ఈనాడు గోవధ గురించి విశేష చర్చ జరుగుతున్నది. గోవులను హింసించరాదనీ , గోమాంస భక్షణ చేయరాదనీ సనాతన ధర్మ పరాయణులు అంటుంటే , ఒకరి ఆహారపుటలవాట్లను నియంత్రించుటకు ఇంకొకరికి అధి కారము లేదు అంటూ మరి కొందరు వాదిస్తున్నారు.
మానవుడు సహజముగా స్వేచ్ఛాజీవి. తన మనసుకు నచ్చినట్లు ఉండుట , ప్రవర్తించుట ...అతని ప్రాథమిక హక్కులు. కానీ ఇక్కడ గమనించవలసినది యేమంటే , ఆ ప్రాథమిక హక్కుల వలన అతడికి సంతృప్తి కలిగినంత మాత్రాన చాలదు. ఇతరులకు అసంతృప్తిగానీ కష్టము గానీ కలుగరాదు. ఎందుకు ?
ఎందుకంటే , మానవుడు సంఘజీవి.. అరణ్యాలలో , ఇతరుల సంపర్కము లేకుండా జీవించేవారికి అంతటా స్వేచ్ఛే ఉంటుంది. కానీ ఎప్పుడైతే సంఘములో ఉండి జీవించాలనుకుంటాడో అప్పుడే కట్టుబాట్లు మొదలవకా తప్పదు , వాటిని పాటించకా తప్పదు. నేను ఇవేవీ పాటించను , నా అలవాట్లు , నా ఇష్టము అంటూ వాదిస్తే , దాని అర్థము , " నేను ఆదిమ వాసిని , నాకు యే సంస్కారమూ లేదు , నాకు ఒకరి కష్టాలతో గానీ భావాలతో గానీ పని లేదు " అని నిర్లజ్జగా చెప్పుకున్నట్టే.
ఒకవేళ , దీనికి కూడా సమ్మతించని వారుంటే , నిస్సందేహముగా వారు తమ వాదనను , తమ హక్కులను గురించి తగిన వేదికలలో [ కోర్టులు వంటివి] చర్చించి ఒక తెన్నుకు రావచ్చు.
ఈ వ్యాసపు ఉద్దేశము , గోమాంస భక్షణ చేయవచ్చునా కూడదా అన్నది కానేకాదు.
మరోసారి చదవండి ,
ఈ వ్యాసపు ఉద్దేశము , గోమాంస భక్షణ చేయవచ్చునా కూడదా అన్నది కానేకాదు.
అది నిర్ధారించుటకు సాధికారికత కలిగిన అనేకులున్నారు.
గోమాంసము తినవచ్చు అని వాదించేవారు కొందరు , సనాతన ధర్మములో అతి పవిత్రముగనూ , ప్రామాణికము గనూ భావించి పూజించే వేదాలను వక్రీకరించే ప్రయత్నము చేస్తూ , తమ వాదనకు బలము తెచ్చుకోవడానికి సమాయత్తమవుతున్నారు. వారి వక్రీకరణలు , వాదనలూ సత్యదూరాలనీ , యే మాత్రమూ బలము లేనివనీ , ఎంతమాత్రమూ గౌరవించవలసినవి కావనీ సత్యాలతో , సాక్ష్యాలతో సహా నిరూపించుటయే ఈ వ్యాసపు ఉద్దేశము.
వేదాలలో వర్ణించిన యజ్ఞ యాగాదులలో గోవధ , గోమాంస భక్షణ ఉన్నాయనీ కాబట్టి గోవధ తప్పేమీ కాదని గోమాంస భక్షణ అనాదిగా హిందువులు చేస్తూనే ఉన్నారనీ ఇప్పుడు కొత్తగా వాటిని నిషేధించడము యేమిటనీ ... ఇటునుంచీ నరుక్కు రావడానికి వారు ప్రయత్నిస్తున్నారు. మనసంతా మురికి పట్టిన మరి కొందరు , ఆ నటుడు , ఈ రాజకీయ వేత్త , ఫలానా పాత్రికేయుడూ హిందువులు మాత్రమే కాక , బ్రాహ్మణులు కూడా అనీ , వారే గోమాంసము తింటున్నారనో , లేక తప్పుకాదంటున్నారనో.... తమ వాదనను ఇతరులచేత ఒప్పించాలని విశ్వ ప్రయత్నము చేస్తున్నారు.. ఆ స్థాయికి దిగిపోయిన వారిని పట్టించుకోవడమే వృథా. అసలు వేదములో చెప్పినదేమిటి ?
వేదాలలో గోవును పూజించి రక్షించమనే చెప్పి ఉంది గానీ గోవును హింసించమని ఎక్కడా చెప్పలేదు.
యజ్ఞయాగాలను సంపూర్ణముగా వివరించేది యజుర్వేదము మాత్రమే. యజ్ఞ యాగాలకు సంబంధించిన సమగ్ర సమాచారమూ సాధికారికముగా చర్చించినది యజుర్వేదములో మాత్రమే.. ఇతర వేదాలలో కూడా అక్కడక్కడా కనపడవచ్చు.. అది కూడా యజుర్వేదముతో అంగీకరిస్తూ ఒకదానినొకటి సమర్థించుకుంటూ సమభావముతో వివరింపబడి ఉంటుందే తప్ప ఒకదానికొకటి ఎక్కడా విరోధము ఉండదు. యాగాలకూ పశువధకూ సంబంధము ఉందా లేదా అనేది, ఆయా మంత్రాల నిజమయిన అర్థము తెలిస్తేనే అవగతమయ్యేది. కేవలం సంస్కృత భాష తెలిసినంత మాత్రాన మంత్రాల అర్థాలను తెలుసుకోలేము. అసలు వేద మంత్రాలే బీజాక్షరాలతో , బీజార్థములతో ఉంటాయి.. అంటే , అతితక్కువ అక్షరాలలో అనంతమైన అర్థము ఇమిడి ఉంటుంది. వేదమంత్రాలంటే మామూలు సంస్కృత శబ్దాలు కాదు. అందుకే ఆ శబ్దాల యొక్క ప్రభావము అంత ఎక్కువ. వాటిని ఎంతో విజ్ఞతతో సమన్వయము చేయాల్సి ఉంటుంది
యజుర్వేదపు ప్రారంభములోనే , మొట్టమొదటి మంత్రము.. " ఇషేత్వోర్జేత్వా వాయవస్థో పాయవస్థ... -----బహ్వీర్యజమానస్య పశూన్ పాహి "
పై మంత్రార్థము చూస్తే , ఇది పశువులను , ముఖ్యంగా వత్సములను ( దూడలను ) కాపాడుటకోసం ప్రయోగించబడుతుంది. దర్శ యాగములో ఇంద్ర దేవతలకు పెరుగును ’ హవిస్సు ’ గా అర్పిస్తారు. ఆ పెరుగు దొరకాలంటే గోవులను ఆశ్రయించక తప్పదు. పాలు దొరికితేనే కదా , పెరుగు తయారయ్యేది ! ఆ పాల కోసము , ఆవుదూడలను కొంతపాలు తాగిన తర్వాత తల్లినుండీ వేరు పరచక తప్పదు. పాలు కావాలంటే ఇదే విధి. ఆ దూడలకు , వేరే ఆహారాన్ని ఏర్పాటు చేయాలి. దూడలను ఆవునుండీ వేరు చేయాలంటే , వాటిని అదిలించో , ఆశపెట్టో ఆ పని చేయాలి. వాటికి హింస కలుగరాదు. కాబట్టి , ఒక మోదుగ కొమ్మను చెట్టునుండీ కత్తరించి , ఆకులు గల ఆకొమ్మతో దూడలను అదిలిస్తారు. తర్వాత వాటిని పచ్చిక మేయడానికి పంపిస్తారు. వాటికేమాత్రం బాధ కలగరాదని , వాటిని ఇలాగ ప్రార్థిస్తారు. " ఓ దూడలారా , మీరు వాయువులు కండి ( అంటే , ఇంకో అర్థము , మాతృ సమీపము నుండీ దూరము వెళ్ళండి.) . ఆ వాయువే మిమ్మల్ని రక్షించు గాక ( పశువులకు దేవత అంతరిక్షము , ఆ అంతరిక్షానికి అధ్యక్షుడు వాయువు ) గడ్డి మేసి , సాయంకాలానికి మరలా యజమాని ఇంటికి తిరిగి రండి.."
