దర్భంగా మహరాజు రామేశ్వర్ సింగ్
ఈ బ్లాగులో , సనాతన ధర్మము నకు సంబంధించిన వివిధ ఆచరణలు , ఇతర విశేషాలు , వివరణలు మాత్రమే ఉంటాయి.
SHARE
Thursday, December 26, 2024
దర్భంగా మహరాజు రామేశ్వర్ సింగ్
Wednesday, September 18, 2024
తర్పణం
తర్పణం
-----
పితృ పక్షము ప్రారంభమవుతున్నది, పితృలోకములోని పితరులు తమ వంశజులు ఇచ్చే శ్రాద్ధాలు, తర్పణాల కోసము భువికి దిగివస్తారు అని నమ్మకము. గరుడపురాణము, మత్స్య పురాణము వంటి పురాణాలలో విషయము మీద చాలినన్ని వివరణలు చూడవచ్చు.
మహాభారతము ప్రకారము, కర్ణుడు మరణించిన తరువాత అతడి సూక్ష్మ శరీరానికి ఊర్ధ్వ లోకాలలో తినడానికి, త్రాగడానికి అన్నపానాదులు దొరకలేదు, కాని చాలినంత వెండి బంగారాలు దొరికాయట. ఎందుకంటే, అతడు ఎంత దానకర్ణుడు అని పేరు తెచ్చుకున్నా, అతడు దానాలు చేసింది ధనము,సంపదలు, ఆభరణాల వంటివే కాని, అన్నపానాదులు కాదు. ఆ స్వర్ణ రజతాలతో తో ఆకలిదప్పులు తీరక, అలమటించి, చివరికి యముడిని ప్రార్థించగా, యముడి దయవల్ల అతడు తిరిగి భూమికి వచ్చి, అన్నదానము విశేషముగా చేసి తిరిగి యమలోకానికి వెళ్ళాడు.
శ్రాద్ధాలు ఈ పక్షమంతా తమ వెనుకటి తరాల పితరులను ఉద్దేశించి అందరూ యథాశక్తిగా చేస్తారు. శ్రాద్ధాలలో ఎన్నో రకాలు ఉన్నాయి. ఏ రకమైన శ్రాద్ధము చేసినా ఫలితము ఒకటే. పదిహేను రోజులూ చేయకపోయినా, కనీసం ముఖ్యమైన తిథులలో... అనగా, తమ పూర్వ వంశజులు మరణించిన తిథులలో అయినా తప్పక శ్రాద్ధాలు చేస్తారు. చివరకు, ఇంకేరోజు వీలుకాకున్నా, అమావాస్య రోజైన తప్పనిసరిగా శ్రాద్ధాలు చేస్తారు.
శ్రాద్ధాల సమాచారము చాలినంత అన్ని చోట్లా దొరకుతున్నది, కాబట్టి ప్రస్తుతము తర్పణాల విషయము మాత్రము చర్చిస్తున్నాను.
పితృపక్షములో పదిహేనురోజులూ శ్రాద్ధాలు చేయలేనివారు, ముఖ్యమైన రోజుల్లో శ్రాద్ధాలు ఆచరించి, మిగతా అన్ని రోజులూ తర్పణాలు తప్పక వదులుతారు.
.
తర్పణాలు అంటే కేవలము పితరులను ఉద్దేశించి చేసేది మాత్రమే అని అర్థము కాదు. పితృపక్షము వస్తున్నది కాబట్టి ఇక్కడ పితరులనుద్దేశించి చేయాలి అని చెప్పినా, తర్పణాలు నిజానికి, దేవతలు, ఋషులు, పితరులు అందరికీ వివిధ సందర్భాలలో ఇస్తాము.
ఈ తర్పణాలు రకరకాలు. వట్టి నీళ్ళతో ఇచ్చేవి, పాలతో ఇచ్చేవి, నువ్వులు, నీళ్ళు కలిపి ఇచ్చేవి, సుగంధ ద్రవ్యాలతో ఇచ్చేవి, నెయ్యి లేదా పెరుగు కలిపి ఇచ్చేవి... ఇలా రకరకాలు.
వినాయకుడు తర్పణ ప్రియుడు అని ప్రసిద్ధి. అందుకే గణపతి పూజలో తర్పణము తప్పని సరి. అలాగే, గణపతి మూలమంత్ర జపము చేసిన తర్వాత తర్పణాలు కూడా వదులుతాము.
