యము లభిస్తే ఆశ్చర్యమేమి ? మొదట శాస్త్రములను కరగతములుగా చేసుకొనుట ఎలాగ అన్నది చెప్పి , తరువాత సర్వజ్ఞత్వమును గురించి చెబుతాను , విను . 

        ఒక్కొక్క శాస్త్రానికీ , సూత్రము , అభ్యాసము అని రెండు క్రమములున్నవి . సంగీతమునే తీసుకో ! నువ్వు దానిలో పండితుడవు కాబట్టి దానిని తీసుకుందాము . అన్ని రాగములూ సప్త స్వరములలోనే ఇమిడియున్నాయి . అలాగని అన్ని రాగములకూ సప్త స్వరములనే వాయిస్తుంటే అవుతుందా ? స్వరముల మృదు , తీవ్రతలను అర్థము చేసుకో వలెను . దానితో పాటు , ఏది అంశము , ఏది గ్రహము అన్నది తెలియవలెను . రాగ ప్రస్తారములో వాది , వివాది మొదలైనవాటిని ఎరిగియుండవలెను . అలాగే వర్జ్యావర్జ్యములు తెలిసి యుండవలెను . ఆయా రాగములలో అవరోహణ తానము ముఖ్యమా ? ఆరోహణ తానము ముఖ్యమా ? అనుదానిని అనుభవించి ఉండవలెను , కదా ? "

" ఔను "

         " అనగా నేమి ? సంగీతము కేవలము శాస్త్రపు కలగూర కాదు . దానిలో మాంత్రికుడు మామిడి టెంక నుండీ మొక్కను చేయునట్లే , అభ్యాస బలముతో జీవకళను నింపవలెను . అపుడే దాని ఆనందము . అలాగే , ప్రతి శాస్త్రమునందూ ఒక నిష్ఠ యున్నది . దానిని పాటించి కొనసాగవలెను . అప్పుడేమవుతుందో తెలుసా ?  శాస్త్రమనెడి అటకపైనున్న విషయము కరగతమై ఆనంద ప్రదమగును . దానికేమి చేయవలెను అంటావేమో ? అదీ విను . శిష్టాచార్యుల విషయము మొదట చెప్పి , మిగిలిన దానిని తరువాత చెప్పెదను . శిష్యుడు ఆచార్యుని నుండీ అనుష్ఠానమును నేర్చును . ఆచార్యుడు తాను చేపట్టిన అనుష్ఠానమును శిష్యునికి ఉపదేశించును . శిష్యుడు అనుష్ఠానము చేయును . ఇది అనుష్ఠాన తాదాత్మ్యత. 

         " అనుష్ఠానము వలన అనుభవము వచ్చును , ఆ అనుభవము ఆచార్యుడు పొందినదే కావలెను . శిష్యుడు ఆచార్యుడు పొందిన అనుభవమునే పొందవలెను . ఆచార్యుడు ’ స ’ అంటే శిష్యుడు ’ స ’ పలకవలెనే తప్ప ’ రి ’ కాకూడదు : లేదా , ’ ని ’ కాకూడదు . ’ స ’ అంటే  ’ స ’ మాత్రమే రావలెను . అది అనుభవపు తాదాత్మ్యత. 

         " అనంతరము ఆ అనుభవము సుఖముగా ఉందా , దుఃఖముగా ఉందా అనునది మూడవ ఘట్టము .  ఆ అనుభవము మొదట మొదట్లో సంగీతము నేర్చువారి పాట వలె శృతి కఠినమూ అయిఉండవచ్చు , దానిని మాలిమి చేసుకొని , కంఠమును వినుటకు ఇంపుగా చేసుకొని శృతి ప్రియమూ ఆనందమూ అగునట్లే , అనుష్ఠానము చేత పొందిన అనుభవము ఆనందమే యగునట్లు చేసుకోవలెను . అనగా , ఆచార్యుడు అనుభవించిన ఆనందము శిష్యునికీ లభించునట్లు కావలెను . అది ఆనంద తాదాత్మ్యత. 

         " చివరి ఘట్టము విచిత్రమైనది .  ఒకడు సంగీతమును పాడి ఆనంద పడితే ఇంకొకడు విని అదే ఆనందమును అనుభవించును . ఈ ఇద్దరి ఆనందమూ వేరే వేరేనా , ఒకటేనా ? అక్కడి ఆనంద స్వరూపమును వెదకి చూడవలెను . పాడి ఆనంద పడిన వాడొకడు . విని ఆనంద పడిన వాడొకడు . ఈ ఇద్దరి ఆనందమూ ఒకటేనా ? వేరే వేరేనా ? ఇది ప్రశ్న . దీనికి ఉత్తరమేమిటో తెలుసా ? ఆనందపు ప్రమాణములో తారతమ్యము ఉండవచ్చును . అయితే , ఆనంద స్వరూపములో భేదములు  లేవు . అలాగుంటే ఆనందములోనూ అనేక జాతులు ఏర్పడవలసి ఉంటుంది . అలాలేక , ఆనందము ఎక్కడెక్కడున్నా ఒకటే  అయి ఉన్నందు వలన , తెలిసినవారు దానిని అఖండము , ఏకరసము , అన్నారు . ఇది శాస్త్రపు కొన కావలెను . ఈ ఘట్టమును చేరుటకు అఖండైకరస తాదాత్మ్యము అని పేరు . ఇలాగే నాలుగు మెట్లలో శాస్త్రమును సాధించవలెను . దీనితో పాటు , నీకు తెలిసిన ఇంకొక మాట . " 

       యాజ్ఞవల్క్యుడు వారి మాటలు వింటూ వింటూ తల్లీనమై పరవశమై యున్నవాడు , ’ నీకు తెలిసిన ఇంకొక మాట ’ అనుటతో జాగృతుడైన వాడివలె , మరలా బహిర్ముఖమునకు వచ్చినాడు . ఆలాపిని ,  కళ్ళు మూసుకొని కూర్చున్నవాడు కళ్ళు తెరచి , తనవైపుకు చూస్తూ ’ అదేమిటి , అనుజ్ఞ ఇవ్వవలెను ’ అని ప్రార్థన  చేయు వైఖరి ని చూస్తూ ఒక ఘడియ అలాగే ఉంది . అనంతరము మరలా ఆరంభించినది . 

         " చూడు యాజ్ఞవల్క్యా , ఏదేమైననూ ఆచార్యుడు శిష్యుడికి కేవలము దిశా నిర్దేశకుడు మాత్రమే . కిశోర న్యాయము వలన  శిష్యుడిని అనుగ్రహించి శాస్త్ర బీజమును కరుణించును . అది ఒక పాదము మాత్రము . ఇంకొక పాదమును తన సహ పాఠులతో చర్చ చేసి తెలుసుకో వలెను . మిగిలిన సగమును తన స్వంత ప్రయత్నము చేత , చింతన , తపస్సులచేత సాధించవలెను . ఇక్కడ లౌకిక విద్యకూ వైదిక విద్యకూ వ్యత్యాసమేమీ లేదు . వైదిక విద్యలో బీజము తప్పక కావలెను . లౌకిక విద్యలో బీజము అవసరము లేకున్ననూ , ప్రయత్నము , అభ్యాసము , చింతన , తపస్సులు కావలెను . ప్రయత్నము , అభ్యాసము , చింతన , తపస్సులను తెలిసిన నువ్వు ,  వైదిక విద్యలోనైతే , అగ్ని దేవ , ప్రాణ దేవుల కృప వలన విచక్షుణుడవైనావు . ఈ వైచక్షణమును లౌకిక విద్యలలో కూడా పొందితే నువ్వు సర్వజ్ఞుడవే కావలెను . దానిలో విశేషమేమీ లేదు . "

        యాజ్ఞవల్క్యునికి వారి మాట పై పూర్ణమైన విశ్వాసము . 
" సర్వజ్ఞత్వము అంత సులభమా ...అలాగయితే అందరూ సర్వజ్ఞులెందుకు అగుట లేదు ? " అని నోరు తెరచి అడిగినాడు . ఆకాశానికి నిచ్చెన వేస్తే ఎవరు ఎక్కలేరు ? అన్నట్లే , ఇది వట్ఠి మాట యని  అతడి నమ్మకము , అని అతడి గొంతు చెపుతోంది . 

        ఆలాపిని నవ్వి అన్నది , " నీ గొంతే నీకు నమ్మకము లేదు అని చెపుతోంది . కానిమ్ము , నమ్మకము లేనివారికి నమ్మకము పుట్టించుటకే కదా , శాస్త్రమున్నది ? కానిమ్ము  , ఆ పని చేద్దాము . అయితే , ఒక సంగతి , యాజ్ఞవల్క్యా , ఆయుధముందని యుద్ధమునకు పోవుటకు అవుతుందా ? " 

       " లేదు , ఆయుధమును ప్రయోగించుటనూ , ఎదుటివాడు ప్రయోగించిన ఆయుధము నుండీ తప్పించుకొనుటనూ నేర్చితే ఆయుధము ఉపయోగమునకు వస్తుందే కానీ , కేవలము ఆయుధముందని యుద్ధమునకు పోవుటకు కాదు . " 

         " అలాగే శాస్త్రమున్నంత మాత్రాన , నమ్మకము లేని వారికి నమ్మకము పుట్టించుటకు సాధ్యము కాదు . పట్లు విడుపులు  తెలిసిన జమాజట్టి  మాత్రమే పైన పడుటకూ , పైన పడ్డ వాడిని తప్పించుకొనుటకూ శక్తుడగునట్లు , శాస్త్రమును సర్వాంగీణముగా తెలిసిన వాడు మాత్రమే ఇతరులకు నమ్మకమును పుట్టించ గలడు . శాస్త్రమును పట్టి నడచుట యంటే , గుడ్డివాడి వెనక పోవు గుడ్డి వాడి వలె కాకూడదు . శాస్త్రపు గుడ్డితనము తన తపస్సుచేత మాత్రమే పోతుంది అనుదానిని మరువరాదు . ప్రతి శాస్త్రమూ విష్ణు పదమునకు తీసుకొని పోవును అను ఆస్తికత తో వెడలి , విష్ణు పదమును చేరి , వెనుకకు తిరిగి వచ్చినవాడు చెప్పు శాస్త్రము వేరే , అలా కాక , శాస్త్రపు పంక్తులను వల్లెవేసి చెప్పు శాస్త్రము వేరే , ఔనా ? "

" ఔను "

" అలాగే ముందుకు వెళ్ళి,  ఈ రీతులు వేరు వేరుగా ఉండుటకు కారణమేమో ఆలోచించు . " 

" ఒకటి అంతర్ముఖము ( అనుభవము ) , ఇంకొకటి బహిర్ముఖము ( అధ్యయనము )  ." 