తర్వాత , గోవులను ఇలాగ ప్రార్థిస్తారు, " ఓ గోవులారా , సర్వప్రేరకుడైన ఆ సవితృ దేవుడు మిమ్మల్ని శ్రేష్టమైన కర్మ అగు యాగానికి హవిస్సును కలుగజేయుటకు ప్రేరేపించనీ.. దేవతలకు ఇవ్వతగిన పాలు , పెరుగు , నేయి మొదలైనవి , మీనుండీ గాక , ఇంకెక్కడ లభించును ? గోవులారా , మీరు హింసకు ఏమాత్రమూ అర్హురాళ్ళు కాదు. ( గోవులను ’ అఘ్ని ’ అని అంటారు... అంటే హింసింపకూడనివి ) మీరు మొదట మీ బిడ్డలకు , తర్వాత మనుషులకూ పాలిచ్చి , పుష్టిని కలిగిస్తున్నారు. ఇప్పుడు బాగా గడ్డి మేసి , ఇంద్రాది దేవతలకు కావలసిన హవిస్సును కూడా ఇవ్వండి.. మిమ్మల్ని , దొంగలు అపహరించకుందురు గాక. కౄర మృగాలు హింసింపకుండు గాక , రుద్రుడూ , రుద్రాయుధాలూ మిమ్మల్ని తాకకుండు గాక ( రుద్రుడి పని , కనిపించినవారిని హింసించుటయే ) మీ సంతతి వృద్ధియై , యజమానుని శాల నిండనీ !
తర్వాత , మోదుగ చెట్టును ( కొమ్మను ) ఇలాగ ప్రార్థిస్తారు. ఓ పాలాశమా , దేవతలకు కావలసిన ఆహారము కోసము , నిన్ను వాడుకుంటున్నాను. నిన్ను నమస్కరించి నిన్ను కత్తరిస్తున్నాను. దూడలు నిన్ను చూడగనే , బెదురు లేకుండా మరలిపోయేటట్టు చేయి , [ మోదుగకు మనసును ప్రభావితం చేసే సమర్థత ఉంది. యాగాలలో మోదుగను ఉపయోగించుట అందుకే ] అలాగే యజమానుని గోవులను రక్షించు..
లోకకల్యాణార్థమై , ఒక్క యాగము కోసము , యాగము సక్రమంగా జరిగి , ఎవరికీ ఏ బాధా కలుగరాదని , వాటికి అవసరమైన అన్నిటినీ ప్రార్థించి గానీ మొదలుపెట్టని సంప్రదాయాన్ని మనకు వేదము నేర్పింది.. ఇవే కాదు , ఇంకా వేరు మంత్రాలలో , మట్టినీ , నీటినీ ఇతర పదార్థాలనీ ఇలాగే ప్రార్థించే సన్నివేశాలు కనిపిస్తాయి.
ఈ అవగాహన లేకుండా , వేదాలలో హింసను ప్రేరేపించే అంశాలు ఉన్నాయనీ , పశు వధ ధర్మ సమ్మతమేననీ తమ స్వార్థము కోసము వక్రీకరించేవారు.. రేపు ఇంకెటువంటి పనిని అయినా చేయగల సమర్థులే.
అసలు , వేదముతో మాకేమిటి పని , మేము వేదములో చెప్పినదాన్ని ఎందుకు పట్టించుకోవాలి ? అది మా మతము కాదే ? అనే వారూ ఉన్నారు.. అలాంటి వారు తెలుసుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి..
వేదము భారతీయులకు మాత్రమే సంబంధించినది అని కొందరూ , కాదు , హిందువులకు మాత్రమే సంబంధించినవి అని మరికొందరూ , కానేకాదు , బ్రాహ్మణులకు మాత్రమే అని మరి కొందరూ.. యే మాత్రమూ కాదు , బ్రాహ్మణులలో మగవారికి , అందులోనూ ఉపనయనము అయిన వారికి మాత్రమే అంటూ అనేకులు భావిస్తుంటారు..
అవన్నీ తప్పే.
వేదాలున్నవి సర్వ మానవాళి కోసము .. ఎందుకలా ? ఎందుకంటే , అందులో ఉన్నవి అభిప్రాయాలు కావు. మానవాభ్యుదయానికి ఎలా జీవించాలో యేయే ధర్మాలను పాటించాలో యేది చేస్తే మానవులకు శుభమో , యేది అశుభమో , యేది మంచో యేది చెడో... స్పష్టముగా చెప్పి ఉంది. ఇవన్నీ కూడా ప్రకృతి సహజమైన ’ న్యాయాల ’ మరియూ ’ ధర్మాల ’ ఆధారముగా చెప్పబడినవే. ఈ న్యాయాలు , ధర్మాలూ సర్వమానవులకూ సమానమే.. ఉదాహరణకు భూమ్యాకర్షణ అనే న్యాయం ఉందనుకోండి... అది మనుషులకే కాక సమస్త జీవులకూ అన్వయించేదే .. మతాలను బట్టి అది మారదు.. అలాగే వేదము లోని న్యాయాలు సమస్తజీవులకూ సౌహార్ద వాతావరణములో జీవించుటకు చెప్పబడినవే గానీ , ఒక దేశము వారికో , ఒక మతము వారికో , మగవారికో ఆడవారికో అని కాదు.
భూమ్యాకర్షణ న్యాయాన్ని అనుసరిస్తూ మరెన్నో ఇతర సూత్రాలు , సమీకరణాలూ తయారయ్యాయి... అవన్నీ సూత్రాలూ సమీకరణలే గానీ , స్వతంత్రముగా న్యాయాలు కావు. అవన్నీ భూమ్యాకర్షణ అనే న్యాయానికే కట్టుబడి ఉంటాయి.. అలాగే సనాతన ధర్మము అటువంటి అనేక ప్రకృతి సహజమైన న్యాయాల పుట్ట. సత్యము , అహింస , బ్రహ్మ చర్యము , మిత్రత్వము... ఇటువంటి వన్నీ సనాతన ధర్మాలే. ఇవే మన జీవన విధానాలు. ఇక మతాలు అనేవి మతాలే గానీ న్యాయాలు కావు , కాలేవు.. మతము అంటే అభిప్రాయము మాత్రమే..ధర్మము కాదు. మతాలెన్నున్నా అవి ప్రకృతి సహజమైన న్యాయాలకు లోబడి ఉంటూనే కొన్ని సమీకరణాలను కలిగి ఉంటాయి.. వాటికి ప్రత్యేక ప్రతిపత్తి లేదు. అవన్నీ ఒక మూల పురుషుడి అభిప్రాయాలనుండీ పుట్టినవి మాత్రమే. అటువంటి యే మతములో కూడా పరస్పర మైత్రి గురించి , అహింసను గురించీ వేదములో చెప్పినంత దృఢముగా , గాఢముగా చెప్పలేదు. ఇది తెలుసుకోవడానికి ఆయా మత గ్రంధాలను చదివే అవసరము లేదు. సర్వమత సామరస్యము , సహనము వంటివి ఒక్క సనాతన ధర్మాన్ని పాటించే వారికి తెలిసినంతగా ఇతర ’ మతాల ’ వారికి తెలియదు అని వారి చర్యలే చెబుతున్నాయి .. మా మతాన్ని పాటించకపోతే చంపేస్తామని కొందరూ , మా మతము లో చేరకపోతే నరకమే గతి యని మరికొందరూ భయపెట్టో , ప్రలోభపరచో చేస్తున్న ప్రయత్నాలే దానికి సాక్ష్యము. సర్వ మానవ మైత్రిని ఆకాంక్షించే వారయితే అటువంటి ఆలోచనలే రావు కదా...
