2. ఔపాసన రెండవ భాగము - త్రేతాగ్నులు
ఔపాసన రెండవ భాగము - త్రేతాగ్నులు
మొదటి భాగములో, మానవుడు తన శ్రేయస్సుకై ఉపాసన చేయవలసినది అగ్నినేయని తెలుసుకున్నాము.
ఈ అగ్న్యుపాసనను యజ్ఞము , హోమము వంటి అనేక విధములుగా పలికినా అక్కడ చేయునది , హవిస్సును అగ్నికి అర్పణ చేయుటయే ! అట్టి యజ్ఞము చేసి , యజ్ఞశేషమును భుజించువాడిని అమృతాశి అంటారు. వాడే పుణ్యాత్ముడు.
|| యజ్ఞశిష్టాశినః సంతో ముచ్యంతే సర్వ కిల్బిషైః |
భుంజతే త్వేత్వఘం పాపా యే పచంత్యాత్మ కారణాత్ ||
అటువంటి యజ్ఞము చేయుటవలన తన పాపములన్నిటినీ పోగొట్టుకుంటాడు మానవుడు. దేవతలకు హవిస్సునీయక , తనకోసమే అన్నమును వండుకొని తినువాడు పాపియే అవుతాడు. వాడు పాపమునే భుజించినట్టు ! --గీత
ఇలాగ , యజ్ఞముల మహత్వమును భగవంతుడు తెలిపి , మనుష్యులు మరియూ దేవతల నడుమ యజ్ఞముల ద్వారా చక్రమునొకదానిని ఏర్పరచినానని తెలిపినాడు. మనుషులిచ్చిన హవిఃప్రదానమును స్వీకరించి , దేవతలు వర్షమును , సస్యములనూ కావలసినంతగా ప్రసాదిస్తారు. దానివలన మనుషులు తృప్తులై మరలా దేవతలను తృప్తి పరుస్తారు. ఈ చక్రమును ఎవరు అనుసరించరో వారి బ్రతుకు వ్యర్థమే నని భగవంతుడే అంటాడు.
నిజానికి మానవుడు హోమములంటూ ఏదో కొత్తగా తాను మొదలు పెట్టునది ఏదీలేదు. వాడి పుట్టుకనుండే , కాదు , పుట్టుటకు ముందే వాడికోసము యజ్ఞము ఆరంభమై ఉంటుంది. షోడశ సంస్కారములలో మొదటిదైన గర్భాధాన సంస్కారము , దాని అంగముగా నడచు హోమము మొదలగునవి , జనించబోవు జీవికోసమే జరపబడతాయి. అలాగ పుట్టుకతోనే అగ్న్యారాధనకు లోబడి పుట్టిన శిశువు ఉపనయనమైన తర్వాత వటువై గాయత్రీ మంత్రోపదేశము పొంది , గాయత్రీ ఉపాసన చేస్తాడు. గాయత్రి ఉపాసన అనగా కాంతి యొక్క ఉపాసనే . అగ్ని యొక్క ఇంకొక రూపమే కాంతి. అంతేకాక , వటువు రెండు పూటలా అనుష్ఠించవలసిన అగ్నికార్యము / సమిదాధానము కూడా అగ్నియొక్క ఆరాధనయే ! బ్రహ్మచర్యాశ్రమమును దాటిన తరువాత గృహస్థుడైన తరుణుడు ’ ఔపాసనము ’ అను పేరుతో మరలా అగ్ని ఆరాధననే ప్రారంభిస్తాడు. ఔపాసనను అనుష్ఠానము చేస్తాడు. ఔపాసనాగ్నిని ’ గృహ్యాగ్ని ’ లేక ’ స్మార్తాగ్ని ’ అంటారు. దాని తర్వాత చేయు విశేష అగ్ని ఆరాధనను శ్రౌతాగ్ని ఉపాసన అంటారు.
