SHARE

Wednesday, September 5, 2018

వైదిక ధనము

వైదిక ధనము
-------------------------

తపస్సుకు మెచ్చి, సరస్వతీ దేవి ప్రత్యక్షమై, ’ వత్సా , ఏమికావాలి, కోరుకో ..’ అంటే ,
" తల్లీ, నాకు అధికముగా ధనాన్ని ఇవ్వు. ప్రపంచములోని అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ చదివి జ్ఞానము సంపాదించుకుంటాను " అన్నట్టు
ఈ మధ్య ప్రతీదాన్నీ కేవలము ధనముతో మాత్రమే సంపాదించగలము--అనుకొనేవారి సంఖ్య రానురానూ ఎక్కువవుతోంది.
జ్ఞాన సరస్వతే ఎదురుగా ఉన్నపుడు, జ్ఞానాన్ని అడక్కుండా , అదేదో తాను ప్రత్యేకంగా సాధించాలి అన్నట్టు , దానికి డబ్బు అవసరమైనట్టు --ఇంతటి అజ్ఞానాన్ని చూసి సరస్వతీ దేవి ఇక అక్కడ క్షణం ఉంటుందా ?
అనేకులు , ఎంతగొప్ప చదువులు చదివినా, ఎంతగొప్ప ఉద్యోగాలు చేసినా , ప్రతీదాన్నీ డబ్బుతో ముడి పెడతారు.
ఎవరైనా ఏదైనా పని చేయబోతే " దానివల్ల ఎంతొస్తుంది ? ఏమొస్తుంది ? " అంటూ ప్రశ్నలు.
సనాతన ధర్మములో
|| ఇష్ట ప్రాప్తి-అనిష్ట పరిహారయోః అలౌకికమ్ ఉపాయమ్ యో గ్రంధో వేదయతి స వేదః ||
అని ప్రసిద్ధమైన ఋషివాణి ఉన్నది.
అనగా , " మనకు ఈ ప్రపంచములో అవసరమైన - లేక, ఇష్టమైన వాటిని పొందడానికి, మరియు హానికరమైన వాటిని తప్పించడానికి కావలసిన అలౌకిక ఉపాయాలను యే గ్రంధము ఇస్తుందో, అదే వేదము "
అంటే, దీన్ని బట్టి, వేదములో ప్రతిపాదించిన పద్దతుల వల్ల మనము సర్వమునూ సమకూర్చుకోవచ్చును. అంతే కానీ ధనము వల్ల కాదు.
ధనము వల్ల వచ్చేవాటినీ, ధనము వల్ల రాని వాటినీ కూడా వైదిక పద్దతుల ద్వారా [ యజ్ఞ యాగాదులు , హోమాలు వంటివి ] సులభముగా పొందవచ్చును.
కానీ దీన్ని మనము నమ్మితే కదా?
నమ్మిన వారికి ఫలముంది, నమ్మని వారికి ఏముంది--అన్నట్టు, అసలు ఇటువంటి ఆలోచనే ఎవరికీ రాదు.. ఎవరైనా చెప్పినా నమ్మరు. ప్రస్తుతము సమాజములోని పరిస్థితులు , పోకడలే దానికి కారణము.
వైదిక ధర్మాన్ని పాటిస్తున్నవారే , చాలామంది దీన్ని నమ్మరు. ఎందుకు నమ్మరు అంటే కారణాలు అనేకము. ముఖ్యమైనది, జీవితంలో వారు ప్రయాణించిన పద్దతి.