సనాతన ధర్మము అలాగ కాదు,ప్రకృతి సహజమైన న్యాయాలకు అనుగుణంగా ఒక జీవన విధానాన్ని నిర్వచించేదే సనాతన ధర్మము. వేదాలు అనేవి అభిప్రాయాలు కావు. ప్రకృతి సహజ న్యాయాలు. లోకములో ఫలానా ఋతువులో ఫలానా పనులు చేయాలి , ఆ ఫలానా పనులను ఫలానా విధముగా చేయాలి , వంటి దేశకాలాలకు తగ్గట్టు చేయవలసిన కార్యాలను వివరిస్తాయి , అది కూడా మానవాభ్యుదయము కోసము మాత్రమే. ఎవరినో సంతోషపెట్టుటకు కాదు. మానవులందరికీ సమానముగా , మిత్రతా భావముతో లాభము కలిగించే అంశాలే ఉన్నాయి కానీ వేరు అభిప్రాయము గలవారికి నాశనము అంటూనో , కష్టాలు అంటూనో బెదిరింపులు ఎక్కడా లేవు. వేదాలకు మూలపురుషుడంటూ ఎవరూ లేరు.. అందుకే వాటిని " అపౌరుషేయాలు " అంటారు.. అవి మానవుడు రాసినవీ , తయారు చేసినవీ కాదు... భూమ్యాకర్షణ మానవుడు తయారు చేశాడా ? అలాగే.
మరి వేదాలలో అక్కడక్కడా కనబడే గోవధ , మాంస భక్షణ , అశ్వమేధము , పశుబలి , బలిపశువులను కట్టి వేయు యూప స్థంభము వంటి వాటి అర్థమేమిటి ?
అవన్నీ అవగాహనా రాహిత్యముతో ఊహించుకున్నవి మాత్రమే ...
మరి సత్యమేమిటి ?
దీనికి కొందరు ఇలాగ సమాధానమిస్తారు..
" గోవధ వేదకాలంలో యజ్ఞాలలో ఉండినదే. కానీ బ్రాహ్మణులు గోమాంసము తినేవారా అన్నదే వివాదాస్పదము.. అయితే , గోవధ " హింస " కాదా అని మీరు అడగొచ్చు. కాదు.
ఈనాటి మన సంకుచిత అర్థాలతోనూ , దృష్టితోనూ చూస్తే అది హింస అనిపించవచ్చు. ఈనాడైతే అది హింసే. కానీ ఆనాడు కాదు. ఎలా ?
||మా హింస్యాత్ సర్వా భూతాని , అహింసా పరమో ధర్మః ||
అనే శ్రుతి వాక్యము అన్నివేదాల ఒట్టు సారాంశపు మాట. హింస , అహింస అనేవాటికి సందర్భాన్ని బట్టి అర్థాలు మారుతాయి. దేశ రక్షణ చేసే సైనికులు శత్రువులను చంపితే అది అహింసే కానీ , హింస కాదు. ఒక రోగి కాలో చెయ్యో తీయాల్సి వస్తే , అది అహింసే. ఒక కార్యపు పరమార్థాన్ని చూడక , కార్యాన్ని మాత్రమే చూస్తే వచ్చే అనర్థమే అనేకులకు కలిగే అయోమయం. "
పై వాదనలో కొంత నిజముందని మొన్న మొన్నటి వరకూ నేను కూడా అనుకునే వాణ్ణి.. కానీ అది శుద్ధ తప్పని నిరూపణ అయింది [ ఎలాగో , కింద ఉంటుంది]
మరికొందరేమో , వేదకాలములో గోవధ ఉన్నా రానురాను అది సమంజసము కాదని అర్థము చేసుకున్న హిందువులు దానిని వ్యతిరేకించారు. కానీ వేదాలను పూర్తిగా కొట్టి పారేయలేక , గోవులను , అశ్వాలను , మేకలనూ పిండితో తయారు చేసి వాటిని బలి ఇచ్చే ఆచారము మొదలైంది.."
అని అంటున్నారు.
పై రెండు వాదనలూ సంపూర్ణముగా అసత్యములు , అవగాహన లేని మాటలూనూ.
మరి వాస్తవమేమిటి ?
వేదాలకు అనేకులు భాష్యాలు రాసినా , అన్ని వేదాలకూ భాష్యాలు రాసింది సాయణాచార్యుడు ఒక్కడే. వేర్వేరు వేద భాగాల్లో వచ్చే అవే మంత్రాల అర్థాల నిజమైన ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని సాయణాచార్యులంటారు ,
|| బిభేత్యల్ప శ్రుతాద్వేదః మామయం ప్రతరిశ్యతి ||
వేదమే ఇలా అంటుందట , " అల్ప జ్ఞానులైన మనుషులు నన్నే వక్రీకరించి మోసగించగలరు "
సత్యము తెలియాలంటే అతి ముఖ్యముగా ఒక సంగతి తెలుసుకోవాలి.
సంస్కృత పదాలకు సాధారణముగా లౌకికార్థము , వేదార్థము అని రెండు అర్థాలుంటాయి . ఆ భేదము తెలుసుకోకపోతే కలిగేది మనుషుల మధ్య , జాతుల మధ్య వైషమ్యాలే .వేదములోని మంత్రాలూ , శబ్దాలు అన్నీ కూడా ఒక ప్రత్యేకమైన " వైదిక " మరియూ " యౌగిక " శబ్దాలు. మామూలు సంస్కృత పదాలకు , వేదములోని అవే పదాలకూ అజగజాంతరము ఉంటుంది. ఆయా మంత్రాలను , సందర్భాన్ని బట్టి అర్థము చేసుకోవాల్సి ఉంటుందే గానీ ఆ పదాల సంస్కృత అర్థాలు తెలిసినంత మాత్రాన మంత్రపు అర్థము తెలిసినట్టు కాదు. అసలు వేద మంత్రాలే బీజార్థములతో ఉంటాయి.. వాటిని ఎంతో విజ్ఞతతో సమన్వయము చేయాల్సి ఉంటుంది.
మరి శంకరాచార్యుల వంటి వారు కూడా వేదాలలోని గోవధను వర్ణించినారు కదా , దానికేమి సమాధానము చెబుతారు ? అని మరి కొందరు అడుగుతారు.