దీన్ని ఎప్పుడు మొదలుపెట్ట వలెను ?
|| జాతపుత్రః కృష్ణ కేశః అగ్నినాదధీత |
జాయామవాప్య దశమేఽహన్యగ్నినాదధీత |
-----బోధాయన గృహ్య సూత్రము.
అనగా , పుత్రప్రాప్తి తరువాత నల్ల వెంట్రుకలు ఉన్నపుడే అగ్నులను ఆధానము చేయవలెను. ఇది అగ్న్యాధానము చేయుటకు మనకున్న గరిష్ట పరిమితి. కానీ సంప్రదాయ నియమముల ప్రకారము వివాహమైన పదవ రోజునుండీ అగ్నులను ఆధానము చేయవలెను . దీనికి , గృహస్థు యొక్క పత్ని ఆమోదము , సహకారము కావలెను. అట్లే ఆగ్నిని తన జీవన పర్యంతమూ కాపాడుకుంటూ వస్తాడు. జన్మతోపాటు దొరికిన అగ్నిని విస్తృత పరచుకొంటూ వస్తాడు కాబట్టి దీనిని శ్రౌతాగ్ని లేదా వైతానిక అగ్ని అంటారు. ఈ శ్రౌతాగ్నినే ’ త్రేతాగ్ని ’ అని కూడా అంటారు. అనగా మూడు అగ్నులు. వీటిని ’ గార్హపత్యాగ్ని ’ , ’ దక్షిణాగ్ని ’, ’ ఆహవనీయాగ్ని ’ అనే పేర్లతో పిలుస్తారు.
వివాహమైన తర్వాత మొదటిసారి అగ్న్యాధానము చేయుట ఒక ఉత్సవము.
తైత్తిరీయ బ్రాహ్మణ వాక్యము ప్రకారము , సాధారణముగా బ్రాహ్మణుడు వసంతకాలము లోను , క్షత్రియుడు గ్రీష్మము లోను , వైశ్యుడు శరదృతువులోనూ అగ్న్యాధానము చేయవలెను. ఈ అగ్నిని , కృత్తిక , రోహిణి , పునర్వసు , పూర్వ ఫల్గుని , ఉత్తర ఫల్గుని , చిత్రా నక్షత్రములలో ఆధానము చేయవచ్చును. అంతేకాక , వైశాఖ అమావాస్య యందు , రోహిణీ నక్షత్రము తో కూడినది--చాలా ముఖ్యమైనది. అయిననూ ,
యదైవైనమ్ యజ్ఞ ఉపనమేత్ | అథాదధీత |
అను వాక్యము ననుసరించి , ఎప్పుడు సోమయాగమును చేయ వలెనని ఇచ్ఛ కలుగునో , లేక వ్యాధి ముదిరి మరణము సన్నిహితమగునో , పుణ్యప్రాప్తికై అప్పుడే అగ్న్యాధానము చేయవచ్చును.
పైవాటిని పరిశీలిస్తే , పుట్టుక నుండే మనిషికి యజ్ఞపు అనుష్ఠానము సహజముగానే జరుగుతున్నది అనవచ్చును.
ఈ కాలపు అనేకులకు ఇవేవీ తెలియక పోవచ్చు. దానికి కారణము మన సంస్కృతి అనేక బాహ్య కారణాలవల్ల మంటగలసి పోవుటయే ! కిందపడినవాడు మరలా పైకి లేచి దుమ్ము దులుపుకొని ఎలాగైతే మరలా పరుగెత్తుతాడో , అలాగే , లుప్తమైన మన సంస్కృతిలోని శిష్టాచారములను తిరిగి మనము మన జీవితములోనికి తెచ్చుకొనుట ఎంతైనా అవసరము.
ఔపాసనా హోమము అనునది , మిగిలిన యజ్ఞములతో పోలిస్తే సాంకేతికంగా చాలా సరళమూ , సులభమూ తేలికా యైనది. ఇక్కడ హోమము , యజ్ఞము , యాగము అను పదాల సాంకేతిక అర్థము , వాటి తేడాలను తెలుసుకుందాము.
