SHARE

Sunday, April 8, 2018

దానము-ధర్మము-దక్షిణ

దానము-ధర్మము-దక్షిణ 






             దానము, ధర్మము , దక్షిణ అనేవి వేరు వేరు పదాలే అయినా వాటికి చాలా దగ్గర సంబంధము ఉంది. 

            సనాతన ధర్మములో దానానికి ఉన్న మహత్తు అంతా ఇంతా కాదు. మనము బాగుండాలంటే ’ పెట్టిపుట్టి ఉండాలి ’  అంటారు.. అంటే దానము చేసి ఉండాలి అని.  పూజకొద్దీ పురుషుడు, దానము కొద్దీ పిల్లలు అన్నారు. ఈ దానము అనే ఒక్క కర్మ మాత్రమూ విడవక చేస్తే ఇక వారికి జీవితమంతా పువ్వులబాటే అని శాస్త్రాలు  ఘోషిస్తున్నాయి. 

ఈ ’ దానము ’ అనే పదము మనకు మొట్టమొదట ఋగ్వేదములో కనపడుతుంది.  కేవలము ఒక సూచనాప్రాయముగా ఉటంకింపబడిన ఈ దానము అనే పదము రానురాను అత్యంత విస్తృతమైన అర్థము సంతరించుకొని, ముఖ్యమైన పుణ్యకర్మలలో ఒకటిగా భావింపబడుతున్నది. 

తపస్సు, జపము , ఇతర అనుష్టానాలతో సమానముగా ఈ దానము యొక్క విశిష్టత వర్ణింపబడినది. దీనిని ఋగ్వేదము ’ దక్షిణ ’ గా పేర్కొనింది [ 1. 125. 6 ] . అప్పటికాలములో దానము అంటే కేవలము ఆవులు , బంగారము మాత్రమే. అటుపిమ్మట అన్నదానము , విద్యాదానము , వంటి అనేక దానాలు గొప్పవని కీర్తింపబడినాయి. 

ఈ దానాలు / లేక దక్షిణలను రెండు విధాలుగా చూడవచ్చు
ఒకటి, సార్వజనికముగా సర్వేసర్వత్రా ఇచ్చే దానాలు
రెండు, బ్రాహ్మణులకు ఇచ్చే దక్షిణలు. 
వీటిని పాటించుట ద్వారా ధర్మము నిలబడుతుంది కాబట్టి , ధర్మాన్ని నిలబెట్టుట కోసము దాన దక్షిణలు ఇవ్వవలెను. ’ ధర్మము చేయండి ’ అనే మాటకు అర్థము అదే. 
అయితే ధర్మము అనే పదానికి అర్థము చాలా విస్తృతమైనది. సత్రములు , దేవాలయములు , భావులు , తోటలు, తోపులు  వంటివి కట్టించుట కూడా ధర్మము కిందకే వస్తాయి. 

దానధర్మములే మోక్షసాధనములు అని ఉపనిషత్తులు తేల్చి చెప్పాయి. 

ఉపనిషత్తుల ప్రకారము , దానము చేయుటవలన ఒక క్రమశిక్షణ కలిగి, మనుషులలో లోభము అనే దుర్గుణము పోతుంది. 
భగవద్గీత [ 16:1   మరియూ 17:20:22 ] కూడా దానమును ఒక గొప్ప దైవగుణముగా కీర్తిస్తుంది. 

వీటన్నిటినీ మించి, ధర్మశాస్త్రాలలోను, పురాణాలలోను దానము యొక్క విశిష్టత గొప్పగా వివరింపబడింది.

         దానమనేది నిత్యకర్మ కావచ్చు , లేదా నైమిత్తికమో, కామ్యమో, విమలమో [ అతి స్వఛ్ఛము ] అయిన కర్మ కావచ్చు. 
ఆకలిగొన్నవారికి ఆహారమును ఇచ్చుట నిత్య దానము లేదా నిత్యాన్నదానము.  దీనిని మనము అనేక దేవస్థానాలలోను , ఇతర ధార్మిక సంస్థలలోనూ చూస్తూనే ఉంటాము. 