వేదాలకూ , ఉపనిషత్తులకూ భాష్యాలు రాసిన శంకరులు అంతకు ముందరి భాష్యాలను చదవలేదనీ , అసలు శంకరులు వేదాలలో చెప్పిన దానికి భిన్నముగా కొత్తగా ఏదైనా చెప్పినారనీ అనుకుంటే అంతకన్నా అజ్ఞానము మరొకటి ఉండదు. వేదములలోని మంత్రాలు ఎలాగ బీజరూపములో , వాటి సరైన అర్థాన్ని వాటి ధాతువుల మూలముగా ఎలాగ అర్థము చేసుకోవాలో , శంకరుల భాష్యములనుకూడా అలాగే అర్థము చేసుకోవలెను. శంకరులు కూడా వైదిక , యౌగిక అర్థాలతోనే ప్రతిపాదించినారు కానీ లౌకిక అర్థాలతో కాదు. వారి భాష్యాలకు విపరీతార్థాలు కనిపిస్తే అది మన దోషమే గానీ వారి భాష్యాలలోని దోషము కాదు.
అలాగే , కొన్ని పురాణాలు , ఇతిహాసాలలో ఉన్న హింసకు సంబంధించిన వ్యాఖ్యలు ఒకానొక కాలములో " ధూర్తుల " చేత చేర్చబడినవే.. శాంతి పర్వములో " యూపం ఛిత్వా , పశూన్ హత్వా .." అంటూ స్వర్గానికి పోగల మార్గమును వర్ణించినారు. పశువులను అలాగ బలి ఇచ్చి స్వర్గానికి వెళ్లగలిగితే లోకం లో అందరూ స్వర్గానికే వెళ్ళవలెను కదా.. స్వర్గప్రాప్తి ఎంత సులభము ? అటువంటి మాటలన్నీ ఇతరులచేత ఆయా భాగాలలో చేర్చబడినవి. అవి మనకు ప్రమాణము కావు. వేదము మాత్రమే స్వతః ప్రమాణమైనది. ఎవరిచేతనూ మార్చబడుటకు అవకాశము లేనిది ఒక్క వేదము మాత్రమే. వేదము తనకు రక్షణగా వేదాంగాలైన జ్యోతిష్యము , [గణితము , ఖగోళము ], శిక్ష , వ్యాకరణము , ఛందస్సు , నిరుక్తము వంటివే కాక , పదపాఠము , క్రమ పాఠము , జటా పాఠము , ఘనపాఠములను కలిగియున్నది. వాటివల్ల ఎవరు ఎక్కడ ఏ చిన్నపాటి మార్పు , అక్షరములో గానీ స్వరములో గానీ-- చేస్తే వెంటనే తెలిసిపోతుంది. కానీ మిగతావి అలాగ కాదు. భారతము , రామాయణము , చివరకు భగవద్గీతలో కూడా ధూర్తులు అనేక మార్పులు , చేర్పులు చేశారు.
అందుకే వేదము మాత్రమే స్వతః ప్రమాణమైనది. మిగతావి ’ పరతః ’ ప్రమాణమైనవి.
కొందరు ’ మేధావులు " గా తమను తాము భావించుకునే వారు , ’ అశ్వమేధ ’ యాగము గురించి రాస్తూ , గుర్రమును చంపి వండుకోవటము , వండుతుండగా వచ్చే దాని సువాసనలనూ వర్ణించడమూ , అంతేనా , , గుర్రముతో యజమాని భార్య ఏమేమి చేస్తుందో... అలాంటివన్నీ తమ మకిలి పట్టిన మనసుతీరా ఉన్మత్తపు రాతలు రాసి శునకానందము పొందుతుంటారు.
తాము ఆధునిక వైజ్ఞానికులమనీ , ఎన్నెన్నో పరిశోధనలు చేసి మానవ జాతి " చరిత్ర ’ ను ఔపోసన పట్టామనీ , ఏవేవో పిచ్చిరాతలు రాసేవారు , సంస్కృతము ఒక్కటీ నేర్చుకుంటే చాలు , వేదాలను , సనాతన ధర్మాన్నీ భ్రష్టు పట్టేలా ఏదైనా , ఎలాగైనా వక్రీకరించి రాయొచ్చనీ , ఈ కాలము యువత సంస్కృతము నేర్చుకోదనీ , తెలిసిన పాతవారు వీటన్నిటినీ పట్టించుకోరనీ ధీమాతో తమ మనసులలోని అశుద్ధాన్ని ఏ మాత్రమూ సంకోచమూ, సంశయమూ, మొహమాటమూ లేకుండా బయట పెట్టుకుంటున్నారు.
శివపురాణములో కథానాయకుడు శివుడు , విష్ణు పురాణములో కథానాయకుడు విష్ణువు అంటూ ఇలాంటి వాళ్ళు చెప్పే ప్రతీదీ ఒప్పేసుకుంటూ పోతే మన ముఖాన మనమే మసి పూసుకున్నట్లే. అసలు నిజాలేమిటో కొన్ని చిన్న చిన్న ఉదాహరణలతో వివరిస్తాను.
యజుర్వేదములో " మా మా హిగ్ంసీ " అనగా , గోవులనూ , జంతువులను హింసించుట ఎంతమాత్రమూ తగదు " అని అంటుంది
యజుర్వేదములో కనపడే " పశుబలి " అనే మాటలకు అర్థము పశువులను బలి ఇచ్చుట కాదు , అది నిజానికి " పశుత్వ" బలి. కావాలన్న వారు " ధాతు రూప " శబ్దాలు ఎలా వచ్చాయీ , వాటి అర్థాలు ఎలా ఉంటాయీ అన్నది ధాతురూప కోశములలో చూడవచ్చు. వేదములోని శబ్దాలన్నీ ధాతువులనుండీ వచ్చినవే..
" మాంసము " అనగానే ఈనాడు ," నాన్ వెజిటేరియన్ " అనే అర్థము బలపడి పోయింది. వేదకాలములో ’ మాంసము ’ అంటే , ఫలములలోని గుజ్జు , దుంపలలోని గుజ్జు , అని మాత్రమే అర్థము.. ఈనాటి అర్థాలతో ఆనాటి వేదశబ్దాలను సంధానం చేస్తే జరిగే దుష్పరిణామమే ఇలాంటి వక్రీకరణలు.
పిశాచి అంటే దయ్యం అని అర్థం చేసుకుంటున్నాము.. అది ’ పిశం అస్తి’ పిశ అవయవే ’ అనే ధాతువుల నుండీ వచ్చినది అనగా , ఈ నాడు మనము చెప్పుకునే " నాన్-వెజిటేరియన్
" పిశాచమంటే అదే !
" భ్రాతృ " అనే పదానికి సంస్కృత అర్థము , ’ సోదరుడు ’ అని. కానీ దాని వేదార్థము యేమిటంటే , " శత్రువు " .
" న " అంటే కాదు అని సంస్కృతార్థము. కానీ " అదే విధమైన " అని వేదార్థము.
అంతేగాక , వేదమంత్రాలకు వర్ణాలతోపాటూ స్వరాలున్నాయని గుర్తుంచుకుంటే , ఒక్క చిన్న స్వర భేదముతో మంత్ర అర్థమే పూర్తిగా మారిపోతుందని ఎన్నో ఉదాహరణల ద్వారా చెప్పవచ్చు. అతి ప్రసిద్ధి పొందిన " ఇంద్ర శత్రు " అన్న పదాల అర్థాలు తెలిసినవే.
" ఆగఛ్చతు " అంటే రమ్మని అర్థము.. దాన్నే స్వరము మార్చి పలికితే , వెళ్ళమని అర్థము.
తెలుగులో మాత్రం అటువంటి పదాలు లేవా ? నేను వెళ్ళను అనుటకు , దీర్ఘము తీసి" నేను వెళ్ళనూ ? " అనుటకు భేదము లేదా ?
|| ఋచో ఆక్షరే పరమే వ్యోమన్ | యస్మిన్ దేవా అధి విశ్వే నిషేదుః |
యస్తన్న వేద | కిమ్ ఋచా కరిష్యతి ||
అన్న ఋగ్వేదపు మంత్రము కూడా , " ఒకడికి మంత్రార్థము తెలియకుంటే దానికి ఋగ్వేదము ఏమి చేస్తుంది ? " అని ప్రశ్నిస్తుంది.
