దర్భంగా మహరాజు రామేశ్వర్ సింగ్
------------------------------
ఇదొక ఆసక్తికరము, విచిత్రమూ అయిన చరిత్ర.
.
భారత్ లో స్వాతంత్ర్యానికి పూర్వము అనేక స్వతంత్ర రాజ్యాలు ఉండేవి, రాజులుండేవారు. మొఘలుల దాడి వల్ల అనేక రాజులు రాజ్యాలు పోగొట్టుకున్నారు.
అయితే , దీనికి భిన్నంగా, అసలు రాజ్యమే లేని రాజపురోహితులు, అక్బర్ నుండీ ఒక ప్రాంతాన్ని నవాబు పరంగా పర్యవేక్షించడానికి తీసుకొని, సొంతము చేసుకొని, స్వతంత్రులై, రాజ్యాని పాలించిన వైనము.
.
ఈ దర్భంగా[ ఇప్పటి బీహార్ ] ను పాలించిన వారు, బ్రాహ్మణ రాజులైన ఖండ్వాలా రాజవంశము వారు. అది మిథిలా ప్రాంతము. ఇప్పటి భారత్, నేపాల్ సరిహద్దులో ఉంది.
తుగ్లక్ వంశ పాలన అంతము అయ్యాక, మిథిలా ప్రాంతములో అరాజకము నెలకొని ఉండినది. 1526 లో మొఘలు సామ్రాజ్యము స్థాపన వరకూ అక్కడ సరయిన రాజు లేక , పాలన లేక తిరుగుబాట్లు, దోపిడీలు వంటివి ఎక్కువగా ఉండేవి. అక్కడి ప్రజలనుండీ పన్నులు వసూలు చేయడము దాదాపు అసాధ్యముగా ఉండింది.
.
మొఘలు వంశములో అక్బర్ సింహాసనానికి వచ్చిన తరువాత, ఆ ప్రాంతములో ఉన్న అరాజకాన్ని తొలగించి, ఎవరైనా ఒక సామంతరాజును నెలకొల్పితేగాని పరిస్థితి చక్కబడదు అని తెలుసుకున్నాడు.
అంతకు ముందు ఆ ప్రాంతాన్ని బ్రాహ్మణ రాజులు పాలించి ఉండినారు. కాబట్టి, అక్బర్, రాజపండితుడైన ’ చంద్రపతి ఠాకుర్’ ను ఢిల్లీకి పిలిపించి , అతడి ముగ్గురు కొడుకుల్లో ఒకరిని పన్నులు వసూలు చేయుటకు అధికారిగా నియమించాలన్న తన ఉద్దేశాన్ని తెలిపాడు.
.
చంద్రపతి ఠాకుర్, తన రెండవ కుమారుడు ’ మహేష్ ఠాకుర్ ’ పేరును సూచించాడు.
.
1557 సంవత్సరము రామనవమి నాడు మహేష్ ఠాకుర్ మిథిలకు పర్యవేక్షకుడిగా నియమింపబడినాడు.
ఒక వైపు అక్బర్ కు అనుకూలముగా ఉంటూనే, మహేష్ ఠాకుర్ కింది తరాలవారు నెమ్మదిగా ఆ మొత్తము మిథిలా ప్రాంతములో పట్టు సాధించి, 1762 లో మొదటిసారిగా ఆ మొత్తము ప్రాంతానికి [ దానిని మధుబని ప్రాంతము అని కూడా అంటారు ] పాలకులైనారు.
.
అయితే తరువాతి కాలములో 1860 నుండీ 1880 వరకూ, ఆ రాజ్యము అనేక వ్యాజ్యాలలో చిక్కుకొని, బ్రిటిష్ వారి పాలన వచ్చాక, ఎన్నోసార్లు కోర్టులకు వెళ్ళాల్సి వచ్చింది. మనకు స్వాతంత్ర్యము వచ్చేనాటికి ఖండ్వాలా వంశపు చివరి రాజైన రామేశ్వర్ సింగ్ ఎన్నో మార్పులు తెచ్చి, తన రాజ్యాన్ని వ్యవసాయము, వాణిజ్యాల్లో అగ్రగామిని చేసి, ఒక ముఖ్యమైన రాజ్యముగా పేరు తీసుకువచ్చాడు.
.
స్వాతంత్ర్యానంతరము భారత ప్రభుత్వపు అనేక భూసంస్కరణల వల్ల , జమీందారీ వ్యవస్థ కూలిపోవడముతో, దర్భంగా పాలన క్షీణించింది. చివరి మహారాజు అయిన రామేశ్వర్ సింగ్ 1962 లో నిస్సంతుగా మరణించడముతో వారి వంశపాలనకు భరతవాక్యము పలికినట్టైంది.
.
ఇదంతా కేవలము బ్రాహ్మణులు రాజులుగా పాలించిన వైనమైతే, వారి ఆచార వ్యవహారాలు, అనుష్ఠానాలు ఎలాగుండేవి చదివితే నిర్ఘాంత పోతారు.
.
