|| విష్ణురశ్వతరో రంభా సూర్యవర్చాశ్చ సత్యజిత్ |
విశ్వామిత్రో మఖాపేత ఊర్జమాసం నయంత్యమీ ||
భానుమండల మధ్యస్థం వేదత్రయ నిషేవితం |
గాయత్రీ ప్రతిపాద్యం తం విష్ణుం భక్త్యా నమామ్యహం ||
ధ్యేయస్సదా సవితృ మండల మధ్యవర్తి నారాయణస్సరసిజాసన సన్నివిష్టః |
కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటీ హరీ హిరణ్మయ వపుః ధృతశంఖ చక్రః ||
కార్తీకమాసమందు ’ విష్ణువు ’ అను పేరుతో సూర్యుడు తన రథముపై సంచరించుచుండును . ’ విశ్వామిత్ర ’ మహర్షి , ’ రంభ ’ అను అప్సరస , ’ సూర్యవర్చసుడు ’ అను గంధర్వుడు , ’ సత్యజిత్తు అను యక్షుడు , ’ అశ్వతరము ’ అను సర్పము , ’ మఖాపేత ’ అను రాక్షసుడు ఆయన వెంట ఉందురు .
ఆయన సూర్యమండలమునకు మధ్య స్థితుడైయుండును . మూడు వేదములు ఆయనను స్తుతించును . గాయత్రీ మంత్రము ద్వారా ప్రతిపాద్యుడైన ఆవిష్ణువునకు నేను భక్తితో నమస్కరించుచున్నాను . విష్ణ్వాదిత్యుడు ఆరు వేల కిరణములతో శోభిల్లుచుండును . అతడు అరుణ వర్ణమును కలిగియుండును .
యమాదిత్యుని మాహాత్మ్యము
ఒకసారి యమధర్మరాజు తన లోకమున ఆశీనుడై , పాశములను , దండములను ధరించిన తన దూతలను ఇట్లు ఆదేశించెను .
" విష్ణు స్వరూపుడైన సూర్య భగవానుని యొక్క భక్తుల సమీపమునకు మీరు వెళ్లవలదు , ఏలనన, వారిని ఈ లోకమునకు తీసుకొని వచ్చుట తగదు . నిరంతరమూ తమ హృదయములను సూర్యుని యందే లగ్నమొనర్చిన ఆయన భక్తులకును , సూర్యభగవానుని పూజించెడి వారికినీ మీరు దూరమునుండియే ప్రణమిల్లి రాగలరు . సర్వకాల సర్వావస్థల యందును సూర్యుని నామములను కీర్తించెడివారు యమలోకమునకు రానక్కరలేదు . భాస్కరుని కొరకు నిత్య నైమిత్తికము లైన యజ్ఞములను ఆచరించు వారి వైపు మీరు కన్నెత్తి యైనను చూడరాదు . మీరు సూర్య భక్తులను తాకిననూ , లేక వారిని యమలోకమునకు తీసుకొని వచ్చుటకు ప్రయత్నించినను మీకు పుట్టగతులుండవు . పుష్పములతో , ధూపదీపములతో , అందమైన వస్త్రములతో సూర్యుని సేవించువారిని మీరు బంధింపరాదు . ఎందుకనగా వారు మా తండ్రికి మిత్రులు . ఆశ్రితులకు ఆశ్రయమైనవారు . సూర్యమందిరమును శుభ్రపరచెడు వారు , లేదా సూర్యమందిరమును నిర్మించువారు అయిన వారియొక్క మూడు తరములవారిని మీరు బంధింపరాదు . తండ్రియైన సూర్యభగవానుని అర్చించు భక్తుల వంశములవారికి కూడా మీరు సర్వదా దూరముగా ఉండవలెను :"
మహాత్ముడైన యమధర్మరాజు ఇట్లు ఆదేశించినను ఒకసారి యమభటులు ప్రమత్తులై , ఆ ఆదేశమును జవదాటి , సూర్యభక్తుడైన సత్రాజిత్తు కడకు వెళ్ళిరి . కానీ సత్రాజిత్తు తేజస్సునకు ఆ యమభటులు మూర్ఛితులై భూమిపై పడిపోయిరి . వారి యపరాధమును మన్నింపజేయుటకు యముడు కాశీ యందు యమాదిత్యుని ప్రతిష్టించి , తీవ్రముగా తపస్సు చేసెను . తత్ఫలితముగా సూర్య భగవానుడు ప్రత్యక్షమై ఆయనకు పెక్కు వరములిచ్చెను .
ఈ యమాదిత్యుడు కాశీ యందు , యమేశ్వరునకు పశ్చిమ దిశయందును , ఆత్మవీరేశ్వరునకు తూర్పు దిశయందునూ , సంకట ఘట్టమున ప్రతిష్ఠితుడై యున్నాడు . యమాదిత్యుని దర్శించేవారికి యమలోకము దర్శించు సందర్భము రాదు . మంగళవారముతో కూడిన చతుర్దశియందు స్నానము చేసి యమేశ్వరుని , యమాదిత్యుని దర్శించెడివారు సకల పాపములనుండీ ముక్తులగుదురు . యమధర్మరాజు ప్రతిష్ఠించిన యమేశ్వరునకూ , యమాదిత్యునకూ ప్రణతులను అర్పించెడివారు యమలోక యాతనలను అనుభవింపవలసిన పనిలేదు సరికదా , వారికి యమలోకమును చూడవలసినపని కూడా లేదు . అంతేగాక , యమ తీర్థమున శ్రాద్ధమొనర్చి , యమాదిత్యుని పూజించువారు పితృ ఋణమునుండీ ముక్తులయ్యెదరు .
కాశీ యందు పండ్రెండు మంది ఆదిత్యులు ప్రతిష్టితులై యున్నారు . ఈ ద్వాదశాదిత్యుల ఆవిర్భావ కథలను వినినవారికీ , వినిపించినవారికీ, దుర్గతులు దూరమై సద్గతులు లభించును .
( పద్మ పురాణము )
లోకాస్సమస్తాస్సుఖినస్సంతు