[ బ్రహ్మాణమ్ బ్రహ్మ వాహసమ్--ఋగ్వేదమ్--౬-౪౫-౭
బ్రహ్మాణమ్ పరివృఢం , బ్రహ్మ వాహసమ్ బ్రహ్మభిః స్తుతిరూపైర్ మంత్రైర్ వహనీయమ్ --సాయన భాష్యమ్
ద్రవ్య పక్షేపి సర్వ శబ్దానామ్ అసత్యోపాద్య వచ్చిన్నం బ్రహ్మతత్త్వం వాచ్యమితి నిత్యతా || --కైయటః , మహా భాష్య పస్పశాహ్నికమ్
" అప్యేకం దేవపథ మథీయీతేవ --శతపథ బ్రాహ్మణం --౧-౧౫-౬౯ ]
" సంస్కృత పదాలైన కొన్ని నామవాచకాలు , నదులు , జంతువుల పేర్లు వాటి అర్థాలను ఇచ్చినా , వాటి నిజమైన స్వభావము , ప్రవృత్తులు మాత్రము బ్రహ్మమును కీర్తించుటయే " అని దాని అర్థము.
ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించేముందు , దాని అసలైన వైదిక అర్థాన్ని తెలుసుకోవడము వివేకమైన పని. సంచలనము కలిగించుట కోసమో , వక్రీకరణ కోసమో దానిని నిర్ధారణ చేసే ముందు అందులోని వైరుధ్యాన్ని, లోపాలనూ , ఆ సిద్ధాంతము చేసేవాడే , " నేఽతి" [ ఇది కాదు , ఇది కాదు ] అంటూ ఆత్మ విమర్శగా పరీక్షించుట అవసరము. ఎందుకంటే ఆ పని ఇతరులు ఎలాగూ చేసి తప్పని చెబుతారు కాబట్టి.
ఇక , అశ్వ మేధము..
విపరీతముగా అపార్థము చేసుకోబడిన వేద శబ్దములలో ఇది ఒకటి. దీని అసలు అర్థము గ్రహింపుకు వచ్చిన తరువాత , అశ్వమేధాన్ని వక్రీకరించినవారు ప్రాయోపవేశము చేసుకున్నా ఆశ్చర్యము లేదు. అంత ఘోరమైన తప్పిదము అది.
తాము మహామేధావులమని భావించుకొనే సనాతన ధర్మ వ్యతిరేకులు కొందరు సంకోచాలు , మర్యాదలూ హుందాతనమూ మరచిపోయి , అశ్వమేధ యాగములో యజమాని భార్య అశ్వము [అనగా వారి అర్థములో ’ గుర్రము ’ ] తో యేమేమి చేస్తుందో వారివారి నీచమయిన ప్రవృత్తులను తృప్తిపరచుకొనుట కోసము వర్ణించి శునకానందము పొందేవారు ఉన్నారు. వీరి వంటి వారే అయిన ప్రాచీనులైన " పువ్వటుడు ", మహీధరుడు " వంటి వారిని ఉటంకిస్తూ అటువంటి వ్యాఖ్యలు చేస్తారు.
ఇటువంటి వైదిక శబ్దాలను అర్థము చేసుకొనుటకు ఒక ప్రత్యేకమయిన క్రమముంది. దానిని " ఆర్షేయ క్రమము " అంటారు. దాని పేరే తెలియని ఈ మేధావులు వేదాలకు భాష్యము చెప్పబోవుట అనేది గుడ్డివాడు సినిమా గ్రాఫిక్స్ ను వర్ణించినట్లే ఊహాజనితములై ఉంటాయి.
అశ్వ అనే పదము , ’ అశ్ భక్షణి ’ అనే ధాతువు నుండీ వచ్చింది. అనగా , దారిని తినివేయునది.
తినుట , గ్రహించుట అనే అర్థాలకోసము అశ్ శబ్దము వాడతారు. అశనము , ప్రాశనము అలా వచ్చిన పదాలే.
వేదములో చెప్పిన అశ్వ మేధ శబ్దానికి, గుర్రానికీ యే విధమైన సంబంధమూ లేదు.
ఏదైతే ఇంకొకదానిని గ్రహించునో , అది అశ్వము
నీటిని గ్రహించే సూర్య కిరణము అశ్వమే.
వెలుతురును గ్రహించే కన్నూ , శబ్దాన్ని గ్రహించే చెవీ, రుచిని గ్రహించే నాలుకా... ఇవన్నీ అశ్వాలే. కాబట్టి ఇంద్రియాలను అశ్వములు అని పిలుస్తారు.
శరీరాన్ని రథముతోనూ , రథము నడిపేవాణ్ణి ఆత్మతోనూ , ఇంద్రియాలను గుర్రాలతోనూ పోల్చే ప్రసిద్ధమైన శ్లోకాలు ఈ వైదిక అర్థముతో రాయబడినవే.
సంస్కృతములో అశ్వము అంటే గుర్రమే. కానీ వేద శబ్దాలకు ఆ అర్థము లేదు. సందర్భాన్ని బట్టి ఎక్కడ ఏ అర్థము వస్తుందో చూడాలే గానీ అశ్వము వచ్చిన చోటంతా గుర్రము రాదు.
అశ్వానికి ఇంకో అర్థము కూడా ఉంది అ-శ్వః అంటే రేపు లేనిది. - నిరంతరంగా ఉండేది. అశ్వమితి రాష్ట్రం-- దేశము ఎప్పుడూ నిరంతరంగా ఉంటుంది. వేదికను కూడా అశ్వము అంటారు. నటీనటులు వస్తూ పోతుంటారు, వేదిక నిరంతరముగా ఉంటుంది.
ఇక మేధ అనే శబ్దానికి రెండు ధాతువులున్నాయి
మేధృ - " సంప్రహ " మరియూ మేధృ- సంగమం.
అశ్వమేధమంటే ఇంద్రియాలను సంగమములోకి అనగా స్వాధీనములోనికి తెచ్చుకొనుట. వేదములో చెప్పిన ’ అశ్వ మేధ ’ పదానికి అర్థము ఇదే.
రాష్ట్ర మేధ -- రాష్ట్రాన్ని అనగా రాజ్యాన్ని అధీనములోకి తెచ్చుకొనుట. రాజ్య ఐక్యత.
యూపము అంటే , గుర్రాన్ని కట్టివేయు కొయ్య స్థంభము కాదు. యూపమను పదాన్ని, ఇంద్రియాలను , మనసును అదుపులో ఉంచు విషయములో వాడతారే గానీ పశువును కట్టు గూటము అనే అర్థములో కాదు.
కాబట్టి అశ్వ మేధములో గుర్రమూ లేదు , హింస అంతకన్నా లేదు. దోష పూర్ణమైన అర్థాలు తీసి వేదవాఙ్మయాన్ని వక్రీకరించుటలో కొందరు మేధావులు సిద్ధ హస్తులు.
అయితే , ఎంతమంది మేధావులు ఎన్ని వక్రీకరణలు , కుతర్కాలు , చేర్పులు మార్పులూ చేసినా , వేదాన్ని ఎవరూ ఆవిధముగా అంటలేరు కాబట్టి వేదమే వారికి దీటైన సమాధానము చెబుతుంది.
ఇలాగ ఎన్నెన్నో పదాలకు తప్పుడు అర్థాలు తీసి అయోమయాలు , వైషమ్యాలూ సృష్టించుటే వారి పని.