దైనందిన జీవితములో అనునిత్యమూ మనము గణహోమము , రుద్ర హోమము , దుర్గా హోమము , చండీ హోమము మొదలగు పేర్లు వింటుంటాము. అట్లే , రాజసూయ యాగము , అశ్వమేధ యాగము వంటి పేర్లను కూడా విని యుంటాము. యజ్ఞము , మరియూ యాగము అనునవి ఒకదానికొకటి పర్యాయ పదాలుగా భావించ వచ్చును. వాటికి ముఖ్యమైన భేదములు ఏవీ లేవు. అయితే , హోమములు మరియు యజ్ఞములు పర్యాయ పదములు కావు. వాటికి వ్యత్యాసములున్నవి.
ఒకే అగ్నిలో మంత్రముల చివర ’ స్వాహా ’ అను పదమును చేర్చి , ఒక దినము లోపల , లేదా అతితక్కువ దినముల పాటు నడచు అగ్ని ఉపాసనను ’ హోమము ’ లేదా ’ హవనము ’ అంటారు. ఈ హోమముల గురించి వేదములోని వాక్యములలో ’ జుహుయాత్ ’ అను పదము ఉండును. అనగా , వేదములో విధించ బడిన కర్మల వివరణలో ఎక్కడెక్కడ ’ జుహుయాత్ ’ అన్న పదము వచ్చునో , అవన్నీ హోమములని అర్థము. వాటన్నిటిలోనూ మంత్రపు చివర ’ స్వాహా ’ అను పదము వచ్చును. ఈ హోమములను ’ దర్వీ హోమములు ’ లేక ’ గృహ్య హోమము ’ అని కూడా అంటారు. హోమములలో సాధారణముగా నెయ్యి , పాలు , చరువు ( వడ్లు దంచి , ఆ బియ్యముతో చేసిన అన్నము ) , సమిధలు వంటి పదార్థములు వాడతారు.
అలాకాక, మూడు అగ్నులలో , రెండు లేక మూడు వేదములతో ఆశ్రావణ , ప్రత్యాశ్రావణాదులతో అనుష్టించు అగ్ని ఉపాసనలను ’ యజ్ఞము ’ లేక ’ యాగము ’ అంటారు. ఈ యజ్ఞములలోని మంత్రాల చివర ’ వషట్ ’ అను పదము వచ్చును. ఆశ్రావణ , ప్రత్యాశ్రావణములంటే , యజ్ఞము చేయునపుడు , అధ్వర్యువు మొదలగు ఋత్త్విజుల మధ్య దేవతల ఆవాహన , స్తోత్రములకు , ఓశ్రావయ , ’ అస్తు వౌషట్ ’ , ’ యజ , ’ యే యజామహే ’ , మరియూ ’ వౌషట్ ’ అను పదాల వాడకము. యాగములలో సాధారణముగా సోమరసము వాడతారు. యాగములు అనేక దినములలో జరుగును. ఒక వారము , పది రోజులు , పక్షము , నెల .. ఇలాగ. ఈ యజ్ఞ యాగాదులు అనేక రకములు. అందులో ప్రధానముగా ఇరవై ఒక విధములూ , మరలా వాటిలో అనేక విధములూ ఉన్నాయి. యజ్ఞ యాగాల గురించి ఇక్కడికి ఆపి , హోమము ,ఔపాసన గురించి చూద్దాం .