ఉదాహరణకు , కొందరు స్వఛ్ఛమైన దుస్తులు వేసుకొని కాలినడకన , మరికొందరు స్కూటర్ మీద, ఇంకొందరు ఆటోరిక్షా, అలాగ , బస్సు , కారు , రైలు , విమానాల్లో ప్రయాణించారు అనుకోండి. వారందరి ప్రయాణ కాలము ఒకటే అనుకోండి. ప్రయాణము తర్వాత ఎవరెవరి దుస్తులు ఎలా ఉన్నాయో చూద్దామా ?
వారందరి దుస్తులూ అంతో ఇంతో మాసి ఉంటాయి.
కాలినడకన వెళ్ళేవారికి, స్కూటర్, ఆటో, బస్సు, కారు, రైలు, విమానాల్లో వెళ్ళేవారికి ఒకే రకంగా దుస్తులు మాసి ఉండవు కదా?
విమానాల్లో వెళ్ళినవారికి తలపైన జుత్తు కూడా చెదరి ఉండకపోవచ్చు. ఏసీ కారు వారికీ అంతే. ఇక రైలు, బస్సు, ఆటో, స్కూటర్ వారికి వేర్వేరు రకాలుగా దుస్తులు మాసి ఉంటాయి. పైగా కొందరికి చెమటవల్లను , వాన, బురద వల్లనో దుస్తులు పాడై ఉంటాయి కూడా.
ఇందులో ఎవరి ప్రయాణము సుఖవంతము , ఫలవంతము అనడిగితే , విమానము , ఏసీ కారు , ఏసీ రైళ్ళలో వెళ్ళినవారిది అని ఠకీమని చెబుతారు.
అదే తర్కాన్ని అనుసరించి, పైన చెప్పిన " ధనముతో అన్నీ వస్తాయి , వైదిక పద్దతుల వల్ల కాదు" --అని అనుకోడానికి-- అనుకోకపోవడానికీ--వారు చేసిన ప్రయాణమే కారణము.
ఇక్కడ విమానము , ఏసీ కార్లు, రైళ్ళూ అంటే-- వైదీక జీవనములో ప్రయాణించినవారు అని అర్థము. అంటే పొట్టపోసుకోడానికి వైదీక జీవనములో ఉండడము కాదు. నిజంగా వేదాన్ని నమ్మి , దాన్ని ఆచరిస్తూ జీవనము గడిపేవారు అని అర్థము.
ఇక ఈనాటి అర్థం పర్థం లేని చదువులు చదివి అవి ఇచ్చే ధనము , వస్తువులు , సౌకర్యాలు పొందుతూ ’ తాము గొప్ప హోదాలో ఉన్నాము ’ అనుకొనేవారు స్కూటర్, ఆటో రిక్షాలలో వెళ్ళేవారికన్నా అధములు. అంటే వారి మనసులు ఎక్కువగా మలినము అయ్యాయి అని. వారికి ప్రతీదీ డబ్బుకు ముడివడి ఉంటుంది. ఇతరులలో డబ్బునే చూస్తారు. వారి గుణగణాలను , వ్యక్తిత్వాన్ని , జ్ఞానాన్ని వీరు చూడలేరు. అవన్నీ ఉన్నా కూడా డబ్బులేదు--అని వీరు గనక అనుకుంటే వారిని చులకనగా చూస్తారు.
మీరు అడగవచ్చు, ’ నేటి అర్థం పర్థం లేని చదువులవల్ల డబ్బు , వస్తువులు , సౌకర్యాలు వస్తున్నాయని అన్నారు కదా, మరి అలాంటప్పుడు వేదముతోను , వైదీక జీవితముతోను ఉపయోగమేమి ? " అని.
నిజము,నేటి చదువులు అవన్నీ ఇస్తున్నాయి . ఎవరు కాదనగలరు.. కానీ మనశ్శాంతి , ఆరోగ్యము , జన్మాంతరములో మనకు తిరిగి సంపదలు , మానసిక ఆరోగ్యము వంటివి ఈ చదువులు ఇస్తాయా ? ఇవన్నీ ఈ జన్మతో ముగిసిపోవలసినదే. ఎవరూ వీటిని -అనగా ఈ డబ్బు సౌకర్యాలు , వస్తువులను మూటగట్టుకొని పోరు. చచ్చినపుడు అన్నీ వదలి పోతారు. మనవెంట రావు. పైగా ఇవన్నీ అశాశ్వతాలు. ఎప్పుడైనా వీటిని పోగొట్టుకోవచ్చు.
అయితే , వైదిక జీవనము ఈ జన్మలో అన్నీ ఇచ్చుటే గాక , పైజన్మకు కూడా వాటిని పుణ్యరూపములో మూటగట్టి తెచ్చిస్తుంది.
’ పై జన్మ ఉందో లేదో, ఇప్పటికేది ప్రస్తుతమో అది చాలు ’ అనుకొనేవారికి, నా ప్రశ్న --" పైజన్మ ఉండకపోయేది మోక్షము ప్రాప్తములో ఉన్నవారికి మాత్రమే. ఆ మోక్షము కలగాలన్నా, ఈ లౌకిక విధానాలు సహాయం చెయ్యవు. దానికీ వైదిక విధానాలే శరణ్యము"
అంతా బాగానే ఉంది, మీరు చెప్పినవి పాటించి ఫలితాన్ని పొందిన వారు ఎవరైనా ఉన్నారా ? --అంటే , అనేకులు ఉన్నారు. నేను స్వయముగా చూసినవారే కాదు, మీరందరూ కూడా చూశారు , ఈనాడు ఆధ్యాత్మికముగా గొప్ప స్థితిలో ఉన్నవారందరూ అటువంటి వారే. వారికి ధనముతో అవసరము లేకుండానే అన్ని భాగ్యాలు , సౌకర్యాలు దొరుకుతున్నాయి.
మనము అనేక దేశాల్లో చూస్తున్నాము , తిండికీ బట్టకీ ఉండదు. మనుషులు అస్థిపంజరాల్లా ఉంటారు. అనేక రోగాలు, అశాంతులు , అలజడులు , ప్రకృతి ప్రకోపాలు--ఇలా ఎన్నెన్నో.. మనదేశములో అవన్నీ లేవు. ఎందుకో తెలుసా ? అది మన గొప్ప కాదు. ఈ తరము , పోయిన తరము వారి గొప్ప కాదు. మనకు మన పూర్వీకులు ఇచ్చిపోయిన ధనమే అది. వారు చేసిన పుణ్యఫలమే తరతరాలుగా మనలను రక్షిస్తున్నది.
" ఒక వ్యక్తి వేద విద్యా పారంగతుడైతే , అతడికి ముందు , వెనుక , ఎన్నోతరాల వారి శ్రమ ఫలించినట్టు. అతడి వల్ల అన్ని తరాలు ఉద్ధరింపబడతాయి. "
కొంతకాలము కింద ఇక్కడే నా మిత్రుడొకరు--చిన్నవయసు వారే --- అడిగారు" ఏమిటోనండీ జపాలు , పూజలు , అనుష్ఠానాలు చేస్తాను గానీ ఎందుకో ధనము ఇమ్మని ఆ దేవుణ్ణి అడగడానికి మనసు రాదు. అది తుఛ్చముగా అనిపిస్తుంది.. కానీ ధనము లేకపోతే నాకు కావలసినవి దొరకడము లేదు, పనులు జరగడము లేదు--" అని.
అతడు నిజముగా ఆధ్యాత్మిక మార్గములో ఉన్నాడు. అయితే కొన్ని అవరోధాలు వస్తున్నాయి. నేను చెప్పాను, " మీకు ధనముతో అవసరము ఏమిటి, మీకేమేమి వస్తువులు , పనులు కావాలో ఆ దేవుణ్ణి అడగండి. ధనము రాకపోయినా మీ పనులు జరిగితే చాలు కదా " అన్నాను. అతడు దానికి ఒప్పుకొని , మంచి సూచన అని అంగీకరించి ఆచరణలో పెట్టాడు. తర్వాత కొంతకాలానికి అతడే చెప్పాడు, ’ ఇప్పుడు నా అవసరాలన్నీ ధనముతో పని లేకుండానే తీరుతున్నాయి, లేదా, అవసరానికి ఏదోరకంగా ధనము అదే వస్తున్నది --" అని.
సరే మరి , అందరూ అనుష్ఠానాలు , యాగాలు హోమాలు చేయలేరు కదా, వారి మాటేమిటి ?
అవును, వేదము నేర్చిన వారిలో కూడా అందరూ యాగాలు , యజ్ఞాలు చేయలేరు. సనాతన ధర్మములో ప్రతిదానికీ ఒక ప్రత్యామ్నాయము ఉంది.
వేదము నేర్చినా, యజ్ఞయాగాదులు చేయలేనివారికి " బ్రహ్మయజ్ఞము " అనే మహోత్కృష్ట సాధనము ఉంది. ఇది అందరూ అనుకొనే అగ్నిని కుండములలో ప్రతిష్ఠించి చేసే యజ్ఞము కాదు. ఇందులో కేవలము స్వాధ్యాయము [ వేదపఠనము ] మరియూ దేవ ఋషి పితృ తర్పణాలు ఉంటాయి . బ్రహ్మ యజ్ఞపు గొప్పదనము , విలువ , ఫలితము అంతాఇంతా కాదు. యాగాలు చేయకపోయినా, ఒక పద్దతి ప్రకారము ఆయా మంత్రాలను పఠిస్తే అంతే ఫలితమని వేదమే చెబుతుంది.
శతపథ బ్రాహ్మణములో , అగ్నిని ప్రతిష్టించి చేసే యజ్ఞాలకూ , బ్రహ్మయజ్ఞానికీ గల సారూప్యత ఆసక్తికరంగా చెప్పబడింది.
బ్రహ్మయజ్ఞములో భాగమైన వేదాధ్యయనములో నిమగ్నమైన వారి శరీరపు వివిధ అంగాలు , ఆయా శరీరపు కలాపాలు , ఇతర యజ్ఞాలలో ఉపయోగించు యజ్ఞాయుధాల[ ఉపకరణాల] తో పోల్చబడినాయి. యజ్ఞములో ఉపయోగించు జుహు, ఉపభృత్ , ధృవా మొదలగు ఉపకరణాలు , సంకేత రూపములో వాక్కు, మనసు , కన్నులతో పోల్చబడినాయి. బ్రహ్మ యజ్ఞపు చివర చేయు వేదాధ్యయనమే అవభృత స్నానమట !
అలాగే వేదము అధ్యయనము చేసినా, అధ్యాపనము చేసినా అదే ఫలితము. అధ్యాపనము [ నేర్పించుట ] చేసేవారు అధ్యాపనమే ఫలితముగా భావించాలి. శిష్యుల వద్దనుండీ ఏమీ ఆశించరాదు. ఒకవేళ వారేమైనా ఇస్తే , అది తనకు అవసరమైతే , ఉపయోగపడితే , తీసుకోవచ్చును. ఉపయోగపడనిదాన్ని , ఎంతగొప్పదైనా, వారే ఇచ్చినా సరే, తీసుకోరాదు.
ఇది తెలియని అనేకులు" వేదము నేర్పిస్తారా ? దానితో కడుపు నిండునా కాలు నిండునా ? " అని ప్రశ్నించి తమ అజ్ఞానాన్ని ప్రదర్శించుకుంటారు. మరికొందరు, వీరు వేదము నేర్పిస్తున్నారు-అనగానే , " పాపం , ఎంత బీదరికంలో ఉన్నారో, " అని జాలి కాదు, తమతో పోల్చుకుని, మిథ్యా తృప్తి పొందుతారు. తామెంత హీనస్థితిలో ఉన్నారో వారు ఎరుగరు.. వారికి అజ్ఞానమే బ్రహ్మానందము.
వేదము నేర్వని వారు యే గాయత్రీ మంత్రమో , అదీ రాని వారు పురాణాలు , ధార్మిక గాథలు, ఇతిహాసాలను చదివితే అంతేఫలితమని వేదములోని యజురారణ్యకములో స్పష్టముగా చెప్పి ఉంది.
కాబట్టి ఎవరికి వచ్చినది వారు చేయవచ్చు.
ఇక తర్పణాలకు కూడా పెద్ద తంతు అవసరము లేదు. ఆయా దేవతల, ఋషుల , పితరుల పేర్లు చెప్పి ఆయా తీర్థాలతో తర్పణము ఇవ్వడమే. తీర్థము అంటే , కుడిచేతి చూపుడు, బొటనవేలిని మడిచి, గోకర్ణ ఆకృతిలో ఉన్న ఆచేతి వేళ్ళ నుండీ ముందుకు నీరు వదిలితే అది దేవతీర్థములో వదలినట్టు.
కుడి అరచేతిలోని నీటిని చిటికెన వేలు కిందిగా ఎడమవైపుకు వదలితే అది ఋషితీర్థము.
చూపుడు వేలు, బొటన వేలు మధ్యనుండీ నీటిని కుడివైపుకు వదిలితే అది పితృతీర్థము. అరచేతిలోని నీటిని వెనక్కు--అనగా మణికట్టు వైపుకు వదిలితే అది బ్రహ్మ తీర్థము.