        ఇక నైమిత్తికమంటే , ప్రత్యేక దినాలలో చేసే దానాలు. ఉదాహరణకు , గ్రహణాలు, సంక్రమణాల వంటి రోజుల్లో చేసేవి. అనేకులు తమ పుట్టినరోజునాడో, ఇతర ప్రత్యేకమైన దినాలలోనో చేస్తుంటారు..ఉగ్రరథ , భీమరథ శాంతులలో భాగముగా కూడా దానాలు ఇస్తారు. ఎవరైనా మరణిస్తే , వారి కర్మలు అయ్యాక, పదవరోజు దానాలు ఇస్తారు. . ఇవన్నీ నైమిత్తికమైనవి. 

     కామ్యములంటే  , ఏదైనా ఒక కోరిక తీరుట కోసము చేసిన పూజలు లేదా యజ్ఞాలలో భాగముగా దానములిచ్చుట. సాధారణముగా బంగారము , గోవులు దానము ఇస్తారు. 

      ఇక నాలుగోది, యతులు, సన్యాసులకు ఇచ్చే దానములు ’ విమలము ’ అనిపించుకుంటాయి. అక్కడ దాతకు యే కోరికా , అవసరమూ ఉండదు. కేవలము భక్తితోనో , దైవ చింతతోనో ఇచ్చేవి. 

ఈ దానాలు అన్నీ కూడా , మూడో కంటికి తెలియకుండా గొప్పకోసము కాకుండా ఇచ్చినపుడే , ఫలవంతములవుతాయి. 

         దానాలు, దక్షిణలు ధర్మానికి సంబంధించినవి కాబట్టి, వీటికి కొన్ని నియమాలు, కట్టుబాట్లూ ఏర్పడ్డాయి. 

దానము చేసే దాత, తనకు ఏ విధమైన ’ నివారింపలేని’  రోగములూ లేనప్పుడు, తనకు పాతకములు చుట్టుకొని లేనపుడు, తాను అనేక పుణ్యాలు చేసి, సద్గుణ సంపన్నుడై ఉన్నపుడు , ధనాన్ని న్యాయమార్గములో సంపాదించినప్పుడు మాత్రమే దానము చేయుటకు అర్హుడు. 
అంతే కాదు, గ్రహీత కూడా , ఆ దానమును తీసుకొనుటకు అర్హుడై ఉండవలెను. అతడు / ఆమె చెడు అలవాట్లు, చెడు శీలము కలిగిఉండరాదు. తాగుబోతులకు, జూదగాళ్ళకు, నేరస్తులకు దానము తీసుకొనే అర్హత లేదు. అట్టివారికి ఇవ్వరాదు. గ్రహీతలకు అన్న వస్త్రాలు , భూములు, ధనము వంటివి ఆ సమయములో అత్యంత అవసరమై ఉండవలెను. అట్టివారికి మాత్రమే దానము ఇవ్వవచ్చును. 

దాతకు ఉండాల్సిన మరికొన్ని అర్హతలు , దానము మీద శ్రద్ధ , భక్తి కలిగి ఉండటము , పుణ్యసంపాదన అనే ఉద్దేశము కలిగిఉండటము ముఖ్యము. అంతే కానీ, వారు ఎంత ఇస్తున్నారు అనేది ముఖ్యము కాదు. అయితే తాముఇచ్చే వస్తువులు / పదార్థములు ఉపయోగయోగ్యములుగా ఉండవలెను. పాడైపోయిన పదార్థాలు , వట్టిపోయిన ఆవులు , ఇతరలోహములు కలిపిన బంగారము--వంటివి ఇవ్వరాదు. 