ఔపాసన కొరకు అగ్న్యాధానము ఎప్పుడు మొదలుపెట్టవలసినదీ చూచినాము. అగ్న్యాధానమంటే హోమము కాదు. ఆ కర్మ వలన త్రేతాగ్నులైన గార్హపత్య , దక్షిణాగ్ని మరియూ ఆహవనీయములు సిద్ధిస్తాయి. అరణులను మథించి అగ్నిని పుట్టించుట అగ్న్యాధానము లోని ప్రధాన కర్మ. అగ్న్యాధానమును అనుష్ఠించు దంపతులు దానికి ఒక వారము ముందే గణహోమమును చేయవలెను. జప , హోమాల వలన శరీరమును శుద్ధి చేసుకొనవలెను. దానిలో భాగముగా కూష్మాండ హోమమును చేయవలెను. కృచ్ఛ్రములు మొదలగు వ్రతములు ఆచరించవలెను. లోకవ్యవహారములనుండీ కూడా శుద్ధుడై ఉండవలెను. దీనినే బోధాయనుడు ఇలాగంటాడు,
అగ్నిన్ ఆధాస్యమానః ,,,!
యేనాస్యా కుశలగ్ం స్యాత్తేన కుశలం కుర్వీత |
యాన్యృణాని ఉత్థిత కాలాని స్యుస్తాని వ్యవహరేత్ |
అనుజ్ఞాపయీతవా |
-అగ్నిని ఆధానము చేయువాడు ఎవరితోనైనా వైషమ్యముతో కలహము కలిగి ఉంటే అతడిని సమీపించి మాటలాడి సముదాయించవలెను. ఎవరితోనైనా అప్పుతీసుకొని ఉంటే , అప్పు తీర్చు అవధి ముగిసి ఉంటే ఆధానమునకు ముందే అప్పుతీర్చివేయవలెను. అది వీలుకాకపోతే , అప్పు ఇచ్చినవాడితో అగ్న్యాధానము చేయుటకు అనుమతినైనా పొందవలెను.
అగ్న్యాధానమునకు ముందు దంపతులు దానికి ఏమేమి నియమములను పాటించవలెనో ఋత్త్విక్కుల నుండీ తెలుసుకొని అవన్నీ నెరవేర్చవలెను. అరణులను అశ్వత్థ వృక్షపు కొమ్మలతో చేయుదురు. అరణులతో అగ్ని మంథనమును గురించిన అనేక వివరములను ఇక్కడ వ్రాయుట లేదు. వాటిని కావలసినవారు అప్పుడే తెలుసుకొనవచ్చును. లేదా ఆ వివరములను వేరొక వ్యాసములో ఇచ్చెదను.
అరణులను మథించగా పుట్టిన అగ్నిని పూర్తిగా గార్హపత్య కుండములో వేయవలెను. దీనిని గార్హపత్యాధానము అంటారు. తరువాత ఈ అగ్ని నుండి ఒక అంశమును తీసుకొని దక్షిణాగ్ని కుండములో స్థాపించవలెను. దీనికి దక్షిణాగ్న్యాధానము అని పేరు. సూర్యుడు సగము ఉదయించినపుడు గార్హపత్య కుండము నుండీ అగ్నిని తీసుకొని ఆహవనీయ కుండములో వేయుటను ఆహవనీయాధానము అంటారు. ఈ విధముగా అగ్న్యాధానము నుండీ త్రేతాగ్నులు సిద్ధిస్తాయి.
పిమ్మట త్రేతాగ్నులలో ధాన్యములతో వ్యాహృతి మంత్రములు చెప్పి హోమము చేయవలెను. మూడు అగ్నులలోను మంత్రపూర్వకముగా సమిధలను వేయవలెను. తరువాత అగ్ని ఉపస్థానము ( తన క్షేమము కొరకు , కోరికలు తీరుట కొరకు అగ్నిని వేడుట ) చేయవలెను. ఆ తరువాత గార్హపత్యములో ఆజ్య సంస్కారమును చేసుకొని ఆహవనీయములో పూర్ణాహుతినీ , కూష్మాండ హోమమునూ చేయవలెను. ఆపైన మథించిన అగ్నుల సంస్కారము కొరకు నేతితో అగ్నిహోత్ర హోమమును చేయవలెను. సాయంకాలము మరియూ ప్రాతః కాలము చేయవలసిన అగ్నిహోత్రమును కలిపి ఒకేసారి చేయవలెను.