         " ఆ మాటను భద్రంగా పట్టుకో . ఇలాగ అంతర్ముఖుడగుట చేతనైన వాడికి సర్వజ్ఞత్వము ఏమి గొప్ప ? నీకు ఉపనయనములో ఉపదేశము చేసిన మంత్రపు అర్థమేమిటి ?  మా వృత్తిని ప్రేరేపించు దేవుడి తేజస్సును ధ్యానించెదము అని కదా ? అంటే ఏమి ? వెనక్కు తిరిగి చూచుటను నేర్చుకో అని కదా ? దానిని ఇంకొంచము దూరము ఎందుకు లాగి చూడకూడదు ? పండును చూచి చెట్టును ఊహించి , చెట్టును చూచి బీజమును ఊహించి తెలుసుకొన్నట్లే , తన చేతిలో నున్న పండులోని బీజమూ , ఆ పండును మాత్రమే  కాక  చెట్టునే తనలో ఉంచుకొన్న బీజమూ ఒకటే యంటే తప్పుకాదు కదా ? " 

" ఔను , తప్పు కాదు " 

      " అలాగే , ఈ ప్రపంచములోనున్న తానూ , ఈ ప్రపంచమునకు కారణమైయున్న వాడూ ఒకరే అయి ఉండ వలెనంటే తప్పు లేదు కదా ? " 

         యాజ్ఞ వల్క్యుడు గంభీరముగా అన్నాడు , " ఇక్కడ నాకు అర్థము కాలేదు , తల్లీ ! . ప్రపంచములోనున్న నేను చిన్నవాడిని . నాకన్నా ప్రపంచము ఎంతో పెద్దది . దానిని పుట్టించినవాడు దానికన్నా పెద్దవాడు . పురుష సూక్తములో " పాదోస్య విశ్వా భూతాని త్రిపాదస్య అమృతం దివి ’ సృష్టికి వచ్చినదంతా ఒక పాదమైతే , సృష్టికి రాకుండా ఉన్నది దీనికి  మూడు పాదాలంత అమృతమై ద్యులోకములో కూర్చున్నది ’ అని ఉన్నది , ఇలాగైతే , అది నేనే అనుటెట్లు ? "

Sunday, February 17, 2013

36. " మహా దర్శనము " --ముప్పై ఆరవ భాగము --పూర్ణపు గుర్తు వైరాగ్యము


36. ముప్పై ఆరవ భాగము--  పూర్ణపు గుర్తు వైరాగ్యము 


         కులపతులైన ఉద్ధాలకులు ఏదో యాగమునకని కాశీ పట్టణమునకు వెళ్ళినారు . ఆశ్రమమంతా వారి పత్ని ఆలాపిని ఆధీనములో ఉండినది . ఆయా శాఖలలో జరిగినదంతా  వృద్ధ శిష్యులు వచ్చి ఆమెకు నివేదిక నిచ్చేవారు . యాజ్ఞవల్క్యుడు అవకాశము కలిగినపుడు పాఠములు జరుగుతున్నపుడు ఆయా వర్గములకు వెళ్ళి అక్కడ ఉండి , వచ్చేవాడు . కులపతులుంటే   వారి దగ్గర , లేకుంటే వారి పత్ని దగ్గర ఏదో ఒక విషయము చర్చిస్తూ ఉండేవాడు . అయితే అతడికి అవకాశము బహు తక్కువ. పొద్దుటినుండీ సాయంత్రము వరకూ చాలా మట్టుకు జపములోనే గడిపేవాడు . 

        ఆలాపిని మాత వచ్చి వేత్రాసనములో కూర్చున్నారు . యాజ్ఞవల్క్యుడు సమీపములోనే నేలపై దర్భాసనములో వినయముగా కూర్చున్నాడు . ఆలాపిని మాత అంటున్నారు ,

          " వారు చెప్పినది నిజము , యాజ్ఞవల్క్యా , బ్రహ్మ విద్య తనకు తానే రావలెను . స్వప్రయత్నము చేత మిగిలిన విద్యలన్నీ సాధించవచ్చు , అయితే బ్రహ్మవిద్య అటుల కాదు . పండిపోవలెను . అంటే , కాయ బలిసి ఉండవలెను . చెట్టుపైనే పండితే దాని రుచి చెప్పనవసరము లేదు . లేకున్నా , వాడవేయుటకైనా ( కృత్రిమముగా పండునట్లు చేయుట ) కాయ బలిసియే ఉండవలెను కదా ? అలాగే బ్రహ్మ విద్య కూడా . ప్రాచీనము ( పూర్వ ఫలము ) పక్వము కాకపోతే గురువు దొరకడు . గురువు దొరకని వారికి బ్రహ్మవిద్య లభించదు . "

యాజ్ఞవల్క్యుడు చేతులు జోడించి , నవ్వు ముఖముతో అడిగినాడు , " అది సరే , మరి , గురువు దొరికి కూడా కాదన్న మా వంటి వారి గతి యేమిటి ? "

        " నీదొక విచిత్రము లే , నువ్వొక విలక్షణ ప్రాణివి . నీకు మానవ గురువులు లేరని , దేవతా గురువులు కలుగు యోగము వచ్చినది . వైశంపాయనులు నిన్ను పంపించి వేసినా , నీకేమి తక్కువయినది ? మీ తండ్రి నీకు స్వశాఖను అధ్యయనము చేయించినారు . బుడిలులు నీకు ఋగ్వేదమును పునశ్చరణము చేయించినారు . వీరు నీకు సామమును పునశ్చరణ చేయించినారు . ఇప్పుడు నీకు అగ్ని దేవుడు , ప్రాణ దేవులు ప్రసన్నమైనారు . ఆదిత్యదేవుడిని గురించి తపస్సు చేస్తున్నావు ! ఆదిత్యుడిని ప్రసన్నుడిని చేసుకుంటే ఇక నిన్ను పట్టేవారుండరు . అదలా ఉండనీ , బ్రహ్మ విద్య సంగతి చెబుతుంటిని , దానిని కొనసాగించనా , నిలిపివేయనా ? "

" దయ చేసి కొనసాగించండి " 

         " మీరు శాంతి మంత్రములలో చెప్పుతుంటారు చూడు , ’ ఆ అంగములన్నీ ఆప్యాయనమును పొందనీ ’ అని , అది నిజము . దేహపు అంగములన్నీ తృప్తితో నిండి , సంతోషపడి , దారిని వదలు వరకూ బ్రహ్మవిద్య లభ్యము కాదు , ఎందుకో తెలుసా ? అంగాంగమూ ఒక్కొక్క దేవతా స్థానము . ఏ అంగము తృప్తి తో నిండి యుండదో , అక్కడ తద్విషయకమైన కోరిక నిలచి , అంతమేరకు వైరాగ్యము కొరతయగును . వైరాగ్యమంటే , ’ వద్దని వదలుట కాదు , ఇక చాలని విముఖమగుట ’ కాబట్టి , ఎద్దు బ్రహ్మచర్యమును పాటించినది యన్నట్లు , చేప నీటిలో ఉండి తపస్సు చేసిందన్నట్లు , మృగములు అడవిలో ఉన్నాయి యన్నట్లు , విధిలేక , వేరు దారి లేక చేసినది వైరాగ్యము కాదు . మనము విధి విధించినదాని పరముగా చూచుట అగత్యము , యాజ్ఞవల్క్యా ! అప్పుడు వైరాగ్యము నిషేధము వలన వచ్చునది కాదు , పూర్ణత కోసము , అపూర్ణ మానవుడు పూర్ణుడగుట యొక్క గుర్తుగా వచ్చునది . అలాగయితేనే మార్పు అన్నది తెలిసేది . "

       " ఔను , నిజమే , ఒప్పుకుంటాను . వైరాగ్యము పూర్ణము యొక్క చిహ్నముగా , పూర్ణమువైపు నడిపించు సాధనము కావలెను . సరే , అప్పుడేమవుతుంది , అమ్మా ? "

       " నేను కూడా నీలాగే మనిషిని . నన్నడిగితే నేనెంతవరకూ చెప్పగలను ? కాబట్టి భువన ప్రాణుడైన మాతరిశ్వుడిని అడుగు . అతడయితే సరిగా చెప్పగలడు . " 

" మీ అనుజ్ఞ , ఇక్కడే అడగమనా ? ఏకాంతములో అడగమనా ? " 

        " ఇది మరీ బాగున్నది . అంతటా నిండి  ఉన్న ఆ పూర్ణ పురుషుని అనుసంధానము చేసిన తరువాత ,అంతటా ఏకాంతమే కాదా ? అతడే కదా , లోపలా బయటా ఉండేవాడు ? ఆతడే సర్వమునూ వ్యాపించి యున్నవాడు . కాలమో ? అంటావేమో . అదికూడా అతడినే అడిగితే సరి . " 

" తమరు చెప్పునది సరియైనదే . ఇప్పుడే ఇక్కడే అతడిని అనుసంధానము చేయుదును " 