|| శుభం భూయాత్ ||

Sunday, April 8, 2018

దానము-ధర్మము-దక్షిణ

దానము-ధర్మము-దక్షిణ 






             దానము, ధర్మము , దక్షిణ అనేవి వేరు వేరు పదాలే అయినా వాటికి చాలా దగ్గర సంబంధము ఉంది. 

            సనాతన ధర్మములో దానానికి ఉన్న మహత్తు అంతా ఇంతా కాదు. మనము బాగుండాలంటే ’ పెట్టిపుట్టి ఉండాలి ’  అంటారు.. అంటే దానము చేసి ఉండాలి అని.  పూజకొద్దీ పురుషుడు, దానము కొద్దీ పిల్లలు అన్నారు. ఈ దానము అనే ఒక్క కర్మ మాత్రమూ విడవక చేస్తే ఇక వారికి జీవితమంతా పువ్వులబాటే అని శాస్త్రాలు  ఘోషిస్తున్నాయి. 

ఈ ’ దానము ’ అనే పదము మనకు మొట్టమొదట ఋగ్వేదములో కనపడుతుంది.  కేవలము ఒక సూచనాప్రాయముగా ఉటంకింపబడిన ఈ దానము అనే పదము రానురాను అత్యంత విస్తృతమైన అర్థము సంతరించుకొని, ముఖ్యమైన పుణ్యకర్మలలో ఒకటిగా భావింపబడుతున్నది. 

తపస్సు, జపము , ఇతర అనుష్టానాలతో సమానముగా ఈ దానము యొక్క విశిష్టత వర్ణింపబడినది. దీనిని ఋగ్వేదము ’ దక్షిణ ’ గా పేర్కొనింది [ 1. 125. 6 ] . అప్పటికాలములో దానము అంటే కేవలము ఆవులు , బంగారము మాత్రమే. అటుపిమ్మట అన్నదానము , విద్యాదానము , వంటి అనేక దానాలు గొప్పవని కీర్తింపబడినాయి. 

ఈ దానాలు / లేక దక్షిణలను రెండు విధాలుగా చూడవచ్చు
ఒకటి, సార్వజనికముగా సర్వేసర్వత్రా ఇచ్చే దానాలు
రెండు, బ్రాహ్మణులకు ఇచ్చే దక్షిణలు. 
వీటిని పాటించుట ద్వారా ధర్మము నిలబడుతుంది కాబట్టి , ధర్మాన్ని నిలబెట్టుట కోసము దాన దక్షిణలు ఇవ్వవలెను. ’ ధర్మము చేయండి ’ అనే మాటకు అర్థము అదే. 
అయితే ధర్మము అనే పదానికి అర్థము చాలా విస్తృతమైనది. సత్రములు , దేవాలయములు , భావులు , తోటలు, తోపులు  వంటివి కట్టించుట కూడా ధర్మము కిందకే వస్తాయి. 

దానధర్మములే మోక్షసాధనములు అని ఉపనిషత్తులు తేల్చి చెప్పాయి. 

ఉపనిషత్తుల ప్రకారము , దానము చేయుటవలన ఒక క్రమశిక్షణ కలిగి, మనుషులలో లోభము అనే దుర్గుణము పోతుంది. 
భగవద్గీత [ 16:1   మరియూ 17:20:22 ] కూడా దానమును ఒక గొప్ప దైవగుణముగా కీర్తిస్తుంది. 

వీటన్నిటినీ మించి, ధర్మశాస్త్రాలలోను, పురాణాలలోను దానము యొక్క విశిష్టత గొప్పగా వివరింపబడింది.

         దానమనేది నిత్యకర్మ కావచ్చు , లేదా నైమిత్తికమో, కామ్యమో, విమలమో [ అతి స్వఛ్ఛము ] అయిన కర్మ కావచ్చు. 
ఆకలిగొన్నవారికి ఆహారమును ఇచ్చుట నిత్య దానము లేదా నిత్యాన్నదానము.  దీనిని మనము అనేక దేవస్థానాలలోను , ఇతర ధార్మిక సంస్థలలోనూ చూస్తూనే ఉంటాము. 


