SHARE

Monday, December 15, 2014

ధనుర్మాసము విశిష్టత- కర్తవ్యములు

ధనుర్మాసము  విశిష్టత- కర్తవ్యములు



రేపటినుండీ ధనుర్మాసము మొదలగుతున్నది. 

         సూర్యుడు వృశ్చికరాశి నుండీ ధనూరాశి కి వచ్చు సమయము నుండీ ధనుర్మాసము మొదలవుతుంది. 
 ఆగ్నేయ పురాణము ప్రకారము ఈ మాసము శ్రీ మహా విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది.  ధనుర్మాస వ్రతమును  ఆచరించువారికి  ఈ నెల  అత్యంత ప్రాముఖ్యమైనది. 

       మహా విష్ణువు పుష్ప , శ్రీగంధమాల్య , మణి మౌక్తిక , పీతాంబర  అలంకార ప్రియుడు అని ప్రతీతి. ఈ ధనుర్మాసములో ప్రతి దినమూ సూర్యోదయమునకు ముందే శ్రీమహావిష్ణువును సహస్ర నామార్చనతో పూజింపవలెను అని శాస్త్రములు నిర్దేశిస్తున్నాయి. ఈ మాసములో యే దేవాలయములో చూసినా బ్రాహ్మీ ముహూర్తములోనే పూజలు మొదలవుతాయి. అనేక విష్ణు దేవాలయములలో పెసర పప్పుతో చేసిన పులగమును  ఆ పరమాత్మునికి నైవేద్యముగా సమర్పించి ప్రసాదం గా భక్తులకు ఇస్తారు. 

ధనుర్మాస వ్రతపు నేపథ్యము 

          పురాణము ప్రకారము ఒకసారి బ్రహ్మ దేవుడు హంసరూపములో లోక సంచారము చేస్తున్నాడు. అప్పుడు సూర్యునికి అకారణముగా గర్వము పొడుచుకు వచ్చి , కావాలని , ఆ హంస పైన తన తీక్షణమైన కిరణాలతో తాపమును ప్రసరించినాడు. అందుకు నొచ్చుకుని బ్రహ్మ , సూర్యుడికి తన తప్పు తెలిసిరావలెనని , ’ నీ తేజో బలము క్షీణించు గాక ’ యని శపించినాడు. వెంటనే సూర్యుడు తేజోహీనుడై , తన ప్రకాశము నంతటినీ పోగొట్టుకున్నాడు. దానితో మూడు లోకములందూ అల్లకల్లోలమైనది. సూర్యుడి తేజము చాలినంత  లేక , జపములు , తపములు , హోమములు అన్నీ నిలచిపోయినాయి. దేవతలకు , ఋషులకే గాక , సామాన్య జనాలకు కూడా నిత్యకర్మలలో ఇబ్బందులు మొదలైనాయి. పరిస్థితి మరింత క్షీణించడముతో , దేవతలు  అనేక  సంవత్సరములు బ్రహ్మను గూర్చి తపము చేసినారు. బ్రహ్మ ప్రత్యక్షము కాగానే , సూర్యుని శాపాన్ని తొలగించమని వేడుకున్నారు. 

          " సూర్యుడు , తాను ధనూరాశిని ప్రవేశించగనే , ఒక మాసము పాటు శ్రీ మహా విష్ణువును పూజిస్తే , అతడి శాపవిమోచనము అవుతుంది " అని బ్రహ్మ తెలిపినాడు.  బ్రహ్మ చెప్పిన విధముగా సూర్యుడు , పదహారు సంవత్సరముల పాటు , ధనుర్మాస విష్ణు పూజను చేసి , తిరిగి తన తేజస్సును , ప్రకాశమునూ పరిపూర్ణముగా పొందినాడు. సూర్యుడినుండీ మొదలైన ఈ పూజ , తదనంతరము మిగిలిన దేవతలూ మరియూ ఋషులలో ప్రాచుర్యము పొంది , తమ కర్మానుష్ఠానములు నిర్విఘ్నముగా , విజయవంతంగా జరుగుటకు , వారుకూడా ధనుర్మాస పూజ , సూర్యోదయపు మొదటి జాములో  ఆచరించుట మొదలు పెట్టినారు.