         యాజ్ఞ వల్క్యుడు అలాగే పద్మాసనములో కూర్చొని , కన్నులు మూసుకొని , ప్రాణ దేవుడిని అనుసంధానము చేసినాడు . ఆతడు దర్శనమిచ్చి , " దేవి వారు చెప్పినది సరియైనది . అంగాంగములూ నా వలన పుట్టిన దేవతల స్థానములు . కాబట్టి అంగాంగములు తృప్తిచెందు వరకూ వాటి కోరికలు తృప్తి పొందవు . హఠము చేసి దేవతలను లొంగదీసుకోవచ్చు.  అప్పుడు వారి ప్రసాదము దొరకదు . చెట్టుకొమ్మ స్వేఛ్చగా పెరిగి ఇవ్వవలసిన ఫలమును , చెట్టుకొమ్మను కొట్టేస్తే దొరుకుతుందా ? హఠము చేసినవాడు విఫలుడౌతాడు . కాబట్టి అంగాంగములూ ప్రసన్నము కావలెను . అవన్నీ ప్రసన్నమైనాక నేను కూడా ప్రసన్నమవుతాను . అప్పుడు బలిసిన బీజము పండును కోరకయే స్వతంత్రమగునట్లు , జీవుడు తృప్తుడై తన జీవత్వము దైవత్వమై , దైవత్వము బ్రహ్మత్వమగుటను ఆత్రముగా నిరీక్షించును.  . జీవత్వము చిన్నది . దైవత్వము దానికన్నా పెద్దది . బ్రహ్మత్వము  అంటే పూర్ణత్వము . అలాగ , అల్పమై , అపూర్ణమై ఉండినది , పూర్ణత్వమును -తనదైన పూర్ణత్వమును పొందుటకు సిద్ధమైనదాని గుర్తే వైరాగ్యము . " 

" సరే , తెలిసింది "

         " ఆ వైరాగ్యము మనసుకు రావలెనంటే దేహములోని దేవతలందరూ అనుగ్రహించ వలెనని రహస్యము . అప్పుడు మనసు అది కావలెను , ఇది కావలెను అని బయటి వస్తువును అపేక్షించు కామనలు లేకుండా పోతాయి . అంటే , వంద మనోరథములతో నిండియున్న మనస్సు , వందలకొద్దీ ఆశలతో కూడిన మనస్సు , ఆశను తన అపూర్ణత యొక్క గుర్తు అని తెలుసుకొని దానిని వదలుట. అప్పుడేమగునో తెలుసా ? ఇంద్రియముల ఉద్దీపనము లేకుండా పోతుంది . ఇంద్రియములకు శక్తి లేక , అవి దుర్బలమై ఉండిపోవును . మనసులో కామనలు బలముగా ఉన్నంతవరకూ ఇంద్రియములు బలముగా ఉంటాయి . కాబట్టి , దుర్బలములైన ఇంద్రియములు , ఓడిపోయి సారథి వశమైన గుర్రముల వలె , చెప్పినట్లు వింటాయి .  ఇదంతా కావలెనంటే పూజ్య వైవస్వతుడికి నచికేతుడు విజ్ఞాపన చేసినట్లు , భోగ భోగమూ ఇంద్రియముల తేజస్సును అపహరించును అనునది తెలుసుకోవలెను . తేజస్సులేని ఇంద్రియములు భోగములను అనుభవించలేవు . భోగమును పొందుట అంటే సంతకు వెళ్ళి వెల ఇచ్చి వస్తువును తెచ్చినట్లే అన్నది మనసుకు అర్థము కావలెను . అప్పుడు మనసు లోకపు వైఫల్యమును చూచి వెనుతిరుగును . అలాగ వెనుతిరుగుట వైరాగ్యము . అర్థమైనదా ? " 

" అర్థమైనది , దేవా. అలాగైతే , మనుష్యుడు భోగములను కోరునది తనకోసమా ?  ఇంకొకరికి కాదా ? "

        " కాదు , కానేకాదు . ఖచ్చితముగా కాదు . మనసు అపరితుష్టమైన దాని గుర్తే భోగాసక్తి . మొదట మనసులో ఆసక్తి పుట్టును . అప్పుడు , ఆ ఆసక్తిని గుర్తించలేని  వాడు ,  అది పెరిగి ఎదురుగా ఉన్న వస్తువు పైన మోహముగా పరిణమించి , అది కాంక్షగా మారినపుడు  , తనను ఆ కాంక్షకు క్షేత్రముగా భావించుకొనును . కాబట్టి , యాజ్ఞవల్క్యా , ఒకసారి నీకు ఉపనయనములో చెప్పిందేమిటో గుర్తు తెచ్చుకో . ధియో యోనః ప్రచోదయాత్ , మన వృత్తులను , బుద్ధులను ప్రచోదనము చేయువారెవరు ? దానిని మొదట చూడవలెను . "

" సరే , ఒక మాట అడుగవచ్చునా ? " 

" అడుగు , అయితే , ఆ మాటను అడగమన్నది ఎవరు ? మొదట అది చూడు . " 

" ఔను , ఒక తేజస్సు మనసును ప్రేరేపించును . అప్పుడు మనసులో ,  తూము వదలితే మరవ పారి వెడలెడు నీటి వలె ,  వృత్తి పారును . " 


         " చక్కగా చెప్పినావు . మనసు అని దేనిని పిలుస్తారో , అదికూడా నాయొక్క భాగమే ! వస్తు వస్తువు నందూ నిలచి , ఒక్కొక్క ప్రత్యేకమైన భావన ఏది ఉందో , అదే మనసు . ప్రత్యేకమన్న తర్వాత , దానికీ దీనికీ ( వస్తువుకూ భావనకూ )  ఒక సంబంధమును కల్పించవలెను కదా ?  ఆ కల్పనకు సాధనమైనది మనసు . సంబంధము ఏర్పడిన తరువాత ఆ సంబంధము సుఖము కావచ్చును , దుఃఖము కావచ్చును . ఈ సుఖదుఃఖాలు మనసుయొక్క ఇఛ్చాద్వేషములను అవలంబించినవి . సంబంధము ఏర్పడినప్పుడు అనుభవము మాత్రము వచ్చును . ఇప్పుడు చెప్పు, నీ సుఖదుఃఖములు , లేదా , నువ్వు సుఖ దుఃఖములు అనునవి నిజమైనవా ? " 

         యాజ్ఞవల్క్యుడు పరిభావించి చూచినాడు . " ఔను , మనసు అనునది ఇంద్రియ ధర్మములనన్నిటినీ కలిగియున్ననూ , దానిని ఇంద్రియము అనుటకు వీలులేని ఏదో ఒక విలక్షణ వస్తువు . ప్రాణపు బలము చేత తనకొక ప్రత్యేకతను సంపాదించుకున్ననూ , నిజానికది ప్రాణముయొక్క ఒక అంగము . అది సుఖ దుఃఖములను ఇంద్రియ మూలకముగా పొందిననూ , అనుభవము దానిని చేరు వరకూ సుఖమూ కాదు , దుఃఖమూ కాదు . మనసులోనున్న ఇఛ్చా ద్వేషములు ఆ అనుభవములపైన , తమకు తోచినట్లు సుఖ దుఃఖపు ముద్ర వేస్తాయి . ఇదంతటినీ పరిభావించి చూచినాడు . అక్కడ ఒక అంశము అతనికి తెలియలేదు , అడిగినాడు, .

" దేవా , అక్కడ నల్లగా , సంచీ వలె నున్నదే , అది ఏమిటి ? "

" బాగా అడిగినావు యాజ్ఞవల్క్యా , అలాగే చూస్తూ ఉండు , అదేమిటన్నది తెలుస్తుంది . "

         యాజ్ఞవల్క్యుడు కళ్ళకే కన్నుగా మారి చూచినాడు . ఏదో ఒక తేజస్సు మనసుపై ప్రకాశిస్తోంది . అప్పుడు ఆ సంచీ వలెనున్న వస్తువు నోరు తెరచింది . దానినుండీ ఏదో ఒక ప్రవాహము వలె వెడలి , మనసు నుండీ ఇంద్రియముల మూలముగా ప్రకటమైనది . 

         ప్రాణదేవుడన్నాడు , " చూడు , అదే కర్మ బీజపు గ్రంధి. వెనుక నిలచి వెలగిన తేజస్సు ఆదిత్య దేవుడిది . ఆతని తేజస్సు ఎండగా నేలపై పడినపుడు , నీటి సహాయముంటే , భూమిలోని బీజములన్నీ మొలకెత్తి పైకి వచ్చునట్లు , ఆతని తేజస్సు మనసుపైన పడగానే మనసు లోనున్న కర్మబీజ గ్రంధి నుండీ కర్మ వాసన వెడలి ఇంద్రియ మూలకముగా వ్యాపించి , లోకములో ప్రకటమై ఫలాఫలములను ప్రతీక్షించును . ఫలము ఎక్కువైనచో జయమంటారు . అఫలము హెచ్చయితే అపజయమంటారు . కాబట్టి , జయమైనా , అపజయమైనా అది ఎదుటివారి మాట. అదే సుఖ దుఃఖాలను ప్రకటముగా ప్రతిబింబించేది . లోపలి సుఖ దుఃఖాలకే అస్తిత్వము లేనపుడు , బయటి జయాపజయములకు అస్తిత్వము ఉంటుందా ?  చెప్పు . " 

        యాజ్ఞవల్క్యునికి ఆశ్చర్యమైనది . అయినా , కనబడుతున్నదానిని లేదనుటెలా ? అన్నాడు , " లేదు దేవా, లేదు . అవి వృత్తి యొక్క ఫలములు . వృత్తి ఆదిత్యునిది . వృత్తి ప్రకటమగు మనసు నీది . వృత్తి యొక్క  ఫలాఫలములను సుఖ దుఃఖములుగా అనుభవించు ఇంద్రియముల గూడైన దేహము అగ్నిది . " 

ప్రాణదేవుడు నవ్వినాడు , " ఈ చివరి మాట ఎవరన్నారో చూడు . " 

        యాజ్ఞవల్క్యుడు చూచినాడు , ;" ఔను , ఆ వాక్యపు కర్త తానుకాదు . వెదకి చూచినాడు . కుడిపక్క ఎవ్వరో నవ్వినట్లైంది . చూడగా , అగ్ని దేవుడు . అతనికి నమస్కారము చేసి , ప్రాణదేవుడికి నివేదించినాడు , " ఔను దేవా, ఆ మాట యొక్క కర్త నేను కాదు , అగ్ని దేవుడు " 

      " సరే , చూచితివా ? దేవతలు తమ స్వరూపములను ప్రకటము చేయకుండానే నీతో కావలసినది పలికించగలరు . అలాగే , కావలసినది చేయించనూ గలరు . ఇప్పుడు చెప్పు , ఇలాగ పరోక్షముగా ఉండి , బొంగరమును ఆడించునట్లు మిమ్మల్ని ఆడించు దేవతలు ప్రసన్నులు కాకుంటే నీకు వైరాగ్యము ఎలా వస్తుంది ? " 

" సరే " 

       " కాబట్టి , దేవీ మాత చెప్పినది సరియైనది . వైరాగ్యము వచ్చుటకు దేవతా ప్రసాదము కారణమగునట్లే , బ్రహ్మ విద్య కలిగితే అంగాంగములు , అంగాంగములలోనున్న దేవతలు ప్రసన్నులవుతారు . ఎందుకనగా  , దానివలన వారికి అమృతాభిషేకము అయినంత తృప్తి కలుగును. "

        ఆలాపినీ దేవి లేచి నిలుచున్నారు . యాజ్ఞవల్క్య , ప్రాణ దేవుల సంభాషణము వారికి వినిపిస్తుండినది ఒక ఆశ్చర్యము !.  అలాగ ప్రాణదేవుడు సాక్షాత్తుగా సంభాషిస్తున్న దానిని విన్నపుడు  వారు  లేవకుండా ఎలా ఉండగలరు ? 

