SHARE

Monday, December 15, 2014

ధనుర్మాసము విశిష్టత- కర్తవ్యములు

ధనుర్మాసము  విశిష్టత- కర్తవ్యములు



రేపటినుండీ ధనుర్మాసము మొదలగుతున్నది. 

         సూర్యుడు వృశ్చికరాశి నుండీ ధనూరాశి కి వచ్చు సమయము నుండీ ధనుర్మాసము మొదలవుతుంది. 
 ఆగ్నేయ పురాణము ప్రకారము ఈ మాసము శ్రీ మహా విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది.  ధనుర్మాస వ్రతమును  ఆచరించువారికి  ఈ నెల  అత్యంత ప్రాముఖ్యమైనది. 

       మహా విష్ణువు పుష్ప , శ్రీగంధమాల్య , మణి మౌక్తిక , పీతాంబర  అలంకార ప్రియుడు అని ప్రతీతి. ఈ ధనుర్మాసములో ప్రతి దినమూ సూర్యోదయమునకు ముందే శ్రీమహావిష్ణువును సహస్ర నామార్చనతో పూజింపవలెను అని శాస్త్రములు నిర్దేశిస్తున్నాయి. ఈ మాసములో యే దేవాలయములో చూసినా బ్రాహ్మీ ముహూర్తములోనే పూజలు మొదలవుతాయి. అనేక విష్ణు దేవాలయములలో పెసర పప్పుతో చేసిన పులగమును  ఆ పరమాత్మునికి నైవేద్యముగా సమర్పించి ప్రసాదం గా భక్తులకు ఇస్తారు. 

ధనుర్మాస వ్రతపు నేపథ్యము 

          పురాణము ప్రకారము ఒకసారి బ్రహ్మ దేవుడు హంసరూపములో లోక సంచారము చేస్తున్నాడు. అప్పుడు సూర్యునికి అకారణముగా గర్వము పొడుచుకు వచ్చి , కావాలని , ఆ హంస పైన తన తీక్షణమైన కిరణాలతో తాపమును ప్రసరించినాడు. అందుకు నొచ్చుకుని బ్రహ్మ , సూర్యుడికి తన తప్పు తెలిసిరావలెనని , ’ నీ తేజో బలము క్షీణించు గాక ’ యని శపించినాడు. వెంటనే సూర్యుడు తేజోహీనుడై , తన ప్రకాశము నంతటినీ పోగొట్టుకున్నాడు. దానితో మూడు లోకములందూ అల్లకల్లోలమైనది. సూర్యుడి తేజము చాలినంత  లేక , జపములు , తపములు , హోమములు అన్నీ నిలచిపోయినాయి. దేవతలకు , ఋషులకే గాక , సామాన్య జనాలకు కూడా నిత్యకర్మలలో ఇబ్బందులు మొదలైనాయి. పరిస్థితి మరింత క్షీణించడముతో , దేవతలు  అనేక  సంవత్సరములు బ్రహ్మను గూర్చి తపము చేసినారు. బ్రహ్మ ప్రత్యక్షము కాగానే , సూర్యుని శాపాన్ని తొలగించమని వేడుకున్నారు. 

          " సూర్యుడు , తాను ధనూరాశిని ప్రవేశించగనే , ఒక మాసము పాటు శ్రీ మహా విష్ణువును పూజిస్తే , అతడి శాపవిమోచనము అవుతుంది " అని బ్రహ్మ తెలిపినాడు.  బ్రహ్మ చెప్పిన విధముగా సూర్యుడు , పదహారు సంవత్సరముల పాటు , ధనుర్మాస విష్ణు పూజను చేసి , తిరిగి తన తేజస్సును , ప్రకాశమునూ పరిపూర్ణముగా పొందినాడు. సూర్యుడినుండీ మొదలైన ఈ పూజ , తదనంతరము మిగిలిన దేవతలూ మరియూ ఋషులలో ప్రాచుర్యము పొంది , తమ కర్మానుష్ఠానములు నిర్విఘ్నముగా , విజయవంతంగా జరుగుటకు , వారుకూడా ధనుర్మాస పూజ , సూర్యోదయపు మొదటి జాములో  ఆచరించుట మొదలు పెట్టినారు.

         అగస్త్య మహర్షి , విశ్వామిత్రుడు , గౌతముడు , భృగువు వంటి మహర్షులే కాక, అనేక దేవతలు , ఉపదేవతలు కూడా ఈ ధనుర్మాస వ్రతమును ఆచరించినారని వివిధ పురాణములలో ఉంది. 

          ధనుర్మాసము అత్యంత మంగళకరమైన మాసమే అయినా , ఇది శుభకార్యములు జరప కూడని శూన్య మాసము. ఈ నెలలో శుభకార్యములైన వివాహ , గృహ ప్రవేశ , ఉపనయనము మొదలగు కార్యములు చేయు పద్దతి లేదు. యేమి చేసిననూ ఈ మాసము సంపూర్ణముగా మహా విష్ణువు సంప్రీతి కొరకే కేటాయించవలెను. వైకుంఠ ఏకాదశి కూడా ఈ మాసములోనే వచ్చును. 


ముద్గాన్న నైవేద్యము 
ఈ ధనుర్మాసములో మహా విష్ణువుకు ముద్గాన్నమును నైవేద్యముగా సమర్పిస్తారు. [ పెసర పప్పుతో చేసిన పులగము ]  దీని గురించి ’ ఆగ్నేయ పురాణము ’ లో ఇలాగుంది , 
|| కోదండస్తే సవితరి ముద్గాన్నం యో నివేదయేత్ |
సహస్ర వార్షికీ పూజా దినేనైకేన సిధ్యతి ||

" ధనూరాశిలో సూర్యుడుండగా పులగమును ఒక్క దినమైనా విష్ణువుకు సమర్పించిన మనుష్యుడు ఒక వేయి సంవత్సరముల పాటు పూజ చేసిన ఫలాన్ని పొందుతాడు " అని వివరిస్తుంది

ఈ నైవేద్యమును  పాకము చేయు విధమును కూడా పురాణమే తెలుపుతుంది. దాని ప్రకారము ,

         " బియ్యమునకు సమానముగా పెసర పప్పును చేర్చి వండు పులగము ఉత్తమోత్తమము. బియ్యపు ప్రమాణములో సగము పెసరపప్పు చేర్చితే అది మధ్యమము. బియ్యపు ప్రమాణములో పావు వంతు పెసరపప్పు చేర్చితే అది అధమము. అయితే , బియ్యపు ప్రమాణమునకు  రెండింతలు పెసరపప్పు చేర్చితే అది పరమ శ్రేష్టమైనది. భక్తులు తమకు శక్తి ఉన్నంతలో శ్రేష్ట రీతిలో పులగము వండి పరమాత్మునికి నివేదించవలెను. ఎట్టి పరిస్థితిలోనూ పెసర పప్పు ప్రమాణము , బియ్యమునకంటే సగము కన్నా తక్కువ కాకుండా చూసుకోవలెను. "

          అంతే కాదు , ’ పెసర పప్పు , పెరుగు , అల్లము , బెల్లము , కందమూలములు , ఫలములతో కూడిన పులగమును భగవంతునికి సమర్పిస్తే  సంతుష్టుడై భక్త వత్సలుడైన మహా విష్ణువు తన భక్తులకు సకల విధములైన భోగములను మోక్షమును కూడా ప్రసాదిస్తాడు ’ అని పురాణము తెలుపుతుంది. 

        అందుకే , ధనుర్మాసమనగానే విష్ణు పూజ మరియు పులగము [ పొంగల్ ] తప్పని సరియైనాయి. శ్రద్ధాళువులు తమ తమ శక్తి మేరకు ధనుర్మాసములో శ్రీ మహావిష్ణువును పూజించి కృతార్థులై , ఆయన కృపకు పాత్రులు కాగలరు. 

|| లోకాస్సమస్తా సుఖినస్సంతు ||


[ కన్నడ ప్రచురణ ’ బోధి వృక్ష ’ ఆధారంగా ] 

Saturday, November 1, 2014

కార్తీక మాసము--తులసి పూజ

కార్తీక మాసము--తులసి పూజ





             కార్తీక మాసమంతా పరమ పుణ్యప్రదము. ఇందులో అతి ముఖ్యమైనవి కార్తీక  శుక్ల ద్వాదశి , పౌర్ణమి మరియూ అమావాస్య. కార్తీక సోమవారాలు శివప్రీతి కరమైనవి అయితే ఏకాదశి , ద్వాదశులు విష్ణువుకు ప్రీతి పాత్రమైనవి . బిల్వపత్రములు శివుడికైతే , తులసీ దళములు , ఉసరి ఫలములు విష్ణువుకు.

 ఇం కార్తీక మాసములో విడువ వలసినవి , నల్లావాలు , కందులు , మినుములు ,పెసలు ,  నువ్వుల నూనె మరియూ బహుబీజకములైన వంకాయలు , మెంతులు , మొదలగునవి. కార్తీకమాసములో కేశకర్తనము [ క్షవరము ] చేసుకొనరాదు.

          పూజా ప్రతీకగా విష్ణు సంబంధమైన  సాలగ్రామము అగ్రగణ్యమైతే , పూజాద్రవ్యములలో తులసిది అగ్ర స్థానము. సాలగ్రామము లేనిదే పుణ్య తీర్థము లేనట్టే , తులసి లేనిదే పూజ లేదు. జంతువులలో గోవు , మనుషులలో జ్ఞాని , సస్యములలో తులసి ప్రత్యేకమైనవి.  దేవతలు లేని ప్రదేశమే లేదు , భగవంతుడు లేని చోటే లేదు. అయినా , సకల దేవతలు వెలసిన చోట్లు రెండే రెండు. ఒకటి గోవు , రెండు తులసి.  తులసిలో సకల దేవతలే కాక పుష్కర క్షేత్రములు , గంగాది సకల తీర్థములు కూడా ఉన్నాయని పురాణములలో వర్ణించబడినది. చరించు దేవాలయం గోవైతే , సస్యరూపమైన దేవాలయమే తులసి. తులసి అంటేనే ’ తులనము లేని సస్యము ’  అనగా , దేనితోనూ సమానము కాని సస్యము. తులసికి అధిదేవత సాక్షాత్తూ మహా లక్ష్మియే ! తులసి గురించి , " తులస్యుపనిషత్ " అను యొక ఉపనిషత్తే ఉన్నతర్వాత , తులసి మాహాత్మ్యము ఎంత గొప్పదో అర్థము చేసుకోవచ్చు. మహాలక్ష్మి సాన్నిధ్యము వల్లనే తులసి కూడా ఐశ్వర్యప్రదమైనది. పద్మ పురాణము , స్కంధ పురాణము , బ్రహ్మాండ పురాణము మొదలగువాటిలో తులసి మహిమ కీర్తించబడినది. 

         యే దానము చేయవలెనన్నా తులసి ఉండవలెను. జపతపములు పూర్ణముగా  ఫలించవలెనంటే తులసిమాల అత్యావశ్యకము. తులసి ఎక్కడుంటే అక్కడే విష్ణువు సన్నిధానముండును. తులసి మాలలేకున్నచో ఒక ఆకైనా చాలు. తులసీ కాష్టము కూడా శ్రేష్టమే. తులసి ఎండిపోయి ఉన్ననూ యే దోషమూ లేదు. అనివార్యమైనపుడు , నిర్మాల్య తులసిని కూడా మరలా కడిగి , పూజకు ఉపయోగించవచ్చును. అథమ పక్షము తులసీ నామమును జపించినా విశేష ఫలమే. 

         ఈ తులసి , దర్శనమాత్రము చేతనే సకల పాపములనూ పరిహరించును. స్పర్శనము చేత శరీరమును పావనమొనరించును. నమస్కారము చేత రోగములను పోగొట్టును, తులసినీటిని ప్రోక్షణ చేసుకున్నంత మాత్రమున మృత్యు భయమును పోగొట్టును , తులసి మొక్కను ఇంటిలో పెంచుకొనుట వలన కృష్ణ భక్తిని పెంపొందించును. శ్రీహరి పాదార్పణము చేసినంతనే ముక్తి ఫలము దొరకును. ఈ తులసి , రాక్షస శక్తులను కూడా నశింపజేయగల పరిణామకారి. ఆ కారణమువల్లనే పురాణములన్నీ , ’ సదా తులసి ఇంటియందు ఉంచుకోతగినది ’ యని ఘోషిస్తాయి. ఈ తులసికి పురాణములలో అనేక నామములు గలవు. 

        తులసిని బృందావనములో పెంచి పూజించుటవలన విశేష పుణ్యము దొరకును. కార్తీక పౌర్ణమినాడు తులసి ప్రాదుర్భవించినది కాబట్టి ఆ దినమే తులసీ జయంతి. ఆ దినము తులసిని భక్తితో పూజించువారు సకల పాపములనుండీ ముక్తిని పొంది విష్ణులోకాన్ని చేరగలరని  బ్రహ్మ వైవర్తస పురాణము తెలుపుతుంది. 

         కార్తీకమాసము తులసి జన్మ మాసము కాబట్టే ఆ మాసములో తులసి పూజకు అంత ప్రాముఖ్యము. ఉత్థాన ద్వాదశి నాడే తులసీ వివాహమైన పుణ్యతిథి. ఆనాడు విష్ణువును ఉదయమే పూజించి తులసీదళాన్ని సమర్పించవలెను. సాయంత్రము , తులసి సాన్నిధ్యములో ధ్వజపతాక రంగవల్లుల అలంకారము గావించి , దామోదర రూపుడైన ఆ శ్రీహరిని పూజించాలి. తోరణములతో శోభించే మంటపమునేర్పరచి , ముత్యాల మాలలతో అలంకృతమైన సింహాసనములో దామోదర మూర్తిని పంచరాత్ర విధానముతో భక్తితో పూజించవలెను. మనోహరములైన రకరకాల పూలమాలలతోను , అనేక విధములైన రత్నములతోను , అసంఖ్యాకమైన నేతిదీపాలతోను శ్రీహరిని ఆరాధించవలెను. 

          పాలు , వెన్న , పెరుగు , నేయిలను , వాటితో చేసిన పంచ భక్ష్యాలను , సుగంధ ద్రవ్య పూరితమైన జలములను , లవంగ సహితమైన తాంబూలమును , దక్షిణతో పాటు సమర్పించవలెను. పరిమళభరితములైన వివిధ పుష్పాలతో సమర్చించవలెను. తులసీ దళములచేతను , ఉసరిక ఫలముల చేతను , పూజింపవలెను. ఉసరికలు మహా విష్ణువుకు ప్రీతి పాత్రమే కాదు , సర్వ పాపములనూ పరిహరించగలదు. అందుకే , ఉసరి చెట్టు నీడలో పిండదానమాచరించినవాని పితరులు మాధవుని అనుగ్రహము వలన ముక్తి పొందుతారు. కార్తీకమాసములో శరీరం నిండా ఉసరిఫలాల గుజ్జును పూసుకొని , ఉసరికాయలతో అలంకరించుకొని , ఎండిన ఉసరి ఫలాలను ఆహారముగా స్వీకరించిన నరులు నారాయణులే అవుతారు. ఉసరి చెట్టు నీడలో విష్ణువును అర్చిస్తే వారు అర్పించిన ప్రతి పుష్పం వల్లనూ అశ్వమేధ ఫలం లభిస్తుంది. కార్తీక మాసములో ధాత్రీ వృక్షములు[ ఉసరి చెట్లు ] గల వనములో విష్ణువును చిత్రాన్నములతో సంతోషపరచి , బ్రాహ్మణులను భుజింపజేసి , తాము భుజించాలి. 

       కార్తీక మాసములో రోజు విడచి రోజు మూడు రాత్రులు ఉపవాసము చేసిన కానీ , ఆరు , పన్నెండు , లేదా పక్షము రోజులు లేదా నెలరోజులూ , ఒంటిపూట భోజనము చేసి గడపినవారు పరమపదాన్ని చేరుకుంటారు. 

           ప్రతి సాయంకాలమూ ఇంటి బయట నువ్వులనూనెతో ఆకాశదీపమును పెట్టవలెను.  చతుర్దశి , అమావాస్యలలో ప్రదోషకాలపు దీపము పెట్టటం వలన యమ మార్గాధికారులనుండీ విముక్తుడౌతాడు. కృష్ణ చతుర్దశి యందు గోపూజ చేయాలి. కార్తీక పౌర్ణమిలో దేవాలయములలో దీపాలు పెట్టాలి. పురుగులు , పక్షులు , దోమలు , వృక్షములు, మరియూ నీటిలోను , భూమియందు తిరుగుతున్న జీవులూ-- ఈ దీపాలను చూస్తే తిరిగి జన్మను పొందవు. చండాలులు , విప్రులూ కూడా ఈ దీపాలను చూస్తే మరుజన్మను పొందరు. 

       కార్తీకమాసమందు కృత్తికా నక్షత్రము రోజున కార్తికేయుని దర్శనము చేసుకున్నవారు ఏడు జన్మలు విప్రులౌతారు. ధనవంతులూ , వేదపారగులూ అవుతారు. [ ఈ నెల ఎనిమిదవ తేదీ నాడు కృత్తికా నక్షత్రము.. మధ్యాహ్నము వరకూ ] 

కార్తీకమాస నియమాలను పాటించి సర్వులూ శుభములను , సుఖములను పొందెదరు గాక. 

                        || శుభం భూయాత్ ||

Thursday, October 16, 2014

అగ్నికార్యము--ఔపాసన పీడీఎఫ్

ఇప్పుడు అగ్నికార్యము-ఔపాసన  ఈ రెండూ చేయు విధానము విపులముగా ,  ఇంకొంత  మెరుగు  పరచి పీడీఎఫ్ రూపములో  ఇవ్వడమైనది ఈ క్రింది లింకులో కొనవచ్చును.  దీని ద్వారా వచ్చు నది , మా ట్రస్ట్ కార్య కలాపాలకు ఉపయోగపడును.  ఆదరిస్తారని ఆశిస్తున్నాము.

http://kinige.com/kbook.php?id=3847

Thursday, October 2, 2014

రజస్వలా ధర్మాలు.

రజస్వలా ధర్మాలు. 

          ఈ కాలములో అంటు , ముట్టు అనేవి ఎవరికీ అర్థము కావు. అర్థమయినవారు , తెలిసిన వారు అనేకులు వాటిని పాటించడము లేదు. అదంతా ఒక మూఢ నమ్మకమనీ , అశాస్త్రీయమనీ , ఇంకా రకరకాలుగా హేళన చేసేవారు పుట్టుకొచ్చారు.. మతమార్పిడులకు ఇది కూడా ఒక కారణమట ! అనాదిగా అన్ని మతాలవారూ  దీన్ని పాటిస్తున్నారు, అయితే సనాతన ధర్మములో మాత్రము ఇంకా కొద్దో గొప్పో ఇది మిగిలి ఉంది. అంటు , ముట్టు లను గురించిన నేటి శాస్త్రీయమైన / అశాస్త్రీయమైన అవగాహన ఏమిటి అన్నది అటుంచితే , అసలు మన సనాతన ధర్మము దీన్ని గురించి యేమంటున్నది అని తెలుసుకోవడము ముఖ్యము.

          సనాతన ధర్మములో అంటు , ముట్టు అనేవే లేవని మిడిమిడి జ్ఞానముతో వాదించే పండిత పుంగవులు కూడా పుట్టుకొచ్చారు. 

