SHARE

Friday, January 24, 2025

సనాతన ధర్మ సంహిత


 సనాతన బంధువులకు శుభ వార్త !!!!!!!!!



మన వ్యభిచార మీడియా , హిందువుల గురించిన అన్ని ముఖ్యమైన సమాచారాలనూ దాచేసి ఏమీ తెలియనట్టు మూతి తుడుచుకొని కూర్చుంటున్నాయి. అక్కడక్కడా ఒకటో రెండో వేరు కారణాల చేత వాటిని ప్రచురిస్తున్నాయి.

ఇది ఒక అత్యంత సంచలన విషయము. ఎంత ప్రచారం ఉండాలి? కానీ ఎందరికి తెలుసు? 


హిందువులు  తమ ఆచార సాంప్రదాయాలను మరచిపోయారనీ, వారికి దిశా నిర్దేశము చేసేవారు లేరని, ఎవరికి తోచినట్టు వారు చేస్తున్నారనీ, ప్రస్తుత కాలానికి తగ్గట్టి ఒక స్మృతి , లేదా సంహిత [ కోడ్ ఆఫ్ కండక్ట్ ] ఉండాలని ఎప్పుడూ వినబడే మాట.  మన పీఠాధిపతులు, జగద్గురువులూ ఎందుకు చొరవతో ఈ విషయం పై మార్గ దర్శనాలను ప్రకటించకూడదు? అని అనేకుల సందేహాలు.  పీఠాధిపతులూ, జగద్గురువులూ, ప్రవచనకారులూ ఎప్పటికప్పుడు తమ సందేశాలను ఇస్తూనే ఉన్నారు. అయితే హిందువులకు ఆదేశాలు ఇచ్చే స్థితిలో ఎవరూ లేకపోవడము, ఒక సమగ్ర వ్యవస్థను అందరూ పాటించాలనే నిబంధనలను ప్రకటించే స్థితిలో లేకపోవడమూ, ఇంకా అలాంటి కారణాల వల్ల అటువంటి చర్యలు ఎవరూ తీసుకోలేదు.... అని ఇంతకాలమూ అనుకుంటున్నాము.  కానీ ఇది చూడండి


మోదీజీ ప్రధాని కాక పూర్వమే, అంటే ఒక పదిహేను సంవత్సరాల వెనుకే, ఈ దిశలో ఎందరో కలసి పని చేశారు.  సాధువులు, సన్యాసులు, పీథాధిపతులు, జగద్గురువులు, హిందూ సంఘాలు, ముఖ్యమైన హిందూ నేతలు,  మేధావులు, విద్వాంసులు, చరిత్రకారులు, శంకరాచార్యులు,  ఒకరేమిటి, అన్ని రంగాల వారూ కలసి ఒక వేదికగా ఏర్పడ్డారు, ఎప్పుడూ? రెండు దశాబ్దాల కిందటే,  దానికి కేంద్రము వారణాసి. ఆ వేదిక పేరు " కాశీ విద్వత్ పరిషత్. " ఈ పరిషత్తు, వేద విజ్ఞానాన్ని పరిరక్షించి, ప్రచురించి, ప్రచారము చేసే  పనిలో చాలా అభివృద్ధి సాధించింది. 


వీరందరూ కలసి సమిష్టిగా ఇన్నేళ్ళూ పరిశోధించి, పరిశ్రమించి " హిందూ సంహిత " నొకదానిని తయారు చేసి, అందరి ఆమోదాన్నీ పొందారు. వేదాలలోని విషయాలు, మన సాంప్రదాయాలు, హిందువులు చేయవలసిన విధులు, చేయకూడనివి, ఆచార వ్యవహారాలు, పండుగలు, కర్తవ్యాలు, ఉత్సవాలు, క్రతువులు, తంతులు, యజ్ఞ యాగాదులు, వంటి ఎన్నెన్నో విషయాలను కూలంకషంగా చర్చించి, ఇప్పటికి ఒక పుస్తకంగా సిద్ధమైంది.


 దీన్ని ఈ కుంభమేళాలో విడుదల చేయనున్నారు.


ఇంతకాలమూ దీనిగురించిన అన్ని విశేషాలనూ గోప్యంగా ఉంచారు. విశ్వ హిందూ పరిషత్, అఖిల భారత సాధు సమితి, ఇంకా ఇతర అఖాడాలు, సంఘాలు అన్నీ కలసి ఈ నెల ఇరవై ఏడున దీన్ని విడుదల చేయబోతున్నారు. వేలాది ప్రతులను కుంభమేళాలో అందరికీ పంచుతారు.  దేవకీనందన్ ఠాకుర్ [ ఆధ్యాత్మిక గురువు ], జీతేంద్రానంద సరస్వతి [ అఖిల భారత సాధు సమితి జనరల్ సెక్రెటరీ ] వంటి అనేకులు ఈ విషయం పై నిన్న కొంత సమాచారాన్ని పంచుకున్నారు. 


ఇంతకీ ఈ సంహితలోని విషయాలు ఏవి? అన్నదానిమీద ఇంక అ గోప్యత వీడలేదు కానీ, మచ్చుకి కొన్ని ఇదిగో


** రాత్రి పూట పెళ్ళిళ్ళను నిషేధించబోతున్నారు. వారి పరిశోధన ప్రకారము, పగటి పూట సూరుడి సాక్షిగా మాత్రమే పెళ్ళిళ్ళు జరగాలి


** భ్రూణ హత్యలు మహా పాపము


** వరకట్న నిషేధము


** స్త్రీలు పురుషులకు అన్నిటా సమానము. వారు యజ్ఞయాగాదులు కూడా చేయవచ్చు. 


** అస్పృశ్యత అనేది మన ధర్మంలో ఎప్పుడూ లేదు,  బానిసత్వం పేరుతో దాన్ని ఒక కాలంలో  మొదలుపెట్టారు. అన్ని దేవాలయాల్లో ఎస్ సి ఎస్ టి వారికి ప్రవేశం ఉంటుంది. 


** పుట్టుకతో అందరూ  హిందువులే కాబట్టి, ఎవరైనా హిందువుగా తిరిగి మారాలనుకుంటే అది మత మార్పిడి కాదు, కేవలం ’ ఘర్ వాపసీ ’ మాత్రమే. 


** దేవాలయాలు ప్రభుత్వపు నియంత్రణ నుండీ బయట ఉండాలి


** " సనాతన బోర్డు " నొకదానిని స్థాపించి వీటిని పర్యవేక్షించాలి. 


ఈ నెల ఇరవై యేడవ తారీకును " ధర్మ స్వతంత్రతా దివస్ " గా ప్రకటించబోతున్నారు. [ ఫ్రీడమ్ ఆఫ్ ధర్మ్ డే ]


జై హింద్

జై సనాతన ధర్మ

 భారత్ మాతా కి జై

No comments:

Post a Comment