దాత , గ్రహీత కూడా , అక్రమ మార్గాల ద్వారా సంపాదించిన ధనమును దానములో విసర్జించాలి. అట్టివి ఇవ్వరాదు, తీసుకొనరాదు. అలాచేస్తే విపరీత పరిణామములు కలుగుతాయి. 

ఒక గృహస్తు, తనకు శక్తికి మించిన దానములు ఎన్నటికీ చేయరాదు. పుణ్యము వస్తుందని , అప్పులు చేసి దానములు ఇవ్వరాదు. తాను ఇచ్చే దానమువలన తన కుటుంబ సభ్యులు నష్టము, కష్టము అనుభవింపరాదు. సాధారణముగా , గృహస్తులు తమ ఆదాయములో పది శాతము వరకూ దానాలు ఇవ్వవచ్చు. కనీసము పదిశాతము ఇవ్వవలెను-అని దీని అర్థము కాదు. 

ఇక దానము ఇవ్వకూడని వస్తువులు/ పదార్థములు

తనకు చెందని వస్తువులు / పదార్థములను ఎన్నటికీ దానము చేయరాదు, అటువంటివని తెలిస్తే తీసుకోరాదు. ఇతరుల నుండీ అరువు తెచ్చుకున్నవీ, ఇతరులు తమవద్ద రక్షణకోసము ఉంచినవీ దానాలు ఇవ్వరాదు. 

ఇక గ్రహీతలు కూడా , ’ స్వధర్మానికి ’ సంబంధించని దానాలు స్వీకరించరాదు. ఉదాహరణకు , ఒక శ్రోత్రియ బ్రాహ్మణుడు, ఆయుధములు , మత్తుపదార్థములు వంటివి ఇచ్చిననూ తీసుకోరాదు. 
దానాలు ఇవ్వవలసిన / తీసుకోతగిన దినములు

ముందే చెప్పినట్టు, ఉత్తర దక్షిణాయన పుణ్యకాలములందూ, గ్రహణకాలము లందూ , సంక్రమణ కాలములందూ , అమావాస్య, పౌర్ణమిలయందూ , ఏదైనా ప్రత్యేక పర్వదినములందూ  దానము ఇచ్చుట, తీసుకొనుట ప్రశస్తమైనది. 
తీర్థయాత్రలలో, పుణ్యక్షేత్రములలో ఇచ్చిన దానాలు అత్యంత శ్రేష్టమైనవి. 
ఒకసారి దానము ఇచ్చిన తరువాత దానిని తిరిగి తీసుకోరాదు. దానము ఇస్తానని మాట ఇచ్చిఉంటే , ఆమాట తిరిగితీసుకోరాదు. దానము ఇచ్చే తీరవలెను. అయితే , మతిస్థిమితము లేనివారు, తీవ్రమైన రోగములతో బాధపడువారు, పరిపక్వత లేని చిన్నపిల్లలు ఇచ్చిన దానాలకు ఇది వర్తించదు. 

దానములన్నిటిలోకి గోదానము , సువర్ణ దానము , తులాపురుషదానము గొప్పవిగా శాస్త్రాలు చెపుతాయి. 
" తులా పురుషదానము " నకు సంబంధించిన మరిన్ని వివరాలు ఈ బ్లాగులోనే ఇక్కడ చూడవచ్చు. 

http://vibhaataveechikalu.blogspot.in/2014/03/blog-post_28.html

జ్ఞానదానము , విద్యాదానము , ధర్మమునకు సంబంధించిన విషయ దానము అతిగొప్పవని శాస్త్రాలు చెబుతాయి. దానమువలన శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు అని మహానారాయణోపనిషత్ అంటుంది. 

ఇక దక్షిణ ల గురించి. 

దక్షిణ కూడా ఒక విధమైన దానమే అయిననూ, దక్షిణ ఇచ్చుటలో దాతకు ఒక బద్ధత అనేది ఉంటుంది. అనగా , ఇక్కడ దానమిచ్చుట అనేది దాత ఇష్టాఇష్టాలపై పూర్తిగా ఆధారపడదు. అది ఒక బాధ్యత. ఒకరినుండీ ఏదైనా ఒక ఉపకారము పొందినపుడు, ప్రత్యుపకారముగా ఇచ్చేదే దక్షిణ లేక సంభావన. 