భారతాన్ని పంచమ వేదము అంటారు.. అందులో కూడా చేర్పులు జరిగాయి. అది మానవుడు రాసింది కాబట్టి.. అలాగే మతాచార్యులు రాసిన వాటిని కూడా కొందరు వేదమనే అంటారు. ఎవరేమి రాసినా మూల వేదానికి విరుద్ధము కానంతవరకే దానికి విలువ , ఆదరము. లేకపోతే వేదము అన్న పదాన్ని చేర్చుకున్నంత మాత్రాన ఏ రాతలూ ’ సత్య వేదాలు ’ కాలేవు, అభాసు పాలూ కాకుండానూ పోవు.
భారత దేశములో అనాది నుండీ మన బలాలు యేమిటంటే , శిక్షణ , పశుపాలన , కృషి-- ఈ మూడే . ఆంగ్లేయుల పాలనలో ఈ మూటిమీదా అటకాయింపు జరిగింది. శిక్షణను ’ మెకాలే ’ ప్రతిపాదించిన " ఇంగ్లీషు చదువుల’ తోనూ , పశుపాలనను ’ మాంస భక్షణను’ అలవాటు చేయడము వలననూ , కృషి ని వాణిజ్యము చేయడము వల్లనూ మూడూ పతనము చెందినాయి.
సనాతన ధర్మములో మాంసాహార భక్షణ అనునదే లేదు. అంతెందుకు , ఓ యాభై యేళ్ళ కిందవరకూ కాఫీ అంటే అదొక " మైల " గా భావించే వారు . ఇంటి బయట ఒక మూలలో బొగ్గులపొయ్యి మీద రహస్యంగా తయారు చేసేవారు.
సనాతన ధర్మమును కించపరచి విమర్శించే వారు రెండు రకాలు.
ఒక్కసారిగా గొప్పవాళ్ళము కావాలనుకొనేవారు , సనాతన ధర్మము గురించి అసలేమీ తెలీని వాళ్ళు.
కానీ వీళ్ళు తమ వరకూ వస్తే , మరలా సనాతన ధర్మపు సందేశాలనే పాటిస్తారు. శాకాహార భోజనము యొక్క గొప్పదనము వారికి తెలీక కాదు , వారి మొదటి ప్రాధాన్యత అదే. అంతే కాదు , వారిలో సంతానము లేని వారికి , కృత్రిమ పద్దతిలో సంతానము కలగాలంటే , మొదటగా కోరుకొనేది బ్రాహ్మణుల వీర్యాన్నే. సంతాన ప్రాప్తి కేంద్రాలలో ఎక్కడ కనుక్కున్నా ఈ విషయము తెలుస్తుంది. ఎన్నిసార్లు పేపర్లలో చదవలేదు ? శాకాహారులై , నియమబద్ధమైన జీవనము గడుపుతూ , వేద వేత్తలై ఉంటే , వారి వీర్యానికి వీరిచ్చే విలువ అంతా ఇంతా కాదు. వ్యక్తి గతముగా అలాగ సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ , సామాజికంగా ఆ సనాతన ధర్మాన్నే విమర్శించే వారు యేనాటికైనా సనాతన ధర్మానికి బాహాటముగా తలవంచవలసినదే.
నిన్న నాతమ్ముడితో మాట్లాడుతున్నపుడు కొన్ని ఆశ్చర్య కరమైన విషయాలు చెప్పాడు. అతడు జర్మనీలో ఉంటాడు.. మనం ఊహించుకునేట్టుగా , విదేశీయులందరూ మాంసాహారులూ , తాగి తందనాలాడేవారూ కాదనీ , చెట్లకు కూడా హాని కలిగించక బ్రతికేవారున్నారనీ అన్నాడు. అక్కడ అనేకులు , చెట్లనుండీ కాయలూ , పళ్ళూ కోయరట. అవే పండి రాలితే గానీ వాటిని తీసుకోరట. మనం మృత్యుంజయ మంత్రములో , " ఉర్వారుకమివ బంధనాత్ ... " అంటూ , పండిన పండువలె రాలిపోదామనీ , అపమృత్యువు రాకూడదనీ ప్రార్థిస్తాము.. దాని అర్థాన్ని తెలుసుకొని వారు ఎంతబాగా ఆచరిస్తున్నారు అనిపిస్తుంది. పాలు పిండితే పశువులకు బాధ అని , చాలామంది పాలు , పెరుగు ముట్టుకోరట.
మనము సనాతన ధర్మము , సాంప్రదాయాలు , అంటూ మాట్లాడుకునే మనము , నిజంగా అందులోని సారాంశాన్ని తెలుసుకొని పాటిస్తున్నామా ? అనిపిస్తుంది , ఒకోసారి. ఎందుకంటే మన వేదాలని అర్థం చేసుకొని , వాటి సారాంశాన్ని ఉపయోగిస్తూ మనకన్నా ఎక్కువగా పాటించేవారు.. విదేశాల్లో ఎక్కువ ఉన్నారని అవగతమవుతున్నది.
అంతే కాదు , నూరేళ్ళనుండే అక్కడ సంస్కృతపు వాడకము ఉందనీ , ఇప్పటికీ సంస్కృతం లో వార్తలు ప్రసారమవుతాయనీ , వేదమంతా అనువదించి లైబ్రరీలలో నిక్షిప్తము చేసుకున్నారనీ అన్నాడు.
వేదాన్ని మనకన్నా వారే క్షుణ్ణంగా అర్థం చేసుకొని ఆచరిస్తున్నారని ఆనందించడమే గాక , మనము కూడా అలాగే ఆచరించాలని దానికి తగ్గ అవగాహనను ఇమ్మనీ , కుసంస్కారంతో ఎదుటివారిపై బురద జల్లేవారిని సంస్కరించమనీ వేడుకుందాము.
వేదములో గోవధ చెప్పబడి ఉందా అని ఒక వివాదాన్ని కొందరు మ్లేఛ్ఛులు తీసుకొచ్చి సనాతన ధర్మాన్ని కించపరచాలని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి... వేదములో అటువంటి గోవధను ప్రేరేపించే విషయములేవీ లేవని నిర్ద్వంద్వముగా తేల్చబడినది.. ఇంకా అనుమానము ఉంటే , --గోవధను ప్రేరేపించుట కాదు-- గోవధను చేయకండి అవివేకులారా --అని స్పష్టముగా ఏకాగ్ని కాండములో వివరింపబడి ఉంది..
వేదములో " గోవధ కూడదు " అని స్పష్టముగా చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యముగా , ఉపనయన సమయములో వటువు, పలికే ఈ మాటలు చూడండి.. వీటికి ఎంతో ప్రాముఖ్యము ఉంది.. ఎందుకంటే , ఉపనయనము అయితే గానీ , వేదాధ్యయనము చేసి , యజ్ఞయాగాదులు చేయుట --చేయించుటకు వటువుకు యోగ్యత రాదు .. .. కాబట్టి , వటువు ఉపనయన సమయములో ఏమి నేర్చుకుంటున్నాడో చూడండి..
|| యజ్ఞోవర్ధతాం యజ్ఞస్య వృద్ధిమను వృద్ధాఽపచితి రస్యపచితిం మా కుర్వపచితోఽహం మనుష్యేషు భూయాసం ||
|| గౌరస్యపహత పాప్మాఽపపాప్మానం జహి మమచాఽముష్య చ ||
" ఓ ధేనువా !! నీవు అతి పవిత్రవంతమైన దానివి.. నీ యందు ఎటువంటి దోషములూ ఉండుటకు సాధ్యము కాదు.. కాబట్టి, నాయొక్కయు , కన్యాదాత యొక్కయు పాపములను నీవు మాత్రమే నశింపజేయ గలవు..