          కృష్ణ యజుర్వేదము రెండో కాండలో ఐదో ప్రశ్న చాలాభాగము దీనిగురించే వివరిస్తుంది. అందులో ఈ ఉదంతము ఉంది, దీనికన్నా ముందు , ఋగ్వేదపు ( 1-20-6 ) సూక్తము నొకదాన్ని చూద్దాము, 

          ద్వాదశాదిత్యులలో ఒకడైన "  త్వష్ట  " ను ’ విశ్వ కర్మ ’ అని కూడా అంటారు. ఇతడే దేవ శిల్పి. ఇతడు కశ్యప ప్రజాపతి ( మానస ) పుత్రుడు .ఋగ్వేదము ఇతడిని బ్రాహ్మణుడు అంటే , యజుర్వేదము ఇతడిని ప్రజాపతి యనీ , అథర్వణ వేదము పశుపతి యనీ , శ్వేతాశ్వతరోపనిషత్ ప్రకారము రుద్రశివుడనీ వర్ణిస్తాయి. ప్రహ్లాదుడి కుమార్తె , ’ రచన ’  ఇతడి భార్య. వీరి పుత్రుడు " విశ్వరూపుడు "  ఇతడికి మూడు తలలుండుట చేత , " త్రిశీర్షుడు "  అంటారు. 

          ఈ విశ్వరూపుడు , ప్రహ్లాదుడి దౌహిత్రుడు కాబట్టి , రాక్షస పక్షపాతి అని పేరు, అయితే కొంతకాలము దేవతల పురోహితుడుగా ఉన్నాడు. అతడి మూడు తలలలో  ఒకతలతో సోమపానము చేసేవాడు , ఇంకొక తలతో సురాపానమూ , మూడో తలతో అన్న భక్షణమూ చేసేవాడు. పురోహితుడిగా యాగములు చేయించేటప్పుడు , దేవతలకు హవ్యభాగాన్ని ప్రత్యక్షంగా ఇప్పించేవాడు , అయితే , రహస్యంగా రాక్షసులకు కూడా హవ్యభాగాన్ని ఇప్పించేవాడు. ఇది తెలుసుకున్న ఇంద్రుడు , ’ ఇతడు దేవలోకాన్ని రాక్షసుల పరం చేయవచ్చు’ నని బెదరినాడు. కాబట్టి , స్వామిద్రోహి , దేవ ద్రోహి యైన విశ్వరూపుడి మూడు తలలూ  తన వజ్రాయుధముతో  నరికివేస్తాడు. ( సోమపానము చేయు తల ’ కపింజలము’  అను పక్షిగాను , సురాపానము చేయు తల గుడ్లగూబ గాను , అన్నము తిను తల , ’ తిత్తిరి పక్షి ’ గాను రూపాంతరము చెందుతాయి ) 

          ఆత్మ జ్ఞాని యైన ఇంద్రుడికి దుష్ట శిక్షణ చేసినందువల్ల , బ్రాహ్మణ హత్య పాపము కాదని తెలుసు. అయినా సామాన్యులకు జనాపవాద నివృత్తి చేయుట ఎలాగ అన్న విషయము తెలుపుట కోసము , ఇలా చేస్తాడు. 

          ధర్మ దేవతల ఎదురుగా తన అంజలితో బ్రహ్మ హత్యా పాపాన్ని స్వీకరిస్తాడు. తాను తప్పుచేయలేదన్న భావనతో ఆ పాపాన్ని ఒక సంవత్సరము భరిస్తాడు. అయితే సృష్టిలోని ప్రాణులన్నీ , ఇంద్రుడిని " బ్రహ్మ హత్య చేసినవాడు " అని ఆక్షేపిస్తాయి. కాబట్టి , సామాన్యుల దృష్టిలోకూడా దాని నివృత్తి కోసము బ్రహ్మ హత్యా పాపాన్ని ఇతరులకిచ్చి , తీసుకున్నందుకు ప్రతిగా వారికి వరాలను ఇవ్వాలనుకుంటాడు. 

          మొదట , భూదేవిని ప్రార్థించి , తన పాపములో మూడో భాగాన్ని తీసుకోమని కోరుతాడు. భూమి , వరాన్ని ఇలా అడుగుతుంది , " జనులు నన్ను త్రవ్వేటప్పుడు నేను పీడను అనుభవిస్తాను , దానివలన నాకు హింస కలుగుతుంది. కాబట్టి , నాకు వ్యథ తెలియకుండా , హింస కలుగకుండా చూడు " . ఇంద్రుడు దానికి సమ్మతించి , జనులు భూమిని త్రవ్వేటప్పుడు భూమికి నొప్పి కాకుండానూ , అంతేకాక, ఆ త్రవ్విన చోట ఒక సంవత్సరములోపల దానికదే పూడుకొనే లాగానూ వరమిచ్చి , పాపపు మూడో భాగాన్ని వదిలించుకుంటాడు. బ్రహ్మ హత్యా పాపం తో కూడుకొన్నది కావున తనకుతానుగా పూడుకొన్న అటువంటి బంజరు భూమిని ఎవరూ నివాసము కోసమూ , యాగముల కోసము ఉపయోగించరాదు. 

          తర్వాత  ఇంద్రుడు, వృక్షములను , సస్యములనూ ప్రార్థించి , బ్రహ్మ హత్యా పాపంలో ఇంకో భాగాన్ని తీసుకొమ్మని కోరుతాడు. అప్పుడా సస్యజాలము , "జనులు మమ్మల్ని కత్తరించుటవలన మేము నశిస్తుంటాము, కాబట్టి మేము నాశనము కాకుండా వరమియ్యి " అని అడుగుతాయి. ఇంద్రుడు ఒప్పుకుని , " నరికినచోట అనేక చిగుళ్ళు మొలవనీ " అని వరమిచ్చి , పాపపు రెండో భాగం వదిలించుకుంటాడు. అందుకే , చెట్లను కొట్టివేస్తే అక్కడే అనేక చిగుళ్ళు పుట్టుకొస్తాయి. అయితే , అది బ్రహ్మ హత్యా పాపంతో కూడుకున్నది కాబట్టి , ఆ కొట్టివేసిన చోట , గట్టియైన రసము ( బంకపాలు లేదా జిగురు) కారుతుంది. కాబట్టి ఆ రసమును తాగరాదు. ( కల్లు వచ్చేది ఇలాగే , అందుకే కల్లుతాగుట నిషేధము. ) కాబట్టి , ఎరుపు రంగుతో ఏదైతే కారుతుందో , లేక , కొట్టివేసిన చోటే బయటికి కారుతుందో , అది తినుటకు యోగ్యము కాదు. అయితే , కొట్టివేయకుండానే కారే రసాలకు ఈ నిషేధము లేదు. 

          ఆ తర్వాత , మిగిలిన బ్రహ్మ హత్యా పాపంలోని మూడోభాగాన్ని తీసుకోమని ఇంద్రుడు , స్త్రీ సమూహాలను కోరుతాడు. అప్పుడు స్త్రీలు , "  నిషిద్ధ దినములలో పురుష సంయోగము వల్ల కలిగే దోషము లేకుండా , దానివలన గర్భమునకు హాని కలుగకుండా వరమునియ్యి "  అని అడుగుతారు. ( పురుష సంయోగము కేవలము సంతాన ప్రాప్తికే అయిననూ , ప్రసవము వరకూ , ఇచ్చానుసారముగా పురుష సంయోగమును యే దోషమూ లేకుండా పొందుటకు యోగ్యతను పొందుతారు ) ఆ వరము వలన , ప్రథమ రజోదర్శనముతో మొదలు పెట్టి , ఋతుకాల సంబంధమైన వీర్య సంయోగము వలన సంతానము పొందుతారు , ప్రసవము అయ్యేవరకూ , ఇచ్చానుసారము పురుష సంయోగము పొందే శక్తిని పొందుతారు. అయితే , అది బ్రహ్మహత్యా సంబంధమయినది కాబట్టి , ఆ పాపము స్త్రీల రజోరూపమైనది. అనగా రజస్సును అంటిపెట్టుకొని ఉండును. 

          రజస్వల అయిన స్త్రీ మలిన వస్త్రములను ధరించినదానితో సమానము. అట్టి రజస్వలతో  ఎవరూ సంవాదములు చేయరాదు. పక్కన కూర్చొనరాదు. ఆమె ముట్టిన అన్నమును తినరాదు. బ్రహ్మ హత్యారూపాన్ని శరీరం లో ధరించినది కావున , స్త్రీలకు ప్రియమైన అభ్యంగనాది  తైలములను  రజస్వలలు తీసుకోకూడదు. సౌందర్య సాధనములను వాడరాదు. ( ఇతర వస్తువులను తీసుకొన వచ్చును ) 

ముఖ్య నియమములు :-


ఎవడైతే రజస్వలతో సంయోగిస్తాడో , ఎవడైతే ఆ సంయోగము వలన పుట్టునో , వాడు నీలాపనిందల పాలై కష్టములనుభవిస్తాడు.

అడవిలో రజస్వలతో సంయోగఫలముగా పుట్టినవాడు , దొంగ అవుతాడు. 

సిగ్గుతోగానీ , భయం తోగానీ , నిరాకరించిన స్త్రీని ఎవరైనా కూడితే , ఆమెకు పుట్టువాడు , సభలలో మాట్లాడుటకు సిగ్గుపడి , తలవంచుకొనెడు పుత్రుడు అవుతాడు

యే రజస్వల అయితే స్నానము చేస్తుందో , ఆమెకు , నీటిలో మునిగి చనిపోగల సంతానము కలుగును ( రజస్వలలు ఆ మూడు రోజులూ స్నానము చేయరాదు) 

యే రజస్వల అభ్యంగన స్నానము చేస్తుందో , ఆమెకు కుష్టు రోగము , చర్మ రోగములు కల సంతానము కలుగును. 

యే స్త్రీ అయితే గోడలమీద బొమ్మలు వేస్తుందో , ఆమెకు కేశములు లేని , బట్టతల కలుగువారునూ , దుర్మరణము / అకాల మరణమునకు పాలగువారు పుడతారు. 

ఎవతె కంటికి కాటుక పెట్టుకొనునో , ఆమెకు , కళ్ళులేనివారు , నేత్రరోగులు పుడతారు.

ఎవతె , దంతధావనము చేయునో ( వేపపుల్లతో )  ఆమెకు పాచి పళ్ళు , పుచ్చుపళ్ళు కలవారై పుడతారు. 

యేస్త్రీ గోళ్ళను కత్తరించుకొనునో , ఆమెకు వికృత గోళ్ళు కలవారు పుడతారు.

యేస్త్రీ గడ్డి కోస్తుందో , చాపలల్లుతుందో , ఆమెకు నపుంసకులు పుడతారు. 

ఎవరైతే పగ్గములను ( తాళ్ళను ) పేని తయారు చేస్తారో , ఆ స్త్రీలకు ఉరిపోసుకొని చచ్చువారు పుడతారు. 

యేస్త్రీ ఆకులతో నీరు తాగునో , ఆకులలో భోజనము చేయునో , ఆమెకు ఉన్మాదులు / పిచ్చివారు పుడతారు.

ఎవరైతే అగ్నిలో కాల్చిన మట్టికుండలలో నీరు తాగుతారో , ఆమెకు మరుగుజ్జులు ( పొట్టివారు ) పుడతారు. 

ఈ నియమాలు మూడురాత్రుల కాలము ముగియువరకూ పాటించవలెను. పచ్చికుండలలో , పచ్చి మూకుడులలో నీళ్ళు తాగడము , భోజనము చేయడము చేయవచ్చును. 

ఈ నియమాలు పాటిస్తే ఉత్తమ సంతానము కలుగును. ఇతరులకు కామోద్రేకము కలుగులాగ ప్రవర్తించరాదు. ఈ నిషిద్ధ కార్యములకు ఫలము అరిష్టమే కాబట్టి , అరిష్టము తెచ్చు యే పనినీ చేయరాదు. 

శ్రద్ధాళువులు సనాతన ధర్మపు సాంప్రదాయములను , ఆచారములను పాటించి శుభమును పొందెదరు గాక . 



సంప్రదించిన గ్రంధములు :
 కృష్ణ యజుర్వేద  భాష్యము ,
  Encyclopedia of Hinduism ,
 బోధివృక్ష  --కన్నడ వార్తా పత్రిక ,
పురాణ భారత కోశము

Monday, August 11, 2014

పంచగవ్యము ---దాని ప్రాశస్త్యత

పంచగవ్యము ---దాని ప్రాశస్త్యత 

పంచగవ్యము అంటే గోవు నుండీ లభించే అయిదు పదార్థాలతో చేసిన ఒక లేహ్యము వంటిది. 




అవి , ఆవుపాలు , ఆవుపాలు తోడుపెట్టిన  పెరుగు , ఆవు వెన్నతో చేసిన నెయ్యి , గోమూత్రము మరియు గోమయము. ఈ అయిదింటినీ ఒక ప్రత్యేక నిష్పత్తిలో  ఆయా మంత్రాలతో అభిమంత్రించి  కలిపి , చేసిన ద్రవమునే పంచగవ్యము అంటారు. 

సనాతన ధర్మములో గోవుకున్న ప్రాముఖ్యత , గౌరవము , విలువా అంతాఇంతా కాదు.  వేదములో అనేకచోట్ల , ’ గోబ్రాహ్మణ ’ అన్న పదము తరచూ వస్తుంది. బ్రాహ్మణుల , గోవుల హితము కొరకు పనిచేయుట చాలా పవిత్రమైన కార్యము. గోవులను పూజించుట వేలయేళ్ళ నుండీ  వాడుకలో ఉంది.. అనేకులు ఋషులతో పాటు , భగవంతుని అవతారాలయిన శ్రీ కృష్ణుడు , శ్రీ రాముడు వంటి వారు కూడా గోపూజను చేసినవారే.. అట్టి గోవునుండీ లభించు పదార్థాలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. 

 మానవుడు చేసే అనేక పాపాలలో , పొరపాట్లలో ఎన్నింటికో ,  సనాతన ధర్మశాస్త్రములలో అనేక ప్రాయశ్చిత్తాలు విధింపబడినవి.  పంచ గవ్యము యొక్క ప్రాశన ( తాగుట ) వాటిలో ఒకటి. దీనిని బట్టే  గోవులకు గల ప్రాశస్త్యము  ఎట్టిదో తెలుస్తున్నది. 

ఒక కపిల గోవు ( ఎర్రావు )పాల నుండీ చేసిన పంచగవ్యము ఇంకా ఫలవంతమైనది. 

పంచగవ్య పదార్థాలను కలపవలసిన నిష్పత్తి ఈ క్రింది విధముగా ఉండాలి.::   

గోక్షీరము ఎంత తీసుకుంటే , అంతే పెరుగు కూడా తీసుకోవాలి.. గోక్షీరములో సగము గోఘృతము ( ఆవు నెయ్యి ) , గోఘృతము లో సగము గోమూత్రము , గోమూత్రములో సగము గోమయము ( ఆవుపేడ ) 

ఈ పంచగవ్యాన్ని అనేక ప్రయోజనాలకోసము వాడతారు... 
* పాపనివృత్తియై , దేహము శుద్ధముగా ఉండుట కోసము పంచగవ్యమును స్వీకరిస్తారు. , 
* యజ్ఞోపవీత ధారణ సమయములో శరీర శుద్ధి కోసము పంచగవ్యమును మొదట ప్రాశన చేస్తారు. 
* కొన్ని పూజలముందరకూడా పంచగవ్య ప్రాశన చేస్తారు...,
*  ఏదైనా ఒక శివలింగముకానీ , సాలిగ్రామము కానీ , రుద్రాక్షకానీ , లేక చిన్న విగ్రహముకానీ పూజగదిలో ఉంచి పూజించుటకు ముందు , వాటిని పంచగవ్యముతో మంత్ర సహితముగా అభిషేకము చేసి , ఆ తర్వాతనే పూజించాలి. 

పంచగవ్యమును ఉపయోగించు విధము

యే ప్రయోజనము కోసము పంచగవ్యమును వాడుతున్నామో , ఆ సంకల్పాన్ని మొదట చెప్పాలి, ఉదాహరణకు , యజ్ఞోపవీత ధారణ  సమయములో శరీర శుద్ధి కోసము చేస్తుంటే , మొదట  ఆచమనము , ప్రాణాయామము చేసి , దేశకాల సంకీర్తనానంతరము , 

1.  "||  మమ శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్ఠాన యోగ్యతా సిధ్యర్థం , శరీర శుద్ధ్యర్థం , పంచగవ్య ప్రాశన -యజ్ఞోపవీత ధారణమహం కరిష్యే  || తదంగ పంచగవ్య మేళనం యజ్ఞోపవీత సంస్కారమహం కరిష్యే ||| అని చెప్పాలి. తర్వాత , 

పంచగవ్యము కలుపవలసిన పద్దతి :-

ఒక అరిటాకులోగాని , పళ్ళెం లో గానీ శుభ్రమైన బియ్యం పోసి , దానిపైన స్వస్తిక గుర్తు వేలితో రాయాలి. ఆ గుర్తుపైన ఒక మట్టి పాత్రగానీ , ఇత్తడి లేక కంచు లేక వెండి పాత్రగానీ పెట్టి , దానికి తూర్పు దిక్కున అటువంటిదే ఒక చిన్న పాత్రలో గోమూత్రాన్ని ఉంచాలి. దక్షిణాన ఒక పాత్రలో గోమయమునుంచాలి. పశ్చిమాన వేరొక పాత్రలో ఆవుపాలను పోయాలి. ఉత్తరాన అటువంటిదే ఇంకో పాత్రలో ఆవుపెరుగు పోయాలి . మధ్యలోని పాత్రలో ఆవునెయ్యి పోయాలి. ఇవికాక , వాయవ్యములో ఒక పాత్రలో కుశోదకం పోయాలి ( దర్భలు ఉంచిన నీరు ) . 

ఇప్పుడు అన్ని పాత్రలలోనూ , ఆయా పదార్థాల అధిదేవతలను ఆవాహన కింది విధంగా చేయాలి

తూర్పు పాత్రలో , || గోమూత్రే ఆదిత్యాయ నమః ఆదిత్యమావాహయామి  || ( అని పలకాలి ) 

దక్షిణ పాత్రలో , || గోమయే వాయవే నమః వాయుమావాహయామి ||

పశ్చిమ పాత్రలో , || గోక్షీరే సోమాయ నమః సోమమావాహయామి ||

ఉత్తర పాత్రలో , || గోదధ్ని శుక్రాయ నమః శుక్రమావాహయామి  ||  ( గో దధి అంటే ఆవుపెరుగు ) 

మధ్య పాత్రలో , || ఆజ్యే వహ్నయే నమః వహ్నిమావాహయామి ||  (  వహ్ని అంటే అగ్ని ) 

వాయవ్య పాత్రలో , || కుశోదకే గంధర్వాయ నమః గంధర్వమావాహయామి ||

ఇలాగ ఆవాహన చేసి , కుంకుమ , గంధము , పూలతో పూజించాలి, తర్వాత మధ్యలో ఉంచిన పాత్రలో , ఒక్కొక్క పదార్థాన్నీ కింది మంత్రాలతో కలపాలి ( మంత్రము పూర్తిగా ఇవ్వడము లేదు , వాటిని స్వరముతో పలుకవలెను. మంత్రము రానివారు , ఆయా దేవతలకు  ఆయా పదార్థాలతో అభిషేకం చేసినట్లు  భావించుకుంటూ  )

మధ్యలోని పాత్రలోకి , గాయత్రీ మంత్రం పలుకుతూ గోమూత్రాన్ని , 

" || గంధ ద్వారే  ...|| " అను మంత్రముతో గోమయాన్ని , 
"|| ఆప్యాయస్వ ...|| " అనే మంత్రంతో గోక్షీరాన్ని , 
"|| దధిక్రావ్‌ణ్ణో....|| " అనే మంత్రముతో  పెరుగునూ , 
" || శుక్రమసి జ్యోతిరసి.... || " అనే మంత్రముతో నేతినీ , 
" || దేవస్యత్వా   సవితుః .....|| " అనే మంత్రముతో కుశోదకాన్నీ  కలపాలి. 