35. " మహాదర్శనము " --ముప్పై ఐదవ భాగము --కొత్తదనము


35.ముప్పై ఐదవ భాగము --  కొత్తదనము


యాజ్ఞవల్క్యుడు ఇప్పుడు ఉద్ధాలకుల దగ్గర ఉంటున్నాడు . 

         ఉద్ధాలకులు , " ఎంతైనా నువ్వు అన్య శిష్యుడవు . కాబట్టి నేను నీకు బోధించుట విహితము కాదు . దానికోసము ఒక పని చేయి . నువ్వు , నీకు అర్థము కాని ఏ విషయము నైననూ తీసుకొని రా. దానిని మనము మన బుద్ధికి అనుసారముగా , శాస్త్రానుసారముగా విచారము చేయుదము . " అన్నారు .

        యాజ్ఞవల్క్యుడు అన్నాడు , " మీరు చెప్పినది శాస్త్ర సమ్మతమైనది . దానిలో సందేహమేమీ లేదు , అయితే , తమరు చెప్పినట్లు చేస్తే , సమానులైన అంతేవాసులలో ( సహ పాఠులైన శిష్యులలో ) దొరకునంత విద్య దొరకుతుందే తప్ప , గురువుల నుండీ దొరకు సంప్రదాయ శుద్ధమైన బీజవిద్య దొరకదు కదా , దానికేమి చేయుట ? " 

         ఉద్ధాలకులు తలయూపినారు : " నిజము , దానికి ఇలాగ చేయి , సంప్రదాయమును గురుముఖముగా అర్థము చేసుకొనుట ఒక విధము . అలా కాక , సమానులనుండీ , తనకన్న గొప్పవారినుండీ నేర్చుకున్న దానిని దేవతలకు అర్పించి ,  వారినుండీ ఆమోద ముద్ర ఒత్తించుకొనుట ఇంకొక విధము . ఇప్పుడు నా శంక మొదటిది సాధ్యము కాదని. అది పోనీలే , రెండవ దానిని చేయి . నాదగ్గర విచార వినిమయము వలన పొందిన దానినంతా దేవతా ముద్ర ఒత్తించుకొని సంప్రదాయ శుద్ధముగా చేసుకో . ఇలాగే , వెనుక ఒక మన్వంతరములో వేదములన్నీ ఖిలములై పోయినాయి . వాటిని సప్తఋషులు తపస్సు చేత మరలా సంపాదించినారు . నువ్వు కూడా అలాగే చేయి . నువ్వు అప్పుడే ప్రాణ దేవుడినీ , అగ్ని దేవుడినీ ఒద్దిక చేసుకొని మెప్పించినావు . ఇక మిగిలినది ఆదిత్యుడొక్కడే .! వాడిని అనుసంధానము చేయి . అతడు ప్రత్యక్ష దేవుడు . చాలా త్వరగా మచ్చిక అగును . అతనిని మెప్పించుకో . వాడి ముద్ర పడితే , అచేతనము కూడా చేతనమగును . "

" ఔను "

" అలాగంటే , నీకు అనుభవసిద్ధమైనదా , ఈ మాట ? "

" ఔను " 

" ఎలాగ ? " 

         " నేను ఈ ఆశ్రమమునకు వచ్చుటకు రెండు దినముల ముందర మా పెరటి తోటలో ఒక ఉసిరి చెట్టు ఉన్నట్టుండి ఎండిపోయినది . మా అమ్మ , చెట్టు బుడములో చెదలు పట్టినాయేమోనని మనుషులను పెట్టి తవ్వించి చూచినది . చెదలు కనిపించలేదు . మా తండ్రి గారు అటు వచ్చి , ’ ఈ చెట్టు ఎండిపోయినది ఎందుకో తెలియదు , ఎవరైనా మంత్ర సిద్ధులుంటే దీనిని పునరుజ్జీవనము చేయవచ్చు . " అన్నారు . మా అమ్మ ,  ’ అదెలా ? ’ అన్నారు . వారు , " అభ్యూహన మంత్రములు అని ఉన్నాయి . ఆ మంత్రములు తెలిసినవారు పఠించి , నీటిని అభిమంత్రించి ప్రోక్షిస్తే ఇది మరలా చిగురించును " అన్నారు . పక్కనే ఉన్న నేను అది విన్నాను . ఆ రాత్రి యజ్ఞేశ్వరుని అనుసంధానము చేసి , తండ్రిగారి మాటలను చెప్పినాను . ఆతడు నవ్వి , ’ ఏమిటి , మహర్షులకు అచేతనమును చైతన్య పరచు పిచ్చి పట్టుకుందా ? అని , ’ అది కూడా న్యాయమే , ఇవన్నీ క్షుద్ర సిద్ధులు . అయినా వీటిని పొందితేనే కదా , మనసుకు తాను వెళుతున్న దారి సరైనదా కాదా అని సమాధానము దొరికేది ? కానిమ్ము , నేను చెప్పితినని ప్రాణదేవుడిని ప్రార్థించు . అతడు తరువాత విషయము తెలుపును . ’ అని అనుజ్ఞ ఇచ్చి అంతర్ధానమాయెను . "

         ఉద్ధాలకులు , అగ్ని దేవుడు యాజ్ఞవల్క్యుడిని ’ మహర్షి ’ యని సంబోధించినాడు అని విన్నవెంటనే జాగృతులైనారు . కానీ మధ్యలో మాట్లాడుట సరికాదని ఊరకే ఉన్నారు . ఇప్పుడు మాట ఒక ఘట్టమునకు వచ్చినట్లై , దానిని అడుగవలెనని అనిపించినది . అయినా , అది అంత ప్రధానమైన మాట కాదు అని , దానిని వదలి , ఆడుతున్న మాటనే కొనసాగించినారు , " ఆ పిమ్మట? "

         అయితే మాటలో మొదటికన్నా గౌరవము ఎక్కువ కనపడుతున్నది . అప్పుడు , నోటిమాటగా ’ సమానులు ’ అన్నవారు , ఇప్పుడు కార్యతః దానిని ఒప్పుకున్నవారి వలె మాట్లాడినారు . 

          యాజ్ఞవల్క్యుడు అన్నాడు , " అనంతరము యజ్ఞేశ్వరుడి ఆజ్ఞ ప్రకారము ప్రాణదేవుడిని అనుసంధానము చేసినాను . ప్రాణదేవుడు దర్శనమిచ్చి , " నువ్వు యజ్ఞేశ్వరుని దయ వలన మహర్షియైనావు . నువ్వు అడిగినది ఇచ్చుటకు దేవతలు సిద్ధముగా ఉన్నారు . అలాగని చెప్పి , తోచిన ప్రతియొకటీ కోరవద్దు . ఇప్పటి మాట గురించి చెబుతాను , విను . నేను దేహగతుడనై ప్రాణము అనిపించుకున్నట్లు గానే , ఈ భువనమునంతటినీ ఆవరించి యున్నాను . కాబట్టి , తెలిసినవారు నన్ను ’ ముఖ్య ప్రాణుడు ’ అంటారు . ప్రాణము వలన ముఖ్య ప్రాణమును గుర్తించునదే ప్రాణోపాసన. నువ్వు నన్ను ముఖ్య ప్రాణుడిగా అర్చించి , అభ్యూహన మంత్రము చేత ఆ వృక్షమును అభిమంత్రించు . ఏమేమవుతుందో అదంతా గమనించు " అని , అభ్యూహన మంత్రమును ఉపదేశించినాడు . 

         ఉద్ధాలకులు తలాడించినారు . వారికి ఉపనయన సంస్కారము గుర్తుకొచ్చినది . " అప్పుడు ప్రాణము కోసము బ్రహ్మచర్యమును ఉపదేశించేవారు . ఈతడు దానిని సాధించి , ప్రాణ దేవుడిని ప్రసన్నము చేసుకున్నాడు . ఇంతటి వాడిని వదలిపెట్టుటకు వైశంపాయనులు కన్నీరు పెట్టుకోవడములో అతిశయమేముంది ? హూ ... నాకు కూడా కొంత అదృష్టము ఉండబట్టే ఈతడు నా వద్దకు వచ్చినాడు . మాకు తెలిసినదంతా ఈతనికి నేర్పి , ఈతనిని బ్రహ్మవిద్వరిష్ఠునిగా చేయవలెను " అనిపించినది .