భీష్ముడు , యముడు వంటి వారికి ఆయారోజుల్లో తర్పణము వదలుట ఆచారము. అలాగే, రుద్రాభిషేకములో కూడా భవుడు, శర్వుడు మొదలుగా ఎనిమిది మంది శివ రూపాలకు తర్పణము ఇస్తాము. నవగ్రహ జపాల అనంతరము కూడా తర్పణాలు తప్పనిసరి. అలాగే, దేవీ ఉపాసకులు మూలమంత్రముతో దేవికి తర్పణాలు ఇస్తారు. ఇంకా, నక్షత్రాలకు కూడా తర్పణాలు ఇస్తారు.
ప్రతిరోజూ బ్రహ్మ యజ్ఞములో భాగముగా దేవ, ఋషి, పితృ తర్పణాలు ఇస్తాము. అంతే కాదు, బ్రహ్మ మొదలు క్రిమికీటకాల వరకూ అందరినీ ఉద్దేశించి నీళ్ళతో నిత్య తర్పణాలు కూడా వదిలే ఆచారము ఉంది.
అసలు తర్పణం అంటే ఏమిటి?
తర్పణము అంటే " సంతృప్తి పరచుట "
దేవతలకు కాని, ఋషులకు కాని, పితరులకు కానీ, నవగ్రహాలకు కానీ, తర్పణాలు వదిలేది,
౧. కృతజ్ఞతను చూపడానికి
౨. వారిని సంతుష్టి చేసి మెప్పించడానికి
౩. మనము చేసుకున్న పాపాలను కడిగివేసి శుద్ధులు కావడము కోసము
౪. దేవర్షిపితరులతో ఒక విధమైన’ సంబంధము ’ లేదా లంకె కలిగి ఉండుటకు
౫. మన కర్మ ఫలాన్ని సమతూకము చేసుకోవడము కోసము.
తర్పణాలు వదిలేటప్పుడు రకరకాల మంత్రాలు ఉచ్చరించడము, వివిధపానీయలు[ పైన చెప్పినవి ] దోసిళ్ళతో ఇవ్వడము, ముద్రలు వేయడము, సమయపాలనగా ఆయా సమయాల్లో చేయడము వంటివి ఉంటాయి.
తర్పణాలు ఇవ్వడము వలన, ఆయా దేవఋషి పితరుల ఆశీర్వాదాలు పొందగలము, వారికి మన భక్తి ప్రపత్తులు చూపించగలము,
ఇక పితృ తర్పణాల విషయానికి వస్తే,
అమావాస్య, సంక్రమణములందు, గ్రహణము, అర్ధోదయమ్, మహోదయము, దక్షిణాయన, ఉత్తరాయన పుణ్యకాలాల్లోను,, మహాలయ పితృ పక్షములోను, తీర్థ క్షేత్రాలు దర్శించినపుడూ తర్పణాలు ఇస్తాము
ఒకే దినము, రెండు కారణాలకోసము రెండుసార్లు తర్పణాలు ఎన్నటికీ వదలరాదు. రెండు సందర్భాలు ఉంటే, మొదట ఏది ముఖ్యమో దానికి ఇచ్చి, తరువాతి దినము ఇంకో కారణానికి ఇవ్వవచ్చు.
ఇంటిలో తిలతర్పణాలు వదలరు, ఇంటి బయటో, బాల్కనీ వంటి వాటిలోనో, తులసి కట్ట వద్దనో ఇవ్వవచ్చు.
తండ్రి బ్రతికి ఉన్నవారు పితృ తర్పణాలు వదలరాదు. దేవ, ఋషి తర్పణాలు వదలవచ్చు.
పితృపక్షములో ద్వాదశ పితరులకు మాత్రమే కాక [ అంటే , మరణించిన వారిలో తండ్రి వైపు మూడు తరాల దంపతులకు, తల్లి వైపు మూడు తరాల దంపతులకు ] ఇంకా మేనమామలు, మేనత్తలు, పినతండ్రి, పెదనాన్నలకు, వారి భార్యలకు, ఇంకా మరణించిన అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, బావ,మరుదులు, వదినలు, ఇలా గడచిన మూడు తరాల అందరికీ వదలాలి. వారిని " సర్వే కారుణ్య పితరులు " అంటారు.
ఇంత విస్తారముగా చేయలేనివారు,
|| ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం దేవర్షి పితృ మానవాః
తృప్యంతు పితరః సర్వే పితృ మాతా మహాదయః
అతీత కుల కోటీనామ్ సప్తద్వీప నివాసినామ్
ఆ బ్రహ్మ భువనాల్లోకాదిదమస్తు తిలోదకమ్ ||
అని చెప్పి మూడు సార్లు నువ్వులు కలిపిన నీళ్ళు వదలవచ్చు.