        ఇక నైమిత్తికమంటే , ప్రత్యేక దినాలలో చేసే దానాలు. ఉదాహరణకు , గ్రహణాలు, సంక్రమణాల వంటి రోజుల్లో చేసేవి. అనేకులు తమ పుట్టినరోజునాడో, ఇతర ప్రత్యేకమైన దినాలలోనో చేస్తుంటారు..ఉగ్రరథ , భీమరథ శాంతులలో భాగముగా కూడా దానాలు ఇస్తారు. ఎవరైనా మరణిస్తే , వారి కర్మలు అయ్యాక, పదవరోజు దానాలు ఇస్తారు. . ఇవన్నీ నైమిత్తికమైనవి. 

     కామ్యములంటే  , ఏదైనా ఒక కోరిక తీరుట కోసము చేసిన పూజలు లేదా యజ్ఞాలలో భాగముగా దానములిచ్చుట. సాధారణముగా బంగారము , గోవులు దానము ఇస్తారు. 

      ఇక నాలుగోది, యతులు, సన్యాసులకు ఇచ్చే దానములు ’ విమలము ’ అనిపించుకుంటాయి. అక్కడ దాతకు యే కోరికా , అవసరమూ ఉండదు. కేవలము భక్తితోనో , దైవ చింతతోనో ఇచ్చేవి. 

ఈ దానాలు అన్నీ కూడా , మూడో కంటికి తెలియకుండా గొప్పకోసము కాకుండా ఇచ్చినపుడే , ఫలవంతములవుతాయి. 

         దానాలు, దక్షిణలు ధర్మానికి సంబంధించినవి కాబట్టి, వీటికి కొన్ని నియమాలు, కట్టుబాట్లూ ఏర్పడ్డాయి. 

దానము చేసే దాత, తనకు ఏ విధమైన ’ నివారింపలేని’  రోగములూ లేనప్పుడు, తనకు పాతకములు చుట్టుకొని లేనపుడు, తాను అనేక పుణ్యాలు చేసి, సద్గుణ సంపన్నుడై ఉన్నపుడు , ధనాన్ని న్యాయమార్గములో సంపాదించినప్పుడు మాత్రమే దానము చేయుటకు అర్హుడు. 
అంతే కాదు, గ్రహీత కూడా , ఆ దానమును తీసుకొనుటకు అర్హుడై ఉండవలెను. అతడు / ఆమె చెడు అలవాట్లు, చెడు శీలము కలిగిఉండరాదు. తాగుబోతులకు, జూదగాళ్ళకు, నేరస్తులకు దానము తీసుకొనే అర్హత లేదు. అట్టివారికి ఇవ్వరాదు. గ్రహీతలకు అన్న వస్త్రాలు , భూములు, ధనము వంటివి ఆ సమయములో అత్యంత అవసరమై ఉండవలెను. అట్టివారికి మాత్రమే దానము ఇవ్వవచ్చును. 

దాతకు ఉండాల్సిన మరికొన్ని అర్హతలు , దానము మీద శ్రద్ధ , భక్తి కలిగి ఉండటము , పుణ్యసంపాదన అనే ఉద్దేశము కలిగిఉండటము ముఖ్యము. అంతే కానీ, వారు ఎంత ఇస్తున్నారు అనేది ముఖ్యము కాదు. అయితే తాముఇచ్చే వస్తువులు / పదార్థములు ఉపయోగయోగ్యములుగా ఉండవలెను. పాడైపోయిన పదార్థాలు , వట్టిపోయిన ఆవులు , ఇతరలోహములు కలిపిన బంగారము--వంటివి ఇవ్వరాదు. 

దాత , గ్రహీత కూడా , అక్రమ మార్గాల ద్వారా సంపాదించిన ధనమును దానములో విసర్జించాలి. అట్టివి ఇవ్వరాదు, తీసుకొనరాదు. అలాచేస్తే విపరీత పరిణామములు కలుగుతాయి. 

ఒక గృహస్తు, తనకు శక్తికి మించిన దానములు ఎన్నటికీ చేయరాదు. పుణ్యము వస్తుందని , అప్పులు చేసి దానములు ఇవ్వరాదు. తాను ఇచ్చే దానమువలన తన కుటుంబ సభ్యులు నష్టము, కష్టము అనుభవింపరాదు. సాధారణముగా , గృహస్తులు తమ ఆదాయములో పది శాతము వరకూ దానాలు ఇవ్వవచ్చు. కనీసము పదిశాతము ఇవ్వవలెను-అని దీని అర్థము కాదు. 

ఇక దానము ఇవ్వకూడని వస్తువులు/ పదార్థములు

తనకు చెందని వస్తువులు / పదార్థములను ఎన్నటికీ దానము చేయరాదు, అటువంటివని తెలిస్తే తీసుకోరాదు. ఇతరుల నుండీ అరువు తెచ్చుకున్నవీ, ఇతరులు తమవద్ద రక్షణకోసము ఉంచినవీ దానాలు ఇవ్వరాదు. 

ఇక గ్రహీతలు కూడా , ’ స్వధర్మానికి ’ సంబంధించని దానాలు స్వీకరించరాదు. ఉదాహరణకు , ఒక శ్రోత్రియ బ్రాహ్మణుడు, ఆయుధములు , మత్తుపదార్థములు వంటివి ఇచ్చిననూ తీసుకోరాదు. 
దానాలు ఇవ్వవలసిన / తీసుకోతగిన దినములు

ముందే చెప్పినట్టు, ఉత్తర దక్షిణాయన పుణ్యకాలములందూ, గ్రహణకాలము లందూ , సంక్రమణ కాలములందూ , అమావాస్య, పౌర్ణమిలయందూ , ఏదైనా ప్రత్యేక పర్వదినములందూ  దానము ఇచ్చుట, తీసుకొనుట ప్రశస్తమైనది. 
తీర్థయాత్రలలో, పుణ్యక్షేత్రములలో ఇచ్చిన దానాలు అత్యంత శ్రేష్టమైనవి. 
ఒకసారి దానము ఇచ్చిన తరువాత దానిని తిరిగి తీసుకోరాదు. దానము ఇస్తానని మాట ఇచ్చిఉంటే , ఆమాట తిరిగితీసుకోరాదు. దానము ఇచ్చే తీరవలెను. అయితే , మతిస్థిమితము లేనివారు, తీవ్రమైన రోగములతో బాధపడువారు, పరిపక్వత లేని చిన్నపిల్లలు ఇచ్చిన దానాలకు ఇది వర్తించదు. 

దానములన్నిటిలోకి గోదానము , సువర్ణ దానము , తులాపురుషదానము గొప్పవిగా శాస్త్రాలు చెపుతాయి. 
" తులా పురుషదానము " నకు సంబంధించిన మరిన్ని వివరాలు ఈ బ్లాగులోనే ఇక్కడ చూడవచ్చు. 

http://vibhaataveechikalu.blogspot.in/2014/03/blog-post_28.html

జ్ఞానదానము , విద్యాదానము , ధర్మమునకు సంబంధించిన విషయ దానము అతిగొప్పవని శాస్త్రాలు చెబుతాయి. దానమువలన శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు అని మహానారాయణోపనిషత్ అంటుంది. 

ఇక దక్షిణ ల గురించి. 