ఇది ఎవరికైనా ఇవ్వతగినదేకానీ ఎక్కువగా ధార్మిక కార్యాలు జరిపించి ఇచ్చే పురోహితులకు , బ్రాహ్మణులకు ఎక్కువగా ఇది వర్తిస్తుంది. దక్షిణ అనేది వారి సేవలకు ప్రతిఫలము అనో, భత్యము అనో, జీతము అనో , రుసుము అనో అనుకుంటే అది పూర్తిగా దోషభూయిష్ఠమైన ఆలోచన. ఋణమును తీర్చుకొనుట ఎటువంటి బాధ్యతో, మనకు పాపమును పోగొట్టి, పుణ్యమును పక్వమునకు వచ్చునట్లు చేయు బ్రాహ్మణులకు దక్షిణ నిచ్చుట కూడా అటువంటి బాధ్యతే.  దురదృష్టముకొద్దీ ఈ కాలములో దక్షిణ అంటే అది ఒక రుసుముగా  భావిస్తున్నారు. ఇది పూర్తిగా తప్పు. 

ధార్మిక కార్యక్రమాలు చేయించుట ద్వారా బ్రాహ్మణులు యజమానికి తన పుణ్యము పక్వమునకువచ్చునట్లు చేయుటే గాక, అతడిచ్చు దక్షిణ స్వీకరించి అతడి పూర్వ పాపములో భాగము పంచుకొంటున్నాడు. ఆ పాపాన్ని పోగొట్టుకొనుటకు ఆ బ్రాహ్మణుడు ప్రాయశ్చిత్తములు చేసుకొనవలెను. 

సాధారణముగా త్రికాల సంధ్యావందనము వలన ఆ పాపములు శమించుచుండును. కానీ ఒక్కొక్కసారి అంతకుమించిన ప్రాయశ్చిత్తములు కూడా చేసుకొనవలసి వచ్చును. 

బ్రాహ్మడికి దక్షిణ ఇంత అనీ ఎక్కడా నిర్వచనము లేదు. అయితే , " విత్త శాఠ్యము " లేకుండా , తనకు ఉన్న శక్తికొలదీ వీలైనంత ఎక్కువగా ఇచ్చి బ్రాహ్మణుడిని సంతృప్తి పరచవలెను. బ్రాహ్మణుడు చేయించిన పూజల/ హోమాల ఫలితము పూర్తిగా యజమానికి దొరకవలెనంటే అతడు  తన శక్తికొలదీ దానము దక్షిణగా ఇవ్వవలెను. పీనాసితనము చేయరాదు. శక్తి ఉండీ తక్కువ దక్షిణను ఇచ్చినచో అతడి కార్యము అంతమేరకు కుంటుబడుతుంది. కావలసిన కార్యములు దానివలన పూర్తిగా సఫలము కావు. శక్తిలేనివాడు తక్కువ ఇచ్చినా కూడా అతడి కార్యము పూర్తిగా సఫలమవుతుంది. కాబట్టి, తన శ్రేయస్సు కోసము , బ్రాహ్మణుడి చేత కార్యములు చేయించుకొను యజమాని ఎప్పుడూ కూడా వీలైనంత ఎక్కువగా దక్షిణ ఇచ్చుచుండవలెను. 