దర్భలు తీసుకొని , " || ఆపోహిష్ఠా ... || " అనే మంత్రముతో మధ్యపాత్రలో కలయబెట్టాలి 

" || మానస్తోకే తనయే ....|| " అను మంత్రముతో అభిమంత్రించి , అందులోకి మరలా గాయత్రీ మంత్రము చెబుతూ సూర్యుడిని ఆవాహన చేయాలి. 

తర్వాత పంచగవ్యానికి పంచమానసపూజలు చేయాలి ( లం  పృథివ్యాత్మనే నమః  .... ఇత్యాది ) మరలా వ్యాహృతులతో గాయత్రీ మంత్రం జపించి ,  || యత్త్వగస్థి గతమ్ పాపమ్ దేహే తిష్ఠతి మామకే ( ఇతరులకోసం చేస్తుంటే , ’ తావకే ’ )

|| ప్రాసనం పంచగవ్యస్య దహత్వగ్నిరివేంధనం ||  అని పలికి , ఓంకారము పలికి , పంచగవ్యాన్ని ప్రాశనము చేయవలెను ( త్రాగ వలెను ) శరీర శుద్ధికోసము అయితే  ఇంతవరకే. 

2. యజ్ఞోపవీత ధారణ కోసమయితే పైదంతా చేసి , 

తర్వాత రెండుసార్లు ఆచమించి , కొత్త  యజ్ఞోపవీతాన్ని ఎడమ చేతిలో ఉంచుకొని , " ||  ఆపోహిష్ఠా  ..|| . మంత్రముతో మొదలుపెట్టి సంధ్యావందనములోని మార్జన మంత్రాలన్నీ చెప్పవలెను.  తర్వాత , ఉదకశాంతి మంత్ర పాఠము అయినవారు , "||  పవమానః సువర్జనః .... నుండీ మొదలుపెట్టి , "|| జాతవేదా మోర్జయంత్యా పునాతు ...||. "  వరకూ చెప్పి , యజ్ఞోపవీతాన్ని నీటితో అభ్యుక్షణము చేసి ( మూసిన పిడికిలితో నీళ్ళను ప్రోక్షించి ) మూడు తంతువులలోకి వ్యాహృతులను , దేవతలను ఆవాహన చేయాలి.

ప్రథమ తంతౌ ఓం భూః  ఓంకారమావాహయామి , ఓం భువః ఓంకారమావాహయామి , ఓం సువః ఓంకారమావాహయామి , ఓం భూర్భువస్సువః ఓంకారమావాహయామి ,అని వ్యాహృతులను ఆవాహన చేయాలి. తర్వాత , ద్వితీయ తంతి లోకూడా ‘అలాగే వ్యాహృతులను ఆవాహన చేయాలి

తృతీయ తంతౌ అగ్నిమావాహయామి , నాగమావాహయామి , సోమమావాహయామి , పితౄనావాహయామి , ప్రజాపతిమావాహయామి , వాయుమావాహయామి , సూర్యమావాహయామి , విశ్వాన్దేవానాహయామి... అని పలికి , మూడు సూత్రములలోనూ , బ్రహ్మాణమావాహయామి, విష్ణుమావాహయామి , రుద్రమావాహయామి , అని ఆవాహన చేసి అక్షతలు వేసి పూజించాలి. 

తర్వాత , "|| స్యోనా పృథివి......  సప్రథా || "  అని పలికి , యజ్ఞోపవీతా(ల)న్ని కింద భూమిపైన గానీ ఒక పళ్ళెములోగానీ పెట్టవలెను. "|| ఓం దేవస్యత్వా సవితుః ....హస్తాభ్యామాదదే || " అనే మంత్రముచెప్పి చేతిలోకి తీసుకొని , "||  ఉద్వయం తమసస్పరి....... జ్యోతిరుత్తమం ||  " అనే మంత్రాలను పలికి యజ్ఞోపవీతాన్ని ఆదిత్యుడికి చూపించవలెను. 

తర్వాత హృదయాది న్యాసములు చేసి , " ముక్తా విద్రుమ ... " ధ్యాన శ్లోకము చెప్పి ,  ఒక్కొక్క యజ్ఞోపవీతాన్నీ పది సార్లు గాయత్రీ మంత్రముతో అభిమంత్రించి , 

" ||  యజ్ఞోపవీతమిత్యస్య పరబ్రహ్మ పరమాత్మా త్రిష్టుప్ ఛందః  | శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్ఠాన యోగ్యతా సిద్ధ్యర్థే యజ్ఞోపవీత ధారణే వినియోగః || "

|| యజ్ఞోపవీతం పరమం ... తేజః ||" అని పలికి యజ్ఞోపవీతాన్ని ధరించవలెను. మరలా ఆచమించి , 

|| అజినం బ్రహ్మ సూత్రం చ జీర్ణం కశ్మల దూషితం | 
విసృజామి సదా  బ్రహ్మవర్చో దీర్ఘాయ్తురస్తు మే || 

అని పాత యజ్ఞోపవీతాన్ని తీసివేయవలెను. 

|| అనేన మయాకృత పంచగవ్య ప్రాశన- యజ్ఞోపవీత ధారణ విధి కర్మణా శ్రీ పరమేశ్వరః ప్రీయతాం ||

మళ్ళీ ఆచమనము చేయాలి. 


3. కొత్త శివలింగము , సాలిగ్రామము , విగ్రహము , రుద్రాక్ష మొదలగునవి మొదటిసారి ధరించుటకు ముందు , పైన చెప్పినట్లే పంచగవ్య మిశ్రణము చేసి ,  మిశ్రణముతో  " పవమానస్సువర్జనః ..."  అనే మంత్రములతోను , మలాపకర్షణ మంత్రములతోను , అభిషేకము చేయవలెను.  తర్వాతనే వాటిని ఉపయోగించవలెను.  

4. పంచగవ్యపు ప్రయోజనాలు ఇంకా చాలానే కలవు.  వాటిలో ముఖ్యమైనది , ఇంట్లో అంటు , ముట్టు పాటించుటకు వీలు కాకపోతేనో , అంటు కలసిపోతేనో , ప్రతిరోజూ కానీ , నాలుగవ రోజుకానీ ఈ పంచగవ్య ప్రాసనము చేయాలి. 

చివరిగా , పంచగవ్యముతో  క్రిమి నివారకాలను  కూడా తయారు చేస్తారు 

|| శుభం భూయాత్ ||





Sunday, July 27, 2014

ఉపాకర్మ

ఉపాకర్మ అనగా , " ఉపక్రమణ కర్మ " ( ఆరంభించుట ) 

ప్రాచీన కాలములో , వేదాధ్యయనము చేయు  బ్రహ్మచారులు గురుకులం లో నివశిస్తూ ఉండేవారు. వేదాధ్యయనము సంవత్సరము పొడగునా ఉన్నా , మధ్య మధ్యలో కొంత వ్యవధి ఉండేది.. ఆ వ్యవధిలో వారు తమ ఇళ్ళకు వెళ్ళిరావడమో , లేక ఆచార్యుని ఇంటనే ఇతరపనులు చూసుకోవడమో చేసేవారు. వేదాధ్యయనమును తాత్కాలికముగా నిలిపివేయడము , తర్వాత మళ్ళీ మొదలుపెట్టడము అన్నవి గొప్ప ఉత్సవాలు. ఈ రెంటినీ మంత్రపూర్వకముగా , సంస్కారపూర్వకముగా , గృహ్యసూత్రానుసారము  ఆచరిస్తారు. వేదాధ్యయనాన్ని తాత్కాలికంగా నిలిపివేయడాన్ని " ఉత్సర్జనము "  అనీ , నిలిపిన తర్వాత మళ్ళీ మొదలుపెట్టడాన్ని " ఉపాకర్మ " అని అంటారు.  రెంటినీ కలిపి ఉత్సర్జనోపాకర్మ అంటారు. 


ఈ ఉపాకర్మను ఆచార్యుడు శిష్యులతో పాటూ ఏదైనా నదీతీరములో ఆచరించుట శ్రేష్ఠమని చెప్పబడినది. కొన్ని సమయాల్లో నదులకు దోషాలుంటాయి.. అప్పుడు ఆ సమయాల్లో నదీస్నానము వంటివి చేయరు. కానీ ఉపాకర్మ నాడు నదులలో ఎట్టి దోషమున్ననూ అది దోషము కాదు అని గార్గ్యోక్తి. విద్యార్థులు ఆనాడే వపనము చేయించుకొనవలెను. వారికి కూడా వపనము నకు చూడవలసిన తిథివార దోషములు ఆనాడు వర్తించవు. 



ఉత్సర్జనము 

ఉత్సర్జనములో భాగముగా , దర్భలతో చేసిన కూర్చలలో కాండఋషులను ఆవాహన చేసి , షోడశోపచార పూజచేసి , తర్పణము ఇచ్చి , ప్రతిష్టిత అగ్నిలో షట్పాత్ర ప్రయోగపూర్వకముగా నవకాండ ఋషులకు , చతుర్వేదాలకు హోమము చేసి హవ్యమునర్పిస్తారు. 

ఉపాకర్మ

 ఉపాకరణము ( ఉపాకర్మ ) అనేది కూడా రెండు రకాలు. 

ఒకటి అధ్యాయోపాకరణం , రెండోది కాండోపాకరణం. 

ఉపనయనము అయిన తర్వాత , వేదాధ్యయన ప్రారంభాన్ని అధ్యాయోపాకరణము అంటారు.  అధ్యాయోపాకరణానికి ముందర , వేదములోని కాండఋషులకు హోమములు చేసి, ఆ తర్వాతనే అధ్యయనము చేయవలెను. కాండఋషులకు చేయు హోమాలనే కాండోపాకరణం అంటారు. 

యజుర్వేదులకు ,  కాండోపాకరణము అంటే , ప్రాజాపత్య , సౌమ్య , ఆగ్నేయ , వైశ్వ దేవ , మొదలుగాగల తొమ్మిది  కాండముల ఋషులకు ( నవకాండ ఋషులు )  హోమము చేయుట. తర్వాత ఆయా కాండములను అధ్యయనము చేయవలెను.   కాని ,  యజుర్వేదములో మంత్రాలు , ( సంహిత , బ్రాహ్మణము , ఆరణ్యకములలోని మంత్రాలు ) ప్రత్యేకముగా ఉండక అన్నీ కలగలసి ఉంటాయి. ఇలా కలగలసి ఉన్న మంత్రాల పాఠమును సారస్వత పాఠము అంటారు. కాండ పాఠానికి అనుగుణముగా , అదే క్రమములో సారస్వత పాఠము ఉండదు. ( అంటే , ఒక కాండ ఋషి కనుగొన్న మంత్రాలు అన్నీ ఆ కాండములోనే ఉండవు. మిగిలినవాటిలో కలగలసి ఉంటాయి )   కాబట్టి , కాండోపాకరణము ఎప్పటికప్పుడు కాక, అధ్యయనోపాకరణము తర్వాత , సర్వ కాండఋషి హోమము ( కాండోపాకరణము )  చేయుట రూఢియై ఉన్నది. 

కాబట్టి యజుర్వేద ఉపాకర్మలో భాగముగా , మొదట గణపతి పూజ , పుణ్యాహవాచనము చేసి , తర్వాత ఉత్సర్జనలో వలెనే ,  కాండఋషులను ప్రతిష్టించి, షోడశోపచార పూజ చేసి , తర్పణమునిచ్చి , షట్పాత్ర ప్రయోగము ద్వారా హోమము చేసి , బ్రహ్మముడిని విప్పిన యజ్ఞోపవీతమును హోమములో అర్పిస్తారు. అంతేకాక , నూతన యజ్ఞోపవీతాలకు పూజచేసి , దక్షిణలతో పాటు పెద్దలకు దానము చేసి , ఆశీర్వాదముపొంది , తర్వాత , తాముకూడా " శ్రౌత స్మార్త కర్మానుష్ఠాన యోగ్యతా సిద్ధి " కోసము నూతన యజ్ఞోపవీతాన్ని ధరించి , జయాది హోమములను , ( ప్రతి ముఖ్యమైన హోమములలోనూ ఈ జయాది హోమములు చేయుట తప్పని సరి ) , తర్వాత , హోమకాలములో సంభవించు అనేక లోపదోషములకు ప్రాయశ్చిత్తముగా ’ ప్రాయశ్చిత్త హోమము ’ చేసి , ప్రత్యేక మంత్రాలతో పూర్ణాహుతి చేసిన ఉపాకర్మ సమృద్ధి అవుతుంది. 

అనంతరము , గడచిన సంవత్సరంలో   వేదాధ్యయనములోను , సంధ్యావందనాది అనుష్ఠానములలోను ,మరియు  ఇతర వైదిక కర్మల దోషములు , లోపముల పరిహారము కోసము  నువ్వులు , బియ్యపు పిండి , మరియూ నెయ్యి కలిపిన పురోడాశము ( హవిస్సు ) తో రెండుచేతులతోనూ " విరజా హోమము " ఆయా మంత్రములతో చేయవలెను. 

తర్వాత ’ బ్రహ్మ యజ్ఞము ’ చేసి , అగ్ని మరియు ఋషులకు నమస్కారములు చేయవలెను. బ్రహ్మచారులు " ఆయుర్వర్చో యశోబలాభివృధ్యర్థం " అని చెప్పుకొని ప్రాతరగ్ని కార్యము చేయవలెను. ఆచార్యుడిని , దక్షిణ , తాంబూల , నూతన వస్త్రములతో సత్కరించవలెను. నవకాండఋషులను విసర్జించి , పర్జన్య సూక్తముతో నదీనీటిలో విడువవలెను. 

మరునాడు , గాయత్రీ హోమమును కానీ , సహస్ర గాయత్రిజపము కానీ చేసి , పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించవలెను. 


ఇక , ఉత్సర్జనం ఎప్పుడు చేయాలి , ఉపాకరణం ఎప్పుడు చేయాలి ?

గృహ్య సూత్రాల ప్రకారము , 

యజుర్వేదీయులు  ఉత్సర్జనమును పుష్యమాసపు పౌర్ణమియందు చేయవలెను. ఋగ్వేదులైతే ఈ ఉత్సర్జనమును మాఘ పౌర్ణమి నాడు చేస్తారు. 


యజుర్వేదీయులు ఈ ఉపాకర్మను శ్రావణమాసపు పౌర్ణమి యందు , ఋగ్వేదీయులు శ్రావణ మాసములో శ్రవణ నక్షత్రము వచ్చిన దినమందు , సామవేదులు భాద్రపద మాసపు హస్తా నక్షత్రపు దినమందు ఆచరించుట వాడుకలో ఉంది.

అయితే , ఉత్సర్జనమును పుష్యమాసములో ఒకసారి , తర్వాత ఉపాకర్మను శ్రావణములో ఒకసారి చేయుట అనుకూలము లేనివారు , ఉత్సర్జనమును కూడా ఉపాకర్మ నాడే , ఉపాకర్మకన్నా ముందుగా చేయుట ఆచారములో ఉంది. అయితే ఇలా చేస్తే  ఉత్సర్జనము చేయుటకు కాలాతీతము అగును కాబట్టి , దానికి పరిహారముగా , మొదట పాహిత్రయోదశ హోమమును చతుష్పాత్ర ప్రయోగముతో ఆచరించవలెను. 

వేదాధ్యయనమును ద్విజులు అందరూ , వీరు వారు అనుభేదములేక చేయవలెను.  ఈ కాలము , పౌరోహితులు మాత్రమే వేదాధ్యయనము చేయవలెను / చేస్తారు  అన్న ఒక అపోహ చాలామందిలో ఉంది. అది సర్వథా అసత్యము. ప్రతి ఒక్క ద్విజుడూ వేదాధ్యయనము చేసి , క్రమం తప్పకుండా ఈ ఉత్సర్జన ఉపాకర్మలను ఆచరిస్తే , వారి జీవితాలు అద్భుతంగా అభ్యుదయ మార్గంలో పయనించి ధన్యులవుతారు. 

ప్రథమోపాకర్మ 

నూతనముగా ఉపనయనము అయిన వటువులు , ఉపాకర్మను ప్రథమముగా జరుపుకొనేటప్పుడు మొదట నాందీ పూజ చేయవలెను. బ్రహ్మచారులు యజ్ఞోపవీతానికి ఒక చిన్న కృష్ణ జింక చర్మపు ముక్కను తగిలించుకోవడము ఆనవాయితీ . దీనికి రెండు కారణాలు.

ఒకటి , యజ్ఞాలలోను , బలులలోను  కృష్ణాజినమును కప్పుకొనుట , కృష్ణాజినముపై  కూర్చొనుట విహితమని చెప్పబడినది. అది ధరించిన వటువు , " ఈ దినము నుండీ నా జీవితము ఒక యజ్ఞము లేక త్యాగము వంటిది. నా జీవితాన్ని లోకకల్యాణమునకై అర్పించవలెను " అని భావించవలెను. రెండోది , కృష్ణాజినము వలన , చిత్తము నిర్మలమై , సాత్త్వికమైన ఆలోచనలు కలుగుతాయి. 

ఈ కాలము ఇవన్నీ కేవలము సూత్రప్రాయముగా మిగిలిపోతున్నాయి. కొందరు కేవలము యజ్ఞోపవీతము మార్చుకొనుటే దీని పరమార్థముగా భావిస్తున్నారు. 

ఉపాకర్మ ఎందుకు చేయవలెను , అందులోని ముఖ్యాంశాలేమిటి అన్నది మాత్రమే ఇక్కడ చర్చించడమైనది. ఉపాకర్మ పద్దతి , వివరాలతో , ఇంకోసారి. 

యజ్ఞోపవీత ధారణ విధి ఈ మధ్య విరివిగా పుస్తకాలలోనూ , అంతర్జాలములోనూ దొరకుతున్నందున ప్రత్యేకించి రాయలేదు. యజ్ఞోపవీతాన్ని , సూతకము తర్వాతా , ఉపాకర్మ సమయములోనూ , అలాగే ప్రతి నాలుగు నెలలకొకసారీ  మార్చుకోవలెను. 



Wednesday, June 18, 2014

షష్టి పూర్తి లేక ఉగ్రరథ శాంతి





                షష్టి పూర్తి  (లేక )ఉగ్రరథ శాంతి 


                     మానవుని జీవితములో అనూహ్య సంఘటనలు , అనుకోని పరిణామాలు ఎదురైనపుడు భీతి చేత  స్పందించుట అతి సహజము.  అట్టి పరిణామములు సంభవించకుండా అనాదిగా ,మానవాళి ఎన్నో ఉపాయములను , పద్దతులను పాటిస్తున్నది. అయితే ఆయా పద్దతులకు  శాస్త్ర ప్రమాణము , వేద ప్రమాణము అందినపుడు , వాటి విలువా , ఆచరణా కూడా పెరుగుతాయి. 