" ఆ మీద ? "

         తెల్లవారినాక సూర్యుడు బారెడు పొద్దు ఎక్కినాక , అమ్మను పిలుచుకొని వచ్చి , ’ అమ్మా , నీ అనుమతి అయితే ఈ మాను మరలా చిగురిస్తుంది ’ అన్నాను . ఆమె నా మాటను నమ్మలేకపోయింది . ’ కానీవయ్యా, నీ నోటి చలవ వలన నాకు అంతటి శక్తి వస్తే ఎందుకు వద్దనాలి ? ఈ మాను చిగురించనీ ’ అన్నది . నేను వెంటనే కమండలము లోని నీరు తీసుకొని , అభ్యూహన మంత్రముతో అభిమంత్రించి ఆ చెట్టుపై చల్లి , మిగిలిన నీటిని చెట్టుమొదట్లో పోశాను . ఉత్తర క్షణమే మనసుకు ఏదో అనిపించి తలయెత్తి చూసినాను . అక్కడక్కడా చిగిరించడము కనిపించింది . అమ్మకు చూపినాను . ఆమె దానిని నమ్మలేక , ఒక సారి కన్నులు నులుముకొని , మరలా చూచినది . అంతలో చిగురు బాగా పెరిగి ఎర్రటి కెంపు వర్ణమునకు వచ్చినది . పరుగెత్తి వెళ్ళి తండ్రిగారిని పిలుచుకొని వచ్చినది . వారు అది చూసి , ’ ఇది ఎవరి పనితనము ? ’ అన్నారు . అమ్మ నన్ను చూపించింది .

         వారు విస్మితులై , ’ ఎలాగ చేశావు ? మంత్ర సిద్ధియా ? ’ అన్నారు . వారికి జరిగినదంతా చెప్పి , " మీరు నిన్న అభ్యూహన మంత్రము అని చెప్పితిరి . దాని వలననే ఇదంతా అయినది ’ అన్నాను . వారు తలఊపుతూ , ’ ఆలంబీ , వీర పుత్రుడిని పొంది వంశమును ఉద్ధారము చేసినావు ’ అని ఆమెను అభినందించి , ’ అయ్యా, నువ్వు మహర్షి తుల్యుడవైనావు . ఇక మేము ఏమైనా నీకు స్మారకులమే ( సాక్షులము ) గానీ శిక్షకులమగుటకు లేదు . ఇక  ఏమి చేయవలెనన్నది ఇంక మీదట దేవతల వలన తెలుసుకొని కృతకృత్యుడవు కమ్ము . అయితే , ఇదిగో , నాకు ఒక వరమునివ్వు . మనది కర్మఠుల వంశము . సత్కర్మ అనేది ఈ వంశపు సొత్తు . దానిని వదలవద్దు . దానిని దాటి ముందుకు పోతే మేము తట్టుకోలేము . కానీ , మేము వద్దనము , ముందుకు వెళ్ళు , కానీ వీలైనంత వరకూ కర్మమును వదలవద్దు . అదే నాకివ్వగలిగిన వరము . అవుతుందా ? " అన్నారు . వారి వాణిని విని నాకు కళ్ళనిండా నీరు వచ్చినది . వారికి నమస్కారము చేసి , ’ కర్మములన్నీ సాంగములగు వరకూ నేను బ్రహ్మ విద్యకు వెళ్ళను . ఈ మాటను దేవతలే నిలబెట్టనీ ’ " అని చేతులు జోడించినాను . 

        ఉద్ధాలకులు ఆశ్చర్యపోయినారు . వెనకటి కాలపు మహర్షి ఎవరో ఒకరు వచ్చి తమ సముఖములో కూర్చొని మాట్లాడుచున్నట్టు అనుభూతి కలిగినది . అయిననూ , ఎదురుగా కూర్చున్నవాడు వయో మానములో చిన్నవాడని , దానిని చూపించకయే అన్నారు , " అలాగైన , తండ్రి గారికి మాట ఇచ్చినావు ? " 

         " ఔను , కానీ దానికి ఏమి చేయవలెనో తెలియదు . ఇప్పుడు ప్రచారములో నున్న యజుర్వేదమును వినియోగించను యని ఆ దినము ప్రతిజ్ఞ చేసినాను . సంహితయే లేనప్పుడు , ఇక బ్రాహ్మణము ఎక్కడిది ? ఇదే చింతయయినది . " 

           " యోచించవద్దు , ఆ సంహితా బ్రాహ్మణములను వదలు . నీకు ప్రసన్నులైయున్న యజ్ఞేశ్వరుడు , ప్రాణ దేవుల దయ వలన ఇంకొక జోడి సంహితా బ్రాహ్మణములను పొందు. ఉపనిషత్తులు ఎవరి సొంతమూ కాదు , వాటిని ఎవరి వద్దనుండీ అయినా పరిగ్రహించ వచ్చును . "  

" అలాగయిన , సంహితయొక్క మంత్రములు , దాని అర్థమును వివరించు బ్రాహ్మణము-ఈ రెంటినీ కొత్తగా పొందవలెను అనే కదా తమరు చెప్పేది ? " 

        " ఔను , అప్పుడే అన్నాను కదా ? నువ్వు దేవతలనుండీ పొందుటకు ప్రయత్నించు . అప్పుడది కొత్తదవుతుంది . సరే , ఇప్పటికే ఈ దినము ఆలస్యమైనది . మరలా దీని గురించి మాట్లాడదాము " 

         యాజ్ఞవల్క్యుడు అనుజ్ఞ అని లేచినాడు . నమస్కారము చేసి వెళ్ళిపోయినాడు . ఉద్ధాలకులు బాహ్యంగా ఆతని నమస్కారమును గ్రహించి , అంతరంగములో ఆతడికి వారే నమస్కారము చేసినారు . 

SAMAYAJNA SAMAJIKA SABHA TRUST


సమయజ్ఞ సామాజిక సభా ట్రస్ట్

SAMAYAJNA SAMAJIKA  SABHA TRUST 

#47 , 3rd floor , 2nd Main, PP Layout
BSK-3rd Stage , Bangalore -560085
      


      The Trust has the noble objective of serving the mankind , as this is the purpose of life. This trust primarily aims to bridge the gap between the attainment of knowledge and its application to mankind. Knowledge, when incomplete or incorrect, can create turbulence in society. The right knowledge, if used wrongly,  can create turbulence in minds which affects the society 

     SAMAYAJNA SAMAJIKA  SABHA TRUST 
aims to achieve the dual purposes of imparting the ancient knowledge to aspirants and serving the needy by making them self-dependent , using methods passed on to us by our ancestors. 

     The Vedas are our source of knowledge and Vedic knowledge has proved itself that , the world has the Vedas as solid base. Every country , directly or indirectly  has drawn its life force from Vedas , the way of life as explained in the Vedas. Though the paths differ, the goal is common.  

The Vedas are bestowed upon the mankind, as a holy gift.  SAMAYAJNA SAMAJIKA  SABHA TRUST strives to rationalize and apply  the Vedic teachings to suit the present day environment, thus making it the most relevant science the world ever has. 

     Our country is flourishing and regarded as spiritual path finder for the rest of the world because of our ancient knowledge and wisdom. Because of that knowledge, India sustained itself and guiding the world in terms of spirituality. This knowledge is for the benefit of entire population. All the religions have this knowledge as basis. When this is used for the benefit of the masses , then its main purpose is served. 

     SAMAYAJNA SAMAJIKA  SABHA TRUST 
explores the possibilities of solving the present problems of the masses by using the ancient knowledge and making it applicable to modern times.  Simulation and comparisons of basic life needs of ancient and modern times , filling the gaps with acceptable methods, making the life simple and meaningful by eliminating the stresses by including the peace methods for a satisfactory life style.

      SAMAYAJNA SAMAJIKA  SABHA TRUST 
envisages to  bring home the fact that, everyone in this world deserves a dignified but simple way of life,  can lead such a life with utmost satisfaction . Bringing harmony among people, other living things & environment is the first step.   Happiness will not happen, it has to be created. 

     SAMAYAJNA SAMAJIKA  SABHA TRUST
 propagates the rational behavior as narrated in the Vedas, and highlights its relevance , with the belief that, Vedas are valid not for a particular time period  and not for the benefit of particular Caste, Creed and Area. Exploring the adaptability of Vedic preaching  to today’s changed perceptions and beliefs is the need of the hour .

This Trust operates purely on public funds. Everyone is welcome to participate / involve in whatever way they can.  

Activity list .....

* Impart Knowledge by in house teachings , organize seminars ., bring out books 
* Find and identify core problems of the society. 
* Find solutions to problems and identify the methods to solve them.
* Identify and felicitate eminent people in this field.
* Encourage public to participate and bring out their contribution to the society. 
* Awards & Rewards  as recognition  for the services of   any one in the concerned field. 
* Financial help to poor and deserving students  / youth . 
* Help to destitute children. 

      Though formally yet to be operative , activities like teaching , bringing books started in 2007. 
A few books are ready for publication . Basic facilities like a building and  other infra structure  are in place . Land for the permanent building is acquired with private funds. Construction of permanent building is planned .
This is a sincere attempt for a noble cause and public are invited to participate and extend their support.
Interested persons can contact either by e-mail or by phone 

e-mail :  samayajna@gmail.com :  janardhan36@gmail.com
cell :  0 9902 719 702

Saturday, February 16, 2013

34. " మహాదర్శనము " --ముప్పై నాలుగవ భాగము --బుడిలుల నిర్యాణము


34.  ముప్పై నాలుగవ భాగము--  బుడిలుల నిర్యాణము


         యాజ్ఞవల్క్యుడు వచ్చు వేళకు బుడిలులు స్నానము చేసి , శుద్ధాచమనము చేసి , పరిశుద్ధమైన మడిబట్టలను కట్టుకొని , మడిగా ఉన్న తెల్లటి బట్టను పరచిన దర్భాస్తరణములో పడుకుని ఉన్నారు . కాత్యాయనుడు పక్కనే కూర్చుని మంత్ర పారాయణము చేస్తున్నాడు . కాసేపటికి ఆచార్య దంపతులు కూడా వచ్చినారు . 