మొదటి అగ్నిహోత్రమును సాయంకాలమే చేయవలసి ఉన్ననూ , ఆధానము చేసిన అగ్నుల సంస్కారము కొరకు ప్రాతఃకాలమే రెంటినీ కలిపి ఒకేసారి అనుష్ఠిస్తారు. ఈ మొదటి హోమములో మంత్రోచ్చారణ ఉండక , మౌనముగా చేయుట వలన దీనిని తూష్ణీమగ్నిహోత్రం అంటారు. తర్వాత కొన్ని మంత్రములతో పవమానేష్టి చేయవలెను. ఆధానము చేసిన సాయంకాలమే అగ్నిహోత్రము ప్రారంభమగును.
ఈ అగ్నులను పన్నెండు రాత్రుల కాలము జాగ్రత్తగా అగ్ని నష్టము కాకుండా రక్షించుకొని ఉండవలెను. తరువాత వచ్చు మొదటి పౌర్ణమి నాడు లేదా , అనుకూలమైన ఒక పౌర్ణమి నాడు ’ అన్వారంభణీయేష్టి ’ చేసి , మరుసటి దినము , అనగా కృష్ణపక్ష ప్రతిపత్ నాడు ’ పూర్ణమాసేష్టి ’ ని చేయవలెను.
( ఔపాసన క్రమము ఎవరికి వారు చేసుకొను పద్దతి చివరగా ఇవ్వబడును. ఇప్పుడు చర్చించునవన్నీ ఋత్త్విజుల సహాయముతో చేయవలెను. ఇవి ఔపాసన మొదలు పెట్టుటకు ముందర చేయవలసిన కార్యములు కాబట్టి కర్తవ్యమును మాత్రము వివరించడమైనది. ఇవన్నీ ముఖ్యముగా యజ్ఞములను చేయగోరువారు చేయవలసినవి. కేవలము ఔపాసన చేయగోరువారికి ఇంత క్రమము లేదు. అది తరువాతి భాగములలో వచ్చును. )
ఇలాగ సిద్ధించిన అగ్నులను కాపాడుకుంటూ ప్రతి పౌర్ణమి , అమావాస్యలలో ఇష్టులను ఆచరించవలెను.
పునరాధానము
అగ్నులను రక్షించుకుంటూ వస్తుండగా ఎపుడైనా అనివార్య కారణముల వలన అగ్ని నష్టమైతే తిరిగి అగ్న్యాధానము చేయవలసి ఉంటుంది. దీనినే శ్రౌత ప్రక్రియలో ’ పునరాధానము ’ అంటారు. పునరాధానము చేయుటకు ఆషాఢ పౌర్ణమి తర్వాత వచ్చు అమావాస్య , పాడ్యమి , లేదా విదియ ఈ మూడురోజులలో ఎప్పుడైనా పునర్వసూ నక్షత్రము వస్తే ఆనాడు మాత్రమే చేయవలెను. ఇది కుదరకపోతే , ఉత్తరాయణము లోని ఏదైనా శుక్ల పక్షములో పునర్వసు నక్షత్రము వచ్చినపుడు చేయవచ్చును. పునరాధానములోని ఒక విశేషమేమంటే , దర్భలతో నిర్మించిన పగ్గముతో ఆధానము చేయవలెను. ( అరణి మథనముతో కాదు )
అగ్నిహోత్రము పద్దతి