దక్షిణ కూడా ఒక విధమైన దానమే అయిననూ, దక్షిణ ఇచ్చుటలో దాతకు ఒక బద్ధత అనేది ఉంటుంది. అనగా , ఇక్కడ దానమిచ్చుట అనేది దాత ఇష్టాఇష్టాలపై పూర్తిగా ఆధారపడదు. అది ఒక బాధ్యత. ఒకరినుండీ ఏదైనా ఒక ఉపకారము పొందినపుడు, ప్రత్యుపకారముగా ఇచ్చేదే దక్షిణ లేక సంభావన. 

ఇది ఎవరికైనా ఇవ్వతగినదేకానీ ఎక్కువగా ధార్మిక కార్యాలు జరిపించి ఇచ్చే పురోహితులకు , బ్రాహ్మణులకు ఎక్కువగా ఇది వర్తిస్తుంది. దక్షిణ అనేది వారి సేవలకు ప్రతిఫలము అనో, భత్యము అనో, జీతము అనో , రుసుము అనో అనుకుంటే అది పూర్తిగా దోషభూయిష్ఠమైన ఆలోచన. ఋణమును తీర్చుకొనుట ఎటువంటి బాధ్యతో, మనకు పాపమును పోగొట్టి, పుణ్యమును పక్వమునకు వచ్చునట్లు చేయు బ్రాహ్మణులకు దక్షిణ నిచ్చుట కూడా అటువంటి బాధ్యతే.  దురదృష్టముకొద్దీ ఈ కాలములో దక్షిణ అంటే అది ఒక రుసుముగా  భావిస్తున్నారు. ఇది పూర్తిగా తప్పు. 

ధార్మిక కార్యక్రమాలు చేయించుట ద్వారా బ్రాహ్మణులు యజమానికి తన పుణ్యము పక్వమునకువచ్చునట్లు చేయుటే గాక, అతడిచ్చు దక్షిణ స్వీకరించి అతడి పూర్వ పాపములో భాగము పంచుకొంటున్నాడు. ఆ పాపాన్ని పోగొట్టుకొనుటకు ఆ బ్రాహ్మణుడు ప్రాయశ్చిత్తములు చేసుకొనవలెను. 

సాధారణముగా త్రికాల సంధ్యావందనము వలన ఆ పాపములు శమించుచుండును. కానీ ఒక్కొక్కసారి అంతకుమించిన ప్రాయశ్చిత్తములు కూడా చేసుకొనవలసి వచ్చును. 

బ్రాహ్మడికి దక్షిణ ఇంత అనీ ఎక్కడా నిర్వచనము లేదు. అయితే , " విత్త శాఠ్యము " లేకుండా , తనకు ఉన్న శక్తికొలదీ వీలైనంత ఎక్కువగా ఇచ్చి బ్రాహ్మణుడిని సంతృప్తి పరచవలెను. బ్రాహ్మణుడు చేయించిన పూజల/ హోమాల ఫలితము పూర్తిగా యజమానికి దొరకవలెనంటే అతడు  తన శక్తికొలదీ దానము దక్షిణగా ఇవ్వవలెను. పీనాసితనము చేయరాదు. శక్తి ఉండీ తక్కువ దక్షిణను ఇచ్చినచో అతడి కార్యము అంతమేరకు కుంటుబడుతుంది. కావలసిన కార్యములు దానివలన పూర్తిగా సఫలము కావు. శక్తిలేనివాడు తక్కువ ఇచ్చినా కూడా అతడి కార్యము పూర్తిగా సఫలమవుతుంది. కాబట్టి, తన శ్రేయస్సు కోసము , బ్రాహ్మణుడి చేత కార్యములు చేయించుకొను యజమాని ఎప్పుడూ కూడా వీలైనంత ఎక్కువగా దక్షిణ ఇచ్చుచుండవలెను. 

ఇక, దక్షిణ ఎప్పుడు ఇవ్వాలి అనునది-
ఏదైనా కార్యము ముగిసిన వెంటనే దక్షిణ ఇచ్చినచో అది యజమానికి సర్వశుభములనూ కలుగజేయును. 
అలాకాకుండా , ఏ కారణము చేతనైనా వెంటనే ఇవ్వలేక పోతే , ఒక రాత్రి గడిచాక ఇస్తే , ఆ దక్షిణను రెట్టింపుగా ఇవ్వవలెను. 
ఒక మాసము గడిచినా ఇవ్వకుండా, తరువాత ఇస్తే దక్షిణను , తాను అనుకున్నదానికన్నా వందరెట్లు ఎక్కువ ఇవ్వవలెను. 
రెండు మాసముల తరువాత ఇస్తే , వెయ్యిరెట్లు ఇవ్వవలెను.
 సంవత్సరము గడిచాక ఇస్తే , అది నిష్ప్రయోజనమే కాక, ఆ యజమానికి నరక ప్రాప్తి తప్పక కలుగును అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. 

ఈ కాలము ’ ఎంత ఇవ్వాలి ?’ అని ముందే అడుగుతున్నారు. లేదా , అతి తక్కువ ఇవ్వ జూపి, బ్రాహ్మణుడి చేత " అంత చాలదు, ఇంకాఎక్కువ ఇవ్వండి " అని చెప్పించుకునేలా చేస్తున్నారు. బ్రాహ్మణుడిచేత అలాగ నోరుతెరచి ’ దక్షిణ ఇంత ఇవ్వాలి ’ అని చెప్పించుకుంటే , అది మరొక పాపముగా పరిగణింపబడుతుంది. దానికి ప్రాయశ్చిత్తముగా ఇంకా ఎక్కువ ఇవ్వవలసి ఉంటుంది. ఇవన్నీ ధర్మ శాస్త్రాలలో విపులముగా చర్చించిన విషయాలు. 

బ్రాహ్మణుడి చేత తమకు కావలసిన కార్యము  జరిపించుకుని , తామేదో దానము ఇస్తున్నట్టు అహంకారము చూపిస్తూ బ్రాహ్మణులను తక్కువ చేసి వేధించేవారికి కులనాశనము , వంశ క్షయము , కుటుంబములో ఈతి బాధలు మొదలవుతాయి. 
బ్రాహ్మణుడు కూడా ఎప్పుడూ తన నోటితో ’ నాకు ఇంత కావలెను, ఇది కావలెను ’ అని అడుగరాదు. అలా అడిగితే , ’ మీ పాపము నాకు రావలెను ’ అని అడిగినట్టే. అలా వచ్చిన పాపమును పోగొట్టుకొనుట అంత సులభము కాదు. 
" ఈ కాలములో ఇంత ఇస్తున్నారు, మీరు చూసి, శక్తివంచన లేకుండా ఇవ్వండి ’ అని చెప్పవచ్చును. 