నీ సంబంధమైన పూజ లోకములో వృద్ధిపొందుగాక.. నీ పూజ వృద్ధియైనట్లే నీవుకూడా వృద్ధి పొందుము , పూజనీయవైన నీ పూజ చేసి నేను కూడా పూజనీయుడనయ్యెదను.. నీ పూజాఫలమును నాకివ్వు. "
|| గౌర్ధేనుభవ్యా మాతా రుద్రాణాం దుహితావసూనాగ్ స్వసాఽదిత్యానామమృతస్య నాభిః | ప్రణువోచం చికితుషే జనాయ మా గామనాగా మదితిం వధిష్ఠ ||
|| పిబతూదకం తృణాన్యత్తు ||
|| ఓముత్సృజత ||
" యజ్ఞయాగాదులలో సమస్త దేవతలూ పొందదగిన ఆజ్యము మొదలగు హవిస్సును ఇచ్చుటవలన ఈ ధేనువు అతి యోగ్యమై, పూజార్హమైనది. ఆ కారణము చేతనే ఈ ధేనువు ఏకాదశ రుద్రులకు తల్లియైనది. అష్ట వసువులకు కుమార్తె యైనది. ద్వాదశాదిత్యులకు తోబుట్టువైనది. అమృతమునకు ఆధారమైనది.. కాబట్టి లోకములలోని యేదోషములూ ఈ గోవును అంట జాలవు. ఈ గోవు అణుమాత్రమైననూ హింసింపకూడనిది. కాబట్టి ఓ అవివేకులారా , పరమ పవిత్రమైన గోవును హింసింపవద్దు , వధింపవద్దు.. దానిని జలములు త్రాగుటకు , తృణ ఘాసములను దినుటకు వదలిపెట్టండి.. "
వేదము గోవును ఎంత పవిత్రముగా ఆరాధిస్తుందో తెలుసుకొనుటకు ఇది చాలు కదా..
జనార్దనశర్మ గారికి నమస్కారములు
ReplyDeleteనన్ను బులుసు ప్రసాద్ అంటారు , గౌతమస గోత్రీకుడను, తూర్పు గోదావరి వాడిని ,వృత్తి రీత్యా డెర్మటాలజిస్ట్ ని
మీరు అనువదించిన " మంత్రద్రష్ట " చదివేను.
ముందుగా మీకు నా కృతఙ్ఞతలు .
కొన్ని సందేహాలు ;
దయచేసి మీకు వీలు అయినపుడు తీర్చగోరుతున్నాను
రచన మీది కాకపోయినా అంతరార్థము తెలియజెప్పగలరనే ఉద్దేశ్యం తో అడుగుతున్నాను
1. " ప్రభూ , స్పష్టముగా చెప్పి అనుగ్రహించండి .
ఇప్పుడు మీరు నాకు దయచేయు మంత్రమేది ?
ఏ నిబంధనలతో దానిని అనుష్ఠానము చేయవలెను ?
దాని సిద్ధి ఏమిటి ? "
" విశ్వామిత్రా , పరిషత్తు నీ ద్వారా అన్వేషించుచున్నది గాయత్రమను మంత్రము .
దానిని అనుష్ఠానము చేయుటకు విశ్వామిత్రుడై యుండవలెను .
అది వాడిని బ్రాహ్మణుడిని చేయును .
బ్రాహ్మణ్యమన్న నేమి యని అంటావేమి ? అదికూడ చెప్పెదను విను ............................................
గంధర్వులూ , సోముడూ , అగ్నియూ కట్టిన ఇల్లు ఈ మనుష్య దేహము .
వీరు ముగ్గురి ప్రభావమునూ మీరి , అనగా , కామమునూ , సంగ్రహమునూ భోగమునూ దాటినవాడు బ్రాహ్మణుడు .............
ఇంతటివాడే ఆత్మోద్ధారము చేసుకున్నవాడు
వీడివలన విశ్వపు ఉద్ధారము .
సిద్ధముగానున్నావా ? "
2. భగవానులు ఆ వేదమాతను స్తోత్రముతో కీర్తించినారు.
"దేవీ , నీకు నమస్కారము ...............
లోకమునంతటినీ ఆర్యమయము చేయు మంత్ర రాజమును దర్శించి పలికెడు భాగ్యమును నాకివ్వు .
బ్రహ్మర్షుల ఇష్టార్థము నెరవేరనీ .
విశ్వమంతయూ ఉద్ధరింపబడు దారి నాకు కనబడనీ . "
. భగవతీ గాయత్రీ దేవి ,
" వత్సా ! దీనిని అనుసంధానము చేసి నీదిగా చేసుకో .
నువ్వు కృతార్థుడవైన గుర్తుగా , నీ నోటి నుండీ ఇరవై నాలుగక్షరాల , మూడు పాదముల మంత్రము ప్రకటము కాగలదు . దానిని అనుసంధానము చేసి , దానిని కూడా నీదిగా చేసుకో . ....................................
. నువ్వు ఎవరికైననూ నన్ను దానము చేయి : నేను వాడిని కాపాడెదను . వాడిని ఆర్యుడను చేసెదను . మూడు వేదములకు అధికారిని చేసెదను .
అయితే , ఇదిగో , ఇదే మాట . నన్ను దురుపయోగపరచిన వాడి వంశము ఎండిన వృక్షము వలె ఎండి పోవును "
అని పలికి ,.........................................అతని పూజను పొంది అంతర్ధానమైనది .
.3. ............................... ఆ నర్మదా తీరములో ఒక ఆశ్రమమును రచించి వాసమేర్పరచుకున్నారు . వశిష్ఠులు అక్కడికి వచ్చి వెళ్ళు వరకూ వారికి శిష్యులను పరిగ్రహము చేయుట ఇష్టము లేదు . అయినా , గాయత్రీ దేవి అనుగ్రహము వలన లభించిన మంత్ర రాజమును ప్రయోగించి చూడవలెనను ఒక పని మిగిలియుంది . అందువలన మితముగా శిష్య పరిగ్రహము చేసి , వారిని ప్రయోగ సిద్ధులను చేయవలెనని ఒక చిన్న సంకల్పము . .........................................
................................. వర్ణ చతుష్టయము వారంతా వచ్చి శిష్యులు గా చేరినారు . అందరికీ మంత్రోపదేశమయినది ...............................................
4. వశిష్ఠులు ముందుకు వచ్చి దేవతలను సంబోధించినారు .
...............................................జాతివలన వచ్చు గుణమును దీక్ష వలన కూడా పొందవచ్చును అనుదానిని నిదర్శనముతో చూపవలసిన కాలము వచ్చినది . అందువలన , బ్రహ్మర్షి పరిషత్తు , సులభముగా బ్రాహ్మణ్యమును సాధించగల దీక్షావిధి నొక దానిని కనిపెట్ట వలసిన బాధ్యతను విశ్వామిత్రులకు ఇచ్చినది .
భగవాన్ విశ్వామిత్రులు , చతుర్ముఖ బ్రహ్మ సృష్ఠిలో జాతి వలన మాత్రమే వ్యక్తమగు గుణము యేదున్నదో , దానిని సిద్ధింపజేయగల మంత్రయోగ మొకదానిని , బ్రహ్మణస్పతి , పూషా , గాయత్రీ దేవుల అనుగ్రహము వలన పొందినారు . మేము దానిని ఒప్పుకొనుటకు తగినట్లు ప్రయోగము చేసి చూపినారు
జాతి వలన బ్రాహ్మణులు కాని పన్నెండు మంది శిష్యులకు ఆ మంత్రమును ఉపదేశించి , వారిని బ్రాహ్మణులను చేసినారు .