తర్పణాలు వదిలేటప్పుడు ఉంగరపు వేలికి పవిత్రం తప్పక ధరించాలి.
దేవర్షు లకు రెండు దర్భలతో చేసినది, పితరులకు మూడు దర్భలతో చేసినది ధరించాలి.
తర్పణాల విషయములో ఇంకొంత సమాచారము
------------------------------------
తండ్రి బ్రతికి ఉన్నవారు పితృ తర్పణాలు ఇవ్వరాదు.
ఎందుకంటే ఆ తర్పణాలేవో ఆ తండ్రే చేస్తాడు కాబట్టి. చేసే అధికారం తండ్రికి మాత్రమే ఉంది కాబట్టి.
తండ్రి బ్రతికి ఉండి, తల్లి పోయినవారు కూడా అంతే... తండ్రే ఇవ్వాలి.
తల్లిదండ్రులు ఇద్దరూ పోయి, ఉన్న ఒక్క కొడుకు కూడా పోయి ఉంటే, వారి మనవడు తర్పణాలు ఇవ్వొచ్చు.
కొడుకు కొడుకు అంటే మనవడు లేకపోతే, కూతురి కొడుకు అనగా దౌహిత్రుడికి అధికారం ఉంది.
మంత్ర పూర్వకముగా ఇచ్చే అధికారం లేనివారు, పౌరాణికముగా ఇవ్వవచ్చు.. అంటే కేవలము గోత్రనామాలు చెప్పి ఒక్కొక్కరికి తర్పణము ఇవ్వడము.
ప్రతి సంవత్సరమూ ఆబ్దీకము పెట్టినా సరే, అక్కడ ఇచ్చే తర్పణము వేరు, పితృపక్షములో ఇచ్చేది వేరు. రెండూ చేయాలి.
తల్లిదండ్రులు ఉన్నవారు ఎంతో అదృష్టవంతులు. పితృ దేవతలు సంతుష్టులై, అనుగ్రహిస్తే, కేవలం ఆ తర్పణము ఇచ్చినవారిని మాత్రమే అనుగ్రహించినట్టు కాదు. వారి కుటుంబములో రాబోయే యేడు తరాలవారిని అనుగ్రహించినట్టే. అది తెలీక, మా తాత ఇచ్చాడు, మా తండ్రి ఇచ్చాడు, వారు మాత్రం బాగుంటారు, నేను కూడా బాగుండాలి కాబట్టి, నాచేత్తో నేను కూడా తర్పణాలు, శ్రాద్ధాలు చేస్తాను--అనుకోవడం అమాయకత్వం.
అధికారం లేని కొడుకు, అధికారం ఉన్న తండ్రికి సహాయ పడాలి అంతే.
తల్లిదండ్రులు బ్రతికి ఉన్నవారికి వేరే దేవతలు, పితృ దేవతలు అవసరం లేదు. వీరే దేవతలు, వీరు చెప్పినట్టు చేసి, వినయముగా ఉంటే అంతకన్నా పెద్ద పుణ్యము ఇంకోటి లేదు.
కొందరంటారు, మా నాన్న సరైన వాడు కాదు, ఏమీ చేయడు, అదీ ఇదీ అని చెప్పి, ఎలా గౌరవించాలి? అని అడుగుతారు.
.
తండ్రి అంటే కేవలము కంటికి కనబడే దేహము కాదు, ఆ దేహములోని బుద్ధులు కాదు. "ఆత్మా వై పుత్ర నామాసి " అన్నారు. అంటే, తండ్రి ఆత్మే పుత్రుడిగా ఇంకో రూపము తీసుకొని ఉంటుంది. మనము గౌరవించేది, పూజించేది, ఆ భౌతిక శరీరాన్ని కాదు, అందులోని పితృ దేవతా రూపమైన ఆత్మను.
ఒక వేళ తండ్రి ఉండి, కారణాంతరాల వల్ల చేయుటకు వీలు కాకపోతే, అప్పుడు ఆ తండ్రి అనుమతి తీసుకొని కొడుకు నిరభ్యంతరంగా చేయవచ్చు. తండ్రి అనుమతి తో శ్రాద్ధాలు, శవదహనాలు, కర్మలు--ఇవన్నీ చేయవచ్చు.
మహాలయ పితృ తర్పణాలు ఇచ్చే విధానము ఇదే బ్లాగులో ఉంది.