రాజా రామేశ్వర్ సింగ్ దినచర్యను చూస్తే విస్మయాశ్చర్యాలు కలిగి శరీరములోని రోమాలు నిక్కబొడుచుకోక తప్పదు.
.
ఈయన కాలము, 1860 నుండీ 1929 వరకూ.
.
రామేశ్వర సింగ్ మహరాజు, మూడవ జామున రెండు గంటలకే నిద్రలేచేవాడు. తన శయ్యపైన కూర్చుండి, అలాగే దేవీ సప్తశతి మొత్తము పాఠాన్ని పఠించేవాడు.
.
అటుతరువాత, స్నానాదికాలు ముగించి, సంధ్యావందనము చేసి, సహస్ర గాయత్రి జపము చేసేవాడు.
అటుతర్వాత , నిత్య శ్రాద్ధము లో భాగముగా ప్రతిరోజూ సుమారు నలభై కేజీల బియ్యముతో పిండదానము చేసేవాడు.
ఆ తరువాత తన నిత్య పూజలో భాగముగా పార్థివ లింగానికి పూజాభిషేకాలు చేసేవాడు.
అయిన తరువాత , భగవతీ దేవి అమ్మవారి ఆలయానికి వెళ్ళి, అమ్మవారి అర్చన తరువాత, ’ తాంత్రిక సంధ్యావందనము ’ చేసి, తంత్ర ప్రకారముగా ’ పాత్ర స్థాపన చేసి, మహా కాళీ పూజ చేసేవాడు. అందులో భాగముగా ఆవరణ పూజ, జపము, పంచాంగ పాఠము చేసి, కకారాది సహస్ర నామాలతో పుష్పాంజలి సమర్పించేవాడు.
.
అటు తరువాత, కుమారి, సువాసిని, వటుక లకు పూజ, తర్పణము చేసి, సామయిక పూజ చేసేవాడు.
ఉదయము పది గంటలకల్లా ఇవన్నీ ముగించి, ప్రసాదము స్వీకరించేవాడు.
.
ఒక గంట విశ్రాంతి తరువాత, రాజ్యపాలనలో భాగముగా తన కర్తవ్యాలను ఉదయము పదకొండు నుండీ మధ్యాహ్నము మూడున్నర వరకూ నిర్వర్తించేవాడు.
.
అటు తర్వాత, స్నానము చేసి, సంధ్యావందనము చేసి, మరలా సహస్ర గాయత్రి చేసి, ప్రదోషకాలములో మరలా పార్థివ లింగానికి పూజాభిషేకాలు చేసేవాడు.
.
రాత్రి కాగానే దేవీ భగవతికి " సాంగోపాంగ నిశార్చన "--అందులో భాగముగా, నూట ఎనిమిది మంది బ్రాహ్మణులు సామూహిక సప్తశతీ పారాయణ చేయగా, యాభై ఒక్క బ్రాహ్మణులు రుద్రాభిషేకము చేసేవారు.
.
ఇవి కాక, ప్రతిరోజూ , నిరంతరాయంగా సూర్యోదయము నుండీ సూర్యాస్తమయము వరకూ దేవీ సప్తశతీ పారాయణలు, రుద్రాభిషేకాలు దేవాలయములో జరుగుతూనే ఉండేవి.
.
ఈ విధముగా తన జీవితాన్ని ’ మహానుష్ఠానము ’ నకే అంకితము చేసిన ఆ మహారాజు రామేశ్వర్ సింగ్, గొప్ప పండిత విద్వాంసుడు కూడా.
.
సంస్కృతము, హింది, బెంగాలి, ఇంగ్లీషు, ఫ్రెంచ్ భాషలలో అనర్గళముగా మాట్లాడేవాడు.
తంత్రములోనే కాక, వేదాంతము, వ్యాకరణము, సాంఖ్యము, యోగము లలో అతడు గొప్ప పండితుడు.
.
1908 శరదృతువులో వేద విద్వత్ సభలు నిర్వహించాడు. ఆ సభలకు, ఆ కాలములో విద్వాంసులుగా ప్రసిద్ధి చెందిన పండిట్ ప్రకాశానంద ఝా [ వైద్యనాథ ధర్మము ] , పండిత శివచంద్ర భట్టాచార్య [ కాశీ ] , శ్రీవిద్యా సాధకులైన పండిత సుబ్రహ్మణ్య శాస్త్రి, అప్పటి ఆగమ అనుసంధాన సమితి యొక్క అధ్యక్షుడు అయిన ’ జాన్ ఉడ్రోఫ్ ’ వంటి మహామహులు భాగము వహించినారు.
.
ఆ విద్వత్ సభకు అధ్యక్షుడు గా శ్రీ పండిత శివచంద్ర భట్టాచార్య వ్యవహరించినారు. మహారాజుకు తంత్ర సాధన, తాంత్రిక విద్యలలో మార్గ దర్శనమునిచ్చినవారు వీరే.
ఈ విద్వత్ సభ గురించి ఎన్నెన్నో విశేషాలు ఈ క్రింది లింకులో చదవవచ్చు.