ఇక చివరగా " గురుదక్షిణ " 
గురువుగారు తాను విద్యాదానము చేసిన శిష్యుడి నుండీ తీసుకునే దానమే " గురుదక్షిణ " 
గురుదక్షిణ ’ ఇది ’  లేక ’ ఇంత ’ అని గురువు చెప్పవచ్చును. లేదా గురువుగారికి ఏది అవసరమో, ఏది ఇష్టమో చూసి శిష్యుడే తెలుసుకొని ఇవ్వవచ్చును. గురుదక్షిణ ఇవ్వడానికి ఒక కాలపరిమితి అంటూ లేకపోయినా , సాధారణముగా విద్యార్జన అయిన తరువాత వెంటనే ఇచ్చుట ఆనవాయితీ. 

|| స్వస్తినో బృహస్పతిర్దధాతు || 

Friday, March 30, 2018

శృంగేరీ జగద్గురువుల సంస్కృత అనుగ్రహ భాషణము-- తెలుగు అనువాదము

|| ఓం శ్రీ గురుభ్యో నమః ||


శృంగేరీ జగద్గురువులు గత జనవరి నెలలో శృంగేరీ క్షేత్రములోని ఒక సంస్కృత విద్యాపీఠపు రజత మహోత్సవములో , సంస్కృత భాష , శాస్త్రములు , వేదములు మానవజీవితానికి ఎందుకు అవసరమో తెలుపుతూ చేసిన సంస్కృత భాషలోని అనుగ్రహ భాషణమును తెలుగులోకి అనువదించాను. 

ఇందులో  సరిగ్గా నేను అనువాదము చేసి ఉంటే , అదంతా జగద్గురువుల ఆశీర్వాద బలముచేతమాత్రమే . ఏవైనా తప్పులు ఉంటే అవి నా అజ్ఞానము వల్లనే. దానికి ముందస్తు క్షమాపణలు .


|| నిత్యాక్ష హారం మణివలయ 
మనోజ్ఞేః పాణి పద్మైర్దధానా ||
|| సితవసన లలామా  తుంగ ముక్తాభిరామా |
| వసతు శశినిభాస్యా వాచి వాగ్దేవతా నః ||


పాతిక సంవత్సరాల పూర్వము ఈ శృంగగిరి క్షేత్రములో  ప్రారంభించబడిన ’ రాజీవ్ గాంధీ విశ్వవిద్యాలయము’   పేరుతో వ్యవహరింపబడుతున్న ఈ సంస్కృత విద్యాలయము యొక్క రజత మహోత్సవము ప్రస్తుతము జరుపుకుంటున్నందుకు  అత్యంత సంతోషించినాము.

ఈ విద్యాలయము యొక్క ప్రారంభము ఏవిధముగా జరిగినది అన్నది , ఈ మఠము యొక్క ప్రశాసనములో స్వకీయమైన భాషణము ద్వారా నిరూపించబడినది . 

దీనికి ముందే , శృంగగిరి క్షేత్రములో చాలా కాలమునుండీ వేద, శాస్త్రముల ప్రచారము కోసము ఒక సంస్కృత పాఠశాల నడుస్తున్నది. మా పూజ్య గురువులు , ప్రాతఃస్మరణీయులుయైన జగద్గురు శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతీ స్వామి వారి చేత నూట ఇరవై ఐదు సంవత్సరముల ముందు ఈ క్షేత్రములో " సద్విద్యా సంజీవిని " పేరుగల సంస్కృత మహాపాఠశాల ఆరంభింపబడినది. ఆ పాఠశాలయొక్క ఏకైక లక్ష్యము, ’ వేద, శాస్త్రముల ’ ప్రచారము చేయుట. 

’ వేద శాస్త్రముల గురించి మాత్రమే ఎందుకు ’ అని మీరు అడిగితే , వేదశాస్త్రముల ప్రచారమే లేకపోతే , అప్పుడు మనము మన ధర్మము యొక్క స్వరూపాన్ని తెలుసుకొనుటకు అశక్తులము అవుతాము. ఏలననగా , ధర్మముయొక్క స్వరూపము వేదశాస్త్రముల చేతమాత్రమే తెలుసుకొనదగినది. వేదశాస్త్రాల్లో ధర్మము యొక్క స్వరూపము నిక్షిప్తమై ఉంటుంది. ఒకవేళ వేదముయొక్క , లేదా శాస్త్రము యొక్క జ్ఞానము లేకుంటే , ఆ ధర్మమును ఇంకేవిధముగానూ తెలుసుకోలేము. ఎప్పుడైతే ధర్మముయొక్క స్వరూపమునే  తెలుసుకోలేమో, అప్పుడు దాన్ని ఎలాగ అనుష్ఠించగలము , ధర్మానుష్ఠానము లేకుండా సుఖము ఏలాగున లభ్యమగును ?. సర్వజనులూ తమకు సుఖమునే కోరుకొందురు. ఆత్మ సుఖము కోరనివాడు, లేదా తనకు దుఃఖము కోరుకొనువాడు ఎవరూ ఉండడు. అట్టి సుఖముయొక్క అభిలాష ధర్మాచరణ చేత మాత్రమే సిద్ధిస్తుంది. ధర్మాచరణము లేకుండా సుఖప్రాప్తిగానీ , సుఖవాంఛ గానీ అత్యంత అనుచితమైనది. అసాధ్యమైనది కూడా!  కాబట్టి, ధర్మాచరణము చేయవలెనంటే , ధర్మపు జ్ఞానము అవసరము , ధర్మాన్ని తెలుసుకొనుటకు వేదశాస్త్రాల పరిచయము అత్యావశ్యకము. 

అందుకని ఈ వేదశాస్త్రముల ప్రచారము అత్యంత అపేక్షితమైనది అని భావించి ఆ పాఠశాల ఈ క్షేత్రములో నూట ఇరవై అయిదు సంవత్సరాల పూర్వము ప్రారంభింపబడినది. 

ప్రస్తుతము, లోకుల మనసులలో విదేశసంస్కృతి , మన సంస్కృతికన్నా ఎక్కువగా ప్రచారములో ఉంది. విదేశ సంస్కృతి చేత ఆకర్షింపబడిన ప్రజలు విదేశ సాంప్రదాయాలను ఆచరించుట చాలా సముచితము అన్న భ్రమలో ఉన్నారు. విదేశీయులు దేన్ని ఆచరిస్తున్నారో, వారు ఎలాగ వేషభూషణ భాషలను ప్రదర్శిస్తున్నారో , వారు ఏ విధముగా భోజనము చేస్తారో ,ఏ విధముగా గానము చేస్తారో అదే మంచిది అన్న భ్రమ, మనవారి మనసులలో నిలచిపోయింది. మన వాస్తవికమైన స్థితి ఎటువంటిది, మన నిజమైన సాంప్రదాయాలు ఎట్టివి అన్నది మనవారు అందరూ మరచిపోయారు.