        బుడిలులు యాజ్ఞవల్క్యుని పక్కన కూర్చోబెట్టుకున్నారు . వాడి చేతిని తన చేతిలో పట్టుకొని యున్నారు . సంతోషముగా ఆచార్య దంపతులను పిలచి , మీ దర్శనము కావాలని వేచియున్నాను . ఇక పోవుటకు అనుజ్ఞయే కదా ? " అన్నారు . 

      భార్గవుడు పక్కన ఉన్నవాడు , " శుభ శంసనము చేస్తూ ఉండవలెనని మాకు చెప్పేవారు , మీరు మాత్రము అది చేయుట లేదు " అని ఆక్షేపణగా అన్నాడు . 

        అదివిని , బుడిలులు నవ్వినారు : " కాదయ్యా ఆచార్యా , నువ్వే చెప్పు . నాకూ అభిమానము వదలలేదు . మా కాత్యాయని కి నాలుగేళ్ళు . ఆమెకు పెండ్లియగు వరకూ ఉండవలెనని నాకు ఆశ. అంటే ఎన్ని సంవత్సరాలు ? ఇంకొక నాలుగైదు సంవత్సరాలు . అదయినాక  , ఇంకేదో ఒక ఆశ. బహుశః మనవడిని ఎత్తుకోవాలనో ఏమో ? అది కూడా అయితే ఇంకేదైనా ఒకటి . ఇలాగ పెరుగుచున్న ఆశ ముగిసే దెన్నటికి ? కాబట్టి , ఎక్కడికి తప్పితే అదేమేలు అనేది మంచిదా , లేక పెరుగుచున్న ఆశలకు చిక్కి ఆందోళన పడుట మంచిదా ? అయినా నాకు సహస్ర చంద్ర దర్శనమైనది . ఇక చాలు . మాకు ఆశ , అభిమానము తప్పియుండ లేదు , తప్పలేదు . అలాగని సద్గతిని మేము వదలిన వారము కాదు . మీరంతా ఆచార వృద్ధులు , తపో వృద్ధులు . మీ సన్నిధానములో దేహమును వదలి బ్రహ్మ లోకమునకు పోదామా అంటే , మా భార్గవ అడ్డు రావచ్చునా ? అదీకాక , ఇక్కడికన్నా అక్కడ ఆనందము హెచ్చు భార్గవా ! కాబట్టి ఆ యోచన వదిలేయి . "

        అప్పటికే బుడిలులకు ఆయాసమైంది . కొంచము నీరు త్రాగి , విశ్రమించి అన్నారు " ఈ నేను , నేను అనే మాట సరే , నేను మీ ముగ్గురినీ పిలిపించు కున్నందుకు కారణము చెపుతాను , వినండి . ఆచార్యా , మీ దంపతులు నాకొక మాట ఇవ్వవలెను . మా కాత్యాయనిని మీ యాజ్ఞవల్క్యునికి ఇవ్వవలెను . ఇలా జరగవలెననే , నేను యాజ్ఞవల్క్యుని శిష్యుడిగా అంగీకరించలేదు . ఏమి యాజ్ఞవల్క్యా ? దాని గురించి నీకు కోపమైతే వదిలేయి కానీ నాకు మాట ఇవ్వు . సుఖంగా ప్రాణము వదలుతాను . " 

ఆచార్య దంపతులు యాజ్ఞవల్క్యుని ముఖమును చూసినారు . వాడు నవ్వుతూ , " ఈ జన్మలో మీమాటే నాకు వేదవాక్యము " అన్నాడు . 

       ఆచార్యునికి చటుక్కున గుర్తొచ్చింది . కొడుకు బ్రహ్మవిద్యోపాసకుడై కర్మ సన్యాసమును చేస్తే గతి ఏమిటి యని తాను చింతించుచుండినది గుర్తొచ్చి , ఇది దానికి అడ్డమగుట అంటే తనకు అనుకూలమే కదా , సరే అనుకుని , ’ అట్లే కానివ్వండి ’ అన్నాడు . యాంత్రికమైననూ , సుప్రసన్నమైన మనోభావముతో మిగిలిన ఇద్దరూ అట్లే కానివ్వండి అన్నారు . 

       బుడిలులు , " ఒక భారము దిగిపోయింది . ఇంకొక మాట వినండి . మొన్నటి దినము ఉద్ధాలకులు వచ్చినారు . ఆచార్యా ! , మీ కొడుకును వారివద్ద కొన్ని సంవత్సరాలు వదలి ఉండు . వారు బ్రహ్మ నిష్ఠులు . అనేక రహస్యములను తెలిసినవారు . వారు మొదట మొదట్లో , ’ అన్య శిష్యుడు , నాకెందుకు ? " అన్నారు . నేను ఏమేమి చెప్పవలెనో  అదంతా చెప్పినాను . చివరికి వారు ఒప్పుకొను వరకూ వదలలేదు . వారిదగ్గర కుమారుడు సామవేదమునూ , బ్రహ్మవిద్యనూ ఎంతో కొంత అధ్యయనము చేయనీ . నా మాట విను . యాజ్ఞవల్క్యా , నాకూ తెలుసు , నువ్వు ఆశ్రమములంటే వేసారి పోయినావని . అయినా ఈ ముసలివాడి మాట గౌరవించి అక్కడ ఉండు . ముందు ముందు అన్నీ నీకు అనుకూలమే అవుతాయి. " అన్నారు . 

       ఆ వేళకు వారికి ఆయాసము ఎక్కువై , కష్టము మీద ఊపిరి పీల్చుట మొదలైనది . బహిర్ముఖమై ,  వారలు వీరలతో మాట్లాడుతున్నవారు చటుక్కున ఆకాశము వైపుకు తిరిగి , " ఇదిగో మా పితరులు " అని లేచి కూర్చొని చేతులు జోడించినారు . -" ఒరే !  ఎవరక్కడ ? అర్ఘ్య పాద్యాదులకు నీరు తీసుకు రండి . వారికి ఆసనమును ఇవ్వండి . అల్పాహారమును అందించండి " అని , యాజ్ఞవల్క్యుని వైపుకు తిరిగి , చూచితివేమయ్యా ? నువ్వు వచ్చినావని వారు వచ్చినారట ! ఏమి భాగ్యము ! " అని ఆగినారు . 

         ఆయాసము ఇంకా ఎక్కువైనది . బుడిలులు చివరి ఘట్టములో ఉన్నారని తెలిసి వైశంపాయనులూ , ఉద్ధాలకులూ వచ్చినారు . కాత్యాయనుడూ , భార్గవుడూ పరుగెత్తి వెళ్ళి వారిని పిలుచుకొని వచ్చినారు . యాజ్ఞవల్క్యుడు శయ్య పక్కన కూర్చున్నవాడు లేచి పక్కకు వెళ్ళి నిలుచున్నాడు . ఆచార్యులు , తదితరులు లేచి వారిని నిశ్శబ్దముగా ఆహ్వానించినారు . వచ్చిన వారి దృష్టి అంతా బుడిలులపైనే ఉంది . 

        బుడిలులు కష్టపడి చేతులెత్తి మొక్కి , మా పితరులు వచ్చి రమ్మంటున్నారు . వారు ఇప్పుడే అనుమతి నిచ్చినారు . ఇక నేను బయలుదేరెదను . నాకు బ్రహ్మ లోకములో స్థానమట . పోయిరానా ? అందరూ అనుమతించండి " అని మరొకసారి చేతులెత్తి మొక్కినారు . అటూ ఇటూ తిరిగి చూచి , ’ మా యాజ్ఞవల్క్యుడెక్కడ ? ’ అని అడిగి , సమీపమునకు వచ్చిన వాడిని చూసి , " పోయి వస్తానయ్యా , అనుమతించు " అని ఒరిగిపోయినారు .

       వైశంపాయనులు యాజ్ఞవల్క్యుని చూసి , ఆ స్థితిలో కూడా ఆదరముతో తమ పక్కకు చేయిపట్టి లాగుకున్నారు . వారు మాట్లాడకున్ననూ , వారి తడి కళ్ళు మాటలకన్నా ఎక్కువ పరిపూర్ణముగా వారి భావమును చెప్పుచున్నట్లుండెను . యాజ్ఞ వల్క్యుడు తల వంచినాడు . అతడి ముఖము కనపడకున్ననూ , వినయముతో వంగియున్న దేహ ముద్ర గురు భక్తిని నిస్సందేహముగా ప్రదర్శిస్తుండినది . 




33. " మహా దర్శనము " --ముప్పై మూడవ భాగము--అగ్ని దేవుని కృప


33. ముప్పై మూడవ భాగము-- అగ్ని దేవుని కృప

         
         దేవరాతుడు కొడుకుకు ఇప్పుడు తానే యజుర్వేదమును మరలా నేర్పిస్తున్నాడు . అలాగే బ్రాహ్మణోపనిషత్తులు కూడా అయినవి . కుమారుడు ఋగ్వేదము కోసము బుడిలులను ఆశ్రయించినాడు . సామవేదము కోసము ఉద్ధాలకుని వద్దకు పంపవలెను అని ఆచార్యుని అభిమతము . అయితే కొడుకు అగ్నిదేవుని అనుమతి లేనిదే దేనినీ చేయడు .  

         ఇలాగ ఒక సంవత్సరమైనది . తండ్రి ఎక్కడైననూ యాగము నడచి తనను అధ్వర్యుడిగా పిలిస్తే , తన వెంట కొడుకును కూడ పిలుచుకొని వెళ్ళును . అక్కడ యాజ్ఞవల్క్యుడు తండ్రికి తన వయసు మీరి సహాయము చేయును . అయినా ఎవరి దగ్గరా వినయమును వదలి మాట్లాడలేదు .  ఆ భీమ కాయుడు అలాగు వినయముగా ఉండుట చూసి , " ఇదేమిటిది , మహా సర్పము పుష్పహారమైనట్లు ఉన్నాడే  ! ఆచార్యుని అదృష్టము ఎంత గొప్పది ! ఇక ఇతడు అధ్వర్యుడై నిలబడు కాలము ఇంకెంతో దూరం లేదు ! " అంటారు . కొందరు తెలియని వారు కుతూహలము చేత , " నీకు శిక్షణ అయినది ఎక్కడయ్యా  ? "  అంటారు . యాజ్ఞవల్క్యుడు ముసి ముసి నవ్వులు నవ్వుతూ తండ్రిని చూపించును . ఇంకా కొందరు పెద్దవారు , " ఎక్కడైనా గానీ , నువ్వు దీర్ఘ కాలము సుఖముగా ఉండవయ్యా ! " అంటారు . యాజ్ఞవల్క్యుడు ఆ ఆశీర్వాదమును నమస్కార పూర్వకముగా గ్రహణము చేయును . 