                     మానవ జీవితము లో సగము ఆయుర్దాయము గడచు ఘట్టము చాలా ముఖ్యమైనది.  జ్యోతిష్య శాస్త్రము ప్రకారము , మానవుని పూర్ణాయుష్షు నూట ఇరవై సంవత్సరాలు. అంతలోపల అన్ని గ్రహముల దశలూ పూర్తిగా జరిగిపోతాయి. అరవై సంవత్సరాలు నిండేటప్పటికి , జాతకుని జన్మ కుండలిలో ఉన్న స్థానాలకే ఆయా గ్రహాలు వచ్చి చేరుతాయి. జాతకుడు పుట్టిన సంవత్సరమే ( నామ సంవత్సరము ) మరలా పునరావృత్తి అవుతుంది.  అంటే ఉదాహరణకి ప్రభవ నామ సంవత్సరములో పుట్టి ఉంటే , అరవై యేళ్ళు నిండగనే అరవై ఒకటో సంవత్సరం మరలా ’ ప్రభవ ’ యే వస్తుంది. సగము ఆయుర్దాయము గడచిన తర్వాత ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికం గా ఎంతో కొంత ఉన్నతిని సాధించి ఉంటారు. అందుకు కృతజ్ఞత గా భగవంతునికి ఆరాధనాపూర్వకముగా అనేకులు ఈ షష్టి పూర్తిని జరుపుకుంటారు. అదేకాక , ఆసమయములో గ్రహ సంధులవల్ల కొన్ని దోషాలు కలుగవచ్చు. దానితోపాటుగా, ఏ జన్మలో చేసిన  పాపపు ఫలము ఆజన్మములోనే తీరునన్న నమ్మకము గలవారు,   గడచిన తమ అరవై సంవత్సరాల లో ( అనగా ఆయుర్దాయపు మొదటి ఆవృత్తము )  చేసిన పాప ఫలము  రెండవ ఆవృత్తములో తక్కువ కష్టముతోనో , బాధ తెలియకుండానో తీరవలెనన్న, ఆ పాపముల తీవ్రతను శమింపజేయుటకు శంకరుడైన రుద్రుని ఆరాధించుట అవశ్యము.   రుద్రుడు సాధారణముగా సర్వులనూ , సర్వమునూ లయము చేయు కార్యములో  ఉంటాడు. ఈ రుద్రులు అనేకులు గలరు. ముఖ్యముగా  ఏకాదశ రుద్రులు గణ్యులైననూ నూట ఇరవై మంది రుద్రులు ఉంటారు అని కూడా శాస్త్ర వచనము. వందలకొలదీ రుద్రులున్నట్టు కూడా ప్రమాణమున్నది. వీరిలో , అనేకులు సౌమ్యులు , శాంతులు. కొందరు ఉగ్రులు , మరికొందరు రౌద్రులు.  ఉగ్రరథుడు అను రుద్రుడు మానవులను అరవైయవ యేట హింసించును. సంసారము నాశనమగుట , ఆయుష్షు తీరిపోవుట , అప మృత్యువు పాలగుట , శరీరము అనారోగ్యము పాలై అవయవములు శిథిలమగుట మొదలగు పరిణామములు కలిగే అవకాశము ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీనిని తప్పించుటకు , ఉగ్రరథుడు అను ఆ రుద్రుని శాంతింపజేయుటయే తరుణోపాయము.  ఈ ఉగ్రరథ శాంతినే షష్ట్యబ్ధ పూర్తి లేదా షష్టి పూర్తి అని వ్యవహరిస్తారు. 
( షష్టి అంటే అరవై )

జననకాలము నుండీ అరవైయవ సంవత్సరము వచ్చినపుడు , జన్మ నామ సంవత్సరము , జన్మ మాసము , జన్మ నక్షత్రము , జన్మ దినమందు సర్వారిష్ట పరిహారము కోసము అచరించవలసిన శాంతి క్రమమే ఉగ్రరథ శాంతి.

                   ఈ షష్టి పూర్తిని అనేకులు , షోడశ సంస్కారాలలో ఒకటి అనుకుంటారు. కానీ కాదు, ఇది కేవలము ఒక శాంతి ప్రక్రియ మాత్రమే. అథర్వణ వేదములోను , యజుర్వేద బ్రాహ్మణములోను , ఋగ్వేదములోను ఈ శాంతికి సంబంధించిన కొన్ని  మంత్రాలున్నాయి. ఇది కేవలము శాంతి ప్రక్రియ మాత్రమే గనుక , ఇంటిని గోమయముతో అలుక్కోవడమో , గోమూత్రము ప్రోక్షించుకోవడమో , పంచగవ్య ప్రాసనమో  చేయవచ్చు. పందిళ్ళ వంటి ఆర్భాటాలు అవసరములేదు. పందిళ్ళు వేయదలుచుకున్నవారు , వాటిని తమకు సౌకర్యముగా వేసుకోవచ్చునే తప్ప , దానికి యే నిబంధనలూ లేవు. 

                    వేదశృతి ప్రకారము , మానవుడి ఆయుర్దాయము ఒక్కొక్క యుగములో ఒక్కో విధము. మొదటిదైన కృతయుగపు మొదటిపాదములో మానవులు వేలకొద్దీ యేళ్ళు జీవించేవారు. రెండో పాదములో ఆయుర్దాయము తక్కువ. ఒక్కో పాదానికీ ఆయుర్దాయం తగ్గుతూ , మనిషికి ఇప్పుడు వందసంవత్సరాలు ఆయుష్షు.  అదికూడా పూర్తిగా జీవించలేకపోవుటకు కారణము అనేక జన్మలలో చేసుకున్న పాప ఫలితము అని చెప్పవచ్చును. కృతయుగము నాటి వైశంపాయన మహర్షి , తర్వాత ఎప్పుడో రాబోయే కలియుగపు మానవుల ఆయుర్దాయము తగ్గుటకు చింతిస్తూ , వ్యథ చెందినవాడై , వేద వ్యాస మహర్షిని ఇలాగ ప్రశ్నిస్తాడు.  

                     " ఓ మహర్షీ , దేహమున్న యెడల అన్ని ధర్మములనూ పాటించవచ్చును. మానవుడిగా పుట్టుటయే శరీరము కోసము కదా ! ఆ శరీరము పడిపోయిన , లేదా వ్యాధి గ్రస్తమైనచో కర్మలనెట్లు ఆచరించగలడు ? కాబట్టి కలియుగములో మానవుడు పుత్రపౌత్రులతో సర్వ సంపదలతో కూడి , దుఃఖము లేనివాడై ఉండవలెనన్న , దానికి యే హేతువు కారణమగును ? దానికి యే ధర్మమునాచరించవలెను ? "
వ్యాస మహర్షి , లోక హితమునకై వైశంపాయనులు అడిగిన ప్రశ్నకు హర్షమును పొందినవాడై , ముఖములో ఆ ఆనందము కనపడుచుండగా ఇలా బదులిచ్చినాడు, 

                   " వత్సా , లోకమునకు హితము కలిగించునట్టి , ఆయుర్వృద్ధిని కలిగించునట్టి , దేహపటుత్వమును పెంచునట్టి ఒకానొక రహస్యమైన ప్రక్రియ కలదు. అదే షష్ట్యబ్ధి వ్రతము. కలియుగములో , మానవుడు అరువది యవ సంవత్సరము రాగానే , శ్రద్ధాభక్తులతో ఈ షష్టిపూర్తిని ఆచరించవలెను. వేదవిదులగు బ్రాహ్మణులను పిలిపించి , నదీ తీరమునగానీ , స్వగృహమునగానీ , లేదా తనకనుకూలమైన ఏదైనా ఒక చక్కటి ప్రదేశమున గానీ సంకల్ప పూర్వకముగా స్నానము చేసి , ఈ ప్రక్రియను వేదోక్త విధముగా ఆచరించి పూర్తి చేయవలెను. రాబోవు కాలములలో అనేకులు దీనిని సూత్రములలో వివరింపబోవుచున్నారు. ఆ రీతిన జేసినచో మనుష్యుడు దీర్ఘాయువు కలవాడై , రోగరహితుడై , వంశాభివృద్ధి కలిగి , ఉత్తమ కర్మలను చేయగలడు. " 

                 " దీనిని పూర్వము , నహుష చక్రవర్తి కుమారుడైన యయాతి చేసినాడు. ఆతడు తన మామగారైన శుక్రుడితో శపింపబడి ముసలివాడైనపుడు , శాప విముక్తికై యయాతి ప్రార్థింపగా , శుక్రుడు , " ఓ రాజా , షష్టి పూర్తి యను ఒక రహస్య వ్రతము కలదు. ఆ వ్రతమును చేసిన , తిరిగి యవ్వనమును పొందగలవు. నీ కుమారులలో ఒకరు తన యవ్వనమును నీకిచ్చిననూ నీకు యవ్వనము కలుగును ."  అని పలికెను.

                మొదట యయాతి తన కుమారులలో ఒకని యవ్వనమును తీసుకొని తన వార్ధక్యాన్ని అతడికి ఇచ్చినాడు. ఆ తరువాత అది అధర్మమని గుర్తెరిగి , పుత్రుడి యవ్వనమును అతడికే ఇచ్చివేసి , షష్టి పూర్తి వ్రతము చేసి మరలా యవ్వనవంతుడై , భోగభాగ్యాలు అనుభవించి ,  యజ్ఞయాగాదులు చేసి ,  చివరికి విష్ణు సాయుజ్యాన్ని పొందినాడు.

               ఆపస్తంబ , బోధాయన మరియూ ఇతర గృహ్య సూత్రాలలో షష్టిపూర్తికి సంబంధించిన తంతు క్లుప్తముగా వివరింపబడి ఉంది. అనాదిగా ఈ షష్టి పూర్తిని మనుషులు ఆచరిస్తున్ననూ , దీనికి ఇదమిత్థమని ఒక నిర్దిష్టమైన పద్దతి లేదు. కానీ , షష్టి పూర్తి లో భాగముగా ముఖ్యముగా చేయవలసిన విధానము పురాణములలో లభ్యమగుచున్నది. ఇది ప్రధానముగా మనిషి ఆయురారోగ్యాలకు సంబంధించినది కాబట్టి , రుద్రహోమము , మృత్యుంజయ హోమము , ఆయుష్య హోమము , నవగ్రహ హోమము వంటివి చేయుట అనాదిగా వాడుకలో ఉంది. 

             కాలము మారుతున్న కొద్దీ ఇందులో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. కొంతమంది ఆడంబరముగానూ , కొంతమంది వైదీకముగను , మరికొందరు లౌకికముగనూ ఎవరికి తోచినట్లు వారు చేయుచున్నారు. అంతే కాక, దీని చేయించే బ్రాహ్మణుడిపై ఇది ఆధారపడుతున్నది. 

            ఇక్కడ , షష్టి పూర్తి లోని అంగాలు , అతి ముఖ్యముగా చేయవలసిన తంతు , ఆ తర్వాత వనరులు ఎక్కువగా ఉన్నవారు చేసుకోవాలంటే చేయతగిన అదనపు తంతులు ఇవ్వడ మైనది. అయితే ఈ కాలము వారు చేస్తున్నట్టి ’ దండలు మార్చుకోవడము , మంగళ సూత్రము మరలా కట్టించడము , వివాహము వలెనే చేయు ఇతర తంతులు ఇందులో ఎంతమాత్రమూ భాగం కాదు. అవన్నీ అర్థము లేనివి.  అవి చేయాలనుకొనే వారు వాటికి షష్టి పూర్తి అనే పేరు పెట్టకుండా , ఇంకో పేరుతో చేసుకుంటే క్షేమము. 

షష్టి పూర్తిలో ముఖ్యమైన విశేషములు --

         మగవాడికి అరవైయవ సంవత్సరము రాగానే , దంపతులిద్దరూ కలిసి కూర్చొని ఈ షష్టి పూర్తిని ఆచరించవలెను. ఆడవారికి ప్రత్యేకముగా ఈ ప్రక్రియ లేదు. 

        ఇందులో భాగముగా  ముందురోజు పుణ్యాహవాచనము , లేదా ఉదకశాంతి మంత్రపూర్వకముగా భూభాండ , జల , గృహ శుద్ధిని చేసుకోవలెను.  ఏకాదశ రుద్రులకు , ఇతర దేవతలకూ కలశములను  స్థాపించి ఆవాహన చేసి ,సాయంకాలము మహాన్యాస పూర్వకముగా రుద్ర క్రమార్చన , అభిషేకము చేయవలెను. నవగ్రహ మంత్ర జపము , మృత్యుంజయ మంత్ర జపము వంటి జపములు ముందే చేసి / చేయించి ఉండవలెను.  మరునాడు నవగ్రహ హోమము , ఆయుష్య హోమము , మహా మృత్యుంజయ హోమము చేయవలెను. 

కలశములను స్థాపించుటలో భిన్నమైన ఆచారములున్నవి. 

              రుద్రులకు పదకొండు కలశములు అని కొందరూ , అయిదే చాలని కొందరూ అంటారు. మరికొందరు , నవ గ్రహములకు తొమ్మిది , ఉదకశాంతి ప్రయోగమునకు ఒకటి , మృత్యుంజయునికి ఒకటి , మొత్తము పదహారు కలశములు  కావలెనంటారు. ( మరికొందరు ఇతర దేవతలను కలుపుకొని అరవై కలశములనీ , మరికొందరు , కాదు , నూట ఇరవై కలశములనీ అంటారు. ) కేవలము అయిదు కలశములతోనే ఈ శాంతి ప్రక్రియ చేసే పద్దతి ఆచరణలో ఉంది. ఇది శాస్త్రామోదమైనది కూడా !  ఇత్తడివి కానీ , దారుపాత్రలు ( చెక్క తో చేసిన కలశములు.)  కానీ వాడవలెను. ఇవి ముఖ్యముగా స్థాపించవలసిన కలశాల వివరాలు. 

            మరి కొందరు ,  ఏకాదశ రుద్రులకు పదకొండు , నవగ్రహాలకు తొమ్మిది , ద్వాదశాదిత్యులకు పన్నెండు , సంవత్సరానికి ఒకటి మొత్తం ముప్పై మూడు కలశాలు స్థాపిస్తారు. ఇంకా ఆసక్తి ఉన్నవారు అదనంగా మృత్యుంజయుడికి , ఆయుర్దేవతకూ , ఇంకా అనేక ఇతరదేవతలకు  మొత్తం అరవై కలశాలు స్థాపిస్తారు. ఎక్కువ కలశాలు స్థాపిస్తే , వాటిని చివరలో బ్రాహ్మణులకే దానము ఇవ్వవలెను కాబట్టి , ఎక్కువ మంది బ్రాహ్మణులను పిలవడము , వారికి వేరుగా దక్షిణలు కూడా ఇవ్వవలెను కాబట్టి అదనముగా ధనము ఖర్చు అగును. ఎవరి తాహతు , స్తోమత లను బట్టి వారు కలశములను స్థాపించవచ్చు. కేవలము అయిదే కలశములను స్థాపించి , వాటిలోనే అందరు దేవతలనూ ఆవాహన చేయు పద్దతి ఆమోదయోగ్యమైనది కనుక , కలశముల సంఖ్య కేవలము షష్టి పూర్తి జరిపించుకొను యజమాని ఆర్థిక స్తోమత పైన ఆధారపడును. తగిన పురోహితుడు దొరికితే ఇవన్నీ అతడే చెప్పగలడు. ఏదేమైనా , తమ శక్త్యానుసారము చేయుటకు పురోహితుడితో అన్నీ మాట్లాడుకుంటే మంచిది.  శక్తి గలవారు ఏ మాత్రమూ లోభము చేయక ఖర్చు పెట్టవలెను. " విత్త శాఠ్యం న కారయేత్ "  అని కదా ప్రమాణము ! శక్తి గలవారు లోభము చూపిన , వారికి కలుగు ఫలితములో కూడా లోభమే ఉంటుంది. 

          ఈ షష్టి పూర్తి యనేది , పిల్లలు తల్లిదండ్రులకు చేయు కార్యక్రమము ( పెళ్ళి వంటిది ) అని అనేకమంది కి ఒక అపోహ ఉన్నది. ఇది ఎంత మాత్రమూ నిజము కాదు.  కానీ ఆచరణలో , అప్పటికి పిల్లలు సంపాదనపరులై , తమ తల్లిదండ్రులకోసము ఇటువంటిది చేయాలనుకుంటే అందులో తప్పు లేదు. దానికి పిల్ల సహాయ సహకారాలు ఉంటే మంచిదే. 

విధానము

       షష్టి పూర్తి విధానము క్లుప్తముగా ఇవ్వడమైనది. దీనిని పురోహితుడే చేయించ వలెను గనక మంత్రముల వంటివి ఇవ్వడము లేదు. 

          దీనిని రెండురోజులు ఆచరించ వచ్చును. మొదటిరోజు ఉదయమే పుణ్యాహము చేసి , కలశములు స్థాపించి ఉదకశాంతి ప్రయోగము చేయించవలెను.  కొందరు " సర్వతో భద్ర మండలమును" నేలపైన వ్రాసి ,  రంగవల్లులతో అలంకరించి దానిపై కలశములను స్థాపించి సర్వదేవతలనూ ఆవాహన చేస్తారు.  ఆనాటి సాయంకాలము ఈశ్వరుడికి మహాన్యాస పూర్వకముగా ఏకవారమో , ఏకాదశ వారమో లేక అతిరుద్రమో చేయించ వలెను. వీలైన వారు క్రమార్చన చేయించవచ్చు. లేదా షోడశోపచార పూజ చేయవచ్చును. 

             మరునాడు మరలా పుణ్యాహము చేసి , కలశముల పైన ఆయాదేవతా ప్రతిమలను ఉంచి , ( ప్రతిమలు లేకుండా కూడా కలశ పూజ చేయవచ్చును )  నవగ్రహ పూజ , సప్త చిరంజీవుల పూజ , సంవత్సర పూజ , నక్షత్ర పూజ ,  నవగ్రహ హోమము , ఆయుష్య హోమము , మృతుంజయ హోమము , చేయవలెను. ఇవి కనీసము చేయవలసిన పూజలు. ఇంకా అదనముగా చేయాలంటే , 
 కొందరు అరవై సంవత్సరాలకూ ఆవాహన , పూజ , ఉత్తర దక్షిణాయనాలు , ఋతువులు , మాసములు , పక్షములు , వారములు , నక్షత్రములు , యోగములు , పన్నెండు రాశులు , భూమి , ఆకాశము , అశ్వినీ దేవతలు , ధన్వంతరి  --ఇలాగ తమకు తోచిన అందరు దేవుళ్ళకూ పూజలు చేస్తారు. వీటి ఆవాహనలో వేద మంత్రాలు లేవు. కేవలము పౌరాణికముగా , అంటే శ్లోకములతో ఆవాహన , పూజ జరిపిస్తారు. ఇవన్నీ శక్తి ఉన్న వారి విషయము.  ఇంకా వీలున్నవారు సప్తశతీ పారాయణము , చండీ హోమము  , శ్రీరామ పట్టాభిషేకము , భాగవత సప్తాహము , హరికథలు వంటి అనేకమైనవి కూడా చేయిస్తారు. అవి చేయుటలో పుణ్యమే గానీ , తప్పేమీ లేదు. అయితే షష్టి పూర్తికి అవన్నీ అనవసరము.   

            పూజలు , హోమములు అయిపోయినతరువాత , ఆ కలశములకు , ప్రతిమలకు పునః పూజ చేసి , ఆయా దేవతలను ఉద్వాసన చేయవలెను. హోమకుండముల ( అగ్నికి ) ఉత్తరాన కానీ , ఈశాన్యాన కానీ , స్నానార్థము కల్పించబడిన మంటపములో పుత్ర పౌత్రాదులతోను , భార్యతోను యజమానుని, అలంకరించబడిన  పీటలపైన కూర్చోబెట్టవలెను.  