 ఈ దుష్ట పరిస్థితి, రెండువందల యాభై సంవత్సరాలనుండీ, ఆంగ్లేయుల పరిపాలన జరగడము వలన మన మనసులు కలుషితమై  ప్రావిర్భవించినది . ఆ ఆంగ్లేయులు, " ఎప్పుడైతే ఈ భారతీయులు తమ స్వధర్మాన్ని మరచిపోతారో,  తమ సంస్కృతిని మరచిపోతారో,  తమ సంస్కృత భాషను మరచిపోతారో, అప్పుడే తమ కార్యము సులభముగా చేయవచ్చును "  అని వారు అనేక కార్యాలను చేయనెంచినారు.  వారికి ఇఛ్ఛ వచ్చినట్టు చేయవచ్చని , మన సంస్కృత భాషను ’ మృత భాష ’ గా ప్రచారము చేయాలని భావించి అటువంటి కార్యాలను మొదలుపెట్టారు. 

" ఎప్పుడైతే   మన సంస్కృత భాషపై జనులకు శ్రద్దాసక్తులు తగ్గిపోతాయో , అప్పుడు ఎవరూ ఈ భాషను అభ్యసించరు, మరియు, ఈ భాషయొక్క అనభ్యాసము వలన వేద శాస్త్రాల అభ్యాసము లుప్తమవుతుంది, సనాతన ధర్మపు గ్లాని కలుగుతుంది అప్పుడు అందరూ విదేశీ సంస్కృతిని ఆచరిస్తారు " అని వారు తలచి, సర్వ ప్రథమముగా సంస్కృత భాషను ’ మృతభాష ’ అని ప్రచారము చేసి మన మనసులలో సంశయాలకు బీజము వేసినారు.

 మనలోని కొందరు మూర్ఖులు, వారు చెప్పినది సత్యమని తలచి మన భాషను విస్మరించి, సంస్కృత భాషపైన శ్రద్ధను వహించక తాత్సారము చేసి సంస్కృత భాషాభ్యాసము మానేసి తమ జీవితాలను గడుపుచుండేవారు. దానితో ఆంగ్లేయులు తాము కృతార్థులమైనట్టు భావించారు. తాము అనుకున్నది జరిగింది, అందరూ తమ సంస్కృతభాషను మరచేటట్టు చేశాము , దీనితో మేము పూర్తిగా కృతార్థులము అయినట్టే అని వారనుకున్నారు. 


అయితే పరమేశ్వరుని కృపవల్ల, మన భారతీయుల మనసులలో సంస్కృతభాష పైన శ్రద్ధ అంకురించింది. ఆ శ్రద్ధను అంకురింపజేయుటకు , ఆ శ్రద్ధను వృద్ధిచెందించుటకే మన పరమపూజ్య గురుసమానులు కొన్ని ప్రయత్నాలను చేయాలని అనుకున్నట్టుగానే , వారి ప్రయత్నములచేతనే శృంగేరీ ’ సద్విద్యా సంజీవిని ’ సంస్కృత పాఠశాల సమారంభమైనది. వారిమార్గములోనే నడుస్తున్న మనము , ఆ సంస్కృత భాషా ప్రచారము కోసము ఎన్నో దారులు వెతికాము. " సుర సరస్వతీ సభా" యొక్క ప్రతిష్ఠాపనము, అక్కడక్కడ సంస్కృత పాఠశాలల ఉద్ఘాటన , శాస్త్ర సభల ఆయోజనము , శాస్త్రవిద్వాంసుల సమ్మానము, శాస్త్రాధ్యయనము చేసేవారికి ప్రోత్సాహము , ఇటువంటి విహితమైన క్రమములు మాచేత చేపట్టబడినవి. 

దీని ఫలితముగా అక్కడక్కడా సంస్కృత విద్వాంసులను ఈనాడు మనము చూస్తున్నాము. సంస్కృతము మీద ఉత్సాహము , శ్రద్ధ గల విద్యార్థులను చూడగలుగుతున్నాము.  మరియూ , శాస్త్ర , వేద విషయములలో కూడా శ్రద్ధ కలిగిన ఆస్తికులను కూడా చూడగలుగుతున్నాము. ప్రస్తుతము చాలామంది ఆస్తికులు ఉన్నారు. వారు స్వయముగా సంస్కృతము గానీ , వేదమునుగానీ నేర్వకున్ననూ , ఎరుగకున్ననూ , వాటిలో అతిగొప్ప శ్రద్ధను కలిగిఉన్నారు. 

సంస్కృతముయొక్క ప్రచారమునకు సహాయము చేయుటకు ’ నేనంటే నేను ’ అంటూ ముందుకు వస్తున్నారు. అందువల్ల ఈ సంస్కృత ప్రచారము కొరకు మేము చేస్తున్న ప్రయత్నాలలో ఇక్కడ , శృంగేరీ సంస్కృత విద్యాపీఠము యొక్కస్థాపనము అనన్యమైనది . 

పూర్వ ప్రధాని , మమ్ములను చూచుటకు శృంగేరికి వచ్చినపుడు, వారి సమక్షములో ఈ విషయము మాచేత ప్రస్తావించబడినది. వారు కూడా మా మనసులోని ఈ సంకల్పాన్ని  ఎంతో శ్రద్ధతోను, సంతోషముతోను ఆమోదించినారు. మా సంకల్పము ను తప్పక నెరవేర్చెదమని ప్రతిజ్ఞ చేసినారు. వారి ప్రతిజ్ఞాపాలనము వల్లనే , ఈ ’ రాజీవ్ గాంధీ విద్యాలయము ’ అను  సంస్కృత విద్యాపీఠముయొక్క స్థాపనము జరిగినది. మా మనస్సు అత్యంత ప్రమోదమును పొందినది. భగవతీ శారద మా పైన అత్యంత అనుగ్రహము కలిగియున్నది అన్న తృప్తి కలిగినది. 


విద్యాపీఠముయొక్క స్థాపనమయితే అయింది కానీ అందులో అధ్యాపకులు ఎటువంటి వారుండవలెను , ఇక్కడ అధ్యయనము ఏ విధముగా జరగాలి, అని మరలా మా మనసులో కొంత దిగులు కలిగినది. ఆ దిగుళ్ళు కూడా భగవతీ కృపవల్ల నివారించబడి,  న్యాయము , వేదాంతము , వ్యాకరణములలోను, మీమాంస లోనూ నిష్ణాతులైన విద్వాంసులు ఇక్కడ నియమింపబడినారు.  మరి యే విద్యాపీఠములలోనూ చూచుటకు దొరకనటువంటి విద్వాంసులు ఇక్కడ అధ్యాపనములో నిరతులై ఉండుట మేము భగవతీ శారద యొక్క కృపగా భావిస్తున్నాము. 

ఇక్కడ అధ్యయనము చేస్తున్న విద్యార్థులు కూడా అమిత ఉత్సాహముతో , గొప్ప శ్రద్ధాభక్తులతో అభ్యసిస్తున్నారు. ఇదంతయూ సాక్షాత్కరించుకోవడము , సర్వులకూ శుభము కలుగుట ,  భగవతీ శారద యొక్క అనుగ్రహము తప్ప మరొకటి కాదు అనుటలో యేమాత్రమూ  సంశయమూ లేదు. 