ఈ కింద రాయబోవునది వేదకాలములోని ప్రక్రియ, మరియూ క్లుప్తముగా వివరణ మాత్రమే. ఈ కాలము ఆచరించు పద్దతి ఇదే వ్యాసములో తరువాత చూచెదరు. ) ఈ వ్యాసపు మొదటి భాగములో చెప్పినట్టు అగ్నిహోత్రమును సాయంకాలమే మొదలుపెట్టవలెను. ఆదినము ఉదయమే వపనము , మంత్రాచమనము , మంత్రప్రోక్షణలతో శుద్ధుడై ’ అగ్నిసూర్య ప్రజాపతయః ప్రీయంతామ్ " అని పుణ్యాహమును చేయవలెను. గార్హపత్యాగ్నికి పశ్చిమమున దంపతులు కూర్చొని ,ఆచమనము , ప్రాణాయామములు చేసి
సత్యధికారే యావజ్జీవమ్ అగ్నిహోత్రం హోష్యామి |
అని సంకల్పము చెప్పుకొనవలెను. తర్వాత గార్హపత్యాగ్నిలో గృహ్య సూత్రము లో చెప్పినట్టుఆజ్య సంస్కారము చేయవలెను. తర్వాత స్రుక్ మరియూ సృవములను సంమార్జన చేసి ఆహవనీయాగ్నిలో దశహోత్ర హోమమునూ , తర్వాత స్రువముతో కూష్మాండ హోమమునూ చేయవలెను. ఇవి అగ్నిహోత్రమును మొట్ట మొదట ఆరంభించునపుడు చేయవలసిన విధులు. ( స్రుక్కు స్రువములనగా , నేతిని , పాలను మొదలగువాటిని గిన్నెనుండీ తీసుకొని అగ్నిలో వేయుటకు ఉపయోగించే చెక్క గరిటలు. వీటినే దర్వి అని అంటారు )
కిందచెప్పబోవు విధానమును బాగుగా పరిశీలించండి. తర్వాత చెప్పబోవు ఈనాటి పద్దతితో పోల్చి చూడండి. అనేక పోలికలున్ననూ , మార్పులు జరిగినది తెలుస్తుంది. వాటికి కారణములు ఏమిటీ యని ఒక్కరైనా ఆలోచించి ఒక తీర్మానము నకు వస్తే చాలా మంచిదని నా విన్నపము. ఈ వివరణ అంతా కేవలము అర్థము చేసుకొనుటకే తప్ప ఈనాటి పరిస్థితులకు అన్వయము చేసుకొనుటకు కాదు. ఈ నాడు ఆచరించు క్రమము ఈ వ్యాసపు అంతమున ప్రత్యేకముగా ఇవ్వబడును.
తరువాత , ’ ఉపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం సాయమగ్ని హోత్రం పయసా హోష్యామి ’ అని సాయంకాలమూ ,
’ ప్రాతరగ్నిహోత్రం పయసా హోష్యామి " అని ప్రాతఃకాలమూ సంకల్పము చెప్పి ప్రధానమైనాగ్నిహోత్ర హోమమును చేయవలెను.
అగ్నిహోత్ర హోమమునకు అవసరమైన అగ్నిహోత్రస్థాలి ( కుండము ) , స్రువము , స్రుక్కు , దర్భలు , సమిధలు --ఈ హోమ సాధనములను గార్హపత్యమునకు పశ్చిమమున ఒక చెక్క పలక పైన ఉంచుకొనవలెను. తర్వాత అగ్నిహోత్రము కొరకు ఆవుపాలను పిండి తేవలెను. ఆ ఆవును అగ్నిహోత్రశాలకు దక్షిణములో , ఉత్తరాభిముఖముగా కట్టివేయవలెను. ఆ పాలను బ్రాహ్మణుడే పిండవలెను.