            తరువాత  ,  స్థాపింపబడిన ఆ కలశములలోని నీటితోనే కర్తకు, అతడి భార్యకు ,  అవభృథ స్నానము పురోహితులు , బ్రాహ్మణులు చేయించెదరు. ఈ స్నానములో భాగముగా ,  వంద చిల్లులు కల ఒక పెద్ద ఘటమును ( కుంభమును ) కానీ , చిల్లులు కల జల్లెడ వంటి ఒక పళ్ళెములో కానీ నవరత్నములు వేసి కానీ , లేక , నవరత్నములు తాపడము చేసియున్న పళ్ళెములో గానీ కలశముల నీరు పోస్తూ , యజమానుడి తలపైన పడునట్లు స్నానము చేయించవలెను. నవరత్నములు లేకున్ననూ , కలశముల నీటితో అవభృథ స్నానము చేయించుట ముఖ్యము.  ఇది అభిషేకము కాదు. అభిషేక మంత్రములు పఠించరు. కేవలము పౌరాణిక మంత్రాలతో స్నానము చేయిస్తారు. అయితే , మరి కొందరి ప్రకారము , మార్జన మంత్రములు , పవమాన మంత్రములు , నవగ్రహ / లేక దిక్పాలక మంత్రములు , వరుణ మంత్రములు మొదలగు అనేక వేద మంత్రములతో స్నానము చేయిస్తారు. ముఖ్య గమనిక : ఈ స్నానములో రుద్రాధ్యాయము పఠించకూడదు.  దీనినే అవభృథ స్నానము అంటారు. తర్వాత కంచు పాత్రలో ఉంచిన దీపములతో నీరాజనం ఇస్తారు. తరువాత మంటపానికి నాలుగు దిక్కులా చిత్రాన్నముతో ( పసుపు కలిపిన అన్నం ) బలి ఇస్తారు. తాము ధరించిన వస్త్రములను ఆచార్యునికి కానీ , మరి ఎవరికైనా కానీ దానము చేయవలెను.  తాము కొత్త వస్త్రములు ధరించి , గంధము , కుంకుమ ధరించి , పూలమాల ధరించి , రక్ష స్వీకరించి , ఒక కంచుతో చేసిన నేతి పాత్రలో అలక్ష్మీ పరిహారము కోసము తన ముఖపు ప్రతిబింబమును చూసుకోవలెను. దక్షిణ తామ్బూలాలతో ఆ నేతి పాత్రను బ్రాహ్మణుడికి దానము ఇవ్వవలెను. 

             వీటితో కలిపి , బ్రాహ్మణులకు , మొత్తం పదిరకాల దానాలు ఇవ్వవలెను ( దశ దానములు) . ఈ దానాల ఉద్దేశము , తనకు శేషజీవితములో కష్టనష్టాలు రాకూడదని , అంతేకాక ,  ఈ ప్రపంచములో మనిషికి ఏదీ తనది కాదు , ఏదీ మిగలదు, ఏదీ వెంటరాదు కాబట్టి తనవంతుగా , తనకు బ్రతుకునిచ్చిన ఈ ప్రపంచానికి ప్రతిగా ఇచ్చుటయే !  అది వానప్రస్థాశ్రమమునకు చేరు వయసు కాబట్టి , ధనలోభము వదలి , తమ సంతతి అభ్యున్నతి  కొరకై వీలైనంతగా ఎన్ని దానాలు ఎక్కువగా ఇస్తే , అంత సంపద తన సంతతికీ , తన వారసులకూ వచ్చి చేరుతుంది. దాచిపెట్టుకుంటే దొంగలపాలే కాక, తనకు పుణ్యము రాదు కూడా ! తమ శక్తి సామర్థ్యములను బట్టి  కొందరు అతి తక్కువ ఖర్చుతోను , కొందరు ఆడంబరముగానూ జరుపుకుంటారు. ఈ శాంతి వలన అందరికీ సమాన ఫలమే వచ్చును. కానీ లోభము చేస్తే , వచ్చు ఫలము కూడా లోభముగా వస్తుంది. షష్టిపూర్తి వైశిష్ట్యాన్ని నమ్మిన వారు దీన్ని కూడా నమ్మి తీరవలెను. 

 ముఖ్య ఆచార్యుడికి , గోదానమును ప్రత్యేకముగా , ఈ విధముగా ఇవ్వ వలెను. 

               ఆచార్యుడిని ఒక పీఠముపైన కూర్చోబెట్టి , గంధపుష్ప తామ్బూల వస్త్రములిచ్చి ,  వేదబ్రాహ్మణులు మంత్రములు చెప్పుచుండగా , గోవును , దూడను , పాలుపితుకుటకు ఒక కంచుపాత్రనూ దానమివ్వవలెను. ( వీటికి బదులుగా కొంత ధనమునిచ్చుట ఇప్పుడు పరిపాటియైఉన్నది. ) 

తర్వాత కలశములను దానమీయవలెను.

మొదటగా , ప్రధాన ప్రతిమ , అనగా మృత్యుదేవతా ప్రతిమను , తర్వాత మృత్యుంజయ ప్రతిమను , కలశవస్త్రములతో పాటు ఇవ్వవలెను. 

           ఆ తరువాత , ఇతర బ్రాహ్మణులను ఒక్కొక్కరిని అదే విధముగా కూర్చోబెట్టి , ఇతర కలశ వస్త్ర ప్రతిమలను దానము చేయవలెను. బ్రాహ్మణులెందరు , కలశములెన్ని , ఎవరికి యే దానము వంటి విషయములను ముందే నిర్ణయించుకోవలెను. ఒకవేళ అనుకున్న వారికన్నా ఎక్కువ మంది బ్రాహ్మణులు వస్తే మిగిలిన వారికి దక్షిణ తాంబూలముల నివ్వవలెను. అనుకున్న వారికన్నా తక్కువ మంది వస్తే , ధనము మిగిలించుకోక , దానినే అందరికీ ఇవ్వవలెను. లోభము పనికి రాదు. ఈ దానములు ఇచ్చునపుడు , తీసుకొనే బ్రాహ్మణుడు కాక మిగిలిన వారు ఆయా మంత్రాలను పలుకుతుంటారు. 

ఇది అయిన తర్వాత , పదిరకాల దానములను ( దశ దానములు ) ఇవ్వవలెను.

దశదానాలు ఏవనగా , 

నల్ల నువ్వులు / లేక నువ్వుల నూనె , 
గోఘృతము ( ఆవు నెయ్యి )
భూదానము ( దానికి బదులుగా కొంత ధనము )
గోదానము ( దానికి బదులుగా కొంత ధనము )--( ఇది ముందే ఇచ్చాము ) 
హిరణ్య ( బంగారం ) దానము ( దానికి బదులుగా కొంత ధనము )
రజత ( వెండి ) దానము ( దానికి బదులుగా కొంత ధనము )
గుడ దానము ( బెల్లము )
వస్త్ర దానము 
లవణ దానము
కంబళి దానము 
ప్రత్తి దానము

పై పదీ కాక , అయః ఖండదానము ( ఇనప గుండు ) దానము ఇస్తారు. 

నువ్వుల నూనెను ఒక కుండలోను , ఉప్పు , ప్రత్తి , బెల్లము వంటివి దోసిలి పట్టే అంత ఇస్తారు. ఇనప గుండు , కనీసము ఇరవైనాలుగు పలముల బరువు ఉండవలెను. ఈ దానాలన్నీ కూడా మంత్ర పూర్వకముగా ఇవ్వవలెను.  

దానముల తరువాత మరలా స్నానము చేసి , వేరే వస్త్రములు ధరించవలెను. 

                      ఆ తరువాత వీలైనంతమంది ఎక్కువ బ్రాహ్మణులకు , బంధువులకు భోజనాలు , మిగిలిన బ్రాహ్మణులకు దక్షిణలు ,తర్వాత కానుకలు ఇచ్చుట , వగైరాలు చేయవచ్చును. తరువాత  , బ్రాహ్మణాశీర్వాదము పొందవలెను. ఆ తరువాత దగ్గరి బంధువులతో కలసి తాను భోజనము చేయవలెను. 

                                                                     

                                                    || శుభం భూయాత్ ||

Friday, March 28, 2014

తులాపురుష మహా దానము పద్దతి ( తులాభారము )--రెండవ / చివరి భాగము

తులాపురుష మహా దానము పద్దతి

          పండుగలు , వ్రతములు , వివాహములు మొదలగు దినములలో గానీ , వ్యతీపాతము , గ్రహణము , మొదలగు పుణ్యకాలమున గానీ , చివరికి తమకు అవకాశము , ఆసక్తి , అనుకూలములున్నపుడు గానీ ఈ కింది విధముగా తులాపురుష మహా దానము నాచరించవచ్చు. 

          ఇల్లు ఆవుపేడతో అలికి , ముగ్గులు , తోరణములు పూలతో అలంకరించి , ధర్మ కాటా ( కూర్చొను త్రాసు ) కు పసుపు రాసి , కుంకుమ బొట్లు పెట్టి , మామిడి మండలు కట్టి ,పూలతో అలంకరించి వస్తువులన్నీ సిద్ధము చేసుకొనవలెను. 

          పెళ్ళయినవారైతే , భార్యా భర్తలిద్దరూ నువ్వులు , ఉసరిక వరుగులూ మెత్తగా నూరిన దానిని తలకు పట్టించుకొని అభ్యంగ స్నానము చేయవలెను. పిల్లల కోసమైతే , ఆ పిల్లలతో పాటూ వారి తల్లిదండ్రులు ఇదే విధముగా చేయవలెను.  భార్య లేకున్నచో , బంగారము , లేదా వెండి , లేదా దర్భలు లేదా రాగి పిండితో భార్యా ప్రతిమను చేసి పక్కన పెట్టుకొనవలెను. పీటలపైన కూర్చొని , గణేశుని పూజించి , కుల దేవతను , ఇష్ట దేవతలను పూజించి , త్రాసులో కూర్చొను వారు మెడలో పూలమాల వేసుకొని , మొదట ఆచమనము చేసి , ఉంగరపు వేలికి పవిత్రమును ధరించి ప్రాణాయామము చేసి , కింది విధముగా సంకల్పము చెప్పవలెను. 

         మమోపాత్త , సమస్త దురితక్షయ ద్వారా , ఏవంగుణ విశేషణ విశిష్టాయాం , అస్యాం పుణ్య తిథౌ , మమ సమస్త పాప పరిహారార్థం , గ్రహారిష్ట , గృహారిష్ట , సర్వారిష్ట దోష పరిహారార్థం , ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం , శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం తులాపురుష మహా దానమహం కరిష్యే ||

నీళ్ళు , నువ్వులు నేలపై వదలవలెను. 

          తరువాత , తులా పురుష దానము చేయు వ్యక్తి ఇష్ట దైవమును  మనసులో ధ్యానించి , నమస్కరించి , తులను పుష్పములతో పూజించి , మంగళ వాద్యములు మ్రోగుతుండగా తులకు , సభకు నమస్కరించి , త్రాసు యొక్క ఎడమవైపు బల్ల యందు తాను ఎక్కి కూర్చొనవలెను. త్రాసు యొక్క కుడి వైపు బల్ల యందు , తాను దానము చేయదలచిన వస్తువులను వేయించవలెను. తరువాత త్రాసు నందు కూర్చున్న వ్యక్తి , దండము మధ్య నుండు ముల్లు సరిగా మధ్యకు నిలువుగా నిలబడినదీ లేనిదీ చూచి ( తన బరువూ , వస్తువుల బరువూ సమముగా ఉన్నదీ లేనిదీ సరి చూచి ) మనసులో లక్ష్మీ దేవినీ శ్రీ హరినీ ధ్యానించుచూ , ఆవు పాలు పిండునంత కాలము త్రాసులో కూర్చొని ఉండవలెను. తరువాత కిందకు దిగి , సభాసదులకు నమస్కరించి ఆ తూచబడిన వస్తువులను వారి ఇష్టానుసారముగా , ’ కృష్ణార్పణము ’ / ’ బ్రహ్మార్పణము ’ / ’ శివార్పణము ’ --ఇలా పలుకుచూ వెంటనే అందరికీ పంచి పెట్టవలెను. 

దీనిని ఎవరంతట వారే కూడా చేసుకొనవచ్చును. 

          స్త్రీలు కూర్చున్నట్టయితే , ఏ నెలలోనైనా శుక్లపక్ష తదియ నాడు ఒక అరటి ఆకులో అయిదు హారతి కర్పూరపు నుండలనుంచి , వాటిలో లక్ష్మీ సరస్వతీ పార్వతులను కుంకుమతో పూజించి త్రాసులో కూర్చుండి , తనతో సమానమైన కుంకుమను తూచి తులా పురుష మహాదానముగా వెంటనే ముత్తయిదువలకు పంచిపెట్టిన , సౌభాగ్యము వృద్ధియై , దీర్ఘసుమంగళియై , పుత్రీ పుత్ర సంతానము , ఆయుర్దాయము , అభివృద్ధి , ఆరోగ్యము , ఐశ్వర్యము కలిగి ఆనందముగా నుండెదరు. వివాహ సమయములో ఇది చేసిన సర్వ దోషములూ తొలగి సుఖముల పొందెదరు. 

          ఇదే విధముగా కాటాలో ఉప్పు , బెల్లము మొదలగు ఏదైనా వస్తువును వేసి స్త్రీలు తమ బరువుతో సమానముగ తూచుకొని పంచిపెట్టిన అనేక శుభములు కలుగును. గుర్తుంచుకొండి , తూచిన వస్తువును తూచినట్లే పంచిపెట్ట వలెను. 

గమనిక : ఈ తులా పురుషమహాదానము చేయుట , ఆడంబరమునకు , చూపించుకొనుటకు కాదు.  చేయువారు , ఫోటోలు , వీడియోలు వగైరాలు తీయించుకోవద్దు. అట్లు తీయించుకొనిన , అవి మనకు అహంకారమును , ఆడంబరమును పెంచి , దాన మహిమ తగ్గును.

|| లోకాస్సమస్తాస్సుఖినో భవంతు ||

Friday, March 21, 2014

తులాపురుష మహాదానము (తులాభారము)-ఒకటవ భాగము


తులాపురుష మహాదానము (తులాభారము)-ఒకటవ భాగము









          ఈ లోకములో చాలా మంది కష్టించి అతి పేద జీవితము నుండీ గొప్ప స్థితికి వచ్చిన వారిని చూస్తాము. వీరి విషయములో ఆశ్చర్యపోవలసినదీ , వింతయైనదీ ఏమీ ఉండదు. ఇక , మరి  కొందరికి ఏ ప్రయత్నము లేకుండానే / లేదా స్వల్ప ప్రయత్నము చేతనే అష్టైశ్వర్యాలు , సకల సంపదలు , సర్వ భోగములూ లభించుట సామాన్యముగా చూచుచున్నాము. ( వాటి వలన వారికి సుఖమూ శాంతీ ఉన్నవా యనునది వేరే సంగతి ) . అయితే అధిక సంఖ్యాకులు అవి లేక చాలా కష్ట నష్టములను అనుభవించుచున్నారు. మొదటి రకమువారికి అట్టి శుభములు ఎందుకు కలుగును ? మిగిలిన వారికి ఎందుకు కలగవు ?  ఈ ప్రశ్న చాలా చిన్నదే అయినా , సమాధానము అంత తేలిక కాదు. ఏ ఒక్క కారణమునో చెప్పి దీనిని వివరించలేము. అయితే అనేక కారణాలలో కొన్ని ఏవంటే , 

వారు పూర్వ జన్మలో గొప్ప తపస్సులు , ఆరాధనలు , పూజలు చేసియుండుట

పూర్వజన్మలో పెద్దలనూ , పితరులనూ సేవించుట 

పూర్వజన్మలో అహింస , ధర్మము వంటివి పాటించుట.

వీరిని భోగములు వెదకికొని వచ్చును. అట్టి సత్కర్మలు చేయని వారికి ఇటువంటి శుభములు కలగవు. పైగా కష్టములు కలుగుచుండును. 

          పూర్వ జన్మలో ఏమిచేసినామో , ఏమి చేయలేదో మనకు తెలియదు. ఈ కాలము జ్యోతిష్యము సరిగ్గా చెప్పువారు దొరకుట దుర్లభము. 
అయిననూ , కష్టములలో నున్నవారు తాము అట్లే కష్టాలు పడుతూ కూర్చోక , వాటిని నివారించుకొనుటకు ప్రయత్నించవలెను. అందుకు ఎన్నో పద్దతులు ఉన్నాయి. వాటిలో తులా పురుష దానము ఒకటి. భవిష్యత్ పురాణములోనూ , అథర్వణ వేదములోనూ తులాపురుషదాన మహిమను గూర్చి యనేక వివరములున్నవి. ఈ తులా పురుషదానము చేయుట వలన , ఇంచుమించు మానవునికి కలుగు అన్ని కష్టములనూ నివారించ వచ్చును. అన్ని శుభములనూ పొందవచ్చును. 

          తులాపురుష దానమనగా , ఒక త్రాసులో దానము చేయవలసిన వ్యక్తి ఒకవైపు కూర్చొని , ఇంకొకవైపు తనకు కావలసిన శుభమునకు యే పదార్థము నిర్ణయింపబడినదో , ఆ పదార్థమును బుట్టలలో గానీ , డబ్బాలలో గానీ , గోతాములలో గానీ ఉంచి , రెండు బరువులనూ సమముగా ఉండునట్లు తూచి , తరువాత ఆ పదార్థమును వెంటనే ఇతరులకు పంచిపెట్టుట. దీని వలన సమస్త పాపములు , సమస్త దోషములూ పరిహారమై శుభములు కలుగును. సర్వ కార్య జయము కలుగును. దాత యొక్క యేలిన నాటి శని ప్రభావము గానీ , అష్టమ సని ప్రభావము గాని , నవగ్రహాలు దుష్ట స్థానములలో ఉండుట వలన కలుగు దోషములూ , భూత ప్రేత పిశాచాదులు ఆవహించుట వలన కలుగు దోషములూ , కుష్ఠు , క్షయాది ఘోర రోగములు , సర్వారిష్టములూ తొలగిపోయి , ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి , కుటుంబమునకు క్షేమము , అపమృత్యువులు దరికి రాకుండుట మొదలగు ఫలములు కలుగును. ఇది హోమములతో సమానమైనది.  తులా పురుష దానము చేసిన వారికి పునర్జన్మ లేదని శాస్త్ర నిశ్చయము.  


తులాపురుష దానములో ఏయే పదార్థములను / వస్తువులను దానము చేయవచ్చును ? 

           తులాపురుష దానము చేయ దలచినవారు , తన బరువుతో సమానమైన బంగారపు పాత్రలు, వస్తువులు గానీ , వెండి పాత్రలను గానీ , రాగి , ఇత్తడి , కంచు , సీసము , తగరము , ఇనుము , ఉక్కు పాత్రలు అన్నీ కలగలపి  గానీ , లేదా ఎదో ఒకటే రకమైన పాత్రలను గానీ తులాభారము వేయవచ్చును. వాటిలోకి యథాశక్తి , యే కొంచమైననూ , బంగారము లేదా వెండి రేకులను కలిపి తూచవచ్చును. 