ఈ సురభారతి యొక్క ప్రచారము మా అందరి అన్ని కర్తవ్యములకన్నా అత్యంత ముఖ్యమైనది అని మేమందరమూ  భావిస్తున్నాము. అందరికీ ఒక్కొక్క కర్తవ్యము ఉంటుంది ,  కానీ అందరూ కలసి ఒక్క కార్యమును చేయుట అనేది సుర సరస్వతి యొక్క ప్రచారము. కాబట్టి మా కర్తవ్యమునుండి  ఎప్పుడైనా కూడా , యే మాత్రము కూడా విచలితులము కాకూడదని , ఏ విధమైన కష్టములు వచ్చినా కూడా  ఈ కర్తవ్యము తప్పక నిర్వహించవలసినదే అని, ఈ కర్తవ్యాన్ని మేము నెరవేర్చవలసినదే ఈ సంకల్పము అందరి మనసులలోనూ సుదృఢముగా ఉండాలని నా కోరిక. 

చాలామంది , " శాస్త్రములను అధ్యయనము చేస్తే ప్రయోజనమేమి ? "  అని సంశయిస్తారు. అయితే ఒక్కొక్క శాస్త్రమునూ అధ్యయనము చేస్తేనే గానీ అక్కడ ఎన్నెన్ని విషయములు ఉన్నవి , మన జీవితాలను సార్థకము చేయుటకు ఎన్ని మార్గములు శాస్త్రములలో చెప్పబడినవి , అన్న విషయము శాస్త్రాధ్యయనము  తరువాత మాత్రమే తెలుస్తుంది. శాస్త్రము చదవకుండా వాటిని అర్థము చేసుకొనుట వీలుకాదు. కాబట్టి, శాస్త్రములను అవగాహన చేసుకొని , జీవితమును ఫలవంతముగా గడిపే దారి ని శాస్త్రాధ్యయనము ద్వారా సరిగా  తెలుసుకోగలుగుతాము. 


సర్వులకూ జీవిత అంతిమ లక్ష్యము మోక్ష ప్రాప్తి. మోక్షప్రాప్తితోనే  జీవితము సార్థకము అవుతుంది.  లేకపోతే మరల మరల ఈ జీవన ప్రవాహములో మగ్నము , నిమగ్నము అగుటయే మన భాగ్యము అవుతుంది. ఎంతవరకూ మనము ఈ జనన , మరణ ప్రవాహము నుండీ బయటకు రాలేమో , అంతవరకూ  మనకు సుఖలేశమూ ఉండదు , లేదు.  ఈ జనన మరణ ప్రవాహమునుండి బయటకు ఎప్పుడు రాగలమంటే , శాస్త్రములలో యే సాధన మార్గములు చెప్పబడి ఉన్నవో , వాటి అనుసరణము చేత మాత్రమే అది సాధ్యము. ఆ మార్గములు శాస్త్రములచేత మాత్రమే ప్రదర్శింపబడినవి, శాస్త్రములచేత ఉక్తమైన  ప్రదర్శింపబడిన అట్టి సన్మార్గములు మాత్రమే మన చేత పాటింపదగినవి. కాబట్టి అందుకోసమే మనమందరికీ శాస్త్రాధ్యయనము అనివార్యము అయినది. 

పూర్తిగా శాస్త్రాధ్యయనము చేయలేకున్ననూ , వాటిలోని సారాన్ని గ్రహించి పాటించి , జీవితాలను సార్థకము చేసుకొనుట మన విధి. కాబట్టి మన అందరి అభ్యుదయము కొరకూ మూలభూతమైనవే ఈ రెండూ-- శాస్త్రము , మరియూ సంస్కృత భాష. కాబట్టి శాస్త్రముల అధ్యయనము , వేదాభ్యాసము అనునవి మన శ్రేయస్సుకోసమే కల్పింపబడినవి. మన శ్రేయస్సును మనమే సాధించాలి. వేరొకరు మన శ్రేయస్సుకు సాధకులు కాలేరు. మన శ్రేయస్సును మనమే సాధించాలంటే , శాస్త్రాలను , సంస్కృత భాషను అవశ్యము అభ్యసించవలెను. దానికోసమే ఈ విద్యాపీఠము సమారంభమైనది .. 

ఇప్పుడు దీనికి ఇరవై అయిదేళ్ళు గడచినవి. ఇరవై ఆరో సంవత్సరములో ఈ విద్యాపీఠము అడుగు పెట్టబోతున్నది. ఇదే విధముగా ఇంకో ఇరవై అయిదేళ్ళ తరువాత స్వర్ణోత్సవము , అటు పిమ్మట శతమానోత్సవము కూడా జరుగుతుంది. అటువంటి ఆ ఉత్సవాలలో భాగము వహించుటకు మాకు సాధ్యము కాకున్ననూ , ఈ ఉత్సవాలు తప్పకుండా జరుగుతాయి అని విశ్వసిస్తున్నాము. శారదా భగవతిని మీ అందరి శ్రేయస్సు అనే పరంపరలో భాగము వహించమని ప్రార్థిస్తున్నాము. 


ఈ రజత మహోత్సవము యొక్క ఆచరణలో గొప్ప శ్రద్ధతోను, ఉత్సాహముతోను అనేకులు తమ కర్తవ్యాన్ని నిర్వహించినందుకు మీ అందరికీ ఆశీర్వాదములను ఇస్తున్నాను. 
ఈ కర్నాటక రాజ్యము యొక్క రాజ్యపాలులైన  సహృదయాగ్రేసరులు వజుభాయి వాలా  మహోదయులు ఇక్కడికి వచ్చి , తమ భావములను ఇక్కడ ప్రకటించినారు. అది విని మాకు అత్యంత ప్రమోదము కలిగినది. మన భారతీయ సంస్కృతి , మన సంస్కృత భాషలలో వారికున్న శ్రద్ధ ఎంతో శ్లాఘనీయము. అందుకు వారికి విశిష్ట ఆశీర్వాదములను అందిస్తున్నాము. ఇదేవిధముగా , మన కర్నాటక సంసద్ సదస్యులు , మన శృంగేరీ శాసక సభ్యులు , కర్నాటక విత్తకోశపు మహా ప్రబంధకులు మొదలుగా అనేకులు ఇక్కడికి వచ్చి సంసృత భాష మీద తమకు గల శ్రద్ధను ఇక్కడ ప్రకటించినారు. వారందరికీ కూడా మా ఆశీస్సులు.  ఈ సంస్థానము యొక్క కులపతి ’ పరమేశ్వర నారాయణ భట్టులు , ఈ  విద్యాపీఠముయొక్క ప్రాచార్యులు సచ్చిదానంద భట్టు లు ఈ కార్యక్రమమును ఎంతో శ్రద్ధతో చేసినందుకు వారికి నా ఆశీర్వాదములు. ఇక్కడ సమావేశమైన సర్వులకు భగవతీ శారద తన శ్రేయః పరంపరతో సర్వదా సర్వులనూ  అనుగ్రహించాలని  ప్రార్థించి , అందరికీ ఆశీర్వాదములతో నా భాషణమును ముగిస్తున్నాను. 

https://www.youtube.com/watch?v=c2Fduv_9dz8