వారికి జాతి బ్రాహ్మణుల యోగ్యత సంపూర్ణమైనది .
చతుర్ముఖ బ్రహ్మ అన్నాడు ,
ఈ తత్త్వమును ఎరిగినవాడు బ్రాహ్మణుడు .
ఇక ముందు ఎవరైనా సరే , ఈ ప్రాజాపత్యమును సాధించి సిద్ధులైతేనే వారికి బ్రాహ్మణ్యము .
లేదంటే లేదు .
"జాతి వలన బ్రాహ్మణుడైన వాడు అధ్యయన ఇత్యాదులవలన దీనిని సాధిస్తే ,
ఇతరులు దీనిని దీక్షా మార్గము వలన , గురుముఖముగా సాధించెదరు గాక .
ReplyDeleteసం దే హా లు :
1.ఒక ప్రయోజనమునాశించి ప్రయత్నపూర్వకముగా సాధించబడినదియా గాయత్రి ?
అయత్నకృతముగా విశ్వామిత్రమహర్షులచే దర్శింపబడినది కాదా ?
సర్వమునూ నడుపుతున్న శక్తి యొక్క మంత్రరూపముగా దర్శింపబడినది కాదా ?
2.ఇంతకూ ఏమిటి ఆ ప్రయోజనం ?
జన్మతహా బ్రాహ్మణుడు కానివానిని బ్రాహ్మణుడిగా చేయుటయా ?
జన్మతహా బ్రాహ్మణుడికి బ్రాహ్మణ్యము ప్రాప్తింపచేయుటయా? ?
ఎవరికైననూ బ్రాహ్మణ్యము ( బ్రాహ్మణత్వము కాదు ) ప్రాప్తింపచేయుటయా , అట్లే అయినచో ఏ విధముగా ?
3.జన్మతహా త్రైవర్ణికుడు కాకపోయిననూ ( అయిఉన్ననూ ఉపనయనమూ ద్విజత్వమూ పొందనివానికి ) గాయత్రిని ఇవ్వవచ్చునా ?
జాత మాత్రస్య గాయత్రీ "
జాతుడు అనగా ఎవరు ?
త్రైవర్ణికుల కుటుంబములో పుట్టినవాడా ?
అలాకానివానికి ఉపనయనమూ ద్విజత్వమూ ఉన్నాయా??
4. గాయత్రి దురుపయోగమునకు కొన్నైనా ఉదాహరణలు ఇవ్వండి ?
అధికారము లేనివానికి గాయత్రిని ఇవ్వటము దురుపయోగమేనా ?
కృతఙ్ఞతలతో ,
బులుసు ప్రసాద్ .
9848413310
శ్రీ బులుసు ప్రసాద్ గారికి నమస్కారములు.. మీ ప్రశ్నలు కూడా నాకు స్ఫూర్తిని కలిగించాయి. నాకు అర్థమయినది వివరిస్తున్నాను.
ReplyDeleteమొదటి ప్రశ్న
విశ్వామిత్రుడికి ఎప్పుడైతే వశిష్ఠుల వల్ల పరాభవము జరిగిందో, అప్పుడే అతడిలో పట్టుదల మొదలైంది. తాను కూడా బ్రహ్మర్షి అనిపించుకోవాలన్న తపన మొదలైంది.
ఆ ప్రయత్నము లో భాగమే గాయత్రీ మంత్ర దర్శనము. ఇది ముమ్మాటికీ ప్రయోజనాన్ని ఆశించి సాధించినదియే . అయత్న కృతముగా పరమార్థాలు రావు.
రెండో ప్రశ్న
జన్మతః బ్రాహ్మణుడు , జన్మతః బ్రాహ్మణుడు కానివాడు అంటూ మీరు విభజన చేసినారు. అటువంటి విభజన ఏదీ లేదు. బ్రాహ్మణ వంశము లో పుట్టిన వారందరూ బ్రాహ్మణులే. బ్రాహ్మణులలో కొందరు అనాచారులుగా ఉండుట ఇటీవలి పరిణామము [ అంతకు ముందు కొన్ని మినహాయింపులు ఉండి ఉండచ్చు.. అది ప్రమాణము కాదు ] .
ఇక బ్రాహ్మణ్యము , బ్రాహ్మణత్వము అని మీరు మళ్ళీ వేరు చేసినారు..వాటి తేడాను వివరించగలరు.
ఇక, గాయత్రీ అధికారము శూద్రులకు తప్ప త్రైవర్ణముల వారికీ ద్విజత్వ ప్రాప్తితో వస్తుంది. శూద్రులకు సాధన ఉంటే , ఉత్తరోత్తరా బ్రాహ్మణ వంశములో పుట్టినపుడు , వారికీ వస్తుంది.
ఈ గ్రంధము చివరలో ఒకచోట దేవుడు గారు , " కొందరు సాధించినారు...మరికొందరు సిద్ధమవుతున్నారు.." అని చెప్పుటలో అదే అర్థము. కాబట్టి జన్మతః బ్రాహ్మణుడు కానివారికి బ్రాహ్మణ్యము సిద్ధింపజేయుటయే దాని ప్రయోజనము.
ఏ విధముగా అంటే , ఆ కాలములో నేరుగ శూద్రులకు గాయత్రిని ఇచ్చినారు కానీ ఈ కాలము అది కుదరదు. దానికి అర్హత సాధించవలసినదే. సాధన చేయవలసినదే. సాధించి అగ్ర వర్ణములో పుట్టవలసినదే. . మాకెందుకు అధికారము లేదు అంటూ ప్రశ్నించే మనస్తత్త్వము గలవారికి ఆ మనస్తత్త్వమే మొదటి అనర్హత. పుట్టుకలు విధాత చేతిలో ఉంటాయి.. అగ్రవర్ణములో జన్మించలేదు అంటే ఆ అర్హత ఈ జన్మకు లేదు--అనే అర్థము. అది విధాత నిర్ణయము.
ఇక మూడో ప్రశ్న
ఈ ప్రశ్నకు జవాబు రెండో జవాబులో ముందే ఇవ్వడమైనది. ద్విజత్వము లేని వానికి గాయత్రి లేదు. త్రైవర్ణీకుడు కాని వాడికి ద్విజత్వము లేదు.
నాలుగో ప్రశ్న
గాయత్రి దురుపయోగాలు--
సంకల్పము చెడ్దదైనపుడు దానికోసము గాయత్రి జపించుట.
నీచమైన కోరికలకోసము గాయత్రిని జపించుట.
ప్రలోభము / మోహము చేత అధికారము లేనివాడికి గాయత్రిని ఇచ్చుట
ఇక ఈ కాలము గాయత్రీ మంత్రాన్ని పాటగా పాడుట , స్వరము విరచి పాడుట , అధికారము లేనివాడు జపించుట, గురూపదేశము కానివాడు జపించుట , మొబైల్ రింగ్ టోన్ గా పెట్టుకొనుట , కారు రివర్స్ చేయునపుడు సిగ్నల్ టోన్ గా పెట్టుకొనుట వంటివి.
నా సమాధానాలు మీకు నచ్చకపోతే సహేతుకముగా రాయండి. పుస్తకాన్ని నేను అనువదించినంత మాత్రాన నేను దానికి అధికారిని , అథారిటీని కాను. మీ వంటి ఉత్తమాభిరుచి గలవారి వద్దనుండీ కూడా నేను నేర్చుకొనుటకు ఎప్పుడూ సిద్ధమే..