          పైవి కాక, బియ్యమును కానీ , వస్త్రములు కానీ , పప్పులు , బెల్లము , పటిక బెల్లము , కూరగాయలు , పాలు, పెరుగు , నెయ్యి , నూనె , కట్టెలు , రూపాయ నాణెములు , వండిన అన్నము , పప్పు , కూరలు గానీ, నవ ధాన్యములను వేరువేరుగా బుట్టలలో పోసి గానీ , ఏవైనా సరే , తనకు తోచినవి గానీ , గ్రహదోషములకు , రోగనివారణకు చెప్పబడినవి గానీ ఇయ్యవచ్చును. ఏవైనా సరే , దానయోగ్యములు గా ఉండవలెను. అనగా మంచి నాణ్యత కలిగి ఉండవలెను. కొన్ని ధార్మిక ప్రదేశముల వారు తులాభారము చేసెదమని చెప్పి , దానయోగ్యము కాని , తిన యోగ్యములు కాని పదార్థములను వారే తెచ్చి , దాతలతో వాటికి తగిన డబ్బు తీసుకొని చేయించుచున్నారు. దాతలు ఆ యా పదార్థముల నాణ్యతను తప్పక పరిశీలించి దీనికి ఒప్పుకొనవలెను.  ముఖ్యముగా గమనించవలసినది యేమిటనగా , అలా తూచిన పదార్థములను / వస్తువులను వెనువెంటనే తాను యేమీ ఉంచుకొనక , సభాసదులకు గానీ , చుట్టుప్రక్కల వారికి గానీ , ఇతర భక్తులకు గానీ పంచివేయ వలెను. వాటిని తన గృహమునకు తెచ్చుకొనుట , ఉంచుకొనుట చేయరాదు. తులాపురుష దానమును ఇంటిలో కూడా చేయవచ్చును. అప్పుడు కూడా వాటిని ఇంటిలో ఉంచుకోరాదు. వెంటనే పంచివేయవలెను. 

తులాపురుష దానమును ఎవరెవరు చేయవచ్చును ?  

స్త్రీలు , పురుషులు , బాల బాలికలు అందరూ చేయవచ్చును. 

ఎప్పుడెప్పుడు చేయవచ్చును ? 

          ఈ తులాపురుష దానమును , పండుగలు , పర్వములు , వ్రతముల యందు గానీ , సంక్రమణము , వ్యతీపాతము , గ్రహణము , మొదలగు పుణ్యకాలములందు గాని , అమావాస్య , పౌర్ణమి యందుగాని , తన జన్మ దినమందుగానీ , చివరికి తనకు అనుకూలమైన ఏ దినమందైననూ చేయవచ్చును. ఎప్పుడు ఇచ్ఛ కలిగిన అప్పుడు చేయవచ్చును. దీనికి శుభ ముహూర్తములు , తిథులు యని లేవు. తీర్థయాత్రలలోను , యేదైనా తీర్థములో అవకాశము ,సౌకర్యము ఉండిన చేయవచ్చును.  

దీర్ఘ కాలముగా పీడించు వ్యాధులు కూడా తులాపురుష దానము వలన పూర్తిగా శమించును.

యే యే వ్యాధులు శమించుటకు యేయే పదార్థములను తులాపురుష దానము చేయవలెను ? 

క్షయ వ్యాధి నిర్మూలము కావలెనన్న , కంచుపాత్రలను , 

మూలవ్యాధికి  తగరపు పాత్రలను , 

మూర్ఛ వ్యాధికి సీసపు పాత్రలనూ , 

కుష్ఠు వ్యాధికి రాగి పాత్రలను , 

రక్త పిత్త దోషమునకు ఇత్తడి పాత్రలనూ , 

స్త్రీల కుసుమ వ్యాధులు , పురుషుల శుక్ర నష్టమునకు వెండి పాత్రలనూ , 

సర్వవ్యాధులకు ఇనప పాత్రలు గానీ , అన్నమునుగానీ దానము చేయవలెను.

ఇవికాక , 

జిగట రక్త విరేచనములకు పండ్లను , 

అతిగా ఆకలి వేసే భస్మీక రోగమునకు బెల్లమును , 

గండమాలా వ్యాధి ( కంఠము దగ్గర వాచి , బిళ్ళలు కట్టుట --టాన్సిల్స్ ) కు పోక చెక్కలను , 

ఆకలి లేకుండుట , అజీర్ణమునకు కట్టెలను , కట్టెపుల్లలనూ , 

దగ్గు , ఉబ్బసము , జలోదర వ్యాధులకు తేనెనూ , 

వాంతులు హరించుటకు నెయ్యినీ , 

పైత్య వ్యాధులు నశించుటకు పాలను , 

భగంధర వ్యాధికి పెరుగునూ , 

శరీరములోని అవయవములు వణకు రోగమునకు ఉప్పును ,

దద్దర్లు హరించుటకు బియ్యపు పిండినీ , 

ఇతర సర్వ రోగములకు ధాన్యములనూ , 

సంతాన లేమితో బాధ పడువారు నూనెనూ , 

శతృ బాధ తొలగుటకు పంచదారను , 

సౌందర్యము అభివృద్ధియగుటకు మంచి గంధము చెక్కలనూ , 

దివ్య వస్త్రములు లభించుటకు , తనకువీలైన నూతన  వస్త్రములనూ దానము చేయవలెను. 

అపమృత్యువును జయించు విధము

          తులాభారమునకు ముందుగా , " ఓం జుం నః "  అను మంత్రమును ఒక లక్ష సార్లు శుచీభూతుడై జపించవలెను. తరువాత , తన బరువుతో సమానమగు ఇనప పాత్రలను తూచి , పై మంత్రము చేత నూట ఎనిమిది సార్లు అభిమంత్రించి , వెంటనే బ్రాహ్మణులకు గాని , ఇతరులు ఎవరికైననూ దానము చేయవచ్చును. తరువాత , వీలు ఉండి , చేయ గల శక్తి ఉంటే , పేదలకు , సాధువులకు , బంధువులకు భోజన దక్షిణాదులు యథాశక్తి పెట్టవలెను. ఈ విధముగా చేసిన , గొప్ప శాంతి కలిగి , అపమృత్యువు తొలగిపోవును. 

          సూర్య గ్రహణము నాడు బంగారముతోను , చంద్రగ్రహణమునందు వెండితో తులాపురుష దానము చేసిననూ అపమృత్యువు తొలగును. దానికి శక్తి లేనివారు , రాగి లేక తగరములు తూచి , అందులో యథాశక్తి వెండి లేక బంగారమును కలిపి దానము చేసినచో , బంగారముతో దానము చేసిన ఫలమే వచ్చునని విశ్వామిత్రుడు చెప్పియున్నాడు. 

          బంగారముతో తులాపురుషదానము చేయువారు , దశదిక్పాలకులకు తప్పనిసరిగా పూజ , హోమములను ఆచరించవలెను. ఇతర వస్తువులతో చేయునపుడు హోమము నాచరించ పనిలేదని శాస్త్రములు చెప్పుచున్నవి. 

          నవగ్రహదోషములున్న వారు నవ ధాన్యములను గానీ , లేక , ఏ గ్రహ దోషమైతే ఉందో ఆ యా గ్రహాలకు చెప్పబడిన ధాన్యములను తులాపురుష దానము చేయించి , వెంటనే బ్రాహ్మణులకూ , ఇతరులకూ పంచిపెట్ట వలెను. సర్వ శుభములూ కలుగును. 

     దానముల విషయము వచ్చునపుడు , కొందరు , ’ ద్విజులకే ఎందుకు దానమీయవలెను ? మిగిలిన వారు అర్హులు కారా ? " యని అడుగుతున్నారు. దానమునకు అందరూ అర్హులే , అయితే ద్విజులకు దానము చేసినచో , ఆ దానము తీసుకొనుట వలన కలుగు పాపము పూర్తిగా నశింపజేసుకొన గలరు. దానము నిచ్చుట అనగా , ఆ తీసుకున్న వారికి దానముతో పాటూ తన పాపమును కూడా ఇచ్చుట. క్రమము తప్పక సంధ్యావందనాది అనుష్ఠానములు చేయు ద్విజుడైతే ఆ దానమును పట్టి , దానితో సంక్రమించిన పాపమును తన అనుష్ఠానములచేత నశింపజేయును. అనుష్ఠానములు చేయనివాడికిస్తే , ఆ పాపము నశింపక , ఒకరినుండీ మరియొకరికి వచ్చుచునే ఉండును. 

తరువాత  తులాపురుష దాన విధానము ను చూస్తాము

Tuesday, March 18, 2014

ఉగాది విధులు

ఉగాది విధులు 

ఉగాది నాడు చేయవలసిన విధులు అంటూ కొత్తగా ఇప్పుడు చెప్పడానికి ఏదీ లేదు.

అయినా , ఓ పద్దతి ప్రకారం వాటిని తెలుసుకుంటే ఉపయోగకరము అని రాస్తున్నాను. 


ఉగాది లేక యుగాది అంటే నూతన వర్షారంభం . ఇది , చాంద్రమాన ఉగాది , సౌరమాన ఉగాది అని రెండు విధములు.

         సృష్టికర్త అయిన చాతుర్ముఖ బ్రహ్మ , ఏ దినము ఉదయము సూర్యోదయ కాలములో ఈ అందమైన జగత్తును అద్భుతంగా సృష్టి చేసినాడో  , ఆ దినమే యుగాది. ఆ దినము నుండే కాల గణనము ఆరంభించు వ్యవస్థ ఏర్పాటు చేసినాడు. దీనికి సూర్య చంద్రుల గమనమే  ఆధారము. బ్రహ్మ ప్రారంభించిన ఆ సృష్ఠి కార్యము ఈనాటి వరకూ అవిచ్ఛిన్నముగా ఉత్తరోత్తరాభివృద్ధిగానూ  సాగుతున్నది కాబట్టి ఈ దినపు ప్రాముఖ్యత మాటలతో చెప్పలేము. ఈ కారణము చేతనే ఈ దినమునందు కొత్తగా లెక్కలు మొదలు పెట్టుటయు , కొత్త వ్యాపారములు మొదలు పెట్టుటయూ అనాదిగా ఆచారములో ఉంది. 

         ఆ రోజు , ప్రతి యింటి యందును మామిడాకుల తోరణములు , పుష్పములు , జెండాలు మొదలైన వాటితో అలంకరించ వలెను. ఇంటి ముందర , పూజా గృహములోనూ అందమైన ముగ్గులు వేయవలెను. తైలాభ్యంగన స్నానము తప్పక చేయవలెను అని వసిష్ఠుడు అంటాడు. తర్వాత సంధ్యావందనాదులు చేసి , పాత , కొత్త పంచాంగములను పూజాగృహములో పెట్టి , మొదట గణపతిని , తరువాత కులదేవతను షోడశోపచారములతో పూజించాలి. కొత్త పంచాంగానికి పసుపు కుంకుమలు రాసి , పంచాంగములను పూజించాలి. వేదవిదులైన బ్రాహ్మణులను , గురువులనూ పుజించాలి. స్త్రీలు , పిల్లలూ నూతన వస్త్రములను ధరించి కొత్త ఆభరణములను ధరించ వలెను.

తరువాత , వేప పచ్చడిని ఈ విధముగా తయారు చేయవలెను

         లేలేత వేపాకులు , వేప పువ్వు , తీసుకొని వచ్చి , మొదట నేతిలోగానీ , నీటిలోగానీ మిరియాల పొడిని పొంగించి , ఇంగువ , సైంధవ లవణము , వాము , జీలకర్ర పటిక బెల్లము సమభాగములు గా చేర్చి , కొద్దిగా కడిగిన చింతపండుతో కలిపి నూరవలెను. దీనిని ఇతర నైవేద్యముతో పాటు దేవుడికి నివేదించి , బంధు మిత్రులతో కలసి దేవుడికి  మంగళారతి ఇచ్చి , వేప పచ్చడిని సేవించవలెను. 

         ఈ ఔషధుల మిశ్రమమును కేవలము ఉగాది నాడు మాత్రమే కాక , తరువాత వచ్చు పౌర్ణమి వరకూ రోజూ ప్రాతఃకాలమున పరగడుపున తినుచుండవలెను. దీనివలన అనేక వ్యాధులు శాంతించును. వాతావరణములో కలుగు మార్పులవలన కలుగు వ్యాధులను అరికట్టును. రక్త విరేచనములు , జ్వరములు మొదలగునవి అస్సలు రావు. 

         ఉగాదినాడు ఉదయము పూజాదుల అనంతరము జ్యోతిష్కుని సత్కరించి , నూతన సంవత్సర పంచాంగ ఫలములను వినవలెను. పంచాంగము అంటే తిథి , వారము , నక్షత్రము , యోగము , కరణము అనునవి. పంచాంగ శ్రవణముచే , తిథి వలన సంపదలు , వారము వలన ఆయుష్యము , నక్షత్రము వలన పాప పరిహారము , యోగము వలన వ్యాధి నివృత్తి , కరణము వలన కార్యానుకూలతా కలుగును. 
సామాన్యముగా అందరికీ తిథి , వార , నక్షత్రములు అనునవి తెలిసిఉండును. ఇవి పంచాంగములో కూడా ఇచ్చి ఉంటారు. యోగము , కరణము అనగా చాలామందికి తెలీదు. ఇవి కూడా కాల వ్యవధులే. వీటిని కూడా పంచాంగములలో ఇచ్చి ఉంటారు.  యోగములు కూడా నక్షత్రముల వలెనే ఇరవై ఏడు. యోగమంటే ఏదైనా ఒక సమయము సూచించు అనుకూల / లేదా ప్రతికూల పరిస్థితి. సూర్య , చంద్రుల స్థానాన్ని బట్టి దీనిని తెలుసుకుంటారు.  ఇవి ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. వీటిని ఘడియలలో లెక్కిస్తారు. 

        అయితే అనేక పంచాంగములలో ప్రతిరోజూ అమృత , సిద్ధ , మరణ అను యోగములు ఇచ్చి ఉంటారు. ఇవి పై యోగములు కావు. ఇవి కేవలము వారము, నక్షత్రముల సంయోగము వలన కలుగు ఫలముల సారాంశము మాత్రమే. 

       కరణములు కూడా కాల వ్యవధులు. ఇవి ఏడు. కోష్ఠకములో ( టేబుల్ ) వీటిని వరుసగా ఇస్తారు. ఒకదాని తర్వాత ఒకటి వచ్చును. అయితే ఇవి ఒకే తిథిలో రెండు వచ్చును అందులో మొదటి దాని పేరు , అది ముగియు కాలము మాత్రమే ఇస్తారు. కాబట్టి , కోష్ఠకము తెలిసినచో , తరువాత ఏది వచ్చునో తెలియును. ఈ ఏడు కాక, కొన్ని విశేష దినములలో వచ్చు విశేష కరణములు ఇంకో నాలుగున్నాయి. అవి పంచాంగములో ఇచ్చియే ఉందురు. 

         కన్యాదానము , భూదానము , సువర్ణ దానము , గజదానము , గోదానము వంటి వాటికి కలుగు ఫలము కన్నా వేయింతలు , ఒక్క పంచాంగ శ్రవణము వలననే కలుగును అని శాస్త్రములు చెబుతున్నాయి. పంచాంగ శ్రవణమంటే కేవలము ఈ ఐదు అంగముల గురించి తెలుసుకొనుటే కాదు ,ఆ  సంవత్సరానికి అధిపతి, మంత్రి , ధాన్యాధిపతుల గురించీ , వారిచ్చు ఫలములు , ద్వాదశాది రాసుల వారికి కలగబోవు ఫలములు , రాజపూజ్య అవమానములు , ఆదాయము , ఖర్చులు , ఋణములు మొదలగునవి కూడా తెలుసుకొనుట. అంతే కాక, మన రాష్ట్రానికి , దేశానికీ , ప్రపంచానికీ కలగబోవు ఫలితాలు కూడా తెలియును. 

నిత్యమూ పంచాంగ శ్రవణము చెస్తే , ’ అగ్నిష్టోమ ఫలము " , ’ గంగా స్నాన ఫలము ’ దొరకును. ఇప్పటికీ పల్లెలలో బ్రాహ్మణులు ప్రతిరోజూ ఇంటింటికీ వెళ్ళి , పంచాంగము వినిపించుట మనము చూస్తుంటాము. 

రాబోవు జయ నామ సంవత్సరములో బ్రాహ్మణులు సత్కర్మాసక్తులు కావలెను

ప్రజాపాలకులు సత్యనిష్ఠాపరులు కావలెను

అన్ని కులాల వారు తమ తమ కుల ధర్మాసక్తులు కావలెను

వంచన , ద్వేషములను వదలి , సౌహార్దముతో నడచుకొనువారు కావలెను. 

సకాలములో సువృష్టి కావలెను

అందరికీ సన్మంగళములు కలగనీ !! 

|| లోకాః సమస్తాః సుఖినో భవంతు ||

Friday, March 14, 2014

5. ఔపాసన --ఐదవ భాగము - ఔపాసనా విధి




ఔపాసన --ఐదవ భాగము - ఔపాసనా విధి 


          ఇంతవరకూ ఔపాసన యొక్క విశిష్టత , ప్రాముఖ్యత , దాని నేపథ్యము , ఔపాసనాగ్ని నష్టమయి ఉంటే చేయవలసిన ’ విచ్ఛిన్నాగ్ని పునస్సంధాన విధానమూ ’  చూచినారు. ఈ భాగములో ఔపాసన చేయు పద్దతి చూద్దాము. ఇంతకు ముందే చెప్పినట్టు , ఔపాసనా విధానము చాలా సరళము , తేలిక. ఇందులో చతుష్పాత్ర , షట్పాత్ర ప్రయోగము  ఉండదు. పునస్సంధానములో వలెనే , ఇందులో మంత్రములు మాత్రమే కొంచము గట్టిగా నేర్చుకోవలసినవి. మిగిలిన తంత్రము ఒకసారి చదివిన , అర్థమగును. అయితే మొదటిసారి చేయువారు శుష్క విధానమును మొదట ప్రయత్నించవలెను. శుష్క విధానమనగా, ’ రిహార్సల్ ’  వంటిది. ఇందులో అగ్ని ప్రతిష్టాపన ఉండదు , ఆహుతులు ఉండవు. కానీ అన్నీ చేసినట్టుగనే , కుండము ముందర కూర్చొని ఒకసారి పద్దతి , ప్రక్రియనంతటినీ అనుసరించి చేయవలెను. మంత్రములు చెప్పవచ్చును. ఈ శుష్క ప్రయోగము చేయుట , ఔపాసనా విధానము అలవాటు లేనివారికి , నేర్చుకొను వారికీ చాలా అవసరము. పునస్సంధానమును కూడా అట్లే ’ శుష్క హోమము ’ గా చేయవచ్చును. 