తర్వాత మూడు అగ్నులకూ క్రమముగా పరిషేచనము చేయవలెను. మొదట గార్హపత్యమునకు పశ్చిమమున కూర్చొని , కుండములోని నిప్పులను కొన్నిటిని అక్కడే కుండపు బయట ఉత్తరానికి వేసి , ఆ నిప్పులపై పాలను కాచవలెను. దర్భలతో అభిద్యూతన మరియూ పర్యగ్నికరణములను చేయవలెను. తర్వాత , కాచిన పాలను ఉత్తరానికి తీసిపెట్టి , నిప్పులను మరలా కుండములోనికే వేయవలెను. కుడిచేతిలో స్రువము మరియు సమిధలను , ఎడమ చేతిలో అగ్నిహోత్ర హవణినీ ( పాలు , పెరుగు వంటి వాటిని వంచుటకు , వంపు ఉన్న ఒకానొక గరిట ) తీసుకొని గార్హపత్యాగ్నిలో కాచవలెను. అగ్నిహోత్ర హవణిని దర్భ కూర్చపైన పెట్టి పాలను స్రువముతో నాలుగుసార్లు అగ్నిహోత్ర హవణిలోకి నింపుకొనవలెను. ఒకవేళ ఋత్విజుడు అగ్నిహోత్రమును చేస్తుంటే , ఇదంతా చేయుటకు యజమానుని అనుమతి తీసుకోవలెను. ఋత్త్విజుడితో చేయించవచ్చుకానీ అమావాస్య పౌర్ణములలో , అనగా పర్వకాలములో అగ్న్యాధానము చేసినవాడే హోమమును చేయవలెను.
పాలను నింపిన తర్వాత ఒక సమిధను అగ్నిహోత్రహవణి యొక్క దండముపై పెట్టి ,ఆ హవణిని ఆహవనీయాగ్ని కుండము పశ్చిమమున ఒక వేదికపై కూర్చ పైన పెట్టవలెను. ఆహవనీయాగ్నిలో ఆ సమిదాధానము చేసి హవణిలోని పాలతో హోమము చేయవలెను. ఇదే ప్రధానమైన అగ్నిహోత్ర హోమము. అనంతరము హోమశేషాన్ని ప్రాశనము ( తాగుట ) చేయవలెను. ఇదే విధముగా మూడు అగ్నులలోనూ సమిదాధానము చేసి ఉత్తర పరిషేచనము చేయవలెను. సాయంకాలము హోమము తర్వాత అగ్న్యుపస్థానము చేయవలెను. ఔపాసనా హోమము రోజుకు విధిగా రెండు సార్లు చేయవలెను. మొదటిసారి చేస్తున్నపుడు సాయంకాలమే మొదలు పెట్ట వలెను. సాయంకాలము చేసినవాడే ప్రాతః కాలములో కూడా చేయవలెను. సాయంకాలము పాలతో చేస్తే , ప్రాతః కాలము కూడా పాలతోనే చేయవలెను. ( నెయ్యి , పెరుగులతో చేసినా అదేవిధముగా అదే పదార్థముతో సాయంత్రమూ పొద్దున్నా చేయవలెను. ) దీనికి కారణమేమంటే , సాయంకాలము మరియూ తరువాతి ప్రాతః కాలమూ అనుష్ఠానము చేసిన హోమములు రెండుగా కనిపించినా అది ఒక్క హోమమేయనబడును.
నిత్యమూ అగ్నిహోత్రమును అనుష్టించుటకు త్రేతాగ్నులను తప్పనిసరిగా రక్షించుకొని ఉండవలెను. ఈ సంరక్షణ అనునది రెండు విధములు.
ఒకటి అజస్ర పక్షము. అనగా , మూడు అగ్నులనూ సర్వవేళలా కాపాడుకుంటూ ఉండవలెను. రెండవది , ఉద్ధరణ పక్షము. అనగా ఒక్క గార్హపత్యాగ్నిని మాత్రము సదా కాలమూ రక్షించుకొని , అగ్నిహోత్రము మొదలు అనేక కార్యములు చేయునపుడు ఆ గార్హపత్యాగినే దక్షిణాగ్ని మరియూ ఆహవనీయాగ్ని కుండములలో ప్రతిష్ఠించి అనుష్ఠానమును చేయవలెను.
పైవన్నీ ముందే చెప్పినట్టు వేదకాలములో చేసెడి పద్దతులు. ఈ కాలమునకు అనేక మార్పులు వచ్చినవి. మూల స్పూర్తి మారకున్ననూ , ఒక్కో యుగ ధర్మమును బట్టి క్రమము కొంత మారుతుండును.
ఇక ఇప్పటికి చాలు, మిగిలిన విషయములను తర్వాతి భాగములలో చూద్దామా.