          ఇప్పుడు ఇంటి వెనుక తోటలో యాజ్ఞవల్క్యుని కోసము ఒక గుడిసె ఏర్పడింది . అక్కడ కుమారుడు పయోవ్రతములో ఉన్నాడు . హవిస్సును పాలతో పాటు ఒకసారి భుజించి , మరొక పూట పాలు మాత్రము సేవిస్తాడు . మొదటి జాములో చెరువు నీటి స్నానము , సూర్యోదయము వరకూ జపము . సూర్యోదయము అగుచుండగనే అర్ఘ్య ప్రదానము . మరలా జపము . సూర్యోపస్థానము , దాని తరువాత అగ్ని కార్యము . అనంతరము వచ్చి తలిదండ్రులకు , యజ్ఞేశ్వరునికీ నమస్కారము చేసి మరలా వెనుకకు గుడిసెకు వెళ్ళును . తల్లి భోజనమును తెచ్చి ఇచ్చును . కుమారుడి వీణ మాత్రము అక్కడే ఉంటుంది . అతడు మంత్ర పునశ్చరణ లో లేనపుడు వీణను వాయించును . ఇప్పుడు బుడిలుల ఇంటికి కూడా వెళ్ళుట లేదు . ఒక దినము రాత్రి ఆలంబిని అకస్మాత్తుగా  పెరటి తలుపు తీసి బయటికి వచ్చింది . యాజ్ఞవల్క్యుని గుడిసెలో ప్రదీపమును వెలిగించినట్టు దేదీప్యమానముగా వెలుగు నిండిఉంది . అక్కడక్కడా గుడిసె కంతల నుండీ మిణుగురు పురుగులు ఎగురునట్లు కాంతి వెదజల్లుతోంది . యాజ్ఞవల్క్యుని గుడిసె కడకు వెళ్ళినది .  ఆలంబిని గాభరాపడు జాతి కాదు , అయినా, " కొడుకేమైనాడో , గుడిసెకు నిప్పు అంటుకున్నదా ? " అని గాభరా పడింది . అయితే పొగ లాంటిదేమీలేదు . మంట కనిపించుట లేదు . కాబట్టి ఏదో విలక్షణముగా ఉండవలెననుకొని శబ్దము చేయకుండా వెళ్ళి గుడిసెలోకి వంగి చూచినది . యాజ్ఞ వల్క్యుడు పద్మాసనములో ధ్యాన ముద్రలో  కూర్చున్నాడు . అతడి శరీరము నుండీ ఏదో మంట వలె  లేస్తున్నది . అయినా ముఖములో ఏ మార్పూ లేదు . కొంచము దూరములో ఆరేసిన బట్టలు దండెము మీద తమ పాటికి తామున్నాయి . ఆశ్చర్యమేమంటే , తాను వాకిలి వద్దకు వచ్చినా ఆ మంటల శాఖము లేదు . మంట , కట్టెలు వేసినపుడు కనిపించు మంట వలె నాలుకలు చాచుట లేదు . నేతి దీపపు మంటవలె ఘనముగా , చాంచల్యము లేకుండా మండుచున్నది . 

        ఆలంబిని ఒక్క ఘడియ లాగే నిలచి చూచినది . ఔను , మంట చంచలముగా లేదు . నేరుగా రత్న ప్రభ వలె కనబడుతున్నది . ఆమెకు అర్థము కాలేదు . ఏమైనా కానీ యని , యజ్ఞేశ్వరుని స్మరించి చేతులు జోడించి " నేను వెళ్ళి వారిని పిలుచుకొని వస్తాను . వారికి కూడా ఈ దర్శనము కానీ ! "  యని ప్రార్థించి , అక్కడినుండీ వెడలినది . 

         దేవరాతుడు మంచి నిద్రలో ఉన్నాడు . నిద్రలో ఉన్నపుడు లేపుట ఎలా అని ఆమె కొంత సేపు వేచింది  . చివరికి సన్నగా చేతులతో చప్పట్లు కొట్టింది . దేవరాతునికి మెలకువయై ’ ఎవరది ’ అన్నాడు . ఆలంబిని చిన్నగొంతుతో , ’ నేను , మెలకువ అయిందా ? ’ అని అడిగింది . 

దేవరాతుడు ’ ఏమిటి విశేషము ? ’ అని ఆమె వైపుకు తిరిగినాడు.

          ఆలంబిని తాను తోటలో చూచినది చెప్పింది . దేవరాతునికి ఆశ్చర్యమైనది . అందులోనూ , యాజ్ఞవల్క్యుడు ఆసన ముద్రా ధారణ చేసి కూర్చున్నాడని విని ఇంకా ఆశ్చర్యమై , ’ పదవే , వెళ్ళి చూసి వద్దాము ’ అని దారిలో బచ్చలి ఇంటికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని శుద్ధాచమనము చేసి గుడిసెకు వెళ్ళినాడు . 

         ఔను , యాజ్ఞవల్క్యుడు ధ్యాన ముద్రలో పద్మాసనములో కూర్చున్నాడు . అతడి చుట్టూ లేత నీలి వర్ణములో , ప్రకాశమానముగా నున్ననూ , కళ్ళకు మిరుమిట్లు గొలపక , కంటికి ప్రియమూ , హితమూ అయినట్టి జ్యోతి యొకటి అతడిని ఆవరించి యుంది . అతడే ఒక దీపమై ఉంటే ఎలాగ నిరాటంకముగా వెలిగెడివాడో అలాగ వెలుగుచున్నది . దేవరాతుడు చేతులు జోడించి నిలుచున్నచోటే ప్రదక్షిణ నమస్కారములను ,  మనసులోనే పంచోపచారమును చేసి , యజ్ఞేశ్వరుని పూజించి , దీని రహస్యమేమో అనుజ్ఞ కావలెనని ప్రార్థించినాడు . చటుక్కున మనసులో మెరసింది , " || ఆర్ద్రం హి జ్యోతిర్జ్వలతి || " తడిసిన వెలుగు జ్వలించుచున్నది . " 

         దేవరాతుడు మరలా నమస్కారము చేసి , మనః పూజను అర్పించినాడు. అతని విచికిత్సా బుద్ధి విచారము చేయసాగినది , " ఆర్ద్ర జ్యోతి యంటే ఆపోజ్యోతి . అది ఏమైననూ ధ్యానములో ఉన్న వాడికి మాత్రమే కనిపిస్తుంది . ఇలాగ దేహము నుండీ బయటికి వెడలి కూడా కనిపించునా ? ఔను , వెనకెప్పుడో వినియున్నాడు , ధ్యానపు ఒక అవస్థలో ఇలాగ జ్యోతి కనిపిస్తుందని . అంటే , యాజ్ఞవల్క్యుడు జ్యోతిరూపమగు అవస్థకు వచ్చినాడా ? ఉండనీ , తెల్లవారు వరకూ ఏమీ చేయుట వద్దు " అని సిద్ధాంతానికి వచ్చి నాడు . అయినా , తాను జనకుడిని యను మోహము వదలక , ఆ మంట వలన కొడుకుకు ఏ ఇబ్బందీ రాకూడదని నిర్ధారణ చేసుకొనుటకు మరలా వంగి చూస్తూ , మరలా దానివలన ఏమీ ఇబ్బంది లేదని మనసుకు నిర్ధారించుకొని, అక్కడినుండీ భార్యతో పాటు వెనుతిరిగినాడు . 

         దారిలో భార్యకు అంతా చెప్పినాడు , " ఉపనయన కాలములో గాయత్రీ మంత్రమును ఉపదేశించినపుడు ఆచార్యుడు శిష్యునికి ఈ జ్యోతిని చూపించును . దానిని కుమారుడు తన స్వంత ప్రయత్నము చేత పెంచుకొని ఎల్లపుడూ చూచుచుండవలెను. ధ్యానము పెరిగి జ్యోతిరూపమగు స్థితి వచ్చినపుడు ఇలాగే జ్వాలలు వెడలును అని విన్నాను . నేనెక్కడా చూడలేదు . చూద్దాము , రేపు కుమారుడినే అడిగితే సరిపోతుంది . "

ఆలంబిని ఆగి ఆగి అన్నది , " ఇటువంటి సందర్భములలో మీరు బుడిలులను అడుగుచుంటిరి కదా ? "

" ఇప్పుడు బుడిలులు ఉన్న స్థితిలో వారిని అడుగునట్లు లేదు "

" అదీ నిజమే , అయితే....."

        " తెల్లవారే వరకూ ఆగు . ఇంతవరకూ మనము స్వతంత్రులై యున్నాము , దానివలన మనకు తోచినట్టు చేయుచుండినాము . ఇప్పుడు కుమారుడు స్వతంత్రుడు . మనము చూసినది అతని ఒక పరిస్థితి. అందుకే , వాడినే అడిగితే సరి అన్నాను . " 

ఆలంబినికి అర్థమైనది . ఎప్పుడు తెల్లవారుతుందా అని కుతూహలముతో కాచుకుని ఉంది. 

         సూర్యోదయమైనది . తెల్లవారు జాములోనే లేచిన ఆలంబిని ప్రాతః కర్మలన్నిటినీ ముగించుకొని , అగ్ని పరిచర్య కూడా కానిచ్చి , పెరుగు చిలుకుతున్నది . అప్పుడు కొడుకు వచ్చి , " అమ్మా , నమస్కారము చేస్తాను " అన్నాడు . ఆలంబిని వెనుతిరిగి , " వారిని చూచి వచ్చినావు కదా ??  " అన్నది .