          వెనుకటి భాగములోని పునస్సంధానము గానీ , ఈ ఔపాసనా విధానముగానీ , దేశముకాని దేశములో ఉండి , మన సాంప్రదాయములను అనుసరించ వలెననుకొను తెలుగువారి కోసము రాయబడినదే తప్ప, అన్నీ తెలిసి , ఆచరించువారిని అధిక్షేపించుటకు కాదు. అనగా , అన్నీ తెలిసినవారు ఎటూ చేయుచునే ఉందురు , వారు అసలు అంతర్జాలమునకు వస్తారని నేను ఊహించను. వచ్చినా, వీటికోసము కాదు. వారికి నేను రాసిన పద్దతిలో ఏవైనా శంకలు గానీ , ఆక్షేపణలు గానీ ఉంటే ఉండవచ్చును. ఒకవేళ అవి ఉంటే , అవి కేవలము ప్రాంతాల , దేశీయ ఆచారములలోని వ్యత్యాసములే తప్ప , ప్రాథమికముగా ఏ భేదాలూ ఉండవు. కొత్తగా నేర్చుకొను వారికి ఉత్సాహము పుట్టవలెనను ఉద్దేశముతో సరళముగానూ , ఆచరణయోగ్యమైనవిగానూ రాయబడినవి. ఒకసారి ఇందులోకి దిగిన వారికి , రాను రాను అనుష్టానము ప్రబలమై , ఆ భగవంతుని అనుగ్రహము వలన న్యూనాతిరిక్తములు ఏవైనా ఉంటే అవన్నీ సవరింపబడి , ఉన్నత ప్రమాణమునకు చేరగలరు. శ్రద్ధాసక్తులు పుట్టించుటయే నా మొదటి లక్ష్యము. 

         పైన రాసినది చదివి మీకు నవ్వు రావచ్చును. నిజమే , ఇక్కడ ’ నా లక్ష్యము ’ ఏమున్నది ? అంతా పైవాడిదే. వాడి ఆజ్ఞ లేకుండా ఎవరూ ఇక్కడికి అసలు రారు కదా ! పొరపాటున వచ్చినా , రుచించకో , అర్థం కాకో వెళ్ళిన వారు ఎందరో !! ఏదేమైనా మనకొక సంకల్పము వాడు పుట్టించాడు గనక , దానిని పూర్తి చేయుటకే ప్రయత్నిద్దాం. 

          నాకు వాచాలత వచ్చి, ఔపాసన విధానము కన్నా ముందు ఇంకొన్ని విషయాలను చెప్పవలెననిపించుతున్నది.

           మొదటి భాగములో రాసినట్టు , ఔపాసన చేయుటవలన అగ్ని దేవుడు హవిస్సుల సారమును పీల్చుకొని మనకు వర్షములను , సస్యములనూ సృష్టించి ఇచ్చుచున్నాడు. అంతేగాక మనకే తెలీని ఎన్నో ఇతర ఉపయోగములను కలిగించుచున్నాడు. మోదుగ సమిధలను వాడినచో , దాని సుగంధము ఒక అలౌకిక ఆనందమును కలిగించుటే కాక,మన మనసులను ప్రేరేపించి మనలను సన్మార్గమున  నడిపించును. ఈ కాలము వారికి ఔపాసనా ప్రయోజనము కళ్ళకు కట్టినట్టు చూపినగానీ దాని గొప్పతనమును ఒప్పుకొనరు కదా. 

          ఒక విశేష సంఘటన గురించి చెబుతాను,మీలో చాలా మందికి తెలిసి ఉండవచ్చు కూడా,  మనందరికీ ’ భోపాల్ గ్యాస్ దుర్ఘటన ’ తెలిసిందే. ఎందరో అమాయకపు ప్రజలు ఘోరముగా బలి అయినారు. వారే కాక, వారి తరువాతి రెండు తరాల వారు కూడా దాని ప్రభావమునకు లోనై , రకరకాల వ్యాధులతో ఇప్పటికీ పీడింపబడుతున్నారు. ఆ సమయములో భోపాల్ పట్టణము గుండా ప్రయాణించిన రైలు ప్రయాణీకులు కూడా తీవ్రముగా ప్రభావితులైనారు.  భోపాల్ కు చుట్టుపట్ల సుమారు వంద కిలోమీటర్ల దూరం లో ఉన్నవారుకూడా తీవ్రముగా గురి అయినారు. 

          కానీ విచిత్రమేమిటంటే , భోపాల్ నగర శివార్లలో ఉన్న ఒక బ్రాహ్మణ అగ్రహారములోని ప్రజలకు ఇవేవీ తెలియవు. ఆ ఊరిలో ఎవరికీ ఏమీ కాలేదు. అంతా పూర్ణ ఆరోగ్యముతో ఉన్నారు. గ్యాస్ దుర్ఘటన వారిని ఏ విధంగానూ ప్రభావితము చేయలేదు. దానికి కారణము ఏమిటని దేశ విదేశాలనుండీ కూడా అనేక శాస్త్రజ్ఞులు వచ్చి పరిశోధనలు జరిపినారు.  అణు శాస్త్రజ్ఞులతో పాటూ వేద పండితులూ , విద్వాంసులూ కూడా ఉన్నారు. అంతా కలిసి ఏక కంఠముతో చెప్పిన దేమంటే , ఆ అగ్రహారములో అనేక కుటుంబాల వారు ప్రతి దినమూ రెండు పూటలుకానీ , మూడు పూటలు కానీ ఔపాసన చేయుటయే  అని! ఆ ఔపాసనాగ్ని సృష్టించిన హోమ ధూమము వారికి ఆ విష వాయువు నుండీ రక్షణ కల్పించినది. పర్యావరణాన్నీ వాతావరణాన్ని పరిరక్షించే ప్రయోజనము ఔపాసన వలన లభిస్తున్నది అని తెలిసి అందరూ ఆశ్చర్యపోయినారు. 

          ఈ విషయమును మొదటిసారిగా , భోపాల్ నుండీ శాస్త్రజ్ఞుల బృందమొకటి శృంగేరి కి వచ్చి వివరించినారు. బెంగళూరు తదితర పట్టణాలకు కూడా వచ్చి వివరించినారు. అనేక పత్రికలలోను , వార్తా పత్రికలలోనూ ఈ విషయమును విశేషముగా ప్రచురించినారు. ఎన్నో పుస్తకములలో ఈ విషయము ఉటంకించబడినది. ఈ నాటికీ సందర్భము వచ్చినపుడల్లా , దూరదర్శనులలోనూ ఇతర మాధ్యములలోనూ ఈ విషయము ఉదహరిస్తూనే ఉన్నారు. ఇంతటి గొప్ప విషయమును మన దేశ ప్రభుత్వము ఉదాసీనముగా తీసుకొనుట శోచనీయము. ప్రభుత్వము లో ఆజమాయిషీ గల వారికి అది రుచించలేదు. 

ఒకరు ఆపిన ఆగేది కాదిది. అరచేతితో సూర్యుడిని అడ్దగించలేము... సరే , ఇక విషయానికొద్దాము. 


          (  పునస్సంధానమును అగ్ని నష్టమయిన ప్రతిసారీ , మరలా ఔపాసన చేయుటకు ముందర , అధికారము కొరకు చేయవలెను అని తెలుసుకున్నాము. అంతేకాక, అగ్ని నష్టము కాకుండా ఉండవలెనంటే పాటించవలసిన ఒక పద్దతి గురించి కూడా ఉటంకించుకున్నాము. అదియే ఆత్మారోపణము , లేదా సమిధారోపణము. కారణాంతరముల వల్ల కొన్ని రోజులు ఔపాసన చేయలేకపోతే , ఈ పద్దతి వలన అగ్ని నష్టము కాకుండా చూచుకోవచ్చును.  ఈ అగ్న్యారోపణ విధానమును ఔపాసనా విధి చివరలో తెలుసుకుందాము. )

ఔపాసనా విధి 


         కర్త , భార్యతో పాటు , ఉదయము లేక సాయంకాలము  సంధ్యావందనము ముగించి , శుచుడై మడిబట్టలతో , రెండుసార్లు ఆచమనము చేయవలెను.( ఓం కేశవాయ స్వాహా .... కృష్ణాయ నమః ) 
తర్వాత ( వీలైన పవిత్రమును ధరించి, ) ప్రాణాయామము చేయవలెను. ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః , పరమాత్మా దేవతా, దైవీ గాయత్రీ ఛందః ..( ఓం భూః...భూర్భువస్సువరోమ్ )

        సంకల్పము :  మమ ఉపాత్త -----ప్రీత్యర్థమ్ , అస్మాకం సహ కుటుంబానామ్ క్షేమ స్థైర్య , వీర్య , విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృధ్యర్థమ్ , ధర్మార్థ , కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థమ్ , సాయమౌపాసనం ( ఉదయమయితే , ప్రాతరౌపాసనమ్ ) కరిష్యే | ఔపాసనాధికార యోగ్యతా సిద్ధ్యర్థం , కృచ్ఛ్రాచరణమ్ కరిష్యే | 

          [ ఔపాసన నిలిపివేయుట , సంధ్యావందనాదులు నిలిపివేయుట , వేదాధ్యయనము చేయక పోవుట వంటి గొప్ప అపరాధములతో పాటు , తినకూడనివి తినుట , యజ్ఞోపవీతము లేకుండుట  వంటి అనేక ఇతర దోషములకు పరిహారముగా కృచ్ఛ్రాచరణము చేయుచున్నాను  - అని సంకల్పము తో పాటూ చెప్పవలెను. కృచ్ఛ్రము చేయుట ఒక నిమిషములోనో గంటలోనో దినములోనో అయ్యేది కాదు కాబట్టి , కృచ్ఛ్రాచరణమునకు బదులుగా యథా శక్తిగా బంగారము / లేదా దక్షిణను అక్షతలతో పాటు కానీ బియ్యముతో పాటు కానీ నీటితో పళ్ళెములో వదలవలెను. ఆ దక్షిణను తరువాత ఎవరైనా వేదవిదుడికి దానము నియ్యవలెను. ]




( పునస్సంకల్ప్య )---తరువాత హోమగుండము వద్ద కూర్చొని మరలా ఈ విధముగా సంకల్పము చెప్పవలెను

సాయమౌపాసనం తండులైర్హోష్యే | --- సాయంకాలపు ఔపోసనమును తండులములతో చేయుచున్నాను అని.  ( ఉదయమైతే , ప్రాతరౌపాసనం తండులైర్హోష్యే అని ) 

మొదట , పునస్సంధానములో చెప్పిన విధానముగనే అగ్నిని ప్రతిష్టించి , పరిస్తరణములు వేయుట వరకూ చేయవలెను. 

తతః స్థండిల ఉల్లేఖనాద్యగ్ని ప్రతిష్టాపనం కరిష్యే |

యత్రాగ్నిస్థాప్యతే , తత్ర సికతాభిర్మృదావాస్థండిలం చతురస్రం కృత్వా || అరత్ని మాత్రం ||

         అగ్నిని ప్రతిష్ఠించు ఒక పరిశుద్ధమైన ప్రదేశములో అరత్ని మాత్రం అనగా, పిడికెడు తక్కువ మూరెడు పొడవు , అంతే వెడల్పు గల చతురస్రాకారం గల అరుగు మట్టితో కానీ , ఇసుకతో కానీ చేయవలెను.  ఆ కుండమునకు పశ్చిమమున , తూర్పుకు తిరిగి కూర్చోవలెను. 

తస్యోపరి తండులైః పిష్టేనవా ప్రాదేశమాత్రం చతురస్రం కృత్వా || 

ఆ మట్టి అరుగుపైన బియ్యమును కానీ బియ్యపు పిండిని కానీ చతురస్రముగా నింపి పరచవలెను. 

అంగుష్ఠానామికాభ్యాం , ద్వౌ, త్రయో వా దర్భాన్ గృహీత్వా | సంతత మృజూర్దక్షిణత ఆరభ్య ఉదక్సంస్థాః ప్రాచీస్తిస్రో రేఖా లిఖిత్వా | తాస్వేవ రేఖాసు పశ్చిమత ఆరభ్య ప్రాక్సంస్థాః ఉదీచీస్తిస్రో రేఖా లిఖిత్వా |

          తర్వాత బొటనవేలు ,  ఉంగరపు వేళ్లతో రెండు లేక మూడు దర్భలు తీసుకొని , దానిపై ఆ దర్భ మొదళ్ళతో ( అగ్రములు కాదు ) పడమటి నుండీ తూర్పుకు మూడు నిలువు గీతలు గీయవలెను. ఆ గీతలు మొదట అరుగుకు కుడివైపునకు అనగా దక్షిణము వైపున మొదలుపెట్టి, రెండోగీత మధ్యలోనూ , చివరి గీత ఎడమ వైపు అనగా ఉత్తరమునకు ఉండవలెను. మరలా ఆ రేఖల పైన ఇప్పుడు అడ్డముగా , అంటే దక్షిణము నుండీ ఉత్తరానికి , మొదట పశ్చిమమునుండీ మొదలు పెట్టి ఒకటి , తర్వాత దానిపైన  మధ్యలో ఒకటి , మూడోది తూర్పుకు మూడోది గీతలు గీయవలెను. 

         ఉల్లేఖన దర్భానాగ్నేయ్యాం నిరస్య | అప ఉపస్పృశ్య | అవాచీనేన పాణినా అద్భిరవోక్ష | శ్రోత్రియాంగారాదగ్నిమాహృత్య | ఆయతనే విధినాగ్నిమ్ భూర్భువస్సువరోం ఇతి ప్రతిష్ఠాప్య | అగ్న్యానయన పాత్రయోరక్షతోదకం నినీయ ||----

ఉల్లేఖనము చేసిన ఆదర్భలను కుండము బయట ఆగ్నేయానికి వేసి , నీటితో చేతులు తుడుచుకొన వలెను. 

ఆ గీతలపైన కుడిచేతితో నీటితో అవోక్షణము చేయవలెను. అవోక్షణమనగా  అరచేతిని బోర్ల వచ్చునట్టు పెట్టి నీటిని చిలకరించుట.చేతిలో మిగిలిన నీటిని తూర్పుకు కానీ ఉత్తరానికి కానీ వేయవలెను. వేరే నీటి పాత్రను కుండమునకు పదహారు అంగుళముల బయట ఉత్తరానికి కానీ తూర్పుకు కానీ పెట్టవలెను. ఈనీటిని ’ ప్రాక్తోయము ’ అందురు. 

ఇప్పుడు కుండములో అగ్నిని ప్రతిష్టించవలెను. 

ఇంధనేనాగ్నిం వ్యజననేన , ధమన్యావా ప్రజ్వాల్య | ----

         ఇప్పుడు కుండములో చిన్న పుడకలు , పిడకలు వంటివి వేసి ఊదు గొట్టముతో ఊది కానీ , విసనకర్ర తో విసరి కానీ అగ్నిని బాగుగా మండునట్లు చేయవలెను. నోటితో ఎప్పటికీ ఊదరాదు. ఊదవలసి వస్తే , అరచేతిలోకి ఊది అగ్నికి తగులునట్లు చేయవలెను. నేరుగా యజ్ఞేశ్వరుడిపై నోటితో ఎప్పుడూ ఊదరాదు. 


చత్వారిశృంగేత్యగ్నిం ధ్యాత్వా ||

అగ్ని ప్రతిష్ఠాపన అయిన తర్వాత అగ్నిదేవుడిని ఈ మంత్రముతో ధ్యానించవలెను. 

చత్వారి శృంగా త్రయోఅస్యపాదా ద్వే శీర్‌షే సప్త హస్తాసో అస్య |
త్రిధాబద్ధో వృషభో రోరవీతి మహోదేవో మర్త్యాగ్ం ఆవివేశ ||

          అగ్నిమ్ ధ్యాయామి | తర్వాత ఈ శ్లోకముతో యజ్ఞేశ్వరునికి ముందు భాగములో అక్షతలు నీళ్ళు వేయవలెను. యజ్ఞేశ్వరుడు ఎప్పుడూ తూర్పుకే తిరిగి ఉండును. కాబట్టి ముందు భాగమనగా కుండమునకు తూర్పు వైపుకు వేయవలెను. అప్పుడు యజ్ఞేశ్వరుడు నీటిని ఇష్టపడక , వెనుకకు తిరుగును , అనగా యజమానునికి అభిముఖముగా తిరుగును. కర్త , తనకు అభిముఖుడు కావలెనని అగ్నిని ఈ విధముగా ప్రార్థించవలెను.

సప్తహస్తశ్చతుశృంగః సప్తజిహ్వో ద్విశీర్షకః | త్రిపాత్ప్రసన్న వదనస్సుఖాశీనశ్శుచిస్మితః ||

స్వాహాంతు దక్షిణే పార్శ్వే దేవీం వామే స్వధాం తథా | బిభ్రద్దక్షిణ హస్తైశ్చ శక్తిమన్నం స్రుచం సృవం ||

తోమరం వ్యజనం వామైర్ఘృత పాత్రం తు ధారయన్ | మేషారూఢో జటాబద్ధో గౌరవర్ణో మహద్యుతిః ||

ధూమధ్వజో లోహితాక్షః సప్తార్చిస్సర్వకామదః || ఆత్మాభిముఖమాశీన ఏవం ధ్యేయో హుతాశనః ||

ఏషహి దేవ ఇతి అక్షతోదకం పూర్వ భాగే క్షిప్త్వా | యజ్ఞేశ్వరం హస్తాభ్యాం ఆత్మాభిముఖీ కృత్య | 

అక్షతలు నీళ్ళు యజ్ఞేశ్వరునకు తూర్పు భాగమున వేసి , తన వైపుకు తిరగమని చేతులతో  చూపవలెను. 
ఈ మంత్రముతో ప్రార్థించవలెను. 

ఏష హి దేవః ప్రదిశోనుసర్వాః పూర్వోహి జాతస్స ఉ గర్భే అన్తః |
సవిజాయమానస్సజనిష్యమాణః ప్రత్యన్ముఖాస్తిష్ఠతి విశ్వతోముఖః ||

హే అగ్నే! ప్రాఙ్ముఖోదేవ ప్రత్యఙ్ముఖస్సన్ | మమాభిముఖో భవ | సుప్రసన్నో భవ , వరదో భవ |

ఓం భూర్భువస్సువరోమితి అగ్నేరష్టాఙ్గుల దేశే జలేన ప్రోక్ష్య |

అగ్ని చుట్టూ , ఎనిమిదంగుళముల దూరములో  ఓం భూర్భువస్సువః అను( గాయత్రీ ) మంత్రముతో నీటిని ప్రోక్షించవలెను. 

          ప్రాగాది పరిమృజ్య  , త్రిస్సమ్మార్ష్టి --అనగా , చూపుడు , నడిమి , ఉంగరపు వేళ్ళతో మొదట ఆగ్నేయము నుండీ ఈశాన్యమునకు , తర్వాత నైఋతి నుండీ ఆగ్నేయమునకు , ఆ తరువాత నైఋతి నుండీ వాయవ్యమునకు , చివరగా వాయవ్యము నుండీ ఈశాన్యమునకు సంధులు కలియునట్లు నాలుగు పక్కలందూ నీటి గీతలు గీయవలెను. దీనినే పరిసమూహనము అందురు. 

అగ్నేర్దశాఙ్గుల పరిమితి దేశే అగ్న్యాయతనాన్యగ్నయే నమిత్యాద్యష్టభిర్నమోంతైరలంకృత్య |

అనగా అగ్నికి పది అంగుళదూరములో తూర్పు నుండీ మొదలు బెట్టి ఎనిమిది దిక్కులందూ ’ అగ్నయే నమః ’ మొదలగు నామములతో  పూలు , అక్షతలచే అలంకారము చేయవలెను. 