         అగస్త్య మహర్షి , విశ్వామిత్రుడు , గౌతముడు , భృగువు వంటి మహర్షులే కాక, అనేక దేవతలు , ఉపదేవతలు కూడా ఈ ధనుర్మాస వ్రతమును ఆచరించినారని వివిధ పురాణములలో ఉంది. 

          ధనుర్మాసము అత్యంత మంగళకరమైన మాసమే అయినా , ఇది శుభకార్యములు జరప కూడని శూన్య మాసము. ఈ నెలలో శుభకార్యములైన వివాహ , గృహ ప్రవేశ , ఉపనయనము మొదలగు కార్యములు చేయు పద్దతి లేదు. యేమి చేసిననూ ఈ మాసము సంపూర్ణముగా మహా విష్ణువు సంప్రీతి కొరకే కేటాయించవలెను. వైకుంఠ ఏకాదశి కూడా ఈ మాసములోనే వచ్చును. 


ముద్గాన్న నైవేద్యము 
ఈ ధనుర్మాసములో మహా విష్ణువుకు ముద్గాన్నమును నైవేద్యముగా సమర్పిస్తారు. [ పెసర పప్పుతో చేసిన పులగము ]  దీని గురించి ’ ఆగ్నేయ పురాణము ’ లో ఇలాగుంది , 
|| కోదండస్తే సవితరి ముద్గాన్నం యో నివేదయేత్ |
సహస్ర వార్షికీ పూజా దినేనైకేన సిధ్యతి ||

" ధనూరాశిలో సూర్యుడుండగా పులగమును ఒక్క దినమైనా విష్ణువుకు సమర్పించిన మనుష్యుడు ఒక వేయి సంవత్సరముల పాటు పూజ చేసిన ఫలాన్ని పొందుతాడు " అని వివరిస్తుంది

ఈ నైవేద్యమును  పాకము చేయు విధమును కూడా పురాణమే తెలుపుతుంది. దాని ప్రకారము ,

         " బియ్యమునకు సమానముగా పెసర పప్పును చేర్చి వండు పులగము ఉత్తమోత్తమము. బియ్యపు ప్రమాణములో సగము పెసరపప్పు చేర్చితే అది మధ్యమము. బియ్యపు ప్రమాణములో పావు వంతు పెసరపప్పు చేర్చితే అది అధమము. అయితే , బియ్యపు ప్రమాణమునకు  రెండింతలు పెసరపప్పు చేర్చితే అది పరమ శ్రేష్టమైనది. భక్తులు తమకు శక్తి ఉన్నంతలో శ్రేష్ట రీతిలో పులగము వండి పరమాత్మునికి నివేదించవలెను. ఎట్టి పరిస్థితిలోనూ పెసర పప్పు ప్రమాణము , బియ్యమునకంటే సగము కన్నా తక్కువ కాకుండా చూసుకోవలెను. "

          అంతే కాదు , ’ పెసర పప్పు , పెరుగు , అల్లము , బెల్లము , కందమూలములు , ఫలములతో కూడిన పులగమును భగవంతునికి సమర్పిస్తే  సంతుష్టుడై భక్త వత్సలుడైన మహా విష్ణువు తన భక్తులకు సకల విధములైన భోగములను మోక్షమును కూడా ప్రసాదిస్తాడు ’ అని పురాణము తెలుపుతుంది. 

        అందుకే , ధనుర్మాసమనగానే విష్ణు పూజ మరియు పులగము [ పొంగల్ ] తప్పని సరియైనాయి. శ్రద్ధాళువులు తమ తమ శక్తి మేరకు ధనుర్మాసములో శ్రీ మహావిష్ణువును పూజించి కృతార్థులై , ఆయన కృపకు పాత్రులు కాగలరు. 

|| లోకాస్సమస్తా సుఖినస్సంతు ||


[ కన్నడ ప్రచురణ ’ బోధి వృక్ష ’ ఆధారంగా ] 

No comments:

Post a Comment