         కొడుకు నవ్వుతూ అన్నాడు , " చూచినాను , నమస్కారము చేసిన తర్వాత దగ్గర కూర్చోబెట్టుకొని అడిగినారు . నిన్నటి అనుభవము ఇది రెండో సారి అయినది . అలాగ అగునపుడు నాకు సగము సగము బాహ్య జ్ఞానము ఉంటుంది . అయితే , బయట జరిగేది తెలిసిననూ , ఆ క్రియకు ప్రతిక్రియ ఏమీ చేయలేను . నువ్వు వచ్చినది తెలుసు . తండ్రిగారు వచ్చినది తెలుసు . మీరిద్దరూ చిన్నగా మాట్లాడుకుంటున్నది కూడా విన్నాను . కానీ మీమాటకు సమాధానముగా ఏమీ చెప్పలేకనే కూర్చున్నాను . "

" అంటే  , నేను వచ్చినపుడూ , తర్వాత వారిని పిలుచుకొని వచ్చినపుడు నీకు ఒంటిపై జ్ఞానముండినదా ? కళ్ళు తెరచే ఉండినావా ? మేము పక్కనే ఉన్నదంతా నీకెలా తెలుసు ? " 

        " నువ్వు వచ్చినపుడు మెలకువ అయినది . తరువాత తండ్రిగారిని పిలుచుకొని వచ్చినావే , అప్పుడు కూడా మెలకువ అయింది . అప్పుడే చెప్పినాను కదా ? కళ్ళు తెరచే ఉన్నావా అన్నావు. నేను కళ్ళు తెరచుకోలేదు , నిజమే . ఈ కన్నులు , అంటే , ముక్కుపైన , కనుబొమల కింద ఉన్న కన్నులు రెప్పలు మూసుకొనే ఉండినవి . కానీ అప్పుడు నాకు ఒళ్ళంతా కన్నులై ఉండెను . ఈ చుట్టుపక్కల ఉన్నదంతా , నా వీపు వెనకాల ఉన్నదంతా కూడా కనిపించుతుండినది . ఇంకొక విశేషమేమంటే , నా కళ్ళకి , అంటే చూపుకు  గోడ కూడా అడ్డము కాలేదు . నువ్వు వాకిలి తెరచుకొని తోటలోపలికి వచ్చినది మొదలు అంతా కనిపించుతుండినది . సరేనా ? " 

" అదేమిటా మంటలు లేస్తున్నట్లుండినవి ? ఆ నీలిమంట నిన్ను కాల్చలేదా ? "

        " అది కాల్చే మంట కాదు . అది కాల్చి ఉంటే , మీ కొడుకునై ఈ దినము వచ్చి చూచేవాడినా ? చూడు , వేదములో , ’ చూపు పెద్దదగుటకు కన్నులు ఆకాశమంత కావలెను ’ అని చెప్పియున్నది . అట్లే అయినది , అంతే . ఆ దినము , ఉపనయనము రోజు , సూర్య మండలమునుండీ సావిత్ర కిరణమును పట్టి హృదయము లోపల నింపుకొనుటను నేర్పించినారు . అక్కడ ఆశ్రమములో ఉన్నపుడు దానిని చేస్తూ ఉండిననూ అది కన్నులను ఆకాశమంత చేసియుండలేదు . ఇప్పుడో వారము కింద అది జరిగినది . నిన్న రాత్రి అయినది రెండోసారి . అంతే ! అది సరే , నేనొక మాట చెప్పనా ? "

" చెప్పు " తల్లి పెరుగు కుండను మరచిపోయి , కవ్వమును గోడకు ఆనించి , తానూ గోడకు ఆనుకొని నిలుచుంది . 

         " నిన్న యజ్ఞేశ్వరుని దర్శనము పూర్తిగా చేసుకున్నాను . ఇంతవరకూ ఐతే ఎదురుగా ఉన్న అగ్ని కుండములో పైకి వచ్చే జ్వాలల మధ్యలో మాత్రమే చూచేవాడిని . నిన్న రాత్రి అదేమీ లేకుండా జ్వాలా మాలా విభూషితుడైన యజ్ఞేశ్వరుడి దర్శనమైనది . నేను పూజ చేసి , ఇదేమిటిలాగ దర్శనమిచ్చినావు అని అడిగినాను . యజ్ఞేశ్వరుడు నవ్వి , " నేను ఎల్లపుడూ మీ ఎదురుగ్గానే ఏదో ఒక రూపములో ఉండనే ఉంటాను . మీరు చూడకపోతే నాదేమి తప్పు ? పగటి పూట ఆదిత్యుడనై వెలుగువాడిని నేనే ! పగలూ రాత్రీ యనక నిలిచినచోట నిలువకుండా వీస్తున్న గాలిని కూడా నేనే ! ఇప్పుడు నీ ఎదురుగా నిలచినట్లు ఈ రూపములో  ఎల్లపుడూ నేను లేకుంటే , నేననే వాడిని లేనే లేనట్లా ? " అని అడిగినాడు . 

         " నేను మరలా అడిగినాను , " మీరు , దేవతలు , మాకన్నా గొప్పవారు . మీ రహస్యములను మీరే చెప్పకపోతే మాకెలా తెలుస్తుంది ? " . దానికి యజ్ఞేశ్వరుడు పకాలుమని నవ్వుతూ అన్నాడు  , " అది కూడా నిజమే , సరే , ఇప్పుడు చూడు , నేను ప్రసన్నుడనైన దానికి గుర్తుగా , నీ దృష్టి పెద్దదగును . నీదృష్టికి ఏ అడ్డూ ఉండదు . నువ్వు మధ్యాహ్నములలో సూర్య దర్శనము చేస్తావు కదా , దానివలన నాడులలో నిండియున్న కశ్మలము నాశనమగును . నాడి శుద్ధి అయితే , మొదటగా కలిగేది నా దర్శనము . నా దర్శనపు గుర్తుగా నా సాత్త్విక తేజము నీ నాడినాడులలోనూ ప్రసరించును . నీకు ఇంతవరకూ గోచరము కాకుండానే ప్రసారమగుచున్న ప్రాణ శక్తి , ఇప్పుడు ఇంద్రియ గోచరమగు నీలజ్యోతియై దేహమునుండి బయటికి వ్యాపించును. ఇప్పుడు ధ్యానములో కూర్చుంటే మాత్రమే కనిపించు ఆ జ్యోతి , నీకు జ్యోతి స్థితి సహజమైనపుడు  ఆదిత్య దర్శనమగును .  నువ్వు మధ్యాహ్నము పూట ఆదిత్యుని ఉపస్థానము చేయుచున్నట్లే ,  ఇక పైన విరామము దొరికినపుడల్లా ఆ ఆదిత్య మంత్రమును జపము చేస్తూ రా. ఇక కొన్ని రోజుల కోసము నువ్వు ఇల్లు వదలి వెళ్ళు ’ అన్నాడు. ఎక్కడికి పోవాలన్నది చెప్పలేదు "

" ఇదంతా వారికి చెప్పినావా ? "

" చెప్పినాను " 

" ఏమన్నారు ? "

        " సరే , నేను పరిగణించినట్లే అయినది . అయితే , నేను సావిత్ర మంత్రము అయితే చాలు అనుకున్నాను . యజ్ఞేశ్వరుని అనుజ్ఞయే అయిన తర్వాత , ఇక చెప్పేదేముంది ? కానీ , ఆదిత్య మంత్రమును జపిస్తూ ఉండు , తర్వాత ఇల్లు వదలి , ఉద్ధాలకుల ఆశ్రమమునకు వెళ్ళిరా ’ అన్నారు . "

" ఇంక చెప్పడానికేముందీ ? ఉద్ధాలకుల ఆశ్రమమునకు వెళితే అక్కడ నువ్వు చదివేది యేముంది ? వారు సామవేదులు కదా ? "

         " చూడమ్మా , సామములో హింకార సామము , హుంకార సామము అని రెండు ఉన్నాయి . వాటిలోని మంత్రాలను విస్తారము చేసి వ్యూహమును కట్టుటను సామము తోనే నేర్వవలెను . అదీకాక, ఉద్ధాలకులు బ్రహ్మిష్ఠులు . వారికి ఉపనిషత్తులపైన శ్రద్ధ ఎక్కువ. కాబట్టి , వారి ఉపనిషత్తైన ఛాందోగ్యోపనిషత్తునూ , మన ఉపనిషత్తులైన తైత్తిరీయ , కఠోపనిషత్తులనూ నేర్చుకుంటే సరిపోవును . అంతే కాక, ఇంకొక రహస్యము . తైత్తిరీయము మహా సంహితలనూ , పంచాత్మ సంక్రమణ విద్యను వివరిస్తుంది . కఠోపనిషత్తు శ్రేయోరూపమైన ఆత్మ విద్యను వివరిస్తుంది . ఛాందోగ్యము అవస్థాత్రయ పరీక్షణమును ముఖ్యముగా వివరిస్తుంది . ఈ మూడు విద్యలూ నేర్చులోపల నేను ముసలి వాడనైపోతాను . "

" అప్పటికి నేనేమౌతానో ఎవరెరుగుదురు ? ....."

      సరిగ్గా అప్పుడే బుడిలుల ఇంటినుండీ వార్త వచ్చింది , " బుడిలులకు ఆఖరి క్షణాలు వచ్చినాయి . ఆచార్య దంపతులతో పాటూ యాజ్ఞవల్క్యుడు కూడా రావలెనంట . " 

        ఆచార్యుడు గబగబా వచ్చి , భార్యా కొడుకులను చూసి , " నువ్వూ ఇక్కడే ఉన్నావా ? మంచిదైంది , పదండి , మనము ముగ్గురూ రావలెనని చెప్పి పంపినారు . యాజ్ఞవల్క్యా, నువ్వు ముందర నడు. నీ వెనకే మేమిద్దరమూ వస్తాము . బుడిలులకి నువ్వంటే చాలా ప్రేమాభిమానాలు . " అన్నాడు . 

యాజ్ఞవల్క్యుడు సరేనని ఉన్నవాడున్నట్లే బయలుదేరినాడు .