ఇక, దక్షిణ ఎప్పుడు ఇవ్వాలి అనునది-
ఏదైనా కార్యము ముగిసిన వెంటనే దక్షిణ ఇచ్చినచో అది యజమానికి సర్వశుభములనూ కలుగజేయును. 
అలాకాకుండా , ఏ కారణము చేతనైనా వెంటనే ఇవ్వలేక పోతే , ఒక రాత్రి గడిచాక ఇస్తే , ఆ దక్షిణను రెట్టింపుగా ఇవ్వవలెను. 
ఒక మాసము గడిచినా ఇవ్వకుండా, తరువాత ఇస్తే దక్షిణను , తాను అనుకున్నదానికన్నా వందరెట్లు ఎక్కువ ఇవ్వవలెను. 
రెండు మాసముల తరువాత ఇస్తే , వెయ్యిరెట్లు ఇవ్వవలెను.
 సంవత్సరము గడిచాక ఇస్తే , అది నిష్ప్రయోజనమే కాక, ఆ యజమానికి నరక ప్రాప్తి తప్పక కలుగును అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. 

ఈ కాలము ’ ఎంత ఇవ్వాలి ?’ అని ముందే అడుగుతున్నారు. లేదా , అతి తక్కువ ఇవ్వ జూపి, బ్రాహ్మణుడి చేత " అంత చాలదు, ఇంకాఎక్కువ ఇవ్వండి " అని చెప్పించుకునేలా చేస్తున్నారు. బ్రాహ్మణుడిచేత అలాగ నోరుతెరచి ’ దక్షిణ ఇంత ఇవ్వాలి ’ అని చెప్పించుకుంటే , అది మరొక పాపముగా పరిగణింపబడుతుంది. దానికి ప్రాయశ్చిత్తముగా ఇంకా ఎక్కువ ఇవ్వవలసి ఉంటుంది. ఇవన్నీ ధర్మ శాస్త్రాలలో విపులముగా చర్చించిన విషయాలు. 

బ్రాహ్మణుడి చేత తమకు కావలసిన కార్యము  జరిపించుకుని , తామేదో దానము ఇస్తున్నట్టు అహంకారము చూపిస్తూ బ్రాహ్మణులను తక్కువ చేసి వేధించేవారికి కులనాశనము , వంశ క్షయము , కుటుంబములో ఈతి బాధలు మొదలవుతాయి. 
బ్రాహ్మణుడు కూడా ఎప్పుడూ తన నోటితో ’ నాకు ఇంత కావలెను, ఇది కావలెను ’ అని అడుగరాదు. అలా అడిగితే , ’ మీ పాపము నాకు రావలెను ’ అని అడిగినట్టే. అలా వచ్చిన పాపమును పోగొట్టుకొనుట అంత సులభము కాదు. 
" ఈ కాలములో ఇంత ఇస్తున్నారు, మీరు చూసి, శక్తివంచన లేకుండా ఇవ్వండి ’ అని చెప్పవచ్చును. 

ఇక చివరగా " గురుదక్షిణ " 
గురువుగారు తాను విద్యాదానము చేసిన శిష్యుడి నుండీ తీసుకునే దానమే " గురుదక్షిణ " 
గురుదక్షిణ ’ ఇది ’  లేక ’ ఇంత ’ అని గురువు చెప్పవచ్చును. లేదా గురువుగారికి ఏది అవసరమో, ఏది ఇష్టమో చూసి శిష్యుడే తెలుసుకొని ఇవ్వవచ్చును. గురుదక్షిణ ఇవ్వడానికి ఒక కాలపరిమితి అంటూ లేకపోయినా , సాధారణముగా విద్యార్జన అయిన తరువాత వెంటనే ఇచ్చుట ఆనవాయితీ. 

|| స్వస్తినో బృహస్పతిర్దధాతు || 

2 comments:

  1. మీ బ్లాగుని ఇంతవరకు ఎంతమంది వీక్షించారో కనిపించే విధంగా చేయండి.

    ReplyDelete
  2. ధన్యవాదములండీ.. ఇంతకు ముందు ఒక బొత్తాము ఉండేది.. తీసేశాను.. ఇప్పటివరకూ రెండులక్షల పైన వీక్షణలు ఉన్నాయి అని చూపుతున్నది.. మరలా ఆ బొత్తాము ఇచ్చుటకు ప్రయత్నిస్తాను

    ReplyDelete