అగ్నయే నమః | హుతవహాయ నమః | హుతాశినే నమః | కృష్ణ వర్తనే నమః | దేవముఖాయ నమః | సప్తజిహ్వాయ నమః | వైశ్వానరాయ నమః | జాతవేదసే నమః | మధ్యే శ్రీ యజ్ఞపురుషాయ నమః |

అలంకరణాదంతః ప్రాగాది ప్రదక్షిణం దక్షిణోత్తరైః , ఉత్తరాధరై ప్రాగుదగగ్రైః షోడశ్షోడశ దర్భైః అగ్నిమ్ పరిస్తృణాతి ||

          అలంకరణమునకు ఒక అంగుళములోపల కుండమునకు నాలుగు వైపులా దర్భలతో పరిస్తరణము చేయవలెను. అనగా , ఒక్కో వైపునా పదహారు పదహారు దర్భలను పరచవలెను. మొదట తూర్పువైపు మొదలుపెట్టి , ఆ పదహారు దర్భలు తూర్పు కొనలుగా పరచవలెను. తర్వాత దక్షిణాన పదహారు దర్భలు , తూర్పు పరిస్తరణము మొదళ్ళపై అగ్రములు వచ్చునట్లు , అటులే పడమట , పదహారు దర్భలను , దక్షిణ పరిస్తరణపు మొదళ్ళపై మొదళ్ళు వచ్చునట్లు , అలాగే , ఉత్తర పరిస్తరణపు దర్భల మొదళ్ళు పశ్చిమ పరిస్తరణపు కొనల పైనా , అగ్రములైతే తూర్పు పరిస్తరణపు అగ్రముల కిందా వచ్చేలా పరచవలెను. 

అగ్నిం పరిషిచ్య ---ఇప్పుడు కింది విధముగా అగ్ని పరిషేచనం చేయవలెను.

కుడిచేతితో కొద్దిగా నీరు తీసుకొని , హోమకుండమునకు బయట కుడి ప్రక్క , అనగా దక్షిణము న పడమటి నుండి తూర్పుకు  ధారగా ఈ మంత్రముతో నేలపై నీరు వదలవలెను. 

అదితేను మన్యస్వ | 

తర్వాత మళ్ళీ నీరు తీసుకొని , కుండమునకు పశ్చిమమున , దక్షిణము నుండీ ఉత్తరమునకు ( దక్షిణపు నీటిని కలుపుకొని ) ధారగా ఈ మంత్రముతో నేలపై నీరు వదలవలెను.

అనుమతేను మన్యస్వ |

తర్వాత మళ్ళీ కుండమునకు ఎడమవైపున /ఉత్తరము వైపు , పడమటి నుండి తూర్పుకు ( పశ్చిమపు నీటిని కలుపుకొని) ధారగా ఈ మంత్రముతో నీరు వదలవలెను. 

 సరస్వతేను మన్యస్వ |  

చివరిగా కుండమునకు తూర్పున , ఈశాన్యమునుండీ మొదలుపెట్టి కుండము చుట్టూ ప్రదక్షిణముగా మరలా ఈశాన్యమునే కలుపుతూ ధారగా ఈ మంత్రముతో నీరు వదలవలెను. 

దేవసవితః ప్రసువ |

         [ ఒక వేళ ఔపాసనాగ్ని నష్టము కాకుండా ఉండి , క్రితం రోజు ఔపాసన చేసియుండినచో , అప్పుడు సమిధనొకదానిలో అగ్ని ఆరోపణము చేసి ఉంటాము--దానిని కింది మంత్రముతో ఆహుతినీయవలెను. ఆరోపణము చేసిన సమిధ ఉంటే , అప్పుడు కృచ్ఛ్రాచరణము అవసరము లేదు. 

ఔపాసన సమిధను చేతిలోకి తీసుకొని , 

|| ఓం ఆజుహ్వానః సుప్రతీకః పురస్తాదగ్నే స్వాం యోని మాసీద సాధ్యా | అస్మిన్సధస్తే అధ్యుత్తరస్మిన్ విశ్వే దేవా యజమానశ్చ సీదత ||

ఉద్భుధ్యస్వాగ్నే ప్రతిజాగృహ్యేన మిష్టాపూర్తే సగ్ం సృజేథా మయం చ | 
పునః కృణ్వగ్గ్‌స్త్వా పితరం యువాన మన్వాతాగ్ం సీత్వయి తంతుమేతమ్ || 

అని పలికి సమారోపితమైన సమిధను అగ్నికి వేయవలెను. అప్పుడది ఔపాసనాగ్నే యగును.

ఒక వేళ , సమిధలో కాకుండా , అగ్నిని ఆత్మారోపణము చేసుకొని ఉంటే , కింది మంత్రము చెప్పి ,

 || యాతే అగ్నే యజ్ఞియా తనూస్త యేహ్యారోహాత్మాత్మానమచ్ఛా వసూని కృణ్వన్నస్మే | నర్యాపురూణి యజ్ఞోభూత్వా  యజ్ఞమాసీద స్వాం యోనిం జాతవేదో భువ ఆజాయమాన సక్షయ ఏహి | 

 --  మూడుసార్లు ఒక రావి సమిధపైకి గాలిని ఊది , ఆ రావి సమిధకు ఔపాసనాగ్ని వచ్చినట్లు భావించి అగ్నిలోకి వేయవలెను. అప్పుడది ఔపాసనాగ్నే యగును.  ]

          ఇప్పుడు , కర్త , తన భార్య చేతులలోకి నీరుపోయగా , ఆమె చేతులు కడుగుకొన వలెను. తర్వాత  అరచేతులకు కొద్దిగా ఆమె నేయి రాచుకొనవలెను. ఆ తరువాత ఆమె యజ్ఞేశ్వరునికి తన అరచేతులు చూపి శాఖము కాచుకొనవలెను. కర్త ఇప్పుడు తన కుడిచేతి నాలుగు వేళ్ళ గణుపులు నిండునట్లు ( చారెడు ) బియ్యమును తీసుకొని , భార్య దోసిలి లోకి వేయవలెను. తర్వాత ఆ బియ్యముపై నీరుపోసి కడిగించవలెను. కడిగిన ఆ బియ్యమునకు నేయి వేయవలెను. ( ఒక వేళ భార్య ఏ కారణము వల్లనైనా అక్కడ లేకుంటే / చేయలేక పోతే , యజమానుడే బియ్యమును  తన చేతులలో కడిగి నేయి వేసుకొనవలెను ) 

భార్య ఆ బియ్యములో సగమును భర్తకు ఇవ్వ వలెను. అప్పుడు ఆ కర్త ఈ కింది మంత్రముతో ఆ బియ్యమును , పొగలేకుండా , బాగా ప్రజ్వలించుచున్న యజ్ఞేశ్వరుడికి సరిగ్గా మధ్య భాగములో వేయవలెను

౧.  అగ్నయే స్వాహా || 

అగ్నయ ఇదమ్ |

ఆ తరువాత , మిగిలిన సగము బియ్యమును ఈ కింది మంత్రముతో ఆహుతిని , అగ్నికి ఈశాన్య భాగములో ఇవ్వవలెను

౨.  అగ్నయే స్విష్టకృతే స్వాహా || 

అగ్నయే స్విష్టకృత ఇదమ్ 

 పై మంత్రాలు సాయంకాలపు ఔపాసనా హోమానికి.  ఉదయపు ఔపాసనకు చెప్పే మంత్రాలు కిందవి. 

౧.  సూర్యాయ స్వాహా ||

సూర్యాయేదమ్ |

౨.  అగ్నయే స్విష్టకృతే స్వాహా || 

అగ్నయే స్విష్టకృత ఇదమ్ 

ఆహుతి సంసర్గ దోష ప్రాయశ్చితార్థం వనస్పతి హోమం కరిష్యే |--చేసిన ఆహుతికి కలిగిన ఏదైనా దోషమును నివారించుటకు  , ఈ మంత్రముతో ఒక రావి సమిధను వేయవలెను

ఓం || యత్ర వేత్థ వనస్పతే దేవానాం గుహ్యా నామాని |
తత్ర హవ్యానిగామయ స్వాహా ||

వనస్పతయ ఇదం 

తర్వాత కింది మంత్రముతో మరొక రావి సమిధను అగ్నిలో ఉంచవలెను

సర్వ ప్రాయశ్చిత్తార్థం భూర్భువస్సువ స్వాహా || 

ప్రజాపతయ ఇదమ్ |

ఈ మంత్రాన్ని పదిసార్లు జపము చేయవలెను

వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి | తన్నో అగ్నిః ప్రచోదయాత్ || --౧౦ 

( జపము తర్వాత ) ఉత్తర పరిషేచనం కృత్వా |

ఇప్పుడు మరలా వెనుకటి వలెనే , ఈ కింది మంత్రములతో అగ్ని పరిషేచనము చేయవలెను. 

కుడిచేతితో కొద్దిగా నీరు తీసుకొని , హోమకుండమునకు బయట కుడి ప్రక్క , అనగా దక్షిణమున పడమటి నుండి తూర్పుకు  ధారగా ఈ మంత్రముతో నేలపై నీరు వదలవలెను. 

అదితేఽన్వ మగ్గ్‌స్థాః  | 

తర్వాత మళ్ళీ నీరు తీసుకొని , కుండమునకు పశ్చిమమున , దక్షిణము నుండీ ఉత్తరమునకు ( దక్షిణపు నీటిని కలుపుకొని ) ధారగా ఈ మంత్రముతో నేలపై నీరు వదలవలెను.

అనుమతేఽన్వ మగ్గ్‌స్థాః  | 

తర్వాత మళ్ళీ కుండమునకు ఎడమవైపున /ఉత్తరము వైపు , పడమటి నుండి తూర్పుకు ( పశ్చిమపు నీటిని కలుపుకొని) ధారగా ఈ మంత్రముతో నీరు వదలవలెను. 

 సరస్వతేఽన్వ మగ్గ్‌స్థాః  | 

చివరిగా కుండమునకు తూర్పున , ఈశాన్యమునుండీ మొదలుపెట్టి కుండము చుట్టూ ప్రదక్షిణముగా మరలా ఈశాన్యమునే కలుపుతూ ధారగా ఈ మంత్రముతో నీరు వదలవలెను. 

దేవసవితః ప్రాసావీః |

ఇప్పుడు లేచి నిలబడి , ఈ మంత్రముతో అగ్ని ఉపస్థానము ( ప్రార్థన ) చేయవలెను

అగ్నే త్వంనో అన్తమః | ఉతత్రాతా శివోభవ వరూధ్యః | తంత్వా శోచిష్ఠ దీదివః  | సుమ్నాయ నూనమీ మహే సఖిభ్యః | వసురగ్నిర్వసుశ్రవాః | అచ్ఛానక్షిద్యుముత్తమో రయిందాః | సనో బోధిశ్రుధీ హవమురుష్యాణో అఘాయతస్సమస్మాత్ | 

స్వస్తిశ్రద్ధాం మేధాం యశ ప్రజ్ఞాం విద్యాం బుద్ధిగ్ం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే హవ్యవాహన | శ్రియం దేహి మే హవ్యవాహన |  ఓమ్ నమః

ప్రవర చెప్పుకోవలెను

చతుస్సాగర పర్యంతం ----అభివాదయే || 

తర్వాత , చేసిన ఔపాసనా కర్మ ఫలించుట కోసం ,సంకల్ప సహితముగా ఈ మంత్రములు చెప్పవలెను

మమ ఉపాత్త దురితక్షయ ద్వారా ఔపాసన సాద్గుణ్యార్థం అనాజ్ఞాత త్రయ మంత్ర జపం కరిష్యే |

ఓం || అనాజ్ఞాతం యదాజ్ఞాతం యజ్ఞస్య క్రియతే మిథు |
అగ్నే తదస్య కల్పయత్వగ్ం హివేత్థ యథాతథం || 

ఓం || పురుషసమ్మితో యజ్ఞోయజ్ఞః పురుష సమ్మితః | 
అగ్నే తదస్య కల్పయత్వగ్ం హివేత్థ యథాతథం || 

ఓం || యత్పాకత్రా మనసా దినదక్షాన యజ్ఞస్య మన్వతే మర్త్యాసః |
అగ్నిష్జ్టద్ధోతా క్రతు విద్విజానన్ |యజిష్ఠో దేవాగ్ం ఋతుశో యజాతి ||

ఓం || ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానిధదే పదమ్ | సమూఢమస్యపాగ్ం సురే ||


హోమాంతే యజ్ఞేశ్వరం ధ్యాయామితి పూజాం- ఆజ్యోపహార నైవేద్యం కృత్వా || ( ఒకసారి కొంచము నేతిని నైవేద్యముగా వేయవలెను. )

యస్య స్మృత్యాచ నామోక్త్యా | తపోహోమ క్రియాదిషు | న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం | మంత్ర హీనం క్రియాహీనం భక్తిహీనం హుతాసన | యద్ధుతం మయాదేవ పరిపూర్ణం తదస్తు మే | అనేన సాయమౌపాసన / ప్రాతరౌపాసన హోమేన భగవాన్ సర్వాత్మకః యజ్ఞేశ్వరస్సుప్రీణాతు || 

అగ్నేః పూర్వభాగే ఉత్తర భాగేవా రక్షాం గృహీత్వా అగ్ని ప్రదక్షణం కుర్యాత్ |

అగ్నికి ఉత్తర భాగము లేదా తూర్పు భాగములో భస్మమును తీసి ఉంచి , అగ్నే నయ సుపథా... అనే మంత్రముతో మూడుసార్లు అగ్నికి ప్రదక్షిణము చేయవలెను. 

          || అగ్నేనయ సుపథారాయే అస్మాన్ , విశ్వాని దేవ వయునాని విద్వాన్ | యుయోధ్యస్మజ్జుహురాణ మేనో భూయిష్ఠాంతే  నమ ఉక్తిం విదేమ || ప్రవశ్శుక్రాయ భానవే భరధ్వం | హవ్యం మతిం చాగ్నయే సుపూతం | యో దైవ్యాని మానుషా జనూగ్ంషి | అంతర్విశ్వాని విద్మనాజగాతి | అచ్ఛాగిరో మతయో దేవయన్తీః అగ్నియంతి ద్రవిణం భిక్షమాణాః సుసందృశగ్ం సుప్రతికగ్ం స్వంచం | హవ్యవాహమరతిం మానుషాణాం | అగ్నేత్వమస్మద్యుయోధ్యమీవాః అనగ్నిత్రా అభ్యమన్తకృష్టీః | పునరస్మభ్యగ్ం సువితాయ దేవాః | క్షాం విశ్వేభిరజరేభిర్యజత్రాః | అగ్నేత్వం పారయా నవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాణి విశ్వా | పూశ్చ పృథ్వీ బహులాన ఉర్వీభవా తోకాయ తనయాయ శంయోః | ప్రకారవో మననా వచ్యమానాః | దేవద్రీచీం నయథ దేవయంతః | దక్షిణా వాడ్వాజినీ ప్రాచ్యేతి | హవిర్భరంత్యగ్నయే ఘృతాచీ | 


        నమస్తే గార్హపత్యాయ నమస్తే దక్షిణాగ్నయే | నమ ఆహవనీయాయ మహావేద్యై నమోనమః | కాండద్వయోపాద్యాయ కర్మ బ్రహ్మ స్వరూపిణే | స్వర్గాపవర్గ రూపాయ యజ్ఞేశాయ నమోనమః | యజ్ఞేశాచ్యుత మాధవానంత కేశవ | కృష్ణ విష్ణు హృషీకేశ వాసుదేవ నమోఽస్తుతే | యజ్ఞేశ్వరాయ నమః | 

          ముందు తీసియుంచిన రక్షను కర్త తీసుకొని , కుడిచేతి ఉంగరపు వేలితో నేయి , భస్మము బాగుగా కలిపి , బృహత్సామ .. అను మంత్రముతో తాను నుదుట పెట్టుకొని , సుమంగలీ అను మంత్రముతో భార్యకు తల చుట్టూ ప్రదక్షిణముగా చేయి తిప్పి , ఆమెకు కూడా నుదుట రక్ష పెట్టవలెను. 

|| బృహత్సామ క్షత్రభృద్వృద్ధ వృష్ణియం త్రిష్టుభౌజశ్శుభితముగ్రవీరమ్ | ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సగరేణ రక్ష || 

|| సుమంగలీరియం వధూరిమాగ్ం సమేత పశ్యత | సౌభాగ్యమస్యై దత్వాయాథాస్తం విపరేతన ||


అగ్ని ఆరోపణము చేసుకొను విధానములు: 

ఆత్మారోపణము :-

 యాతే.. అను ఈ కింది మంత్రముతో కర్త తన కుడి చేతిని నేతితో తుడిచి , యజ్ఞేశ్వరునిపై శాఖము తగులునట్లు ఉంచి , శాఖము తగిలిన తర్వాత , తన నోటి దగ్గర చేయి ఉంచి , ఆ అరచేతిలోని శాఖము గాలి ద్వారా లోపలికి పోవునట్లు నోటితో గాలిని లోపలికి పీల్చుకొనవలెను. తనలోనికి అగ్ని ఆరోపణము అయినట్లు భావించవలెను. ఇలాగ మూడు సార్లు చేయవలెను. 

|| యాతే అగ్నే యజ్ఞియా తనూస్త యేహ్యారోహాత్మాత్మానమచ్ఛా వసూని కృణ్వన్నస్మే | నర్యాపురూణి యజ్ఞోభూత్వా  యజ్ఞమాసీద స్వాం యోనిం జాతవేదో భువ ఆజాయమాన సక్షయ ఏహి | 

ఏవం త్రిః ఇత్యారోప్య తేన యావజ్జీవం హోష్యామి | సత్యనుకూలే | -- ఇప్పుడు చేసిన ఈ ఔపాసనాగ్నితోనే జీవముండు వరకూ వసతిని బట్టి చేయుదునని సంకల్పము. 

తరువాత ఔపాసన చేయునపుడు , ’ యాతే ...’  అను ఈ  మంత్రముతోనే మూడుసార్లు ఒక రావి సమిధపైకి గాలిని ఊది , ఆ రావి సమిధకు ఔపాసనాగ్ని వచ్చినట్లు భావించి , ఔపాసనకు ముందు , అగ్నిని ప్రతిష్ఠించిన తర్వాత అగ్నిలో వేయవలెను.

సమిధారోపణము 

విష్ణువును స్మరించి , ఒక రావి సమిధను తీసుకొని , కింది మంత్రమును చెప్పవలెను. 

ఓం || అయంతే యోనిర్‌ఋత్వియో యతోజాతో అరోచథాః | తం జానన్నగ్న ఆరోహాథానో వర్ధయారయిమ్ | 

అని , ఆ రావి సమిధను అగ్నిపై కాచి , సమిధారోపణము అయినది అని భావించి , ఆ సమిధను జాగ్రత్తగా పెట్టుకొన వలెను. 

తర్వాత ఔపాసన చెయునపుడు , ఆ సమిధనే తీసుకొని , పైన చెప్పిన విధముగా అగ్ని ప్రతిష్టాపన అయిన తర్వాత ’ ఆజుహ్వాన .. ’ అను మంత్రముతో అగ్నిలో వ్రేల్చవలెను. 

ఆరోపణ చేయుటకు సమిధ లేకున్నా , లేక ఆరోపణ చేసిన సమిధ తర్వాత దొరకకపోయినా , కష్టమగును. కాబట్టి ఆత్మారోపణము చేసుకొనుటయే మంచిది. 

కింది మంత్రముతో యజ్ఞేశ్వరునికి ఉద్వాసన చెప్పవలెను. 

గచ్ఛగచ్ఛ  సురశ్రేష్ఠ స్వస్థానం పరమేశ్వర | యత్ర బ్రహ్మాదయో దేవస్తత్ర గచ్ఛ హుతాశన | యజ్ఞేశ్వరాయ నమః | యథాస్థానం ప్రతిష్ఠాపయామి. ||


|| ఇతి ఔపాసన హోమః || 


|| శుభమ్ భూయాత్ ||

|| సర్వేజనాస్సుఖినో భవంతు ||